గాంధీ, పేట్ల బురుజులో ఐవీఎఫ్ కేంద్రాలు ప్రారంభం
వరంగల్‌లో ఏర్పాటుకు సర్కారు ఉత్తర్వులు
హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, పాలమూరు, నిజామాబాద్‌లో మరో ఐదు కేంద్రాలకు ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: సంతానం కోసం ప్రైవేటు సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగి లక్షలకు లక్షలు ఖర్చు చేసే స్థోమత లేనివారికి అండగా నిలువాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో రెండు సర్కారీ సంతాన సాఫల్య కేంద్రాలను నెలకొల్పిన ప్రభుత్వం.. మరిన్ని జిల్లాల్లో ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
హైదరాబాద్‌లోని గాందీ, పేట్ల బురుజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలిజేషన్) కేంద్రాలకు రాష్ట్రం నలుమూలల నుంచి పేదలు వస్తున్నారు. దీంతో మరిన్ని కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే వరంగల్‌లో కేంద్రం ఏర్పాటు పనులు సాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాల్లో మరో 5 ఐవీఎఫ్ సెంటర్లను ప్రారంభించాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
ప్రైవేటు రంగంలో 358 ఫెర్టిలిటీ సెంటర్లు
తాజా అధ్యయనాల ప్రకారం రాష్ట్రంలో 26 శాతం మంది సంతాన లేమి సమస్య ఎదుర్కొంటున్నారు. çరాష్ట్రంలో 358 ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి. చాలా సెంటర్లు సిట్టింగ్‌ల పేరుతో ఏళ్లకేళ్లు చికిత్సలు అందిస్తూ రూ.లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని 2017లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించి.. గాం«దీ, పేట్ల బురుజు, వరంగల్ ఎంజీఎంలో ఏర్పాటుకు జీవో 520 విడుదల చేసింది. కానీ వివిధ కారణాల వల్ల అవి ఏర్పాటు కాలేదు. 2023 ఫిబ్రవరిలో మరోసారి జీవో విడుదల చేసి, అదే ఏడాది అక్టోబర్‌లో గాం«దీలో ఐవీఎఫ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ, డాక్టర్లు, రీ ఏజెంట్స్, ఔషధాలు అందుబాటులో లేకపోవడంతో నామ్‌కే వాస్తేగా మిగిలింది.
అక్టోబర్‌లో గాం«దీ, పేట్ల బురుజులో ప్రారంభం
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో గాంధీ ఆసుపత్రిలోని ఐవీఎఫ్ సెంటర్‌లో ఎంబ్రయాలజిస్ట్, గైనకాలజిస్ట్, ఇతర డాక్టర్లను నియమించింది. ఏఆర్టీ యాక్ట్ ప్రకారం అనుమతులు తీసుకొని అక్టోబర్ 15న ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. అవసరమైన అన్ని రీ ఏజెంట్స్, ఔషధాలు పంపిణీ చేశారు. పేట్లబురుజు ఆసుపత్రిలోనూ ఎంబ్రయాలజిస్ట్‌ను నియమించి, ఈ నెల 9న ఐవీఎఫ్ సేవలు ప్రారంభించారు.
గాం«దీలోని ఐవీఎఫ్ సెంటర్‌లో ఔట్‌పేషెంట్ (ఓపీ) కింద ఈ నెల 20 వరకు 271 మంది సంతానం కోసం రాగా, ఫాలిక్యులర్ స్టడీ కింద 66 మంది, ఐయూఐ కింద 26 మందికి పరీక్షలు నిర్వహించారు. ఐవీఎఫ్‌కు ఆరుగురు ఎంపికయ్యారు. పేట్ల బురుజులో 82 మంది ఓపీలో, ఫాలిక్యులర్ స్టడీకి 16 మంది, ఐయూఐకి 10 మందికి పరీక్షలు నిర్వహించారు. నలుగురిని ఐవీఎఫ్‌కు ఎంపిక చేశారు. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో మరిన్ని ఐవీఎఫ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి రాజనర్సింహ ఇటీవలే శాసనమండలిలో ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment