WHO
-
క్షయ నిర్మూలన ఓ అత్యవసరం!
క్షయ (టీబీ) వ్యాధిని పూర్తిగా నిర్మూలించే వ్యూహంలో భాగంగా డిసెంబర్ 7న మరో పరివర్తనాత్మక కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఈ వ్యాధిపై పోరాటాన్ని వేగవంతం చేసేందుకు, వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న 347 జిల్లాలను కలుపుకొని ప్రభుత్వం జాతీయ స్థాయిలో 100 రోజుల విస్తృత ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. టీబీ నిర్మూలనలో మన దేశం రోగ నిర్ధారణ వ్యవస్థలను విస్తరించేందుకు, రోగులు పూర్తిగా కోలుకునేందుకు తోడ్పడటానికి పోషకాహార సహాయ పథకం ‘ని–క్షయ పోషణ యోజన’ (ఎన్‌పీవై)ని అమలుచేస్తోంది. ఔషధాలకు లొంగని వేరియంట్ సోకిన రోగులకు చికిత్సలో ఎదురయ్యే సవాళ్లను పరిగణించి, స్వల్పకాలిక చికిత్సా విధానమైన బీపీఏఎల్ఎంకూ అనుమతి ఇవ్వడం విశేషం.దేశం నుంచి క్షయ (టీబీ)ని పారదోలాలని గౌరవ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపు నిచ్చారు. ఆయన నాయకత్వంలో టీబీని నిర్మూలించేందుకు వ్యాధి నివారణ, నిర్ధారణ, చికిత్సల్లో మార్పు తీసుకువచ్చేందుకు గత కొన్నేళ్లుగా వినూత్న విధానాలను భారత్ అవలంబిస్తోంది. డబ్ల్యూహెచ్‌వో విడుదల చేసిన ‘ప్రపంచ టీబీ నివేదిక – 2024’లో ఇప్పటి వరకు దేశంలో అవలంబిస్తున్న విధానాలను ప్రస్తావించింది. దేశంలో 2015 నుంచి 2023 వరకు 17.7 శాతం మేర టీబీ వ్యాప్తి తగ్గింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే వ్యాధి క్షీణత రేటు విషయంలో ఇది రెట్టింపు. అలాగే దేశ వ్యాప్తంగా 25.1 లక్షల మంది టీబీ రోగులను గుర్తించారు. ఫలితంగా ఈ వ్యాధికి చికిత్స తీసుకునేవారి శాతం 2015లో ఉన్న 59 నుంచి 2023 నాటికి 85 గణనీయంగా పెరిగింది. ప్రధానమంత్రి దార్శనిక స్ఫూర్తితో టీబీని పూర్తిగా నిర్మూలించే వ్యూహంలో భాగంగా డిసెంబర్ 7న మరో పరివర్తనాత్మక కార్యక్రమం భారత్‌లో ప్రారంభమైంది. క్షయపై పోరాటాన్ని వేగవంతం చేసేందుకు, ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న 347 జిల్లాలను కలుపుకొని ప్రభుత్వం జాతీయ స్థాయిలో 100 రోజుల విస్తృత ప్రచార కార్య క్రమాన్ని పంచకుల నుంచి ప్రారంభించింది. వ్యాధి తొలిదశలో ఉండగానే క్షయ రోగులందరినీ గుర్తించి వారికి సకాలంలో అవస రమైన, నాణ్యమైన చికిత్సను అందించాలనే మా సంకల్పాన్ని ఈ కార్యక్రమం మరింత బలోపేతం చేస్తుంది. ‘జన్ భగీదారి’ స్ఫూర్తితో మనమంతా– ప్రజాప్రతినిధులు, ఆరోగ్య నిపుణులు, పౌరసమాజం, కార్పొరేట్ సంస్థలు, సంఘాల–సంయుక్తంగా ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా కృషి చేద్దాం.భారత్ నుంచి టీబీని తరిమేసే ప్రయాణంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అందిస్తున్న చురుకైన భాగస్వామ్యం... ఈ కార్యక్రమం మరో మైలురాయిగా నిలుస్తుందనే భరోసాను ఇచ్చింది. టీబీ నిర్మూలనలో మన దేశ సామాజిక విధానం రోగ నిర్ధారణ వ్యవస్థలను విస్తరించేందుకు, టీబీ రోగులు పూర్తిగా కోలుకొనేందుకు తోడ్పడటానికి పోషకాహార సహాయ పథకం... ‘ని–క్షయ పోషణ యోజన’ (ఎన్‌పీవై)ని భారత్ అమలుచేస్తోంది. ఏప్రిల్ 2018 నుంచి 1.16 కోట్ల మంది లబ్ధి దారులకు ఎన్‌పీవై పథకం ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో రూ. 3,295 కోట్లు అందించారు. ఈ పథకం ద్వారా నెలవారీగా అందించే ఆర్థిక సాయం గత నవంబర్ నుంచి రూ. 500 నుంచి రూ. 1000కి పెంచడం క్షయ నిర్మూలనలో భారత్ నిబద్ధతను సూచించే మరో అంశం.మరో కీలక అంశం... పోషకాహర సమస్యను పరిష్కరించడంతో పాటు సమాజ భాగస్వామ్యం పెరిగేలా ‘టీబీ ముక్త భారత్ అభియాన్’ తోడ్పడింది. అలాగే సమాజంలో వివిధ వర్గాలను ఏకం చేసి అవగాహన పెంచడానికి, టీబీ రోగులకు పోషకాహారం, వృత్తిపరంగా, మానసికంగా సాయం అందించే దిశగా సామూహిక ఉద్య మాన్ని సృష్టించింది. జన్ భగీదారి స్ఫూర్తితో ప్రభుత్వ – పౌర భాగ స్వామ్యంతో చేపట్టిన ఈ ఉద్యమం 1.75 లక్షల మంది ని–క్షయ మిత్రల ద్వారా దేశవ్యాప్తంగా 21 లక్షల ఆహార కిట్లను సరఫరా చేసేందుకు స్ఫూర్తినిచ్చింది.టీబీని రూపుమాపడానికి వినూత్న విధానంఅనేక సంవత్సరాలుగా చికిత్స సఫలతా రేటును పెంపొందించేందుకు బెడాక్విలైన్, డెలామనిడ్ వంటి సరికొత్త ఔషధాలను భారత్ ప్రవేశపెట్టింది. ఔషధాలకు లొంగని వేరియంట్ సోకిన రోగులకు చికిత్సలో ఎదురయ్యే సవాళ్లను పరిగణించి స్వల్ప కాలిక చికిత్సా విధానమైన బీపీఏఎల్ఎంకు అనుమతి నిచ్చాం. ఇప్పటికే ఉన్న చికిత్సా విధానాలతో పోలిస్తే ఇది మరింత ప్రభావ వంతంగా ఉంటుంది. ప్రస్తుతం మనకు 19 నుంచి 20 నెలల పాటు సాగే సంప్రదాయ చికిత్సా విధానంతో పాటు 9 నుంచి 11 నెలల పాటు సాగే చికిత్సా విధానం కూడా మనకు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ బీపీఏఎల్ఎమ్ విధానంతో రోగులు ఆరు నెలల్లోనే చికిత్సను పూర్తి చేసుకోవచ్చు. క్షేత్ర స్థాయిలో రోగులందరినీ గుర్తించి సత్వరమే చికిత్స అందించడడానికి వీలుగా అందుబాటులో అధునాతన పరికరాలు ఉండేలా నిరంతర కృషి చేస్తున్నాం. దీని కోసమే సమర్థవంతమైన, కచ్చితమైన పరీక్షా పద్ధతులను ప్రవేశపెట్టాం. అవే జీవ పరమాణు పరీక్షలు (మాలిక్యులర్ టెస్ట్స్). 2014 –15లో కొన్ని వందల సంఖ్యలో మాత్రమే ఉన్న వ్యాధి నిర్ధారణ పరికరాల సంఖ్య ప్రస్తుతం 8,293 కు చేరుకున్నాయి. ఈ పరికరాలు అన్ని జిల్లాల్లోనూ అందుబాటులో ఉన్నాయి.‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమ స్ఫూర్తితో స్వదేశీ జీవ పరమాణు పరీక్షలను క్షేత్రస్థాయిలో పరీక్షించి రూపొందించిన పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది. తద్వారా జిల్లా, బ్లాకు స్థాయిల్లో టీబీ నిర్ధారణకు వెచ్చించే సమయాన్ని తగ్గించడంతో పాటు రోగ నిర్ధారణ పరీక్షలు, చికిత్సకు అయ్యే ఖర్చును తగ్గించగలిగాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందిన మన స్వదేశీ మాలిక్యులర్ పరీక్షలను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. ఈ కార్యక్రమాలు టీబీ నిర్మూలనలో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపాయి.2018 నుంచి టీబీ పరిశోధనలపై అధికంగా నిధులు వెచ్చిస్తున్న అగ్ర సంస్థల్లో ఒకటిగా భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) స్థిరంగా నిలవడం మనందరికీ గర్వకారణం. రోగులకు అతి చేరువలోనే సమర్థవంతమైన వ్యాధి నిర్ధారణ సౌకర్యాలతో సహా మరిన్ని నూతన సాధనాలను త్వరిత గతిన అభివృద్ధి చేసేందుకు పెట్టుబడులు కొనసాగిస్తాం. భవిష్యత్తు వైపు దృష్టి సారిస్తూ...వివిధ రంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడం, నిరూపి తమైన సాంకేతికతలను వేగంగా అందుబాటులోకి తీసుకురావడం... టీబీ నిర్మూలనా దిశలో భారత్ నాయకత్వానికి నిదర్శనాలు. అధు నాతన రోగ నిర్ధారణ, చికిత్సలకు దారితీసే మార్గదర్శక పరిశోధనల నుంచి సార్వత్రిక సామాజిక తోడ్పాటును అందించే నియమాలను ప్రవేశ పెట్టేవరకూ... టీబీని పారదోలడంలో మన దేశం ముందంజలో ఉంది. టీబీని గుర్తించడం, నిర్ధారించడం, చికిత్స, నివారణలో సామాన్య ప్రజలను భాగస్వాములను చేయడం ఈ సమయంలో అత్యవసరం. 100 రోజుల పాటు ఉద్ధృతంగా సాగే ప్రచారం టీబీని రూపుమాపడంలో సామూహిక నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది. గౌరవనీయులైన ప్రధానమంత్రి నాయకత్వంలో అందరి భాగస్వా మ్యంతో, మానవాళికి పెద్ద శత్రువుగా ఉన్న టీబీని ఓడించి, ఆరోగ్య కరమైన భవిష్యత్తును కల్పిస్తామని నేను విశ్వసిస్తున్నాను.జగత్ ప్రకాశ్ నడ్డా వ్యాసకర్త కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి -
Disease X: ఆ ప్రాణాంతక మహమ్మారి ఇదేనా?
అంతుచిక్కని వ్యాధి మధ్య ఆఫ్రికా దేశం కాంగోను వణికిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందో ఇప్పటిదాకా ఓ అంచనాకి రాలేకపోయింది. ఇప్పటిదాకా ఈ వ్యాధి బారినపడి 31 మంది చనిపోగా.. అందులో పిల్లలే ఎక్కువమంది ఉండడం ఆందోళనకు గురి చేస్తోంది. ఫ్లూ తరహాలో విజృంభిస్తూ.. శ్వాసకోశ సమస్యలతో మరణాలకు కారణమవుతోందని ఈ వ్యాధిపై వైద్య నిపుణులు ఓ అంచనాకు వచ్చారు.మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టికి ఈ అంతుచిక్కని వ్యాధి విషయం చేరింది. నవంబర్ 29వ తేదీన కాంగో ఆరోగ్య శాఖ.. డబ్ల్యూహెచ్‌వోకి ఈ వ్యాధి గురించి నివేదిక ఇచ్చింది. ఇప్పటికే దర్యాప్తు నడుస్తోంది. దర్యాప్తులో ఆఫ్రికా సీడీసీ(వ్యాధుల నియంత్రణ &నిర్మూలన) కూడా భాగమైంది. అయితే ఇన్నిరోజులు గడిచినా వ్యాప్తికి గల కారణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటిదాకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీంతో ఈ వ్యాధిని డిసీజ్ (Disease X)గా పరిగణిస్తున్నారు.ఏమిటీ డిసీజ్ ఎక్స్కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా మరో మహమ్మారి విజృంభణ ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ గత కొంతకాలంగా అంచనా వేస్తోంది. శరవేగంగా వ్యాపిస్తూ మనుషులకు ప్రాణాంతకంగా(హైరిస్క్ రేటు) మారవచ్చని అభిప్రాయపడుతోంది. ఈ క్రమంలోనే ఆ ముందస్తు మహమ్మారికి ‘డిసీజ్ ఎక్స్’గా నామకరణం చేసింది. ఆపై దానిని ఎబోలా, జికా వైరస్ సరసన జాబితాలో చేర్చింది.అయితే.. డిసీజ్ ఎక్స్‌కు ఏ వైరస్ కారణం కావొచ్చనే దానిపై డబ్ల్యూహెచ్‌వో ఇప్పటిదాకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ, కోవిడ్ తరహాలోనే శ్వాసకోశ సంబంధమైనదే అయ్యి ఉండొచ్చని మాత్రం నిపుణులు అంచనా వేస్తున్నారు.సంబంధిత వార్త: డిసీజ్ ఎక్స్ ప్రభావం కరోనా కంటే ఎన్ని రేట్లంటే..ఆలోపు వ్యాక్సిన్ సిద్ధం!డిసీజ్ ఎక్స్‌పై ఓవైపు ఆందోళనలు నెలకొంటున్న వేళ.. మరోవైపు వ్యాక్సిన్‌ను తయారు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆక్స్‌ఫర్ట్ యూనివర్సిటీ కోవిడ్-19 వ్యాక్సిన్‌లోనే మార్పులు చేస్తోందని తెలుస్తోంది. అలాగే.. భవిష్యత్తులో రాబోయే మహమ్మారి కోసం మరిన్ని వ్యాక్సిన్లను సిద్ధం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.కాంగోలో విజృంభిస్తోంది ఏంటి?మారుమూల కువాంగో(Kwango) నుంచి అంతుచిక్కని వ్యాధి విజృంభణ మొదలైందని ఆ దేశ ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటిదాకా 406 కేసులు నమోదుకాగా.. 31 మంది చనిపోయారు. మృతుల్లో పిల్లలు ఎక్కువగా ఉన్నారు. అయితే పాతికేళ్లలోపు వాళ్లలోనే లక్షణాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. అయితే ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందో అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కాంగో కొత్త వ్యాధి లక్షణాలుజ్వరంతలనొప్పిదగ్గు,జలుబుఒళ్లు నొప్పులుఅయితే.. కాంగోలో అంతుచిక్కని వ్యాధి రికార్డుల్లోని తీవ్రస్థాయిలో కేసులను పరిశీలించిన డబ్ల్యూహెచ్‌వో నిపుణుల బృందం.. పౌష్టికాహార లోపాన్ని గుర్తించినట్లు చెబుతోంది. చనిపోతున్నవాళ్లలో శ్వాసకోశ ఇబ్బందులు, రక్తహీనత సమస్యలను గుర్తించినట్లు వెల్లడించింది. అలాగే వ్యాధి వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల్లో ఆహార కొరత, తక్కువ వ్యాక్సినేషన్ నమోదు, పరీక్షలకు.. వైద్యానికి సరైన వసతులు లేకపోవడం కూడా గుర్తించినట్లు ఓ నివేదిక ఇచ్చింది. అయితే కాంగోలో విజృంభిస్తోందని డిసీజ్ ఎక్స్ యేనా? దాని తీవ్రత ఏంటి? వ్యాప్తి రేటు తదితర అంశాలపై ల్యాబోరేటరీ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని, ఆ తర్వాతనే(అదీ దశలవారీగా) ఈ వ్యాధి విజృంభణకు గల కారణాలపై కచ్చితమైన నిర్దారణకు రాగలమని ఆ బృందం స్పష్టత ఇచ్చింది. -
ఈ మోతాదులో ఉప్పు తీసుకుంటే గుండె, కిడ్నీ వ్యాధులను నివారించొచ్చు..!
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సిఫార్సు చేసిన మోతాదులో ఉప్పు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చని మోడలింగ్ అధ్యయనం పేర్కొంది. ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన మోతాదులో ఉప్పు తీసుకోవడం వల్ల పదేళ్లలో గుండె, మూత్రపిండాలకు సంబంధించిన దీర్ఘకాలికి వ్యాధుల కారణంగా సంభవించే..దాదాపు మూడు లక్షల మరణాలను నివారించొచ్చని పేర్కొంది. అధిక స్థాయి సోడియం అనేది ప్రధాన ఆహార ప్రమాదాల్లో ఒకటి. అధిక ఆదాయ దేశాల్లో సోడియంకి సంబంధించిన ప్యాక్ చేసిన ఆహారాలు ప్రధాన వనరు. ఇక తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో వీటి వినియోగం మరింత ఎక్కువగా ఉండటం బాధకరం. ముఖ్యంగా భారతదేశంలో ఉప్పు తగ్గించి తీసుకునేలా సరైన జాతీయ వ్యూహం లేదని హైదరాబాద్‌లోని ది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ పరిశోధకులు చెబుతున్నారు. ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన ఉప్పు ఒక టీ స్పూన్ లేదా ఐదు గ్రాముల కంటే తక్కువగా ఉంటుందని మోడలింగ్ అధ్యయనం పేర్కొంది. ఈ మోతాదులోనే ప్రతి రోజూ వినియోగించినట్లయైతే దాదాపు 17 లక్షల కార్డియోవాస్కులర్ సంఘటనలు, గుండెపోటులు, స్ట్రోక్‌లతో సహా క్రానిక్ కిడ్న వ్యాధులను నివారించడమే గాక గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందగలమని పరిశోధన వెల్లడించింది. ముఖ్యంగా భారతదేశంలో పూర్తిస్థాయిలో ఇది అమలవ్వాలని పేర్కొంది. ఇక్కడి ప్రజలు ఎక్కువగా ప్యాక్ చేసిన ఆహారాలను ఉపయోగిస్తున్నట్లు పరిశోధన వెల్లడించింది. ఈవిషయమై ఆహార తయారీదారులకు అవగాహన కల్పించడం, పాటించేలా చేయడం అత్యంత ముఖ్యమని తెలిపింది. కాగా, అధిక స్థాయిలో సోడియం తీసుకోవడం తగ్గించేలా ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా 2018 నుంచి అవగాహన కార్యక్రమాలు ప్రారంభించింది. అయితే ప్రస్తుతం మాత్రం ఈట్ రైట్ ఇండియా అనే జాతీయ కార్యక్రమం ద్వారా సోడియంను తగ్గించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుందని పరిశోధకులు తెలిపారు.(చదవండి: వాట్ ఏ రికార్డ్!..గుమ్మడికాయ పడవతో 26 గంటలు..) -
అమోదయోగ్యమైన నడక ఎంత?
అన్ని వయసుల వారికీ వాకింగ్ నిర్ద్వంద్వంగా అందరికీ మేలు చేసే వ్యాయామం. పైగా అది ఎవరైనా చేయగలిగే చాలా తేలికైన ఎక్సర్సైజ్. పైగా దీనికి ఎలాంటి వ్యాయామం ఉపకరణాలూ, పరికరాలూ అక్కర్లేదు. వ్యాయామం చేయగలిగే ఏ వయసు వారైనా అలాగే మహిళలైనా, పురుషులైనా వాకింగ్ చేయాల్సిన సగటు దూరమెంతో, ఎంత నడిస్తే దేహం మీద దాని ప్రభావం పడి, మంచి ఆరోగ్యం సమకూరుతుందో లెక్కలు వేశారు యూఎస్‌కు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వారి సిఫార్సుల ప్రకారం రోజుకు ఎనిమిది కిలోమీటర్లు మంచిదని చెబుతున్నారు. (వాళ్ల లెక్కల ప్రకారం 5 మైళ్లు). ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెబుతున్న ప్రకారం వారానికి 150 నిమిషాల పాటు నడక గానీ లేదా ఏరోబిక్స్గానీ చేయడం మంచిది. నడర అయితే రోజుకు 30 నిమిషాల పాటు బ్రిస్క్ వాక్ చేస్తూ వారంలో కనీసం ఐదు రోజుల పాటైనా ఈ వ్యాయామం చేయాలి. ఇలా చేస్తే రోజులో కనీసం 4 నుంచి 5 కిలోమీటర్లు నడవడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలన్నది డబ్ల్యూహెచ్‌వో లెక్క. ఏ లెక్కలు ఎలా ఉన్నా... ఎత్తుకు తగినట్లుగా బరువు తగ్గి, మంచి ఫిట్నెస్ సాధించడం కోసం అందరూ రోజూ ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్లు నడవాలని పలు ఆరోగ్య సంస్థల అధ్యయనాల్లో తేలింది. దీనివల్ల గరిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయన్నది ఆ అధ్యయనాల మాట. ఇది అందరి లెక్క అయినప్పుడు అందరూ ఇన్ని దూరాలు నడవగలరా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది కదా... దీనికి సమాధానమిస్తూ టీనేజ్‌లో ఉన్న పిల్లలు, యువత చాలా వేగంగా ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్లు దూరాలు నడవాలనీ, అయితే మధ్యవయస్కులు మొదలు కాస్త వయసు ఎక్కువగా ఉన్నవారు నెమ్మదిగా నడవాలని సూచిస్తున్నారు. మరీ ఎక్కువ వయసుతో వృద్ధాప్యంలో ఉన్నవారు మాత్రం రోజూ 2 నుంచి 4 కిలోమీటర్లు నడిస్తే చాలన్నది ఆ అధ్యయన సంస్థల సూచన. ఇక ఆరు నుంచి పదిహేడేళ్ల వరకు ఉన్న చిన్నారులు రోజుకు కనీసం 60 నిమిషాల పాటైనా వేగంతో కూడిన నడక లేదా కాస్త శ్రమ కలిగించే వ్యాయామాలు చేయాలంటున్నారు.అసలు ఎందుకు నడవాలి?ఈ ప్రశ్న వచ్చినప్పుడు నడక వల్ల కలిగే వేర్వేరు ఆరోగ్య ప్రయోజనాలే సమాధానాలుగా నిలుస్తాయంటున్నాయి ఆరోగ్య పరిశోధక సంస్థలు. నడక వల్ల ఒత్తిడి తగ్గడం, మూడ్స్ మెరుగుపడటం, శక్తిసామర్థ్యాలు పెరగడం, బరువు తగ్గడం, కండరాలు బలంగా మారడం, కీళ్ల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు వాటికి అవసరమైన పోషకాలు అందడం, వాటి ఫ్లెక్సిబిలిటీ పెరగడంతో పాటు మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. -
జలగండం!
సాక్షి, అమరావతి: జలసంక్షోభం ముంచుకొస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా తలసరి నీటి లభ్యత గణనీయంగా తగ్గుతోంది. మన దేశంలో 1951 నాటికి తలసరి నీటి లభ్యత 5,177 క్యూబిక్ మీటర్లుŠ(ఒక క్యూబిక్ మీటర్‌కు వెయ్యి లీటర్లు) ఉంటే... ప్రస్తుతం అది 1,486 క్యూబిక్ మీటర్లకు తగ్గింది. ఇది 2031 నాటికి 1,367 క్యూబిక్ మీటర్లకు... 2051 నాటికి 1,228 క్యూబిక్ మీటర్లకు తగ్గుతుందని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అంచనా వేసింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి లభ్యత పెరగకపోవడం వల్లే తలసరి నీటి లభ్యత నానాటికీ తగ్గిపోతోందని వెల్లడించింది. సముద్రం పాలవుతున్న నదీ జలాలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడం, భూగర్భ జలాలను సంరక్షించుకోవడం, వ్యర్థ జలాలను శుద్ధిచేసి మళ్లీ వినియోగించుకోవడం ద్వారా తలసరి నీటి లభ్యతను పెంచుకోవచ్చని సూచించింది. సీడబ్ల్యూసీ అధ్యయన నివేదికలో ప్రధాన అంశాలు... » ప్రపంచంలో భూమిపై ఉన్న నీటిలో 97.5 శాతం ఉప్పునీరు. 2.5 శాతం మాత్రమే మంచినీరు. భూమిపై ఉన్న మంచినీటిలో 68.9 శాతం హిమానీనదాలు(గ్లేసియర్లు)లో ఉండగా, భూగర్భజలాలు, భూమిలో తేమ రూపంలో 30.8 శాతం, నదులు, సరస్సులలో 0.3 శాతం ఉంది. » మన దేశ భౌగోళిక విస్తీర్ణం 328.75 మిలియన్ హెక్టార్లు. ప్రపంచ భౌగోళిక విస్తీర్ణంలో మన దేశ విస్తీర్ణం వాటా 2.44 శాతం. దేశంలో సగటున ఏటా 1,170 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. వర్షపాతం వల్ల ఏటా 4,000 బిలియన్ క్యూబిక్ మీటర్లు(బీసీఎం) నీరు లభిస్తుంది. ఇందులో 1,999.2 బీసీఎంల నీటిని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం 1,139.18 బీసీఎంల నీటిని వినియోగించుకుంటున్నాం. » ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రమాణాల ప్రకారం తలసరి నీటి లభ్యత 5 వేల క్యూబిక్ లీటర్లు ఉండాలి. ఆ ప్రమాణాల మేరకు మన దేశంలో 1951లో మాత్రమే నీటి లభ్యత ఉంది. ఆ తర్వాత క్రమేణా జనాభా పెరుగుతూ ఉండటం, దానికి అనుగుణంగా నీటి లభ్యతను పెంచుకోకపోవడం వల్లే తలసరి నీటి లభ్యత తగ్గిపోతోంది. » ఏ దేశంలో అయినా తలసరి నీటి లభ్యత 1,700 క్యూబిక్ లీటర్లు ఉంటే... ఆ దేశంలో నీటి కొరత తీవ్రంగా ఉన్నట్లు. ప్రస్తుతం మన దేశంలో తలసరి నీటి లభ్యత 1,486 క్యూబిక్ మీటర్లు ఉంది. ఈ లెక్కన మన దేశంలో తీవ్ర నీటి కొరత ఉన్నట్లు స్పష్టమవుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2051 నాటికి దేశంలో తీవ్ర జలసంక్షోభం తలెత్తడం ఖాయమని సీడబ్ల్యూసీ ఆందోళన వ్యక్తంచేసింది.ప్రపంచంలో భూమిపై ఉన్న నీటిలో ఉప్పు నీరు: 97.5 శాతంమంచి నీరు: 2.5 శాతంప్రపంచంలో భూమిపై ఉన్న మంచినీటి విస్తరణ ఇలా.. హిమానీనదాలలో: 68.9 శాతం భూగర్భజలాలు, భూమిలో తేమ రూపంలో: 30.8 శాతం నదులు, సరస్సులలో: 0.3 శాతం -
ఈ బద్ధకం వదిలేద్దాం!
ఆరోగ్యమే మహాభాగ్యమంటాం. ఆరోగ్యంగా ఉండేందుకు కనీసపాటి శ్రమైనా చేస్తున్నామా? శారీరక శ్రమ, క్రమం తప్పని కదలికల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిసినా, భారతీయులు బద్ధకపు జీవనశైలినే అనుసరిస్తున్నారట. క్రియాశీలక జీవనవిధానానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కొన్ని మార్గదర్శకాలు పేర్కొంది. కానీ, మన దేశం నుంచి 20 కోట్ల మంది (15.5 కోట్ల మంది వయోజనులు, 4.5 కోట్ల మంది కౌమార వయస్కులు) వాటిని పాటించడంలో విఫలమవుతున్నారు. డాల్బెర్గ్ వారి ‘స్టేట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ’ (సాపా) నివేదిక తాజాగా ఈ సంగతి వెల్లడించింది. ఈ నివేదిక ఆందోళన కలిగించడమే కాక, ఆటలు, వ్యాయామం విషయంలో భారతీయులు శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. నిజానికి, ఇలాంటి జాతీయ స్థాయి సర్వే జరగడం ఇదే తొలిసారి. మేధావుల బృందమైన ‘డాల్ బెర్గ్ అడ్వైజర్స్’, స్వచ్ఛంద సంస్థ ‘స్పోర్ట్స్ అండ్ సొసైటీ యాక్సలరేటర్’ సంయుక్తంగా జరిపిన ఈ అధ్యయనం అనేక ఆందోళనకరమైన ధోరణులను వెల్లడించింది. మన దేశంలో వయోజనుల్లోని కాస్తంత పెద్దవారిలో 48 శాతం మంది ఆటల లాంటి శారీరక శ్రమ చేసేందుకు తమ వయసు మీద పడింది అనేస్తున్నారట. ఇంకా చిత్రం ఆటలు ఆడపిల్లలకు సురక్షితం కాదన్న అభిప్రాయంలో 45 శాతం మంది ఉన్నారట. అలాగే, శారీరక శ్రమ చేయడం ఋతుస్రావ మహిళలకు నష్టదాయకమనీ, ఒంటికి దెబ్బలు తగిలితే వివాహ అవకాశాలు దెబ్బ తింటాయనీ, భౌతిక శ్రమ వల్ల పెళ్ళయిన అమ్మాయిలకు గర్భస్రావం అవుతుందనీ... ఇలా రకరకాల దురభిప్రాయాలు నెలకొన్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో... అలాగే పురుషులతో పోలిస్తే మహిళల్లో శారీరక శ్రమ బాగా తక్కువవడం గమనార్హం. దీనికి కారణాలు లేకపోలేదు. శారీరక శ్రమ చేసేందుకు అనుకూలంగా ఉద్యానాలు, మైదానాల లాంటి బహిరంగ ప్రదేశాలు పట్టణాల్లో కరవై పోయాయి.అందువల్ల గ్రామాలతో పోల్చి చూసినప్పుడు పట్టణాల్లో శారీరక శ్రమ రాహిత్యం రెట్టింపు ఉంటోంది. నగర జనాభా మరీ అతి సున్నితంగా తయారైంది. ఇక, మన భారతీయ మహిళల్లో... నూటికి 75 మందికి రకరకాల ఇంటిపనుల్లోనే సమయమంతా గడిచిపోతుంది. ఫలితంగా వారికి వ్యాయామం చేసేందుకు తీరిక దొరకని పరిస్థితి. ఈ కారణాలన్నీ కలిసి కొంప ముంచుతున్నాయి. జీవనశైలి వ్యాధులకు దారి తీస్తున్నాయి. చాలామంది రోజూ నడుస్తున్నామంటారు. నడక వల్ల ప్రయోజనాలు ఉన్నాయి కానీ, ఆరోగ్యవంతమైన శరీరానికి అదొక్కటే సరిపోదని నిపుణుల ఉవాచ. తాజా సర్వే ఒక్కటే కాదు... ప్రతిష్ఠాత్మక ‘లాన్సెట్’ పత్రికలో ఇటీవలే ప్రచురితమైన మరో అధ్యయనం సైతం భారతీయ వయోజనుల్లో నూటికి 50 మంది శారీరకంగా తగినంత శ్రమ చేయట్లేదని పేర్కొంది. అంతంత మాత్రపు శారీరక శ్రమతోనే వయోజనులు సరిపెట్టుకొంటున్న ధోరణి ఉన్నతాదాయాలుండే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రధానంగా కనిపిస్తోంది. ఆ తరువాత రెండోస్థానంలో దక్షిణాసియా ప్రాంతం నిలిచింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సహా పలువురు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం చెబుతున్న మాట. ఆందోళనకరమైన అంశం ఏమిటంటే... మన దేశంలోని వయోజనుల (కనీసం 18 ఏళ్ళు, ఆపైన ఉన్నవారి)లో పెద్దగా శారీరక శ్రమ చేయని సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 2000 నాటికి అలాంటివారు 22 శాతం పైచిలుకు ఉంటే, 2010 నాటికి వారు 34 శాతం దాకా పెరిగారు. 2022 నాటికి 50 శాతం దాకా చేరారు. ఇలాగే కొనసాగితే... 2030 నాటికల్లా ఇలాంటివాళ్ళు ఏకంగా 60 శాతానికి చేరతారని అంచనా. ఇది శారీరక, మానసిక ఆరోగ్యపరంగానే కాదు... సామాజికంగానూ ప్రమాదఘంటికే!రోజూ బద్ధకంగా, శారీరక శ్రమ లేకుండా గడిపేస్తుంటే... మధుమేహం, గుండెజబ్బు వచ్చే ముప్పుంది. నిజానికి, ఎంతసేపూ కదలకుండా కూర్చొనే జీవనశైలి, శారీరక శ్రమ అంతకంతకూ తగ్గిపోవడం వల్ల ప్రపంచమంతటా ఈ జబ్బుల బారినపడుతున్నవారు పెరుగుతున్నారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై భారం పడుతోందని డబ్ల్యూహెచ్ఓ మాట. అంతేకాదు... ఈ బద్ధకపు జీవన విధానం వల్ల మన దేశంలో దాదాపు 25.4 కోట్లమందికి పైగా స్థూలకాయంతో, 18.5 కోట్ల మంది దాకా ‘చెడు కొలెస్ట్రాల్’తో బాధపడుతున్నట్టు వెల్లడైంది. ఆరోగ్యానికే కాదు... దేశ ఆర్థిక బలిమికీ శారీరకంగా చురుకుదనం అత్యంత కీలకం. మన దేశ జనాభా మొత్తం శ్రమకు నడుంబిగిస్తే, 2047 నాటికి దేశ స్థూల జాతీయోత్పత్తి రూ. 15 ట్రిలియన్లు దాటిపోతుందని అంచనా. స్థూలకాయం, లాంటి జబ్బులు తగ్గడమే కాదు, వాటి కోసం ఖర్చు చేస్తున్న రూ. 30 ట్రిలియన్లు ఆదా అవుతాయి. లెక్కతీస్తే, ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మంది తగిన శారీరక శ్రమ చేయక చెరుపు చేస్తున్నారు, చేసుకుంటున్నారు. ఇక, డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల్ని బట్టి చూసినా శారీరక శ్రమరాహిత్యం అత్యధికంగా ఉన్న 195 దేశాల్లో భారత్ 12వ స్థానంలో నిలిచిందని ‘లాన్సెట్’ అధ్యయనం. రోజువారీ వ్యాయామంతో సమయం వృథా అనీ, ర్యాంకుల చదువులతోనే జీవితంలో పైకి వస్తామనీ, ఆటలు అందుకు ఆటంకమనీ భావించే తల్లితండ్రుల ఆలోచనా ధోరణి ఇకనైనా మారాల్సి ఉంది. మనమైనా, మన దేశమైనా పైకి రావాలంటే... మనుషుల శారీరక, మానసిక ఆరోగ్యమే కీలకం. ప్రభుత్వాలు అది గుర్తించి ఆటలతో మేళవించిన విద్యా ప్రణాళికను తప్పనిసరి చేయాలి. పౌరుల కోసం వ్యాయామ కేంద్రాల వసతులూ పెంచాలి. ఎందుకంటే, జీవన సౌంద ర్యమే కాదు... జగమంతటినీ లక్ష్మీనివాసంగా మార్చే మహత్తూ శ్రమశక్తిదే మరి! -
భారత్‌లో మంకీపాక్స్ అనుమానిత కేసు నమోదు
భారత్‌లో తొలి మంకీపాక్స్ (ఎంపాక్స్) కేసు నమోదైందనే వార్తలు కలకలం రేపుతుంది. ఆ వార్తలపై కేంద్రం స్పందించింది. ఇటీవల విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన ఓ వ్యక్తిలో ఎంపాక్స్ లక్షణాలు ఉన్నాయనే అనుమానంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.ఆ వ్యక్తిని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, మంకీ పాక్స్ వైరస్ లక్షణాలు అతనిలో ఉన్నాయా? లేవా అని తెలుసుకునేందుకు రక్త పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొంది. Suspected #Mpox case under investigation; patient put under isolation, no cause for alarmA young male patient, who recently travelled from a country currently experiencing Mpox (monkeypox) transmission, has been identified as a suspect case of Mpox. The patient has been…— PIB India (@PIB_India) September 8, 2024ఏర్పాటు చేసిన ప్రోటోకాల్‌లకు అనుగుణంగా సదరు వ్యక్తిపై పరీక్షలు జరుగుతున్నాయని, వైరస్ మూలాలను గుర్తించడానికి, కాంటాక్ట్ ట్రేసింగ్ కొనసాగుతుందని చెప్పింది. ఎంపాక్స్ విషయంలో అనవసర ఆందోళన చెందవద్దని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. -
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఊరట: బ్రెయిన్ కేన్సర్‌తో సంబంధం లేదు!
స్మార్ట్‌ఫోన్ వాడకంతో బ్రెయిన్ కేన్సర్ వస్తుందని ఇప్పటిదాకా చాలా భయపడ్డాం. సెల్‌ఫోన్ రేడియేషన్ దుష్ర్పభావానికి సంబంధించి పలువురు నిపుణులు హెచ్చరించారు కూడా. అయితే తాజా అధ్యయనం మాత్రం స్మార్ట్ఫోన్లకు, బ్రెయిన్ కేన్సర్ కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. సాధారణంగా స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడినా, ముఖ్యంగా పడుకునేటపుడు దిండుకింద మొబైల్ పెట్టుకుని పడుకున్నా, పసిపిల్లలకు దగ్గరగా ఉంచి, రేడియేషన్ ప్రభావం ఉంటుందిని, తీవ్రమైన ప్రమాదకరమైన జబ్బులొస్తాయనే ఆందోళన ఇప్పటివరకు ఉండేది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక అధ్యయనంలో కొన్ని కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొబైల్ ఫోన్ వినియోగానికి, మెదడు కేన్సర్ ప్రమాదానికి ఎటువంటి సంబంధం లేదని వెల్లడింది. వైర్లెస్ టెక్నాలజీ వినియోగంలో భారీ పెరుగుదల ఉన్నప్పటికీ, మెదడు కేన్సర్‌లో పెరుగుదల లేదని మంగళవారం ప్రచురించిన ఒక రివ్యూలో తెలిపింది. సుదీర్ఘ ఫోన్ కాల్స్ చేసే వ్యక్తులకు లేదా ఒక దశాబ్దం కంటే ఎక్కువ కాలం పాటు మొబైల్ ఫోన్లను ఉపయోగించిన వారికి కూడా ఇది వర్తిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ప్రచురితమైన అనేక రీసెర్చ్ పేపర్లను సైతం అధ్యయనం చేసి ఈ విషయం వెల్లడించినట్లు అధ్యయనం పేర్కొంది. కాగా డబ్ల్యూహెచ్ఓ , ఇతర అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు మొబైల్ ఫోన్లు ఉపయోగించే రేడియేషన్ నుంచి వచ్చే ప్రతికూల ఆరోగ్య ప్రభావాలకు ఖచ్చితమైన ఆధారాలు లేవని గతంలో చెప్పాయి, అయితే మరింత పరిశోధన కోసం పిలుపునిచ్చాయి. ఈ నేపత్యంలో తాజా స్టడీ ఆసక్తికరంగా మారింది. -
మాయరోగం... మరోసారి!
అవును... మళ్ళీ మరో మాయరోగం బయటకొచ్చింది. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీపాక్స్ (ఎంపాక్స్) తాజాగా విజృంభించింది. స్వీడన్ నుంచి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ దాకా అనేక ప్రాంతాలకు విస్తరించింది. ఫలితంగా, ప్రపంచం మరోసారి ఉలిక్కిపడింది. దీన్ని ఆందోళన చెందా ల్సిన అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా రెండేళ్ళలోనే రెండోసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించాల్సొచ్చింది. భారత్ సైతం ఎయిర్‌పోర్ట్‌లు, ఆస్పత్రుల్ని అప్రమత్తం చేసి, కాంగో సహా మధ్య ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల ఆరోగ్యంపై కన్నేసింది. మాస్కుల ధారణ, చేతుల పరిశుభ్రత, గుంపుల్లో తిరగకపోవడం లాంటి ముందుజాగ్రత్తలే శ్రీరామ రక్ష అని మంకీపాక్స్ మరోసారి గుర్తుతెచ్చింది. తరచూ తలెత్తుతున్న ఈ వైరస్ల రీత్యా ఔషధ పరి శోధన, ఆరోగ్య వసతుల కల్పనపై మరింత పెట్టుబడి పెట్టాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పింది. ప్రపంచంపై ఎంపాక్స్ పంజా విసరడం ఇప్పటికిది మూడోసారి. అసలు 15 నెలల పైచిలుకు క్రితం ఇది ఇక ఆందోళన చెందాల్సినది కాదని డబ్ల్యూహెచ్ఓ తేల్చింది. తీరా ఇటీవల కొద్ది వారాలుగా వైరస్ పునర్ విజృంభణతో ఆగస్ట్ 14న మరోసారి అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సి వచ్చింది. దీనికి కారణం లేకపోలేదు.2023 సెప్టెంబర్ నుంచి కేసులు పెరుగుతున్నాయి. పైగా గతంలో 2022–23లో ప్రపంచాన్ని చుట్టుముట్టినప్పటితో పోలిస్తే, ఈసారి జన్యుపరంగా విభిన్నమైన వైరస్ (క్లాడ్ 1బి వేరియంట్) దీనికి కారణమవుతోంది. ఈ సాంక్రమిక వ్యాధి గతంలో ఒకరి నుంచి మరొకరికి లైంగిక సంపర్కం ద్వారానే వ్యాపించేది. కొత్త వేరియంట్ ఇప్పుడు రోగితో స్పర్శ, దగ్గరగా మాట్లాడడం, రోగి వాడిన దుస్తులు, దుప్పట్లు వాడడం ద్వారా కూడా వ్యాపిస్తున్నట్టు నిపుణుల మాట. మరణాల రేటూ మునుపటి కన్నా పెరిగింది. ఈ ఒక్క ఏడాదే 116కి పైగా దేశాల్లో 15,600కి పైగా కేసులు నమోదయ్యాయి. 500 పైచిలుకు మంది ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్రికాలో నిరుటితో పోలిస్తే ఇప్పుడు మరణాలు 160 శాతం పెరిగాయి. ప్రపంచంలో దాదాపు 70 లక్షల మందికి పైగా మరణానికి కారణమైన కోవిడ్ లానే మంకీపాక్స్‌కూ జనం భయపడుతున్నది అందుకే!ఏడాది ౖక్రితం అత్యవసర పరిస్థితిని ఎత్తివేసినప్పుడే ఎంపాక్స్‌పై దీర్ఘకాలిక నిఘా, నియంత్రణ ప్రణాళికలు అవసరమని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ వ్యాధి సాంక్రమిక రోగ విజ్ఞానంపై ఇంకా పూర్తిగా అవగాహన లేదంటూ ప్రజారోగ్య నిపుణులు, వైరస్ శాస్త్రవేత్తలు సైతం హెచ్చరించారు. అయినా సరే ఈ రోగాన్ని కనిపెట్టే పరీక్షల్ని మెరుగుపరచడం, టీకాలు – యాంటీ వైరల్ మందులకు సంబంధించి క్లినికల్ పరీక్షలపై దృష్టి పెట్టడం, టీకాల తయారీని విస్తరించడం లాంటి చర్యలేవీ ఆచరణలో పెట్టలేదు. ఈ అంతర్జాతీయ నిర్లక్ష్యమే ఇప్పుడు శాపమైంది. ఇవాళ్టికీ మంకీపాక్స్‌కు టీకాల సరఫరా పరిమితం. నియంత్రణకు కోటి డోసుల అవసరం ఉంటే, 2.1 లక్షల డోసులే తక్షణం అందుబాటులో ఉన్నాయట. డోసులు దానం చేస్తామని యూరోపియన్ యూనియన్, అమెరికాలు వాగ్దానం చేశాయి కానీ, వ్యాక్సిన్లపై ఇప్పటికీ కొన్ని అధికాదాయ దేశాల గుత్తాధిపత్యమే సాగుతోంది. అత్యవసరంలో ఉన్న అనేక దేశాలకు అది పెద్ద దెబ్బ. ఆఫ్రికాలో అవసరమున్నా యూరోపియన్ దేశాల్లోనే టీకాలను మోహరించడమే అందుకు ఉదాహరణ. కోవిడ్ కాలంలో లానే ఇప్పుడూ పేదదేశాలకు సాంకేతికత బదలాయింపు జరగట్లేదు. టీకాలకై పెనగులాట తప్పట్లేదు. మహమ్మా రుల కట్టడికి ఒక సమానత్వ ఒప్పందంపై ప్రపంచ దేశాలు విఫలమైతే దెబ్బతినేది ప్రజారోగ్యమే!మన దేశంలోనూ ఈ ఏడాది మంకీపాక్స్ కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులేవీ లేవనీ, మన దగ్గర ఇది పెద్దయెత్తున రాకపోవచ్చనీ అంచనా. అయినా అప్రమత్తత తప్పదు. కేంద్రం ఇప్పటికే ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిపి, చర్యలు ప్రారంభించింది. రోగ నిర్ధారణ వసతు లతో పాటు, ఆరోగ్య బృందాల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తోంది. అక్కడితో ఆగకుండా ప్రజల్లో చైతన్యం కల్పించాలి. రాష్ట్రాలతో అన్ని రకాల కీలక సమాచారాన్ని పంచుకోవాలి. నిజానికి, ఇలాంటి వైరస్ల విజృంభణ వేళ వ్యవహరించాల్సిన తీరుపై కోవిడ్ విలువైన పాఠాలే నేర్పింది. ఇన్ఫెక్షన్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. అలాగే, కేసుల వివరాలను సమగ్రంగా నమోదు చేయాలి. ప్రాథమిక అంశాలే అనిపించినా, ఇవే అతి ముఖ్యం. కోవిడ్‌లో లాగా కాక ఈసారైనా రోగ నిర్ధారణ కిట్లు, టీకాలు వర్ధమాన దేశాలకు సక్రమంగా చేరితేనే ఉపయోగం. సరిహద్దులు దాటి సులభంగా విస్తరించే ఇలాంటి మాయదారి రోగాలను కట్టడి చేయాలంటే అన్నిచోట్లా సమస్థాయిలో ప్రయత్నాలు జరగడం కీలకం. వ్యాధి సోకిన, సోకే అవకాశం ఉన్న వర్గాలన్నిటికీ టీకాలు అందుబాటులో ఉంచి, సంరక్షణ చేపట్టేలా ఆర్థిక, విధానపరమైన అండదండలు కావాలి. సత్వర, కీలక చర్యలు చేపట్టడమే ముఖ్యమనేది కోవిడ్ నేర్పింది. అందులోనూ ఇలాంటి మాయరోగాలకు ముకుతాడు వేయాలంటే, తొలి 100 రోజుల్లోని ఆచరణే అతి ముఖ్యం. ఎప్పటికప్పుడు స్వరూప స్వభావాల్ని మార్చుకుంటున్న ఎంపాక్స్ ఆఫ్రికా సమస్య, కేసులు బయట పడ్డ కొన్ని దేశాల తలనొప్పి అనుకుంటే పొరపాటు. ఇది ప్రపంచానికే ముప్పు అని ముందు గుర్తించాలి. ‘ఇది మరో కరోనా కాదు’ అంటూ డబ్ల్యూహెచ్ఓ అంటున్నా, వైరస్ విజృంభణ ధోరణులు భయపెడుతున్నాయి. టీకాలు, చికిత్సలు లేకుండా ఆఫ్రికా దేశాలను వాటి ఖర్మానికి వదిలేయడం దుస్సహం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ సమన్వయంతో కట్టడికి కృషి చేయాలి. అత్యవసర ఆరోగ్య పరిస్థితి అని ప్రకటించడంలోని అసలు ఉద్దేశం అదే! జంతుజాల వైరస్లు పదే పదే ఎందుకు తలెత్తుతున్నాయో దృష్టి పెట్టాల్సి ఉంది. విస్మరిస్తే మనకే కష్టం, నష్టం. పారాహుషార్! -
అనుమానం ఉంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు చేయండి.. మంకీపాక్స్‌పై కేంద్రం ఆదేశాలు
ఢిల్లీ : కాంగో సహా ఆఫ్రికాలోని పలు దేశాలలో విస్తరిస్తున్న ప్రాణాంతకమైన ఎంపాక్స్ (మంకీపాక్స్) వ్యాధి తీవ్రతను గమనించి అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్ఓ). ఈ తరుణంలో ఎంపాక్స్‌పై భారత్ అప్రమత్తమైంది. ఎమర్జెన్సీ వార్డులను సిద్ధం చేయడం, విమానాశ్రయాల్లో తనిఖీలు చేయడంతో పాటు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.దద్దుర్లు ఉన్న రోగులను గుర్తించి ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆసుపత్రులను ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని మూడు నోడల్ ఆసుపత్రులు సఫ్దర్‌జంగ్, లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజ్,రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ ఎంపిక చేసింది. అనుమానిత రోగులపై ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేసి అవసరమైన జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. విమానాశ్రయాలను కూడా అప్రమత్తం చేసినట్లు సమాచారం. భారత్‌లో ఇప్పటి వరకు ఎంపాక్స్ కేసులు నమోదు కాలేదు. అయితే ఆగస్ట్ 16న యూఏఈ నుంచి దేశానికి వచ్చిన ముగ్గురు రోగుల్ని పాకిస్థాన్ గుర్తించింది. అంతకుముందు, స్వీడన్, ఆఫ్రికా వెలుపల మొదటి పాక్స్ కేసును నిర్ధారించాయి. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల రెండేళ్లలో రెండవ సారి ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఎంపాక్స్ ప్రమాదకరంగా మారిందని తెలిపింది. అదే సమయంలో ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించింది. -
