
శ్రవణ్‌కుమార్‌పై ప్రొక్లైమ్డ్ అఫెండర్ పిటిషన్
నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన పోలీసులు
ప్రధాన నిందితుడిపై మాత్రం మౌనముద్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) కేంద్రంగా సాగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ప్రధానంగా వినిపించింది టి.ప్రభాకర్‌రావు పేరే. ఆ విభాగ మాజీ చీఫ్ అయిన ఈ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ట్యాపింగ్ కేసు నమోదుతో అమెరికా వెళ్లిపోయారు. ఈ కేసు దర్యాప్తు కొలిక్కిరావాలంటే ఆయన్ను వెనక్కి రప్పించడం, విచారించడం అనివార్యంగా మారింది. అయితే ఇప్పుడెందుకో పోలీసులకు ఆయనపై ప్రేమ పుట్టుకొచ్చింది.
ఇదే కేసులో ఆరో నిందితుడిగా ఉండి, విదేశాల్లో తలదాచుకున్న శ్రవణ్‌రావును ప్రొక్లైమ్డ్ అఫెండర్‌గా (ప్రకటిత నేరస్తుడు) ప్రకటించాలంటూ ఇటీవల నాంపల్లి కోర్టులో పోలీసు విభాగం పిటిషన్ దాఖలు చేసింది. అయితే ప్రభాకర్‌రావు పేరును మాత్రం ఇందులో చేర్చలేదు. మరోపక్క పి.రాధాకిషన్‌రావు, భుజంగరావులకు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసు విభాగం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.
ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది మొదలు..
అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పంజగుట్ట పోలీసులు 2024 మార్చి 10 కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి సంబంధించి ప్రణీత్‌రావుపై నమోదైన ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం ఆరుగురిని నిందితులుగా చేర్చారు. కీలక నిందితులుగా పేర్కొంటూ అదే నెలలో అడిషనల్ ఎస్పీలు నాయిని భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును అరెస్టు చేశారు.
ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, ఓ టీవీ ఛానల్ అధినేత శ్రవణ్‌కుమార్ మాత్రం పరారీలో ఉన్నారు. ఈ కేసులో పోలీసులు గత జూన్‌లో చార్జీషీట్ దాఖలు చేశారు. అప్పట్లో ట్యాపింగ్‌కు గురైన వారిలో కాంగ్రెస్ నేతలు, ఓ న్యాయమూర్తి, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతోపాటు కొందరు బీఆర్‌ఎస్ నేతలు కూడా ఉన్నారని ప్రస్తావించారు. ఇంకా విచారణ సాగుతున్నందున అదనపు చార్జీïÙట్ దాఖలు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.
విచారణ ఇంకా పూర్తికాలేదంటూ...
ఇప్పటికీ ప్రభాకర్‌రావు, శ్రవణ్‌కుమార్ అమెరికాలో ఉన్నారు. ట్రయల్ కోర్టు రెండుసార్లు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినా స్పందన లేదు. ఇటీవల పోలీసులు కోర్టుకు సమరి్పంచిన సీల్డ్ కవర్ నివేదికలో ప్రస్తుత హైకోర్టు న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారుల ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు ఉన్నాయి. నిందితుల వ్యక్తిగత కంప్యూటర్ల నుంచి ఫోరెన్సిక్ నిపుణులు రిట్రీవ్ చేసిన డేటాలో వీటిని గుర్తించినట్టు పేర్కొన్నారు.
వీరందరి నంబర్లూ ట్యాపింగ్ అయినట్టు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ దశలో కీలక నిందితులకు బెయిల్ ఇవ్వడం విచారణను ప్రభావితం చేస్తుందని అధికారులు చెబుతున్నారు. వారి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని, వివరాలతో వాదనలు సిద్ధం చేయాలని పీపీకి పోలీసు విభాగం సూచించింది.
‘ప్రొక్లైమ్డ్ అఫెండర్’ ఒక్కరిపైనే ఎందుకు?
ఒకరిని న్యాయస్థానం ప్రొక్లైమ్డ్ అఫెండర్‌గా ప్రకటిస్తే.. వారి ఆస్తులు జప్తు చేసే అధికారం పోలీసులకు వస్తుంది. ఇలా ఒత్తిడి తీసుకొచ్చి నిందితులను విదేశాల నుంచి రప్పించే అవకాశం ఉంటుంది.
అయితే ఈ పిటిషన్‌ను ప్రధాన నిందితుడైన ప్రభాకర్‌రావుపై దాఖలు చేయకుండా, శ్రవణ్‌కుమార్‌పై దాఖలు చేయడం వెనుక ఆంతర్యం అంతు చిక్కట్లేదు. పోలీసు విభాగం ఇలా వ్యవహరించడం వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉందా? లేక వ్యూహంలో భాగమా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment