Karimnagar District News
-
నేడు పేరెంట్స్.. టీచర్స్ సమావేశం
కరీంనగర్: పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. పాఠశాలల్లో విద్య, పిల్లల చదువులు, సంస్థాగత విషయాలపై ఇక నుంచి ప్రతీనెల మూడో శనివారం పాఠశాలల్లో తల్లిదండ్రులతో టీచర్లు సమావేశం(పీటీఎం) నిర్వహించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో ఒక నగరపాలక సంస్థ, నాలుగు మున్సిపాలిటీలు, 16 మండలాలు, 313 గ్రామాలున్నాయి. 652 పాఠశాలలు, 12 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, 11 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. ఆయా విద్యాసంస్థల్లో సుమారు 65 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రతీ పాఠశాలకు పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) చైర్మన్, సభ్యులుంటారు. వీరి ఆధ్వర్యంలో ప్రతినెలా తరగతుల వారీగా తల్లిదండ్రులతో టీచర్ల సమావేశాలు నిర్వహించాలి. మూడో శనివారం సెలవు దినం అయితే నాలుగో శనివారం నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. చర్చించాల్సిన అంశాలివే.. విద్యార్థుల చదువులో పురోగతి, హాజరు, సమస్యలపై చర్చించాలి. పాఠశాలల్లో విద్యాప్రమాణాలు, మధ్యాహ్న భోజనం మెరుగుపరచడం, వసతులపై నివేదిక తయారు చేయాలి. విద్యార్థులకు అందించాల్సిన సాయం, హోంవర్క్ పూర్తి చేయడం, పిల్లల ప్రవర్తన, ఆసక్తులపై సమీక్షించవచ్చని విద్యాశాఖ తెలిపింది. ఫలితంగా విద్యానాణ్యత మెరుగుపడి , అభ్యాసన ఫలితాల సాధనకు దోహదం చేస్తోంది. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో తల్లి దండ్రులు సైతం ప్రధాన పాత్ర పోషించవచ్చు. -
పెండింగ్ డీఏ చెల్లించాలి
కరీంనగర్: పెండింగ్ డీఏ విడుదల చేసి పీఆర్సీ అమలు చేయాలని డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.రాజిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అవాల నరహరి అధ్యక్షతన సమావేశం జరిగింది. రాజిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని కోరారు. ఆడిట్ కమిటీ కన్వీనర్ ఈశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ గురుకుల పాఠశాలల విద్యార్థులకు అందించే మెనూ మండల పరిషత్, జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టా లని, స్నాక్స్ అందజేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు ఆవాల నరహరి మాట్లాడుతూ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి తూముల తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షుడు కానుగంటి రాజమౌళి పాల్గొన్నారు. డయల్ యువర్ ఆర్ఎంకు స్పందన విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ డయల్ యువర్ రీజినల్ మేనేజర్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 14 మంది ప్రయాణికులు పలు సమస్యలపై ఫిర్యాదు చేశారు. వాటిని నోట్ చేసుకున్న ఆర్ఎం బి.రాజు పరిష్కారాని కి డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారు. క్వింటాల్ పత్తి రూ.7,100 జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్లో క్వింటాల్ పత్తి ధర గరిష్టంగా రూ.7,100 పలికింది. శుక్రవారం మార్కెట్‌కు 15వాహనాల్లో 136 క్వింటాళ్ల పత్తిని రైతులు అ మ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.7,000, కనిష్ట ధర రూ.6,600కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. శని, ఆదివారాలు యార్డుకు సెలవు ఉంటుందని, సోమవారం యథావిధిగా కొనుగోళ్లు సాగుతాయని కార్యదర్శులు మల్లేశం, రాజా వివరించారు. ఎట్‌హోమ్‌లో సుడా చైర్మన్ కరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన ఎట్‌హోమ్‌లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది సందర్భంగా సికింద్రాబాద్‌లో బస చేయడం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన ఎట్‌హోమ్ కార్యక్రమానికి నరేందర్‌రెడ్డి హాజరయ్యారు. పారదర్శకంగా పార్క్ టెండర్ కరీంనగర్ అర్బన్: ఉజ్వల పార్క్ టెండర్ ప్రక్రియ పారదర్శఽకంగా నిర్వహించామని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లీజు వ్యవధి పూర్తవగా లీజు కోసం సెప్టెంబర్ 21 నుంచి 27వరకు సీల్డ్ టెండర్‌ను పిలిచామన్నారు. రెండేళ్ల లీజు కాలానికి పార్క్ నిర్వహణ, కార్యకలపాలకు సమర్థులైన కంపెనీలను పిలవగా ఆరు కంపెనీలు టెండర్లో పాల్గొన్నాయని వెల్లడించారు. అక్టోబర్ 1న టెండర్లు తెరవగా అత్యధిక బిడ్ శ్రీ లక్ష్మి నర్సింహ గ్రానైట్స్, కరీంనగర్ రూ.26,01,000కు వేయగా నెలకు రూ.2,16,750 కు కోట్ చేశారని వివరించారు. గతంలో టూరిజం కార్పొరేషన్ నెలకు రూ.50వేలు లీజు కింద ఇచ్చేదని పేర్కొన్నారు. టెండర్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, న్యాయబద్ధంగా జరిగిందని తెలిపారు. -
కేటీఆర్‌పై అక్రమ కేసు సిగ్గుచేటు
● బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్కరీంనగర్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అసెంబ్లీలో ఎదుర్కొనే సత్తా లేక దొడ్డిదారిన అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపాలని కుట్రలకు పాల్పడటం కాంగ్రెస్ పార్టీ నీచ సంస్కృతికి నిదర్శనమని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ విమర్శించారు. నగరంలోని మీసేవ కార్యాలయంలో శుక్రవారం మాట్లాడుతూ.. ఏడాదిగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీలను అమలు చేయకుండా కొత్తకొత్త అంశాలతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందన్నారు. బీఆర్ఎస్ పార్టీని అబాసుపాలు చేయడానికే తహతహలాడుతోందని ఆరోపించారు. మచ్చలేని నాయకుడిగా నాలుగుసార్లు గెలుపొందిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై పొన్నం ప్రభాకర్ అవాకులు, చెవాకులు పేలడం తగదని అన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాలుగుసార్లు ఓడిపోయింది నిజం కాదా అని ప్రశ్నించారు. గంగుల కమలాకర్‌ను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. -
కలెక్టర్ నివేదిక ప్రకారమే
వ్యవసాయం తగ్గి, పరిశ్రమలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, కలెక్టర్ నివేదిక ప్రకారమే గ్రామాలను విలీనం చేయాలని ప్రతిపాదించాం. ఆనాటి ప్రభుత్వం ఆరెపల్లి, వల్లంపహాడ్, సదాశివపల్లిలను కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేసి, పక్కనే ఉన్న బొమ్మకల్ను కలపలేదు. ఆనాడు అక్కడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, కలెక్టర్ నివేదిక ఇచ్చారు. అదే తరహాలో ప్రస్తుతం కలెక్టర్ నివేదిక ప్రకారమే కొత్తపల్లి మున్సిపాలిటీని విలీనం చేస్తున్నాం. – అసెంబ్లీలో దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఐటీ, శాసనసభ వ్యవహారాల మంత్రి ల్యాండ్ గ్రాబర్స్ను రక్షించడానికే కరీంనగర్‌కు దూరంగా ఉండే మానకొండూర్ నియోజకవర్గంలోని సదాశివపల్లిని ఆనాటి ప్రభుత్వం కలిపింది. అలాగే, అల్గునూర్ దూరంగా ఉన్నప్పటికీ విలీనం చేశారు. దీనిపై హైకోర్టులో కేసు వేశాం. ల్యాండ్ గ్రాబర్స్ను సీపీ జైలుకు పంపారు. వారందరినీ రక్షించడానికే కొత్తపల్లి మున్సిపాలిటీ విలీనాన్ని అడ్డుకుంటున్నారు. – అసెంబ్లీలో కవ్వంపల్లి సత్యనారాయణ, మానకొండూర్ ఎమ్మెల్యే -
నిరసన
కరీంనగర్: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అంబేడ్కర్‌ను అవమానించడాన్ని నిరసిస్తూ తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం, ప్రజా సంఘాల జేఏసీ అధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. తెలంగాణ అంబేడ్కర్ యవజన సంఘం జిల్లా అధ్యక్షుడు సముద్రాల అజయ్ మాట్లాడుతూ అంబేడ్కర్‌ను అవమానించే విధంగా మాట్లాడిన అమిత్‌షాను వెంటనే కేంద్రమంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నాయకులు గజ్జెల ఆనంద్‌రావు, సుద్దాల లక్ష్మణ్, శంకర్, ప్రభాకర్, సంపత్, స్వరూప, అనిల్, మనోహర్, భారతి, మహేందర్, చంద్రశేఖర్, లక్ష్మణ్, రవీందర్, నర్సయ్య పాల్గొన్నారు. -
విలీన పంచాయితీ
కొంగ జపంశనివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్ శ్రీ 2024సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థలో శివారు గ్రామాల విలీన ప్రక్రియ దాదాపుగా పూర్తయినట్లే కనిపిస్తోంది. అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఈ అంశంపై వాడీవేడి చర్చ దీనికి సంకేతమని తెలుస్తోంది. గ్రేటర్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటులో భాగంగా కరీంనగర్ నగరపాలక సంస్థలో కొత్తపల్లి మున్సిపాలిటీతోపాటు కొత్తపల్లి మండలంలోని మల్కాపూర్, లక్ష్మీపూర్, చింతకుంట, కరీంనగర్ రూరల్ మండలంలోని బొమ్మకల్, గోపాల్పూర్, దుర్శేడ్ గ్రామాలను విలీనం చేయాలని ప్రభుత్వానికి కలెక్టర్ నివేదిక పంపారు. ఈ మేరకు శివారు గ్రామాలను కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేస్తున్నట్లు అసెంబ్లీలో మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు. గతంలో కలిపిన గ్రామాల్లో పన్నుల భారం మినహా నేటికీ తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ తదితర కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. అందుకే, విలీనంపై ప్రజాభిపాయ సేకరణ చేపట్టిన తర్వాతే నిర్ణయం తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో విలీనంపై తమకు ఇంకా అధికారిక ఆదేశాలు రాలేదని డిప్యూటీ కమిషనర్ స్వరూపారాణి ‘సాక్షి’కి తెలిపారు. వ్యవసాయమే ఆధారం.. కరీంనగర్ నగరపాలక సంస్థలో గ్రామాల విలీనంతో ప్రజలపై పన్నుల భారం పడనుంది. అంతేకాకుండా, గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు దూరమై, ఉపాధి కోల్పోతామని కూలీలు అంటున్నారు. కొత్తపల్లి పట్టణంతోపాటు చింతకుంట, మ ల్కాపూర్, లక్ష్మీపూర్, బొమ్మకల్, దుర్శేడ్, గోపాల్పూర్లు వ్యవసాయాధారిత గ్రామాలు. విలీనమైతే పట్టణీకరణ జరిగి, పంటల సాగుకు దూరమవుతా మని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలు గ్రామాల ప్రజలు విలీనం వద్దంటూ నిరసనలు తెలిపారు. అయినప్పటికీ, ప్రభుత్వం విలీనం వైపే మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో ప్రజాభిప్రాయం లేకుండానే.. విలీనం విషయంలో గత ప్రభుత్వం వ్యవసాయాధారిత గ్రామాలైన వల్లంపహాడ్, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి, సదాశివపల్లి, అల్గునూర్ గ్రామాలను విలీనం చేసింది. అప్పుడు వచ్చిన అభ్యంతరాలను పట్టించుకోకుండా ముందుకెళ్లింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే చేస్తున్నట్లు కనిపిస్తోందని ప్రజలు అంటున్నారు. ప్రజాభిపాయ సేకరణ చేపట్టాకే నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు. అభివృద్ధికి ఆమడ దూరం..న్యూస్‌రీల్ గ్రేటర్ కరీంనగర్‌కు రంగం సిద్ధం! కొత్తపల్లి మున్సిపాలిటీ సహా ఆరు గ్రామాల విలీనానికి నివేదిక గతంలో కలిపిన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కరువు పన్నుల భారం, ఉపాధి కోల్పోతామని ప్రజల ఆవేదన2018, ఏప్రిల్ 12న కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనం చేసిన గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా మేయర్ సునీల్‌రావు ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. పద్మనగర్, రేకుర్తి, సీతారాంపూర్, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్, సదాశివపల్లి, అల్గునూర్ గ్రామాల్లో మౌలిక వసతులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. విలీనాన్ని కొందరు స్వాగతిస్తుండగా, మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేపడితే తమ డిమాండ్లు, సమస్యలు చెప్పుకునేవారమని ఆయా గ్రామాలవారు అంటున్నారు. -
పనులకే ప్రాధాన్యం
● నేడు బల్దియా సమావేశం ● 38 అంశాలతో ఎజెండా ● దుకాణ సముదాయాల కేటాయింపు కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ ప్రస్తుత పాలకవర్గ పదవీకాలం మరికొద్ది రోజుల్లో ముగియనున్నందున, అభివృద్ధి పనులకు ప్రాధాన్యం పెరిగింది. తమ పదవీకాలం ముగిసేలోగా పనులు ప్రారంభించాలనే లక్ష్యంతో కార్పొరేటర్లు దృష్టి సారించారు. ఈ క్రమంలో శనివారం జరుగుతున్న నగరపాలకసంస్థ సర్వసభ్య సమావేశంలోనూ అభివృద్ధి పనుల కేటాయింపునకే ఎక్కువ డిమాండ్ ఉండనుంది. మేయర్ యాదగిరి సునీల్‌రావు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జరగనున్న సమావేశంలో 38 అంశాలతో ఎజెండాను రూపొందించారు. ఆదాయం పెంపుపై నజర్ అప్పులతో తిప్పలు పడుతున్న నగరపాలకసంస్థ ఆదాయాన్ని కాస్త పెంచుకునేందుకు చర్యలు చేపట్టింది. సర్వసభ్య సమావేశంలో 38 అంశాలతో ఎజెండాను రూపొందించారు. ఇందులో దుకాణ సముదాయాల వేలం, పార్క్‌ల లీజు, కళాభారతి అద్దెకు ఇవ్వడం తదితర అంశాలున్నాయి. పెండింగ్‌లో ఉన్న దుకాణ సముదాయాల కేటాయింపునకు ఈ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. స్మార్ట్‌సిటీలో భాగంగా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వెనుకాల 126 దుకాణాలతో సముదాయాన్ని నిర్మించారు. వీటిలో ఎస్సీలకు 19, ఎస్టీలకు 8, దివ్యాంగులకు 4, నాయిబ్రాహ్మణులు, వాషర్మెన్ సొసైటీకి 6, స్వయం సహాయక సంఘాలకు 13 కేటాయించారు. గతంలోనే ఈ దుకాణాల కేటాయింపు ప్రక్రియ మొదలు పెట్టినప్పటికి, కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయింది. కోర్టు ఆదేశాల మేరకు 39 మంది, మెప్మా పరిశీలనతో 13 మందితో మరో జాబితాను రూపొందించారు. 39 జాబితాలో ఇద్దరు వీధివ్యాపారులకు సంబంధించి వారి కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్నట్లు గుర్తించారు. శాతవాహన యూనివర్సిటీ వద్ద నిర్మించిన 25 షాప్‌లను కూడా లాటరీ ద్వారా కేటాయించేందుకు నిర్ణయించారు. ఆధునిక హంగులతో నిర్మిస్తున్న మల్టీపర్పస్ పార్క్ నిర్వహణకు ఏడాదికి రూ.20 లక్షల చొప్పున, జ్యోతిబాపూలే పార్క్ నిర్వహణకు రూ.10 లక్షల చొప్పున లీజుకు ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇటీవల ఆధునీకరించిన కళాభారతిని అద్దెకు ఇవ్వడం ద్వారా నగరపాలకసంస్థకు ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టారు. సాధారణ వ్యక్తులకు రూ.10 వేలు, కళాకారులకు అయితే రూ.5 వేలు అద్దె నిర్ణయించారు. అభివృద్ధి పనులు కావాలి తమ పదవీకాలానికి కౌంట్‌డౌన్ మొదలవడంతో ఆ లోగా తమ డివిజన్లో మిగిలిపోయిన పనులు పూర్తి చేసేందుకు కార్పొరేటర్లు హడావుడి పడుతున్నారు. సీఎం హామీ పథకం కింద చేపట్టిన పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడం, మరే ప్రత్యేక నిధులు రాకపోవడంతో డివిజన్లలో పనులు జరగడం లేదు. దీనితో బిల్లుల సకాలంలో రానప్పటికి రూ.23 కోట్ల సాధారణ నిధులతోనే టెండర్ పిలిచారు. నిధులేవైనా మరిన్ని పనులకు టెండర్ పిలిచేందుకు కార్పొరేటర్లు ఒత్తిడి పెంచుతున్నారు. కోతులు.. కుక్కలు నగరంలో కోతులు, కుక్కల బెడద తీవ్రంగా ఉంది. ప్రతి సమావేశంలో చర్చిస్తున్నా, సమస్యకు మాత్రం పరిష్కారం దొరకడం లేదు. నగరవ్యాప్తంగా కుక్కలు విపరీతంగా పెరిగిపోవడంతో, కాలనీల్లో గుంపులుగా సంచరిస్తూ ప్రజలను హడలెత్తిస్తున్నాయి. అలాగే కోతులు ఇండ్లల్లోకి దూరి సామగ్రిని ఎత్తుకెళుతున్నాయి. కుక్కలు, కోతులతో ప్రజల భయభ్రాంతులకు గురవుతున్నారు. పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. -
వెన్కెపల్లి యువకుడి అదృశ్యం
● సైబర్ నేరగాళ్లను నమ్మి, రూ.8.50 లక్షలు ట్రాన్స్ఫర్ చేసినట్లు సమాచారం సైదాపూర్: సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మిన ఓ యువకుడు వారు చెప్పిన ఖాతాకు రూ.8.50 లక్షలు పంపించినట్లు సమాచారం. తర్వాత అతను అదృశ్యమయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సైదాపూర్ మండలంలోని వెన్కెపల్లికి చెందిన కామారపు శ్రీకాంత్ స్థానిక విశాల సహకార సంఘంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఇతను సైబర్ నేరగాళ్ల మాయలో చిక్కుకున్నాడు. రూ.5 లక్షలు చెల్లిస్తే, మూడు నెలలకే ఆ డబ్బుకు రూ.30 వేలు కలిపి ఇస్తామని, రూ.15 లక్షలు చెల్లిస్తే రూ.40 లక్షలు ఇస్తామని ఆశ చూపారు. నిరుపేద కుటుంబం కావడంతో తమ పేదరికం పోతుందని శ్రీకాంత్ భావించాడు. బంధువులు, స్నేహితులు, తనకు తెలిసినవారి వద్ద రూ.లక్షల్లో అప్పులు చేసినట్లు సమాచారం. ఈ నెల 17న సైదాపూర్ కేడీసీసీ బ్యాంకు నుంచి తన అకౌంట్ నంబర్ 202722010060000 ద్వారా ఎస్బీఐ గోరక్‌పూర్ బ్రాంచి, జ్యోతిదేవి అకౌంట్ నంబర్ 38080484767కు రూ.8.50 లక్షలు ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలిసింది. గురువారం ఉదయం 11 గంటలకు బైక్‌పై వెళ్లిన శ్రీకాంత్ తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అతని తల్లి బుచ్చవ్వ శుక్రవారం ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
ఇంటి పెద్దను ఇంటికి రప్పించండి
జగిత్యాలక్రైం: కుటుంబ బాధ్యతలకు భయపడి, ముగ్గురు ఆడ పిల్లల పెళ్లిళ్లు చేయలేననే మానసిక ఒత్తిడితో స్వదేశానికి రాకుండా పదేళ్లుగా సౌదీలో తలదాచుకుంటున్న ఓ గల్ఫ్ కార్మికుడిని స్వదేశానికి రప్పించాలని శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రవాసి ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. వివరాలు.. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన గూడూరి భూమేశ్వర్ ఏప్రిల్ 2014లో సౌదీ వెళ్లాడు. అప్పటి నుంచి ఫోన్ చేయకపోవడం లేదని, అసలు బతికి ఉన్నాడో లేదో తెలియని పరిస్థితిలో తానూ, తన ముగ్గురు కూతుళ్లు తీవ్ర మానసిక క్షోభ అనుభవించామని భార్య లత ఆవేదన వ్యక్తం చేశారు. సౌదీలో ఉన్న తమ గ్రామస్తులు, తెలిసినవారు ఇటీవల అతన్ని ముహాయిల్ అభా ప్రాంతంలో వెతికి జాడ తెలుసుకున్నారని, ఇండియాకు రావడానికి విముఖత చూపుతున్నాడని వాపోయింది. తన ముగ్గురు కూతుళ్లు మౌనిక, మానస, సహస్ర తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సీఎం రేవంత్‌రెడ్డి, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవ తీసుకుని తన భర్తను సౌదీ నుంచి ఇండియాకు రప్పించాలని, తమ పిల్లల చదువుకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఆమె వెంట ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు మంద భీంరెడ్డి, టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ అడ్వయిజర్ బొజ్జ అమరేందర్‌రెడ్డి, తిప్పర్తి పుల్లయ్య చారి ఉన్నారు. -
కాలువ శిథిలం.. పారకం ప్రశ్నార్థకం
పెద్దపల్లి జిల్లాలో యాసంగి సాగు ప్రారంభమైంది. ఇప్పటికే మొక్కజొన్న ఏపుగా పెరుగుతోంది. కొందరు రైతులు వరి నారుపోశారు. నాట్లు వేసేందుకు మరికొందరు పొలాలు సిద్ధం చేస్తున్నారు. ఈ పంటలకు సాగునీరు అందించాల్సిన ఎస్సారెస్పీ కాలువలు ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు, చెట్లు, పూడికతో దర్శనమిస్తున్నాయి. చాలాచోట్ల ధ్వంసమై సాగునీటి పారకానికి అవరోధంగా మారాయి. సుల్తానాబాద్ పరిధిలోని దృశ్యాలివి. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లిసుద్దాలలో ధ్వంసమైన డీ–86 మెయిన్ కెనాల్ తూము -
ఆడుకుంటూ వెళ్లి.. తప్పిపోయిన పాప
వేములవాడ: ఆడుకుంటూ రోడ్డుపైకి వచ్చి, తప్పిపోయిన ఓ పాపను కుటుంబసభ్యులకు అప్పగించినట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. కొడిమ్యాలకు చెందిన రమేశ్–రమ్య దంపతులు వేములవాడలోని తమ బంధువుల ఇంట్లో పెళ్లి ఉంటే ఈ నెల 19న పాపను తీసుకొని, వెళ్లారు. రాత్రి బంధువుల ఇంట్లోనే ఉన్నారు. శుక్రవారం వేకువజామున వివాహానికి హాజరయ్యేందుకు ఫంక్షన్‌హాల్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో పాప ఆడుకుంటూ రోడ్డుపైకి వచ్చింది. అలాగే చాలా దూరం వెళ్లింది. కాసేపటికి చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికారు. ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ప్రభు అనే యువకుడు తప్పిపోయి, ఏడ్చుకుంటూ వెళ్తున్న పాపను ఎత్తుకొని, స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. పోలీసులు ఆ చిన్నారి తల్లిదండ్రులను పిలిపించి, అప్పగించారు. పాపను జాగ్రత్తగా ఠాణాకు తీసుకొచ్చిన ప్రభును సీఐ వీరప్రసాద్ అభినందించారు. రమేశ్–రమ్య దంపతులు అతనితోపాటు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు -
భూకబ్జా కేసులో బీఆర్ఎస్ నాయకుల రిమాండ్
సిరిసిల్ల క్రైం: ప్రభుత్వ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్న బీఆర్ఎస్ నాయకులను సిరి సిల్ల పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలి ంచారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అగ్గి రా ములు, తంగళ్లపల్లి స్టేషన్ పరిధిలో జిందం దేవదాసుపై కేసు నమోదైంది. అధికారులను మచ్చిక చేసుకొని, అసైన్డ్ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వారిపై అభియోగాలున్నాయి. భూమి అనుభవదారుగా మార్చిన అప్పటి అధికారులపై కేసు నమోదు చేశామని, వారు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పింఛన్ ఇప్పిస్తానని నగలు కాజేశాడు.. కోరుట్ల: ఓ వృద్ధురాలికి పింఛన్ ఇప్పిస్తానని నమ్మించిన దుండగుడు ఆమె నగలు కాజేశాడు. బాధితురాలి వివరాల ప్రకారం.. కథలా పూర్ మండలం దుంపెటకు చెందిన దొప్పల చిన్న గంగు శుక్రవారం పని నిమిత్తం కోరుట్లకు వచ్చింది. స్థానిక నంది చౌరస్తా వద్ద ఉండగా ఆమె వద్దకు ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి, నీకు పింఛన్ ఇప్పిస్తామని చెప్పాడు. మెడలో నగలు తీస్తే ఫొటో తీసుకుంటానన్నాడు. అతని మాటలు నమ్మిన చిన్న గంగు మెడలోని తులం బంగారు గొలుసుతోపాటు పావు తులం చెవికమ్మలు తీసి, ఇచ్చింది. వాటిని తీసుకున్న దుండగుడు వెంటనే అక్కడినుంచి పరారయ్యాడు. బాధి తురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. అనారోగ్యంతో కళాకారుడి మృతి వీర్నపల్లి(సిరిసిల్ల): అడవిపది రకు చెందిన మాట్ల బాబు (47) అనే కళాకారుడు అనా రోగ్యంతో మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. బాబు తన కళాప్రదర్శనల ద్వారా ఎన్నో తెలంగాణ, బహుజన సాంస్కృతిక వేదికల మీద, ఎలక్షన్ క్యాంపెయిన్లలో ప్రదర్శనలు ఇచ్చాడు. ఓవైపు పేదరికం వెంటాడుతున్నా డప్పే తన ఆయుధంగా ప్రజల్లో చైతన్యానికి కృషి చేశాడు. ఆయన అనారోగ్యానికి గురై, పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నాడు. నయం కాకపోవడంతో గురువారం రాత్రి ఇంట్లోనే మృతిచెందాడు. మృతుడికి భార్య మంజుల, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బీఎస్పీ మండల అధ్యక్షుడు గజ్జెల ప్రశాంత్, స్థానికులు కోరారు. -
ఎములాడ రాజన్నకు మొక్కులు
వేములవాడ: ఎములాడ రాజన్నను శుక్రవారం దాదాపు 20 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి అభిషేకాలు, అన్నపూజలు చేసి, కోడెమొక్కులు చెల్లించుకున్నారు. సత్యనారాయణ వ్రతాలు, అమ్మవారికి కుంకుమ పూజలు జరిపారు. అనంతరం బద్దిపోచమ్మకు బోనం మొక్కులు చెల్లించి, భీమన్న, నగరేశ్వరాలయాలను సందర్శించారు. భక్తుల ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు. స్వామివారి సేవలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు.. వేములవాడ రాజన్నను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు కొంకటి లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శన అవకాశం కల్పించారు. ప్రొటోకాల్ ఏఈవో అశోక్ శాలువాతో సత్కరించి, ప్రసాదం అందజేశారు. -
మరమ్మతు చేయరు.. పూడిక తీయరు
ఇది డీ–89 ప్రధాన కాల్వ దుస్థితి. కరీంనగర్ మండలం ఎలబోతారం శివారులో కాల్వ సిమెంట్ లైనింగ్ కూలిపోగా, అడ్డుగా పడిన బండరాళ్లతో కిందకు నీళ్లు వెళ్లలేని స్థితి. కరీంనగర్ జిల్లాలోని చాలావరకు కాల్వలది ఇదే పరిస్థితి. పూర్వ వైభవం తీసుకురావాలి ఆయకట్టు రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అధికారులు డీబీఎం–17 ఉపకాలువకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి. పేరుకుపోయిన పూడిక, పిచ్చిమొక్కలను తొలగించాలి. కాలువ సరిగ్గా లేకపోతే చివరి ఆయకట్టు వరకు నీరందే పరిస్థితి లేదు. అధికారులు చొరవ తీసుకొని మరమ్మతులు చేయించి కాలువకు పూర్వవైభవం తీసుకురావాలి. – పసుల స్వామి, సామాజిక కార్యకర్త, హుజూరాబాద్ అత్యవసర పనులకే నిధులు మంజూరు ఎస్సారెస్పీలో అత్యవసరమైన పనులకు మాత్రమే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. ఇరుకుల్ల వద్ద రూ.4లక్షలతో కల్వర్టు పనులు నడుస్తున్నాయి. ఉపాధిహామీ ద్వారా కొన్ని కాలువల్లో పూడిక తొలగించాం. – సంతోష్, డీఈ, ఎస్సారెస్పీ, కరీంనగర్‌రూరల్ కరీంనగర్‌రూరల్/హుజూరాబాద్: ఎస్సారెస్పీ కా ల్వలు అధ్వానంగా మారాయి. ఆయకట్టు కాల్వలు శిథిలావస్థకు చేరాయి. డ్రాపులు కూలిపోయి పొలా లకు నీళ్లందడం లేదు. ప్రధాన కాల్వలకు మరమ్మతు చేయకపోవడం, పూడిక తీయకపోవడంతో ఏ టా ఆయకట్టు చివరి భూములకు నీరందక పంట లు ఎండిపోతున్నాయి. ప్రస్తుతం యాసంగి సీజన్ పంటల సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నా యి. ఈ నెల 25 నుంచి ఎస్సారెస్పీ నీటిని విడుదల చేస్తారనే ప్రభుత్వ ప్రకటనతో పలువురు రైతులు వ రిపంటను సాగు చేసేందుకు ముందుకొస్తున్నారు. పేరుకుపోయిన పూడిక కరీంనగర్‌రూరల్ డివిజన్ పరిధిలో డీ–89 నుంచి డీ–94 ప్రధాన కాల్వల ద్వారా 27వేల ఎకరాలు సాగవుతోంది. డీ–89 ప్రధాన కాల్వ శిథిలావస్థకు చేరింది. డ్రాపులు కూలిపోగా సిమెంట్ లైనింగ్ ధ్వంసమైంది. కాల్వల్లో బండరాళ్లు అడ్డుగా పడడంతో ఆయకట్టు కింది గ్రామాలు ఇరుకుల్ల, మొగ్దుంపూర్, సాంబయ్యపల్లి, గొల్లపల్లి గ్రామాల్లోని ఆయకట్టు భూములకు నీళ్లందడం లేదు. ప్రధాన కాల్వతోపాటు ఉపకాలువల్లో సైతం పిచ్చిమొక్కలతో పూడిక పేరుకుపోయింది. డీ–94 ప్రధాన కాల్వ ద్వారా గోపాల్పూర్, దుర్శేడ్, బొమ్మకల్, చేగుర్తి గ్రామాలకు సాగునీరు సరఫరా చేస్తారు. అయితే కార్పొరేషన్లో విలీనమైన రేకుర్తి, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్ పరిధిలోని కాలువలో పిచ్చిమొక్కలు పెరిగి పూడిక పేరుకుపోయింది. ఆయా గ్రామాల్లో ఉపాధిహామీలో పూడికతీసే అవకాశం లేకపోవడంతో ఇటీవల మున్సిపల్ నిధులు రూ.6 లక్షలతో పూడిక తొలగించే పని చేపట్టారు. 250 ఎకరాలకు నీరందించే కాలువపై అలసత్వం.. ఎస్సీరెస్పీ కెనాల్ కింద గల డీబీఎం–17 ఉపకాలువ పరిధిలో పెద్ద పాపయ్యపల్లి, హుజూ రాబాద్, రాంపూర్, రంగాపూర్ గ్రామాల్లో సుమా టరు 250 ఎకరాలకు నీరందించే లక్ష్యంగా ఏర్పాటైంది. పెద్దపాపయ్యపల్లి నుంచి ప్రారంభమై హుజూరాబాద్ పోచమ్మగుండ్ల కింది వరకు వెళ్లి వాగులో కలుస్తుంది. ఉపకాల్వ కింద ఆయకట్టు రైతులు ఏడాదికి రెండు పంటలు పండించవచ్చు. ఆయకట్టు రైతులే లక్ష్యంగా ఉన్న ఈ కాలువపై అధికారుల పట్టింపు కరువవడంతో పూర్తిగా రూపురేఖలు కోల్పోయింది. ఎస్సారెస్పీ కాల్వల నిర్వహణ అధ్వానం చివరి ఆయకట్టుకు నీరందక ఎండుతున్న పంటలు -
మైనర్ డ్రైవింగ్‌పై స్పెషల్ ఫోకస్
సిరిసిల్ల క్రైం: పిల్లలకు బైక్‌లు ఇచ్చి, షాప్‌కు వెళ్లమనడం, బంధువులను తీసుకురావాలని చెప్పడం, వెనకాల కూర్చొని, వారితో డ్రైవింగ్ చేయించడం ప్రమాదకరమని రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లాలో మైనర్లు వాహనాలు నడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నందున నాలుగు రోజులుగా మైనర్ డ్రైవింగ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. దీంతో ఊహించని స్థాయిలో దాదాపు 350 మంది మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు పెద్దలు కారణమని పలువురిని కౌన్సిలింగ్ చేసిన ప్పుడు తెలిసిందన్నారు. వారికి సిరిసిల్ల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించామని తెలిపారు. పిల్లలు డ్రైవింగ్ చేసి, ప్రమాదాలకు కారణమైతే కేసులపాలవుతారన్నారు. వారికి వాహనాలు ఇవ్వడం మానుకోవాలని సూచించారు. ప్రస్తుతం పట్టుబడినవారి వివరాలను వెంటనే ఆన్లైన్ చేయాలని, మళ్లీ బైక్‌లు నడుపుతూ పట్టుబడితే కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదైతే ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్లాలంటే పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఉండదన్నారు. అందుకే నిర్ణీత వయస్సు వచ్చే వరకు వాహనాలు నడపొద్దని సూచించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బైక్‌లు నడుపుతూ పట్టుబడిన దాదాపు 350 మందికి కౌన్సెలింగ్ ఇకనుంచి ఇవ్వను నేనే మా అబ్బాయిని బైక్ తీసుకెళ్లమని చెప్పాను. ప్రమాదాలు జరుగుతున్న తీరును పోలీసు సార్లు చెప్పిన తర్వాత ఇక బైక్ ఇవ్వొద్దని నిర్ణయించుకున్నాను. ఇప్పటినుంచి ఏదైనా పని ఉంటే నేనే వెళ్తాను. – లింగపల్లి రాజేశం, సుందరయ్యనగర్, సిరిసిల్ల -
సైకిల్‌పై వెళ్లమంటాం
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడపడం నేరమని ఇక్కడికి వచ్చినంక తెలిసింది. పిల్లలు అల్లరి చేస్తే వాహనం ఇచ్చాం. కానీ, ఇకనుంచి ఇవ్వము. పని ఉంటే సైకిల్, లేకుంటే నడిచి వెళ్లమని చెబుతాం. – బిపాషా, సిరిసిల్ల ఇంకోసారి బైక్ ఎక్కనివ్వను మా ఊరిలో ఓ పెద్ద మనిషికి బైక్ అవసరం అంటే వాళ్ల ఇంటి నుంచి మావాడు తీసుకెళ్లి, పోలీసులు పట్టుబడ్డాడు. పిల్ల లు వాహనాలు నడపడం ప్రమాదకరమని ఎస్పీ సారు చెప్పారు. ఇంకోసారి బైక్ ఎక్కనివ్వను. – యానా రాజేశం, సిరిసిల్ల ప్రజలు సహకరించాలి వాహనాలు నడిపిన పిల్లలను పట్టుకుంటే తల్లిదండ్రులు విడిచిపెట్టాలని పైరవీలు చేయిస్తున్నారు. సంబంధిత పోలీసు అధికారులపై కోపగిస్తున్నారు. భవిష్యత్తు తరం ప్రమాదానికి గురికావొద్దనే మేము నాలుగు రోజులు తనిఖీలు చేశాం. మార్పు వస్తే అందరికీ మంచిది. ప్రజలు సహకరించాలి. – అఖిల్ మహాజన్, ఎస్పీ -
చోరీ కేసులో ఆరుగురి అరెస్టు
జగిత్యాల క్రైం: ఓ ఇంట్లో చొరబడి, దంపతులను డమ్మీ తుపాకులతో బెదిరించి, దొంగతనం చేసిన కేసులో ఆరుగురిని అరెస్టు చేశామని, ఒకరు పరారీలో ఉన్నట్లు జగిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. శుక్రవారం జగిత్యాలలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన కాసం ఈశ్వరయ్య ఇంట్లో ఈ నెల 14 తెల్లవారుజామున దుండగులు చొరబడ్డారు. దంపతులను బంధించి, డమ్మీ తుపాకులతో బెదిరించి, 10 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేలు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలించారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్, రూరల్ సీఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నాలుగు పోలీసు బృందాలు నిందితుల కోసం గాలింపు చేపట్టాయి. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి, నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం మున్యాలకు చెందిన మున్నేశుల శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా లక్షెట్‌పేట్ మండలం గోపవాడకు చెందిన పొన్నూరు హైస్కూల్ రికార్డు అసిస్టెంట్ చిప్పబత్తుల తులసయ్య, జగిత్యాల రూరల్ మండలం గుట్రాజ్‌పల్లికి చెందిన బక్కెనపల్లి అరుణ్, బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన యశోద శ్రీనివాస్, జగిత్యాల రూరల్ మండలం అనంతారా నికి చెందిన సైదు సహదేవ్, మంచిర్యాల జిల్లా జ న్నారం మండలం మర్రిమడుగుకు చెందిన రత్నం మాణిక్యంలను శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 10 తులాల ఆభరణాలు, రూ.10 వేలు, 6 ఫోన్లు, ఒక ద్విచక్రవాహనం, రెండు డమ్మీ తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మంచిర్యాల జిల్లా పోచమ్మవాడకు చెందిన ముకునూరి కిరణ్‌కుమార్ పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. డీఎస్పీ రఘుచందర్, రూరల్ సీఐ కృష్ణారెడ్డి, బీర్పూర్ ఎస్సై కుమారస్వామి, రూరల్ ఎస్సై సదాకర్, బుగ్గారం ఎస్సై శ్రీధర్‌రెడ్డి, సారంగాపూర్ ఎస్సై దత్తాద్రి, హెడ్‌కానిస్టేబుల్ గంగాధర్, కానిస్టేబుళ్లు గంగాధర్, శ్రీనివాస్, వెంకటేశ్, ముత్తయ్య, సుమ న్, రవి, రమేశ్‌నాయక్, లింగారెడ్డి, శివ, పరమేశ్, జలంధర్‌లకు రివార్డులిచ్చి, అభినందించారు. పరారీలో మరొకరు ఆభరణాలు, రూ.10 వేలు, 6 ఫోన్లు, 2 డమ్మీ తుపాకులు, బైక్ స్వాధీనం -
నేరెల్ల గుట్టల్లో మృతదేహం?
ధర్మపురి: మండలంలోని నేరెల్ల గుట్టల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అడవిలో పనులకు వెళ్లిన కొందరు సదరు మృతదేహాన్ని చూసినట్లు తెలిసింది. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విషయమై ఎస్సై ఉదయ్‌కుమార్‌ను వివరణ కోరగా అడవిలో మృతదేహం ఉన్నట్లు వదంతులు వస్తున్న మాట నిజమేనని, కానీ ఎక్కడుందో తెలియడం లేదని పేర్కొన్నారు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వ్యక్తి ఆత్మహత్యహుజూరాబాద్: మండలంలోని రాంపూర్‌కు చెందిన సుంకరి రమేశ్(46) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. రమేశ్‌కు భార్య, ఇద్దరు పిల్ల లున్నారు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో రెండేళ్ల క్రితం పిల్ల లను తీసుకొని, భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటినుంచి రమేశ్ ఏ పనీ చేయకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో అతనికి కేన్సర్ ఉన్నట్లు తెలిసింది. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి, భార్యను ఇంటికి రావాలని కోరినా ఆమె రాలేదు. దీంతో రమేశ్ మనస్తాపానికి గురై, శుక్రవారం ఇంట్లోనే ఉరేసుకున్నాడు. మృతుడి తల్లి కొమురమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కుక్కల దాడిలో గొర్రెపిల్లలు మృత్యువాత ధర్మారం(ధర్మపురి): నర్సింగపూర్ గ్రామానికి చెందిన బద్ద సుధాకర్‌రెడ్డి గొర్రెల మందపై శుక్రవారం ఉద యం కుక్కలు దాడిచేశాయి. ఈ ఘటనలో 12 గొర్రెపిల్లలు చనిపోయాయి. తన ఇంటి వెనుకాల షెడ్లో గొర్రెలను ఉంచగా, వీధికుక్కలు ఒక్కసారిగా దాడిచేసి చంపినట్లు బాధితుడు సుధాకర్‌రెడ్డి తెలిపారు. మధ్యా హ్నం ఇంటికి వచ్చిన తర్వత గొర్రె పిల్లలకు పాలు పెట్టేందుకు వెళ్లగా గొర్రెపిల్లలు కనిపించలేదని, సమీపంలో గాలించగా కళేబరాలు కనిపించాయని ఆవేదన వ్యక్తం చేశాడు. గొర్రె పిల్లల కోసం వేసిన ఫెన్సింగ్‌ను ధ్వంసం చేసి గొర్రె పిల్లలను ఎత్తుకుపోయి చంపినట్లు అతడు వివరించాడు. పీఏసీఎస్ సేవలు విస్తరించాలి సుల్తానాబాద్(పెద్దపల్లి): పీఏసీఎస్ సేవలు విస్తరించాలని నాబార్డ్ సీజీఎం ఉదయభాస్కర్ అన్నారు. శుక్రవారం సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. సహకార సంఘం సభ్యులకు 6 శాతం డివిడెంట్ ఇవ్వడం శుభపరిణామమని అన్నారు. వ్యాపారులకు, గృహ నిర్మాణదారులకు రుణాలు ఇవ్వడంతోపాటు లాకర్ సౌకర్యం ఏర్పాటు చేస్తే మరిన్ని లాభాలు వస్తాయని తెలిపారు. రైతులకు ఎక్కువ రుణాలు ఇచ్చే ప్రయత్నం చేయాలని సూచించారు. చైర్మన్, కేడీసీసీబీ డైరెక్టర్ శ్రీగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పీఏసీఎస్ పరిధిలో 3,499 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. రూ.40 కోట్ల విలువైన రుణాలు ఇచ్చామని, రూ.19 కోట్ల డిపాజిట్లు ఉన్నాయన్నారు. అనంతరం నాబార్డ్ సీజీఎంను సన్మానించారు. కార్యక్రమంలో కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణరావు, డీడీఎంలు జయప్రకాశ్, దిలీప్, జీఎం రియాజుద్దీన్, రిసోర్స్‌పర్సన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
పిల్లలు, వృద్ధులు జాగ్రత్త
● చలి తీవ్రత పెరిగింది. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ చలితో చర్మం, ఊపిరితిత్తుల సమస్యలు పెరుగుతుంటాయి. రోగ నిరోధక శక్తి తగ్గి, శారీరక, మానసక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ● చలి బాగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో అవసరమైతేనే బయటకు వెళ్లాలి. పిల్లలు, వృద్ధులు స్వెట్టర్లు ధరించాలి. ● చలి ప్రభావంతో శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయి. రక్షణ పొందాలంటే ముక్కు, చెవుల్లోకి చలి గాలి వెళ్లకుండా చూసుకోవాలి. ● చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. న్యూమోనియా, అస్తమా రాకుండా ఉండేందుకు గాలి వీస్తున్నప్పుడు తిరగకపోవడం, దుమ్ము, ధూళి ఉండే పరిసరాలు, రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి. చర్మ సంరక్షణ కోసం తగినంత మంచినీరు తీసుకోవాలి. – డాక్టర్ నరేందర్, పల్మనాలజిస్టు, ప్రభుత్వ ఆస్పత్రి, కరీంనగర్ -
ఆరోగ్య మహిళపై అవగాహన కల్పించాలి
● కలెక్టర్ పమేలా సత్పతికరీంనగర్టౌన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్య మహిళ కార్యక్రమం కింద రూ.40 వేల విలువైన 54 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కార్యక్రమంపై ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మొహతాజ్ఖానా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఆస్పత్రిలో వైద్య సేవలపై వైద్యాధికారి ఇమ్రాన్‌ను అడిగి తెలుసుకున్నారు. గర్భిణులకు ప్రత్యేక రిజిస్టర్ ఏర్పాటు చేయాలన్నారు. వైద్య పరీక్షలు జాగ్రత్తగా చేయాలని, ఎక్కడ ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని చెప్పారు. మహిళలు రక్తహీనత బారిన పడకుండా పోషకాహారం తీసుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని డీఎంహెచ్‌వో వెంకటరమణకు సూచించారు. ప్రతీ మంగళవారం మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు మందులు అందిస్తారని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంసీహెచ్ ప్రోగ్రాం ఆఫీసర్ సనా, సూపర్వైజర్ ఎంకే.బేక్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
సమతుల ఆహారం తీసుకోవాలి
● చలికాలంలో రోగనిరోధక శక్తి తగ్గి, సీజనల్, ఇతర వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలుండే సమతుల ఆహారం, ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ అధికంగా తీసుకోవాలి. ● పండ్లు, కూరగాయలు, బ్రోకలీ, చిలకడదుంప వంటివి ఎక్కువగా తినాలి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచేందుకు నీరు, హెర్బల్ టీలు, వెచ్చని సూప్‌లు తీసుకోవాలి. తగినంత నిద్ర, వ్యాయామం, శారీరక శ్రమ మానసిక స్థితిని, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ● వేరుశనగ, బాదాం, జీడిపప్పు, పిస్తా, ఖర్జురా వంటివి తీసుకోవాలి. ఇవి బలవర్ధక ఆహారం. శరీరంలో వేడిని పుట్టిస్తాయి. యాపిల్, అరటిపండ్లు, బొప్పాయి. పైనాపిల్ వంటివి తినాలి. వీటిలో ఫైబర్ ఉండి, వేడిని ఉత్పత్తి చేస్తాయి. ● కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్, స్వీట్లు, కేకులు, ఫ్రైడ్ రైస్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. – భవ్యశ్రీ, డైటీషియన్, అపోలో రీచ్ -
అనర్హులకు ఆసరా!
గత వారం రోజుల్లో నమోదైన ఉష్ణోగ్రతలు● పింఛన్లపై విజిలెన్స్‌కు ఫిర్యాదు ● ఒక్క ఇల్లందకుంటలోనే 1,000 మంది అనర్హులు? ● ఉమ్మడి జిల్లాలో ఎందరో? ● 500 మందిని గుర్తించిన అధికారులు ● నకిలీ సర్టిఫికెట్లపై డీఆర్డీఏ, సివిల్ ఆస్పత్రి పరస్పర ఆరోపణలు ● రెండేళ్ల కిందే బయటపెట్టిన ‘సాక్షి’ ● విచారణ పక్కనబెట్టిన ఏసీబీ30.730.928.627.729.031.1281517.313.616.414.513.915.0సాక్షి ప్రతినిధి, కరీంనగర్●: దివ్యాంగులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్లు పక్కదారి పడుతున్నాయి. ముఖ్యంగా నకిలీ సదరం సర్టిఫికెట్లు చూపి, నెలకు రూ.3 వేల చొప్పున పెన్షన్ తీసుకుంటున్న విషయం కరీంనగర్ జిల్లాలో మరోసారి వెలుగులోకి వచ్చింది. ఒక్క ఇల్లందకుంట మండలంలోనే 1,000 మంది వరకు అనర్హులున్నట్లు సమాచారం. ఫిర్యాదు ఆధారంగా వారి సదరం సర్టిఫికెట్లపై విజిలెన్స్ అధికారులు అత్యంత రహస్యంగా విచారణ చేపట్టారు. ఈ విషయంలో తవ్విన కొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2011 నుంచి చాలామంది అనర్హులు అక్రమ మార్గంలో సర్టిఫికెట్లు పొందినట్లు తేల్చారు. ఇల్లందకుంటలో ఇప్పటివరకు 500 మందిని గుర్తించారు. వీరంతా ఇప్పటికీ ఆసరా పింఛన్ పొందుతున్నట్లు తెలిసింది. మిగిలిన వారెక్కడ? ఇల్లందకుంటలో దాదాపు మరో 500 మందిని విజిలెన్స్ అధికారులు గుర్తించలేకపోతున్నారు. వారంతా ఎవరు? ఎక్కడున్నారు? సర్టిఫికెట్లు ఎవరు జారీ చేశారు? అన్న విషయాలపై తర్జనభర్జన పడుతున్నారు. మొత్తానికి నానా ఇబ్బందులు పడి, లోతుగా దర్యాప్తు చేస్తే.. కేవలం 70 సర్టిఫికెట్ల లబ్ధిదారులు, వారి సమాచారం పూర్తిస్థాయిలో రీ వెరిఫై చేయించగలిగారు. 2011 నుంచి ఆ సర్టిఫికెట్లు జారీ చేసిన డాక్టర్లు 15 మందిని విచారణకు పిలిచారు. వీరంతా కరీంనగర్ సివిల్ ఆస్పత్రిలో విధులు నిర్వహించినవారే. ఇప్పుడు రిటైరయ్యారు. ఏ కారణం చేత జారీ చేశారో.. ఏ సమయంలో ఇచ్చారో.. అన్న విషయాలు వారికి గుర్తు లేకపోవడం గమనార్హం. దీంతో విజిలెన్స్ అధికా రుల దర్యాప్తుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. మరోవైపు మిగతా 500 మంది కోసం గాలిస్తున్నారు. ఈ విషయంలో ఇటు డీఆర్డీఏ, అటు సివిల్ ఆస్పత్రి అధికారులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. జరిగిన వ్యవహారంలో తమ తప్పు లేదంటే తమ తప్పు లేదంటూ తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘సాక్షి’లో వరుస కథనాలు.. సదరం నకిలీ సర్టిఫికెట్ల విషయంలో ‘సాక్షి’ దినపత్రిక 2022లోనే వరుస కథనాలు రాసింది. అప్పుడు కూడా జమ్మికుంటకు చెందిన ఓ విజిల్ బ్లోయర్(కుంభకోణాన్ని వెలికితీసిన వ్యక్తి) ద్వారా విషయం వెలుగుచూసింది. ఆ తర్వాత 317 జీవో అమలు సమయంలోనూ కలెక్టరేట్ కేంద్రంగా జరిగిన బదిలీల్లోనూ అనేక నకిలీ సర్టిఫికెట్లను అధికారులే పక్కనబెట్టారు. కానీ, అప్పటికే చాలామంది వాటి ఆధారంగా కోరుకున్న చోటకు బదిలీ చేయించుకోవడం, లేదా బదిలీ నిలిపివేయించుకోవడం ద్వారా లబ్ధి పొందారు. అనంతరం విచారణను ఏసీబీ చేపట్టింది. సివిల్ ఆస్పత్రి, డీఆర్డీఏ సిబ్బందిని విచారించింది. పలు ఆధారాలు సేకరించింది. ఆరంభంలో దూకుడుగా కనిపించిన సంబంధిత అధికారులు ఆ తర్వాత చల్లబడ్డారు. కొంతకాలానికి విచారణను పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. విజిలెన్స్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కానీ, దీనికి సంబంధించిన సమస్త సమాచారం కరీంనగర్ ఏసీబీ వద్ద ఉంది. అయితే, విజిలెన్స్ అధికారులు ఏసీబీని సంప్రదించారా లేదా అన్నది సందేహమే. ఇది కేవలం ఇల్లందకుంట మండలానికే పరిమితమైన సమస్య కాదు. ఉమ్మడి జిల్లా కేంద్రంగా 2011 నుంచి జరుగుతున్న వ్యవహారం. దర్యాప్తు పూర్తయితే ఎన్ని కొత్త కోణాలు బయటపడతాయోనన్న ఉత్కంఠ నెలకొంది. -
అమ్మో.. చలి
కరీంనగర్ టౌన్ ●: జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ప్రజలు గజగజ వణుకుతున్నారు. సాయంత్రం 6 గంటలైందంటే చాలు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. పొగమంచుతోపాటు ఈదురుగాలులు వీస్తున్నాయి. జిల్లాలో 10 నుంచి 12.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ అసమతుల్యతతో ప్రజలు వ్యాధుల బారినపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా గుండె జబ్బుల వంటి దీర్ఘకాల పేషెంట్లు చలిలో బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. -
వీధి వ్యాపారులను ఇబ్బంది పెట్టకండి
● కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్‌టౌన్: కరీంనగర్లో వీధి వ్యాపారులను ఇబ్బంది పెట్టొద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అధికారులకు సూచించారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఆయన ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ఇక్కడ వీధి వ్యాపారులు ధర్నా చేస్తున్న విషయాన్ని స్థానిక బీజేపీ నాయకులు గురువారం ఆయన దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించారు. సీపీ అభిషేక్ మహంతి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పేయ్లకు ఫోన్ చేశారు. పొట్టకూటి కోసం వీధుల్లో వ్యాపారం చేసుకుంటున్నవాళ్ల వస్తువులను స్వాధీనం చేసుకుంటూ, ఫైన్లు వేస్తూ ఇబ్బంది పెడుతున్న విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. మానవతా దృక్పథంతో వ్యవహరించి, వాళ్లతో సామరస్యపూర్వకంగా మెలగండి అని కోరారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. నెలాఖరులో మల్టీపర్పస్ పార్క్ ప్రారంభం● మేయర్ సునీల్రావుకరీంనగర్ కార్పొరేషన్: స్మార్ట్‌సిటీలో భాగంగా రూ.13 కోట్లతో ఆధునీకరిస్తున్న మల్టీపర్పస్ పార్క్‌ను ఈ నెలాఖరులో ప్రారంభిస్తామని మేయర్ యాదగిరి సునీల్‌రావు అన్నారు. గురువారం పార్క్ పనులను నగర పాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్తో కలిసి పరిశీలించారు. 24లోగా పనులు పూర్తి చేయాలని ఏజెన్సీ కాంట్రాక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. పార్క్‌లో ప్రవేశానికి రుసుము కూడా ఉంటుందన్నారు. కార్పొరేటర్లు వాల రమణారావు, కంసాల శ్రీనివాస్, అఖిల్ ఫిరోజ్, తుల రాజేశ్వరి, సుధగోని మాధవి, ఎస్ఈ రాజ్‌కుమార్, ఈఈ యాదగిరి, డీఈ అయూబ్‌ఖాన్, ఏఈ గఫూర్ తదితరులున్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన నగరంలోని 14వ డివిజన్ రాంనగర్ టెలిఫోన్ క్వార్టర్స్ వద్ద రూ.16.50 లక్షలతో రెండుచోట్ల చేపట్టనున్న సీసీరోడ్లు, డ్రైనేజీ పైప్‌లైన్ పనులకు మేయర్ సునీల్‌రావు శంకుస్థాపన చేశారు. కార్పొరేటర్ దిండిగాల మహేశ్, ఈఈ సుబ్రమణ్యం, డీఈ లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులు ఆర్థికాభివృద్ధి సాధించాలిసప్తగిరికాలనీ(కరీంనగర్): దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ఆర్థికాభివృద్ధి సాధించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సివిల్ జడ్జి కె.వెంకటేశ్ అన్నారు. గురువారం నగరంలోని చైతన్యపురి అడోరేషన్ సొసైటీ ఆధ్వర్యంలో 20 మంది దివ్యాంగులకు ఐజీఏ ఆర్థికాభివృద్ధి కింద రూ.15 వేల చొప్పున లోన్ అందించారు. కార్యక్రమంలో ఫాదర్ సంతోష్, ఫాదర్ అలెక్స్, తణుకు మహేశ్, సిస్టర్ ప్రీత, తెస్సీ, దీప్తి, వెలంగాణి తదితరులు పాల్గొన్నారు. ఒక ఓటు ఎనిమిదిసార్లు నమోదు ● సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్‌సింగ్ ఆరోపణకరీంనగర్: ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్‌లకు సంబంధించిన పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదులో తప్పులు దొర్లాయని సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ ఆరోపించారు. ఒక ఓటు గరిష్టంగా ఎనిమిదిసార్లు నమోదైందన్నారు. గురువారం కరీంనగర్‌లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటరు నమోదులో తప్పులపై ఎలక్షన్ కమిషన్ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, గొట్టం మహేశ్, పొన్నం అనిల్‌గౌడ్, కెమసారం తిరుపతి, పెండ్యాల మహేశ్, సాయిండ్ల కొమురయ్య, బుడిగె పర్శరాంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
బారికేడ్లు.. ట్రాఫిక్జాంకు చెక్
● నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా, కమాన్ వద్ద ఏర్పాటు ● సాఫీగా వెళ్లిపోతున్న వాహనదారులు ● ట్రాఫిక్ పోలీసుల ఆలోచన బాగుందని కితాబు కరీంనగర్ క్రైం: జిల్లా కేంద్రంలో జనాభా, వాహనాలు, వివిధ పనులపై ఇక్కడికి వచ్చే ప్రజల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఫలితంగా వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌జాం అవుతోంది. నగరంలో ట్రాఫిక్ సమస్యలున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు దృష్టిపెట్టి, నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ జాం అవకుండా బారికేడ్లను డివైడర్ మాదిరిగా ఏర్పాటు చేస్తున్నారు. ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సమస్య ఏళ్లనాటిది. ఇక్కడ బారికేడ్లు పెట్టడంతో వాహనాలు గుమికూడటం లేదు. కరీంనగర్ బస్టాండ్ నుంచి హైదరాబాద్ వెళ్లే దారిలో కమాన్ వద్ద సమస్య పరిష్కారానికి కూడా పోలీసులు ఇలాగే చేశారు. ఎలాంటి అయోమయానికి గురవకుండా వెళ్తున్నామని, ట్రాఫిక్ పోలీసుల ఆలోచన బాగుందని వాహనదారులు కితాబునిస్తున్నారు. రోజూ లక్షకు పైగా వాహనాలు.. జిల్లా నలుమూలల నుంచి కరీంనగర్‌కు నిత్యం లక్షకు పైగా వాహనాలు వచ్చి, వెళ్తుంటాయి. వీటిలో 50 వేలకు పైగా హైదరాబాద్, వరంగల్ల వైపు కమాన్ మీదుగా వెళ్తుంటాయి. దీంతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సిరిసిల్ల బైపాస్ నిర్మించాక సిరిసిల్ల నుంచి వరంగల్, హైదరాబాద్, పెద్దపల్లి వైపు వెళ్లే భారీ వాహనాలు సిటీలోకి రావడం లేదు. దీంతో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్‌జాం ఏర్పడి, వాహనదారులు ఇబ్బందులు పడేవారు. ఇటీవల పోలీసు శాఖ, వివిధ శాఖల మధ్య సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించడానికి పోలీసులు పలు పరిష్కార మార్గాలు సూచించారు. కోర్టు రోడ్డులో, రాంనగర్, మంచిర్యాల చౌరస్తాతో, టవర్‌సర్కిల్, మార్కెట్ ప్రాంతాల్లో ట్రాఫిక్‌జాం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. సమస్యలు పరిష్కరిస్తున్నాం నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం. ఎన్టీఆర్ చౌరస్తా, కమాన్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశాం. దీంతో వాహనదారులు ఎవరి దారిలో వారు అయోమయం లేకుండా వెళ్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లోనూ బారికేడ్లు ఏర్పాటు చేస్తాం. – కరీముల్లాఖాన్, ట్రాఫిక్ సీఐఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు‘బస్టాండ్ నుంచి కమాన్ మీదుగా వెళ్లే వాహనాలు, హౌసింగ్‌బోర్డు, టవర్ సర్కిల్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఒకేసారి రావడంతో నిత్యం ఉదయం, సాయంత్రం పెద్ద ఎత్తున ట్రాఫిక్‌జాం అవుతుంది. ఇది గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు కమాన్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీనివల్ల ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌జాం సమస్యకు చెక్ పడింది.’