Peanut farmers
-
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ప్రకాశం జిల్లా శనగలు
జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన శనగ రైతులకు ఒక అద్భుత అవకాశం తలుపు తట్టింది. సాక్షాత్తూ కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూ తయారీ కోసం జిల్లాలో పండించిన జేజీ–11 రకం శనగలు కొనుగోలు చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకొచ్చింది. అలాగే సేద్యానికి అవసరమైన సాయాన్ని కూడా టీటీడీ అందించనుంది. శ్రీవారి సేవ చేసేందుకు అవకాశం కలగడం మహద్భాగ్యంగా రైతులు భావిస్తున్నారు. సాక్షి, ఒంగోలు: ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు మంచి అవకాశాలు వస్తున్నాయి. రసాయన ఎరువులు, పురుగు మందులు లేకుండా ఇంటిల్లిపాది కష్టపడి పంటలను పండించి అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన పంటలు పండిస్తున్నారు. ఈ విధానంలో సాగుచేసిన శనగలు గొనుగోలు చేసేందుకు తిరుమల, తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముందుకొచ్చింది. జిల్లాలో దాదాపు 1026 టన్నుల జేజీ–11 శనగలు కొనేందుకు అంగీకరించింది. దీంతో జిల్లాలో పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం(జెడ్బీఎన్ఎఫ్)కు చెందిన అధికారులతో టీటీడీ అధికారులు సమావేశమయ్యారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు సంబంధించిన వివరాలు తీసుకున్నారు. జిల్లాలో మొత్తం ఏడు వేల మంది ప్రకృతి వ్యవసాయం చేసే రైతులున్నారు. అందులో టీటీడీ నిబంధనల మేరకు సాగు చేసిన శనగ రైతులను ఎంపిక చేసుకున్నారు. బోడవాడలో శనగల నాణ్యతను పరిశీలిస్తున్న జెడ్బీఎన్ఎఫ్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వి.సుభాషిణి చదవండి: (టీడీపీతో బీజేపీ పొత్తుపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు) ఇది మొదటి సంవత్సరం కావడంతో దీనిపై రైతులకు పెద్దగా అవగాహన లేదు. మొదటి విడతగా జిల్లాలోని 377 మంది రైతులు టీటీడీకి శనగలు (ఎర్ర శనగలు) ఇచ్చేందుకు అంగీకరించారు. వీరి దగ్గర నుంచి 1026 టన్నుల శనగలు కొనేందుకు మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపారు. శనగ పంట సాగు చేయటానికి రైతులు అవలంబించిన పద్ధతులు, పక్క పొలాల్లో పిచికారీ చేసే రసాయన ఎరువులు, పురుగు మందులు ప్రకృతి వ్యవసాయం చేసే పొలంలోకి రాకుండా తీసుకున్న జాగ్రత్తలు వీటన్నింటినీ పరిశీలించిన తరువాతనే కొనుగోలుకు ముందుకొచ్చారు. అందుకుగాను సెంటర్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్(సీఎస్ఏ), ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థలను టీటీడీ రంగంలోకి దించింది. శాస్త్రీయంగా పరీక్షలు నిర్వహించిన తరువాతనే కొనుగోలు చేయటానికి నిర్ణయం తీసుకున్నారు. చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో రైతులకు ఇచ్చిన ఆవులు, ఎద్దులు మద్దతు ధరకంటే పది శాతం అదనపు ధర.. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన శనగలకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకంటే పది శాతం అధికంగా ఇచ్చి కొనుగోలు చేయటానికి టీటీడీ అంగీకరించింది. ప్రస్తుతం ఎంఎస్పీ ప్రకారం క్వింటా శనగలు రూ.5,230 మద్దతు ధర ఉంది. దీనికి పది శాతం అదనంగా ఇచ్చి కొనుగోలు చేయటానికి నిర్ణయించింది. అంటే క్వింటా శనగలు రూ.5,753 రైతుకు దక్కనుంది. జిల్లాలో మొత్తం 49 ఆర్బీకేల పరిధిలో 19 మండలాల్లో పండించిన శనగలు కొనుగోలు చేయటానికి సిద్ధం చేశారు. జిల్లాలోని యర్రగొండపాలెం, మార్టూరు, పర్చూరు, ఇంకొల్లు, కారంచేడు, చినగంజాం, జే.పంగులూరు, కొరిశపాడు, అద్దంకి, నాగులుప్పలపాడు, మద్దిపాడు, ఒంగోలు, వలేటివారిపాలెం, చీమకుర్తి, ఎస్‌ఎన్‌పాడు, కనిగిరి, తర్లుపాడు, కొత్తపట్నం, ముండ్లమూరు మండలాల్లోని గ్రామాల్లో పండిన శనగలు కొనుగోలు చేయనున్నారు. ఉచితంగా ఆవులు, ఎడ్లు.. ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు సాగు చేస్తున్న రైతులకు టీటీడీ ఉచితంగా ఆవులు, సేద్యానికి జత ఎద్దులు అందిస్తోంది. ప్రకృతి వ్యవసాయానికి ఆవులు, ఎద్దుల మూత్రం, పేడ ఎంతో అవసరం. ఘన జీవామృతం, ద్రవ జీవామృతంతో పాటు పలురకాల కషాయాల ద్వారా పంటల్లో చీడ పీడలు, వ్యాధులను నివారించవచ్చు. అందుకోసం టీటీడీ జిల్లాలోని రైతులకు ఉచితంగా రవాణా ఖర్చులు భరించి మరీ రైతులకు అందజేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 247 ఆవులు కావాలని రైతులు కోరారు. అయితే ఇప్పటి వరకు 124 ఆవులను ఇచ్చారు. 26 జతలు ఎడ్లు కూడా ఇచ్చారు. ఒక్కో రైతుకు ఒక ఆవు కానీ లేదా, జత ఎడ్లుకానీ ఉచితంగా అందిస్తున్నారు. శనగ రైతులకు మంచి అవకాశం టీటీడీ ముందుకొచ్చి ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసిన జేజీ–11 రకం శనగలు కొనుగోలు చేయటం రైతులకు మంచి అవకాశం. జిల్లాలో ప్రతి సంవత్సరం ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు ఆసక్తిని పెంచుకుంటున్నారు. దీంతో టీటీడీ లాంటి ప్రముఖ అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన దేవస్థానం లడ్డూ తయారీకి కొనుగోలు చేయటం రైతులు ఎంతో అదృష్టంగా భావిస్తున్నారు. మొదటి సంవత్సరం కాబట్టి కొంతమంది మాత్రమే ముందుకు వచ్చారు. వచ్చే ఏడాది నుంచి ఇంకా ఎక్కువ మంది రైతులు ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ధర కూడా పది శాతం అదనంగా ఇస్తున్నారు. గోవులు, ఎడ్లు ఉచితంగా ఇవ్వటంతో రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. - వి.సుభాషిణి, జిల్లా ప్రాజెక్టు మేనేజర్, జెడ్బీఎన్ఎఫ్ -
శుభవార్త చెప్పిన మంత్రి కన్నబాబు
సాక్షి, కాకినాడ : రాష్ష్ర్టంలో రైతు భరోసా కేంద్రాలు ఒక విప్లవాత్మకమైన వ్యవస్థగా మారనున్నాయని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనల నుంచే ఈ రైతు భరోసా వ్యవస్థ పుట్టిందని, పక్కనున్న పొరుగు రాష్ట్రాలు కూడా పని తీరుపై ఆరా తీయడం గొప్ప విషమమని పేర్కొన్నారు. జాతీయ స్థాయి వ్యవసాయశాఖలో ఉన్న అధికారులు, కొన్ని కేంద్ర సంస్థలు రైత భరోసా కేంద్రాలను అభినందించినట్లు తెలిపారు. వచ్చే ఖరీఫ్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల రైతు భరోసా కేంద్రాలు వస్తాయి. ఏజెన్సీలో ఉన్న మండలాల్లో రెండో దశలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. (‘గతంలో జరిగిన అక్రమాలకు బాబు సమాధానం చెప్పాలి’) వ్యవసాయ అనుబంధ శాఖల మధ్య అనుసంధానం, సమన్వయం ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీని కోసం జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా, వ్యవసాయ శాఖ జెడి కన్వీనర్‌గా జెసీతో పాటుగా అన్ని శాఖల అధికారులు సభ్యులుగా ఒక కమిటీ నియమించామని పేర్కొన్నారు. దీని వల్ల క్షేత్ర స్దాయిలో రైతుకు అవసరమైన నాణ్యమైన సేవలు అందుతాయని భావిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర స్ధాయిలో కూడా ఒక కమిటీని కూడా నియమించామని, దీనికి వ్యవసాయ శాఖ ప్రత్యేక సీఎస్ చైర్మన్ గా ఉంటారని కన్నబాబు తెలిపారు. (ప్రజల దృష్టి మళ్లించేందుకే.. ఆ యాత్ర) కంది, శనగ రైతులకు శుభవార్త ఈ సందర్భంగా కంది, శనగ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు శుభవార్త చెప్పారు. ఈ-కర్షక్ నమోదు లేకపోయినా కందులు, శెనగలను రైతుల నుంచి కొనుగోలు చేయాలని మార్క్ ఫెడ్ ను ఆదేశించామన్నారు. రాష్ట్రంలో మార్క్ ఫెడ్ ద్వారా 98 కందుల కొనుగోలు కేంద్రాలు, 100 శెనగల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, గతంలో ఈ పంటలు ఈ-కర్షక్‌లో నమోదు అయితే కాని కొనుగోలు చేసేవారు కాదన్నారు. కాగా ఆ అవసరం లేకుండానే కందులు, శెనగల ఉత్పత్తులను ఆఫ్‌లైన్ ద్వారా కొనుగోలుకు అనుమతిస్తామని, కాకపోతే సంబందిత వ్యవసాయ శాఖ అధికారి నుంచి రైతులు లెటర్ తీసుకురావల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు మార్క్ ఫ్రెడ్ కొనుగోలు కేంద్రాల నుంచి 1లక్షా 95 వేల క్వింటాళ్ళు కందులు, 5 లక్షల 79,329 క్వింటాళ్ళు శెనగలు కొనుగోలు చేశామన్నారు. రైతు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా పలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కన్నబాబు వెల్లడించారు. -
శనగ రైతుకు సాయం
సాక్షి, అమరావతి: ఎన్నికల సమయంలో అన్నదాతలకు ఇచ్చిన హామీకి కట్టుబడుతూ శనగ రైతులకు క్వింటాల్‌కు రూ.1,500 చొప్పున నగదు సాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఒక్కో శనగ రైతుకు గరిష్టంగా రూ.45 వేల వరకు నగదు సాయం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఇందుకోసం రూ.333 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిర్ణయంతో దాదాపు 75 వేల మంది రైతులకు మేలు చేకూరనుంది. సోమవారం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో రైతు దినోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో శనగ రైతులకు నగదు అందచేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించనున్నారు. రుణాలు చెల్లించాలంటూ రైతులకు బ్యాంకుల నోటీసులు రాయలసీమలోని కర్నూలు, వైఎస్సార్, అనంతపురం జిల్లాలతోపాటు దక్షిణ కోస్తాలోని ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రైతులు ప్రధానంగా శనగ సాగు చేస్తున్నారు. టీడీపీ హయాంలో కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఈ పంట సాగువైపు మొగ్గు చూశారు. దీంతో సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2016–17లో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం నాలుగు లక్షల హెక్టార్లు కాగా 2018–19లో 4.78 లక్షల హెక్టార్లకు పెరిగింది. రబీలో పండించే శనగలకు కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.4,620 చొప్పున కనీస మద్దతు ధర ప్రకటించింది. అయితే ఇది గిట్టుబాటు కాకపోవడంతో పలువురు రైతులు పంటను కోల్డు స్టోరేజీల్లో నిల్వ చేసుకుని బ్యాంకు రుణం తీసుకున్నారు. అయితే గిరాకీ లేదంటూ వ్యాపారులు పంట కొనుగోలు చేసేందుకు ముందుకు రావట్లేదు. మరోవైపు రుణాలు చెల్లించాలంటూ బ్యాంకర్లు రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం కోసం శనగ రైతులు నెల రోజుల నుంచి ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి సానుకూల నిర్ణయాన్ని ప్రకటించడం పట్ల అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. రూ.333 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో దాదాపు 59 లక్షల క్వింటాళ్ల శనగలు కోల్డు స్టోరేజీల్లో, 10 లక్షల క్వింటాళ్లు రైతుల వద్ద నిల్వ ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నిల్వలను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం రూ.333 కోట్లను విడుదల చేసింది. నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు క్వింటాల్‌కు రూ.1,500 చొప్పున నగదు అందచేయనుంది. ఒక్కో రైతుకు ఎకరాకు గరిష్టంగా 6 క్వింటాళ్ల చొప్పున ఐదు ఎకరాల వరకు లేదా 30 క్వింటాళ్లకు ఈ నగదును ఆందచేస్తారు. ఫలితంగా ఒక్కో రైతుకు రూ.45 వేలు చొప్పున లబ్ధి చేకూరనుంది. ఈ–క్రాపింగ్ ద్వారా రైతుల వివరాల సేకరణ కోల్టు స్టోరేజీ ప్లాంట్లలో నిల్వ చేసిన రైతులు 75 వేల మంది వరకు ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం నుంచి ఆర్ధికసాయం అందనుంది. రైతు దినోత్సవం సందర్భంగా ఈనెల 8వ తేదీన వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో శనగ రైతులకు నగదు చెల్లింపు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో రైతులందరికీ నగదు అందించేలా వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు ఏర్పాట్లు ప్రారంభించాయి. గిడ్డంగుల్లో పంట నిల్వ చేసిన రైతుల వివరాలు, పంట సాగు చేసిన అన్నదాతల వివరాలను ఈ–క్రాపింగ్ ద్వారా గుర్తించి నగదు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి వై.మధుసూధనరెడ్డి తెలిపారు. ఇతర రాష్ట్రాల వ్యాపారులు కొందరు ఇక్కడి రైతుల నుంచి శనగలు కొనుగోలు చేసి వారి పేరుతో కోల్డు స్టోరేజీల్లో నిల్వ చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని, అనర్హులకు నగదు సాయం అందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులకు అన్ని రకాలుగా భరోసా కల్పిస్తాం. ప్రకృతి వైపరీత్యాల సమయంలో పంట నష్టపోయిన వారిని ఆదుకుంటాం. ఆరుగాలం శ్రమించి పంట పండించిన అన్నదాతలను ధరల స్ధిరీకరణ నిధితో ఆదుకుంటాం – ఎన్నికల సమయంలో రైతులకు వైఎస్ జగన్ హామీ -
ఒక్క ఎకరా పండితే ఒట్టు..!
సాక్షి, కొత్తపట్నం (ప్రకాశం): భూమాత ఘోషిస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో విత్తన విత్తు భూమిలోనే ఎండిపోయింది. పైకి అరకొరగా వచ్చిన మొక్కలు ఎదుగులేక చతికిలబడిపోతున్నాయి. ఫలితంగా మండలంలో వేల ఎకరాల్లో శనగ రైతులు కోట్లలో నష్టాన్ని మూటగట్టుకున్నారు. ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నామని, కానీ ఇలాంటి గడ్డు పరిస్థితి ఎప్పుడూ తాము చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఒక్క గింజ కూడా రైతులు చేతికి రాలేదు. ఎన్నో ఆశలతో ఎంతో వ్యయప్రయాసలకోర్చి వేలకు వేలకు పెట్టుబడులు పెట్టిన రైతులకు ఒక్క రూపాయి కూడా చేతికి రాలేదంటే రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. భూతాపం..రైతులకు శాపం.. మండలంలో ఎక్కువగా సాగయ్యే పంటల్లో శనగ ఒకటి. ఇక్కడి ఇసుక భూముల్లో శనగ పంట వేలాది ఎకరాల్లో సాగు చేశారు. మండల పరిధిలోని ఆలూరు, గాదెపాలెం, కొత్తపట్నం, అల్లూరు, గవళ్లపాలెం, చింతల, రాజుపాలెం, ఈతముక్కల, మడనూరు, సంకువానికుంట గ్రామాల్లో సుమారు 8250 ఎకరాల్లో ఈ ఏడాది శనగ సాగు చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నా రైతులు ఎంతో సాహసం చేసి ఎన్నో వ్యయప్రయాసలకొర్చి శనగ సాగు చేశారు. ఎకరాకు శనగ సాగుకు దుక్కి దున్నడం, విత్తనాలు ఎదపెట్టడం, ఎరువులు, కూలీ..ఇలా మొత్తం రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఖర్చయింది. కౌలు రైతులకు కౌలు అదనపు ఖర్చు. అయితే పంట వేసిన నాటి నుంచి ఒక్క చినుకు వర్షం కూడా కురవకపోవడంతో మండలంలోని కొన్ని ప్రాంతాల్లో మొక్క కూడా బయటకు రాలేదు. అరకొరగా వచ్చిన మొక్క సైతం నీటి తడులు లేక ఎదుగుదల నిలిచిపోయింది. దీంతో రైతులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పంటను పశువులకు మేతగా వదిలేశారు. 8 వేల ఎకరాల్లో శనగ సాగు చేస్తే కనీసం ఒక్క గింజ కూడా చేతికి రాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క మండలంలోనే రైతులకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. పరిహారం ఎక్కడ..? పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి వ్యవసాయాధికారులు పొలాలకు వెళ్లి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. కానీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రైతులకు నష్టపరిహారం విడుదల కాలేదు. దీంతో ప్రభుత్వం తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేల ఎకరాల్లో పంట నష్టపోయి మండలంలో కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లినా మా గురించి పట్టించుకునే వారే కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నామని, కానీ గింజ కూడా చేతికి రాకుండా లేనంతగా ఎప్పుడూ లేదని, ఇలాంటి గడ్డు పరిస్థితులను తామెప్పుడూ చూడలేదని రైతులు పేర్కొంటున్నారు. బీమా అయినా వస్తుందా..? మండలంలోని 8 వేల ఎకరాల్లో శనగ సాగు చేసిన రైతుల్లో కొంత మంది బీమా కోసం ఎకరాకు రూ.330 ప్రీమియం చెల్లించారు. ఫసల్ బీమా పథకం కి,ద పంటనష్టం వాటిల్లితే ఎకరాకు రూ.22 వేల వరకు రైతులకు చెల్లించాల్సి ఉంది. అయితే ఇంత వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. అసలు వస్తుందో రాదో కూడా అర్థం కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వ్యవసాయాధికారి సుచిరితను వివరణ కోరగా.. మండలంలో సాగు చేసిన శనగ పంట పూర్తిగా నష్టపోయింది వాస్తవమేనన్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు నష్టపోయిన పంట జాబితాను సిద్ధం చేసి పంపించామని తెలిపారు. ఫసల్ బీమా కింద ప్రీమియ, చెల్లించిన రైతులకు బీమా నగదు చెల్లించేలా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గింజ కూడా చేతికి రాలేదు నాలుగు ఎకరాల్లో శనగ సాగు చేశాను. మొత్తం రూ.50 వేల వరకు ఖర్చయింది. వేసిన పంట వేసినట్లే ఎండిపోయింది. గింజ కూడా చేతికి రాని పరిస్థితి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అధికారులన్నా గుర్తించి శనగ రైతులను ఆదుకోవాలి. - రాము, అల్లూరు అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు వ్యవసాయం మానేసి కూలి పనులకు వెళ్లడం మేలనిపిస్తుంది. వేలకు వేలు ఖర్చు చేస్తే రూపాయికి కూడా చేతికి రాలేదు. పంట మొత్తం పూర్తిగా నష్టపోయా. పంటల కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు. అధికారులు స్పందించి నష్టపరిహార, చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. - చిరుతోటి విద్యాసాగర్ -
శనగ రైతుపై వేలం వేటు
సాక్షి, ఒంగోలు: జిల్లాలో శనగ రైతులు భగ్గుమంటున్నారు. రుణాల మాఫీ అమలులో సర్కారు దోబూచులాటపై విరుచుకుపడుతున్నారు. ఆర్భాటపు ప్రకటనలతో మభ్యపెట్టాలని ప్రయత్నిస్తోన్న అధికారపార్టీ నేతల మెడపై కత్తి పెట్టేందుకు సిద్ధమయ్యారు. తాజాగా, జిల్లాకు చెందిన శనగ పంట రైతులు ఆదివారం గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వ్యవసాయమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇంటిని ముట్టడించడం చర్చనీయాంశమైంది. కొన్ని మాసాలుగా శనగ రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈవిషయంపై అనేకమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిశారు. అయితే, వారికి ఎక్కడా స్పష్టత లభించలేదు. పైగా, వారు కోల్డ్‌స్టోరేజీల్లో దాచుకున్న శనగల నిల్వలను బహిరంగ వేలం వేసి రుణాల రికవరీ చేస్తామని బ్యాంకర్లు నోటీసులిచ్చారు. ఈనెల 25వ తేదీ నుంచి 29 వరకు జిల్లాలో రుణాలు తీసుకుని బకాయి పడిన రైతులకు చెందిన 17 లక్షల క్వింటాళ్ల శనగలను బహిరంగ వేలం వేస్తామని బ్యాంకర్లు ప్రకటించడంతో వ్యవహారం రాజుకుంది. ఇదేవిషయంపై కిందటి నెల 27న వ్యవసాయమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, రవాణామంత్రి శిద్ధా రాఘవరావుతో పాటు తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరాం నేతృత్వంలో రైతులు ముఖ్యమంత్రిని కలిశారు. వారంలో సమస్యను పరిష్కరిస్తామని అప్పట్లో చంద్రబాబు హామీనిచ్చినా ఫలితం దక్కలేదు. నోరువిప్పని అధికార పార్టీ నేతలు.. శనగ రైతులంతా టీడీపీకి ఓట్లేసి గెలిపించాలని.. గిట్టుబాటు ధరపై న్యాయం చేస్తామని అన్ని జిల్లాల్లో ఆపార్టీ నేతలు ఎన్నికల సమయాన విస్తృత ప్రచారం చేశారు. అప్పట్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారానికొచ్చినప్పుడు శనగ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, రైతు రుణమాఫీపై స్పష్టమైన హామీనిచ్చారు. ప్రస్తుతం అధికారం చేపట్టాక కూడా వారిని ఆదుకునే ప్రయత్నాల్లో ఆపార్టీ ప్రజాప్రతినిధులు వెనుకంజ వేస్తున్నారు. ప్రకాశం, కర్నూలు, అనంతపురం, గుంటూరు జిల్లాలోని నరసరావుపేట డివిజన్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాలో శనగ పంటను రైతులు సాగుచేస్తున్నారు. సరైన గిట్టుబాటు ధర లేక ఇప్పటికీ రెండు రాష్ట్రాల్లో మొత్తం 30 లక్షల క్వింటాళ్ల శనగలు కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వలున్నాయి. అందులో ప్రకాశం జిల్లాలోనే 20 లక్షల క్వింటాళ్లు నిల్వలుండటం గమనార్హం. ఏటా సీజన్ ప్రారంభంలో క్వింటాలు రూ.5 వేలకు పైగానే ధరపలికే శనగలు... సరుకు చేతికొచ్చే నాటికి క్వింటాలు రూ.2600 దిగజారింది. గిట్టుబాటు కాని ధరకు అమ్ముకోలేక, నిల్వలను కోల్డ్స్టోరే జ్ల్లోనే ఉంచుకున్నారు. స్టోరేజీల్లో ఉన్న సరుకు నిల్వలకు బ్యాంకర్లు అప్పటి ధరపై 75 శాతం రుణాలిచ్చారు. ప్రస్తుతం తీసుకున్న రుణాలకన్నా ..నిల్వచేసుకున్న సరుకుకు విలువ తక్కువగా ఉండటంతో.. మిగిలిన సొమ్ము వెంటనే చెల్లించాలని బ్యాంకర్లు రైతులను ఒత్తిడి చేస్తున్నారు. రెండేళ్లుగా శనగల నిల్వలు పేరుకుపోవడంతో రుణాల రికవరీ చేయని రైతులపై బ్యాంకర్లు వేలం నోటీసులిచ్చారు. ఇప్పటికే జిల్లాలో 2 వేల మంది రైతుల శనగలను రుణాల రికవరీ పేరిట వేలం వేశారు. తాజాగా, ఈనెల 25 నుంచి అత్యధిక మంది రైతుల శనగలను వేలం వేసేందుకు బ్యాంకర్లు సంసిద్ధం కావడంతో.. భగ్గుమన్న రైతాంగం వ్యవసాయ మంత్రి ఇంటిని చుట్టుముట్టాల్సి వచ్చిందని ప్రకాశం జిల్లా శనగ రైతుసంఘం అధ్యక్షుడు నాగ బోయిన రంగారావు తెలిపారు. వేలం నిలిపివేతపై కలెక్టర్‌కు ఆదేశాలు: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇంటిని ముట్టడించిన క్రమంలో బాధిత రైతులు బ్యాంకర్ల వేలం నోటీసులను చూపించారు. వ్యవసాయ రుణాల మాఫీ అమలుపై జాప్యంతో పాటు తాము పండించిన శనగలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. శనగల గిట్టుబాటు ధరపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని.. ఈవిషయంలో కేంద్రసహకారం కోరతామని చెప్పగా.. ఆయన సమాధానంపై రైతులు శాంతించలేదు. అనంతరం వారంతా కలిసి చిలకలూరిపేట - ఒంగోలు జాతీయ రహదారిపై బైఠాయించగా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకాశం జిల్లా కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్‌తో ఫోన్లో మాట్లాడి తక్షణమే బ్యాంకర్లను పిలిపించి వేలం ప్రక్రియను నిలువరించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
ప్రత్తిపాటికి శనగ సెగ!
పంటకు మద్దతు ధర కోసం ఏపీలో అన్నదాతల కన్నెర్ర మంత్రి నివాసం ముట్టడి చిలకలూరిపేట: ‘ఆదుకుంటామంటూ ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు. అధికారం చేపట్టాక మా సమస్యలు పట్టించుకోవటం లేదు. బ్యాంకు అధికారులు శనగలను వేలం వేస్తామంటున్నారు. మాకు ఆత్మహత్యలే శరణ్యం’ అంటూ ఏపీలో శనగ రైతులు ఆ రాష్ట్ర వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎదుట ఆందోళనకు దిగారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన పలువురు రైతులు ఆదివారం చిలకలూరిపేటలోని మంత్రి ఇంటిని ముట్టడించారు. ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.3,100 మద్దతు ధర లభిస్తోందని, ఈ ధరకు అమ్మితే రైతులు దివాళా తీస్తారని ఆక్రోశించారు. మూడేళ్లుగా గిట్టుబాటు ధరలేక ప్రకాశం జిల్లాలోనే 17 లక్షల క్వింటాళ్లు నిల్వ ఉన్నాయని మంత్రి దృష్టికి తెచ్చారు. బ్యాంకులు ఈనెల 24నుంచి వీటిని వేలం వేయటానికి సిద్ధమైనట్లు చెప్పారు. రైతువద్ద నిల్వ ఉన్న శనగలను క్వింటాల్‌కు రూ.5 వేల చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేయాలని, వేలం వేయటాన్ని నిలుపుదల చేయాలని డిమాం డ్ చేశారు. దీనిపై సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ప్రత్తిపాటి హామీ ఇచ్చారు. 25న రాస్తారోకోలు... మంత్రి హామీతో సంతృప్తి చెందని రైతులు శనగపంటకు గిట్టుబాటు ధర కల్పించాలని చిలకలూరిపేటలోని జాతీయరహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈనెల 25 తేదీన గ్రామాల్లో రాస్తారోకోలు నిర్వహించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తేవాలని శనగ రైతులు కార్యాచరణను రూపొందించారు.