ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనను అమెరికా నుంచి రప్పించడానికి ప్రయత్నాలు
ప్రభాకర్‌రావు పాస్‌పోర్టు సస్పెండ్ చేయించిన పోలీసులు
శాశ్వతంగా రద్దు చేయాలంటూ కేంద్రానికి లేఖ
మరోవైపు పాస్‌పోర్ట్ సస్పెన్షన్‌ను సవాల్ చేసిన న్యాయవాదుల టీమ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) కేంద్రంగా జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన ఆ విభాగం మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావును అమెరికా నుంచి రప్పించడానికి పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిని తిప్పికొట్టడానికి ప్రభాకర్‌రావు కూడా అక్కడి నుంచే పావులు కదుపుతున్నారు. దీనితో పోలీసులు వెర్సస్ ప్రభాకర్‌రావు అన్నట్టుగా మారింది.
పరిణామాలను గమనించి అమెరికా వెళ్లిపోయి..
ఎస్‌ఐబీకి సుదీర్ఘకాలం నేతృత్వం వహించిన టి.ప్రభాకర్‌రావు గత ఏడాది డిసెంబర్ 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసిన వెంటనే రాజీనామా చేశారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు, తర్వాతి పరిణామాలను గమనించిన ఆయన... ఈ ఏడాది మార్చిలో తిరుపతి వెళ్లి, అటు నుంచే చెన్నై మీదుగా అమెరికా వెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడి టెక్సాస్‌లో ఉండి, వైద్యం చేయించుకుంటున్నట్టు తెలుస్తోంది.
ప్రభాకర్‌రావు తనపై అరెస్టు వారెంట్ జారీ చేయవద్దంటూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సమయంలో... తాను వైద్యం కోసం అమెరికా వచ్చానని, షెడ్యూల్ ప్రకారం జూన్ 26న తిరిగి వస్తానని వివరణ ఇచ్చారు.
జూలైలో ఈ–మెయిల్ ద్వారా దర్యాప్తు అధికారికి లేఖ రాసిన ఆయన... తనపై తప్పుడు కేసు, నిరాధార ఆరోపణలతో ఏర్పడిన మానసిక వేదన కారణంగా ఆరోగ్యం మరింత క్షీణించిందని, ఇప్పట్లో తిరిగి రాలేనని స్పష్టం చేశారు. అప్పటి నుంచి పోలీసులు ఆయనపై రెడ్ కార్నర్ నోటీసుల జారీ కోసం ప్రయత్నాలు చేస్తూనే.. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖతోనూ (ఎంఈఏ) సంప్రదింపులు జరుపుతున్నారు.
తొలుత పాస్‌పోర్ట్ ఇంపౌండ్ చేయించి...
రాష్ట్ర పోలీసులు తొలుత రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం (ఆర్‌పీఓ) ద్వారా ప్రభాకర్‌రావు, మరో నిందితుడు శ్రవణ్‌రావుల పాస్‌పోర్టులను ఇంపౌండ్ (సస్పెన్షన్) చేయించారు. ఆపై ప్రభాకర్‌రావు పాస్‌పోర్టును పూర్తిగా రద్దు చేయాలంటూ మరో ప్రతిపాదన పంపారు. ప్రస్తుతం ఆ ఫైల్ విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) వద్ద పెండింగ్‌లో ఉంది. ప్రభాకర్‌రావు తన న్యాయవాదుల ద్వారా పాస్‌పోర్టు ఇంపౌండ్ చేయడాన్ని ఎంఈఏ జాయింట్ సెక్రటరీ వద్ద సవాల్ చేశారు.
ఈ వివాదం పరిష్కారమైతే తప్ప పాస్‌పోర్టు రద్దుపై నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం లేదు. అయితే ఎవరైనా వ్యక్తిపై చార్జ్‌షీట్ దాఖలు కావడం, న్యాయస్థానం తగిన ఆదేశాలు జారీ చేయడం, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడం జరిగితే.. పాస్‌పోర్టు ఇంపౌండ్, రద్దుకు అవకాశం ఉంటుంది. ప్రభాకర్‌రావు విషయంలో ఈ మూడూ జరిగిన నేపథ్యంలో.. ఆయన పాస్‌పోర్టు త్వరలోనే రద్దవుతుందని పోలీసులు భావిస్తున్నారు.
రద్దయినా ఇప్పట్లో రావడం కష్టమే!
ప్రభాకర్‌రావు పాస్‌పోర్టు రద్దు అయినా ఆ సమాచారం ఎంఈఏ, ఇమిగ్రేషన్ అధికారుల వద్ద మాత్రమే ఉంటుంది. ఆయన అమెరికా నుంచి మరో దేశానికి రాకపోకలు సాగించినా దీని ద్వారా గుర్తించలేరు. కేవలం పాస్‌పోర్టు పేజీలు అయిపోవడం, గడువు తీరిపోవడం, పోగొట్టుకోవడం వంటివి జరిగి.. ఆ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయానికి వెళ్లినప్పుడు మాత్రమే అధికారులు దాన్ని స్వా«దీనం చేసుకుంటారు.
ఎమర్జెన్సీ సర్టిఫికెట్ జారీ చేయడం ద్వారా బలవంతంగా భారత్‌కు పంపుతారు. అలా కాకుండా ప్రభాకర్‌రావు తనంతట తానుగా తిరిగి వస్తే.. విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకుని పోలీసులకు అప్పగిస్తారు. ప్రభాకర్‌రావును అమెరికా ప్రభుత్వమే తిప్పిపంపాలంటే మాత్రం పాస్‌పోర్టు రద్దు తర్వాత కేంద్ర హోంశాఖ (ఎంహెచ్‌ఏ) ద్వారా అమెరికా దేశ ఏజెన్సీలను సంప్రదించాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
వీసాలో గడువులో మతలబులు ఎన్నో...
కొన్నేళ్లుగా తరచూ అమెరికాకు వెళ్లి వస్తున్న, కుటుంబీకులు అక్కడే ఉంటున్న ప్రభాకర్‌రావు వంటి వారికి సాధారణంగా 10 నుంచి 15 ఏళ్ల గడువుతో కూడిన వీసాలు లభిస్తుంటాయి. అయితే ఒకసారి ఆ దేశంలో అడుగుపెట్టిన తర్వాత గరిష్టంగా 180 రోజులలోపు తిరిగి వెళ్లాలనే నిబంధన ఉంది.
దీనితో ప్రస్తుతం ఆయన 179 రోజులు అక్కడ ఉండి.. సమీపంలోని కెనడా, లేదా మరో దేశానికి కొన్ని రోజులు వెళ్లి రావొచ్చు. అలా మరో 179 రోజులు అమెరికాలో ఉండొచ్చు. అయితే ప్రభాకర్‌రావు వైద్యం చేయించుకుంటున్న నేపథ్యంలో వీసా గడువు తేలిగ్గా పొడిగించుకునే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment