అమెరికాలో తలదాచుకున్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు
అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈయనే అత్యంత కీలకం
వెనక్కు రప్పించడానికి అధికారుల ప్రయత్నాలు
బ్లూ కార్నర్ నోటీసు జారీ అయినా డిపోర్టేషన్ ప్రక్రియ ప్రహసనమే
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావును అమెరికా నుంచి వెనక్కు రప్పించడం అంత తేలిక కాదని తెలుస్తోంది. ఆయన వైద్యపరమైన కారణాలతో ఆ దేశంలో ఉండటం, ఇంటర్‌పోల్ కేవలం బ్లూకార్నర్ నోటీసు మాత్రమే జారీ చేసే అవకాశం ఉండటంతో దర్యాప్తు అధికారులు ఆయన డిపోర్టేషన్ (బలవంతంగా రప్పించడం) పై మల్లగుల్లాలు పడుతున్నారు.
సుదీర్ఘకాలం ఎస్‌ఐబీ చీఫ్‌గా వ్యవహరించిన ప్రభాకర్‌రావు గత డిసెంబర్ 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసి రాజీనామా చేశారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు, తదితర పరిణామాలను గమనించిన ఆయన తిరుపతికి ప్రయాణమై కనీసం కుటుంబీకులకు కూడా చెప్పకుండా అటు నుంచే చెన్నై మీదుగా అమెరికా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన టెక్సాస్‌లో వైద్యం చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది.
గత నెల 12న ప్రభాకర్‌రావు కుమారుడిని విచారించిన పోలీసులు ఆయన తిరిగి ఎప్పుడు వస్తారని ప్రశ్నించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభాకర్‌రావు ఇటీవల ఈ–మెయిల్ ద్వారా దర్యాప్తు అధికారికి లేఖ రాశారు. జూన్ నాటికి పూర్తిగా కోలుకుని తిరిగి వచ్చేస్తానని భావించానని, నిరాధార ఆరోపణలతో కలిగిన మానసిక వేదన కారణంగా ఆరోగ్యం మరింత క్షీణించిందని ఆ లేఖలో పేర్కొన్నారు.
బ్లూ కార్నర్ నోటీసు జారీ అయినప్పటికీ...
హైదరాబాద్ పోలీసులు ప్రభాకర్‌రావుపై తొలుత ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించాలని భావించారు. అయితే ఆ విభాగం దృష్టిలో ఈ కేసు అంత తీవ్రమైంది కాదనే ఉద్దేశంతో బ్లూ కార్నర్ నోటీసుల జారీ కోసం సీబీఐని ఆశ్రయించారు. ఇవి జారీ అయినా ఇంటర్‌పోల్ ప్రభాకర్‌రావు ఆచూకీ కనిపెట్టి, ఆయన కదలికలపై నిఘా ఉంచుతుంది తప్ప బలవంతంగా తిప్పి పంపదు.
ఒకవేళ ఏదో ఒకవిధంగా డిపోర్టేషన్ ఉత్తర్వులు పొందినా.. అవి అమెరికా న్యాయవ్యవస్థ ఆమోదం పొందాలి. అమెరికా న్యాయవ్యవస్థ వద్ద వెయ్యికిపైగా వివిధ నోటీసులు పెండింగ్‌లో ఉండగా.. ఇప్పటివరకు కేవలం 56 నోటీసుల అమలుకే అనుమతి ఇ చ్చింది. అమెరికా వంటి దేశాల్లో వ్యక్తుల ప్రాణాలు, ఆరోగ్యానికి విలువ ఎక్కువ. ప్రభాకర్‌రావు అక్కడ మెడికల్ గ్రౌండ్స్‌పై ఉంటున్నందున ఆయనపై నోటీసు జారీ అయినా డిపోర్టేషన్‌కు అనుమతించే అవకాశాలు చాలా తక్కువే.
వీసాగడువులో మతలబులుఎన్నో...
తరచూ అమెరికాకు వెళ్లి వస్తున్న ఆయా వ్యక్తుల కుటుంబీకులు, అక్కడే ఉంటున్న ప్రభాకర్‌రావు వంటి వారికి సాధారణంగా 10 నుంచి 15 ఏళ్ల గడువుతో కూడిన వీసాలు లభిస్తుంటాయి. అయితే ఒకసారి ఆ దేశంలో అడుగుపెట్టిన తర్వాత గరిష్టంగా 180 రోజులలోపు తిరిగి బయటకు వచ్చేయాలనే నిబంధన ఉంది. దీంతో ప్రస్తుతం ఆయన 179 రోజులు అక్కడ ఉండి, ఆపై కెనడా లేదా మరో దేశానికి కొన్ని రోజులు వెళ్లి వస్తే.. మళ్లీ 179 రోజులు అమెరికాలో ఉండే అవకాశం దక్కుతుంది.
ప్రభాకర్‌రావు వైద్యం చేయించుకుంటున్న నేపథ్యంలో వీసా గడువు తేలిగ్గా పొడిగించుకునే అవకాశం ఉంది. రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం ద్వారా ఆయన పాస్‌పోర్టు రద్దుకు ప్రయత్నాలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇది కూడా ఆశించిన ఫలితం ఇవ్వదని కొందరు నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment