
టీడీపీ నాయకుడిని ప్రశ్నిస్తున్న రైతులు
టీడీపీ నాయకుడి హుకుం.. రైతులతో వాగ్వాదం
‘యూరియా మేం చెప్పిన వారికే ఇవ్వాలి. లేదా గతంలో చేసినట్టు మా ఇంటి దగ్గర టోకెన్లు రాసి రైతులకు ఇవ్వాలి. లేదంటే అమ్మకాలు ఆపేయాలి’ అంటూ శ్రీకాకుళం జిల్లా గార మండలం బూరవెల్లిలో ఓ టీడీపీ నాయకుడు అధికారులకు హుకుం జారీ చేశాడు. ఆదివారం బూరవిల్లి రైతు సేవా కేంద్రానికి 313 యూరియా బస్తాలు వచ్చాయి. ఇదే ఆర్‌ఎస్‌కే పరిధిలో అంబళ్లవలస గ్రామం ఉంది. ఆ రైతులకు సచివాలయం దగ్గర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు టోకెన్లు మెయిన్‌రోడ్డులోని పాల కేంద్రం దగ్గర ఇస్తారనే సమాచారంతో రైతులంతా అక్కడకు చేరుకున్నారు.
కొందరు రైతులకు టోకెన్లు ఇస్తుండగా, స్థానిక టీడీపీ నాయకుడు మళ్ల అబ్బాయినాయుడు అక్కడకు చేరుకొని ఇక్కడ యూరియా ఇవ్వడానికి వీల్లేదని, టీడీపీ కార్యకర్తలకే యూరియా ఇవ్వాలని అధికారులకు హుకుం జారీ చేశారు. దీంతో రైతులు వాగ్వాదానికి దిగా రు. అధికారులు టోకెన్లు పంపిణీ నిలిపేశారు. ఎస్‌ఐ సీహెచ్ గంగరాజు టోకెన్లు ఇచ్చే పాలకేంద్రం వద్దకు వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ విషయమై ఏఓ డి.పద్మావతిని వివరణ కోరగా యూరియా పంపిణీ మంగళవారం సచివాలయం వద్ద జరుగుతుందని చెప్పారు.