medak constituency
-
కాంగ్రెస్‌కు రెండు సీట్లు కూడా రావు: కేసీఆర్
సంగారెడ్డి,సాక్షి: రాజకీయాల్లో అప్పుడప్పుడు కొంత మంది లిల్లిపుట్ గాళ్లకు అధికారం వస్తుందని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే లిల్లిపుట్ గాళ్లకు సురుకు పెట్టినట్లతవుతుందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో 2 సీట్లు కూడా రావని సర్వేలు చెబుతున్నాయన్నారు. సంగారెడ్డిలో మంగళవారం(ఏప్రిల్ 16) జరిగిన మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. ‘ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో వణుకుతున్నాడు. కాంగ్రెస్ పనైపోయింది. ఆ పార్టీపై ప్రజాగ్రహం ప్రారంభమైంది. సీఎం భయం చూస్తే ఏడాది కూడా ఉండేటట్టు లేడు. ముఖ్యమంత్రి ఉంటడా వేరే పార్టీలకు జంపైతడా తెల్వదు. ఇక్కడేమో కాంగ్రెస్‌కు ఓటేయమంటాడు. ఢిల్లీకి పోయి బీజేపీకి ఓటేయమంటాడు. నేను రాజకీయంగా ఎంతో ఎత్తు ఎదిగేలా.. నన్ను పెంచింది మెతుకు సీమ. మీరిచ్చిన బలంతోనే ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నాం. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను గెలిపిచ్చిన మెతుకుసీమ గడ్డ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. కొంత మంది బీఆర్ఎస్కు పార్లమెంట్ సీట్లు ఎందుకని అడ్డం పొడుగు మాట్లాడుతున్నారు. ఇప్పుడే కావాలి ఎంపీ సీట్లు బీఆర్ఎస్కు. బీఆర్ఎస్ బిడ్డలు పార్లమెంట్లో ఉంటేనే మన హక్కులు నెరవేర్తాయి. రాజకీయాల్లో అప్పుడప్పుడు గమ్మత్తు ఉంటుంది. గుడ్డి లక్ష్మి వచ్చినట్లు కొంత మంది లిల్లిపుట్ గాళ్లకు కూడా అధికారం వస్తుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని కట్టుకుని ఆవిష్కరించుకున్నాం. విగ్రహం పెట్టుకున్న తర్వాత జరిగిన తొలి జయంతి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది. పూలమాల పెట్టలే.. ఏర్పాట్లు చేయలే.. సందర్శకులు వెళ్లకుండా గేట్లు బంద్ చేశారు. ఇది కండకావరమా.. అజ్ఞానమా.. మరి సెక్రటేరియట్లో ఎందుకు కూర్చుకుంటున్నారు. దానికి కూడా అంబేద్కర్ అని పేరు పెట్టాం కదా.. యాదాద్రి గుడికి ఎందుకు వెళుతున్నారు..ఎమ్మెల్యే క్వార్టర్లలో ఎందుకు ఉంటున్నారు. అవన్నీ మేమే కట్టాం. ఇదే లిల్లీపుట్ గాళ్ల పార్టీ సింగూరు నుంచి ఒక్క చుక్క నీరు కూడా మెదక్‌కు ఇవ్వలే. మనం సంగమేశ్వర, బసమేశ్వర లిఫ్ట్‌లు పెట్టుకున్నం. వాటిని ఈ ప్రభుత్వం పట్టించుకుంట లేదు. దళితబంధు బంద్ పెడితే నోరు మూస్కోని పడుందామా.. అంబేద్కర్‌ను అవమానిస్తే చూస్తూ ఊరుకుందామా. వీళ్లకు సురుకు పెట్టాలె. ఈ ప్రభుత్వం మెడలు వంచి హామీలు నెరవేర్చాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో సురుకు పెట్టాల్సిందే. ఉద్యోగులకు ఎన్నో ఇచ్చాం గుర్తులేదా.. ఆలోచించండి లేదంటే బీఆర్ఎస్కు ఏం కాదు.. మీరే నష్టపోతరు. కరెంటు ఉండాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి. డీజీపీ వార్నింగ్.. పోలీసులు మీకు రాజకీయాలెందుకు. బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోం. కరీంనగర్లో సల్వాజీ మాధవరావు అనే బీఆర్ఎస్ కార్యకర్త సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. డీజీపీకి వార్నింగ్ ఇస్తున్నా.. మళ్లీ మేం అధికారంలోకి వస్తాం. మీరేం చేస్తున్నరో అన్నీ రికార్డు చేస్తున్నం. జాగ్రత్త’ అని కేసీఆర్ హెచ్చరించారు. -
నాగర్‌కర్నూల్ నుంచి ప్రవీణ్‌కుమార్..మెదక్ నుంచి వెంకట్రామిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ శుక్రవారం ప్రకటించింది. మెదక్ నుంచి ఎమ్మెల్సీ పరిపాటి వెంకట్రామిరెడ్డికి, నాగర్‌కర్నూల్ నుంచి ఇటీవలే బీఎస్పీ నుంచి చేరిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు పార్టీ అధినేత కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీనితో మొత్తంగా బీఆర్ఎస్ 13 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్టయింది. మరో 4 సీట్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. వంటేరు పేరు వినిపించినా.. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పేరును బీఆర్ఎస్ దాదాపు నెల రోజుల క్రితమే ఖరారు చేసినా.. వివిధ కారణాలతో ప్రకటన జాప్యం జరుగుతూ వచ్చింది. అయితే 2 రోజుల క్రితం కేసీఆర్‌ను కలిసిన వంటేరు ప్రతాప్‌రెడ్డి తనకు పోటీచేసే ఉద్దేశం లేదని చెప్పినట్టు సమాచారం. దీంతో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వెంకట్రామిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో జాయింట్ కలెక్టర్‌గా, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి పనిచేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి మెదక్ లోక్‌సభ నియోజకవర్గం పార్టీకి కంచుకోటగా ఉంది. 2014లో పార్టీ అధినేత కేసీఆర్ మెదక్ ఎంపీగా గెలిచినా రాష్ట్రంలో బీఆర్ఎస్ విజయం సాధించడంతో రాజీనామా చేసి సీఎం పదవి చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మెదక్‌లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్.. ఆర్థిక బలం కలిగిన వెంకట్రామిరెడ్డి వైపు మొగ్గుచూపినట్టు సమాచారం. పెండింగ్‌లో మరో నాలుగు సీట్లు లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి 11 సీట్లలో అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంతకుముందే ప్రకటించారు. తాజాగా ప్రకటించిన ఇద్దరి కలసి బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసిన స్థానాల సంఖ్య 13కు చేరింది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ సీట్లకుగాను ఇంకా నాలుగు సీట్లు హైదరాబాద్, సికింద్రాబాద్, భువనగిరి, నల్లగొండ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ పేరు ఖరారైనట్టు ప్రచారం జరుగుతోంది. మిగతా స్థానాలకు కసరత్తు కొనసాగుతోందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. పెండింగ్ సీట్లకు రెండు మూడు రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని తెలిపాయి. 30వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయి సమావేశాలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం మెదక్ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులతో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భేటీ అయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, ముఖ్య నేతలు వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, భూంరెడ్డి, వేలేటి రాధకృష్ణశర్మ తదితరులు దీనికి హాజరయ్యారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తిరుమలకు వెళ్లడంతో భేటీకి రాలేదు. ఈ సందర్భంగా ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు మెదక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని నేతలను కేసీఆర్ ఆదేశించారు. ఆలోగా అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని మండలాల వారీగా కార్యకర్తల సమావేశాలను పూర్తి చేయాలని పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులకు సూచించారు. మెదక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో రెండు లేదా మూడు ఎన్నికల ప్రచార సభలు నిర్వహించేందుకు షెడ్యూల్ తయారు చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావుకు సూచించారు. బీఆర్ఎస్లోనే కొనసాగుతా: వంటేరు ప్రతాప్‌రెడ్డి మెదక్ లోక్‌సభ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేసిన నేపథ్యంలో.. గజ్వేల్ నియోజకవర్గ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి బీఆర్ఎస్ను వీడతారనే ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తానని వంటేరు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో పనిచేసిన ప్రతాప్‌రెడ్డి.. ఆ సమయంలో రేవంత్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావులతో సన్నిహితంగా ఉండేవారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై 2014లో టీడీపీ తరఫున, 2018లో కాంగ్రెస్ తరఫున వంటేరు ప్రతాప్‌రెడ్డి పోటీ చేశారు. తర్వాత బీఆర్ఎస్లో చేరి అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. నాకు ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి: వెంకట్రామిరెడ్డి మర్కూక్ (గజ్వేల్): తనను మెదక్ అభ్య ర్థిగా ప్రకటించడం పట్ల కేసీఆర్, హరీశ్‌రావులకు వెంకట్రామిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఐఏఎస్ అధికారిగా ఏడున్నరేళ్లు ఈ జిల్లాలో పనిచేశానని, తనకు ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. కేసీఆర్ దీనిని గుర్తించి తనకు అవకాశం ఇవ్వడం గర్వంగా ఉందన్నారు. -
మంత్రి హరీష్ రావుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి వార్నింగ్
తిరుమల: తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్ధుల ప్రకటన ముహూర్తానికి ముందే ఆ పార్టీ మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు మంత్రి హరీశ్ రావుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం మరికొద్ది సేపట్లో అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారనగా మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మంత్రి హరీశ్ రావుపై ఫైర్ అయ్యారు. నేను, నా కుమారుడు ఎక్కడ నుండి పోటీ చెయ్యాలో చెప్పడానికి హరీష్‌రావు ఎవరు? ఇందులో ఆయన పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. నేను మల్కాజ్ గిరి నుంచి నా కుమారుడు మెదక్ నుంచి పోటీ చేస్తాము. ఎవ్వరు అడ్డుకుంటారో చూస్తామని సవాల్ చేశారు. ఇంతకాలం మెదక్ అభివృద్ధిని అడ్డుకుంది హరీష్ రావేనని అవసరమైతే సిద్దిపేటలో నా తడాఖా ఏంటో చూప్పించి హరీశ్ రావు అడ్రస్ గల్లంతు చేస్తానని వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేశారు. కేసీఆర్ కుటుంబంలో చాలామందికి టికెట్ ఇచ్చారని మా ఇద్దరికి టికెట్ ఇస్తేనే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ‘నా కుమారుడు మైనంపల్లి రోహిత్ రెండు గోల్డ్ మెడల్స్ సాధించారు. కరోన సమయంలో ప్రణాలకు తగించి చాలా మందికి వైద్య సేవలు అందించారు. తండ్రి గా నా కుమారుడికి నా సపోర్ట్ ఉంటుంది. నా కొడుకుని మెదక్ ఎమ్మెల్యే చేస్తాను. హరీష్‌రావు మెదక్ లో పెత్తనం చలాయిస్తున్నాడు. ఓ డిక్టేటర్లా హారీష్‌రావు ప్రవర్తిస్తా ఉన్నారు. హారీష్‌రావు గతం గుర్తు పెట్టుకో. ఓ టంకు డబ్బాతో, రబ్బరు చొప్పులతో వచ్చిన రోజు చూసాను. నేను హిరోగా ఉన్నా, హరీష్ రావు చాలా చిన్న వాడు....సిద్దిపేట్ అభివృద్ధి అయింది, మెదక్ ఎందుకు అభివృద్ధి కాలేదు అని అడిగినా. హరీష్‌రావు బట్టలు ఇప్పే వరకు నేను వదలను.. ఈసారి నా కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించుకొని హరీష్‌రావు అడ్రస్ లేకుండా చేస్తా. వచ్చే ఎన్నికల్లో సిద్ధిపేటలో పోటి చేస్తా బిడ్డా. హరీష్‌రావుని నిద్రపోనివ్వను. లక్ష కోట్లు హరీష్‌రావు సంపాదించాడు. టంకు డబ్బా,రబ్బరు చెప్పులతో వచ్చిన హారీష్రావ్కి లక్ష కోట్లు ఎక్కడి నుండి వచ్చాయి. మెదక్ లో హారీష్రావ్ పెత్తనం ఏంటి. మల్కాజ్‌గిరిలో నేను పోటీ చేస్తా, మెదక్ లో నా కొడుకు పోటీ చేస్తాడు. అవసరమైతే రాజకీయాలు పక్కనపెట్టి నా కొడుకుని గెలిపించుకొంటాను. నేను టీఆర్ఎస్ పార్టీ, వారు నన్ను వద్దు అనుకొంటే నేను ఏం చేసేను. నాకు ఎమ్ఎల్ఏ టికెట్ ఇచ్చారు. ఇస్తే ఇద్దరికి టికెట్ ఇవ్వమని అడిగా. లేకుంటే ఎవ్వరికి వద్దు అని తేల్చి చెప్పాను’అని మంత్రి హరీష్‌రావుపై మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి. ఇది కూడా చదవండి: హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌కు మంత్రి హరీష్ క్లాస్ -
‘కేటీఆర్ వర్గానికే పదవులు.. హరీశ్ వర్గాన్ని అణగదొక్కుతున్నారు’
మెదక్ మున్సిపాలిటీ: ఉమ్మడి మెదక్ జిల్లాలో రాజకీయ పదవులతోపాటు నామినేట్ పదవులు కూడా అగ్రవర్ణాలకే ఇస్తున్నారని, టీఆర్ఎస్ పార్టీలో బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోందని నర్సా పూర్ మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్ అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలోని ఐబీ గెస్ట్ హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్లో బీసీలకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. కాగా, పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆయనను టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మురళీయాదవ్ టీఆర్ఎస్ నాయకత్వం తీరుపై ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్, హరీశ్ వెంటే ఉండి, రాష్ట్ర సాధనకు పోరాడామన్నారు. అంతర్గతంగా పార్టీ గురించి చర్చించాలంటే అధిష్టానాన్ని కలిసే అవకాశం రావాలన్నారు. కానీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకే ప్రగతిభవన్‌లోకి ఎంట్రీ లేకపోతే తనలాంటి వారు పార్టీలో జరుగుతున్న విషయాలు చెప్పే అవకాశం ఎక్కడ దొరుకుతుందన్నారు. పార్టీలో కేటీఆర్ వర్గానికి పదవులు ఇస్తూ, హరీశ్‌రావు వర్గాన్ని అణగదొక్కరని ఆరోపించారు. తన రాజకీయ భవిష్యత్‌ను నర్సాపూర్ ప్రజలే నిర్ణయిస్తారని, వారి అభిప్రాయాల మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: మున్సిపల్ చైర్మన్‌ను సస్పెండ్ చేసిన టీఆర్ఎస్ -
టీఆర్ఎస్లో పోటాపోటీ.. ప్రజాక్షేత్రంలో బిజీగా నేతలు
సాక్షి, మెదక్: అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న టీఆర్ఎస్ నియోజకవర్గ నేతలు పోటాపోటీ కార్యక్రమాలకు తెరలేపారు. బహిరంగంగా ఎక్కడా విభేదాలు కనబడకున్నా.. అంతర్గతంగా ఎవరికి వారు ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నట్లు చర్చసాగుతోంది. స్థానికంగా జరిగే కార్యక్రమాలకు హాజరవుతూ జనం మధ్యలో ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పటికే మెదక్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరిసుభాష్‌రెడ్డి నర్సాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునితాలక్ష్మారెడ్డి మధ్య వర్గ విభేదాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ప్రజల మద్దతుకై ఆరాటం ► అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల గడువున్నా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నేతలు ఇప్పటి నుంచే ప్రజల మద్దతును కూడగట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ► మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు టికెట్ ఆశిస్తు న్న ముఖ్య నాయకులు ఆయా నియోజకవర్గాల్లో ముమ్మరంగా పర్యటిస్తూ, ఏ చిన్న అవ కాశం ఉన్నా వదులుకోకుండా హాజరవుతున్నారు. ► ఎవరి వర్గాన్ని వారు కాపాడుకుంటూ పోటీపోటీగా అధికార, ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటుండడంతో రాజకీయవర్గాల్లో విస్తృతంగా చర్చ మొదలైంది. మెదక్ నియోజకవర్గంలో.. ► మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి ఇప్పటికే జిల్లా పార్టీ పగ్గాలను సీఎం కేసీఆర్ అప్పగించటంతో నియోజకవర్గంతో పాటు ఇతర ముఖ్య పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ బీజీగా గడుపుతున్నారు. ► ప్రతీ మంగళవారం క్యాంపు కార్యాలయంలో మీ కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పద్మాదేవేందర్‌రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదానం, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. ► అవకాశం దొరికినప్పుడల్లా మెదక్ జిల్లాకు రైలు, మెడికల్ కళాశాల మంజూరు తదితర పనులపై ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ► సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి జన్మదినం సందర్భంగా గతేడాది ఆగస్టులో ఆయన వర్గీయులు నియోజకవర్గంలో భారీ ర్యాలీ, కటౌట్లతో హంగామా చేశారు. ► తమ వర్గీయులతో కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందిస్తూ ప్రజల మెప్పు పొందుతున్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ సమస్యలపై దృష్టి పెడుతున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో... ► సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునితా లక్ష్మారెడ్డి పోటాపోటీగా పర్యటనలు చేస్తూ, స్థానికంగా ఎక్కువ సమయం ఉండేలా చూసుకుంటున్నారు. ► నర్సాపూర్‌లో మహిళా కమిషన్ చైర్పర్సన్ సు నితా లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలను ఆమె వర్గీయులు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ► మరోవైపు మదన్‌రెడ్డి అనుయాయులు ఆయన పుట్టిన రోజున ఆలయాల్లో పూజలు చేశారు. నర్సాపూర్ నుంచి చాకరిమెట్ల వరకు కాలినడకన వెళ్లి పూజలు నిర్వహించారు. ► మెదక్‌లో పద్మాదేవేందర్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డిలు, నర్సాపూర్‌లో మదన్‌రెడ్డి, సునితా లక్ష్మారెడ్డి ఎవరికి వారు ప్రజల్లో ఉంటూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ► ఈ క్రమంలో అధికార పక్షానికి చెందిన ఇద్దరు నేతలు రెండు వర్గాలుగా ఏర్పడడంతో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ రెండు నియోజకవర్గాలు.. ► జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజక వర్గాలు ఉన్నా, మెదక్ మాత్రమే పూర్తిస్థాయి నియోజకవర్గంగా కొనసాగుతోంది. ► మెదక్ నియోజకవర్గంలోని హవేళిఘనాపూర్, రామాయంపేట, పాపన్నపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట మండలాలతో పాటు మెదక్, నర్సాపూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ► నర్సాపూర్ నియోజక వర్గంలో నర్సాపూర్, శివ్వంపేట, వెల్దూర్తి, కొల్చారం, కౌడిపల్లి, చిలిపిచెడ్, నర్సాపూర్ మున్సిపాలితో పాటు హత్నూర మండలం ఉన్నా, పాలనా సౌలభ్యం కోసం దానిని సంగారెడ్డి జిల్లాలో కలిపారు. ► గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్, మనోహరబాద్లను, దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంట, నార్సింగ్ మండలాలను, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పెద్దశంకరంపేట మండలాన్ని, అందోల్ నియోజకవర్గంలోని టేక్మాల్, రేగోడు, అల్లాదుర్గ్, మండలాలను మెదక్ జిల్లాలో కలిపారు. ► ఇటీవల ఏర్పడిన మాసాయిపేట మండలంతో కలిపి జిల్లాలో 21 మండలాలు, 4 మున్సిపాలిటీలు మెదక్ జిల్లాలో కొనసాగుతున్నాయి. (క్లిక్: అధికార పార్టీలో ధిక్కార స్వరం.. ‘కారు’కు ఏమైంది?) -
మా ఆయన బంగారం: పద్మా దేవేందర్ రెడ్డి
సాక్షి, మెదక్ : అమ్మే ధైర్యం.. ఆమె ఆశీర్వాదమే నా బలం అని అంటున్నారు అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి. అమ్మకు తోడుగా మా వారి అండతోనే ఈ స్థాయికి చేరా.. ఆయనే నా రాజకీయ గురువు.. వారి ప్రోద్బలంతోనే తెలంగాణ ఉద్యమం, ప్రత్యక్ష రాజకీయాల్లో నాదైన ముద్ర వేసుకున్నా.. అని గర్వంగా చెబుతున్నారు. వరుస ఎన్నికలు, నిత్య రాజకీయాల్లో తలమునకలైన ఆమె శనివారం ‘సాక్షి’తో ముచ్చటించారు. చిన్ననాటి తీపి గుర్తులు, ఇష్టమైన వంటకాలు, స్నేహితులు, బంధువులతో అనుబంధాన్ని పంచుకున్నారు. పుట్టినిల్లయినా.. అత్తారిల్లయినా.. మా ఇళ్లే ఒక బృందావనం అని అంటున్న పద్మాదేవేందర్‌రెడ్డి ‘పర్సనల్ టైం’ ఆమె మాటల్లోనే.. పుట్టినింట్లో ప్రెండ్లీగా ఉండేటోళ్లం. అత్తారింటికి వచ్చాక పద్ధతులు మారాయి. అక్కడైనా, ఇక్కడైనా క్రమశిక్షణతో ఉండడం అలవర్చుకున్నా. ఏ ఇల్లు అయినా ఒక బృందావనమే. చిన్న కోడలు కావడంతో అత్తవారింట్లోకి ఒకింత భయంతో అడుగుపెట్టినా.. మా ఆయన బంగారం కావడంతో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. ఆ ఉత్తరం తీపి జ్ఞాపకం మాది కరీంనగర్ జిల్లా నామాపూర్ గ్రామం. అమ్మ విజయ, నాన్న భూమిరెడ్డి. మేం ముగ్గురు సంతానం. నేనే పెద్ద కూతురిని. నాన్న ప్రభుత్వ ఉద్యోగి. ఆదిలాబాద్ జిల్లా తోటపల్లి జెడ్పీహెచ్ఎస్లో టీచర్‌గా పనిచేసేవారు. ఇంటి వద్ద అమ్మ ఒక్కతే మా ఆలనాపాలనా చూసేది. నాన్న సెలవు రోజుల్లో వచ్చి మా యోగక్షేమాలు తెలుసుకుని.. మళ్లీ డ్యూటీకి వెళ్లేవారు. దీంతో అమ్మతోనే ఎక్కువ అనుబంధం ఉండేది. అమ్మ నాతో స్నేహితురాలిగా మెలిగేది. అమ్మ ఆశీర్వాద బలంతోనే తెలంగాణ ఉద్యమంలోకి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చా. నాన్న దూరంగా ఉన్నప్పుడు మా అమ్మ నాతో మొదటిసారి నాన్నకు ఉత్తరం రాయించింది. నేను అప్పుడు మూడో తరగతి చదువుతున్నాను. అది ఎప్పటికీ మరువలేని తీపి జ్ఞాపకం. విద్యాభ్యాసం సొంతూరు కరీంనగర్ జిల్లా నామాపూర్‌లో ఏడో తరగతి వరకు విద్యనభ్యసించా. ఎనిమిది నుంచి డిగ్రీవరకు కరీంనగర్లో చదువుకున్నా. ఆ తర్వాత హైదరాబాద్‌లోని పెండెకంటి లా కాలేజీలో న్యాయ విద్యనభ్యసించా. స్నేహబంధం కంటిన్యూ చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు స్నేహబంధం కంటిన్యూ అవుతూనే ఉంది. ఉమ, మంగ, అరుణ ఇంకొందరం చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లం. పెళ్లి అయినప్పటికీ స్నేహితుల ఇళ్లలో జరిగే ఏ కార్యక్రమాలకైనా హాజరయ్యేదాణ్ని. ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత కొంత తగ్గినప్పటికీ.. ప్రతి సంవత్సరం ఎవరో ఒకరి ఇంట్లో అందరం స్నేహితులం కలుస్తాం. నేను వెళ్లినా.. వెళ్లకున్నా.. ఈ ట్రెండ్ ఇప్పటివరకు కొనసాగుతుండడం సంతోషంగా ఉంది. గ్రామాలే విడిది కేంద్రాలు చిన్నప్పటి నుంచి గ్రామీణ వాతావరణంలోనే ఉన్నాం. కోడి కూతతో తెల్లవారడం.. పాడి పశువులు ఇంటిబాట పట్టినప్పుడు పొద్దుగూకడం వంటి వాతావరణంలో పెరిగినం. చిన్నప్పుడైనా కావొచ్చు.. ఇప్పుడైనా కావొచ్చు విలేజీ వాతావరణంలోనే ఉండాలని అనిపిస్తుంది. మేము, మా కుటుంబ సభ్యులం ప్రత్యేకంగా ఎలాంటి టూర్లకు వెళ్లం. చిన్నప్పుడు ఏదైనా కార్యక్రమం ఉంటే అమ్మమ్మ, నానమ్మ వాళ్లింటికి వెళ్లేటోళ్లం. ఇప్పడు కూడా అదే పద్ధతి కొనసాగుతోంది. మాకు గ్రామాలే విడిది కేంద్రాలు. ప్రస్తుతం పల్లెలు పట్టణాలుగా రూపాంతరం చెందుతున్నప్పటికీ.. పల్లె వాతావరణమే మాకు ఇష్టం. చెంపదెబ్బలు ఫన్నీ నేను ఐదో తరగతి చదువుతున్న సమయంలో జరిగిన సంఘటన ఇప్పటికీ నాకు నవ్వు తెప్పిస్తుంది. మా సార్ చొక్కారావు.. ‘బృహలేశ్వరాలయం’ అని పలకాలని విద్యార్థులకు చెప్పారు. ఎవరు కూడా ఆ పేరు పలకలేకపోయారు. నేను మాత్రమే చెప్పడంతో సార్ నన్నెంతో మెచ్చుకుని, తోటి విద్యార్థులకు చెంపదెబ్బలు వేయించారు. నేను మెల్లిగా కొడితే దగ్గరుండి మరీ గట్టిగా వేయించారు. ఈ సంఘటన నాకు చిన్ననాటి తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది. పునీత్.. హ్యాపీ మూమెంట్ నా కొడుకు పునీత్‌రెడ్డి పుట్టడం జీవితంలో మరచిపోలేను. అది ఇప్పటికి, ఎప్పటికీ నాకు హ్యాపీ మూమెంట్. డిప్యూటీ స్పీకర్ అయ్యే వరకు నేనే స్వయంగా వంట చేసే దాణ్ని. నేను వంట చేస్తేనే నా కొడుకు పునీత్ తినేటోడు. ఇప్పటికీ అప్పుడప్పుడు నా కొడుకు కోసం వంట చేస్తా. కూరగాయలతో భోజనం ఇష్టమైనప్పటికీ.. నాన్‌వెజ్ వంటకాలు బాగా చేస్తా. గోళీలాట, చిర్రగోనె ఇష్టం రాజకీయ రంగంలోకి రాకముందు ఖాళీ సమయాల్లో సినిమాలు చూసేదాణ్ని. దోస్త్‌లతో కలిసి షాపింగ్ అంటే ఇష్టముండేది. ఇప్పుడు ఎప్పుడైనా ఖాళీగా ఉంటే టీవీ చూస్తున్నా. పుస్తకాలు, నవలలు చదువుతా. చిన్నప్పుడు గోళీలాట, చిర్రగోనె ఆడడం ఇష్టం. రాజకీయాల్లోకి రాక ముందు దినపత్రికలు చదివేదాణ్ని కాదు. ఇప్పుడు ప్రతి పేపరు తప్పకుండా చదువుతా టీచర్. న్యాయవాది కావాలనుకున్నా.. చిన్నప్పుడు క్లాస్ ఫస్ట్ రావాలని కోరిక. నాన్న టీచర్ కాబట్టి చిన్నçప్పుడు నాకు టీచర్కావాలనే కోరిక ఉండేది. పెళ్లి అయిన తర్వాత మా ఆయనను చూసి న్యాయవాది కావాలనుకున్నా. లా చదివినప్పటికీ ఆ తర్వాత వృత్తిని చేపట్టలేదు. ఆ తర్వాత తల్లి ధైర్యం, భర్త ప్రోత్సాహంతో ఉద్యమంలో పాల్గొన్నా. ఆ తర్వాత రాజకీయ ప్రస్థానం మొదలైంది. మా ఆయన బంగారం మా ఆయన దేవేందర్‌రెడ్డి బంగారం. మా మధ్య చిన్న తగవు కూడా లేదు. దేవేందర్‌రెడ్డిని పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ఉద్యమం, రాజకీయ రంగంలో నా భర్త ప్రోత్సాహం ఎంతగానో ఉంది. ఉద్యమ సమయంలో జైలుకెళ్లడం వంటి ఘటనలతో నా పుట్టింటి వారు, అత్తింటి వారు కొంత ఆందోళనకు గురయ్యారు. మా ఆయన పూర్తిగా సహకారం అందించడంతో తెలంగాణ సాధనలో నా వంతు కర్తవ్యాన్ని నిర్వహించా. అనంతరం మా ఆయన ప్రోద్బలంతో 2001లో జెడ్పీటీసీగా గెలిచా. టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ అయ్యా. అప్పుడు నాకు ఎలా చేయాలి.. ఏం చేయాలి వంటి విషయాలు పెద్దగా తెలవదు. నా భర్త సహకారంతో అన్నీ తెలుసుకున్నా. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2004లో రాజీనామా చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రజల ఆశీస్సులతో మూడు దఫాలుగా ఎమ్మెల్యే అయ్యా. కూతురుగా అభివర్ణించడం మరిచిపోలేను తెలంగాణ ఏ విధంగా అన్యాయానికి గురైంది వంటి అంశాలను పుస్తకాలు చదవడం ద్వారా తెలుసుకున్నా. ప్రధానంగా ఉద్యమ సమయంలో కేసీఆర్ స్పీచ్ నన్ను ఆకట్టుకుంది. ఎమ్మెల్యే అయిన తర్వాత కేసీఆర్.. నన్ను కూతురుగా అభివర్ణించడం, అలానే చూసుకోవడం ఎప్పటికీ మరిచిపోలేను. ఎంతో సంతోషాన్నిచ్చిన సంఘటన అది. విద్యతోనే మహిళా సాధికారత ఆడ, మగ పిల్లలనే తేడా చూపొద్దు. నేటి సమాజంలో ఆడపిల్లలను తప్పనిసరిగా చదివించాలి. అదే నా మొదటి ఆకాంక్ష. మహిళల ఆర్థిక స్వాలంబన, మహిళా సాధికారత రావాలంటే విద్యే మూలం అని నా నమ్మకం. మహిళలను పురుషులతో సమానంగా చదివించాలి. ప్రొఫైల్ పేరు : పద్మాదేవేందర్‌రెడ్డి పుట్టిన తేదీ : 1969 జనవరి 6 పుట్టిన ఊరు : నామాపూర్ (కరీంనగర్) అత్త గారి ఊరు : కోనాపూర్ (మెదక్) వివాహం : 1988 చదువు : ఎల్ఎల్బీ కుటుంబం తల్లి : విజయ తండ్రి : భూమిరెడ్డి సోదరుడు : వంశీధర్‌రెడ్డి చెల్లెలు : అనిత సంతానం : పునీత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం : 2001–04 : జెడ్పీటీసీ (రామాయంపేట), టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ 2009–14 : మెదక్ ఎమ్మెల్యే 2014–18 : మెదక్ ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ 2018 డిసెంబర్ నుంచి : మెదక్ ఎమ్మెల్యే -
‘కేసీఆర్ మాటలు.. బ్రహ్మానందం కామెడీ’
సాక్షి, మెదక్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కంకణం కట్టుకున్నారని మాజీ ఎంపీ విజయశాంతి ఆరోపించారు. మెదక్‌లో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్ సింహగర్జన ఎన్నికల ప్రచార సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశ మంతా ప్రధానిగా మోదీ వద్దనుకుంటుంటే, కేసీఆర్ మాత్రం కావాలంటున్నారని విమర్శించారు. కేసీఆర్ మోదీ మనిషి అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ మాటలు చూస్తుంటే బ్రహ్మానందం, ఆలీ కామెడీలా అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. 16 మంది ఎంపీలున్నా విభజన హామీలు సాధించలేకపోయారని ధ్వజమెత్తారు. 2014లో మెదక్‌కు మంచి జరుగుతుందని ఎమ్మెల్యేగా పోటీకి దిగితే కుట్రలు కుతంత్రాలతో తనను ఓడించినా తాను బాధ పడలేదన్నారు. గెలుపు, ఓటములు తనకు మామూలేనని చెప్పారు. గెలిచినా ఓడినా మెదక్ తన ఇల్లు లాంటిదన్నారు. మెదక్‌కు రైలు నేనే సాధించానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది నాయకులు బయటకు పోయినా ఏమీ కాదన్నారు. మెదక్ ఎంపీ, ఎమ్మెల్లే వసూల్ రాజా, వసూల్ రాణిగా మారారని విజయశాంతి దుయ్యబట్టారు. సిరిసిల్లలో తాను ప్రచారం చేసి గెలిపించకపోతే కేటీఆర్ గెలిచేవాడా.. అప్పుడు దేవత, ఇప్పుడు దెయ్యం లా కనిపిస్తున్నానా అని ప్రశ్నించారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ సీఎం అయ్యే వారా అని నిలదీశారు. కేసీఆర్ మాయమాటలతో కాలం గడుపుతారని విమర్శించారు. ప్రజలు ఆలోచించకపోతే తమ గొయ్యి తాము తీసుకున్నట్టేనని హెచ్చరించారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి బీజేపీ తెలంగాణ ఇవ్వలేదని ధ్వజమెత్తారు. -
ఉక్కపోత .. ఉక్కిరిబిక్కిరి
సాక్షి, మెదక్ రూరల్: వేసవి ఆరంభంలోనే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఎండ వేడికి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రోజూవారి పనులలో భాగంగా జనం బయటకు వెళ్లాలంటేనే మండుటెండలను చూసి జంకుతున్నారు. వేసవి ఆరంభంలోనే ఇంత తీవ్రత ఉంటే ఏప్రిల్, మేలో ఉష్ణోగ్రతలు ఏమేర ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. ఎండవేడి తట్టుకునేందుకు తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఏటా వేసవిలో మెదక్ జిల్లా ప్రజలు అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతారు. గతంతో పోలిస్తే ఈసారి ఆరంభంలోనే ఎండలు మండుతున్నాయి. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పులతో జనం విలవిలలాడిపోతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎండ ఎక్కువగా ఉంటోంది. మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితి. ఆ సమయంలో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు శీతల పానీయాలు, పండ్ల రసాలను సేవిస్తున్నారు. అలాగే ఎండలకు వడదెబ్బ తగులకుండా తలకు రక్షణగా టోపీలు ధరిస్తున్నారు. రుమాళ్లను చుట్టుకుంటున్నారు. మహిళలు, వృద్ధులు గొడుగులు వేసుకుని వెళుతున్నారు. నీటి కష్టాలు మొదలు వేసవి ఆరంభంలోనే ఎండలు మండుతున్నాయి. ఈసారి వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురువకపోవడంతో చెరువులు, కుంటలు వట్టిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో నీటి మట్టం తగ్గిపోయింది. దీంతో బోర్లు నీళ్లు పోసే సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. సాగు నీరు లేకపోవడంతో పంటసాగు విస్తీర్ణం ఈసారి గణనీయంగా తగ్గింది. చెరువులు, కుంటల్లో చుక్క నీరు లేకపోవడంతో పశువులు దాహం తీర్చుకునేందుకు అల్లాడుతున్నాయి. ఇప్పటికే ఆయా గ్రామాల్లో ప్రజలకు నీటి కష్టాలు మొదలయ్యాయి. నీళ్ల కోసం బిందెలు పట్టుకొని సమీప ట్యాంకులు, పొలాలకు పరుగులుపెడుతున్నారు. సింగూరులో నీటి మట్టం తగ్గిపోవడంతో మిషన్ భగీరథ నీటి సరఫరా కొద్ది రోజులుగా నిలిచిపోయింది. ఈసారి తాగు, సాగు నీటికి గడ్డుకాలమేనని పలువురు చర్చించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నీటి ఎద్దడి అధికారులకు సవాల్‌గా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఊపందుకున్న సీజనల్ వ్యాపారాలు జ్యూస్ స్టాల్స్, శీతల పానీయాలు, టోపీలు, గొడుగులు వంటి వ్యాపారాలు ఇప్పటికే ప్రధాన రహదారుల వెంట వెలిశాయి. మట్టి కుండలు, రంజన్లను వ్యాపారులు అందుబాటులోకి తెచ్చారు. ఇక వేసవి తాపాన్ని తగ్గించేటువంటి కూలర్లు, ఏసీల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. -
మెదక్ అన్నింటా ప్రత్యేకమే
సాక్షి, మెదక్: రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉండటం, శరవేగంగా పారిశ్రామికాభివృద్ధి చెందిన ప్రాంతం మెదక్. 1952 తొలి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మెదక్ పార్లమెంట్లో నిజాం సంస్థానాధీశుల ఆదిపత్యం కొనసాగుతూ వచ్చింది. అప్పుడు మెదక్ పార్లమెంట్ మెదక్, అందోల్, సంగారెడ్డి, జహీరాబాద్, నారాయఖేడ్, ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పడింది. తర్వాత 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్ విభజన తర్వాత మెదక్ పార్లమెంట్ ముఖచిత్రం మారిపోయింది. పూర్వం మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న పటాన్చెరు, సంగారెడ్డి, మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలకు తోడుగా అప్పటివరకు సిద్దిపేట పార్లమెంట్‌గా కొనసాగిన సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలు మొత్తం ఏడు నియోజకవర్గాలు కలుపుకొని నూతన మెదక్ పార్లమెంట్‌గా ఆవిర్భవించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో మరింత ప్రత్యేకత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న మెదక్ పార్లమెంట్ స్థానం తెలంగాణ ప్రత్యేక వాద నినాదంతో గొంతు కలిపి ఉద్యమకారులకు అండగా నిలిచింది. తర్వాత స్వరాష్ట్ర సాధన, అనంతరం నూతన జిల్లాల ఆవిర్భావంతో మెదక్ పార్లమెంట్ పరిధిలో ఏడు మండలాలు మూడు జిల్లాల పరిధిలోకి వచ్చాయి. ఇందులో ప్రధానంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంతోపాటు, కార్మికుల గొంతుక పటాన్చెరు మెదక్ పార్లమెంట్ పరిధిలోనే నిలిచి పోయింది. మెదక్ జిల్లా కేంద్రంతోపాటు వెనకబడిన ప్రాంతంగా పేరున్న నర్సాపూర్ నియోజకవర్గం ఇందులోనే ఉంది. వీటితోపాటు సిద్దిపేట జిల్లా కేంద్రం సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలు మెదక్‌లోకి వచ్చాయి. అంటే సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ మూడు జిల్లా కేంద్రాలు ఈ పార్లమెంట్ పరిధిలోనే ఉన్నాయి. పారిశ్రామిక ప్రాంతం, రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉన్న గజ్వేల్‌తోపాటు, వెనకబడిన ప్రాంతాలైన దుబ్బాక, నర్సాపూర్ నియోజకవర్గాలు ఈ మెదక్ పరిధిలోకే వచ్చాయి. అంటే మెదక్ పార్లమెంట్ పరిధిలో అటు పట్టణ వాసులు, ఇటు పల్లె జనాల కలగలుపు, అభివృద్ధి, వెనకబాటుతనం ఇలా ఆర్థిక, సామాజిక, విద్య, వైద్యం పారిశ్రామిక రంగాల్లో కలగలుపుగా ఉన్న మెదక్ ఏంపీ స్థానం ఉండటం గమనార్హం. నాడు సామాజిక వేత్తలు.. నేడు ప్రత్యేక ఉద్యమ కర్తలు భారత పార్లమెంటరీ వ్యవస్థ ఏర్పాటు నుంచి నేటి వరకు మెదక్ ప్రత్యేకతను సంతరించుకుంటూ వస్తోంది. నాడు ఎన్.ఎం.జయసూర్య, సంగం లక్ష్మీబాయి వంటి సామాజిక వేత్తలకు ఆతిధ్యమిచ్చి పార్లమెంట్‌కు పంపించిన చరిత్ర ఈ గడ్డకు ఉంది. తర్వాత కాలంలో దేశంలోనే రాజకీయకల్లోల పరిస్థితి ఏర్పడిన సందర్భంలో 1980లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ప్రధాన మంత్రి అభ్యర్థి ఇందిరాగాంధీని గెలిపించారు. ఇక్కడి నుంచి గెలిచిన ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా కొనసాగుతూనే మృతి చెందారు. అనంతరం ప్రత్యేక తెలంగాణ వాదమే నినాదంగా ఒక్కడి నుంచి పోటీ చేసిన నరేంద్ర, విజయశాంతిలను రాష్ట్ర ఏర్పాటు తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గెలిపించి ప్రత్యేకతను చాటుకుంది. -
అచ్చొచ్చిన చోట.. అలవోకగా.. ‘గెలుపు’
మెదక్ జిల్లాలో నాయకులకు నేటితో నరాలు తెగే ఉత్కంఠకు తెర పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మెదక్ జిల్లా నాయకుల భవిష్యత్తును మార్చాయి. గతంలో మెదక్‌లో టీఆర్ఎస్ పది స్ధానాలను గెలుచుకుంది, కానీ ఇప్పుడు తొమ్మిది స్ధానాలకు పరిమితమైన ఓటు బ్యాంకు పెరగడంతో భారీ మెజారీటీతో మెదక్‌లో టీఆర్ఎస్ విజయం సాధించారు. ఉద్యమాల గడ్డగా పేరొందిన ‘సిద్దిపేట’ దేశ చరిత్రలోనే 2018 లో అత్యంత లక్ష మెజారీటితో గెలుపొందిన వ్యక్తిగా తన్నీరు హరీష్ రావు చరిత్ర సృష్టించారు. సాక్షి, మెదక్ : మెదక్‌లో రాజకీయ నేతగా నిలదొక్కుకోగలిగారంటే అది ఆమె సంకల్ప బలమే వృత్తి రీత్యా న్యాయవాది అయిన పద్మా దేవేందర్ రెడ్డి రాజకీయాల్లో అనేక ఆటుపోట్లను ఎదుర్కొటు, అడ్వకేట్ గా పనిచేసిన అనుభవంతో రాజకీయాల్లో డిప్యూటీ స్పీకర్ పదవిని స్వీకరించారు. బాధ్యతలను నిర్వర్తించడంలో కష్టపడే తత్వంతో మెదక్ స్ధానాన్ని టీఆర్ఎస్ అభ్యర్ధి పద్మా దేవేందర్ రెడ్డి నిలబెట్టుకున్నారు. మెదక్ జిల్లాలో గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నపది స్ధానాల్లో ఘన విజయం సాధించింది.ఈసారి ఈ జిల్లాలో టీఆర్ఎస్ ఒక స్థానాన్ని కొల్సోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ , హరీష్ రావులకు బలమైన కేడర్ ఉన్నా కానీ ఈసారి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఒక నియోజకవర్గంలో ప్రజల మద్దతును పొందింది. సంగారెడ్డి నియోజకవర్గంలో గతంలో గెలిచిన చింతా ప్రభాకర్ ఈ ఎన్నికల్లో ఒటమి చెందారు. ఇప్పుడు సంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్ధి జగ్గారెడ్డి గెలుపోందారు. హరీష్ రావు ఇలాకా సిద్దిపేటలో గతంలో కన్న ఈసారి భారీ మెజారీటితో గెలిచారు. కష్టపడేతత్వమే ఈయన బలం, నిత్యం ప్రజలతో మమేకం అయ్యే హరీష్ రావుకు, సిద్దిపేటలో టీ.జే.ఎస్ అభ్యర్ధి భవాని రెడ్డి ప్రత్యర్ధిగా నిలుచున్న గట్టిపోటీ ఇవ్వలేక పొయింది. ఎందుకంటే హరీష్ రావుకు సిద్దిపేటలో ట్రబుల్ షూటర్‌కు కబలమైన కేడర్ ఉండడం వల్ల లక్ష పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు.‘సిద్దిపేట’ దేశ చరిత్రలోనే 2018 లో అత్యంత మెజారీటితో గెలుపొందిన వ్యక్తిగా తన్నీరు హరీష్ రావు చరిత్ర సృష్టించారు. నర్సాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్ధి సునీతారెడ్డి పైన టీఆర్ఎస్ అభ్యర్ధి చిలుముల మదన్ రెడ్డి విజయం సాధించారు. జహీరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్ధి కె.మాణిక్‌రావు గట్టి పోటీ ఇవ్వడంతో కాంగ్రెస్ అభ్యర్ధి గీతారెడ్డి ఒటమి పాలైనారు. పఠాన్‌చెరులో టీఆర్ఎస్ అభ్యర్ధి గూడెం మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధి కాటా శ్రీనివాస్ గౌడ్ పైన గెలిచారు. ఆందోల్‌లో కాంగ్రెస్ అభ్యర్ధి దామోదర రాజనర్సింహ గట్టి పోటీ ఇచ్చిన టీఆర్ఎస్ అభ్యర్ధి చంటి క్రాంతి కిరణ్ గెలుపొందారు. నారయణఖేడ్‌లో కాంగ్రెస్ అభ్యర్ధి సురేశ్ షెట్కార్ , టీఆర్ఎస్ అభ్యర్ధి భుపాల్‌రెడ్డి పైన చిత్తుగా ఒడిపోయారు. దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్ధి మద్దుల నాగేశ్వర్‌రెడ్డి పైన , టీఆర్ఎస్ అభ్యర్ధి సోలిపేట రామలింగారెడ్డి భారీ మెజారీటీతో విజయం సాధించారు. మాటల మాంత్రికుడు తనదైన పరిపాలనతో, ప్రత్యర్ధుల మాటలకు తన తూటలకు విసారే వాక్చాతుర్యంతో, కేసీఆర్ పోటీ చేసిన గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి ఒంటేరు ప్రతాప్ రెడ్డి , బీజేపీ అభ్యర్ధి ఆకుల విజయ లు కేసీఆర్‌కు ఎంత పోటీ ఇచ్చిన, అభివృద్దే మంత్రంగా భావించే కేసీఆర్ గజ్వేల్ స్ధానాన్ని మరోసారి భారీ విజయంతో నిలబెట్టుకున్నారు. నియోజకవర్గం అభ్యర్ధి పార్టీ మెదక్ పద్మాదేవేందర్ రెడ్డి టీఆర్ఎస్ నర్సాపూర్ చిలుముల మదన్ రెడ్డి టీఆర్ఎస్ జహీరాబాద్(ఎస్సీ) కె. మాణిక్ రావు టీఆర్ఎస్ సంగారెడ్డి జగ్గారెడ్డి కాంగ్రెస్ ఆందోల్ చంటి క్రాంతి కిరణ్ టీఆర్ఎస్ పఠాన్‌చెరు గూడెం మహిపాల్ రెడ్డి టీఆర్ఎస్ సిద్దిపేట టీ. హరీశ్ రావు టీఆర్ఎస్ గజ్వేల్ కేసీఆర్ టీఆర్ఎస్ హూస్నాబాద్ వడితెల సతీష్ కుమార్ టీఆర్ఎస్ దుబ్బాక సోలిపేట రామలింగా రెడ్డి టీఆర్ఎస్ నారాయణఖేడ్ ఎమ్. భూపాల్ రెడ్డి టీఆర్ఎస్ -
ఓటేస్తూ సెల్ఫీ దిగితే ఓటు రద్దే..
నారాయణఖేడ్: పోలింగ్ సమయంలో ఓటు వేయడానికి వచ్చిన వారు ఓటు వేస్తూ సెల్ఫీలు దిగడం నిషిద్ధం. ఎవరైనా తన ఓటును ఇతరులకు చూపిస్తే రూల్ 49ఎం (ఓటు రహస్యం) బహిర్గతం నియమం మేరకు ఎన్నికల అధికారులు అతడిని గుర్తించి బయటకు పంపివేస్తారు. ఆ ఓటును 17–ఏలో నమోదు చేస్తారు. అనంతరం లెక్కింపు సమయంలో ఆ ఓటును పరిగణలోకి తీసుకోరు. నిబంధనల మేరకు అంధులు ఓటు వేయడానికి వెంట 18 ఏళ్లు నిండిన సహాయకుడిని వెంట తీసుకెళ్లవచ్చు. ఓటు రహస్యం.. ఫలానా వారికి ఓటు వేస్తాను, వేశాను, అని బూత్‌లో చెప్పడం నేరంగా పరిగణిస్తారు. వారిని ఓటు వేయనీయరు. దివ్యాంగులు ఓటు వేయడానికి సహాకుడిగా మరో వ్యక్తిని వెంట అనుమతిస్తారు. వారు మరో వైకల్యం గల ఓటరు వెంట సహాయకుడిగా రావడానికి అనుమతిలేదు. పోలింగ్ సిబ్బంది సహాయకులుగా ఓటు వేయడానికి వీలులేదు. ఓటు వేయడం ఆలస్యం అయినా, వెళ్లిన ఓటరు యూనిట్‌పై కాగితాలు, టేప్‌లు అతికిస్తున్నట్లు అనుమానం వస్తే పోలింగ్ ఏజెంట్లు ప్రిసైడింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లి ఓటింగ్ గది వరకు వెళ్లవచ్చు. అధికారి మాత్రమే అక్కడ ఏం జరగలేదని ఏజెంట్ల సమక్షంలో నిర్దారిస్తారు. ఓటువేయడం తెలియదని నిస్సహాయతను వ్యక్తం చేసిన ఓటరుకు పోలింగ్ అధికారి నమూనా ద్వారా ఏజెంట్ల సమక్షంలో ఓటు వేసే విధానంపై డమ్మీ గుర్తులపై వివరిస్తారు. -
ఎన్నికల్లో నవ రత్నాలు
అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి తొమ్మిది మంది మహిళా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 139 మంది అభ్యర్థుల్లో తొమ్మిది మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సిద్దిపేట, నర్సాపూర్ నుంచి ఇద్దరు చొప్పున, మెదక్, అందోల్, జహీరాబాద్, దుబ్బాక, గజ్వేల్ నుంచి ఒక్కొక్కరు చొప్పున బరిలో నిలిచా రు. ప్రధానంగా మాజీ మంత్రులు గీతారెడ్డి, సునీతారెడ్డి, మాజీ డిప్యూ టీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి బరిలో ఉన్నారు. మరి ప్రజలు వీరిని ఏమేరకు ఆదరిస్తారో.. వేచి చూడాలి సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో వివిధ పార్టీలు, స్వంతంత్రులుగా 11అసెంబ్లీ స్థానాలకు గాను 139మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే వీరిలో ప్రధాన పార్టీలతో పాటు వివిధ పక్షాల తరఫున కేవలం తొమ్మిది మంది మహిళలు మాత్రమే ఎన్నికల బరిలో నిలిచారు. అంటే ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో మహిళా అభ్యర్థుల శాతం 6.47 మాత్రమే. ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు హుస్నాబాద్, సంగారెడ్డి, నారాయణఖేడ్, పటాన్చెరు నియోజకవర్గాల్లో ఒక్క మహిళా అభ్యర్థి కూడా పోటీలో లేకపోవడం గమనార్హం. సిద్దిపేట, నర్సాపూర్ అసెంబ్లీ స్థానాల్లో ఇద్దరేసి మహిళలు ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రధాన రాజకీయ పక్షం టీఆర్ఎస్ తరఫున పద్మాదేవేందర్‌రెడ్డి (మెదక్) పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రులు సునీతాలక్ష్మారెడ్డి (నర్సాపూర్), గీతారెడ్డి (జహీరాబాద్) బరిలో ఉన్నారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌తో తలపడుతున్నారు. బీఎల్ఎఫ్ తరఫున అంగన్వాడీ కార్యకర్తల హక్కులకోసం ఉద్యమించిన పోతురాజు జయలక్ష్మి (అందోలు) పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ఆశించి బంగపడిన సోమన్నగారి లక్ష్మి ప్రస్తుతం బీఎస్పీ అభ్యర్థిగా నర్సాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. శ్రమజీవి పార్టీ నుంచి ఎం.పుష్పలత (సిద్దిపేట), స్వతంత్ర అభ్యర్థులుగా మద్దుల రజనీరెడ్డి (దుబ్బాక) పోటీ చేస్తున్నారు. అయితే మద్దుల రజనీరెడ్డి దుబ్బాక నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మద్దుల నాగేశ్వర్‌రెడ్డి సతీమణి కావడం గమనార్హం. భర్తకు డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రజనీరెడ్డి తన అభ్యర్థిత్వం ఉపసంహరించుకోక పోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో మిగిలారు. -
మెదక్‌లో కమలం గురి
మొదటి నుంచి మెదక్ నియోజకవర్గంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని భావించారు. కానీ అనూహ్యంగా రసవత్తర పోరులోకి బీజేపీ వచ్చి చేరింది. ఎలాగైనా జిల్లాలో పాగా వేయాలని బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. నియోజకవర్గ నాయకులతో పాటు పక్క రాష్ట్రాల నేతలు కూడా బీజేపీ అభ్యర్థి ఆకుల రాజయ్య విజయానికి కృషి చేస్తున్నారు. వీళ్లకుతోడు ఆ పార్టీ అనుబంధ సంఘాలు ఏబీవీపీ, విశ్వహిందూ పరిషత్, హిందూవాహిని, సేవాభారతి, బజరంగ్దళ్ నాయకులు చాపకింద నీరులా ప్రచారం సాగిస్తున్నారు. నియోజకవర్గంలో బీసీలదే కీలకపాత్ర. బీజేపీ అభ్యర్థి బీసీ సామాజికవర్గానికి చెందినవారు కావడంతో అనుకూలించే అంశంగా భావిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ.. గెలిస్తే ఏం అభివృద్ధి పనులు చేస్తారో వివరిస్తూ.. మెదక్‌ను బీజేపీ ఖాతాలో వేసుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సాక్షి, మెదక్: జిల్లాలో ఎలాగైనా పాగావేయాలని బీజేపీ ఎత్తుగడలు వేస్తోంది. ప్రత్యేకంగా మెదక్ నియోజయకవర్గంపై దృష్టి కేంద్రీకరించింది. ఈ సీటును కైవసం చేసుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ఎమ్మెల్యే అభ్యర్థి ఆకుల రాజయ్య గెలుపు కోసం కార్యకర్తలు, నాయకులు సర్వశక్తులు ఓడ్డుతున్నారు. రాజయ్యకు వెన్నుదన్నుగా సంఘ్‌పరివార్ సభ్యులతోపాటు కర్ణాటక బీజేపీ నాయకులు కూడా రంగంలోకి దిగారు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమంటూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌లు మెదక్‌లో మకాం వేశారు. బీజేపీ అనుబంధ సంఘాలతో సమావేశమై తెరవెనుక ప్రచారం చేస్తున్నారు. అన్ని గ్రామాల్లోకి వెళ్తూ బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చేలా ఓటర్లను చైతన్య పరుస్తున్నారు. మెదక్ పార్లమెంట్ స్థానంపై గురిపెట్టిన బీజేపీ అంతకంటే ముందు మెదక్ అసెంబ్లీని కైవసం చేసుకునేందకు పావులు కదుపుతోంది. ఇందుకోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మెదక్ అభ్యర్థి ఎంపిక నుంచే బీజేపీ తగు జాగ్రత్తలు తీసుకుంది. మెదక్ పార్లమెంట్ నుంచి రాజయ్యను పోటీలో నిలపాలని భావించిన బీజేపీ అధిష్టానం మెదక్ అసెంబ్లీ బరిలో దింపింది. ముఖ్యంగా మెదక్ నియోజకవర్గంలో బీసీలు ఓటర్లు అత్యధికం. బీసీ ఓటర్ల ఎటువైపు ఉంటే వారికి విజయం వరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బీసీ సామాజికవర్గానికి చెందిన రాజయ్యను బరిలో దింపటం బీజేపీకి అనుకూలించనుంది. పార్టీ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన మొదలు రాజయ్య నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు. తన అభ్యర్థిత్వంపై అసంతృప్తితో ఉన్న స్థానిక నేతలతో మాట్లాడి తనవైపు తిప్పకున్నారు. జిల్లా అధ్యక్షుడు సహా పార్టీలోని నాయకులందరికీ ప్రచార బాధ్యతలను అప్పగించి రోజుకు ఒక మండలంలో ప్రచారం సాగిస్తున్నారు. చాపకింద నీరులా.. రాజయ్యకు మద్దతుగా తెరవెనుక ఆర్ఎస్ఎస్, కర్ణాటక నుంచి బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్కు చెందిన విభాగ్ ప్రచారక్‌లు ముగ్గురు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రచారం సాగిస్తున్నారు. ప్రతి మండలానికి ఇద్దరు ప్రచారక్‌లు ఇన్చార్జిలుగా వ్యవహిరిస్తూ రాజయ్య గెలుపుకు కృషి చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్, గుల్బార్గా జిల్లాల నుంచి 50 మందికిపైగా బీజేపీ నాయకులు మెదక్‌లో ప్రచారం సాగిస్తున్నారు. పదిరోజులుగా వీళ్లు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ బీజేపీ గెలుపుకోసం ముమ్మర ప్రచారం చేస్తున్నారు. వీరితోపాటు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలైన ఏబీవీసీ, విశ్వహిందూ పరిషత్, హిందూవాహిని, సేవాభారతి, బజరంగ్దళ్ నాయకులు చాపకింద నీరులా బీజేపీ గెలుపు కోసం పనిచేస్తున్నారు. బీజేపీ నేతలు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వీరంతా సొంతంగా ప్రచారం సాగిస్తున్నారు. పట్టణాలు, గ్రామాల్లో బీజేపీ అనుకూలతతోపాటు ఎన్నికలను ప్రభావితం చేసే ఓటర్లను కలుస్తున్నారు. బీజేపీ గెలుపొందితే చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఓటర్లకు ప్రత్యేకంగా వివరిస్తున్నారు. నియోజకవర్గంలో బీజేపీ గెలుపుకు అవసరమైన వాతావరణాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీలో చోటు చేసుకుంటున్న సమన్వయలోపం, అభ్యర్థి తీరుతెన్నులు, ప్రచారంలో లోటుపాట్లపైనా ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌లు ఎప్పటికప్పుడు రహస్యనివేదికలు బీజేపీ అధిష్టానానికి పంపుతున్నట్లు తెలుస్తోంది. -
ఇక సభల హోరే..
నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో కీలక ఘట్టానికి తెరపడింది. జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చింది. నాలుగు ప్రధాన రాజకీయ పక్షాలతో పాటు, ఇతర పార్టీలు, స్వతంత్రులు కలుపుకొని మొత్తం 62 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో మిగిలారు. పటాన్చెరు నియోజకవర్గంలో అత్యధికంగా 16 మంది పోటీ పడుతుండగా, అందోలు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో ఎనిమిది మంది మాత్రమే పోటీలో ఉన్నారు. ఇక ఎన్నికలకు కొద్దిరోజులే మిగిలుండడంతో అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించనున్నారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అన్ని పార్టీలు ఇక ప్రచార వ్యూహంపై దృష్టి కేంద్రీకరించాయి. వీలైనంత మేరకు విస్తృతంగా జనాల్లోకి వెళ్లేలా అభ్యర్థులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకెళ్తుండగా మిగిలిన పార్టీల్లో ఎలా ముందంజ వేయాలా అన్న సమాలోచనలు జరుపుతున్నారు. పటాన్చెరులో మహా కూటమి తరఫున కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన నేతలు కొందరు నామినేషన్ల స్క్రూటినీ అనంతరం స్వతంత్రులుగా బరిలో మిగిలిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన సి.అంజిరెడ్డి, కొలన్ బాల్‌రెడ్డి, సపాన్‌దేవ్, శశికళ, షేక్ అబ్దుల్ ఘనీతో పాటు టీడీపీ టికెట్ ఆశించిన ఎడ్ల రమేశ్, కరికె సత్యనారాయణ బరి నుంచి తప్పుకున్నారు. బీజేపీ టికెట్ ఆశించిన గాలి వెంకటగిరి కూడా పార్టీ బుజ్జగించడంతో తన అభ్యర్థిత్వం ఉపసంహరించుకున్నారు. తన అభ్యర్థిత్వం ప్రకటించింది మొదలు శరవేగంతో కదిలిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ అసంతృప్తులను బుజ్జగించడంలో సఫలమయ్యారు. అందోలులో బీఎస్పీ తరపున నామినేషన్ వేసిన అల్లారం రత్నయ్య చివరి నిమిషంలో తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. ఇక ప్రచార పర్వంలోకి..! నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ కార్యక్రమం ముగియడంతో వివిధ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చింది. నాలుగు ప్రధాన పక్షాలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎల్పీతో చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు బరిలో మిగిలారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 28న సంగారెడ్డి జిల్లా పరి«ధిలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ నెల 25న నారాయణఖేడ్‌లో జరిగే బహిరంగ సభకు హాజరవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల షెడ్యూలు ఖరారు కానప్పటికీ, అభ్యర్తులు తమ నియోజకవర్గాల్లో ప్రచార షెడ్యూలును సిద్ధం చేసుకుంటున్నారు. నియోజవకవర్గం బరిలో ఉన్న అభ్యర్థులు జహీరాబాద్ (ఎస్సీ) 14 పటాన్చెరు 16 సంగారెడ్డి 14 అందోలు (ఎస్సీ) 08 నారాయణఖేడ్ 10 మొత్తం 62 -
మెదక్‌లో లెక్క తేలింది..
ఎన్నికల ప్రక్రియలో రెండు ప్రధాన ఘట్టాలు ముగిసాయి. దీంతో రెండు స్థానాల నుంచి పోటీలో ఉండే అభ్యర్థులెవరో ఖరారయింది. మెదక్, నర్సాపూర్ నుంచి మొత్తం 31 నామినేషన్లు దాఖలయ్యాయి. స్క్రూటినీలో తిరస్కరించినవి, అభ్యర్థుల ఉపసంహరణ తర్వాత ఆ సంఖ్య 19గా తేలింది. ఇప్పుడు అందరి దృష్టి మెదక్ నుంచి పోటీలో ఉన్న అన్నదమ్ములు శశిధర్‌రెడ్డి, ఉపేందర్రెడ్డిలపైనే ఉంది. ప్రత్యర్థులెవరో తేలడంతో అభ్యర్థులు వారి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికలకు ఇంకా కేవలం పట్టుమని పదిహేను రోజులు కూడా లేవు. ఈ కొద్ది సమయంలో విజయం సాధించడానికి అన్ని రకాల ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. అందరూ ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. సాక్షి,మెదక్ : ,మెదక్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్న అభ్యర్థుల లెక్క తేలింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారంతో ముగిసింది. 19 మంది అభ్యర్థులు బరిలో ఉంటున్నారు. మెదక్ స్థానం నుంచి పన్నెండు, నర్సాపూర్ నుంచి ఏడుగురు పోటీలో ఉన్నారు. మెదక్ స్థానం నుంచి నామినేషన్ వేసిన టీజేఎస్ పోటీ నుంచి తప్పుకుంది. ఆ పార్టీ అభ్యర్థి జనార్దన్‌రెడ్డి నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఆయన తరఫున న్యాయవాది బాలయ్య మెదక్ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ వీరబ్రహ్మచారికి నామినేషన్ ఉపసంహరణ పత్రాలను అందజేశారు. మాజీ ఎమ్మెల్యే పి.శశిధర్‌రెడ్డి విత్‌డ్రా చేసుకుంటారని ప్రచారం జరిగినా.. ఆయన నామినేషన్ ఉపసంహరించుకోలేదు. దీంతో మెదక్ నియోకజవర్గం నుంచి అన్నదమ్ములు ఉపేందర్‌రెడ్డి(కాంగ్రెస్), శశిధర్‌రెడ్డి(ఎన్సీపీ) పోటీలో ఉన్నారు. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు యాదగిరి, పుర్ర ఊశయ్య నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్ నుంచి పద్మాదేవేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి అమ్మారెడ్డిగారి ఉపేందర్‌రెడ్డి, బీజేపీ నుంచి ఆకుల రాజయ్య, బీఎస్పీ నుంచి అశోక్‌కుమార్, ఎన్సీపీ నుంచి శశిధర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందిన పార్టీల నుంచి ఐదుగురు అభ్యర్థులతోపాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులున్నారు. నర్సాపూర్ నుంచి ప్రధానంగా టీఆర్ఎస్ నుంచి మదన్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతారెడ్డి, బీజేపీ నుంచి గోపీ, బీఎస్పీ నుంచి సోమన్నగారి లక్ష్మీ, సీపీఎం నుంచి మల్లేశం పోటీ చేయనున్నారు. వీరితోపాటు మనపార్టీ తరఫున దిగంబర్ ముదిరాజ్, స్వతంత్ర అభ్యర్థి నవీన్ పోటీలో ఉన్నారు. ఆసక్తిగా అన్నదమ్ముల పోటీ.. మహాకూటమిలో మెదక్ టికెట్ దక్కించుకున్న టీజేఎస్ చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకుంది. పొత్తులో భాగంగా మెదక్ టికెట్‌ను టీజేఎస్ అభ్యర్థి జనార్దన్‌రెడ్డికి ఇచ్చారు. అయితే కాంగ్రెస్ తరఫున ఉపేందర్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించి బీఫామ్ అందజేసింది. పొత్తు ధర్మం పాటించని కాంగ్రెస్ వైఖరిపై టీజేఎస్ నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయింది. కాంగ్రెస్ అభ్యర్థిని పోటీ నుంచి తప్పుకోవాలని టీజేఎస్ కోరినప్పటికీ స్నేహపూర్వక పోటీ పేరిట ఎన్నికల బరిలో నుంచి తప్పుకునేందుకు కాంగ్రెస్ నిరాకరించంది. దీంతో టీజేఎస్ అభ్యర్థి పోటి నుంచి తప్పుకోవాని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ వైఖరి వల్లే తాను పోటీలో నుంచి తప్పుకున్నానని, భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తారని ఆయన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకుంటారని ముందుగా ప్రచారం సాగింది. కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్‌రెడ్డి తన çసోదరుడైనా ఆయన నామినేషన్ విత్‌డ్రా చేసుకునేలా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఆయన నామినేషన్ ఉపసంహరించుకునేందుకు నిరాకరించారు. అన్నదమ్ముళ్లు ఇద్దరు ఎన్నికల్లో పోటీ చేయడంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఊపందుకోనున్న ఎన్నికల ప్రచారం ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో శుక్రవారం నుంచి ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. అన్ని పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించారు. ఎన్నికలకు ఇంకా రెండు వారాలు సమయం ఉండటంతో అభ్యర్థులంతా ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమవుతున్నారు. ప్రధాన రాజకీయపార్టీల అభ్యర్థులు స్టార్ క్యాంపెయినర్లను రంగంలో దింపేందుకు సిద్ధం అవుతున్నారు నర్సాపూర్ నియోకజవర్గం.. అభ్యర్థి పేరు పార్టీ చిలుముల మదన్‌రెడ్డి టీఆర్ఎస్ వాకిటి సునీత కాంగ్రెస్ అజ్జమర్రి మల్లేశం సీపీఎం సింగాయపల్లి గోపి బీజేపీ సోమన్నగారి లక్ష్మి బీఎస్పీ మన్నె దిగంబర్ ముదిరాజ్ మన పార్టీ నవీన్ స్వతంత్ర -
మాకు ‘పోటీ’ లేదు
నేనూ రైతునే.. కాపుదనపు బిడ్డనే.. నా పొలంలోనూ మోటార్లు కాలిపోయాయి. కాంగ్రెస్, టీడీపీ పాలనలో కరెంటు కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డం. వాళ్ల పాలనలో ప్రజలను ఏడిపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయం, పరిశ్రమలతోపాటు అన్ని రంగాలకు 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్నం. కరెంటు సరఫరాలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో ఉంది. సాక్షి, మెదక్: మెదక్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి పోటీయేలేదని, లక్ష మెజార్టీతో పద్మాదేవేందర్‌రెడ్డిని గెలిపిస్తే ఉన్నతమైన స్థానం ఆమెకు లభిస్తుందని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మెదక్‌లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రెడ్డి అధ్యక్షతన ప్రజా ఆశీర్వాద బహిరంగసభ జరిగింది. ఈ సభలో కేసీఆర్ మాట్లాడుతూ పద్మాదేవేందర్‌రెడ్డి చురుగ్గా పనిచేసే మహిళా నాయకురాలని, పద్మాదేవేందర్‌రెడ్డిని మళ్లీ గెలిపిస్తే మెదక్‌ను వరుసబెట్టి అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. మెదక్‌లో ఇది వరకే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు సాగుతున్నట్లు వివరించారు. నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల నిర్మాణాల దశల్లో ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మెదక్‌కు మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలు వస్తాయని హామీ ఇచ్చారు. ప్రత్యేక కార్యక్రమాలతో ముందుకు.. 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే తాను మెదక్ జిల్లాను ఏర్పాటు చేశానని గుర్తు చేశారు. కేసీఆర్ సీఎం కాకపోయుంటే జన్మలో మెదక్ జిల్లా ఏర్పాటు అయ్యేది కాదన్నారు. కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ఘనపురం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశాయన్నారు. గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో ఘనపురం కాల్వల దుస్థితిని కళ్లారా చూసి వాటిని అభివృద్ధి చేసే కొత్త ప్రయత్నం చేసినట్లు చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఘనపురం ప్రాజెక్టును, కాల్వలను అభివృద్ధి చేసినట్లు వివరించారు. త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. వచ్చే ఏడాది జూన్ నెలలో కాళేశ్వరం నీళ్లు జిల్లాకు వస్తాయన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి కోరిక మేరకు మంజీరా నదిపై 14 చెక్‌డ్యామ్‌లు మంజూరు చేసినట్లు చెప్పారు. రైతుబంధు పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందజేస్తున్నట్లు చెప్పారు. పింఛన్లు మొత్తాన్ని రూ.2016 కు పెంచనున్నట్లు వివరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేసిందన్నారు. బలహీనవర్గాలు దళితులు, గిరిజనుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నామన్నారు. ముస్లిం పిల్లల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. సమావేశంలో నీటిపారుల శాఖ మంత్రి హరీశ్‌రావు, జెడ్పీచైర్మన్ రాజమణి మురళీయాదవ్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌రెడ్డి, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కరణం ఉమాదేవి, ముత్యంరెడ్డి, టీఆర్ఎస్ నేతలు దేవేందర్‌రెడ్డి, మురళీయాదవ్, మున్సిపల్‌చైర్మన్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే: పద్మాదేవేందర్‌రెడ్డి గత ఎన్నికల్లో జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తానని హామీ నిచ్చిన కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారని పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. అలాగే జిల్లా కేంద్రంతోపాటు కలెక్టరెట్‌ను మంజూరు చేశారని తెలిపారు. మహా కూటమి కుమ్ములాటలతోనే ఉందన్నారు. ఆ కూటమిలో నుంచి ఎవరు నిలబడ్డారో వారికే తెలియడం లేదన్నారు. అలాంటి కూటమికి అడ్రస్ లేకుండా తరిమి కొట్టాలన్నారు. అక్కా చెలెల్లు, అన్నా దమ్ములు ఆశీర్వదించి మరోసారి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, జెడ్పీచైర్మన్ రాజమణి, మాజీ ఎమ్మెల్యేలు ముత్యంరెడ్డి, కరుణం ఉమాదేవి, మెదక్ మున్సిపల్‌చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, రాష్ట్ర నాయకులు దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెదక్ అర్బన్: సాయంత్రం 4 గంటలకు రావాల్సిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాయంత్రం 5.49 గంటలకు వచ్చారు. కేసీఆర్ వస్తున్న హెలీక్యాప్టర్‌ను చూసి ప్రజలు, కార్యకర్తల నినాదాలు, చప్పట్లు, ఈలలతో కేరింతలు కొట్టారు సభావేదిక మీదకు కేసీఆర్ 5.56 గంటలకు చేరుకొని... 5.58 గంటలకు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కేసీఆర్ కేవలం 15 నిమిషాలు మాత్రమే ప్రసంగించారు. కేసీఆర్ సభా వేదిక వద్దకు చేరుకోగానే మెదక్ టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్‌రెడ్డి కేసీఆర్‌కు పాదాభివందనం చేశారు. కేసీఆర్ హెలీక్యాప్టర్ దిగగానే మాజీ మంత్రి హరీష్‌రావు, టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్‌రెడ్డి హెలీప్యాడ్ వద్దకు పరుగెత్తుకు వెళ్ళి వేదిక వద్దకు తీసుకువచ్చారు. కేసీఆర్ పద్మ నా బిడ్డ... 2014 ఎన్నికల్లో గెలిపించారు. మళ్లీ గెలిపించండి అని అనడంతో కార్యకర్తలు, అభిమానులు గట్టిగా నినాదాలు చేశారు. ప్రజా ఆశీర్వాద సభకు మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందు వేదికపై కళాకారుల ఆటపాటలు సభికులను ఆకట్టుకున్నాయి. వీరు మెదక్ అభివృద్ధిపై పాటలు పాడి అలరించారు. టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు మందుగుల గంగాధర్ వేదికపై పాడిన పాటలు అలరించాయి. చిన్నశంకరంపేట మండలం రామాయిపల్లి నుంచి బోనంతో వచ్చిన మహిళ సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పద్మాదేవేందర్‌రెడ్డి కోడలు దీపిక, తల్లిదండ్రులతో కలిసి టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు వచ్చారు. మెదక్ టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్‌రెడ్డి మాజీ మంత్రి కరణం రామచంద్రారావు సతీమణి కరణం ఉమాదేవిని స్వయంగా వేదికపైకి తీసుకెళ్లారు. ‘‘కాళేశ్వరం నీళ్లు వస్తే హల్ధీ, మంజీరాలు ఎన్నటికీ ఎండిపోవు. ఆ నీళ్లతో తూర్పుగోదావరి, డెల్టా ప్రాంతలకంటే మెదక్ బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. ఇది జరిగితే బంగారు తెలంగాణ వచ్చినట్లే.’’ ‘‘రైతులు, ప్రజలకు మేలు చేసే పార్టీని గెలిపించాలి. పొరపాటున కాంగ్రెస్ అ«ధికారంలోకి వస్తే కరెంటు ఆగమైతది. తాగు, సాగునీరులో ఇబ్బందులు వస్తయి. ఎన్నికల సమయంలో ఎవరో ఏదో చెబితే ప్రజలు నమ్మొద్దు. మెదక్ ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలి.’’ ‘‘ఎన్నికల్లో ఏం ఫలితం వస్తుందోనని మెదక్ నియోజకవర్గంలో సర్వే చేయించిన. పద్మాదేవేందర్‌రెడ్డికి 64 శాతం అనుకూలత ఉంటే, ఇతరులకు 20 నుంచి 30 శాతం ఉంది. మెదక్‌లో ప్రత్యక్షంగా పోటీ ఉన్నప్పుడే అలా ఉంటే.. ఇప్పుడే జోకర్, బ్రోకర్ కథ అయ్యింది. పద్మను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలి.’’ -
బీజేపీలో బీ–ఫారం ట్విస్ట్
నారాయణఖేడ్: నారాయణఖేడ్ బీజేపీలో సోమవారం నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. ఉదయం నుంచి అన్ని పార్టీల్లోనూ తీవ్ర ఉత్కంఠ రేపింది. నారాయణఖేడ్ బీజేపీ అసెంబ్లీ టిక్కెట్‌ను రవికుమార్‌గౌడ్‌కు ఆ పార్టీ రెండు రోజుల క్రితం ప్రకటించింది. ఈ మేరకు ఆయనకు బీ ఫారం అందజేసింది. కాగా ఆదివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించగా సంజీవరెడ్డికి కాంగ్రెస్ టిక్కెటు దక్కలేదు. సోమవారం నామినేషన్లకు చివరిరోజు. దీంతో బీజేపీ నాయకులు సంజీవరెడ్డిని సంప్రదించారు. కార్యకర్తల ఒత్తిడిమేరకు సంజీవరెడ్డి బీజేపీ నుంచి నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యాడు. తనకు వచ్చిన బీ ఫారంను సమర్పించేందుకు రవికుమార్‌గౌడ్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం సమీపంలో ఉదయం 9గంటలకే చేరుకున్నాడు. పట్టణానికి చెందిన బీజేపీ నాయకులు రవికుమార్‌గౌడ్ వద్దకు వచ్చి బీ ఫారం కావాల్సిందిగా కోరారు. దీంతో రవికుమార్‌గౌడ్ రిటర్నింగ్ అధికారి ఛాంబర్లోకి వెళ్లి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. బీజేపీ నాయకులు ఎంతకూ ఫోన్ చేసినా ఫోన్ కలవడకపోవడంతో పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సమాచారం ఇచ్చారు. దీంతో పార్టీ నాయకత్వం హుటాహుటినా బీదర్ బీజేపీ ఎంపీ భగవంత్ కుబ్బాతో మరో బీఫారంను పంపగా సంజీవరెడ్డి మరో సెట్టును బీజేపీ అభ్యర్థిగా దాఖలు చేశారు. మొదట బీ–ఫారం సమర్పించిన రవికుమార్‌గౌడ్ స్థానిక కార్యకర్తలకు చిక్కకుండా వెళ్ళిపోయారు. ఈ విషయంపై సాక్షి బీజేపీ అభ్యర్థి రవికుమార్‌గౌడ్‌ను ఫోన్లో మాట్లాడగా.. పార్టీ బీఫారం ఇవ్వగా తాను నామినేషన్ వేసి బీఫారం సమర్పించినట్లు తెలిపారు. తనను ఎవ్వరూ సంప్రదించలేదన్నారు. సంజీవరెడ్డి అభ్యర్థిత్వాన్ని పార్టీ ఖరారు చేసిందని, ఆయనకు మద్దతు ఇస్తారా అని ప్రశ్నించగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. ఇద్దరికీ బీ–ఫారం ఇస్తే.. శాసనసభ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు ఒకే పార్టీ ద్వారా బీ ఫారం ఇస్తే ఎలా అనే సందేహం నారాయణఖేడ్‌లో సోమవారం నెలకొన్న ఘటన ద్వారా చర్చనీయాంశమయ్యింది. నారాయణఖేడ్ బీజేపీ పార్టీ అభ్యర్థులుగా రవికుమార్‌గౌడ్, సంజీవరెడ్డిలు నామినేషన్ వేసారు. ఇలా ఇద్దరు బీఫారాలు ఇవ్వడంతో ఎన్నికల అధికారులు ఎవరికి పార్టీ గుర్తు కేటాయిస్తారన్న చర్చ హాట్‌టాపిక్‌లా మారింది. ఈ విషయంలో పలు పార్టీల కార్యకర్తల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఒక పార్టీ ఒకరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశాక ఏ–ఫారం, బీ–ఫారం అందజేస్తుంది. తర్వాత మొదటి వ్యక్తికి కాకుండా రెండో వ్యక్తికి ఏ–ఫారం, బీ–ఫారం జారీచేసేప్పుడే బీ–ఫారంలో ఉండే ఒక కాలంలో మొదటి వ్యక్తికి ఇచ్చిన బీ ఫారం రద్దు చేస్తున్నామని, కావునా ఈ రెండో వ్యక్తికి కేటాయించిన బీ ఫారాన్ని స్వీకరించాలని రాసి ఇస్తుంది. దీన్ని రిటర్నింగ్ అధికారికి సమర్పించిన పక్షంలో మొదటి వ్యక్తి ఇచ్చిన బీఫారాన్ని రద్దు చేసి రెండో వ్యక్తి ఇచ్చిన బీ ఫారానికి ఎన్నికల అధికారులు గుర్తును కేటాయిస్తారు. -
సిద్దిపేట బరిలో ఉద్దండులు
నాడు తొలి దశ తెలంగాణ ఉద్యమం.. తర్వాత మలి దశ ఉద్యమంలో అగ్గి పుట్టింది సిద్దిపేట జిల్లాలోనే.. ఇప్పుడు రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా సిద్దిపేట నుంచే సీఎం కేసీఆర్, కీలక మంత్రి హరీశ్‌రావు జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించారు. టీజేఎస్ ఏర్పాటు తర్వాత ఆ పార్టీ అధినేత కోదండరాం ఎన్నికల అభ్యర్థుల తొలి ప్రకటన దుబ్బాకలోనే చేశారు. మరో ఉద్యమ నేత రఘునందన్‌రావు బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అదేవిధంగా పెన్ను, గన్ను పట్టిన నాయకుడిగా పేరున్న సోలిపేట రామలింగారెడ్డి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.. ఇక మహాకూటమిలో భాగస్వామ్యమైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం నుండే పోటీ చేస్తున్నారు. ఇలా జిల్లాలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో అన్ని పార్టీల్లోనూ కీలక వ్యక్తులే బరిలో నిలిచారు. సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహించే గజ్వేల్ నియోజకవర్గంపై అందరి దృష్టి ఉంది. గత ఎన్నికల్లో సమీప అభ్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన వంటేరు ప్రతాప్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చాడు. అయితే ఆదే వంటేరును కాంగ్రెస్ పార్టీ తరఫున ఈసారి బరిలో దింపారు. వంటేరు ప్రతాప్‌రెడ్డిని గెలిపించేందుకు కాంగ్రెస్ నాయకులు గల్లీ నుండి ఢిల్లీ వరకు మద్దతు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. అయితే ఇది పసిగట్టిన టీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు గజ్వేల్‌పై ప్రత్యేక దృష్టిపెట్టారు. కుల సంఘాలను ఏకం చేస్తూ మద్దతు సభలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించారు. ఇతర నాయకులు వస్తే ఏం జరుగుతుందో ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల నియోజకవర్గంలోని 15వేల మంది కార్యకర్తలతో తన ఫాం హౌస్‌లో సమావేశం ఏర్పాటు చేసి ఉత్సాహాన్ని నింపారు. వీరితోపాటు ఎంపీ ప్రభాకర్‌రెడ్డి తదితర నాయకులు నియోజకవర్గం వ్యాప్తంగా ప్రచారం ముమ్మరం చేశారు. అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ నాయకులు గజ్వేల్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రచారం చేస్తూ అందరి దృష్టి గజ్వేల్ వైపు మళ్లేలా చేస్తున్నారు. సిద్దిపేట మెజార్టీపై లెక్కలు దశాబ్దాలుగా గులాబీ కంచుకోటగా ఉన్న సిద్దిపేట నియోజకవర్గంలో గెలుపు గురించి ఎవరూ మాట్లాడుకోవడం లేదు. ఇక్కడి నుండి పోటీ చేసే మాజీ మంత్రి హరీశ్‌రావుకు మెజార్టీ ఎంత వస్తుందనే విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ. ఇప్పటి వరకు ఐదు పర్యాయాలు కేసీఆర్, ఐదు పర్యాయాలు హరీశ్‌రావు విజయం ఢంకా మోగించారు. గత ఎన్నికల్లో 95వేల మెజార్టీ సాధించిన హరీశ్‌రావు.. ఈసారి లక్ష మెజార్టీ సాధించి రికార్డు సాధించాలనే ఊపుతో ముందుకు వెళ్తున్నారు. అయితే రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాలకు భిన్నంగా హరీశ్‌రావుకే ప్రజలు చందాలు వేసుకొని ఎన్నికల ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వడం... ఎక్కడా లేని విధంగా సబ్బండ కులాలు పోటాపోటీగా ఆశీర్వాద సభలు నిర్వహించడం విశేషం. గతంలో ప్రధాన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఉండగా ఇప్పుడు కూటమిలో భాగంగా సిద్దిపేట సీటు టీజేఎస్‌కు ఇవ్వడంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకుపై టీఆర్ఎస్ దృష్టి సారించారు. ఇక ఇక్కడి నుంచి పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి నరోత్తం రెడ్డి అత్యధిక ఓట్లు సాధించి మార్కు చూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకప్పటి అన్నల ఇలాకాగా చెప్పుకునే దుబ్బాక నియోజకవర్గం అందరికీ ప్రతిష్టాత్మకంగానే మారింది. భూమి కోసం.. భుక్తి కోసం సాగిన పోరాటంలో గన్ను, పెన్ను పట్టిన నాయకుడిగా పేరున్న తాజా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా కీలక భూమిక పోషించారు. దీనిని గమనించిన కేసీఆర్ రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ పదవి కూడా అప్పగించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రతీ ఇంటితో అనుబంధం పెంచుకున్న సోలిపేట.. ఈ ఎన్నికల్లో కూడా తనను గెలిపించాలని తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ జనసమితి పార్టీ ఏర్పాటు తర్వాత దుబ్బాకలో నిర్వహించిన తొలి సభలో కోదండరాం ప్రసంగిస్తూ తన పార్టీ అభ్యర్థి దుబ్బాక నుండి పోటీ చేస్తాడని ప్రకటించారు. దానికి కట్టుబడి కూటమి నాయకులను ఒప్పించి దుబ్బాక సీటును టీజేఎస్‌కు కేటాయించేలా చేశారు. ప్రకటన చేయడమే ముఖ్యం కాదు. నియోజకవర్గంలో తన అభ్యర్థికి ఓటు బ్యాంకు పెంచుకోవడం, పార్టీ సత్తా చాటడం కోదండరాంకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక మరో ఉద్యమ నాయకుడు రఘునందన్ బీజేపీ నుండి పోటీలో ఉన్నారు. ఆ పార్టీలో కీలక వ్యక్తిగా గుర్తింపు పొంది మొదటి జాబితాలో సీటు తెచ్చుకున్నారు. ఈ ఎన్నికలు తన రాజకీయ భవిష్యత్‌తో ముడిపడి ఉందని ప్రతిష్టాత్మకంగా భావించి ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఇక మాజీ మంత్రి ముత్యం రెడ్డి కూడా చివరిసారి పోటీలో ఉండి అసెంబ్లీకి పంపించాలని కోరుకుంటూ గ్రామాలను పర్యటిస్తున్నారు. కూటమిలో కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించకపోయినా.. స్వతంత్రంగా పోటీ చేసి సత్తాచాటుతానని చెబుతున్నాడు. హుస్నాబాద్‌లో కామ్రేడ్స్‌కు పరీక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పడిన మహాకూటమి భాగస్వామ్య పార్టీ సీపీఐకి హుస్నాబాద్ కీలకం. పొత్తులో భాగంగా పోరాడి మరీ హుస్నాబాద్ టికెట్ సాధించుకున్నారు. ఇక్కడి నుండి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పోటీలో ఉంటున్నారు. పార్టీకి కీలకమైన హుస్నాబాద్‌ను గెలిపించుకొని మిత్రుల మధ్య గౌరవం పెంచుకోవాలని ఆ పార్టీ కేడర్ అంటున్నారు. అయితే గత నెలన్నర నుండి తాజా మాజీ ఎమ్మెల్యే సతీష్‌కుమార్ ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే హుస్నాబాద్‌లో సీఎం కేసీఆర్‌తో సభ పెట్టించి కార్యకర్తలకు నూతనోత్సాహం నింపారు. ఇంటింటి ప్రచారం చేసి ఓటరుకు దగ్గరయ్యామని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. పొత్తులో భాగంగా హుస్నాబాద్ టికెట్ సీపీఐకి కేటాయించినా.. తాను పోటీ ఉండి తీరుతానని, స్నేహ పూర్వక పోటీలో ఉండి తన సత్తా చాటుతానని మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి ముమ్మర ప్రయత్నాలు చేయడం గమనార్హం. -
అసంతృప్తులకు గాలం
మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి టీజేఎస్ పోటీ చేస్తుందని ప్రకటించడంతో కాంగ్రెస్ ఆశావహుల్లో ఆందోళన మొదలైంది. ఇన్నాళ్లు కన్న కలలపై నీళ్లు చల్లినట్లయింది. టీజేఎస్ పోటీ చేస్తుందని తెలియడంతో టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. కాంగ్రెస్ అధిష్టానం ఈ స్థానాన్ని టీజేఎస్‌కు ఇవ్వడంపై ఆశావహులు గుర్రుగా ఉన్నారు. బీజేపీ నుంచి కూడా స్థానికేతరుడికి టికెట్ ఇవ్వనున్నారనే ప్రచారంతో స్థానిక నాయకుల్లో కూడా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ గందరగోళ పరిస్థితిలో టీఆర్ఎస్ అసంతృప్తులను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. టికెట్ దక్కని నేతలు కూడా కండువాలు మార్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. సాక్షి, మెదక్ : మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి తెలంగాణ జన సమితి పోటీ చేస్తుందని తెలియడంతో టీఆర్ఎస్ నాయకుల్లో ఉత్సాహం పెరిగింది. మొదటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పోటీలో ఉంటారని టీఆర్ఎస్ భావించింది. దీంతో ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన కాంగ్రెస్ పార్టీ ఆశావహుల్లో నైరాశ్యం అలముకుంది. శ్రేణులు సైతం మెదక్ సీటును వదులుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ తీరును బాహాటంగానే వారందరూ తప్పుబడుతున్నారు. అయితే తాజాగా టీజేఎస్ పేరు తెరపైకి రావడంతో కాంగ్రెస్‌లోని అసంతృప్తులను తమ వైపు తిప్పుకునేందుకు టీఆర్ఎస్ దృష్టి సారించింది. ఆశావహులతో పాటు అసంతృప్తితో ఉన్న ద్వితీయశ్రేణి నాయకులను పార్టీలో చేర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. టీఆర్ఎస్ నేత దేవేందర్‌రెడ్డి స్వయంగా కాంగ్రెస్‌లోని అసంతృప్త నేతలతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీలో చేరి మద్దతు ఇస్తే వారికి న్యాయం చేస్తామని కాంగ్రెస్ నేతలకు నచ్చచెబుతున్నట్లు సమాచారం. పలువురు నేతలు టీఆర్ఎస్లో చేరేందుకు సముఖంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి బరిలో ఉండరని తెలియడంతో కాంగ్రెస్ నాయకులు సైతం పార్టీలు మారేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఆశించిన నేతలు కాంగ్రెస్ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. వీరిని టీఆర్ఎస్లో చేర్చుకోవాలని టీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. అసంతృప్త నేతలతో ఆమె కూడా టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 19వ తర్వాత చేరికలపై స్పష్టత ఇస్తామని వారు చెప్పినట్లు సమాచారం. కాగా బీజేపీ నేతలు సైతం పార్టీ తీరుతో కొంత అసంతృప్తితో ఉన్నారు. స్థానికులకు కాకుండా మెదక్ టికెట్ ఇతరులకు అప్పగించే యోచనలో బీజేపీ అధిష్టానం ఉంది. దీన్ని పసిగట్టిన కొంత మంది బీజేపీ నాయకులు పార్టీ తీరుపై అధిష్టానంపై కోపంగా ఉన్నారు. పార్టీ తీరు నచ్చని బీజేపీ జిల్లా నాయకుడు సుభాష్‌రెడ్డి బుధవారం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఆయన బాటలోనే మెదక్ నియోకజవర్గంలోని పలువురు బీజేపీ నాయకులు టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. -
వీడని ‘ సీటు’ముడి
ఒక పక్క సోమవారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం ప్రారంభమైంది. ఇంకా మెదక్ నియోజవర్గ టికెట్‌పై కూటమిలో చిక్కుముడి వీడటం లేదు. కాంగ్రెస్, టీజేఎస్ ఈ టికెట్ తమదంటే తమదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను తొలగించడానికి స్నేహ పూర్వక పోటీ చేద్దామనే కొత్త ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ, టీజేఎస్ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ ఆశావహులు నామినేషన్‌కు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. టీజేఎస్ నాయకులు మాత్రం ఈ ప్రతిపాదనపై ఆసక్తి లేదన్నట్లు చెబుతున్నారు. దీంతో ఎవరికి ఈ టికెట్ వస్తుం దోనని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. సాక్షి, మెదక్: ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనా మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్‌పై ప్రతిష్టంభన తొలగడంలేదు. ఈ టికెట్ కోసం మొదటి నుంచి పట్టుబడుతున్న టీజేఎస్ సైతం మెట్టు దిగడం లేదు. దీంతో మధ్యేమార్గంగా మెదక్ అసెంబ్లీ నుంచి స్నేహ పూర్వక పోటీచేద్దామని కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇరు పార్టీలు చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ టీజేఎస్‌కు ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఇవ్వనుంది. టీజేఎస్‌కు కేటాయించిన 8 స్థానాల్లో మెదక్ అసెంబ్లీ స్థానాన్ని కావాలని వారు కోరుతున్నారు. అయితే మెదక్ అసెంబ్లీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్ ఉండటం, ఇటీవల నిర్వహించిన వేర్వేరు సర్వేల్లో కాంగ్రెస్‌కు సానుకూల ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. సర్వే ఫలితాలను దృష్టిలో ఉంచుకుని మెదక్ సీటు తమకు వదిలేయాని కాంగ్రెస్ పార్టీ టీజేఎస్‌ను కోరుతున్నట్లు సమాచారం. దీనికితోడు మెదక్ టికెట్‌పై కాంగ్రెస్ నేతలు భారీగా ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ నాయకులు బట్టి జగపతి, సుప్రభాతరావు, బాలకృష్ణ తదితరులు పోటీచేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. అయితే పొత్తులో భాగంగా మెదక్ స్థానం టీజేఎస్‌కు కేటాయిస్తున్నట్లు ప్రచారం సాగుతుండటంతో ఆశావహులంతా మాజీ ఎంపీ విజయశాంతిని ఆశ్రయించారు. మెదక్ సీటు ఎట్టిపరిస్థితుల్లో కాంగ్రెస్‌కు దక్కేలా చూడాలని, తమలో ఎవరికి టికెట్ ఇప్పించినా కలిసికట్టుగా పనిచేసి పార్టీ గెలుపుకోసం కృషి చేస్తామని వారు విజయశాంతిపై వత్తిడి తీసుకువస్తున్నారు. దీంతో విజయశాంతి చొరవ తీసుకుని స్నేహ పూర్వక పోటీ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. 14న నామినేషన్.. మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నందున కాంగ్రెస్, టీజేఎస్ స్నేహ పూర్వకపోటీ చేసేలా చూడాలని అధిష్టానం నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. స్నేహ పూర్వక పోటీ అంశంపై హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేతలు, టీజేఎస్ నేతలు సోమవారం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. స్నేహపూర్వక పోటీ అంశం తెరపైకి రావడంతో కాంగ్రెస్ నేతల్లో మెదక్ టికెట్‌పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. టీజేఎస్ ఈ పోటీకి అంగీకరిస్తే బరిలో దిగేందుకు ఆశావహులు ఎవరికివారే సిద్ధం అవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి ఏకంగా ఈనెల 14న కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేయనున్నట్లు ప్రకటించారు. సోమవారం మెదక్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో సమావేశమైన ఆయన 14న నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ బీ ఫామ్ తనకే దక్కుతుందని ధీమా సైతం వ్యక్తం చేశారు. మెదక్‌లో కాంగ్రెస్, టీజేఎస్ మధ్య స్నేహ పూర్వక పోటీ దిశగా అడుగులు పడుతున్నాయని, తాను స్వతంత్ర అభ్యర్థిగా కాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉండటం ఖామయని చెప్పారు. కాగా టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి మాత్రం స్నేహపూర్వక పోటీ ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. స్నేహపూర్వక పోటీ ప్రతిపాదనను కాంగ్రెస్ తీసుకువచ్చిందని, అయితే తమ పార్టీ ఆసక్తిచూపడం లేదన్నారు. -
మహిళా ఎమ్మెల్యేలు ఏడుగురే
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: 1952 నాటి హైదరాబాద్ స్టేట్ మొదలుకుని 2014లో జరిగిన తెలంగాణ రాష్ట్ర తొలి ఎన్నికల వరకు రాష్ట్ర శాసనసభకు పద్నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి కేవలం ఏడుగురు మహిళలు మాత్రమే శాసనసభలో అడుగు పెట్టారు. 1962 (మూడో శాసనసభ), 2004 (పన్నెండో శాసనసభ)కు జిల్లా నుంచి అత్యధికంగా ముగ్గురు చొప్పున మహిళలు ఎన్నికయ్యారు. వారిలో గీతారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి మాత్రమే మంత్రి పదవులు నిర్వర్తించారు. జిల్లా నుంచి అత్యధికంగా నాలుగు సార్లు గీతారెడ్డి శాసనసభకు ఎన్నికయ్యారు. సిద్దిపేట, దొమ్మాట (ప్రస్తుతం దుబ్బాక), సంగారెడ్డి, నారాయణఖేడ్, పటాన్చెరు అసెంబ్లీ స్థానాల నుంచి ఇప్పటి వరకు ఒక్క మహిళా కూడా అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించలేదు. 1962–67 (మూడో శాసనసభ)లో రాష్ట్ర అసెంబ్లీకి మొత్తం ఆరుగురు మహిళలు ఎన్నిక కాగా, వీరిలో ముగ్గురు మెదక్ జిల్లా నుంచి ఎన్నికైన వారే కావడం గమనార్హం. అందోలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగం లక్ష్మిదేవి, 1967లో జరిగిన మెదక్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తిరిగి 2004–09 (పన్నెండో శాసనసభ) ఎన్నికల్లోనూ జిల్లా నుంచి ముగ్గురు మహిళలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 1962, 1967 ఎన్నికల్లో రామాయంపేట ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన రెడ్డి రత్నమ్మ 1972 ఎన్నికల్లో ఓటమి పాలై, క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో నర్సాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వి.సునీత లక్ష్మారెడ్డి వరుస విజయాలు నమోదు చేసి హ్యాట్రిక్ సాధించారు. 2014 ఎన్నికల్లో నాలుగో పర్యా యం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మాజీ మంత్రి జె.గీతారెడ్డి 1989 ఎన్నికల్లో గజ్వేల్ (ఎస్సీ) స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. తిరిగి 1994, 1999 ఎన్నికల్లో వరుస ఓటమి చవిచూసి తిరిగి 2004లో రెండో పర్యాయం ఎన్నికయ్యారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన ఫలితంగా గజ్వేల్ జనరల్ స్థానంగా మారడంతో ఎస్సీ రిజర్వుడు స్థానంగా మారిన జహీరాబాద్ నుంచి గీతారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తిరిగి 2014లోనూ ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ పక్షాన మరోమారు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రెండు వేర్వేరు నియోజకవర్గాల నుంచి విజయం సాధించిన ఘనతను సాధించారు. 2014 (పద్నాలుగో శాసనసభ)లో మెదక్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన పద్మా దేవేందర్‌రెడ్డి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. 2004లో టీఆర్ఎస్ పక్షాన రామాయంపేట అసెంబ్లీ స్తానం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన పద్మా దేవేందర్‌రెడ్డి 2008లో జరిగిన ఉప ఎన్నికలో పరాజయం పాలయ్యారు. నియోజకవర్గాల పునర్విభజనలో మెదక్ నుంచి 2009లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ ఓటమి చెందగా, 2014లో టీఆర్ఎస్ పక్షాన పోటీ చేసి విజయం సాధించారు. 1999లో మెదక్ నుంచి ఎన్నికై చంద్రబాబు కేబినెట్లో ఉన్నత విద్యా శాఖ మంత్రిగా ఉన్న కరణం రామచంద్రరావు 2002 మేలో మరణించారు. అదే ఏడాది జూలైలో మెదక్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆయన సతీమణి కరణం ఉమాదేవి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. వివిధ పదవులు చేపట్టిన మహిళామణులు.. గల్ఫ్ దేశాల్లో వైద్య వృత్తిలో ఉన్న గీతారెడ్డి 1989 ఎన్నికల్లో గజ్వెల్ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించి, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి మంత్రివర్గాల్లో పర్యాటక, సాంస్కృతిక, సాంఘిక సంక్షేమం, క్రీడలు, మాధ్యమిక విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. తిరిగి 2004లో వైఎస్ మంత్రివర్గంలో భారీ పరిశ్రమలు, 2009లో వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో సమాచార, భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో నర్సాపూర్ నుంచి వరుస విజయాలు సాధించిన సునీత లక్ష్మారెడ్డి 2009–14 మధ్యకాలంలో వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. వైఎస్, రోశయ్య కేబినెట్లో చిన్న నీటి పారుదల, కిరణ్ కేబినెట్లో స్త్రీ శిశు సంక్షేమ మంత్రిగా పనిచేశారు. 2004లో రామాయంపేట, 2014లో మెదక్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన పద్మా దేవేందర్‌రెడ్డి పద్నాలుగో శాసనసభ (2014–18)లో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. -
వరి కొట్టు.. ఓటు పట్టు
సాక్షి,టెక్మాల్(మెదక్) : ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారు. మంగళవారం టేక్మాల్ మండలంలోని వెల్పుగొండ శివారులో వరికొడుతున్న రైతుల వద్దకు వెళ్లి ఆందోల్ ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతికిరణ్ వారితోపాటు వరిని కొట్టారు. వరి కొట్టడంతో కార్యకర్తలు, నాయకులంతా ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు. అనంతరం ఎల్లుపేటలో వరి కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి హమాలీలతో మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. -
యువ ఓటర్లే కీలకం
జిల్లాలోని అభ్యర్థుల భవితవ్యం యువకుల చేతిలో కేంద్రీకృతమైంది. మొత్తం ఓటర్లలో సగానిపైగా యువ ఓటర్లే ఉన్నారు. మరో ఆసక్తికర విషయమేమంటే ఇందులో యువతుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో అభ్యర్థులు యువమంత్రాన్ని జపిస్తున్నారు. వారిని ఆకర్షించడానికి ఎత్తుగడలను సిద్ధం చేసుకుంటున్నారు. వారితో మాట్లాడేందుకు యువ నాయకులను రంగంలోకి దించుతున్నారు. తమ ప్రచారాల్లోనూ యువకులను ఎక్కువగా కలుస్తూ ఆదరించాలని కోరతున్నారు. యువత మరి ఎటువైపు మొగ్గు చూపుతారో.. వేచి చూడాలి.. సాక్షి మెదక్: అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో యువ ఓటర్లు కీలకంగా మారనున్నారు. అభ్యర్థుల గెలుపు, ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో యువ ఓటర్లు ఉన్నారు. 18 నుంచి 39 ఏళ్లలోపు వయస్సు ఓటర్లు జిల్లాలో 2,21,713 మంది ఉన్నారు. ఈ ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే వారిది గెలుపు ఖాయమని విశ్లేషిస్తున్నారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో మొత్తం 3,92,606 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,21,713 మంది యువకులే ఉన్నారు. ఈ ఎన్నికల్లో యువ ఓటర్లు తీర్పుపై రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఉన్నారు. వారి మద్దతు కూడగట్టేందుకు అన్ని రాజకీయపార్టీలు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు యువ ఓటర్లను ఆకర్శించేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. అభ్యర్థులు తమ ప్రచారంలో యువ ఓటర్లు తమ వెంట ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో పాటు వారినే ఎక్కువగా కలుస్తున్నారు. అలాగే యువజన సంఘాలు, మహిళా సంఘాలను దగ్గర చేసుకుని యువతరంను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. యువ ఓటర్లను ఆకర్షించేందుకు ఎమ్మెల్యే అభ్యర్థులు తమ పార్టీలోని యువనేతలను రంగంలోకి దించుతున్నారు. ఇదిలా ఉంటే యువ ఓటర్లలో మహిళలే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఆకర్షణకు ప్రత్యేకంగా.. మెదక్, నర్సాపూర్ నియోకజవర్గాల్లో యువ ఓటర్లదే పైచేయి. 18 నుంచి 39 ఏళ్ల వయస్సు ఉన్న ఓటర్లు 2,21,713 మంది ఉన్నారు. ఇందులో మెదక్ నియోకజవర్గంలో 1,03,610 మంది ఉన్నారు. వీరిలో 18 నుంచి 19 ఏళ్ల వయస్సు ఉన్న ఓటర్లు 5163, 20 నుంచి 29 ఏళ్ల వయస్సు ఉన్న ఓటర్లు 43,644, 30 నుంచి 39 ఏళ్ల వయస్సు ఉన్న ఓటర్లు 54,803 మంది ఉన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో మొత్తం యువ ఓటర్లు 1,18,103 మంది ఉన్నారు. వీరిలో 18–19 ఏళ్ల వయస్సు ఉన్న ఓటర్లు 5775, 20 నుంచి 25 ఏళ్ల ఓటర్లు 50,697 మంది, 30 నుంచి 39 ఏళ్లు ఉన్న ఓటర్లు 61,631 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో యువ ఓటర్ల శాతం ఎక్కువగా ఉండటంతో మెదక్, నర్సాపూర్ నియోకజవర్గాల్లోని రాజకీయపార్టీలు యువ ఓటర్లను ఆకర్శించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అధికారుల ప్రచారం విజయవంతం మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో ఈ ఎన్నికల్లో 10,938 మంది యువ ఓటర్లు మొదటి సారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఓటు సవరణ చేపట్టారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే జిల్లా యంత్రాంగం 18 నుంచి 19 ఏళ్ల ఓటర్ల పేర్లను ఓటరు జాబితాలో చేర్పించేందుకు ఎక్కువగా కృషి చేసింది. కళాశాలల్లో ప్రచారం చేయడంతోపాటు రాజకీయ పార్టీలకు కొత్త ఓటర్లను చేర్పించాల్సిందిగా సూచించింది. జిల్లాలో కొత్త ఓటర్లుగా 10,938 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో పురుషులు 6,311 మంది ఉండగా మహిళలు 4,627 మంది ఉన్నారు. మెదక్ నియోజకవర్గంలో కొత్త ఓటర్లు 5,163 మంది ఉండగా నర్సాపూర్ నియోజకవర్గంలో 5,777 మంది ఉన్నారు. -
కాంగి‘రేస్’లో ఎవరు?
‘మెదక్’ టికెట్‌పై రోజుకో ప్రచారం సాగుతోంది. గజ్వేల్‌కు చెందిన నాయకుడు నర్సారెడ్డికి టికెట్ వస్తుందన్న ప్రచారంతో ఆశావహుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. దీంతో ఒక్కసారిగా స్థానికత అంశం తెరపైకి తీసుకొచ్చారు. నిన్నటి వరకు టికెట్ నాదం టే నాది అన్న ఆశావహులు, నేడు స్థానికులమైన తమలో ఒకరికి టికెట్ ఇవ్వాలని, ఎవరికి వచ్చినా కలిసి పనిచేస్తామని అధిష్టానానికి తమ నిర్ణయాన్ని తెలియజేస్తున్నారు. హామీ మేరకే నర్సారెడ్డి కాంగ్రెస్‌లో చేరారన్న అనుచరల మాటలు నాయకులను మరింత కలవర పెడుతున్నాయి. సాక్షి, మెదక్: మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. నెల రోజులుగా ఎమ్మెల్యే టికెట్‌పై ఉత్కంఠ సాగుతోంది. ఇది వరకే 13 మంది అభ్యర్థులు ఈ స్థానం కోసం పోటీ పడుతున్న విషయం తెలిసిందె. దీనికితోడు స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి బరిలో దిగుతుందా? అన్న ప్రశ్న కూడా వేధిస్తోంది. స్క్రీనింగ్ కమిటీ జాబితా కూడా ఏఐసీసీకి చేరడంతో టికెట్ రాజకీయాలు హస్తినను తాకాయి. ఆశావహులు ఎవరికివారే టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఇలా కొనసాగుతుండగానే తాజాగా తెరపైకి గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన తూంకుంట నర్సారెడ్డి పేరు వచ్చింది. టీఆర్ఎస్ను వీడి శనివారం ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఆయన మెదక్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పెద్దలుకూడా మెదక్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని హామీ ఇచ్చిన తర్వాతే నర్సారెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు అంగీకరించారని ఆయన అనుచరులు చెబుతున్నారు. మెదక్ నుంచి నర్సారెడ్డి పోటీ చేస్తారని సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇది నియోజకవర్గంలోని కాంగ్రెస్‌లో కలవరం రేపుతోంది. 13 మంది అభ్యర్థులు పోటీ పడుతుంటే స్థానికేతరుడైన నర్సారెడ్డికి పేరు తెరపైకి రావడాన్ని ఆశావహులు జీర్ణించుకో లేకపోతున్నారు. గెలిచే వారికే.. గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన నర్సారెడ్డికి మెదక్ టికెట్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వొద్దని ఆశావహులంతా పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు అధిష్టానం పెద్దలపై వత్తిడి తీసుకువస్తున్నారు. శుక్రవారం రాత్రి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ను కలిశారు. శనివారం ఆశావహులు మాజీ ఎంపీ, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి నివాసంలో సమావేశమయ్యారు. కాంగ్రెస్ నేతలు బట్టి జగపతి, సుప్రభాతరావు, తిరుపతిరెడ్డి, బాలకృష్ణ తదితరులంతా సమావేశమై స్థానికులమైన తమలో ఎవరికైనా ఒకరికి టికెట్ ఇవ్వాలని, ఎవ్వరికి టికెట్ ఇచ్చినా అందరం కాంగ్రెస్ గెలుపుకోసం పనిచేస్తామని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విజయశాంతితో సమావేశమైన వీరంతా నర్సారెడ్డికి టికెట్ ఇచ్చే విషయమై ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. స్థానికులకే టికెట్ వచ్చేలా చూడాలని ఆశావహులంతా ఆమెను కోరినట్లు సమాచారం.‘ కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి షరతులు లేకుండా నర్సారెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకుందని, స్థానికులు గెలిచే అభ్యర్థులకు మాత్రమే అధిస్టానం టికెట్ ఇస్తుందని’ ఆశావహులకు విజయశాంతి భరోసా ఇచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఆయోమయం సృష్టించేందుకే టీఆర్ఎస్ పార్టీ నర్సారెడ్డికి కాంగ్రెస్ టికెట్ వస్తుందంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని ఓ కాంగ్రెస్ నేత అన్నారు. ఇదిలా ఉంటే నర్సారెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని కొంత మంది ఆశావహులు స్వాగతిస్తున్నారంటూ సాగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. కాగా నర్సారెడ్డి మెదక్ ఎంపీ టికెట్ కోరుతున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది. అధిష్టానం మదిలో ఏముందో..? ఈ విషయంలో అధిష్టానం మదిలో ఏముందో తెలియక ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న నేతలు, కాంగ్రెస్ శ్రేణులు సతమతం అవుతున్నాయి. టికెట్ ఎవరికి దక్కుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. నవంబర్ 3 తర్వాత ఎమ్మెల్యే టికెట్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే మహాకూటమిలో భాగంగా మెదక్ టికెట్‌పై తెలంగాణ జన సమితి కూడా ఆశలు పెట్టుకుంది. మెదక్ టికెట్ తమకే వస్తుందని ఆ పార్టీ నేతలు గట్టి చెబుతుండటంతోపాటు ఇటీవల సంబరాలు సైతం చేసుకోవటం కాంగ్రెస్ నాయకులను మరింత కలవరపరుస్తోంది. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఎమ్మెల్యే ఆశావహులతో రెండు మూడురోజుల్లో భేటీ కానుంది. ఈ భేటీలో మెదక్ ఎమ్మెల్యే టికెట్ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. -
‘మెదక్’ పై టీజేఎస్ కన్ను
సాక్షి, మెదక్: టీజేఎస్(తెలంగాణ జన సమితి) అధ్యక్షుడు కోదండరాం ఎన్నికల ప్రచార యాత్రను మెదక్ నుంచి ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నారు. దీంతో మహాకూటమిలో కేటాయించే అసెంబ్లీ స్థానాల్లో మెదక్ టికెట్‌ను ఎలాగైనా దక్కించుకోవాలిని పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఉమ్మడి కార్యాచరణపై చర్చలు జరుపుతూనే మరోవైపు సీట్ల సర్ధుబాటుపైనా మహాకూటమి చర్చలు జరుపుతోంది. పొత్తులో భాగంగా 25 అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని టీజేఎస్ కోరుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయటం లేదని సమాచారం. మహాకూటమిలో భాగంగా 10 నుంచి 15లోపు అసెంబ్లీ స్థానాలు ఇచ్చే అంశంపై కాంగ్రెస్ యోచిస్తున్నట్లు సమచారం. ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు స్థానాలు కావాలని టీజేఏసీ కోరుతోంది. మూడు స్థానాల్లో ప్రధానంగా మెదక్ అసెంబ్లీ టికెట్ విషయమై కోదండరాం పట్టుదలగా ఉన్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య అంతర్గత విభేదాలు, ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని టీజేఎస్ భావిస్తోంది. కాంగ్రెస్‌లో మెదక్ టికెట్ కోసం 13 మంది నాయకులు పోటీ పడుతున్నారు. దీనికితోడు వారి మధ్య విభేదాలు ఉన్నాయి. దీంతో మెదక్ ఎమ్మెల్యే టికెట్ కేటాయింపు కాంగ్రెస్ అధిష్టానానికి కత్తిమీద సాములా తయారైంది. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా మెదక్ స్థానాన్ని తమకు వదిలివేయాలని టీజేఎస్ వత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. కోదండరాం సైతం ఇటీవల నాలుగు పర్యాయాలు మెదక్ నియోజకవర్గంలో పర్యటించారు. మెదక్ నుంచి పార్టీ బరిలో ఉంటుందని, కష్టపడి గెలవాలని పార్టీ శ్రేణులకు ఇప్పటికే సూచించారు. అయితే మెదక్ స్థానాన్ని వదులుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా కనిపించడం లేదు. దీంతో పొత్తులో టీజేఎస్‌కు టికెట్ దక్కుతుందా? లేదా? అన్న విషయం వేచి చూడాల్సి ఉంది. స్వల్ప మార్పులు ఉండే అవకాశం పొత్తులో మెదక్ టికెట్ టీజెఎస్ వచ్చిన పక్షంలో పోటీ చేసేందుకు పార్టీ జిల్లా అధ్యక్షులు జనార్ధన్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారు. దీనికితోడు ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం మెదక్ నుంచి ఎన్నికల ప్రచార యాత్రను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మెదక్ నుంచి ప్రచారం ప్రారంభిచటం ద్వారా నియోజకవర్గంలో పార్టీ శ్రేణులకు ఉత్సాహం నింపడంతోపాటు ఎన్నికల్లో పార్టీకి కలివస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా 4వ తేదీన మెదక్ మండలం పాపన్నపేటలోని ఏడుపాయల నుంచి ఎన్నికల ప్రచార యాత్ర చేపట్టాలని కోదండరాం నిర్ణయం తీసుకున్నారు. అయితే రాబోయే రెండు రోజులు ఆయన కూటమి చర్చల్లో పాల్గొంటారని సమాచారం. దీంతో ప్రచార యాత్ర తేదీల్లో స్వల్పమార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. 6 లేదా 7 తేదీల్లో ఈ ప్రచారం ప్రారంభించవచ్చని సమాచారం. ఇదిలా ఉంటే మెదక్ నుంచి పోటీ చేయాలనుకుంటున్న జనార్ధన్‌రెడ్డి నియోజకవర్గంలో ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. ఇటీవల చిన్నశంకరంపేట మండలంలో రైతు సమస్యలపై సదస్సు నిర్వహించారు. మెదక్‌లో యువజన ర్యాలీ, సభ చేపట్టారు. ఈ కార్యక్రమానికి కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై పార్టీశ్రేణుల్లో ఉత్సాహాంనింపే ప్రయత్నం చేశారు. మెదక్ బరిలో నిలవాలనుకుంటున్న టీజేఎస్ జనార్ధన్‌రెడ్డి పార్టీ నాయకులను ఏకతాటి మీదికి తీసుకురావటంతోపాటు జేఏసీలోని అన్నివర్గాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.