
సాక్షి, హైదరాబాద్: ‘‘ఎవరి పనితీరు ఎంటో నాకు తెలుసు. ఎవరు పనిచేస్తున్నారో, ఎవరు నటిస్తున్నారో తెలుసు. పార్టీ కోసం సమయం కేటాయించాలి. అంతర్గత విషయాలు బయట చర్చించొద్దు’’ అంటూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ మరోసారి హెచ్చరించారు. పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ అధ్యక్షతన గాంధీభవన్‌లో ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మీనాక్షి నటరాజన్, మంత్రి సీతక్క పాల్గొన్నారు. కాంగ్రెస్ అనుబంధ సంఘాల నేతలకు మీనాక్షి దిశానిర్దేశం చేశారు.
లోక్‌సభ నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న సమీక్షల్లో భాగంగా మంగళవారం గాందీభవన్‌లో మెదక్, మల్కాజ్‌గిరి స్థానాల పరిధిలోని పార్టీ నేతలతో ఆమె విడివిడిగా సమావేశయిన సంగతి తెలిసిందే. పార్టీ లైన్ ప్రకారమే ఎవరైనా వెళ్లాల్సి ఉంటుందని, గీత దాటితే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు బహిరంగ వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పార్టీలో అందరికీ అవకాశాలు కల్పిస్తామని, పదేళ్లుగా పార్టీ జెండాను భుజాన మోసిన వారికి తొలి ప్రాధాన్యత ఉంటుందని మీనాక్షి నటరాజన్ హామీ ఇచ్చారు. ఫ్లెక్సీల్లో ఫొటోలు కనిపిస్తే సరిపోదని, ప్రజల మధ్యలో ఉండాలని దిశానిర్దేశం చేశారు. పార్టీలో సామాజిక న్యాయం అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.

Comments
Please login to add a commentAdd a comment