ఆరోగ్యమే మహాభాగ్యమంటాం. ఆరోగ్యంగా ఉండేందుకు కనీసపాటి శ్రమైనా చేస్తున్నామా? శారీరక శ్రమ, క్రమం తప్పని కదలికల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిసినా, భారతీయులు బద్ధకపు జీవనశైలినే అనుసరిస్తున్నారట. క్రియాశీలక జీవనవిధానానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కొన్ని మార్గదర్శకాలు పేర్కొంది.
కానీ, మన దేశం నుంచి 20 కోట్ల మంది (15.5 కోట్ల మంది వయోజనులు, 4.5 కోట్ల మంది కౌమార వయస్కులు) వాటిని పాటించడంలో విఫలమవుతున్నారు. డాల్‌బెర్గ్ వారి ‘స్టేట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ’ (సాపా) నివేదిక తాజాగా ఈ సంగతి వెల్లడించింది. ఈ నివేదిక ఆందోళన కలిగించడమే కాక, ఆటలు, వ్యాయామం విషయంలో భారతీయులు శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.
నిజానికి, ఇలాంటి జాతీయ స్థాయి సర్వే జరగడం ఇదే తొలిసారి. మేధావుల బృందమైన ‘డాల్ బెర్గ్ అడ్వైజర్స్’, స్వచ్ఛంద సంస్థ ‘స్పోర్ట్స్ అండ్ సొసైటీ యాక్సలరేటర్’ సంయుక్తంగా జరిపిన ఈ అధ్యయనం అనేక ఆందోళనకరమైన ధోరణులను వెల్లడించింది. మన దేశంలో వయోజనుల్లోని కాస్తంత పెద్దవారిలో 48 శాతం మంది ఆటల లాంటి శారీరక శ్రమ చేసేందుకు తమ వయసు మీద పడింది అనేస్తున్నారట.
ఇంకా చిత్రం ఆటలు ఆడపిల్లలకు సురక్షితం కాదన్న అభిప్రాయంలో 45 శాతం మంది ఉన్నారట. అలాగే, శారీరక శ్రమ చేయడం ఋతుస్రావ మహిళలకు నష్టదాయకమనీ, ఒంటికి దెబ్బలు తగిలితే వివాహ అవకాశాలు దెబ్బ తింటాయనీ, భౌతిక శ్రమ వల్ల పెళ్ళయిన అమ్మాయిలకు గర్భస్రావం అవుతుందనీ... ఇలా రకరకాల దురభిప్రాయాలు నెలకొన్నాయి.
గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో... అలాగే పురుషులతో పోలిస్తే మహిళల్లో శారీరక శ్రమ బాగా తక్కువవడం గమనార్హం. దీనికి కారణాలు లేకపోలేదు. శారీరక శ్రమ చేసేందుకు అనుకూలంగా ఉద్యానాలు, మైదానాల లాంటి బహిరంగ ప్రదేశాలు పట్టణాల్లో కరవై పోయాయి.
అందువల్ల గ్రామాలతో పోల్చి చూసినప్పుడు పట్టణాల్లో శారీరక శ్రమ రాహిత్యం రెట్టింపు ఉంటోంది. నగర జనాభా మరీ అతి సున్నితంగా తయారైంది. ఇక, మన భారతీయ మహిళల్లో... నూటికి 75 మందికి రకరకాల ఇంటిపనుల్లోనే సమయమంతా గడిచిపోతుంది.
ఫలితంగా వారికి వ్యాయామం చేసేందుకు తీరిక దొరకని పరిస్థితి. ఈ కారణాలన్నీ కలిసి కొంప ముంచుతున్నాయి. జీవనశైలి వ్యాధులకు దారి తీస్తున్నాయి. చాలామంది రోజూ నడుస్తున్నామంటారు. నడక వల్ల ప్రయోజనాలు ఉన్నాయి కానీ, ఆరోగ్యవంతమైన శరీరానికి అదొక్కటే సరిపోదని నిపుణుల ఉవాచ.
తాజా సర్వే ఒక్కటే కాదు... ప్రతిష్ఠాత్మక ‘లాన్సెట్’ పత్రికలో ఇటీవలే ప్రచురితమైన మరో అధ్యయనం సైతం భారతీయ వయోజనుల్లో నూటికి 50 మంది శారీరకంగా తగినంత శ్రమ చేయట్లేదని పేర్కొంది. అంతంత మాత్రపు శారీరక శ్రమతోనే వయోజనులు సరిపెట్టుకొంటున్న ధోరణి ఉన్నతాదాయాలుండే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రధానంగా కనిపిస్తోంది. ఆ తరువాత రెండోస్థానంలో దక్షిణాసియా ప్రాంతం నిలిచింది.
ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సహా పలువురు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం చెబుతున్న మాట. ఆందోళనకరమైన అంశం ఏమిటంటే... మన దేశంలోని వయోజనుల (కనీసం 18 ఏళ్ళు, ఆపైన ఉన్నవారి)లో పెద్దగా శారీరక శ్రమ చేయని సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
2000 నాటికి అలాంటివారు 22 శాతం పైచిలుకు ఉంటే, 2010 నాటికి వారు 34 శాతం దాకా పెరిగారు. 2022 నాటికి 50 శాతం దాకా చేరారు. ఇలాగే కొనసాగితే... 2030 నాటికల్లా ఇలాంటివాళ్ళు ఏకంగా 60 శాతానికి చేరతారని అంచనా. ఇది శారీరక, మానసిక ఆరోగ్యపరంగానే కాదు... సామాజికంగానూ ప్రమాదఘంటికే!
రోజూ బద్ధకంగా, శారీరక శ్రమ లేకుండా గడిపేస్తుంటే... మధుమేహం, గుండెజబ్బు వచ్చే ముప్పుంది. నిజానికి, ఎంతసేపూ కదలకుండా కూర్చొనే జీవనశైలి, శారీరక శ్రమ అంతకంతకూ తగ్గిపోవడం వల్ల ప్రపంచమంతటా ఈ జబ్బుల బారినపడుతున్నవారు పెరుగుతున్నారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై భారం పడుతోందని డబ్ల్యూహెచ్‌ఓ మాట.
అంతేకాదు... ఈ బద్ధకపు జీవన విధానం వల్ల మన దేశంలో దాదాపు 25.4 కోట్లమందికి పైగా స్థూలకాయంతో, 18.5 కోట్ల మంది దాకా ‘చెడు కొలెస్ట్రాల్’తో బాధపడుతున్నట్టు వెల్లడైంది. ఆరోగ్యానికే కాదు... దేశ ఆర్థిక బలిమికీ శారీరకంగా చురుకుదనం అత్యంత కీలకం.
మన దేశ జనాభా మొత్తం శ్రమకు నడుంబిగిస్తే, 2047 నాటికి దేశ స్థూల జాతీయోత్పత్తి రూ. 15 ట్రిలియన్లు దాటిపోతుందని అంచనా. స్థూలకాయం, లాంటి జబ్బులు తగ్గడమే కాదు, వాటి కోసం ఖర్చు చేస్తున్న రూ. 30 ట్రిలియన్లు ఆదా అవుతాయి.
లెక్కతీస్తే, ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మంది తగిన శారీరక శ్రమ చేయక చెరుపు చేస్తున్నారు, చేసుకుంటున్నారు. ఇక, డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాల్ని బట్టి చూసినా శారీరక శ్రమరాహిత్యం అత్యధికంగా ఉన్న 195 దేశాల్లో భారత్ 12వ స్థానంలో నిలిచిందని ‘లాన్సెట్’ అధ్యయనం.
రోజువారీ వ్యాయామంతో సమయం వృథా అనీ, ర్యాంకుల చదువులతోనే జీవితంలో పైకి వస్తామనీ, ఆటలు అందుకు ఆటంకమనీ భావించే తల్లితండ్రుల ఆలోచనా ధోరణి ఇకనైనా మారాల్సి ఉంది. మనమైనా, మన దేశమైనా పైకి రావాలంటే... మనుషుల శారీరక, మానసిక ఆరోగ్యమే కీలకం.
ప్రభుత్వాలు అది గుర్తించి ఆటలతో మేళవించిన విద్యా ప్రణాళికను తప్పనిసరి చేయాలి. పౌరుల కోసం వ్యాయామ కేంద్రాల వసతులూ పెంచాలి. ఎందుకంటే, జీవన సౌంద ర్యమే కాదు... జగమంతటినీ లక్ష్మీనివాసంగా మార్చే మహత్తూ శ్రమశక్తిదే మరి!
ఈ బద్ధకం వదిలేద్దాం!
Published Fri, Sep 13 2024 12:48 AM | Last Updated on Fri, Sep 13 2024 12:48 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment