వృద్ధురాలిని రోడ్డు పక్కన దింపిన వైద్య సిబ్బంది
ఆస్పత్రి నుంచి బయటకు వచ్చేసిన ఆమె భర్త
జగిత్యాల సర్కారు దవాఖానా వద్ద ఘటన
జగిత్యాల: అనారోగ్యం బారిన పడ్డ భర్తను సర్కారు దవాఖానాలో చేర్పించిన భార్య ఆయన బాగోగులు చూసుకుంటోంది. ఓ చేయికి గాయం అయినా భర్త ఆస్పత్రిలో ఉండటంతో ఆయనకు సపర్యలు చేసేందుకు వెంట వచ్చింది. వారం రోజులుగా దవాఖానాలోనే ఉన్న ఆమె హైబీపీతో తన భర్తకు ఇచ్చిన బెడ్‌పై పడిపోయింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఆమెను బయట రోడ్డు పక్కన దింపడంతో భర్త కూడా బయటకు వచ్చేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం రాఘవపట్నంకు చెందిన రాజనర్సు అనారోగ్యానికి గురవడంతో వారం రోజుల క్రితం జగిత్యాలలోని పెద్దాస్పత్రికి తీసుకొచ్చి చికిత్స చేయిస్తోంది అతని భార్య మల్లవ్వ. అయితే, ఆమె చేతికి గాయమైనప్పటికీ భర్త ఆరోగ్యం బాగుపడాలని పరితపించి, సపర్యలు చేస్తోంది. ఈ క్రమంలో రెండు రోజులుగా హైబీపీతో బాధ పడుతున్న మల్లవ్వ సొమ్మసిల్లి పడిపోతోంది. తన భర్తకు ఆస్పత్రిలో కేటాయించిన బెడ్‌పై ఉన్న మల్లవ్వను శుక్రవారం గమనించిన వైద్య సిబ్బంది వీల్‌చైర్‌పై బయటకు తీసుకెళ్లి, రోడ్డు పక్కన దింపి వెళ్లిపోయారు.
అనారోగ్యానికి గురైన తన భార్యను దవాఖానా సిబ్బంది బయటకు తీసుకెళ్తుండటాన్ని గమనించిన రాజనర్సు తనకు వైద్యం వద్దని బయటకు వచ్చి, రోడ్డు పక్కన పడుకొని ఉన్న భార్య వద్దకు చేరుకున్నాడు. ఈ దంపతులను గమనించిన స్థానికులు జగిత్యాల టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని, బాధితులను ఆస్పత్రిలో చేర్పించారు. ఆర్‌ఎంవో నవీన్‌ను వివరణ కోరగా ఇలాంటి సంఘటన జరగలేదని, ఏదైనా ఉంటే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
గతంలోనూ ఇలాంటి ఘటనలు..
జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణమన్న ఆరోపణలున్నాయి. గతంలో కూడా ఓ వృద్ధుడిని పాత్ బస్స్టేషన్‌లో దింపి పోగా.. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తిరి గి ఆస్పత్రికి తరలించారు. అలాగే, ఓ గర్భిణి కడుపులో వస్త్రాలు మరిచిపోయిన ఘటన వెలుగులోకి రావడం అప్పట్లో సంచలనంగా మారింది. తాజా గా భర్తకు అటెండెంట్‌గా ఉన్న మల్లవ్వ విషయంలోనూ ఆస్పత్రి సిబ్బంది కఠినంగా వ్యవహరించిన తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
చర్యలు తీసుకున్నా మారని తీరు..
జగిత్యాల ఆస్పత్రి యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల సూపరింటెండెంట్‌ను సరెండర్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ, జిల్లా ఆస్పత్రి యంత్రాంగం వైఖరిలో మార్పు రాకపోవడం విస్మయం కల్గిస్తోంది. వృద్ధ దంపతుల విషయంలో కఠిన వైఖరిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికై నా దవాఖానా సిబ్బందిని క్రమశిక్షణలో పెట్టాలంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment