మంత్రివర్గంలో ఛాన్సు కోసం ఆశావహుల ప్రయత్నాలు
బీజేపీ కోటాలో దక్కించుకునేందుకు ‘ఆది’ భారీ ఎత్తుగడలు
మహిళా కోటాలో అవకాశం కోరుతున్న మాధవిరెడ్డి
‘ఒక్క ఛాన్స్’అంటున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరద
బీసీ కోటాలో అవకాశం కల్పించాలని పుట్టా సుధాకర్ అభ్యర్థన
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్ర మంత్రివర్గంలోకి వెళ్లేందుకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరికి వారు విశేష ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. సామాజిక సమీకరణలో భాగంగా అవకాశం కల్పించాలని కొందరు యత్నిస్తే, అపార అనుభవం ఉంది, ఒక్క అవకాశం ఇవ్వాలని మరికొందరు యత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రమాణస్వీకారంలో నిమగ్నమైన అధినేత చంద్రబాబు సోమవారం నుంచి మంత్రివర్గ కసరత్తు చేయనున్నారు. ఈ నేపధ్యంలో ఆయా నేతలు గాడ్‌ఫాదర్‌లను ఆశ్రయిస్తున్నారు. బీజేపీ కోటాలో ఛాన్సు కోసం జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అత్యంత వేగంగా పావులు కదుపుతోన్నారు.
👉 ఉమ్మడి జిల్లాలో ఏడు ఎమ్మెల్యే స్థానాలు తెలుగుదేశం కూటమి వశమయ్యాయి. ఇందులో ఐదు గురు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోటీ ఉన్న నేపధ్యంలో తొలిసారి ఎన్నికై న వారిని మంత్రివర్గంలోకి అవకాశం లేకపోతే, జిల్లాలో ఇద్దరికే ఛాన్సు కన్పిస్తోంది. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, వరదరాజులరెడ్డి సీనియర్లుగా మిగలనున్నారు. బీజేపీ కోటాలో మంత్రిగా అవకాశం దక్కించుకునేందుకు ఆదినారాయణరెడ్డి పెద్ద ఎత్తున పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ విషయమై ఇప్పటికే కేంద్ర పార్టీ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నారు. కాగా రాయలసీమ కో టా పరంగా చూస్తే ఇక్కడున్న ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల్లో ఆదినారాయణరెడ్డి మాత్రమే సీనియర్. ఆదోని, ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యేలు పార్థసారధి, సత్యకుమార్ ఇద్దరూ తొలిసారిగా ఎన్నికై న వారే కావడం ఆదికి అదనపు బలంగా నిలుస్తోన్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు.
బీసీ కోటాపై ఆశలు పెట్టుకున్న పుట్టా
మైదుకూరు నుంచి ఎన్నికై న పుట్టా సుధాకర్‌యాదవ్ బీసీ కోటాలో మంత్రివర్గంలో బెర్త్ ఖరారు చేస్తారనే ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం, గతంలో లభించిన ప్రాధాన్యత దృష్టి పెట్టుకొని అవకాశం కల్పిస్తారనే ఆశాభావంలో ఉన్నారు. మరో వైపు వియ్యంకుడు ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడుకు అవకాశం లేకపోతే, తప్పకుండా తనకు దక్కుతోందనే భావన కూడా ఆయన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
ఇరవై ఏళ్ల చరిత్ర తిరగరాశామంటున్న మాధవీరెడ్డి
కడప గడ్డపై 2004 నుంచి టీడీపీ ఓటమి పాలవుతోంది. 2024లో చరిత్ర తిరగరాశాం. అవకాశం కల్పిస్తే పార్టీ ఉన్నతికి విశేషంగా కృషి చేస్తామనే ఆశాభావాన్ని ఎమ్మెల్యే ఆర్.మాధవీరెడ్డి వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈమారు మహిళ కోటాకు పెద్దఎత్తున పోటీ ఉండడం విశేషం. రాయలసీమ జిల్లాల్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి పాణ్యం, ఆళ్లగడ్డ, పుట్టపర్తి ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, భూమా అఖిలప్రియ, పల్లె సింధూరరెడ్డి, నెల్లూరు జిల్లా నుంచి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మంత్రివర్గంలో ప్రాతినిథ్యం కోసం ప్రయత్నిస్తున్నారు.
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి కేంద్ర కేబినేట్‌లో అవకాశం దక్కకపోవడంతో, ఆయన సతీమణీ ప్రశాంతిరెడ్డికి రాష్ట్రంలో ఛాన్సు ఉంటుందనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్త పరుస్తున్నారు. అనంతపురం జిల్లా నుంచి పరిటాల సునీత సైతం మహిళ కోటాలో అవకాశం కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈనేపధ్యంలో తొలిసారి ఎన్నికై న మాధవీరెడ్డికి అవకాశాలు తక్కవగా ఉన్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. జిల్లాలో బీజేపీకి కేటాయిస్తే, మహిళా కోటాలో తనకు ఛాన్సు దక్కనున్నట్లు మాధవీరెడ్డి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
మైనార్టీ కోటా కోసం షాజహాన్ యత్నం
అన్నమయ్య జిల్లాలో ముస్లిం మైనార్టీ కోటా లో అవకాశం కల్పించాలని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్‌కు అవకాశం కల్పిస్తే షాజహాన్‌కు మిస్ అయ్యే అవకాశం లేకపోలేదు. అలా కూర్పు నిర్వహిస్తే పీలేరు ఎమ్మెల్యే ఎన్ కిశోర్‌కుమార్‌రెడ్డికి అవకాశం దక్కనున్న ట్లు విశ్లేషకులు భా విస్తున్నారు. ఇలా ఎవరికి వారు ఎత్తు లు పైఎత్తులు వేస్తూ మంత్రివర్గంలో అవకాశం కోసం ముమ్మ ర ప్రయత్నాలు ఆరంభించడం విశేషం.
తెలంగాణ ముఖ్యనేత ద్వారా..
తెలంగాణకు చెందిన ముఖ్యనేత ద్వారా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మంత్రివర్గంలో ఛాన్సు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎమ్మెల్యేగా 6సార్లు ఎన్నికై న చరిత్ర వరదకు ఉంది, పైగా ఇప్పటివరకూ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మంత్రివర్గంలో ప్రాతినిథ్యం దక్కకపోవడం కూడా అదనపు బలంగా నిలుస్తోంది. సుదీర్ఘ అనుభవం ఉన్నా మంత్రి పదవి ఇప్పటికీ దక్కలేదు. అందివచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకునే దిశగా పావులు కదుపుతోన్నారు. అదే విషయాన్ని తెలంగాణ ముఖ్యనేత ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం. నిబద్ధతతో పార్టీ ఉన్నతి కోసం పనిచేస్తామనే ఒక్క అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు సమాచారం. సీనియర్లుగా ఎమ్మెల్యేలు ఆది, వరద ఇరువురు వివిధ మార్గాలల్లో మంత్రివర్గంలోకి అవకాశం కల్పించాలని కోరుతు న్నా, తొలిసారి ఎన్నికై న ఎమ్మెల్యేలు కూడా విశేష ప్రయత్నాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment