ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా?: వైఎస్‌ జగన్‌ | Ys Jagan Tweet On Urea Shortage And Farmers Problems | Sakshi
Sakshi News home page

ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా?: వైఎస్‌ జగన్‌

Sep 3 2025 6:31 PM | Updated on Sep 4 2025 5:35 AM

Ys Jagan Tweet On Urea Shortage And Farmers Problems

యూరియా కొరత, రైతుల అవస్థలపై వైఎస్‌ జగన్‌ ట్వీట్‌

చంద్రబాబు సర్కార్‌ నిర్లక్ష్యంపై ఆగ్రహం
 

సాక్షి, అమరావతి: రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు.. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతారా..? అంటూ సీఎం నారా చంద్రబాబునాయుడును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వ్యవసాయ రంగంపై టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు. రైతులను అన్ని విధాలా దగా చేశారని మండిపడ్డారు. 

వరుసగా పంటల ధరలు పతనమవుతున్నా, ఈ రెండేళ్లలో వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీనీ, కోకో, పొగాకు పంటలకు ధరల్లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈ ప్రభుత్వం ఏ రోజూ ఆదుకోలేదని నిప్పులు చెరిగారు. ఈ మేరకు బుధవారం  ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..  

చంద్రబాబు గారూ.. మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కాని, రైతులకు గతంలో సులభంగా దొరికే యూరియా బస్తా కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతారా? మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్లపాటు రైతులకు ఎరువుల కష్టాలే. బస్తా యూరియా కోసం రోజుల తరబడి రైతులు క్యూల్లో నిలబడే దారుణ పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు? మరోవైపు తాజాగా ఉల్లి, చీనీ, మినుము ధరలు పతనమై రైతులు లబోదిబోమంటున్నారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా మీలో కనీస చలనం కలగడం లేదెందుకు?  

⇒ ఏటా ఏ సీజన్‌లో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగవుతాయి.. అందుకు అను­గుణంగా ఏమేరకు ఎరువులు పంపిణీ చేయాలి.. ఈ విషయాలపై ప్రతి ఏటా ప్రభుత్వంలో కసరత్తు జరుగుతుంది. మరి యూరియా సమస్య ఎందుకు వచ్చింది? ఐదేళ్ల మా పాలనలో ఇలాంటి సమస్య ఎప్పుడూ లేదన్నది వాస్తవం కాదా? ఇవాళ మీరు వైఫ­ల్యం చెందారంటే ప్రభుత్వం సరిగా పని చేయడం లేదనే కదా అర్థం?  

⇒ ఎరువులను మీ పార్టీ నాయకులే దారి మళ్లించి అధిక ధరకు అమ్ముకుంటున్నారు. మరోవైపు ప్రైవేటు వ్యాపారులు నల్ల బజారుకు తరలించి, వాటిని బ్లాక్‌ చేస్తున్నారు. బస్తా యూరియా రేటు రూ.267 అయితే, దీనికి మరో రూ.200 అధికంగా అమ్ముకుంటున్నారు. అక్రమ నిల్వలపై తనిఖీలు లేవు. ఎవ్వరి మీదా చర్యలు లేవు. పీఏసీఎస్‌ (ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు)లకు, ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు)లకు సరైన కేటాయింపులు లేవు. దీనికి కారకులు మీరే కదా చంద్రబాబు గారూ.. మా హయాంలో ఆర్బీకేల ద్వారా 12 లక్షల టన్నుల ఎరువులను రైతుల వద్దకే పంపిణీ చేశాం. పీఏసీఎస్‌ల ద్వారా మార్కెట్‌ రేటు కన్నా రూ.50 తక్కువ రేటుకు రైతుకు అందించగలిగాం. మీరెందుకు ఆపని చేయలేకపోతున్నారు చంద్రబాబు గారూ? ఎందుకంటే బ్లాక్‌ మార్కెట్‌ నుంచి మీ కొచ్చే కమీషన్ల కోసం కాదా?  

⇒ మరో వైపు పంటలకు గిట్టుబాటు ధరలు రాక రైతులు లబోదిబోమంటున్నారు. వరుసగా పంటల ధరలు పతనమవుతున్నా, ఈ రెండేళ్లలో వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్క జొన్న, సజ్జ, రాగులు, అరటి, చీనీ, కోకో, పొగాకు ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా, చిత్తశుద్ధితో ఏరోజూ రైతును మీ ప్రభుత్వం ఆదుకోలేదు. క్వింటా ఉల్లి సగటున క్వింటాలుకు రూ.400–500కు క్షీణించినా పట్టించుకునే నాథుడే లేడు. మరోవైపు ఇదే ఉల్లిని బహిరంగ మార్కెట్లో కిలో రూ.35తో అమ్ముతున్నారు. మా ప్రభుత్వ హయాంలో ఉల్లి క్వింటా రూ.4 వేల నుంచి రూ.12 వేలతో అమ్ముడయ్యేది. అంటే కేజీ రూ.40 నుంచి రూ.120 దాకా రైతులు అమ్ముకున్నారు.    

⇒ ధరలు పతనమైనప్పుడు మా హయాంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధరలు కల్పించింది. మా ఐదేళ్ల కాలంలో, రైతులకు ఇలాంటి కష్టకాలం వచ్చినప్పుడు 9,025 టన్నుల ఉల్లిని ప్రభుత్వమే కొనుగోలు చేయడం ద్వారా రైతులకు తోడుగా నిలబడ్డాం. చీనీ ధర కూడా ఇప్పుడు మీ హయాంలో పడిపోయి టన్ను రూ.6 వేల నుంచి రూ.12 వేలు మాత్రమే పలుకుతోంది. మా హయాంలో టన్నుకు కనిష్టంగా రూ.౩౦ వేలు, గరిష్టంగా రూ.లక్ష ధర రైతులకు లభించింది. 

కోవిడ్‌ లాంటి మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన సమయంలో రైతుల వద్ద చీనీ పంట ఉండిపోతే, ప్రభుత్వమే కొనుగోలు చేసి, ప్రత్యేక రైళ్లు పెట్టి.. ప్రభుత్వంగా రైతులను ఆదుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు ఇంత సంక్షోభం వచ్చినా మీరు పట్టించుకోవడం లేదెందుకు చంద్రబాబు గారూ? నిద్ర నటించే వాళ్లని ఎవరైనా లేపగలరా?

⇒ మేం ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారు. దీనికింద రూ.7,802 కోట్లు ఖర్చు చేసి మేం రైతులకు తోడుగా నిలబడితే మీరు ఆ విధానానికి మంగళం పాడారు. పంటలు, వాటికి లభిస్తున్న ధరలపై రియల్‌ టైం డేటా సీఎంఏపీపీ (కాంప్రహెన్షివ్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్, ప్రైస్‌ అండ్‌ ప్రొక్యూర్‌మెంట్‌)ను మూలన పడేశారు. రైతులకు చేదోడుగా నిలిచే ఆర్బీకేల వ్యవస్థను నాశనం శారు. ఉచిత పంటల బీమాకు పాతర వేశారు. ఏ సీజన్‌లో పంట నష్టం వస్తే, అదే సీజన్‌ ముగిసేలోపు ఇచ్చే ఇన్‌పుట్‌ సబ్సిడీ, మరుసటి సీజన్‌లోగా ఇచ్చే క్రాప్‌ ఇన్సూరెన్స్‌ (పంట నష్టపరిహారం)­ను అందించే పద్ధతినీ ధ్వంసం చేశారు. 

రైతులకు సున్నా వడ్డీ పథకాన్నీ ఎత్తివేశారు. మేం క్రమం తప్పకుండా ఇస్తున్న రైతు భరోసాను ఎత్తివేసి, పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా రైతులకు పెట్టుబడి సహాయం కింద ఏడాదికి రూ.20 వేలు అన్నదాత సుఖీభవ పేరుతో ఇస్తామని ఎన్నికల్లో మాట ఇచ్చి, వెన్నుపోటు పొడిచారు. మొదటి ఏడాది ఎగ్గొట్టారు. రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చింది రూ.5 వేలు మాత్రమే. అది కూడా సుమారు 7 లక్షల మంది రైతు కుటుంబాలకు ఎగ్గొట్టారు. అందుకే బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement