ఒక్క ఎకరా పండితే ఒట్టు..! | Black Gram Farmers Are Problems Facing In Prakasam | Sakshi
Sakshi News home page

ఒక్క ఎకరా పండితే ఒట్టు..!

Published Thu, Mar 14 2019 1:21 PM | Last Updated on Thu, Mar 14 2019 1:21 PM

Black Gram Farmers Are Problems Facing In Prakasam - Sakshi

సాక్షి, కొత్తపట్నం (ప్రకాశం​): భూమాత ఘోషిస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో విత్తన విత్తు భూమిలోనే ఎండిపోయింది. పైకి అరకొరగా వచ్చిన మొక్కలు ఎదుగులేక చతికిలబడిపోతున్నాయి. ఫలితంగా మండలంలో వేల ఎకరాల్లో శనగ రైతులు కోట్లలో నష్టాన్ని మూటగట్టుకున్నారు. ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నామని, కానీ ఇలాంటి గడ్డు పరిస్థితి ఎప్పుడూ తాము చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఒక్క గింజ కూడా రైతులు చేతికి రాలేదు. ఎన్నో ఆశలతో ఎంతో వ్యయప్రయాసలకోర్చి వేలకు వేలకు పెట్టుబడులు పెట్టిన రైతులకు ఒక్క రూపాయి కూడా చేతికి రాలేదంటే రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

భూతాపం..రైతులకు శాపం..
మండలంలో ఎక్కువగా సాగయ్యే పంటల్లో శనగ ఒకటి. ఇక్కడి ఇసుక భూముల్లో శనగ పంట వేలాది ఎకరాల్లో సాగు చేశారు. మండల పరిధిలోని ఆలూరు, గాదెపాలెం, కొత్తపట్నం, అల్లూరు, గవళ్లపాలెం, చింతల, రాజుపాలెం, ఈతముక్కల, మడనూరు, సంకువానికుంట గ్రామాల్లో సుమారు 8250 ఎకరాల్లో ఈ ఏడాది శనగ సాగు చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నా రైతులు ఎంతో సాహసం చేసి ఎన్నో వ్యయప్రయాసలకొర్చి శనగ సాగు చేశారు. ఎకరాకు శనగ సాగుకు దుక్కి దున్నడం, విత్తనాలు ఎదపెట్టడం, ఎరువులు, కూలీ..ఇలా మొత్తం రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఖర్చయింది. కౌలు రైతులకు కౌలు అదనపు ఖర్చు. అయితే పంట వేసిన నాటి నుంచి ఒక్క చినుకు వర్షం కూడా కురవకపోవడంతో మండలంలోని కొన్ని ప్రాంతాల్లో మొక్క కూడా బయటకు రాలేదు. అరకొరగా వచ్చిన మొక్క సైతం నీటి తడులు లేక ఎదుగుదల నిలిచిపోయింది. దీంతో రైతులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పంటను పశువులకు మేతగా వదిలేశారు. 8 వేల ఎకరాల్లో శనగ సాగు చేస్తే కనీసం ఒక్క గింజ కూడా చేతికి రాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క మండలంలోనే రైతులకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.   

పరిహారం ఎక్కడ..?
పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి వ్యవసాయాధికారులు పొలాలకు వెళ్లి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. కానీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రైతులకు నష్టపరిహారం విడుదల కాలేదు. దీంతో ప్రభుత్వం తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేల ఎకరాల్లో పంట నష్టపోయి మండలంలో కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లినా మా గురించి పట్టించుకునే వారే కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నామని, కానీ గింజ కూడా చేతికి రాకుండా లేనంతగా ఎప్పుడూ లేదని, ఇలాంటి గడ్డు పరిస్థితులను తామెప్పుడూ చూడలేదని రైతులు పేర్కొంటున్నారు.

బీమా అయినా వస్తుందా..?
మండలంలోని 8 వేల ఎకరాల్లో శనగ సాగు చేసిన రైతుల్లో కొంత మంది బీమా కోసం ఎకరాకు రూ.330 ప్రీమియం చెల్లించారు. ఫసల్‌ బీమా పథకం కి,ద పంటనష్టం వాటిల్లితే ఎకరాకు రూ.22 వేల వరకు రైతులకు చెల్లించాల్సి ఉంది. అయితే ఇంత వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. అసలు వస్తుందో రాదో కూడా అర్థం కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వ్యవసాయాధికారి సుచిరితను వివరణ కోరగా.. మండలంలో సాగు చేసిన శనగ పంట పూర్తిగా నష్టపోయింది వాస్తవమేనన్నారు. కమిషనర్‌ ఆదేశాల మేరకు నష్టపోయిన పంట జాబితాను సిద్ధం చేసి పంపించామని తెలిపారు. ఫసల్‌ బీమా కింద ప్రీమియ, చెల్లించిన రైతులకు బీమా నగదు చెల్లించేలా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

గింజ కూడా చేతికి రాలేదు
నాలుగు ఎకరాల్లో శనగ సాగు చేశాను. మొత్తం రూ.50 వేల వరకు ఖర్చయింది. వేసిన పంట వేసినట్లే ఎండిపోయింది. గింజ కూడా చేతికి రాని పరిస్థితి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అధికారులన్నా గుర్తించి శనగ రైతులను ఆదుకోవాలి.
- రాము, అల్లూరు

అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు
వ్యవసాయం మానేసి కూలి పనులకు వెళ్లడం మేలనిపిస్తుంది. వేలకు వేలు ఖర్చు చేస్తే రూపాయికి కూడా చేతికి రాలేదు. పంట మొత్తం పూర్తిగా నష్టపోయా. పంటల కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు. అధికారులు స్పందించి నష్టపరిహార, చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.
- చిరుతోటి విద్యాసాగర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement