
మతాలకతీతంగా ప్రతి నగరవాసి సంప్రదాయ ఆహార సంస్కృతిలో మమేకమైపోయే సమయం రంజాన్. పాతబస్తీని అంతగా పట్టించుకోని ఐటీ నిపుణులు సైతం అసలు సిసలు హైదరాబాద్ అనుభవం కోసం ఓల్డ్ సిటీకి రౌండ్స్ కొట్టే సీజన్ ఇది. ఓ రకంగా దీన్ని లోకల్ టూరిజం అని పేర్కొనవచ్చు. రంజాన్ సీజన్‌లో ఈ లోకల్ టూరిస్టులు ఆస్వాదించే వాటిలో హలీమ్, ఇఫ్తార్‌లు మాత్రమే కాదు సెహ్రీ కూడా ఒకటి.
రోజూ రకరకాల కారణాలతో.. రంజాన్ సమయంలో నగరం సెహ్రీ ప్రత్యేక మెనూల కోసం మేల్కొంటోంది. ఇది ముస్లింలు తమ రోజాను (ఉదయం నుంచి సాయంత్రం వరకూ చేసే ఉపవాసం) పునఃప్రారంభించే ముందుగా.. సూర్యోదయానికి ముందు తినే ఉదయపు భోజనం. అయితే ఈ సమయం సాధారణంగా ముస్లిమేతరులు ఎవరికీ అనుభవంలో లేని తెల్లవారుజామున ఆస్వాదించే వైవిధ్యభరిత అనుభూతి. సమయం మాత్రమే కాదు ఆ సమయానికి రెస్టారెంట్స్ వడ్డించే వంటకాలు కూడా ప్రత్యేక అనుభూతే.
వైవిధ్యభరిత అనుభూతి..
సెహ్రీ కోసం బయటకు వెళ్లడం సంప్రదాయ పద్ధతి కానప్పటికీ, లేట్‌నైట్ షిఫ్టుల్లో పని చేసే వారి సంఖ్య పెరగడంతో పాటు, వంటగదిలోకి అడుగు పెట్టకుండానే రంజాన్ సమయంలో రిలాక్స్‌డ్ ఫుడ్‌ని ఇష్టపడే వారూ పెరగడం వల్ల కొత్తగా సెహ్రీ ఇంటి బయట ఊపందుకుంటోంది. రెస్టారెంట్లలో సెహ్రీ భోజనం సాధారణంగా తెల్లవారుజామున 1.30 గంటలకు ప్రారంభమవుతుంది.
సిసలైన సిటీ రుచుల సెహ్రీ..
సాధారణ బిర్యానీ లేదా హలీమ్‌లా కాకుండా, సెహ్రీలో కిచిడీ ఖట్టా–ఖీమా, నిహారీ విత్ నాన్, దమ్ కా కీమా కబాబ్‌లతో సహా అనేక రకాల సంప్రదాయ వంటకాలు సెహ్రీలో వడ్డిస్తారు. వీటిని రెస్టారెంట్లు ఈ సమయంలో ప్రత్యేకంగా అందిస్తాయి. కబాబ్‌లు వగైరా కూడా ఇందులో ఉన్నాయి, కానీ పూర్తిగా కొత్త మెనూను ఈ సందర్భంగా చాలా మంది రుచి చూస్తారు.
సిటీలోని అనేక రెస్టారెంట్లు, హోటళ్లు, రోడ్‌సైడ్ కేఫ్స్ సైతం ప్రత్యేక సెహ్రీ మెనూ ప్లేటర్‌ను అందిస్తున్నాయి. ఈ ప్లేటర్లు లేదా కాంబోలు కనీసం నలుగురికి సరిపోయేంత పెద్దవిగా ఉండడం విశేషం. ఎక్కువగా ఈ సెహ్రీ కాంబోల్లో కబాబ్‌లు, రోటీలు, అన్నం, పప్పులతో పాటు మాంసాహార స్టార్టర్‌ల మిశ్రమం ఉంటుంది. దీంతో పాటు వివిధ రకాల కబాబ్‌లు, నయాబ్ హోటల్‌లో పాపులర్ డిష్ ఓ ఆఫాల్ ఫ్రై, రోటీ పే బోటీ, కబాబ్స్‌తో రోగ్ని రోటీ వంటివి సెహ్రీ స్పెషల్స్‌గా పేరొందాయి.
ఎక్కడెక్కడ రుచి చూడొచ్చు అంటే..
ఓల్డ్ సిటీ, టోలిచౌకి, విమానాశ్రయ రహదారి (అరామ్‌ఘర్) వంటి ప్రాంతాల్లోని రెస్టారెంట్లు సెహ్రీ మెనులను అందిస్తాయి. అలాగే –టోలిచౌకి వంటి ప్రాంతాల్లో కూడా తాత్కాలిక ఆహార దుకాణాలు కనిపిస్తాయి. పాతబస్తీలోని నయాబ్ హోటల్ వంటి కొన్ని రెస్టారెంట్లు తమ సెహ్రీ మెనులను ఉదయం 1 గంట నుంచే అందిస్తాయి. అపరిమిత సెహ్రీ బఫేలను అందించేవి కూడా ఉన్నాయి.
‘గత సంవత్సరం ఇంటి బయట ‘సెహ్రీ’ కోసం అనేక మంది ఆసక్తిని కనబరిచారు, అందువల్ల మేం అనేక కొత్త రుచులను జోడించాం. ఉదయం 1 నుంచి 5 గంటల వరకూ స్పెషల్ మెనూలు అందిస్తున్నాం’ అని చార్మినార్ సమీపంలోని హోటల్ నయాబ్‌కు చెందిన జునైద్ అంటున్నారు. కొత్త మెనూలో ‘ఆచారి’ మటన్/చికెన్, నయాబ్ స్పెషల్ చికెన్, ‘కిచ్డీకి’, ‘దమ్ కా ఖీమా’ వంటి రుచికరమైన వంటకాలు అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుతం సెహ్రీ నగర నిజానికి ఒక భారీ ఆకర్షణగా మారుతోంది. మేం మా ‘సెహ్రీ’ మెనులో మటన్ ‘తహరీ’ అనే ప్రత్యేక వంటకం అందిస్తున్నాం’ అని లకడికాపూల్‌లోని పెషావర్ రెస్టారెంట్‌కు చెందిన మహమ్మద్ అబ్దుల్ మోయిద్ చెబుతున్నారు.
(చదవండి: జెన్–జడ్ రెబల్స్..ఈ తరం ఉద్యోగులు సరిచేసుకోవాల్సినవి ఇవే..!)