‘ఆదుకుంటామంటూ ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు. అధికారం చేపట్టాక మా సమస్యలు పట్టించుకోవటం లేదు. బ్యాంకు అధికారులు శనగలను వేలం వేస్తామంటున్నారు.
పంటకు మద్దతు ధర కోసం ఏపీలో అన్నదాతల కన్నెర్ర
మంత్రి నివాసం ముట్టడి
చిలకలూరిపేట: ‘ఆదుకుంటామంటూ ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు. అధికారం చేపట్టాక మా సమస్యలు పట్టించుకోవటం లేదు. బ్యాంకు అధికారులు శనగలను వేలం వేస్తామంటున్నారు. మాకు ఆత్మహత్యలే శరణ్యం’ అంటూ ఏపీలో శనగ రైతులు ఆ రాష్ట్ర వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎదుట ఆందోళనకు దిగారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన పలువురు రైతులు ఆదివారం చిలకలూరిపేటలోని మంత్రి ఇంటిని ముట్టడించారు.
ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.3,100 మద్దతు ధర లభిస్తోందని, ఈ ధరకు అమ్మితే రైతులు దివాళా తీస్తారని ఆక్రోశించారు. మూడేళ్లుగా గిట్టుబాటు ధరలేక ప్రకాశం జిల్లాలోనే 17 లక్షల క్వింటాళ్లు నిల్వ ఉన్నాయని మంత్రి దృష్టికి తెచ్చారు. బ్యాంకులు ఈనెల 24నుంచి వీటిని వేలం వేయటానికి సిద్ధమైనట్లు చెప్పారు. రైతువద్ద నిల్వ ఉన్న శనగలను క్వింటాల్‌కు రూ.5 వేల చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేయాలని, వేలం వేయటాన్ని నిలుపుదల చేయాలని డిమాం డ్ చేశారు. దీనిపై సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ప్రత్తిపాటి హామీ ఇచ్చారు.
25న రాస్తారోకోలు...
మంత్రి హామీతో సంతృప్తి చెందని రైతులు శనగపంటకు గిట్టుబాటు ధర కల్పించాలని చిలకలూరిపేటలోని జాతీయరహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈనెల 25 తేదీన గ్రామాల్లో రాస్తారోకోలు నిర్వహించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తేవాలని శనగ రైతులు కార్యాచరణను రూపొందించారు.