
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా వేదికగా సొంత పార్టీ నేతలు విమర్శించుకోవద్దని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ సూచించారు. ఆమె నేటి నుంచి రాష్ట్రంలో పార్టీ పనితీరుపై పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చేపట్టారు. గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన మెదక్ లోక్‌సభ నియోజకవర్గ సమీక్ష నిర్వహించారు. పార్టీ అంతర్గత విషయాలు బయటకు మాట్లాడితే వేటు తప్పదంటూ మీనాక్షి నటరాజన్ హెచ్చరించారు.
పార్టీ కోసం పనిచేసిన వారి వివరాలు తానే స్వయంగా తెప్పించుకుంటున్నానని చెప్పిన మీనాక్షి.. నియోజకవర్గ ఇంఛార్జ్‌లు బాధ్యతతో పనిచేయాలన్నారు. ఇంఛార్జ్ వల్లే సమస్యలు వస్తే.. పదవి నుంచి తొలగిస్తామంటూ ఆమె ఖరాఖండిగా చెప్పేశారు. పటాన్ చెరువులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమను ఇబ్బంది పెడుతున్నారన్న కాట శ్రీనివాస్ గౌడ్.. సమస్య పరిష్కారం కోసం కమిటీ వేసినా.. ఇప్పటి వరకు రిపోర్ట్ ఇవ్వలేదంటూ ఫిర్యాదు చేశారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించాలంటూ ఇంఛార్జ్‌ని కాట కోరారు.
అధికారులు తమ మాట వినడం లేదన్న మరి కొందరు నేతలు.. ఇంకా బీఆర్ఎస్ నేతలే అధికారం చెలాయిస్తాన్నారంటూ మరికొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇందిరమ్మ ఇల్లు అయినా తాము చెప్పిన వారికి ఇస్తే గౌరవం ఉంటుందంటూ మీనాక్షి నటరాజన్‌కు పలువురు నేతలు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment