Video games
-
వీడియో గేమ్స్ చరిత్ర తెలుసా?
పిల్లలూ! వీడియో గేమ్స్ ఆడటమంటే మీకు చాలా ఇష్టమా? సెలవుల్లో ఇంట్లో కూర్చుని గంటల తరబడి ఆడుతుంటారా? మరి వాటి చరిత్రేమిటో తెలుసుకుందామా?వీడియో గేమ్స్ పుట్టి దాదాపు 66 ఏళ్లు దాటుతోంది. 1958లో విలియం ఆల్ఫ్రెడ్ హిగిన్ బోతమ్ అనే అమెరిన్ భౌతిక శాస్త్రవేత ‘టెన్నిస్ ఫర్ టూ’ అనే వీడియోగేమ్ తయారు చేశారు. 1960 తర్వాత కంప్యూటర్ల వాడకం పెరుగుతున్న సమయంలో కంప్యూటర్ శాస్త్రవేత్తలు గ్రాఫిక్స్ ఆధారంగా గేమ్స్ తయారు చేశారు. అనంతరం 1962లో అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు ‘స్టార్‌వార్’ అనే వీడియో గేమ్ తయారు చేశారు. ఆ తర్వాత 1970లో ఇళ్లల్లో వీడియో గేమ్స్ ఆడుకునేందుకు గేమ్ కన్సోల్‌ని తయారు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఈ వీడియో గేమ్స్ అమెరికా అంతటా ప్రాచుర్యం పొందాయి. ఆ తర్వాత మరికొన్ని కంపెనీలు సైతం కొత్తగా వీడియోగేమ్స్ తయారు చేశాయి.వీడియో గేమ్స్ ప్రధానంగా పిల్లల కోసమే తయారు చేసినా పెద్దలు కూడా వీటిని ఇష్టపడుతున్నారని కంపెనీలు గుర్తించాయి. మరిన్ని కొత్త గేమ్స్‌ని అందుబాటులోకి తెచ్చాయి. ఒకానొక దశలో చాలా గేమ్స్‌కి కాపీలు, పైరసీ వెర్షన్లు వచ్చేశాయి. దీంతో జనానికి నాణ్యమైన గేమ్స్ అందుబాటులో లేకుండా ΄ోయాయి. 1983 నుంచి 1985 మధ్యలో అమెరికాలోని వీడియో గేమ్స్ తయారీ సంస్థలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. ఆ తర్వాత వీడియో గేమ్స్ మార్కెట్లోకి జ΄ాన్ దూసుకొచ్చింది. కొత్త కొత్త గేమ్స్‌ని అందుబాటులోకి తెస్తూ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఏర్పడేలా చేసింది. దీంతో సంస్థలు కొత్త టెక్నాలజీ ఉపయోగించి మరిన్ని నాణ్యమైన, క్రియేటివ్ గేమ్స్ తయారు చేయడం మొదలుపెట్టాయి. ఇంటర్నెట్ వాడకం మొదలయ్యాక వీడియోగేమ్స్ మరింతగా అందుబాటులోకి వచ్చాయి. స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్స్ వచ్చాక అందరూ సులభంగా వీడియో గేమ్స్ ఆడేస్తున్నారు. వీటికోసం ప్రత్యేకమైన యాప్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వీడియో గేమ్స్ మార్కెట్ రూ.1.5 లక్షల కోట్లతో నడుస్తోంది. వేల మంది ఈ రంగంలో పని చేస్తున్నారు. వీడియో గేమ్స్ తయారు చేసేందుకు ప్రత్యేకంగా గేమ్ డిజైనర్లు ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా రెండు వేల వీడియో గేమింగ్ స్కూల్స్ ఉన్నాయి. అందులో వీడియో గేమింగ్ తయారీ గురించి నేర్పిస్తారు. వీడియో గేమ్స్‌లో ఎక్కువమంది యాక్షన్, స్పోర్ట్స్, సాహసయాత్రలు వంటివి ఇష్టపడుతుంటారుఅయితే చదువు పక్కన పెట్టి వీడియో గేమ్స్ ఆడటం ఏమాత్రం మంచిది కాదు. గంటల తరబడి ఆడటం కూడా చాలా ప్రమాదకరం. అదొక వ్యసనం అవుతుంది. రాత్రి పగలూ ఆడాలనిపిస్తుంది. భవిష్యత్తుకే ప్రమాదం. కాబట్టి సెలవు రోజుల్లో కొద్దిసేపు మాత్రమే వీడియో గేమ్స్ ఆడండి. సరేనా? -
క్లౌడ్ గేమింగ్ సూపర్ ‘క్లిక్’!
సరికొత్త వీడియో గేమ్‌లు మార్కెట్లోకి రిలీజ్ అయిన వెంటనే ఆడేయాలని ఎవరికుండదు చెప్పండి! నేటి జెన్ జడ్, యువతరానికి గేమ్స్ అంటే మరీ క్రేజ్. వీటిని ఆడాలంటే హై ఎండ్ పీసీతో పాటు ఖరీదైన గేమింగ్ కన్సోల్స్ తప్పనిసరి కావడంతో చాలా మందికి అందని ద్రాక్షగానే ఊరిస్తున్నాయి. అయితే, క్లౌడ్ గేమింగ్ ఎంట్రీతో వీడియో గేమ్స్ ముఖ చిత్రమే మారిపోతోంది. అతి తక్కువ ఖర్చుతో, ఇంట్లో ఉన్న సాధారణ పీసీతోనే అదిరిపోయే లేటెస్ట్ వీడియో గేమ్స్ ఆడే అవకాశం లభిస్తుండటంతో గేమర్స్ క్లిక్.. క్లిక్.. హుర్రే అంటున్నారు!గేమింగ్ ఆన్ డిమాండ్... గేమ్ స్ట్రీమింగ్.. క్లౌడ్ గేమింగ్... పేరేదైనా కానీ గేమర్ల పాలిట వరంలా మారింది. కేవలం హైస్పీడ్ ఇంటర్నెట్, గేమ్ ప్యాడ్/కంట్రోలర్ ఉంటే చాలు.. ఇప్పుడు ఎవరైనా తమ ఫేవరెట్ గేమ్స్‌ను డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, మొబైల్ లేదా టీవీలోనే ఎంచక్కా స్ట్రీమ్ చేసేయొచ్చన్నమాట! హై క్వాలిటీ గేమ్‌ను మన సొంత సిస్టమ్‌లో రన్ చేయాలంటే, ఆడటానికి ముందే ఆ గేమ్‌ను ఫిజికల్‌గా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. దీనికి పూర్తి భిన్నంగా ఎక్కడో క్లౌడ్ సర్వర్లలో ఉన్న నచ్చిన గేమ్‌ను ఏ డివైజ్ లేదా ప్లాట్‌ఫామ్‌లోనైనా ఆడేందుకు (స్ట్రీమ్ చేసేందుకు) వీలవుతోంది. ఒకేసారి పలు డివైజ్‌లలోనూ గేమ్ ఆడొచ్చు. అంతేకాదు, గేమ్‌ను ఆపిన చోట నుంచే మళ్లీ ఆడుకోవచ్చు కూడా. అందుకే గేమర్స్ దీన్ని ‘నెట్‌ఫ్లిక్స్ ఫర్ గేమ్స్’ అని కూడా పిలుచుకుంటారు! రెండేళ్లలో మూడింతలు... మార్కెట్ రీసెర్చ్ ప్లాట్‌ఫామ్ మార్కెట్.యూఎస్ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ గేమింగ్ యూజర్ల సంఖ్య 2021లో దాదాపు 10.27 కోట్ల మంది కాగా, 2023లో ఈ సంఖ్య ఏకంగా 29.1 కోట్లకు ఎగబాకింది. అంటే రెండేళ్లలోనే మూడింతలైంది. ఈ డిమాండ్‌కు అనుగుణంగా క్లౌడ్ గేమింగ్ మార్కెట్ కూడా ఫుల్ స్వింగ్‌లో పరుగులు తీస్తోంది. 2030 నాటికి ప్రపంచ క్లౌడ్ గేమింగ్ మార్కెట్ 46.9 శాతం వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)తో 85 బిలియన్ డాలర్లకు ఎగబాకుతుందని ఫార్చూన్ బిజినెస్ లెక్కగట్టింది. 2022లో ఈ మార్కెట్ విలువ కేవలం 3.37 బిలియన్ డాలర్లు మాత్రమే. మరోపక్క, క్లౌడ్ గేమింగ్‌కు అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా ఉన్న భారత్.. 2033 నాటికి పరిశ్రమ లీడర్‌గా ఎదుగుతుందని బ్లూంబర్గ్ ఇంటెలిజెన్స్ తాజా నివేదిక పేర్కొనడం గమనార్హం. ‘అమెరికా, చైనా వంటి అభివృద్ధి చెందిన సీఎస్జీ (క్లౌడ్–స్ట్రీమ్డ్ గేమింగ్) మార్కెట్లు, ప్రపంచవ్యాప్తంగా అమ్మకాల్లో మూడో వంతుకు పైగా ఆక్రమిస్తున్నాయి. వచ్చే పదేళ్లలో దక్షిణ, ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికా మార్కెట్లు భారీగా వృద్ధి చెందనున్నాయి. ముఖ్యంగా యువతరంతో ఉప్పొంగుతున్న భారత్‌లో, 5జీ విప్లవం ఆన్లైన్ గేమింగ్ స్వరూపాన్ని సమూలంగా మార్చేయనుంది’ అని బ్లూంబర్గ్ ఇంటెలిజెన్స్ ఎనలిస్ట్ నాథన్ నాయుడు పేర్కొన్నారు. భారత్.. అవకాశాల ‘క్లౌడ్’ భారీ అవకాశాల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్, ఎన్‌వీడియో, సోనీ మొబైల్ విభాగాలు వర్ధమాన దేశాల మార్కెట్లలో విస్తరణపై దృష్టి సారిస్తున్నాయి. యాపిల్ కూడా తన గేమ్–స్ట్రీమింగ్ యాప్‌లను ఈ మార్కెట్లలో అందుబాటులోకి తెస్తోంది. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం ప్రపంచ మార్కెట్లో ఒక్కో గేమింగ్ యూజర్ నుంచి సగటు ఆదాయం (ఏఆర్పీయూ) 10% వార్షిక వృద్ధి సాధిస్తుండగా.. భారత్‌లో 15% చొప్పున పెరుగుతుండటం విశేషం. ‘మారుమూల ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ లభ్యత, చౌక డేటా ప్లాన్లు, 4జీ/5జీ భారీ విస్తరణ, స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడం, అవి మరింత చౌక రేట్లతో మరింత పవర్ఫుల్ ఫీచర్లతో లభిస్తుండటం వంటి అనేక అంశాలు భారత్‌లో క్లౌడ్ గేమింగ్ జోరుకు దన్నుగా నిలుస్తున్నాయి’ అని యాంట్క్లౌడ్ సీఈఓ హిమాన్షు జైన్ పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌లో సేవలు ప్రారంభించిన ఈ క్లౌడ్ గేమింగ్, పీసీ సర్వీస్ ప్రొవైడర్ ఇప్పటికే 10,000 మంది యూజర్లను సంపాదించింది. ఈ ఏడాది చివరికల్లా 50,000 సబ్‌్రస్కిప్షన్లను లక్ష్యంగా పెట్టుకుంది.టెల్కోలకు భలే చాన్స్..దూసుకెళ్తున్న క్లౌడ్ గేమింగ్ మార్కెట్లో టెల్కోలు తమ సహజ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో రిలయన్స్ జియో ‘జియో గేమ్స్ క్లౌడ్’ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. నెలకు రూ.199 ప్లాన్‌తో గేమ ర్లు చెలరేగిపోవచ్చన్న మాట! 30 రోజుల ఉచిత ట్రయల్ కూడా అందుబాటులో ఉంది. వొడాఫోన్ ఐడియా కూడా క్లౌడ్ ప్లే పేరుతో గేమింగ్ సరీ్వస్ మొదలుపెట్టింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ హ్యాండ్సెట్లలో ఎలాంటి డౌన్లోడ్లు లేకుండానే అదిరిపోయే గేమింగ్ అనుభూతిని యూజర్లకు అందిస్తోంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
13 ఏళ్ల అమ్మాయి..తల్లిదండ్రులకు ఓ రేంజ్లో షాక్ ఇచ్చింది!
వీడియో గేమ్స్ అడిక్షన్ ఇంటింటి వ్యసనాయణం! అది చైనా, హేనన్ ప్రావిన్స్‌లోని ఒక కుటుంబానికి ఎలాంటి షాక్‌ను ఇచ్చిందో చదవండి. ఆ కుటుంబంలోని పదమూడేళ్ల అమ్మాయికి వీడియో గేమ్స్ అంటే పిచ్చి. నిద్రాహారాలు మరచిపోయి మరీ ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంటుంది.. ఇల్లు, బడి అనే తేడా లేకుండా! ఆ అమ్మాయికున్న ఈ అలవాటును ఇంట్లో పెద్దలు నిర్లక్ష్యం చేసినా బడిలో టీచర్ మాత్రం లక్ష్యపెట్టింది. ఆ పిల్ల తల్లిదండ్రుల దృష్టికీ తీసుకెళ్లింది. అప్పటి నుంచి ఆ అమ్మాయి మీద ఓ కన్నేసి ఉంచింది ఆమ్మ. ఎన్నో రోజులు గడవకముందే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియో అమ్మ కంట్లో పడింది. ఏంటా అని చూస్తే.. తన కూతురు ఖర్చు పెట్టిన డబ్బు తాలూకు బ్యాంక్ స్టేట్మెంట్స్ వీడియో అది. ఒకటి కాదు రెండు కాదు 51,72,646 రూపాయలు. అది ఆ పిల్ల అమ్మానాన్న కొన్నేళ్లుగా కూడబెట్టిన మొత్తం! ఒక్క పూటలో అలవోకగా ఖర్చుపెట్టేసింది. అంతా ఆన్లైన్ పేమెంటే. కూతురికి ఎప్పుడైనా అర్జంట్‌గా ఏదైనా అవసరం వస్తుందేమో ఎంతకైనా మంచిది అని అమ్మాయికి తన డెబిట్ కార్డ్ పిన్ నంబర్ చెప్పింది. ఇంకేముంది ఆ కూతురు కొత్త వీడియో గేమ్స్ కొనడానికి, ఆడుతున్న గేమ్స్‌కి కావల్సిన పాయింట్స్‌ని సంపాదించడానికీ తల్లిదండ్రుల సేవింగ్స్‌ని ఖర్చుపెట్టింది ఆ పిన్ నంబర్ ఉపయోగించి. తన ఈ సీక్రెట్ ఫ్రెండ్స్‌కి తెలిసిపోయి.. బ్లాక్మెయిల్ చేసేసరికి వాళ్లకూ కావల్సిన వీడియో గేమ్స్‌ని కొనిపెట్టి మొత్తం డబ్బును హుష్ కాకి చేసేసింది. ఈ వ్యవహారం తల్లి కంట పడకుండా చక్కగా ఫోన్లోంచి ఆ ట్రాన్జాక్షన్ హిస్టరీని డిలీట్ చేసింది. పదమూడేళ్ల అమ్మాయి రికార్డ్ స్థాయిలో వీడియో గేమ్స్ కొనేసరికి అది సోషల్ మీడియాలో వైరలై.. ట్రాన్జాక్షన్ స్టేట్మెంట్ కూడా బయటకు వచ్చి.. అమ్మకు షాక్ ఇచ్చింది. ఇన్నాళ్ల తమ కష్టాన్ని కూతురు సింపుల్‌గా స్వైప్ చేయడంతో నెత్తీనోరు కొట్టుకుంటున్నారు తల్లిదండ్రులు. ఈ వ్యసనాయణం మనకూ షాక్ ఇవ్వకుండా జాగ్రత్తపడదాం! (చదవండి: బంధం నిలబడాలంటే అదొక్కటే సరిపోదు!) -
ముల్లును ముల్లుతోనే తీయాలి.. ఆన్లైన్ ‘ఆట’కట్టించిన తల్లిదండ్రులు
బీజింగ్: చైనాలో ఆన్లైన్ వీడియో గేమ్‌లకు బానిసగా మారిన ఓ ఐదో తరగతి బాలుడిని ఆ వ్యసనం నుంచి బయటపడేసేందుకు తల్లిదండ్రులు అతని ‘దారి’నే ఎంచుకున్నారు! రోజూ గంటల తరబడి వీడియో గేమ్‌లు ఆడుతున్న తమ కుమారుడు తిరిగి చదువుల బాట పట్టేందుకు వీలుగా ఓ ప్రొఫెషనల్ ఆన్లైన్ గేమర్‌ను ఆశ్రయించారు!! ఇందుకోసం అతనికి గంటకు సుమారు రూ. 600 చొప్పున ‘సుపారీ’సైతం చెల్లించారు!! ముల్లును ముల్లుతోనే తీయాలన్న చందంగా తమ కుమారుడిని ఆన్లైన్ గేమర్‌తో చిత్తుగా ఓడించడం ద్వారా ఈ తరహా ఆటలు ఆడటంలో నిష్ణాతుడినన్న అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలనుకున్నారు. అనుకున్నట్లుగానే వారి వ్యూహం ఫలించింది. బాలుడితో ఐదు గంటలపాటు ఐదు గేమ్‌లు ఆడిన ఆన్లైన్ గేమర్... అతన్ని చిత్తుగా ఓడించాడు. గేమ్‌లన్నీ పూర్తి ఏకపక్షంగా సాగడంతో కంగుతిన్న బాలుడు.. ఆ ఆటలపై ఇష్టాన్ని కోల్పోయాడు. దీంతో తమ కొడుకును ఓదార్చిన తల్లిదండ్రులు... ఇక నుంచి అతను తిరిగి చదువుపై దృష్టిపెట్టేలా ఒప్పించారు. ఈ విషయాలను ఆన్లైన్ గేమర్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా బయటపెట్టాడు. మరో బాలుడిని సైతం ఇలాగే ఆన్లైన్ ఆటల వ్యసనం నుంచి బయటపడేసినట్లు చెప్పాడు. చదవండి: పాలపుంతలో నీటి గ్రహాలు! కనిపెట్టిన నాసా టెలిస్కోప్.. -
‘అసెంబ్లీలో ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో చూడండి?’
లక్నో: శాసనసభా సమావేశాలు రాష్ట్రం, ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అధికార, విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు తమ వంతు పాత్ర పోషించి.. తీసుకునే నిర్ణయాల్లో భాగమవుతారు. అయితే, కొందరు ఎమ్మెల్యేలు అశ్రద్ధగా వ్యవహరిస్తూ విమర్శల పాలవుతున్నారు. మనకేందుకులే అనుకుని నిద్రపోయిన ఎమ్మెల్యేల సంఘటనలు చాలానే చూసుంటాం. అయితే, ఓవైపు కీలక చర్చ జరుగుతుండగా కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు తమకేమి పట్టనట్టు ఫోన్లలో వీడియో గేమ్స్ ఆడటంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీలో జరిగింది. ఎమ్మెల్యేలకు సంబంధించిన రెండు వీడియోలను సమాజ్‌వాది పార్టీ శనివారం ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘ఈ వ్యక్తులు ప్రజల సమస్యలకు సమాధానం చెప్పరు. అసెంబ్లీని ఒక వినోద హబ్‌గా మార్చేశారు. ఇది చాలా నీచమైన, అవమానకరమైన చర్య.’ అంటూ పేర్కొంది ఎస్పీ పార్టీ. సమాజ్‌వాది పార్టీ షేర్ చేసిన వీడియోలు సోషల్ మీడియలో వైరల్‌గా మారాయి. మొదటి వీడియోలో.. మొహబా ఎమ్మెల్యే రాకేశ్ గోస్వామి తన మొబైల్ ఫోన్లో కార్డ్స్ గేమ్ ఆడుతున్నారు. మరోవైపు సభ జరుగుతున్నట్లు మాటలు, చప్పట్లు స్పష్టంగా వినిపిస్తున్నాయి. రెండో వీడియోలో.. ఝాన్సీ ఎమ్మెల్యే రవి శర్మ అసెంబ్లీలో కూర్చుని పోగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. డెస్కు నుంచి రాజ్‌నిగంధ బాక్స్‌ను బయటకు తీస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. सदन की गरिमा को तार-तार कर रहे भाजपा विधायक! महोबा से भाजपा विधायक सदन में मोबाइल गेम खेल रहे, झांसी से भाजपा विधायक तंबाकू खा रहे। इन लोगों के पास जनता के मुद्दों के जवाब हैं नहीं और सदन को मनोरंजन का अड्डा बना रहे। बेहद निंदनीय एवं शर्मनाक ! pic.twitter.com/j699IxTFkp — Samajwadi Party (@samajwadiparty) September 24, 2022 pic.twitter.com/822d0fQDG7 — Samajwadi Party (@samajwadiparty) September 24, 2022 ఇదీ చదవండి: ఐరాస వేదికగా పాక్ పీఎం ‘శాంతి’ మాటలు.. స్ట్రాంక్ కౌంటర్ ఇచ్చిన భారత్ -
మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న సాంకేతికత
‘‘కర్నూలు సిటీలోని గణేశ్‌నగర్ వాసి మహ్మద్ రిజ్వాన్ వెన్నునొప్పితో గాయత్రి ఎస్టేట్‌లోని ఓ న్యూరోఫిజిషియన్ వద్దకు వెళ్లారు. డాక్టర్ ఆరాతీస్తే రోజూ అర్ధరాత్రి ఒంటిగంట వరకూ మేల్కొని సెల్‌ఫోన్ చూస్తుంటారని తేలింది. ఇతనికి ఇదొక్కటే సమస్య కాదు కంటిచూపు తగ్గడం, విపరీతమైన తలనొప్పి కూడా ఉన్నాయి.’’ ‘‘మనస్విని అనే ఐదోతరగతి చదువుతోన్న చిన్నారి ఏక్యాంపులో నివాసం ఉంటోంది. ఈ వయస్సుకే దృష్టిలోపం వచ్చింది. ఆస్పత్రికి వెళితే కంటిచూపు ‘మైనస్ వన్’ ఉందని అద్దాలు ఇచ్చారు. స్కూలు నుంచి రాగానే సెల్‌ఫోన్, టీవీకి అతుక్కుపోతుందని, గట్టిగా మందలిస్తే భోజనం చేయకుండా మారం చేస్తుందని, తాము ఏం చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు’’ సాక్షిప్రతినిధి, కర్నూలు: ప్రపంచీకరణ నేపథ్యంలో టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోంది. 30 ఏళ్ల కిందటతో పోలిస్తే టెక్నాలజీ అభివృద్ధి, తద్వారా జనజీవనానికి జరిగిన మేలు ఊహలకందనిది. చావు కబురు పంపాలంటే గతంలో టెలిగ్రాం చేయాల్సి వచ్చేది. బంధువులను పండుగల్లోనే, వేసవి కాలం సెలవుల్లోనూ చూడాల్సి వచ్చేది. మధ్యలో మంచిచెడులు తెలుసుకోవాలంటే ఉత్తరాలు దిక్కయ్యేవి. ఈ దశ నుంచి కంప్యూటర్, ఇంటర్నెట్ యుగంలోకి వచ్చాం. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటోంది! ఇంటింటా స్మార్ట్ టీవీలు ఉన్నాయి. ఇంటర్నెట్తో ఇంటి నుంచే ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకుంటున్నాం. ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌లో దొరుకుతోంది. కావాల్సిన బ్రాండ్ దుస్తులు, వస్తువులు ఏది కావాలన్నా ఆన్లైన్లో షాపింప్ చేస్తున్నాం. వ్యాపార రంగంలో ఆన్లైన్ బిజినెస్ వాటా ఏకంగా 37 శాతం ఉందంటే టెక్నాలజీ ప్రభావం ఏవిధంగా ఉందో స్పష్టమవుతోంది. ఇదే రకంగా పిల్లల వీడియో గేమ్స్ యాప్స్ రూపంలో మొబైల్స్, టీవీల్లో వస్తున్నాయి. టెక్నాలజీ లేకుంటే రోజువారీ జీవితం నడవని పరిస్థితి నెలకొంది. మనకు తెలియని ప్రాంతానికి వెళ్లాలంటే అడ్రస్ కోసం ‘గూగుల్’ మ్యాప్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తోంది. ఇదంతా నాణేనికి ఓవైపు మాత్రమే. మరోవైపు నిశితంగా పరిశీలిస్తే టెక్నాలజీని అతిగా వినియోగిస్తూ ఆరోగ్య సమస్యలతో అల్లాడిపోతున్నవారు లక్షల సంఖ్యలో ఉన్నారు. వీరిలో 15–32 ఏళ్ల వయస్సున్న యువతీ, యువకులు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే విషయం. పెరుగుతున్న ఒత్తిడి టెక్నాలజీలో ఎక్కువ సమస్యలు వస్తోంది స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్తోనే అని ‘యూరోపియన్ స్పైన్ జర్నల్’ ప్రచురించింది. చిన్న పిల్లలు, టీనేజర్ల మానసిక వికాసంపై టెక్నాలజీ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వయస్సు వారిలోనే మానసిక, శారీరక సమస్యలు వస్తున్నాయి. సోషల్ మీడియాకు ఎక్కువగా అలవాటైనవారిలో సాధారణ కంటే ఐదు రెట్లు ఒత్తిడి ఉంటోంది. మొబైల్ఫోన్లను తక్కువగా వాడేవారు సానుకూల ఆలోచనా ధోరణితో ఒత్తిడికి దూరంగా ఉంటే, ఎక్కువగా ఆధారపడే వారు నెగిటివ్ ఆలోచనలతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ట్యాబ్‌లు, స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లపై ఎక్కువ సమయం గడిపేవారు కంటి సమస్యలతో బాధపడుతున్నారు. చాలా మందికి తలనొప్పి, మెడ, భుజాల నొప్పి వస్తున్నాయి. ఈ సమస్యలతో ఆస్పత్రికి వెళ్లేవారు గత నాలుగేళ్లలో ఏకంగా ఐదురెట్లు పెరిగారు. దీంతో ‘అమెరికా ఆప్తాల్మజీ అసోసియేషన్’ ఓ రూల్ ప్రవేశపెట్టింది. కంప్యూటర్లు, సెల్ఫోన్లు వాడేవారు ప్రతీ 20 నిమిషాలకొకసారి కనీసం 20 సెకండ్లు దృష్టి మరల్చాలి. 20 అడుగుల దూరం నడక సాగించాలి. డేంజర్ జోన్లో చిన్నపిల్లలు అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ చేసిన ఓ సర్వేలో చిన్నపిల్లలపై టెక్నాలజీ ప్రభావం ఎక్కువగా ఉంటోందని తేలింది. స్కూలు నుంచి ఇంటికి రాగానే ఫోన్, టీవీకి అతుక్కుపోతున్నారు. దీంతో చదువులో వెనుకబడటం, క్రమశిక్షణ లేకపోవడం, దేనిపైనా సరైన ఫోకస్ లేకపోవడం, వ్యక్తులతో మాట్లాడటం తగ్గిపోవడం, శారీరక శ్రమ తగ్గిపోయి ఊబకాయం పెరగడం, నిద్రలేమి సమస్య, అగ్రెసివ్ బిహేవియర్‌కు గురవుతున్నారు. ఇవి చిన్న సమస్యలు కాదని, అత్యంత ప్రమాదకరమైనవని ఆ అకాడమీ తల్లిదండ్రులను హెచ్చరించింది. అందుకే 18 నెలల వయస్సు పిల్లలకు టీవీ, ఫోన్ చూపించకూడదు. 2–5 ఏళ్ల పిల్లలు గంటకు మించి టీవీ చూడకూడదు. మరిన్ని అనారోగ్య సమస్యలు.. పరిష్కారాలు ► ఒకే ప్రదేశంలో కూర్చుని కంప్యూటర్ చూస్తూ గడిపేవారికి వెన్ను సమస్యలు అధికమవుతున్నాయి.ఈ నొప్పితో మనిషి ఇతర విషయాలపై దృష్టి సారించలేకపోతున్నారు. చురుకుదనం తగ్గిపోయి పురోగతి సాధించలేకపోతున్నారు. వీరు కనీసం గంటకోసారి లేచి నడవాలి. ► ఫోన్లతో జ్ఞాపకశక్తి క్లీణించింది. గతంలో పదుల సంఖ్యలో ఫోన్ నంబర్లు గుర్తుండేవి. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ల నంబర్లు కూడా గుర్తులేని పరిస్థితి. లావాదేవీల్లో గతంలో ‘నోటిలెక్కల’తో తేల్చేసేవారు. ఇప్పుడు ఫోన్లో ‘కాలిక్యులేటర్’పై ఆధారపడాల్సిందే! ► మొబైల్‌ఫోన్ ఎక్కువగా వాడటం, సరిగా కూర్చోకుండా టీవీలు చూడటంతో మెడ వెనుక అప్పర్ బ్యాక్‌పెయిన్ వస్తోంది. ► 2019 నుంచి నిద్రలేమి సమస్యలు ఎక్కువగా పెరిగాయి. రోజూ అర్ధరాత్రి 12 గంటలు, ఒంటిగంట వరకూ నిద్ర మేల్కొని ఉంటున్నారు. జనాభాలో 32 శాతం మంది అర్ధరాత్రి వరకూ ఫోన్లలో గడుపుతున్నారు. ► అనవసర సోషల్ మీడియా యాప్స్ మొబైల్స్‌లో పెట్టుకోకూడదు. ► సెల్‌ఫోన్, టీవీలు ఎక్కువ సమయం, ఎక్కువ లైటింగ్‌లో చూడటం, అతిదగ్గరగా, అతి దూరంగా చూడటం, సరిగా కూర్చోకుండా చూడటం చాలా ప్రమాదకరం. ► నిద్రకు కనీసం గంట ముందు టీవీ, ఫోన్ చూడటం ఆపేయాలి. ► పుస్తకాలు, న్యూస్‌పేపర్ చదవడం తగ్గింది. దీన్ని అలవాటు చేయాలి. బంధువులు, స్నేహితులతో ఎక్కువగా గడపాలి, మాట్లాడాలి. శారీరక దృఢత్వాన్ని కలిగి ఉండేలా ఆటలు ఆడాలి. వ్యాయామాలు చేయాలి. సోమరితనం పెరుగుతోంది ‘టెక్నాలజీ’ అవసరం కోసమే. కానీ బానిసలవుతున్నాం. దీంతో వెన్ను, మెడ నొప్పితో పాటు ‘నిద్ర’ టైంటేబుల్ మారిపోయింది. గతంలో 9 నుంచి 10 గంటల వరకు నిద్రపోయేవాళ్లు. ఇప్పుడు ఫోన్, ఓటీటీల్లో సినిమాలు చూస్తూ అర్ధరాత్రి వరకూ మేల్కొని ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తున్నారు. దీంతో శరీరంలో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్ అవుతోంది. సోమరితనం ఎక్కువగా వస్తోంది. జ్ఞాపకశక్తిని కోల్పోయి మొద డు మొద్దుబారుతోంది. ఫోన్ నంబర్లతో పాటు కొత్తగా పరిచయమయ్యేవారి పేర్లను కూడా గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. పిల్లలు ఆహారం తినాలన్నా ఫోన్లు, టీవీలు చూపించే పరిస్థితి. ప్రస్తుతం ‘డిప్రెషన్ ట్రెండ్’ నడుస్తోంది. చాలామందికి వారు డిప్రెషన్లో ఉన్న సంగతే తెలీడం లేదు. – డాక్టర్ కె. హేమంత్‌కుమార్‌రెడ్డి, న్యూరోఫిజీషియన్ జాగ్రత్త లేకపోతే భవిష్యత్తు ఛిన్నాభిన్నమే టెక్నాలజీ అతి వినియోగంతో ఎక్కువ మానసిక సమస్యలు వస్తున్నాయి. 15–25 ఏళ్ల వయస్సున్న వారికి లెర్నింగ్ ఎబిలిటీ ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి. చదవడం, నేర్చుకోవడంతో నాలెడ్ట్ వస్తుంది. ఇప్పటి పిల్లలు వినోదానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో చదువులో క్వాలిటీ ఉండటం లేదు. సొసైటీపై కూడా బాధ్యత ఉండటం లేదు. ఉద్యోగాలు సాధించలేని పరిస్థితుల్లో డిప్రెషన్లోకి వెళ్లి ఆల్కాహాల్, సిగరెట్లు, డ్రగ్స్‌కు బానిసయ్యే ప్రమాదం ఉంది. చెడు, మంచి రెండూ నేర్చుకునే అవకాశాలు ప్రస్తుత సొసైటీలో ఉన్నాయి. పిల్లల పెంపకంపై తల్లిదండ్రులు మరింత జాగ్రత్తతో ఉండాలి. గారాబాలతో ఏమాత్రం అలసత్వం చేసినా భవిష్యత్‌ను ఛిన్నాభిన్నం చేసినట్లే. డాక్టర్ ఇక్రముల్లా, సైక్రియాట్రిస్ట్, కర్నూలు. -
సినిమా చూపిస్త మావా.. వడివడిగా ఓవర్ ది టాప్ అడుగులు
కంటికి కనిపించని కరోనాను తీసుకువచ్చి ప్రపంచాన్ని గడగడలాడించిన 2020.. మానవాళి జీవన శైలిని సమూలంగా మార్చివేసింది. అనేక అలవాట్లను, పోకడలను పరిచయం చేసింది. వర్క్ ఫ్రం హోంలు, ఆన్లైన్ చెల్లింపులు, ఆన్లైన్ షాపింగ్‌లు లాంటి వాటన్నింటినీ అలవాటు చేసింది. అదే సంవత్సరం మరో పరిణామానికి నాంది పలికింది. అది స్ట్రీమింగ్ సర్వీసుల వెల్లువ. మనం ఓటీటీ సర్వీసుగా పిలుచుకునే ఈ సేవల విజృంభణకు కరోనా కూడా ఓ ప్రధాన కారణమయ్యింది. థియేటర్ల మూత, బయట తిరగలేని పరిస్థితి, వర్క్ ఫ్రం హోంలతో ఇంటికి పరిమితమైన జనాభాకు వినోదం అందించేందుకు ఓ కొత్త మార్గాన్ని ఆవిష్కరించిందీ ఓటీటీ సర్వీసు. కేబుల్ కనెక్షన్, బ్రాడ్కాస్ట్ పరికరాలు, శాటిలైట్ కనెక్షన్లతో సంబంధం లేకుండా ఇంటర్నెట్ ద్వారా మన దగ్గర ఉన్న మొబైల్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ లాంటి ఎలాంటి పరికరం ద్వారా అయినా వినోదాన్ని అందించేదే ఈ స్ట్రీమింగ్ సర్వీసు. సినిమాతో మొదలై టెలివిజన్ సీరియల్స్, వెబ్ సిరీస్‌లు, లైవ్ స్ట్రీమింగ్ల వరకు విస్తరించిన ఈ ఓటీటీ రంగం త్వరలో టెలివిజన్ రంగాన్ని మించి పోయే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. పేరుకు తగ్గట్టుగా ఓటీటీ (ఓవర్ ది టాప్) అన్ని వినోద రంగాల్ని అధిగమించబోతోంది. వీడియో వచ్చి రేడియోను మరిపించినట్లుగా ఓటీటీ ఇప్పుడు డిష్ చానళ్లను కనుమరుగు చేస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది కేబుల్ కనెక్షన్లకు స్వస్తి చెప్పి ఓటీటీ సర్వీసుల్లో సభ్యులుగా చేరిపోయారు. ఓటీటీ సేవల విస్తృతి గమనిస్తే ముక్కున వేలు వేసుకోవాల్సిందే. 2019 నాటికి 190 కోట్ల మంది సభ్యులు కలిగిన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ 2020కి 210 కోట్లు, 2021 నాటికి 220 కోట్లు లెక్కన 2025 నాటికి 270 కోట్ల సభ్యులను సమకూర్చుకోబోతోంది. ఇది ఆఫ్రికా ఖండం జనాభాకు దాదాపుగా రెట్టింపు కాబోతోంది. సభ్యత్వ రుసుము ద్వారా ఈ సంస్థలు ఆర్జిస్తున్న ఆదాయం కూడా అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. 2019లో 8,300 కోట్ల డాలర్లు ఉండగా 2020 నాటికి అది 9,900 కోట్ల డాలర్లకు పెరిగి 2025 నాటికి 16700 కోట్ల డాలర్లకు పెరగనున్నట్లు అంచనా. అంటే శ్రీలంక, నేపాల్ జీడీపీలను కలిపినా ఈ మొత్తం ఎక్కువే. దీనంతటకూ కారణం బ్రాడ్‌బ్యాండ్ కవరేజీ పెరగడం, హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం, చెల్లించే రుసుము తక్కువ కావడం కొన్ని కారణాలైతే విపరీతంగా పెరిగిపోతున్న స్మార్ట్ ఫోన్లు మరో పెద్ద కారణం. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఎక్కడున్నా నచ్చిన సినిమా లేదా సీరియల్‌ను వీక్షించే వీలుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 664 కోట్లు స్మార్ట్ ఫోన్లు అంటే.. 83.89 శాతం మంది వద్ద ఫోన్లు ఉన్నట్లు జోరాం అనే సంస్థ నివేదిక. 2026 నాటికి 130 కోట్ల స్మార్ట్ ఫోన్లు ఇంటర్నెట్ కనెక్షన్ పొందనున్నట్లు మొబైల్ ట్రేడింగ్ సంస్థ జీఎస్ఎమ్ఏ అంచనా. లెక్కలేనన్ని చానల్స్ సినిమా, మ్యూజిక్, వెబ్‌సిరీస్, స్పోర్ట్స్ లాంటి అన్ని రకాల వినూత్న వినోద క్రీడా రంగాలకు సంబంధించి ఓటీటీ చానెల్స్ అందుబాటులో ఉన్నాయి. కొన్ని చానెల్స్‌లో చిన్న పిల్లలకు కూడా వినోదం అందించే కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 300కుపైగా ఓటీటీ చానెల్స్ ఉన్నాయి. అమెరికా జనాభా 75శాతం మంది రెండు లేదా ఆపైన ఓటీటీ చానల్స్ సబ్స్క్రైబర్లుగా ఉన్నారు. ఒక్క నెట్‌ఫ్లిక్స్‌కే అమెరికా జనాభాలో 30శాతం మంది సభ్యులు. కోవిడ్ పుణ్యమా అని కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. జర్మనీలోని బూట్సాస్ అనే మ్యూజిక్ నైట్ క్లబ్ ఏకంగా బాట్సాస్ లైవ్ అనే ఓటీటీ చానెల్ ప్రారంభించి సభ్యుల కోసం లైవ్ మ్యూజిక్ కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. పికాక్ అనే సంస్థ టోక్యో ఒలింపిక్స్ లైవ్ స్ట్రీమింగ్ కోసం ఓటీటీ చానెల్ ప్రారంభించి అన్ని రకాల క్రీడా పోటీలను లైవ్‌గా ప్రసారం చేసింది. ఎన్ని చానెల్స్ ఉన్నా ఓటీటీ రంగంలోకి తొలి అడుగు వేసిన నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికీ టాప్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌కి నెలవారీ ఫీజు చెల్లించే 22.5 కోట్ల మంది సభ్యులు ఉన్నారు అమెజాన్‌కు చెందిన ప్రైమ్ వీడియోకు 20.5 కోట్లు, స్పాటిఫైకి 18 కోట్లు , డిస్నీ ప్లస్‌కి 13 కోట్లు, హెచ్‌బీవో మ్యాక్స్‌కి 8.5 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. అక్కడ ఫ్లాప్.. ఇక్కడ హిట్... పాత సినిమాలు, టీవీ సీరియల్స్ కొనుగోలు చేసి ప్రసారం చేయడం ద్వారా వ్యాపారం ప్రారంభించిన ఈ స్ట్రీమింగ్ చానల్స్ ఇప్పుడు సొంత సినిమాలు, సీరియల్స్ నిర్మిస్తు న్నాయి. టీవీలో ఫ్లాప్ అయిన సీరియల్స్ ఓటీటీలో బంపర్‌హిట్ అవుతున్నాయి. స్పానిష్ థ్రిల్లర్‘మనీహైస్ట్’ టీవీలో ఫ్లాప్ షోగా ముద్ర వేయించుకుని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ చానల్లో ప్రత్యక్షమై బ్రహ్మాండంగా హిట్టయ్యింది. నెట్‌ఫ్లిక్స్ 2020లో సొంత సినిమాలు, సీరియల్స్ కోసం 1,700 కోట్ల డాలర్లు వెచ్చించింది. ఈ సంస్థ దగ్గర ఇప్పుడు సినిమాలు, సీరియల్స్ కలిపి 6,000 టైటిల్స్ ఉన్నాయి. అందులో 40 శాతం సొంత ప్రొడక్షనే. డిస్నీ దగ్గర అయితే 2500 టీవీ సీరియల్స్‌కు సంబంధించిన 55,000 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఆస్కార్ అవార్డు గ్రహీత టామ్ హంక్స్, ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పిల్బర్గ్ కలసి రెండో ప్రపంచయుద్ధంపై హెచ్‌బీవో కోసం సిరీస్ నిర్మిస్తున్నారు. దీనికోసం బ్రిటన్‌లో ఇప్పటికే ఒక కృత్రిమ వైమానిక స్థావరాన్ని నిర్మించారు. విలీనపర్వం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మధ్య పోటీ రసవత్తరంగా మారింది. నెట్‌ఫ్లిక్స్‌లో పోటీ పడేందుకు వివిధ టీవీ, ఓటీటీ సంస్థలు విలీనబాట పడుతున్నాయి. మీడియా రంగంలో మెగా సంఘటనగా పేర్కొంటున్న అతి పెద్ద విలీనం ఈ ఏడాది చివరికి జరగబోతోంది. ఏటీ అండ్ టీ, హెచ్‌బీవో, సీఎన్ఎన్, వార్నర్ మీడియా, డిస్కవరీ, యానిమల్ప్లానెట్, టీఎల్సీ కలసి ఒకే గొడుగు కిందకి రాబోతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో ఇప్పటికే హాలీవుడ్ మెగా సంస్థ ఎంజీఎంను కొనుగోలు చేసింది. బ్రిటన్‌లో బీబీసీ, ఐటీవీ, చానెల్ఫోర్ కలసి ‘బ్రిట్బాక్స్’ అనే స్ట్రీమింగ్ సంస్థను ఏర్పాటు చేసుకున్నాయి. జర్మనీలో డిస్కవరీ, మరో మాస్ మీడియా సంస్థతో కలసి జోయిన్గా అవతరించాయి. స్పెయిన్‌లో అట్రెస్ మీడియా, మీడియా సెల్, ఆర్టీవీ కలసి లవ్స్ టీవీనీ ఏర్పాటు చేశాయి. నెట్‌ఫ్లిక్స్ వీడియో, గేమింగ్ మార్కెట్లో అడుగుపెట్టేందుకు నైట్స్కూల్ స్టూడియోను కొనుగోలు చేయబోతున్నట్లు ప్రకటించింది. - దొడ్డ శ్రీనివాసరెడ్డి -
ఆర్థిక ఇబ్బందులతో దేశీ స్టార్టప్ కంపెనీలు సతమతం
(కంచర్ల యాదగిరిరెడ్డి) దేశంలో గత కొన్నేళ్లుగా వినిపిస్తున్న కొత్త మంత్రం స్టార్టప్.. స్టార్టప్.. వినూత్నమైన ఉత్పత్తులు, సేవలతో సరికొత్త వ్యాపారాలను సృష్టించి భారత యువత ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. రూ. వందల వేల కోట్ల విలువైన పెట్టుబడులు స్టార్టప్ కంపెనీల్లోకి ప్రవహిస్తూ ఎందరికో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. అయితే ప్రతి వ్యవస్థలో ఒడిదుడుకులు ఉన్నట్లే ప్రస్తుత మన స్టార్టప్ కంపెనీలూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రూ. లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు... దేశంలో ఇప్పటివరకు దాదాపు 72 వేల స్టార్టప్‌లు ఏర్పాట య్యాయి. ఈ ఏడాది జూన్ వరకూ భారత స్టార్టప్ కంపెనీలు ఆకర్షించిన పెట్టుబడులు సుమారు రూ. 1.36 లక్షల కోట్ల వరకు ఉంటాయని అంచనా. కేవలం 891 ఒప్పందాల ద్వారా ఈ స్థాయి పెట్టుబడులు రావడమన్నది చెప్పుకోదగ్గ విషయమే. ఈ సమయంలోనే సుమారు 18 స్టార్టప్ కంపెనీలు 100 కోట్ల డాలర్ల విలువైనవిగా (యూనికార్న్)గా మారిపోయాయి. గతేడాదితో పోలిస్తే వచ్చిన పెట్టుబడులు, యూనికార్న్‌లుగా ఎదిగిన కంపెనీల సంఖ్య రెండూ ఎక్కువే. సరిపెట్టుకుంటున్న స్టార్టప్‌లు.. పెట్టుబడులు తగ్గిపోయిన నేపథ్యంలో భారత స్టార్టప్ కంపెనీలు కూడా అందుకు తగ్గట్లుగా సర్దుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, మార్కెటింగ్ వ్యవహారాలను తగ్గించుకోవడం ద్వారా పొదుపును పాటించే ప్రయత్నం చేస్తున్నాయి. భారం తగ్గించుకొనే క్రమంలో వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ ఇలా ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య 10 వేలకు పైనే. ఈ పరిస్థితి ఇంకో ఏడాదిన్నర వరకూ కొనసాగే అవకాశం ఉందని అంచనా. కోవిడ్ సమయంలో లాక్డౌన్ కారణంగా ఆన్లైన్ క్లాసులు ఉనికిలోకి రాగా విద్యకు సంబంధించిన స్టార్టప్‌లు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. వీడియో గేమింగ్ పరిస్థితి కూడా ఇదే. అయితే కోవిడ్ సద్దుమణుగుతున్న నేపథ్యంలో ఈ రంగాలకు నిధుల కొరత ఏర్పడిందని నిపుణులు అంటున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే చాలా రంగాల్లోని స్టార్టప్‌లు గత రెండేళ్లుగా నిధులు సేకరించలేదు. ప్రస్తుత పరిస్థితులు ఇలాంటి కంపెనీలకు పెద్ద సమస్యగా మారుతున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు వస్తేనే సమీప భవిష్యత్తులో మళ్లీ స్టార్టప్‌లు నిలదొక్కుకోగలవని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదుటపడితే నిధులు వస్తాయని, కాకపోతే వచ్చే ఈ నిధులను కొంచెం ఆచితూచి తగిన వ్యాపార ప్రణాళికతో ఖర్చు చేస్తే మేలన్నది వారి అభిప్రాయం. మే నెలలో మందగమనం.. ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో పెట్టుబడుల మొత్తం రూ. 1.36 లక్షల కోట్లుగా పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నా అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఫలితంగా ఏప్రిల్ నుంచే మందగమనం మొదలైంది. మే నెలలో వచ్చిన పెట్టుబడులు రూ. 14 వేల కోట్లు మాత్రమే. ఇందులోనూ గతంలో కుది రిన ఒప్పందాల కారణంగా వచ్చినవే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా షేర్ మార్కెట్ల పతనం, పెరుగుతున్న వడ్డీ రేట్లు, సరుకు రవాణా ఇబ్బందులు, ద్రవ్యోల్బణం పెరుగుదల వంటివి భారత స్టార్టప్ వ్యవస్థపైనా ప్రభావం చూపాయని నిపుణులు విశ్లేస్తున్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కూడా ఇందు కు ఒక కారణంగా చెబుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వెంచర్ క్యాపిటలిస్టులైన సాఫ్ట్ బ్యాంక్, టైగర్ గ్లోబల్ మేనేజ్ మెంట్లు మే నెలలోనే 2022 సంవత్సరానికిగాను నష్టాలను ప్రకటించడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్ వరకూ ప్రతి త్రైమాసి కానికి 1,000–1,100 కోట్ల డాలర్ల పెట్టుబడులు రాగా మే–జూన్ త్రైమాసికంలో అది 40% దాకా తగ్గిపోయి 600–700 కోట్ల డాలర్లకు పరిమితమైంది. ( పాపం.. ఓలా అంచనా తల్లకిందులైందే!) నిపుణుల మాట ఇదీ.. ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కగలిగినవి మాత్రమే భవిష్యత్తులో దేశంలోని దిగ్గజ కంపెనీల జాబితాలోకి చేరిపోతాయి. 2021ని స్టార్టప్‌లకు ఊపిరి పోసిన ఏడాదిగా చెప్పుకోవాలి. ఇప్పుడు కొన్ని సమస్యల నుంచి గట్టెక్కగలిగితే వాటి భవిష్యత్తుకు ఢోకా ఉండదు. – ఆశిష్ శర్మ, ఇన్నోవెన్ క్యాపిటల్ ఇండియా మేనేజింగ్ పార్ట్నర్ భారత స్టార్టప్ వ్యవస్థకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. టెక్నాలజీ, ఇన్నొవేషన్, ఉత్పత్తులన్నీ యథాతథంగా కొనసాగుతాయనేది నా నమ్మకం. కంపెనీల వ్యాల్యుయేషన్‌లో తగ్గుదల ఉన్నా మొత్తమ్మీద పరిస్థితి బాగుంది. – సి.విజయ్ కుమార్, సీఈవో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గత 2 నెలల్లో స్టార్టప్ వ్యవస్థకు సమస్యల ముసురు పట్టుకుంది. పెట్టుబడులు తగ్గిపోయాయి. ఉన్న కంపె నీల వ్యాపార ప్రణాళికలు వెనుకంజ వేస్తుండగా కొత్త వాటికి నిధులు గగనమైపోతున్నాయి. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? సమస్యలు ఇలాగే ఉంటే వాటి భవిష్యత్తు ఏమవుతుంది? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం జరగాలి. – కేశవ్ ఆర్. మురుగేష్, నాస్కామ్ మాజీ చైర్మన్ స్టార్టప్ కంపెనీలు మౌలికాంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వెంచర్ క్యాపిటలిస్టులు లేదా పెట్టు బడిదారులు గతంలో మాదిరిగా సులువుగా పెట్టుబ డులు పెట్టడం లేదు. ఉత్పత్తి లేదా సేవ ఆదాయాన్ని ఇవ్వగలదా లేదా? అన్నది చూస్తున్నారు. ఇప్పటివరకూ చాలా వరకూ స్టార్టప్‌లు తమ ఉత్పత్తులు/సేవలను రాయితీ ధరలతో అమ్మే ప్రయత్నం చేశాయి. ఇలా కాకుండా వాస్తవ అవసరాలను గుర్తించి చేసే వ్యాపారం లాభదాయకమా కాదా? అని ఆలోచించుకుని ముందడుగు వేయడం మంచిది. – మురళి బుక్కపట్నం, టై గ్లోబల్ ఉపాధ్యక్షుడు స్టార్టప్‌లకు అకస్మాత్తుగా నిధులు మందగించడం ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకుల్లో భాగమే. దీనిపై ఆందోళన అవ సరం లేదు. అయితే కేవలం వ్యాల్యుయేషన్పైనే ఆధార పడి కొంతకాలంగా స్టార్టప్ కంపెనీలు పనిచేస్తుండటం ప్రస్తుత పరిస్థితికి కారణం కావచ్చు. ఆదాయాన్ని సృష్టించగలమా? లాభాలు వస్తాయా అనే ఆలోచన లేకుండా కంపెనీలు పెట్టుబడిదారుల నుంచి వస్తున్న నిధులను ఖర్చు చేయడమే ఆందోళన కలిగించే విషయం. – ఇటీవలి నివేదికలో ఆర్బీఐ -
సైబర్ క్రైమ్: పిల్లలు ఏం చూస్తున్నారు?
సురేష్ ఇంటికి వస్తూనే వందన మీద కేకేశాడు ‘మన పర్సనల్ ఫొటోలు సోషల్‌మీడియాలో ఎందుకు పోస్ట్ చేశావ’ని. వందన తన ఫోన్ తీసుకొని చెక్ చేసింది. భర్త చెప్పింది నిజమే. కొడుకు వీడియో గేమ్ ఆడుకుంటానని అదేపనిగా విసిగిస్తుంటే తన మొబైల్ ఫోన్ ఇచ్చింది. ఎని మిదేళ్ల కొడుకు చేసిన నిర్వాకానికి తలకొట్టేసినట్లయ్యింది. సోషల్ మీడియాలో అప్లోడ్ అయిన ఫొటోలు తొలగించి ఊపిరి పీల్చుకుంది. ఎందుకలా చేశావని అడిగితే తనకేమీ తెలియదని ఆటలో మునిగిపోయిన కొడుకును చూస్తూ ‘ఇక నుంచి వీడిని ఫోన్ ముట్టకోనివ్వకూడద’ ని గట్టిగా నిర్ణయించుకుంది. (పేర్లు మార్చడమైది). సురేశ్, వందన విషయంలోనే కాదు పిల్లలున్న ప్రతి ఇంట్లో డిజిటల్ వినియోగంపై తల్లిదండ్రుల్లో ఆందోళన రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఊహ తెలియని పిల్లలు ఆన్లైన్లో ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారో... అనే ఆందోళన ఎక్కువయ్యింది. బడి పాఠాలు కూడా డిజిటల్లోకి మారాక ఇంటర్నెట్ వాడకం పిల్లల్లోనూ పెరిగింది. ఇలాంటప్పుడు పిల్లలకు ఏది మంచి, ఏది చెడు తెలియజేయాల్సిన అవసరం తల్లిదండ్రులకు తప్పక ఉంది. డిజిటల్ శ్రేయస్సు... ఈ రోజుల్లో పిల్లల స్మార్ట్ ఫోన్ స్క్రీన్ సమయాన్ని నియంత్రించడం కష్టమైన పనే. 7నుంచి 13 ఏళ్ల పిల్లలు చాలా రకాల సోషల్ నెట్వర్కింగ్ సైట్లను ఉపయోగిస్తున్నారు. డిజిటల్ శ్రేయస్సు విషయంలో అన్ని వయసుల వారికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అలాగే, డిజిటల్ టెక్నాలజీతో మెరుగైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రమాదాలు, జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండటం తప్పనిసరి. మన దగ్గరి డేటా.. మన దేశంలో 2021లో ఇంటర్నెట్, సోషల్ మీడియాను వినియోగించేవారి సంఖ్య దాదాపు 1.39 బిలియన్ల జనాభా ఉంది. 1.10 బిలియన్లకు మొబైల్ కనెక్షన్‌కి యాక్సెస్ ఉంది. వీరిలో 624 మిలియన్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు. 448 మిలియన్ల మంది యాక్టివ్ సోషల్ మీడియా వినియోగదారులు. సగటు ఇంటర్నెట్ వినియోగం రోజుకు 6.36 గంటలు అయితే సోషల్ మీడియా వినియోగం 2.25 గంటలు. మ్యూజిక్ స్ట్రీమింగ్ సేవలను వినడానికి వెచ్చించిన సగటు సమయం 1.53 గంటలు. గేమింగ్‌లో గడిపే సగటు సమయం 1.20 గంటలు. 16 నుండి 64 సంవత్సరాల మధ్య వయస్సు గల ఇంటర్నెట్ వినియోగదారులలో 92.8% మంది వీడియో గేమ్‌లు ఆడుతున్నారని నివేదికలు ఉన్నాయి. మార్గదర్శకాలు తప్పనిసరి... ఈ రోజుల్లో పిల్లలు సెకండరీ స్కూల్‌కి వెళ్లడంతోనే మరింత స్వతంత్రులు అవుతున్నారు. వైవిధ్యమైన అలవాట్లతో మరింత నమ్మకంగా ఇంటర్నెట్ వినియోగదారులుగా మారుతున్నారు. తల్లిదండ్రులు యాప్ ద్వారా కొనుగోళ్లను ఆపేయాలి. పిల్లలతో తరచూ ఇంటర్నెట్ భద్రత గురించి మాట్లాడాలి. పిల్లలకు వ్యక్తిగతం కాకుండా కుటుంబ ఇ–మెయిల్‌ను సెట్ చేయాలి. వీడియోగేమ్‌ల రేటింగ్, వయసు బార్లను తనిఖీ చేయాలి. పెద్దలకు చిట్కాలు... ∙పిల్లలు స్క్రీన్‌ని ఎక్కువగా వాడుతున్నారని టెక్నాలజీ యాక్సెస్‌ను బ్లాక్ చేయవద్దు. అంటే, ఫోన్లు లాగేసుకోవడం, ఇంటర్నెట్ కట్ చేయడం.. చేయకూడదు. ∙ పిల్లలకు ఇష్టమైన యాప్‌లు, సైట్లపై మీరూ ఆసక్తి చూపండి. ∙కొన్ని పరిమితులను సెట్ చేయడానికి కంటెంట్ ఫిల్టర్ సాఫ్ట్వేర్లను వాడచ్చు. ∙పడకగది, భోజన సమయం, ప్రయాణంలో.. ఇంటర్నెట్ను వాడద్దని కుటుంబమంతటికీ పరిమితిని నిర్ణయంచండి. ∙ఆన్లైన్లో ఏ వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయ కూడదో/ఓవర్షేర్ చేయకూడదో తప్పనిసరిగా నేర్పించాలి. ∙ఆఫ్ స్క్రీన్ సమయం, ఆన్‌స్క్రీన్ సమయాన్ని బ్యాలెన్స్ చేయడం నేర్పాలి. ∙వయసు పరిమితులు (ఉదా: 18 ఏళ్లు) ఉన్న సైట్లకు సైన్ అప్ చేయడానికి మీ చిన్నారికి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వవద్దు. అవసరం, అవగాహన లేని సమాచారం ఇవ్వాలనుకోకూడదు. పెద్దలు వేసుకోదగిన ప్రశ్నలు ► మీ పిల్లలు ఆన్లైన్ ద్వారా ఎవరితో సంప్రదింపులు జరుపుతున్నారో, ఎందుకు జరుపుతున్నారో, ఈ పరస్పరచర్య నుండి వారు ఏం పొందుతున్నారో .. తెలుసుకోవడం ముఖ్యం. ► ఆన్లైన్లో ఏ సమాచారం గురించి వెతుకుతున్నారు. అందుకు వారు ఉపయోగించే సాధనాలు ఏమిటి, వాటి మూలాలు ఏమిటి.. తనిఖీ చేయడం అవసరం. ► మీ డిజిటల్ కార్యకలాపాల మంచి, చెడు తెలిసే విధానం ఏమిటి, వాటి ప్రభావం పిల్లల మీద ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ∙పిల్లలు తమ చుట్టూ ఉన్నంత సురక్షితంగా, ఆన్లైన్ వేదికల్లో ఉన్నారా. ఈ తరహా డిజిటల్ శ్రేయస్సుపై అవగాహన, అభ్యాసం ఎప్పుడూ ఆగిపోకూడదు. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
హాట్ టాపిక్‌గా చైనా.. ఈసారి ఏం చేసిందంటే..?
బీజింగ్: చైనా మరోసారి సోషల్ మీడియాలో నిలిచింది. ఇప్పటికే ఎన్నోసార్లు వివిధ ఆవిష్కరణలు, ప్రపంచాన్ని భయపెడుతూ వార్తల్లో నిలిచిన చైనా.. ఈసారి మాత్రం కొంచెం వైరెటీ పని చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారింది. ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా.. భార్యలతో షాపింగ్‌కు వెళ్లే భర్తల కోసం చైనీయులు ట్రెండీగా ఆలోచించారు. భార్యలు గంటల కొద్దీ సమయం షాపింగ్ కోసం కేటాయిస్తారాన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో భర్తలు అసహనానికి గురికాకుండా, వారికి బోర్ కొట్టకుండా ఉండేందుకు చైనా ఓ పరిష్కారాన్ని కనుగొంది. షాపింగ్ చేసే భార్యలకు దూరంగా ఉండేందుకు షాంఘైలోని గ్లోబల్ హార్బర్ మాల్లో 'husband storage' పాడ్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పాడ్స్‌లో ఓ వ్యక్తి కూర్చునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసింది. కస్టమర్లు ఆ పాడ్స్‌లో కుర్చొన్న సమయంలో వారు వైరే లోకంలో ఉన్నారనే అనుభూతిని కలిగించేందుకు వారికి బోర్ కొట్టకుండా ఉండేందుకు స్పెషల్ అరేంజ్మెంట్స్ చేసింది. గేమ్స్ ఆడుకునేందుకు వీలుగా మానిటర్, గేమ్ ప్యాడ్స్‌ను, కనీస అవసరాలను ఏర్పాటు చేసింది. అయితే, ప్రస్తుతానికి వినియోగదారులకు పాడ్స్‌లో ఉచితంగా గేమ్స్ ఆడుకునేందుకు అవకాశం కల్పించారు. రానున్న రోజుల్లో కస్టమర్లు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని షాపింగ్ మాల్స్ యజమానులు చెబుతున్నారు. కాగా, ఈ పాడ్స్‌లో సమయంగా గడిపిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. పాడ్స్‌లో గేమ్స్ ఆడటం ఎంతో కొత్తగా ఉందన్నారు. ఆహ్లదాన్ని అందించినట్టు తెలిపారు. దీంతో పాడ్స్ ఏర్పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. -
Video Game: భీముడిలా పోరాడొచ్చు.. కురుక్షేత్ర యుద్ధం చేయొచ్చు
న్యూఢిల్లీ: హిందూ పురాణ పాత్రలతో కూడిన వీడియో గేమింగ్‌లకు ఆదరణ పెరుగుతోంది. దీంతో కంపెనీలు కొత్త కొత్త పాత్రలతో కూడిన గేమ్‌లను రూపొందిస్తున్నాయి. దీంతో భీముడు, సూర్పణక, అర్జునుడు, సుగ్రీవుడు తదితర పాత్రలతో కూడిన గేమ్‌లు దర్శనమివ్వనున్నాయి. దేశీ గేమింగ్ బూమ్ నేపథ్యంలో ఈ తరహా క్యారక్టర్ల పట్ల యూజర్లు ఆసక్తి ప్రదర్శిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. డిమాండ్ వాతావరణం బాగుండడంతో కంపెనీలు చేపట్టే కొత్త ప్రాజెక్టులకు ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడిదారులు మద్దతుగా నిలుస్తున్నారు. ‘కురుక్షేత్ర: ఆసెన్సన్’ అనే స్ట్రాటజీ విడియోగేమ్‌ను అభివృద్ధి చేసిన స్డూడియోసిరాహ్ 8,30,000 డాలర్ల నిధులను ప్రముఖ ఇన్వెస్టర్ల నుంచి సమీకరించడం గమనార్హం. లిమికాయ్ ఫండ్, ఇన్‌మొబి సహ వ్యవస్థాపకుడు పీయూష్ షా, స్వీడిష్ గేమింగ్ కంపెనీ స్టిల్‌ఫ్రంట్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆలెక్సిస్ బాంటే, నాడ్విన్ గేమింగ్ వ్యవస్థాపకుడు అక్షత్‌రాథీ పెట్టుబడులు పెట్టిన వారిలో ఉన్నారు. మార్కెట్ పెద్దదే.. మరోవైపు ఇండస్ గేమ్ రూపకర్త ‘సూపర్ గేమింగ్’ సైతం సిరీస్–ఏ రౌండ్లో భాగంగా 5.5 మిలియన్ డాలర్లను సమీకరించింది. స్కైక్యాచర్, ఏఈటీ ఫండ్, బీఏస్ క్యాపిటల్, డ్రీమ్ ఇంక్యుబేటర్, 1అప్ వెంచర్స్, ఐసెర్టిస్ సహ వ్యవస్థాపకుడు మోనిష్ దర్దా ఈ పెట్టుబడులు సమకూర్చారు. భారత గేమింగ్ పరిశ్రమ భిన్నమైన గేమ్‌లతో పరిపక్వ దశలో ఉన్నట్టు కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ ఇటీవలో ఓ నివేదికలో పేర్కొనడం గమనార్హం. ‘‘గేమింగ్ కంపెనీలకు యూజర్ల అభిరుచులే ఎన్నో అవకాశాలను కల్పిస్తున్నాయి. గేమింగ్ ప్రియులు భారతీయ కంటెంట్‌తో కూడిన వాటిని ఆదరిస్తున్నారు. భారత పురాణ పాత్రలతో కూడిన వాటి పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారు’’ అని రెడ్‌సీర్ తెలిపింది. ‘‘ప్రజలకు తెలిసిన పాత్రలతో గేమ్‌లను రూపొందించి వారికి చేరువయ్యే ప్రయత్నాన్ని కంపెనీలు చేస్తున్నాయి. మహాభారత, రామాయణంలోని పాత్రలను చిన్న నాటి నుంచి పెరుగుతూనే తెలుసుకుంటాం. వీటిని అర్థం చేసుకునేందుకు ప్రత్యేక శ్రమ పెట్టక్కర్లేదు’’ అని స్టూడియో సిరాహ్ సహ వ్యవస్థాపకుడు అబ్బాస్‌షా తెలిపారు. కురుక్షేత్ర గేమ్‌ను బీటా వెర్షన్లో 100 మంది యూజర్లకు ఆహ్వాన విధానంలో అందించామని, వాణిజ్య పరంగా వచ్చే ఏడాది విడుదల చేస్తామని చెప్పారు. భారత మార్కెట్టే కాకుండా.. దక్షిణాసియా దేశాల్లోనూ భారత పురాణ పాత్రల పట్ల ఆసక్తి ఉందన్నారు. చదవండి: వీడియో గేమ్‌లో అన్నదమ్ములు.. పేరెంట్స్ ఖాతా నుంచి లక్ష ఖర్చు -
పిల్లల కోసం నెట్‌ఫ్లిక్స్ కొత్త ఫీచర్లు, ఖర్చు లేకుండా చూడొచ్చు!
ఎంటర్టైన్మెంట్ రంగాన్ని శాసిస్తున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు గేమింగ్ ఇండస్ట్రీ పై కన్నేసింది. ముఖ్యంగా మొబైల్ వెర్షన్లో చిన్నపిల్లలు గేమ్స్ ఆడే విధంగా కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఫేస్ బుక్ ఎగ్జిక్యూటీవ్ మైక్ వెర్దును గేమ్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమించింది. ఈ ఫీచర్ పై మైక్ వెర్దు మాట్లాడుతూ.. వచ్చే ఏడాది నాటికి కిడ్స్ రీ క్యాప్ ఈమెల్, కిడ్స్ టాప్ 10 రో పేరుతో సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు వీడియో గేమ్ ను ఆడేస్తున్నారు ప్రపంచ దేశాల్లో వీడియో గేమింగ్ ఇండస్ట్రీ ఊపందుకుంది. మార్కెట్ పరిశోధన సంస్థ 'స్టాటిస్టా' రిపోర్ట్ లో 2012 నుంచి 2021 నాటికి వీడియో గేమింగ్ వినియోగం భారీగా పెరిగింది. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు వీడియో గేమ్స్ ఆడుతున్నట్లు తెలుస్తోంది. 2012లో 52.8 శాతంతో ప్రారంభమై 2021 నాటికి 138.4కి పెరిగింది. ముఖ్యంగా కరోనా క్రైసిస్‌లో వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగింది. -
టెస్లా క్రిస్మస్ బహుమతి
టెస్లా క్రిస్మస్ పండుగ సందర్బంగా తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ అప్డేట్ లో భాగంగా ఆర్కేడ్ ప్లాట్ఫామ్లో 3 కొత్త ఇన్-కార్ వీడియో గేమ్‌లను తీసుకొచ్చింది. సాంప్రదాయ వాహన తయారీదారులకు కంటే కొత్తగా ఏమైనా తీసుకోరడంలో భాగంగా టెస్లా కార్లలో వీటిని తీసుకొచ్చింది. క్రిస్మస్ నాడు కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ రానుంది అని గతంలో పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ అప్డేట్ సంబందించిన ఒక చిత్రం రెడ్డిట్‌లో లీక్ అయింది. నార్వేజియన్ భాషలో విడుదలైన నోట్లను ఉటంకిస్తూ యుఎస్ మీడియా టెస్లా కారులోని గేమ్స్ సాఫ్ట్వేర్ అప్డేట్ లో ఒక భాగమని హైలైట్ చేశాయి. విడుదలైన చిత్రం ప్రకారం ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ లో కొత్త డ్రైవింగ్ విజువలైజేషన్లు, షెడ్యూల్లో మార్పులు వంటి మరెన్నో ఫీచర్స్ సూచిస్తాయి. ఈ గేమ్స్ కంప్యూటర్స్, గేమింగ్ కన్సోల్‌లలో అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ ఆటలను టెస్లా ఆర్కేడ్‌లో ప్రారంభించనున్నట్లు సమాచారం.(చదవండి: జూమ్ యూజర్లకు గుడ్ న్యూస్) -
తండ్రి మందలించాడని..
పటాన్చెరు టౌన్ : వీడియో గేమ్స్ ఆడుతున్న కుమారుడిని ఓ తండ్రి మందలించడంతో ఇంటి నుంచి కుమారుడు వెళ్లిపోయిన ఘటన అమీన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన సుకుమార్ వంటల మాస్టర్‌గా పనిచేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. కాగా ఇతడికి 6వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలుడు వెంకట్ దత్త హనుమంత కలడు.ఈ క్రమంలో బుధవారం కుమారుడు ఇంట్లో వీడియో గేమ్స్ ఆడుతుండటంతో తండ్రి సుకుమార్ మందిలించాడు. దీంతో ఇంట్లో ఎవరికి చెప్పకుండా అదే రోజు సాయంత్రం వెంకట్ దత్త వెళ్లిపోయాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, చుట్టు పక్కన వెతికినా బాలుడి ఆచూకీ లభించలేదు. దీంతో కొడుకు అదృశ్యం పై తండ్రి సుకుమార్ అమీన్పూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు. -
కంచికి చేరిన ‘అమ్మమ్మ’ కథలు
మద్నూర్(జుక్కల్): బాల్యం ఒక మధుర జ్ఞాపకం. చిన్నప్పుడు అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య చెప్పే నీతి కథలు.. బోధనలు.. ఎన్నో ఆటపాటలు.. ఇలా బాల్యం సరదాగా గడిచేది. కానీ ప్రస్తుతం రోజులు మారాయి.. మనిషి జీవన శైలి మారిపోయింది. మారుతున్న బిజీ కాలంలో అమ్మమ్మ, తాతయ్య చెప్పే నీతి కథలు.. కనుమరుగయ్యాయి. ఒకప్పుడు వేసవి సెలవుల్లో రాత్రివేళ అయిందంటే చాలు పిల్లలందరూ అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల వద్ద చేరేవారు. వారు చెప్పిన కథలను శ్రద్ధగా వినేవారు. పగటి సమయాల్లో చందమామ, పరమానందయ్య శిష్యుల కథలు వంటి పుస్తకాలు చదివేవారు. కానీ ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో పిల్లలు నిత్యం పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. ఉన్న కొద్ది సమయం కూడా కంప్యూటర్లు, వీడియోగేమ్‌లకు పరిమితమైపోతున్నారు. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగు.. నేటి ఆధునిక సాంకేతిక యుగంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్నాయి. రెండు దశాబ్దాల క్రితం వరకు ఏ ఇంట్లో చూసినా ఉమ్మడి కుటుంబాలు తాతయ్యలు, నానమ్మలు, తల్లిదండ్రులు, చిన్నాన్నలు, పిన్నిలు ఇలా పెద్ద కుటుంబాలు ఉండేవి. రాత్రి అయితే ఆ కుటుంబంలోని పిల్లలంతా తాతయ్య, నానమ్మ వద్దకు చేరేవారు. కంప్యూటర్, సెల్ఫోన్లు, టీవీలు లేని కాలంలో చిన్నారులంతా కథలు చెప్పమంటూ పెద్దవారి వద్ద మారాం చేసేవారు. వారు చేప్పే నీతి కథలను పిల్లలు ఎంతో ఇష్టంగా వినేవారు. ఈ కథల ప్రభావం చిన్నారులపై పడేది. ఆ కథల వల్ల స్నేహం గొప్పదనం, ఐక్యమత్యంతో సమస్యల సాధన, పొడుపు కథలతో ఆలోచన, జీవితానికి దారి చూపే సందేశాలు, నీతి, నిజాయితీ, దేశ భక్తి, పెద్దలు, గురువులపై గౌరవభావం కలిగేవి. మాయమవుతున్న బాల్య జ్ఞాపకాలు ప్రతి మనిషి జీవితంలో బాల్యం ఒక జ్ఞాపకం. బాల్యంలో చేసే అల్లరి పనులు, ఆటపాటలు జీవితాంతం తమ వెంట ఉంటాయి. పట్టణాలకు చెందిన చిన్నారులు గ్రామీణ ప్రాంతాలకు వచ్చి సెలవులను సరదాగా గడుపుతారు. చిన్నారులు పలెల్లోని చేలగట్ల పైన, పంట బోదెలలోను, చెట్ల కొమ్మలపై ఆటలాడుకునే వారు. గ్రామీణ ప్రాంతాల్లో కోతికొమ్మచ్చి, దాగుడు మూతలు, అష్టాచమ్మా, చార్పల్లి, పోలీస్ దొంగ వంటి ఆటల్లో పిల్లలు మునిగి తేలేవారు. దూరప్రాంతాల్లో ఉన్న తమ వారు తమ పిల్లలతో కలిసి సొంత ఊళ్లకు వచ్చి నిత్య జీవనానికి కాస్త దూరంగా ఉండి ఊరట చెందే పరిస్థితి ఉండేది. తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు.. నేటితరం తల్లిదండ్రుల ఆలోచనల్లో స్పష్టమైన మార్పు వచ్చింది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం.. పోటీ ప్రపంచంలో ర్యాంకుల కోసం పోటీపడే తాపత్రాయం తల్లిదండ్రుల ఆలోచనను మార్చింది. గజిబిజి జీవనం, తమ చిన్నారుల బ్రైట్ ఫ్యూచర్ పేరుతో వేసవిలో ఎవ్వరూ గడప దాటే ప్రయత్నం చేయడం లేదు. వేసవి సరదా, ఊరట పిల్లలకు లభించడం లేదు. సరదాగా గడవాల్సిన వేసవి సెలవులు కాస్తా ప్రత్యేక కోచింగ్‌లు, కంప్యూటర్ క్లాసుల పేరుతో ముగిపోతున్నాయి. చిన్నారులు ఇంట్లోనే ఉన్న వీడియో గేమ్, సెల్ఫోన్లో గేమ్‌లు ఆడుతున్నారు. అవే వేసవిలో పిల్లల నేస్తాలుగా మారుతున్నాయి. కేవలం కొద్దిమంది మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నారు. ఆటా.. పాటా లేకుండా చదువే ప్రపంచంగా చదివే పిల్లలను సెలవుల్లో దూరంగా ఉంచితే క్రమేణ వారిలో ఏకాగ్రత కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే చిన్నారులకు అందమైన బాల్యం అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. అప్పటి రోజులే వేరు.. అప్పట్లో మాకు పాఠశాల సెలువులు వచ్చాయంటే ఉబ్బిపోయేవాళ్లం. సెలవుల్లో అమ్మమ్మ, తాతయ్యల ఊర్లకు వెళ్లాలని ముందే ప్లాన్ వేసుకునే వాళ్లం. అమ్మమ్మ ఊర్లో నూతన స్నేహితులతో పరిచయాలు అయ్యేవి. వారితో పొద్దంతా ఆడుకునే వాళ్లం. పొలం గట్లమీద స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఆస్వాదించేటోళ్లం. ఇప్పుడెమో సెలవులు రాగానే పిల్లలకు స్పెషల్ క్లాసులు, కంప్యూటర్ ట్రైనింగ్‌లు గివ్వే నేర్పిస్తున్నారు. ఏమన్న అంటే నీకు తెలువది అంటారు. అప్పటి రోజులే వేరు. –శంకర్రావ్ పటేల్, అవాల్గావ్ సెల్ఫోన్లు పట్టుకునే కుర్చుంటున్నారు విద్యార్థులు పాఠశాల నుంచి రాగానే అమ్మమ్మ, తాత య్య, నానమ్మలను పలకరించకుండానే సెల్ఫోన్లు పట్టుకుని కూర్చుంటున్నారు. నానమ్మ, తాతయ్య అంటు అప్యాయంగా దగ్గరికి కూడా రావడం లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా తల్లిదండ్రుల్లో వస్తున్న మార్పులకు పిల్లల్లో కూ డా ఆ మార్పు స్పష్టంగా కనపడుతుంది. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే ప్రేమ లు, అనురాగాలు, సంబంధాలు అన్ని నేర్పించాలి. – ఈరయప్ప, కోడిచిర -
ఆ మాత్రం చేయలేనా!
ఆ తండ్రికి కూతురంటే ఎనలేని ప్రేమ. ఆ కూతురికి వీడియో గేమ్స్ అంటే చెప్పలేనంత ఇష్టం. తొమ్మిదేళ్లుంటాయి ఆ చిన్నారికి. మార్కెట్లోకి కొత్త గేమ్ రాగానే ముందుగా ఆమె దగ్గరికే ఆ గేమ్ వస్తుంది! అంతలా వీడియో గేమ్స్ మార్కెట్‌ని ఫాలో అవుతుంటాడు ఆ పాప కోసం తండ్రి. అయితే ఆ పాప వేళ్లకు పట్టు ఉండదు. పుట్టినప్పట్నుంచే ఏదో నరాల బలహీనత. జాయ్ స్టిక్స్‌ని సరిగా పట్టుకోలేదు. బటన్స్‌ని గట్టిగా నొక్కలేదు. కానీ గేమ్స్ ఆడటం ఇష్టం. అది గమనించిన తండ్రి.. ఆమె కోసమే ప్రత్యేకంగా ఒక జాయ్ స్టిక్స్ కంట్రోలర్‌ని తయారు చేశాడు. అది ఆమె వేళ్ల శక్తికి అనుగుణంగా గేమ్‌ని యాక్టివేట్ చేస్తుంటుంది. ఇదంతా కూడా ఆయన విడిపరికరాలతోనే చేశాడు. కొంత సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉంది కాబట్టి.. కూతురికి అలా కస్టమైజ్డ్ గేమ్ కంట్రోలర్‌ని తయారు చేసి ఇవ్వగలిగాడు. ఇందుకు అతడు ఖర్చు చేసింది.. మన కరెన్సీలో పదివేల రూపాయలు! తన కూతురి సంతోషం కంటే డబ్బు ఎక్కువేం కాదు అంటున్న ఆ తండ్రి పేరు రోరీ స్టీల్. కూతురు అవా. వాళ్లుండేది ఫ్రాన్స్‌లోని జెర్సీ ప్రాంతంలో. ‘నా బిడ్డ కోసం ఆ మాత్రం చేయడంలో గొప్పేముంది?’ అని కూడా అంటున్నాడతను. -
చూపు కోల్పోనున్న చిన్నారి.. పాపం ఫోన్‌దే
బీజింగ్: స్మార్ట్‌ఫోన్ వల్ల ఎన్ని అనార్థాలు ఉన్నాయో మరోసారి రుజువైంది. ఫోన్‌ను అతిగా వాడడం వల్ల ఓ చిన్నారి చూపు కోల్పోనుంది. చైనాలోని జియాంగ్జూ ప్రాంతానికి చెందిన జియావో అనే రెండేళ్ల బాలికకు కొద్ది రోజులుగా కళ్లు సరిగా కనిపించడంలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు చిన్నారికి హ్రస్వదృష్టి ఏర్పడినట్లు తేల్చారు. చిన్నారి ఎదిగేకొద్ది ఈ సమస్య తీవ్రమై, 9 ఏళ్లు వచ్చేసరికి చూపు పూర్తిగా మసకబారిపోయే ప్రమాదముందని చెప్పారు. ఈ సమస్య తలెత్తడానికి కారణమేంటా? అని అన్వేషించగా.. జియావోకు ఏడాది వయసు నుంచే స్మార్ట్ ఫోన్లో గేమ్స్ ఆడుకోవడం అలవాటని తల్లిదండ్రులు చెప్పారు. దీంతో ఆమె చూపు కోల్పోవడానికి కారణం స్మార్ట్‌ఫోనేనని వైద్యులు తేల్చారు. -
ఆటల్లేవ్.. మాటల్లేవ్!
సాక్షి, హైదరాబాద్: ఆరుబయట పిల్లలు ఆడే ఆటలతో ఒకప్పుడు కాలనీలు సందడిసందడిగా ఉండేవి. పాఠశాలల రోజుల్లోసాయంత్రం పూట.. వేసవి సెలవుల్లో రోజంతా ఆటలాడి శారీరకంగా అలసి పిల్లలందరూ ఇళ్లకు చేరేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి దాదాపు కనుమరుగైంది. స్మార్ట్ ఫోన్లు చేతికి వచ్చాక పిల్లలంతా గంటల తరబడి వాటితోనే గడిపేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు మొబైల్ ఫోన్లలోనే అధిక సమయం వెచ్చిస్తున్నారు. ఇదే విషయమే ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లు, వీడియో గేమ్స్ వంటి ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు చిన్నపిల్లలపై తీవ్ర దుష్ప్రభావాలు చూపిస్తున్నాయని ఆ సంస్థ వెల్లడించింది. వీటి వాడకం పెరిగితే చిన్నప్పటి నుంచే పిల్లల్లో ఊబకాయం, కంటి సమస్యలు, మున్ముందు మధుమేహం వంటి అనారోగ్యాలు దరిచేరే ప్రమాదముందని హెచ్చరించింది. రెండు నుంచి ఐదేళ్ల వయసున్న పిల్లలు రోజుకు గంట కంటే ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఉపయోగించకూడదని, అంతకంటే చిన్నపిల్లలు అసలే వాడకూడదని తాజాగా నూతన మార్గదర్శకాలు జారీచేసింది. ఈ సందర్భంగా ప్రస్తుతం చిన్నపిల్లల పట్ల జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపింది. శారీరక శ్రమకు సెలవు.. ఎలక్ట్రానిక్ ఉపకరణాల వల్ల పెద్దలు, పిల్లలు శారీరక శ్రమకు దూరం అవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం 23 శాతం మంది పెద్దలు, 80 శాతం టీనేజీ పిల్లలు శారీరకంగా ఉత్సాహంగా ఉండటం లేదని తేలింది. అత్యధికంగా ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అధికంగా వినియోగించడం వల్ల పిల్లల్లో కంటి సమస్యలు, తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తేల్చింది. మరో విస్మయం కలిగించే వాస్తవం ఏంటంటే ఊబకాయం వల్ల చిన్నతనంలోనే పిల్లల్లో డయాబెటిక్ రావడం. మూడు నుంచి ఆరేళ్ల పిల్లల్లో తలనొప్పి అత్యంత సాధారణమైంది. అలాగే ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అధికంగా వినియోగించడం వల్ల పిల్లల్లో మానసిక ఎదుగుదల కూడా ఉండటంలేదు. అలాగే సెల్ఫోన్లకు, ట్యాబ్‌లకు అతుక్కుపోయే పిల్లలు సామాజిక సంబంధాలకు దూరమవుతున్నారు. ఇతరులతో ఎలా మాట్లాడాలో కూడా గ్రహించడంలేదు. యూట్యూబ్‌ను ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది చూస్తున్నారని, అందులో పిల్లలు కూడా ఉన్నారని తేల్చింది. ఇది పిల్లల మెదళ్లపై చెడు ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. అంతేకాదు అనేక పాఠశాలలు పిల్లలకు ట్యాబ్‌లను తప్పనిసరి చేయడం కూడా సమస్యలకు కారణంగా నిలుస్తుంది. ప్రపంచంలో ఎనిమిదేళ్లలోపు పిల్లల్లో 42 శాతం మంది ట్యాబ్‌లను వినియోగిస్తున్నారని తేలింది. మాటలే కరువయ్యాయి.. పిల్లలు ప్రధానంగా తల్లిదండ్రులు, ఇతరులతో పరస్పరం మాట్లాడుకునే పరిస్థితి ఉండాలి. కానీ ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో మనుషులతో సంబంధాలు కోల్పోతున్నారు. 24 గంటలూ మొబైల్లోనే మునుగుతూ ఇంట్లో పెద్దలతో మాట్లాడటం అనే మాటనే మరిచిపోతున్నారు. హైదరాబాద్ నగరంలో చిన్నతనం నుంచే ఎలక్ట్రానిక్ ఉపకరణాల వాడకం పెరిగిందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక అనేక స్కూళ్లు చిన్నప్పటి నుంచే ట్యాబ్‌లను ప్రవేశపెట్టాయని, కొందరు విద్యార్థులు తమ రోజువారీ అసైన్మెంట్ల కోసం గాడ్జెట్లను వాడుతున్నారని తేలింది. ఆహారం తినిపించడానికీ గాడ్జెట్లే.. అనేకమంది తల్లిదండ్రులు పిల్లలను దారిలోకి తెచ్చుకోవడానికి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు ఏడాది రెండేళ్ల వయసున్న పిల్లలకు ఆహారం తినిపించడానికి తల్లులు నానా తంటాలు పడుతుంటారు. పిల్లలు వినడంలేదన్న భావనతో వారి చేతికి సెల్‌ఫోన్ లేదా ట్యాబ్‌లు ఇచ్చి తినిపించడమో చేస్తున్నారు. వాటిల్లో వీడియో గేమ్స్ చూపించడం ద్వారా తినిపిస్తున్నారు. ఈ పరిస్థితి హైదరాబాద్ వంటి మెట్రో నగరాల నుంచి మొదలు పెడితే చిన్నచిన్న పట్టణాల్లోనూ 60–70 శాతం మంది తల్లిదండ్రులు గాడ్జెట్లనే ఆశ్రయిస్తున్నారని తేలింది. నూతన మార్గదర్శకాలు.. ► చిన్నపిల్లలు ఆరోగ్యవంతంగా పెరగాలంటే వాళ్లు తక్కువగా కూర్చొని.. ఎక్కువ శారీరకంగా ఆడాలి. ►ఐదేళ్ల చిన్నారులు అత్యంత తక్కువ సమయంపాటే టీవీలు, మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌ల ముందు కూర్చోవాలి. ►ఎక్కువ సేపు ఆడాలి. అలసిపోయి నిద్రపోవాలి. అలాగే పిల్లలు మానసికంగా ఎదగడానికి పుస్తకాలు చదవాలి. కథలు చెప్పాలి. పజిల్స్ ఆడాలి. పాటలు పాడాలి. అదే వారి అభివృద్ధికి కారకంగా నిలుస్తుంది. ►ఏడాది లోపు పిల్లలు తప్పనిసరిగా రోజుకు 14 నుంచి 17 గంటలు నిద్రపోవాలి. ►ఒకటి నుంచి రెండేళ్లలోపు పిల్లలు కనీసం 3 గంటలపాటు వివిధ రకాల శారీరకమైన ఆటల్లో నిమగ్నమవ్వాలి. ►రెండేళ్లలోపు పిల్లలు గంటకు మించి ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో ఆడకూడదు. వాళ్లు రోజుకు కనీసం 11 నుంచి 14 గంటలు నిద్రపోవాలి. ►మూడు నుంచి నాలుగేళ్ల వయసున్న పిల్లలు 3 గంటలపాటు ఏదో ఒకరకమైన శారీరక శ్రమలో ఉండాలి. ఆడుతూ ఉండాలి. కనీసం గంటపాటు ఒకరకమైన ఆ వయసుకు సంబంధించిన కఠినమైన వ్యాయా మం ఉండాలి. ఈ వయసు వారు రోజుకు 10 నుంచి 13 గంటలు నిద్రపోవాలి. -
అతిగా ఆడుతున్నారా..?
స్మార్ట్‌ఫోన్.. ఈ పేరు ఎత్తగానే పిల్లలు మంచి క్రేజీగా ఫీలవుతారు. ఆన్లైన్ గేమ్స్.. ఈ పేరు వింటే ఎగిరి గంతేస్తుంటారు. స్మార్ట్‌ఫోన్ కనిపిస్తే చాలు చటుక్కున చేతిలోకి తీసుకోవడం నేటి పిల్లలకు పరిపాటి. ఆన్లైన్లో గేమ్స్ డౌన్లోడ్ చేయడం, గంటల తరబడి ఆడుకోవడం.. ఏ ఇంట్లో చూసినా ఇదే తంతు. ఒక్కప్పుడు టీవీలు, కంప్యూటర్లలోనే ఆడగలిగిన వీడియోగేమ్స్.. కాలక్రమంలో అనేక రకాలుగా రూపాంతరం చెంది క్రమంగా మామూలు ఫోన్లు, స్మార్ట్ఫోన్లలోకి దూరిపోయి ప్రపంచంలో సరికొత్త సంచలనంగా మారిపోయాయి. చాలామంది పిల్లలకు వీడియో గేమ్స్ ఆడటం ఇటీవల కాలంలో ఒక వ్యసనంగా మారిపోయింది. ప్రధానంగా 10 నుంచి 14 ఏళ్ల మధ్య ఉండే పిల్లలు వీటికి బానిసలుగా మారుతున్నారు. అది ఎంత తీవ్రంగా మారిందంటే తల్లిదండ్రులు వీడియో గేమ్స్ ఆడనివ్వడం లేదని అలిగి ప్రాణాలు తీసుకునేంతలా..! వీడియో గేమ్స్‌కి ఇప్పుడు పిల్లలు బానిసలుగా మారిపోతున్నారని ప్రపంచంలోని అనేక రీసెర్చ్ సంస్థలు చేసిన అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. దీనిపై అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సైతం పలు సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం బ్రిటన్, అమెరికా, భారత్ దేశాల్లో చాలా మంది పిల్లలు వీడియో గేమ్స్ వ్యసనాల బారిన ఇప్పటికే పడ్డారని, మరికొంతమంది ఆ వ్యసనానికి గురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పిల్లలు వీడియో గేమ్స్‌కి బానిసలుగా మారుతుండటంలో తల్లిదండ్రుల పాత్ర కూడా ప్రముఖంగా ఉంది.వారి అల్లరిని తట్టుకోలేక తల్లిదండ్రులు సైతం పిల్లలకు మొబైల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. కొందరు తల్లిదండ్రులు అయితే వారి పిల్లలు కోరిన వీడియో గేమ్‌లను సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసి మరీ ఈ విషయంలో వారికి సహకరిస్తున్నారు. అయితే వీడియో గేమ్స్‌కు ఎక్కువగా అలవాటు పడుతున్న పిల్లల్లో మానసిక ప్రవర్తన ప్రతికూలంగా మారుతుందని సైకియాట్రిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీడియో గేమ్స్‌కి బానిసలుగా మారుతున్న పిల్లలు చదువుతో పాటు ఇతర విషయాలపై అసలు శ్రద్ధ పెట్టడం లేదని వారు చెబుతున్నారు. తల్లిదండ్రులు వారికి ఉన్నఫళంగా మొబైల్ ఇవ్వకుండా మానేస్తే పిల్లలు విపరీత చర్యలకు పాల్పడుతున్నారు. అయితే ఫోన్ ఇవ్వాలనే ఆలోచన మాకు లేకపోయినా వారి అల్లర్లను తట్టుకోలేకే వారికి ఫోన్లు ఇస్తున్నామని కొందరు తల్లిదండ్రులు చెబుతుండటం గమనార్హం. దీనివల్ల పిల్లలకు ఇబ్బందులు వస్తాయని తెలిసినా తప్పడం లేదని తల్లిదండ్రులు అంటున్నారు. పిల్లలను మొబైల్ ఫోన్లు, అందులో ఉండే గేమ్స్‌కి దూరంగా ఉంచడం ఎలా? ఇది చాలామంది తల్లిదండ్రులను వేధించే ప్రశ్న. కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటే పిల్లలను వీడియో గేమ్స్‌కి బానిసలుగా కాకుండా చూడవచ్చని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. అతిగా ఆడితే నష్టమే.. వీడియో గేమ్స్ ఎక్కువగా ఆడే పిల్లలు మానసిక సమస్యలు, డిప్రషన్‌తో బాధపడుతున్నట్లు మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.వీటికి ట్రీట్మెంట్ అంటే ఇతర వ్యసనాల కంటే భిన్నంగా ఇవ్వాల్సి ఉంటుంది. వీరికి ఇంటర్నెట్ను పరిమితంగా వాడుకోవడం నేర్పించాలి. టెక్నాలజీతో మానవాభివృద్ధికి ఎన్నిరకాల ఉపయోగాలు ఉంటాయో అంతవరకే వాటిని ఉపయోగిస్తూ గేమ్స్ డేటా వంటివాటిని పరిమితంగా వాడుకుంటేనే బాగుంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పిల్ల్లలు అదే పనిగా వీడియో గేమ్స్ ఆడుతుండటాన్ని గమనిస్తే అది ఒక వ్యసనంగా వారికి మారుతున్నట్లు గుర్తించాలి. పూర్తిగా పరిసరాలను మర్చిపోయి అందులో లీనమైపోవడం ఒక రకమైన మానసిక సమస్యగా పరిగణించాలంటున్నారు నిపుణులు. రోజంతా సెల్ఫోన్ల ముందు కూర్చొని గేమ్స్ ఆడుతున్న పిల్లల్లో మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతున్నాయి. పిల్లలు ఎప్పుడు చూసినా అదే పనిగా ఇంటర్నెట్ బ్రౌజింగ్, వీడియో గేమ్స్ ఆడటాన్ని మానసిక సమస్యలుగా పరిగణించాలని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎక్కువ సమయం వీడియో గేమ్స్‌కు కేటాయిస్తున్న వారిలో నిద్రలేమి, ఏకాగ్రత లోపం ఇంకా మతిమరుపు వంటి రుగ్మతలు చోటు చేసుకుంటున్నాయి. తదేకంగా వీడియో గేమ్స్ ఆడడం వల్ల కంటి చూపుపై ఒత్తిడి పెరిగి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అలాగే వీడియో గేమ్స్‌లో చూపెడుతున్న మితిమీరిన యాక్షన్, అశ్లీల దృశ్యాలు చిన్నారులను పెడదోవ పట్టించే అవకాశాలున్నాయి. అతిగా వీడియో గేమ్స్ ఆడటం వల్ల చిన్నవయసులోనే రక్తపోటు వచ్చే అవకాశాలున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీడియో గేమ్స్ ఆడడం వల్ల మూర్ఛ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఈ వ్యసనం వల్ల అనారోగ్యమే కాకుండా..పిల్లల్లో హింసా ప్రవృత్తి, దూకుడుతనం ఎక్కువ అవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇంకా..జీవక్రియ వేగం పెరగటం, చేతులకు ‘రిపిటీటివ్ స్ట్రెయిన్ ఇంజ్యూరీ‘ లాంటి సమస్యలు పెరుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ‘గేమ్స్’ బాధితుల కోసం రిహాబిలిటేషన్ సెంటర్స్ భారత్‌లో గేమ్స్ మార్కెట్ నాలుగు రకాలుగా విస్తరించింది. అవి పీసీ గేమ్స్, ఆన్లైన్ గేమ్స్, మొబైల్ గేమ్స్, కన్సల్ గేమ్స్. వీటికి మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. 2018 నాటికి ఇవి 40 బిలియన్ డాలర్లు దాటింది. గ్లోబల్ మార్కెట్లో ప్రస్తుతం 100 బిలియన్ డాలర్లను మించి వ్యాపారం జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా గేమింగ్ మార్కెట్లో అమెరికా, యూరప్ దేశాలతో పాటు జపాన్ ప్రథమ స్థానంలో ఉండగా, చైనా, భారత్‌ల్లో ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. పర్సనల్ కంప్యూటర్ వచ్చిన తొలిరోజుల్లో మేరియన్ టెట్రిస్ వంటి సాధారణ స్థాయి గేమ్స్ అందరినీ అలరించాయి. అప్పట్లో గ్రాఫిక్స్ పరిమితంగా ఉండేవి. కాలక్రమంలో మెరుగైన గ్రాఫిక్స్‌తో 2డీ, యానిమేషన్స్ ఇలా రూపాంతరం చెందాయి. నేడు ఫొటో రియలిస్టిక్, 3డీ గేమ్స్ వచ్చాయి. కంప్యూటర్లో ఉండే బీప్ అనే శబ్దంతో ఆరంభమై నేడు మ్యాజిక్, సౌండ్స్‌తో అలరిస్తున్నాయి. ఈ పాత గేమ్స్‌లో ఆటను కొద్దిసేపు గమనిస్తే చాలు గెలవడం తేలిగ్గానే ఉండేది. ఇప్పటి గేమ్స్ అలా కాదు. రోజుల తరబడి, సంవత్సరాల తరబడి ఆడినా కంప్లీట్ కావు. ఒక్క అమెరికాలోనే కోటి మందికి మించి ఇంటర్నెట్ గేమ్స్‌కు బానిసలుగా మారిపోయారు. కొరియాలో అయితే ఇలాంటి వారి కోసం రిహాబిలిటేషన్ సెంటర్లు విచ్చలవిడిగా వెలిశాయి. చైనా, జపాన్, తైవాన్లోనూ ఈ గేమింగ్ విపరీతంగా కనిపిస్తుంది. జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఇంటర్నెట్ ఎడిక్షన్ డిజార్ట్ సమస్య ఉన్న దేశాలు చాలానే ఉన్నాయి. గేమ్స్ ఆడనివ్వడం లేదని ఇటీవల పిల్లలు పాల్పడిన దుశ్చర్యలు ఎక్కువ సేపు సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతున్నాడని తండ్రి మందలించడాన్ని తట్టుకోలేక గతేడాది ఢిల్లీలో ఓ బాలుడు (15) తన తండ్రి పడుకున్నప్పుడు గొంతునులిమి చంపేశాడు గేమ్స్ ఎక్కువగా ఆడుతున్నాడని తల్లిదండ్రులు మందలించడంతో కోపం తట్టుకోలేక గతేడాది డిసెంబర్లో రాజస్థాన్‌లో ఓ బాలుడు తన తల్లిదండ్రులను కత్తితో తీవ్రంగా గాయపర్చాడు వీడియో గేమ్ ఆడుకుంటుండగా తన సోదరి సెల్‌ఫోన్ లాక్కుందనే కోపంతో ఆమెపై బ్లేడుతో ఓ బాలుడు దాడి చేసిన ఘటన పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లో జరిగింది సెల్ఫోన్లో గేమ్స్ ఎక్కువగా ఆడుతున్నాడని తండ్రి మందలించడంతో బెంగళూరులోని తొమ్మిదో తరగతి చదువుతున్న బాలుడు ఇంటి నుంచి సెల్‌ఫోన్ తీసుకుని పారిపోయాడు తల్లిదండ్రులు ఏం చేయాలి? కొన్ని ఈ పేరెంటింగ్ టిప్స్ ద్వారా పిల్లల ఆలోచనలను మార్చవచ్చు. ఇంటికి కొన్ని నియమాలను రూపొందించాలి. ఉదాహరణకు ఎంతసేపు మొబైల్ వాడాలో పిల్లలకు పక్కాగా చెప్పాలి. పిల్లలతో మాట్లాడి ఇంటర్నెట్లో వాళ్లేం చూస్తున్నారో తెలుసుకోవాలి. వారి మీద వారికి తెలియకుండా నిఘా వేసి ఉంచాలి. ఎక్కువ సేవు గేమ్స్ ఆడుతున్నట్లు గానీ కనిపిస్తే వెంటనే వారికి అర్థమయ్యేటట్లు చెప్పి గేమ్స్ నుంచి వారి ఆలోచనలను వేరే అంశాలపైకి మరలేలా చర్యలు తీసుకోవాలి. ఏవో వీడియోలు, వెబ్సైట్లు చూసే బదులు సోషల్ మీడియాలో స్నేహితులతో గానీ బంధువులతో గానీ మాట్లాడమని సూచించాలి. ఏది కనిపిస్తే దానిపైన క్లిక్ చేయడం ప్రమాదకరమని వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. వారాంతాల్లో ఎక్కువ సమయం పిల్లలతో గడిపేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకుంటే పిల్లలు గేమ్స్ అంటూ పక్కదారి పట్టబోరని పలు పరిశోధనాత్మక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పిల్లలకు సరిపడని వెబ్సైట్లు ఫోన్లో కనిపించకుండా సెట్టింగ్స్ మార్చాలి. ఇంటర్నెట్లో వ్యక్తిగత సమాచారం పంచుకోవడం ప్రమాదకరమని తెలియజేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా, పిల్లలకు నేర్పే ముందు తల్లిదండ్రులు తమ అలవాట్లను మార్చుకోవాలి. - పక్కి రాకేష్ పట్నాయక్, సాక్షి, సెంట్రల్ డెస్క్ -
సంసారంలో నిప్పులు పోస్తున్న ‘ఫోర్ట్‌నైట్’
జీవితమే ఒక క్రీడా మైదానం. మనమంతా ఆటగాళ్లం. ఈ క్రీడలో తప్పక ఆడాల్సిందే. అలాంటిది కొన్ని ‘గేమ్స్’ మనల్ని ఆడిస్తున్నాయి. జీవితాల్ని చిత్తు చేస్తున్నాయి. కాపురాల్లో చిచ్చు రేపుతున్నాయి. పిల్లల చదువులను, యువత కెరీర్‌నూ పాడు చేస్తున్నాయి. మొబైల్ వీడియో గేమ్స్ అన్ని వర్గాలపై పెను ప్రభావమే చూపుతున్నాయి. ఆటాడుకుందాం రా.. అని వేటాడుతున్నాయి. మొబైల్లో ఇటీవల కొత్తగా అందుబాటులోకి వచ్చిన ‘ఫోర్ట్‌నైట్’ గేమ్ ఆడటం వ్యసనంగా మారడంతో యూకేలో విడాకుల సంఖ్య పెరిగిందనే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నగరవాసులూ మొబైల్ వీడియో గేమ్స్‌పై అప్రమత్తంగా ఉండాలని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కలెక్టరేట్ :ఇటీవల మొబైల్ యాప్‌లలో అందుబాటులోకి వస్తున్న సరికొత్త వీడియో గేమ్స్ యువతను, పిల్లలను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. వారికి నూతన ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నాయి. ఇదంతా నాణేనికి వైపు మాత్రమే. వీటి వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా జరుగుతున్నాయనే విషయం నాణేనికి మరోవైపు కనిపిస్తున్న యథార్థం. వింత వింత వీడియో గేమ్స్‌కు అతుక్కుపోతుండటం, గంటలకొద్దీ సమయం వృథా చేస్తుండటంతో పిల్లలు చదువులను అశ్రద్ధ చేస్తున్నారు. యువత తమ కెరీర్‌పై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. అలాగే కుటుంబాలపైనా పెను ప్రభావమే చూపుతోంది. ఈ గేమ్ ఆడటం వ్యసనంగా మారడటంతో జీవనశైలి మార్పులకు లోనవుతోంది. ఉద్యోగులు మానసిక ఒత్తిడిని జయించే క్రమంలో గేమ్స్‌కు అడిక్ట్ అవుతున్నారు. దంపతులు తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తుండటంతో కలహాల కాపురాలుగా మారుతున్నాయి. భర్త/భార్య మొబైల్‌తో ఎక్కువ సేపు గడుపుతుండటంతో సమస్య తీవ్రత పెచ్చుమీరుతోంది. పెరుగుతున్న విడాకుల సంఖ్య.. ప్రస్తుతం మహిళల నుంచి వస్తున్న అధిక ఫిర్యాదుల్లో తమ భర్త ఎక్కువ సమయం సెల్‌ఫోన్‌కే కేటాయిస్తున్నాడని, తమను అసలు పట్టించుకోవడంలేదని. ఇంటర్నెట్ను కుదిపేస్తున్న బ్యాటిల్ రాయల్ గేమ్ ‘ఫోర్ట్‌నైట్’ కుటుంబాల మధ్య పెద్ద చిచ్చే పెడుతోంది. యూకేకు చెందిన ప్రముఖ వెబ్సైట్ డైవోర్స్ ఆన్లైన్ 2018కిగానూ ఇప్పటి వరకు 4,665 డైవోర్స్ పిటిషన్ రిక్వెస్ట్‌లు అందగా వాటిలో 200 వరకు ఫోర్ట్‌నైట్ ఇంకా ఇతర ఆన్లైన్ గేమ్స్ కారణంగానే విడాకులు కోరుకుంటున్నట్లు వెల్లడి కావడం విస్తుగొలుపుతోంది. ప్రమాదకరమని తెలిసినా.. కోట్లాది మంది యూజర్లతో ఆన్లైన్ వీడియో గేమ్స్ ప్రపంచాన్ని శాసిస్తోన్న ఫోర్ట్‌నైట్ ఇంకా పూర్తిస్థాయిలో అన్ని ప్లాట్ఫామ్లలోకి అందుబాటులోకి రాలేదు. అయినప్పటికీ పలు థర్డ్‌పార్టీ సాఫ్ట్వేర్స్ ద్వారా ఈ గేమ్‌ను పొందేందుకు గేమర్స్ వెనకాడటం లేదు. ఇలా చేయటం ప్రమాదకరమని తెలిసినప్పటికీ వారు వెనుకంజ వేయటం లేదు. క్షణ క్షణం.. ఉత్కంఠభరితం.. ఫోర్ట్‌నైట్ వీడియో గేమ్‌లో వంది మంది ప్లేయర్స్ ఉంటారు. వీరి వద్ద ఎటువంటి ఆయుధాలు ఉండవు. ప్లేయర్స్‌కు ఇచ్చే మ్యాప్స్ ఆధారంగా ఆయుధాలను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ప్లేయర్స్ ఖాళీ నగరంలోని భవనాల్లో పరిగెడుతూ శత్రువులను తుదిముట్టిస్తూ, తమకు కేటాయించిన టాస్కులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒక్కో లెవల్ పెరిగేకొద్ది గేమ్ మరింత క్లిష్టతరంగా మారుతుంది. చివరి లెవల్ వరకు ప్లేయర్ బ్రతికి ఉండి టాస్కులను పూర్తి చేసినట్లయితే విజేతగా నిలుస్తారు. మానసికంగా.. శారీరకంగా.. రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చుని గేమ్స్ ఆడేవారిలో మానసికంగా ఇంకా శారీరకంగా సమస్యలు తలెత్తుతున్నాయని అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఎక్కువ సమయం వీడియో గేమ్‌లకు కేటాయిస్తున్న వారిలో నిద్రలేమి, ఏకాగ్రత లోపం, మతిమరుపు లాంటి రుగ్మతలు చోట చేసుకుంటున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే వీడియోగేమ్‌లలో చూపిస్తున్న మితిమీరిన యాక్షన్, అశ్లీల దృశ్యాలు చిన్నారులను చెడుదోవ పట్టించే ప్రమాదం లేకపోలేదు. అందుకే మొబైల్ యాప్ వీడియో గేమ్‌లతో తస్మాత్ జాగ్రత్త. -
పిల్లల పిచ్చాటలు
కందుకూరు రూరల్ : ఇంట్లో బుజ్జిగాడు అన్నం తినాలంటే సెల్ ఫోన్లో ఒక ఫన్నీ వీడియో.. చిట్టిది ఏడుస్తూ మారాం చేస్తుంటే స్మార్ట్ ఫోన్లో ఓ డీజే సాంగ్.. పిల్లలు అరిచి గోల చేస్తుంటే యూట్యూబ్‌లో ఏదో ఒక జంతువుల వీడియో చూపించడం.. ఇలా చిన్నతనంలో పిల్లలను ఆడిచేందుకు చేసిన అలవాటే ప్రస్తుతం తల్లిదండ్రులకు తలనొప్పిగా మారింది. ముద్దుముద్దుగా మాట్లాడుతూ.. బుడిబుడి అడుగులు వేస్తూ.. స్కూల్‌కు వెళ్లే పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఫోబియా పట్టుకుంది. నాన్నా.. ఒకసారి ఫోన్ ఇవ్వవా...! అన్నయ్యా నీ ఫోన్లో ఒక గేమ్ ఆడుకొని ఇస్తా..! మమ్మీ.. నీ సెల్లో టెంపుల్ రన్ ఆడుకొని హోంవర్క్ చేసుకుంటానే.. బయటకు వెళ్లను ఇంట్లోనే ఉంటా..! అంటూ పిల్లలు మారాం చేయడం తల్లిదండ్రులందరికీ అనుభవమే. ఇలా ఫన్నీ వీడియోలతో సెల్ ఫోన్ వాడటం మొదలుపెడుతున్న పిల్లలు క్రమంగా యూట్యూబ్‌లో అశ్లీల దృశ్యాల వరకు వెళ్తూ పక్కదారి పడుతున్నారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరిగిపోయింది. రోజూ స్కూలుకు వెళ్లి ఇళ్లకు వచ్చిన వెంటనే పిల్లలు సెల్‌ఫోన్ కావాలని నానాయాగీ చేస్తున్నారు. దొరికితే స్మార్ట్ ఫోన్లో గేమ్స్ లేదా టీవీల్లో కార్టూన్ చానల్స్ చూడటంలో నిమగ్నమవుతున్నారు. ఇవి ప్రస్తుతం పిల్లల్ని బాగా ఆకర్షిస్తున్నాయి. దీని కారణంగా ఫిజికల్ గేమ్స్‌కు దూరమవుతున్నారు. కనీసం ఇంటి పక్కన ఉన్న స్నేహితులతోనైనా ఆడుకోలేని పరిస్థితుల్లో చిన్నారులు ఉన్నారు. ఇల్లు విడిచి ఆటల్లో మునిగిపోయిన చిన్నారులను వెతికి తీసుకువచ్చే రోజులు పోతున్నాయి. నేడు పిల్లలను బటయకు వెళ్లి ఆడుకోమని తల్లిదండ్రులు చెప్పినా ఇంట్లో నుంచి కదలని పరిస్థితి. పల్లెల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లే దర్శనమిస్తున్నాయి. అందులో ఆటల్లో మునిగి తేలుతున్న చిన్నారులు, ప్లే గ్రౌండ్ మరిచిపోయి ప్లేస్టోర్కే పరిమితమవుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందుతున్న క్రమంలో స్కూల్ పిల్లలు, యువతీయువకులు క్రీడా మైదానాన్ని మరిచిపోతున్నారు. అతిగా వినియోగిస్తే ముప్పు అని విశ్లేషకులు చెతున్నప్పటికీ తల్లిదండ్రులు కూడా పెడచెవిన పెట్టడం ఆందోళన కలిగించే అంశం. వీడియో గేమ్స్‌పైనే ఆసక్తి ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్లేస్టోర్ నిండా వివిధ రకాల ఆటలు ఉంటున్నాయి. వీలైనన్ని గేమ్స్ ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉంది. చిన్న పిల్లలకు చదువు కంటే ప్లేస్టోర్‌లోని ఆటలపైనే ఎక్కువ అవగాహన ఉంటోంది. చోటా బీమ్, హంగ్రీబర్డ్, క్యాండీ క్రష్, టెంపుల్ రన్, సబ్ వే సర్ఫ్, టామ్ అండ్ జెర్రీ ఫైటింగ్‌ను చిన్నా పెద్ద తేడా లేకుండా ఆడుకున్నారు. ఇక బోటింగ్, ట్రాఫికర్ రేసర్, టక్ ఫ్రూట్, డోరా, బబుల్ షూట్, కార్‌రేస్ లాంటి ఆటలు ఆడటం వల్ల పిల్లల్లో అనవసరమైన కసి పెరుగుతోంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో గేమ్స్‌పై దృష్టి కేంద్రీకరించడంతో తామే స్వయంగా ఈ ఆటలు ఆడుతున్నామనే అనుభూతికి పిల్లలు లోనవుతున్నారు. పిల్లలు ఏడుస్తున్నారనో, గోల చేస్తున్నారనో సెల్‌ఫోన్ ఇవ్వడం వల్ల అది వారికి వ్యసనంగా మారుతోంది. సాంఘిక జీవనానికి దూరమవుతున్నారు స్మార్ట్ ఫోన్ల రాకతో తల్లిదండ్రులకు వాటితోనే పనైపోయింది. గేమ్స్ ఆడుతూ, వీడియోలు చూస్తూ పిల్లలకు అవే అలవాటు చేస్తున్నారు. పిల్లలు గోల చేసినా స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారు. స్మార్ట్ ఫోన్ పట్టుకుంటే ఇంట్లో ఉన్న మనుషులను సైతం పిల్లలు మర్చిపోతున్నారు. కనీసం బంధువులు వచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు. దీనివల్ల మానవ సంబంధాలు దూరమవుతున్నాయి. పిల్ల లు ఏడ్చినా, గోల చేసినా.. ఆరోగ్యకరమైన ఆటలకు దగ్గర చేయాలి. అంతే తప్ప స్మార్ట్ ఫోన్లకు అలవాటు చేస్తే అరోగ్యం దెబ్బతినడంతోపాటు మానసికంగా కుంగిపోతారు.– పి.పాపారావు, ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఇండియా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మానసికంగా ఇబ్బంది పడతారు ప్రస్తుతం టచ్ ఫోన్ పట్టుకుంటే చాలు పిల్లలు నేరుగా గేమ్స్ లేదా యుట్యూబ్‌లోకి వెళ్తున్నారు. యుట్యూబ్లో అశ్లీల వీడియోలు అధికంగా ఉంటున్నాయి. యాప్ ఓపెన్ చేయగానే అలాంటి బొమ్మలు, దృశ్యాలు కన్పిస్తుండడంతో చిన్నారులు వాటిపై ఆసక్తి చూపుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఫోన్లు తీసుకొచ్చి ఏంటి ఇవి వస్తున్నాయని తల్లిదండ్రులనే అడుగుతున్నారు. గేమ్స్ ఆడటం వల్ల పిల్లలు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. పిల్లల రుగ్మతలు మానసిక నిపుణులకు కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. పిల్లలపై తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. – ఇ.ఆనందరావు, హెచ్ఎం -
వీడియో గేమ్స్... కొకైన్, జూదం లాంటివే!
పారిస్: కొకైన్, జూదం తరహాలో ప్రజలు వీడియో గేమ్స్‌కు బానిసలుగా మారే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. అంతర్జాతీయ వ్యాధుల వర్గీకరణ (ఐసీడీ) 11వ సంచికను ఆ సంస్థ సోమవారం విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణుల్ని సంప్రదించిన తర్వాత ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ‘వీడియో గేమ్ డిజార్డర్’ను ఈ జాబితాలో చేర్చినట్లు డబ్ల్యూహెచ్‌వో మానసిక ఆరోగ్య విభాగం డైరెక్టర్ శేఖర్ సక్సేనా తెలిపారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ జాబితాలో భారీ మార్పులు చేర్పులు చేయడం ఇదే తొలిసారన్నారు. వీడియో గేమ్ వ్యసనాన్ని ఓ వ్యాధిగా గుర్తించాలని గత జనవరిలోనే నిర్ణయించినట్లు వెల్లడించారు. వీడియోగేమ్‌ను వదల్లేకపోవడం, తిండీతిప్పలు గుర్తురాకపోవడం, నిద్రపోకపోవడం దీని ముఖ్య లక్షణాలని పేర్కొన్నారు. -
అమ్మాయిలు వాలిపోతున్నారు
లీ జేయాన్ వయసు 28 ఏళ్లు. బిజినెస్ టైకూన్. పైగా అందగాడు. చైనా అమ్మాయిలంతా ఇప్పుడు అతడంటే పడి చస్తున్నారు! కాలేజీ అమ్మాయిలకయితే.. ‘ఐయామ్ మిసెస్ లీ జేయాన్’ అని చెప్పుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. లీ కోసం బాయ్‌ఫ్రెండ్స్‌ని కూడా పక్కన పడేస్తున్నారు! మగాళ్లకు శత్రువులా దాపురించిన ఈ లీ ఇంతకీ ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? ‘లవ్ అండ్ ప్రొడ్యూజర్’ అనే వీడియో గేమ్ నుంచి! అందులోని నమిక్ క్యారెక్టరే లీ జేయాన్. డిసెంబర్లో ఈ గేమ్ మొబైల్స్‌లోకి వచ్చింది. ఇప్పటి వరకు కోటి మందికి పైగా అమ్మాయిలు డౌన్లోడ్ చేసుకున్నారు. మొబైల్లో వీడియో గేమ్స్ ఆడుతున్న ప్రతి నలుగురిలో ఒక అమ్మాయి లీతో గేమ్స్ ఆడుతోంది! చైనాలో ఇప్పుడున్నది ‘షి ఎకానమీ’. ఆర్థిక వ్యవస్థ అంతా అమ్మాయిల చుట్టూతానే రౌండ్స్ కొడుతోంది. వాళ్లను బుట్టలో వేసుకోడానికి కంపెనీలు రకరకాల ఆసనాలు వేస్తున్నాయి. అందులో భాగంగానే ‘లవ్ అండ్ ప్రొడ్యూజర్’ అనే ఈ గేమ్ తయారైంది. ఇందులో మన లీ గారితో పాటు, ఒక సైంటిస్టు, ఒక స్పెషల్ ఏజెంటు, ఒక ప్రఖ్యాత గాయకుడు ఉంటారు. ఈ నలుగురిలో ఒక ఆప్షన్ తీసుకుని ముందుకు వెళ్లాలి. గేమ్ స్టార్ అయ్యీ కాగానే చైనా అమ్మాయిలంతా ‘లీ’తో చెట్టపట్టాలు వేసుకుని స్మార్ట్‌ఫోన్‌లో గంటల కొద్దీ తల దూర్చేస్తున్నారు. ఒకటే ఇకఇకలు పకపకలు! లీ అస్సలు అమ్మాయిల మనసు నొప్పించడట. అదీ పాయింట్! అబ్బాయ్లూ విన్నారా.. ఈ టిప్ ఏమైనా వర్కవుట్ అవుతుందేమో నోట్ చేసుకోండి.. వెంటనే. -
వీడియోగేమ్స్ అలవాటు జబ్బే
రకరకాల వీడియోగేమ్స్ ఆడుతూ కంప్యూటర్లకు, స్మార్ట్ఫోన్లకు గంటల తరబడి అతుక్కుపోయి గడపడం కూడా జబ్బేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజాగా ప్రకటించింది. వీడియోగేమ్స్‌కు అలవాటు పడటాన్ని జబ్బుగా పరిగణించాలా, లేదా అనేది నిర్ధారించుకునేందుకు ఏకంగా పదేళ్ల పాటు విస్తృతంగా అధ్యయనం సాగించింది. ఫలితంగా డబ్ల్యూహెచ్ఓ వచ్చే ఏడాది విడుదల చేయనున్న వ్యాధుల జాబితాలో ‘వీడియోగేమింగ్ అడిక్షన్’ కూడా చేరనుంది. డబ్ల్యూహెచ్ఓకు చెందిన మానసిక ఆరోగ్య, మాదక ద్రవ్యాల దుర్వినియోగ విభాగం పదేళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం జరిపిన తర్వాత వీడియో గేమింగ్ అడిక్షన్‌ను కూడా ఒక మానసిక వ్యాధిగానే పరిగణించాలని నిర్ణయం తీసుకుందని డబ్ల్యూహెచ్ఓ శాస్త్రవేత్త వ్లాదిమిర్ పోజ్న్యాక్ తెలిపినట్లు ‘న్యూ సైంటిస్ట్’ పత్రిక వెల్లడించింది. మానసిక వైద్యనిపుణులు వీడియోగేమింగ్ అలవాటుపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాలని డబ్ల్యూహెచ్ఓ పిలుపునిచ్చినట్లు తెలిపింది. -
ఆడుతూనే... 71 కోట్లు సంపాదించేశాడు
వాషింగ్టన్ : ప్రముఖ సంస్థ ఫోర్బ్స్ ఈ ఏడాదికిగానూ ఒక్కో జాబితాను విడుదల చేస్తున్న క్రమంలో యూట్యూబ్ ద్వారా అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న స్టార్ల జాబితాలో ఆరేళ్ల చిన్నారి నిలిచి ఆశ్చర్యానికి గురిచేశాడు. కేవలం బొమ్మలతో ఆడుకోవటం ద్వారానే అతను 11 మిలియన్ డాలర్లను(మన కరెన్సీలో సుమారు 71 కోట్లు) సంపాదించాడంటే అతిశయోక్తి కాదు. పిల్లలకు బొమ్మలంటే ఇష్టం ఎలాగో ర్యాన్‌కు అంతే.. కాకపోతే అది కాస్త ఎక్కువ. ఒక బొమ్మ అతని చేతికి చిక్కిందంటే దానిని క్షణ్ణంగా పరిశీలిస్తాడు. అదేంటో.. దాంట్లో ప్రత్యేకతలు ఏంటో పూర్తిగా అధ్యయనం చేసి వివరిస్తుంటాడు. నాలుగేళ్ల వయసులో అతని ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు వీడియోలు తీసి.. ర్యాన్ టాయ్స్రివ్యూ అనే ఓ ట్యూబ్ఛానెల్ను సృష్టించి అందులో ఆ వీడియోలను అప్ డేట్ చేస్తూ వస్తున్నారు. ఆ ఛానెల్‌కు కోటి మందికిపైగా సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ర్యాన్ వీడియోలను చూసే చాలా మంది చిన్నారులు బొమ్మలు కొంటుంటారు కూడా. వాటి డెమో ఇచ్చే సమయంలో అతని హవాభావాలు భలేగా ఉంటాయి. ఈ వీడియోలను గానూ అతనికి సదరు కంపెనీల నుంచి పెద్ద మొత్తంలోనే ముడుతోంది. ఈ ఏడాదికి గానూ 71 కోట్ల సంపాదనతో యూట్యూబ్ స్టార్ల లిస్ట్‌లో 8వ స్థానంలో నిలిచాడు. ఇక ఈ జాబితాలో డేనియల్ మిడల్టన్(16.5 మిలియన్ల డాలర్లతో) ప్రథమ స్థానంలో నిలవగా... ఇవాన్ ఫోంగ్(వానోస్స్ గేమింగ్-15.5 మిలియన్ల డాలర్లు), డ్యూడ్ ఫర్ఫెక్ట్(14 మిలియన్లు) నిలిచారు. ర్యాన్ టాయ్స్రివ్యూ... స్మోష్ స్టార్లు సంయుక్తంగా 8వ స్థానంలో నిలిచారు. ఇదే లిస్ట్‌లో ఇండో-కెనడియన్ కమెడియన్ లిల్లీ సింగ్ పదో స్థానంలో నిలవటం విశేషం. లిల్లీ సింగ్ ఫోటో