Farmers
-
పోరాడితేనే కాపాడుకోగలం!
మన దేశం ప్రపంచ వాణిజ్య సంస్థలో భాగస్వామిగా చేరినప్పటి నుంచి రైతాంగం, వ్యవసాయ రంగం పరిస్థితి మరింత వేగంగా క్షీణించడం ప్రారంభమైంది. 2022 నాటికల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, స్వామినాథన్ సిఫారసుల ప్రకారం వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధర ఇస్తామని నమ్మబలికిన ఎన్డీయే పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గెలిచే వరకు మద్దతు ధర గురించి ఊదరగొట్టి, గెలిచిన తర్వాత సి2 + 50 సూత్రం (ఉత్పత్తికి అయ్యే ఖర్చుకు అదనంగా అందులో సగభాగం కలిపి ఆ మొత్తంపై లెక్కగట్టటం) ప్రకారం తాము కనీస మద్దతు ధర ఇవ్వలేమని సుప్రీంకోర్టుకు ఎన్డీఏ ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించడం ద్వారా తన రైతు వ్యతిరేక విధానాన్ని బయట పెట్టుకొన్నది.ఇప్పటికే దేశంలోని 52 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాయని, వారి నెత్తిపై సగ టున 74,121 రూపాయల అప్పు ఉందని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మార్కెట్లో పంటల ధరలు గిట్టుబాటు కాక, పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక అప్పుల సుడి గుండంలో చిక్కుకుంటున్న రైతు కుటుంబాల్లో ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నది. 2013 నుండి 2022 వరకు అధికారిక లెక్కల (ఎన్సీఆర్బీ) ప్రకారమే గత పదేళ్లలో లక్షా ఇరవై వేల మందికి పైగా రైతులు ఆత్మ హత్య చేసుకున్నారంటే రైతాంగం పరిస్థితి ఎంత దయ నీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయ పంటలపై కార్పొరేట్ శక్తులకు అధి కారాన్ని కట్టబెట్టే విధంగా మోదీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఉరితాళ్ల వంటి మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల పాటు ఢిల్లీ కేంద్రంగా రైతులు వీరోచితంగా పోరాడారు. ఫలితంగా ప్రభుత్వం కనీస మద్దతు ధర చట్టబద్ధత అవకాశాల పరిశీలన కోసం ఉద్యమ నాయ కత్వానికి రాతపూర్వక హామీ ఇచ్చింది. అయితే మూడు సంవత్సరాలు దాటినా దీనిపై ఎలాంటి పురోగతి లేకపోగా తిరిగి దొడ్డి దారిన ఆ మూడు నల్ల చట్టాలను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధం అవుతోంది. దానిలో భాగంగానే కొత్త వ్యవసాయ మార్కెట్ విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. అటవీ సంరక్షణ నియమాల పేరుతో 2006 అటవీ హక్కుల చట్టానికి పాతరేయటానికి పూనుకున్నది. అటవీ సంరక్షణ నియమాల బిల్లు ఆమోదం పొందితే అడవులకు, అడవుల్లో నివసించే జన సమూహాల హక్కులకు ముప్పు ఏర్పడుతుందని పార్లమెంట్ సభ్యులకు కాన్స్టిట్యూషనల్ కండక్ట్ గ్రూపు తరపున 155 మంది మాజీ ఐఏఎస్ అధికారులు తమ సంతకాలతో లేఖ రాశారు. అయినా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా ఆ బిల్లును ఆమోదింప చేసు కుంది. మరోవైపు విద్యుత్ బిల్లు–2020ని చట్టం చేయడా నికి మార్గం సుగమం చేసుకుంది. కచ్చితంగా ఇది వ్యవ సాయ రంగంపై పెను భారం మోపే బిల్లు అనొచ్చు.వ్యవసాయ రంగంలో పని చేసే వారంతా రైతులే. వీరిలో కౌలు రైతులు, మహిళా రైతులు, వ్యవసాయ కూలీల పరిస్థితి మరింత దారుణంగా వుంది. రైతును, వ్యవసాయ రంగాన్ని రక్షించుకోలేక పోతే దేశంలో ఆహార కొరత ఏర్పడే ప్రమాదం వుంది. ఇప్పటికైనా రైతులు, రైతు సంఘాలు మేల్కొనాలి. ప్రమాదంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాలి. ఉద్యమ శక్తుల ఐక్యత ద్వారానే రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్నీ కాపాడుకోగలుగుతాం. ‘అఖిలభారత రైతుకూలీ సంఘం’ అనే పేరుతో కొనసాగుతూ వస్తున్న రెండు వేర్వేరు నిర్మాణాలు ఈ నేపథ్యంలోనే ‘ఆలిండియా కిసాన్ మజ్దూర్ సభ’ (ఏఐకేఎంఎస్)గా ఒకటి అవుతున్నాయి. ఆదివారం మహబూబాబాద్‌లో విలీన సభ జరుపుకొంటున్నాయి.– గౌని ఐలయ్య,ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
కచ్చితత్వం దిశగా...
పక్షుల, పాముల, జంతువుల ప్రవర్తనను చూసీ...ఆకాశం తీరుతెన్నులు గమనించీ, గాలివాటు, దాని వేగం గ్రహించీ వాతావరణాన్ని అంచనా కట్టే గతకాలపు రోజుల నుంచి ఇవాళ ఏం జరుగుతుందో, వచ్చే నాలుగైదు రోజుల్లో ఎలాంటి వాతావరణం ఉండబోతున్నదో, రాగల సంవత్సరమంతా ఎలాంటి స్థితిగతులుంటాయో స్పష్టంగా వివరించే సమాచారం అందరికీ అందుబాటులో కొచ్చింది. గత నూట యాభయ్యేళ్లుగా అవిచ్ఛిన్నంగా ఈ పనిలోనే నిమగ్నమై కోట్లాది పౌరులకు చేదోడువాదోడుగా నిలిచిన భారతీయ వాతావరణ విభాగం(ఐఎండీ) తన వార్షికోత్సవాన్ని మంగళ వారం ప్రధాని మోదీ సమక్షంలో ఘనంగా నిర్వహించుకుంది. ఒక దేశ విజ్ఞాన శాస్త్ర అవగాహన ఆ దేశంలోని వైజ్ఞానిక సంస్థల ప్రగతిలో ప్రతిఫలిస్తుందని ఈ సందర్భంగా మోదీ చెప్పిన మాట అక్షరసత్యం. ఈ నూటయాభయ్యేళ్లలో ఐఎండీ సాధించిన ప్రగతి ఇందుకు సాక్ష్యం. ‘వాన రాకడ... ప్రాణం పోకడ’ ఎవరికీ తెలియదనే నానుడి నుంచి మనం చాలా దూరం వచ్చాం. ఇక పోవటం ఖాయమనుకున్న ప్రాణాన్ని నిలబెట్టడానికీ, పునర్జన్మ ఇవ్వడానికీ అధునాతన వైద్య సదుపాయాలు విస్తృతంగా అందుబాటులోకొచ్చాయి. అలాగే వాన ఎక్కడ కురుస్తుందో, దాని తీవ్రత ఏపాటో అంచనా వేయగలుగుతున్నాం. తుపాను ఏర్పడే అవకాశాలు, దాని గమ్యం, గమనం, అది మోసుకు రాగల విపత్తు గురించీ హెచ్చరించటంతో పాటు కరవుకాటకాల ప్రమాదాన్ని తెలియజెప్పటం ఆ రంగంలో సాధించిన ప్రగతికి తార్కాణం. మూడు రోజుల వరకూ వాతావరణం ఎలా ఉండబోతు న్నదో చెప్పే స్వల్పకాలిక అంచనాలు, పదిరోజుల వరకూ వాతావరణ పోకడల్ని వివరించగల మధ్య శ్రేణి అంచనాలు, నెల పాటు ఏ వారమెలా వుంటుందో తెలియజేయగల సామర్థ్యం ఇప్పుడు మన సొంతం. ఇంకా స్థానిక వాతావరణాలను అంచనా వేయగలిగే దిశగా ఐంఎండీ ముందుకెళ్తోంది.పేరులో తప్ప జనాభా రీత్యా, సంపద రీత్యా, లేదా విస్తీర్ణం రీత్యా ఏ రకంగానూ ‘గ్రేట్’ అనే పదానికి అర్హత లేని బ్రిటన్ నుంచి వచ్చిన వలస పాలకులు ఈ దేశంలోని వాతావరణ తీరుతెన్నులు చూసి అయోమయంలో పడ్డారు. వీటిని సక్రమంగా అంచనా వేసే సాధనాలు లేకపోతే సరిగా పాలించటం అసాధ్యమన్న నిర్ణయానికొచ్చిన ఫలితంగానే 1875లో సర్ చార్లెస్ చాంబర్లేన్ నేతృత్వంలో ఐఎండీని నెలకొల్పారు. అంతవరకూ రైతులు సంప్రదాయంగా అనుసరిస్తూ వచ్చిన విధానాలన్నీ క్రమేపీ కనుమరుగై వాతావరణ అధ్యయనం కొత్త పుంతలు తొక్కటం ప్రారంభించింది. కేవలం బ్రిటన్ వాతావరణాన్ని పోలి వుంటుందన్న ఏకైక కారణంతో తమ వెసులుబాటు కోసం సిమ్లాలోని పర్వత ప్రాంతంలో మొదలెట్టిన ఐఎండీ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని గ్రహించాక 1928లో పుణేకు తరలిరావటం, ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఢిల్లీకి వెళ్లటం తప్పనిసరైంది. ఐఎండీ డైరెక్టర్ జనరల్‌గా వచ్చిన గిల్బర్ట్ వాకర్ 1904–1924 మధ్య రెండు దశాబ్దాల సమయంలో భారత వాతావరణంలో చోటుచేసుకున్న అసాధారణతలపై అధ్యయనం చేయటంతో అనేక అంశాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంత పసిఫిక్ మహా సముద్ర జలాలపై ఉండే వాయుపీడనంలో వచ్చే హెచ్చుతగ్గులే ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ స్థితిగతులను ప్రభావితం చేస్తున్నాయని ఆ అధ్యయనం తేల్చాక వాతావరణాన్ని అర్థంచేసుకునే తీరే మారిపోయింది. పసిఫిక్ జలాలపై ఉండాల్సిన సాధారణ ఉష్ణోగ్రతలో మైనస్ 17 డిగ్రీల సెల్సియస్ మేరకు హెచ్చితే లాæనినో... ఆ ఉష్ణోగ్రత మైనస్ 17 డిగ్రీల కన్నా తగ్గితే లానినా ఏర్పడు తుందని తేలింది అప్పుడే. ఇదంతా అర్థమయ్యాక రాగల కాలంలో వాతావరణమెలా వుండనున్నదో అంచనా వేయటం సులభమైంది. వాతావరణంలో విడిచిపెట్టే బెలూన్లు గాలిలో తేమనూ, ఉష్ణోగ్రతనూ ఇట్టే చెప్పగలుగుతుండగా ఉపగ్రహాలు నేల పరిస్థితుల గురించి సమాచారం ఇస్తున్నాయి.స్వాతంత్య్రానంతరం వాతావరణాన్ని కొలవటానికి రాడార్ల వంటి ఉపకరణాలు అందుబాటు లోకొచ్చాయి. 1971లో తొలి తుపాను హెచ్చరిక కేంద్రం ఏర్పాటైతే, 1990ల్లో ఇస్రో ఉపగ్రహాలు పంపే డేటాతో వాతావరణ అంచనాల కచ్చితత్వం పెరిగింది. సెకనుకు కొన్ని లక్షల గణనలను చేయగలిగిన అధునాతన సూపర్ కంప్యూటర్ వినియోగం మొదలయ్యాక రుతుపవనాలు, తుపానుల గురించి మాత్రమే కాదు... వడగాల్పులు, వరదల వంటి వైపరీత్యాల గురించి కూడా చెప్పగలుగుతున్నారు. మన దేశంలో సాగుకు యోగ్యమైన భూమిలో 60 శాతం కేవలం వర్షాధారం కావటం, జనాభాలో మూడింట రెండొంతుల మందికి జీవనాధారం వ్యవసాయమే కావటం వల్ల ఐఎండీ చెప్పే అంచనాలు ఎంతో అవసరం. అందుకే వర్షాలు సరిగ్గా ఎక్కడ పడతాయో, ఏ ప్రాంతంలో వడగాడ్పులు వీచవచ్చో, ఎక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నదో కూడా పదేళ్లుగా చెప్పగలుగుతోంది. కృత్రిమ మేధ దీన్ని మరింత పదునెక్కించింది.ఐఎండీ అంచనాల వల్ల ప్రభుత్వాలు అప్రమత్తమై లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించటం, వేలాది ప్రాణాలను కాపాడుకోవటం సాధ్యమవుతోంది. ఇది మున్ముందు ఇంకా విస్తరించి కనీసం అయిదురోజుల ముందు 90 శాతం కచ్చితత్వంతో చెప్పగలిగే విధానాలను అభివృద్ధి చేసుకోవాలనీ, ఆఖరికి భూకంపాల రాకడను సైతం పసిగట్టగలగాలనీ ఐఎండీ 2047 విజన్ డాక్యుమెంటు విడుదల సందర్భంగా మోదీ చేసిన సూచన శిరోధార్యం. ఈ అంచనాలు మన దేశానికి మాత్రమే కాదు...ఆసియా ప్రాంత దేశాలకు సైతం ఎంతో మేలుచేస్తాయి. పంటల దిగుబడిపై, ఆర్థికవ్యవస్థ తీరుతెన్నులపై మరింత మెరుగైన అంచనాలకు తోడ్పడతాయి. -
మన నగరంలోనే అరుదైన పంటలు..రుద్రాక్ష, కుంకుమ పువ్వు..
హైదరాబాద్ నగరం కేవలం ఐటీ, పారిశ్రామిక స్టార్టప్‌లకు మాత్రమే కాదు.. అరుదైన పంటల ఆవిష్కర్తలకు నగరంలోని శివారు ప్రాంతాలు వేదికగా నిలుస్తున్నాయి.. బీటెక్ కోర్సులు పూర్తి చేసి, ఐటీ, ఇతర సాంకేతిక సాగులో ఆరితేరాల్సిన జిల్లా యువత.. అరుదైన పంటల పరిశోధనలు, సాగుపై దృష్టిసారించింది. అందమైన కాశ్మీర్ లోయల్లో మాత్రమే సాగయ్యే అరుదైన కుంకుమ పువ్వు బాలాపూర్ మండలం గుర్రంగూడలో సాగవుతుండగా, కేరళ తీరం వెంట మాత్రమే సాగయ్యే వక్క తోటలు శంకర్పల్లిలోనూ సాగవుతున్నాయి. ఇక సిమ్లా, ఇతర శీతల ప్రదేశాల్లో మాత్రమే కనిపించే యాపిల్ ప్రస్తుతం కందుకూరు మండలం పులిమామిడిలోనూ దర్శనమిస్తున్నాయి. సౌదీ అరేబియా దేశాల్లో విరివిగా పండే ఖర్జూర సరస్వతి గూడలో నోరూరిస్తుంది. ఇప్పటి వరకూ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అవకాడో ప్రస్తుతం దెబ్బగూడలోనూ లభిస్తుంది. నేపాల్ సరిహద్దులో అరుదుగా లభించే రుద్రాక్ష.. ప్రస్తుతం మేడ్చల్ మండలం రాయిలాపూర్‌లో సాగవుతుండటం గమనార్హం.. ఎస్బీఐలో ఉద్యోగం చేస్తూ.. పూర్వ మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో వ్యవసాయ కుటుంబం. నల్లగొండ ఎన్జీకాలేజీలో డిగ్రీ, ఉస్మానియాలో ఎంబీఏ పూర్తి చేశాను. ప్రస్తుతం కోఠి ఎస్బీఐలో పని చేస్తున్నా. అచ్చంపేటలో పదెకరాలు, సరస్వతి గూడలో ఏడెకరాలు ఉంది. యూట్యూబ్ ద్వారా అనంతపూర్‌లో ఖర్జూర సాగు చేస్తున్న విషయం తెలుసుకున్నా. ఆ మేరకు ఆరేళ్ల క్రితం మొత్తం 17 ఎకరాల్లో 1260 మొక్కలు నాటాను. ఎకరాకు రూ.5 లక్షల వరకూ వచి్చంది. మూడేళ్ల క్రితం దిగుబడి ప్రారంభమైంది. తొలిసారిగా 1.50 టన్నుల దిగుబడి వచి్చంది. ఆ తర్వాత 55 నుంచి 60 టన్నుల దిగుబడి వచ్చింది. – ఏమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అచ్చంపేట (ఖర్జూర) విదేశాల నుంచి తిరిగొచ్చి.. బీటెక్ పూర్తి చేసి, ఎంబీఏ కోసం పదేళ్ల క్రితం లండన్ వెళ్లాను. అక్కడ సరైన ఉపాధి అవకాశాలు లేక వెనక్కి తిరిగొచ్చా. అవకాడోపై అవగాహన ఉండటంతో అటువైపు చూశా.. మూడేళ్ల క్రితం 1.10 ఎకరాల విస్త్రీర్ణంలో 220 అవకాడో మొక్కలు నాటాను. సాధారణంగా 25 డిగ్రీల వాతావరణంలో మాత్రమే పెరిగే అవకాడో 40 డిగ్రీలకుపైగా నమోదైన ఉష్ణోగ్రతలను సైతం తట్టుకొని నిలబడింది. డ్రిప్ సాయంతో మొక్కలకు నీరు అందించా. చీడపీడల సమస్యే కాదు.. పెట్టుబడికి పైసా ఖర్చు కూడా కాలేదు. ఒక్కో చెట్టు నుంచి 150 నుంచి 200 కాయలు దిగుబడి వచ్చింది. ఆన్లైన్లో చూసి, స్వయంగా తోట వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. – రమావత్ జైపాల్, దెబ్బడిగూడ (అవకాడో) బీటెక్ చదువుతూనే.. బాలాపూర్ మండలం గుర్రంగూడ మాది. ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నా. వ్యవసాయ కుంటుంబం కావడంతో నాన్నతో పాటు తరచూ పొలానికి వెళ్తుంటా. కాశ్మీర్లో ప్యాంపూర్, పుల్వొమా జిల్లాల్లో అరుదుగా పండే కుంకుమ పువ్వు పంటను ఎంచుకున్నా. మార్కెట్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. కల్తీని నివారించి, నాణ్యమైన పువ్వును అందివ్వాలనుకున్నా. ఇంటిపై ఖాళీగా ఉన్న ఓ గదిలో 2024 సెప్టెంబర్‌లో సాగు ప్రారంభించాను. రూ.5 లక్షలు ఖర్చు అయ్యింది. ఇప్పటి వరకూ 20 గ్రాముల వరకూ సేకరించాం. ఒక గ్రాము రూ.800 నుంచి రూ.1000 వరకూ పలుకుతోంది. – లోహిత్‌రెడ్డి, గుర్రంగూడ (కుంకుమ పువ్వు) వక్కసాగులో విశ్రాంత వైద్యుడు.. ఐడీపీఎల్ బాలానగర్‌లో ఫ్యామిలి ఫిజీషియన్‌గా నాలుగు దశాబ్దాల పాటు సేవలు అందించా. శంకర్పల్లి మాసానిగూడలోని భూమిలో ఏదైనా చేయాలని భావించా. ఏలూరులో నా స్నేహితుడు విజయసారధి సూచనలతో 2015లో నాలుగు ఎకరాల్లో.. ఎకరాకు 300 చొప్పున వక్క మొక్కలు నాటాను. 2023లో తొలిసారిగా పంట దిగుబడి 1500 కేజీలు వచ్చింది. కేజీ రూ.350 నుంచి రూ.400 పలుకుతుంది. వక్కతోటలోనే అంతరపంటలుగా మిరియాలు, యాలకులు, జాజికాయ, జాపత్రి, లవంగాలు, అల్లం, యాపిల్, ద్రాక్ష, బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీ, అవకాడో, మ్యాంగో, జామ వంటి పండ్ల మొక్కలను సాగు చేస్తున్నా. మరో ఏడాదిలో పండ్ల దిగుబడి ప్రారంభమవుతుంది. – డాక్టర్ విజయ్‌కుమార్ కొడాలి, బోధన్ (వక్కసాగు)రాయలాపూర్లో రుద్రాక్ష.. ఫిన్లాండ్కు చెందిన మహిళను వివాహం చేసుకుని మేడ్చల్ మండలం రాయలాపూర్ గ్రామ శివారులో స్థిరపడ్డారు. ఇంటి చుట్టూ వివిధ రకాల చెట్లు నాటారు. దక్షిణ భారతదేశంలో అత్యంత అరుదుగా కనిపించే రుద్రక్ష మొక్కలను ఇంటి ముందు నాటారు. ప్రస్తుతం దిగుబడి ప్రారంభమైంది. జనవరి, ఫిబ్రవరిలో కాయలు తెంపి, ఆరబెడుతుంటారు. ప్రదీప్ ఇటీవల వెయ్యి రుద్రాక్షలతో పూజ చేయడం కొసమెరుపు. – ప్రదీప్, మేడ్చల్ (రుద్రాక్ష) (చదవండి: గట్ బయోమ్ 'పవర్ హోమ్'..!) -
అన్నదాత ఇంట కానరాని సంక్రాంతి
సాక్షి, అమరావతి: తెలుగింట సంక్రాంతి పెద్ద పండుగ.. మరీ ముఖ్యంగా ఇది రైతన్న పండుగ. పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు సంబరాలు చేసుకోవలసిన తరుణం. కానీ అన్నదాత లోగిలి కళతప్పింది. పల్లెల్లో సంక్రాంతి సందడి కానరావడం లేదు. అన్ని విధాలుగా మోసపోయిన రైతన్న దిగాలుగా కనిపిస్తున్నాడు. కొత్త సర్కారు వచ్చి ఏడు నెలలు గడిచాయి. ఖరీఫ్, రబీ రెండు సీజన్లు పూర్తయ్యాయి. పెంచి ఇస్తామన్న పెట్టుబడిసాయం ఒక్క విడత కూడా అందలేదు. పంటలబీమా పరిహారం లేదు.. పైగా ప్రీమియం కట్టాల్సిరావడం.. కరువు సాయానికి ఎగనామం.. ఆర్బీకేలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. విత్తనాలు, ఎరువులు దొరకలేదు. తుపానులు, వరదలు దారుణంగా దెబ్బతీశాయి. దిగుబడులు ఆశించినట్లులేవు.. వాటికీ కనీస మద్దతు ధర రాలేదు. అన్ని విధాలుగా దగా పడిన రైతన్న ఏడు నెలలుగా రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున ఇస్తానన్న పెట్టుబడి సాయం లేదు. ఈ సాయం కోసం రాష్ట్రంలోని 54 లక్షల మందికి రూ.10వేల కోట్లు అవసరం కాగా, బడ్జెట్లో రూ.1,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇంతమోసం చేస్తారా.. అని అన్నదాతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఖరీఫ్–2023 సీజన్‌కు సంబంధించి రైతుల తరఫున చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించకపోవడం వలన రూ.1,358 కోట్ల పంటల బీమా పరిహారం అందకుండా పోయింది. రబీ సీజన్లో కరువు సాయానికి సంబంధించి రూ.328 కోట్లకు ఎగనామం పెట్టారు. ఇలా రైతులకు ఈ ఏడు నెలల్లో అందించాల్సిన రూ.12,563 కోట్లు ఈ ప్రభుత్వం ఎగ్గొట్టింది. వీటి కోసం కళ్లల్లో ఒత్తులేసుకొని రైతులు ఎదురు చూస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వలేక ఈసారి పండుగకు దూరమవ్వాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లుగా విత్తు నుంచి విక్రయం వరకు గ్రామ స్థాయిలో రైతులను చేయిపట్టి నడిపించిన రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)ను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. దీంతో విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు నానా అగచాట్లు పడ్డారు. రోడ్డునపడిన అన్నదాత..ఇంటికొచ్చే కొత్త పంటతో సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలికే రైతన్నల ఇంట ఈసారి ఆ పరిస్థితి మచ్చుకైనా కన్పించడం లేదు. ప్రభుత్వ నిర్వాకానికి తోడు వరుస వైపరీత్యాల ప్రభావంతో ఓ వైపు పంటలు దెబ్బతినగా, చేతికొచ్చిన అరకొర పంటకు మద్దతు ధర కోసం రైతన్నలు రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. గడిచిన ఐదేళ్లుగా విత్తనాలు, ఎరువులకు ఏరోజు ఇబ్బందిపడని రైతులు గడిచిన ఖరీఫ్ సీజన్లో వాటి కోసం నానా అవస్థలు పడ్డారు. మళ్లీ, మళ్లీ పెట్టుబడులు పెట్టి పండించిన వరి, పత్తి, ఉల్లి, టమోటా, మిర్చి వంటి పంటలకు మార్కెట్లో సరైన ధర లేక రైతులు తీవ్రమైన ఆవేదనతో ఉన్నారు. ఖరీఫ్ సీజన్లో కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతంలో తుపానులు, వరదలతో అధికారికంగా 6 లక్షల ఎకరాలలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వర్షాభావ పరిస్థితులతో రాయలసీమ జిల్లాల్లో మరో 2 లక్షల ఎకరాలకు పైగా పంటలు ఎండిపోయాయి. రాయలసీమ జిల్లాల్లో 80కి పైగా మండలాలు కరువు కోరల్లో చిక్కుకున్నప్పటికీ మొక్కుబడిగా 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకున్నారే తప్ప పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. పంటల బీమా రక్షణేది?గతేడాది ఇదే రబీ సీజన్లో పంటల బీమాలో నమోదైన రైతుల సంఖ్య అక్షరాల 43.82 లక్షల మంది. మరిప్పుడూ.. కేవలం 7.64 లక్షల మంది. అంటే ఆరో వంతు మందికి కూడా పంటల బీమా రక్షణ దక్కలేదు. గత ఐదేళ్లూ అన్నదాతలపై పైసా భారం పడకుండా డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేసింది. ఈ–క్రాప్ నమోదు ప్రామాణికంగా నోటిఫై చేసిన ప్రతి పంటకు, సాగు చేసిన ప్రతి ఎకరాకు నూరు శాతం యూనివర్శల్ కవరేజ్ కల్పిస్తూ పంటల బీమా రక్షణ లభించేది. ఈ బీమాతో ఎలాంటి విపత్తు ఎదురైనా రైతన్నలు నిశ్చింతగా ఉండే వారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో వివిధ విపత్తుల కారణంగా పంటలు దెబ్బతిన్న 54.55 లక్షల మంది రైతులకు రికార్డు స్థాయిలో రూ.7,802.05 కోట్లు పరిహారంగా అందించింది. వరి పంటకు ప్రీమియం చెల్లింపు గడువు బుధవారంతో ముగుస్తుంది. మిగతా పంటలకు గత నెల 31వ తేదీనే ముగిసింది. అయినా 50.67 లక్షల ఎకరాలకు రైతులు బీమా చేయించలేదు. చంద్రబాబు ప్రభుత్వం బీమా ప్రీమియం భారాన్ని రైతులపైనే వేయడమే ఇందుకు కారణం. ఈ భారం భరించలేక లక్షలాది రైతులు పంటల బీమా చేయించుకోలేకపోయారు. పైగా, బీమాకు అవసరమైన సర్టిఫికెట్లు, నమోదు వంటి వాటి కోసం ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన దుస్థితి. దీంతో పంటల బీమా అంటేనే రైతులు భయపడిపోయారు.17న విజయవాడలో ధర్నాకు పిలుపుప్రతీ రైతుకు రూ.20వేల పెట్టుబడి సాయం ఇస్తామన్న హామీని ఎప్పుడు అమలు చేస్తారంటూ సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎన్నికలలో ఇచ్చిన అన్ని హామీలన్నీ అమలు చేస్తున్నామని గొప్పగా చెబుతున్న చంద్రబాబు.. రైతులకు ఇచ్చిన హామీల సంగతేమిటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. రైతులకు ఇచ్చిన పెట్టుబడి సాయం హామీ ముఖ్యమంత్రికి గుర్తులేదా? గుర్తు ఉన్నా రైతులకు ఇవ్వటం ఇష్టం లేక అమలు చేయటం లేదా? స్పష్టం చేయాలి. రైతులకు ఇచ్చిన హామీల అమలు, పెండింగ్ బకాయిలు చెల్లింపుతోపాటు రైతులపై భారం వేయకుండా ఉచిత పంటల బీమా పథకం కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా చేయబోతున్నాం. – కె.ప్రభాకరరెడ్డి, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
17న విజయవాడలో రైతుల మహా ధర్నా
సాక్షి, అమరావతి : రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైన టీడీపీ కూటమి ప్రభుత్వం పట్ల రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ జిల్లాలలో దాదాపు 80కు పైగా మండలాలు కరువు కోరల్లో చిక్కుకున్నప్పటికీ మొక్కుబడిగా 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకుందే తప్ప పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. 2023–24లో ఖరీఫ్‌తో పాటు రబీ సీజన్లలో వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టపోయిన 3.91 లక్షల మంది రైతులకు చెల్లించాల్సిన రూ.328 కోట్ల కరువు సాయం బకాయిలు విడుదల చేయలేదు.ఖరీఫ్–2023 సీజన్లో రైతుల తరఫున రూ.930 కోట్ల ప్రీమియం బకాయిలు చెల్లించకపోవడం వల్ల రైతులకు న్యాయంగా దక్కాల్సిన రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారం అందలేదు. ఇలా రైతులకు చెల్లించాల్సిన రూ.12,563 కోట్లు ఎగ్గొట్టింది. ఈ నేపథ్యంలో రైతాంగ సమస్యలపై ఈ నెల 17న విజయవాడలో భారీ ధర్నా నిర్వహణకు ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణయ్య, కే ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి రైతుకు రూ.20 వేల పెట్టుబడి సాయం ఇస్తామన్న హామీని ఎప్పుడు అమలు చేస్తారంటూ ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని నిలదీశారు.ఎన్నికలలో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నామని గొప్పగా చెబుతున్న చంద్రబాబు.. రైతులకు ఇచ్చిన హామీల సంగతేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. పెట్టుబడి సాయం హామీ ముఖ్యమంత్రికి గుర్తులేదా? గుర్తు ఉన్నా రైతులకు ఇవ్వటం ఇష్టం లేక అమలు చేయటం లేదా.. అన్నది స్పష్టం చేయాలన్నారు. ఈ నేపథ్యంలో రైతాంగ సమస్యల సాధనకు డిమాండ్ చేస్తూ ఈ నెల 17న విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా నిర్వహించబోతున్నామని వారు స్పష్టం చేశారు. -
రైతుల ఆస్తులు వేలం
కర్నూలు (అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీబీ) బకాయిలను రాబట్టుకునేందుకు రైతుల ఆస్తులను వేలం వేసేందుకు రంగం సిద్ధంచేస్తున్నారు. రైతులకు అవసరమైన రుణాలను పంపిణీచేసి ఆదుకోవాల్సి ఉండగా.. గతంలో ఎప్పుడూలేని విధంగా ఆ విషయంలో పూర్తిగా వెనుకబడింది. పైగా ఇప్పుడు వారి ఆస్తులను విక్రయించి బకాయిలకు జమచేసుకునేందుకు న్యాయ ప్రక్రియ కూడా మొదలుపెట్టింది. ఇందులో భాగంగా తాకట్టు పెట్టిన ఆస్తులను వేలంపాట ద్వారా విక్రయించే ప్రక్రియను జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, పీఏసీఎస్‌లు ముమ్మరం చేశాయి. ఈ ఏడాది జూన్ నుంచి ఒకవైపు సెక్షన్–71 కింద నోటీసులివ్వడం, మరోవైపు ఎగ్జిక్యూషన్ పిటిషన్ (ఈపీ) పైల్చేయడం వంటివి జరుగుతున్నాయి. అలాగే, 2024 జూన్ నుంచి డిసెంబరు వరకు రూ.122.82 కోట్ల బకాయిలను రాబట్టుకునేందుకు 1,457 మంది రైతులకు సహకార చట్టం సెక్షన్–71 కింద నోటీసులు ఇచ్చారు. ఇదే సమయంలో 522 మంది రైతుల నుంచి రూ.41.92 కోట్లను రాబట్టేందుకు ఈపీలు కూడా దాఖలు చేశారు. ఆస్తుల అమ్మకానికి డిక్రీ కూడా చేయడం గమనార్హం. నిజానికి.. ఈ ఏడాది అన్ని రకాలుగా వ్యవసాయం కలిసిరాక నష్టాల బారిన పడినా రైతుల ఆస్తుల విక్రయాలకు డీసీసీబీ రంగం సిద్ధంచేయడంపట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాటి రోజులు మళ్లీ పునరావృతం.. 2014–15 నుంచి 2018–19 వరకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, పీఏసీఎస్‌లు పాత బకాయిలను రాబట్టుకునేందుకు రైతుల జీవితాలతో చెలగాటమాడాయి. మళ్లీ అదే పరిస్థితి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోను పునరావృతమవుతోంది. బకాయిలు పేరుకుపోవడానికి బ్యాంకు, పీఏసీఎస్ సిబ్బంది అవినీతి అక్రమాలే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వల్పకాలిక రుణమైన, దీర్ఘకాలిక రుణమైన రైతులు కమీషన్లు ఇచ్చుకోకపోతే రుణాలిచ్చే పరిస్థితిలేదు. వెరిఫికేషన్ కోసం వెళ్లే అధికారులకూ ముడుపులు సమర్పించాల్సిందే. రూ.లక్ష రుణం తీసుకుంటే చేతికి వచ్చేది రూ.80 వేలే. రికవరీ మాత్రం రూ.లక్ష చేయాల్సిందే. ఈ కారణాలతోనే అనేకమంది రైతులు రుణాలు తిరిగి చెల్లించలేకపోతున్నారు. దీంతో వీరి ఆస్తుల వేలంపాట ద్వారా విక్రయించి బకాయిలు జమచేసుకుంటున్నారు. రూ.5 కోట్లు రుణాలు ఇస్తే ఒట్టు.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రుణాల పంపిణీ కోసం ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బ్రాంచీలకు, పీఏసీఎస్‌లకు రూ.330 కోట్ల బడ్జెట్ ఇచ్చిoది. ఈ బడ్జెట్ పూర్తయితే అదనంగా ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉంది. దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాల పంపిణీకి ఈ బడ్జెట్‌ని వినియోగించాలి. బడ్జెట్ దండిగా ఉన్నప్పటికీ రుణాల పంపిణీ మాత్రం పెద్దగాలేదు. వాణిజ్య బ్యాంకులకు రైతులు పోటెత్తుతుంటే జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బ్రాంచీల్లో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిఏటా జూలై నుంచి నవంబరు లేదా డిసెంబరు మూడవ వారం వరకే రుణాలు పంపిణీ చేస్తారు. ఆ తర్వాత రికవరీపై దృష్టిసారిస్తారు. ఈ నేపథ్యంలో.. రుణాల పంపిణీకి ఇంత పెద్ద మొత్తం కేటాయించినప్పటికీ ఇప్పటివరకు రుణాల పంపిణీ రూ.5 కోట్లలోపే ఉండటం గమనార్హం. లాభాల బాట పట్టించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. నష్టాల ఊబిలో చిక్కుకున్న కర్నూలు డీసీసీబీకి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఊపిరిపోసింది. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు కేడీసీసీబీ రుణాలు పంపిణీచేసే ఏర్పాటుచేసింది. కస్టమ్స్ హయ్యరింగ్ సెంటర్లు, మల్టీపర్పస్ గోదాముల నిర్మాణాలకు డీసీసీబీ రుణాలు అందజేసింది. గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా బ్యాంకు లోనింగ్ భారీగా పెరిగింది. వైఎస్సార్సీపీ హయాంలో దశాబ్దాల నాటి నష్టాలను అధిగమించి నికర లాభాల్లోకి వచి్చంది. 2022–23, 2023–24 సంవత్సరాల్లో గణనీయమైన నికర ఆదాయం పొందింది. రికార్డు స్థాయిలో ఏకంగా రూ.10 కోట్లు లాభం ఆర్జించగా.. సభ్యులైన పీఏసీఎస్‌లకు రూ.4 కోట్లు డివిడెండ్ ఇచ్చిoది. రాయలసీమ జిల్లాల్లోనే అత్యధిక టర్నోవర్ కలిగిన బ్యాంకుగా వరుసగా రెండేళ్లు అవార్డు కూడా అందుకుంది. నికర లాభాల్లోకి వచ్చిన కేడీసీసీబీ మళ్లీ నష్టాల్లోకి వచ్చి బలహీనమైన బ్యాంకుగా రికార్డు నమోదుచేసుకోవడం ఆందోళన కలిగించే విషయం. రైతుల ఆస్తుల స్వాధీనానికి రంగం సిద్ధం.. ఇక కల్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో బకాయిపడిన రైతులు 70 మందికి జూన్ నుంచి సెక్షన్–71 కింద నోటీసులిచ్చారు. తర్వాత 30 మంది రైతులకు ఈపీ దాఖలు చేశారు. కొంతమంది బకాయిలు చెల్లించారు. 20 మంది రైతులు స్పందించకపోవడంతో వారి ఆస్తుల వేలానికి చర్యలు తీసుకున్నారు. దీంతో 13 మంది రైతులు బకాయిలు చెల్లించారు. ఇక ఏడుగురు స్పందించకపోవడంతో వారి ఆస్తులను పీఏసీఎస్ పరం చేసుకోవడానికి చర్యలు చేపట్టారు. -
రైతుల సేవలో కేవీకే
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని మల్యాల కృషి విజ్ఞాన కేంద్రాన్ని (Krishi Vigyan Kendra) 1989లో ఏర్పాటు చేశారు. 36 ఏళ్లుగా ఈ కేంద్రం రైతులకు సేవలందిస్తోంది. జెన్నారెడ్డి రఘోత్తంరెడ్డి తన తండ్రి వెంకటరెడ్డి పేరు మీద మల్యాల గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రానికి 46.6 ఎకరాల భూమిని కేటాయించారు. మల్యాల కేవీకేలో సమన్వయకర్తగా డాక్టర్ ఎస్.మాలతి, విస్తరణ విభాగ అధిపతిగా డాక్టర్ ఎన్.కిషోర్ కుమార్, పంట సేద్యం ఉత్పత్తి శాస్త్రవేత్తగా బి.క్రాంతికుమార్, ఉద్యాన శాస్త్రవేత్తగా డాక్టర్ ఈ.రాంబాబు పనిచేస్తున్నారు. సస్యరక్షణ విభాగం, వెటర్నరీ, గృహ విజ్ఞాన విభాగాల శాస్త్రవేత్తల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రైతులకు అవగాహన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిపిన పరిశోధనలపై మల్యాల కేవీకే ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. స్థానిక భూముల నాణ్యతను బట్టి వాటికి అనువుగా ఉంటే ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాలుగా ఎంపిక చేసి పరీక్షలు నిర్వహిస్తారు. మళ్లీ వాటిని పరిశోధనకు తీసుకువెళ్లి ఇతర రైతులకు ఉపయోగపడే విధంగా తెలియజేస్తున్నారు. రైతు దినోత్సవాలు, కిసాన్ మేళాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఉన్న ప్రధాన పంటలపైన రైతులకు శిక్షణ కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలను సమన్వయం చేస్తూ సీజన్లో రైతులు సాగుచేస్తున్న పంట క్షేత్రాలను సందర్శించి పురుగులు, తెగుళ్ల నివారణ విషయంలో రైతులను చైతన్యపరుస్తున్నారు. చిరు సంచుల్లో వంగడాలు.. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన వంగడాలను చిరు సంచుల రూపంలో రైతులకు అందజేస్తున్నారు. రైతులు చిరు సంచుల ధాన్యం అభివృద్ధి బాగా ఉందని చెబితే కొత్తగా మరింత మంది రైతులకు ఇస్తున్నారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, యాంత్రీకరణ, చీడపీడల నివారణ, పురుగుమందుల వాడకంపై మల్యాల కేవీకే శాస్త్రవేత్తలు క్షేత్ర దినోత్సవాలు, ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతుల క్షేత్రాల్లో వరి, పత్తి, మిరప, మొక్కజొన్న పంటలతోపాటు ఆరుతడి పంటలపై క్షేత్ర ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మట్టి పరీక్షలు.. భూసార పరీక్ష కేంద్రం ద్వారా రైతులకు మట్టి, నీళ్ల పరీక్షలు నిర్వహించి ఫలితాలు తెలియజేస్తున్నారు. వ్యవసాయ రంగంలో రోజురోజుకూ కొత్తకొత్త మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడంతోపాటు సేంద్రియ సాగుపై ఆసక్తి పెరిగే విధంగా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. పెట్టుబడులు తగ్గించి అధిక దిగుబడులు పొందడం కోసం రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ వ్యవసాయంలో రాణించే విధంగా శిక్షణ ఇస్తున్నారు. వరి విత్తన ఉత్పత్తి.. మల్యాల కేవీకేలోని ఫాంలో వరి విత్తన ఉత్పత్తిలో భాగంగా సిద్ధి సన్న రకం, ఆర్ఎన్ఆర్ 15048 (తెలంగాణ సోనా), కునారం 118 సన్నాలు, డబ్ల్యూజీఎల్ 962 సన్నాలు తయారు చేస్తున్నారు. వరిలో విత్తన ఉత్పత్తి ద్వారా జిల్లాలోని రైతాంగానికి నాణ్యమైన విత్తనాలను అందిస్తున్నారు. గిరిజన ఉప ప్రణాళిక, ఎస్సీ ఉప ప్రణాళిక పథకంలో భాగంగా ఎంపిక చేసిన గ్రామాల రైతులకు పంటల సాగులో మెళకువలపై శిక్షణ ఇస్తున్నారు. అదే విధంగా స్కిల్ ట్రైనింగ్‌లు, ఒకేషనల్ ట్రైనింగ్‌లు, గుర్తించబడిన అంశాలపై ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆర్య (అట్రాక్టింగ్ అండ్ రిటైనింగ్ రూరల్ యూత్ ఇన్ అగ్రికల్చర్) పథకంలో భాగంగా గ్రామాలను దత్తత తీసుకుని 18 నుంచి 35 ఏళ్ల వయసుగల వారిని ఎంపిక చేసి పురుష, మహిళా రైతులకు శిక్షణ ఇస్తున్నారు. కూరగాయల సాగు, పెరటికోళ్ల పెంపకం.. కేవీకేలోని షేడ్ నెట్లలో కూరగాయల సాగు పెంపకం, వర్మి కంపోస్టు తయారీ, పెరటి కోళ్ల పెంపకం, చిరుధాన్యాలతో వంటకాలు తయారు చేయడంపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. గిరిజనులు, దళితులు ఎక్కువగా ఉండే గ్రామాలను ఎంపిక చేసి, దత్తత తీసుకొని అక్కడి స్థానికులకు కుట్టు మెషీన్లపై శిక్షణ ఇచ్చారు. మూడు నుంచి నాలుగు సంవత్సరాలకుగాను జిల్లాలో కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని శిక్షణ ఇస్తున్నారు. కాటన్ స్పెషల్ ప్రాజెక్టులో భాగంగా నాగ్‌పూర్ అఖిల భారత పత్తి పరిశోధన సంస్థ (సీఐసీఆర్) సహకారంతో అధిక సాంద్రత పత్తి సాగు వల్ల జరిగే మేలుపై రైతులకు శిక్షణ ఇచ్చారు. తద్వారా రోజురోజుకూ రైతులు అధిక సాంద్రత పత్తి సాగుపై మక్కువ కనబరుస్తున్నారు. దీంతో మొక్కల సంఖ్య పెరిగి పంట దిగుబడి పెరగటంతో పాటుగా ఆర్థికంగా చేయూత వచ్చే విధంగా కృషి చేస్తున్నారు.మరిన్ని విశేషాలు.. » పెసర, మినుము, కందిలో కొత్త రకాలను చిరు సంచుల రూపంలో రైతులకు అందజేసి పంటల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. » కిసాన్ సారథి మొబైల్ యాప్ ద్వారా జిల్లా వ్యాప్తంగా 1,12,124 మంది రైతులను అందులో సభ్యులుగా చేర్చారు. పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలను కిసాన్ సారథి మొబైల్ యాప్ ద్వారా సమాచారాన్ని రైతులకు చేరవేస్తున్నారు. » డిస్ట్రిక్ట్ ఆగ్రో మెటరాలజీ యూనిట్ (దాము) వాట్సాప్ గ్రూపు ద్వారా 2023–24 సంవత్సరంలో రైతులకు వాతావరణ సూచనలు చేరవేశారు. »మల్యాల కేవీకే అనుసంధానంలో రైతులకు మిరపలో సాగు జాగ్రత్త చర్యలో భాగంగా నీలిరంగు, పసుపు రంగు జిగురు అట్టలను మిరప పంట చేలలో ఏర్పాటు చేసుకుని పంటను కాపాడుకునే విధానాలపై తెలియజేస్తున్నారు. మిరపలో సమగ్ర వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ మల్చింగ్ విధానం వల్ల కలిగే లాభాలు, మిరప పంట చేనుల చుట్టూ బంతి పూల చెట్లు, మొక్కజొన్న వేసుకుంటే మేలుదాయకమని అవగాహన కల్పిస్తున్నారు. » వరిలో నేరుగా వెదజల్లే పద్ధతి ద్వారా రైతులకు లాభాలు చేకూరుస్తున్నారు. » మొక్కజొన్నలో జంటసాళ్ల పద్ధతిపై అవగాహన కల్పిస్తున్నారు. » యాసంగిలో జీరో టిల్లేట్ పద్ధతిలో మొక్కజొన్న సాగు లాభదాయకంపై తెలియజేస్తున్నారు. » వరి, మిరప పంటలకు ముందుగా పచ్చిరొట్ట పంటలు సాగు చేయాలని అవగాహన కల్పించటం వల్ల 40 శాతం వరకు రైతులు వృద్ధి సాధిస్తుండగా సూడోమోనోస్ జీవ నియంత్రికల వాడకాన్ని పెంచారు.మందుల వాడకం తగ్గించాలి రైతులు పంటల సాగు సమయంలో పురుగు మందులు, తెగుళ్ల మందులు అధికంగా వాడటం వల్ల భూసారం దెబ్బతింటుంది. పురుగు మందులు, తెగుళ్ల మందుల వాడకం తగ్గించడం శుభసూచకం. తద్వారా మనం సాగుచేసే నేల పాడైపోకుండా భావితరాల వారికి అందించే విధంగా ఉంటుంది. విచక్షణారహితంగా మందుల వాడకాన్ని తగ్గించాలి. సమీకృత వ్యవసాయాన్ని ఆచరించాలి. భావితరాల పురోగతికి నాంది పలకాలి. – డాక్టర్ ఎస్.మాలతి, మల్యాల కేవీకే సమన్వయకర్త గ్రామీణ యువతకు అవగాహన కల్పిస్తున్నాం... మల్యాల కేవీకే ద్వారా నిర్వహించే వివిధ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలతో గ్రామీణ యువతకు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై అవగాహన కల్పిస్తున్నాం. తద్వారా వారు ఉపాధి అవకాశాలు పొందే విధంగా ప్రోత్సహిస్తున్నాం. జిల్లాలోని రైతులకు సమగ్ర ఎరువులు, పురుగు మందుల వాడకంపై తెలియజేస్తూ వారు సమగ్ర వ్యవసాయం చేసే విధంగా అవగాహన కల్పిస్తున్నాం. - డాక్టర్ ఎన్.కిషోర్ కుమార్, మల్యాల కేవీకే శాస్త్రవేత్త కొత్త రకాల విత్తనాలతో దిగుబడి సాధించా.. మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా నేను కొత్త రకాలైన వరి, పెసర విత్తనాలను తీసుకున్నాను. వాటి ద్వారా అధిక దిగుబడి సాధిస్తూ నాతోటి రైతులకు కొత్త రకం వరి, పెసర రకాలను పరిచయం చేస్తున్నాను. కేవీకే ద్వారా ఏర్పాటు చేస్తున్న అనేక శిక్షణ కార్యక్రమాలు, రైతు సదస్సులకు హాజరవుతున్నాను. తద్వారా రైతులు కొత్త విషయాలను తెలుసుకునే విధంగా సాయం చేస్తున్నాను. ముఖ్యంగా నేరుగా వరిలో విత్తేపద్ధతి, సమగ్ర వ్యవసాయం, కొత్త రకాలు, వివిధ పంటల్లో జంటసాళ్ల పద్ధతి మొక్కజొన్నలో అవలంబిస్తూ ఆర్థిక లబ్ధి పొందుతున్నాను. –గండ్రాతి భాస్కర్‌రెడ్డి, రైతు, బయ్యారం అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేస్తున్నాను మల్యాల కేవీకే ద్వారా గత మూడు సంవత్సరాలుగా నేను అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేస్తున్నాను. దీని ద్వారా ఎకరాకు పది నుంచి 11 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తుండగా ఆర్థికంగా అభివృద్ధి ఉంటోంది. పత్తి తర్వాత జొన్న, బొబ్బెర పంటలను సాగుచేసి ఆదాయాన్ని పొందుతున్నాను. మల్యాల కేవీకే ద్వారా ముఖ్యంగా సమగ్ర ఎరువులు, పురుగు మందుల యాజమాన్యం, అధిక సాంద్రత పత్తిసాగు, కొత్త రకాలైన విత్తనాలు, సమగ్ర వ్యవసాయంపై విషయాలు తెలుసుకుని తోటి రైతులు అవలంబించే విధంగా ప్రోత్సహిస్తున్నాను. –మాలోతు బాలాజీ, రైతు, చంద్రుతండా -
నాడు హడావుడి చేసి.. నేడు ముఖం చాటేసి!
సాక్షి ప్రతినిధి, విజయవాడ/హనుమాన్‌జంక్షన్ రూరల్: గోడు వినలేదు.. కనికరం చూపలేదు.. కనీసం కలిసేందుకు అవకాశం ఇవ్వలేదు. నాడు హామీ ఇచ్చారు కదా.. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా.. అని ఆశతో వస్తే.. ముఖం చాటేశారు. రోజంతా ఎదురుచూసినా ఫలితం దక్కలేదు. ఇక చేసేది లేక నిరాశతో వెనుదిరిగారు. ఇదీ మంగళవారం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం వద్ద డెప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను కలిసేందుకు వచ్చిన మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడ నిర్వాసితుల పరిస్థితి. 2019 ఎన్నికల ముందు స్వయంగా మల్లవల్లి వచ్చి భూ నిర్వాసితుల ఆందోళనకు మద్దతు తెలపటంతో పాటుగా, అధికారంలోకి రాగానే బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన పనన్ కల్యాణ్ ఇప్పుడూ ముఖం చాటేయటంతో ఉసూరుమంటూ వెనుదిరిగారు.అసలు విషయం ఏమిటంటే..2016లో పారిశ్రామికవాడ ఏర్పాటుకు మల్లవల్లిలోని రీ సర్వే నంబర్–11లో 1360 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించారు. అప్పటికే ఆ భూములను సాగు చేస్తున్న రైతులను గుర్తించేందుకు జియోకాన్ అనే సంస్థతో ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 623 మంది సాగుదారులు ఉన్నట్లు నివేదిక ఇవ్వగా, ఆ తర్వాత రెవెన్యూ అధికారులు 716.44 ఎకరాల్లో 490 మంది సాగుదారులు ఉన్నట్లుగా తుది జాబితాను ప్రకటించారు. కానీ వివిధ కారణాలతో చివరికి 443 మంది రైతులకు గానూ 615.6 ఎకరాలకు మాత్రమే రూ.7.50 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని పంపిణీ చేశారు. దీంతో పరిహారం దక్కని సాగుదారులు ఎనిమిదేళ్లుగా ప్రజాప్రతినిధులు, అధికారుల చూట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సాగుదారుల లెక్క తేల్చే విషయంలో రెవెన్యూ అధికారులపై నాటి టీడీపీ నాయకుల ఒత్తిడితోనే పలువురి పేర్లు తుది జాబితాలో గల్లంతయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయగా, 217 మంది సాగుదారులు 713 ఎకరాలకు నష్టపరిహారం దక్కలేదని అర్జీలు దాఖలు చేశారు.పవన్‌కల్యాణ్, లోకేష్ హడావుడి హామీలు..నష్టపరిహారం అందని సాగుదారులు పలు దఫాలుగా ఆందోళనలు చేపట్టారు. ఏపీఐఐసీ ఇప్పటికే పరిశ్రమలకు భూకేటాయింపులు చేయటంతో ఆ సంస్థలు చేపట్టిన నిర్మాణాలను సాగుదారులు అడ్డుకుంటూ నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే గత ఏడాది ఆగస్ట్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మల్లవల్లి పారిశ్రామికవాడలో పర్యటించారు. నష్టపరిహారం అందని సాగుదారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ మల్లవల్లి గ్రామానికి వచ్చినప్పుడు బాధితులు తమ గోడును విన్నవించగా న్యాయం చేస్తానని హామీనిచ్చారు. ఈ హామీలను నమ్మిన భూనిర్వాసితులు ఇప్పుడు నెత్తికొట్టుకుంటున్నారు. పవన్ కల్యాణ్‌ను కలిసి తమ కష్టాన్ని చెప్పుకునేందుకు వెళ్తే కనీసం దర్శనభాగ్యం కలగలేదంటూ వాపోతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లవల్లి భూనిర్వాసితుల ఊసే పవన్ కల్యాణ్, నారా లోకేష్‌కు పట్టలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తాజా పరిణామాలు ఇవి..బాపులపాడు మండలం మల్లవల్లిలోని ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో పరిహారం దక్కని రైతుల స్వాధీనంలో ఉన్న భూములను బలవంతంగా లాక్కునేందుకు కూటమి ప్రభుత్వం దౌర్జన్యకాండకు దిగింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ నెల మూడో తేదీ నుంచి నాలుగురోజుల పాటు గ్రామాన్ని అదుపులోకి తీసుకుంది. భూనిర్వాసితులను గృహ నిర్బంధం చేసి, వారి భూములను దౌర్జన్యంగా స్వాధీనం చేసుకుంటోంది. పారిశ్రామికవాడలోకి ఇతరులను ఎవ్వరిని అనుమతించకుండా బారికేడ్లు ఏర్పాటు చేసింది. ఎనిమిదేళ్లుగా పరిహారం కోసం కళ్లు కాయలు కాసేటట్లు ఎదురుచూస్తున్న సాగుదారులను నిర్ధాక్షిణ్యంగా ఇళ్లలో బంధించి, వారి భూములను బలవంతంగా లాక్కొంటున్న కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది.పవన్‌కల్యాణ్, లోకేష్ హడావుడి హామీలు..నష్టపరిహారం అందని సాగుదారులు పలు దఫాలుగా ఆందోళనలు చేపట్టారు. ఏపీఐఐసీ ఇప్పటికే పరిశ్రమలకు భూకేటాయింపులు చేయటంతో ఆ సంస్థలు చేపట్టిన నిర్మాణాలను సాగుదారులు అడ్డుకుంటూ నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే గత ఏడాది ఆగస్ట్‌లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మల్లవల్లి పారిశ్రామికవాడలో పర్యటించారు. నష్టపరిహారం అందని సాగుదారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ మల్లవల్లి గ్రామానికి వచ్చినప్పుడు బాధితులు తమ గోడును విన్నవించగా న్యాయం చేస్తానని హామీనిచ్చారు. ఈ హామీలను నమ్మిన భూనిర్వాసితులు ఇప్పుడు నెత్తికొట్టుకుంటున్నారు. పవన్ కల్యాణ్‌ను కలిసి తమ కష్టాన్ని చెప్పుకునేందుకు వెళ్తే కనీసం దర్శనభాగ్యం కలగలేదంటూ వాపోతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లవల్లి భూనిర్వాసితుల ఊసే పవన్‌కల్యాణ్, నారా లోకేష్ కు పట్టలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాక్కోవటం తగదు.. మల్లవల్లి పారిశ్రామికవాడ భూముల్లో సుమారు 150 మందికిపైగా నష్టపరిహారం అందలేదు. దీనిపై ఎనిమిదేళ్లుగా పలు రకాలుగా ఆందోళనలు, పోరాటాలు చేశాం. ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ కూడా వచ్చి న్యాయం చేస్తామని మాట ఇచ్చారు. కానీ ఇప్పుడు నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా పోలీసు బలగాన్ని అడ్డుపెట్టుకుని బలవంతంగా భూములు లాక్కోవటం సబబు కాదు. – చిన్నాల వరప్రసాద్, భూ నిర్వాసితుల ఉద్యమ నేత, మల్లవల్లికోర్టు ఆదేశాలు ఉన్నా బేఖాతరు.. మల్లవల్లిలోని ఆర్ఎస్ నంబర్ 11లో మా కుటుంబానికి 15 ఎకరాల భూమి ఉంది. దశాబ్దాలుగా ఆ భూమిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. కానీ పారిశ్రామికవాడకు భూసేకరణ జరిగినప్పుడు మాకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఈ భూమిపై గతంలోనే కోర్టు ద్వారా పరి్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది. అయినప్పటికీ రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులు భూములు స్వా«దీనం చేసుకుంటున్నారు. – బొకినాల సాంబశివరావు, నిర్వాసితుడు, మల్లవల్లిఅలసిపోయాను.. చెట్లు, ముళ్ల పోదలతో అడవిలా ఉన్న భూమిని మా కుటుంబం అంతా కలిసి నానా కష్టాలు పడి చదును చేసుకున్నాం. ఆ భూమిలోనే పంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తరుణంలో టీడీపీ ప్రభుత్వం పారిశ్రామికవాడ ఏర్పాటు చేస్తామని భూములు లాక్కొది. కానీ ఒక్క రూపాయి కూడా పరిహారం చెల్లించలేదు. ఎన్నో సార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి అలసిపోయాను. ఆ మనోవేదనతో ఆరోగ్యం బాగా క్షీణించింది. – పంతం కామరాజు, నిర్వాసితుడు, మల్లవల్లి -
సాగు యోగ్యతతోనే ‘భరోసా’!: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏటా రూ.12 వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా ఏటా రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. ఈ కొత్త పథకానికి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’అని పేరుపెట్టినట్టు తెలిపారు. ఇక రాష్ట్రంలో రేషన్‌కార్డు లేని పేద కుటుంబాలన్నింటికీ కొత్త రేషన్‌కార్డులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి జనవరి 26తో 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ మూడు పథకాల అమలును ప్రారంభించాలని నిర్ణయించామని తెలిపారు. శనివారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలసి రేవంత్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. వారికి రైతు భరోసా వర్తించదు.. రైతుభరోసా విషయంలో ఎలాంటి గందరగోళం అవసరం లేదని సీఎం రేవంత్ పేర్కొన్నారు. వ్యవసాయ యోగ్యం కాని భూములంటే.. రాళ్లు, రప్పలు, గుట్టలు, రోడ్ల నిర్మాణంలో పోయిన భూములు, మైనింగ్ భూములు, నాలా కన్వర్షన్ పొందిన భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పరిశ్రమల కోసం సేకరించిన భూములు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయబోమని సీఎం స్పష్టం చేశారు. రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా (లబ్ధిదారుల) సమాచారం సేకరించి గ్రామసభల ద్వారా ప్రజలకు వివరిస్తారని తెలిపారు. ప్రభుత్వం, అధికారుల వద్ద ఉన్న సమాచారం ఆధారంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను వర్తింపజేస్తామని వెల్లడించారు. రెవెన్యూ రికార్డుల్లో, ధరణిలో లోపాలతో గతంలో వ్యవసాయానికి యోగ్యంకాని భూములకూ రైతుబంధు వచ్చిందని.. వారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి వివరాలు అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్థిక పరిస్థితి, వెసులుబాటు మేరకు.. రైతు భరోసా కింద ఎకరాకు ఏటా రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయాన్ని మీడియా గుర్తు చేయగా.. గత ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరాకు రూ.10 వేలు ఇస్తే తాము రూ.12 వేలకు పెంచామని సీఎం రేవంత్ బదులిచ్చారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, వెసులుబాటును బట్టి భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు సైతం రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఆదాయం పెంచి పేదలకు పంచడమే తమ ప్రభుత్వ విధానమని చెప్పారు. ఎంత వెసులుబాటు ఉంటే అంతగా రైతులకు మేలు చేయాలన్నదే తమ ఆలోచన అని పేర్కొన్నారు. భూమి లేని వారి ఆవేదన తీర్చడానికి.. ‘‘తమకు భూములు లేకపోవడం ఒక శాపమైతే, ప్రభుత్వం పట్టించుకోకపోవడం మరో శాపమని గతంలో నేను, భట్టి విక్రమార్క, ఇతర సహచరులు నిర్వహించిన పాదయాత్రల సందర్భంగా తండాల్లో, మారుమూల ప్రాంతాల్లోని భూమి లేని వ్యవసాయ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. వాళ్లు కూడా సమాజంలో, మనలో భాగమని గుర్తించి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకాన్ని తీసుకొచ్చాం. చాలా ఏళ్ల నుంచి రేషన్‌కార్డుల సమస్య పేదవాళ్లను పట్టి పీడిస్తోంది. రేషన్‌కార్డులు లేని వారందరికీ జనవరి 26 నుంచి కొత్త కార్డులు ఇస్తాం’’ అని సీఎం రేవంత్ చెప్పారు. కేసీఆర్ కుటుంబం వెయ్యేళ్లు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది రైతుబంధు కింద అనర్హులకు చెల్లించిన రూ.వేల కోట్లను తిరిగి వసూలు చేస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘గతంలో ఏం జరిగిందో వెనక్కి వెళితే కేసీఆర్ కుటుంబం వెయ్యేళ్లు జైలు శిక్షకు వెళ్లాల్సి ఉంటుంది. రైతు భరోసాకు సంబంధించి విపక్షాలు శాయశక్తులా ఊహాగానాలు రేపాయి. ఉన్నవి లేనివి ప్రభుత్వ నిర్ణయాలంటూ ప్రచారం చేసి రైతుల్లో గందరగోళం సృష్టించాయి. రైతులకు మేం శుభవార్త వినిపించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం’’ అని సీఎం రేవంత్ చెప్పారు. కొత్త సంవత్సరంలో మొదటిసారి పత్రికా సమావేశం నిర్వహిస్తున్నామని.. రాష్ట్ర రైతాంగానికి మంచి జరగాలని, ఈ ప్రభుత్వం వాళ్లను అన్నిరకాలుగా ఆదుకోవాలని సీఎం ఆకాంక్షించారు. వ్యవసాయం దండుగ కాదు పండుగ చేయాలని తమ ప్రభుత్వం పట్టుదలతో ఈ పథకాలను చేపట్టిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్రావు, కొండా సురేఖ, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు.కేబినెట్ తీసుకున్న ఇతర కీలక నిర్ణయాలివే..పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి పేరు పెట్టాలని నిర్ణయంసింగూరు ప్రాజెక్టు కెనాల్‌కు మంత్రి దామోదర రాజనర్సింహ తండ్రి, మాజీ మంత్రి రాజనర్సింహ పేరు పెట్టేందుకు ఆమోదం.జూరాల జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించి మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్తగా ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఉన్న మార్గాలు, ప్రత్యామ్నాయాల పరిశీలన కోసం టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ నియామకం. ఎంత నీటి లభ్యత ఉంది? ఎక్కడ ఉంది? ఎక్కడి నుంచి ఎంతెంత నీటిని తీసుకునే వీలుంది? ఎక్కడెక్కడ రిజర్వాయర్లు నిర్మించాలనే అంశాలతోపాటు ఇప్పుడున్న ప్రాజెక్టుల ద్వారా మరింత నీటిని తీసుకునేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై ఈ కమిటీతో అధ్యయనం చేయించాలని నిర్ణయం.మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను తాగునీటి అవసరాల కోసం హైదరాబాద్‌కు తరలించేందుకు ప్రతిపాదించిన గోదా వరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్–2,3లకు ఆమోదం. గతంలో 15 టీఎంసీల తరలింపునకు ఈ ప్రాజెక్టు ప్రతిపాదించగా.. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 20 టీఎంసీలకు పెంచేందుకు నిర్ణయం. కొత్తగూడెం మున్సిపాలిటీకి మున్సిపల్ కార్పొరేషన్‌గా హోదా పెంపు. -
‘రీజినల్’లో మెరుగైన పరిహారం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు భూనిర్వాసితులకు మెరుగైన పరిహారం అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు పరిహారంలో ఉదారంగా వ్యవహరించాలని... ఆర్బిట్రేటర్లుగా ఉన్న జిల్లా కలెక్టర్లు వీలైనంత మేర దాన్ని ఖరారు చేయాలని సూచించారు. సీఎం రేవంత్ శుక్రవారం రాత్రి రోడ్లు భవనాల శాఖ అధికారులతో సమీక్షించారు. రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం భూసేకరణను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణ సమయంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించాలని, తరచూ రైతులతో సమావేశమై రహదారి నిర్మాణంతో కలిగే ప్రయోజనాలను వివరించాలని సూచించారు. రీజినల్ రింగు రోడ్డు దక్షిణ భాగం నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ సూత్రప్రాయ ఆమోదం తెలిపినందున.. హెచ్ఎండీఏతో అలైన్మెంట్ చేయించాలని ఆదేశించారు. జిల్లాల నుంచి హైదరాబాద్‌ను కలిపే 11 రహదారులకు ఆటంకం లేకుండా రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు, రీజినల్ రింగురోడ్డు మధ్య అనుసంధానంలో ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఇతర ప్రధాన రహదారులపై ఫోకస్ మంచిర్యాల– పెద్దపల్లి– భూపాలపల్లి– వరంగల్– హన్మకొండ– మహబూబాబాద్– ఖమ్మం మీదుగా సాగే నాగ్‌పూర్–విజయవాడ రహదారి... ఆర్మూర్–జగిత్యాల–మంచిర్యాల రహదారి.. జగిత్యాల–కరీంనగర్ రహదారుల నిర్మాణంతోపాటు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల (ఎల్‌డబ్ల్యూఎఫ్) రోడ్ల నిర్మాణంపైనా సీఎం రేవంత్ సమీక్షించారు. ఈ రహదారుల నిర్మాణానికి సంబంధించి భూసేకరణ, అటవీ అనుమతుల్లో ఆటంకాలను అధిగమించేందుకు పలు సూచనలు చేశారు. ప్రజలకు ఉపయోగపడే రహదారుల నిర్మాణంలో అటవీ శాఖ ఎందుకు కొర్రీలు పెడుతోందని ‘ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు (పీసీసీఎఫ్)’డోబ్రియల్‌ను ప్రశ్నించారు. పలు అంశాల్లో నిబంధనలు పాటించకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని సీఎంకు పీసీసీఎఫ్ బదులిచ్చారు. దీనితో రాష్ట్రస్థాయిలో తేల్చగల సమస్యలను ఇక్కడే పరిష్కరిస్తామని.. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ వరకు వెళ్లే అంశాలపై వెంటనే నివేదిక రూపంలో సమర్పించాలని సూచించారు. ఆర్అండ్బీ, అటవీ శాఖల నుంచి ఒక్కో అధికారిని ప్రత్యేకంగా ఈ సమస్యల పరిష్కారం కోసం కేటాయించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సీఎస్ వారితో పదిరోజులకోసారి సమీక్షించి త్వరగా క్లియరెన్సులు వచ్చేలా చూడాలని... ఇక్కడ కాకపోతే సంబంధిత మంత్రులు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి, అధికారులను కలవాలని స్పష్టం చేశారు. జాతీయ రహదారుల నిర్మాణంలో అండర్ పాస్‌ల ఏర్పాటును విస్మరిస్తుండటంతో రైతులు ఇబ్బందిపడుతున్నారని సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గుర్తుచేశారు. దీనితో ఈ సమస్య ఎదురుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణంపై... హ్యామ్ విధానంలో ఆర్అండ్బీ పరిధిలో 12 వేల కిలోమీటర్లు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 17,700 కిలోమీటర్లు రహదారులు నిర్మించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ రహదారుల నిర్మాణానికి సంబంధించి పాత జిల్లాలను యూనిట్‌గా తీసుకోవాలని సూచించారు. కన్సల్టెన్సీల నియామకం, డీపీఆర్‌ల తయారీ, వేగంగా పనులు చేపట్టడంపై దృష్టి సారించాలని... మూడేళ్లలో నిర్మాణం పూర్తికావాలని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టాలని, కూలిన వంతెనలను వెంటనే నిర్మించాలని ఆదేశించారు. రహదారుల నిర్మాణం, మరమ్మతులకు సంబంధించి రాష్ట్ర వాటా నిధులు వెంటనే విడుదల చేసి.. కేంద్రం నుంచి రావాల్సిన మ్యాచింగ్ గ్రాంట్‌ను పొందాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రామీణ రోడ్ల నిర్మాణానికి రూ.వెయ్యి కోట్లు రాష్ట్రంలో గ్రామీణ రహదారుల నిర్మాణానికి సీఎం రూ.వెయ్యి కోట్లను కేటాయించారు. ఈ నెల నుంచే నెలకు రూ.150 కోట్ల చొప్పున ఈ నిధులను విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. గతంలో ఎడ్ల బండ్లు, సైకిళ్లు, మోటార్ సైకిళ్ల రాకపోకలకు అనుగుణంగా గ్రామ రోడ్లను నిర్వహించేవారని.. ఇప్పుడు అన్నిచోట్లా కార్లు, ట్రాక్టర్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలు తిరుగుతున్నందున వాటి రాకపోకలకు వీలుగా రోడ్లను వెడల్పు చేయాలని సూచించారు. ప్రతి పంచాయతీకి బీటీ రోడ్డు ఉండాలని, గ్రామాల నుంచి మండలాలకు సింగిల్ రోడ్లు, మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు కచి్చతంగా ఉండాలని పేర్కొన్నారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రహదారుల నిర్మాణ నాణ్యతలో తేడాలు చూపొద్దని స్పష్టం చేశారు. అటవీ ప్రాంతాల్లోని గ్రామాలకు సైతం రహదారులు నిర్మించాలని సూచించారు. -
రైతు భరోసా కోసం తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: రైతులకు పంట పెట్టుబడి సాయం ‘రైతు భరోసా’(Rythu Bharosa) అందించే విషయంలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఈ పథకం అమలుపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. వ్యవసాయేతర భూములకు పెట్టుబడి సాయం అందించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని.. ఈ విషయంలో రెవెన్యూ, వ్యవసాయ శాఖలు కలసి క్షేత్రస్థాయిలో సంయుక్త తనిఖీలను చేపట్టాలని సిఫారసు చేసింది. గురువారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీ(Cabinet sub committee) సమావేశంలో ఈ మేరకు ఆరు సిఫారసులను ఆమోదించింది. ‘రైతు భరోసా’పై సబ్ కమిటీ చేసిన సిఫారసులివే.. ⇒ పంటలు పండించే భూములకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయాలి. తోటలు పెంచే భూములకు వానాకాలం లేదా యాసంగిలో ఒక్క సీజన్లో మాత్రమే సాయం ఇవ్వాలి. ఏ భూమికి కూడా ఏడాదికి రెండుసార్లకు మించి సాయం అందించకూడదు. ⇒ ప్రతి సీజన్‌కు ముందు రైతులు సాగు ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్లైన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ లేదా ప్రజాపాలన కేంద్రాల్లో రైతులు ఇచ్చే ఈ ధ్రువీకరణలను శాటిలైట్, క్షేత్రస్థాయి పరిశీలనల ఆధారంగా నిర్ధారించాలి. ⇒ ఈ ఏడాది యాసంగి సీజన్లో పంటల సాగును శాటిలైట్ చిత్రాల ద్వారా నిక్షిప్తం చేయాలి. ⇒ రాష్ట్రంలో పంటల సాగు పరిస్థితిని తెలుసుకోవడంతోపాటు డిజిటల్ రికార్డులను అప్డేట్ చేసేందుకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణాధికారులు, మండల వ్యవసాయాధికారులు, గ్రామ పంచాయతీల కార్యదర్శులు, పలు శాఖలకు చెందిన గ్రామస్థాయి అధికారులతో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలి. ⇒ సాగు యోగ్యం కాని భూములను గుర్తించాలి. కొండలు, రోడ్లు, రాళ్లు ఉండే భూములు, భౌగోళికంగా సాగుకు అనర్హమైన భూములను గుర్తించాలి. ఆర్వోఆర్ డేటాలో వ్యవసాయ భూములుగా ఉండి నివాస, పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న భూములను వేరు చేయాలి. ⇒ రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి భౌగోళికంగా వ్యవసాయానికి పనికిరాని భూములను, వ్యవసాయేతర అవసరాలకు జరిగిన మార్పిడిని గుర్తించాలి. ఈ భూములకు రైతు భరోసా వర్తింపజేయకూడదు. ⇒ మాజీ, తాజా ప్రజాప్రతినిధులకు, వారి కుటుంబాలకు, ఐటీ చెల్లింపుదారులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఈ పథకం వర్తింపచేయకూడదు. వీరిని గుర్తించేందుకు ఆహార భద్రత కార్డులు, 2024లో నిర్వహించిన కులగణనను ప్రాతిపదికగా తీసుకోవాలి. అయితే ఈ మినహాయింపును రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం మేరకు వర్తింపచేయాలి. -
ఉగాదికి సన్నబియ్యం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పేదలందరికీ రేషన్‌కార్డులపై ఉచితంగా సన్న బియ్యం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. కుటుంబంలో ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీని.. ఉగాది నుంచి ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఖరీఫ్ (వానాకాలం)లో రైతులు పండించిన సన్న ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇచ్చి సేకరిస్తున్న ప్రభుత్వం.. ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం సచివాలయంలో జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు కొత్త రేషన్‌కార్డుల కోసం ఇప్పటికే 20 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. అయితే మరోసారి కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు కోరుతూ కేబినెట్ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని సమాచారం. అదనంగా 10 లక్షల కొత్త కార్డులు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది. పేద, దిగువ మధ్య తరగతికి ఊరట ప్రస్తుతం రాష్ట్రంలో 89.6 లక్షల రేషన్ కార్డుల ద్వారా 2.81 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. ప్రతి లబ్ధిదారుకు నెలకు 6 కిలోల చొప్పున దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్నారు. దీనికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయనుంది. తద్వారా బియ్యం బ్లాక్ మార్కెటింగ్, రీసైక్లింగ్‌ను పూర్తిగా కట్టడి చేయవచ్చని భావిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో సన్న బియ్యం ధరలు బాగా పెరిగిపోయాయి. సాధారణ రకం సన్న బియ్యం ధర కిలో రూ.60–65 వరకు ఉండగా.. ఫైన్ రకాల బియ్యం ధర రూ.70కిపైగానే ఉంది. దీనితో పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలపై భారం పడుతోంది. ప్రభుత్వం రేషన్‌కార్డులపై ఇస్తున్న దొడ్డు బియ్యాన్ని తినేందుకు ఆసక్తి చూపని మధ్య తరగతి వర్గాల వారు ఆ బియ్యాన్ని కిలో రూ.10–20 చొప్పున దళారులకు విక్రయిస్తున్నారు. ఈ బియ్యం తిరిగి రైస్‌మిల్లులకు చేరుతోంది. మిల్లులు ఈ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కస్టమ్ మిల్లింగ్ కింద ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. రేషన్‌పై సన్న బియ్యం పంపిణీ ప్రారంభిస్తే దానిని వినియోగించుకుంటారని.. బ్లాక్ మార్కెట్ సమస్య తీరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అదనపు ఖర్చేమీ లేకుండానే పేద, మధ్యతరగతి కుటుంబాల వారు సన్న బియ్యం అన్నం తింటారని, ఇది వారికి భారీ ఊరట అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సర్కార్‌పై మరో రూ.1,500 కోట్ల భారం రాష్ట్రంలో 89.6 లక్షల రేషన్‌కార్డులు ఉండగా.. అందులో జాతీయ ఆహార భద్రత పథకం కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినవి 54.5 లక్షలు ఉన్నాయి. అంత్యోదయ అన్న యోజన పథకం కింద మరో ఐదున్నర లక్షల కార్డులున్నాయి. వీరందరికీ కేంద్ర ప్రభుత్వమే ఒక్కొక్కరికి నెలకు 5 కిలోల చొప్పున బియ్యం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చేదానికి అదనంగా మరో కిలో అదనంగా కలిపి ఆరు కిలోల చొప్పున లబ్ధిదారులకు అందిస్తోంది. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన మరో 35.66 లక్షల ఆహార భద్రత కార్డులపై రాష్ట్ర ఖర్చుతోనే బియ్యం పంపిణీ చేస్తోంది. ఇదంతా దొడ్డు బియ్యం మాత్రమే. అయితే కేంద్రం నేరుగా బియ్యం ఇవ్వకుండా కిలోకు రూ.36 చొప్పున రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్ ద్వారా.. ఈ బియ్యాన్ని సమకూర్చుకుంటుంది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 89.6 లక్షల కార్డుదారులకు సన్న బియ్యం సరఫరా చేయనుంది. సన్న బియ్యం కోసం కిలోకు రూ.55, ఆపై ఖర్చవుతుందని అంచనా. అంటే కేంద్రం ఇచ్చే నిధులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వమే వ్యయాన్ని భరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏటా సుమారు రూ.3,600 కోట్ల సబ్సిడీని భరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై సన్న బియ్యం పంపిణీతో మరో రూ.1,500 కోట్ల వరకు భారం పడే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. బియ్యం బాగుంటాయన్న సూచనలతో..సంక్రాంతి నుంచే సన్నబియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ వానాకాలంలో రైతుల నుంచి సేకరించిన సన్నవడ్లను కనీసం రెండు మూడు నెలలైనా మాగనిచ్చి మిల్లింగ్ చేస్తేనే బియ్యం బాగుంటాయని నిపుణులు సూచించడంతో.. రెండు నెలల తర్వాతే సన్న వడ్లను మిల్లింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఉచిత సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించడానికి కొంత సమయం పడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గంలో చర్చించిన అనంతరం దీనిపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నాయి. ఉగాది (మార్చి నెలాఖరు) నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. -
అన్నదాతలకు అండగా కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు... డీఏపీపై వన్-టైమ్ స్పెషల్ ప్యాకేజీ పొడిగింపు
-
నడి రోడ్డుపై అన్నదాతకు అవమానం
పది మందికి అన్నం పెట్టే అన్నదాతను అగచాట్లకు గురిచేసింది. కూటమి ప్రభుత్వం నడి రోడ్డుపై అవమానించింది. నూతన సంవత్సరం వేళ మిల్లర్లతో కలిసి అన్నదాతలతో ఆడుకుంది. ఆరుగాలం శ్రమించి పంటను అమ్ముకునేందుకు వెళ్లిన రైతులను నడిరోడ్డుపై నిలబెట్టింది. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ప్రియాగ్రహారంలో బుధవారం జరిగిన ఈ ఘటన రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది.పోలాకి: ఇటీవల కురిసిన ఎడతెరిపి లేని వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో చాలా చోట్ల ధాన్యం రంగుమారింది. ప్రభుత్వం వారిని పట్టించుకోకుండా వదిలేసింది. ఇదే అదనుగా కొందరు మిల్లర్లు అక్రమాలకు తెగబడుతున్నారు. తేమ పేరిట రైతులను నిలువునా దగా చేస్తున్నారు. అధికారులూ మిల్లర్లకే అమ్మాలని తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వం, మిల్లర్లు కలిసి ఆడుతున్న ఈ ఆటలో రైతులు నలిగిపోతున్నారు. బుధవారం పొలాకి మండలం ప్రియాగ్రహారంలో 20 మంది అన్నదాతలు నడిరోడ్డుపై నిలబడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రియాగ్రహారానికి చెందిన రైతులు బుధవారం రైతు సేవా కేంద్రానికి వెళ్లి ధాన్యానికి ట్రక్‌షీట్ వేయాలని కోరారు. ధాన్యం శాంపిల్ చూసిన సిబ్బంది.. తాము తేమ శాతం మాత్రమే నిర్థారించగలమని, రంగు మారినట్లు కనిపిస్తున్నందున మిల్లర్‌ను సంప్రదించాలని చెప్పారు. రైతులు మిల్లర్ దగ్గరకు వెళ్లగా.. మద్దతు ధర ఇవ్వలేనంటూ కరాఖండిగా చెప్పేశారు. కొద్దిసేపటికి మిల్లర్ తరపున దళారీ ఎంటరయ్యాడు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర (80 కేజీలు) రూ.1,840 కాగా.. రైతు సొంత ఖర్చులతో ధాన్యాన్ని మిల్లు వద్ద చేర్చేలా రూ.1,700కు దళారీ రేటు మాట్లాడాడు. గత్యంతరం లేక రైతులు అంగీకరించారు. ధాన్యం ట్రాక్టర్లకు లోడ్ చేశారు. ఇంతలో మిల్లర్ మళ్లీ మాటమార్చేశాడు. ఆ ధాన్యం తమకు వద్దని, రూ.1,500 మాత్రమే ఇస్తామని, లేదంటే అసలు తీసుకోనని తెగేసి చెప్పాడు. దీంతో రైతులు నిర్ఘాంతపోయారు. సొంత ఖర్చులతో ధాన్యం తెచ్చిన తర్వాత తీసుకోకపోతే ఎలా అంటూ రోడ్డపైన ఆందోళనకు దిగారు. రైతంటే ఇంత చిన్నాచూపా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య మండలం అంతా ఉందని రైతులు తెలిపారు. బియ్యం బాగున్నా కొనరెందుకు?ధాన్యం పైకి రంగు మారినట్లు కనిపిస్తున్నా, లోపల బియ్యం బాగుందని రైతులు చెబుతున్నారు. రంగు మారిన ధాన్యం నుంచి తీసిన బియ్యాన్ని వారు చూపించి, నాణ్యత ఏమాత్రం తగ్గలేదని తెలిపారు. అయినా ఎందుకు కొనడంలేదని నిలదీశారు. రైతులకు జరిగిన అవమానాన్ని, వారి ఆవేదనను ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. ఉన్నతాధికారులు రంగంలోకి దిగి మిల్లర్లకు నచ్చజెప్పారు. మిల్లర్లు చెప్పిన ధరకు, మద్దతు ధరకు మధ్యస్తంగా మరో ధరకు రైతులను బలవంతంగా ఒప్పించారు.అవగాహన కల్పిస్తాంధాన్యం కొనుగోలు ప్రక్రియపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తాం. రంగు మారిన ధాన్యంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానందున మిల్లర్లు కొనడంలేదు. తుపాను ప్రభావం నేపథ్యంలో రైతుల వద్ద ఉన్న రంగు మారిన ధాన్యంపై ఉన్నతాధికారులకు నివేదిస్తాం. స్పష్టమైన ప్రకటన వచ్చిన తర్వాత రైతులకు తెలియజేస్తాం. – ఎం.సురేష్‌కుమార్, తహశీల్దార్, పోలాకిరైతులను వంచించారువర్షంతో పంట నేలవాలి అనేక గ్రామాల్లో ధాన్యం రంగు మారటంతో రైతులంతా నష్టపోయారు. అన్నదాతకు అండగా ఉంటామని చెప్పిన ప్రభుత్వం మమ్మల్ని వంచించింది. నూతన సంవత్సర ఆరంభం రోజున నడిరోడ్డుపై నిలబెట్టింది. అధికారులు మా సమస్య పరిష్కరించకుండా నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు లైన్లో నిలబడ్డారు. – దుర్రు యర్రయ్య, రైతు, ప్రియాగ్రహారంమళ్లీ దళారుల రాజ్యమే..పంట కొనుగోలులో మళ్లీ దళారుల రాజ్యం వచ్చింది. చాలాచోట్ల మిల్లర్లు దళారులతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని రైతులను నిలువునా ముంచుతున్నారు. మిల్లర్లు బ్యాంక్ గ్యారెంటీ పూర్తయ్యేలా కొనుగోలు చేసినట్లు రికార్డులు చూపించి, ఎంపిక చేసిన వారి ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నారు. వాస్తవానికి ఆ రైతులు ధాన్యం నూర్పిడి కూడా చేయడంలేదు. ఇది ముమ్మాటికీ మోసమే. ఇలాంటి వాటిపై ప్రతి మండలంలో మిల్లర్ల వారీగా అధికారులు సూక్ష్మ పరిశీలన చేయాలి. – కరిమి రాజేశ్వరరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ -
అసైన్డ్ భూములపై హక్కులు ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా అసైన్డ్ భూములకు హక్కులు కల్పించే అంశంలో అడుగు ముందుకుపడటం లేదు. రాష్ట్రంలోని 18 లక్షల మందికిపైగా పేద రైతులు అసైన్డ్ భూములపై హక్కులు ఎప్పుడు కల్పిస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు వెంటనే దీనిని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భూపరిపాలన అంశాలపై దృష్టి సారించి ఎంతో కొంత ముందుకెళుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. అసైన్డ్‌పై హక్కుల అంశాన్ని మాత్రం పక్కన పెట్టినట్టు వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. చట్టాన్ని సవరించాల్సిందే! భూమి లేని పేదలకు ఆర్థిక భద్రత కల్పించడం, సామాజిక గుర్తింపు ఇవ్వడమే ప్రధాన ఉద్దేశంగా తెలంగాణలో దశాబ్దాలుగా భూమి పంపిణీ జరుగుతోంది. పలు రకాల భూములను పేదలకు కేటాయిస్తూ వస్తున్నారు. ఇలా అసైన్ చేసిన భూములు అన్యాక్రాంతం కాకూడదనే ఉద్దేశంతో అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం (పీవోటీ)– 1977 తీసుకొచ్చారు. దాని ప్రకారం ప్రభుత్వం నుంచి ఉచితంగా భూమి పొందినవారు.. ఆ భూమిని ఇతరులకు విక్రయించకూడదు. దానం చేయకూడదు. కౌలుకు కూడా ఇవ్వకూడదు. వారసత్వంగా అనుభవిస్తూ వెళ్లే హక్కులు మాత్రమే ఉంటాయి. అయితే మాజీ సైనికులు పదేళ్ల తర్వాత, రాజకీయ బాధితులు మార్కెట్ ధర చెల్లించి ఉంటే వెంటనే అమ్ముకునే హక్కులు కల్పించారు. అయితే రైతుల అసైన్డ్ భూముల క్రయ, విక్రయ లావాదేవీలు జరగాలంటే భూబదలాయింపు నిరోధ చట్టాన్ని సవరించాలి. ఇందుకోసం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ఇచ్చేశారు! అసైన్డ్ భూములపై పేదలకు హక్కులు కల్పించడంలో కొన్ని దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. అసైన్ చేసి 20 ఏళ్లు దాటితే వాటిపై అసైనీలకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో 15 ఏళ్లకు, తమిళనాడులో 20 ఏళ్లకు, కేరళలో 25 ఏళ్లకు అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు వస్తాయి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో అయితే పదేళ్లకే యాజమాన్య హక్కులు వస్తాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా అసైన్డ్ భూములపై హక్కులు కల్పించాలనే డిమాండ్ రోజురోజుకూ ఊపందుకుంటోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ దిశగా పలుమార్లు హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదు. దీనిపై ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. భిన్నాభిప్రాయాలతో.. అసైన్డ్ భూములపై పేదలకు హక్కులు కల్పించే అంశంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ హక్కుల కల్పన ద్వారా తెలంగాణలో పెరిగిన భూముల ధరలతో పేద రైతులకు ఆర్థిక స్థిరత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కు టుంబ అవసరాల కోసం అత్యవసర పరిస్థితుల్లో భూములను అమ్ముకుని గట్టెక్కవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఇలా హక్కులిస్తే ఎస్సీ, ఎస్టీల చేతుల్లో ఉన్న భూకమతాల సంఖ్య తగ్గిపోతుందని.. సంపన్నుల చేతుల్లోకి భూమి వెళుతుందనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలతో కమిటీ వేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందనే చర్చ జరిగింది. కానీ ప్రభుత్వం భూభారతి చట్టం, ఇతర భూసంబంధిత అంశాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడంతో ఈ అసైన్డ్ భూముల అంశం పక్కన పడింది. ఇప్పటికైనా అసైన్డ్ భూ ముల విషయంలో ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలనే వాదన వినిపిస్తోంది. -
సంక్రాంతికే భరోసా!
ఏమిటీ సెల్ఫ్ డిక్లరేషన్?‘అయ్యా.. ఫలానా గ్రామానికి చెందిన నాకు సర్వే నంబర్ 1లో ఎకరం పొలం ఉంది. నా ఇంటి ఆవరణతో కలిపి 100వ సర్వే నంబర్లో మరో ఎకరం చెలక ఉంది. ఇంటి జాగా 2 గుంటలు పోను మొత్తం ఎకరా 38 గుంటల్లో కూరగాయలు సాగు చేస్తున్నాను. ఇందులో ఎలాంటి తప్పుడు లెక్కలు చూపినట్లు తేలినా.. ప్రభుత్వం తీసుకునే చర్యలకు కట్టుబడి ఉంటాను. దయచేసి నేను సాగు చేసే భూమికి సంబంధించి రైతు భరోసా అందించగలరని మనవి’ రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందాలనుకునే రైతు ఎవరైనా భవిష్యత్తులో వ్యవసాయ శాఖకు ఇవ్వాల్సిన ‘సెల్ఫ్ డిక్లరేషన్ ’ నమూనా ఇది. సాక్షి, హైదరాబాద్: ‘రైతుభరోసా’ అమలుకు ముహూర్తం ఖరారైంది. కొత్త సంవత్సరంలో సంక్రాంతి కానుకగా ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత కొన్నేళ్లుగా అమల్లో ఉన్న పెట్టుబడి సాయం ‘రైతుబంధు’ స్థానంలో ‘రైతు భరోసా’ను కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్‌కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశమై పథకం మార్గదర్శకాలపై చర్చించింది. తాజాగా రెండురోజుల క్రితం జరిగిన సమావేశంలో తుది కసరత్తు కూడా పూర్తి చేసింది. వానాకాలం, యాసంగి సీజన్లలో రైతు ఎంత మేర భూమి సాగు చేస్తే అంత విస్తీర్ణానికే లెక్కగట్టి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. గతంలో ఎంత భూమి ఉంటే అంత భూమికి రైతుబంధు అందేది. ఇలాఉండగా రైతు ఎంత భూమిలో సాగు చేశాడో స్వయంగా తెలియజేసే ‘సెల్ఫ్ డిక్లరేషన్’ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని కూడా మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. శాటిలైట్ ఇమేజ్, రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా రైతు సాగు చేసిన భూమిని లెక్కగట్టనున్నారు. అలాగే వ్యవసాయాధికారి ఇచ్చే పంటల విస్తీర్ణంతో రైతు నుంచి తీసుకున్న ‘సెల్ఫ్ డిక్లరేషన్’ను సరిపోల్చుకున్న తర్వాతే పెట్టుబడి సాయాన్ని రైతు ఖాతాలో జమ చేస్తారు. రైతే స్వయంగా తన పేరిట ఉన్న భూమి, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను తెలియజేయడంతో పాటు తాను ఎంత విస్తీర్ణంలో ఏ పంట వేస్తున్నాననే విషయాన్ని ప్రకటించేలా చూడటం ద్వారా రైతుల్లో జవాబుదారీతనాన్ని పెంచవచ్చనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. తద్వారా ప్రభుత్వ సొమ్ము దారి మళ్లకుండా రైతు సాగు చేసిన భూమికే కచ్చితంగా పెట్టుబడి సాయం అందుతుందని భావిస్తోంది. సాగు విస్తీర్ణంలో కచ్చితత్వం కోసమే అంటున్న సర్కారు రైతు అందించే సెల్ఫ్ డిక్లరేషన్ వల్ల ఒక గ్రామంలో ఉన్న పట్టా భూమి ఎంత? అందులో సాగవుతున్న విస్తీర్ణం ఎంతో తెలియడమే కాకుండా రాష్ట్రంలో సాగవుతున్న పంటల వివరాలు కూడా కచ్చితంగా తెలుస్తాయని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి సీజన్లో ఇచ్చే పంటల సాగు విస్తీర్ణం లెక్కల్లో కచ్చితత్వం ఉండడం లేదని భావిస్తున్న ప్రభుత్వం.. రైతు భరోసా పథకం ద్వారా ఈ వివరాలను కూడా తెలుసుకోవాలని నిర్ణయించింది. ఉదాహరణకు ఈ యాసంగిలో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 63.54 లక్షల ఎకరాలు కాగా, రైతులు ఏకంగా 79.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ లెక్కలు వేసింది. ఇందులో వరి 63.20 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 7.18 లక్షల ఎకరాల్లో సాగవుతుందంటూ ప్రతిపాదనలు రూపొందించింది. అయితే ఇప్పుడు రైతు భరోసాకు రైతు సెల్ఫ్ డిక్లరేషన్ నిబంధన వల్ల ఈ పంటలకు సంబంధించి కచ్చితమైన వివరాలు తెలిసే అవకాశం ఉందని, అలాగే ఏ పంటల లోటు ఎంత ఉందో తెలుసుకుని తదనుగుణంగా ఆయా పంటల విస్తీర్ణం పెంచే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే పంట సాగు చేస్తేనే పెట్టుబడి సాయం అందుతుందనే నిబంధన వల్ల..గతంలో పునాసలో మాత్రమే సాగు చేసే రైతు యాసంగిలో కూడా తప్పకుండా ఏదో ఒక పంట పండించేందుకు ఆసక్తి చూపుతారని, తద్వారా యాసంగిలోనూ సాగు విస్తీర్ణం పెరుగుతుందని మంత్రివర్గ ఉప సంఘం అభిప్రాయపడింది. ఎంత పెద్ద రైతుకైనా భరోసా ఖాయం! రైతు భరోసా కింద ఒక్కో సీజన్లో ఎకరాకు రూ.7,500 చొప్పున చెల్లించాలని భావిస్తున్నప్పటికీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనిని ఎంతకు పరిమితం చేయాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. జనవరి 2 లేదా 3వ తేదీన ఉపసంఘం మరోసారి సమావేశమై దీనిపై చర్చించే అవకాశం ఉంది. అదే సమయంలో ఒక్కో రైతుకు ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలనే అనే అంశాన్ని కూడా ఖరారు చేయనున్నట్లు సమాచారం. అయితే ఎంత పెద్ద రైతైనా నిరీ్ణత సీలింగ్ పరిధికి లోబడి సాగు చేసిన భూమికి రైతు భరోసా ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు. పీఎం కిసాన్ పథకంలో ఐదెకరాలు పైనున్న భూ యజమానికి పెట్టుబడి సాయం అందని విషయం విదితమే. రైతు భరోసాకు సంబంధించిన విధివిధానాలతో కూడిన నివేదికను మంత్రివర్గ ఉప సంఘం 3వ తేదీలోపు ప్రభుత్వానికి అందజేస్తే 4వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో ఆమోదముద్ర పడే అవకాశం ఉంది. -
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక అస్తవ్యస్థంగా ఈ క్రాప్
-
రైతన్నల పడిగాపులు
-
పంజాబ్‌లో రైతుల బంద్
చండీగఢ్: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంసహా తమ పలు డిమాండ్ల సాధనకు ఉద్యమిస్తున్న పంజాబ్ కర్షకులు సోమవారం చేపట్టిన తొమ్మిది గంటల రాష్ట్రవ్యాప్త బంద్‌తో జనజీవనం స్తంభించింది. పంజాబ్ గుండా సాగే జాతీయ రహదారులపై రాస్తారోకోలు, రైల్వేపట్టాలపై బైఠాయింపులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైల్వే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పంజాబ్–ఢిల్లీ రూట్లో రాకపోకలు సాగించే 163 రైళ్ల సర్వీసులు రద్దయ్యాయి. రాస్తారోకోలతో వాహనాల్లో జనం ఎక్కడికక్కడ చిక్కుకుపోయి అవస్థలు పడ్డారు. సోమవారం ఉదయం ఏడు గంటలకు మొదలెట్టి సాయంత్రం నాలుగు గంటలకు బంద్‌ను ముగిస్తామని రైతు సంఘాలు ప్రకటించినా బంద్ ప్రభావం రోజంతా కనిపించింది. పటియాలా, జలంధర్, అమృత్సర్, ఫిరోజ్‌పూర్, బఠిందా, పఠాన్కోట్లలో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. పటియాలా–చండీగఢ్ జాతీయ రహదారిపై ధరేరీ జఠాన్ టోల్‌ప్లాజా వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించడంతో కిలోమీటర్ల పొడవునా వాహ నాలు నిలిచిపోయి సామాన్యులు ఇబ్బందులపా లయ్యారు. VIDEO | Punjab: Shops remain closed, and buses are off the roads in Moga in the wake of shutdown called by protesting farmers.#PunjabBandh #PunjabNews(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/bxerq4Pm7u— Press Trust of India (@PTI_News) December 30, 2024అమృత్‌సర్‌లోని గోల్డెన్ గేట్‌సహా చాలా పట్టణాల్లో వేల సంఖ్యలో రైతులు బంద్‌లో పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాలు ఈ బంద్‌కు పిలుపునివ్వడం తెల్సిందే. గత 35 రోజులుగా ఖనౌరీ సరిహద్దు వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న రైతు సంఘం నేత జగ్జీత్సింగ్ ధల్లేవాల్‌కు బంద్ సందర్భంగా రైతులు సంఘీభావం ప్రకటించారు. మరోవైపు దీక్ష మొదలై 35 రోజులు పూర్తవడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఇప్ప టికైనా తమ డిమాండ్లపై కేంద్రం దృష్టిసారించాలని సోమవారం ఒక వీడియో విన్నపంలో ధల్లేవాల్ కోరారు. -
ఆంధ్రప్రదేశ్ రైతులకు ఉచిత పంటల బీమాను దూరం చేసిన కూటమి సర్కారు... ప్రీమియం భారం భరించలేక రైతుల గగ్గోలు
-
సంక్రాంతికే కానీ..!
సాక్షి, హైదరాబాద్: రైతులకు పెట్టుబడి సాయం అందించే ‘రైతు భరోసా’పై కాంగ్రెస్ సర్కారు కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. సంక్రాంతి నుంచే రైతు భరోసా సొమ్మును రైతులకు అందిస్తామని సర్కారు ప్రకటించినా.. విధి విధానాల రూపకల్పన ఇంకా ఓ కొలిక్కి రాలేదు. రైతు భరోసాకు ఎవరు అర్హులు? ఎవరు అనర్హులనే దానిపై ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నా.. ఎలా ఇవ్వాలి, ఎంత మేర ఇవ్వాలి, ఉద్యాన పంటలకు పెట్టుబడి సాయం ఎలా అందించాలి, ఇందుకోసం ఏ విధానాన్ని అనుసరించాలన్న అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ క్రమంలో రైతుభరోసాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఆదివారం మళ్లీ సమావేశమై చర్చించింది.అధికాదాయ వర్గాలు మినహా..ఐటీ చెల్లింపుదారులు, సివిల్ సర్వీస్, గ్రూప్–1 స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు వంటి వారికి మినహా సాగుభూమి ఉన్న ప్రతి ఒక్కరికీ రైతు భరోసా అందించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించినట్టు సమాచారం. ఎన్ని ఎకరాలకు సీలింగ్ అమలు చేయాలనే అంశాన్ని సీఎంకే వదిలేసినట్టు తెలిసింది. అయితే 10 ఎకరాల్లోపు సొంత భూమి ఉన్న రైతులందరికీ సాగు చేసిన కమతాలను లెక్కకట్టి పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఎంత భూమి ఉన్నా ప్రభుత్వ నిర్ణయించిన సీలింగ్ లోపు అందరికీ రైతుభరోసా ఇవ్వాల్సిందేనని ఉప సంఘం సభ్యులు పేర్కొన్నట్టు తెలిసింది. కుటుంబం యూనిట్‌గా రైతు భరోసాను అమలు చేయాలనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని... పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మార్గదర్శకాలను రైతుభరోసాకు వర్తింపజేస్తే వ్యతరేకత వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడినట్టు సమాచారం.సాగుభూములకు సరే.. పక్కాగా నిర్ధారణ ఎలా?సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో.. సాగును నిర్ధారించే అంశంపైనా ఉప సంఘం భేటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలిసింది. ఖరీఫ్‌లో సాగు ఎక్కువగా ఉంటే రబీలో తగ్గుతుందని.. ఖరీఫ్‌లో పత్తి సాగు చేసే రైతులు రబీలో నీరు లేక ఏ పంట వేయక బీడు పెట్టే పరిస్థితి మహబూబ్‌నగర్, మెదక్, ఆదిలాబాద్ తదితర ఉమ్మడి జిల్లాల్లో ఉందని సభ్యులు గుర్తు చేసినట్టు తెలిసింది. వారికి ఎలా రైతు భరోసా వర్తింపజేస్తారనే అంశం ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. అంతేగాకుండా ఆయిల్ పామ్, మామిడి, ఇతర పండ్ల తోటలకు సంబంధించి రైతు భరోసాను ఎలా వర్తింపజేస్తారనే విషయంలోనూ స్పష్టత రాలేదని తెలిసింది. ఒకసారి పంట వేస్తే మళ్లీ పెట్టుబడి అవసరం ఉండదు కాబట్టి ఇలాంటి భూములకు రైతుభరోసా ఎలాగనే సందేహాలు వ్యక్తమైనట్టు సమాచారం. ఇక ఖరీఫ్ సీజన్లో మాత్రమే సాగయ్యే భూములకు రెండు సీజన్లలో రైతుభరోసా ఇవ్వడంపైనా సుదీర్ఘ చర్చ జరిగినట్టు తెలిసింది. మరోవైపు సీజన్‌కు రూ.7,500 చొప్పున ఒకేసారి రూ.15 వేలు ఇవ్వాలా? లేక విడివిడిగా ఇవ్వాలా అన్న అంశం ప్రస్తావనకు వచ్చిందని... రూ.7,500 కాకుండా సీజన్‌కు రూ.6,000 చొప్పున ఒకేసారి రెండు సీజన్ల మొత్తాన్ని రైతు ఖాతాల్లో వేయాలనే ప్రతిపాదన కూడా వచ్చినట్టు సమాచారం.రోడ్లు, నాలా కన్వర్షన్లు, కొత్త రిజిస్ట్రేషన్లపై ఫోకస్!రోడ్లు, నాలా కన్వర్షన్ అయిన భూములు, పెద్ద మొత్తంలో కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన భూములకు రైతు భరోసా నిలిపివేయాలని ఉపసంఘం నిర్ణయించినట్టు తెలిసింది. అలాగే గుట్టలు, కొండలు, చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో రిజిస్టరైన భూములకు కూడా ఇవ్వొద్దనే భావనకు వచ్చినట్టు సమాచారం. మొత్తంగా ఖరీఫ్, రబీ సీజన్లలో పంటలు వేసిన భూములకు సంబంధించి మాత్రమే రైతు భరోసా అందించేలా విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది.రైతులెవరూ నష్టపోకుండా ‘రైతుభరోసా’: భట్టిఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. బడ్జెట్లో వ్యవసాయానికి రూ.72,659 కోట్లు కేటాయించడమే తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు రైతులకు మాట ఇచ్చిన విధంగా రైతు భరోసా ఇచ్చి తీరుతామన్నారు. రైతులెవరూ నష్టపోకుండా రైతు భరోసా విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆదివారం సచివాలయంలో రైతు భరోసా మంత్రివర్గ ఉపసంఘం భేటీ కేబినెట్ సబ్‌కమిటీ భేటీ అయింది. భట్టితోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు వ్యవసాయ శాఖ అధికారులు ఇందులో పాల్గొన్నారు. యాసంగి పంటకు రైతు భరోసా ఇచ్చేందుకు ఖరారు చేయాల్సిన విధివిధానాలపై రెండు గంటల పాటు చర్చించారు. గతంలో పెట్టుబడి సాయం పథకం అమలు నుంచి నేటి వరకు ఏం జరిగింది? రైతుల అభిప్రాయాలు ఏమిటన్న అంశాలను పరిశీలించారు. పలు అంశాలపై వ్యవసాయ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రుణమాఫీ కింద ఇప్పటికే రూ.21వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమచేశామని, రైతు కమిషన్‌ను నియమించామని, రైతు వేదికలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. రైతులకు ఇబ్బందులు లేకుండా పాలన చేయడం కాంగ్రెస్ పేటెంట్ అని పేర్కొన్నారు. -
ప్రీమియం భారం బీమాకు దూరం
సాక్షి, అమరావతి: గతేడాది ఇదే రబీ సీజన్లో పంటల బీమాలో నమోదైన రైతుల సంఖ్య ఏకంగా 43.82 లక్షలు.. మరిప్పుడు.. కేవలం 5.94 లక్షలు.. ఏడాదిలో ఎంత తేడా! లక్షల ఎకరాలు.. లక్షలాది మంది రైతన్నలు బీమా రక్షణకు దూరమై గాలిలో దీపంలా సాగు చేయాల్సిన దుస్థితి నెలకొంది.. గత ఐదేళ్లూ అన్నదాతలపై పైసా భారం పడకుండా డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసింది. ఎక్కడా తిరగాల్సిన అవసరం లేకుండా ఈ–క్రాప్ ప్రామాణికంగా గ్రామంలోనే పని పూర్తయ్యేది. నోటిఫై చేసిన ప్రతీ పంటకు, సాగు చేసిన ప్రతీ ఎకరాకు నూరు శాతం యూనివర్శల్ కవరేజ్ కల్పిస్తూ పంటల బీమా కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకంతో ఉచితంగా లబ్ధి చేకూరేది. రైతన్నలు నిశ్చింతగా పొలం పనుల్లో నిమగ్నమైతే కావాల్సిన కాగితాలు.. మిగతా ప్రక్రియ విషయాన్ని గ్రామ సచివాలయాలు, వలంటీర్లు దగ్గరుండి చూసుకునేవారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో 54.55 లక్షల మంది రైతన్నలకు పంటలు నష్టపోతే రికార్డు స్థాయిలో రూ.7,802.05 కోట్లు పరిహారంగా అందచేసి సాగుకు అండగా నిలిచింది. ఇప్పుడు వరికి పంటల బీమా వర్తించాలంటే హెక్టార్‌కు రూ.1,575 చొప్పున రైతన్నలు తమ చేతి నుంచి ఖర్చు పెట్టుకోవాలి. పనులు మానుకుని బ్యాంకులు, కార్యాలయాల చుట్టూ తిరగాలి. రోజుల తరబడి పడిగాపులు కాయాలి. అసలు బీమా పథకానికి ఎప్పటిదాకా గడువు ఉందో చెప్పేవారు లేక.. ఈ అవస్థలు భరించలేక.. డబ్బులు కట్టలేక ఎంతో మంది ఈ పథకానికి దూరమయ్యారు. టీడీపీ కూటమి సర్కారు నిర్వాకాలతో అన్నదాతలు అన్యాయమైపోయారు! ఐదేళ్ల పాటు పైసా భారం పడకుండా అమలైన ఉచిత పంటల బీమా పథకం ద్వారా పూర్తి స్థాయిలో రక్షణ పొందిన రైతన్నలంతా నేడు ప్రీమియం భారాన్ని భరించలేక, పంటల బీమా చేయించుకోలేక గగ్గోలు పెడుతున్నారు.బీమా కవరేజ్ విస్తీర్ణం 8.44 లక్షల ఎకరాలేరబీ–2024–25 సీజన్లో దిగుబడి ఆధారిత పంటల బీమా పథకం కింద 13 పంటలను, వాతావరణ ఆధారిత పంటల కింద 3 పంటలను నోటిఫై చేశారు. జీడి మామిడి పంటకు ప్రీమియం చెల్లింపు గడువు నవంబర్ 15వ తేదీతోనే ముగియగా వరి మినహా మిగతా వాటికి ఈ నెల 15తో గడువు ముగిసింది. వరితో పాటు ఇటీవలే నోటిఫై చేసిన మామిడి పంటకు ఈ నెల 31వతేదీతో గడువు ముగియనుంది. దిగుబడి ఆధారిత పంటల బీమా కింద నోటిఫై చేసిన సాగు విస్తీర్ణం 45.55 లక్షల ఎకరాలు కాగా వాతావరణ ఆధారిత పంటల బీమా కింద నోటిఫై చేసిన జీడిమామిడి, మామిడి, టమాటా పంటల సాగు విస్తీర్ణం 15 లక్షల ఎకరాలు.. అంటే రెండూ కలిపి 60.55 లక్షల ఎకరాల పైమాటే. కానీ ఇప్పటి వరకు పంటల బీమా కవరేజ్ పొందిన విస్తీర్ణం కేవలం 8.44 లక్షల ఎకరాలు మాత్రమే కావడం గమనార్హం. వీటిలో వాతావరణ పంటల బీమా కింద 24,550 ఎకరాలు, దిగుబడి ఆదారిత పంటల బీమా కింద 8.20 లక్షల ఎకరాలలో సాగైన పంటలకు మాత్రమే బీమా కవరేజ్ పొందగలిగారు. రైతుల పరంగా చూస్తే ఈ రబీలో కేవలం 5,94,336 మంది మాత్రమే బీమా చేయించుకోగలిగారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పంటల బీమా తీరు ఎలా ఉందో చెప్పేందుకు ఇదే నిదర్శనం. పంటల బీమా వర్తించాలంటే గరిష్టంగా హెక్టార్‌కు మామిడికి రూ.5,625, జీడి మామిడికి రూ.3,837.50, టమాటాకు రూ.3,775, వరికి రూ.1,575 చొప్పున బీమా ప్రీమియాన్ని చెల్లించాలి. ఇతర పంటలకూ అదే స్థాయిలో ప్రీమియం భారం పడుతోంది. ఇంత భారం భరించలేక పంటల బీమాకు దూరం అవుతున్నట్లు అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు.ఐదేళ్లు నూరు శాతం కవరేజ్మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత ఐదేళ్లూ ఈ – క్రాప్ నమోదు ప్రామాణికంగా నోటిఫై చేసిన పంటలకు ఉచితంగా నూరు శాతం పంటల బీమా కవరేజ్ కల్పించింది. రబీ 2023–24 సీజన్లో 37.80 లక్షల ఎకరాల్లో సాగైన నోటిఫైడ్ పంటలకు బీమా కవరేజ్ కల్పించడంతో 43.82 లక్షల మంది బీమా రక్షణ పొందగలిగారు. టీడీపీ కూటమి సర్కారు పగ్గాలు చేపట్టిన మరుక్షణమే రైతుల మదిలో వైఎస్ జగన్ ముద్రను చెరిపివేయాలనే అక్కసుతో ఉచిత పంటల బీమా పథకాన్ని నిలిపివేసింది. పంటల బీమా అమలులో రైతులను భాగస్వాములను చేస్తామని చెబుతూ పెనుభారం మోపింది. స్వచ్ఛంద నమోదు పద్థతిలో పంటల బీమాకు శ్రీకారం చుట్టింది. చివరకు అవగాహన కల్పించలేక చేతులెత్తేసింది.తుపాన్, అకాల వర్షాలతో ఇప్పటికే తీవ్ర నష్టం..పంటల బీమా ప్రీమియం చెల్లింపు గడువును జనవరి నెలాఖరు వరకు పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను కేంద్రం పట్టించుకోలేదు. దీంతో రబీ సీజన్ ప్రారంభంలో విరుచుకుపడిన ఫెంగల్ తుపాన్‌తో పాటు ఇటీవల అల్పపీడన ప్రభావంతో కురిసిన అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న రబీ పంటలకు బీమా పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. దురదృష్టవశాత్తూ సీజన్ ముగిసేలోగా మరేదైనా విపత్తు సంభవిస్తే తమ పరిస్థితి అగమ్యగోచరమేనని అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.పారదర్శకంగా పథకం..1965లో కేంద్రం రూపొందించిన క్రాప్ ఇన్‌స్రూెన్స్ బిల్లు ఆధారంగా తెచ్చిన మోడల్ ఇన్‌స్రూెన్స్ పథకం వివిధ రూపాలు మార్చుకుని 2016 నుంచి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)గా అమలవుతోంది. దీని ప్రకారం నోటిఫై చేసిన వ్యవసాయ పంటలకు ఖరీఫ్‌లో 2 శాతం, రబీలో 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం చొప్పున ప్రీమియాన్ని రైతులు చెల్లించగా మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించేవి. అయితే ప్రీమియం భారం అధికంగా ఉండడం, ఆర్థిక ఇబ్బందులు, అవగాహన లేక రైతులు సొంతంగా బీమా చేయించుకునేందుకు ముందుకొచ్చేవారు కాదు. రుణాలు తీసుకుంటే మాత్రం బ్యాంకులు ప్రీమియం రూపంలో నిర్దేశిత మొత్తాన్ని మినహాయించుకునేవి. లక్షలాది మంది రైతన్నలు తాము పండించిన పంటలకు బీమా చేయించుకోలేకపోవడంతో విపత్తుల బారిన పడితే తీవ్ర నష్టాల పాలయ్యేవారు. గతంలో బీమా చేయించుకున్న వారు సైతం ఎంతొస్తుందో? ఎప్పుడొస్తుందో తెలియక ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఉండేవి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో రాగానే ఈ దుస్థితిని తొలగిస్తూ చర్యలు చేపట్టింది. ఈ క్రాప్‌తో పాటు ఈ కేవైసీ నమోదు పూర్తికాగానే ఉచిత పంటల బీమా పధకం వర్తించే నోటిఫై చేసిన పంటలను (స్టార్ గుర్తు) ప్రత్యేకంగా తెలియచేస్తూ రైతులకు భౌతిక రసీదులు అందచేసింది. డాక్టర్ వైస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద నోటిఫై చేసిన పంటకు మీరు చెల్లించాల్సిన ప్రీమియాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి పంటకు బీమా చేసినట్లు స్పష్టంగా తెలియజేసింది. ఈ జాబితాలను ఏటా సామాజిక తనిఖీల్లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శించడమే కాకుండా అభ్యంతరాలను పరిష్కరించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ బీమా పరిహారం అందేలా చర్యలు తీసుకుంది. కూటమి సర్కారు వచ్చాక ఈ క్రాప్ అస్తవ్యస్థంగా మారింది. ఎవరు ఏ పంట సాగు చేశారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక పంటల బీమాలో నమోదు చేసేందుకు అవసరమైన సాగు పత్రాల కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు.బాబు హయాంలో అరకొరగా..2014–19 మధ్య టీడీపీ హయాంలో ఏటా సగటున 46 లక్షల ఎకరాల చొప్పున 2.32 కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్ కల్పించగా, ఏటా సగటున 14.88 లక్షల మంది చొప్పున 74.4 లక్షల మంది రైతులు ప్రీమియం కట్టి బీమా సదుపాయం పొందారు. నాడు హుద్‌హుద్, తిత్లీ లాంటి భారీ తుపాన్లు, 324 మండలాల్లో కరువు ప్రభావం వల్ల రూ.వేల కోట్ల విలువైన పంటలను కోల్పోయినా రైతులకు దక్కిన పరిహారం అరకొరే. 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్లు మాత్రమే బీమా పరిహారం దక్కింది.జగన్ హయాంలో రికార్డు..2019–23 మధ్య వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా ఏటా 1.08 కోట్ల ఎకరాల చొప్పున 5.42 కోట్ల ఎకరాలకు ఉచిత పంటల బీమా సదుపాయాన్ని కల్పించింది. ఏటా సగటున 40.50 లక్షల మంది చొప్పున ఐదేళ్లలో 2.04 కోట్ల మంది రైతులకు బీమా రక్షణ కల్పిస్తూ చర్యలు తీసుకుంది. రైతుల తరపున వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.3,022.26 కోట్లను బీమా కంపెనీలకు ప్రీమియం రూపంలో చెల్లించింది. ఇక ఐదేళ్లలో 54.55 లక్షల మంది రైతులకు రూ.7,802.08 కోట్ల మేర బీమా పరిహారాన్ని అందచేసి ఆదుకుంది. అంతేకాకుండా 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో 6.19 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల బకాయిలు కూడా చెల్లించి అండగా నిలిచింది. టీడీపీ హయాంతో పోల్చితే అదనంగా 23.70 లక్షల మందికి రూ.4,390.88 కోట్ల మేర అదనంగా బీమా పరిహారం అందించి వైఎస్ జగన్ అన్నదాతలకు అండగా నిలిచారు.ప్రభుత్వమే చెల్లించాలి..నాకున్న 75 సెంట్ల పల్లపు భూమిలో వరి పండిస్తుంటా. 2021 సెప్టెంబరులో గులాబ్ తుపాను కారణంగా పంట నష్టపోతే నా బ్యాంకు ఖాతాకు ప్రభుత్వం రూ.4,650 జమ చేసి ఆదుకుంది. వైఎస్సార్సీపీ హయాంలో ఈ – క్రాప్‌లో నమోదైన ప్రతీ పంటకు బీమా వర్తించేది. ఇప్పుడు పంటల బీమా ప్రీమియాన్ని రైతులే చెల్లించాలని చెబుతున్నారు. ప్రీమియం భారాన్ని భరించలేక.. బ్యాంకులు, కార్యాలయాల చుట్టూ తిరగలేక, అవగాహన లేక చాలా మంది నష్టపోతున్నాం. రైతుల తరపున ప్రీమియాన్ని గతంలో మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి.– తమ్మిన సీతారమణ, రైతు, టి.నగరపాలెం, భీమిలి మండలం, విశాఖ జిల్లాప్రీమియం భారాన్ని మోయలేం..ప్రీమియం భారాన్ని భరించలేకనే రైతులు పంటల బీమాకు దూరమవుతున్నారు. వరుస వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు కనీసం మద్దతు ధర చెల్లించి ఆదుకోవడంలోనూ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అన్నదాతలు ఈ తరుణంలో ప్రీమియం చెల్లించి బీమా చేయించుకునే పరిస్థితిలో లేరు. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలి. – కోసూరి శివనాగేంద్ర, రైతు, పమిడిముక్కల మండలం, గడ్డిపాడు, కృష్ణా జిల్లాఉచిత బీమా కొనసాగించాలి..గత ఐదేళ్లూ రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకం ఎంతగానో ఆదుకుంది. స్వచ్ఛంద నమోదు పద్ధతి పేరుతో కూటమి ప్రభుత్వం తెచ్చిన పంటల బీమా వల్ల కౌలు రైతులకు తీరని అన్యాయం జరుగుతుంది. గతంలో మాదిరిగా రైతుల తరపున ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలి.– ఎం.హరిబాబు, ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శిఏటా రూ.900 కోట్లకుపైగా భారం..ప్రీమియం భారాన్ని భరించ లేకనే రాష్ట్రంలో రైతన్నలు పంటల బీమాకు దూరమయ్యారు. గత ఐదేళ్లు పైసా భారం పడకుండా నోటిఫై చేసిన ప్రతీ పంటకు, సాగు చేసిన ప్రతీ ఎకరాకు పూర్తి స్థాయిలో బీమా కవరేజీ రైతులకు వైఎస్ జగన్ అండగా నిలిచారు. కూటమి సర్కారు కక్షకట్టినట్లు వ్యవహరిస్తూ ఉచిత పంటల బీమా పథకాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఏటా రూ.900 కోట్లకుపైగా అన్నదాతలపై భారాన్ని మోపడం దుర్మార్గం.–వడ్డి రఘురాం, వర్కింగ్ ప్రెసిడెంట్, వైఎస్సార్ సీపీ రైతు విభాగం2021లో పైసా కట్టకుండా రూ.55 వేల పరిహారం..ఐదెకరాల్లో వరి సాగు చేస్తున్నా. ఖరీఫ్ 2021లో గులాబ్ తుపాను వల్ల మూడు ఎకరాల్లో పంట దెబ్బ తినడంతో రూ.55 వేల బీమా పరిహారం నా ఖాతాలో జమైంది. గత ఐదేళ్లలో ఎప్పుడూ ప్రీమియం కింద పైసా చెల్లించలేదు. ప్రస్తుతం బీమా ప్రీమియాన్ని రైతులే చెల్లించాలని ఈ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది రైతులకు ఎంతో భారంగా ఉంది. మా తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఆదుకోవాలి. – ఎం.శ్రీనివాసరావు, రైతు, కేసీహెచ్ పల్లి, విజయనగరం జిల్లా -
ఆ రైతు కుటుంబాలకు రూ.20లక్షల పరిహారం ఇవ్వాలి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురంలో కుటుంబంతో సహా కొమ్మర నాగేంద్ర ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఏపీ రైతు సంఘం(సీపీఎం) అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.ఇదే రోజున నంద్యాల జిల్లా ఎం.లింగాపురానికి చెందిన చిమ్మె నడిపి మారెన్న ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమన్నారు. వీరి కుటుంబాలకు రూ.20 లక్షలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను నివారించడంలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఏపీ రైతు సంఘం(సీపీఐ) రాష్ట్ర అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య మరో ప్రకటనలో విమర్శించారు. -
రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. కుదరని ఏకాభిప్రాయం
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసా విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరిగింది. సుదీర్ఘంగా రెండున్నర గంటల పాటు మంత్రులు చర్చించారు. కేబినెట్ సబ్ కమిటీలో ఏకాభిప్రాయం కుదరలేదు. విధి విధానాల ఖరారు పూర్తిస్థాయిలో కొలిక్కిరాలేదు. దీంతో మరోసారి భేటీ కావాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. సాగు భూమికి రైతు భరోసా పూర్తిస్థాయిలో ఇవ్వాలనే చర్చ జరిగింది.పథకం ప్రారంభమైనప్పటి నుంచి రైతు భరోసా అమలు తీరు, కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా పర్యటించిన క్రమంలో రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, అధికారులు సేకరించిన సమాచారంపై మంత్రులు చర్చించారు. కమిటీ ఛైర్మన్ భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, కమిటీ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భేటీలో పాల్గొన్నారు.ఇదీ చదవండి: తెలంగాణలో పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ -
అన్నదాతల ప్రాణాలపై కూటమి నిర్లక్ష్యం