సాక్షి,హైదరాబాద్:ఫోన్ ట్యాపింగ్ కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటివరకు విచారణకు హాజరుకాని ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు తాజాగా అమెరికాలో గ్రీన్ కార్డు వచ్చినట్లు సమాచారం. అమెరికాలో సెటిల్ అయిన కుటుంబసభ్యుల ద్వారా ఆయన కొద్దిరోజుల క్రితమే గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరయినట్టు తెలుస్తోంది.
గ్రీన్ కార్డు మంజూరు విషయం తెలిసి ఫోన్‌ట్యాపింగ్ కేసు దర్యాప్తు అధికారులు ఈ విషయమై ఆరా తీశారు. ప్రభాకర్‌రావుకు గ్రీన్‌కార్డు లభించడంతో దర్యాప్తులో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు పై పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాగా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఫోన్‌ట్యాపింగ్ జరిగిందని ఆరోపిస్తూ దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో గతంలో ఇంటెలిజెన్స్‌లో పనిచేసిన పలువురు పోలీసు అధికారులను అరెస్టు చేసి విచారించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును కూడా విచారించేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ ఆయన అమెరికా వెళ్లిపోవడంతో అది సాధ్యం కాలేదు.
ఇదీ చదవండి: కేసు పెడితే పెట్టుకో.. దేనికైనా రెడీ: కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment