సామాజిక స్పృహ, సమయపాలనే ప్రధానం
స్క్రీన్ టైమింగ్ తగ్గించుకుంటే అన్నింటికీ మంచిది
ఒక్క సెకనుతో వచ్చే మార్పులను గ్రహించాలి
ఆరోగ్యకరమైన ఆలోచనలతో ఆరోగ్యకరమైన సమాజం
నూతన సంవత్సరంలో నగర వాసుల ముందు కొత్త రిజల్యూషన్స్
స్క్రీన్ టైమింగ్ తగ్గాలి..
చిన్న పిల్లల నుంచి పెద్ద వారి దాకా ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ మొబైల్ ఫోన్ లేనిదే గడవట్లేదు. కొత్త సంవత్సరంలో అయినా స్క్రీన్ టైమింగ్ తగ్గించుకోవాలని నిర్ణయించుకుంటే మంచిది. కళ్లతో పాటు, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో స్క్రీన్ టైమింగ్ కాస్త తగ్గించుకుని ఆరోగ్యం కాపాడుకోవాలి.
సైబర్ వలలో పడకుండా..
సైబర్ నేరాలకు అంతులేకుండా పోతోంది. ఏ అవకాశం దొరికినా అందిపుచ్చుకునేందుకు సైబర్ నేరస్తులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ వలలో పడకుండా అప్రమత్తంగా ఉండేలా చూసుకోవాలి. సోషల్ మీడియాలో బ్యాంకు వివరాల గోప్యత పాటించడం, కొన్ని జాగ్రత్తలు వహించడం మనకే మంచిది.
పొదుపు మంత్రం..
ఆర్థిక వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం నేర్చుకుంటే మంచిది. ఇప్పుడు చేసే పొదుపే రేపు వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడేస్తుందనే విషయాన్ని మర్చిపోకూడదు. దుబారా ఖర్చులు తగ్గించుకొని జాగ్రత్తగా ఖర్చు చేస్తూ పొదుపు మంత్రం పాటిస్తే ఎలాంటి ఒడిదుడుకులైనా ఎదుర్కొనే శక్తి మనకు ఉంటుంది. సంపాదనలో కొంత ఇన్సూరెన్స్‌లోనో, మ్యూచువల్ ఫండ్స్‌లోనో దాచుకోవడం
మంచిది.
డ్రగ్స్‌కు దూరం..
ప్రస్తుతం డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు సమాజానికి చీడపురుగులా తయారయ్యాయి. డ్రగ్స్ రహిత సమాజం కోసం మన వంతు కృషి చేద్దాం. డ్రగ్స్ తీసుకోవడమే కాదు.. దానికి బానిసైన వారిని దూరంగా ఉంచేందుకు ప్రయతి్నద్దాం. దీనిపై
పోలీసులకు సహకరిద్దాం.
పరులకు సహాయం..
పరులకు సాయం చేస్తే మనకు తిరిగి ప్రకృతి సహాయం చేస్తుంది. అందుకే ఉన్నదాంట్లో తోచినంత పరులకు, అవసరం ఉన్న వారికి సహాయం చేయాలనే ఆలోచన చేస్తే మంచిది. మీ టు డూ లిస్ట్ లో ఇది చేర్చుకోవడం మర్చిపోవద్దు. తద్వారా ఎదో ఒక రోజు మనం ఊహించని రీతిలో తిరిగి సహాయం అందుతుందని మర్చిపోవద్దు.
హెల్త్ ఈజ్ వెల్త్..
ఎంత సంపాదించినా సరైన ఆరోగ్యం లేకపోతే ఉపయోగం ఉండదు. ఉద్యోగం, సంపాదన వేటలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదు. సో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతిరోజూ గంట సమయం కేటాయించడం ఎంతో ముఖ్యం. ఉదయం లేవగానే కొద్దిసేపు వ్యాయామం, చిన్నపాటి బరువులు ఎత్తడం, నడక వంటివి ఎంత ముఖ్యమో.. సరైన ఆహారం తీసుకోవడమూ అంతే ముఖ్యం.
ప్రస్తుతం తరుణంలో ఉరుకుల, పరుగుల జీవన విధానంలో మనలో చాలా మందికి సామాజిక స్పృహ లేకుండా పోతోందని విశ్లేషకులు చెబుతున్న మాట..! ఇటీవల రోడ్ రేజ్ పెద్ద ఇబ్బందిగా పరిణమించింది. కనీసం ఓపిక లేకుండా ప్రజలు వ్యవహరిస్తున్నారు. రోడ్డుపై వెళ్తుండగా ఎవరితో అయిన ఘర్షణ జరిగితే కాస్త సంయమనం పాటించి.. చిన్న చిరునవ్వు చిందిస్తే ఎలాంటి సమస్యకూ తావులేకుండా ఉంటుంది. లేదంటే గొడవలు, ముష్టి యుద్ధాలకు దారితీసి తీవ్ర పరిణామాలకు దారి తీసే ప్రమాదం ఉందని గ్రహించాలి.
మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ..
ఒత్తిడి ప్రపంచంలో మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం. చిన్నవాటికే చిరాకు పడడం.. కోపం తెచ్చుకోవడం.. అసహనం వ్యక్తం చేయడం.. తగ్గించుకోవడం ఎంతో మంచిది. ఇందుకోసం యోగా, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం ఆరోగ్యకరమైన అలవాటు. మానసిక ఆరోగ్యం బాగుంటేనే కుటుంబం, తద్వారా సమాజం బాగుంటుంది.
ఫ్యామిలీ టైం..
ఎంత బిజీగా ఉన్నా కుటుంబంతో కొంత సమయం గడపడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఎంత సంపాదించినా అది కుటుంబం కోసమే. ఇంతా చేసి కుటుంబానికి సమయం కేటాయించకపోతే కుటుంబ సభ్యులు మనల్ని మిస్ అవుతారనే విషయాన్ని మర్చిపోకూడదు. ప్రతిరోజు కాకపోయినా.. వారంలో ఒకసారి కలిసి కూర్చుని భోజనం చేయడం ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ఒకరి గురించి ఒకరు ఆరా తీసుకునే వీలు కలుగుతుంది.
ట్రాఫిక్ రూల్స్ విషయంలో..
ట్రాఫిక్ రూల్స్ పాటించే విషయంలో మిగతా నగరాల పౌరులతో పోల్చుకుంటే మనం వెనుకబడ్డట్టే. రూల్స్ పాటించడం వల్ల ప్రమాదాల నివారణకు దోహదం చేయవచ్చు. దీనిని మన వంతు బాధ్యతగా పాటించాలని ఇప్పటి నుంచే నిర్ణయం తీసుకుందాం.. మనలో ఈ చిన్న మార్పు 10 మందికి స్ఫూర్తిగా నిలిచి, సమాజాభివృద్ధికి దోహదం చేస్తుంది.
టైం సెన్స్ ముఖ్యం..
మనం చిన్నప్పటి నుంచీ వినే మాట సమయపాలన. అయినా.. ఎన్నోసార్లు ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఉంటాం. ఒక్క సెకండ్‌తో ఎన్నో మార్పులు జరగవచ్చు. ఒక్క నిమిషం వల్ల ఎన్నో ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. సమయం పోతే తిరిగి రాదు.. అనే విషయాన్ని గుర్తిస్తే మంచిది. ఒలింపిక్స్‌లో ఎన్నో పతకాలు చేజారిపోయేదా ఆ సెకను తేడాతోనే అనే విషయం గ్రహించాలి. సమయం అనేది ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉండదు.. ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా ఉంటుంది. అందుకే విధిగా సమయపాలన పాటించడం అనేది వచ్చే ఏడాది మన డైరీలో భాగం కావాలి. అదే మనల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్.
Comments
Please login to add a commentAdd a comment