Hyderabad Vibes
-
సందేహాలను నివృత్తి చేసే.. దుల్హా–దుల్హన్
గతంలో పెళ్లి జరగాలంటే వధూవరులను పెద్ద నాన్నలు, బాబాయ్‌లు, మామలు, పెద్దమ్మలు, మేనత్తలు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి అబ్బాయి లేదా అమ్మాయి నచి్చతే వారి గుణగణాలు తెలుసుకొని కుటుంబ పరిస్థితి తెలుసుకొని పెళ్లి జరిపించేవారు. వివాహం జరిగిన తర్వాత భర్తతో ఎలా మసలుకోవాలి?, అత్తగారింట్లో ఎలా ఉండాలి? ఇలాంటివన్నీ అమ్మమ్మలు, తాతలు, నానమ్మలు కొత్తగా పెళ్లయిన వారికి చెప్పేవారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కరువై యాంత్రిక జీవనం కొత్తగా పెళ్లయిన వారినే కాకుండా పెళ్లికి ముందు కూడా వధూవరులను, పెళ్లి తర్వాత భార్యా, భర్తలను మనస్పర్థలకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టోలిచౌకిలో నివసించే ఇలియాస్ షంషి అనే వ్యక్తి ‘దుల్హా–దుల్హన్’ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చాడు. దీని గురించిన మరిన్ని విశేషాలు..! టోలిచౌకి బాల్‌రెడ్డినగర్ కాలనీలో ఏర్పాటు చేసిన దుల్హా–దుల్హన్ ఫ్యామిలీ ఇన్స్టిట్యూట్కు మంచి స్పందన లభిస్తోంది. ఈ ఇన్స్టిట్యూట్లో కొత్తగా పెళ్లి చేసుకోబోయేవారు ఎలా ఉండాలి అనే దానిపై 15 అంశాల్లో నిర్వాహకుడు ఇలియాస్ షంషి శిక్షణ ఇస్తున్నారు. హైదరాబాద్‌లోనే కాకుండా బెంగళూరు, చెన్నై, గుజరాత్, ఢిల్లీ, కోల్‌కతాతో పాటు దుబాయ్, కెనడా, అమెరికాలో కూడా షంషి ప్రారంభించిన ఆన్లైన్ క్లాస్‌లకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. పెళ్లంటే ఏంటి?, పెళ్లిలో మంత్రాల అర్థం ఏంటి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి?, పెళ్లి ఎందుకు?, బాధ్యతలు, భర్తతో మనస్పర్థలు వస్తే వాటిని ఎలా పరిష్కరించుకోవాలి?, భార్య అంటే ఎలా ఉండాలి?, భర్త చేయాల్సినవి, చేయకూడనివి ఏంటి?, మీరు మంచి భర్తగా ఎలా ఉండొచ్చు తదితర అంశాలపై షంషి శిక్షణ ఇస్తున్నారు. సందేహాలను నివృత్తి చేస్తూ.. హోమ్ మేనేజ్మెంట్, భర్త మనసును ఎలా గెలుచుకోవాలి, భార్య మనసును ఎలా గెలుచుకోవాలి ఇలాంటివన్నీ ఈ ట్రైనింగ్‌లో భాగమయ్యాయి. పెళ్ళికి ముందు వధూవరులు వస్తే వారు అడిగే ప్రశ్నలకు సందేహాలను నివృత్తి చేస్తూనే పెళ్లి తర్వాత మంచి భర్తగా, లేదా మంచి భార్యగా ఎలా ఉండాలి అన్న అంశాలపై ఈ శిక్షణ కొనసాగుతున్నది.మంచి స్పందన మేం ఈ సంస్థను ఏర్పాటు చేసినప్పుడు స్పందన అంతంత మాత్రంగానే ఉండేది. రోజులు గడుస్తున్న కొద్దీ మా సంస్థకు రెస్పాన్స్ పెరుగుతోంది. అమెరికా, దుబాయ్, కెనడా తదితర ప్రాంతాల నుంచి కూడా మేం నిర్వహించే ఆన్లైన్ క్లాస్‌లకు అభ్యర్థులు హాజరవుతున్నారు. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత భార్యా, భర్తల బంధం ఎంత బలంగా ఉండాలో ఈ శిక్షణ ద్వారా సూచిస్తున్నాం. ఇప్పటి వరకూ వేలాది మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. మూడు నెలల పాటు ఈ ఆన్లైన్ శిక్షణ ఉంటుంది. అంతే కాదు బెస్ట్ మదర్ అనిపించుకోవడం ఎలా అన్నదానిపై కూడా మా శిక్షణ కొనసాగుతున్నది. ఇటీవల పెళ్లికి ముందే చిన్న చిన్న విషయాల్లో వధూవరులకు మనస్పర్థలు వచ్చి పెళ్లిళ్లు ఆగిపోతున్న ఘటనలూ చూస్తున్నాం. దుల్హన్ కోర్సులో ఈ విషయాలన్నింటికీ సమాధానాలు లభిస్తున్నాయి. యువతీ, యువకులకు వేర్వేరుగా ఈ క్లాసులు ఉంటాయి. ముఖ్యంగా భార్య, భర్తల బంధం బలంగా ఉండాలంటే ఎలా ఉండాలో చూపిస్తున్నాం. – ఇలియాస్, షంషీ, ట్రైనర్ ఫ్యామిలీ ఇన్స్టిట్యూట్ 2019లో ఏర్పాటు.. ప్రతిరోజూ పాతిక మంది వరకూ ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యే ఈ ఫ్యామిలీ ఇన్స్టిట్యూట్ 2019లో ఏర్పాటైంది. ఇప్పటి వరకూ వేల సంఖ్యలో యువతీ, యువకులకు శిక్షణతో పాటు తగిన సూచనలు జారీ చేశారు షంషి. భార్యా, భర్తల మధ్య ఏదైనా గొడవ వస్తే వాటిని పరిష్కరించే దిశలోనే ఆయన అడుగులు వేస్తున్నారు. ఎవరికైనా ఇలాంటి సలహాలు, సంప్రదింపులు కావాలంటే తమ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావొచ్చు అని కూడా పేర్కొంటునారు. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత మేం చెప్పబోయే అంశాలు ఏమిటి అన్న దానిపై వివరిస్తూ స్పష్టంగా వెబ్సైట్లో పొందుపరిచారు. -
మనసుదోచే సొగశారీ..
స్కిన్‌టైట్ జీన్సులు, ట్యునీక్సూ, కుర్తీస్, నీలెంగ్త్ స్కర్టులు, పొట్టి నిక్కర్లూ.. లాంటి మోడ్రన్ ట్యూన్స్‌తో ఓ వైపు మమేకమైన నగర మహిళలు మరోవైపు ఇంకా పాత రాగంలో ‘శారీ’గమ పాడేస్తోందంటే.. చీర కట్టు మహిమ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.. ఆధునిక కట్టుబాట్లు ఎలా ఉన్నా అప్పుడప్పుడూ సొగసిరి చీరకట్టి అన్న రీతిలో నగర మహిళలు తమ హుందాతనాన్ని ప్రదర్శిస్తున్నారు. డిసెంబర్ 21న శారీ దినోత్సవం నేపథ్యంలో దీనిపైనే ఈ కథనం.. – సాక్షి, సిటీబ్యూరో‘చీర కట్టుకుంటే ఆ డిగ్నిటియే వేరు. నెలకోసారన్నా.. వార్డ్‌రోబ్‌లో నుంచి శారీ తీయాల్సిందే’ అంటోంది ఓ పీఆర్ కంపెనీలో పనిచేసే వాణి. సిటీలో విభిన్న వృత్తి ఉద్యోగాలు చేసే మహిళలు, యువతులు వృత్తి, బాధ్యతల కారణంగా రోజువారీ వినియోగం అంత సులభం కాకపోవడంతో ‘చీరకట్టు’ వీరికి మరింత అపురూపంగా మారిపోయింది. దీంతో సెలవు దినాల్లో, కుటుంబ వేడుకల్లో ఇలా వీలైనన్ని సందర్భాల్లో తప్పనిసరిగా ఎంచుకునే వస్త్రధారణగా మారింది. ప్రత్యేక సందర్భం వస్తే చీరకట్టాలి అనే రోజుల నుంచి చీరకట్టు కోసం సందర్భాన్ని సృష్టించుకునేంత ఆసక్తి నగరమహిళల్లో పెరిగిపోతోంది.కట్టు తప్పుతోంది.. రోజుల తరబడి టాప్లూ, ట్రౌజర్లతో కాలక్షేపం చేస్తూ వచ్చి ఒక్కసారిగా చీర కట్టుకోవాలంటే ఇబ్బందే కదా. అందుకే చీరకట్టడంలో నేర్పరితనం ఉన్నవారి సేవల మీద నగర మహిళలు ఆధారపడుతున్నారు. ‘ఫంక్షన్స్‌కి శారీ కాకుండా డ్రెస్సులతో వెళితే గిల్టీ ఫీలింగ్ వస్తోంది. అలాగని చీరకట్టాలని ప్రయత్నిస్తే సరిగా కుదరడం లేదు. అందుకే నేను అవసరమైనప్పుడల్లా చీరకట్టే వారిని పిలిపించుకుంటాను’ అని జూబ్లీహిల్స్‌లో నివసించే ఉమ చెబుతున్నారు. ఈ ‘కట్టు’ ఇబ్బందుల నుంచి తప్పించుకోడానికి నిపుణులకు రూ.500 వరకూ చెల్లించడానికి పెద్దగా ఇబ్బంది పడడంలేదంటున్నారు ఆధునిక మహిళలు. ‘ఇటీవల చీర కట్టుకోవాలని ఆసక్తి బాగా పెరిగింది. అయితే మోడ్రన్ డ్రెస్సుల్లా నిమిషాల మీద వేసుకుని వెళ్లిపోడానికి కుదిరేది కాదు కదా. అందుకే అమ్మాయిలు మాత్రమే కాదు పెద్ద వయసు మహిళలు కూడా చీర కట్టుకోవడానికి మా సహకారం కోరుతున్నారు. అవసరమైన వారికి మేం ఇంటికే వెళ్లి సేవలు అందిస్తున్నాం’ అని చెబుతున్నారు శారీ డ్రేపర్‌గా రాణిస్తున్న సునీల.విభిన్న శైలిలో...చీరకట్టు విభిన్నరకాల శైలులు నగరంలో రాజ్యం ఏలుతున్నాయి. ‘జయప్రద స్టైల్, నూపుర్ స్టైల్, తానిదార్ స్టైల్.. ఇలా దాదాపు 35 రకాల శారీడ్రేపింగ్ స్టైల్స్ అందుబాటులో ఉన్నాయి. నా దగ్గరకు వచ్చే వారిలో అత్యధికులు నూపుర్స్టైల్ అడుగుతారు’ అని చెప్పారు శారీడ్రేపింగ్కు పేరొందిన సికింద్రాబాద్ వాసి జానీనులియా. నగరం విభిన్న సంస్కృతుల నిలయం కావడం, విభిన్న ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడికి వచ్చి నివసిస్తుండడం, ఈ కుటుంబాల మధ్య రాకపోకలు పెరగడంతో.. ఇతర ప్రాంతాల కట్టు బొట్టూ నేర్చుకోవాల్సి రావడం తప్పడం లేదు. ఆ క్రమంలోనే మార్వాడి, గుజరాతీ, బెంగాలీ.. తదితర చీరకట్టు శైలిని స్థానిక మహిళలు అనుసరిస్తుండడం సాధారణంగా మారింది. విభిన్న శైలులను అనుసరించాలనుకునేవారికి స్టైల్‌ను బట్టి రూ.500 నుంచి రూ.2000 వరకూ రుసుముతో సేవలు అందించేవారు సైతం పుట్టుకొచ్చేశారు. బ్యూటీ విత్ డిగ్నిటీ..‘రెగ్యులర్ డ్రెస్సులంటే మొహం మొత్తేస్తోంది. మా కంపెనీలో ఏ చిన్న వేడుకైనా అందరూ చీరలు కట్టుకునే వస్తాం. ప్రత్యేకంగా ట్రెడిషనల్ డే వంటివి క్రియేట్ చేసుకుని మరీ చీరలు కడుతున్నాం’ అంటోంది సాఫ్ట్వేర్ ఉద్యోగిని భవ్యశ్రీ. మోడ్రన్ డ్రెస్సుల దగ్గర ఆచితూచి ఖర్చుపెట్టే అమ్మాయిలు చీర విషయానికి వచ్చేసరికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారని నగరానికి చెందిన డిజైనర్ అవని చెబుతున్నారు. హఫ్ శారికే డిమాండ్..ఎన్ని రకాలు వచ్చినా నగరంలో అత్యధికుల్ని ఆకర్షిస్తున్నది మాత్రం హాఫ్‘శారీ’.. అంటే లంగా వోణి కాదు. లంగా వోణి లాంటి చీర అని అర్థం. అచ్చం హాఫ్శారీలా కనబడే శారీలు నగర మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. వయసు తక్కువలా అనిపించేలా ఉండే వీటి పట్ల నగర మహిళలు ఆదరణ చూపుతున్నారని కలర్జ్ బ్యూటీ స్టూడియో నిర్వాహకురాలు శ్రావణీరెడ్డి చెప్పారు. అలాగే ధోతీ స్టైల్, గోచీ స్టైల్, లెహంగా స్టైల్.. ఇలా అనేక రకాల స్టైల్స్ నగరంలో సందడి చేస్తున్నాయి. ప్రొఫెషనల్ స్టెప్స్.. స్టైల్ టిప్స్విభిన్న రంగాల్లో ఉంటున్నవారు అందుకు తగ్గట్టుగా ఉండేందుకు చీరకట్టు కూడా ప్రత్యేకంగా ఉండేలా డిజైనర్లు సూచిస్తున్నారు. చీర మీద కొంగును సింగిల్స్టెప్ వేసే స్టైల్‌ని టీచర్ వృత్తిలో ఉన్నవారు ఎంచుకోవచ్చు. ఇదే స్టైల్లో పల్లు కొసని కుడి చేత్తో పట్టుకోవడం వల్ల డిజైన్ కొట్టొచి్చనట్టు కనబడుతుంది. హుందాగా కనిపించాలనుకున్నవారు డబుల్స్టెప్ను అనుసరించవచ్చు. ఇక అత్యధికులకు నప్పేది త్రీస్టెప్స్. పనులకు ఎలాంటి అడ్డంకీ రాకూడదనుకునే ఉద్యోగినులు, గృహిణులు.. అందరికీ ఇది ఓకె. కాస్త స్పైసీగా కనపడాలనుకుంటే మాత్రం ఫోర్స్టెప్స్, ఫైవ్స్టెప్స్.. ఇలా ఎంచుకోవాలి. పట్టు చీరలకు తప్పనిసరిగా ఆరు స్టెప్స్ ఉండాల్సిందే. అప్పుడే దానికి ఆకర్షణ. స్కూల్ డేస్ నుంచే కడుతున్నా.. శారీ కట్టడం స్కూల్ డేస్ నుంచే అలవాటు. అందుకే చీరకట్టు నాకు చాలా కంఫర్ట్బుల్ అనిపిస్తుంది. ఒక యాంకర్‌గా రకరకాల ప్రోగ్రామ్స్ కోసం రకరకాలుగా రెడీ అవుతుంటాను. అన్ని రకాల స్టైల్స్ ధరించడం అవసరం కూడా. అయితే నా మనసు ఎప్పటికీ చీరమీదే ఉంటుంది. రకరకాల బ్లౌజ్‌లు, జ్యువెలరీస్ జత చేసి వెరైటీ స్టైల్స్‌లో డ్రేప్ చేసుకోవచ్చు.. – మంజూష, యాంకర్ -
కళ్ల జోడు.. స్టైల్ చూడు
కళ్ల జోడు కొత్త మోడల్స్ అనునిత్యం నయా పుంతలు తొక్కుతున్నాయి. నలుగురిలో భిన్నంగా ఉండాలనుకునే యువత మార్కెట్లోకి కొత్త మోడల్ వచి్చందంటే దాన్ని మనం ధరించాల్సిందే అంటున్నారు. ఈ తరహా ట్రెండ్ ప్రధానంగా కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, సాఫ్ట్వేర్, ఇతర ఉద్యోగుల్లో కనిపిస్తోంది. ఇందులో అత్యధిక శాతం మంది మాత్రం ఎప్పటికప్పుడు తమ కళ్లజోడు మారుస్తున్నారు. నగరవాసులు కొత్త మోడల్స్‌కు మారిపోతున్నారు. అందం, అభినయానికి అనుగుణంగా తమ కళ్లజోడు ఉండేలా సెట్ చేసుకుంటున్నారు.కళ్ల జోడు వల్ల చాలా లాభాలు ఉన్నాయి. నగరంలో ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం సమస్య వేధిస్తోంది. మోటారు సైకిల్‌పై, ప్రజారవాణా వ్యవస్థలో ప్రయాణాలు చేసేవారికి గాలిలోని ధూళి కణాలు కంట్లో పడి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇటువంటి సమయంలో కంటికి రక్షణ, స్టైలిష్ కళ్ల జోడు కోసం నిత్యం వివిధ వెబ్సైట్లలో, ఆప్టికల్ దుఖాణాల్లో కొత్త మోడల్స్‌పై ఆరా తీస్తున్నారు. ఎండలో ప్రయాణాలు చేసేవారు ప్రమాదకరమైన సూర్య కిరణాల నుంచి రక్షణ కల్పించడం కోసం, రాత్రి వేళ డ్రైవింగ్ చేసే సమయంలో ఎదుటి వాహనాల వెలుతురు ప్రభావం మన కళ్లపై పడకుండా ఉండేందుకు యాంటీ గ్లేర్ గ్లాసెస్, కంప్యూటర్ ముందు కూర్చుని ఉద్యోగాలు చేసే యువత కంప్యూటర్ కిరణాల నుంచి రక్షణ కసం బ్లూలైట్ యాంటీ గ్లేర్ వంటి వివిధ రకాల ప్రత్యేకతలున్న గ్లాసెస్ వినియోగిస్తున్నారు. మరికొంత మంది మాత్రం కంటి సమస్యలతో కళ్లజోడు వినియోగిస్తున్నారు. చూపు మందగించడం, రీడింగ్ గ్లాసెస్, కళ్లు ఒత్తిడికి గురైనప్పుడు వచ్చే తలనొప్పిని తగ్గించడం కోసం కొన్ని రకాల లెన్స్ అందుబాటులో ఉన్నాయి.బ్రాండ్స్‌పై మోజు.. ప్రపంచంలో పేరెన్నిక కలిగిన పలు బ్రాండెడ్ గాగుల్స్ కంపెనీలు తమ ఉత్పత్తులను హైదరాబాద్ నగర ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నాయి. అనునిత్యం కొత్త కొత్త మోడల్స్, ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కేపీహెచ్‌బీ, హైటెక్‌సిటీ, రాయదుర్గం, శేరిలింగంపల్లి తదతర ప్రాంతాల్లో బ్రాండెడ్ గాగుల్స్ దుకాణాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అచ్చం అలాగే కనిపించే లోకల్ బ్రాండ్స్ సైతం లభిస్తున్నాయి. ఈ రెండింటి మధ్య ధరల్లో మాత్రం భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. చిన్న చిన్న దుకాణాల్లో గాగుల్స్ అడిగితే రూ.100కే లభిస్తున్నాయి. అదే మల్టీనేషన్ కంపెనీ బ్రాండ్ అయితే కనీసం రూ.5 వేలు ఆపైనే ఉంటాయి. వీటి మన్నికలోనూ స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోందని కొనుగోలుదారులు పేర్కొంటున్నారు.సమస్య ఎక్కడ మొదలవుతోంది? నగరంలో యువత జీవన శైలి మారిపోతోంది. రాత్రి వేళ ఆలస్యంగా నిద్రపోవడం, మొబైల్ ఫోన్ స్క్రీన్ ఎక్కువ సమయం చూడటం, ఉద్యోగం, వ్యాపార లావాదేవీల్లో అవసరాల రీత్యా కంప్యూటర్, ల్యాప్‌టాప్, ట్యాబ్స్‌పై పనిచేయాల్సి రావడంతో కంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో చాలామందిలో చూపు మందగించడం, కళ్లు ఎక్కువగా ఒత్తిడిగి గురై తలనొప్పి రావడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లల్లో సైతం ఈ తరహా లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్న బాధితులు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.బ్రాండ్స్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి కాలుష్యం నుంచి కంటిని రక్షించుకోవడానికి గాగుల్స్ అవసరం. అయితే వాటిని నిపుణులైన వైద్యుల సూచనల మేరకు వినియోగిస్తే మంచిది. కంటి సమస్యలతో వచ్చేవారికి కళ్లజోడు రాయాల్సి వచి్చనప్పుడు కొత్త మోడల్స్ కావాలని కోరడం సహజంగా మారిపోయింది. కంటిపై ఒత్తిడి పెరగడం వల్ల దగ్గర, దూరం దృష్టి సమస్యలు, కళ్లు పొడిబారిపోవడం, తలనొప్పి రావడం, ఇంట్రాక్రీనియల్ ప్రెజర్ పెరగడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. బయటకు వెళ్లే సమయంలో సన్ ప్రొటెక్షన్, కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు నిపుణుల ఆదేశానుసారంగా లెన్స్ గ్లాసెస్ వాడుకోవాలి. ప్రతి 45 నిమిషాలకు ఒక 10 నిమిషాలైనా కంప్యూటర్, మొబైల్‌కు దూరంగా ఉండాలి. ఎక్కువ సార్లు కనురెప్పలను బ్లింక్ చేయాలి. కంట్లో ధూళి కణాలు పడితే నల్లగుడ్డుకు ప్రమాదం వాటిల్లుతుంది. కళ్లజోడు వినియోగించడంతో కంటి లైఫ్ టైం పెంచుకోవచ్చు. బ్రాండ్ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ఏదో ఒకటి కళ్లజోడే కదా చాలు అనుకుంటేనే ఇబ్బంది. – డా.పి.మురళీధర్ రావు, వైరియో రెటినల్ సర్జన్, మ్యాక్స్ విజన్, సోమాజిగూడ -
శీతల ప్రయాణం..
కొద్ది రోజుల క్రితం సాధారణ స్థాయిలో ఉన్న విమానయాన ధరలు అమాంతం రెట్టింపయ్యాయి. ముఖ్యంగా డిసెంబర్ 15 నుంచి 31 తేదీల్లో గతంతో పోల్చితే రెండింతలు, మూడింతల మేర పెరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నగర వాసుల్లో ప్రయాణాల పట్ల ఉన్న ఆసక్తే దీనికి కారణం. కాగా ప్రస్తుత నెలల్లో వరుసగా క్రిస్మస్, ఇయర్ ఎండ్, న్యూఇయర్, సంక్రాంతి వంటి పండుగల నేపథ్యంలో నగరవాసులకు భారీగా సెలవులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ట్రావెలింగ్ మంత్‌గా డిసెంబర్‌ను ఎంచుకుంటున్నారు. ప్రతి యేడాదీ డిసెంబర్ నెలలో ఏదో ఒక టూర్ వేయడం అందివచ్చిన సెలవులను వినియోగించుకోవడం నగర వాసులకు అలవాటే. ఇందు కోసం ముందస్తుగానే నగరంలోని ప్రయాణ ప్రేమికులు వారి ప్రయాణ గమ్యస్థానాలకు మార్గాలను సుగమం చేసుకున్నారు. యువత, టెకీలు ట్రావెలింగ్ ప్లాన్స్‌లో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా డొమెస్టిక్ ప్రయాణాలు ఇప్పటికే సోల్డ్ ఔట్ బోర్డ్పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో.కొందరు ఐటీ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ టెకీలు యేడాదంతా వారి సెలవులను వినియోగించకుండా తమ తమ విధులు నిర్వహిస్తుంటారు. దీంతో పాటు మరికొందరు టెకీలకు, కాల్ ఇంటర్నేషనల్ కాల్ సెంటర్ ఉద్యోగులకూ డిసెంబర్ నెలలో భారీగా సెలవులు ఉంటాయి. దీంతో ఆయా సెలవుదినాలను డిసెంబర్ డెస్టినేషన్ కోసమే వినియోగిస్తుంటారు.. నగరంలో విస్తరిస్తున్న ఐటీ ట్రెండ్‌తో గత కొన్నేళ్లుగా ట్రావెలింగ్ రంగంలోనూ భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు మిగిలిపోయిన సెలవులు, మరోవైపు నగరంలోని విదేశాలకు చెందిన గ్లోబల్ కంపెనీల క్రిస్మస్ లీవ్స్ దీనికి ప్రామాణికం అవుతున్నాయి.వీటిని ఎంజాయ్ చేయడానికి ఇప్పటికే యుద్ధప్రాతిపధికన టీమ్ హెడ్లకు మెయిల్స్ పెట్టేయడం, ట్రావెల్ ఏజెన్సీలను సంప్రదించడం, పర్యాటక ప్రాంతాల్లో విడిది, విందు, వినోదం తదితరాలకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఇది కొత్తేం కాకపోయినప్పటికీ.. ఈ కల్చర్ ఈ ఏడాది మరింత పుంజుకోవడం విశేషం. సాధారణ రోజుల్లో 4 నేల నుంచి 9 వేల వరకూ ఉండే దేశీయ విమాన చార్జీలు ప్రస్తుతం 14 నుంచి 20 వేలకు పైగా కొనసాగడం ఈ సంస్కృతి ప్రభావానికి నిదర్శనం. కన్యాకుమారి, కేరళ మొదలు.. మనాలి, డార్జిలింగ్ వంటి శీతల ప్రదేశాలకు బయలు దేరుతున్నారు. మరికొందరైతే స్విస్ దేశాలు, సింగపూర్, మలేషియా, బ్యాంకాక్ వంటి విదేశాలకు బుకింగ్‌లు మొదలెట్టారు. ఏడాదికి వీడ్కోలు.. పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పడం, నూతన ఏడాదికి నూతనోత్సాహాన్ని పొందడం కోసం కూడా ట్రావెలింగ్ డెస్టినేషన్లనే ఎంచుకుంటున్నారు ఈ తరం యువత. ఇయర్ ఎండ్ వేడుకలకైతే గోవాలాంటి మ్యూజికల్ నైట్స్ కోసం పరితపిస్తున్నారు నగర వాసులు. ఇందులో భాగంగానే హైదరాబాద్ నుంచి నేరుగా గోవాకు వేసిన కొత్త రైలు సేవలు పొందడానికి ముందస్తుగానే బెర్త్ కరారు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆలస్యంగా బుక్ చేస్తే ఈ చార్జీలు మరింత పెరిగిపోతాయని ఇప్పటికే చాలా టూర్స్ ప్లానింగ్, బుకింగ్ పూర్తయ్యాయని గూగుల్ చెబుతుంది. ఈ వేదికల్లో అవకాశం లేకపోతే ప్రైవేటు ట్రావెల్స్‌ను సైతం ఆశ్రయిస్తూ, సెల్ఫ్ డ్రైవింగ్‌కు సై అంటున్నారు. ఈ నేపథ్యంలో నగరంతో పాటు దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాల్లోని ట్రావెలింగ్ ఏజెన్సీలు, ఈవెంట్ ఆర్గనైజర్లు ముందస్తు పండగలు చేసుకుంటున్నారు.గోవా పార్టీలకు... యేడాది చివరి వేడుకలకు నగర యువత భారీగా ఆసక్తి చూపిస్తోంది. వీరిలో అత్యధికులు వెళ్లే ఏకైక డెస్టినేషన్ మాత్రం గోవానే. ఎందుకంటే..నగర కల్చర్‌లో భాగంగా పంబ్ పారీ్టలు, లైవ్ కాన్సర్ట్, డీజే మ్యూజిక్ వంటి ట్రెండ్స్‌ని ఆస్వాదించే వారు, ప్రకృతిని కోరుకునే వారు వేరు వేరుగా ఈస్ట్ గోవా, నార్త్ గోవాలను ఎంచుకుంటారు. తమకు అనుకూలమైన, అనువైన స్పాట్స్‌ను ముందస్తుగానే ఎంచుకుని అందుకు అనుగునంగా ప్రయాణాలకు టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. ఈ లిస్ట్‌లో వైజాగ్, అరకు వ్యాలీ సైతం టాప్‌లోనే ఉన్నాయి.ఎతైన ప్రదేశాలకు.. ఇప్పటికే ఈ సీజన్లో దక్షిణాది రాష్ట్రాల్లోని కూర్గ్, ఊటీ, మున్నార్, వయనరాడ్, కొడైకెనాల్, ఇడుక్కి, యరక్కాడ్, కున్నూర్ వంటి హిల్ స్టేషన్స్‌కి భారీగా టికెట్లు బుక్ అయ్యాయని లోకల్ ట్రావెల్ ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నామాట. దీంతోపాటు ఈ మధ్య కాలంలో మనాలి, డార్జిలింగ్, సిమ్లా, షిల్లాంగ్ వంటి చల్లటి ప్రకృతి ప్రాంతాలను ఆస్వాదించడానికి ఉవి్వళ్లూరుతున్నారు. ఈ ట్రిప్స్‌లో భాగంగానే నార్త్‌కు ఎక్కువగా ప్రయాణమవుతున్నారు. అంతేకాకుండా సాంస్కృతిక వైవిధ్యాన్ని తిలకించడానికి కేరళ, ఊటీ వంటి ప్రదేశాలను వారి గమ్యస్థానాలుగా చేర్చుకున్నారు. -
భాగ్యనగర్.. బిస్కెట్ కా ఘర్..
హైదరాబాద్ అంటే బిర్యానీ.. బిర్యానీ.. అంటే హైదరాబాద్.. ఈ రెండింటికీ మధ్య విడదీయరాని బంధం అలాంటిది. ఈ విషయం భాగ్యనగర వాసులతోపాటు ప్రపంచమంతా తెలిసిందే.. ఎందుకంటే దశాబ్దాల తరబడి బిర్యానీకి హైదరాబాద్ నగరం కేరాఫ్ అన్నట్టుగా మారింది. అయితే మన చవులూరించే చరిత్ర కేవలం బిర్యానీ మాత్రమే కాదు.. దీంతోపాటు పలు రకాల బిస్కెట్లకు కూడా గుర్తింపు ఉందని అంటున్నారు నగరానికి చెందిన బేకరీ నిర్వాహకులు. ఈ బిస్కెట్స్‌లో ఇరానీ చాయ్‌తో జోడీ కట్టేవి కొన్నయితే.. క్రిస్మస్ లాంటి పండుగల సందర్భంగా ఇచ్చిపుచ్చుకునే గిఫ్ట్ ప్యాకెట్స్గా మారేవి మరికొన్ని. అలాంటి కొన్నింటిపైనే ఈ కథనం.. నాటి నిజామ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాస్త సాల్ట్, కాస్త స్వీట్ కలగలిసిన రుచికరమైన ఈవెనింగ్ స్నాక్స్ కోసం చేసిన అన్వేషణే ఉస్మానియా బిస్కెట్‌కి ఊపిరిపోసిందని చరిత్ర చెబుతోంది. ఆయనే నిర్మించిన ఉస్మానియా ఆస్పత్రిలో రోగులకు అల్పాహారంగా కూడా ఇది వినియోగించారని చరిత్రకారులు చెబుతుంటారు. దేశంలోనే రాజ ప్రాసాదం నుంచి వచి్చన రాయల్ గుర్తింపు కలిగిన తొలి బిస్కెట్‌గా దీన్ని చెప్పొచ్చు. వెన్న, పంచదార, కస్టర్డ్ పౌడర్, సోడా, యాలకుల పొడి, కుంకుమ పువ్వు, పాల మేళవింపుతో ఈ బిస్కెట్ అప్పుడు రోగుల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తయారైందట. తొలి రాయల్ బిస్కెట్.. కాగా ఈ రాయల్ బిస్కెట్‌ని నగర మార్కెట్‌కి పరిచయం చేసింది మాత్రం సుభాన్ బేకరీ. ఉస్మానియా బిస్కెట్ పేరుతో మార్కెట్లోకి విడుదలైన ఈ బిస్కెట్‌ను ఒక కప్పు ఇరానీ చాయ్‌తో ఆస్వాదించడం అప్పుడు.. ఇప్పుడూ.. ఎప్పుడూ హైదరాబాదీలకు నిత్యకృత్యం. హిస్టారికల్ టూటీ ఫ్రూటీ.. పురాతన హైదరాబాదీ బిస్కెట్‌గా గుర్తింపు పొందిన మరొకటి ఫ్రూట్ బిస్కెట్. ఇది రోజువారీ వినియోగం కన్నా.. ఇచ్చి పుచ్చుకునే బహుమతిగా టూటీ ఫ్రూటీ ప్యాక్ బాగా పేరొందింది. నగరవాసులు విదేశీ పర్యటనకు వెళ్లడానికి ముందుగా కరాచీ బేకరీ నుంచి పుట్టిన ఫ్రూట్ బిస్కెట్‌ను ప్యాక్ చేయించుకోవడం చాలా మందికి అలవాటు.వెనీలా రుచుల చంద్రవంక.. చంద్రవంక ఆకారంతో ఉంటుంది కాబట్టి ఈ బిస్కెట్‌కి ఆ పేరు పెట్టారు. ఇది తేలికపాటి తీపితో మధ్యకు విరిగిన ఆకృతి కలిగి ఉంటుంది. ఈ బిస్కెట్లను తరచూ వెనిలా లేదా పాలతో బేక్ చేసి, వాటికి సున్నితమైన, లలితంగా ఉండే రుచిని అందజేస్తారు. వీటినే టూటీ ఫ్రూటీ బిస్కెట్స్ అని కూడా అంటారు. వీటి ధరలు సుమారు కిలో రూ.400 నుంచి రూ.500 మధ్యలో ఉన్నాయి. చాయ్‌తో.. ఫైన్ బిస్కెట్.. నగరంలోని బేకరీలలో దీర్ఘకాల వారసత్వం కలిగిన మరొక హైదరాబాదీ ట్రీట్‌గా దీన్ని చెప్పొచ్చు. దీనిని పలుచని పొరలుగా వేయడం అనేది కొంత శ్రమతో కూడిన ప్రక్రియగా తయారీదారులు చెబుతారు. ఈ బిస్కట్లో పంచదార పాకం, కొద్దిగా మంచిగా పెళుసైన క్రస్ట్ ఉంటుంది. ఇది ఇరానీ చాయ్‌తో మరో చక్కని కాంబినేషన్. చాయ్‌లో ముంచినప్పుడు మెత్తగా మారి దానికి సరికొత్త తీపిని జోడిస్తుంది. ఇది కిలో రూ.300 నుంచి ఆపైన అందుబాటులో ఉన్నాయి. రుచికి దాసోహం ‘కారా’.. ఇది నగర టీ సంస్కృతి ప్రత్యేకతకు దోహదం చేసే మరో రుచికరమైన బిస్కెట్ ఖారా.æ వీటిని పిండి, వెన్నతో పాటు మరికొన్ని సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో తయారు చేస్తారు. తరచుగా జీలకర్ర లేదా నువ్వులు కూడా ఈ మేళవింపులో చోటు చేసుకుంటాయి. ఇవి చాయ్ రుచికి మసాలాని జోడించి వైవిధ్యభరితమైన ఆస్వాదనను అందిస్తాయి. ఇది కిలో రూ.350 నుంచి రూ.400 మధ్య అందుబాటులో లభిస్తుంది.ఛాయ్ అండ్ ‘టై’.. సూపర్ భాయ్.. ప్రత్యేకమైన విల్లు–టై ఆకృతి ద్వారా ప్రసిద్ధి చెందిన ఈ బిస్కెట్లు కొంచెం గట్టిగా ఉంటాయి. ఇవి ఒక కప్పు ఇరానీ చాయ్‌కి అద్భుతమైన కాంబినేషన్‌గా చెప్పొచ్చు. వీటి తేలికైన, పొరలతో కూడిన రుచి తియ్యటి బిస్కెట్ల నుంచి వేరు చేస్తుంది. కిలో రూ.300 నుంచి రూ.350 వరకూ ఉంటుంది.బిస్కెట్ల చరిత్ర అ‘పూర్వం’.. బిర్యానీ కన్నా అతి పురాతన చరిత్ర కలిగిన బిస్కెట్లు మన నగరానికి ఉన్నాయి. అయితే చాలా మందికి వాటి విశేషాలు తెలియవు. బిస్కెట్స్‌లో మేం పరిచయం చేసిన ఉస్మానియా బిస్కెట్ విదేశాలకు సైతం ఎగుమతి అవుతుంది. చాంద్ బిస్కెట్, టై బిస్కెట్ వంటివి ఇప్పటికీ పలువురు రాజకీయ ప్రముఖులు సైతం రెగ్యులర్‌గా ఆర్డర్ చేస్తుంటారు. ముఖ్యంగా వింటర్ సీజన్లో ఛాయ్‌కి డిమాండ్ ఎక్కువ.. దీంతో పాటే ఖారా వంటి బిస్కెట్స్‌కి డిమాండ్ పెరుగుతుంది. – సయ్యద్ ఇర్ఫాన్, సుభాన్ బేకరీ టేస్ట్ ఎంజాయ్ చేయాలంటే.. ఈ బిస్కెట్ల ఒరిజినల్ టేస్ట్‌ని ఎంజాయ్ చేయాలంటే కొంత ఎంక్వయిరీ చేసుకుని వెళ్లాల్సిందే. ఎందుకంటే.. కొన్ని పాత బేకరీలు మాత్రమే వాటిని పాత పద్ధతిలో తయారు చేస్తున్నాయి. ‘1951లో మా తాత మొహమ్మద్ యాసీన్ ఖాన్ బేకరీని ప్రారంభించినప్పుడు, జనాదరణ పరంగా అగ్రస్థానంలో ఉస్మానియా బిస్కెట్ ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో ఖారా బిస్కెట్, చాంద్ బిస్కెట్, ఫైన్ బిస్కెట్, టై బిస్కెట్ ఉండేవి. ఇవి అప్పట్లో ఎంతగా ప్రాచుర్యం పొందాయంటే, అవి లేకుండా అల్పాహారం, టీ సమయం మాత్రమే కాదు, పెళ్లి విందులు సైతం ఉండేవి కావు. ఇప్పటికీ వీటిని రెగ్యులర్‌గా వినియోగించేవాళ్ల వల్ల తగినంత డిమాండ్ ఉంది’ అని రోజ్ బేకరీ యజమాని ముజాఫర్ ఖాన్ అంటున్నారు. కాగా సోషల్ మీడియా ట్రెండ్స్‌తో మమేకమవుతున్న నేటి యువతకు హైదరాబాద్ సంప్రదాయ బిస్కెట్ల గురించి తెలియజేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు నగరంలోని పలువురు బేకరీల నిర్వాహకులు. -
భలేవాడివి బాసు!
ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతత చాలా అవసరం. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం బాగుంటేనే ప్రతిరోజూ ఆనందం ఉంటుంది. అసలే దూరాభారం ప్రయాణాలు, ట్రాఫిక్ చిక్కులు, టార్గెట్లు వంటి కారణాలతో అలిసిపోవడం సహజం.. అయితే మన రోజువారీ ఆరోగ్య పరిస్థితిని ఇలాంటి అనేక అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. అన్నింటి కన్నా మనపై ఉన్న బాస్ ప్రవర్తనను బట్టే మన మానసిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని తాజా పరిశోధనల్లో తేలింది. మనం పనిచేసే ప్రాంతం బాగుంటే మానసిక ప్రశాంతత ఉంటుందని మానసిక నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే రోజుకు కనీసం 9 గంటల పాటు ఆఫీస్‌లోనే గడపాల్సి వస్తుంది కాబట్టి.. అక్కడి వాతావరణం బాగుంటేనే మిగతా రోజంతా సులువుగా గడిచిపోతుందని పేర్కొంటున్నారు. పై అధికారి శాడిస్టు అయితే మానసిక ఆరోగ్యంతో పాటు మన పనితనం, భవిష్యత్తు, ఇతరులతో సంబంధాలు కూడా దెబ్బతింటాయని చెబుతున్నారు నిపుణులు. దీర్ఘకాలిక ప్రభావం.. ఆఫీస్‌లో బాస్ ప్రవర్తన సరిగ్గా లేకపోతే.. అది ఉద్యోగిపై స్వల్పకాలికంగా కాకుండా దీర్ఘకాలికంగా ప్రభావం చూపుతుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడూ నెగెటివిటీతో బాస్ మాట్లాడుతుంటే ఉద్యోగుల సొంత తెలివితేటలపైనే అనుమానం వస్తుంటుంది. వారిని వారే తక్కువ అంచనా వేసుకోవడంతో పనితీరు కూడా మందగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. చివరకు ఉద్యోగంపై విరక్తి కలిగి రాజీనామా చేసేంత వరకూ వెళ్తుందని పేర్కొంటున్నారు. మోటివేషన్ ఉండాల్సిందే.. పని చేసే ప్రదేశంతో నెగెటివ్ వాతావరణం కన్నా మోటివేషన్ ఉంటే ఉద్యోగులు క్రియాశీలకంగా పనిచేస్తుంటారని, చేసిన పనికి మెచ్చుకోలు లేకపోయినా కనీసం కించపరిచేలా మాట్లాడటం, అందరి ముందు మందలించడం వంటి పనులు చేస్తే మానసిక వేదనకు గురై.. పని తీరు మందగిస్తుందని పేర్కొంటున్నారు. పనిచేసే ప్రదేశంలో ఆరోగ్యకరమైన పోటీతత్వం, స్వతంత్రత, చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు ఉంటే ఉద్యోగులకు మోటివేషన్ వస్తుందని పేర్కొంటున్నారు. అప్పుడు పనితీరులో కూడా మెరుగుదల ఉంటుందని చెబుతున్నారు.ఎలా బయటపడాలి..?కర్కశమైన బాస్ కింద పనిచేసిన వారి మానసిక స్థితిని మళ్లీ తిరిగి పొందొచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పనిచేయడం కన్నా అక్కడి నుంచి వెళ్లిపోయి వేరే ఉద్యోగం వెతుక్కోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇక, పాత ఆఫీస్ జ్ఞాపకాలను మర్చిపోయి.. ఆత్మన్యూనత భావం నుంచి బయటపడటం కాస్త కష్టమైనా కూడా సాధించొచ్చని చెబుతున్నారు. మన శక్తి సామర్థ్యాలను గుర్తు చేసుకుని, మనం గతంలో సాధించిన విజయాలను నెమరువేసుకుంటూ ఉండాలని పేర్కొంటున్నారు. మన మంచి కోరే సహోద్యోగులతో మనం చేసిన పనిపై ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ ఉండాలని, చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని పూర్తి చేస్తుంటే మళ్లీ మనలో కాని్ఫడెన్స్ పెరుగుతుందంటున్నారు. కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ఆత్మ స్థైర్యం సాధించాలని పేర్కొంటున్నారు. ఆఫీస్‌లో మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రొఫెషనల్‌గా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.వ్యక్తిగత సంబంధాలపై ప్రభావం.. ‘ఎక్కువ కాలం ఇలాంటి వాతావరణంలో పనిచేయడంతో నేర్చుకునే తత్వం తగ్గిపోతుందని, కొత్త విషయాలు రూపకల్పన చేయడం, సృజనాత్మకత పెంచేందుకు దోహదపడే డోపమైన్ తగ్గుముఖం పట్టి.. కారి్టసాల్ స్థాయి పెరిగుతుందని ఢిల్లీకి చెందిన సైకోథెరపిస్టు డాక్టర్ చాందినీ చెబుతున్నారు. అద్భుతంగా ఎలా పని చేయాలా..? అని ఆలోచించడం మానేసి.. తన మీదికి రాకుండా ఏం చేయాలనే దానిపైనే దృష్టి సారిస్తారని ఆమె వివరించారు. ఆఫీస్ వాతావరణం చాలాకాలం పాటు సరిగ్గా లేకుంటే ఉద్యోగులకు వేరే వారితో సంబంధాలు దెబ్బతింటాయని, అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయని మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో మత్తు పదార్థాలు తీసుకునే అలవాటు చేసుకుంటారని, అలాగే శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.లీడర్షిప్ ముఖ్యం.. ఆఫీస్ వాతావరణం చెడిపోడానికి కారణాల్లో ప్రధానమైనది లీడర్షిప్ లేకపోవడం. బాస్ సరిగ్గా లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతాయని చెబుతున్నారు. బాస్‌కు నాయకత్వ లక్షణాలు లేకపోతే తాను చెప్పాలనుకున్న విషయాలు ఉద్యోగులకు వ్యక్తీకరించలేరు. దీంతో ఉద్యోగులకు ఉన్న సమస్యలు నేరుగా చెప్పుకోలేరు. పక్షపాత వైఖరి, అసాధ్యమైన టార్గెట్లు పెట్టడం కూడా వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని చెబుతున్నారు. ఒత్తిడితో పాటు ఆందోళన పెరుగుతుందని పేర్కొంటున్నారు. తద్వారా ఆఫీస్ వాతావరణం పూర్తిగా చెడిపోతుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో ఇటీవల ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో తాజా ఈ అధ్యయనం ప్రాధాన్యత సంతరించుకుంది.అనేక ఆరోగ్య సమస్యలు.. పనిచేసే ప్రదేశంలో బాస్ సపోర్టు ఉంటే ఉద్యోగులు వ్యక్తిగతంగా ఎదుగుదలకు ఉపయోగపడటమే కాకుండా సంస్థ పనితీరు కూడా బాగుంటుంది. ఏం చేసినా తప్పులు వెతకడం, విమర్శలు చేస్తుండటం వల్ల ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆ ఉద్యోగాన్ని వదిలి వెళ్లలేక, అక్కడే భరించలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. ఈ పరిస్థితులను ఎవరికీ చెప్పుకోలేక నిద్రలేమి, హృద్రోగ సమస్యలు తలెత్తుతాయి. బాస్ ప్రవర్తనతో ఎలాంటి సమస్యలు వస్తున్నాయో కుదిరితే నేరుగా చెప్పి సమస్యలను పరిష్కరించుకోవాలి. నచ్చిన వారితో కాసేపు ప్రశాతంగా గడిపినా, ఫోన్లో మాట్లాడినా మనసులోని బరువు తగ్గి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. – డాక్టర్ పి.హరీశ్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ -
కాన్వాస్‌పై.. సిటీ లైఫ్వ్..
నగరవ్యాప్తంగా అర్బన్ స్కెచ్చర్ల ఈవెంట్లు లైవ్ స్కెచ్‌లతో జీవనశైలికి చిత్రరూపం హబ్సిగూడలోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తలకు గత నవంబరు 9న ఓ వైవిధ్యభరిత అనుభవం ఎదురైంది.. తమ ప్రాంగణంలోకి వచి్చన కొందరు ఔత్సాహిక చిత్రకారులు తమ ల్యాబ్స్ సహా పరిసరాలను బొమ్మలుగా గీస్తుంటే ఆసక్తిగా గమనించడం అంతకు ముందెన్నడూ ఎరుగని అనుభూతి. ‘ఇది మా 298వ స్కెచ్ంగ్ ట్రిప్. శాస్త్రవేత్తల పని చూసినప్పుడు ఎంతో అబ్బురం అనిపించింది. ఆ పని, పరిసరాలు మా కళకు స్ఫూర్తిని అందించాయి’ అంటూ అర్బన్ స్కెచ్చర్స్ ప్రాంతీయ అడ్మిన్స్లో ఒకరైన సయ్యద్ జీషన్ అహమద్ చెప్పారు. నగరాన్నే తమ కాన్వాస్‌గా మార్చుకుని వారాంతాల్లో లైవ్స్కెచ్ డ్రైవ్ నిర్వహిస్తున్న అర్బన్ స్కెచ్చర్స్ ఈ నెలలో 300వ మైలురాయిని చేరుకుంది. ఈ అరుదైన సందర్భాన్ని వీరు నెల రోజుల వేడుకగా మార్చారు. ‘ఒక రోజులో ఒకే ఈవెంట్ జరుపుకునే బదులు, నెల అంతటా నిర్వహించాలని అనుకున్నాం’ అని అర్బన్ స్కెచర్స్ సహ వ్యవస్థాపకుడు సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ ఫరాజ్ ఫర్షోరి చెప్పారు. స్కెచ్ వేద్దాం రా.. బొమ్మలు వేద్దాం రా.. అంటూ ఆహా్వనించే ఈ అర్బన్ స్కెచ్చర్స్ అనే గ్రూప్ అమెరికాలో గాబ్రియేల్ క్యాంపెనారియో అనే వ్యక్తి వాషింగ్టన్లో ప్రారంభించిన ఒక అంతర్జాతీయ వేదిక. నగరాల్లో తమకు నచి్చన ప్రదేశాన్ని ఎంచుకుని లైవ్ స్కెచ్ వేసే ఔత్సాహిక చిత్రకారుల నెలవు. నగరంలో ఈ గ్రూపు నవంబర్ 2017లో ట్యాంక్ బండ్‌లోని బోట్ క్లబ్‌ను స్కెచ్ చేయడంతో దాని మొదటి ఈవెంట్ నిర్వహించింది. అప్పటి నుంచి వివిధ ప్రదేశాల్లో వారానికో రెండు గంటల సెషన్ చొప్పున దాదాపు 30–60 మంది సభ్యులు నగర విశేషాలను కాగితంపై బంధిస్తున్నారు. వీరంతా బొమ్మలు గీశాక వాటిని ఆన్లైన్లో పోస్ట్ చేస్తారు. అలా వీరి అభిరుచి వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను ఒకచోట చేర్చింది. ‘మాలో చాలా మంది ప్రొఫెషనల్స్ కాదు, దీనిని వారాంతపు అభిరుచిగా కొనసాగిస్తున్నవారు మాత్రమే’ అని ఫరాజ్ చెప్పారు. అర్బన్ స్కెచ్చర్స్కు చెందిన జీషన్ అహ్మద్ మాట్లాడుతూ.. ‘ఇషాక్, ఫరాజ్ ఫర్షోరీ ఆధ్వర్యంలో హైదరాబాద్ చాప్టర్ ఒక ఐదుగురు మాత్రమే హాజరైన చిన్న స్కెచ్ మీట్‌తో ప్రారంభమైంది, ఇప్పుడు 7–70 సంవత్సరాల వయసు గల ఎందరో సభ్యులకు విస్తరించింది’ అన్నారు. ‘ఇది కళ ద్వారా హైదరాబాద్ ఆత్మను సంగ్రహించే’ ప్రయత్నంగా ఫరాజ్ అభివరి్ణంచారు.కళాత్మక అనుబంధం.. ‘నా పరిసరాలను శ్రద్ధగా గమనించడానికి రికార్డ్ చేయడానికి ఇది గొప్ప మార్గం’ అన్నారు అమెరిగో ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ డీ హు. తాను 2021లో వాషింగ్టన్లో ఉన్నప్పుడు అర్బన్ స్కెచ్చర్స్లో చేరారు. ప్రస్తుతం నగరంలో నివసిస్తున్న డీ హు కేఫ్‌లు, డాక్టర్ అపాయింట్మెంట్లకు కూడా తన స్కెచ్‌బుక్ తీసుకెళతారు. తాను స్కెచ్ గీసిన ప్రతి ప్రదేశం తన జీవితంలో భాగమే. ఇది ఫొటో తీయడం కంటే గాఢంగా అనిపిస్తుంది’ అంటూ చెప్పారామె. గత వారం అర్బన్ స్కెచ్చర్స్ వర్క్‌షాప్‌లో భాగమైన నరేష్ మాట్లాడుతూ, ‘నేను కళ ద్వారా ప్రపంచ సౌందర్యాన్ని కనుగొనాలని అనుకుంటున్నాను’ అని అన్నారు. ‘నాలాంటి ఆసక్తిగల కొత్త వ్యక్తులను కలవడం ద్వారా కొందరు స్నేహితులను సంపాదించుకున్నాను. ఇది నా దినచర్యకు భిన్నం.. ప్రశాంతతని అందించే కళాత్మక థెరపీలా అనిపిస్తుంది’ అన్నారు సుజిత. తన 12 ఏళ్ల కూతురితో ఈ ఈవెంట్‌కు హాజరైన మరో గృహిణి మాట్లాడుతూ.. ‘నా బిడ్డ కేవలం సోషల్ మీడియాతో మమేకం అయిపోవడం నాకు ఇష్టం లేదు. తను స్క్రీన్లకు మించిన జ్ఞాపకాలను పొందాలని కోరుకుంటున్నాను’ అన్నారు.ట్రిపుల్ సెంచురీ.. ఈవెంట్ల సందడి.. ఈ నెల తమ ఈవెంట్ల సంఖ్య 300కి చేరుకున్న సందర్భంగా వీరు మరింత తరచూ స్కెచి్చంగ్ ట్రిప్స్ ఏర్పాటు చేస్తున్నారు. గత ఆదివారం అబిడ్స్‌లో ఈ గ్లోబల్ కమ్యూనిటీ ఆఫ్ ఆరి్టస్ట్స్ సభ్యులు సండే బుక్ ఫెయిర్, తాజ్ మహల్ హోటల్, మొజామ్జాహి మార్కెట్లను స్కెచ్‌గా వేశారు. గత డిసెంబర్ 8న బంజారాహిల్స్‌లో జరిగిన స్కెచ్చింగ్ సెషన్లో లామకాన్, జీవీకే మాల్, సిటీ సెంటర్ షాపింగ్ ఏరియా కవర్ చేశారు. ఇక డిసెంబర్ 22లోపు.. ఓల్డ్ సిటీలో బారా గల్లి, హుస్సేనీ ఆలం, చారి్మనార్.. వీరి మెనూలో ఉన్నాయి.ఎవరైనా సరే వెల్కమ్.. ‘సమూహంలో చేరడానికి నైపుణ్యం స్థాయి ఏదీ అడ్డంకి కాదు. ప్రొఫెషనల్ ఆరి్టస్ట్ కానవసరం లేదు. అయితే ఇందులో పాల్గొనేవారు తమ సొంత స్టేషనరీని తీసుకురావాలని, ఎంచుకున్న ప్రదేశంలో కనిపించిన దేనినైనా సరే స్కెచ్‌గా గీయవచ్చు’ అని జీషన్ వివరించారు. వర్ధమాన చిత్రకారులు రాణించడంలో సహాయపడుతూ వాటర్ కలర్స్, స్కెచి్చంగ్, చార్క్కోల్ డ్రాయింగ్ వంటి ప్రాథమిక విషయాలపై ఉచిత వర్క్‌షాప్‌లను కూడా అర్బన్ స్కెచ్చర్స్ నిర్వహిస్తోంది. వారాంతాల్లో ఈ సెషన్లకు హాజరు కావాలనిఇ అనుకున్నవారు సోషల్ మీడియా పేజీల ద్వారా మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. -
విదేశీ పండ్లకు పెరిగిన క్రేజ్
అమెరికా స్ట్రాబెర్రీ, న్యూజిలాండ్ కివీ, వాషింగ్టన్ యాపిల్, కాలిఫోర్నియా ద్రాక్ష, ఆస్ట్రేలియా ఆరెంజ్, థాయిలాండ్ డ్రాగన్ ఇలా అనేక రకాల విదేశీ పండ్లు ప్రసుత్తం నగర మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. దీంతో విదేశీ పండ్ల రుచులను ఆస్వాదించడానికి నగర వాసులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రోజు రోజుకూ నగరంలో వీటి అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సగటున రోజుకు 50–60 టన్నుల మేర అమ్మకాలు జరుగుతున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. సుమారు 18 దేశాల నుంచి వివిధ రకాలు దిగుమతి చేసుకుంటున్నట్లు వ్యాపార వర్గాల చెబుతున్న మాట. కాగా ఈ మొత్తం ప్రక్రియలో అమ్మకాలు, దిగుమతులు గణనీయంగా పెరిగాయని, దీంతో విదేశీ పండ్ల విక్రయాల్లో నగరం దేశంలోనే మూడో స్థానంలో ఉందని తెలుస్తోంది.. ఒకప్పుడు స్థానికంగా దొరికే ఫలాలే సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసేవారు. వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఫలాలు ఎగువ మధ్య తరగతి వారు, లేదా ధనవంతులు మాత్రమే కొనుగోలు చేసేవారు. అయితే మారుతున్న పరిస్థితులు, గ్లోబల్ మార్కెటింగ్‌లో భాగంగా ప్రతిదీ సామాన్యులకు అందుబాటులకి వచి్చంది. పైగా వాటికి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు వాటి అమ్మకాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశంలో అందుబాటులో ఉన్న అనేక రకాల పండ్లు నగర మార్కెట్లో అందుబాటులో అమ్మకాలు జరుగుతున్నాయి... మాల్స్ నుంచి లోకల్ మార్కెట్‌కి.. విదేశీ పండ్లు ఒకప్పుడు పెద్ద పెద్ద మాల్స్‌లోనో.. లేదా సూపర్ మార్కెట్స్‌లోనో అమ్మకాలు జరిగేవి... అయితే విదేశీ పండ్లు నగరంలో మాల్స్, ఫ్రూట్ షాప్స్ నుంచి తోపుడు బండ్లపై అమ్మకాలు జరుగుతున్నాయి. పైగా దేశీయ పండ్ల ధరలకు సమానంగా వీటిని విక్రయిస్తున్నారు. దీంతో అన్ని వర్గాల ప్రజలూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఏదో ఒక సీజన్లో మత్రమే దేశయ మార్కెట్లో అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం వివిధ దేశాల పండ్లు అక్కడి సీజన్ల ప్రకారం మార్కెట్‌కు దిగుమతి అవుతున్నాయి. దీంతో యేడాది పొడవునా ఏదో ఒక దేశం నుంచి అన్ని రకాల పండ్లూ అన్ని సీజన్లలో లభ్యమౌతున్నాయి. దేశంలోనే మూడో స్థానంలో.. విదేశీ పండ్లుగా పేరుగాంచిన కివీ, స్ట్రాబర్రీ, బ్లాక్ బెర్రీస్, అవకాడో వంటి పళ్లు నగరంలో విరివిగా లభ్యమవుతున్నాయి. భారీగా అక్కడి నుంచి దిగుమతులు చేయడం ఒక కారణమైతే.. లోకల్ మార్కెట్‌తో పాటు ఇళ్ల వెంబడి కూడా అమ్మకాలు చేయడమే మరో కారణమని బాటసింగారం మార్కెట్ వ్యాపార వర్గాలు చెబుతున్నారు. నగరంతో పాటు ఇతర రాష్ట్రాలకూ, జిల్లాలకూ ఇక్కడి నుంచే ఎగుమతులు జరుగుతాయి. అందుకే రాష్ట్రంలోనే బాటసింగారం పండ్ల మార్కెట్‌కు అతి పెద్దదిగా పెట్టింది పేరు. అయితే విదేశీ పండ్ల వినియోగంలో ముంబయి, బెంగళూరు తర్వాత నగరం మూడో స్థానంలో నిలిచింది. దిగుమతులు ఇలా.. గ్రీన్ యాపిల్‌కు ఇటీవల అదరణ పెరిగింది. నెదర్లాండ్స్, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. యాపిల్ పళ్లను వాషింగ్టన్, చైనా, న్యూజిల్యాండ్, చిలీ, బెల్జియం నుంచి ముంబాయి, చెన్నై పోర్టు ద్వారా నగరానికి దిగుమతవుతాయి. అవకాడో టాంజానియా నుంచి, కివీ పండ్లు న్యూజిల్యాండ్, ఇటలీ, ఇరాన్‌తో పాటు చైనా నుంచి వస్తాయి. ఇదే క్రమంలో వివిధ పళ్లు ఇతర దేశాల నుంచి దిగుమతవుతున్నాయి. ప్రతి ఫలం..ఔషధ గుణం.. ప్లమ్.. చూడడానికి పెద్ద రెగు పండు సైజులో యాపిల్‌ను పోలివుంటుంది. ఇందులో క్యాల్షియం, సీ, బీ విటమిన్లు, మెగీ్నíÙయంతో పాటు ఇతర పోషకాలు మొండుగా ఉంటాయి. కివీ ఫ్రూట్లో విటమిన్ సీ, కే, ఇ అధికంగా ఉంటాయి. ఇక డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ సీ, ఫాస్పరస్, క్యాల్షియం, ఫైబర్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తితో పాటు కేన్సర్‌ను నియంత్రిస్తుంది. చెర్రీలో కార్బోహైడ్రేట్లు, షుగర్, విటమిన్ సీ, పోటాషియం పుష్కలంగా లభిస్తాయి. స్ట్రాబెర్రీలో విటమిన్ సీ, క్యాల్షియం అధిక స్థాయిలో ఉంటుంది.ఆన్లైన్లోనే ఆర్డర్స్.. వివిధ దేశాల నుంచి ఇక్కడి వ్యాపారులు ఆయా సీజనల్ ఫ్రూట్స్‌ని ఆన్లైన్ ద్వారానే దిగుమతి చేసుకుంటారు.. అదెలా అంటే.. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వాట్సాప్, మెయిల్ ద్వారా పండ్ల నమునా ఫొటోలు పంపిస్తారు. దీంతో వ్యాపారులు ఆన్లైన్లో అడర్ ఇస్తారు. విదేశాల నుంచి ముంబయికి దిగుమితి అవుతాయి. అక్కడి నుంచి ఫ్రీజర్ ట్రాన్స్పోర్ట్ ద్వారా నగరానికి వస్తాయి.మార్కెట్లో వివిధ దేశాల పండ్లు ప్రపంచ వ్యాప్తంగా లభించే దాదాపు 20 రకాల విదేశీ పండ్లు గడ్డిఅన్నారం మార్కెట్‌కు కమీషన్ ఏజెంట్ల ద్వారా దిగుమతి అవుతున్నాయి. గతం కంటే ప్రస్తుతం దిగుమతులు పెరిగాయి. ట్రేడర్స్‌కు రెఫ్రిజిరేటర్ చాంబర్లు ఏర్పాటు చేశాము. దేశంలోని ఇతర పండ్ల మార్కెట్లతో పోలిస్తే నగర మార్కెట్లో అన్ని సౌకార్యలూ ఉన్నాయి. – ఎల్ శ్రీనివాస్, గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిపెరిగిన అమ్మకాలు గతంతో పోలిస్తే విదేశీ పండ్ల అమ్మకాలు పెరిగాయి. దీంతోపాటు నగరం ప్రజలకు కూడా విదేశీ పండ్లపై ఆసిక్తి పెరిగంది. కరోనా అనంతరం ప్రజల్లో ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెరగడం మరో కారణం.. దిగుమతులు కూడా విరివిగా జరుగుతుండడంతో ధరలు కూడా దేశీ పండ్ల స్థాయిలోనే ఉంటున్నాయి. యాపిల్, కివీ, పియర్స్‌తో పాటు మరికొన్ని విదేశీ రకాల వైపు కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు. – క్రాంతి ప్రభాత్‌రెడ్డి, విదేశీ పండ్ల హోల్‌సేల్ వ్యాపారి -
స్లిమ్ సెట్.. డైట్ మస్ట్
ఆధునిక జీవన శైలిలో నగరవాసుల ఆహారపు అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి. యువత నుంచి మొదలైతే వయోవృద్ధుల వరకు స్లిమ్‌తో పాటు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. అధిక బరువు నుంచి ఉపశమనం పొందాలని, శరీరంలోని అనవసరమైన కొవ్వులు కరిగించాలని తినే ఆహారం తగ్గిస్తున్నారు. మరో వైపు వ్యాయామంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. దీంతో నీరసించిపోవడం, ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. నిత్యం మనతోనే ఉండే వారు లావుగా ఉన్నావని ఎత్తిపొడుపు మాటలకు బాధపడి కొంతమంది.. అధిక బరువు ఉన్నారని పెళ్లికి నిరాకరించడం, కాలేజీ, ఉద్యోగ ప్రాంగణంలో ఆకర్షణీయంగా కనిపించాలని మరికొంత మంది.. ఇలా ఎవరి అవసరాలు వారికి ఉన్నాయి. అవే స్లిమ్ సెట్ ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. నగరంలో సుమారు 60 శాతం మంది 30 నుంచి 50 ఏళ్ల వయసు ఉన్నవారే నాజూగ్గా కనిపించాలని ఆరాటపడుతున్నారంటే ఆశ్చర్యం లేదు. మరో 20 శాతం నుంచి 30 శాతం మంది 14 నుంచి 29 ఏళ్ల వయస్కులు ఉండగా, సుమారు 10 శాతం మంది 50 ఏళ్లు దాటిన వారు ఈ తరహా స్లిమ్ సెట్ కోసం ట్రై చేస్తున్నారు. ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ కావాలనుకునేవారు పౌష్టికాహారం వైపు అడుగులు వేస్తున్నారు. ఇది మంచిదే.. అయితే.. ఎవరైనా సరే నిపుణుల సూచనలు ఆచరణాత్మకంగా పాటిస్తారో అక్కడే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మితంగా తింటున్నారు.. నాజూగ్గా కనిపించాలని చాలా మంది యువత తిండి తగ్గించేస్తున్నారు. దీనికి తోడు ప్రొసెసింగ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు. శరీరంలో ఉన్న ఫ్యాట్ తగ్గించడానికి డైట్ యాక్టివిటీ తప్పనిసరిగా ఉండాలి. కొంత మంది ప్రత్యేకంగా నడుము, పొట్ట, చేతులు వంటి ఒక పార్ట్నే లక్ష్యంగా స్లిమ్ చేయాలనుకుంటున్నారు. వారంలో 750 గ్రాముల నుంచి ఒక కేజీ వరకు బరువు తగ్గితే ఆరోగ్యకరంగా ఉంటుంది. మనం సాధారణ పనులు చేసుకోవడానికి నిత్యం శరీరానికి శక్తి అవసరం. దానికి అవసరమైన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఆహారం తగ్గిస్తే దాని ప్రభావం కండలు (మజిల్)పై కనిపిస్తుంది. నీరసం వస్తుంది. ఏ పని చేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. వివిధ సంస్థలు ఒక కేజీ బరువు తగ్గడానికి సుమారుగా రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు తీసుకుంటున్నాయి. ప్రొటీన్ పౌడర్ వాడేస్తున్నారు.. చాలా మంది ఈ మధ్య కాలంలో భోజనానికి ప్రత్యామ్నాయంగా ప్రొటీన్ పౌడర్ తీసుకుంటున్నారు. ప్రొటీన్ డబ్బా బయట మార్కెట్లో రూ.650 నుంచి రూ.1,500 వరకు అందుబాటులో ఉన్నాయి. ఆ వ్యక్తి లైఫ్ స్టైయిల్, బాడీ ప్యాటర్న్ బట్టి ప్రొటీన్ పౌడర్ తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. మూడు పూటలా మీల్ రీప్లేస్మెంట్ ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయం మొలకెత్తిన గింజలు, రాగి జావ, తృణధాన్యాలు, ఫైబర్ ఫుడ్ వంటివి తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. అయితే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మాత్రం నిపుణుల సూచనల మేరకు తీసుకోవడం మంచిది. ఫ్లూయిడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలు పోతాయి. ఆ ఆలోచన చేయవద్దు డైట్ నిరంతర ప్రక్రియగా ఉండాలి. ఒక్కసారి స్లిమ్ అయిపోవాలి.. వేగంగా బరువు తగ్గిపోవాలనే ఆలోచన చేయవద్దు. అది ఒక్క రోజులో వచ్చే ఫ్యాట్ కాదు. మూడు నెలల పాటు హెల్దీ లైఫ్ స్టైల్‌కు అలవాటు పడాలి. వ్యక్తి శరీరానికి ప్రధానంగా ప్రొటీన్, కార్బొహైడ్రేట్స్, ఫ్యాట్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవసరం. ఉదయం బాడీ డిటాక్సేషన్ కోసం నిమ్మరసం, జీరా నీరు, మెంతుల నీరు, దనియాలు, జీలకర్ర, కాంబినేషన్లో సూచిస్తాం. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ప్రత్యేక మెనూ ఉంటుంది. – బి.కవిత, పౌష్టికాహార నిపుణురాలు, హైదరాబాద్సుమారు 30 కేజీలు బరువు తగ్గాను అధిక బరువుతో ఇబ్బందిగా ఉండేది. వెయిట్ లాస్ కోసం 2023 నుంచి న్యూట్రిషన్ సూచనలు ఫాలో అవుతున్నాను. ఇప్పటి వరకు సుమారు 30 కేజీలు తగ్గాను. అప్పటి ఇప్పటికి చూస్తే మనకి స్పష్టమైన తేడా కనిపిస్తోంది. బరువుతో బాధపడే సమయంలో నెమ్మదిగా ఉండేది. ఇప్పుడు పిల్లలతో చురుగ్గా పనులు చేసుకోగలుగుతున్నాను. లుక్ వైజ్‌గా చాలా తేడా వచి్చంది. ఫీల్ గుడ్. – వై.నిషిత, కూకట్పల్లి -
వింటర్ చిల్స్..
వింటర్ అంటేనే వెచ్చని పార్టీల సీజన్. చల్లని వాతావరణంలో పుట్టే లేజీనెస్‌ను వేడి వేడి క్రేజీ పార్టీస్ ద్వారా తరిమికొట్టడం సిటీ పార్టీ లవర్స్‌కి అలవాటు. అందుకే డిసెంబర్ నెల వచ్చెరా అంటే పార్టీలకు వేళాయెరా అన్నట్టు ఉంటుంది. క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకూ వరుసగా హోరెత్తే వేడుకల్లో అటు పండుగలు ఇటు న్యూ ఇయర్ లాంటి సంబరాలు కలగలసి ఎక్కడలేని సందడినీ మోసుకొస్తాయి. ఇప్పటికే చలితో పాటు పారీ్టల సందడి కూడా సిటీని కమ్ముకుంది. ఈ నేపథ్యంలో నగరంలో క్రేజీగా మారిన కొన్ని పార్టీస్టైల్స్ గురించి.. నలుగురమూ కలిశామా.. తిన్నామా.. తాగామా.. తెల్లారిందా.. అన్నట్టు కాకుండా తాము నిర్వహించే పార్టీలకు ఆసక్తికరమైన థీమ్ జతచేయడం అనే అలవాటు నగరంలో ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. తమ వేడుకని కొన్ని రోజుల పాటు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మార్చాలని పార్టీ లవర్స్ ఆలోచిస్తున్నారు. అందుకు అనుగుణంగా వెరైటీ థీమ్స్ అన్వేíÙస్తున్నారు. దీంతో వెరైటీ పార్టీస్ పుట్టుకొస్తున్నాయి వాటిలో కొన్ని.. ట్విన్నింగ్.. స్టన్నింగ్.. తల్లీ కూతుళ్లు కావచ్చు, తండ్రీ కొడుకులు కావచ్చు.. భార్యాభర్తలు కూడా కావచ్చు.. కలిసి పుట్టకపోయినా కవలలం కాకపోయినా మేం ఇద్దరం కాదు ఒక్కరమే.. అనే భావన వచ్చేలా అనుబంధాన్ని ఆవిష్కరించే అవకాశాన్ని అందిస్తుందీ ట్విన్నింగ్ పార్టీ. ఇటీవల నగరంలో పలు చోట్ల దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ పార్టీకి వచ్చే అతిథులు జంటగా వస్తారు. ఒకే రంగు దుస్తులు ధరించడం దగ్గర నుంచి వారిద్దరి మధ్య అనుబంధాన్ని వీలున్నన్ని మార్గాల్లో వ్యక్తీకరించడమే ఈ పార్టీల్లో థీమ్. ఫ్యూజన్.. ఫన్.. భారతీయతను, పాశ్యాత్య రీతులను కలగలిపేదే ఫ్యూజన్ పార్టీ. వీటినే ఇండో వెస్ట్రన్ పారీ్టస్ అని కూడా పిలుస్తున్నారు. ఈ పార్టీలో వేడుక జరిగే ప్రదేశం అలంకరణ నుంచీ వస్త్రధారణ వరకూ ఫ్యూజన్ శైలి ప్రతిఫలిస్తుంది. ఉదాహరణకు లాంతర్లు, దీపాలు వంటి సంప్రదాయ వెలుగుల సరసనే ఎల్ఈడీ లైట్స్ అలంకరించడం.. అదే విధంగా అతిథులు లెహంగా, స్కర్ట్స్‌కు క్రాప్ టాప్స్‌ను జత చేయడం లేదా కుర్తా షర్ట్స్‌కు జీన్స్ కలపడం.. ఇలా ఉంటుంది. వంటకాల నుంచి కాక్టైల్స్ వరకూ విందు వినోదాలన్నీ భారతీయ, పాశ్చాత్య మేళవింపుతోనే ఉంటాయి. రాయల్టీ.. పార్టీ.. ఇండియన్ రాయల్టీ థీమ్‌తో నిర్వహించే పార్టీలో అంతా రిచ్ లుక్ ఉట్టిపడుతుంది. సిల్‌్క, వెల్వెట్, గోల్డ్, రెడ్ రాయల్ బ్లూ.. కలర్ ఫ్యాబ్రిక్‌తో పార్టీ ప్రదేశం అంతా అలంకరణతో మెరిసిపోతుంటుంది. వింటేజ్ క్యాండిల్బ్రాస్, రాయల్ థ్రోన్స్, గ్రాండ్ షాండ్లియర్స్.. వగైరాలతో రిచ్ టచ్ ఇస్తాయి. అతిథులు ఖరీదైన దేశంలో పేరొందిన ప్రాంతాల దుస్తులు, షేర్వానీ.. వగైరాలు ధరిస్తారు. వెండి ప్లేట్లలో విందు వడ్డిస్తుంటే.. అందుకు తగిన నేపథ్యంలో లైవ్ గజల్స్ తరహా సంగీతాలు వినిపిస్తుంటాయి. బాలీవుడ్.. స్టైల్.. నగరం టాలీవుడ్‌కి కేరాఫ్ అయినప్పటికీ.. పారీ్టస్ ఇచ్చిపుచ్చుకోడంలో బాలీవుడ్ స్టైల్ పారీ్ట.. అంటూ ఒకటి ఉంది తప్ప టాలీవుడ్ థీమ్ ఇంకా తెరకెక్కలేదు. ఈ పారీ్టలో బాలీవుడ్ పోస్టర్స్, ఫెయిరీ లైట్స్, క్లాసిక్ బాలీవుడ్ లైవ్ మ్యూజిక్.. ఏర్పాటు చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన డ్యాన్స్ ఫ్లోర్‌పై బాలీవుడ్ హిట్స్‌కి అతిథులు తమ అభిమాన చిత్రంలోని స్టెప్స్ జత చేస్తారు. ఈ పార్టీలోనే బెస్ట్ డ్యాన్సర్, మోస్ట్ గ్లామరస్ అవుట్ ఫిట్.. తదితర సరదా అవార్డ్స్ కూడా ఉంటాయి. పూల్.. పారీ్టస్.. నగరంలోని స్టార్ హోటల్స్‌లో మాత్రమే కాదు కొందరి సొంత భవనాల్లోనూ కొందరికి స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. కేవలం స్విమ్మింగ్‌కు మాత్రమే కాదు పారీ్టలకు కూడా పూల్ కేరాఫ్‌గా మారింది. పూల్ దగ్గర నిర్వహించే పారీ్టస్ కోసం పూల్ ఆవరణం మొత్తం ఆక్వా థీమ్‌తో డెకరేట్ చేస్తున్నారు. ఈవెంట్ మొత్తం పూల్ దగ్గరే జరుగుతుంది. వాటర్ గేమ్స్, ఆక్వా డ్యాన్స్ తదితర సరదా ఆటలూ పూల్ రీడింగ్స్ వంటి ఆసక్తికరమైన సెషన్లూ ఉంటాయి. పూల్ పారీ్టలో భాగంగా పగలూ రాత్రీ లైట్ల ధగధగల మధ్య నీళ్లలో జలకాలాటలు ఉర్రూతలూగిస్తాయి. పాట్ లాక్.. ఫుడ్ క్లిక్.. చాలా కాలంగా వాడుకలో ఉన్న సంబరాల శైలి ఇది. అయినప్పటికీ దీనికి ఇంకా క్రేజ్ తగ్గలేదు. ఇంట్లోనే నిర్వహించుకోవడం, ఎన్నో రకాల ఇంటి వంటలు ఆస్వాదించే వీలుండడం ఈ పాట్లాక్ని బాగా క్లిక్ చేసింది. పాట్లాక్ కోసం ఒక వ్యక్తి హోస్ట్‌గా ఉంటే ఆ వ్యక్తి ఇంటికి అందరూ తమకు బాగా నచి్చన, వచి్చన వంటకాన్ని తయారు చేసి తీసుకెళతారు. అలా పెద్ద సంఖ్యలో పోగైన ఆహారపదార్థాలను రుచి చూస్తూ గేమ్స్, అంత్యాక్షరి వంటివాటితో సందడిగా గడిపేస్తారు. ఆరోగ్యకరం.. ఆర్గానిక్.. ఆహారంలో, ఆహార్యంలో ఇప్పటికే సహజత్వంవైపు సిటిజనులు భారీగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ పోకడ పారీ్టస్కి కూడా అంటుకుంది. ఎకో ఫ్రెండ్లీ లేదా ఆర్గానిక్ పార్టీలు షురూ అయ్యాయి. నగరంలో చాలా మందికి శివార్లలో పార్మ్ హౌజ్‌లు ఉన్న నేపథ్యంలో ఒక్కోసారి ఒక్కో ఫార్మ్ హౌజ్‌లో పార్టీ ప్లాన్ చేసుకుంటున్నారు. అక్కడ కాసేపు ఆటపాటలతో పాటు సహజ పద్ధతిలో తయారైన వంటకాలను ఆస్వాదించి పచ్చని ప్రకృతిలో సేదతీరి తిరిగి వస్తున్నారు. డెస్టినేషన్..ప్యాషన్.. ఉన్న ఊర్లో సెలబ్రేషన్స్ చేసుకోవడం ఎలా ఉన్నా.. ఊరు దాటి వెళ్లాం అంటే తెలియని ఫ్రీడమ్ ఫీలింగ్ వచ్చేసి ఆటోమెటిగ్గా సందడి మొదలైపోతుంది. డెస్టినేషన్ పారీ్టలు నగరంలో క్లిక్ అవడానకి కారణం అదే. ప్రస్తుతం బ్యాచిలర్ పారీ్టలు ఎక్కువగా డెస్టినేషన్ ఈవెంట్స్‌గా మారాయని నగరానికి చెందిన ఉత్సవ్ ఈవెంట్స్ నిర్వాహకులు రాజ్‌కిషోర్ అంటున్నారు. సిటీకి దగ్గరలో ఉన్న అనంతగిరి మొదలుకుని కాస్త దూరంలో ఉన్న లోనావాలా, దండేలి, మతేరన్ తదితర హిల్ స్టేషన్స్ వరకూ డెస్టినేషన్ పారీ్టస్ జరుగుతున్నాయి.ట్రెడిషనల్‌గా.. ట్రెండీగా.. సంక్రాంతి టైమ్‌లో ట్రెడిషనల్ పారీ్టస్ ఎక్కువగా జరుగుతుంటాయి. వేడుక అంతా సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. ముగ్గులు, జానపద గీతాలు పాడడం, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. వీటికి తమ టీనేజ్ పిల్లల్ని తీసుకు రావడానికి పార్టీ ప్రియులు ఇష్టపడుతున్నారని పార్టీ ఆర్గనైజర్ విశాల చెప్పారు. దీని వల్ల వారికి మన సంప్రదాయాలపై మక్కువ, అవగాహన ఏర్పడుతుందనే ఆలోచనే దీనికి కారణమన్నారు. -
ఫైన్ టూ షైన్..
ఫైన్ ఆర్ట్స్ కోర్సులు చదివితే ఉపాధి ఉంటుందో లేదోనన్న అనుమానాలు గతంలో చాలామందికి ఉండేవి. అయితే హైదరాబాద్‌లోని జవహర్లాల్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఏటా ప్రవేశాల కోసం వచ్చే దరఖాస్తులు చూస్తుంటే ఈ కోర్సులకు ఉన్న డిమాండ్ అర్థం అవుతుంది. ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్‌లో కోర్సు చేసి, బయటకు వస్తే మంచి గుర్తింపు, గౌరవంతో పాటు ఉపాధి కూడా ఉంటుందని అనేక మంది విద్యార్థులు నిరూపిస్తున్నారు. కల్చరల్ ఎంట్రప్రెన్యూర్షిప్లో భాగంగా ఫైన్ ఆర్ట్స్ చేసిన విద్యార్థులు కలిసి చిన్నపాటి వ్యాపారం ప్రారంభిస్తున్నారు. ఇలాంటి వారికి పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. పైగా, చాలా పాఠశాలల్లో చిన్నప్పటి నుంచే చదువుతో పాటు పిల్లలకు ఫైన్ ఆర్ట్స్ నేరి్పంచేందుకు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫైన్ ఆర్ట్స్ చేసిన వారిని టీచర్లుగా నియమించుకుంటున్నారు. దీంతో పిల్లల్లో సృజనాత్మకత పెంపొందడంతో పాటు మానసిక ఎదుగుదల కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.మారిన నగరవాసి అభిరుచి..మారుతున్న కాలానికి అనుగుణంగా సగటు నగరవాసి అభిరుచి కూడా మారుతోంది. దీంతో ఇంటి ఆవరణతో పాటు ఇంట్లో ప్రతి మూలనూ వినూత్నంగా, ఆహ్లాదకరంగా మలుచుకోవాలని చూస్తున్నారు. అందుకోసం అందమైన పెయింటింగ్స్, మంచి ఫొటోలతో పాటు చిన్నపాటి శిల్పాలను ఇంట్లో అలంకరణకు పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఫైన్ ఆర్ట్స్ వ్యాపారం నగరంలో అభివృద్ధి చెందుతోంది. కళలకు కాస్త టెక్నాలజీని జోడించి ముందుకు వెళ్తే ఈ రంగంలో ఎంతో ఎత్తుకు ఎదగొచ్చని పేర్కొంటున్నారు.కూడళ్ల వద్ద ఆకర్షణగా..భాగ్యనగరంతో పాటు రాష్ట్రంలోని పలు నగరాల్లోని కూడళ్ల వద్ద ఆకర్షణీయంగా ఉండేలా శిల్పాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. నగరంలోని అనేక కూడళ్ల వద్ద ఆలోచింపజేసేలా శిల్పాలను రూపొందించారు. కేవలం శిలలతోనే కాకుండా వివిధ రకాల వ్యర్థాలతో వాటిని రూపొందించి పర్యావరణహితాన్ని సమాజానికి చాటుతున్నారు. జేఎన్ఏఎఫ్టీయూకు చెందిన పలువురు నగరాన్ని అందంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. శిల్పకారుడు బుద్ధి సంతో‹Ù, స్ట్రీట్ ఆర్టిస్ట్ కిరీట్ రాజ్, స్ట్రీట్ ఆరి్టస్ట్ రెహమాన్, మురళి, మహేశ్ తదితరులు కలిసి నగరానికి కొత్త సొబగులు దిద్దేందుకు కృషి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రారంభించిన నగర సుందరీకరణ కార్యక్రమాల్లో వీరు అనేకసార్లు భాగస్వాములయ్యారు.ప్రయోగాలు చేయడం ఇష్టం.. చిన్నప్పుడు డ్రాయింగ్స్, స్కెచ్‌లు వేస్తుండేవాడిని. ఇంటర్ తర్వాత జేఎన్ఏఎఫ్టీయూలో డిగ్రీ పూర్తి చేశాను. ఇక్కడికి వచ్చాక స్కల్ప్చరింగ్పై ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశాను. కొత్తకొత్త మెటీరియల్స్‌తో శిల్పాలు చేయాలని కోరికగా ఉండేది. అందుకే రాళ్లతో పాటు ఈ–వేస్ట్, జాలీలు, పేపర్ గుజ్జు, రాళ్లు, నట్స్, బోల్ట్స్ వంటి వాటితో అనేక శిల్పాలను రూపొందించేవాడిని. లక్డీకాపూల్‌లోని నిరంకారి భవన్ వద్ద ఏర్పాటు చేసిన పుస్తక శిల్పం, బంజారాహిల్స్‌లోని జీవీకే మాల్ వద్ద ఏర్పాటు చేసిన శిల్పం, వరంగల్‌లోని ములుగురోడ్డు వద్ద ఏర్పాటు చేసిన గుర్రం శిల్పం, జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన పాలపిట్ట విగ్రహం నేను తయారు చేసినవే. చాలా మంది తమ ఇళ్లల్లో పెట్టుకునేందుకు అడిగి మరీ.. వారికి కావాల్సిన విధంగా తయారు చేయించుకుంటారు. – బుద్ధి సంతోష్ కుమార్, శిల్పకారుడునాన్నే నాకు స్ఫూర్తి.. మా నాన్న లారీ బాడీలు తయారు చేస్తుంటారు. ఆ ట్రక్కులపై పెయింటర్స్ వేసే పెయింటింగ్స్ చూస్తూ పెరిగాను. అప్పటి నుంచి వాటిని గీసేందుకు ప్రయత్నించేవాడిని ఆ క్రమంలోనే పెయింటింగ్స్‌పై ఆసక్తి పెరిగింది. అయితే నా స్కిల్స్‌ను మరింత పెంచుకునేందుకు ఫైన్ ఆర్ట్స్ కాలేజీలోచేరాను. ఆయిల్, ఆక్రెలిక్, వాటర్ కలర్స్, భిన్నమైన పెన్సిల్స్‌తో స్కెచ్‌లు వేయడం నేర్చుకున్నాను. పెయింటింగ్‌లో నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం నా లక్ష్యం. – అబ్దుల్ రెహమాన్, స్ట్రీట్ ఆర్టిస్ట్ఆర్ట్ డైరెక్టర్‌గా చేస్తున్నా.. చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడం ఇష్టంగా ఉండేది. మా అన్నయ్య ఫణితేజ బొమ్మలను చూసి నేర్చకునేవాడిని. అదే ఇష్టంతో పెయింటింగ్‌లో బీఎఫ్ఏ, ఎంఎఫ్ఏ పూర్తి చేశాను. ఈ కోర్సుల ద్వారా ఆర్ట్‌లో నైపుణ్యం నేర్చుకున్నాను. ఆర్ట్ హిస్టరీలో పట్టు సాధించాను. ఆర్ట్ షోలు, గ్యాలరీల్లో పనిచేశాను. ఫైన్ ఆర్ట్స్‌లో వచి్చన అనుభవంతో సినిమా రంగంలో అడుగుపెట్టాను. ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాను. – కిరీటి రాజ్ మూసి, ఆర్టిస్ట్. -
స్వెట్టీస్.. స్టైల్..
నగరంలో చలికాలం ప్రారంభమైంది. చలికాలం వస్తుందంటే చాలు స్వెటర్ల కోసం నగరవాసి కళ్లు వెతుకుతుంటాయి. మార్కెట్లోకి స్టైలిష్ స్వెటర్లు కొనేందుకు చూస్తుంటారు. నవంబర్ రాగానే నగరంలో స్వెటర్ దుకాణాలు భారీగా వెలుస్తుంటాయి. ఈ ఏడాది కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో స్వెటర్ దుకాణాలు వెలిశాయి. రంగురంగుల ఉన్ని దుస్తులతో పాటు రగ్గులు, దుప్పట్లు, టోపీలు, మఫ్లర్లు, చేతి గ్లౌజులు కొనేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు.నవంబర్ రెండో వారం నుంచి జనవరి మూడో వారం వరకూ నగరంలో చలికాలం ఉంటుంది. ప్రత్యేకంగా డిసెంబర్, జనవరి నెలలో నగర ఉష్ణోగ్రతలు 12.5 డిగ్రీల కనిష్ట స్థాయిలో నమోదు అవుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఏడాది నవంబర్ రెండో వారంలో చలి ప్రారంభమైంది. కానీ తుఫాను ప్రభావంతో చలి తీవ్రత తగ్గింది. ఈ వారం నుంచి చలి వాతావరణం మళ్లీ పుంజుకుంది. దీంతో స్వెటర్ల వ్యాపారాలు జోరుగా పెరిగాయి. నేపాల్ నుంచి వచ్చి.. చలికాలం ప్రారంభం కాగానే నేపాల్ వ్యాపారులు నగరానికి భారీగా తరలివచ్చి స్లాళ్లు ఏర్పాటు చేసుకుని మరీ అమ్మకాలు జరుపుతుంటారు. కోఠికి వెళ్లేవారు ఇలాంటి దుకాణాలను వరుసగా చూసే ఉంటారు. వీటితోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్ల వెంబడి స్టాళ్లు ఏర్పాటు చేస్తారు. చాలా మంది నగర వాసులు ఇక్కడే కొనుగోలు చేస్తుంటారు. మూడు నెలల పాటు ఇక్కడే ఉండి విక్రయిస్తుంటామని, తమ ఉత్పత్తులకు ఇక్కడ డిమాండ్ ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. బ్రాండెడ్ దుకాణాలు సైతం.. ఇటీవల స్వెటర్ల వ్యాపారం రోడ్లపై నుంచి బ్రాండెడ్ షాపుల వరకూ చేరింది. గతంలో చేతితో తయారు చేసిన స్వెటర్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరుందిన బ్రాండెడ్ కంపెనీలు తయారు చేస్తున్న స్వెటర్లను కొనుగోలు చేసేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా పలు సినిమాల్లో హీరో, హీరోయిన్లు వేసుకుంటున్న స్వెటర్ల కోసం బ్రాండెడ్ దుకాణాల్లో వెతుకుతున్నారు. వారి అభిరుచిని బట్టి వ్యాపారులు కూడా బ్రాండెడ్ ఉన్ని దుస్తులను తెప్పిస్తున్నారు. ధర ఎక్కువైనా కూడా వాటిని కొనేందుకు ముందుకొస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. తగ్గిన వ్యాపారం..నగరంలో ఏటా చలికాలం ప్రారంభానికి ముందు నుంచే పలువురు వ్యాపారులు తాత్కాలిక స్వెటర్ల షాపులు, రోడ్డుల పక్కన స్టాళ్లు ఏర్పాటు చేసి, మైదానాల్లో అమ్మకాలు చేస్తుండేవారు. అయితే ఈ ఏడాది నవంబర్ రెండో వారం నుంచి చలి ప్రారంభమైనప్పటికీ బంగాళాఖాతంలో తుపాన్ రావడంతో నగరంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. చలి తగ్గింది. తిరిగి డిసెంబర్ నెల్లో కూడా సైక్లోన్ రావడంతో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరగడం ప్రారంభమయ్యాయి. దీంతో చలికాలం కోసం నగర వ్యాపారులు దేశ, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వివిధ రకాల స్వెటర్లతో పాటు ఇతర దుస్తువుల వ్యాపారం అనుకున్న స్థాయిలో జరగడంలేదని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. స్టైల్ కోసం..చలిని తట్టుకోడంతో పాటు.. ధరించినప్పుడు హుందాగా కనబడేందుకు పలు స్వెటర్ తయారీ సంస్థలు వివిధ రకాల మోడల్స్‌ను రూపొందిస్తున్నాయి. ఇవి వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని పలువురు నిర్వాహకులు చెబుతున్నారు. ఏఎన్ఆర్, ఎనీ్టఆర్, చిరంజీవి లాంటి ఆ తరం నటులు సినిమాల్లో ధరించిన స్వెటర్లను అప్పట్లో వాడేవారని, ఇప్పుడు ఈ తరం హీరోలు, హీరోయిన్లు ధరించే స్వెటర్లను వాడేందుకు ఇప్పటి యువత ఆసక్తి చూపిస్తోందని పేర్కొంటున్నారు. కొంత మంది యువతీ యువకులు ఫలానా సినిమాల్లో హీరోహీరోయిన్ ధరించిన స్వెటర్ తయారు చేసి ఇవ్వాలని ఆర్డర్లు కూడా చేస్తుంటారని చెబుతున్నారు. ఉలెన్‌తో పాటు క్యాష్మిలన్ ఫ్యాబ్రిక్.. గతంలో ఉన్నితో తయారు చేసిన స్వెటర్లు ధరించేందుకు నగరవాసులు ఆసక్తి చూపేవారు. మందంగా ఉండే ఉన్ని దుస్తులను ధరించేందుకు ఇప్పుడు కొందరు ఆసక్తి చూపట్లేదు.. దీంతో తయారీదారులు తేలికగా ఉండే క్యాష్మిలన్ ఫ్యాబ్రిక్‌తో స్వెటర్లను తయారు చేస్తున్నారు. చలికాలంతో పాటు సాధారణ సీజన్లో కూడా ధరించేందుకు వీలుగా ఉండటంతో పాటు స్టైల్‌గానూ ఉంటున్నాయని యువత ఎక్కువగా ఈ ఫ్యాబ్రిక్‌తో తయారు చేసిన స్వెటర్లను వాడుతున్నారు. తేలికగా ఉండే చలిని తట్టుకునే స్వెటర్లు, గ్లౌజ్‌లతో పాటు సాక్స్ ఎక్కువగా అడుగుతున్నారు. – మహ్మద్ ఇల్యాస్ బుఖారీ, వ్యాపారి, మదీనా సర్కిల్సరసమైన ధరల్లో.. ఏటా కోఠిలో వెలిసే స్వెటర్ దుకాణాల్లో కొనుగోలు చేస్తుంటాం. తక్కువ ధరల్లో అందుబాటులో ఉంటాయి. డిజైన్స్‌తో పాటు మంచి నాణ్యమైనవి ఇక్కడ దొరుకుతాయని మేం వస్తుంటాం. పిల్లలతో పాటు పెద్ద వారికి కూడా ఇక్కడ లభిస్తుంటాయి. – మల్లికార్జున్, హైకోర్టు లాయర్ -
Cake Mixing: కేక్స్ మిక్స్..టేస్ట్ అదుర్స్..
డిసెంబర్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగరం నూతనోత్సాహాన్ని పుంజుకుంటుంది. ఒకవైపు ఇయర్ ఎండ్, న్యూ ఇయర్ వేడుకలు, మరోవైపు క్రిస్మస్ సంబరాలతో నగరం అంతా పార్టీ మూడ్‌లో ఉంటుంది. ఇందులో భాగంగా నగరంలో ఇప్పటికే విభిన్న వేదికల్లో వినోద కార్యక్రమాలు, వేడుకలు మొదలయ్యాయి. కల్చరల్ డైవర్సిటీకి కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలిచే హైదరాబాద్‌లో సర్వమత సమ్మేళనంలో భాగంగా క్రిస్మస్ వేడుకలు సైతం ఘనంగా నిర్వహిస్తుంటారు. ప్రీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా కేక్ మిక్సింగ్ సందడి నెలకొంది. నూతన ఏడాదికి స్వాగతం పలికేందుకు ఇయర్ ఎండ్ వేడుకలకు కూడా సన్నద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వహించే కేక్ మిక్సింగ్పైనే ఈ కథనం.. నగరంలో గత కొన్ని సంవత్సరాలుగా కేక్ మిక్సింగ్.. ట్రెండ్ కొనసాగుతోంది. మొదట్లో క్రిస్మస్ ఫ్రీ ఈవెంట్స్‌లో భాగంగా కేక్ మిక్సింగ్ నిర్వహించేవారు. కానీ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కేక్ మిక్సింగ్‌లో పాల్గొంటూ వినూత్న సంస్కృతికి నాంది పలుకుతున్నారు. నగరంలోని ఫైవ్ స్టార్ హోటల్స్, రిసార్ట్స్, ఎన్జీవోలు, విద్యా వ్యాపార సంస్థల్లో, ఇతర ఎంటర్టైన్మెంట్ వేదికలుగా కేక్ మిక్సింగ్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్లలో పలువురు సెలబ్రిటీలు సైతం పాల్గొని సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే నోవోటెల్ హైదరాబాద్, గోల్కొండ హోటల్, తాజ్ కృష్ణ, తాజ్ వివంత వంటి ఫైవ్ స్టార్ హోటల్స్‌తో పాటు ఇతర వేదికల్లో కేక్ మిక్సింగ్ వేడుకలు మొదలై కొనసాగుతూనే ఉన్నాయి.సెలిబ్రిటీల సందడి.. నగర జీవన శైలిలో భాగమైన ఈ కార్యక్రమాలకు సెలిబ్రిటీల నుండి కూడా మంచి ఆదరణ లభిస్తుంది. నిర్వాహకులు సైతం పలువురు సెలిబ్రిటీలు, సామాజికవేత్తలు, ఐకానిక్ వ్యక్తులను ఈ కేక్ మిక్సింగ్ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఆహా్వనిస్తూ నగరవాసులను తమ వైపుకు తిప్పుకుంటున్నారు. ఇలా ఈ ఏడాది నగర వేదికగా ఇప్పటికే జరిగిన పలు వేడుకల్లో సినీ తారలు, సింగర్లు, స్పోర్ట్స్ స్టార్స్ పాల్గొని సందడి చేశారు.వివిధ రకాల డ్రై ఫ్రూట్స్.. ప్రీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా, కేక్ మిక్సింగ్, గ్రేప్ స్టాంపింగ్ ప్రధానంగా నిర్వహిస్తారు. ఈ కేక్ మిక్సింగ్‌లో దాదాపు 25 రకాల డ్రై ఫ్రూట్స్, పలు రకాల స్పైసెస్, రం, బ్రాందీ, విస్కీ లాంటి లిక్కర్ కలుపుతారు. ఇందులో వాడే పదార్థాల మిశ్రమం మంచి పోషకాలతో ఆరోగ్య ప్రదాయిని గానూ ఉంటున్నాయి. ఈ మిశ్రమాన్నంతా కొద్ది రోజులపాటు సోక్ (పులియ బెట్టడం) చేసి ఆ తరువాత ఫ్లమ్ కేక్ తయారు చేస్తారు. పాశ్చాత్య సంస్కృతిలో భాగంగా తయారు చేసిన ఈ ఫ్లమ్ కేక్ క్రిస్మస్ వేడుకల్లో అందరికీ ఫేవరెట్. కేక్ మిక్సింగ్‌లో చిన్నలు, పెద్దలు అందరూ కలిసి లిక్కర్‌తో డ్రై ఫ్రూట్స్ కలుపుతూ ఎంజాయ్ చేస్తారు.గ్రేప్ స్టాంపింగ్.. కేక్ మిక్సింగ్‌తో పాటు ఈ మధ్యకాలంలో గ్రేప్ స్టాంపింగ్ విరివిగా నిర్వహిస్తున్నారు. ఈ గ్రేప్ స్టాంపింగ్‌లో ఒక పెద్ద చెక్క బుట్టలో అధిక మొత్తంలో ద్రాక్ష పళ్లను వేసి సామూహికంగా వాటిని తొక్కుతూ ద్రాక్ష రసాన్ని తీసి దాని నుండి వైన్ తయారు చేస్తారు. ఈ వైన్ కూడా క్రిస్మస్ వేడుకల్లో ప్రధాన అంశమే ఇలాంటి సాంస్కృతిక వినోదపరమైన కార్యక్రమాలకు నగరంలోని యువత సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కూడా అమితాసక్తి చూపిస్తున్నారు. ఈ నెలలో వీకెండ్ వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో తెలుసుకొని అందులో పాలుపంచుకుంటున్నారు. ఈ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. నూతనోత్సాహం కోసం.. కేక్ మిక్సింగ్ కూడా మన జీవన పరమార్థాన్ని తెలిపే ఓ వేడుకే. ఈ కేక్ మిక్సింగ్ లో కలిపే డ్రై ఫ్రూట్స్ నట్స్ సుగంధద్రవ్యాల లాగే మన అందరి జీవితాలు కలుపుగోలుగా అందంగా ఉండాలని అర్థం. అంతేకాకుండా ప్రతి ఏడాదీ నూతనోత్సాహాన్ని అందించడానికి ముందస్తు వేడుక. నగరంలో ఈ మధ్యకాలంలో ఈ సంస్కృతికి ఆదరణ బాగా పెరిగింది. – ఎస్పీ శైలజ, ప్రముఖ సింగర్, (ఈ మధ్య జరిగిన ఓ కేక్ మిక్సింగ్ వేడుకలో భాగంగా). -
క్రేజీ.. కేజే..
నికితా నాయర్ (26) ఆరేళ్లుగా విదేశాల్లో ఉంటూ రెండు నెలల క్రితం సిటీకి తిరిగి వచ్చారు. ఈ వెడ్డింగ్ కొరియోగ్రాఫర్ పాడడంలో ప్రొఫెషనల్ కాదు. కానీ ఆమె ఒంటరిగా కరోకే ఈవెంట్లకు వెళ్లి ఇతర క్రూనర్లతో కలిసి పాడడం ప్రారంభించి ఇప్పుడు రెగ్యులర్‌గా మారారు. ‘నేను ఆల్కహాల్ తాగను. నచ్చిన ఫుడ్ తిని నా హృదయానికి దగ్గరగా అనిపించిన పాటలు పాడతాను’ అని నాయర్ చెప్పారు. ఇలాంటి బాత్రూమ్ సింగర్స్‌ని బాల్రూమ్ సింగర్స్‌గా మారుస్తున్న క్రెడిట్ కరోకే జాకీ (కేజే)లకే దక్కుతుంది. – సాక్షి, సిటీబ్యూరోపాట మొదలవుతుంది.. సంగీతం వినబడుతుంటుంది. స్క్రీన్ మీద ఆ పాట సాహిత్యం కనబడుతుంటుంది. ప్రేక్షకుల్లో నుంచి కొన్ని చేతులు గాల్లోకి లేస్తాయి. ఆడియోలో గాత్రం మొదలయ్యే సమయానికి ఆ గాల్లోకి లేచిన చేతుల్లోని ఒక చేతిలో మైక్ పెడతాడు కేజే లేదా కరోకే జాకీ. ఆ సమయంలో అసలు గాయకుని గాత్రం స్థానంలో సదరు చేతి తాలూకూ వ్యక్తి గొంతు భర్తీ అవుతుంది. ఇలా మ్యూజిక్ ట్రాక్‌లో వాయిస్‌ని కట్ చేసి ఆ స్థానంలో మన వాయిస్‌ని కలిపి పాడడమే కరోకే సింగింగ్ అంటారు. ఇప్పుడు సిటీలో జరిగే పార్టీ ఈవెంట్స్‌లో ట్రెండీగా మారాయి ఈ కరోకే నైట్స్. ‘తాను డీప్ పర్పుల్, ది బీటిల్స్‌లోని రెట్రోలను, హిందీ పాట లేదా రాక్ వినడానికి ఇష్టపడతా’ అని నికితా నాయర్ చెప్పారు. ఒకప్పుడు ఇలా ఇష్టపడడం అనేది కేవలం వినడం వరకూ మాత్రమే పరిమితమైతే.. ఇప్పుడు అది పాడడం వరకూ చేరింది. ఆహారం, పానీయాలతో పాటుగా ముందుగా రికార్డ్ చేసిన ట్రాక్‌ల ద్వారా మైక్రోఫోన్లో పాడటం కొత్త సోషల్ నెట్వర్కింగ్ మంత్రంగా మారింది. నో డ్రింకింగ్ ఓన్లీ సింగింగ్.. ఇటీవలే బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కోలిన్ డిసౌజా (28) మాట్లాడుతూ ‘నాకీ సరదా బెంగళూర్‌లో అలవాటైంది. డ్రింక్ చేయడానికి కాకుండా పాడటానికి మాత్రమే రెస్టో–బార్లను సందర్శిస్తాను. పాటల్ని కలిసి పాడే సమయంలో కొత్త పార్ట్నర్స్ లభిస్తుంటారు’ అన్నారు. నగరానికి చెందిన కరోకే జాకీ రోగర్ వైట్ ప్రకారం.. ‘తెలుగు పాటలకు ఇంకా పబ్స్, క్లబ్స్‌లో జరిగే కరోకే నైట్స్‌లో ప్రాచుర్యం పెరగలేదు. పాశ్చాత్య సంగీతానికే డిమాండ్. బ్రయాన్ ఆడమ్స్ రాసిన ‘సమ్మర్ ఆఫ్ 69’ బాన్ జోవి రాసిన ‘ఇట్స్ మై లైఫ్’ వంటి పాటలు కరోకే నైట్స్‌లో ప్రసిద్ధి చెందాయి. రెట్రో, రెగె, ఓల్డ్ రాక్ పాప్ శైలులతో గొంతు కలపడానికి అతిథులు ఇష్టపడతారు.’ప్రైవేట్ ఈవెంట్స్‌లోనూ.. పెళ్లిళ్లు, బర్త్‌డేలు తదితర వేడుకల్లోనూ ఇప్పుడు కరోకే సందడి బాగా పెరిగింది ‘గతంలో పబ్స్, క్లబ్స్కే పరిమితం అయినప్పటికీ ఇప్పుడు వివాహ వేడుకల్లో సంగీత్ వంటి కార్యక్రమాలతో పాటు కరోకే కూడా భాగం చేస్తున్నారు’ అని కేజే నోయల్ చెప్పారు. అయితే వీటిలో ఎక్కువగా తెలుగు, హిందీ పాటలకే పెద్ద పీట వేస్తున్నారని, అలాగే ఇలాంటి చోట అతిథులను పాడించడం అంత సులభం కాదని పలువురు కేజేలు అభిప్రాయపడుతున్నారు. కరోకే నైట్స్‌కి పేరొందిన ఓ క్లబ్‌కు సహ–యజమాని దీప్తి కే దాస్ మాట్లాడుతూ.. ‘కరోకే కాలం చెల్లిన డీజే నైట్ల కంటే ఎక్కువ ఇంటరాక్టివ్‌గా ఉంటుంది. ఆదివారం బ్రంచ్ తర్వాత యువత దీని కోసం బాగా వస్తారు. ఈ ట్రెండ్‌లో మమేకమవుతున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. ఫ్యామిలీ మొత్తం కలిసి టేబుళ్లను రిజర్వ్ చేసుకుంటాయి. డైనింగ్‌తో పాటు సింగింగ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు’ అని చెప్పారు. పుట్టి 20 ఏళ్లయినా..నైట్ పార్టీస్‌లో ఈ కరోకే ట్రెండ్ సిటీలో ఊపిరిపోసుకుని దాదాపు 20 ఏళ్లు కావస్తోంది. ఆనంద్ అనే డీజే తాను కేజేగా మారి ఈ ట్రెండ్‌కు బోణీ కొట్టారు. అప్పటి నుంచీ ఆయన మాత్రమే సిటీలో కేజేగా సుపరిచితులుగా ఉన్నారు. అయితే గత కొన్నేళ్లుగా కరోకే ట్రెండ్ బాగా పెరిగింది. దీంతో సిటీలో కేజేల సందడి కూడా పెరిగింది. ఎఫ్ అండ్ బీ నిపుణులు గఫNర్ మాట్లాడుతూ.. ‘ఇంతకుముందు, వారానికి రెండు కరోకే నైట్స్ ఉండేవి. ఇప్పుడు, నాకు కనీసం 10 వరకూ ఉంటున్నాయి’ అని చెప్పారు. -
టూరు.. భలే జోరు..
నగరంలో సగటు వ్యక్తి సమయం ఉద్యోగం, వ్యాపారం, ట్రాఫిక్ తంటాలతోనే సగం గడిచిపోతోంది. డిసెంబర్ వచ్చిందంటే ఉద్యోగులకు సెలవులకు ముగిరిపోయే సమయం ఆసన్నమైందని లెక్కలేసుకుంటారు. మరో వైపు క్రిస్మస్ సెలవులు.. దీంతో సెలవుల్లో ఎలా ఎంజాయ్ చేయాలా అని ప్లాన్ చేసుకుంటున్నారు. ఎత్తయిన కొండల్లో దాగిన సరస్సులు, భూమికి పచ్చని చీరకట్టినట్లుండే టీ, కాఫీ ఎస్టేట్లు, భూతల స్వర్గంలా పొగమంచు కమ్మిన ప్రాంతాలవైపు ఆకర్షితులవుతున్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు హిల్ స్టేషన్స్ తమ డెస్టినేషన్‌గా ఎంపిక చేసుకుంటున్నారు. ఆధ్యాత్మిక ప్రాంతాలకూ డిమాండ్ ఉందని టూర్ ఆపరేటర్లు పేర్కొంటున్నారు. 5 రోజుల నుంచి వారం రోజుల పాటు సాగే టూర్ రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకూ ఛార్జ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అరకు శీతాకాలంలో దట్టమైన పొగ మంచు, పచ్చని చెట్ల మధ్య సాగే ప్రయాణం.. రహదారులు, గుహల్లోంచి దూసుకుపోయే అద్దాల రైలు ప్రయాణం, రంగురంగుల పూల తోటలు, టీ, కాఫీ ఎస్టేట్స్, వంజంగి కొండపై నుంచి కనిపించే పొగ మంచు పొరలు కన్నులకు విందుగా అనిపిస్తుంది. దేశంలోనే అతి పెద్ద గుహలలో ఒకటైన బొర్రా గుహలు ఇక్కడ చూడొచ్చు. సుమారు 80 మీటర్ల లోతు గుహలో దిగొచ్చు. విశాఖపట్నంలో కైలాసగిరి, ఆర్కే బీచ్, అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం, విజయవాడ దుర్గాదేవి దర్శనం చేసుకుని తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. మండువేసవిలో దట్టమైన మేఘాలు.. ప్రిన్సెస్ ఆఫ్ ది హిల్‌గా ప్రసిద్ధి చెందిన కొడైకెనాల్ తమిళనాడులోనే ఉంది. దట్టమైన అడవులు, ఎత్తయిన పర్వతాల నడుమ సాగే ప్రయాణం, సరస్సులు, జలపాతాలు, పిల్లర్ రాక్, బ్రయంట్ పార్క్ ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు. ఈ పర్వతాలపై మండే వేసవిలో సైతం దట్టమైన మేఘాలు మనల్ని కమ్మేస్తాయి. కొడైకెనాల్ల్లో ప్రయాణం చేస్తుంటే.. మేఘాల్లో తేలిన ఫీల్ ఉంటుంది. శీతాకాలంలో అయితే మంచు దుప్పటి కప్పేస్తుంది. ముచ్చటగొలిపే మున్నార్.. కేరళలోని మున్నార్ అంటే మూడు నదులు అని అర్థం. ప్రసిద్ధ ఎరవికులం జాతీయ పార్క్ మున్నార్ సమీపంలోనే ఉంటుంది. టీ ఎస్టేట్స్, మట్టుపెట్టి డ్యాం, ఆహ్లాదరకమైన గ్రీనరీ, ఎత్తయిన కొండలు చూడొచ్చు. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాంతం నచ్చుతుంది. కేరళలోని మరో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం వయనాడ్. పడమర కనుమలు, వివిధ రకాల పక్షలు, జంతువులు, కొండల మధ్య ప్రయాణం ఆకట్టుకుంటుంది. చెంబ్రా, బాణాసుర సాగర్ డ్యాం పర్యాటకులకు డెస్టినేషన్‌గా నిలుస్తాయి. కూర్గ్‌లో ట్రెక్కింగ్.. కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్ ట్రెక్కింగ్ చేయాలనుకునే వారికి ఇది అనువైన ప్రదేశం. కనుచూపు మేరలో ఎటు చూసినా కాఫీ, మిరియాలు, యాలుకల తోటలతో సుమనోహరంగా ఉంటుంది. వైల్డ్ లైఫ్, అబ్బే జలపాతం, నగర్‌హోళె నేషనల్ పార్క్‌లు చూడదగ్గ ప్రదేశాలు. అదే సమయంలో నంది హిల్స్‌పై నుంచి సూర్యోదయం చూసేందుకు ప్రకృతి ప్రేమికులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. బెంగళూరు సమీపంలోని ఈ కొండల్లో భోగనందీశ్వరాలయం ఉంటుంది. నంది కోట ప్రధాన ఆకర్షణ.క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్.. తమిళనాడులోని ఊటీని క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్‌గా పిలుస్తారు. స్థానికంగా ఉండే బొటానికల్ గార్డెన్, నీలగిరి కొండలు, పర్వతాల మధ్య సరస్సులు, పచ్చని తోటలు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. ఊటీని కొత్త జంటలు హనీమూన్ డెస్టినేషన్‌గా పిలుచుకుంటారు. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 2,240 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఊటీకి సమీపంలోనే కూనూర్ ఉంటుంది. ఇక్కడ డాలి్ఫన్ నోస్, ల్యాంబ్స్ రాక్, టీ ఎస్టేట్స్ చూడొచ్చు. ఐదు రోజుల ప్రయాణం అద్భుతం.. ఈ సీజన్లో హిల్ స్టేషన్స్ చూడటానికి బాగుంటాయని ఫ్రెండ్స్ టూర్ ప్లాన్ చేద్దామని అడిగారు. కొడైకెనాల్ డెస్టినేషన్. మధ్యలో కొన్ని దేవాలయాలు, ఇతర ప్రదేశాలను సందర్శించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. వెళ్లి రావడానికి 5 రోజులు పట్టింది. కొడైకెనాల్ ప్రయాణం మేఘాల్లో తేలినట్లుంది. మధ్యాహ్నం 12 అయినా అక్కడ రెండు మీటర్ల దూరంలో ఉన్న మనిషి కనిపించే పరిస్థితి లేదు. ఈ టూర్ మంచి అనుభూతినిచ్చింది. – సాయి హర్ష, మణికొండఆహ్లాదం.. ఆధ్యాత్మికం రెండూ..ఈ సీజన్లో వెకేషన్,ఆధ్యాత్మికం కలిపి మిక్సడ్ టూర్ ప్లాన్స్ ఉంటున్నాయి. గోవా, రామేశ్వరం, ఊటి, కొడైకెనాల్, పాండిచ్చేరి, మున్నార్, మదురై, అరుణాచలం, శభరిమలై వంటి ప్రదేశాలకు ఎక్కువ మంది ప్యాకేజీలు అడుగుతున్నారు. కొన్ని కుటుంబాలు వాహనం మాట్లాడుకుంటున్నారు. – భాస్కర్‌రెడ్డి, శ్రీసాయి టూర్స్ అండ్ ట్రావెల్స్ -
మరణానంతరం.. మరో చరిత్ర
మనిషి జన్మ వింతే.. అది తెలియకుంటే చింతే.. నీ నిర్మాణమే తెలుసుకోవా.. బతుకు అర్థం ఉంది. అది తెలియకుంటే వ్యర్థం.. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ.. తస్మాదపరిహార్యే అర్థేన త్వం శోచితుమర్హసి.. (పుట్టినవానికి మరణం తప్పదు.. మరణించినవానికి పుట్టుక తప్పదు.. తప్పించుకోడానికి వీలులేని ఈ విషయంలో నువ్వు దుఃఖించడం తగదు.) – సాక్షి, సిటీబ్యూరో మనిషికి ప్రాణం పై ఉన్న మక్కువ లెక్క కట్టలేనిది.. మరణం అనేదే లేకుండా చేసేందుకు ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేశారు.. దేవుడు రాసిన తలరాతను ఎవరూ మార్చలేరు. దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. అయితే అమరులుగా ఉండాలనే ఆశ మనిíÙలో ఎప్పటికీ తగ్గదు. ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే.. అందరూ స్వార్థంగా ఉండరు. సమాజంలో ఎంతో నిస్వార్థంగా జీవించే వారూ ఉంటారు. వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. చిన్న సహాయం చేస్తేనే ఏదో గొప్ప పని చేశాం అని చెప్పుకునే ఈ రోజుల్లో... అవయవదానం చేసే గొప్పవాళ్ళు కూడా ఉన్నారు. మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి మొత్తం శరీరాన్ని దానం చేసే వారిని ఏమనాలో.. ఇలా నగరంలో ఎంతో మంది మరణానంతరం తమ భౌతికదేహాలను పరిశోధనల కోసం దానం చేసేందుకు ముందుకు వచ్చారు. మానవతా దృక్పథంతో.. దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది అంటారు.. కానీ అన్నింటి కన్నా దేహాన్ని దానం చేయడం గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానం చేయడం అంత సులువైన విషయం కాదు. సామాజిక, సంప్రదాయ, ఆర్థిక, మానసిక సమస్యలు ఇందులో ముడిపడి ఉంటాయి. కుటుంబంతో పాటు.. బంధువుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. ముందుగా దేహాన్ని దానం చేయాలంటే పెద్ద మానసిక సంఘర్షణ ఎదుర్కోవాల్సి వస్తుంది. అవన్నీ దాటుకుని ముందడుగు వేయడం చాలా పెద్ద విషయం. కుటుంబ సభ్యులను ఒప్పించడం కూడా పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. ఎన్జీవోల పాత్ర మరువలేనిది.. సాధారణంగా అవయవదానం, మృత దేహాలను దానం చేసే విషయంలో ఎన్జీవోలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. నగరంలోని పలు సంస్థలు ఈ దిశగా ప్రజలకు అవగాహన కలి్పస్తున్నాయి. ఎంతో మంది తమ అవయావాలు దానం చేసేందుకు కృషి చేస్తున్నాయి. దీంతో పాటు కడవర్ దానం చేయించడం అంత సులువైన పని కాదని పలువురు ఎన్జీవోల నిర్వాహకులు చెబుతున్నారు. చాలా వరకూ కనీసం పోస్ట్ మార్టం చేయించేందుకే విముఖత చూపిస్తారని.. అలాంటి సమాజంలో ఉన్న వారిని ఒప్పించడం ఇబ్బందికరమేనని పేర్కొంటున్నారు. చదువుకున్న వాళ్లలో ఎక్కువగా..దానం చేసిన దేహాన్ని కడవర్ అంటారు. దేహం దానం చేయడం ఎక్కువగా చదువుకున్న వారిలో కనిపిస్తుంది. సమాజంపై అవగాహన ఉండటం వల్ల కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు.. పరిశోధనల కోసం..మాములుగా బ్రెయిన్ డెడ్ అయిన వారి శరీరాల నుంచి అవయవదానం చేస్తుంటారు. కానీ చనిపోయిన తర్వాత శరీరం అవయవ దానాలకు పనికి రాదు. అప్పుడు శరీరాన్ని మెడికల్ కాలేజీలకు దానం చేస్తారు. ఆ శరీరాన్ని ప్రయోగాలు చేసుకునేందుకు, పరిశోధనలు చేసేందుకు వినియోగిస్తారు. శరీరాన్ని దానం చేయాలంటే.. మరణానికి ముందు స్థానిక వైద్య కళాశాల, ఆస్పత్రి లేదా ఎన్జీవోతో ముందస్తు ఒప్పందం చేసుకోవాలి. సంబంధిత పత్రాలపై సంతకం చేయాల్సి ఉంటుంది. మరణించిన తర్వాత వారికి సమాచారం అందిస్తే అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేస్తారు.. అయితే చనిపోయిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు అందరూ.. ఒప్పుకుని సంతకాలు చేసి దానం చేయొచ్చు.అమ్మ కోరిక మేరకు..మరణానంతరం తన శరీరాన్ని ప్రయోగాల కోసం దానం ఇవ్వాలని అమ్మ అనుకునేది. కుటుంబ సభ్యులమంతా కలసి ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నాం. ఆమె మరణించిన తర్వాత ఓ ఎన్జీవోకు ఫోన్ చేసి.. విషయం చెప్పాం. అయితే మా నిర్ణయాన్ని చాలా మంది వ్యతిరేకించారు. కర్మకాండలు జరిపించకపోతే పాపం అని చాలా మంది అన్నారు. కానీ ప్రయోగాల కోసం ఇస్తే ఎంతో మందికి జ్ఞానం వస్తుందని మేం నమ్మాం. ఎంతమంది ఏం అనుకున్నా ముందుకు వెళ్లాం. ఒకానొక సందర్భంలో మమ్మల్ని వేలేసినంత పని చేశారు. కానీ కొందరు మాత్రం మా నిర్ణయాన్ని స్వాగతించారు. అమ్మ ఎప్పుడూ దైవ చింతనలో ఉండేవారు. అధ్యాత్మికతలో మునిగిపోయేవారు. అయినా కూడా సంప్రదాయాలను పక్కన పెట్టి శరీర దానానికి ముందుకు వచ్చారు. ఆమెకు ఆమెనే గొప్ప బిరుదు సంపాదించుకున్నారు.. అదే కడవర్.. – మునిసురేశ్ పిళ్ళై, కడవర్ భారతమ్మ కుమారుడు అవగాహన పెరగడం వల్లే.. ఇటీవల సమాజంలో అవగాహన పెరగడంతో అవయవదానం చేసేందుకే చాలా మంది ముందుకు వస్తున్నారు. చదువుకుని.. సమాజంపై అవగాహన ఉన్న వాళ్లు అవయవ దానాన్ని అర్థం చేసుకుంటున్నారు. అలాగే సరైన కౌన్సెలింగ్ ఇచ్చి నలుగురికీ సహాయపడొచ్చని చెప్పడం వల్లే ఒప్పుకుంటున్నారు. అవయవ దానంతో నలుగురి జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం వదులుకోవద్దు. ఇదే అసలైన సమాజ సేవ. – డాక్టర్ సందీప్ దవళ్ల, హెచ్‌వోడీ యూరాలజీ విభాగం, ఈఎస్ఐసీ -
సమాజం మా ఇజం!
నగరంలో వందల కొద్ది స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. అనాథలు, వయోవృద్ధులు మొదలు.. జంతు, పర్యావరణ పరిరక్షణ, సామాజిక హక్కులు, మానవ హక్కులు, వికలాంగుల సేవ.. ఇలా విభిన్న అంశాల్లో సమాజ సేవ చేయడానికి ఎన్జీవోలను ఏర్పాటు చేశారు. అయితే ఈ సామాజిక సేవ ఒక సంస్థతోనో.. ఒక వ్యక్తితోనో సంపూర్ణంగా నిర్వహించలేం.. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అన్నీ వలంటీర్స్‌పై ఆధారపడి సేవలు కొనసాగిస్తున్నాయి. నగరం వేదికగా ఉన్న ఎన్జీవోల్లో సగానికి పైగా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వలంటీర్ల మద్దతుతో కొనసాగుతున్నవే.. ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా విభిన్న రంగాల్లో సేవలందిస్తున్నారు. నేడు ప్రపంచ వలంటీర్ దినోత్సవం నేపథ్యంలో నగరం వేదికగా సేవలందిస్తున్న విభిన్న సామాజిక సేవా విభాగాల్లోని విశేషాలు తెలుసుకుందాం.. కోటిన్నరకుపైగా జనాభా కలిగిన హైదరాబాద్‌లో వేల సంఖ్యలో అనాథలు, నిరాశ్రయులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారికి సేవలందించడానికి ఎన్నో రకాల స్వచ్ఛంద సేవ సంస్థలు నిత్యం కృషి చేస్తున్నాయి. దాతల సహాయంతో కార్పొరేట్ కంపెనీల సీఎస్ఆర్ నిధులతో సామాజిక సేవ చేస్తున్న ఎన్జీవోలకు వలంటీర్ వ్యవస్థ వారధిగా పనిచేస్తుంది. ఇందులో అధిక శాతం యువతనే ఉండటం విశేషం. విద్యార్థులు, ఉద్యోగులుగా వ్యక్తిగత జీవితాన్ని కొనసాగిస్తున్న యువత హ్యాపీగా జీవితాన్ని అన్ని కోణాల నుంచి చూడాలన్న మంచి హృదయంతో వలంటీర్లుగా మారుతున్నారు. వారంలో ఒక రోజైనా లేదా రెండు, మూడు రోజులకు కాసింత సమయమైనా ఎన్జీవోలకు కేటాయిస్తూ తమవంతు బాధ్యత నిర్వర్తిస్తున్నారు. ఇందులో భాగంగా వీధుల్లో ఫుట్‌పాత్‌లపై ఉన్న అనాథలకు, అన్నార్తులను కలిసి వారి పరిస్థితులను తెలుసుకొని వృద్ధాశ్రమాల్లో, అనాథాశ్రమాల్లో చేరి్పంచడం లేదా తాత్కాలికంగా వారి ఆకలి తీర్చడానికి తమవంతు కృషి చేస్తున్నారు. ఈ వలంటీర్లు ఏదో ఒక ఎన్జీవోతో కలిసి తమ సేవలను కొనసాగిస్తున్నారు. అంతేగాకుండా చలికాలంలో దుప్పట్లు పంచడం, వర్షాకాలంలో రెయిన్ కోట్లు పంచడం, ఎండాకాలంలో నీళ్లు అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. జంతువులకు బాసటగా.. నగరం వేదికగా జంతు ప్రేమికులకు ప్రత్యేకంగా సమూహాలు సైతం ఉన్నాయి. ఈ జంతువులకు కొన్ని ఎన్జీవోలతో కలిసి లేదా వారే ఒక సంఘంగా ఏర్పడి నగరంలోని నిరాదరణకు గురైన జంతువులు, సాధుజంతువుల సంరక్షణ కోసం కృషి చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో హింస, దాడులకు గురైనప్పుడు వాటికి కారణమైన వ్యక్తులను వ్యవస్థలను న్యాయపరంగా శిక్షించేందుకు కృషి చేస్తున్నారు. వీరంతా సోషల్ మీడియా వేదికగా వెబ్సైట్లో పేజీలు క్రియేట్ చేసుకుని తమ సేవలను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా పెట్స్ వేగన్స్ క్లబ్, బ్లూ క్రాస్ సొసైటీ వంటి పలు సంస్థలు పని చేస్తున్నాయి.రోగులకు సేవలందిస్తూ.. ప్రస్తుత తరుణంలో వివిధ కారణాలతో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు రక్షణ అందించడం చాలా అవసరం. ఈ విషయంలో నగరం వేదికగా ఎంతోమంది స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు. పెద్దఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. సోషల్ మీడియాలో లేదా ఏదో ఒక స్వచ్ఛంద సంస్థ ఆహా్వనం మేరకు పలువురు వలంటీర్లు సదరు హాస్పిటల్స్‌కు వెళ్లి స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు.పర్యావరణం.. మన హితం.. పర్యావరణ పరిరక్షణ కోసం పలువురు హౌస్ స్థాయిలో విభిన్న వేదికలుగా విశేష సేవలు అందిస్తున్నారు. వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించడం మొదలు కాలుష్యం పెరగడానికి కారణమైన మొక్కల నరకడానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న వారు సైతం ఉన్నారు. తప్పనిసరి నరికేయాల్సి వచ్చిన మొక్కలను తిరిగి మళ్లీ పెంచేలా కృషి చేస్తుండటం విశేషం. పర్యావరణ సంరక్షణలో ప్లాస్టిక్ వాడకం తగ్గించడానికి దశాబ్ద కాలంగా కొన్ని సంస్థలు అందులోని వాళ్లు విశేషంగా కృషి చేస్తున్నారు. మూగజీవుల కోసం..సాటి మనుషులకే కాదు మూగజీవాలకు కూడా ప్రత్యేకంగా హక్కులున్నాయి. వాటి గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నా వంతు సామాజిక బాధ్యతగా జంతు సంరక్షణకు సంబంధించిన సేవా కార్యక్రమాలు చేస్తుంటాను. ఇందులో భాగంగా వీధి కుక్కలకు ఆహారం అందించడం, ఆదరణకు నోచుకొని జంతువులకు అనారోగ్య సమస్యలు ఉంటే వాటికి చికిత్స అందిస్తాం. ఈ మధ్యకాలంలో జంతువులపై దాడులు పెరిగిపోయాయి. వీటికి వ్యతిరేకంగా ఫైట్ చేయడమే కాకుండా హింసకు పాల్పడవద్దంటూ అవగాహన కల్పస్తున్నాం. – గౌతమ్ అభిష్క్, అనిమల్ యాక్టివిటీస్రక్తం అందేందుకు కృషి.. ప్రస్తుత జీవన విధానంలో ప్రమాదాలు కావొచ్చు.. ఇతర అనారోగ్య సమస్యలు కావొచ్చు.. అత్యవసర సమయంలో రక్తం అందక ప్రాణాలు కోల్పోయిన వారు వేలు, లక్షల సంఖ్యలో ఉన్నారు. సరైన సమయంలో సాటి మనుషులు స్పందించకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి పరిస్థితి రాకూడదనే లక్ష్యంతో నేను వలంటీర్‌గా రక్తదానం చేస్తున్నాను. నేను రక్తదానం చేస్తూనే నా స్నేహితులను ఏకం చేసి నాలుగేళ్లలో దాదాపు నాలుగు వేల మందికి పైగా రక్తం అందించేలా కృషి చేశాను. – ముతీ ఉర్ రెహమాన్, హైదరాబాద్ -
ఫిట్.. సెట్..
సొగసైన శరీరాకృతి అందరూ కోరుకుంటారు. అయితే దానికి మన వంతుగా ఎలాంటి ప్రయత్నం చేస్తున్నామన్నదే ముఖ్యం. ఎవరైనా నిత్యం వ్యాయామం చేస్తూ, జిమ్ ట్రైనర్స్ సూచనలు పాటిస్తే మెరుగైన ఆకృతిని సొంతం చేసుకోవచ్చు. దీనికి ఆహారపు అలవాట్లు, శరీరతత్వం, ఉద్యోగ సమయం, ఆరోగ్యం పరిస్థితులు, తదితర అంశాలు సైతం శరీరంపై ప్రభావం చూపిస్తాయి. నగరంలో యువత, మహిళలు అధిక శాతం మంది జిమ్ బాట పడుతున్నారు. ఇందులో కొంత మంది ప్రాథమిక వ్యాయామానికే పరిమితం అవుతుండగా, మరికొంత మంది మాత్రం తమ శరీరంలోని వివిధ అవయవాలకు సంబంధించిన ప్రత్యేక వ్యాయామాలపై దృష్టి పెడుతున్నారు. ట్రైనర్స్ ఏం చెబుతున్నారు? ఎలాంటి డైట్ పాటించాలి? తెలుసుకుందాం..! నగర యువత అత్యధిక శాతం మంది తమ శరీరాకృతిని ఆరు పలకల ఆకృతిలోకి మార్చుకోడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పొట్ట ప్రదేశంలో అనవసరమైన కొవ్వులను కరిగించుకోడానికి ఆబ్డామిన్ స్ట్రెచ్చెస్, క్రంచెస్ వంటి వ్యాయామాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో పొట్ట భాగం సరైన ఆకృతిలోకి వస్తోంది. జంపింగ్ స్వా్కట్స్ చేయడం వల్ల బరువుని తగ్గించుకోవచ్చు. ఎత్తుకు సరిపడేంతగా సన్నబడడం, షోల్డర్స్‌ను అభివృద్ధి చేయడంపై దృష్టిసారిస్తున్నారు. శరీరంలో వృధాగా పేరుకుపోయే కొవ్వులు, కేలరీలను కరిగించేందుకు బర్పీస్ చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. మౌంటెనింగ్, క్లైంబింగ్స్ వంటివి ఫ్లాట్ స్టొమక్ని అందిస్తాయి. డంబెల్స్‌తో డిఫరెంట్ సెట్స్.. చూడచక్కని షోల్డర్స్ కోసం డంబెల్స్‌తో వర్కౌట్ చేయాలి. బెంచ్ ప్రెస్ చేయడం వల్ల గుండె భాగంపై ప్రభావం కనిపిస్తుంది. చెస్ట్ కండరాలు స్పష్టమైన అమరికతో ఆకర్షిణీయంగా తయారవుతాయి. వీపు వైపు బలంగా, ఫిట్‌గా ఉండాలంటే పుల్ డౌన్, నడుము బలంగా తయారవడానికి డెడ్ లిఫ్ట్ వర్కౌట్ చేయాలి. ప్లాంక్ ఫోశ్చర్పై పరుగు తీస్తే గుండె కొట్టుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ వ్యాయామాలు ముఖ్యంగా భుజాలు, గుండె భాగం, కాళ్లపై ప్రభావం చూపిస్తాయి. మజిల్స్ బలంగా తయారై, శరీరాన్ని ఫ్లెక్సిబిలిటీగా ఉంచుతుంది. మహిళలను వేధిస్తున్న అధిక బరువు.. ఇటీవలి కాలంలో జిమ్‌లకు వస్తున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పిల్లలు పుట్టిన తరువాత మహిళలు బరువు పెరుగుతున్నారు. ఇంట్లో సరైన వ్యాయామం లేకపోవడంతో వివిధ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని పేర్కొంటున్నారు. బెల్లీఫ్యాట్ తగ్గించుకోవడం, గుండె భాగం ఫిట్‌గా ఉండటం, నడుము బలంగా తయారు కావడానికి వ్యాయామాలు చేస్తున్నారని ట్రైనర్స్ పేర్కొంటున్నారు.శరీరం దృఢంగా ఉండాలంటే.. శరీరం దృఢంగా, బలంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం సహజం. అయితే బిజీ సిటీ లైఫ్‌లో ఆహారపు అలవాట్లు, కాలుష్యం, నిద్ర అనేక అంశాలు శరీర పటుత్వంపై ప్రభావం చూపిస్తాయి. సరైన వ్యాయామం చేయకుంటే అనేక వ్యాధులకు మనం ఆహ్వానం పలికినట్లే అవుతుంది. శరీరం ఫిట్‌గా ఉండేందుకు క్రాస్ ఫీట్, బరీ్పస్, జంపింగ్ తదితర వ్యాయామాలు చేయడం మంచిది. శరీర కండరాలు సరైన ఆకృతిలో పెరగాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా ఆహారపు క్రమశిక్షణ అవసరం. బయట చిరు తిళ్లు, నూనె వంటకాలకు దూరంగా ఉండాలని జిమ్ ట్రైనర్స్ సూచిస్తున్నారు.శరీరం ఫిట్‌గా తయారైంది.. రెండేళ్లుగా నిత్యం జిమ్ చేస్తున్నాను. వారంలో కనీసం మూడు రోజులు 60 నుంచి 70 కిలో మీటర్ల వరకూ పరుగెత్తుతాను. గతంలో కిడ్నీలో స్టోన్స్, అల్సర్, ఛాతీలో నొప్పి వంటి సమస్యలు బాధించేవి. వ్యాయామం చేయడం మొదలు పెట్టిన తర్వాత సుమారు 20 కిలోల వరకూ బరువు తగ్గాను. ఇప్పుడు శరీరం ఫిట్‌గా తయారైంది. వచ్చే ఏడాది జనవరిలో జరిగే రాష్త్ర స్థాయి పరుగు పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించాను. – శ్రీశైలంగౌడ్, బండ్లగూడక్రమశిక్షణ అవసరం.. యువతలో ఎక్కువ మంది జిమ్ చేసే సమయంలో శరీరాకృతి కోసం అడుగుతున్నారు. పెద్దలు సాధారణ వ్యాయామాలపై దృష్టిసారిస్తున్నారు. మహిళలు సన్నబడటం, బెల్లీ ఫ్యాట్, బరువు తగ్గించుకోడానికి ఆసక్తి చూపిస్తున్నారు. డైట్ పాటించాలి. మాంసాహారానికి దూరంగా ఉండాలి. కూరగాయలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ప్రతి రోజూ కనీసం అరగంట సమయం నడక, పరుగు తీయడం మంచిది. – సద్దాం, జిమ్ ట్రైనర్ -
కేకుపుట్టించే టేస్ట్!
ప్రయాణం చేస్తూనే అల్పాహారం తీసుకోవాలనుకున్న ఓ యువ ప్రొఫెషనల్ దీని కోసం అరటి వాల్నట్ కేక్ తయారు చేసుకుంటాడు. బిజీగా ఉండే ఓ మోడ్రన్ మదర్.. చిన్నపిల్లల స్నాక్ బాక్స్ కోసం తన ప్యాంట్రీలో నిల్వ చేసిన ఫ్రూట్ పుడ్డింగ్ కేక్‌ని బయటకు తీసి రెడీగా ఉంచుతుంది. ఇలా ఉదయాన్నే తీసుకునే అల్పాహారం నుంచి రాత్రి పూట ఆస్వాదించే బ్రౌనీస్ వరకూ.. కేక్స్ నగరవాసుల వేగవంతమైన డైలీ రొటీన్లో భాగం అయిపోయాయి. ఇక న్యూఇయర్‌ని, క్రిస్మస్లను మోసుకొచ్చే డిసెంబర్ నెలలో అయితే కేక్‌ల సందడికి హద్దే ఉండదని చెప్పాలి. కేకుల వినియోగంలో సౌలభ్యంతో పాటు వాటి రుచి కారణంగా చాలా మందికి ఆహారపరంగా ప్రాధాన్యత జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. లాక్డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితమైన సిటిజనులు హోమ్ బేకింగ్‌ను అలవాటు చేసుకున్నారు. అలా పదుల సంఖ్యలో పుట్టుకొచి్చన హోమ్ బేకర్స్.. ఆన్లైన్ వేదికగా అనేక మందికి వీటిని చేరువ చేశారు. దీంతో ఈ డెజర్ట్ సిటిజనులకు మరింత ఇష్టమైన ఆహారంగా మారింది. హాట్ కేక్.. ఈట్ రైట్.. సిటీలో విరివిగా వినియోగంలో ఉన్నవాటిని ప్యాకేజ్డ్ కేకులు: ఆరి్టసానల్ కేక్‌లుగా విభజించవచ్చు. వీటిలో స్పాంజ్ కేక్‌లు, కప్ కేక్‌లు, చీజ్ కేక్‌లు, కేక్ పాప్స్ వంటివి వేగంగా తినే పని ముగించాలనుకునేవారికి ఇష్టమైనవిగా మారాయి. దీనికి తోడు పలు బ్రాండ్స్ మార్కెట్లోకి ప్రవేశపెడుతున్న వివిధ రుచులు ఆకట్టుకునే ప్యాకేజ్లతో మరింతగా ఆదరణ దక్కించుకుంటున్నాయి. ప్లెయిన్ స్పాంజ్ కేకులు, ఫ్రాస్టెడ్ ఐసింగ్, స్విస్ రోల్స్, ఫ్రూట్ ఫిల్డ్ మఫిన్ల వరకు అందుబాటులో ఉన్న అనేక రకాల ప్యాకేజ్డ్ కేక్‌లకు డిమాండ్ బాగా ఉంది. గులాబ్ జామూన్, రస్మలై కేకులు లేదా ఫిర్ని తిరమిసు ఇలా బ్రెడ్ తయారీదారులు మన రుచులతో పాశ్చాత్య డెజర్ట్‌లను చొప్పిస్తున్నారు. పండుగలకూ పసందే.. పుట్టిన రోజులు లేదా వివాహాలతో పాటు కేక్ సంప్రదాయం భారతీయ పండుగలకు కూడా విస్తరించింది. రాఖీ, దీపావళి భాయ్ దూజ్ వంటి పండుగలు సంప్రదాయ స్వీట్లు – బహుమతులతో పాటు కేక్‌లను బహుమతిగా ఇచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. సంప్రదాయ స్వీట్లు ఇప్పటికీ పెద్ద ఎత్తున ఆదరణ పొందుతున్నప్పటికీ, కేక్‌ను బహుమతిగా ఇవ్వడం అనేది కూడా క్రమక్రమంగా ఊపందుకుంటోంది. అలా ఇచ్చి పుచ్చుకోవాలనుకునేవారి కోసం రిచ్ ప్లమ్ కేక్, విక్టోరియన్ ప్లమ్ కేక్, చాకొలెట్ ఐసింగ్ కేక్, వెనీలా ఐసింగ్ కేక్, పైనాపిల్, స్ట్రాబెర్రీ, బట్టర్ స్కాచ్, బ్లాక్ ఫారెస్ట్ కేకులతో పాటు ఫ్రెష్ ఫ్రూట్ కేక్, క్యారామిల్ కేక్, చాకొలెట్ ఆల్మండ్ కేక్.. వంటì వెన్నో.. సిటీ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఊపుతెచ్చిన.. ఈ–కామర్స్ఇ–కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల వల్ల కొన్ని గంటల్లో ఫ్యాన్సీ కేక్‌లను పంపడం/స్వీకరించడం çసర్వసాధారణమైపోయింది. కేక్ గిఫ్టింగ్ కోసం ఈ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొనుగోలు చేసి, బహుమతిగా పంపే సౌలభ్యంతో కేక్‌ల విక్రయాల్లో 12–15% పెంపునకు ఈ సైట్లు కారణమయ్యాయని అంచనా. ప్రముఖ ఆన్లైన్ బేకరీ రిటైల్ చైన్ అయిన విన్నీ విక్రయాల తీరు రాఖీ, భాయ్ దూజ్ లేదా దీపావళి వంటి పండుగల సమయంలో డిమాండ్‌కు అద్దం పడుతోంది. ఏతావాతా ప్లాట్‌ఫారమ్‌ల వెల్లువ కేక్ గిఫ్టింగ్ మార్కెట్ వృద్ధికి గణనీయంగా దోహదపడింది. రాఖీ, భైదూజ్ దీపావళి వంటి పండుగల సమయంలో కేక్ విక్రయాల దాదాపు 20% వృద్ధి రేటును చూసింది. సోషల్.. సోస్టైల్.. డిజైనర్ కేక్స్ హవాకు సోషల్ మీడియా ఆజ్యం పోస్తోంది. ఆకర్షణీయమైన వెరైటీలను సోషల్ వేదికలపై ఇన్ఫ్లుయెన్సర్లు, ఫుడ్ బ్లాగర్లు తాజా కేక్ డిజైన్లను క్రమం తప్పకుండా ప్రదర్శిస్తున్నారు. తద్వారా ప్రత్యేక సందర్భాలకు తగ్గట్టుగా డిజైన్ చేసిన కేక్‌ల వైపు వినియోగదారుల చూపు మళ్లేలా చేస్తున్నారు. పరిశ్రమ నివేదికల ప్రకారం, సోషల్ మీడియా ప్రభావం వల్ల దేశంలో కేక్ మార్కెట్ కొన్ని సంవత్సరాలుగా 20శాతం వరకూ పెరుగుతోందట.సందర్భమేదైనా.. సందడి కేక్స్దే.. ఒకప్పుడు కేక్స్‌ను కేవలం బర్త్‌డేలకు మాత్రమే ఎక్కువగా వినియోగించేవారు. క్రిస్మస్, న్యూ ఇయర్లతో పాటు ఇప్పుడు ఇవి విభిన్న సందర్భాలకు విస్తరించాయి. చిన్నారుల పుట్టిన రోజుల్ని ప్రతినెలా జరపడం దగ్గర నుంచీ వివాహ వార్షికోత్సవాల దాకా అలాగే కొత్తగా జాబ్‌లో చేరడం దగ్గర నుంచీ ప్రమోషన్స్, పదవీ విరమణ దాకా.. ఇలా అనేకానేక సందర్భాలకు కేక్స్‌ను వినియోగించడం జరుగుతోంది. పైనాపిల్ కేక్, బటర్‌స్కాచ్ కేక్, ఛీజ్ కేక్, బిస్కోటి కేక్.. తదితర వెరైటీలకు ఫుల్ డిమాండ్ ఉంది. – సయ్యద్ ఇర్ఫాన్, సుభాన్ బేకరీ -
సినివారం.. లఘు చిత్రాల సమాహారం..
సినిమా.. సినిమా.. అంటూ జీవితాన్ని సైతం అంకితం చేసి ఈ రంగంలో రాణించడానికి, వెండి తెరపైన తమకంటూ ప్రత్యేకంగా ఓ పేజీ రాసుకోవాలని తపించే, పరితపించే సినిమా ప్రేమికులెందరో. విభిన్న కళల సమాహారం సినిమా. కథకుడు, దర్శకుడితో మొదలై.. నటీనటులు, ప్లేబ్యాక్ సింగర్స్, మ్యూజిక్, కొరియోగ్రఫీ, ఆర్ట్, వీఎఫ్ఎక్స్, డబ్బింగ్.. ఇలా విభిన్న కళాకారుల సమిష్టి కృషి సినిమా. ఈ వేదికపై తమ పేరును చూసుకోవాలన్నా, వారి చిరకాల ఆకాంక్షను నెరవేర్చుకోవాలన్నా ఎక్కడో సాయం అందాలి.ఇప్పుడిప్పుడే సినీ రంగం వైపు అడుగులేస్తున్న ఔత్సాహికుల కళాత్మకతను, సృజనాత్మకతను గుర్తించే వారుండాలి..?! సినిమానే లక్ష్యంగా లఘుచిత్రాలు రూపొందిస్తూ, బిగ్ స్క్రీన్ కోసం ప్రయత్నిస్తున్న సినీపిపాసులను ఆదరించే ప్రోత్సాహం అవసరం.. ఇలాంటి వారందరినీ సగర్వంగా ప్రపంచానికి పరిచయం చేస్తోంది ‘సినివారం’. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నగరం నడిబొడ్డున కొలువుదీరిన రవీంధ్రభారతి వేదికగా ప్రతి శనివారం నిర్వహిస్తున్న ‘సినివారం’ ఈ తరం సినీ ప్రేమికులకు స్వర్గధామం. ఉత్తమ షార్ట్ ఫిలింస్ నిర్మించే వారిని గుర్తించి వారి ప్రయాణానికి రెడ్ కార్పెట్ వేస్తోంది రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ ‘సినివారం’. – సాక్షి, సిటీబ్యూరోవినీలాకాశంలాంటి సినీ ప్రపంచంలోకి అడుగులేసిన యువతరానికి గుర్తింపునివ్వాలనే లక్ష్యంతో 2016 నవంబర్ నెలలో పురుడుపోసుకుంది ‘సినీవారం’. సృజనాత్మకత ఉండి, సినిమాపై ప్రేమతో మొదటి ప్రయత్నంగా లఘు చిత్రాలు రూపొందిస్తున్న తెలంగాణ యువత ఎందరో. వారందరికీ ఒక అవకాశంతో పాటు, సినిమా రంగానికి వారి సృజనాత్మకతను తెలియజేసేది ఆ షార్ట్‌ఫిల్మ్ మాత్రమే. అనంతరం దానిపై సినీ రంగ ప్రముఖులతో చర్చిస్తుంది ఈ సినీవారం. ఇందులో భాగంగా ఈ ఎనిమిదేళ్లలో కొన్ని వందల లఘు చిత్రాలు ఈ తెరపై ప్రదర్శితమయ్యాయి. వీటిని రూపొందించిన సినీ ప్రేమికులకు నేరుగా అవకాశాలు లభించాయి. నూతన తెలంగాణలో సినీ ప్రేమికులకు ఇదొక అవకాశాల పుష్పక విమానం. నైపుణ్యాలను గుర్తించి.. లోపాలను సవరిస్తూ.. తెలంగాణకు సినిమా కొత్త కాదు. ఆ రోజుల్లోనే బాలీవుడ్లో తనదైన ముద్ర వేసుకున్న మొదటి తరం సినీ రంగ ప్రముఖులు.. పైడి జయరాజ్. ఆయన గౌరవార్థం రవీంద్రభారతిలోని థియేటర్‌కు పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ అని నామకరణం చేశారు. ఈ థియేటర్లోనే ఈ తరం యువకులు తీసిన లఘు చిత్రాలను క్రమం తప్పకుండా ప్రతి శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకూ ప్రదర్శిస్తున్నారు. కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మం, ఆదిలాబాద్, హైదరాబాద్.. ఇలా తెలంగాణలోని విభిన్న ప్రాంతాల్లో యువతరం తీసిన షార్ట్ ఫిల్మŠస్, డాక్యుమెంటరీలను ఈ వేదికపై ప్రదర్శించి వారికి ఒక గుర్తింపునిస్తోంది రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ. ఈ ప్రయత్నంలో వారి నైపుణ్యాలను, లోపాలను ఇదే వేదికపై తెలియజేసేలా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు, సినీ ప్రముఖులు, నిపుణులు, ప్రముఖ సినీ విమర్శకులతో చర్చా గోష్టిని నిర్వహిస్తున్నారు. అనంతరం వారికి సినిమా అవకాశాలు లభించేలా ఒక దారిని చూపిస్తోంది.మహామహులంతా ఇక్కడి నుంచే.. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి హిట్ చిత్రాలతో ఫేమస్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన తరుణ్ భాస్కర్, మెయిల్ సినిమాతో చిన్న సినిమాకు పెద్ద గుర్తింపు తీసుకొచ్చిన ఉదయ్ గుర్రాల, దొరసాని ఫేం కేవీఆర్ మహేంద్ర వంటి ఈ తరం సినీ దిగ్గజాలు తమ మొదటి సినీ ప్రయత్నాలను ఈ సినీవారం వేదికగానే ప్రదర్శించారు. ఇలా దర్శకులు, నటులు, సినీ రచయితలతో పాటు సిని పరిశ్రమకు అవసరమయ్యే విలువైన ముడిసరుకు కొంతమేర ఈ సినీవారం వేదికగా సమకూరుతోంది. ఇక్కడ ప్రదర్శించే లఘుచిత్రాలు ప్రధానంగా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, తెలంగాణ పోరాటాలు, యధార్థగాథలతో పాటు నేటి మోడ్రన్ కమర్షియల్ సినిమాల నాణ్యతను పరిచయం చేస్తున్నాయి. క్రియేటివిటీకి కేరాఫ్ అడ్రస్... పదేళ్ల కృషికి నిదర్శనం ఇది.. ప్రస్తుత సినిమాల్లో తెలంగాణ నేపథ్యమున్న కళాకారులు, కథలు, సినిమాలు, టెక్నీషియన్లు వారి విజయాలు..!! ఈ లక్ష్యం నిర్దేశించుకునే 2016లో ‘సినివారం’ను ప్రారంభించాం. గతంలో ముంబైలోని బాలివుడ్ కమర్షియల్ సినిమాలకు కేంద్రం. కానీ అక్కడి మరాఠీ సినిమాలు కూడా వాటి ప్రత్యేకతను, ప్రాధాన్యతను, ప్రశస్తిని కొనసాగించాయి. అలాగే హైదరాబాద్‌లోనూ తెలుగు సినిమా సైతం తన వైవిధ్యాన్ని, విశిష్టతను ప్రదర్శించాలనే లక్ష్యంతో ఈ వినూత్న ప్రయత్నానికి నాంది పలికాం. ఇందులో భాగంగా కళ, నైపుణ్యాలు, సృజనాత్మకత ఉండి, అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు అద్భుత వేదికను నిర్మించాం. ఈ సినివారం వేదికగా ఇప్పటి వరకూ దాదాపు 27 మంది ఈ తరం దర్శకులు పరిచయమయ్యారు. అంతేకాకుండా 24 క్రాఫ్టŠస్కు చెందిన నిపుణులు గుర్తింపును, అవకాశాలను పొందారు. ఇలాంటి ఔత్సాహికుల కోసం ఇక్కడ వారి షార్ట్ ఫిల్మ్ ప్రదర్శనతో పాటు వర్క్‌షాప్‌లు, శిక్షణా తరగతులు, అవగాహనా సదస్సులు, ఇంటరాక్టివ్ సెషన్స్ తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అందించే సేవలన్నీ ఇక్కడ అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇటీవలే సినిమాల్లో ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ (ఏఐ) ప్రాధాన్యత పైన వర్క్‌షాప్ నిర్వహించాం. సినిమా రంగంలోని అధునాతన మార్పులపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాం.భవిష్యత్‌లోనూ ఈ తరం సినిమా ప్రేమికులకు మరిన్ని అవకాశాలను భాషా సాంస్కృతిక శాఖ అందిస్తుంది. – మామిడి హరిక్రిష్ణ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు -
కుంచె గీసిన చిత్రం..
నగరంలోని పలు కూడళ్లు రంగులద్దుకుంటున్నాయి. విభిన్న కళాకృతులతో ఫ్లై ఓవర్ పిల్లర్లు, అండర్ పాస్ గోడలు కలర్ ఫుల్ పెయింటింగ్స్‌తో కళకళలాడుతున్నాయి. ఒక్కో సెంటర్‌కు ఒక్కో రకమైన థీమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గత రెండు నెలలుగా కళాకారులు తమ ప్రతిభతో ఎంతో అందమైన కళాఖండాలను తీర్చిదిద్దుతున్నారు. ఆ దారిన పోయే ప్రయాణికులను ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పర్యావరణం, ఆరోగ్యం, నగర, గ్రామీణ ప్రజల జీవన శైలి, జంతువులు, పక్షులు, క్రీడలు ఇలా విభిన్న రంగాలకు చెందిన చిత్రాలు నడయాడినట్లు దర్శనమిస్తున్నాయి. ఇందులో కళాకారులతో పాటు, ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు సైతం పాలుపంచుకుంటున్నారు. ఎల్బీనగర్ నుంచి లింగంపల్లి వరకూ.. మెహిదీపట్నం నుంచి సికింద్రాబాద్ వరకూ.. హైటెక్ సిటీ నుంచి ఉప్పల్ సచివాలయం వరకూ.. ఇలా ఎటు చూసినా వంతెనల పిల్లలర్ల మీద, వంతెనల గోడలపైనా ఇటీవల కాలంలో కొత్త సొబగులద్దుకుంటున్నాయి. రేవంత్ సర్కార్ వచ్చిన తరువాత వాల్ పెయింటింగ్స్‌తో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు కార్యాచరణలోకి దిగారు. ప్రతి ఫ్లై ఓవర్ వంతెన, అండర్ పాస్ గోడలు, పిల్లర్లకు అందమైన ఆకృతుల్లో చిత్రాలకు ప్రాణం పోస్తున్నారు. ఒక్కో సెంటర్లో ఒక్కో రకమైన థీమ్‌తో చిత్రాలు వేస్తున్నారు. ఎల్బీ నగర్ కూడలిలో వంతెన పిల్లర్లకు ఓ వైపు సంప్రదాయ నృత్యాలు, మైరో వైపు పాప్ డ్యాన్సర్స్ చిత్రాలు తీర్చిదిద్దారు. ఫ్లెక్సీ ప్రింటింగ్‌తో ముప్పు..ఒకప్పుడు ఆర్టిస్టులకు చేతినిండా పని ఉండేది. దీంతో బ్యానర్లపై రాతలు రాయడం, గోడలపై చిత్రాలు వేయడం, రాజకీయ, సినీ ప్రముఖుల కటౌట్లను సిద్ధం చేయడం, వివిధ సందర్భాల్లో ఆరి్టస్టులకు చేతినిండా పని దొరికేది. దీంతో గతంలో ఫైన్ ఆర్ట్స్ నేర్చుకోవాలనే ఆలోచన ఎక్కువ మందిలో కనిపించేది. అయితే ఇటీవలి కాలంలో మార్కెట్లోకి డిజిటల్ ఫ్లెక్సీ ప్రింటింగ్ అందుబాటులోకి రావడంతో తక్కువ ఖర్చు, వేగంగా పని పూర్తవుతుండడంతో పలువురు దీనిపై మక్కువ చూపుతున్నారు. దీంతో పెయింటింగ్ ఆరి్టస్టులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయని పలువురు కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం, ఉపాధి మార్గాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వాపోతున్నారు.36 ఏళ్లుగా ఇదే వృత్తి..1988లో ఆరి్టస్టుగా ప్రయాణం మొదలు పెట్టాను. ప్రభుత్వం వాల్ పెయింటింగ్స్‌కు అవకాశం కల్పించడం సంతోషంగా ఉంది. కళాకారులకు పని దొరుకుతుంది. రోజుకు రూ.2 వేలు ఇస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ఏ రకమైన పెయింటింగ్స్ వేయాలని సూచిస్తే వాటినే చిత్రిస్తున్నాం. ఈ పని ఎన్నాళ్లు ఉంటుందో తెలీదు. పదేళ్ల క్రితం వరకూ చేతినిండా పని ఉండేది. ఫ్లెక్సీ ప్రింటింగ్ వచ్చిన తరువాత నెలలో కొన్ని రోజులు పనిలేక ఖాళీగా ఉండాల్సి వస్తోంది. – అశోక్, కళాకారుడు, హయత్నగర్ఆరు నెలలు పని కలి్పంచాలి.. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పని కల్పించినట్లు సంవత్సరంలో కళాకారులకు కనీసం ఆరు నెలలు పనికల్పించే విధంగా చట్టం చేయాలి. ఒకప్పుడు ఫైన్ ఆర్ట్స్ అంటే సమాజంలో డిమాండ్ ఉండేది. ఫ్లెక్సీలు వచ్చాక క్రమంగా పని తగ్గుతోంది. పదో తరగతి చదివి ఆరి్టస్టుగా స్థిరపడ్డాను. ఇప్పుడు నెలలో 20 రోజులు పని ఉంటే పది రోజులు ఖాళీగా ఉండాల్సి వస్తోంది. ప్రభుత్వమే కళాకారులను ఆదుకుని జీవనోపాధి చూపించాలి. – సత్యం, కళాకారుడు, హయత్‌నగర్ -
రేర్ బర్డ్స్.. నో వర్డ్స్..
రాష్ట్రానికి, నగరానికి ఏడాది పొడవునా వలస పక్షుల రాకపోకలు ఉంటాయి. సమ్మర్లో కొద్దిగా మాత్రమే వస్తాయి. అయితే వర్షాకాలం నుంచి పెరుగుతూ.. వింటర్లో బాగా ఎక్కువగా 2, 3 రెట్లు ఎక్కువగా పక్షులు వలస వస్తాయి. ఒకప్పుడు ఇలాంటి వలస పక్షులకు నగరంలో చాలా స్పాట్స్ ఉన్నాయి. కానీ కాలక్రమంలో లేక్స్ కనుమరుగవుతుండడం వల్ల వీటికి ఆవాసాలు దొరకడం లేదు. చిరునామాలివే.. నగరం చుట్టు పక్కల పక్షుల వీక్షణకు వీలు కల్పించే ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఒకప్పుడు అమీన్పూర్లేక్, జనవాడ వైపు గండిపేట్లేక్, మోకిలా వంటి ప్రాంతాల్లో విపరీతంగా కనిపించేవి. ఇప్పుడు బాగా తగ్గిపోయాయి. ఇప్పటికీ కాలుష్య కాసారాలుగా మారిన లేక్స్‌లో కూడా పక్షలు కనిపిస్తున్నాయి. వాటిని కాలుష్యరహితంగా మారిస్తే మరింత బాగా పెరుగుతాయి. సంజీవయ్య పార్క్ దగ్గర కూడా బోలెడు పక్షులు, డక్స్ ఉంటాయి. నగరంలో ప్రస్తుతం పక్షులు చూడాలంటే కెబిఆర్ పార్క్, బొటానికల్ గార్డెన్స్, సంజీవయ్య పార్క్‌లలో చూడొచ్చు. చుట్టుపక్కల చెరువుల్లో.. నగరం చుట్టుపక్కల అయితే.. అనంతగిరి హిల్స్ బెస్ట్. అక్కడకు వెళ్లినప్పుడల్లా ఒక్కోసారి ఒక్కో ఆశ్చర్యకరమైన పక్షి కనబడుతుందని పక్షి ప్రేమికులు అంటున్నారు. అదే కాక ఉస్మాన్‌సాగర్, కొడకంచి లేక్, కృష్ణారెడ్డి పేట్ చెరువు.. మంజీరా వైల్డ్‌లైఫ్ శాంక్చురీ, పోచారం వైల్డ్‌లైఫ్ శాంక్చురీ, నర్సాపూర్ రిజర్వ్ ఫారెస్ట్, సింగూర్ డ్యామ్ కూడా బర్డ్స్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా చెప్పొచ్చు. ఇటీవల సిటీలోని కొన్ని గేటెడ్ కమ్యూనిటీల్లోని కాలనీ పార్క్స్‌లో కూడా బాగా పెరుగుతున్నాయి.సీజన్ స్పెషల్స్ ఇవే.. వానాకాలం మన సమీపానికి వచ్చే పక్షుల్లో రెయిన్ క్వాయిల్, పెయింటెడ్ ఫ్రాంకొలిన్, జాకొబిన్ కుకూ (దీనినే మాన్సూన్ బర్డ్ అని కూడా పిలుస్తారు. ఇది రుతుపవనాల ప్రారంభ సమయంలో వస్తుంది) వంటివి ఉన్నాయి. ఇవి మంజీరాలేక్, యంకతల.. వంటి సరస్సులు, పచ్చని పచి్చక బయళ్లలో కనిపిస్తాయి. ఇక శీతాకాలంలో వచ్చేవాటిలో వర్డియర్ ఫ్లై క్యాచర్, ఇండియన్ బ్లూ రాబిన్, బార్ హెడెడ్ గూస్ (ఇది సరస్సుల దగ్గర బాగా కనిపిస్తుంది. ప్రస్తుతం మంజీరాలేక్ దగ్గర దీనిని చూడొచ్చు. విదేశాల నుంచి హిమాలయాల మీదుగా ఈ పక్షి నగరానికి చేరుతుందట)తొలిసారిగా బర్డ్స్ పై బుక్.. మనకి చాలా చోట్ల పక్షులు కనిపిస్తాయి. కానీ అవేంటో వాటి ప్రత్యేకతలేమిటో తెలీదు. ఈ నేపథ్యంలో కొన్ని కామన్ బర్డ్స్ తీసి ఒక గైడ్‌లాగా ఇస్తే బాగుంటుందనీ, స్టూడెంట్స్‌కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ వాళ్లకి ఇస్తే ఉపయుక్తంగా ఉంటుందనే ఆలోచనతో తొలిసారిగా మన రాష్ట్రంలో పక్షుల వెరైటీలపై ఒక పుస్తకం రూపొందింది. రాష్ట్రంలో 430పైగా వెరైటీ పక్షులు ఉంటాయి. ఇందులో 252 రకాల పక్షుల ఫొటోలు, వాటి పేర్లు, విశేషాలు ఉంటాయి. రెగ్యులర్‌గా అనంతగిరికి ట్రెక్కింగ్‌కి వెళ్తుంటారు. అలాంటివారికి ఇవి ఇస్తే ఉపయుక్తం. ప్రభుత్వ పాఠశాలలకు, కళాశాలల విద్యార్థులకు లక్ష కాపీల వరకూ ఉచితంగా పంపిణీ చేయాలనే ఆలోచన చేస్తున్నారు. అమెరికా నేర్పిన అలవాటుగతంలో ఒకసారి అమెరికాలో కొంతకాలం ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో నేనున్న ప్రాంతానికి దగ్గరలో పెద్ద అడవి ఉండేది. అక్కడ రంగు రంగుల పక్షుల్ని కళ్లార్పకుండా చూడడం అలవాటైంది. ఇక్కడకు వచ్చాక సిటీలో పక్షులును అన్వేషిస్తూ.. సంజీవయ్య పార్క్‌కు తరచూ వెళ్లేవాడిని. ప్రస్తుతం విభిన్న ప్రాంతాలకు వెళ్లి పక్షుల్ని చూడడం ఒక నిత్యకృత్యం. ఈ అభిరుచితోనే హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ ప్రారంభించాం. తాజాగా బర్డ్స్ మీద బుక్ లాంచ్ చేశాం. అంతేకాకుండా జనవరి నుంచి బర్డ్ అట్లాస్ పేరుతో వైవిధ్యభరిత కార్యక్రమం చేపడుతున్నాం. నగరం చుట్టుపక్కల విభిన్న ప్రాంతాల నుంచి దీనికి కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఏ పక్షి ఎప్పుడు ఎలా కనిపిస్తుంది? అనేది రికార్డ్ చేసి ఒక మ్యాప్ తయారు చేయాలని ఆలోచన. అయితే దీన్ని పూర్తి చేయడానికి కనీసం ఏడాది పడుతుంది. – హరికృష్ణ, హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ -
ఐటీ జాబ్స్.. పిటీ లైఫ్
సాఫ్ట్వేర్ జాబ్స్ ఈ తరానికి ఎయిమ్స్ అండ్ డ్రీమ్స్.. మారుతున్న అధునాతన సాంకేతికత, మోడ్రన్ లైఫ్ స్టైల్లో తాము కూడా భాగస్వాములు కావాలనే ఆశయంతో టెకీలుగా మారుతున్న యువకులెందరో.. ఐదంకెల జీతం, ఐదు రోజులు మాత్రమే పని, సామాజిక హోదా, గుర్తింపు, గౌరవం.. ఇలా ఎన్నెన్నో ఆశలతో అక్షయపాత్ర వంటి సాఫ్ట్వేర్ పల్లకీలోకి అడుగెడుతున్నారు. కానీ.. ఒక్కసారి ఈ రంగంలోకి వచ్చాక వారి జీవన శైలి వారు అనుకున్నట్టుగానే ఉంటుందా..? సామాజికంగా, సౌకర్యాల పరంగా వైరల్ అవుతున్న రీల్స్‌లా ఉన్నప్పటికీ, వారి వ్యక్తిగత జీవితం ఆ రీల్స్‌కు వచ్చే కామెంట్ల మాదిరిగా మారింది. మానసిక ఒత్తిడి, శారీరక అనిశ్చితి, ఆర్టిఫిషియల్ ఆర్భాటాలు..! నాణానికి మరో కోణం వంటి ఈ అవస్థల పరిష్కారానికి నగరంలో వెల్నెస్ సెంటర్లు సైతం వెలుస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో శారీరక శ్రమ లేకుండా సాఫ్ట్‌గా కొనసాగుతున్నప్పటికీ.. మానసికంగా ఒత్తిడి మాత్రం పీక్స్‌లో ఉంటుందని టెకీల మాట. సాఫ్ట్వేర్లు, ఐటీ ఉద్యోగుల దైనందిన జీవితం.. కొత్త ప్రాజెక్ట్‌లు, ప్రాజెక్ట్ డెవలప్మెంట్లు, పైప్‌లైన్ ప్రాసెస్, డిప్లాయిమెంట్, అజైల్ ప్రాసెస్, బెంచ్, టెస్టింగ్, క్వాలిటీ అష్యూరెన్స్ తదితర నైపుణ్యాల మధ్య అందమైన దయనీయంగా కొనసాగుతుంది. ఐదు రోజుల పని, వారానికి రెండు రోజులు సెలవులు. ఇంకేం.. హాయిగా ఎంజాయ్ చేయవచ్చని అనుకుంటాం.. కానీ క్రెడిట్ బిల్లులు, ఈఎంఐ పేమెంట్స్, రీఫండబుల్ అకౌంట్స్ చెక్ చేసుకుని, సెట్ చేసుకునేలోపు సోమవారం వస్తుందని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తెలిపారు. ఆఫీసులోనైనా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఐనా, హైబ్రిడ్ ఐనా.. ఒత్తడి మాత్రం తప్పదంటున్నారు గచ్చిబౌలికి చెందిన ఐటీ ప్రొఫేషనల్ గౌతమీ. జాబ్ రాక ముందు ఒక అవస్థ, వచ్చాక దానిని కాపాడుకోవడానికి మరో అవస్థ.. వీటి మధ్య టార్గెట్ రీచ్ కావడానికి, సొల్యూషన్స్ క్లియర్ చేయడానికి ల్యాప్‌ట్యాప్ పైన చేసే యుద్ధం మరో ప్రపంచ యుద్ధాన్ని గుర్తు చేస్తుందని యువ సాఫ్ట్వేర్ నరేష్ తెలిపారు. ఇక బెంచ్‌పై ఉన్న వారి పరిస్థితి వివరించడానికి మరో జావా లాంగ్వేజ్ తయారు చేయాలని స్టీఫెన్ మాట. అసహజ జీవనానికి వేదికలుగా.. అందమైన అద్దాల గ్లోబల్ భవనాల్లోని ఈ సాఫ్ట్వేర్ల ఒత్తిడి వారి జీవితాల పైన పెద్ద ప్రభావమే చూపిస్తుందని ఆరోగ్య నిపుణలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి వారి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ను విపరీతంగా పెంచుతుంది. విభిన్న ఆరోగ్య సమస్యలకు ఇది మూల కారణమని నిపుణుల మాట. పనివేళల్లో దాదాపుగా కూర్చొనే ఉండటంతో ఉబకాయం, మధుమేహం పక్క సీట్లోనే ఎదురు చూస్తుంది. వెన్ను నొప్పులు, నరాల బలహీనత ఇలా తదితర సమస్యలకు ఈ హైటీ ఒత్తిడి కారణమవుతోంది. దీనికి తోడు నైట్ డ్యూటీలు సహజ జీవన విధానానికి ఆటంకంగా మారిందిన అంతర్జాతీయ ఆరోగ్య సర్వేలు, అధ్యయనాలు వెల్లడించాయి. ఇలాంటి సమస్యలు పెరుగుతున్న సమయంలో వీరికి సాంత్వన, సహకారం అందించడానికి విభిన్న రకాల వెల్నెస్ సెంటర్లు ఆవిష్కృతమైతున్నాయి. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి, అంతర్గత స్థిరత్వాన్ని అందిపుచ్చుకోవడానికి మెడిటెషనల్ కోర్సులు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. యోగా, మ్యూజిక్, ధ్యానం.. మీరు సాఫట్వేర్ ఉద్యోగా..?! ఐతే మీ కోసమే మా ఈ సెషన్ అంటూ సోషల్ మీడియా యాడ్. ధ్యానం, యోగా సమ్మిళితంగా వినూత్న కోర్స్ అది. ఒత్తిడిమయమైన యువకులకు ఇదో ఉపశమనం. నగర శివార్లలో పచ్చని పారవశ్యంలో ఏర్పాటు చేసిన మరో బైండ్ మ్యాజిక్ సెంటర్. ఇక్కడ వారు నిర్వహించే సైకలాజికల్ సెషన్స్ మెదడుపై ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మరింత చురుకుగా పనిచేసేలా చేస్తుంది. ఇలాంటి వారికి స్పిర్చువల్ మ్యూజిక్ హీలింగ్ సెంటర్లు కూడా ఎంతో మేలు చేస్తున్నాయి. ఏరోబిక్స్, జుంబా వంటి ఫిట్నెస్ సెంటర్లు సైతం ఈ అవస్థలకు కాసింత చెక్ పెడుతున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ రంగంలోని అనారోగ్య సమస్యలకు ఎర్గనామిక్స్ అనే ప్రత్యేక మెడికల్ సేవలు సైతం ఉన్నాయి. ఈ మధ్య ఈ సేవలు మరింత ఆదరణ పొందుతున్నాయి. ఎన్షూర్ ఫర్ క్యూర్.. సాఫ్ట్వేర్ రంగంలోని ఉద్యోగులు అధిక సమయం కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చునే పని చేయాలి. నగరంతో పాటు దేశంలోని ఈ రంగంలో దాదాపు 64 శాతం మంది సెడెంటరీ డెస్క్ జాబ్‌లలో ఉన్నవారే. ఇటీవలి ప్రముఖ అధ్యయనం ప్రకారం ఇలాంటి ఉద్యోగాల వలన ప్రపంచవ్యాప్తంగా 540 మిలియన్లకు పైగా ప్రజలను నడుము నొప్పి ప్రభావితం చేస్తుంది. 25 సంవత్సరాల్లో ఈ పరిస్థితి రెట్టింపు అయ్యింది. శరీరానికి మూలస్థంభమైన వెన్నెముక ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో భాగంగా అధిక ఒత్తిడిని, భారాన్ని భరిస్తోంది. ఈ సమస్య అనతికాలంలోనే విభిన్న ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. ఈ తరుణంలో సంరక్షణ కోసం ఎన్షూర్ హెల్తీ స్పైన్ అనే విధానాన్ని ప్రవేశ పెట్టాం. ఈ అవస్థలు ఎదుర్కొంటున్న వారికి ప్రివెంటివ్ స్పైన్, స్పోర్ట్స్ హెల్త్ సెంటర్‌గా సాధారణ, సరళమైన పద్ధతులు రూపొందించాం. కోర్ కండరాలను బలోపేతం చేయడానికి ప్లాంక్స్, బ్రిడ్జెస్ వంటి వంటి వ్యాయామాలు.. ఫ్లెక్సిబుల్, బ్యాలెన్స్ కోసం మైండ్‌ఫుల్ మూవ్మెంట్స్ పద్ధతులు నిర్వహిస్తున్నాం. వెన్నుముక అవస్థలకు ఎర్గోనామిక్ వర్క్స్పేస్తో చెక్ పెట్టవచ్చు. – నరేష్ పగిడిమర్రి, ఎన్షూర్ హెల్తీ స్పైన్ సీఈఓ. -
రీడ్.. రైట్.. రైట్
ఈ మధ్య మంచి సినిమా వచ్చింది చూశావా బ్రో.. ఇన్‌స్టాలో కొత్త రీల్ ట్రెండింగ్‌లో ఉంది తెలుసా మచ్చా.. యూట్యూబ్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది సెండ్ చేయాలా? ఈ తరం యువతను కదిపితే వారి నోటివెంట ఎక్కువగా వచ్చే మాటలు. మనలో చాలా మంది ఇలాగే మాట్లాడతారు కూడా. అదే ఏదైనా పుస్తకం గురించి చెప్పామనుకోండి.. పుస్తకమా.. పుస్తకం చదివే టైం ఎక్కడుంది.. అయినా ఈ రోజుల్లో పుస్తకాలు ఎవరు చదువుతారు చెప్పండి! అంటూ తిరిగి ప్రశ్నిస్తుంటారు. నిజమే పుస్తక పఠనం ఈ తరం యువతలో తగ్గిపోయిందని అనుకుంటారు. కానీ మనలో చాలా మంది ఈ ట్రెండ్స్‌ని ఫాలో అవుతూనే ఏదో ఒక పుస్తకాన్ని చువుతూ ఉంటారు. మరికొందరైతే పుస్తకాలంటే పడి చచి్చపోతుంటారు. తెలుగుతో పాటు ఇంగ్లిష్ పుస్తకాలను తెగ చదివేస్తున్నారు. ఇన్‌స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ మాత్రమే చూసే ఈ తరం యువతీ, యువకుల్లో చాలా మంది పుస్తకాలు చదివే వాళ్లు కూడా ఉన్నారా అని మనలో కొందరికి డౌటనుమానం? అయితే అదంతా వట్టి అపోహేనని ఏటా జరిగే హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు వచ్చే స్పందన రుజువు చేస్తోంది. వేలాది మంది యువత ఈ ఫెయిర్‌లో లక్షల సంఖ్యలో పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు బుక్ ఫెయిర్‌లో అమ్మకాలు ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలానే కొనసాగుతున్నాయని చెబుతున్నారు నిర్వాహకులు. నవలలకు ప్రాధాన్యం.. పుస్తకాలు చదివే వారిలో ఎక్కువగా నవలలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పొట్టి వీడియోలు, షార్ట్ న్యూస్ లాగే పొట్టి కథలు చదివేందుకు ఇష్టపడుతున్నారు. తక్కువ నిడివిలో చెప్పాల్సిన విషయాన్ని చెప్పేసే నవలలకు యువత ఎక్కవగా అట్రాక్ట్ అవుతోంది. ఇక, వచన కవిత్వంపై కూడా యూత్ మనసు పారేసుకుంటోంది. దీంతో పాటు ప్రముఖుల ఆత్మకథలు చదివేందుకు చాలా మంది యువతీ, యువకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఒకప్పుడు ఇంగ్లిష్ లో నవలలు చదివేందుకు కాలేజీ విద్యార్థులు మొగ్గు చూపేవారు. కానీ ఇప్పుడు మాతృభాష అయిన తెలుగు పుస్తకాలు చదివేందుకు ప్రయతి్నస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్నప్పటి నుంచి ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్న వారు తెలుగు పుస్తకాలు చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు.పాఠకులు పెరుగుతున్నారు.. 1990లలో పుస్తకాలు బాగా హిట్ అయ్యేవి. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఎంత ఆసక్తిగా ఉన్నా కూడా పుస్తకాలు చదివే వారు తక్కువయ్యారని చాలా మంది అంటుంటారు. కానీ పుస్తకాలు చదివేవారు బాగానే పెరిగారు. ఓ సినిమా బాగుంటే ఎలా చూస్తున్నారో.. మంచి కథ.. విభిన్న కథనంతో పుస్తకాలు మార్కెట్లోకి వస్తే కళ్లకద్దుకుని చదివే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇటీవల వచ్చిన ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ అనే పుస్తకం దాదాపు లక్ష కాపీలు అమ్ముడుపోవడమే ఇందుకు నిదర్శనం. నిజ జీవితంలో జరిగే ఉదంతాలనే ఆసక్తిగా రాస్తే పుస్తకాలు చదువుతారని ఆ పుస్తక రచయిత నిరూపించారనడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి పుస్తకాలు చదివిన తర్వాత చాలా మంది ఏదైనా మంచి పుస్తకం ఉంటే చెప్పండి బ్రదర్ అని తెలిసిన వారిని ఇప్పటి యువతీ, యువకులు అడుగుతున్న సందర్భాలు కోకొల్లలు.రచయితలుగానూ రాణిస్తూ.. ఇటీవలి కాలంలో పుస్తకాలు రాసేందుకు కూడా యువత ఆసక్తి కనబరుస్తోంది. ముఖ్యంగా మాతృభాషపై మమకారంతో తమకు సాధ్యమైనంత వరకూ రచనలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు హాబీగా ఖాళీ సమయాల్లో రచనలు చేస్తుండగా.. కొందరు మాత్రం రచనను కెరీర్‌గా ఎంచుకుంటున్నారు. మంచి కథతో వస్తే పాఠకులు ఆదరిస్తారనే నమ్మకం పెరగడంతో, మంచి కథలు రాసేందుకు ప్రయతి్నస్తున్నారు. అందరికీ పుస్తకాలు అచ్చు వేయించుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. అందుకే చాలా మంది సామాజిక మాధ్యమాల్లో చిన్న చిన్న కథలు రాస్తూ తమ అభిరుచిని చాటుకుంటున్నారు. ఇలా రాస్తూ.. రాస్తూ.. పుస్తకాలు ప్రచురించేసి, ఆదరణ పొందుతున్న వాళ్లూ లేకపోలేదు. ఇక, పుస్తకాలు, సోషల్ మీడియాలో రాస్తూ సినిమాల్లో గేయ రచయితగా, స్క్రిప్ట్ రైటర్‌గా కూడా వెళ్లేందుకు దారులు వెతుక్కుంటున్నారు.వెలకట్టలేని అనుభూతి.. పుస్తక పఠనం ఎప్పటికీ వన్నె తరగనిది. సామాజిక మాధ్యమాలు తాత్కాలికమే. పుస్తకాలు చదివితే ఏదో వెలకట్టలేని అనుభూతి కలుగుతుంది. సోషల్ మీడియాలో సమయాన్ని వృథా చేసుకునే బదులు మంచి పుస్తకం చదివితే కొత్త ప్రపంచాన్ని చూసిన వాళ్లమవుతాం. – డాక్టర్ మల్లెగోడ గంగాప్రసాద్, రచయితఅవినాభావ సంబంధం చిన్నప్పటి నుంచే చిన్న చిన్న కథలు, వ్యాసాలు రాయడం అలవాటు. తెలుగుపై మమకారంతో తెలుగులో పీజీ చేశాను. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రచయిత్రుల కథా సాహిత్యం– స్త్రీ జీవన చిత్రణ అనే అంశంపై పీహెచ్డీ చేస్తున్నాను. పుస్తక పఠనంతో భాషను మెరుగుపరుచుకోవచ్చు. నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథలు ఆసక్తిగా ఉంటాయి. – పెద్దపల్లి తేజస్వి, పరిశోధక విద్యారి్థని, ఓయూబంగారు భవితకు బాట.. పుస్తక పఠనం యువత బంగారు భవితకు బాటలు వేస్తుంది. సాహిత్య పఠనం ద్వారా సామాజిక స్పృహ కలుగుతుంది. పుస్తకం చదువుతుంటే ఎంతో మందితో సాన్నిహిత్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది. భావ వ్యక్తీకరణ, భాషా నైపుణ్యం, ఏకాగ్రత, ఓర్పు, సహనం పెరుగుతుంది. – రావెళ్ల రవీంద్ర, యువ రచయిత -
క్రేజీ.. డీజే..
అర్ధరాత్రి సమయం..చిమ్మ చీకట్లని. పట్ట పగలుగా మార్చే రంగురంగుల విద్యుత్ కాంతుల్లో.. ఓ వైపు ఛీర్స్‌తో హుషారు.. మరోవైపు చిందుల జోరు.. ఆ సమయంలో తోడు లేకుండా అమ్మాయిలు బయటకు వెళ్లడమే సరికాదని నొక్కి వక్కాణించే సంప్రదాయ వాదుల చెవులకు చిల్లులు పడే సంగీతంతో కదం తొక్కుతున్నారు ఆధునిక యువతులు. డీజేలుగా.. మేల్ డామినేషన్‌కు గండికొడుతూ శరవేగంగా ముందుకు దూసుకొస్తున్నారు. ‘మనసుకు నచ్చిన సంగీతం.. వయసుకు తగ్గ వినోదం.. మంచి ఫ్రెండ్స్. ఇన్ని అందించే రంగాన్ని వదిలేసి సాదా సీదా ఉద్యోగం ఎందుకు చేయాలి?’ అని ప్రశ్నింస్తున్నారు అఖిల. ఉద్యోగం అంటే మంచి ఆదాయం వస్తుంది కదా..అంటే..! ‘నేను ఎంచుకున్న కెరీర్లో అంతకన్నా ఎక్కువ సంపాదనే ఇప్పుడు వస్తుంది’ అంటూ స్పష్టం చేశారు. సాయంత్రం ఆరు దాకా అఖిల.. ఆరు దాటాక డీజే బ్లాక్.ఎవరూ డేర్ చేయని రోజుల్లోనే.. దాదాపు పదేళ్ల క్రితమే ఈ రంగంలోకి వచ్చారు లీనా. నగరంలోని సికింద్రాబాద్‌లో నివసించే ఈ సింథీ యువతి.. డిగ్రీ పూర్తి చేసి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు కూడా చేశారు. అనంతరం కొన్ని షోస్ చేశారు.. చిన్న చిన్న ఉద్యోగాలు చేసి ఆ తర్వాత ఫుల్‌టైమ్ డీజేయింగ్ను ఎంచుకున్నారు. ‘ఏవీ మనసుకు నచ్చలేదు. అదే నా కెరీర్‌ను ఇటు మార్చింది’ అంటూ చెప్పారు డీజే లీనా. ఫ్రీలాన్స్ డీజేగా సిటీలోని సగం పైగా క్లబ్స్‌లో ఇప్పటికే తన మ్యూజిక్ వినిపించానంటున్న లీనా.. బాలీవుడ్ అంటే తనకు ప్రేమ అనీ, అందుకే ఆ సంగీతాన్ని ప్లే చేయడానికి తాను ఇష్టపడతానని అంటున్నారు. అమ్మాయిలు ఈ రంగంలోకి ఎక్కువగా రాకపోవడానికి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు దొరకకపోవడమే కారణమంటున్నారు లీనా.. తాను కూడా అతి కష్టం మీద కుటుంబ సభ్యులను ఒప్పించగలిగానని చెబుతున్నారు.ట్రెడిషనల్ ఫ్యామిలీలో.. ట్రెండీగా.. ‘నేను ఇక్ఫాయ్లో బీబీఏ పూర్తి చేశాను. సొంతంగా బిజినెస్ చేయాలనేది నా ఆలోచన. అయితే చిన్నప్పటి నుంచీ డీజేయింగ్ అంటే ఇష్టం. ఫ్రెండ్స్‌తో క్లబ్స్‌కి వెళ్లినప్పుడు కేవలం డీజే మ్యూజిక్ కోసమే వెళ్లేదాన్ని’ అంటూ గుర్తు చేసుకున్నారు అఖిల. మహబూబ్ నగర్‌కు చెందిన ఓ పూర్తి సంప్రదాయ కుటుంబంలో పుట్టిన అఖిల.. 2018లో డీజే స్కూల్లో చేరాలని నిర్ణయించున్నారు. అప్పుడు ఇంట్లో వాళ్ల నుంచి చెప్పుకోదగ్గ ప్రతిఘటననే ఎదుర్కొన్నారు. ‘ఫ్యామిలీ వద్దు అన్నప్పటికీ మనసు మాటే విన్నాను. ఒక ప్రోగ్రామ్‌కి కేవలం రూ.1000తో ప్రారంభించి.. ఇప్పుడు అంతకు పదింతలు తీసుకునే స్థాయికి చేరాను’ అంటూ సగర్వంగా చెప్పారామె. అమ్మాయిల భద్రత విషయం గురించి మాట్లాడినప్పుడు.. ‘మా చుట్టూ బౌన్సర్స్ ఉంటారు. ఇప్పటిదాకా చిన్న చేదు అనుభవం కూడా నాకు ఎదురుకాలేదు’ అంటూ చెప్పారామె. భవిష్యత్తులోనూ డీజేగా కొనసాగుతానని, మరిన్ని టాప్ క్లబ్స్‌లో తన మ్యూజిక్‌ని వినిపిస్తానని బాలీవుడ్ ట్య్రాక్స్కి పేరొందిన ఈ డీజే బ్లాక్ చెబుతున్నారు.‘ఫ్లో లో.. ‘జో’రుగా.. ‘మా నాన్న వాళ్లది వరంగల్. అయితే నేను నార్త్‌లోనే పెరిగాను. ప్రస్తుతం సిటీలో సెటిలయ్యా’ అంటూ చెప్పారు ఫ్లోజో. డిగ్రీ పూర్తి చేశాక.. కొన్ని కార్పొరేట్ ఉద్యోగాలు చేశా. అయితే చిన్నప్పటి నుంచీ సంగీతం పై ఉన్న ఇష్టంతో డీజేసూ్కల్లో చేరి కోర్సు పూర్తి చేసి డీజేగా మారాను అంటూ చెప్పారు ఫ్లోజో. ప్రస్తుతం నగరంలో టాప్ డీజేల్లో ఒకరుగా ఉన్న ఈ అమ్మాయి తొలుత లిక్విడ్స్‌లో రెసిడెంట్ డీజేగా ప్లే చేశానని, కొంత కాలం తర్వాత ఫ్రీలాన్స్ డీజేగా మారి, పలు అవార్డ్స్ కూడా అందుకున్నానని వివరించారు. థాయ్‌ల్యాండ్ వంటి అంతర్జాతీయ వేదికలపైనా, గోవా వంటి పార్టీ సిటీల్లోనూ ప్లే చేశానంటున్న ఫ్లోజోకి తన పేరు స్టైలి‹Ùగా ఉండడంతో మార్చుకోవాల్సిన అవసరం రాలేదన్నారు. ఈ కెరీర్లో అటు ఆనందం, ఇటు ఆదాయం రెండూ బాగుంటాయంటున్న ఫ్లోజో.. ఆరేడేళ్లలోనే కారు, ఫ్లాట్ కొనగలిగానని సంతోషంగా చెప్పారు. ఇదీ చదవండి: గేలి చేసినచోటే గెలిచి చూపించిన మగువలు!