laziness
-
ఈ బద్ధకం వదిలేద్దాం!
ఆరోగ్యమే మహాభాగ్యమంటాం. ఆరోగ్యంగా ఉండేందుకు కనీసపాటి శ్రమైనా చేస్తున్నామా? శారీరక శ్రమ, క్రమం తప్పని కదలికల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిసినా, భారతీయులు బద్ధకపు జీవనశైలినే అనుసరిస్తున్నారట. క్రియాశీలక జీవనవిధానానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కొన్ని మార్గదర్శకాలు పేర్కొంది. కానీ, మన దేశం నుంచి 20 కోట్ల మంది (15.5 కోట్ల మంది వయోజనులు, 4.5 కోట్ల మంది కౌమార వయస్కులు) వాటిని పాటించడంలో విఫలమవుతున్నారు. డాల్బెర్గ్ వారి ‘స్టేట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ’ (సాపా) నివేదిక తాజాగా ఈ సంగతి వెల్లడించింది. ఈ నివేదిక ఆందోళన కలిగించడమే కాక, ఆటలు, వ్యాయామం విషయంలో భారతీయులు శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. నిజానికి, ఇలాంటి జాతీయ స్థాయి సర్వే జరగడం ఇదే తొలిసారి. మేధావుల బృందమైన ‘డాల్ బెర్గ్ అడ్వైజర్స్’, స్వచ్ఛంద సంస్థ ‘స్పోర్ట్స్ అండ్ సొసైటీ యాక్సలరేటర్’ సంయుక్తంగా జరిపిన ఈ అధ్యయనం అనేక ఆందోళనకరమైన ధోరణులను వెల్లడించింది. మన దేశంలో వయోజనుల్లోని కాస్తంత పెద్దవారిలో 48 శాతం మంది ఆటల లాంటి శారీరక శ్రమ చేసేందుకు తమ వయసు మీద పడింది అనేస్తున్నారట. ఇంకా చిత్రం ఆటలు ఆడపిల్లలకు సురక్షితం కాదన్న అభిప్రాయంలో 45 శాతం మంది ఉన్నారట. అలాగే, శారీరక శ్రమ చేయడం ఋతుస్రావ మహిళలకు నష్టదాయకమనీ, ఒంటికి దెబ్బలు తగిలితే వివాహ అవకాశాలు దెబ్బ తింటాయనీ, భౌతిక శ్రమ వల్ల పెళ్ళయిన అమ్మాయిలకు గర్భస్రావం అవుతుందనీ... ఇలా రకరకాల దురభిప్రాయాలు నెలకొన్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో... అలాగే పురుషులతో పోలిస్తే మహిళల్లో శారీరక శ్రమ బాగా తక్కువవడం గమనార్హం. దీనికి కారణాలు లేకపోలేదు. శారీరక శ్రమ చేసేందుకు అనుకూలంగా ఉద్యానాలు, మైదానాల లాంటి బహిరంగ ప్రదేశాలు పట్టణాల్లో కరవై పోయాయి.అందువల్ల గ్రామాలతో పోల్చి చూసినప్పుడు పట్టణాల్లో శారీరక శ్రమ రాహిత్యం రెట్టింపు ఉంటోంది. నగర జనాభా మరీ అతి సున్నితంగా తయారైంది. ఇక, మన భారతీయ మహిళల్లో... నూటికి 75 మందికి రకరకాల ఇంటిపనుల్లోనే సమయమంతా గడిచిపోతుంది. ఫలితంగా వారికి వ్యాయామం చేసేందుకు తీరిక దొరకని పరిస్థితి. ఈ కారణాలన్నీ కలిసి కొంప ముంచుతున్నాయి. జీవనశైలి వ్యాధులకు దారి తీస్తున్నాయి. చాలామంది రోజూ నడుస్తున్నామంటారు. నడక వల్ల ప్రయోజనాలు ఉన్నాయి కానీ, ఆరోగ్యవంతమైన శరీరానికి అదొక్కటే సరిపోదని నిపుణుల ఉవాచ. తాజా సర్వే ఒక్కటే కాదు... ప్రతిష్ఠాత్మక ‘లాన్సెట్’ పత్రికలో ఇటీవలే ప్రచురితమైన మరో అధ్యయనం సైతం భారతీయ వయోజనుల్లో నూటికి 50 మంది శారీరకంగా తగినంత శ్రమ చేయట్లేదని పేర్కొంది. అంతంత మాత్రపు శారీరక శ్రమతోనే వయోజనులు సరిపెట్టుకొంటున్న ధోరణి ఉన్నతాదాయాలుండే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రధానంగా కనిపిస్తోంది. ఆ తరువాత రెండోస్థానంలో దక్షిణాసియా ప్రాంతం నిలిచింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సహా పలువురు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం చెబుతున్న మాట. ఆందోళనకరమైన అంశం ఏమిటంటే... మన దేశంలోని వయోజనుల (కనీసం 18 ఏళ్ళు, ఆపైన ఉన్నవారి)లో పెద్దగా శారీరక శ్రమ చేయని సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 2000 నాటికి అలాంటివారు 22 శాతం పైచిలుకు ఉంటే, 2010 నాటికి వారు 34 శాతం దాకా పెరిగారు. 2022 నాటికి 50 శాతం దాకా చేరారు. ఇలాగే కొనసాగితే... 2030 నాటికల్లా ఇలాంటివాళ్ళు ఏకంగా 60 శాతానికి చేరతారని అంచనా. ఇది శారీరక, మానసిక ఆరోగ్యపరంగానే కాదు... సామాజికంగానూ ప్రమాదఘంటికే!రోజూ బద్ధకంగా, శారీరక శ్రమ లేకుండా గడిపేస్తుంటే... మధుమేహం, గుండెజబ్బు వచ్చే ముప్పుంది. నిజానికి, ఎంతసేపూ కదలకుండా కూర్చొనే జీవనశైలి, శారీరక శ్రమ అంతకంతకూ తగ్గిపోవడం వల్ల ప్రపంచమంతటా ఈ జబ్బుల బారినపడుతున్నవారు పెరుగుతున్నారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై భారం పడుతోందని డబ్ల్యూహెచ్ఓ మాట. అంతేకాదు... ఈ బద్ధకపు జీవన విధానం వల్ల మన దేశంలో దాదాపు 25.4 కోట్లమందికి పైగా స్థూలకాయంతో, 18.5 కోట్ల మంది దాకా ‘చెడు కొలెస్ట్రాల్’తో బాధపడుతున్నట్టు వెల్లడైంది. ఆరోగ్యానికే కాదు... దేశ ఆర్థిక బలిమికీ శారీరకంగా చురుకుదనం అత్యంత కీలకం. మన దేశ జనాభా మొత్తం శ్రమకు నడుంబిగిస్తే, 2047 నాటికి దేశ స్థూల జాతీయోత్పత్తి రూ. 15 ట్రిలియన్లు దాటిపోతుందని అంచనా. స్థూలకాయం, లాంటి జబ్బులు తగ్గడమే కాదు, వాటి కోసం ఖర్చు చేస్తున్న రూ. 30 ట్రిలియన్లు ఆదా అవుతాయి. లెక్కతీస్తే, ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మంది తగిన శారీరక శ్రమ చేయక చెరుపు చేస్తున్నారు, చేసుకుంటున్నారు. ఇక, డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల్ని బట్టి చూసినా శారీరక శ్రమరాహిత్యం అత్యధికంగా ఉన్న 195 దేశాల్లో భారత్ 12వ స్థానంలో నిలిచిందని ‘లాన్సెట్’ అధ్యయనం. రోజువారీ వ్యాయామంతో సమయం వృథా అనీ, ర్యాంకుల చదువులతోనే జీవితంలో పైకి వస్తామనీ, ఆటలు అందుకు ఆటంకమనీ భావించే తల్లితండ్రుల ఆలోచనా ధోరణి ఇకనైనా మారాల్సి ఉంది. మనమైనా, మన దేశమైనా పైకి రావాలంటే... మనుషుల శారీరక, మానసిక ఆరోగ్యమే కీలకం. ప్రభుత్వాలు అది గుర్తించి ఆటలతో మేళవించిన విద్యా ప్రణాళికను తప్పనిసరి చేయాలి. పౌరుల కోసం వ్యాయామ కేంద్రాల వసతులూ పెంచాలి. ఎందుకంటే, జీవన సౌంద ర్యమే కాదు... జగమంతటినీ లక్ష్మీనివాసంగా మార్చే మహత్తూ శ్రమశక్తిదే మరి! -
మీ బద్ధకం అమ్మకు భారమే
చలికాలం ముసుగు తన్ని పడుకుంటే ఎంత బాగుణ్ణు. బెడ్ దగ్గరకు పొగలు గక్కే టీ వస్తే ఎంత బాగుణ్ణు. టిఫిన్లూ, సూప్‌లు, సాయంత్రం ఉడకబెట్టిన పల్లీలు... ఎంత బాగుణ్ణు. అన్నట్టు రగ్గులు, బొంతలు భలే శుభ్రంగా, పొడిగా ఉండాలండోయ్. చలికాలం ఎవరికీ పని చేయబుద్ధేయని కాలం. కాని అమ్మకు తప్పుతుందా? అమ్మ వెచ్చని రగ్గు కప్పుకుని టీవీ చూస్తూ ‘టీ తెండి’ అని అరిస్తే ఒకరోజైనా ఇస్తారా ఎవరైనా? చలికాలంలో ఇంటి సభ్యులు ఏం చేయాలి? స్కూల్ టైమ్ మారదు. ఉదయం 8 లోపు బస్సొచ్చి ఆగుతుంది. పిల్లలకు బాక్స్ కట్టివ్వడమూ తప్పదు. ఏడున్నరకంతా కట్టాల్సిందే. టిఫిన్ తినిపించాల్సిందే. ఎంత చలి ఉన్నా, ఎంత మంచు కమ్ముకున్నా, ఎంత బద్ధకంగా ఉన్నా, ఎంత ముసుగుతన్ని నిద్రపోవాలని ఉన్నా అమ్మకు తప్పుతుందా? అమ్మ లేవకుండా ఉంటుందా? వంట గదిలో వెళ్లకుండా ఉంటుందా? నాన్న అరగంట లేటుగా లేవొచ్చు. వాకింగ్ ఎగ్గొట్టి అమ్మ ఇచ్చిన టీని చప్పరిస్తూ పేపర్‌ను చదువుతూ ఉండొచ్చు. కాని అమ్మ మాత్రం అదే వంట చేయాల్సిందే. రోజువారీ అంట్లు, బట్టల ఉతుకుడు చూడాల్సిందే. ఆమెకు ఇంట్లో నుంచి ఎలాంటి సాయం అందుతున్నదో ఆలోచించామా ఎప్పుడైనా? బద్ధ్దకమైన కాలం ఇది చలికాలం బద్ధకం కాలం. తలుపులు కిటికీలు మూసుకుని అరచేతులు రుద్దుకుంటూ కూచోమని చెప్పే కాలం. బబ్బుంటే బాగుండు అనిపించే కాలం. అమ్మకు ‘ఈ పూట ఎవరైనా వంట చేసి పెడితే బాగుండు’ అనిపించినా అలా చేసేవారు ఎవరు? ‘రోజూ వండుతున్నావ్ కదా ఇవాళ బజారు నుంచి వేడి ఇడ్లీ తెస్తానులే’ అని బండి తాళం అందుకునే నాన్నలు ఎందరు? పాలల్లో కొన్ని చాకోస్ వేసివ్వు చాలు అనే పిల్లలు, బ్రెడ్ ఆమ్లేట్ చేసుకుని తింటాలే అనే భర్తలు ఉన్న ఇల్లు ఇల్లాలి శ్రమను గుర్తించే ఇల్లు. ‘కాసేపు పడుకోలే’ అని లేచి పేపర్లు లోపల పడేసి, పాలు ఫ్రిజ్‌లో పెట్టి, ఒక ప్యాకెట్ గిన్నెలో వేడి చేసి, కాఫీ కలిపి భార్యను లేపితే ఎంత బాగుంటుంది. మగవాళ్లు బట్టలు ఎలాగూ ఉతకరు. ‘చెమ్మగా ఉన్నాయి’ అని విసుక్కునే బదులు కనీసం ఎండ తగిలే తీగ దాకానో, డాబా మీదనో తీసుకెళ్లి ఆరేసే సాయం చేయరు. ఇలాంటి సమయంలో ‘బట్టలు ఆరేయడం’ అనే చిన్న పని కూడా చాలా పెద్ద సాయం కిందకు వస్తుంది.ఈ రోజుల్లో ప్రత్యామ్నాయ టిఫిన్లు, ఇన్స్టంట్ టిఫిన్లు ఎన్నో మార్కెట్లో ఉన్నాయి. యూట్యూబ్‌లో కొడితే వందలాది వీడియోలు ఉన్నాయి. తెచ్చిపెట్టే స్విగ్గి, జొమాటోలు ఉన్నాయి. ఈ శీతాకాలంలో ఉదయపు వంట చెర నుంచి అమ్మకు ఏ విధంగా ఉపశమనం ఇవ్వొచ్చో తప్పక ఆలోచించాలి. ఇంట్లో పెద్దవారు ఉంటే? అమ్మమ్మో, నానమ్మో ఇంట్లో ఉంటే వారి గురించి ఇల్లంతా మరింత శ్రద్ధ పెట్టాలి. మంచి షాల్, రగ్గు వారికి ఏర్పాటు చేయాలి. నేలకు పాదాలు తాకి జిల్లు మనకుండా ఇంట్లో తిరగడానికి మంచి స్లిప్పర్లు ఇవ్వాలి. స్లిప్పర్లలోనే తిరగమని చెప్పాలి. చలికి ఆకలి ఎక్కువ. పెద్దవారు పసిపిల్లల్లా మారి నోటికి హితంగా వేడివేడిగా అడుగుతారు. వారికి ఏదో ఒకటి చేసి పెట్టాలి. ఆ పనిలో కూడా అమ్మకు భర్త, పిల్లలు ఏదో ఒక మేరకు సాయం చేయాలి. వారికి వెచ్చని గది కేటాయించాలి. లేదా ఇంట్లోని వెచ్చని ప్రదేశమైనా. శుభ్రత అందరిదీ శీతాకాలం ఇల్లు మబ్బుగా ఉంటుంది. ఇటు పుల్ల అటు పెట్టబుద్ధి కాదు. కాని ప్రయత్నం చేసి ఇల్లు ప్రతి రోజూ సర్దుకునే పడుకోవాలి. హాల్లో బెడ్రూముల్లో కిచెన్‌లో కుటుంబ సభ్యులంతా నిద్రకు ముందు వీలైనంత శుభ్రంగా, సర్ది పడుకుంటే ఉదయాన్నే అమ్మ లేచినప్పుడు చిందర వందర లేకుండా పనిలో పడబుద్ధి అవుతుంది. పక్క బట్టలు మడవడం కూడా కొంతమంది చేయరు. అలాంటి వారిని తప్పక గాడిలో పెట్టాలి. చలికాలం అమ్మకి పని తేలిక చేద్దాం. చలికాలాన్ని ఎంజాయ్ చేసేలా చూద్దాం. అమ్మకు కావాలి వెచ్చని దుస్తులు సాధారణంగా ఇళ్లల్లో నాన్నకు హాఫ్ స్వెటర్లు ఉంటాయి. ఎప్పుడూ వేసుకునే ఉంటాడు. అమ్మకు మాత్రం ఎందుకనో స్వెటర్ ఉండదు. కొని తేవాలని ఎవరికీ అనిపించదు. చాలా ఇళ్లల్లో అమ్మలు పాతబడిన స్వెటర్లతోనే తిరుగుతూ ఉంటారు ఈ సీజన్లలో. ఒక రంగురంగుల కొత్త స్వెటర్ కొనుక్కోవాలని వారికి ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నా, గృహిణి అయినా తాను కొనుక్కునే చొరవకు ఎప్పుడూ అమ్మ దూరంగానే ఉంటుంది. స్వెటర్ లేకుండానే చలికాలం గడిపేస్తుంది. ఆమెకు స్వెటర్, సాక్సులు, స్కార్ఫ్‌లు కావాలి. ఉన్నాయా గమనించండి. ఆమె అడగదు. తెచ్చి పెట్టండి. శీతాకాలంలో స్త్రీలు తమ శరీరం గురించి ఆలోచన చేస్తారు. చర్మాన్ని, శిరోజాల్ని కాపాడుకోవడానికి వారికి కొన్ని వస్తువులు అవసరం. క్రీములు, నూనెలు, సబ్బులు... ఏర్పాటు చేయాలి. చర్మ సమస్యలు కొందరిలో రావచ్చు. వాటిని చిట్కాలతో సరిపుచ్చుతూ బాధ పడాల్సిన పని లేదు. వైద్యుల దగ్గరకు వెళ్లాలి. తీసుకువెళ్లాలి. ఇక ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉంటే చలికాలం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రోజువారీ చాకిరీ నుంచి దాదాపుగా తప్పించాలి. -
వద్దు‘లే..జీ’ నడవటం ఈజీ.. మరణాలకు నాలుగో ప్రధాన కారణం ఏంటో తెలుసా?
తాగి డ్రైవింగ్ చేయడం.. అతి వేగంతో వాహనాలు నడపటం.. సిగరెట్లు తాగడం వంటివి ఎలా ప్రాణాంతకమవుతాయో.. రోజంతా మంచంపై కూర్చోవడం.. ఎలాంటి కదలికలు లేకుండా ఉండటం కూడా అంతే ప్రాణాంతకమని మీకు తెలుసా. సోమరితనం మీ విలువైన కాలంతోపాటు మీ ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది. శరీరానికి తగినంత వ్యాయామం చేయకపోతే అకాల మరణాలు సంభవించే అవకాశాలు 500 రెట్లు అధికమని ‘ది లాన్సెట్’లో ప్రచురించిన ఓ అధ్యయనం స్పష్టం చేసింది. నడక లేదా పరుగు వంటి సాధారణ వ్యాయామాలు చేయడానికి కూడా తీరిక లేని వ్యక్తి వ్యాధులను ఆహ్వానిస్తాడని వెల్లడించింది. సాక్షి, అమరావతి: బడి ఈడు పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఏ వయసు వారైనా తగినంత శారీరక శ్రమ చేయడం ఆరోగ్యానికి చాలా అవసరం. ఇంటినుంచి అడుగు బయట పెట్టగానే బైక్ లేదా కారెక్కి తుర్రుమని గమ్యస్థానానికి చేరుతున్న వారెందరో ఉన్నారు. ఒక్క క్లిక్‌తో గుమ్మం వద్దకే అగ్గిపెట్టె నుంచి అన్నిరకాల వస్తువులు వచ్చి చేరుతున్నాయి. దీంతో బద్ధకస్తులు పెరిగిపోతున్నారు. ఫలితంగా దీర్ఘకాలిక వ్యాధులబారిన పడుతున్న వారి సంఖ్య కూడా శరవేగంగా పెరుగుతోంది. ఉరుకుల పరుగుల జీవితంలో నడక, జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, జిమ్ చేయడం లాంటి ఏదో ఒక వ్యాయామం చేసి తీరాలని వైద్యులు సూచిస్తున్నారు. భారం పెరిగిపోతోంది ప్రజలు బద్ధకిస్టులుగా మారడం.. ఆధునిక ఆహారపు అలవాట్ల వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, క్యాన్సర్ వంటి నాన్ కమ్యూనికబుల్ (ఎన్సీడీ) వ్యాధులు దేశంలోను, రాష్ట్రంలోనూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశంలో 63 శాతం, రాష్ట్రంలో 68 శాతం మరణాలకు ఎన్సీడీ వ్యాధులకు కారణమవుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్సీడీ నివారణ, నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 30 ఏళ్ల పైబడిన వారందరికీ స్క్రీనింగ్ నిర్వహించి.. వారి ఆరోగ్యంపై నిరంతర ఫాలో అప్ను వైద్య శాఖ చేపడుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 2.80 కోట్ల మందికి స్క్రీనింగ్ నిర్వహించగా.. 55.41 లక్షల మందిలో రక్తపోటు లక్షణాలు వెలుగు చూశాయి. వీరిలో 16.28 లక్షల మందిలో సమస్య నిర్ధారణ అయింది. 5.46 లక్షల మంది ప్రస్తుతం చికిత్సలో ఉండగా.. 5.14 లక్షల మందిలో సమస్య అదుపులోనే ఉంది. అదేవిధంగా 53.92 లక్షల మందిలో మధుమేహం సమస్య వెలుగు చూడగా.. 12.29 లక్షల మందికి సమస్య నిర్ధారణ అయింది. వీరిలో 4.17 లక్షల మంది ప్రస్తుతం చికిత్సలో ఉన్నారు. 3.65 లక్షల మందిలో సమస్య అదుపులో ఉంది. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ఎన్సీడీ బాధితులపై వైద్య శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రజల్లోకి తీసుకుని వెళ్లేలా.. దీర్ఘకాలిక జబ్బుల బారిన పడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రజలకు శారీరక శ్రమ ఆవశ్యకతను తెలియజేసి.. వారిని నడక, వ్యాయామం ఇతర కార్యకలాపాల వైపు మళ్లించడంపై వైద్య శాఖ దృష్టి సారించింది. ఈ క్రమంలో ప్రైవేట్ విద్యాసంస్థలు, ఎన్జీవోల సహకారాన్ని తీసుకుని వాకింగ్ ట్రాక్‌లు, గ్రౌండ్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళిక రచించారు. పాఠశాల దశలోనే పిల్లల్లో వ్యాయామం, నడక రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మరణాలకు నాలుగో ప్రధాన కారణం బద్ధకమే ప్రజలు తగినంత శారీరక శ్రమ చేయకపోవడం మరణాలకు నాలుగో ప్రధాన కారణంగా ఉంటోందని డబ్ల్యూహెచ్‌వో సైతం హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మరణాలకు నాలుగు ప్రధాన కారణాలను పరిశీలిస్తే అధిక రక్తపోటు మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానాల్లో పొగాకు వినియోగం, మధుమేహం, శారీరక శ్రమ చేయకపోవడం వంటివి ఉంటున్నాయి. తగినంత శారీరక శ్రమ లేకపోవడంతో ప్రజలు దీర్ఘకాలిక జబ్బులైన మధుమేహం, రక్తపోటు, పక్షవాతం, క్యాన్సర్, గుండె సమస్యలు, మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు. వీటిని నయం చేసుకోవడానికి ఏటా రూ.25 వేల కోట్ల మేర ఖర్చవుతోందని, పదేళ్లలో ఈ ఖర్చు రూ.2.50 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని గత ఏడాది ఓ నివేదికలో డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. పట్టణీకరణ పెరుగుదల, రవాణా సౌకర్యంలో మార్పులు, అవుట్డోర్ పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు అందుబాటులో లేకపోవడం, శారీరక శ్రమ ఆవశ్య కతపై అవగాహన లేకపోవడం వంటి కారణాలు ప్రజలను బద్ధకిస్టులుగా మార్చుతున్నాయి. ఇప్పటికే సమావేశం నిర్వహించాం ప్రజలకు వాకింగ్ చేయడానికి వీలుగా మైదానాలను అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో ఇప్పటికే సమావేశం నిర్వహించాం. తమ గ్రౌండ్లను ఉదయం, సాయంత్రం ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరాం. వివిధ శాఖలను సమన్వయం చేసుకుని ప్రజల రోజువారి దినచర్యలో వాకింగ్, జాగింగ్, వ్యాయామం, ఇతర శారీరక శ్రమ కార్య కలాపాలను భాగం చేసేలా కార్యక్రమాలు చేపడతాం. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ మార్పు రావాలి పాశ్చాత్య జీవన విధానానికి ప్రజలు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో అలవాట్లలో మార్పు రావాలి. మన పూర్వీకుల జీవన విధానాల్లోకి మనం వెళ్లాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు నడక, వ్యాయామం, ఈత ఇలా ఏదో ఒక శారీరక శ్రమ చేయాలి. తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుప డుతుంది. ఊబకాయం నుంచి బయటపడొచ్చు. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్, కర్నూలు జీజీహెచ్ -
WHO Report: ‘భారత్‌లో బద్ధకస్తులు ఎక్కువయ్యారు’.. ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళన
సాక్షి, హైదరాబాద్: దేశంలో బద్ధకస్తులు ఎక్కువయ్యారు. చాలామంది శారీరక శ్రమ చేయడం లేదు. ఫలితంగా దీర్ఘకాలికవ్యాధులు పెరుగుతున్నాయి. ఈ జబ్బులకు చికిత్స ఖర్చు భారీగా పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ‘శారీరక శ్రమ లేకపోవడం వల్ల తలెత్తుతున్న అనారోగ్య సమస్యలు, పడుతున్న భారం’పై ఆ సంస్థ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. అందులో భారత్ గురించి అనేక అంశాలను ప్రస్తావించింది. మనదేశంలో 11–17 మధ్య వయస్సువారిలో 74 శాతం మంది శారీరక శ్రమ చేయడంలేదు. అందులో బాలురు 72 శాతం, బాలికలు 76 శాతం ఉన్నారు. 18 ఏళ్లు పైబడినవారిలో మహిళలు 44 శాతం, పురుషులు 25 శాతం వ్యాయామం చేయడంలేదు. 70 ఏళ్లు పైబడినవారిలో మహిళలు 60 శాతం, పురుషులు 38 శాతం శారీరక శ్రమ చేయడం లేదు. శారీరక శ్రమ చేయకపోవడం వల్ల దీర్ఘకాలిక జబ్బులైన బీపీ, షుగర్, పక్షవాతం, గుండె, క్యాన్సర్, మానసిక రుగ్మతలు తలెత్తుతు న్నాయి. వీటిని నయం చేసేందుకు అయ్యే ఖర్చు దేశంలో ఏడాదికి రూ. 25,600 కోట్ల ఖర్చు అవుతోంది. వచ్చే పదేళ్లలో అది ఏకంగా రూ.2.5 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా. వాకింగ్, సైక్లింగ్‌పై జాతీయ విధానం కరువు దేశంలో చనిపోయేవారిలో 66% మంది దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులే. మొత్తం మరణాల్లో 30 శాతం గుండెకు సంబంధించినవే కావడం గమనార్హం. ఆ తర్వాత ఊపిరితిత్తి వ్యాధులు, క్యాన్సర్, షుగర్, ఇతరాలతో చనిపోతున్నారు. పాఠశాలల్లో నాణ్యమైన శారీరక శ్రమ ఉండటంలేదు. జాతీయంగా శారీరక వ్యాయామం చేయించడానికి పెద్ద వాళ్ల విషయంలో ఒక సర్వేలెన్స్ వ్యవస్థ ఉంది. కానీ, చిన్నపిల్లలకు లేదు. ఐదేళ్ల లోపు పిల్లల విషయంలో శారీరక శ్రమ ఎంత చేయాలన్న దానిపై మార్గదర్శకాలే లేవు. సాధారణ సిఫార్సులు... ► 2050 నాటికి శారీరక శ్రమ లేకపోవడం అనే స్థితిని 15 శాతానికి తగ్గించాలి. ► ప్రపంచంలో వచ్చే పదేళ్లలో సరైన శారీరక శ్రమ చేయకపోవడం వల్ల కొత్తగా 50 కోట్లమంది దీర్ఘకాలికవ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే పదేళల్లో నమోదయ్యే బీపీ కేసుల్లో 47 శాతం వ్యాయామం లేకపోవడం వల్లే సంభవించవచ్చు. మానసిక రుగ్మతలు నమోదయ్యే కేసుల్లో 43 శాతం మేర వ్యాయామం లేకపోవడం కారణమే. 50 కోట్ల కొత్త కేసుల్లో మూడో వంతు కేసులు దిగువ మధ్య ఆదాయ దేశాల్లోనే ఉంటాయి. అంటే మనలాంటి దేశాల్లోనే ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. ► నడకకు అనువైన రహదారుల వ్యవస్థను నెలకొల్పాలి. ► వాహనాల వేగంపై నియంత్రణ ఉండాలి. ► డ్రంక్ అండ్ డ్రైవ్, మొబైల్ మాట్లాడుతూ నడపడంపై నియంత్రణ ఉండాలి. ► శారీరక శ్రమ చేయాలని ప్రోత్సహించే వ్యవస్థ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉండాలి. ► ప్రతి ఒక్కరికీ వారానికి 300 నిముషాల వ్యాయామం తప్పనిసరి ► 18 ఏళ్లు పైబడినవారు వారానికి 150 నుంచి 300 మధ్యస్థ శారీరక శ్రమ చేయాలి. ► 11–17 మధ్య వయస్సున్న పిల్లలు రోజుకు గంట శారీరక శ్రమ చేయాలి. ► 18 ఏళ్లు పైబడినవారు కనీసం వారానికి రెండుసార్లు కండరాలు బలపడే వ్యాయామాలు చేయాలి. ► 50 ఏళ్లు పైబడినవారు వారానికి మూడు సార్లు బ్యాలెన్స్ ఎక్సర్ సైజ్లు చేయాలి. మానసిక రుగ్మతలపైనే ఖర్చు ఎక్కువ: డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ వ్యాయామం లేకపోవడం వల్ల ప్రధానంగా బీపీ, డిప్రెషన్, మతిమరుపు సమస్యలు వస్తాయి. ప్రపంచంలో 75 శాతం మరణాలకు దీర్ఘాకాలిక జబ్బులే కారణం. ఈ జబ్బులకు శారీరక శ్రమ లేకపోవడమే ప్రధాన కారణం. అయితే వీటిని తగ్గించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య బడ్జెట్లో కేవలం రెండు శాతమే ఖర్చు చేస్తున్నారు. -
మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న సాంకేతికత
‘‘కర్నూలు సిటీలోని గణేశ్‌నగర్ వాసి మహ్మద్ రిజ్వాన్ వెన్నునొప్పితో గాయత్రి ఎస్టేట్‌లోని ఓ న్యూరోఫిజిషియన్ వద్దకు వెళ్లారు. డాక్టర్ ఆరాతీస్తే రోజూ అర్ధరాత్రి ఒంటిగంట వరకూ మేల్కొని సెల్‌ఫోన్ చూస్తుంటారని తేలింది. ఇతనికి ఇదొక్కటే సమస్య కాదు కంటిచూపు తగ్గడం, విపరీతమైన తలనొప్పి కూడా ఉన్నాయి.’’ ‘‘మనస్విని అనే ఐదోతరగతి చదువుతోన్న చిన్నారి ఏక్యాంపులో నివాసం ఉంటోంది. ఈ వయస్సుకే దృష్టిలోపం వచ్చింది. ఆస్పత్రికి వెళితే కంటిచూపు ‘మైనస్ వన్’ ఉందని అద్దాలు ఇచ్చారు. స్కూలు నుంచి రాగానే సెల్‌ఫోన్, టీవీకి అతుక్కుపోతుందని, గట్టిగా మందలిస్తే భోజనం చేయకుండా మారం చేస్తుందని, తాము ఏం చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు’’ సాక్షిప్రతినిధి, కర్నూలు: ప్రపంచీకరణ నేపథ్యంలో టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోంది. 30 ఏళ్ల కిందటతో పోలిస్తే టెక్నాలజీ అభివృద్ధి, తద్వారా జనజీవనానికి జరిగిన మేలు ఊహలకందనిది. చావు కబురు పంపాలంటే గతంలో టెలిగ్రాం చేయాల్సి వచ్చేది. బంధువులను పండుగల్లోనే, వేసవి కాలం సెలవుల్లోనూ చూడాల్సి వచ్చేది. మధ్యలో మంచిచెడులు తెలుసుకోవాలంటే ఉత్తరాలు దిక్కయ్యేవి. ఈ దశ నుంచి కంప్యూటర్, ఇంటర్నెట్ యుగంలోకి వచ్చాం. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటోంది! ఇంటింటా స్మార్ట్ టీవీలు ఉన్నాయి. ఇంటర్నెట్తో ఇంటి నుంచే ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకుంటున్నాం. ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌లో దొరుకుతోంది. కావాల్సిన బ్రాండ్ దుస్తులు, వస్తువులు ఏది కావాలన్నా ఆన్లైన్లో షాపింప్ చేస్తున్నాం. వ్యాపార రంగంలో ఆన్లైన్ బిజినెస్ వాటా ఏకంగా 37 శాతం ఉందంటే టెక్నాలజీ ప్రభావం ఏవిధంగా ఉందో స్పష్టమవుతోంది. ఇదే రకంగా పిల్లల వీడియో గేమ్స్ యాప్స్ రూపంలో మొబైల్స్, టీవీల్లో వస్తున్నాయి. టెక్నాలజీ లేకుంటే రోజువారీ జీవితం నడవని పరిస్థితి నెలకొంది. మనకు తెలియని ప్రాంతానికి వెళ్లాలంటే అడ్రస్ కోసం ‘గూగుల్’ మ్యాప్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తోంది. ఇదంతా నాణేనికి ఓవైపు మాత్రమే. మరోవైపు నిశితంగా పరిశీలిస్తే టెక్నాలజీని అతిగా వినియోగిస్తూ ఆరోగ్య సమస్యలతో అల్లాడిపోతున్నవారు లక్షల సంఖ్యలో ఉన్నారు. వీరిలో 15–32 ఏళ్ల వయస్సున్న యువతీ, యువకులు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే విషయం. పెరుగుతున్న ఒత్తిడి టెక్నాలజీలో ఎక్కువ సమస్యలు వస్తోంది స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్తోనే అని ‘యూరోపియన్ స్పైన్ జర్నల్’ ప్రచురించింది. చిన్న పిల్లలు, టీనేజర్ల మానసిక వికాసంపై టెక్నాలజీ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వయస్సు వారిలోనే మానసిక, శారీరక సమస్యలు వస్తున్నాయి. సోషల్ మీడియాకు ఎక్కువగా అలవాటైనవారిలో సాధారణ కంటే ఐదు రెట్లు ఒత్తిడి ఉంటోంది. మొబైల్ఫోన్లను తక్కువగా వాడేవారు సానుకూల ఆలోచనా ధోరణితో ఒత్తిడికి దూరంగా ఉంటే, ఎక్కువగా ఆధారపడే వారు నెగిటివ్ ఆలోచనలతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ట్యాబ్‌లు, స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లపై ఎక్కువ సమయం గడిపేవారు కంటి సమస్యలతో బాధపడుతున్నారు. చాలా మందికి తలనొప్పి, మెడ, భుజాల నొప్పి వస్తున్నాయి. ఈ సమస్యలతో ఆస్పత్రికి వెళ్లేవారు గత నాలుగేళ్లలో ఏకంగా ఐదురెట్లు పెరిగారు. దీంతో ‘అమెరికా ఆప్తాల్మజీ అసోసియేషన్’ ఓ రూల్ ప్రవేశపెట్టింది. కంప్యూటర్లు, సెల్ఫోన్లు వాడేవారు ప్రతీ 20 నిమిషాలకొకసారి కనీసం 20 సెకండ్లు దృష్టి మరల్చాలి. 20 అడుగుల దూరం నడక సాగించాలి. డేంజర్ జోన్లో చిన్నపిల్లలు అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ చేసిన ఓ సర్వేలో చిన్నపిల్లలపై టెక్నాలజీ ప్రభావం ఎక్కువగా ఉంటోందని తేలింది. స్కూలు నుంచి ఇంటికి రాగానే ఫోన్, టీవీకి అతుక్కుపోతున్నారు. దీంతో చదువులో వెనుకబడటం, క్రమశిక్షణ లేకపోవడం, దేనిపైనా సరైన ఫోకస్ లేకపోవడం, వ్యక్తులతో మాట్లాడటం తగ్గిపోవడం, శారీరక శ్రమ తగ్గిపోయి ఊబకాయం పెరగడం, నిద్రలేమి సమస్య, అగ్రెసివ్ బిహేవియర్‌కు గురవుతున్నారు. ఇవి చిన్న సమస్యలు కాదని, అత్యంత ప్రమాదకరమైనవని ఆ అకాడమీ తల్లిదండ్రులను హెచ్చరించింది. అందుకే 18 నెలల వయస్సు పిల్లలకు టీవీ, ఫోన్ చూపించకూడదు. 2–5 ఏళ్ల పిల్లలు గంటకు మించి టీవీ చూడకూడదు. మరిన్ని అనారోగ్య సమస్యలు.. పరిష్కారాలు ► ఒకే ప్రదేశంలో కూర్చుని కంప్యూటర్ చూస్తూ గడిపేవారికి వెన్ను సమస్యలు అధికమవుతున్నాయి.ఈ నొప్పితో మనిషి ఇతర విషయాలపై దృష్టి సారించలేకపోతున్నారు. చురుకుదనం తగ్గిపోయి పురోగతి సాధించలేకపోతున్నారు. వీరు కనీసం గంటకోసారి లేచి నడవాలి. ► ఫోన్లతో జ్ఞాపకశక్తి క్లీణించింది. గతంలో పదుల సంఖ్యలో ఫోన్ నంబర్లు గుర్తుండేవి. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ల నంబర్లు కూడా గుర్తులేని పరిస్థితి. లావాదేవీల్లో గతంలో ‘నోటిలెక్కల’తో తేల్చేసేవారు. ఇప్పుడు ఫోన్లో ‘కాలిక్యులేటర్’పై ఆధారపడాల్సిందే! ► మొబైల్‌ఫోన్ ఎక్కువగా వాడటం, సరిగా కూర్చోకుండా టీవీలు చూడటంతో మెడ వెనుక అప్పర్ బ్యాక్‌పెయిన్ వస్తోంది. ► 2019 నుంచి నిద్రలేమి సమస్యలు ఎక్కువగా పెరిగాయి. రోజూ అర్ధరాత్రి 12 గంటలు, ఒంటిగంట వరకూ నిద్ర మేల్కొని ఉంటున్నారు. జనాభాలో 32 శాతం మంది అర్ధరాత్రి వరకూ ఫోన్లలో గడుపుతున్నారు. ► అనవసర సోషల్ మీడియా యాప్స్ మొబైల్స్‌లో పెట్టుకోకూడదు. ► సెల్‌ఫోన్, టీవీలు ఎక్కువ సమయం, ఎక్కువ లైటింగ్‌లో చూడటం, అతిదగ్గరగా, అతి దూరంగా చూడటం, సరిగా కూర్చోకుండా చూడటం చాలా ప్రమాదకరం. ► నిద్రకు కనీసం గంట ముందు టీవీ, ఫోన్ చూడటం ఆపేయాలి. ► పుస్తకాలు, న్యూస్‌పేపర్ చదవడం తగ్గింది. దీన్ని అలవాటు చేయాలి. బంధువులు, స్నేహితులతో ఎక్కువగా గడపాలి, మాట్లాడాలి. శారీరక దృఢత్వాన్ని కలిగి ఉండేలా ఆటలు ఆడాలి. వ్యాయామాలు చేయాలి. సోమరితనం పెరుగుతోంది ‘టెక్నాలజీ’ అవసరం కోసమే. కానీ బానిసలవుతున్నాం. దీంతో వెన్ను, మెడ నొప్పితో పాటు ‘నిద్ర’ టైంటేబుల్ మారిపోయింది. గతంలో 9 నుంచి 10 గంటల వరకు నిద్రపోయేవాళ్లు. ఇప్పుడు ఫోన్, ఓటీటీల్లో సినిమాలు చూస్తూ అర్ధరాత్రి వరకూ మేల్కొని ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తున్నారు. దీంతో శరీరంలో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్ అవుతోంది. సోమరితనం ఎక్కువగా వస్తోంది. జ్ఞాపకశక్తిని కోల్పోయి మొద డు మొద్దుబారుతోంది. ఫోన్ నంబర్లతో పాటు కొత్తగా పరిచయమయ్యేవారి పేర్లను కూడా గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. పిల్లలు ఆహారం తినాలన్నా ఫోన్లు, టీవీలు చూపించే పరిస్థితి. ప్రస్తుతం ‘డిప్రెషన్ ట్రెండ్’ నడుస్తోంది. చాలామందికి వారు డిప్రెషన్లో ఉన్న సంగతే తెలీడం లేదు. – డాక్టర్ కె. హేమంత్‌కుమార్‌రెడ్డి, న్యూరోఫిజీషియన్ జాగ్రత్త లేకపోతే భవిష్యత్తు ఛిన్నాభిన్నమే టెక్నాలజీ అతి వినియోగంతో ఎక్కువ మానసిక సమస్యలు వస్తున్నాయి. 15–25 ఏళ్ల వయస్సున్న వారికి లెర్నింగ్ ఎబిలిటీ ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి. చదవడం, నేర్చుకోవడంతో నాలెడ్ట్ వస్తుంది. ఇప్పటి పిల్లలు వినోదానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో చదువులో క్వాలిటీ ఉండటం లేదు. సొసైటీపై కూడా బాధ్యత ఉండటం లేదు. ఉద్యోగాలు సాధించలేని పరిస్థితుల్లో డిప్రెషన్లోకి వెళ్లి ఆల్కాహాల్, సిగరెట్లు, డ్రగ్స్‌కు బానిసయ్యే ప్రమాదం ఉంది. చెడు, మంచి రెండూ నేర్చుకునే అవకాశాలు ప్రస్తుత సొసైటీలో ఉన్నాయి. పిల్లల పెంపకంపై తల్లిదండ్రులు మరింత జాగ్రత్తతో ఉండాలి. గారాబాలతో ఏమాత్రం అలసత్వం చేసినా భవిష్యత్‌ను ఛిన్నాభిన్నం చేసినట్లే. డాక్టర్ ఇక్రముల్లా, సైక్రియాట్రిస్ట్, కర్నూలు. -
మీకు చేరాల్సిన లేఖ దశాబ్ద కాలం లేటు!
మీకు రావాల్సిన పాస్‌పోర్టు కోసం ఎదురుచూస్తున్నారా? మీకు రావాల్సిన బ్యాంకు పాస్‌పుస్తకం ఏదైనా మిస్సయ్యిందా? లేదా మీరెదురుచూస్తోన్న ఏటీఎం కార్డు మీకింకా చేరలేదా? మీ స్నేహితుడి సమాధానం కోసం వేచిఉన్నారా? ఏం ఫరవాలేదు. కాస్త ఆలస్యంగా అయినా మీకు చేరుతుంది. కాకపోతే ఓ దశాబ్ద కాలం లేటవుతుందంతే. కాకపోతే మీకు రావాల్సిన కాల్‌లెటర్ కూడా ఓ దశాబ్దకాలం లేటవుతుందంతే! ఒరిస్సాలోని ఒధాంగా గ్రామంలో జగన్నాథ్ పూహాన్ అనే ఓ పోస్ట్‌మాన్ ఇలాగే సర్దిచెప్పుకొని తను ఇవ్వాల్సిన ఉత్తరాలన్నింటినీ పోస్టాఫీసులోనే పోగేసాడు. ఉత్తరాలూ, ఏటీఎం కార్డులూ, పాస్‌పోర్టులూ, రకరకాల పోస్టల్ ప్యాకెట్లూ ఇలా ఒకటేమిటి మొత్తం 6000 ఉత్తరాలను పంచకుండా తన ఆఫీసులోనే ఉంచేసుకున్నాడు. పంచకుండా పేరుకుపోయిన పాత తపాలా భాండాగారం పోస్ట్‌ఆఫీసు కార్యాలయం మార్పుతో బట్టబయలైంది. ఒరిస్సాలోని సదురు పోస్టాఫీసుని వేరే బిల్డింగ్‌లోకి మార్చడంతో అక్కడ కుప్పలుకుప్పలుగా పేరుకుపోయిన విలువైన సమాచారాన్నందించే ఉత్తరాలతో స్థానికుల పిల్లలు ఆటలు ఆడుకోవడాన్ని పెద్దలు గమనించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అసలేంజరిగిందని ఆరాతీస్తే ఆ ప్రాంతంలోని సదరు పోస్ట్‌మాన్ గత దశాబ్దకాలంగా ఉత్తరాలను బట్వాడా చేయడం లేదని తేలిపోయింది? అయితే ట్రాకింగ్‌కి అవకాశమున్న స్పీడ్ పోస్టలూ, రిజిస్టర్ పోస్ట్ ఉత్తరాలను మాత్రం సమయానికి అందించేసి, మిగిలిన వాటిని ఓ మూలన పడేసేవాడు అసిస్టెంట్ పోస్ట్‌మాస్టర్ అయిన జగన్నాథ్ పూహాన్. ఇదే విషయమై పోస్ట్మాన్ని నిలదీస్తే తన దీనావస్థని చెప్పుకొచ్చాడు. ఆ ప్రాంతమంతటికీ తానొక్కడ్నే పోస్ట్మాన్ననీ, జీవితకాలమంతా ఇల్లిల్లూ తిరిగి ఉత్తరాలు పంచే తనకు గత పదేళ్ళుగా కాళ్ళు పనిచేయడం లేదనీ తన దీనావస్థని చెప్పుకొచ్చాడు. అయినా చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పలేదు, చివరకు సస్పెండ్ అయ్యాడు. పాపం దశాబ్దకాలం తర్వాత కూడా ఆ ఉత్తరాలను పోస్టల్ శాఖ పంచేకార్యక్రమం ఏర్పాటు చేసింది. పాడై చిరిగిపోయినవి పోగా, శిథిలావస్థలో ఉన్నవి తీసేసి మిగిలిన వాటిల్లో దాదాపు 1500 ఉత్తరాలను పంపిణీచేసింది. అందులో 2011లో ఇండియన్ నావీ స్థానిక యువకుడికి పంపిన ఎంప్లాయ్మెంట్ లెటర్ కూడా ఉంది. స్థానికులెవ్వరూ కూడా తమకు రావాల్సిన ఉత్తరాలు ఎందుకు రావడం లేదని ఆరా తీయకపోవడమేంటా అని పోస్టల్ డిపార్ట్మెంట్ జుట్టుపీక్కుంటోంది. -
మనం బద్ధకిష్టులమండోయ్!
ఏరా నీకేం ఇష్టం అంటే.. బద్ధకిష్టం.. అన్నాడట ఓ మహా లేజీ ఫెలో.. ఇలాంటోళ్ల సంఖ్య మన దగ్గర కాసింత ఎక్కువేనట. అడుగు తీసి అడుగు వేయమంటే.. కాలు అరిగిపోతుందని చూసేవారి సంఖ్యా అలాగే ఉందట.. ఇటీవల స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో మనవాళ్ల ‘లేజీనెస్’ బయటపడింది. రోజువారీ జీవితంలో ఒళ్లు వంచి శారీరకశ్రమ చేసే విషయంలో, ఉత్సాహంగా రెండు అడుగులు ముందుకేసి చురుకుదనాన్ని నింపుకోవాల్సిన చోట మనవాళ్లు బద్ధకంతో గడుపుతున్నారట. నడిచి వెళ్లేందుకు అవకాశమున్నపుడు కూడా ఏ వాహనం అందుబాటులో ఉంటే దానిపై కడుపులోని చల్ల కదలకుండా వెళ్లిపోతున్నారట. ప్రపంచవ్యాప్తంగా 46 దేశాల ప్రజల రోజువారి నడక అలవాటు, శారీరకశ్రమపై చేసిన అధ్యయనంలో ఇండియా 39వ స్థానంలో నిలవగా, హాంగ్‌కాంగ్ ప్రథమ స్థానంలో నిలిచింది.. భారతీయులు రోజుకు సగటున కేవలం 4,297 అడుగులు వేస్తున్నట్లు తేలింది. అందులోనూ మగవారు 4,606 అడుగులు, మహిళలు 3,684 అడుగులు మాత్రమే వేస్తున్నారు. సరైన శారీరకశ్రమ, వ్యాయామం లేని కారణంగా ఆడవారిలో ఊబకాయం పెరిగే అవకాశం 232 శాతం, పురుషుల్లో 67 శాతంగా ఉంటోందని స్పష్టమైంది. శారీరకంగా ఆరోగ్యవంతంగా ఉండేందుకు రోజుకు కనీసం వెయ్యి అడుగులైనా వేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం పూట గంటపాటు వాకింగ్ చేసి వ్యాయామం అయిపోయిందనుకోవడం సరికాదని, రోజంతా శారీరక శ్రమ ఉండాల్సిందేనని చెబుతున్నారు. అయితే మనకంటే అత్యంత బద్ధకస్త దేశంగా ఇండోనేషియా నిలుస్తోంది. వారు రోజుకు 3,513 అడుగులేస్తూ బద్ధకిష్టులకే ట్రేడ్‌మార్క్‌గా అథమస్థానాన్ని (46వ ప్లేస్) సాధించారు. మలేషియా, సౌదీ ఆరేబియా ప్రజలు 3,900 అడుగుల నడకతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇక ప్రపంచ సగటు విషయానికొస్తే మాత్రం రోజుకు 4,961 అడుగులుగా ఉండగా, అమెరికన్లు సైతం 4,774 అడుగులతో సగటు కంటె వెనుకబడే ఉన్నారు. మొత్తం 46 దేశాల్లోని 7 లక్షల మంది నడకపై ఈ పరిశోధనను నిర్వహించారు. ప్రస్తుతం స్మార్ట్ఫోన్లు, ఫిట్బిట్లుæ ఇతర సాధనాల ద్వారా రోజూ తామెంత శారీరకశ్రమ చేస్తున్నారో, ఎన్ని అడుగులు వేస్తున్నారో అంచనా వేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సమాచారం ఆధారంగానే ఈ అధ్యయనం చేశారు.. హాంగ్‌కాంగ్ ప్రజలు రోజుకు 6,880 అడుగులతో అగ్రస్థానంలో నిలవగా. చైనా, ఉక్రెయిన్, జపాన్‌లకు చెందిన వారు సగటున 6 వేలకు పైగానే అడుగులు వేస్తున్నట్లు వెల్లడైంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మరి.. మరి... సోమరి
సోల్ / బద్ధకం ‘బద్ధకము సంజ నిద్దుర... వద్దుసుమీ దద్దిరంబు వచ్చును దానన్...’ అంటూ శతకకారుడు ఏనాడో హితవు పలికాడు గానీ బద్ధకస్తులు ఇలాంటి వాటిని పట్టించుకుంటారా? లోకం తలకిందులైపోయినా వారి రూటే సెపరేటు. పనికీ బద్ధకస్తులకూ చుక్కెదురు. ఖాళీగా కూర్చొనే బదులు పనేదైనా చేసుకోవచ్చు కదా అని పొరపాటున ఏ బద్ధకస్తుడినైనా అడిగారనుకోండి... ‘కూర్చోవడం మాత్రం పని కాదేంటి?’ అని ఠపీమని ఎదురు ప్రశ్నించి నోరు మూయించగలరు.బద్ధకస్తుల్లో అలాంటి తెలివితేటలకు ఏమాత్రం లోటుండదు. ‘కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఏదైనా పనీపాటా చేసుకోవచ్చు కదా’ అని పెద్దలెవరైనా మందలించబోతే... ‘కూర్చుని తింటే కొండలేం కరుగుతాయి గానీ, కూర్చుని తినేవాళ్లు కొండలా పెరుగుతారు... కావాలంటే నన్ను చూడు’ అని తమ భారశరీరాన్నే ఉదాహరణగా చూపి చమత్కరించగలరు. సోమరితనం సహజ లక్షణం బద్ధకస్తులను సోమరులని, సోంబేరులని ఆడిపోసుకుంటారు గానీ, సోమరితనం మనుషుల సహజ లక్షణం. ఎంతటి పనిమంతులకైనా ఎంతో కొంత బద్ధకం ఉండనే ఉంటుంది. అయితే, అది శ్రుతి మించిన వాళ్లనే లోకం బద్ధకస్తులుగా పరిగణిస్తుంది. ఆదిమానవుడి వారసత్వ లక్షణంగా బద్ధకం ఇప్పటికీ మనుషుల్లో కొనసాగుతోందనేది శాస్త్రవేత్తల వాదన. వేట మాత్రమే తెలిసిన ఆదిమానవుడు అప్పటి తన అవసరాల మేరకు శక్తిని ఎడాపెడా వినియోగించుకోకుండా, పదిలపరచుకోవడానికే అలవాటు పడ్డాడు. ఎందుకంటే, ఆకలేసినప్పుడు వేటాడదామంటే జంతువులు దొరుకుతాయనే గ్యారంటీ లేదు. అందువల్ల జంతువు కనిపించినప్పుడే వేటాడటం, కడుపారా తిని, మరో జంతువు కనిపించేలోగా విశ్రాంతి తీసుకోవడం తప్ప వేరే పనేమీ ఉండేది కాదు. పరిణామ క్రమంలో వ్యవసాయం అలవడిన తర్వాత మానవుడి జీవితమే మారిపోయింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి ఆధునిక కాలం వరకు మానవులకు పని అనివార్యంగా మారింది. అయితే, అనివార్యములను శాయశక్తులా నివారించుకోవడంలోనే బద్ధకస్తులు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తారు. ఒళ్లొంచని ధీరులు బద్ధకస్తుల్లోనూ స్థాయీ భేదాలు ఉంటాయి. కొందరు సాదాసీదా బద్ధకస్తులు. మరీ తప్పనిసరైతే నెమ్మదిగా, అయిష్టంగా ఏదోలా పని చేసేందుకు సిద్ధపడతారు. ఇంకొందరు ఉంటారు... అరివీర భయంకర పరమ బద్ధకస్తులు. కొంపలు అంటుకుంటున్నా సరే... ససేమిరా పని చేయరు. ఇలాంటి బాపతు మనుషులు గనుక ఇంట్లో ఉంటేనా... ఆస్తులు కరిగిపోయి ఆరిపోవడం ఖాయం. పనెందుకు చేయవని ప్రశ్నిస్తే, పని గండం ఉందంటూ తప్పించుకునే బాపతు వీరు. కర్మకాలి ఇలాంటి వాళ్లు ఉద్యోగాల్లో చేరితేనా..? వాళ్లు పనిచేసే ఆఫీసుల్లో పరిస్థితులు అతలాకుతలం కావడానికి ఎంతో కాలం పట్టదు. బద్ధకస్తులైన ఉద్యోగులు పొరపాటుగానైనా పని చేయరు. పని ఎగ్గొట్టడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త సాకులు చెబుతుంటారు. బద్ధకస్తులందరూ దాదాపు సాటిలేని ‘సాకు’వీరులే! తప్పనిసరిగా పని చేయాల్సి వస్తే, అందుబాటులోని అమాయక జీవిని ఎవరినైనా ఎంచుకుని, ఆ బకరాపైకి పని నెట్టేసి, ఖుషీగా కాలక్షేపం చేసేస్తారు. ఇలాంటి శాల్తీలు ఎక్కువగా ప్రభుత్వ కార్యాలయాల్లోనే కనిపిస్తారు. కూసే గాడిద మేసే గాడిదను చెడగొట్టినట్లుగా... కాస్తో కూస్తో పనిచేసే వాళ్లనూ వీళ్లు చెడగొడతారు. తెలివైన వాళ్లే... కాకపోతే... బద్ధకస్తులు చాలా తెలివైన వాళ్లు. సోంబేరులంటూ ‘పని’మంతులందరూ వీళ్లను ఈసడిస్తారు గానీ, చాలామంది పనిమంతుల కంటే బద్ధకస్తులకు తెలివితేటలు ఎక్కువ. కాకపోతే, అవన్నీ పనిని ఎగ్గొట్టేందుకు మాత్రమే పనికొచ్చే చావు తెలివితేటలు. చాలా కష్టమైన పనికి సులువైన మార్గాన్ని కనిపెట్టాలంటే అలాంటి పనిని బద్ధకస్తుడెవరికైనా అప్పగిస్తే చాలని నిపుణులు చెబుతారు. కష్టమైన పనిని ‘పని’మంతులకు అప్పగిస్తే, వాళ్లు పాపం నానా ప్రయాసపడి ఆ పనిని పూర్తి చేస్తారు. అదే బద్ధకస్తులకు అప్పగిస్తేనా..? అతి తక్కువ శ్రమతో ఆ పనిని పూర్తిచేసే మార్గాన్ని అన్వేషిస్తారు. మన సమాజంలోని దృష్టి లోపమే తప్ప, బద్ధకస్తుల్లో ఏ లోపమూ లేదనేది వారిని సమర్థించే కొందరి వాదన. సక్రమంగా ఉపయోగించుకుంటే, బద్ధకస్తుల వల్ల సమాజానికి చాలా మేలు జరుగుతుందని, శ్రమ దమాదులతో కూడుకున్న పనులను తేలికగా చేసే మార్గాలన్నీ అలాంటి వాళ్ల చలవ వల్లనే అందుబాటులోకి వస్తాయని చెబుతారు. గెలుపు భయం వల్లనే... బద్ధకం జన్యులక్షణమని జన్యుశాస్త్ర నిపుణులు చెబుతుంటే, మానసిక శాస్త్రవేత్తలు మాత్రం బద్ధకానికి సవాలక్ష కారణాలను చెబుతున్నారు. ఆత్మగౌరవం లేకపోవడం, పిరికితనం, నిరాశ వంటి కారణాల వల్ల చాలామంది బద్ధకస్తులుగా మారుతారట. ముఖ్యంగా గెలుపు పట్ల ఉండే భయం వల్ల చాలామంది బద్ధకస్తులుగా మిగిలిపోతారట. ఒకవేళ పనిచేస్తే, పొరపాటున అది విజయవంతమవుతుందేమో! చేసిన పని విజయవంతమైతే అందరూ పొగుడుతారేమో! అలాంటి పొగడ్తలను భరించడం ఇబ్బందిగా ఉండదూ! అందుకే పని చేయకుండా ఉంటేనే మేలు అని డిసైడైపోతారట ఇలాంటి వాళ్లంతా. వీళ్లకు పని చేతకాకపోవడం అంటూ ఉండదని, పని చేతనైనా, పని చేస్తే వచ్చే పర్యవసానాల గురించిన ఆందోళన వల్లనే కొందరు బద్ధకస్తుల్లా తయారవుతారని, ఈ మానసిక పరిస్థితిని చక్కదిద్దకుంటే, వాళ్లు శాశ్వతంగా సోమరి జీవితాన్ని గడిపేస్తారని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బద్ధకస్తులను గుర్తించడం తేలికే గానీ, వారు ఎందుకలా తయారయ్యారో తెలుసుకోవాలంటే మాత్రం మానసిక విశ్లేషణ చేయక తప్పదు. -
ప్రైవేటు వైద్యశాల ఎదుట ఆందోళన
- చికిత్స పొందుతూ - నాలుగు నెలల పాప మృతి - సిబ్బంది నిర్లక్ష్యం అంటూ - బంధువుల ఆరోపణ ఇల్లెందు : సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తమ పసిబిడ్డ చనిపోరుుందని ఆరోపిస్తూ శనివారం ఇల్లెందు పట్టణంలోని ఓ ప్రైవేట్ వైద్యశాల ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి...పట్టణంలోని 14 నంబర్ బస్తీకి చెందిన రతన్, భారతిల నాలుగు నెలల కూతురు జ్వరంతో బాధపడుతుండడంతో మూడు రోజుల క్రితం స్థానిక ప్రైవేట్ వైద్యశాలకు తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యుడు చిన్నారికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపి మందులిచ్చి ఇంటికి పంపించాడు. మరుసటి రోజు చిన్నారికి జ్వరం తీవ్రతరం కావడంతో తల్లిదండ్రులు మళ్లీ వైద్యశాలకు వచ్చారు. వైద్యుడు లేకపోవడంతో సిబ్బంది ప్రాథమిక వైద్యం చేసి ఇంటికి పంపించారు. రెండు రోజులుగా డాక్టర్ లేకపోవడంతో సిబ్బందే వైద్యం చేయాల్సి వచ్చింది. శనివారం ఉదయం చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో తాము ఏమి చేయలేము ఖమ్మం ఆస్పత్రికి తీసుకువెళ్లాల్సిందిగా వైద్యశాల సిబ్బంది తెలిపారు. చిన్నారిని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లే క్రమంలోనే మార్గ మధ్యలో మృతి చెందింది. ప్రైవేట్ వైద్యశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ పాప చనిపోయిందంటూ కుటుంబ సభ్యులు, బంధువులు వైద్యశాల ఎదుట బైఠాయించారు. విషయం తెలుసుకున్న పలువురు రాజకీయ నేతలు ఘటనా స్థలికి వచ్చి చిన్నారి తల్లిదండ్రులకు మంద్దతుగా నిలిచారు. సమాచారం తెలిసిన పోలీసులు వైద్యశాలకు వెళ్లి పరిస్థితిని అదుపులోనికి తెచ్చారు. బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని వైద్యుడు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
అలసత్వాన్ని సహించం
కర్నూలు అగ్రికల్చర్: విధి నిర్వహణలో అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని కలెక్టర్ విజయమోహన్ హెచ్చరించారు. శనివారం తన కాన్ఫరెన్స్ హాల్లో టీబీ నియంత్రణ, సర్వేపై సమీక్ష నిర్వహించారు. గోనెగండ్ల, కోవెలకుంట్ల సీనియర్ టీబీ ట్రీట్మెంట్ సూపర్వైజర్ల పనితీరు సరిగా లేనందున ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. టీబీ వ్యాధిని సమూలంగా నిర్మూలించాల్సి ఉందని, ఇందుకు అనుగుణంగా ప్రతీ ఒక్కరు జవాబుదారీతనంతో పని చేయాలని సూచించారు. గ్రామం వారీగా టీబీ రోగులను గుర్తించేందుకు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు సర్వే చేయాలని పేర్కొన్నారు. అనుమానిత కేసులను గుర్తించి గళ్ల పరీక్షలు, అవసరమైతే ఎక్స్‌రేలు తీయించి వ్యాధిని గుర్తించాలన్నారు. వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయితే వెంటనే చికిత్స ప్రారంభించాలన్నారు. ఇక నుంచి టీబీ నియంత్రణపై ప్రతినెలా సమీక్ష నిర్వహిస్తానని, పూర్తి వివరాలతో రావాలని తెలిపారు. జిల్లాలో 540 సబ్ సెంటర్లు ఉండగా, నవంబర్, డిసెంబర్ నెలలో 74 సబ్ సెంటర్లలోనే సర్వే జరిగిందని, అన్ని సబ్ సెంటర్ల పరిధిలో గ్రామాల వారీగా సర్వే చేయాలన్నారు. కర్నూలు పెద్దాసుపత్రికి వచ్చిన టీబీ కేసులను సంబంధిత క్లస్టర్లకు రెఫర్ చేస్తుంటారని, వారికి కూడా ఎటువంటి జాప్యం లేకుండా వైద్య సేవలు అందించాలన్నారు. జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ మోక్షేశ్వరుడు మాట్లాడుతూ.. నవంబర్ నెలలో 700, డిసెంబర్ నెలలో 949 టీబీ కేసులను గుర్తించి చికిత్స చేపట్టినట్లు వివరించారు. సమీక్షలో అన్ని క్లస్టర్ల ఎస్పీహెచ్ఓలు, ఎస్టీసీలు పాల్గొన్నారు.