నకిలీ డాక్యుమెంట్లతో కోట్ల భూములు కాజేసే యత్నం..
కడప ద్వారకనగర్‌లో 40 సెంట్లు కొట్టేసేందుకు ఎత్తుగడ
యంత్రాలతో చదును చేసిన ‘తమ్ముళ్లు’
జిల్లా నేత కనుసన్నల్లో స్వాహాకు యత్నాలు
ప్రభుత్వ భూమిగా హెచ్చరిక బోర్డు ఖాతరు చేయని వైనం
ఆక్రమణకు పక్కా ప్రణాళిక
కడప నగరంలో భూచోళ్లు పడ్డారు. భూ దాహంతో ‘సైకిల్ చక్రాలు’ కట్టుకుని మరీ ఊరంతా తిరుగుతున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు నోరు తెరుస్తున్నారు. పట్టపగలే ప్రభుత్వ స్థలాలను చదును చేస్తూ కబ్జా చర్యలకు పదును పెడుతున్నారు. అధికారులకు మామూళ్ల మకిలీ అంటగట్టి.. ఆపై ఏంచక్కా నకిలీ డాక్యుమెంట్లతో స్థలాలను హాంఫట్ చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి కడప: కూటమి ప్రభుత్వంలోని టీడీపీ నేతలు భూ ఆక్రమణలతో చెలరేగిపోతున్నారు. ఖాళీ స్థలాలు కన్పిస్తే కబ్జాకు యత్నిస్తున్నారు. ముఖ్యంగా కడప నగరంలో ఖాళీ స్థలాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం, ఆపై రెవెన్యూ డిపార్టుమెంటును మేనేజ్ చేయడంలో తల మునకలయ్యారు. ఇలా పక్కా స్కెచ్ తో కోట్లాది రూపాయల విలువజేసే స్థలాలను కొట్టేస్తున్నారు. తాజాగా కడప నగరంలోని ద్వారకానగర్‌లో రూ.12 కోట్ల విలువజేసే ప్రభుత్వ భూమిని చదును చేశారు. ఈ ప్రాంతంలో ఇది ప్రభుత్వ భూమి అని హె చ్చరిక బోర్డును సైతం కబ్జాదారులు లెక్కచేయకుండా చదును చేసి ఆక్రమించే ప్రయత్నాలు సాగిస్తున్నారు.
కడప నగరం ద్వారకానగర్‌లో రైతు బజార్ సమీపంలో నాగరాజుపల్లె పొలం సర్వే నెంబరు 71/1లో 2.52 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో రైతు బజార్ ఏర్పాటు చేయగా మరో 40 సెంట్లు ప్రభుత్వ భూమి ఖాళీగా ఉండిపోయింది. ఈ స్థలం బుగ్గవంక ప్రొటెక్షన్ వాల్‌కు ఆనుకునే ఉంది. ఆన్‌లైన్‌లో రికార్డులల్లో అనుభవదారు పేరు ‘వాగు’అని ఇప్పటికీ వస్తోంది. కాగా ఆ స్థలంపై టీడీపీ నేతల కన్ను పడింది. జిల్లా టీడీపీ ముఖ్యనేత సన్నిహితులు స్వాహాకు ప్రణాళిక రచించారు. ప్రతిరోజు ముఖ్యనేత చుట్టు ఉండే తెలుగుతమ్ముళ్లు ఈకబ్జా వ్యవహారంలో క్రియాశీలక ప్రాత పోషించినట్లు ఆరోపణలున్నాయి.
హెచ్చరిక బోర్డును లెక్కచేయని అక్రమార్కులు
రెవెన్యూ అధికారులు ఈ స్థలం ప్రభుత్వ భూమి...దీనిని ఎవరైనా ఆక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోబడును అని హెచ్చరిక బోర్డు సైతం ఏర్పాటు చేశారు. ఇవేవి తెలుగుతమ్ముళ్లు లెక్కచేయలేదు. కాగా ఈ స్థలం కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో ఉంది. ఈవ్యవహారం వెలుగులోకి రావడంతో సదరు నేతలు తేలుకుట్టిన దొంగలా ఉండిపోయారు. రూ.12కోట్ల విలువజేసే స్థలాన్ని కొట్టేసేందుకు నకిలీ పత్రాలు సృష్టించి ఇది తమదేనని చదును చేసేశారు. విషయం తెలుసుకున్న ద్వారకానగర్æకాలనీ డెవెలప్‌మెంట్ కమిటీ వారు రెవిన్యూ, కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోరారు. దాంతో వ్యవహారం బహిర్గతం కావడంతో అధికారులు సైతం కాస్తా అప్రమత్తమయ్యారు. కోట్లు విలువైన భూమి కాజేసేందుకు ఇప్పటికే టీడీపీ నేతలు నకిలీ డాక్యుమెంట్లు సైతం సృష్టించినట్లు సమాచారం. ఆమేరకు ఓ రెవెన్యూ అధికారితో సైతం సంప్రదించి సహాకారం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ కూడా ఓ నేతకు పీఏగా ఉన్న వ్యక్తి తలదూర్చడంతోనే సాధ్యమైందనే ఆరోపణలు లేకపోలేదు.
ఇలాంటి చర్యలను ఎక్కడికక్కడ కట్టడి చేయాల్సిన రెవెన్యూ యంత్రాంగం భూ కబ్జాలను అరికట్టేడంలో చేతులెత్తేస్తోందనే విమర్శలు ఉన్నాయి. జిల్లా కేంద్రమైన కడప నగరంలో వార్డు సెక్రటరీ నుంచి కలెక్టర్ వరకు నిత్యం ఇక్కడే ఉంటారు. అలాంటి నగరంలోనే ప్రభుత్వ భూమిని పక్కాగా స్వాహా చేసేందుకు స్కెచ్ వేయడం గమనార్హం. ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం మామూళ్ల మత్తు వీడి ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడాలని నగర ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment