‘‘కర్నూలు సిటీలోని గణేశ్‌నగర్ వాసి మహ్మద్ రిజ్వాన్ వెన్నునొప్పితో గాయత్రి ఎస్టేట్‌లోని ఓ న్యూరోఫిజిషియన్ వద్దకు వెళ్లారు. డాక్టర్ ఆరాతీస్తే రోజూ అర్ధరాత్రి ఒంటిగంట వరకూ మేల్కొని సెల్‌ఫోన్ చూస్తుంటారని తేలింది. ఇతనికి ఇదొక్కటే సమస్య కాదు కంటిచూపు తగ్గడం, విపరీతమైన తలనొప్పి కూడా ఉన్నాయి.’’
‘‘మనస్విని అనే ఐదోతరగతి చదువుతోన్న చిన్నారి ఏక్యాంపులో నివాసం ఉంటోంది. ఈ వయస్సుకే దృష్టిలోపం వచ్చింది. ఆస్పత్రికి వెళితే కంటిచూపు ‘మైనస్ వన్’ ఉందని అద్దాలు ఇచ్చారు. స్కూలు నుంచి రాగానే సెల్‌ఫోన్, టీవీకి అతుక్కుపోతుందని, గట్టిగా మందలిస్తే భోజనం చేయకుండా మారం చేస్తుందని, తాము ఏం చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు’’
సాక్షిప్రతినిధి, కర్నూలు: ప్రపంచీకరణ నేపథ్యంలో టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోంది. 30 ఏళ్ల కిందటతో పోలిస్తే టెక్నాలజీ అభివృద్ధి, తద్వారా జనజీవనానికి జరిగిన మేలు ఊహలకందనిది. చావు కబురు పంపాలంటే గతంలో టెలిగ్రాం చేయాల్సి వచ్చేది. బంధువులను పండుగల్లోనే, వేసవి కాలం సెలవుల్లోనూ చూడాల్సి వచ్చేది. మధ్యలో మంచిచెడులు తెలుసుకోవాలంటే ఉత్తరాలు దిక్కయ్యేవి. ఈ దశ నుంచి కంప్యూటర్, ఇంటర్నెట్ యుగంలోకి వచ్చాం. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటోంది! ఇంటింటా స్మార్ట్ టీవీలు ఉన్నాయి. ఇంటర్నెట్‌తో ఇంటి నుంచే ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకుంటున్నాం. ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌లో దొరుకుతోంది. కావాల్సిన బ్రాండ్ దుస్తులు, వస్తువులు ఏది కావాలన్నా ఆన్‌లైన్‌లో షాపింప్ చేస్తున్నాం. వ్యాపార రంగంలో ఆన్‌లైన్ బిజినెస్ వాటా ఏకంగా 37 శాతం ఉందంటే టెక్నాలజీ ప్రభావం ఏవిధంగా ఉందో స్పష్టమవుతోంది.
ఇదే రకంగా పిల్లల వీడియో గేమ్స్ యాప్స్ రూపంలో మొబైల్స్, టీవీల్లో వస్తున్నాయి. టెక్నాలజీ లేకుంటే రోజువారీ జీవితం నడవని పరిస్థితి నెలకొంది. మనకు తెలియని ప్రాంతానికి వెళ్లాలంటే అడ్రస్ కోసం ‘గూగుల్’ మ్యాప్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తోంది. ఇదంతా నాణేనికి ఓవైపు మాత్రమే. మరోవైపు నిశితంగా పరిశీలిస్తే టెక్నాలజీని అతిగా వినియోగిస్తూ ఆరోగ్య సమస్యలతో అల్లాడిపోతున్నవారు లక్షల సంఖ్యలో ఉన్నారు. వీరిలో 15–32 ఏళ్ల వయస్సున్న యువతీ, యువకులు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే విషయం.
పెరుగుతున్న ఒత్తిడి
టెక్నాలజీలో ఎక్కువ సమస్యలు వస్తోంది స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్‌తోనే అని ‘యూరోపియన్ స్పైన్ జర్నల్’ ప్రచురించింది. చిన్న పిల్లలు, టీనేజర్ల మానసిక వికాసంపై టెక్నాలజీ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వయస్సు వారిలోనే మానసిక, శారీరక సమస్యలు వస్తున్నాయి. సోషల్ మీడియాకు ఎక్కువగా అలవాటైనవారిలో సాధారణ కంటే ఐదు రెట్లు ఒత్తిడి ఉంటోంది. మొబైల్‌ఫోన్లను తక్కువగా వాడేవారు సానుకూల ఆలోచనా ధోరణితో ఒత్తిడికి దూరంగా ఉంటే, ఎక్కువగా ఆధారపడే వారు నెగిటివ్ ఆలోచనలతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లపై ఎక్కువ సమయం గడిపేవారు కంటి సమస్యలతో బాధపడుతున్నారు. చాలా మందికి తలనొప్పి, మెడ, భుజాల నొప్పి వస్తున్నాయి. ఈ సమస్యలతో ఆస్పత్రికి వెళ్లేవారు గత నాలుగేళ్లలో ఏకంగా ఐదురెట్లు పెరిగారు. దీంతో ‘అమెరికా ఆప్తాల్మజీ అసోసియేషన్’ ఓ రూల్ ప్రవేశపెట్టింది. కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు వాడేవారు ప్రతీ 20 నిమిషాలకొకసారి కనీసం 20 సెకండ్లు దృష్టి మరల్చాలి. 20 అడుగుల దూరం నడక సాగించాలి.
డేంజర్ జోన్‌లో చిన్నపిల్లలు
అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ చేసిన ఓ సర్వేలో చిన్నపిల్లలపై టెక్నాలజీ ప్రభావం ఎక్కువగా ఉంటోందని తేలింది. స్కూలు నుంచి ఇంటికి రాగానే ఫోన్, టీవీకి అతుక్కుపోతున్నారు. దీంతో చదువులో వెనుకబడటం, క్రమశిక్షణ లేకపోవడం, దేనిపైనా సరైన ఫోకస్ లేకపోవడం, వ్యక్తులతో మాట్లాడటం తగ్గిపోవడం, శారీరక శ్రమ తగ్గిపోయి ఊబకాయం పెరగడం, నిద్రలేమి సమస్య, అగ్రెసివ్ బిహేవియర్‌కు గురవుతున్నారు. ఇవి చిన్న సమస్యలు కాదని, అత్యంత ప్రమాదకరమైనవని ఆ అకాడమీ తల్లిదండ్రులను హెచ్చరించింది. అందుకే 18 నెలల వయస్సు పిల్లలకు టీవీ, ఫోన్ చూపించకూడదు. 2–5 ఏళ్ల పిల్లలు గంటకు మించి టీవీ చూడకూడదు.
మరిన్ని అనారోగ్య సమస్యలు.. పరిష్కారాలు
► ఒకే ప్రదేశంలో కూర్చుని కంప్యూటర్ చూస్తూ గడిపేవారికి వెన్ను సమస్యలు అధికమవుతున్నాయి.ఈ నొప్పితో మనిషి ఇతర విషయాలపై దృష్టి సారించలేకపోతున్నారు. చురుకుదనం తగ్గిపోయి పురోగతి సాధించలేకపోతున్నారు. వీరు కనీసం గంటకోసారి లేచి నడవాలి.
► ఫోన్‌లతో జ్ఞాపకశక్తి క్లీణించింది. గతంలో పదుల సంఖ్యలో ఫోన్ నంబర్లు గుర్తుండేవి. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ల నంబర్లు కూడా గుర్తులేని పరిస్థితి. లావాదేవీల్లో గతంలో ‘నోటిలెక్కల’తో తేల్చేసేవారు. ఇప్పుడు ఫోన్‌లో ‘కాలిక్యులేటర్’పై ఆధారపడాల్సిందే!
► మొబైల్‌ఫోన్ ఎక్కువగా వాడటం, సరిగా కూర్చోకుండా టీవీలు చూడటంతో మెడ వెనుక అప్పర్ బ్యాక్‌పెయిన్ వస్తోంది.
► 2019 నుంచి నిద్రలేమి సమస్యలు ఎక్కువగా పెరిగాయి. రోజూ అర్ధరాత్రి 12 గంటలు, ఒంటిగంట వరకూ నిద్ర మేల్కొని ఉంటున్నారు. జనాభాలో 32 శాతం మంది అర్ధరాత్రి వరకూ ఫోన్లలో గడుపుతున్నారు.
► అనవసర సోషల్ మీడియా యాప్స్ మొబైల్స్‌లో పెట్టుకోకూడదు.
► సెల్‌ఫోన్, టీవీలు ఎక్కువ సమయం, ఎక్కువ లైటింగ్‌లో చూడటం, అతిదగ్గరగా, అతి దూరంగా చూడటం, సరిగా కూర్చోకుండా చూడటం చాలా ప్రమాదకరం.
► నిద్రకు కనీసం గంట ముందు టీవీ, ఫోన్ చూడటం ఆపేయాలి.
► పుస్తకాలు, న్యూస్‌పేపర్ చదవడం తగ్గింది. దీన్ని అలవాటు చేయాలి. బంధువులు, స్నేహితులతో ఎక్కువగా గడపాలి, మాట్లాడాలి. శారీరక దృఢత్వాన్ని కలిగి ఉండేలా ఆటలు ఆడాలి. వ్యాయామాలు చేయాలి.
సోమరితనం పెరుగుతోంది
‘టెక్నాలజీ’ అవసరం కోసమే. కానీ బానిసలవుతున్నాం. దీంతో వెన్ను, మెడ నొప్పితో పాటు ‘నిద్ర’ టైంటేబుల్ మారిపోయింది. గతంలో 9 నుంచి 10 గంటల వరకు నిద్రపోయేవాళ్లు. ఇప్పుడు ఫోన్, ఓటీటీల్లో సినిమాలు చూస్తూ అర్ధరాత్రి వరకూ మేల్కొని ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తున్నారు. దీంతో శరీరంలో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్ అవుతోంది. సోమరితనం ఎక్కువగా వస్తోంది. జ్ఞాపకశక్తిని కోల్పోయి మొద డు మొద్దుబారుతోంది. ఫోన్ నంబర్లతో పాటు కొత్తగా పరిచయమయ్యేవారి పేర్లను కూడా గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. పిల్లలు ఆహారం తినాలన్నా ఫోన్లు, టీవీలు చూపించే పరిస్థితి. ప్రస్తుతం ‘డిప్రెషన్ ట్రెండ్’ నడుస్తోంది. చాలామందికి వారు డిప్రెషన్‌లో ఉన్న సంగతే తెలీడం లేదు.
– డాక్టర్ కె. హేమంత్‌కుమార్‌రెడ్డి, న్యూరోఫిజీషియన్
జాగ్రత్త లేకపోతే భవిష్యత్తు ఛిన్నాభిన్నమే
టెక్నాలజీ అతి వినియోగంతో ఎక్కువ మానసిక సమస్యలు వస్తున్నాయి. 15–25 ఏళ్ల వయస్సున్న వారికి లెర్నింగ్ ఎబిలిటీ ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి. చదవడం, నేర్చుకోవడంతో నాలెడ్ట్ వస్తుంది. ఇప్పటి పిల్లలు వినోదానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో చదువులో క్వాలిటీ ఉండటం లేదు. సొసైటీపై కూడా బాధ్యత ఉండటం లేదు. ఉద్యోగాలు సాధించలేని పరిస్థితుల్లో డిప్రెషన్‌లోకి వెళ్లి ఆల్కాహాల్, సిగరెట్లు, డ్రగ్స్‌కు బానిసయ్యే ప్రమాదం ఉంది. చెడు, మంచి రెండూ నేర్చుకునే అవకాశాలు ప్రస్తుత సొసైటీలో ఉన్నాయి. పిల్లల పెంపకంపై తల్లిదండ్రులు మరింత జాగ్రత్తతో ఉండాలి. గారాబాలతో ఏమాత్రం అలసత్వం చేసినా భవిష్యత్‌ను ఛిన్నాభిన్నం చేసినట్లే.
డాక్టర్ ఇక్రముల్లా, సైక్రియాట్రిస్ట్, కర్నూలు.
Comments
Please login to add a commentAdd a comment