
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దేవిక ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. ఆరు నెలల క్రితమే సాఫ్ట్ వేర్ ఉద్యోగినే ప్రేమ వివాహం చేసుకున్న దేవిక.. ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమెకు వేధింపులు ఎక్కువ కావడంతోనే ఈ దారుణానినికి పాల్పడి ఉంటుందని ఆరోపిస్తున్నారు.
అతనొక ఉన్మాది..
దేవికను ప్రేమించి పెళ్లిచేసుకున్న శరత్ చంద్ర అనే వ్యక్తి ఒక ఉన్మాది అని, అతనికి ఉరిశిక్షే సరైనదని దేవిక మేనమామ అంటున్నారు. ‘సాక్షి’తో మాట్లాడిన దేవిక మేనమామ.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందన్నారు. ఎప్పుడూ అందరికీ ధైర్యం చెప్పే తన మేనకోడలు.. ఈరోజు ఇలా విగత జీవిలా పడి ఉండటం తమను ఎంతగానో బాధిస్తుందన్నారు. తానొక రైతునని, తనకు ఎప్పుడు కష్టం వచ్చినా ధైర్యం చెప్పే మేనకోడలు ఈరోజు లేదన్నారు. నేటి సమాజంలో ఏ అమ్మాయికి ఇటువంటి పరిస్థితి రాకూడదన్నారు. తన మేనకోడలు ఎంతో గట్టి మనస్తత్వం ఉన్న అమ్మాయి అని, కానీ భర్త వల్ల ఎంతగా కృంగిపోతే ఆత్మహత్య చేసుకుందో తమకు అర్థమైందన్నారు. అతన్ని కచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిందేనన్నారు మేనమామ.
మండే వస్తా మమ్మీ అంది.. శవమై వచ్చింది నా బిడ్డ..!
తన కూతురు ఆత్మహత్యపై తల్లి పడే రోదన అంతా ఇంతా కాదు. ఇంటికి వస్తానన్న బిడ్డ, శవమై వచ్చిందంటూ ఆమె తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తన బిడ్డ తనకు ప్రతీ రోజూ ఫోన్ చేసేదని, తిన్నావా మమ్మీ, ఎలా ఉన్నావ్ మమ్మీ అనే అడిగేదని కన్నీటి పర్యంతమయ్యారు తల్లి. ‘మొన్న పోయిన సండే ఇంటికి రా బిడ్డా అని అడిగితే, లేదు మమ్మీ మండే వస్తానంది.. వచ్చి నన్ను ఆస్పత్రిలో చూపిస్తానంది. మండే నాడు శవమై వచ్చింది నా కూతురు’ అంటూ తల్లి కన్నీటి పర్యంతమయ్యారు.

ఆరు నెలల క్రితమే ప్రేమ పెళ్లి..
కాగా, వికారాబాద్ జిల్లా, తోర్‌మామిడికి చెందిన కమలాపురం దేవిక(25) మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తోంది. మంచిర్యాల మార్కెట్ రోడ్డుకు చెందిన సద్గుర్తి శరత్ చంద్రతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీయడంతో పెద్దల అంగీకారంతో వారిద్దరూ గతేడాది ఆగస్టు 23న గోవాలో పెళ్లి చేసుకున్నారు. రాయదుర్గంలోని ప్రశాంత్ హిల్స్‌లో నివాసం ఉంటున్నారు.
అయితే, కొద్ది రోజులుగా భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా వారి మధ్య గొడవ జరగడంతో దేవిక గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. బయటికి వెళ్లి తిరిగి వచ్చిన శరత్‌చంద్ర తలుపు తట్టినా దేవిక స్పందించకపోవడంతో నిద్రపోయి ఉంటుందని భావించాడు. సోమవారం ఉదయం 10 గంటలైనా దేవిక బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన శరత్ చంద్ర తలుపు విరగ్గొట్టి చూడగా ఆమె ఉరి వేసుకుని కనిపించింది.
ఈ క్రమంలో ఇరుగు పొరుగు సహాయంతో కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందింది. వరకట్నం కోసం శరత్‌చంద్ర తన కుమార్తెను వేధిస్తున్నాడని, ఈ కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని మృతురాలి తల్లి రామలక్ష్మి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment