ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టులో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు
భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లపై తీర్పు నేటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) కార్యాలయం కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పంజగుట్ట పోలీసులు మంగళవారం అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఇప్పటికే అరెస్టయిన పోలీసు అధికారులు దుగ్యాల ప్రణీత్‌రావు, నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న, మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావులతోపాటు పరారీలో ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు, శ్రావణ్ రావులను నిందితులుగా పేర్కొంటూ అభియోగాలు మోపారు.
పరారీలో ఉన్న ఇద్దరూ విదేశాల్లో తలదాచుకున్నట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ ఏడాది మార్చి 10న పంజగుట్ట పోలీసుస్టేషన్‌లో కుట్ర, నమ్మకద్రోహం, నేరపూరిత చర్యలు, ప్రజా ఆస్తుల విధ్వంసం తదితర సెక్షన్ల కింద నమోదైన ఈ కేసు ఆపై ట్యాపింగ్ టర్న్ తీసుకుంది. దీంతో టెలిగ్రాఫ్ యాక్ట్, సైబర్ టెర్రరిజం చట్టాలను జోడించారు.
నిందితుడిగా ఉన్న ప్రణీత్‌ను మార్చి 12న, భుజంగరావును తిరుపతన్నలను 23న, రాధాకిషన్‌రావును 28న అరెస్టు చేశారు. చట్ట ప్రకారం ఓ నిందితుడిని అరెస్టు చేసిన తర్వాత గరిష్టంగా 90 రోజుల్లో అతడిపై అభియోగపత్రం దాఖలు చేయకుంటే న్యాయస్థానం అతడికి మ్యాండేటరీ బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు మంగళవారం ఈ కేసులో సప్లిమెంటరీ చార్జ్ïÙట్ దాఖలు చేశారు.
ట్యాపింగ్... వసూళ్లు
ట్యాపింగ్ కేసు దర్యాప్తులో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పేరు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబీకులు, సంబం«దీకులు, పోలీసు అధికారులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. బీఆర్‌ఎస్‌కు చెందిన అసమ్మతి నేతలపైనా అక్రమ నిఘా ఉంచినట్లు వివరించారు.
అలాగే, బీజేపీ నేతలు ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, బండి సంజయ్‌ల ఫోన్లు ట్యాప్ చేశారని అభియోగపత్రాల్లో పేర్కొన్నారు. వివిధ నిర్మాణ సంస్థలు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందిన యజమానులు, వ్యాపారవేత్తల ఫోన్ల పైనా అక్రమ నిఘా ఉంచారని, అలా తెలుసుకున్న విషయాలతో వసూళ్లకు పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. బీఆర్‌ఎస్ అగ్రనాయకుల ఆదేశాల మేరకు రాధాకిషన్‌రావు భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడినట్లు తేల్చారు.
మొత్తమ్మీద నిందితులు 1000 నుంచి 1200 ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆధారాలు లభించాయని, బాధితుల్లో హైకోర్టు న్యాయమూర్తి కాజా శరత్ కూడా ఉన్నట్లు అధికారులు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. మరోపక్క డీఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై తీర్పును కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టులు జరిగాయని నిందితుల తరఫు న్యాయవాది, బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ప్రభుత్వ న్యాయవాది వాదించారు.
Comments
Please login to add a commentAdd a comment