pesticide
-
తగ్గిన ‘నానో’ ఎరువుల అమ్మకాలు
గత మూడేళ్లలో గణనీయంగా పెరిగిన నానో ఎరువుల అమ్మకాలు.. గత ఖరీఫ్ సీజన్ నుంచి భారీగా తగ్గాయి. సంప్రదాయ ఎరువులకు ప్రత్యామ్నాయంగా నానో బయోటెక్నాలజీ ద్వారా ద్రవరూపంలో అభివృద్ధి చేసిన ఈ సూక్ష్మ ఎరువులను 2021లో భారత రైతులు ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) మార్కెట్లోకి తీసుకొచ్చింది. తొలుత యూరియా, ఆ తర్వాత నానో డీఏపీలను మార్కెట్లోకి తీసుకొచ్చిన ఇఫ్కో గత ఖరీఫ్ సీజన్ నుంచి నాలుగింతల నత్రజని (16 శాతం)తో సహా అధిక పోషక విలువలతో కూడిన నానో యూరియా ప్లస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వచ్చే సీజన్ నుంచి నానో జింక్, నానో కాపర్‌ను తీసుకొచ్చేందుకు సైతం ఏర్పాట్లు చేస్తోంది. – సాక్షి, అమరావతిఏపీలో తగ్గిన అమ్మకాలుగడచిన మూడేళ్లలో ఏపీలో ఇఫ్కో అవుట్‌లెట్స్‌తో పాటు ఆర్బీకేల ద్వారా 10.50 లక్షల బాటిళ్ల విక్రయాలు జరిగాయి. కాగా 2024–25 సీజన్ కోసం 10లక్షల నానో యూరియా, 4 లక్షల నానో డీఏపీ బాటిళ్లను ఇఫ్కో సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. వర్షాలు, వరదలు, వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో ఖరీఫ్–2024లో అతికష్టమ్మీద 1.04లక్షల బాటిళ్ల నానో యూరియా ప్లస్, 48వేల నానో డీఏపీ బాటిళ్ల అమ్మకాలు జరిగాయి. కాగా వచ్చే రబీ సీజన్లో నానో యూరియా ప్లస్ 3లక్షల బాటిళ్లతో పాటు లక్ష బాటిళ్ల నానో డీఏపీని అందుబాటులో ఉంచేందుకు ఇఫ్కో ఏర్పాట్లు చేసింది. గడచిన మూడేళ్లుగా ఆర్బీకేల ద్వారా కూడా విక్రయాలు జరపగా, గడచిన ఖరీఫ్ సీజన్ నుంచి ఇఫ్కో అవుట్‌లెట్స్‌తో పాటు ఓపెన్ మార్కెట్ ద్వారా మాత్రమే నానో ఎరువులను అందుబాటులో ఉంచుతోంది. నానో ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రైతులు, గ్రామీణ యువతకు కిసాన్ డ్రోన్స్ కూడా ఇస్తున్నారు. గతేడాది ఒక్కొక్కటి రూ.15లక్షల విలువైన ఈ వెహికల్తో కూడిన కిసాన్ డ్రోన్స్‌ను 75 మందికి అందజేశారు. ఈ ఏడాది మరో 70 మందికి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.500 మిల్లీ లీటర్ల బాటిల్లో తీసుకొచ్చిన నానో యూరియా/డీఏపీలు 45 కిలోల సంప్రదాయ యూరియా, డీఏపీ బస్తాకు సమానం. బస్తా యూరియా ధర మార్కెట్లో రూ.266.50 ఉండగా, అదే పరిమాణంలో ఉన్న ఈ నానో యూరియాను రూ.225కే ఇఫ్కో అందుబాటులోకి తీసుకొచ్చింది. సంప్రదాయ డీఏపీ బస్తా మార్కెట్లో రూ.1,350 ఉండగా, నానో డీఏపీ బాటిల్ రూ.600కే తెచ్చింది. గడచిన మూడేళ్లలో వీటి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. దేశ వ్యాప్తంగా 2021–22 సీజన్లో 2.12 కోట్ల బాటిళ్లు, 2022–23లో 3.30 కోట్ల బాటిళ్ల అమ్మకాలు . దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల ప్రభావం వల్ల సాగు తగ్గడంతో 2023–24లో 2.04 కోట్ల నానో యూరియా, 44 లక్షల నానో డీఏపీ బాటిళ్ల విక్రయాలు జరిగాయి. 2024–25 సీజన్లో 4.60 కోట్ల నానో యూరియా, 2 కోట్ల నానో డీఏపీ బాటిళ్ల విక్రయాలు లక్ష్యంగా నిర్ధేశించుకోగా, ఖరీఫ్ సీజన్లో కేవలం కోటి బాటిళ్ల నానో యూరియా ప్లస్, 43 లక్షల నానో డీఏపీ బాటిళ్ల అమ్మకాలు మాత్రమే జరిగాయి. తగ్గిన నానో విక్రయాలు.. -
ప్రేమోన్మాది ఘాతుకం
ఆదోని రూరల్: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరు గ్రామానికి చెందిన అశ్విని అనే ఇంటర్మీడియెట్ విద్యార్థిని ప్రేమోన్మాది చేతిలో బలైంది. విద్యార్థిని నోట్లో పురుగుల మందు పోసి హత్యచేసిన ఘటన శుక్రవారం నగరూరు గ్రామంలో కలకలం రేపింది. విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నరసమ్మ, చిన్న వీరేష్ దంపతుల ఏకైక కుమార్తె అశ్విని పత్తికొండ మోడల్ స్కూల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతోంది. దసరా సెలవులకు ఇంటికి వచ్చింది. అదే గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి సన్నీ శుక్రవారం అశ్విని ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. తనను ప్రేమించకపోతే చంపేస్తానని వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బా చూపుతూ ఆమెను బెదిరించాడు. అయినప్పటికీ బాలిక అతని మాట లెక్కచేయకపోవడంతో సన్నీ ఆమె నోట్లో బలవంతంగా పురుగు మందు పోసి పరారయ్యాడు. కొద్దిసేపటికి విద్యార్థిని తల్లిదండ్రులు పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి కుమార్తె చావుబతుకుల్లో కనిపించింది. సన్నీ అనే వ్యక్తి బలవంతంగా పురుగు మందు తాగించాడని తల్లిదండ్రులకు తెలిపింది. వారు వెంటనే ఆమెను ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
టీడీపీ నేతల బెదిరింపులకు ‘ఉపాధి’ ఉద్యోగి బలి
చిలకలూరిపేట: టీడీపీ నాయకుల బెదిరింపులు భరించలేక ఉపాధి హామీ పథకం ఉద్యోగి ఒకరు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం గోపాలంవారిపాలెం గ్రామంలో గురువారం జరిగింది. మృతుని కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం... గోపాలంవారిపాలెం గ్రామానికి చెందిన జడ ఆనంద్(38) గత 18 సంవత్సరాలుగా మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎన్ఆర్ఈజీఎస్)లో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నాయకులు వచ్చి ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఆనంద్‌ను ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేయాలని హెచ్చరించారు. ఉద్యోగానికి రాజీనామా చేయకపోతే ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తామని బెదిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఆనంద్ గురువారం మధ్యాహ్నం తన ఇంటి వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకురాగా, చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతిచెందాడు. ఆనంద్‌కు భార్య రత్నకుమారి, కుమార్తెలు దివ్య(10వ తరగతి), అర్షిత(8వ తరగతి), మహి(7వ తరగతి) ఉన్నారు. తన భర్త మృతికి గోపాళంవారిపాలెం గ్రామానికి చెందిన చిన్నం రవిబాబు, గోపాళం సాగర్‌బాబు, గోరంట్ల బుజ్జి, గోపాళం శ్రీధర్, మిన్నకంటి వీరబాబు, మానుకొండ బాలయ్య తదితరుల వేధింపులే కారణమని రత్నకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
'ప్రకృతి' పద్ధతిలో చీడపీడల యాజమాన్యం మేలు!
సాక్షి, హైదరాబాద్: వాతావరణ మార్పుల నేపథ్యంలో మెట్ట పంటల సాగును తక్షణమే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోకి మార్చుకోవటం అత్యవసరమని పులివెందులలోని ఇండో–జర్మన్ ఆగ్రోఎకాలజీ అకాడమీ సీనియర్ కన్సల్టెంట్, జాతీయ నూనెగింజల పరిశోధనా సంస్థ పూర్వ సంచాలకులు డాక్టర్ కె.ఎస్. వరప్రసాద్ అన్నారు. వర్షాధార ప్రాంతాల పొలాలకు సాగు నీటి సదుపాయం కల్పించటం కన్నా సాగు పద్ధతిని ప్రకృతికి అనుగుణంగా సమూలంగా మార్చటం అవశ్యమని, ఆయన శనివారం నొక్కిచెప్పారు. పంటల ఆరోగ్య యాజమాన్యం– నవ్యత, సుస్థిరత అనే అంశంపై రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నాలుగు రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ఈ సదస్సులో డా. వరప్రసాద్ ఆసియా పసిపిక్ ప్రాంతంలో సుస్థిర చీడపీడల యాజమాన్యంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అనే అంశంపై ప్రసంగించారు. చీడపీడల యాజమాన్య పద్ధతులను పంటల వారీగా, పురుగుల వారీగా, తెగుళ్ల వారీగా వేర్వేరుగా చూస్తూ వేర్వేరు పరిష్కారాలను వెతకటం కన్నా.. స్థానిక వంగడాల జీవవైవిధ్యంతో కూడిన ప్రకృతి వ్యవసాయం ద్వారా వ్యవస్థాగత పరిష్కారం వెతకడమే మేలన్నారు. ఈ మేరకు నవీనీకరించిన సమీకృత సస్యరక్షణ సూత్రాలను అనుసరించాలని ఆయన సూచించారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో కలసి వాసన్ సంస్థ మన దేశంలోని వర్షాధార ప్రాంతాల్లో సంప్రదాయ సాగు పద్ధతులపై నిర్వహించిన అధ్యయనంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయ అనుభవాలు కూడా ఈ విషయాన్ని ధృవపరుస్తున్నాయన్నారు. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ తెగుళ్ల శాస్త్రవేత్త డాక్టర్ పప్పు హనుమంతరావు రసాయనిక వ్యవసాయ దృష్టికి అతీతంగా ఈ ఫలితాలను శాస్త్రవేత్తలు గమనించాలని సూచించారు. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని వర్షాధార ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయ ఫలితాలు కొత్త పాఠాలు నేర్పుతున్నాయని, అంతర్జాతీయ బృందాలు ఈ నెల 26–29 తేదీల్లో ఏపీలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నాయని డా. వరప్రసాద్ తెలిపారు. స్థానిక ప్రకృతి వ్యవసాయదారుల అనుభవాల ఆధారంగా శాస్త్రవేత్తలు సాగు పద్ధతుల నుంచి చీడపీడల యాజమాన్యం వరకు ఉన్న అంశాలను సరికొత్త దృష్టితో, ముఖ్యంగా వర్షాధార వ్యవసాయం విషయంలో, పరిశీలించాల్సిన తరుణం ఆసన్నమైందని డా. వరప్రసాద్ తెలిపారు. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ తెగుళ్ల శాస్త్రవేత్త డాక్టర్ పప్పు హనుమంతరావు జీనోమ్ ఎడిటింగ్(జన్యు సవరణ) వంటి అత్యాధునిక సాంకేతికతల ద్వారా చీడపీడల యాజమాన్యంలో ప్రతిబంధకాలను అధిగమించవచ్చని, అనేక పంటలకు సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. జన్యు మార్పిడి సాంకేతికతపై మాదిరిగా జన్యు సవరణ సాంకేతికతపై అభ్యంతరాలు లేవన్నారు. పిజెటిఎస్ఎయు కీటక శాస్త్ర నిపుణుడు డా. ఎస్.జె. రహమాన్ ప్రసంగిస్తూ జీవన పురుగుమందులను క్షేత్రస్థాయిలో పునరుత్పత్తి చేసుకునే క్రమంలో నాణ్యతా ప్రమాణాలను పాటించటంలో ఖచ్చితత్వం కొరవడితే వ్యాధి కారక క్రిములతో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మార్కెట్లో నకిలీ పంచగవ్య వంటి ద్రావణాలను అధిక ధరలకు విక్రయిస్తున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని, నియంత్రణ యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. సుస్థిర వ్యవసాయాభివృద్ధే లక్ష్యం: సుస్థిర వ్యవసాయాభివృద్ధి లక్ష్యంగా పరిశోధనలకు శ్రీకారం చుట్టాలని, రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యంతో ప్రధాని మోదీ శాస్త్రవేత్తలకు ఈ మేరకు దిశానిర్దేశం చేశారని ఐసిఎఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా. ఉదమ్ సింగ్ గౌతమ్ అన్నారు. పంటల ఆరోగ్య యాజమాన్యం– నవ్యత, సుస్థిరత అనే అంశంపై నాలుగు రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు ముగింపు సభలో శనివారం సాయంత్రం ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. పిపిఎఐ అధ్యక్షులు డా. బి. శరత్‌బాబు, అటారి డైరెక్టర్ డా. షేక్ మీరా తదితరులు పాల్గొన్నారు. ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్వర్ణోత్సవాల సందర్భంగా వెటరన్ శాస్త్రవేత్తలు డా. కృష్ణయ్య, డా. వరప్రసాద్‌లకు జీవన సాఫల్య పురస్కారాలను ప్రదానం చేశారు. (చదవండి: మంచి వ్యవసాయం పద్ధతులే మేలు! ఐసిఎఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పిలుపు) -
యువతికి బలవంతంగా పురుగుల మందు తాగించి...
సిర్పూర్ (టి): అతడికి అప్పటికే వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా ఓ యువతిని ప్రేమ పేరుతో వేధించాడు. ఆ యువతి ప్రేమకు నిరాకరించడంతో నేరుగా ఇంట్లోకి వెళ్లి ఆమెకు పురుగుల మందు తాగించి పరారయ్యాడు. తొలుత ఆత్మహత్యగా భావించినప్పటికీ ఓ పదేళ్ల చిన్నారి చెప్పిన సాక్ష్యంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కుమురంభీం జిల్లా సిర్పూర్(టి) మండలం వెంకట్రావ్‌పేటకు చెందిన బుదే విట్టు, జీవనకళ దంపతుల కుమార్తె బుదే దీప (19) ఇంటర్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన దంద్రె జోగాజీ, దుమన్‌బాయిల కుమారుడు కమలాకర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొద్దిరోజులుగా కమలాకర్ ప్రేమ పేరుతో దీప వెంటపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 17న ఆదివారం సాయంత్రం యువతి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఉన్న ఇద్దరు చిన్నారులను భయపెట్టి బయటికి పంపించాడు. తనను ప్రేమించాలని లేకుంటే నిన్ను, నీ కుటుంబం మొత్తాన్నీ చంపుతానని దీపను బెదిరించాడు. అయినప్పటికీ ఆమె ఒప్పుకోకపోవడంతో వెంట తెచ్చుకున్న పురుగుల మందును బలవంతంగా ఆమెకు తాగించి పరారయ్యాడు. దీప కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. యువతిని మొదట సిర్పూర్(టి) ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించడంతో కాగజ్‌నగర్‌కు.. అక్కడి నుంచి మంచిర్యాలకు ఆ తర్వాత మెరుగైన చికిత్సకోసం కరీంనగర్‌కు తరలించారు. సోమవారం కరీంనగర్లో దీప మృతి చెందింది. దీపది ఆత్మహత్యగా భావించిన కుటుంబ సభ్యులు పోస్టుమార్టం కోసం సిర్పూర్(టి) సామాజిక ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే దీపకు కమలాకర్ బలవంతంగా పురుగుల మందు తాగించిన విషయం ఓ పదేళ్ల చిన్నారి ద్వారా మంగళవారం వెలుగులోకి వచ్చింది. దీంతో సామాజిక ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రామంలో స్థానికులు నిందితుడిపై దాడికి యత్నించారు. కౌటాల సీఐ సాదిక్‌పాషా, ఎస్సై రమేశ్ వారికి నచ్చజెప్పారు. పోలీసులు ఆస్పత్రిలోనే చిన్నారిని విచారించి పూర్తి వివరాలు సేకరించారు. మృతురాలి సోదరుడు బుదే రాజేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. -
కన్నీటి వాగు
కెరమెరి(ఆసిఫాబాద్): పత్తి చేనులో పురుగు మందు పిచికారీ చేస్తూ విష ప్రభావానికి గురైన లక్మాపూర్ రైతు మాలోత్ లక్ష్మణ్ (50)ను వాగు దాటించి ఆస్పత్రికి తరలించడం ఆలస్యం కావడంతో మృతి చెందాడు. లక్ష్మణ్ శుక్రవారం తన పత్తి పంటకు పురుగు మందు పిచికారీ చేస్తుండగా విషప్రభావంతో స్పృహ తప్పి కింద పడిపోయాడు. గమనించిన సమీప రైతులు ఆయనను ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును కష్టంగా దాటించి.. కెరమెరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆ తర్వాత ఉట్నూ ర్ సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యానికి ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించగా.. అర్ధరాత్రి 12 గంటలకు పరిస్థితి విషమించి మృతి చెందాడు. శనివారం కూడా వాగు ఉధృతి తగ్గక పోవ డంతో మృతదేహాన్ని మంచంపైనే వాగు దాటించారు. కాగా ఈ నెల 8న ‘ప్రాణాలు పోయా కా స్పందిస్తారా..?’ అన్న శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైన రోజే మృతి చెందడం గమనార్హం! ఆలస్యం కాకుంటే.. లక్ష్మణ్ తన చేనులో పడిపోగా.. వాగు దాటించి కెరమెరి పీహెచ్‌సీకి చేర్చడానికి రెండు గంటల సమయం పట్టింది. దీంతో ప్రాథమిక చికిత్స అందడం ఆలస్యమైంది. అక్కడి నుంచి ఉట్నూర్, ఆ తర్వాత ఆదిలాబాద్ రిమ్స్‌కు చేరేసరికి లక్ష్మణ్ పరిస్థితి విషమించింది. రిమ్స్ వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. సకాలంలో తీసుకొస్తే ప్రాణాలు దక్కేవని రిమ్స్ వైద్యులు పేర్కొన్నట్లు మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ నేత్రాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు. -
నవజాత శిశువుకు పురుగుల మందు ఇచ్చిన తండ్రి.. కారణమేంటంటే..?
భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ వ్యక్తి తన నెల శిశువుకు పురుగుల మందు ఇచ్చాడు. ఈ అమానవీయ ఘటన ఒరిస్సాలోని బాలాసోర్‌లో జరిగింది. చందన్, తన్మయికి గత ఏడాది వివాహం జరిగింది. ఈ నెల 9న వారికి ఓ శిశువు పుట్టింది. ఆస్పత్రి నుంచి తన్మయి డిఛార్జ్ కాగానే నీలగిరి పోలీసు స్టేషన్ పరిధిలోని సింగిరి గ్రామంలోని తల్లిగారింటికి వెళ్లింది. ఈ క్రమంలో పాపను చూడడానికి అత్తగారింటికి చందన్ వెళ్లాడు. భార్య వాష్‌రూమ్‌కు వెళ్లినప్పుడు, తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును పసిపాపకు ఎక్కించాడు. పాప ఏడుపుతో బయటికి వచ్చిన తన్మయి షాక్‌కు గురైంది. భర్తను దూరంగా నెట్టి పాపను తీసుకుంది. తన తల్లిదండ్రులకు విషయం తెలుపగా.. వారు పాపను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయనప్పుటికీ గ్రామస్తుల సమాచారంతో కేసును సుమోటోగా తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పాప పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. చదవండి:రోడ్డుపై లవర్స్ రొమాంటిక్ వీడియో..కేసుపై పోలీసుల తంట..! -
పురుగుల మందు తాగి.. చెట్టుకు ఉరేసుకుని..
చందంపేట: తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరన్న భయంతో ఓ ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆపై చెట్టుకు ఉరేసుకున్న ఘటన నల్లగొండ జిల్లా నేరెడుగొమ్ము మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాలిలా.. దేవరకొండ మండలం కొండభీమనపల్లి గ్రామానికి చెందిన అందుగుల భిక్షమయ్య, మార్తమ్మ దంపతుల కుమారుడు రాకేశ్(20) డిగ్రీ చదువును మధ్యలోనే వదిలేసి కూలి పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. కొండమల్లేపల్లి మండలం దోనియాల గ్రామానికి చెందిన వరికుప్పల కృష్ణయ్య, జయమ్మ దంపతుల కుమార్తె దేవి(16) దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఫస్ట్ ఇంటర్ చదువుతోంది. దేవి గతేడాది చింతపల్లి మండల పరిధిలోని మోడల్ స్కూల్లో పదోతరగతి చదువుతున్న సమయంలో రాకేశ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇటీవల ఇరువురూ తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంతో రాకేశ్ కుటుంబసభ్యులు సానుకూలంగా ఉండగా దేవి తరఫు బంధువులు నిరాకరించారు. ఈ క్రమంలో దేవి ఆదివారం రాకేశ్‌కు ఫోన్ చేసి తనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, నేను వేరొకరిని పెళ్లి చేసుకుని బతకలేనని, వచ్చి తీసుకెళ్లాల్సిందిగా కోరింది. దీంతో రాకేశ్ అదే రోజు ఆమెను ఇంటి నుంచి తీసుకొచ్చి బైక్‌పై నేరెడుగొమ్ము మండలం కాచరాజుపల్లి గ్రామ శివారులోని ఉచ్చలబుడ్డి వద్దకు చేరుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆపై చెట్టుకు తాడుతో ఉరి వేసు కున్నారు. కాచరాజుపల్లి గ్రామస్తులు చూసి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలంలో తమ చావుకు ఎవరూ కారణం కాదని, తల్లిదండ్రులు క్షమించాలని రాసి ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పరిహారం కోసం రైతు ఆత్మహత్యాయత్నం
భూపాలపల్లి: సింగరేణి ఓపెన్‌కాస్ట్ ఏర్పాటులో ఉన్న భూమి పోయింది. పరిహారం కోసం ఆఫీసుల చుట్టూ ఎంత తిరిగినా పూర్తిస్థాయిలో అందలేదు. దీంతో విసిగివేసారిన ఓ రైతు కలెక్టరేట్లో ప్రజావాణి వద్దకు వచ్చి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. సోమవారం కలెక్టరేట్ పక్కన ఉన్న ఇల్లందు క్లబ్‌హౌస్‌లోని మీటింగ్ హాల్లో ప్రజావాణి కార్యక్రమం జరుగుతోంది. కలెక్టర్ భవేష్ మిశ్రా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో గణపురం మండలం మాధవరావుపల్లికి చెందిన జిట్టబోయిన సాంబయ్య అనే రైతు క్లబ్‌హౌస్ బయట క్రిమిసంహారక మందు తాగి పడిపోయాడు. అక్కడున్న వారు అతడిని లేపి ఏమైందని అడగ్గా.. తనకు అన్యాయం జరిగిందని, ఎవరూ పట్టించుకోకపోవడంతో పురుగుమందు తాగానని చెప్పాడు. మాధవరావుపల్లిలో సర్వే నంబర్ 318/92లో తనకు ఎకరన్నర భూమిలో 500 టేకు చెట్లు ఉండేవని, 2019లో సింగరేణి సంస్థ ఓపెన్‌కాస్ట్–3 నిర్మాణంలో భాగంగా ఆ భూమిని సేకరించిందన్నాడు. ఎకరన్నర భూమికి గాను ఎకరాకే పరిహారం వచ్చిందని, మిగిలిన 20 గుంటల పరిహారం ఓ దళారి పేరుపై వచ్చిందని వాపోయాడు. అలాగే, 78 చెట్లకు కూడా పరిహారం రాలేదన్నాడు. నష్టపరిహారం కోసం మూడేళ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నానని చెప్పాడు. గతంలో గణపురం తహసీల్దార్‌ను ప్రశ్నిస్తే.. విధులకు ఆటంకం కలిగించానని పోలీసులకు ఫిర్యాదు చేశారని, పది రోజులు జైల్లో ఉండి వచ్చానని సాంబయ్య పేర్కొన్నాడు. రైతు ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకున్న కలెక్టర్ భవేష్ మిశ్రా వెంటనే సిబ్బందిని పంపి రైతును ఆస్పత్రిలో చేర్పించారు. సాంబయ్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. -
Devadula: భూములు తిరిగి ఇవ్వకుంటే మూకుమ్మడి ఆత్మహత్యలు
శాయంపేట: సొరంగం పనుల కోసం రైతుల నుంచి భూములను లీజుకు తీసుకుని, పనులైన వెంటనే తిరిగి ఇస్తామని చెప్పి.. తీరా ఇప్పుడు మినీ క్రషర్ ఏర్పాటు చేస్తున్నారని, వెంటనే భూములను మాకు అప్పగించాలంటూ రైతులు పురుగు మందు డబ్బాలతో ఆందోళన చేపట్టారు. భూములు అప్పగించకపోతే 18 కుటుంబాల రైతులందరమూ మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మైలారం గ్రామ శివారులో దేవాదుల మూడో విడత సొరంగం పనుల కోసం 18మంది రైతులనుంచి 27.30 ఎకరాల భూమిని కోస్టల్ మెగా కంపెనీ లీజుకు తీసుకుంది. ఆ స్థలంలో ఆడిట్ పాయింట్ ఏర్పాటు చేసి పనులు పూర్తి చేసింది. సొరంగం పనుల్లో వచ్చిన పెద్దపెద్ద బండరాళ్లు, మెటీరియల్స్‌ను ఆ ప్రాంతంలోనే నిల్వ చేశారు. పనులు పూర్తయినప్పటికీ తిరిగి రైతులకు భూములు అప్పగించలేదు. ఇటీవల కాలంలో రైతులు తమ భూములు అప్పగించాలని అడుగుతూ వస్తున్నారు. అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో 18.27 ఎకరాల పట్టా భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతోపాటు 5 ఎకరాల అసైన్డ్ భూమిని కూడా స్వాధీనం చేసుకుంది. ఆ స్థలంలో నిల్వ చేసిన బండరాళ్లను, మెటీరియల్‌ను తొలగించడానికి హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ కాంట్రాక్టర్‌కు పనులను అప్పగించింది. దీంతో కాంట్రాక్టర్ ఆ ప్రాంతంలో మినీ క్రషర్ ఏర్పాటుచేయడానికి బుధవారం రాత్రికి రాత్రే మెటీరియల్ దింపాడు. విషయం తెలుసుకున్న రైతులు గురువారం ఉదయం అక్కడికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించి తిరిగి వెళ్తున్న ఇరిగేషన్ అధికారుల వాహనాన్ని రెండు గంటలపాటు అడ్డుకున్నారు. సమస్య పరిష్కరించేంత వరకు వెళ్లనివ్వమని పురుగు మందు డబ్బాలు పట్టుకుని ఆందోళన చేపట్టారు. తమ స్థలంలో ఎలాంటి పనులూ చేపట్టవద్దని, కాదని చేపడితే 18 కుటుంబాల రైతులం ఆత్మహత్య చేసుకుంటా మని హెచ్చరించారు. దీంతో ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని, వారి ఆదేశాలను పాటిస్తామని డీఈ రవీందర్ తెలిపారు. రైతుల ఆందోళన మేరకు పదిరోజుల పాటు ఆడిట్ స్థలంలో ఎలాంటి పనులూ చేపట్టమని హామీ ఇచ్చారు. -
అమ్మా.. పురుగుల మందు తాగిన.. నన్ను క్షమించమ్మా!
సాక్షి, మంచిర్యాల: ‘ఉద్యోగం రాదోమోననే భయంతో పురుగుల మందు తాగిన.. అమ్మా.. నన్ను క్షమించమ్మా? అని ఆ కొడుకు చివరిసారిగా మాట్లాడిన మాటలు ఆ కన్నతల్లి జీర్ణించుకోలేకపోతోంది. చేతికందిన కొడుకు చేదోడువాదోడుగా ఉంటాడనుకుంటే అర్ధంతరంగా తనువు చాలించడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. మృతుడి తండ్రి, ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రోటిగూడ గ్రామానికి చెందిన దాసరి శేఖర్–సుజాత దంపతులకు కొడుకు శ్రీకాంత్ (25), కూతురు ఉన్నారు. కూతురుకు వివాహం జరిపించారు. శ్రీకాంత్ బీటెక్ చదివాడు. ఇటీవల ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాశాడు. తక్కువ మార్కులు వస్తాయని భావించి ఉద్యోగం రాదని దిగులు చెందాడు. ఇదే బెంగతో ఈనెల 10న రాత్రి 11గంటల ప్రాంతంలో ఇంట్లో పురుగుల మందు తాగాడు. ‘పరీక్షలో తక్కువ మార్కులు వస్తాయి.. ఉద్యోగం రాదేమోననే భయంతో పురుగుల మందు తాగిన.. నన్ను క్షమించమ్మా’ అని తల్లి సుజాతతో చివరిసారిగా మాట్లాడాడు. అంతలోనే అపస్మారక స్థితికి చేరాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని మేదరిపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కరీంనగర్ ఆస్పత్రి కి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఎదిగివచ్చిన కొడుకుపై పుట్టెడు ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొడుకు చివరి మాటలు తలుచుకుని రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. మృతుడి తండ్రి శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తానాజీ తెలిపారు. చదవండి: (Kothapalli Geetha: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష) -
సెల్ఫీ వీడియో తీస్తూ రైతు ఆత్మహత్యాయత్నం
కౌడిపల్లి(నర్సాపూర్): సెల్ఫీ వీడియో తీస్తూ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ యువ రైతు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం దేవులపల్లిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. దేవులపల్లి గ్రామానికి చెందిన జింక శ్రీశైలంకు గ్రామ శివారులోని అటవీభూమి పక్కన సాగుభూమి ఉంది. అందులో వరితోపాటు మిరప పంట సాగు చేశారు. ఇటీవల గ్రామానికి బృహత్ పల్లె ప్రకృతి వనం మంజూరైంది. అటవీశాఖ అధికారులు దీనికోసం ఐదు ఎకరాల స్థలం కేటాయించారు. శనివారం అక్కడికి వచ్చిన డిప్యూటీ ఎఫ్ఆర్ఓ రాజమణి, బీట్ అధికారి హరిత.. మిగతా భూమితోపాటు శ్రీశైలం పోడు చేసుకుంటున్న అటవీభూమిని సైతం దున్ని చదును చేయాలని సిబ్బందికి చెప్పారు. దీంతో శ్రీశైలం తమ తాతల కాలం నుంచి పోడు భూమిలో సాగు చేస్తున్నామని.. పంటను నాశనం చేయొద్దని అధికారులను కోరాడు. ఈ నేపథ్యంలో అతను అధికారులతో వాగ్వాదానికి దిగాడు. పనులను అడ్డుకోవడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై వారు స్థానిక పోలీసులు ఫిర్యాదు చేశారు. అనంతరం శ్రీశైలం, అటవీశాఖ అధికారులు, సర్పంచ్ కలసి తన పొలంలో బృహత్ పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేస్తున్నారంటూ సెల్ఫీ వీడియో ద్వారా బాధను తెలిపాడు. ఈ భూమి పోతే తమకు వేరే ఆధారం లేదని రోదిస్తూ పురుగు మందు తాగాడు. వీడియోను చూసిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అతడిని మెదక్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీశైలం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. అది అటవీ భూమి.. జింక శ్రీశైలం ఇప్పటికే అటవీ భూమిని ఆక్రమించి వరి సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది కొత్తగా మరో ఎకరా అటవీభూమి దున్ని మిరప పంట సాగు చేస్తున్నాడు. అటవీ భూమి కావడంతో పల్లెప్రకృతి వనం కోసం చదును చేస్తుండగా అడ్డుకొని ఇష్టానుసారంగా దూషించాడు. భూమికి సంబంధించి ఆధారాలు చూపించలేకపోయాడు. సిబ్బంది పనులకు అడ్డు తగలడంతో వాటిని నిలిపివేసి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ కోసం వస్తారన్న ఆందోళనతో శ్రీశైలం పురుగు మందు తాగి ఉండవచ్చు. – రాజమణి, డిప్యూటీ ఎఫ్ఆర్ఓ, కౌడిపల్లి -
స్కూల్‌కు సెలవులివ్వడం లేదని విషం కలిపాడు!
భువనేశ్వర్: స్కూల్‌కు సెలవులు ఇవ్వడం లేదని ఓ విద్యార్ధి ఏకంగా 20 మంది విద్యార్ధుల జీవితాలను ఇరకాటంలో పెట్టాడు. ఎందుకు చేశావని స్కూల్ ప్రిన్సిపాలు అడిగితే అతను చెప్పిన సమాధానం విని అందరూ నోరెళ్ల బెట్టారు. అసలేంజరిగిందంటే.. ఒడిశాలోని బర్గార్ జిల్లాకు చెందిన కామగాన్ హయ్యర్ సెకండరీ స్కూల్ల్లో 11వ తరగతి చదివే విద్యార్థి (16) తన 20 మంది స్నేహితులకు బాటిల్ నీళ్లలో విషం కలిపి ఇచ్చాడు. ఆ బాటిల్లోని నీళ్లు తాగిన వారంతా వాంతులు, వికారంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేర్పించడంతో చికిత్స అనంతరం ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటనపై ప్రిన్సిపాల్ ప్రేమానంద్ పటేల్ మాట్లాడుతూ.. ఒమిక్రాన్ కారణంగా మరోమారు లాక్డౌన్ విధించే అవకాశం ఉందని నేరానికి పాల్పడిన విద్యార్ధి ఆశించాడు. అలా జరగకపోవడంతో ఈ పనికి పూనుకున్నాడని తెలిపాడు. ఐతే అనారోగ్యంపాలైన విద్యార్ధుల తల్లిదండ్రులు సదరు విద్యార్ధిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఐతే విద్యార్ధి కెరీర్, చిన్న వయసును దృష్టిలో ఉంచుకుని ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యలేదు. ఐతే పాఠశాల యాజమన్యం సదరు విద్యార్ధిని కొన్ని రోజులపాటు స్కూల్ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. పాఠశాలలోని హాస్టల్లో నివసిస్తున్న విద్యార్ధి ఎలాగైనా ఇంటికి వెళ్లాలనుకున్నాడు. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్‌లు వచ్చినప్పుడు స్కూళ్లు మూతపడ్డాయి. ఇప్పుడు ఒమిక్రాన్ వల్ల కూడా స్కూళ్లు మూతపడి సెలవులిస్తారని అనుకున్నాడు. అలా జరగకపోవడంతో తోటలోని పురుగుల మందును నీళ్లలో కలిపి విద్యార్ధులకు తాగేందుకు ఇచ్చాడు. నీళ్లను తాగిన విద్యార్ధులు ఆనారోగ్యానికి గురయ్యారు. చదవండి: జపాన్‌లో కొత్తగా 8 ఒమిక్రాన్ కేసులు.. ఆ దేశంలో రోజుకు 7 వేలకు పైనే..! -
దళిత దంపతులపై జులుం
-
‘చావు తప్ప మరో దారి లేదు’
భోపాల్: చేతికొచ్చిన పంటను అధికారులు బుల్డోజర్తో నాశనం చేయడం చూసి ఆ దళిత దంపతులు తట్టుకోలేకపోయారు. సొంత బిడ్డను చంపుతున్నట్లే భావించారు. ఆ ఘోరాన్ని చూడలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవ్వడంతో అధికారుల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ దారుణమైన సంఘటన మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. రామ్ కుమార్ అహిర్వార్, సావిత్రి దేవి దంపతులు కొన్నేళ్లుగా రెండు బిఘాల(5.5 ఎకరాలు) ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో 2018లో ప్రభుత్వం ఆ భూమిని ఓ కాలేజీ కోసం కేటాయించింది. దాంతో ఆ భూమిని ఖాళీ చేయాల్సిందిగా అధికారులు రామ్ కుమార్ దంపతులకు సూచించారు. కానీ వాళ్లు అంగీకరించకపోవడంతో.. రెండు రోజుల క్రితం రాష్ట్ర రెవెన్యూ అధికారులు పోలీసులతో వచ్చి భూమిని ఖాళీ చేయాల్సిందిగా రామ్ కుమార్ దంపతులను బెదిరించారు. ఈ క్రమంలో బుల్డోజర్తో వారి పంటను నాశనం చేసే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులకు, రామ్ కుమార్ దంపతులకు మధ్య వాగ్వాదం జరిగింది. ‘మాకు మూడు లక్షల రూపాయల అప్పు ఉంది. దాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందా. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ సాగు చేసుకుంటున్నాం. ఇప్పుడ ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అంటే.. మేం ఎలా బతకాలి. చావు తప్ప మాకు వేరే దారి లేదు’ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో పోలీసులు లాఠీలతో విచక్షణారహితంగా రామ్ కుమార్ మీద దాడి చేశారు. అడ్డుకోబోయిన సావిత్రి దేవిని అసభ్యకరమైన మాటలతో అవమానించారు. చివరకు బుల్డోజర్తో పంటను నాశనం చేసేందుకు ప్రయత్నించారు. ఇది చూసి తట్టుకోలేకపోయిన ఆ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. దాంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రామ్‌కుమార్ దంపతుల మీద దాడి చేసిన పోలీసులకు జిల్లా కలెక్టర్ క్లీన్‌చీట్ ఇవ్వడం మరింత వివాదాస్పదంగా మారింది. (మృతదేహం కళ్లు పీక్కుతిన్న చీమలు!) దాంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా రంగంలోకి దిగారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్నింటికంటే ముందుగా పోలీసులకు క్లీన్‌చీట్ ఇచ్చిన కలెక్టర్‌ను, ఎస్పీని సస్పెండ్ చేశారు. తల్లిదండ్రులను కాపాడేందుకు ప్రయత్నించిన పిల్లలను కూడా పోలీసులు అవమానించారు. అవతలకు ఈడ్చిపారేశారు. ప్రతిపక్షాలు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మాజీ సీఎం కమల్‌నాథ్ రాష్ట్రంలో జంగిల్‌రాజా పాలన కొనసాగుతుందని ఆరోపించారు. ‘దళిత దంపతుల మీద పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఏంటిది జంగిల్ రాజా. ఒకవేళ వారు ప్రభుత్వ భూమినే సాగు చేస్తున్నారనుకుందా. దాన్ని చట్టబద్దంగా పరిష్కరించుకోవాలి. అంతకాని జాలీ, దయ లేకుండా ఆ దంపతులను, వారి పిల్లలను కొట్టడం న్యాయం కాదు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.(కమల్‌ను కాపాడిన ‘కరోనా’) దీని గురించి ప్రభుత్వ అధికారులను ప్రశ్నించగా.. ‘లోకల్ గ్యాంగ్‌స్టర్ ఒకడు దాదాపు 4.5 బిఘాల(12.5ఎకరాలు) భూమిని ఆక్రమించుకున్నాడు. రామ్ విలాస్ దందపతులను వాడుకుని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకు అప్పులపాలైన రామ్ విలాస్ దంపతులను వాడుకుంటున్నాడు’ అని తెలిపారు. -
‘మందుల’ వాడకంలో మనమే టాప్
క్రిమిసంహారక మందుల తయారీ సంస్థల ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా రైతుల ప్రాణాలను బలిగొంటున్నాయని, ఆ మందులను పంటపొలాల్లో వాడుతున్న రైతులు కేన్సర్ వ్యాధికి గురవుతున్నారని అంతర్జాతీయ అధ్యయనాలు భయంగొలిపే నివేదికలను వెలువరిస్తున్నాయి. ప్రపంచ పురుగుమందుల్లో 59 శాతంవరకు వినియోగిస్తున్న భారతదేశం అంతర్జాతీయంగా పురుగుమందుల వినియోగంలో అగ్రస్థానం పొందినట్లు తెలిసింది. పురుగుమందుల కంపెనీలు తయారు చేస్తున్న మందుల్లో 99.9 శాతం మందులు పర్యావరణంలో కలిసిపోతుండగా 0.1 శాతం మందులు మాత్రమే క్రిములను ప్రభావితం చేస్తున్నాయని ప్రొ. డేవిడ్ పిమెంటర్ యాభయ్యేళ్ల క్రితమే తన శాస్త్ర పరిశోధనా పత్రంలో సమర్పించారు. దీన్ని ముందుగానే గ్రహించి ఉంటే ప్రపంచం పురుగుమందులకు వ్యతిరేకంగా మరింత సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకుని ఉండేది. అంతర్జాతీయ వ్యవసాయ రసాయనిక ఉత్పత్తుల బహుళజాతి సంస్థ బేయర్–మోన్శాంటో తయారు చేసిన రౌండప్, డికాంబా అనే క్రిమిసంహాకర మందులు కేన్సర్ వ్యాధికారకాలను కలిగి ఉన్నట్లు వచ్చిన ఆరోపణలపై అమెరికాలోనూ, ఇతర దేశాల్లోనూ ఆ సంస్థ కేసులు ఎదుర్కొం టోంది. ఈ నేపథ్యంలో స్విట్జర్లాండ్ ఎన్జీఓ పబ్లిక్ ఐ, యూకేకు చెందిన గ్రీన్ పీస్ సంస్థలకు చెందిన జర్నలిస్టు పరిశోధనా బృందం ‘అన్‌ఎర్త్‌డ్’ చేసిన పరిశోధనలో.. అత్యంత ప్రమాదకరమైన పురుగుమందుల్లో 59 శాతంవరకు వినియోగిస్తున్న భారతదేశం అంతర్జాతీయంగా పురుగుమందుల వినియోగంలో అగ్రస్థానం పొందినట్లు తెలిసింది. అయితే ది గార్డియన్ పత్రిక నివేదిక ప్రకారం, వ్యవసాయ రసాయన ఉత్పత్తుల కంపెనీలు ఈ డేటాతో విభేదిస్తున్నాయి. పరిశోధనా బృందం ప్రకటించిన సమాచారం తప్పుదోవ పట్టిస్తోందని బేయర్ కంపెనీ చెబుతోంది కానీ దాన్ని తన సొంత డేటాతో ఎదుర్కోలేకపోయింది. మరోవైపున ఆగ్రో–కెమికల్ పరిశ్రమకు చెందిన బలమైన లాబీ గ్రూప్ అయిన క్రాప్ లైఫ్ ఇంటర్నేషనల్ ఒక ప్రకటన చేస్తూ, తన ఉత్పత్తులలో 15 శాతం మాత్రమే అత్యంత ప్రమాదకరమైనవిగా ఉంటున్నాయని, వీటిలో కూడా 10 శాతం మందులను రైతులు సురక్షితంగా వాడుతున్నారని తెలిపింది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా ఆహార, వ్యవసాయ సంస్థ అభిప్రాయం ప్రకారం అత్యంత ప్రమాదకరమైన పురుగుమందులు అంటే.. ‘అంతర్జాతీయంగా ఆమోదించిన వర్గీకరణ వ్యవస్థల ప్రకారం మానవ ఆరోగ్యానికి లేదా పర్యావరణానికి తీవ్రమైన, దీర్ఘకాలిక హాని కలిగించేవి’ అని అర్థం. ఇది 1980లలో నోబెల్ గ్రహీత నార్మన్ బొర్లాగ్తో నేను జరిపిన చర్చను గుర్తుకు తెచ్చింది. పర్యావరణ ఉద్యమానికి దారిచూపుతున్నట్లుగా అప్పట్లో ప్రచారమైన రేచల్ కార్ల్సన్ రాసిన ‘సైలెంట్ స్ప్రింగ్’ పుస్తకంపై నేను సంధించిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ఆమె ఒక దుష్టశక్తి అని అభివర్ణించారు. ఆమెలాంటి వ్యక్తులు ప్రపంచంలోనుంచి ఆకలిని తరిమివేయాలని అసలు కోరుకోరని ఆయన విమర్శించారు. పైగా పురుగుమందులు అనేవి ఔషధాల వంటివి అనేశారు. అన్ని జాగ్రత్తలూ తీసుకుని రైతులు వాటిని ఉపయోగించాలన్నారు. ఆరోజు బొర్లాగ్ చెప్పిన మాటలు చర్చనీయాంశమే. కానీ ఆయన అభిప్రాయాలు క్రిములు కలిగించే నష్టాన్నుంచి పంటలను కాపాడేందుకు పురుగుమందులను ఉపయోగించే హరిత విప్లవానికి కీలక వ్యూహాన్ని ఏర్పర్చాయి. కానీ ఏళ్లు గడిచేకొద్దీ, పురుగుమందులు పర్యావరణానికి మరిం తగా హాని కలిగించాయి. రసాయనమందుల వినియోగం, దుర్వినియోగం అనేవి ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ నష్టాలకు, పర్యావరణ అసమతుల్యతకు, పురుగుమందుల ప్రభావం నిరోధకతకు, మొత్తం ఆహార సరఫరా వ్యవస్థనే కలుషితం చేసిందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఎంత అధికంగా పురుగుమందులు వాడితే అంత అధికంగా ఆకలిని తొలగించవచ్చనే అభిప్రాయం భ్రాంతి మాత్రమే అని ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ప్రతినిధి హిలాల్ ఎల్వర్ పేర్కొన్నారు. మరింతగా పురుగుమందులు వాడితే ఆకలి సమస్యపై అంత ఎక్కువగా స్వారీ చేయవచ్చనడంలో నిజం లేదు. ఎప్‌ఏఓ ప్రకారం, ఈరోజు మనం 700 కోట్లమందికి ప్రపంచంలో తిండిపెడుతున్నాం. ఉత్పత్తి కచ్చితంగా పెరిగింది. కానీ దారిద్య్రం, అసమానత్వం, పంపిణీయే అసలు సమస్య. పురుగుమందులను దీర్ఘకాలంగా వాడటం అనేది కేన్సర్, అల్జీమర్స్, పార్కిన్సన్ వంటి వ్యాధులకు దారితీస్తోందని, హార్మోన్ల విచ్ఛిన్నత, మానవ శరీర అభివృద్ధి క్రమరాహిత్యం, సంతాన విహీనత వంటివి కూడా తలెత్తుతున్నాయని పై నివేదిక వివరించింది. రౌండప్ పురుగుమందులో వాడుతున్న గ్లైపోసేట్ మనుషుల్లో కేన్సర్‌కు కారణమవుతోందన్న అంశాన్ని జతచేస్తూ ఇంటర్నేషనల్ ఏజెన్సీ రీసెర్చ్ ఆన్ కేన్సర్ నివేదికను ప్రచురించిన తర్వాత, విషపూరితమైన పురుగుమందుల వాడకానికి వ్యతిరేకంగా అమెరికాలో అనేక వ్యాజ్యాలు ప్రారంభమయ్యాయి. గ్లిపోసేట్కు, కేన్సర్ వ్యాధికి మధ్య లింకు ఉన్నట్లు యూరోపియన్ కమిషన్, అమెరికా పర్యావరణ రక్షణ ఏజెన్సీ వంటి రెగ్యులేటరీ సంస్థలు చెప్పడం లేదని మోన్శాంటో చెప్పింది కానీ పలువురు కేన్సర్ రోగులు పురుగుమందుల కంపెనీలపై లీగల్ కేసులు పెట్టడం ప్రారంభించారు. తాజా గణాంకాలను చూస్తే ఇంతవరకు పురుగుమందుల కంపెనీలపై 42,000 కేసులు పెట్టారు. కాగా ఫిర్యాదుదారుల సంఖ్య ఇప్పటికే లక్షకు పైగా దాటినట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఒక్క గ్లైపోసేట్‌కు వ్యతిరేకంగానే కాకుండా, మరొక క్రిమిసంహారక మందు అయిన డికాంబాపై కూడా న్యాయవివాదాలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 15న మిస్సోరి రైతుకు తన పీచ్ ఆర్చర్డ్ తోటను పురుగుమందులు ధ్వంసం చేసిపడేశాయన్న ఆరోపణతో ఏకీభవిం చిన అమెరికా ఫెడరల్ కోర్టు 265 మిలియన్ డాలర్ల పరిహారాన్ని చెల్లించాలని పురుగుమందుల కంపెనీలను ఆదేశించింది. తన పొరుగున ఉన్న పొలం యజమాని చల్లిన డికాంబా క్రిమిసంహాకర మందు పక్కనే ఉన్న తన పూలతోటకు వ్యాపించి తోట మొత్తాన్ని పాడు చేసిందంటూ ఆ రైతు బేయర్, బీఎఎస్ఎఫ్ అనే బడా ఆగ్రో–కెమికల్ కంపెనీలపై ఫిర్యాదు చేశారు. డికాంబా పురుగుమందు ప్రభావాన్ని తట్టుకునే పత్తిపంట కోసం పొరుగు రైతు ఈ కంపెనీల మందును చల్లగా అది పక్కనున్న తన పొలంలోని పీచ్ అర్చర్డ్ తోటలోని ఆకులను, చెట్లను చంపేసిందని ఆ రైతు వాదించి మరీ గెలిచారు. అయితే గ్లైపోసేట్ పురుగుమందుకు వ్యతిరేకంగా నడుస్తున్న న్యాయపరమైన లావాదేవీని మనం నిశితంగా పరిశీలించాలి. ఇంతవరకు గ్లైపోసేట్‌కు వ్యతిరేకంగా మూడు వ్యాజ్యాలలో నలుగురు ఫిర్యాదీదారులకు న్యాయస్థానం 2.3 బిలియన్ డాలర్ల పరిహారాన్ని చెల్లించాలని తీర్పు ఇచ్చింది. తన పురుగుమందులు వాడేటప్పుడు కేన్సర్ ప్రమాదం పొంచి ఉంటుందని వినియోగదారులను నిర్దిష్టంగా హెచ్చరించడంలో పురుగుమందుల కంపెనీ విఫలమైందని తీర్పులు స్పష్టం చేశాయి. మొట్టమొదటగా 2018 ఆగస్టు నెలలో డెవైన్ జాన్సన్ అనే తోటల పెంపకందారుకు శాన్ప్రాన్సిస్కో న్యాయస్థానం 289 మిలి యన్ డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని పురుగుమందుల కంపెనీలను ఆదేశించింది. తన పొలంలో గ్లైపోసేట్‌కు చెందిన వివిధ రకాల కాంబినేషన్లను స్ప్రే చేశానని, దీంతో తాను లింపోమా వ్యాధికి గురయ్యానని ఆ రైతు చెప్పారు. ఇక భారతదేశం విషయానికి వస్తే ప్రతి సంవత్సరం 10 వేల పురుగుమందుల విషప్రభావానికి సంబంధించిన కేసులు సగటున నమోదవుతున్నాయని డౌన్ టు ఎర్త్ పత్రిక పేర్కొంది. 2015లో ప్రమాదవశాత్తూ పురుగుమందులతో విషప్రభావానికి గురై 7,060 మంది చనిపోయారని జాతీయ నేర నమోదు బ్యూరో పేర్కొంది. వాస్తవానికి దేశంలో రూ. 20,000 కోట్ల విలువైన క్రిమిసంహారక పరిశ్రమలు 2024 వరకు ప్రతి ఏటా 8.1 శాతంతో వృద్ధి సాధించనున్నాయని అంచనా. అంటే పురుగుమందుల కంపెనీల క్రమబద్ధీకరణ విషయంలో లొసుగులను పరిష్కరించడం ఎంత అవసరమో దీన్ని బట్టి తెలుస్తోంది. కేంద్రం తీసుకురానుందని చెబుతున్న పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ బిల్ 2020ను త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ చట్టం క్రిమిసంహారక మందుల కంపెనీలను క్రమబద్ధీకరించడమే కాకుండా తమ మందుల వాడకం ద్వారా రైతులకు కలుగుతున్న ఆరోగ్యపరమైన నష్టాలకు కూడా పరిహారం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పైగా వేలాది మంది రైతులు వేయబోయే కేసులను కూడా మననంలో ఉంచుకోవలసిన అవసరం ఉంది అయితే దాదాపు అయిదు దశాబ్దాల క్రితం 1970లలో కార్నెల్ యూనివర్సిటీకి చెందిన సుప్రసిద్ధ ప్రొఫెసర్ డేవిడ్ పిమెంటర్ చెప్పిన మాటలను ప్రపంచం పట్టించుకుని ఉంటే ఈ 50 ఏళ్లలో జరుగుతూ వచ్చిన నష్టాన్ని నివారించి ఉండేది. పురుగుమందుల కంపెనీలు తయారు చేస్తున్న మందుల్లో 99.9 శాతం మందులు పర్యావరణంలో కలిసిపోతుండగా 0.1 శాతం మందులు మాత్రమే క్రిములను ప్రభావితం చేస్తున్నాయని ఆయన ఆనాడే తన శాస్త్ర పరిశోధనా పత్రంలో సమర్పించారు. అంటే పురుగుమందుల్లోని రసాయనాలు ఒక శాతం మాత్రమే తమ లక్ష్యాన్ని తాకుతున్నాయని అర్థం. దీన్ని ముందుగానే గ్రహించి ఉంటే ప్రపంచం పురుగుమందులకు వ్యతిరేకంగా మరింత సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకుని ఉండేది. కానీ ఇంతవరకు జరిగిన నష్టానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? వ్యాసకర్త: దేవీందర్ శర్మ, వ్యవసాయ నిపుణులు, ఈ–మెయిల్ : hunger55@gmail.com -
‘పెస్టిసైడ్స్’ నియంత్రణకు బిల్లు
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే పురుగు మందుల వ్యాపార నియంత్రణ బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది. పురుగుమందుల వ్యాపార క్రమబద్ధీకరణతో పాటు, నకిలీ పురుగుమందుల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందించే ప్రతిపాదనను కూడా బిల్లులో చేర్చారు. ఈ ‘పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ బిల్–2020’ని బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ‘ప్రస్తుతం పురుగుమందుల వ్యాపారం ఇన్సెక్టిసైడ్ యాక్ట్ – 1968 నిబంధనల ప్రకారం జరుగుతోంది. ఆ నిబంధనలకు కాలం చెల్లింది. అందుకే కొత్త బిల్లును రూపొందించాం’ అని సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా, వారికి సురక్షితమైన, ప్రభావశీలమైన పురుగుమందులు అందించడం, నకిలీ పురుగుమందులను అరికట్టడం లక్ష్యంగా ఈ బిల్లు రూపొందిందన్నారు. ఆయా పురుగు మందులకు సంబంధించిన సమస్త సమాచారం డీలర్ల నుంచి రైతులకు అందేలా నిబంధనలు రూపొందించామన్నారు. అలాగే, సేంద్రియ పురుగుమందుల వాడకాన్ని ప్రోత్సహించే ప్రతిపాదనలను కూడా తాజా బిల్లులో చేర్చామన్నారు. నకిలీ రసాయన మందుల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు ఒక సెంట్రల్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. పెస్టిసైడ్స్ కంపెనీల నుంచి వసూలు చేసిన జరిమానాకు, అవసరమైతే కొంత కలిపి కేంద్రం ఆ ఫండ్‌ను ఏర్పాటు చేస్తుందన్నారు. పురుగుమందుల ప్రచారాన్ని క్రమబద్ధీకరించే ప్రతిపాదన కూడా తాజా బిల్లులో ఉందన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే పురుగుమందుల తయారీ సంస్థలకు రూ. 25 వేల నుంచి రూ. 50 లక్షల వరకు జరిమానా విధించే ప్రతిపాదనను ఆ ముసాయిదా బిల్లులో చేర్చారు. నిబంధనలను అతిక్రమించేవారికి జైలు శిక్షను ఐదేళ్లవరకు పెంచే ప్రతిపాదనను తాజా బిల్లులో చేర్చారు. -
కడుపులోకి ‘కల్తీ’ కూట విషం..
సాక్షి, హైదరాబాద్: పండ్లు.. కూరగాయలు.. ఆకు కూరలు.. పప్పులు.. బియ్యం.. సుగంధ ద్రవ్యాలు.. గోధుమలు కాదేదీ పెస్టిసైడ్స్ (క్రిమి సంహారకాలు) ఆనవాళ్లకు అనర్హం అన్నట్లుగా మారింది ప్రస్తుత పరిస్థితి. హైదరాబాద్ వాసులు రోజువారీగా విని యోగిస్తున్న నిత్యావసరాలు, పలు రకాల ఆహార పదార్థాల నమూనాల్లోనూ ఫుడ్‌సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ ఎస్ఏఐ) నిర్దేశించిన పరిమితికి మించి రసాయనాలు, క్రిమి సంహారక ఆనవాళ్లు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ పరిధిలో బహిరంగ మార్కెట్ల, లో విక్రయిస్తున్న ఆహార పదార్థాల్లో మొత్తం గా సుమారు 30% మేర పెస్టిసైడ్స్ ఆనవాళ్లు బయటపడుతున్నాయి. ఎరువులు, పురుగు మందుల అవశేషాలు లేని సేంద్రియ ఆహార పదార్థాలను విక్రయిస్తున్నా మంటూ ప్రచారం చేసుకుంటున్న పలు సంస్థలు తమ ఆర్గానిక్ స్టోర్లలో విక్రయిస్తున్న నమూనాల్లోనూ ఈ ఆనవాళ్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆయా స్టోర్లలో సేకరించిన పలు రకాల ఆకుకూరలు, పండ్లు, కూరగాయల్లోనూ విష రసాయనాల ఆనవాళ్లు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్ మెంట్ (హైదరాబాద్) ఆధ్వర్యంలో వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరల నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించగా వీటి ఆనవాళ్లు బయటపడ్డాయి. కూరల్లో వాడే కరివేపాకులోనూ వీటి ఆన వాళ్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నమూనాలను నగరంలోని పలు బహిరంగ మార్కెట్లలో సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. అమ్మో క్రిమి సంహారకాలు.. క్రిమి సంహారకాల్లో ప్రధానంగా ఆర్గానో క్లోరిన్, ఎసిఫేట్, ఎసిటామిప్రిడ్, అజోక్సీ స్టార్బిన్, కార్బన్డిజం, ఇమిడాక్లోప్రిడ్, టిబ్యుకొనజోల్ తదితర క్రిమిసంహారక ఆన వాళ్లు బయటపడ్డాయి. ఇవన్నీ ఫుడ్‌సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్దేశించి న పరిమితులకు మించి ఉంటున్నాయి. ఎసిఫేట్, లిండేన్ వంటి క్రిమి సంహారకాల వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ వాటి ఆనవాళ్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సుగంధ ద్రవ్యమైన యాలకులలోనూ క్వినై ఫోస్, అజోక్సీస్టార్బిన్, థయామె టోక్సా మ్ వంటి క్రిమి సంహారకాలు ఉంటున్నాయి. పెస్టిసైడ్స్ ఆనవాళ్లతో అనర్థాలివే.. దేశంలో సరాసరిన 10% మధుమేహ బాధి తులుండగా.. హైదరాబాద్‌లో సుమారు 16–20% మంది ఈ వ్యాధితో బాధపడుతు న్నారు. దేశంలో గ్రేటర్ సిటీ డయాబెటిక్ క్యాపిటల్‌గా మారుతుండటం ఆందోళన కలి గిస్తోంది. ఆకుకూరలు, కూరగాయల్లో ఉండే క్రిమిసంహారకాలు ఆహారపదార్థాల ద్వారా మానవశరీరంలోకి ప్రవేశిస్తే సుమారు 20 ఏళ్ల పాటు అలాగే తిష్టవేసే ప్రమాదం ఉంద ని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రకాల క్రిమిసంహారకాల అవశేషాలు దేహం లోని కొవ్వు కణాల్లో నిల్వ ఉంటాయని.. పలు రకాల అనారోగ్య సమస్యలకు కారణ మవుతాయంటున్నారు. కూరగాయలను ఉప్పు నీళ్లతో కడిగిన తరవాత.. బాగా ఉడికించి తినాలని వైద్యులు సూచిస్తున్నారు. మధుమేహానికి కారకాలు.. తెలుగు రాష్ట్రాల్లో శరీర బరువు తక్కువగా ఉన్న వారు.. రక్తంలో కొవ్వు మోతాదు తక్కువ ఉన్న వారు సైతం మధు మేహ వ్యాధి బారిన పడేందుకు ఆర్గానో క్లోరిన్ తదితర క్రిమి సంహారక ఆనవాళ్లు ఆహార పదార్థాల్లో చేర డమే ప్రధాన కారణ మని ఈ నివేదిక హెచ్చరిం చింది. మరోవైపు ఆర్గానో క్లోరిన్ క్రిమిసం హారకాల తయారీ దేశంలో అధి కంగా జరుగుతోందని.. ఇక లిండేన్ వంటి నిషే ధిత క్రిమిసంహారకాన్ని సైతం దేశంలో పలు ప్రాం తాల్లో విరివిగా విని యోగిస్తుండటంతో పలు అనర్థాలు తలెత్తు తున్నా యని ఈ నివేదిక స్పష్టం చేసింది. తలసరి క్రిమిసం హారకాల వినియోగం లోనూ రెండు తెలుగు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉండటం గమనార్హం. తల్లిపాలలోనూ క్రిమి సంహారకాల ఆనవాళ్లు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. -
జాగ్రత్త తీసుకుని ఉంటే బతికేవాడే
ఏ మట్టిని నమ్ముకుని బతికాడో ఆ మట్టిలోనే కలిసిపోయాడు. ఏ పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నాడో ఆ పంట మధ్యనే ఊపిరి వదిలేశాడు. పంటను కాపాడుకోవాలనే ఆత్రుత లో తన ప్రాణానికి ఏమవుతుందో ఆలోచించడం మానేశాడు. ఫలితంగా అయిన వారికి కన్నీళ్లు మిగిల్చి కన్నుమూశాడు. పురుగు మందు కొట్టేటప్పుడు కనీస జాగ్రత్తలు పాటించాలని తెలుసుకోలేని ఓ రైతు ఆ అజాగ్రత్త వల్ల ఏకంగా ప్రాణాలే కోల్పోయాడు. ఓ చిన్న వస్త్రం ముఖానికి కట్టుకుని ఉంటే కుటుంబంతో చక్కగా నవ్వుతూ ఉండేవారు. సాగులో ఆధునిక పద్ధతులు పంటకే కాదు రైతుల ప్రాణాలకూ రక్షణగా నిలుస్తాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. సాక్షి, వీరఘట్టం(శ్రీకాకుళం) : వీరఘట్టం మండలం సంత–నర్శిపురంలో పడాల గోవిందరావు(51) అనే కౌలు రైతు పత్తి పంటకు పురుగు మందు కొట్టి ఆ అవశేషాలు శ్వాసలో చేరి మంగళవారం చనిపోయారు. గోవిందరావు 4 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ఐదేళ్లుగా పత్తి పంటను పండిస్తున్నారు. మూడు రోజు లుగా కురుస్తున్న వర్షాలకు పత్తి పంటకు పురుగు ఆశించింది. ఆదిలోనే జాగ్రత్తలు తీసుకుంటే పంటను కాపాడుకోవచ్చునని భావించి మంగళవారం తెల్లవారుజామున పురుగుమందు స్ప్రే చేశారు. కానీ జాగ్రత్తలేవీ పాటించలేదు. గాలి వీచే దిశకు ఎదురుగా పురుగు మందు స్ప్రే చేయడంతో ఆ మందు అవశేషాలు అతని శ్వాసలో కలిసి పొలంలోనే కుప్పకూలిపోయాడు. చుట్టుపక్కల ఉన్న రైతులు ఆయనను గమనించి అతడిని ఇంటికి తీసుకువచ్చి సపర్యలు చేశారు. వైద్యుని వద్దకు తీసుకెళ్లేలోగానే ఆయన కన్ను మూశారు. సంత–నర్శిపురంలో విషాద ఛాయలు గోవిందరావుతో సన్నిహితంగా ఉండే చాలా మంది గ్రామస్తులు తెల్లవారి చూసిన వ్యక్తి గంటల వ్యవధిలోనే చనిపోయాడనే విషయం తెలియడంతో నివ్వెరపోయారు. ఆయన మృతితో సంత–సంతనర్శిపురంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడికి భార్య బానమ్మ, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న గోవిందరావు మృతి చెందడంతో వారు కంటికీ మింటికీ ఏకధారగా రోదిస్తున్నారు. -
డ్రోన్‌తో పురుగుమందు పిచికారీ
హైదరాబాద్ : డ్రోన్ ద్వారా పురుగుమందు పిచికారీ చేసే విధానాన్ని గురువారం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రదర్శించారు. సెన్స్‌కర్ సంస్థ సహకారంతో రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ పరిశోధనా సంస్థలో ప్రయోగాత్మకంగా ఈ డెమో ఏర్పాటు చేశారు. పది లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకును డ్రోన్‌కు అమర్చి రిమోట్ సహాయంతో జీపీఎస్, జీఐఎస్ పరిజ్ఞానం వినియోగించి స్ప్రే ఎలా చేయాలి? ఎంత మోతాదులో పురుగుమందు వాడాలి? తదితర అంశాలను పరిశీలించారు. ఈ ప్రదర్శనను వ్యవసాయ వర్సిటీ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఆర్ జగదీశ్వర్, వరి పరిశోధనా కేంద్రం హెడ్ డాక్టర్ ప్రదీప్, వరి విభాగం శాస్త్రవేత్తలు, ప్లాంట్ ప్రొటెక్షన్ విభాగంలోని శాస్త్రవేత్తలు, యూజీ, పీజీ, పీహెచ్డీ విద్యార్థులు, అధ్యాపకులు పరిశీలించారు. -
కన్నీళ్లతో కడుపు నింపుకుంటున్నాం..
కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనగేరి గ్రామానికి చెందిన రైతు మచ్చల ఈరన్న అప్పుల బాధ భరించలేక 2017 అక్టోబరు 18న పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతని భార్య శ్యామల, నలుగురు పిల్లల జీవితం వేదనా భరితంగా మారింది. ప్రభుత్వం నుంచి చంద్రన్న బీమా సహా ఎటువంటి ఆర్థిక సాయం అందలేదు. రైతుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో చెప్పడానికి కన్నీళ్లతో కడుపు నింపుకుంటున్న శ్యామల, నలుగురు పిల్లల వేదనా భరిత జీవితమే నిదర్శనం. వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘మా సొంతూరు జాలిమంచి. పదేళ్ల క్రితం ఈరన్నతో పెళ్లి అయింది. నా భర్త పేరు మీద 3 ఎకరాల భూమి ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో సకాలంలో వర్షాలు కురవడంతో పంటలు బాగా పండాయి. మా కాపురం ఎంతో సంతోషంగా కొనసాగింది. మాకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. మా అమ్మ, నాన్న, అత్త, మామ చనిపోయారు. నా భర్త సొంత భూమితోపాటు మరికొంత భూమి కౌలుకు తీసుకుని సేద్యం చేశారు. అతివృష్టి, అనావృష్టి కల్లోలం రేపడంతో పెట్టుబడి పెట్టడం తప్ప రాబడి లేకుండా పోయింది. రెండేళ్ల క్రితం ఉల్లి, పత్తి వేశాం. వానలు ఎక్కువై పంటలు పోయాయి. తెలిసిన వారి దగ్గర చేసిన అప్పు రూ. 3 లక్షలతో పాటు ఆదోని ఆంధ్రా బ్యాంకులో తీసుకున్న అప్పు రూ.1.5 లక్షలు కట్టలేక పోయాం. పోయినేడు వానలే లేవు. మా పొలంలో సాగు చేసిన పత్తి దిగుబడి విత్తనాల ఖర్చుకు కూడా రాలేదు. గర్భవతిని కావడంతో తొమ్మిదో నెలలో పుట్టినిల్లు జాలిమంచిలో మా చిన్నాన్న ఇంటికి పురిటికి వెళ్లాను. ఒంటరిగా ఉన్న నా భర్త ఇంట్లోనే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన చనిపోయిన వారంలో మగ పిల్లోడు పుట్టాడు. నెలలోపే దొడ్డనగేరికి వచ్చేశాను. విఆర్ఓ సురేష్ వివరాలు సేకరించుకు వెళ్లారు. ఏడాది దాటినా ఒక్క పైసా సాయం అందలేదు. ఈ ఏడు తీవ్ర కరువు వచ్చింది. మా పొలంలో పత్తి వేసినా దిగుబడి పెద్దగా రాలేదు. బోరు బావుల కింద కూడా పంటలు లేవు. ఉపాధి పనులు పెట్టలేదు. కూలి పనికి పిలిచే వారు కూలీలుగా మారారు. వారానికి రెండు రోజులు కూడా కూలి పనులు దొరకటం లేదు. డీలరు వేసే బియ్యంతో నెలలో సగం రోజులు ఒక పూట గడచిపోతోంది. మిగిలిన రోజుల్లో కూలి పనులు దొరికితే ఒక పూట కడుపు నింపుకుంటున్నాం. లేదంటే మంచి నీళ్లతోనే ఆకలిని సంపుకుంటున్నాం. ప్రభుత్వం ఏదో ఒక రోజు ఆదుకుంటుందన్న ఆశతోనే రోజులు వెళ్లదీస్తున్నా..’ – కె.బసవరాజు, సాక్షి, ఆదోని, కర్నూలు జిల్లా -
కంటి వెలుగు కార్యక్రమంలో అపశ్రుతి
పాల్వంచ : కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంటి పరీక్షల చేయించుకునేందుకు తన రెండేళ్ళ కూతురుని తీసుకుని తల్లి వెళ్లింది. అక్కడ ఓ కూల్ డ్రింక్ సీసాను చూసిన ఆ చిన్నారి, దానిని చేతిలోకి తీసుకుని అందులోని ద్రవాన్ని తాగింది. అందులో ఉన్నది కూల్‌డ్రింక్ కాదు... పురుగు మందు. ఆ తల్లి తెలిపిన వివరాలు.. శుక్రవారం పట్టణంలోని శేఖరం బంజరకు చెందిన బోడ వెంకటేష్ భార్య పద్మ. ప్రభుత్వ పాఠశాలలో కంటి పరీక్షలను చేయించుకునేందుకు రెండేళ్ల కూతురు సహస్త్రను తీసుకెళ్లింది. అక్కడ పెద్ద క్యూ ఉండటంతో నిరీక్షిస్తోంది. ఆమె ఒళ్లో నుంచి ఆ చిన్నారి కిందకు దిగి ఆడుకుంటోంది. పాఠశాల గదిలో ఓ మూలకు కూల్ డ్రింక్ సీసా కనిపించింది. దానిని తీసుకుని, అందులోని ద్రవాన్ని తాగింది. కొద్దిసేపటికే చిన్నారి నోటి నుంచి నురగలు రావడంతో తల్లి కంగారు పడింది. బాటిల్లోని డ్రింక్ తాగిందని ఓ పాప చెప్పింది. అది పురుగు మందుగా గుర్తించిన ఆ తల్లి, వెంటనే ప్రభుత్వ ఏరియా ఆసుపపత్రికి తన బిడ్డను తీసుకెళ్లింది. ఆ చిన్నారి కడుపు నుంచి మందును వైద్యులు కక్కించారు. ఆ మందును ఎండ్రోసల్పాన్గా గుర్తించారు. పాఠశాలలోకి పురుగుల మందు ఎలా వచ్చింది..? సీసాలో పెట్టి ఉంచినా ఎవరూ ఎందుకు పట్టించుకోలేదని తల్లిదండ్రులు వెంకటేష్, పద్మ ప్రశ్నిస్తున్నారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రవి విచారణ చేపట్టారు. -
కౌలు రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోదా?
30 ఏళ్లుగా కౌలు వ్యవసాయం చేస్తున్న రైతు ప్రైవేటు అప్పులు తెచ్చి పత్తి, మిర్చి సాగు చేసి అప్పుల్లో కూరుకొని ఆత్మహత్య పాలైన ఏడాదిన్నరకు కూడా ప్రభుత్వం బాధిత కుటుంబానికి ఎటువంటి సహాయమూ అందించలేదు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన కౌలు రైతు కొపూరి పున్నారావు (50) 2017 మే 13న ఇంట్లోనే పురుగులమందు తాగారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన సత్తెనపల్లిలోని ఆస్పత్రికి తరలించగా.. 17న చనిపోయారు. సెంటు భూమి లేకపోయినప్పటికీ పున్నారావు కుటుంబం 30 ఏళ్లుగా భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసి జీవనం సాగిస్తున్నారు. 2017లో ఎకరానికి రూ. 25 వేల కౌలు చొప్పున ఆరెకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నారు. రెండెకరాల్లో పత్తి, నాలుగెకరాల్లో మిరప పంటను సాగు చేశారు. పత్తికి తెగుళ్లు ఎక్కువగా సోకడంతో కనీసం పంట పెట్టుబడి కూడా తిరిగి రాలేదు. మిర్చి ధర క్వింటాలు రూ. 2,500కు పడిపోవటంతో రూ. 5 లక్షల అప్పు తీర్చేదారి లేక దిగులుతో ఆత్మహత్య చేసుకున్నారు. పున్నారావుకు భార్య పద్మావతి, కుమార్తెలు శిరీష, రాధ ఉన్నారు. ‘మాకు సెంటు కూడా భూమి లేకపోవడంతో బ్యాంకులు రుణం ఇవ్వలేదు. 17 సవర్ల బంగారం వేరే వారి పేరు మీద బ్యాంకులో కుదువ పెట్టాం. దానికి కూడా రుణమాఫీ వర్తించలేదు. ఇప్పుడు రెక్కల కష్టంపైనే ఆధార పడి జీవిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు..’ అని పద్మావతి ఆవేదన చెందుతున్నారు. – ఓ.వెంకట్రామిరెడ్డి, అమరావతి బ్యూరో, గుంటూరు -
మరో యువకుడితో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారని...
ఒంగోలు / పెద్దారవీడు: ఎదురెదురు ఇళ్లలో నివసించే యువతీయువకుడు రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారు. కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్న వీరిద్దరూ కొండప్రాంతంలో విగతజీవులుగా కనిపిం చారు. పెద్దారవీడు మండలంలో శనివారం సాయంత్రం ఈ ఘటన వెలుగు చూసింది. సేకరించిన వివరాల ప్రకారం.. యర్రగొండపాలెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన దూదేకుల హుస్సేన్‌పీరా (20) సమీపంలోని ఒక ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. వీరింటికి ఎదురుగా ఉండే డి.అరుణబీ (16) యర్రగొండపాలెం సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఇరుగుపొరుగు ఇళ్లలో ఉండటంతోపాటు బంధువులు కూడా అయిన వీరిద్దరూ కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. హుస్సేన్, అరుణబీ ఇద్దరూ కలిసి తిరుగుతున్నారని తెలిసిన తల్లిండ్రులు వారికి కొద్ది రోజుల కిందట కౌన్సెలింగ్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఇంటి నుంచి వెళ్లిన వీరిద్దరూ ఆ తర్వాత ఆచూకీ లేకుండా పోయారు. ఈ క్రమంలో శనివారం పెద్దారవీడు మండలంలోని దేవరాజుగట్టు సమీపంలోగల సూర్యనారాయణమూర్తి ఆలయం సమీపంలోకి స్థానిక ఉన్నత పాఠశాల విద్యార్థులు వనం–మనం కార్యక్రమంలో భాగంగా వెళ్లారు. కొండపైకి ఎక్కిన సమయంలో దుర్వాసన వెదజల్లడంతో పరిసరాలను పరిశీలించారు. అక్కడ కొండ చక్కల మధ్యన రెండు మృతదేహాలు ఒకదానిపై మరొకటి పడి ఉండటం చూసి ఆందోళన చెందారు. ఈ విషయాన్ని వెంటనే గ్రామాధికారులకు, గ్రామస్తులకు తెలియజేశారు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న వీఆర్ఓ ఎస్.లక్ష్మయ్య, మార్కాపురం పట్టణ ఎస్ఐ బి.రామకోటయ్యలు ఘటనా స్థలికి చేరుకున్నారు. ముఖాలను గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న మృతదేహాల సమీపంలో లభించిన కూల్‌డ్రింక్ సీసా, పురుగు మందు డబ్బాలను చూసి, ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. వీరి వద్దగల సెల్‌ఫోన్‌లోని నంబర్లకు కాల్చేసి మృతుల వివరాలు తెలుసుకున్న పోలీసులు, బంధువులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి వచ్చిన హుస్సేన్ పీరా తండ్రి దస్తగిరి కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్నారు. అరుణ్‌బీకి ఇటీవల ఆమె కుటుంబసభ్యులు మరో యువకుడితో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ క్రమంలోనే సన్నిహితంగా ఉంటున్న అరుణ్‌బీ, హుస్సేన్ పీరాలు ఇక్కడి కొండప్రాంతంలోని ఆలయం వద్దకు వచ్చి బలవన్మరణానికి పాల్పడి ఉంటారనే చర్చ జరుగుతోంది. ఆలయ సమీపంలోని కొండపై యువతీయువకుల మృతదేహాలు ఉన్నట్టు తెలియడంతో స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పురుగు మందులకు బలవుతున్న రైతులు
సాక్షి, న్యూఢిల్లీ : పంటలకు పురుగు మందులు కొట్టే క్రమంలో ఏటా దేశంలో ఎంతో మంది రైతులు బలైపోతున్నారు. 2017 సంవత్సరంలోనే మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రంలో 50 మంది రైతులు ఈ మందుల ప్రభావంతో మరణించారు. వారిలో ఎక్కువ మంది మనోక్రోటోఫస్ మందులను ఉపయోగించినవారే. వాటిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యంత ప్రమాదకారిగా గుర్తించిన ఫాస్ఫరస్ ఉంటుంది. ఈ మందును ఇప్పటికే ఎన్నో దేశాలు నిషేధించాయి. ప్రపంచంలో పలు దేశాలు నిషేధించిన పురుగు మందుల్లో ఇప్పటికీ భారత్‌లో రైతులు కనీసం 99 మందులను వాడుతున్నారు. పంటలకు పట్టిన చీడ పీడలను నాశనం చేసేందుకు భారత్‌లో రైతులు ఉపయోగిస్తున్న 260 మాలిక్యూల్ రకాల పురుగు మందుల్లో 99 మందులను పలు దేశాలు ఎప్పుడో నిషేధించాయి. వీటిని మన రైతులు ఇప్పటికీ వాడుతుండడమే కాకుండా లైసెన్స్‌లేని నకిలీ మందులను కూడా వాడుతున్నారు. ఈ కారణంగా రైతులు ఎక్కువగా మృత్యువాతకు గురవుతున్నారు. 1968 నాటి ఇన్సెక్టిసైడ్స్ యాక్ట్ కిందనే భారత ప్రభుత్వం పురుగు మందులను ఇప్పటికీ నియంత్రిస్తోంది. ఆధునిక కాలానికి అవసరమైన విధంగా చట్టాన్నిగానీ, విధానాలనుగానీ మార్చుకోలేదు. దేశంలో వ్యవసాయమేమో రాష్ట్రానికి సంబంధించిన అంశం. పురుగు మందులేమో కేంద్రానికి సంబంధించిన విషయం. అయినప్పటికీ ఇరు ప్రభుత్వాలు సమన్వయంతో రైతుల బలిని అరికట్టవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ‘ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్’ విధానం అన్నది ఒకటి ఉంది. దాని ప్రకారం ఎప్పటికప్పుడు రైతులను పురుగు మందుల విషయంలో, ఇతర వ్యవసాయ పద్ధతుల విషయంలో చైతన్యపరచాలి. అందుకోసం రైతులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలి. ఇందుకోసం వ్యవసాయ శాఖ, అధికారులు, సిబ్బంది ఉన్నప్పటికీ రైతులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న దాఖలాలు కనిపించవు. సిబ్బంది కొరత కారణమైని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కూడా చెబుతోంది. ఉద్యాగాలిస్తామంటూ అధికారంలోకి వచ్చినప్పుడు ఖాళీలను భర్తీ చేసుకోవచ్చుగదా! పెస్ట్ మేనేజ్మెంట్ విధానం ప్రకారం తప్పనిసరి అయినప్పుడు మాత్రమే పురుగు మందులను వాడాలి. పురుగులను నివారించేందుకు సాధ్యమైనంత వరకు సహజ పద్ధతులను పాటించాలి. వర్మీ కంపోజ్, వేప నూనెలు వాడడం, నున్నటి రబ్బరు గొట్టాల ద్వారా చేనుకు పట్టిన పురుగులు పడిపోయేలా చేయడం సహజమైన పద్ధతులు. సహజమైన పద్ధతులన్నీ విఫలమైన సందర్భాల్లో ప్రభుత్వం చూపించిన మోతాదుల్లోనే రసాయనిక మందులను వాడాలి. ప్రభుత్వం విధానం ప్రకారం ఎరువులు అమ్మే వ్యాపారులు కూడా వాటిని ఎలా వాడాలో రైతులకు విడమర్చి చెప్పాలి. కేవలం లాభాపేక్ష కలిగిన ఎరువుల వ్యాపారులు అలా చేయరు. వారి వద్ద శిక్షణ కలిగిన సిబ్బంది కూడా ఉండరు. ఎరువుల షాపుల్లో వ్యవసాయ బీఎస్సీ చదివిన వారిని ప్రమోటర్లుగా పెట్టుకోవాలని, వారు విధిగా రైతులకు సూచనలు ఇవ్వాలంటే గతేడాది కేంద్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని తెచ్చింది. ఎక్కడా ఆ చట్టం అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. లాభాపేక్షలేని ప్రభుత్వమే రైతుల సంరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలి. పటిష్ట చట్టాలను పట్టుకురావాలి.