‘ఎవడ్రా నువ్వు నన్ను అన్నా అని పిలుస్తున్నావ్‌’ | Swiggy Delivery Boy Sai Kumar Reveals Shocking Facts About Owner In Vizag Oxygen Towers Incident, More Details Inside | Sakshi
Sakshi News home page

‘ఎవడ్రా నువ్వు నన్ను అన్నా అని పిలుస్తున్నావ్‌’

Published Thu, Mar 27 2025 7:38 AM | Last Updated on Thu, Mar 27 2025 9:53 AM

Vizag Oxygen Towers Swiggy Delivery Boy Shocking Facts About Owner

తీవ్రంగా కొట్టి.. దుస్తులు విప్పించి..

ఫుడ్‌ డెలివరీ బాయ్‌పై దాడి కేసు విచారణలో వెలుగులోకి..

ఎంవీపీకాలనీ: స్విగ్గీ ఫుడ్‌ డెలివరీ బాయ్‌ హరిదేవ సాయికుమార్‌పై దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించి పోలీసుల విచారణలో అవాక్కయ్యే వాస్తవాలు వెలుగు చూశాయి. డెలివరీ బాయ్‌ సాయికుమార్‌ ‘సార్‌’ అని కాకుండా ‘అన్నా’అని సంబోధించడం నిందితుడు పాండ్రంకి ప్రసాద్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. 

‘ఎవడ్రా నువ్వు నన్ను అన్నా అని పిలుస్తున్నావ్‌’ అంటూ ప్రసాద్‌ సాయికుమార్‌పై దాడికి పాల్పడ్డాడు. ‘సార్‌ డెలివరీ ఇచ్చేశాను. అయిపోయింది కదా.. నాతో ఇష్యూ ఎందుకు? వదిలేయండి సార్‌’ అని చెప్పినా వినకుండా ఆక్సిజన్‌ టవర్స్‌ 29వ అంతస్తు నుంచి కిందివరకు వెంబడించి చొక్కా కాలర్‌ పట్టుకుని మరీ దాడి చేశాడు. అక్కడితో ఆగకుండా సెక్యూరిటీ గార్డ్‌ల సహకారంతో గేటు వద్ద సాయికుమార్‌ను నిలువరించి ‘నీ స్థాయి ఏంటి? నా స్థాయి ఏంటి? నన్నే అన్నా అని పిలుస్తావా?’ అంటూ కర్రతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. 

గేటు వద్ద అప్పటికి మరికొందరు డెలివరీ బాయ్స్‌ ఉండటంతో వ్యతిరేకత వస్తుందని భావించి.. సెక్యూరిటీ రూమ్‌లోకి తీసుకెళ్లి దుస్తులు విప్పించి దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఈ ఘటనలో తప్పంతా తనదే అని ఒప్పుకున్నట్లుగా సాయికుమార్‌తో రెండు లేఖలు కూడా రాయించుకున్నాడు. తర్వాత దుస్తులు లేకుండానే గేటు బయటకు పంపించాడు. బుధవారం ఈ ఘటనలకు సంబంధించి సీసీ ఫుటేజ్‌లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆ వీడియోలు చూసిన పలువురు ప్రసాద్‌ వ్యవహరించిన తీరు అమానవీయతకు అద్దం పట్టిందంటూ విమర్శించారు.

ఏప్రిల్‌ 7 వరకు రిమాండ్‌
ఈ ఘటనపై సీపీ ఆదేశాలతో విచారణ వేగవంతం చేసిన పోలీసులు.. నిందితుడు పాండ్రంకి ప్రసాద్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతన్ని అరెస్ట్‌ చేయడంతో పాటు ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు అతనికి ఏప్రిల్‌ 7వ తేదీ వరకు రిమాండ్‌ విధించింది. అయితే విచారణతో పాటు ప్రసాద్‌ను కోర్టులో హాజరుపరచడంలో పోలీసులు గోప్యత పాటించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆక్సిజన్‌ టవర్స్‌కు ఫుడ్‌ బంద్‌
సీతమ్మధారలోని ఆక్సిజన్‌ టవర్స్‌ లోపలికి ఫుడ్‌ డెలివరీ నిలిపివేస్తున్నట్లు స్విగ్గీ, జొమాటో వంటి వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ మీడియాకు తెలిపారు. నగరంలోని ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ అంతా కలిసి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సాయికుమార్‌ అనే ఫుడ్‌ డెలివరీ బాయ్‌పై ఆక్సిజన్‌ టవర్స్‌లోని ఓ ఫ్లాట్‌ యజమాని ప్రసాద్‌ దాడి చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినట్లు గుర్తు చేశారు. ఆరు నెలల వరకు ఆక్సిజన్‌ టవర్స్‌ లోపలికి ఫుడ్‌ డెలివరీ చేయబోమని, కేవలం ప్రధాన గేటు వద్ద డెలివరీ ఇస్తామని డెలివరీ బాయ్స్‌ స్పష్టంచేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement