
రైతన్న దేశానికి వెన్నెముకగా నిలుస్తున్నాడని ఎంత చెప్పుకుంటున్నా వ్యవసాయానికి సంబంధించి తనకు మౌలిక సదుపాయాల భరోసా ఇవ్వకపోతే ఎలా అనే ప్రశ్నలొస్తున్నాయి. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో యూరియా కోసం అన్నదాత పడిగాపులు అంతాఇంతా కావు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాకా అని చెప్పుకుంటున్న కుప్పంలోనూ ఎరువు కోసం కర్షకులు ఏకరువు పెడుతున్న దుస్థితి నెలకొంటోంది. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఈ పరిస్థితులు లేవు. అయితే అప్పటి రైతన్న కష్టాలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పోకడలు కారణమవుతున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులు, క్రిమిసంహారకాల వాడకం పెరుగుతుండడం వల్ల సాగుభూమి క్రమంగా సారం కోల్పోతుందని చాలా నివేదికలు చెబుతున్నాయి. పంటల దిగుబడి పెంచాలంటే సహజ ఎరువులు వాడాలని అధికారాలు ఎంత ఊదరగొడుతున్నా అందుకు సరిపడా బడ్జెట్ కేటాయించకపోవడంతో ఆ లక్ష్యం నీరుగారుతోంది. రైతులు ఏ పంట వేసినా దాదాపు యూరియా వాడకం తప్పనిసరైంది. కానీ సాగుకు సరిపడా యూరియా తయారీలో యాంత్రాంగాలు జాప్యం చేస్తున్నాయనే వాదనలున్నాయి. అందుకు కొన్ని కారణాలను కింద తెలియజేశాం.
ఎంత అవసరమో ముందే తెలిసినా..
యూరియా పంట దిగుబడి పెంచడంలో, ఆహార భద్రతను నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. అంతటి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ ప్రభుత్వాలు తరచు దీని తయారీ ప్లాంట్లను స్థాపించడంలో లేదా ఇప్పటికే ఉన్న వాటిలో ఉత్పాదకతను పెంచడంలో గణనీయమైన జాప్యాన్ని ఎదుర్కొంటున్నాయి. దాంతో రైతులకు పంట సమయానికి ఎరువుల దుకాణాల ముందు పడిగాపులు తప్పడంలేదు. ప్రతి ఏడాది ఎంత మొత్తంలో ఎరువులు అవసరం అవుతాయో ముందే నిర్ధారించుకున్న ప్రణాళిక ప్రకారం ప్రభుత్వం ఎరువులు తయారు చేయాలి లేదా దిగుమతి చేసుకోవాలి. ఇప్పటికే ప్రభుత్వ గోదాముల్లో ఎరువులు నిల్వ ఉంచి అవసరాలకు తగ్గట్టుగా వెంటనే సరఫరా చేసే వ్యవస్థగా ఏర్పాటు చేయాలి. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఎరువుల తయారీలో, వాటి సరఫరాలో జాప్యానికి చాలానే కారణాలున్నాయి.
అడపాదడపా నిధులు
యూరియా తయారీ అనేది మూలధన ఆధారిత ప్రక్రియ. కొత్తగా ఎరువుల కర్మాగారాన్ని నిర్మించడానికి వేలాది కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. దాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులో తీసుకురావడానికి చాలా ఏళ్లు పట్టవచ్చు. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రభుత్వాలు ఇప్పటికే పరిమిత ఆర్థిక వసతులతో పోరాడుతున్నాయి. ఫలితంగా ఇటువంటి దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం కష్టమవుతుంది. బడ్జెట్‌లో వ్యవసాయానికి అడపాదడపా కేటాయించిన మొత్తం నిధుల నుంచి ఇలాంటి ప్రాజెక్ట్‌లకు ఖర్చు చేయడం సవాలుగా కూడుకుంటోంది.
సబ్సిడీ భారం
నిర్మాణ వ్యయంతోపాటు యూరియా తయారీకి భారీగా సబ్సిడీ ఇస్తున్నారు. భారత్ వంటి దేశాల్లో రైతులు యూరియాను దాని వాస్తవ ఉత్పత్తి వ్యయంలో కొంత ధరలకే కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యత్యాసాన్ని ప్రభుత్వం రాయితీలతో పూడుస్తోంది. దేశీయంగా ఉత్పాదకతను పెంచితే అందుకు అనుగుణంగా ప్రైవేట్ కంపెనీలకు అధిక సబ్సిడీ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వాలకు భారం. ఇంకొన్ని కంపెనీలు డీఏపీ, పొటాష్..వంటి ఇతర కృత్రిమ ఎరువుల తయారీకి యూరియాను దారి మళ్లిస్తున్నాయి. ఆయా ఎరువులపై మార్జిన్లు అధికం ఉండడం, వాటికి మార్కెట్లో ఎక్కువ ధర పలుకుతుండడంతో ఈమేరకు అక్రమాలకు పాల్పడుతున్నాయి.
ప్రాజెక్ట్‌ల తాత్సారం
కొన్నిసార్లు నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ బ్యూరోక్రటిక్ నిబంధనల కారణంగా యూరియా ప్రాజెక్టుల అమలుకు చాలా ఆలస్యం అవుతుంది. భూసేకరణ, పర్యావరణ అనుమతులు పొందడం, వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు రావడం, కఠిన నిబంధనలు పాటించడం వంటి చర్యలతో ఏళ్లకుఏళ్లు ఈ ప్రక్రియ వాయిదా పడుతోంది. అంతేగాక రసాయనాలు, ఎరువులు, పర్యావరణం, పెట్రోలియం (గ్యాస్ సరఫరా కోసం), ఫైనాన్స్ వంటి వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం లోపిస్తుంది. ఏదైనా విభాగంలో ఆలస్యం జరిగితే మొత్తం ప్రాజెక్టు పురోగతి ఆగిపోతుంది.
అంతర్జాతీయ మార్కెట్లు..
స్వల్పకాలిక వ్యవసాయ అవసరాలను తీర్చడానికి అనేక ప్రభుత్వాలు దేశీయ ఉత్పాదకతపై పెట్టుబడులు పెట్టడానికి బదులుగా యూరియాను దిగుమతి చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నాయి. ఇది మరింత ఖర్చుకు దారితీస్తుంది. అయితే కొత్తగా ప్రాజెక్ట్ స్థాపించి సరఫరా చేయడానికి బదులుగా ఇది సరళమైన విధానంగా కూడా కనిపిస్తుంది. ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో అంతర్జాతీయ ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఈ ఆలోచనలు మరింత పెరుగుతున్నాయి. అయితే, ఎరువుల దిగుమతిపై ఆధారపడటం దీర్ఘకాలిక బలహీనతలను సృష్టిస్తుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆంక్షలు లేదా ధరల అస్థిరత కారణంగా ఏదైనా ప్రపంచ సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడినప్పుడు అసలు సమస్య గుర్తుకొస్తుంది. ఇది దేశీయ వ్యవసాయ ఉత్పాదకతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
లాభదాయకంగా చేయవచ్చు.. కానీ..
యూరియా ఉత్పత్తి సహజ వాయువు లభ్యతపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. దీన్ని ఫీడ్‌స్టాక్‌గా ఉపయోగిస్తారు. అనేక దేశాల్లో సహజ వాయువు కొరత ఉంది. ఒకవేళ దిగుమతి చేసుకోవాలన్నా ఖరీదుతో కూడుకుంది. సహజవాయువు సమృద్ధిగా ఉంటే ప్రభుత్వ సబ్సిడీలు లేకుండా యూరియా ఉత్పత్తిని ఆర్థికంగా లాభదాయకం చేయవచ్చు. గ్యాస్ సరఫరాలో అంతరాయాలు లేదా అననుకూల ధరల ఒప్పందాలు ఉత్పత్తిని నిలిపేస్తున్నాయి. కొత్త ప్లాంట్ ఏర్పాటును ఆలస్యం చేస్తున్నాయి.
ఇప్పుడేం చేయాలంటే..
ప్రభుత్వాలు సంప్రదాయ యూరియా వాడకానికి దూరంగా నేల ఆరోగ్యం, పర్యావరణ సుస్థిరతపై అవగాహన పెంపొందించే ప్రయత్నాలను మరింత పెంచాలి. నానో యూరియా, బయో ఫెర్టిలైజర్స్, సేంద్రియ ఎరువులు వాడకం వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించేలా రైతు సమావేశాలు ఏర్పాటు చేయాలి. యూరియా వాడకంతో పోలిస్తే ఖర్చులు తగ్గుతూ దిగుబడి స్థిరంగా ఉన్నా రైతులు ఇలాంటి ప్రత్యామ్నాయాలవైపు చూసే అవకాశం ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికత సాయంతో సంప్రదాయ యూరియాపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించేందుకు మార్గాలేమిటో అధికారులు, పరిశోధకులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి.
ఇదీ చదవండి: కేంద్ర బ్యాంకులకు బంగారు నిల్వలు ఎందుకు?