ప్లాట్లు అభివృద్ధి చేసేందుకు రూ. 12 వేల కోట్లకు పైగా అవసరం
నీట మునగకుండా ఉండేలా ఎత్తు చేసేందుకు మరింత ఖర్చు
నిధులెలా తేవాలో తెలియక ప్రభుత్వం, సీఆర్డీయే మల్లగుల్లాలు
ఎకరాకు 1,450 గజాలు ఇస్తామని గతంలో టీడీపీ ప్రభుత్వం హామీ
ఇప్పుడు పెద్దమొత్తంలో ఖర్చుచేసే పరిస్థితిలేక తర్జనభర్జన
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణం కోసం అమరావతి రైతుల నుంచి తీసుకున్న భూములకు తిరిగి వారికి ఇవ్వాల్సిన ప్లాట్ల అభివృద్ధిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ప్లాట్ల అభివృద్ధికి రూ. వేల కోట్ల నిధులు అవసరం కావడం, ప్రస్తుత పరిస్థితుల్లో అంత మొత్తం ఖర్చు చేసే పరిస్థితి లేకపోవడంతో హామీ అమలుపై కూటమి ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. రాజధాని నిర్మాణం కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 29 వేల మంది రైతుల నుంచి 34 వేల ఎకరాలకు పైగా భూములు సేకరించారు. తీసుకున్న ఎకరాకు 1,450 గజాల చొప్పున ప్లాట్లను అన్ని వసతులతో అభివృద్ధి చేసి ఇస్తామని గత టీడీపీ ప్రభుత్వం రైతులకు ఒప్పంద పత్రాలు ఇచ్చి0ది.
ప్రస్తుతం మరో 4 వేల ఎకరాలు సేకరించాలన్న ఆలోచనతో రైతుల నుంచి సీఆర్డీఏ భూములు తీసుకుంటోంది. ఇటీవల అమరావతి పరిధిలోని 29 వేల ఎకరాల్లో రూ. 34 కోట్లతో సీఆర్డీఏ కంప చెట్ల తొలగింపు పనులు చేపట్టింది. అయితే, ఈ పనులు పూర్తయ్యాక ప్లాట్లు అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాల్సి ఉంది. రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్ల అభివృద్ధికి దాదాపు రూ. 12 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని గతంలోనే అధికారులు అంచనా వేశారు.
ఇప్పుడు ఇంత మొత్తం నిధులు ఎలా సేకరించాలో.. పనులు ఎలా చేపట్టాలోనని సీఆర్డీఏ ఆందోళన చెందుతోంది. సీఆర్డీఏ అభివృద్ధి చేసే ప్లాట్లలో నివాస, కమర్షియల్ ప్లాట్లు ఉన్నాయి. మాస్టర్‌ప్లాన్ ప్రకారం ఆయా ప్రాంతాల్లో ప్రధాన రోడ్లతో పాటు అంతర్గత రోడ్లు అభివృద్ధి చేయాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ సరఫరా, ఎస్టీపీలు, తాగునీరు సదుపాయాలు వంటివి కల్పించాలి. ప్లాట్లు పొందే రైతులకు ఇచ్చిన హామీ మేరకు వీటిని కల్పించాకే రైతులకు అప్పగించాలి. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక అవసరం.
మునిగే ప్లాట్లు రైతులు తీసుకుంటారా?
ఇటీవల కురిసిన వర్షాలకు ఎక్కడికక్కడ వర్షం, వరద నీరు ఈప్రాంతంలో నిలిచిపోయింది. ఇప్పుడున్నట్టుగా ప్లాట్లు వేస్తే భవిష్యత్‌లో ఇలాంటి వర్షం వచ్చినప్పుడు ప్లాట్లన్నీ నీట మునగడం ఖాయం. ఇలా చేసినట్టయితే వాటిని రైతులు తీసుకునే పరిస్థితి లేదు. ఆయా ప్లాట్ల ప్రాంతాలను పూర్తిగా మట్టితో ఎత్తు చేయాల్సి ఉంది.
కానీ ఈ పనులన్నీ చేయడం ఇప్పుట్లో సాధ్యమయ్యే పని కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా గతంలో సీఆర్డీఏ వేసిన అంచనా వ్యయమే రూ. 12 వేల కోట్లు దాటుతుండగా, ప్లాట్లు నీట మునగకుండా ఎత్తు చేయాలంటే రెట్టింపు నిధులు ఖర్చు చేయాల్సిందే. కానీ ప్రభుత్వం అంత మొత్తం ఖర్చు చేసేందుకు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment