No rains
-
పంటలకు ‘డ్రైస్పెల్’ దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: నెల రోజులుగా చినుకు జాడలేక, ఎండలు పెరిగిపోయి రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయి. తొలుత రుతుపవనాల ఆలస్యం, తర్వాత జూలై భారీ వర్షాలు, మళ్లీ ఆగస్టులో డ్రైస్పెల్తో పంటల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టులో 63శాతం వరకు లోటు వర్షపాతం నమోదైంది. పలుచోట్ల కరువు ఛాయలు కూడా నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి వానాకాలం పంటలు గట్టెక్కుతాయా అన్న సందేహాలు ముసురుకుంటున్నాయి. ముఖ్యంగా ఈసారి ఆరుతడి పంటలు ఆగమవుతాయన్న ఆందోళన రైతులు, వ్యవసాయ అధికారుల్లో కనిపిస్తోంది. మొక్కజొన్న, పత్తికి నష్టం! వానలు పడటంలో ఎక్కువ విరామం రావడం మొ క్కజొన్నపై ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే పంట ఎండిపోతోంది. అధిక ఉష్ణోగ్రతలతో చీడపీడల దాడి పెరిగింది. అనేకచోట్ల మొక్కజొన్నపై కత్తెర పురుగు దాడిచేస్తోందని వ్యవసాయశాఖ బుధవా రం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. పత్తిలో పేనుబంక, రసం పీల్చే పురుగుల దాడి పెరిగిందని.. వరిపై కాండం తొలుచు పురుగు, అగ్గి తెగులు, కాండం కుళ్లు తెగులు, ఆకు ముడత తెగుళ్లు వస్తు న్నాయని హెచ్చరించింది. ఎండల కారణంగా సో యాబీన్ పంట ఎండిపోతోందని అధికారులు చెప్తున్నారు. వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే పత్తి, మొక్కజొన్న పంటలు చేతికి రావడం కష్టమేనని.. దిగుబడులు పడిపోతాయని అంటున్నారు. వరి ఫుల్.. పప్పులు డల్ రాష్ట్రంలో ఈసారి వానాకాలం పంటల సాగు విస్తీర్ణం కోటి ఎకరాలు దాటింది. సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం ఆగస్టు చివరినాటికి 1.24 కోట్ల ఎకరాలుకాగా.. ఈసారి ఇప్పటివరకు 1.16 కోట్ల ఎకరాల్లో (93.61 శాతం) పంటలు సాగయ్యాయి. వరి సాధారణ సాగు విస్తీర్ణం 49.86 లక్షల ఎకరాలైతే.. ఈసారి ఇప్పటివరకు 55.90 లక్షల ఎకరాల్లో (112.12 శాతం) నాట్లు పడ్డాయి. గత నెల భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో వరిసాగు జోష్ పెరిగింది. మరోవైపు రాష్ట్రంలో పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 9.43 లక్షల ఎకరాలుకాగా.. ఇప్పటివరకు 5.32 లక్షల ఎకరాల్లో (56.39%) మాత్రమే సాగయ్యాయి. ఇక మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 7.13 లక్షల ఎకరాలైతే.. ఇప్పటివరకు 5.21 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.59 లక్షల ఎకరాలుకాగా.. ఇప్పటివరకు 44.70 లక్షల ఎకరాల్లో (88.36 శాతం) వేశారు. వాస్తవంగా ఈ ఏడాది 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయించాలని వ్యవసాయశాఖ భావించింది. ఈ మేరకు రైతులకు పిలుపునిచ్చింది. కానీ సకాలంలో రుతుపవనాలు రాకపోవడం, కీలకమైన జూన్ నెల, జూలై రెండో వారం వరకు వర్షాలు లేకపోవడంతో అదను దాటిపోయింది. పంటలను కాపాడుకోవాలి: వ్యవసాయ వర్సిటీ జిల్లాల్లో నీటి వసతి గల రైతులు పత్తి, మొక్కజొన్న, కంది, సోయాచిక్కుడు వంటి పంటలకు నీటి తడులివ్వాలి. పూతదశలో ఉన్న మొక్కజొన్న పంటకు జీవసంరక్షక నీటి తడి ఇవ్వాలి. ప్రస్తుతం వరి పంట పిలక దశ నుంచి అంకురం దశలో ఉంది. కాండం తొలుచు పురు గు, అగ్గి తెగులు కలగచేసే కారకాలు కలుపు మొక్కలపై నివసించి వరి పంటను ఆశిస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వరిలో ఆకు నల్లి ఆశించే అవకాశం ఉంది. పత్తి పంట పూత నుంచి కాయ అభివృద్ధి దశలో ఉంది. ఈ పంటలో పేనుబంక, రసం పీల్చే పురుగుల నివారణకు ప్లునికామిడ్ 0.4 గ్రాములను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మొక్కజొన్న పంట మోకాలి ఎత్తు దశ నుంచి కంకి ఏర్పడే దశల్లో ఉంది. మొక్కజొన్న లో కత్తెర పురుగు ఆశిస్తోంది. నివారణకు 0.4 మి.లీ.క్లోరంట్రానిలిప్రోల్ లేదా 0.5 మి.లీ. స్పైనటోరంను లీటరు నీటికి కలిపి ఆకు సుడుల లోపల పిచికారి చేయాలి. రాష్ట్రంలో సోయా పంట పూత నుంచి పిందె, కాయ అభివృద్ధి దశలో ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పంటలో పెంకు పురుగు, కాండం ఈగ ఆశించేందుకు కారణమవుతాయి. ముందు జాగ్రత్తగా పురుగులు ఆశించకుండా 0.4 మి.లీ. థయోమిథాక్సిం లాంగ్డా సైలోత్రిన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. -
వర్షాలు పడలేదని.. రైతులెవరూ అధైర్యపడొద్దు
సంగారెడ్డి మున్సిపాలిటీ: రుతుపవనాలరాక ఆలస్యం కావడం, వరుణుడి జాడ లేకపోవడంతో ఎన్నో ఆశలతో సాగుకు భూములను సిద్ధం చేసిన రైతుల్లో కొంత ఆందోళన నెలకొందని, అయితే ఎలాంటి ఆందోళన చెందొద్దని జిల్లా వ్యవసాయాధికారి నసింహరావు అన్నారు. విత్తుకునే అదను దాటలేదన్నారు. ప్రస్తుతం సన్నాలు, మధ్యకాలిక, స్వల్పకాలిక వంగడాలు ఎంచుకోవాలి. వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటించాలని, వీలైనంత వరకు పంట మార్పిడి చేయాలని అప్పుడే అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని, 70 నుంచి 110 మి.మీ. వర్షం పడితేనే విత్తనాలు విత్తుకునేందుకు అనువుగా ఉంటాయన్నారు. బుధవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్‌కు రైతుల నుంచి విశేష స్పందన లభించింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా జాన్ 15 వరకే బీపీటీ సోనా రకం వరి సాగుకు నారుపోసుకోవాలన్నారు. ఆ తర్వాత పోసుకుంటే వాటికి తెగుళ్లు ఆశిస్తాయని తెలిపారు. సన్నరకం ధాన్యం ఆర్– ఎన్ఆర్ కేఎస్ఎం, దొడ్డు రకం 1010ని జూలై 15 వరకు నారు పోసుకోవాలి. అన్ని రకాల నేలలు వరి సాగుకు అనుకూలమని రైతులకు భరోసా ఇచ్చారు. రైతుల సందేహాలను నివృత్తి చేశారు. రైతు: నరసయ్య, అంత్వార్ (నారాయణఖేడ్) మూడు ఎకరాల పత్తి వేసాము. దానికి ఎలాంటి మందు వేయాలి. జేడీఏ: ఇప్పుడు డీఏపీ, కాంప్లెక్స్ వేయొచ్చు. రైతు: నవాజ్ రెడ్డి, చక్రియాల్ (చౌటకూర్) జిలుగు, జనుము రాలేదు సార్. ఆలస్యం అయ్యాయి. పంటకు ఇబ్బంది అవుతుంది. జేడీఏ: అవును. జిలుగు జనుము ఆలస్యమయ్యాయి. మీ దగ్గరలోగల మండలం నుంచి తెచ్చుకోవచ్చు. రైతు: శ్రీనివాస్. పుల్కల్ (పుల్కల్) మూడు ఎకరాల పత్తి మొలక వచ్చింది. ఇంకా మూడు ఎకరాలు ఉంది. ఏ పంటకు అనుకూలం సార్ ఇప్పుడు. జేడీఏ: జులై 10 వరకు పత్తి పంట వేసుకోవాలి. అది దాటితే ఇతర పంటలు వేసుకోవాలి. రైతు: విఠల్, జూకల్ (నారాయణఖేడ్) 25 గుంటల భూమి మూడు నెలల క్రితం నా పేరుపై పట్టా చేసుకున్నా. ఏఈఓ దగ్గర చూసుకుంటే డబ్బులు పడలేదు సార్. జేడీఏ: మీరు చేయించుకుని మూడు నెలలు మాత్రమే అయ్యింది. కొంచెం ఆలస్యం అవుతుంది. రైతు: నరసింహారెడ్డి, సత్వర్ (జహీరాబాద్) జనుము విత్తనాలు ఇంకా అందుబాటులోకి రాలేదు సార్. జేడీఏ: జహీరాబాద్ డీసీఎంఎస్ ఆఫీసులో వచ్చాయి తీసుకోండి. రైతు: నరేందర్, వెంకటాపూర్ (సదాశివపేట) సబ్సిడీపై ఎలాంటి ధాన్యాలు ఉన్నాయి సార్. జేడీఏ: కంది, సోయాబీన్ ఉన్నాయి. మిగతావి సబ్సిడీపై డీలర్లను అడిగి తెలుసుకోవాలి. అంతర పంటలు వేస్తే మంచిది. రైతు: రాజ్ కుమార్ దేశ్‌పాండే, మానియర్ పల్లి (కోహిర్) జిలుగు, జనుము తొందరగా రాకపోవడం కారణంగా ఆలస్యంగా విత్తనాలు వేశాము. మొక్కలు లేటుగా మొలుస్తున్నాయి. జేడీఏ: వర్షాలు లేని కారణంగా లేటుగా మొలుస్తున్నాయి. ఆందోళన చేందొద్దు. -
వరుణుడు కరుణిస్తాడని...కలవరపెడుతున్న వానాకాలం
మంచిర్యాలఅగ్రికల్చర్: జూన్ వచ్చిందంటే చాలు అన్నదాతలు వానాకాలం సాగు పనుల్లో బిజీగా కనిపిస్తారు. కానీ.. ఈసారి భిన్నమైన పరిస్థితి నెలకొంది. తొలకరి కోసం నేటికీ రైతులు నిరీక్షిస్తూనే ఉన్నారు. ఆలస్యమవుతుండగా అదునుదాటుతుందని ఆందోళన చెందుతున్నారు. వరుణుడు కరుణించకపోతాడా.. అని పలువురు రైతులు ఎప్పటిలాగే మృగశిరకార్తె (మిరుగుకార్తె) నుంచి పొడి దుక్కుల్లోనే విత్తనాలు వేస్తున్నారు. ఇంకా వానలు కురియ క పోవడంతో వేసిన విత్తనాలు దుక్కుల్లోనే మాడి పోతుండగా, మరోసారి విత్తనం వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని దిగులు చెందుతున్నారు. ఈ సమయానికే జిల్లాను రుతుపవనాలు తాకాల్సి ఉంది. కానీ ఇంకా ఎండలు తగ్గక రైతన్నను వానాకాలం కలవరం పెడుతోంది. వానాకాలం ఆరంభమై పక్షం రోజులు గడిచినా వర్షాలు పడలేదు. దీంతో అన్నదాత గుండెల్లో గుబులు మొదలైంది. జిల్లాలో ఇప్పటికే కొన్ని మండలాల్లో పత్తి విత్తనాలు వేస్తున్నారు. కాగా, ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసి భూమిలో తేమ శాతం పెరిగితేనే విత్తనాలు వేయాలని వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అడుగంటుతున్న జలాశయాలు జిల్లాలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొడుతున్నాయి. సాయంత్రం ఈదురుగాలులు, మబ్బులు పడుతున్నా వర్షాలు మాత్రం కురవడం లేదు. మృగశిర కార్తె బుధవారంతో ముగుస్తుండగా గురువారం నుంచి ఆరుద్ర కార్తె ప్రారంభం కానుంది. ఈ పాటికి జోరువర్షాలు కురిసి వాగులు, వంకలు పొంగి పొర్లుతుండాలి. చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో కొత్తనీరు చేరి జలమట్టం క్రమేపి పెరుగుతుండాలి. ఇందుకు భిన్నంగా ఇంకా ఎండలు మండుతుండగా జలాశయాలు అడుగంటిపోతున్నాయి. 94శాతం లోటు వర్షపాతం ఈసారి 3.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా. కానీ.. ఇప్పటివరకు 7వేల ఎకరాల వరకు పత్తి విత్తుకున్నట్లు తెలుస్తోంది. ఆశించిన వర్షాలు కురిస్తే ఈ సమయానికి 50వేల ఎకరాల వరకు విత్తనాలు వేసుకోవాల్సి ంది. గతేడాది ఇదే సమయానికి 45 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఈ ఏడాది సాధారణ స్థాయి వర్షాలు ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతుండగా ప్రస్తుత పరిస్థితులు రైతుల్లో గుబులు రేపుతున్నాయి. గతేడాది ఇదే సమయానికి జిల్లాలో సగటున 119 మిల్లీమీటర్ల వర్షపాతం కురువగా, ఈ ఏడాది 07 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. ఈ నెల 20వరకు సాధారణ వర్షపాతం 101.7 మిల్లిమీ టర్లు కురవాల్సి ఉండగా 6.2 మిల్లిమీటర్లు మాత్రమే కురిసింది. 94 శాతం లోటు వర్షపాతం నెలకొంది. మృగశిర కార్తె ఆరంభానికి ముందే ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిశాయి. దీంతో కొంతమంది రైతులు విత్తనాలు వేశారు. ఆ తర్వాత చినుకు పడక విత్తనం మొలకెత్తక ఆదిలోనే నష్టాలు చవి చూశారు. తేమ లేకుంటే ప్రమాదమే.. నేలలో తేమ లేనిదే విత్తనం వేసుకోవద్దని వ్యవసాయశాఖ ఓ వైపు హెచ్చరిస్తున్నా రైతులు విత్తనాలు వేస్తూనే ఉన్నారు. రెండు, మూడు భారీ వర్షాలు కురిసి 60–70శాతం తేమ నేలలో ఉంటేనే విత్తుకోవాలంటున్నారు. పత్తి, కంది, వరి, మొక్కజొన్న పంటలు విత్తుకునేందుకు వచ్చే నెల వరకు సమయం ఉందని చెబుతున్నారు. దుక్కి వేడి తగ్గకుండానే విత్తనాలు విత్తుకోవడం మంచిది కాదని పేర్కొంటున్నారు. విత్తిన ఐదురోజుల వరకు వాన పడకుంటే విత్తనం చెడిపోతుందని చెబుతున్నారు. కొన్ని విత్తనాలు మొలకెత్తినా మొలక దశలోనే మాడిపోతాయని పేర్కొన్నారు. ఇలా.. మొలక ఎండిపోయిన స్థానంలో రెండుమూడుసార్లు విత్తుకుంటే అదనపు ఖర్చుతో పాటు మొక్కల ఎదుగుదలలో వ్యత్యాసమేర్పడి కలుపు తీయడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. వానలు పడుతయనుకున్న నిరుడు మిరుగుకార్తెలోనే ప త్తి విత్తనం వేసిన. ఈసారి నాలుగురోజులు ఆలస్యంగా ఎనిమిదెకరాల్లో విత్తనాలేసి న. వారంరోజులైనా వర్షాలు పడుతలేవు. విత్తనాలు మొలకెత్తలేదు. ఎండలకు దుక్కిలోనే మాడిపోతున్నయ్. ఈ రెండుమూడ్రోజు ల్లో వాన పడకుంటే నేను పెట్టిన పెట్టుబడి రూ.35 వేల దాకా నష్టపోవుడే. – ముదరకోల సదయ్య, రైతు, నెన్నెల తొందరపడి విత్తనాలు వేయొద్దు తుఫాన్ కారణంగా రుతుపవనాల రాక కొంత ఆలస్యమైంది. ఈనెల 25నుంచి ఉ మ్మడి జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. రైతులు ఒకట్రెండు భారీ వర్షాలు కురిసి 60–70 శాతం తేమ ఉన్న తర్వాతే విత్తనాలు వేసుకోవాలి. పత్తి విత్తేందుకు సమయం ఉంది. తొందరపడి విత్తుకుంటే మొలక రాదు. – శ్రీధర్‌చౌహాన్, వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త -
Europe Drought 2022: జాడలేని వాన చినుకు.. అల్లాడిపోతున్న యూరప్
బ్రిటన్‌లో థేమ్స్ నది ఎండిపోతోంది. ఫ్రాన్స్‌లో ఎండ వేడిమికి కార్చిచ్చులు ఎగసిపడుతున్నాయి. నదుల్లో నీళ్లు లేక చచ్చిపోయిన చేపలు గుట్టలుగుట్టలుగా పడుతున్నాయి. స్పెయిన్‌లో రిజర్వాయర్లు నీళ్లు లేక బోసిపోతున్నాయి. మొత్తంగా యూరప్‌లో సగభాగాన్ని కరువు కమ్మేస్తోంది. లండన్: వాతావరణంలో మార్పుల ప్రభావం యూరప్‌ను అల్లాడిస్తోంది. బ్రిటన్, ఫ్రాన్స్, హంగేరి, సెర్బియా, స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ తదితర దేశాల్లో కరువు ముంచుకొస్తోంది. పశ్చిమ, మధ్య, దక్షిణ యూరప్‌లో రెండు నెలలుగా వాన చినుకు జాడ కూడా లేదు! దాంతో యూరప్‌లోని సగం ప్రాంతాల్లో కరువు పడగ విప్పింది. యూరోపియన్ యూనియన్‌లో 46% ప్రాంతాల్లో ప్రమాదకంగా కరువు పరిస్థితులున్నాయి. వాటిలో 11% ప్రాంతాల్లోనైతే అతి తీవ్ర కరువు నెలకొంది! దక్షిణ ఇంగ్లండ్‌లో థేమ్స్ నదిలో ఏకంగా 356 కి.మీ. మేర ఇసుక మేటలు వేసింది. నది జన్మస్థానం వద్ద వానలు కురవకపోవడం, ఎగువ నుంచి నీళ్లు రాకపోవడంతో ఎన్నడూ లేనంతగా ఎండిపోయింది! ఫ్రాన్స్‌లోని టిల్లె నదిలో సెకనుకు సగటున 2,100 గాలన్లు నీరు ప్రవహించే చోట్ల కూడా ఇప్పుడు చుక్క నీరు కనిపించడం లేదు. దక్షిణ, మధ్య, తూర్పు ఇంగ్లండ్‌లో ఏకంగా 8 ప్రాంతాలను కరువు ప్రభావితమైనవిగా బ్రిటన్ ప్రకటించింది. 1935 తర్వాత ఇలాంటి పరిస్థితులు రావడం ఇదే తొలిసారి! ఇంగ్లండ్‌లో కొద్ది వారాలుగా ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీల సెల్సియస్ పైగానమోదవుతున్నాయి. ఈ ఏడాది జూలై అత్యంత పొడి మాసంగా రికార్డులకెక్కింది. ఇవే పరిస్థితులు తూర్పు ఆఫ్రికా, మెక్సికోల్లో కనబడుతున్నాయి. 500 ఏళ్లకోసారి మాత్రమే ఇంతటి కరువు పరిస్థితులను చూస్తామని నిపుణులు చెబుతున్నారు. నదులు ఎండిపోతూ ఉండడంతో జల విద్యుత్కేంద్రాలు మూతపడుతున్నాయి. 2018లో కూడా కరువు పరిస్థితులు వచ్చినా ఇంత టి పరిస్థితులను ఎదుర్కోలేదని అధ్యయనవేత్లలు అంటున్నారు. అక్టోబర్ దాకా ఇవే పరిస్థితులు కొనసాగుతాయన్న అంచనాలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితులు తీవ్రమైతే ఇళ్లల్లో తోటలకు నీళ్లు పెట్టడం, కార్లు శుభ్రం చేయడం, ఇంట్లోని పూల్స్‌లో నీళ్లు నింపడంపై నిషేధం విధిస్తారు. – సాక్షి, నేషనల్ డెస్క్ ప్రమాద ఘంటికలు... ► బ్రిటన్‌లో జూలైలో సగటు వర్షపాతం 35% మాత్రమే నమోదైంది. ► దాంతో ఆవులు తాగే నీళ్లపై కూడా రోజుకు 100 లీటర్లు అంటూ రేషన్ విధిస్తున్నారు. ► మొక్కజొన్న ఉత్పత్తి 30%, పొద్దుతిరుగుడు ఉత్పత్తి 16 లక్షల టన్నులకు తగ్గనుందని అంచనా. ► బంగాళదుంప రైతులంతా నష్టపోయారు. ► జర్మనీలోని రైన్ నదిలో నీటి ప్రవాహం తగ్గిపోతూ వస్తోంది. చాలాచోట్ల 5 అడుగుల నీరు మాత్రమే ఉంది. ఈ నదిపై రవాణా ఆగిపోతే∙8 వేల కోట్ల డాలర్ల నష్టం సంభవిస్తుంది. ► ఇటలీలో గత 70 ఏళ్లలో చూడనంతటి అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. ► ఇటలీలోని అతి పెద్ద నది పో సగం వరకు ఎండిపోయింది. ► ఫ్రాన్స్‌లో 100కు పైగా మున్సిపాల్టీల్లో ట్యాంకర్ల ద్వారా నీళ్లు పంపిణీ చేస్తున్నారు. ► ఎండ తీవ్రతకు ఫ్రాన్స్‌లో గిర్నోడ్ లో 74 చదరపు కిలోమీటర్ల మేర కార్చిచ్చు వ్యాపించింది. ► స్పెయిన్‌లో ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు భారీగా పడిపోయాయి. ► హంగరీలో నదులన్నీ బురద గుంతలుగా మారిపోతున్నాయి. -
20 లక్షల ఏళ్లుగా వాన పడలే.. ఎక్కడో తెలుసా!
భూమ్మీద వందలు, వేల ఏళ్లుగా వాన అనేదే లేకుండా, పూర్తిగా పొడిగా ఉండే ప్రదేశం ఎక్కడుందో తెలుసా? ఏముందీ.. ఏ సహారా ఎడారో, మరో ఎడారో అయి ఉంటుందిలే అనిపిస్తోందా? అస్సలు కాదు.. ఎటు చూసినా కిలోమీటర్ల ఎత్తున మంచుతో కప్పబడి ఉన్న అంటార్కిటికా ఖండంలో అలాంటి ‘కరువు’ ప్రాంతం ఉంది. చలితో గజగజ వణికిపోతున్న ఈ శీతాకాలంలో.. ఆ చలి ఖండంలోని చిత్రమైన ప్రాంతం విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ మంచు మధ్య ‘కరువు’! భూమి దక్షిణ ధ్రువంలో కొన్ని కిలోమీటర్ల మందం మంచుతో కప్పబడి ఉన్న ఖండం అంటార్కిటికా. అత్యంత శీతలమైన ఈ ఖండంలో ఉత్తరం వైపు సముద్రతీరానికి సమీపంలో అత్యంత పొడిగా ఉండే ప్రదేశాలు ఉన్నాయి. సుమారు 4,800 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ప్రాంతాలను ‘డ్రై వ్యాలీస్’ అంటారు. ఇక్కడ సుమారు 20 లక్షల ఏళ్లుగా వాన పడటంగానీ, మంచు కురవడంగానీ జరగలేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో చాలావరకు ఒక్క చుక్క నీళ్లుగానీ, మంచుగానీ లేకుండా అత్యంత పొడిగా ఉంటుంది. అంతేకాదు.. ఈ ప్రాంతంలో ఏడాది పొడవునా మైనస్ 14 నుంచి మైనస్ 30 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య గడ్డ కట్టించే చలి ఉండటం గమనార్హం. మంచును కొండలు పట్టేసి.. నిజానికి అంటార్కిటికా ఖండంలోని గాలిలో తేమ శాతం ఎక్కువే. అలాంటి మంచు ఖండంలో ఇంతటి పొడి ప్రదేశాలు ఉండటానికి కారణం ‘కాటబాటిక్ విండ్స్’గా పిలిచే గాలులు కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ డ్రైవ్యాలీస్ ప్రాంతానికి చుట్టూ ‘ట్రాన్స్ అట్లాంటిక్’గా పిలిచే పర్వతాలు ఉన్నాయి. డ్రైవ్యాలీస్ వైపు వీచే గాలులు ఈ పర్వతాల కారణంగా వాతావరణంలో మరింత పైకి ఎగుస్తాయి. అక్కడి అతితక్కువ ఉష్ణోగ్రతల కారణంగా.. ఆ గాలుల్లోని తేమ అంతా మంచుగా మారి పర్వతాలపై పడిపోతుంది. ఏమాత్రం తేమలేని పొడి గాలులు.. డ్రైవ్యాలీస్ వైపు ప్రయాణిస్తాయి. వీటినే ‘కాటబాటిక్ విండ్స్’ అంటారు. గాలిలో తేమ లేకపోవడంతో వానలు, మంచు కురవడం వంటివి అసలే ఉండవు. ఉప్పునీటి సరస్సులతో.. డ్రైవ్యాలీస్గా పిలిచే ప్రాంతంలో కొన్ని సరస్సులు కూడా ఉన్నాయి. ఎప్పుడో లక్షల ఏళ్ల కింద ఏర్పడ్డ ఆ సరస్సుల్లో అప్పటి నీరే ఉంది. వానలు, హిమపాతం లేకపోవడంతో కొత్తగా నీళ్లు చేరే అవకాశం లేదు. వేల ఏళ్లుగా వేసవికాలంలో స్వల్పంగా నీరు ఆవిరవుతూ వస్తుండటంతో ఈ సరస్సుల్లోని నీటిలో లవణాలు ఎక్కువ. ఆ నీళ్లు సముద్రపు నీటికన్నా మూడు రెట్లు ఉప్పుగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. పూర్తిగా మంచినీటి మంచు ఖండంలో ఇలా ఉప్పునీటి సరస్సులు ఉండటం మరో వింత కూడా. అక్కడక్కడా ‘మమ్మీ’లు కూడా.. సమీపంలోని సముద్రం నుంచో, మధ్యలోని సరస్సుల నుంచో డ్రైవ్యాలీస్లోకి వచ్చిన సీల్ జంతువులు.. అక్కడి పరిస్థితులను తట్టుకోలేక చనిపోతాయి. ఇలా చనిపోయిన వాటి శరీరాలు వందలు, వేల ఏళ్లపాటు పెద్దగా చెడిపోకుండా ‘మమ్మీ’ల్లా ఉండిపోవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. చుక్కనీరు లేని పరిస్థితులు, తీవ్రమైన చలి, ఉప్పునీరు వంటివి దీనికి కారణమని తేల్చారు. రెండోస్థానంలో అటకామా ఎడారి అంటార్కిటికాలోని డ్రైవ్యాలీస్ను మినహాయిస్తే.. భూమ్మీద అత్యంత పొడిగా ఉండే ప్రాంతం అటకామా ఎడారి. చిలీ, పెరూ దేశాల మధ్య ఉన్న ఈ ఎడారిలో ఏళ్లకేళ్లు ఒక్క చుక్క వాన కూడా పడదు. ఒకవేళ పడినా ఏడాదికి ఒకట్రెండు మిల్లీమీటర్ల కంటే తక్కువే పడుతుంది. మన దగ్గర ఒకట్రెండు నిమిషాల పాటు కురిసే వానకంటే అది తక్కువ. -
వర్షాల కోసం నగ్నంగా బాలికల ఊరేగింపు
దమోహ్(మధ్యప్రదేశ్): ఆధునిక యుగంలోనూ దురాచారాలకు అడ్డుకట్ట పడడం లేదనడానికి ఇది మరో ఉదాహరణ. వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆరుగురు మైనర్ బాలికలతో నగ్నంగా ఊరేగింపు నిర్వహించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం దమోహ్ జిల్లాలో జబేరా పోలీసు స్టేషన్ పరిధిలోని బనియా గ్రామంలో ఆదివారం ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ గ్రామంలో చాలా ఏళ్లుగా వర్షాలు పడక కరువు తాండవిస్తోంది. బాలికలతో నగ్నంగా ఊరేగింపు జరిపిస్తే వరుణ దేవుడు కరుణించి, వర్షాలు కురిపిస్తాడన్న అంధ విశ్వాసంతో గ్రామ పెద్దలు సభ్య సమాజం తలదించుకొనే దురాగతానికి ఒడిగట్టారు. దీనికి సంబంధించిన రెండు వీడియోలు తెరపైకి వచ్చాయి. జిల్లా కేంద్రానికి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ దారుణంపై తమకు సమాచారం అందిందని పోలీసులు చెప్పారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించామని, బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నగ్న ప్రదర్శనకు బాధిత బాలికల తల్లిదండ్రులు సైతం అంగీకరించినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. వర్షాల కోసం కప్పను ఒక దుంగకు కట్టి, గ్రామంలో ఊరేగించడం చాలామందికి తెలిసిందే. బనియా గ్రామంలో బాలికలను నగ్నంగా మార్చి, వారితో కప్ప ఊరేగింపు నిర్వహించారని దమోహ్ జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ ఉదంతంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై నివేదిక ఇవ్వాలని దమోహ్ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. -
ఆశలు ఆ‘వరి’ !
ఖరీఫ్ సీజన్లో అప్పుడే రెండున్నర నెలలు గడచిపోయాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. సిద్ధం చేసుకున్న నారుమడులు ఎండిపోతున్నాయి. నీటితడులున్న ప్రాంతాల్లో వరినాట్లు వేసినా... మండుతున్న ఎండలు రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రాజెక్టుల ఎగువప్రాంతాల్లో అరకొరగా కురిసిన వర్షాలవల్ల నీటిమట్టాలు పెరగడం లేదు. మరో నెల రోజుల్లో విస్తారంగా వర్షాలు కురవని పక్షంలో ఇక కరువు పరిస్థితులు తలెత్తకమానవని రైతాంగం ఆందోళన చెందుతోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో కరువు ఛాయలు కనిపిస్తున్నా యి. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారా యి. జిల్లాలో శుక్రవారం 3.1మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జలాశయాల్లో 70 శాతానికి మించి నీటి మట్టం లేదు. దీనివల్ల సాగు అవసరాలకు నీటిని విడుదల చేయలేకపోతున్నారు. ఇప్పటికే నాట్లు వేయడం ఆలస్యమైంది. వాటికి ఆశించిన మేర నీరు అందకపోవడంతో ఎండిపోతున్నాయి. నీరు లేక ఇంకా కొన్నిచోట్ల నాట్లు పడనేలేదు. ఈ వారం దాటిపోతే ఇక నాట్లు వేసినా ప్రయోజనం ఉండదని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. జిల్లాలో వరి పంట సాధారణ విస్తీర్ణం 1,22,977 హెక్టార్లు కాగా ఇంతవరకూ 35,519 హెక్టార్లలో మాత్రమే సాగైంది. ఇందులో 22,875 హెక్టార్లలో వెదజల్లే పద్ధతిని అనుసరించారు. 12,644 హెక్టార్లలో వరి నాట్లు వేశా రు. నాట్లు వేసిన చోట వరి పంట ఎండిపోతోం ది. దత్తిరాజేరు మండలంలో కొన్ని చోట్ల నారు ఎండుతున్నట్టు వ్యవసాయ అధికారుల దృష్టికి కూడా వచ్చింది. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడానికి ఈ నెల 15వ తేదీ వరకు చూడాలని వ్యవసాయశాఖ కమిషనర్ చెప్పినట్టు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఆందోళనకరంగా జలాశయాలు.. జిల్లాలో జలాశయాలున్నప్పటికీ వాటిలో సరిపడా నీరులేదు. పెద్ద గెడ్డ నీటిని నేటికీ విడుదల చేయలేదు. వెంగళరాయ సాగర్ నీటిని విడుదల చేసినా తక్కువ స్థాయిలో ఆరుతడి పంటలకు పనికివచ్చేలా విడుదల చేస్తున్నారు. వీఆర్ఎస్ కాలువలు 23 కిలోమీటర్ల పొడవయితే వారం రోజుల క్రితం విడుదల చేసిన సాగునీరు బొబ్బిలి మండలానికి శుక్రవారమే చేరింది. 12వ కిలోమీటర్ వద్దే సాగునీరు ఇంకా ఉండటంతో వర్షాలు పడకుంటే జలాశయంలో ఉన్న కొద్ది పాటి నీరు కూడా అయిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. కంటితుడుపు వానలు.. జిల్లాలో కురుస్తున్న వర్షాలు కేవలం కంటి తుడుపుగానే ఉన్నాయి. శుక్రవారం నమోదైన వర్షపాతం వివరాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలోని 19 మండలాల్లో చుక్క రాలలేదు. కురిసిన చోట కూడా మెంటాడలో 32.2 మిల్లీమీటర్లు, పాచిపెంటలో 21.4 మిల్లీమీటర్లు, బొండపల్లిలో 18.2 మిల్లీమీటర్లు మినహా మిగిలిని అన్ని మండలాల్లో 1.2 మిల్లీమీటర్లు నుంచి 8.2 మిల్లీమీటర్ల వరకే నమోదైంది. వర్షాల కోసం ఎదురు చూస్తున్నాం.. జిల్లాలో వర్షాలు లేకపోవడం వల్ల రిజర్వాయర్లలోని నీటిని కూడా విడిచిపెట్టే సాహసం చేయలేకపోతున్నాం. పెద్ద గెడ్డ నీటిని నేటికీ విడిచిపెట్టలేకపోయాం. జిల్లాలో ఉన్న మొత్తం రిజర్వాయర్లన్నిటిలో 70 శాతం లోపే నీటి నిల్వలున్నాయి. వర్షాలు పడుతూ తెరిపి ఇ చ్చినప్పుడు వినియోగించే ప్రాజెక్టులే మనవి. పూర్తిగా రిజర్వాయర్ల నీటిని వినియోగించుకునే అవకాశం లేదు. వర్షాలు కురుస్తాయని ఎదురు చూస్తున్నాం. – కె.రాంబాబు, ఎస్ఈ, బొబ్బిలి ఇరిగేషన్ సర్కిల్. -
ముఖం చాటేసిన నైరుతి
వర్షాకాలం వచ్చేసింది. రైతు దుక్కి దున్ని ఆకాశంలోకి ఆశగా చూస్తున్నాడు. కానీ ఒక్క మబ్బు తునక కనిపించడం లేదు. నైరుతి రుతు పవనాలు ముఖం చాటేయడంతో ఖరీఫ్ సీజన్ వృథాయేనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. దక్షిణ భారతంలో రైతులకు జులై నెల అత్యంత కీలకం. ఈ నెలలో వర్షం కురిసే అవకాశాలు కనిపించడం లేదని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంటోంది. ‘నైరుతి రుతు పవనాలు బలహీనపడి పోతున్నాయి. వచ్చే రెండు వారాల్లో మధ్య, దక్షిణ భారతంలో ఎక్కడా వానలు కురిసే అవకాశాల్లేవు’ అని భారత వాతావరణ శాఖ అధికారి ఒకరు చెప్పారు. దేశం మొత్తమ్మీద చూస్తే 12 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మధ్య భారతంలో వానలు ఇప్పటికే దంచికొడుతున్నాయి. మరో నాలుగైదు రోజులపాటు ఉత్తర, ఈశాన్య భారతాల్లోని కొన్ని ప్రాంతాలు, గంగా పరీవాహక రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, బిహార్, బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి కశ్యపి పేర్కొన్నారు. అరేబియా సముద్రం, బంగాళాఖాతం ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం కనిపించడం లేదని ఆయన వివరించారు. మధ్య భారతంలో భారీ వర్షాలు నైరుతి రుతుపవనాలు భారత్‌లో ప్రవేశించిన తర్వాత తొలిసారిగా ఈ వారంలో కొన్ని ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. జులై మొదటి వారంలో గత 50 ఏళ్ల సగటు తీసుకుంటే 28 శాతం అత్యధికంగా వర్షపాతం నమోదైంది. సోయాబీన్, పత్తి అధికంగా పండించే మధ్యభారతంలో 38 శాతం అధిక వర్షాలు కురిస్తే, వరి పండించే దక్షిణాదిన 20శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. తీవ్రమవుతున్న నీటి సమస్య ఇప్పటివరకు కురిసిన వర్షాలు ఏ మాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. ఎక్కడికక్కడ బోర్లు బావురుమంటున్నాయి. చెరువులు ఎండిపోయాయి. రిజర్వాయర్లలో నీటిమట్టం దిగువకి పడిపోయింది చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఈసారి నైరుతి రుతుపవనాలు ఒక్క వారం ఆలస్యంగా రావడంతో పాటు అరేబియా సముద్రంలో నెలకొన్న వాయు తుఫాన్ ప్రభావం రుతుపవనాలపై పడింది. ఫలితంగా గత ఏడాదితో పోల్చి చూస్తే 27 శాతం వరకు విస్తీర్ణంలో పంటలు వేయడం తగ్గిపోయింది. ‘మన దేశంలో బంగారు పంటలు పండాలంటే వచ్చే రెండు, మూడు వారాల్లో అధికంగా వానలు కురవాలి. అప్పుడే జూన్‌లో తగ్గిన లోటు వర్షపాతం భర్తీ అవుతుంది. కానీ, ఇప్పుడు ఆ అవకాశాలు కనిపించడం లేదు’ అని భారత వాతావరణ శాఖకు చెందిన భారతి చెప్పారు. ఈ ఏడాది సరిగ్గా వానలు కురిసే అవకాశం లేదని వాతావరణ పరిస్థితుల్ని అంచనా వేసే ప్రైవేటు సంస్థ స్కైమెట్ మే నెలలోనే ప్రకటించింది. చెన్నై చేరిన నీళ్ల రైలు చెన్నై: వెల్లూరులోని జోలార్‌పేటై నుంచి 25 లక్షల లీటర్ల నీటిని మోసుకుంటూ ఓ రైలు చెన్నైలోని విల్లివక్కమ్‌కు చేరుకుంది. ఈ రైల్లో మొత్తం 50 వ్యాగన్లు ఉండగా, ఒక్కో వ్యాగన్ సామర్థ్యం 50 వేల లీటర్లు. నీటిని శుభ్రపరిచేందుకు దాదాపు 100 పైపులను అమర్చి ప్లాంటుకు తరలిస్తున్నారు. శుద్ధి చేశాక పంపిణీ చేస్తామని చెన్నై మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అధికారులు తెలిపారు. ఈ పంపిణీ ఈశాన్య రుతుపవనాలు వచ్చే వరకు కొనసాగుతుందన్నారు. ఈశాన్య రుతుపవనాలు రావడానికి ఇంకా ఆరునెలల సమయం ఉంది. దక్షిణ మెట్రోపోలీస్ నుంచి జోలార్‌పేటై 217 కిలోమీటర్ల దూరంలో ఉంది. నీటి కొరతతో అల్లాడుతున్న చెన్నైకి నీటిని తరలించేందుకు సహాయం అందించాల్సిందిగా ప్రభుత్వం రైల్వేను కోరిన నేపథ్యంలో ఈ రైలు వెల్లూరు జిల్లా నుంచి నీటితో చెన్నై చేరుకుంది. జోలార్‌పేటై నుంచి నీటిని తెచ్చి, కొరతను తగ్గించేందుకు ముఖ్యమంత్రి కే. పళనిస్వామి రూ.65 కోట్లను కేటాయించారు. నీటి పంపిణీని తమిళనాడు మంత్రులు ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు. చెన్నై నగరానికి రోజుకు 20 కోట్ల లీటర్లు నీరు అవసరం కాగా ఆ నీటిని అందించే నాలుగు ప్రధాన రిజర్వాయర్లలో నీరు అడుగంటిన సంగతి తెలిసిందే. -
చెరువులు వెలవెల.. రైతులు విలవిల
సాక్షి, మెంటాడ (విజయనగరం): వరుణుడు ముఖం చాటేయడంతో మండలంలోని చెరువులు చుక్కనీరు లేక వెలవెలబోతున్నాయి. ఖరీఫ్ వరిసాగుకు సిద్ధపడే రైతులను వర్షాభావ పరిస్థితి సందిగ్ధంలోకి నెట్టేసింది. ఇటీవల అడపా, దడపా వర్షాలు కురిసినా చెరువుల్లోకి నీరు చేరే స్థాయిలో కురవకపోవడంతో రైతన్నలు దిగులుచెందుతున్నారు. వరినార్లు పోసేం దుకు సాహించడం లేదు. దమ్ముల సంగతి పక్కనపెడితే నారుమడులకు కూడా నీరందుతుందో లేదోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా ప్రభుత్వం ఉపాధి హామీ పనులు చేపట్టి చెరువులను లోతు చేయిస్తున్నా వర్షాలు లేకపోవడంతో ఆ పనులవల్ల ఎటువంటి ఫలితం దక్కడం లేదని రైతులు అంటున్నారు. మండలంలో చిన్న పెద్ద చెరువులు, బందలు కలిపి సుమారు 400 వరకు ఉన్నాయి. వీటి కింద సుమారు 3,600 ఎకరాల వరకు ఖరీఫ్ వరి సాగు చేసేవారు. ఈ ఏడాది ఖరీఫ్ ఆసన్నమవుతున్నా నేటికీ సరైన వర్షాలు కురవకపోవడంతో వరి విత్తనాలు రైతుల వద్ద సిద్ధంగా ఉన్నప్పటికీ చల్లేందుకు సాహసించలేకపోతున్నారు. గోపీ పట్నాయిక్ చెరువు మండలంలోని గోపీ పట్నాయిక్ చెరువు పరిధిలో సుమారు 500 ఎకరాల ఆయకట్టు ఉంది. బడేవలస, మీసాలపేట, కొంపంగి, ఇద్దనవలస రాబం ద గ్రామాలకు చెందిన భూములను ఈ చెరువు ఆధారంగానే సాగుచేస్తుంటారు. ప్రస్తుతం ఈ చెరువులో చుక్క నీరు లేకపోవడం ఆయకట్టు రైతులను ఆందోళనలోకి నెట్టింది. పొట్టి బంద చెరువు అమరాయివలస,కైలాం గ్రామాల పొలాలకు పొట్టి బంద చెరువు ద్వారానే నీరు అందుతుంది. ఈ చెరువు కింద సుమారు 250 ఎకరాలు సాగవుతోంది. ప్రస్తుతం ఈ చెరు వు ఎడారిని తలపిస్తోంది. ఆయకట్టు రైతులు కనీసం నారు మడులు కూడా తయారు చేయలేదు. గండివాని, పినా చెరువులు కైలాం గ్రామ రైతులు గండివాని చెరువు ఆధారంగానే వరి సాగు చేస్తుంటారు. సుమారు 400 ఎకరాల ఆయకట్టు ఈ చెరువు కింద సాగువుతోంది. ఈ ఏడాది నేటికీ చెరువులోకి చుక్క నీరు చేరలేదు. చింతలవలస రెవెన్యూ పరిధిలో ఉన్న పినా చెరువు కింద సుమారు 200 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరవు పరిస్థితి కూడా అలాగే ఉంది. విస్తారంగా వర్షాలు కురిస్తే తప్ప ఈ ఏడాది ఉభాలు జరిగేలా లేవని రైతులు అంటున్నారు. -
నైరుతి నైరాశ్యం
-
దేవుడా...
సాక్షి, ఒంగోలు: జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఉదయం నాలుగున్నర గంటల నుంచే తెల్లవారి వెలుగు కన్పిస్తోంది. ఒక్క సారిగా వడగాడ్పులు మొదలవుతున్నాయి. రోహిణి కార్తె ముగిసినా ఉష్ణ తీవ్రత తగ్గడం లేదు. ఈ ఏడాది రుతుపవనాలు కచ్చిత సమయానికే వచ్చాయని బావించినా వాటి జాడే లేకుండా పోయింది. చినుకు రాలలేదు. జిల్లాలో మార్కాపురం, కందుకూరు డివిజన్లలోని పలు ప్రాంతాల్లో వడగండ్ల వానలు కురిశాయి. అక్కడక్కడ చినుకులు రాలాయి. పిడుగులు పడి కొందరు మృత్యువాతపడ్డారు. పశు నష్టం వాటిల్లింది. జిల్లాలో 40 డిగ్రిల ఉష్ణోగ్రతలు తగ్గడంలేదు. గురువారం టంగుటూరు, ముండ్లమూరు, దొనకొండ, ఇంకొల్లు, వేటపాలెంలోని దేశాయిపేటలో 45 డిగ్రిల ఉష్ణోగ్రత నమోదైంది. త్రిపురాంతకం, దొనకొండ,తర్లుపాడు, ముండ్లమూరు, మార్టూరు, వేటపాలెం, జె.పంగులూరు, కొరిశపాడు, మద్దిపాడులో 50–70 కి.మీ వేగంతో వడగాడ్పులు నమోదయ్యాయి. ఉదయాన్నే ఎండ తీవ్రంగా వస్తుంది. ఆరు,ఏడు గంటలలోపే ప్రచండ వెలుగు కన్పిస్తోంది. వడగాడ్పులు మొదలవుతున్నాయి. వేడి గాలులకు ఇల్లు విడిచి రావాలంటే భయపడ్తున్నారు. ఒక మధ్యాహ్నం 12–1 గంట మధ్యలో జన సంచారం ఉండటం లేదు. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉంటున్నాయి. ఈ ఏడాది తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎన్నడు లేని విధంగా వేడి తాపాన్ని ఎదుర్కొన్నారు. మే,జూన్ నెలల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువ పర్యాయాలు నమోదయ్యాయి. గురువారం 37 మండలాల్లో 40–42.3 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏసీలు పని చేయడం లేదు. వడగాడ్పులను పోలిన బెట్ట వాతావరణమే గదుల్లోనూ నెలకుంటోంది. ఉష్ణోగ్రతలు, వడగాడ్పులకు బయటకు తిరిగే పరిస్థితి లేదు. ఇళ్లల్లో ఉందామన్నా వాతావరణం సహకరించడం లేదు. పగటి పూట ఉష్ణోగ్రతలు, ఉక్క దెబ్బకి జనం బెంబేలెత్తిపోతున్నారు. రైళ్లు, బస్సుల్లో ఏసీలు పని చేయడం లేదు. కనిగిరి ప్రాంతంలో ఇటీవల ఏసీ బస్సులో ఏసీ అంతరాయం వచ్చి నిలిచిపోయింది. అర్ధరాత్రి ప్రయాణికులు నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారుల దృష్టికి రాత్రి 12 గంటల ప్రాంతంలో సమస్యను తీసుకెళ్లినా ప్రత్యమ్నాయం చేయలేకపోయారు. రైళ్లల్లోని ఏసీ కంపార్టుమెంట్లలో ఏసీలు సరిగ్గా పని చేయక అధికారులకు తరుచూ ఫిర్యాదులు వస్తున్నాయి. మరో 48 గంటలు వడగాడ్పుల తీవ్రత ఉంటుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. మృగశిర కార్తె వచ్చినా ఇంత వరకు వ్యవసాయ పనులు మొదలు కాలేదు.. నీళ్లు లేవు. సాగుకు ఈ ఏడాది నీళ్లు వస్తాయో లేదో తెలియదు. అధికారులు తాగునీటి గండం ఎలా గట్టెక్కాలని చూస్తున్నారు. వ్యవసాయ విస్తీర్ణం లక్ష్యాలను నిర్ణయించినా ఇంత వరకు అడుగు ముందుకు పడలేదు. -
ఒక్క ఎకరా పండితే ఒట్టు..!
సాక్షి, కొత్తపట్నం (ప్రకాశం): భూమాత ఘోషిస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో విత్తన విత్తు భూమిలోనే ఎండిపోయింది. పైకి అరకొరగా వచ్చిన మొక్కలు ఎదుగులేక చతికిలబడిపోతున్నాయి. ఫలితంగా మండలంలో వేల ఎకరాల్లో శనగ రైతులు కోట్లలో నష్టాన్ని మూటగట్టుకున్నారు. ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నామని, కానీ ఇలాంటి గడ్డు పరిస్థితి ఎప్పుడూ తాము చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఒక్క గింజ కూడా రైతులు చేతికి రాలేదు. ఎన్నో ఆశలతో ఎంతో వ్యయప్రయాసలకోర్చి వేలకు వేలకు పెట్టుబడులు పెట్టిన రైతులకు ఒక్క రూపాయి కూడా చేతికి రాలేదంటే రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. భూతాపం..రైతులకు శాపం.. మండలంలో ఎక్కువగా సాగయ్యే పంటల్లో శనగ ఒకటి. ఇక్కడి ఇసుక భూముల్లో శనగ పంట వేలాది ఎకరాల్లో సాగు చేశారు. మండల పరిధిలోని ఆలూరు, గాదెపాలెం, కొత్తపట్నం, అల్లూరు, గవళ్లపాలెం, చింతల, రాజుపాలెం, ఈతముక్కల, మడనూరు, సంకువానికుంట గ్రామాల్లో సుమారు 8250 ఎకరాల్లో ఈ ఏడాది శనగ సాగు చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నా రైతులు ఎంతో సాహసం చేసి ఎన్నో వ్యయప్రయాసలకొర్చి శనగ సాగు చేశారు. ఎకరాకు శనగ సాగుకు దుక్కి దున్నడం, విత్తనాలు ఎదపెట్టడం, ఎరువులు, కూలీ..ఇలా మొత్తం రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఖర్చయింది. కౌలు రైతులకు కౌలు అదనపు ఖర్చు. అయితే పంట వేసిన నాటి నుంచి ఒక్క చినుకు వర్షం కూడా కురవకపోవడంతో మండలంలోని కొన్ని ప్రాంతాల్లో మొక్క కూడా బయటకు రాలేదు. అరకొరగా వచ్చిన మొక్క సైతం నీటి తడులు లేక ఎదుగుదల నిలిచిపోయింది. దీంతో రైతులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పంటను పశువులకు మేతగా వదిలేశారు. 8 వేల ఎకరాల్లో శనగ సాగు చేస్తే కనీసం ఒక్క గింజ కూడా చేతికి రాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క మండలంలోనే రైతులకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. పరిహారం ఎక్కడ..? పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి వ్యవసాయాధికారులు పొలాలకు వెళ్లి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. కానీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రైతులకు నష్టపరిహారం విడుదల కాలేదు. దీంతో ప్రభుత్వం తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేల ఎకరాల్లో పంట నష్టపోయి మండలంలో కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లినా మా గురించి పట్టించుకునే వారే కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నామని, కానీ గింజ కూడా చేతికి రాకుండా లేనంతగా ఎప్పుడూ లేదని, ఇలాంటి గడ్డు పరిస్థితులను తామెప్పుడూ చూడలేదని రైతులు పేర్కొంటున్నారు. బీమా అయినా వస్తుందా..? మండలంలోని 8 వేల ఎకరాల్లో శనగ సాగు చేసిన రైతుల్లో కొంత మంది బీమా కోసం ఎకరాకు రూ.330 ప్రీమియం చెల్లించారు. ఫసల్ బీమా పథకం కి,ద పంటనష్టం వాటిల్లితే ఎకరాకు రూ.22 వేల వరకు రైతులకు చెల్లించాల్సి ఉంది. అయితే ఇంత వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. అసలు వస్తుందో రాదో కూడా అర్థం కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వ్యవసాయాధికారి సుచిరితను వివరణ కోరగా.. మండలంలో సాగు చేసిన శనగ పంట పూర్తిగా నష్టపోయింది వాస్తవమేనన్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు నష్టపోయిన పంట జాబితాను సిద్ధం చేసి పంపించామని తెలిపారు. ఫసల్ బీమా కింద ప్రీమియ, చెల్లించిన రైతులకు బీమా నగదు చెల్లించేలా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గింజ కూడా చేతికి రాలేదు నాలుగు ఎకరాల్లో శనగ సాగు చేశాను. మొత్తం రూ.50 వేల వరకు ఖర్చయింది. వేసిన పంట వేసినట్లే ఎండిపోయింది. గింజ కూడా చేతికి రాని పరిస్థితి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అధికారులన్నా గుర్తించి శనగ రైతులను ఆదుకోవాలి. - రాము, అల్లూరు అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు వ్యవసాయం మానేసి కూలి పనులకు వెళ్లడం మేలనిపిస్తుంది. వేలకు వేలు ఖర్చు చేస్తే రూపాయికి కూడా చేతికి రాలేదు. పంట మొత్తం పూర్తిగా నష్టపోయా. పంటల కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు. అధికారులు స్పందించి నష్టపరిహార, చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. - చిరుతోటి విద్యాసాగర్ -
జాడలేని వాన.. రైతన్న హైరానా!
సాక్షి, హైదరాబాద్ : నిర్ణీత సమయానికి ముందే నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయి.. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి.. మొదట్లో సాధారణస్థాయికి మించి వానలు కురిశాయి.. అన్నదాతల్లో ఆనందం పొంగింది.. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఆవిరైంది! రుతుపవనాలు బలహీనపడటంతో వానలు ముఖం చాటేశాయి. వారం రోజులుగా వాన జాడలేక రైతన్న దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. వానల్లేక వేసిన విత్తనం భూమిలో ఉండిపోయింది. కొన్నిచోట్ల విత్తనాలు మొలకెత్తినా ఎండలకు మాడిపోతున్నాయి. ఇంకొన్నిచోట్ల దుక్కులు దున్నిన రైతన్నలు ఆశగా నింగి వైపు చూస్తున్నారు. ఆగిన సాగు ఈసారి నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంతో పోలిస్తే 97 శాతం వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ లెక్కన తెలంగాణలో సాధారణ నైరుతి సీజన్ వర్షపాతం 755 మి.మీ. కాగా.. 97 శాతం లెక్కన 732 మి.మీ.లు కురిసే అవకాశముంది. అయితే ఈ నెల 15 నుంచి వర్షాలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. గత రెండ్రోజుల్లోనైతే పరిస్థితి ఘోరంగా ఉంది. ఏకంగా 84 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో ఎక్కడికక్కడ పంటల సాగు నిలిచిపోయింది. నార్లు పోసే దిక్కు కూడా లేదు. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. 4 లక్షల ఎకరాల్లో పత్తి ఈ ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం కోటి ఎకరాలకు పైనే ఉంది. అందులో 45 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేస్తారు. పైపెచ్చు ఖరీఫ్‌పై ప్రభుత్వం కోటి ఆశలు పెట్టుకుంది. రుతుపవనాల ఆరంభ సమయంలో వర్షాలు కురుస్తాయన్న ఆశతో అనేక మంది రైతులు పత్తి, మెట్ట పంటల విత్తనాలను చల్లారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేసి ఉంటారని అంచనా. అందులో పత్తి విత్తనాలు దాదాపు 4 లక్షల ఎకరాల్లో చల్లి ఉండొచ్చని చెబుతున్నారు. కొన్నిచోట్ల పెసర, కంది వంటి విత్తనాలను చల్లారు. వర్షాలు నిలిచిపోయి ఎండలు మండిపోతుండటంతో మొలకెత్తిన విత్తనాలు వాడిపోతుంటే, కొన్నిచోట్ల భూమిలోనే మాడిపోతున్నాయని రైతులు అంటున్నారు. ముందుగా వేసిన విత్తనాలు మొలకెత్తినా ప్రయోజనం కనిపించటం లేదు. ఆ మొలకలు కూడా వాలిపోతున్నాయి. దాదాపు 2 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు భూమిలోనే మగ్గుతున్నాయి. ఇంకొన్ని చోట్ల పొడి దుక్కుల్లోనే రైతులు పత్తి విత్తనాలను నాటుతున్నారు. నేలలో తగిన తేమ ఉన్న సమయంలోనే పంటలను సాగు చేయాలని అధికారులు చెబుతున్నా రైతులు పట్టించుకోవడం లేదు. 60 మి.మీ. వర్షం కురిసినప్పుడే పత్తి విత్తనాన్ని నాటుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచనలు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏదీ? ప్రస్తుతం రైతు బీమా పథకంపై తప్ప వ్యవసాయశాఖ దేనిపైనా దృష్టి సారించడం లేదు. మండలాల్లో వ్యవసాయాధికారులు అంతా ఎల్ఐసీ ఫారాలను ముందేసుకొని రైతులను బీమాలో చేర్పించే పనుల్లోనే నిమగ్నమయ్యారు. అలాగే వ్యవసాయశాఖ ఇప్పటికీ 2018–19 ప్రణాళిక విడుదల చేయలేదు. అందులో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను తెలియజేయాలి. కానీ ఆ ప్రణాళిక విడుదలపై ఇంకా దృష్టి సారించడం లేదు. రైతులను చైతన్యపరిచేందుకు యాత్రలు కూడా నిర్వహించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. 22 నుంచి వర్షాలు: రాజారావు, సీనియర్ అధికారి, హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఈ నెల 22 లేదా 23వ తేదీ నుంచి వర్షాలు కురుస్తాయి. ప్రస్తుతం రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. రెండు మూడు రోజుల్లో మళ్లీ పుంజుకుంటాయి. ఈ నెలాఖరుకు అనేకచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
ఈసారి ఆశించిన వర్షాలు పడవా ?
-
బరువెక్కుతున్న రైతు గుండె
ముఖం చాటేసిన వర్షాలు ఎండుతున్న పంటలు ఆందోళనలో రైతులు కొల్చారం: ఊరించిన వర్షాలు ముఖం చాటేయడంతో పంటలు ఎండుతున్నాయి. ఏపుగా పెరిగిన పంటలు కళ్లెదుటే ఎండుతుంటే రైతు గుండె బరువెక్కుతోంది. దిగులుతో రోగాల బారిన పడి మంచం పడుతున్నారు రైతులు. కష్టాల్లో ఉన్న రైతులకు ప్రభుత్వం భరోసా కల్పించడంలో పూర్తిగా విఫలమవుతోంది. కొల్చారం మండలంలో గత రెండేళ్ల నుంచి పంటల సాగు అంతంతగానే ఉంది. మండలంలో పంటల సాగు సాధారణ విస్తీర్ణం 5,706 హెక్టార్లు కాగా ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో 4,748 హెక్టార్లలో పంటలను సాగు చేశారు. వర్షాభావ పరిస్థితులను ముందుగానే పసిగట్టిన రైతులు ఎక్కువగా ఆరుతడి పంటలు మొక్కజొన్న, పప్పు దినుసులు, పత్తి సాగు చేశారు. వరి 2,875 హెక్టార్లు, మొక్కజొన్న 941హెక్టార్లు, పత్తి 344 హెక్టార్లు, జొన్న 32 హెక్టార్లు, పెసర 117 హెక్టార్లు, కంది 240 హెక్టార్లలో సాగు చేశారు. ఇతర పంటలనూ సాగు చేశారు. సాగు సమయంలో వర్షాలు అడపాదడపా ఓ మోస్తలు కురియడంతో పంటలు కాస్త ఏపుగా పెరిగే దశకు వచ్చాయి. ఇంతలోనే వర్షాలు ముఖం చాటేశాయి. బోర్లు వట్టిపోవడంతో తాగేందుకు నీళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. పంటలు ప్రస్తుతం ఎండుతుండటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పంటల సాగు కోసం తెచ్చిన అప్పులు తీర్చే మార్గం కానరాక.... ప్రభుత్వం ఇస్తామన్న మూడో దఫా రుణమాఫీ ఇప్పటికీ అమలు కాకపోవడంతో ఏ రైతును కదిలించినా బాధతో కూడిన భావాలను వ్యక్తం చేస్తున్నారు. కనీసం మండలస్థాయి వ్యవసాయధికారులు కూడా పొలాల వైపు వచ్చి చూసింది లేదని రైతులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో తాము బతికేది ఎలా అంటూ నిట్టూరుస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొల్చారం మండల రైతులకు భరోసా కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. రూ.60 వేల పెట్టుబడి ఐదు ఎకరాల్లో ఈ సంవత్సరం బోరు కింద వరి పంట సాగు చేశాను. రూ.60 వేల వరకు పెట్టుబడి పెట్టాను. బోరు కాస్త నీళ్లు పోయడం ఆగింది. వర్షం కూడా తగినంత కురవకపోడంతో ప్రస్తుతం వరి పంట పూర్తిగా ఎండుముఖం పడుతోంది. పంట సాగు కోసం చేసిన పెట్టుబడి చేతికందని పరిస్థితులు కనిపిస్తున్నాయి. - మహేందర్‌రెడ్డి, వై.మాందాపూర్ కలిసిరాని కాలం రెండేళ్ల నుంచి కాలం కలిసి రావడం లేదు. ఈ సంవత్సరం నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశాను. పంట బాగా పండి అప్పుల నుంచి బయట పడదామనుకుంటే వర్షాలు కురవడం లేదు. పంట పూర్తిగా ఎండిపోయింది. అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిన పొలం వైపు రావడం లేదు. - సత్తయ్య, కోనాపూర్ రోగాలతో చస్తున్నాం నా మూడెకరాల పొలంలో మొక్కజొన్న పంట సాగు చేశాను. పంటను చూస్తే దుఃఖమొస్తోంది. నీళ్లందక పంట పూర్తిగా ఎండిపోయే దశకు చేరింది. రోగాలు వచ్చి పదిహేనురోజులుగా ఇబ్బంది పడుతున్నా. కనీసం అధికారులు వచ్చి మా పొలాలను చూసి భరోసా ఇవ్వకపోవడం దారుణం. అధికారులు స్పందించాలి. - నర్సింలు, రైతు -
ఆదుకోని అల్పపీడనం
ఆగస్టులో 30మండలాల్లో చినుకు జాడ కరువు అంతంతమాత్రంగా వరినాట్లు.. ఉభాలపై ప్రభావం విజయనగరం గంటస్తంభం: రాష్ట్రమంతా వర్షాలు అదరగొట్టేస్తుంటే... ఇక్కడ చిన్నపాటి జల్లులే పడుతున్నాయి. నీటి తడికోసం అల్లాడుతున్న వరినారుమళ్లు... నెర్రెలుగా మారుతున్నాయి. అదను దాటుతున్నా... చినుకు జాడ కరువై అన్నదాత అల్లాడుతున్నాడు. ఉభాలు వేసే సాహసం చేయలేక... నారుమళ్లు బతికించుకోలేక సతమతమవుతున్నాడు. అల్పపీడన ప్రభావం వల్ల జిల్లాలో ఐదారు రోజులుగా చెదురుమదురుగా కురుస్తున్న చిన్నపాటి వానలు అన్నదాతను ఆదుకోలేకపోయాయి. ఆగస్టు నెల వర్షపాతం లోటులోనే ఉంది. 30మండలాల్లో వర్షాభావ పరిస్థితులున్నట్లు ప్రణాళికాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఖరీఫ్ మూడు నెలలకు సంబంధించి మాత్రం సాధారణ వర్షపాతం నమోదు కావడం గమనార్హం. ఆగస్టు నెలలో మెంటాడ, గజపతినగరం, బొండపల్లి, గుర్ల మండలాల్లో మాత్రమే సాధారణ వర్షాలు పడ్డాయి. మిగతా 30మండలాల్లో గురుగుబిల్లి, సీతానగరం, బలిజిపేట, చీపురుపల్లి, వేపాడ మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు, మిగతాచోట్ల వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. వరిపంటపై తీవ్ర ప్రభావం జిల్లాలో వర్షాభావ పరిస్థితులు వరిపైనే తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఏనెలలో వర్షాలు సక్రమంగా లేకపోయినా పంటలు నష్టపోక తప్పదు. కీలకమైన ఆగస్టులో వర్షపాతం జిల్లాలో చాలా తక్కువగా నమోదైంది. ఈ నెలలో మొత్తం 6,634.2 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 4078.3మిల్లీమీటర్లే నమోదైంది. సగటున చూస్తే 195.1 మిల్లీమీటర్లు పడాల్సి ఉండగా 120మిల్లీమీటర్లు పడింది. కొన్ని మండలాల్లో చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. జూన్ నెలాఖరు, జులై ఆరంభంలో వరినారు పోసిన విషయం విదితమే. జులై నెలాఖరు నాటికి ఉభాలు జరిగి నాట్లు పడాలి. కానీ వర్షాలు సక్రమంగా పడకపోవడం వల్ల అవి ఊపందుకోలేదు. వరినారు కొన్ని చోట్ల పూర్తిగా పోగా మరికొన్ని చోట్ల ముదిరిపోయింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నాలుగైదు రోజులుగా అక్కడక్కడ కురుస్తున్న వర్షాలకు ముదిరిన వరినారుతోనే ఉభాలు కానిచ్చేస్తున్నారు. సెప్టెంబర్, ఆక్టోబర్‌లో వర్షాలు అనుకూలించినా పూర్తిస్థాయి దిగుబడి రావడం కష్టమే. మూడు నెలల్లో సాధారణం ఖరీఫ్‌లో ఇప్పటివరకు ముగిసిన జూన్, జూలై, ఆగస్టు నెలల్లో కురిసిన వర్షాలు సాధారణంగా నమోదయ్యాయి. సగటున జూన్‌లో 128.4 మిల్లీమీటర్లుకు 182.7మిల్లీమీటర్లు, జూలైలో 178.7మిల్లీమీటర్లకు 184.6మిల్లీమీటర్లు పడింది. ఆగస్టు నెలలో 195.1మిల్లీమీటర్లుకు 120మిల్లీమీటర్లు నమోదు కావడంతో మూడు నెలల్లో సగటున సాధారణ వర్షపాతం నమోదైంది. మొత్తంగా చూస్తే 502.2మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా 487.2మిల్లీమీటర్లు నమోదైంది. ఈ లెక్కన ఇప్పటివరకు కురవాల్సిన వర్షాల కంటే కేవలం 3శాతం మాత్రమే తక్కువ నమోదైంది. అయినా వరిపంటకు ఫలితం లేకపోయింది. రైతులకు అవసరమైన సమయంలో పడకపోవడంతో ఉభాలు సరిగ్గా జరగలేదు. కురుస్తున్న వర్షాలు కరువు ప్రకటనకు విఘాతం కలిగిస్తాయేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే పంటలు కోల్పోయిన రైతన్నకు సర్కారునుంచి ఊరట లభించే అవకాశం కానరావడంలేదు. -
కన్నీటి సాగు!
ఈసారీ తప్పని తిప్పలు కరుణించని వరుణుడు ఎండుతున్న పంటలు మొక్క మొక్కకు నీరు పోస్తూ.. రైతన్న పడరాని పాట్లు శివ్వంపేటు/చేగుంట/చిన్నశంకరంపేట: మెతుకుసీమ రైతు కంట కన్నీరే.. రెండేళ్లుగా కరువుతో విలవిల్లాడిన రైతు ఎన్నో ఆశలతో ఖరీఫ్ సాగు చేయగా.. ముందు మురిపించిన వరుణుడు.. పంటలు ఎదిగే కీలక సమయంలో ముఖం చాటేశాడు. దీంతో పంటలన్నీ ఎండుముఖం పట్టాయి. చెల్క నేలల్లో ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. పరిస్థితి ఇలాగే ఉంటే.. మరి కొద్ది రోజుల్లో నల్ల రేగడి భూముల్లో పంటలు కూడా నాశనమయ్యే పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికే వేలాది రూపాయలు ఖర్చు చేయగా కనీసం పెట్టుబడి కూడా రాని దుస్థితి నెలకొంది. పలువురు రైతులు ఇతర ప్రాంతాల నుంచి బిందెల ద్వారా నీటిని తీసుకువచ్చి మొక్కమొక్కకు నీరు పోస్తూ పాట్లుపడుతున్నారు. శివ్వంపేట, చేగుంట, చిన్నశంకరంపేట మండలాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
ఖరీఫ్.. ఉఫ్!
జాడలేని వానలు ఎండుతున్న పంటలు.. ఆశల్లేని రైతులు అడ్డాపై కూలీగా పనుల కోసం పరుగులు మెదక్: ఖరీఫ్ కన్నీరు పెట్టిస్తోంది.. ఆశలన్నీ సూరీడు ఆవిరి చేస్తున్నాడు.. వరుణుడు మొఖం చాటేశాడు.. పంటలన్నీ ఎండిపోతున్నాయి. పెట్టుబడులు రాని దుస్థితి. అప్పులు మీదపడ్డాయి. బతుకు కష్టమవుతోంది.. మళ్లీ పొట్టచేతపట్టుకుని రైతన్న వలసబాట పడుతున్నాడు. అన్నదాతను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. సరైన వర్షాలు కురవక.. ఖరీఫ్ సాగక.. రైతన్న ఆందోళనకు గురవుతున్నాడు. వర్షాకాలం ప్రారంభంలో కురిసిన అడపాదడపా వర్షాలకు సాగుచేసిన ఆరుతడి పంటలు కూడా ఎండిపోతున్నాయి. 20 రోజులుగా వేసవిని తలపిస్తున్న ఎండలకు పంటలన్నీ చేతికందకుండా పోతున్నాయి. బోర్ల ఆధారంగా వేసిన వరిపంటలకూ నీరందక నెర్రలు బారాయి. కనీసం పెట్టుబడులు కూడా రాని దుస్థితి నెలకొంది. దీంతో దిక్కుతోచని స్థితిలో మళ్లీ పొట్టచేతపట్టుకుని వలస బాటపడుతున్నాడు. రెండేళ్లుగా కరువు తాండవం చేయడంతో పల్లెలను వదిలి పట్టణాలకు వలస వెళ్లిన అన్నదాతలు ఎంతో ఆశతో.. ఈసారి ఖరీఫ్‌కు సన్నద్ధమయ్యారు. ఈయేడు వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయన్న ఆశతో పల్లెలకు తిరిగి చేరుకున్నారు. వేలాది రూపాయల అప్పులుచేసి పంటలు సాగుచేస్తే వర్షాలు లేక సాగుచేసిన ఆరుతడి పంటలన్నీ ఎండిపోయాయి. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి పల్లెల్లో కానరావడం లేదు. పల్లెల్లో చేసేందుకు పనులు దొరకక మెదక్ పట్టణంలోని కూలీల అడ్డామీదకు పల్లెల నుంచి తరలివస్తున్నారు. మాకు పనులు చూపాలని వేడుకుంటున్నారు. ఒక్కరిని కూలికి పిలిస్తే నలుగురు ఎగబడుతున్నారు. జిల్లా అంతటా కరువు పరిస్థితులే కనిపిస్తున్నాయి. మురిపించిన వర్షాల ఆధారంగా ఆరుతడి పంటలైన మొక్కజొన్న, మినుములు, పెసర్లు, కందులు, జొన్న పంటలను 1.20లక్షల హెక్టార్లలో రైతులు వేసుకున్నారు. కొద్దోగొప్పో నీరు వచ్చే బోర్ల ఆధారంగా జిల్లా వ్యాప్తంగా 35 వేల హెక్టార్లలో వరి పంటను సాగుచేశారు. వర్షాలు పడకపోవడంతో చేతికందే దశలో ఉన్న ఆరుతడి పంటలన్నీ ఎండిపోయాయి. బోరుబావుల్లో సైతం నీటి ఊటలు అడుగంటిపోయి వరి పొలాలు నెర్రలు బారాయి. ఇక చేసేదిలేక అడ్డా మీదకు కూలీ పనులకోసం పరుగులు తీస్తున్నారు. మెదక్, పాపన్నపేట, చిన్నశంకరంపేట, మెదక్ మండలాల నుంచి నిత్యం వెయ్యి మందికిపైగా రైతులు కూలి పనులకు వస్తున్నారు. ఇక్కడ కూడా వారికి పనులు చెప్పేవారు లేకపోవడంతో నిరాశతో వెనక్కి తిరిగిపోతున్నారు. ఆటో, బస్సుచార్జీలు పెట్టుకొని దూర ప్రాంతాల నుంచి పనికోసం వస్తే పనులు దొరకక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మక్క ఎండిపోయింది సారూ.. రెండెకరాల పొలం ఉంది. అందులో రూ.20వేల అప్పు చేసి మొక్కజొన్న పంట వేశాను. తీరా కంకి దశకు చేరుకున్న దశలో వర్షాలు పడకపోవడంతో పంటంతా ఎండిపోయింది. దీంతో అడ్డామీదకు కూలీపని కోసం వచ్చినా.. ఇక్కడ కూడా పనిదొరకడం లేదు. ఎట్లా బతకాల్లో అర్థమైతలేదు. - నర్సింగ్, జానంపల్లి గిరిజనతండా రెండెకరాల వరి పోయినట్టే నాకు రెండెకరాల పొలం ఉంది. అందులో రెండు బోర్లున్నాయి. వాటిల్లో కొద్దిపాటి నీరు వస్తుండటంతో రూ.30వేల అప్పు చేసి వరి పంట సాగుచేశాను. వర్షాలు పడకపోవడంతో బోర్లలో నీటి ఊటలు అడుగంటాయి. పంట ఎండిపోతోంది. అడ్డామీద పనికొచ్చినా.. పనిచెప్పేవారే లేరు. - రైతు శ్రీను, అవుసులపల్లి పనులు చూపించాలి మళ్లీ కరువు మొదలైంది. పంటలుఎండిపోయాయి. ప్రభుత్వం స్పందించి పల్లెల్లో పనులు చూపించి ఆదుకోవాలి. బుక్కెడు కూడు కోసం అడ్డామీద పడిగాపులే.. వారానికి రెండు రోజులైన పని దొరకడం లేదు. పల్లెల్లోనే ఉపాధి పనులు చేపట్టి ఆదుకోవాలి. - ఏసుమణి, మక్తభూపతిపూర్ పోషణ భారమైంది నాకున్న రెండెకరాల్లో మొక్కజొన్న పంట వేసిన. వర్షాలు కురవక ఎండిపోయింది. అందుకోసం చేసిన అప్పులు మీద పడ్డాయి. బతుకు దెరువుకోసం అడ్డామీద కూలీవస్తే పని దొరకుతలేదు. కన్నబిడ్డలను పోషించుకునేందుకు ఆదేరువులేదు. ప్రభుత్వమే పనులు చూపించి ఆదుకోవాలి. - లంబాడి మీరి, జానకంపల్లితండా కుటుంబం చిన్నాభిన్నం వరుస కరువులతో నా కుటుంబం చిన్నాభిన్నమైంది. 5 ఎకరాల పొలం ఉంది. ఆరు బోర్లు వేయగా, ఒక్కదాంట్లోనే నీరుపడింది. వరుస కరువుతో పొట్టగడవక నా ముగ్గురు కొడుకులు హైదరాబాద్‌కు వలస వెళ్లారు. ఎక్కడున్నారో కూడా తెలియదు. శరీరం సహకరించక చర్చి ప్రాంగణంలో కొబ్బరికాయలు, అగ్గిపెట్టెలు, అగర్బత్తీలు అమ్ముకుంటున్నా. - సంగం ఎల్లయ్య, బొగుడ భూపతిపూర్ -
సాగు బాగేనా?
సాధారణం కన్నా తక్కువ వర్షాలు విస్తీర్ణంలో సగం ఎండుముఖం అయోమయంలో రైతాంగం నర్సాపూర్: సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షాలు కురవడంతో సాధారణ సాగు విస్తీర్ణం కన్నా తక్కువ సాగు చేసినప్పటికీ సాగు చేసిన పంటలు ఎండు ముఖం పట్టాయి. వర్షాకాలం సీజన్లో మూడు నెలలు గడుస్తున్నా వర్షాల జాడ లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నందున రైతాంగంతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జూన్, జూలైలో అంతో ఇంతో వర్షాలు కురవడంతో ఆయా పంటలు సాగు చేయగా ప్రస్తుతం వర్షాలు కురవ నందున అన్ని రకాల పంటలు ఎండుముఖం పడుతున్నాయి. దీంతో పెట్టిన పెట్టుబడులు వృధా అయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు లేక వరి నాట్లు వేయకపోవడంతో నారుమళ్లు చాలా చోట్ల ఎండుతున్నాయి. కాగా మొక్కజొన్న ,జొన్న తదితర వర్షాధార పంటలు సైతం ఎండుతున్నాయి. నియజకవర్గంలో వర్షాలతో పాటు బోరు బావులపై ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తున్నారు. వర్షాలు లేక చెరవులు కుంటలు నిండక పోవడంతో ఆయకట్టు భూములు ఇప్పటికే బీడు భూములుగా మారాయి. కాగా బోరు బావుల కింద సాగు చేసినప్పటికీ బోర్ల నుంచి నీరు తక్కువగా రావడంతో ఆ పంటలు సైతం ఎండుముఖం పడుతున్నాయి. నర్సాపూర్ మండలంలో తక్కువ వర్షాలు తక్కువ సాగు మండలంలో జూన్ నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షాలు కురిశాయి. మొదట్లో వర్షాలు కురవడంతో చాలా చోట్ల వరి, మొక్కజొన్న, జొన్న కంది తదితర పంటలు సాగు చేశారు. కాగా వరి 2681హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణం కాగా 1112 హెక్టార్లు నాటు వేయగా మొక్కజొన్న సాధారణం కన్నా సుమారు మూడు వందల హెక్టార్లు ఎక్కువ విస్తీర్ణంలో విత్తనం వేశారు. కౌడిపల్లి మండలంలో అధ్వానం మండలంలో మూడు నెలల్లో 700మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతం ఉండగా 295 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవడంతో సాగు సైతం తక్కువగా నమోదైంది. మండలంలో వరి 4500 ఎకరాలలో సాగు చేయాల్సి ఉండగా 1200 ఎకరాల్లో మాత్రమే వేశారు. మొక్కజొన్న ఐదు ఎకరాలకు గాను 3125 ఎకరాల్లో వేయగా, కంది రెండు వేల ఎకరాలకుగాను 1550 ఎకరాల్లో, జొన్న మూడు వందల ఎకరాలకు గాను 150 ఎకరాల్లో సాగు చేశారు. కాగా సాధారణ సాగు విస్తీర్ణంలో సగానికి తక్కువ పంటలే సాగు చేయగా వర్షాలు లేక సాగు చేసిన పంట పొలాల్లో చాలా మటుకు ఎండు ముఖం పట్టడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెల్దుర్తి మండలంలో సగానికి సగం పంటలు ఎండిపోతున్నాయి. మండలంలో ఇప్పటి వరకు మూడు నెలల కాలంలో 635 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా 248 మిల్లీ మీటర్ల వర్షపాతమే కురిసింది. కాగా పంటలు సైతం సగానికి పైగా ఎండుముఖం పట్టాయి.మ ండలంలో వరి పంటను 2026 హెక్టార్లకు గాను 1280 హెక్టార్లలో మాత్రమేసాగు చేయగా అందులో 40 శాతం ఎండిందని తెలిసింది. కాగా మొక్కజొన్న 730 హెక్టార్లలో సాగు చేయగా అందులో సగం ఎండుముఖం పట్టిందని తెలిసింది. కొల్చారం మండలంలో సైతం సాగు అధ్వానంగా ఉంది. మండలంలో మూడు నెలల కాలంలో 620 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 329 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలంలో వరి, మొక్కజొన్న తదితర పంటలను 5700హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా 4748 హెక్టార్లలో సాగు చేసినప్పటికీ, సగం పంటలు ఎండిపోయాయి. హత్నూర మండలంలో సాధారణంలో సగమే.. మండలంలో సాధారణ వర్షపాతంలో సగం వర్షాలు కురిశాయి. జూన్ నెలలో 190 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 129 మిల్లీమీటర్లు. జూలై నెలలో 237కు గాను 171మి.మీ, ఆగస్టులో 221 మిల్లీమీటర్లకు గాను ఇప్పటి వరకు 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరి సుమారు 3480 హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా మండలంలో 1756 హెక్టార్లలో మాత్రమే నాట్లు వేయగా, మొక్కజొన్న పంటను 633 హెక్టార్లలో విత్తనం వేయాల్సి ఉండగా వర్షాలు తక్కువగా ఉన్నందున ఎక్కువ మంది రైతులు విత్తనం వేయడంతో 1086 హెక్టార్లలో విత్తనం వేసినట్లు నమోదైంది. శివ్వంపేట మండలంలో సైతం పరిస్థితులు అధ్వానంగానే ఉంది. -
కమ్ముకొస్తున్న కరువు మేఘాలు
ఎడారిలా ఘనపురం.. ఎండిపోతున్న వరి ఆందోళనలో రైతాంగం.. సింగూరు నీటిపై ఆశలు పాపన్నపేట: కార్తెలు కదిలిపోతున్నా.. వరుణుడి జాడ కనిపించడం లేదు. కనీస వర్షపాతం కూడా లేకపోవడంతో జల వనరులన్నీ మైదానాల్లా.. ఘనపురం ఎడారిలా మారింది. ఈక్రమంలో మంజీర మడుగులను చూసి వరినాట్లు వేసిన రైతన్నలు వాటిని దక్కించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. కన్నీళ్లను దిగమింగి.. వనజాడ కోసం ఎదురుచూస్తున్నారు. కనీస వర్షపాతం కరువే మెదక్ డివిజన్లో జూన్‌లో 2,614.4 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 2.525 మి.మీ మాత్రమే నమోదైంది. అదేవిధంగా జూలైలో 4,388.2 మి.మీ. కురవాల్సి ఉండగా 3,966.8 మి.మీ. మాత్రమే నమోదైంది. ఈక్రమంలో వేసవిలో రికార్డు స్థాయి ఎండలు నమోదవడంతో అడపాదడపా కురిసిన వర్షాలకు చెరువులు, కుంటల్లోకి నీళ్లు రాలేదు. ఎగువన కూడా వర్షాలు కురవకపోవడంతో ఘనపురం ప్రాజెక్టులోకి నీళ్లు రాలేదు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోయాయి. మడుగుల ఆధారంగా నాట్లు మెతుకు సీమ చుట్టూ మంజీరా నది ప్రవహిస్తుండటంతో అప్పుడప్పుడు కురిసిన వర్షాలకు మడుగుల్లో నీళ్లు చేరాయి. వీటిని నమ్ముకొని సుమారు 3 వేల ఎకరాల్లో రైతులు వరినాట్లు వేశారు. సుమారు 15 రోజుల పాటు మోటార్ల ద్వారా మడుగుల నుంచి నీటిని తోడి పంటలకు అందించారు. ప్రస్తుతం మడుగుల్లోనూ నీరు కనుమరుగవుతోంది. దీంతో రైతన్నల్లో ఆందోళన మొదలైంది. అప్పులు చేసి పంటలు వేశామని, అవి ఎండిపోతే పరిస్థితి ఏమిటని ఆవేదన చెందుతున్నారు. సింగూరు నీరే ఆధారం ప్రస్తుతం వరి పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొన్నందున సింగూరు నుంచి 0.3 టీఎంసీల నీరు వదలాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. సింగూరులో 6 టీఎంసీలకు పైగా నీరున్నందున ఒక్కసారి 0.3 టీఎంసీ నీరు వదిలితే 15 రోజుల వరకు నీళ్లు సరిపోతాయని వారు చెబుతున్నారు. -
‘పొట్ట’కొడుతోంది
ముఖం చాటేసిన వర్షాలు ఎండుతున్న పంటలు గింజవేసే దశలో వాడుతున్న కంకులు ఆందోళనలో రైతన్నలు మెదక్: రెండేళ్లుగా కరువుతో విలవిల్లాడిన రైతులు.. ఈసారైనా సాగు చేసుకుని కష్టాల నుంచి గట్టెక్కుదామనుకున్నా.. నిరాశే మిగులుతోంది.. ముందు మురిపించిన వర్షాలు ఆ తరువాత కనుమరుగు కావడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పంటలు సరిగ్గా పొట్ట పోసుకునే దశలో వర్షాలు లేకపోవడంతో ఎండు ముఖం పడుతున్నాయి. దీంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. వరుణుడు కరుణించకపోతే మా బతుకులు ఆగమేనని వారు వాపోతున్నారు. సగానికిపైగా బీడు భూములే కార్తెలన్నీ కరిగిపోతున్నాయి.. కరువు మేఘాలు కమ్ముకుంటున్నాయి. జిల్లాలో గడిచిన రెండున్నర నెలల వర్షాకాలంలో ఇప్పటి వరకు సగమే వర్షపాతం నమోదు కావడంతో చెరువు, కుంటల్లోకి చుక్కనీరు రాలేదు. ఇప్పటి వరకు రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, అశ్లేష, ప్రస్తుతం మఖ కార్తె కూడా కరిగిపోతోంది. జూన్‌లో 170 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 190 నమోదైంది. జూలైలో 370 మి.మీ. గానూ 340 మి.మీ. నమోదైంది. ఆగస్టు మాసంలో 370కి గానూ ఇప్పటి వరకు కేవలం 27మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. రెండున్నర నెలలుగా.. 910 మిల్లీమీటర్ల వర్షపాతానికిగానూ కేవలం 557 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. ఈ లెక్కన 353 మిల్లి మీటర్ల వర్షపాతం తక్కువగా నమోదైంది. తక్కువ వర్షపాతం నమోదు కావడంతో నీటి వనరులైన చెరువు, కుంటల్లోకి ఏమాత్రం నీరు చేరలేదు. దీంతో ఆయకట్టు భూములన్నీ బీళ్లుగానే దర్శనమిస్తున్నాయి. అలాగే నియోజకవర్గంలోని ఘణపురం ప్రాజెక్ట్‌లోకి నీరురాకపోవడంతో 21వేల ఆయకట్టు భూమి బీడుగానే ఉంది. బోరుబావుల ఆధారంగా సాగుచేసిన వరిపంటలు సైతం ఎండుముఖం పడుతున్నాయి. ఆరుతడి పంటలైన కందులు, పెసర్లు, జొన్నలు వంటి పంటలు సైతం ఎండుముఖం పడుతున్నాయి. మూడు ఎకరాల్లో వరి ఎండింది మూడెకరాల పొలంలో రెండు బోర్లు వేశాను. ముందుగా వర్షాకాల సీజన్ ప్రారంభంలో వర్షాలు కురవడంతో రూ.40వేల అప్పు చేసి సాగుచేశాను.వర్షాలు లేక బోరుబావుల్లో నీటి మట్టం పెరగలేదు. దీంతో వేసిన పంట ఎండిపోతోంది. - పాపన్నగారి కిష్టారెడ్డి, బ్యాతోల్ దిక్కుతోచడంలేదు నాలుగు ఎకరాలలో రెండు బోర్లు ఉన్నాయి. వాటి ఆధారంగా సుమారు రూ.80వేల అప్పు చేసి వరిపంట సాగుచేశాను. వర్షాలు లేక బోరుబావుల్లో నీటి మట్టం తగ్గిపోయింది. వేసిన పంట ఎండిపోతోంది. దీనికితోడు పురుగు తగిలింది. ఏం చేయాలో తోచడంలేదు. - కెతావత్రవి, బ్యాతోల్ తండా. -
చినుకు జాడేది?
ఖరీఫ్ ప్రారంభమైనా భారీ వర్షాలు కరువు ‘బోరు’మంటున్న జిల్లాలో బావులు ‘ఆరుతడి’ సాగుకే పరిమితమవుతున్న రైతన్నలు ఖాళీగానే దర్శనమిస్తున్న నీటి వనరులు మెదక్/మెదక్ రూరల్: ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు కావొస్తున్నా జిల్లాలో నేటికి భారీ వర్షాలే లేవు. అడపా దడపా కురుస్తున్న వర్షాలతో ఆరుతడి పంటలైన మొక్కజొన్న, కంది, జొన్న, కూరగాయల పంటలను మాత్రమే రైతులు సాగుచేశారు. వర్షాలు అనుకున్న స్థాయిలో కురియక పోవడంతో చెరువులు, కుంటలతోపాటు జిల్లాలోని సింగూర్, ఘనపురం ప్రాజెక్ట్, రాయిన్‌పల్లి తదితర మధ్యతరహా ప్రాజెక్టుల్లోకి కొద్దిపాటి నీరు మాత్రమే చేరింది. గత రెండేళ్లుగా కరువు పరిస్థితులు నెలకొనడంతో బోరుబావులు పూర్తిగా అడుగంటిపోయాయి. దీంతో వేలాది బోర్లు మూలన పడ్డాయి. భారీ వర్షాలు కురిసి చెరువులు, కుంటల్లో నీరు చేరితే బోరు బావుల్లో నీటి ఊటలు పెరిగేవి. దీంతో జిల్లాలో తక్కువ స్థాయిలోనైనా బోర్ల ఆధారంగా రైతులు వరిపంటలు సాగుచేస్తున్నారు. మిగతా రైతులంతా ఆరుతడి పంటలతో సరిపెడుతున్నారు. జిల్లాలో ప్రధాన పంట వరిసాగే. గడిచిన రెండేళ్లలో కరువు పరిస్థితుల వల్ల రైతులు ఎలాంటి పంటలు సాగుచేయలేదు. ఈయేడు వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని గంపెడాశతో అన్నదాతలు బోరుబావుల వద్ద, చెరువులు,కుంటల వద్ద నార్లు పోసి, దుక్కులు దున్ని సాగుకు సిద్ధమయ్యారు. కాని భారీ వర్షాలు లేకపోవడంతో అన్నదాతల ఆశలు ఆవిరై పోతున్నాయి. ఆగస్టు మాసంలోనైనా భారీ వర్షాలు కురిసి చెరువులు, కుంటల్లోకి నీరు వస్తే పంటలు బాగాపండి తమ కష్టాలు తీరుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బోర్లలో నీళ్లు లేవు వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా భారీ వర్షాల జాడేలేదు. ఏడాదిగా నా పొలంలోని రెండు బోర్లలో నీటి ఊటలు ఏ మాత్రం పెరగలేదు. దీంతో మూడెకరాల్లో మొక్కజొన్నే వేసుకున్నా. - నీల్యా, గిరిజన రైతు, ఔరంగాబాద్ తండా రూ.20వేలు అప్పుచేశా రెండేళ్లుగా వర్షాలు లేక పంటలు వేయలేదు. ఈసారి వర్షాలు బాగా కురుస్తాయన్న ఆశతో అప్పు చేసి ఎకరన్నర పొలంలో వరి పంట సాగుచేశా. వర్షాలు కురవకపోవడంతో పంట మొలకదశలోనే ఎండిపోయింది. గతంలోనే రూ.2లక్షల అప్పులున్నాయి. ఈసారి సాగుకోసం చేసిన అప్పులు మీదపడేలా ఉన్నాయి. - సిద్దమ్మ, మహిళా రైతు, బ్యాతోల్ మొలక దశలో ఎండుతున్నాయి వర్షాలు పడతాయన్న ధైర్యంతో అప్పు చేసి పంటలు వేశాం. కాని వర్షాలే పడలేదు. మూడెకరాల వ్యవసాయభూమి ఉండగా రెండెకరాల్లో వరి పంట వేశా. వర్షాలు లేకపోవడంతో బోరుబావిలో నీటి ఊటలు పెరగలేదు. వరినాట్లు వేసేందుకు రూ.30వేల అప్పులయ్యాయి. - కెతావత్శ్రీను, రైతు, బ్యాతోల్ తండా వర్షాలు లేక కూలీకి వెళ్తున్నా నాకు రెండెకరాల వ్యవసాయ పొలం ఉంది. సరైన వర్షాలు లేక ఎలాంటి పంటలు సాగుచేయలేదు. దీంతో పూట గడవటమే కష్టంగా మారింది. చేసేది లేక నిత్యం కూలి పనులకు వెళ్తున్నా.. ఈసారైనా వరుణదేవుడు కరుణిస్తాడనుకుంటే సరైన వర్షాలు కురియక పోవడంతో కూలిగా మారాల్సి వచ్చింది. - వీరమణి, బ్యాతోల్ -
కొలమానాలే కొంపముంచాయి
నిబంధనల వల్లే తగ్గిన కరువు మండలాల సంఖ్య రాష్ట్రంలో 217 మండలాల్లో వర్షాభావం వాస్తవ పరిస్థితిని వివరించిన కలెక్టర్లు సాగు విస్తీర్ణం, ఎన్‌డీవీఐ, ఎన్‌డీడబ్ల్యూఐ అంచనాల వల్లే సమస్య వాస్తవాలను పక్కనపెట్టి కరువును నిర్ధారించిన సర్కారు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు మండలాల నిర్ధారణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం 66 మండలాల్లోనే కరువు ఉన్నట్లు తేల్చడం వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉందన్న చర్చ జరుగుతోంది. అయితే కలెక్టర్లు జిల్లాల్లో వాస్తవ పరిస్థితులను సర్కారుకు నివేదించారు. వర్షాభావం, వర్షానికి వర్షానికి మధ్య అంతరం (డ్రైస్పెల్), తగ్గిన సాగు విస్తీర్ణం ఆధారంగా వేర్వేరు కేటగిరీల్లో మండలాల సంఖ్యను పేర్కొన్నారు. ఖరీఫ్ పంటల దిగుబడి ఇంకా రానందున ఆ అంశాన్ని వదిలేశారు. కానీ కలెక్టర్లు పంపిన ఈ వివరాలకు సర్కారు నిబంధనలను జోడించడంతో కరువు మండలాల ప్రకటన పక్కదారి పట్టింది. కరువు మండలాల సంఖ్య అత్యల్పంగా 66కే పరిమితమైంది. వాస్తవాలు పక్కదారి: కలెక్టర్లు పంపించిన నివేదికల ప్రకారం రాష్ట్రంలో వర్షాభావ మండలాలు 217 ఉన్నాయి. డ్రైస్పెల్ ఉన్న మండలాలు 152 ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధికంగా 42 డ్రైస్పెల్ మండలాలున్నాయని ఆ జిల్లా కలెక్టర్ నివేదించారు. సాగు విసీర్ణం 50% కంటే తగ్గిన మండలాలు రాష్ట్రంలో కేవలం 31 ఉన్నట్లుగా కలెక్టర్ల నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదే కొంప ముంచింది. వాస్తవంగా జూన్‌లో వర్షాలు విస్తారంగా కురవడంతో పెద్ద ఎత్తున పంటల సాగు ప్రారంభమైంది. మొత్తంగా ఖరీఫ్‌లో 86% సాగు జరిగింది. పత్తి 104%, సోయాబీన్ 142% జరి గింది. దీంతో 50% కన్నా సాగు విస్తీర్ణం తగ్గిన మండలాలు 31 మాత్రమే నమోదయ్యాయి. కరువు మండలాల ప్రకటనకు ఇదే ప్రధాన అడ్డంకిగా మారింది. వీటితో పాటు జయశంకర్ వ్యవసాయ వర్సిటీ 269 మండలాల్లో కరువు ఉన్నట్లుగా చెప్పి నా.. అందులో తీవ్రతను బట్టి 73 మండలాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. మరోవైపు నార్మలైజ్డ్ డిఫరెన్స్ వెజిటేషన్ ఇండెక్స్ (ఎన్‌డీవీఐ), నార్మలైజ్డ్ డిఫరెన్స్ వాటర్ ఇండెక్స్ (ఎన్డీడబ్ల్యుఐ)ల ప్రకారం రాష్ట్రంలో కరువు మండలాలను తక్కువగా చూపింది. కలెక్టర్లు పంపిన మూడు అంశాలతోపాటు వ్యవసాయ వర్సిటీ, ఎన్‌డీవీఐ, ఎన్డీడబ్ల్యుఐల అంచనాలను కలిపి పరిశీలించారు. దీంతో కరువు మండలాల సంఖ్య భారీగా తగ్గిపోయింది. వ్యవసాయ వర్సిటీ, ఎన్‌డీవీఐ, ఎన్డీడబ్ల్యుఐలను పక్కన పెడితే కరువు మండలాల సంఖ్య ఎక్కువగా ఉండేదని చెబుతున్నారు. ఒకవేళ సాగు విస్తీర్ణంపరంగా చూసినా... జూలై, ఆగస్టు నెలల్లో వర్షాభావంతో పంటలన్నీ సగానికిపైగా ఎండిపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోనైతే నూటికి నూరు శాతం దెబ్బతిన్నాయి. దీనిని బట్టి సాగు విస్తీర్ణం వంటి సాంకేతిక అంశాలు కాకుండా వాస్తవ పరిస్థితిని బట్టి కరువు అంచనా వేస్తే బాగుండేది. కానీ సర్కారు నిబంధనల సాకుతో వాస్తవాలను మరుగున పెట్టిందన్న ఆరోపణలు వస్తున్నాయి. -
అక్కడ జోరువాన.. ఇక్కడ జీరోవాన
హైదరాబాద్ నగరంలో వర్షం అంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక ప్రాంతంలో వర్షం విపరీతంగా పడితే.. ఆ పక్కనే ఉన్న ప్రాంతంలో ఒక్క చినుకు కూడా ఉండదు. అలాంటి విచిత్ర పరిస్థితే తాజాగా కనిపించింది. దిల్సుఖ్ నగర్ నుంచి వనస్థలిపురం వరకు విపరీతంగా వర్షం కురిసింది. రోడ్ల మీద నీళ్లు బాగా నిలిచిపోయాయి. పాదచారులతో పాటు వాహనచోదకులు కూడా బాగా ఇబ్బందిపడ్డారు. అయితే, వనస్థలిపురానికి పక్కనే ఉండే హయత్‌నగర్ ప్రాంతంలో మాత్రం అసలు వర్షమన్నదే కనిపించలేదు. విపరీతంగా మబ్బుపట్టి, ఏ క్షణంలో వర్షం పడిపోతుందో అన్నట్లు అనిపించింది. కానీ, పేరుకు ఒకటి రెండు చినుకులు పడి.. కామ్‌గా ఊరుకుంది. దాంతో, మంచి వర్షం పడుతుందని ఆశించిన వాళ్లంతా నిరాశకు గురయ్యారు. బయటకు వచ్చి చూస్తే, కూతవేటు దూరంలో మొత్తం కుంభవృష్టి. అలాగే నాగారం ప్రాంతంలో విపరీతంగా వర్షం పడింది, ఆ పక్కనే ఉన్న చర్లపల్లిలో మాత్రం ఒక్క చుక్క కూడా వాన పడలేదు. అదీ హైదరాబాద్‌లో పరిస్థితి. -
'వారం రోజుల్లో వర్షం రాకపోతే దుర్భిక్షమే'
బి.కొత్తకోట (చిత్తూరు) : వారం రోజుల్లో కనీసం 10 మిల్లీ మీటర్ల వర్షం పడకపోతే రైతులు పెట్టిన పెట్టుబడులు బూడిదలో పోసిన పన్నీరు అయి.. తీవ్ర దుర్భిక్షం తాండవ మాడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. తిరుపతి వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు గురువారం బి.కొత్తకోటలోని వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా.. గ్రామంలో వేసిన వేరుశెనగ పంటను పరిశీలించి మరో వారం రోజుల్లో మొక్కలకు నీరు అందకపోతే వేరు నిర్జీవమైపోతుందని సూచించారు.