
ఈ జీవితం వద్దనుకుని..
ఆర్‌ఎస్‌లోని దుర్గమ్మ వీధిలో నివాసముంటున్న వివాహిత పార్వతి (35) ఆదివారం రాత్రి ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని....
అన్ని జన్మల్లోకెల్లా మానవజన్మ ఎంతో గొప్పదంటారు. ఈ విషయాన్ని చాలా మంది మరచిపోతున్నారు. చిన్నచిన్న విషయాలకే తల్లడిల్లిపోతూ బలవంతంగా తనువు చాలిస్తున్నారు. అయిన వారిని అనాథలను చేసి వెళ్లిపోతున్నారు. తాజాగా జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం ఇద్దరు బలవన్మరణానికి పాల్పడగా, మరో ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేశారు. వారి నిర్ణయం వెనక కారణాలు ఏమైనా.. కష్టాలు వచ్చినోళ్లందరూ చస్తూ పోతుంటే బతకడానికి మనిషి అనే వాడు ఉండడు కదా?
గుత్తి : ఆర్‌ఎస్‌లోని దుర్గమ్మ వీధిలో నివాసముంటున్న వివాహిత పార్వతి (35) ఆదివారం రాత్రి ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పార్వతి భర్తకు దూరంగా నివసిస్తోంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో తరచూ కలహాలు చోటు చేసుకునేవి. భర్త దూరం కావడం, మతిస్థిమితం సరిగా లేకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ కలహాలతో యువకుడు..
వజ్రకరూరు: మండలంలోని పీసీ.పెద్దప్యాపిలి గ్రామానికి చెందిన ప్రకాష్ (18) అనే యువకుడు కుటుంబ కలహాలతో విషపుగుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ జనార్దన్ నాయుడు తెలిపారు. ఆదివారం ఉద యం ఇంట్లో విషపు గుళికలు మింగడంతో ప్రకాష్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబసభ్యులు వెంటనే గమనించి ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించడంతో బంధువులు అనంతపురం ఆసుపత్రికి తీసుకు వెళ్లినట్లు ఎస్‌ఐ తెలిపారు. అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు ఆయన తెలిపారు.
వివాహిత ఆత్మహత్యాయత్నం
సోమందేపల్లి: సోమందేపల్లి ఎస్సీ కాలనీకు చెందిన పుష్పలత(30) అనే వివాహిత కిరోసిన్ పోసుకుని ఆదివారం ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఎస్‌ఐ గౌస్ మహమ్మద్ తెలిపారు. వెంటనే ఆమెను హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.
రెక్కమానులో విద్యార్థి..
కదిరి టౌన్ : హాస్టల్‌కు వెళ్లి బుద్ధిగా చదువుకోవాలని తల్లిదండ్రులు మందలించినందుకు మనస్థాపంతో పురుగుల మందు సేవించి విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం రెక్కమానులో చోటు చేసుకుంది. వివరాలు.. నంబులపూలకుంట మండలం రెక్కమానుకు చెందిన రామకృష్ణ కుమారుడు హరి 9వ తరగతి చదువుతున్నాడు. ఇదివరకు స్వగ్రామంలోనే ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకునేవాడు. అయితే తన తండ్రి ఇదే మండలం పూలకుంటలో ఉన్న సంక్షేమ హాస్టల్‌లో హరిని చేర్పించాడు. దీంతో తనకు ఇష్టం లేకున్నా హాస్టల్‌లో చేర్పిస్తున్నారనే కారణంతో మనస్థాపం చెందిన హరి ఇంట్లోనే ఉన్న పురుగుల మందు తాగి అపస్మారకస్థితికి చేరుకున్నాడు. ఇది గమనించిన కుటుంబీకులు వెంటనే కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.