సాక్షి, తిరుపతి: ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో టీడీపీ నేత బ్యాంకును బురిడీ కొట్టించి రూ. 8 కోట్లకుపైగా రుణం తీసుకున్న ఘటన తిరుపతి జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. రామచంద్రాపురం మండలానికి చెందిన బీఎన్ రెడ్డి కుటుంబం దశాబ్దాలుగా టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఆయన కుమారుడు నవీన్‌రెడ్డి, కోడలు ప్రియాంకా చౌదరి కొంత కాలం క్రితం తిరుపతిలో స్థిరపడ్డారు.
2016, మే 28న నిర్వహించిన మహానాడులో చంద్రబాబు సమక్షంలో ప్రియాంక చౌదరి రూ.15 లక్షలు విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని ఎల్లో మీడియా ద్వారా అప్పట్లో విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాత 2016 జూలై 8న తిరుపతి న్యూ బాలాజీ కాలనీలోని ఎస్‌బీఐ ఎస్‌ఎంఈ బ్రాంచ్‌లో ఓసారి రూ.4.90 కోట్లు రుణం తీసుకున్నారు. కొంతకాలం తర్వాత మరలా రూ. 3.5 కోట్లు రుణం తీసుకున్నారు.
9 ఎకరాలు తమదేనంటూ..
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం పీర్లగూడలో చిన్నశ్రీరాములు పేరుతో సర్వే నంబర్ 157, 159, 160లో ఉన్న 9 ఎకరాల భూమి, అలాగే కరీంనగర్ జిల్లాలో ఉన్న నారియా ఎంటర్‌ప్రైజెస్ గ్రానైట్ ఇండస్ట్రీ రికార్డులను ఎస్‌బీఐకు స్యూరిటీగా సమరి్పంచి ఎస్‌బీఐ నుంచి రూ.4.90 కోట్లు రుణం తీసుకున్నారు. ప్రస్తుత తిరుపతి జిల్లా పుత్తూరు పాలమంగళంలోని సిరీనా రాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మరో రూ. 3.5 కోట్లను రుణంగా పొందారు.
ఆ రుణం పొందిన వెంటనే బ్యాంకుకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నారియా ఎంటర్‌ప్రైజెస్‌ను అమ్మేశారు. ఆ తరువాత ఈఎంఐలు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు ఎన్‌పీఏగా గుర్తించి స్యూరిటీగా పెట్టిన ఆస్తుల అమ్మకానికి రంగంలోకి దిగారు. ఈ క్రమంలో పీర్లగూడలో ప్రియాంకా చౌదరి, నవీన్‌రెడ్డి పేరుతో ఎలాంటి భూములు లేవని, బ్యాంకుకు సమర్పించిన పత్రాలు ఫోర్జరీ డాక్యుమెంట్లని నిర్ధారించుకున్నారు.
ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలతో గతేడాది అక్టోబర్ 3న తిరుపతి ఎంఆర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే రూ. 4.90 కోట్లకు సంబంధించిన కేసుకు సంబంధించి మాత్రమే బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేయడం అనుమానాలకు తావిస్తోందని, ఇది సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలకు అప్పగించాల్సిన కేసు అని బ్యాంకు సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment