
పాడేరు ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆవేదన
108 రాకపోవడంతో నిండు గర్భిణి ఆటోను ఆశ్రయించాల్సి వచి్చంది
చివరకు ఆటోలోనే ప్రసవం.. వైద్యం అందక పురిటి బిడ్డ మరణించింది
కుయ్ కుయ్ మూగబోతోంది.. ప్రజల ప్రాణాలు పోతున్నాయి
రాష్ట్రంలో ప్రభుత్వం పని చేస్తోందా?
కలెక్షన్లపై మినహా ప్రజల బాగోగులపై ధ్యాస ఏది?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 108 సర్వీసులకు చంద్రబాబు ప్రభుత్వం ఉరి వేస్తోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫోన్ చేసినా 108 సర్విసు రాకపోవడంతో పాడేరు సమీపంలోని ముల్లుమెట్టకు చెందిన నిండు గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు ఆటోను ఆశ్రయించాల్సి వచి్చందని, చివరకు అందులోనే ప్రసవం జరిగిందని.. వైద్యం అందక ఆటోలోనే శిశువు మరణించిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను జత చేసి చంద్రబాబు సర్కార్ అసమర్థతను నిలదీస్తూ వైఎస్ జగన్ ‘ఎక్స్’లో తన ఖాతాలో సోమవారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..
ప్రజల ప్రాణాలు పోతున్నాయ్
⇒ ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్విసులకు చంద్రబాబు ప్రభుత్వం ఉరి వేస్తోంది. నిండు గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు 108 రాకపోవడంతో ఆటోను ఆశ్రయించాల్సి వచి్చంది. వైద్యం అందక ఆటోలోనే శిశువు మృతి చెందింది.
⇒ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అంబులెన్స్‌లు, పట్టణ ప్రాంతాల్లో ఫోన్ చేసిన 15 నిమిషాల్లోగా 108 రావాలనే నిబంధన ఉంటే.. దాన్ని అధిగమిస్తూ 12–14 నిమిషాల్లోనే చేరుకునేవి. గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో చేరుకోవాలని నిబంధన ఉంటే.. 16–17 నిమిషాల్లోనే వచ్చేవి. గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల్లో చేరుకోవాలనే నిబంధన ఉంటే దాన్ని కూడా అధిగమిస్తూ 22.12 నిమిషాల్లోనే చేరుకుని 108లు సేవలందించాయి. మరి ఇప్పుడు ఎందుకు చేరుకోవడం లేదు? ఫోన్ చేసినా ఎందుకు రావడంలేదు? ప్రభుత్వం అన్నది పనిచేస్తేనే కదా! కలెక్షన్ల మీద మినహా ప్రజల పట్ల ధ్యాస ఉంటే కదా?