
“మా బాబుకు స్మార్ట్‌ఫోన్ ఇవ్వకపోతే అరుపులు, కేకలు. ఇల్లంతా రచ్చరచ్చ చేసేస్తాడు. కానీ పుస్తకాలు తీస్తే బోలెడంత బద్ధకం. చదువంటే ఎప్పుడూ తప్పించుకునే ప్రయత్నమే. కానీ అదే వీడియో గేమ్ ఆడేటప్పుడు ఏమీ తినకుండా, తల ఊపకుండా గంటల తరబడి కూర్చుంటాడు!”
ఇలాంటి మాటల్ని మీరు రోజూ వింటూనే అంటారు.
దానికి మీరేం సలహా ఇస్తారు?
“ఈ తరం పిల్లలు స్క్రీన్‌కు బానిసలైపోయారు.”
“వీడియో గేమ్స్ బ్రెయిన్‌ను వదిలిపెట్టకుండా హైపర్ యాక్టివ్ చేస్తాయి.”
“ఇది డిజిటల్ డెమెజ్.”
"పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇవ్వకూడదు."
కానీ, అసలు మర్మం ఎక్కడ ఉంది తెలుసా?
వీడియో గేమ్స్ అనేవి సైకాలజీని వాడి డిజైన్ చేసిన అద్భుత ఇంజినీరింగ్.
మొబైల్ గేమ్స్ ఆడే పిల్లవాడిని ఒకసారి గమనించండి… "ఈ లెవెల్‌ను కంప్లీట్ చేయాలి", "ఈ శత్రువును ఓడించాలి", "ఈ స్కోరు సాధించాలి" అని అతనికి స్పష్టమైన లక్ష్యం ఉంటుంది.
అతను ప్రయత్నం చేస్తాడు. ఓడిపోతాడు. మళ్లీ ట్రై చేస్తాడు. మళ్లీ ఓడతాడు. చివరికి గెలుస్తాడు.
విజయం పొందిన వెంటనే స్క్రీన్ మీద – "Congratulations!", "You’re a winner!", "Unlocked new powers!" అంటూ మెసేజ్ వస్తుంది.
ఈ ఫీడ్‌బ్యాక్ అతని మెదడులో డోపమిన్ అనే హ్యాపీ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ కోసమే, అది ఇచ్చే హ్యాపీనెస్ కోసమే అతను మళ్ళీ మళ్ళీ మొబైల్ గేమ్స్ ఆడుతూనే ఉంటాడు.
ఇప్పుడు చదువును పరిశీలిద్దాం. ఓ ఏడో తరగతి పిల్లాడు, మొఘలుల వంశవృక్షం చదవాల్సి ఉంది. అతనికి పాఠం ఎంత పెద్దదో తెలియదు. ఎక్కడ మొదలుపెట్టాలో కూడా స్పష్టత లేదు. పుస్తకంలోని ప్రశ్నల్లో ఏది పరీక్షల్లో వస్తుందో, ఏది గుర్తుంచుకోవాలో తెలియక కంగారు.
పరీక్షలో సరైన సమాధానం రాసినా – ఫలితం ఎప్పుడు వస్తుందో తెలీదు. పరీక్షలు వస్తున్నాయంటే "నువ్వేమైనా చదువుతున్నావా?" అంటూ తల్లి, తండ్రి, టీచర్లు ఒత్తిడి పెడతారు. ఆ ఒత్తిడి అతని మెదడులో కోర్టిసాల్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇదే అసలు తేడా.
వీడియో గేమ్ మోటివేట్ చేస్తుంది. చదువు భయం, ఒత్తిడితో నడుస్తుంది.
మా Genius Matrix వర్క్‌షాప్‌లో పాల్గొన్న 8వ తరగతి విద్యార్థిని మిహిర ఏం చెప్పిందో తెలుసా?
“సర్, నేను Minecraft ఆడేటప్పుడు ఎంత creative అవుతానో తెలుసా? నా మీద నాకే ఆశ్చర్యం. కానీ అదే స్కూల్‌లో డ్రాయింగ్ competition ఉంటే, ఒక్కసారిగా భయమేస్తుంది. గెలవకపోతే నన్ను తక్కువగా చూస్తారని.”
ఇంకొక తండ్రి తన కొడుకును గురించి ఇలా చెప్పాడు... “డాక్టర్ గారు, మా వాడి PUBG స్టాటిస్టిక్స్ మామూలుగా ఉండవు. ప్లానింగ్, లీడర్‌షిప్, టీమ్ వర్క్ – అన్నీ బాగా చూస్తాడు. కానీ అదే క్లాస్‌లో ప్రాజెక్ట్ వచ్చిందంటే మౌనంగా పడుకుంటాడు. ఎందుకంటే అక్కడ creativityతో పని లేదు, కేవలం marks కోసం పని చేయాలి.”
వీడియో గేమ్‌లో చిన్న ప్రయత్నానికే పెద్ద గుర్తింపు వస్తుంది. చదువులో మంచి ప్రయత్నం చేసినా మార్కులు రాకపోతే ఎవరూ పట్టించుకోరు. వీడియో గేమ్‌లో స్వాతంత్య్రం ఉంటుంది. చదువులో నిబంధనలు, డెడ్‌లైన్‌లు, ఫలితాలపై భయం ఉంటుంది.
ఒకసారి నేను ఓ క్లాస్‌లో పిల్లల్ని అడిగాను: “మీరు ఎక్కువ టైం ఏమి చేస్తారు?”
ఒకటి: “గేమ్స్ ఆడతాను.”
రెండు: “యూట్యూబ్ చూస్తాను.”
మూడు: “కంప్యూటర్ మీద క్రియేట్ చేస్తాను.”
చదువు ఎప్పుడూ నాల్గవ ఆప్షన్‌లా ఉంటుంది.
మనం ఏమి చేయాలి?
వీడియో గేమ్‌లు నిషేధించడం సమస్యకు పరిష్కారం కాదు. స్మార్ట్‌ఫోన్ తీసేయడం వల్ల కూడా సమస్య తీరిపోదు. “నీకు concentration లేదు” అని తిట్టడం వల్ల అస్సలు ఉపయోగం ఉండదు.
మరేం చేయాలంటారా?
పిల్లలు ఏది concentrationతో చేస్తారో గమనించాలి. మన పాఠశాల, మన ఇంటి వాతావరణం కూడా వీడియో గేమ్‌లా మారాలి.
🔹చిన్న లక్ష్యాలు ఇవ్వండి – చిన్న విజయం పొందిన ఆనందాన్ని అనుభవించాలి.
🔹ప్రయత్నాన్ని గుర్తించండి – “శబాష్, నువ్వు మంచి ట్రై చేశావు” అనే మాట ఎంతో విలువైనది.
🔹విఫలమైనా మళ్లీ ప్రయత్నించేందుకు అవకాశం ఇవ్వండి – శిక్షలు కాదు, శక్తినివ్వండి.
🔹విజయం చూపించండి – మార్కులు కాకపోయినా, మెరుగుదల కనబడాలి.
🔹పిల్లల మనసును మెప్పించే చదువు… అలాగే వాళ్లే కోరుకునే అభ్యాసం కావాలి.
🔹మనం పిల్లల మీద ఒత్తిడి పెట్టడం తగ్గించాలి. వాళ్లలో ఉత్తేజాన్ని పెంచాలి. 🔹వీడియో గేమ్‌ల మాదిరిగానే – విద్య కూడా ఒక అడ్వెంచర్ అనిపించాలి.
చదువు ఒక బాధగా, భారంగా కాదు… ఒక ప్రయాణంగా మారితే – పిల్లలు కూడా చదువును “ఆటలా” ఆస్వాదిస్తారు.
మొత్తానికి సమస్య స్క్రీన్ కాదు.
చదువులో ఆనందాన్ని మేళవించడమే సమాధానం.
-సైకాలజిస్ట్ విశేష్
+91 8019 000066
www.psyvisesh.com
Comments
Please login to add a commentAdd a comment