ఆస్తి ఇవ్వలేదని అఘాయిత్యం | suicide attempt for property | Sakshi
Sakshi News home page

ఆస్తి ఇవ్వలేదని అఘాయిత్యం

Published Thu, Jul 6 2017 10:08 PM | Last Updated on Tue, Sep 5 2017 3:22 PM

పరిస్థితి విషమంగా ఉన్న ఉసేన్‌పీరా

పరిస్థితి విషమంగా ఉన్న ఉసేన్‌పీరా

- కుటుంబ సభ్యులను చంపి.. తానూ ఆత్మహత్య చేసుకునేందుకు ఓ మహిళ యత్నం
– అన్నంలో పురుగు మందు కలిపిన వైనం
 - దాన్ని తినడంతో అస్వస్థతకు గురైన ఇద్దరు పిల్లలు, సదరు మహిళ
– వారిలో ఒకరి పరిస్థితి విషమం
 
ఆలూరు రూరల్‌ :  అత్తా మామ తమకు ఆస్తి పంచివ్వలేదన్న కోపంతో ఓ మహిళ అఘాయిత్యానికి ఒడిగట్టింది. తనతో పాటు భర్త, నలుగురు పిల్లలు చనిపోవాలన్న ఉద్దేశంతో అన్నంలో పురుగు మందు కలిపింది. ఆ అన్నం తిన్న తను, ఇద్దరు పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. భర్త, మరో ఇద్దరు పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన గురువారం హొళగుంద మండలం సుళువాయి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పెద్ద ఉసేన్‌షా, ఫాతిమా దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద ఉసేన్‌షాకు 20 ఎకరాల పొలం ఉంది.
 
ముగ్గురు కుమార్తెలకు పెళ్లి చేశాడు. కుమారుడు వన్నూరుసాబ్‌కు కూడా 13 ఏళ్ల క్రితం కర్ణాటకలోని బండరాళ్ల గ్రామానికి చెందిన షాషాబీతో వివాహం చేశాడు. వివాహం తర్వాత రెండేళ్లకు కుమారుడితో వేరుకాపురం పెట్టించారు. కొడుకు, కోడలు అదే ఇంట్లోనే ఒక భాగంలో వేరు కాపురం ఉంటున్నారు. వారికి కూడా ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె కలిగారు. కాగా..పెద్ద ఉసేన్‌షా తన భూమిలో ఎకరా చొప్పున ముగ్గురు కుమార్తెలకు మూడెకరాలు రాసిచ్చాడు. హొళగుందలో ఉన్న విలువైన స్థలాన్ని కూడా అమ్మేసి.. వచ్చిన మొత్తాన్ని కుమార్తెలకు ఇచ్చేశాడు. వారి పిల్లలను కూడా మంచి చదువులు చదివించేలా ప్రోత్సహించాడు. దీన్ని జీర్ణించుకోలేని వన్నూరుసాబ్‌ తన తండ్రితో ఆస్తి విషయమై గొడవ పడుతూ వచ్చాడు. కనీసం పది ఎకరాల భూమినైనా తన పేరుమీద చేసివ్వాలని కోరాడు. ఇందుకు తండ్రి తిరస్కరించాడు.
 
తనకు ఆస్తి ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడన్న బాధతో  వారం క్రితం తండ్రితో వన్నూరుసాబ్‌ గొడవపడ్డాడు. దీంతో పెద్ద ఉసేన్‌షా హొళగుంద పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కుమారుడిపై కేసు నమోదు చేయించాడు. ఈ కేసు విషయంలో  రెండు రోజులక్రితం  వన్నూరుసాబ్, అతని భార్య షాషాబి, పిల్లలు హొళగుంద స్టేషన్‌కు వెళ్లారు. జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపారు. పోలీసులు కూడా కుమారునికి ఎంతోకొంత ఆస్తి ఇస్తే పిల్లలు, భార్యను పోషించే అవకాశం ఉంటుందని ఉసేన్‌షాకు సూచించారు. అయినా అతను వినలేదు. ఆస్తి ఇచ్చేది లేదని తెగేసి చెప్పాడు.  ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన షాషాబి గురువారం ఉదయం అన్నంలో పత్తి పైరుకు వేసే రిజైంట్‌ అనే పురుగుమందును కలిపింది.
 
పొలానికి బయలుదేరిన భర్త, మూడో కుమారుడు సుభాన్, కుమార్తె మున్నీకి ఆ అన్నం క్యారియర్‌ను ఇచ్చి పంపింది. తాను ఆలస్యంగా వస్తానని చెప్పింది. ఇంటిలో ఉన్న పెద్దకుమారుడు ఉసేన్‌పీరా, చిన్నకుమారుడు ఉసేన్‌సాబ్‌కు ఆ అన్నాన్నే పెట్టింది. కాసేపటికి వారు అస్వస్థతకు గురి కాగా.. ఆ వెంటనే తను కూడా తినింది. కడుపులో మంటగా ఉండడం, పిల్లలు అస్వస్థతకు గురై కళ్ల ముందే బాధ పడుతుంటే చూడలేక విషయాన్ని ఇరుగూపొరుగు వారికి చెప్పింది. వారు పొలంలోకి వెళ్లి ఆమె భర్త, ఇద్దరు పిల్లలు పురుగు మందు కలిపిన అన్నం తినకుండా చూశారు.  మరి కొందరు షాషాబీని, మిగిలిన ఇద్దరు కుమారులను చికిత్స కోసం ఆలూరు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వీరిలో పెద్దకుమారుడు ఉసేన్‌పీరా పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. షాషాబి, చిన్న కుమారుడు ఉసేన్‌సాబ్‌ ఆరోగ్యం కుదుట పడిందని ఆలూరు ఆస్పత్రి వైద్యసిబ్బంది తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement