వరద నీరు చేరని కొంటూరు చెరువు
- ముఖం చాటేసిన వర్షాలు
- ఎండుతున్న పంటలు
- గింజవేసే దశలో వాడుతున్న కంకులు
- ఆందోళనలో రైతన్నలు
మెదక్: రెండేళ్లుగా కరువుతో విలవిల్లాడిన రైతులు.. ఈసారైనా సాగు చేసుకుని కష్టాల నుంచి గట్టెక్కుదామనుకున్నా.. నిరాశే మిగులుతోంది.. ముందు మురిపించిన వర్షాలు ఆ తరువాత కనుమరుగు కావడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పంటలు సరిగ్గా పొట్ట పోసుకునే దశలో వర్షాలు లేకపోవడంతో ఎండు ముఖం పడుతున్నాయి. దీంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. వరుణుడు కరుణించకపోతే మా బతుకులు ఆగమేనని వారు వాపోతున్నారు.
సగానికిపైగా బీడు భూములే
కార్తెలన్నీ కరిగిపోతున్నాయి.. కరువు మేఘాలు కమ్ముకుంటున్నాయి. జిల్లాలో గడిచిన రెండున్నర నెలల వర్షాకాలంలో ఇప్పటి వరకు సగమే వర్షపాతం నమోదు కావడంతో చెరువు, కుంటల్లోకి చుక్కనీరు రాలేదు. ఇప్పటి వరకు రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, అశ్లేష, ప్రస్తుతం మఖ కార్తె కూడా కరిగిపోతోంది. జూన్‌లో 170 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 190 నమోదైంది.
జూలైలో 370 మి.మీ. గానూ 340 మి.మీ. నమోదైంది. ఆగస్టు మాసంలో 370కి గానూ ఇప్పటి వరకు కేవలం 27మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. రెండున్నర నెలలుగా.. 910 మిల్లీమీటర్ల వర్షపాతానికిగానూ కేవలం 557 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. ఈ లెక్కన 353 మిల్లి మీటర్ల వర్షపాతం తక్కువగా నమోదైంది.
తక్కువ వర్షపాతం నమోదు కావడంతో నీటి వనరులైన చెరువు, కుంటల్లోకి ఏమాత్రం నీరు చేరలేదు. దీంతో ఆయకట్టు భూములన్నీ బీళ్లుగానే దర్శనమిస్తున్నాయి. అలాగే నియోజకవర్గంలోని ఘణపురం ప్రాజెక్ట్‌లోకి నీరురాకపోవడంతో 21వేల ఆయకట్టు భూమి బీడుగానే ఉంది. బోరుబావుల ఆధారంగా సాగుచేసిన వరిపంటలు సైతం ఎండుముఖం పడుతున్నాయి. ఆరుతడి పంటలైన కందులు, పెసర్లు, జొన్నలు వంటి పంటలు సైతం ఎండుముఖం పడుతున్నాయి.
మూడు ఎకరాల్లో వరి ఎండింది
మూడెకరాల పొలంలో రెండు బోర్లు వేశాను. ముందుగా వర్షాకాల సీజన్ ప్రారంభంలో వర్షాలు కురవడంతో రూ.40వేల అప్పు చేసి సాగుచేశాను.వర్షాలు లేక బోరుబావుల్లో నీటి మట్టం పెరగలేదు. దీంతో వేసిన పంట ఎండిపోతోంది. - పాపన్నగారి కిష్టారెడ్డి, బ్యాతోల్
దిక్కుతోచడంలేదు
నాలుగు ఎకరాలలో రెండు బోర్లు ఉన్నాయి. వాటి ఆధారంగా సుమారు రూ.80వేల అప్పు చేసి వరిపంట సాగుచేశాను. వర్షాలు లేక బోరుబావుల్లో నీటి మట్టం తగ్గిపోయింది. వేసిన పంట ఎండిపోతోంది. దీనికితోడు పురుగు తగిలింది. ఏం చేయాలో తోచడంలేదు. - కెతావత్‌రవి, బ్యాతోల్ తండా.