మంకీపాక్స్‌పై WHO హెచ్చరికలు.. అప్రమత్తమైన కేంద్రం
కరోనా తర్వాత ఇప్పుడు ప్రపంచ దేశాల్ని కలవర పెడుతున్న మంకీపాక్స్‌పై కేంద్రం అప్రమత్తమైంది. ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆఫ్రికా కేంద్రంగా వ్యాపించిన మంకీపాక్స్ (ఎంపాక్స్)పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మంకీ పాక్స్ ఆఫ్రికా నుంచి పొరుగుదేశమైన పాకిస్థాన్‌కు చేరడంతో మోదీ తక్షణ చర్యలకు సిద్ధమయ్యారు.ఇందులో భాగంగా ఆదివారం(ఆగస్ట్18) మంకీ పాక్స్‌పై ప్రధాని మోదీ అధ్యక్షతన ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పీకే మిశ్రా నేతృత్వంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. వ్యాధిని త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు పీకే మిశ్రా జారీ చేశారు. మంకీ పాక్స్‌ను ఎదుర్కొనే అంశంతో పాటు ముందుగానే రాష్ట్రాల్లో టెస్టింగ్ ల్యాబులు ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ సూచించారని చెప్పారు.మంకీపాక్స్ సోకిన రోగుల సంఖ్యఆఫ్రికా దేశాల్లో ఈ ఏడాది మంకీపాక్స్ సోకిన రోగుల సంఖ్య 18,737కి చేరింది. ఈ ఒక్క వారంలోనే 1200 కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ప్రాణాంతకమైన క్లాడ్-1తో పాటు అన్నీ రకాల వైరస్‌లతో కలిపి ఈ గణాంకాలు విడుదల చేసినట్లు పేర్కొంది. మొత్తంగా 545 మరణాలు సంభవించాయి. ఆఫ్రికా ఖండంలో 97 శాతం కేసులు, మరణాల కేసులో కాంగోలో నమోదవుతుండగా..ఈ ఒక్క వారంలో 202 కేసులు నిర్ధారణ కాగా.. 24 మంది మృత్యువాత పడ్డారు. 12 ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ కేసుల్ని గుర్తించగా..మరణాల రేటు 8.2శాతంగా ఉంది. కాంగో సరిహద్దు దేశం బురుండిలో ఈ వారంలో 39కేసులు నిర్ధారణయ్యాయి. ఆఫ్రికా వెలుపల పాకిస్థాన్లలో మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి.డబ్ల్యూహెచ్ఓ అత్యవసర స్థితిమంకీపాక్స్ విజృంభణ వేళ డబ్ల్యూహెచ్ఓ ఇప్పటికే అంతర్జాతీయంగా ఆందోళనలతో కూడిన అత్యవసర స్థితిని ప్రకటించింది. విపత్తుపై అత్యవసర కమిటీని ఏర్పాటు చేసింది. తొలిదశలో ఆ కమిటీ సిఫార్స్‌లను ప్రచురిస్తామని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఎన్జీవోలతో కలిసి టీకా ఉత్పత్తులను వేగవంతం చేయాలని పిలుపునిచ్చింది. అటు దక్షిణాఫ్రికాలో సమావేశమైన దక్షిణాఫ్రికా డెవలప్మెంట్ దేశాల ప్రతినిధులు ఖండంలో కోరలు చాస్తున్న ఎంపాక్స్‌పై చర్చించారు. డబ్ల్యూహెచ్ఓతో పాటు పలు దేశాలు వ్యాధి నియంత్రణా సంస్థలు అంతర్జాతీయ భాగస్వాములు, మంకీపాక్స్ నివారణకు కృషి చేయాలని అభ్యర్ధించారు. ప్రభావ దేశాలకు సంఘీభావం, మద్దతును ప్రకటించారు. -
మంకీపాక్స్ లక్షణాలు ఇవే.. చికిత్స గురించి తెలుసా?
ఆఫ్రికా దేశాల్లో కలకలం సృష్టిస్తున్న మంకీ పాక్స్ (ఎంపాక్స్) మహమ్మారిని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఎంపాక్స్ సుమారు 70 దేశాలకు పాకింది. ఇప్పటివరకు 100 మంది ఎంపాక్స్‌తో మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే..సుమారు 17 వేలకుపైగా అనుమానిత కేసులు నమోదైనట్లు తెలిపారు. ఎంపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. గత రెండేళ్లలో డబ్ల్యూహెచ్ఓ ఇలా ప్రకటించడం ఇది రెండోసారి. కాంగోలో మంకీ పాక్స్ వైరల్ ఇన్ఫెక్షన్ విజృంభించడం సహా ఇతర చుట్టు పక్కల 12 దేశాలకు వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.ఎంపాక్స్‌ను మంకీపాక్స్ అని కూడా అంటారు. 1958లో కోతులలో పాక్స్ లాంటి వ్యాధి వ్యాప్తి చెందినప్పుడు దీనిని తొలిసారిగా గుర్తించారు. ఇటీవలి మధ్య, పశ్చిమ ఆఫ్రికాలో సోకిన జంతువులతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్న వ్యక్తులలో ఎంపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి.మంకీపాక్స్ బాధితుల్లో కూడా జ్వరం, ఒళ్లు నొప్పులు, అలసట, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. దద్దుర్లు నొప్పిని కలుగజేస్తాయి. దక్షిణాఫ్రికాలో ఇప్పటికే అంతమైన మంకీపాక్స్ వ్యాధి.. స్వలింగ సంపర్గం వల్లే ఇతర దేశాలకు వ్యాపించి ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి. మంకీపాక్స్ గురించి ప్రపంచదేశాలకు దశాబ్దాలుగా తెలుసు. దీని విరుగుడుకు వ్యాక్సిన్ ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. స్మాల్‌పాక్స్ (మశూచి) వ్యాక్సిన్నే మంకీపాక్స్ బాధితులకు ఇస్తున్నారు. అది ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు నిరూపితమైంది. డెన్మార్క్‌కు చెందిన బవారియన్ నోర్డిక్ కంపెనీ మాత్రమే మంకీపాక్స్ నివారణకు వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. -
విజృంభిస్తున్న మంకీఫాక్స్..డబ్లుహెచ్‌ఓ మరోసారి హెల్త్ ఎమర్జెన్సీ!
ప్రపంచవ్యాప్తంగా మంకీ ఫ్యాక్స్ వేగంగ విజృంభిస్తోంది. కేసులు సంఖ్య భారీగా పెరిగిపోతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతేగాదు ఈ వ్యాప్తి విషయమై ఓ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిది కూడా. డబ్ల్యూహెచ్ఓ ఇలా ప్రకటించడం రెండేళ్లలో ఇది రెండోసారి. ఈ వ్యాధి సాధారణ ప్లూ వంటి తేలికపాటి లక్షణాలలో మొదలవుతుంది. ఒక్కోసారి అరుదైన సందర్భాల్లో ప్రాణాంతకంగా మారి శరీరంపై చీముతో నిండిన గాయాలను కలిగిస్తుంది. కాంగోలో ఈ వ్యాధి క్లాడ్I తో ప్రారంభమై.. క్లాడ్Ibగా రూపాంతరం చెందినట్లు అధికారులు తెలిపారు. ఇది ఇంతవరకు లైంగిక సంపర్కం వల్ల వస్తుందని అనుకున్నారు. కానీ తర్వాత సన్నిహిత పరిచయం ఉన్నవాళ్ల నుంచి కూడా సక్రమిస్తున్నట్లు కొన్ని కేసుల ద్వారా తేలింది. అలా ఇప్పటి వరకు కాంగో నుంచి బురుండి, కెన్యా, రువాండా, ఉగాండాతో సహా పొరుగ దేశాలకు వ్యాపించినట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఈ నేపథ్యలోనే డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు జారీ చేయడమే గాక అంతర్జాతీయంగా ప్రజారోగ్య చర్యలను వేగవంతం చేయాలని కోరింది. అలాగే నిధులు సమకూర్చి వ్యాధిని అరికట్టేలా సహకరించాలని విజ్ఞప్తి చేసింది. దీంతోపాటు ప్రజల ప్రాణాలను కాపాడేలా అంతర్జాతీయ స్థాయిలో సమన్వయంతో కూడిన ప్రతిస్పందన కూడా అవసరమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ అన్నారు. కాగా, ఆఫ్రికా ఖండంలో ఇప్పటివరకు 17,000 అనుమానిత మంకీఫాక్స్ కేసులు, 517 మరణాలు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 160% కేసులు పెరిగాయని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. మొత్తంగా 13 దేశాల్లో కేసులు నమోదయ్యాయి.(చదవండి: పంద్రాగస్టు వేడుకల్లో ప్రధాని మోదీ లుక్ వేరేలెవెల్!) -
భారత్‌లోనే కోవిడ్-19 మరణాలు ఎక్కువ.. ఖండించిన కేంద్రం
న్యూఢిల్లీ: కోవిడ్-19 సమయంలో భారత్‌లో అధిక మరణాలు సంభవించాయని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం తెలిపింది. సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో పేర్కొన్న అధ్యయనాన్ని కేంద్రం కొట్టిపారేసింది. భారత్‌లో అధికారిక కోవిడ్-19 మరణాల కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల కంటే 1.5 రెట్లు ఎక్కువ అని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నివేదించారు. సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం, అధిక-ఆదాయ దేశాలలో కనిపించే నమూనాలతో పోలిస్తే, మహమ్మారి సమయంలో మహిళల కంటే పురుషులలో అధిక మరణాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. అయితే,ఆ రిపోర్ట్‌పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఖండించింది. సైన్స్ అడ్వాన్సెస్ పేపర్లో నివేదించబడిన అదనపు మరణాలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయి. జర్నల్స్ లోపభూయిష్టంగా ఉందని, ఆమోదయోగ్యం కాని ఫలితాలను చూపుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. -
2020లో భారత్‌లో కరోనాతో... 11లక్షల అధిక మరణాలు
న్యూఢిల్లీ: కరోనా వల్ల 2020లో భారత్‌లో కేంద్రం చెప్పిన వాటికంటే ఏకంగా 11.9 లక్షల అధిక మరణాలు సంభవించినట్లు అంతర్జాతీయ అధ్యయనం ఒకటి పేర్కొంది. ఇది భారత్ అధికారిక గణాంకాల కంటే 8 రెట్లు, డబ్ల్యూహెచ్ఓ అంచనాల కంటే ఒకటిన్నర రెట్లు అధికం! 2019తో పోలిస్తే ఈ మరణాలు 17 శాతం అధికమని అధ్యయనం పేర్కొంది. బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్, మరికొన్ని విశ్వవిద్యాలయాల పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందుకు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 గణాంకాలను పరిగణనలోకి తీసుకున్నారు. 2019 నుంచి 2020 దాకా దేశవ్యాప్తంగా లక్షలాది మంది కరోనా బాధితుల డేటాను సైతం పరిశీలించారు. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన కోవిడ్–19 సంబంధిత మరణాల్లో మూడింట ఒక వంతు మరణాలు ఇండియాలోనే చోటుచేసుకున్నాయని వెల్లడించారు. కోవిడ్–19 ప్రభావం వల్ల ప్రజల సగటు ఆయుర్దాయం 2.6 ఏళ్లు తగ్గినట్లు తెలిపారు. మహిళల ఆయుర్దాయం 3.1 ఏళ్లు, పురుషుల ఆయుర్దాయం 2.1 ఏళ్లు తగ్గినట్లు గుర్తించారు. అధ్యయనం వివరాలను ‘సైన్స్ అడ్వాన్సెస్’ పత్రికలో ప్రచురించారు.అవన్నీ కరోనా మరణాలు కాదు అధ్యయనం గణాంకాలపై కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అధ్యయనం ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని ఆక్షేపించింది. ఈ గణాంకాల్లో వాస్తవం లేదని, అవన్నీ కరోనా మరణాలు కావని పేర్కొంది. -
రక్తం కాదు.. ప్రాణం ఇచ్చినట్టే!
ఏదైనా ప్రమాదం జరిగింది, లేకుంటే ఏదో అత్యవసర సర్జరీ జరిగింది.. ట్రీట్మెంట్ కోసం రక్తం కావాలి. అప్పటికప్పుడు ఎవరైనా దాత దొరికితేనో, బ్లడ్ బ్యాంకుల్లో స్టాక్ ఉంటేనో సరి. లేకుంటే ఎంతో విలువైన ప్రాణాలు గాలిలో కలసిపోవడం ఖాయం. ఈ నేపథ్యంలోనే రక్తదానంపై అవగాహన కల్పించడం, రక్తదానంపై ఉన్న అపోహలు, వదంతులకు చెక్ పెట్టడం లక్ష్యంగాఏటా జూన్ 14న ‘వరల్డ్ బ్లడ్ డోనర్ డే’ను నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ప్రత్యేక కథనం..జూన్ 14నే ఎందుకు?ఒకప్పుడు ఒకరి రక్తాన్ని మరొకరికి ఎక్కించడమనే చికిత్సే లేదు. ఒకవేళ అలా చేసినా.. బాధితులు బతికేవారు కాదు. దానికి కారణం మన రక్తం వేర్వేరుగా ఉండటమేనని ప్రముఖ శాస్త్రవేత్త కార్ల్ లాండ్స్టీనర్ 1990వ దశకంలో గుర్తించారు. రక్తాన్ని ఏ, బీ, ఓ గ్రూపులుగా వర్గీకరించారు. ఆయన పుట్టినరోజు అయిన జూన్ 14వ తేదీని ‘వరల్డ్ బ్లడ్ డోనర్ డే’కోసం ఎంపిక చేశారు.రక్తదానంపై అవగాహన పెంచేందుకు.. ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది ప్రమాదాల బాధితులు, వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారు సరైన సమయానికి రక్తం అందక ప్రాణాలు వదులుతున్నారు. ఈ క్రమంలో రక్తదానంపై అవగాహన పెంచేందుకు ప్రఖ్యాత సంస్థలు నడుం బిగించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), అంతర్జాతీయ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్, రెడ్ క్రిసెంట్ సొసైటీస్ (ఐఎఫ్ఆర్సీఎస్), అంతర్జాతీయ ఫెడరేషన్ ఆఫ్ బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్స్ (ఐఎఫ్బీడీఓ), అంతర్జాతీయ సొసైటీ ఫర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ (ఐఎస్బీటీ) సంస్థలు కలసి తొలిసారిగా 2004 జూన్ 14వ తేదీ నుంచి ‘వరల్డ్ బ్లడ్ డోనర్ డే’ను నిర్వహించడం మొదలుపెట్టాయి. దీనికి ఈ ఏడాదితో 20 ఏళ్లు పూర్తవుతుండటంతో.. ‘20 ఏళ్ల రక్తదానం. దాతలకు కృతజ్ఞతలు’అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు.పేదరికానికి ‘రక్తం’ లింకు..ప్రమాదాల్లో గాయపడ్డవారు, సర్జరీలు చేయించుకునేవారికే కాదు తలసేమియా, హీమోఫీలియా, ఎనీమియా వంటి వాటితో బాధపడుతున్నవారికి కూడా తరచూ రక్తం ఎక్కించడం అవసరం. ముఖ్యంగా నిరుపేద దేశాల్లో చిన్నపిల్లలు వివిధ వ్యాధులకు లోనవడం, పోషకాహార లోపం వంటివాటితో.. రక్తం ఎక్కించాల్సిన అవసరం ఎక్కువగా ఉంటోంది.– ప్రపంచవ్యాప్తంగా చూస్తే ధనిక దేశాలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రమాదాలు, సర్జరీలు, వయసు మీదపడటం వల్ల వచ్చిన సమస్యల బాధితులకు రక్తం ఎక్కువగా ఎక్కిస్తున్నారు.– పేద దేశాల్లో రక్త హీనత, వివిధ వ్యాధులు, పోషకాహార లోపం వంటి వాటితో బాధపడుతున్న చిన్నారులు, మహిళలకు రక్తం ఎక్కువగా అవసరం పడుతోంది. దానం చేస్తే.. మనకూ ఆరోగ్యం! రక్తదానం చేయడం వల్ల అవతలివారి ప్రాణాలను కాపాడటమేకాదు.. మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నవాళ్లమూ అవుతామని వైద్య నిపుణులు చెప్తున్నారు. రక్తదానం వల్ల మన శరీరంలో ఐరన్ స్థాయిలు బ్యాలెన్స్ అవుతాయని.. కొత్త రక్తం ఉత్పత్తి, రక్త ప్రసరణ తీరు మెరుగుపడతాయని అంటున్నారు. ఇది గుండె సంబంధిత వ్యాధుల ముప్పును అరికడుతుందని, బరువు తగ్గేందుకూ తోడ్పడుతుందని వివరిస్తున్నారు. మొత్తంగా రక్తదాత శారీరక, మానసిక ఆరోగ్యానికి దారితీస్తుందని స్పష్టం చేస్తున్నారు. రక్తంలో ఏభాగాన్ని ఎన్నిసార్లు దానం చేయొచ్చు?పూర్తిస్థాయి రక్తమైతే.. 90 రోజులకోసారి ప్లాస్మా ఒకటే అయితే.. 28 రోజులకోసారి ప్లేట్ లెట్లు మాత్రమే అయితే.. 14 రోజులకోసారి ఎర్ర రక్తకణాలు మాత్రమే అయితే 112 రోజులకోసారి భారతదేశంలో రక్తదానం పరిస్థితి ఇదీ.. ఏటా అవసరమైన రక్తం 5 కోట్ల యూనిట్లు ఎవరెవరు రక్తదానం చేయొచ్చు?– పురుషులు 3 నెలలకు ఒకసారి.. మహిళలు 4 నెలలకు ఒకసారి – వయస్సు పరిమితి18 – 65 ఏళ్ల మధ్య – కనీసం ఉండాల్సిన బరువు 45 కిలోలు – దగ్గు, జలుబు, జ్వరం, ఇతర ఇన్ఫెక్షన్లు ఏవీ ఉండకూడదు. – ఏవైనా వ్యాక్సిన్లు వేసుకున్నవారు కనీసం 15 రోజులనుంచి నెలరోజుల్లోపు రక్తదానం చేయవద్దు. – రక్తదానం చేసినవారు రెండు రోజుల పాటు నీళ్లు, పళ్లరసాలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. తీవ్ర శారీరక శ్రమకు దూరంగా ఉండాలి. డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం..– రక్తదాతల నుంచి అందుతున్నది 2.5 కోట్ల యూనిట్లు – దాత నుంచి సేకరించే రక్తం350 మిల్లీలీటర్లు – ఇందుకుపట్టే సమయం15 నిమిషాలు– ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రతి 2 సెకన్లలో ఒకరికి రక్తం అవసరం పడుతోంది. – ఏటా ప్రపంచవ్యాప్తంగా రక్తదానాలు 11.85 కోట్లు– అందులో ధనిక దేశాల నుంచి వస్తున్నవే 40%– పేద దేశాల్లో రక్తం ఎక్కిస్తున్న వారిలో ఐదేళ్లలోపు పిల్లలే 54%– ధనిక దేశాల్లో రక్తం ఎక్కిస్తున్నవారిలో 60 ఏళ్లు పైబడిన వారు76% -
భారత్‌లో నాలుగేళ్ల చిన్నారికి బర్డ్‌ఫ్లూ
న్యూఢిల్లీ : భారత్‌లో బర్డ్ ఫ్లూ కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కీలక ప్రకటన చేసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన నాలుగేళ్ల బాలుడికి బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారించింది. బాలుడిలో h9n2బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాధి లక్షణాలను గుర్తించినట్లు వెల్లడించింది. బర్డ్ ఫ్లూ వైరస్ లక్షణాలు వెలుగులోకి రావడంతో బాలుడిని అత్యవసర చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చేరిన తర్వాత బాలుడికి శ్వాసకోస సంబంధిత సమస్యలు తలెత్తాయని, ప్రస్తుతం ఐసీయూ వార్డ్‌లో ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.భారత్‌లో ఇది రెండో కేసుభారత్లో H9N2 బర్డ్‌ఫ్లూను మనుషుల్లో గుర్తించడం ఇది రెండోసారి. 2019లో ఒకరు దీని బారినపడ్డారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. రెండున్నరేళ్ల చిన్నారిలో భారత్‌లో పర్యటించిన జూన్7న ఆస్ట్రేలియాలో రెండున్నరేళ్ల చిన్నారిలో h5n2 బర్డ్‌ఫ్లూ లక్షణాలు కనిపించాయి. అంతకుముందే ఆ చిన్నారి భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వచ్చినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. బర్డ్‌ఫ్లూ లక్షణాలు డబ్ల్యూహెచ్ఓ మేరకు..బర్డ్‌ఫ్లూ వైరస్ సోకితే వ్యాధిగ్రస్తుల్లో కండ్లకలక, కడుపులో అసౌకర్యం, పొత్తికడుపు తిమ్మిరి, వికారం, వాంతులు, గుండెల్లో మంట,మెదడు వాపు,అనాక్సిక్ ఎన్సెఫలోపతి : కార్డియాక్ అరెస్ట్ లేదా మెదడుకు ఆక్సిజన్/ప్రసరణ కోల్పోవడంతో పాటు ఇతర లక్షణాలు ఉత్పన్నమై ప్రాణంతంగా మారుతుందని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. బర్డ్‌ఫ్లూ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు బర్డ్‌ఫ్లూ సోకకుండా ఉండేందుకు ముందుగా మూగజీవాలకు దూరంగా ఉండాలి. మూగజీవాల ద్వారా వైరస్లు ప్రభావితమయ్యే ప్రాంతాలకు వెళ్లకపోవడం మంచిదని తెలిపింది.ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మూగజీవాలు ఉన్న ప్రాంతాలను సందర్శించే ముందు, తర్వాత తప్పని సరిగా సబ్బులతో చేతుల్ని శుభ్రం చేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ సూచిస్తోంది. -
బర్డ్‌ఫ్లూ వేరియంట్‌తో తొలిమరణం.. డబ్ల్యూహెచ్ఓ యూటర్న్
బర్డ్‌ఫ్లూ హెచ్5ఎన్2 వేరియంట్‌తో ఓ వ్యక్తి మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. అంతలోనే యూటర్న్ తీసుకుంది. మరణించిన సదరు వ్యక్తిలో ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని, పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించి, త్వరలో స్పష్టత ఇస్తామని వెల్లడించింది.ఇటీవల హెచ్5ఎన్2 బర్డ్‌ఫ్లూ వేరియంట్‌తో మెక్సికోకు చెందిన ఓ వ్యక్తి మరణించారని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. ఈ వైరస్ వల్ల ప్రపంచంలో నమోదైన తొలి మరణం ఇదే అని తెలిపింది.అయితే, మెక్సికో ఆరోగ్య మంత్రిత్వ శాఖ 59 ఏళ్ల వ్యక్తికి దీర్ఘకాలిక కిడ్నీ సమస్య, టైప్ 2 డయాబెటిస్, దీర్ఘకాలిక రక్తపోటు సమస్య ఉందని అధికారిక ప్రకటన చేసింది.బాధితుడిలో ఇతర అనారోగ్య సమస్యలు ఏప్రిల్ 17న జ్వరం, శ్వాస ఆడకపోవడం, విరేచనాలు, వికారం, సాధారణ అస్వస్థత వంటి తీవ్రమైన లక్షణాలు కనిపించడానికి మూడు వారాల ముందు అనారోగ్యానికి గురయ్యాడు. అత్యవసర చికిత్స కోసం బాధితుడిని ఏప్రిల్ 24న మెక్సికోలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత రోజు మరణించాడు.బర్డ్ ఫ్లూ మరణం కాదుఈ తరుణంలో శుక్రవారం జెనీవాలో జరిగిన మీడియా సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి క్రిస్టియన్ లిండ్‌మీర్ మాట్లాడుతూ..ఈ మరణం పలు రకాల అనారోగ్య సమస్యల వల్ల మరణించారని, హెచ్5ఎన్2కి సంబంధించిన మరణం కాదని చెప్పారు. బర్డ్‌ఫ్లూ గుర్తించాం.. అంతేవైద్యం నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన వైద్యులు బర్డ్ ఫ్లూ, ఇతర వైరస్ల కోసం పరీక్షలు చేయగా.. బాధితుడిలో హెచ్5 ఎన్2 వేరియంట్ గుర్తించామని లిండ్‌మీర్ చెప్పారు. అతనితో పరిచయం ఉన్న 17 మందికి టెస్ట్‌లు చేయగా నెగిటివ్‌గా తేలిందిత్వరలోనే స్పష్టత ఇస్తాంపరిశోధనలు కొనసాగుతున్నాయి. సెరోలజీ కొనసాగుతోంది. అంటే ముందుగా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చూడటానికి రక్త పరీక్ష అని లిండ్‌మీర్ చెప్పారు. అతనిలో ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని, వాటిపై విచారణ జరుపుతున్నామని, పూర్తి స్థాయిలో నిర్ధారించిన వెంటనే.. మరణంపై స్పష్టత ఇస్తామని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి లిండ్‌మీర్ పేర్కొన్నారు. -
చెడు అలవాట్లతో 'మెదడుకు చేటు'..
సాక్షి, అమరావతి: ఆధునిక జీవనశైలి, దురలవాట్ల కారణంగా మెదడు సంబంధిత జబ్బుల బారినపడుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు పైబడిన వారిలో వయోభారం, బీపీ, షుగర్ నియంత్రణలో లేకపోవడం తదితర కారణాలతో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుండేది. అయితే, ప్రస్తుతం నమోదవుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసుల్లో 25–30 శాతం కేసుల్లో బాధితుల వయస్సు 20–45 ఏళ్ల లోపే ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ న్యూరాలజీ విభాగం వెల్లడించిన ఒక నివేదిక ప్రకారం ఏడాది కాలంలో 300 మంది స్ట్రోక్‌తో అడ్మిట్ కాగా.. 25 శాతం మంది 21–45 ఏళ్ల వయస్సు వారేనని తేలింది. అలాగే, ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటిమంది ఈ స్ట్రోక్ బారినపడుతుండగా, వీరిలో సగం మంది మృత్యువాత పడుతున్నారు. మిగిలిన వారు శాశ్వత వికలాంగులుగా మిగిలిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇటీవల వెల్లడించింది. దురలవాట్లతో చేటు..ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లు మెదడుకు చేటుచేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ అలవాట్లను మానుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నప్పటికీ కొందరిలో మాత్రం మార్పు రావడంలేదు. బ్రిటీష్ మెడికల్ జర్నల్ 2021లో వెల్లడించిన ఒక అధ్యయనం ప్రకారం.. ధూమపానం, మద్యపానం అలవాట్లున్న వ్యక్తులు బ్రెయిన్ స్ట్రోక్ బారినపడటానికి 80 శాతం ఎక్కువ అవకాశాలున్నాయి. గుండె జబ్బులకు దారితీసే ప్రధాన కారకాల్లో ధూమపానం ఒకటి. గుండెపోటు కేసుల్లో 25 శాతం వరకూ ఇదే ప్రధాన కారణంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే, పొగాకులోని నికోటిన్, విషతుల్యాలు రక్తనాళాల లోపలి పొరను దెబ్బతీస్తాయి. దీంతో రక్తనాళ గోడల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి పూడిక ఏర్పడుతుంది. పూడిక చిట్లిపోతే హఠాత్తుగా రక్తం గడ్డకట్టి నాళం పూర్తిగా మూసుకుపోవచ్చు. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. అదే విధంగా మెదడు రక్తనాళాల్లో పూడికలతో స్ట్రోక్ సంభవిస్తుంది. ఏటా కేసుల పెరుగుదల..బ్రెయిన్ స్ట్రోక్, ఇతర న్యూరో సంబంధిత కేసులు ఏటా పెరుగుతున్నాయి. ఇందుకు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం కింద అందించిన చికిత్సలే నిదర్శనంగా ఉంటున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద న్యూరో, న్యూరో సర్జరీ విభాగాల్లో చికిత్స పొందిన రోగుల సంఖ్య గడిచిన ఐదేళ్లలో ఏటా వృద్ధి చెందుతూ వచ్చింది. 2019–20లో 26,023 మంది చికిత్స పొందారు. 2022–23 నాటికి ఈ సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. ఆ ఏడాది 40 వేల మందికి ప్రభుత్వం ఉచితంగా చికిత్సలు అందించింది. ఇక 2023–24లోను చికిత్స పొందిన వారి సంఖ్య 40 వేలు దాటింది. యువతలో బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణాలు..⇒ బీపీ, షుగర్ నియంత్రణలో లేకపోవడం.. ఊబకాయం ఉండటం. ప్రస్తుతం రాష్ట్రంలో 30 ఏళ్లు పైబడిన వారిలో 25 శాతం మంది బీపీ, షుగర్‌తో బాధపడుతున్నారు.⇒ కొందరిలో బీపీ, షుగర్ సమస్యలు ఉన్నప్పటికీ సంబంధిత లక్షణాలు లేకపోవడంతో బయటకు తెలీడంలేదు. కానీ లోలోపల జరగాల్సిన నష్టం జరుగుతోంది.⇒ మహిళలు నెలసరిని వాయిదా వేయడం, అధిక రక్తస్రావాన్ని నియంత్రించుకోవడం కోసం వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోకుండా మందులు వాడటం..⇒ ఊబకాయం కూడా బ్రెయిన్ స్ట్రోక్‌కు దారి తీస్తోంది. ⇒ శారీరక శ్రమ లేకపోవడం.తీసుకోవాల్సిన జాగ్రత్తలు..⇒ రోజుకు 45 నిమిషాలు నడవాలి, ఇతర వ్యాయామాలు చేయాలి.⇒ ఆహారంలో 25 శాతం పండ్లు, 30 శాతం కూరగాయలు, 25 శాతం పిండి పదార్థాలు, 20 శాతం ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి. జంక్ ఫుడ్‌ను పూర్తిగా నియంత్రించాలి.⇒ శరీర బరువును నియంత్రించుకోవాలి. బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉంటే తరుచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.⇒ తీవ్ర ఒత్తిడికి లోనవ్వకుండా ఉండాలి. ఆరు గంటలు నిద్రపోవాలి.జీవనశైలి మార్పుపై దృష్టిపెట్టాలి..గతంలో ఎన్నడూ లేనట్లుగా ఈ మధ్య కాలంలో యంగ్ ఏజ్ స్ట్రోక్ కేసులు ఎక్కువగా చూస్తున్నాం. సాధారణంగా 55 ఏళ్లు పైబడిన వారిలోనే స్ట్రోక్ ఎక్కువగా వస్తుంది. అయితే, ప్రస్తుతం అందుకు భిన్నంగా కేసులు వస్తున్నాయి. 25 ఏళ్లు, అంతకంటే చిన్న వయస్సు వాళ్లు బ్రెయిన్ స్ట్రోక్ బారినపడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఆధునిక జీవనశైలి. యువతలో కొందరు ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్లకు అలవాటుపడుతున్నారు. ఇది కొందరిలో వ్యసనంగా మారుతోంది. ఇలాంటి వారిలో ఐదేళ్ల అనంతరం స్ట్రోక్ రావడానికి అవకాశముంది. ఈ క్రమంలో ప్రజలు జీవనశైలి మార్పు చేసుకోవడంతో పాటు బీపీ, షుగర్, ఊబకాయం నియంత్రించుకోవడంపై దృష్టిపెట్టాలి. మరోవైపు.. స్ట్రోక్ బాధితులను గోల్డెన్ హవర్లో ఆస్పత్రికి తీసుకొస్తే ప్రాణాపాయం నుంచి రక్షించడానికి ఆస్కారం ఉంటుంది. – డాక్టర్ ఎన్. వెంకటసుందరాచారి, న్యూరాలజిస్ట్, మచిలీపట్నం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ -
ఉప్పు తగ్గించండిరా బాబోయ్! ఏటా 25 లక్షలమందికి ముప్పు
ప్రపంచవ్యాప్తంగా మే 17న వరల్డ్ హైపర్ టెన్షన్ డే జరుపుకుంటారు. హైబీపీ అనేది సెలంట్ కిల్లర్ లాంటిది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రధానంగా ఉప్పువల్లే ముప్పు ఏర్పడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. ఎక్కువ ఉప్పు వాడకం కారణంగానే ఏటా ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది.ప్రపంచవ్యాప్తంగా ఉప్పు వాడకం అధికం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, గుండెపోటు సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. రోజుకు ఒక టీ స్పూన్ కంటే ఎక్కువ ఉప్పు తింటే రక్తపోటు పెరుగుతుందని తెలిపింది. ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే లక్షల మందిని ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని కూడా పేర్కొంది.పెద్దలు సగటున రోజుకు 4310 మిల్లీ గ్రాములు (సుమారు 10.78 గ్రాముల ఉప్పుకు సమానం) సోడియం తీసుకుంటున్నారని, ఇది సిఫారసు చేసిన పరిమితి 2000 mg (సుమారు 5 గ్రాముల ఉప్పు) కంటే ఇది రెండింతలు ఎక్కువని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. దీని వల్ల హృదయ సంబంధ వ్యాధులు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ఊబకాయం, బోలు ఎముకల వ్యాధి, మెనియర్స్ వ్యాధి ,మూత్రపిండాల వ్యాధితో సహా వివిధ ఆరోగ్య సమస్యలొస్తాయని తెలిపింది. దీని వల్ల ఏటా 1.89 మిలియన్ల మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించింది.డైనింగ్ టేబుల్ నుంచి ఉప్పు తీసేయండిప్రాసెస్ చేసిన ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలనీ, తాజా ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలని సూచించింది.నకు బదులుగా సుగంధ ద్రవ్యాలు, వన మూలికలను వాడమని సూచించింది. ఉప్పు వాడకాన్ని తగ్గించేందుకు ఖర్చు పెట్టే ప్రతి డాలర్‌కు ప్రతిగా 12 డాలర్ల విలువైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. అంతేకాదు డైనింగ్ టేబుల్ నుండి తొలగించాలంటూ సలహా ఇచ్చింది. కమర్షియల్ సాస్‌లు, ఫుడ్స్ తగ్గించాలని కూడా కోరింది. ఉప్పు వాడకాన్ని తగ్గించేందుకు ఖర్చు పెట్టే ప్రతి డాలర్‌కు , బదులుగా 12 డాలర్ల విలువైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వివరించింది. -
ప్రపంచానికి పొంచివున్న మరో మహమ్మారి ముప్పు: డిసీజ్ ‘ఎక్స్’
కోవిడ్-19 మహమ్మారితో అల్లాడిపోయిన ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. కోవిడ్-19 కంటే 20 రెట్లు ప్రాణాంతకం కావచ్చట. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనికి ఇచ్చిన పేరు డిసీజ్ ‘ఎక్స్’ (Disease X). నిపుణుల అభిప్రాయం ప్రకారం, వ్యాధి X ఎప్పుడైనా ,ఎక్కడైనా పెరుగుతుంది. లేదా ఇప్పటికే ప్రస్తుతం ఎక్కడో పెరుగుతూ ఉండవచ్చు లేదా ఇప్పటికే పెరిగి ఉండవచ్చు. దీని ఆవిర్భావాన్ని అంచనా వేయడం అంత తేలిక కాదని, మరో విధంగా చెప్పాలంటే డిసీజ్ X తో మానవజాతి అంతం కావచ్చేనే అంచనాలు కూడా ఉన్నాయి. డిసీజ్ ఎక్స్ రూపంలో ప్రపంచానికి మరో పెను ప్రమాదం పొంచి ఉందని వారు జాన్స్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ హెల్త్ సెక్యూరిటీలో సీనియర్ స్కాలర్ అమేష్ అడాల్జా ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త వైరస్‌ను ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే ఇది కొత్తది కాదని 2018 నుండి ఎక్స్ వ్యాధి గురించి చర్చ ఉందని అమేష్ అడాల్జా తెలిపారు. వైరస్ ద్వారా రావచ్చు. లేదా ఒక జంతు జాతి నుండి మానవునికి వ్యాపించి కొత్త లక్షణాలను అభివృద్ధి చేసే మహమ్మారిగా మారవచ్చు అని అంచనావేశారు. 90 శాతం సాధారణ జలుబు లేదా న్యుమోనియాగా ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు. టీకాలు, యాంటీవైరల్‌లు, మోనోక్లోనల్ యాంటీ బాడీలు, డయాగ్నస్టిక్ సెంటర్లు ఎంత వేగంగా అందుబాటులో ఉంటే మహమ్మారిని నిలువరించడం అంత సులభం అవుతుందన్నారు. ముఖ్యంగా డబ్ల్యూహెచ్‌వో, సీడీసీ, యూరోపియన్ సీడీడీ, యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ వంటి ఇతర పబ్లిక్ హెల్త్ ఏజెన్సీలు సంసిద్ధంగా ఉండాలన్నారు. అలాగే కరోనామహమ్మారి తరహాలో డిసీజ్ ఎక్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిపై ప్రభావం చూపిస్తుందని బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ కు నాయకత్వం వహిస్తున్న డేమ్ కేట్ బింగ్ హామ్ ఇటీవల వెల్లడించారు. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న అనేక వైరస్లు వేగంగా రూపాంతరం చెందుతున్నాయని, అయితే వాటినన్నింటిని ప్రమాద కరమైనవిగా పరిగణించలేమని, వాటిలో కొన్ని ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని పేర్కొన్న సంగతి తెలిసిందే. -
గరళ కంఠ భారతం
ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి అంటూ రొమ్ము విరుచుకుంటున్న మనకు ఇప్పుడు పెద్ద అపకీర్తి కిరీటమూ దక్కింది. ప్రపంచంలోకెల్లా అత్యంత కలుషిత దేశాల్లో భారతదేశం ఒకటని తాజాగా తేలింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ సంస్థ ‘ఐక్యూ ఎయిర్’ మొత్తం 134 దేశాలు, ప్రాంతాల్లోని 7,812 నగరాలలో 30 వేలకు పైగా వాయు నాణ్యతా పర్యవేక్షక కేంద్రాల నుంచి డేటా సేకరించి ఈ నివేదికను అందించింది. వారి ప్రపంచ వాయు నాణ్యతా నివేదిక ప్రకారం అత్యంత కాలుష్యదేశాల్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ల తర్వాత మూడో స్థానం భారత్‌దే. 2022లో ఎనిమిదో స్థానంలో ఉన్న భారత్ ఒక్క ఏడాది కాలంలో కాలుష్యంలో మూడో ర్యాంకుకు చేరడం ఆందోళన రేపుతోంది. పైగా, ప్రపంచంలోకెల్లా అత్యంత కలుషిత రాజధాని అనే దుష్కీర్తి వరుసగా రెండో ఏడాది కూడా మన ఢిల్లీకే దక్కింది. అవి చాలదన్నట్టు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా బెగూసరాయ్ నిలవడం దిమ్మ తిరిగేలా చేస్తోంది. ప్రపంచంలో గత ఏడాది ఎదురైన ఆరోగ్య విపత్తు వాయు కాలుష్యమని నిపుణుల మాట. మన దేశంలో శిలాజ ఇంధనాల వినియోగం ప్రధాన కాలుష్యకారకం కాగా, ఉత్తరాదిన ఖరీఫ్ సీజన్లో పంట వ్యర్థాల్ని కాల్చే అలవాటుకు సరైన ప్రత్యామ్నాయం చూపడంలో పాలకుల వైఫల్యాలు సైతం ఢిల్లీ దుఃస్థితికి కారణమై వెక్కిరిస్తున్నాయి. అయితే, మెట్రోలు, గౌహతి – పాట్నా లాంటి ద్వితీయ శ్రేణి నగరాలే కాదు... బిహార్‌లోని బెగూసరాయ్, హర్యానాలోని రోహ్తక్, యూపీలోని మీరట్ లాంటి చిన్న పట్నాలు సైతం వాయు గరళంతో నిండిపోతున్నాయని నివేదిక తేల్చింది. ఐక్యూ ఎయిర్ జాబితాలోని 83 భారతీయ నగరాల్లో చాలావాటిలో కాలుష్య కారకాలు ఏమిటనే సమాచారం లేదు. అలాగే, బెగూసరాయ్ లాంటి చోట ఏడాది తిరగక ముందే కాలుష్యం 6 రెట్లు ఎలా పెరిగిందనేది కనిపెట్టాల్సి ఉంది. కారణాల్ని అంచనా వేస్తూనే, ముంచుకొచ్చిన ఈ ముప్పును విధానపరమైన పరిష్కారాలతో సమర్థంగా ఎదుర్కోవడం పాలకుల ముందున్న సవాలు. గాలిలో ధూళికణాల (పీఎం) సాంద్రత ఏ మేరకున్నదనే దాన్ని బట్టి వాయుకాలుష్య ర్యాంకులు నిర్ణయిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మార్గదర్శకాల ప్రకారం క్యూబిక్ మీటర్‌కు 5 మైక్రోగ్రాములు ఫరవాలేదు. అలాకాక, ధూళికణాలు 2.5 మైక్రాన్లు లేదా అంతకన్నా తక్కువ వ్యాసం (పీఎం 2.5) ఉన్నప్పుడు ఊపిరితిత్తుల, గుండె జబ్బులు, క్యాన్సర్, చిన్న వయసులోనే మర ణాలు సంభవిస్తాయి. కాబట్టి అది ప్రమాదఘంటికకు కొలమానం. 2023లో భారత్‌లో వార్షిక సగటు పీఎం2.5 సాంద్రత క్యూబిక్ మీటర్‌కు 54.4 మైక్రోగ్రాములుగా రికార్డయింది. అలా భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఇక, క్యూబిక్ మీటర్‌కు 79.9 మైక్రోగ్రాములతో బంగ్లాదేశ్ మొదటి స్థానంలో, క్యూబిక్ మీటర్‌కు 73.3 మైక్రోగ్రాములతో పాకిస్తాన్ రెండోస్థానంలో ఉన్నాయి. నిజానికి, మిగతా రెండు దేశాలతో పోలిస్తే, భారత్ పీఎం2.5 సాంద్రత 2021 నాటి నుంచి తగ్గింది. అప్పట్లో భారత్‌లో క్యూబిక్ మీటర్‌కు 58.1 మైక్రోగ్రాములు ఉండేది. ఇప్పుడది 54.4కు తగ్గిందన్న మాటే కానీ ఇవాళ్టికీ ప్రపంచ టాప్ 50 కాలుష్య నగరాల్లో 42 మన దేశంలోవే కావడం కలతపరిచే అంశం. దేశ జనాభాలో కొద్ది మంది మినహా దాదాపు 136 కోట్లమంది నిత్యం డబ్ల్యూహెచ్ఓ మార్గ దర్శకాలను మించి పీఎం2.5 ధూళికణ సాంద్రతకు లోనవుతున్నవారే! మరీ ముఖ్యంగా, మన దేశంలోని పట్టణప్రాంతాల్లో అధిక శాతం మంది ఇలా నిత్యం కాలుష్యం కోరల బారిన పడుతూ, శ్వాస కోశ సమస్యలతో డాక్టర్ల చుట్టూ తిరుగుతుండడం తరచూ కంటి ముందు కనిపిస్తున్న కథే. మిగిలి నవి అటుంచితే, భారత్‌లో ఉత్పత్తి అయ్యే విద్యుచ్ఛక్తిలో 70 శాతం థర్మల్ విద్యుత్తే అన్నది గమనార్హం. ఇప్పటికీ మనం పునరుత్పాదక శక్తి వనరుల మార్గం పట్టలేదు. పైపెచ్చు, దేశ ఆర్థిక వృద్ధి మరింత వేగవంతమయ్యేకొద్దీ ఇది పెను సవాలు కానుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఇంటి పైకప్పులపై సౌరవిద్యుత్ ఫలకాల ఏర్పాటు లాంటి భారీ ప్రణాళికలు ప్రకటించింది. అయితే, ఇవన్నీ ఆచరణ లోకొచ్చి, ప్రభావం చూపడానికి మరికొంత సమయం పడుతుంది. ఇలాంటి ప్రయత్నాలు గణనీ యంగా ప్రభావం చూపాలంటే, మన విద్యుత్ విధానాలను సమూలంగా మార్చడం ముఖ్యం. అసలు ‘స్వచ్ఛమైన గాలి’ కూడా ప్రాథమిక జీవనహక్కే. కోర్టులు ఆ సంగతి పదేపదే చెప్పాయి. బరిలోకి దిగక తప్పని పరిస్థితిని ప్రభుత్వాలకు కల్పించాయి. అయితే, పౌర రవాణాలో సీఎన్జీ, మెట్రో వ్యవస్థ, ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్’ లాంటివి తీసుకొచ్చినా ఢిల్లీ లాంటి చోట్ల కాలుష్యం కోరలు చాస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు సమస్య అవగాహన, పరిష్కారానికై శాస్త్ర విజ్ఞానాన్ని ఆశ్రయించాలి. అలాగే, కాలుష్య నియంత్రణకు అవసరమైన రీతిలో జనజీవితంలో అలవాట్లు మారేలా ప్రోత్సాహకాలు, అతిక్రమిస్తే జరిమానాల పద్ధతి తేవాలి. సర్వజన శ్రేయస్సు కోసం పార్టీలన్నీ కాలుష్యంపై పోరును రాజకీయ అంశంగా తీసుకొని, ఎన్నికల మేనిఫెస్టోల్లో చోటివ్వాలి. నిజానికి, జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమాన్ని పటిష్ఠం చేస్తామంటూ 2019లో కాంగ్రెస్, బీజేపీలు తమ ఎన్నికల వాగ్దానపత్రంలో పేర్కొన్నాయి. ఇది కేవలం కేంద్రం పనే కాదని గుర్తించి, రాష్ట్రాల నుంచి మునిసిపాలిటీల దాకా అన్నీ తమ వంతుగా కాలుష్యంపై పోరులో చేతులు కలపాలి. వాయు కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యమే కాక, దరిమిలా సంక్లిష్టమైన పర్యావరణ ప్రక్రియలతో పుడమి వాతావరణమే దెబ్బతింటుందని శాస్త్రవేత్తల మాట. అందుకని ఈ విషానికి విరుగుడు కనిపెట్టడం అన్ని విధాలా అత్యవసరం. ఈ క్రమంలో తాజా ఐక్యూ ఎయిర్ నివేదిక మనకు మరో మేలుకొలుపు. -
రంజాన్ ఉపవాసాలపై డబ్యూహెచ్ఓ మార్గదర్శకాలు!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లీంలకు అత్యంత పవిత్రమైన నెలల్లో ఒకటి ఈ రంజాన్ మాసం. ఇస్లామిక్ చంద్ర క్యాలెండర్లో తొమ్మిదవ నెల ఈ మాసం. ఈ రంజాన్ మాసం భారత్‌లో మార్చి 12( మంగళవారం) నుంచి ప్రారంభమవుతోంది. ఈ మాసంలో ముస్లీం సోదరులంతా ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారు. ఈ పవిత్ర మాసం ప్రారంభమయ్యేది సరిగ్గా వేసవికాలం. ఈ నేపథ్యంలో ఆ ఉపవాసలు చేసే సమయంలో ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్యూహెచ్ఓ) కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి ఏడాదిలోనే ఈ రంజాన్ మాసంలో కూడా కొన్ని మార్గదర్శకాలను అందించింది. ఉపవాసాలు చేస్తూ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకునే యత్నం చేయమని కోరింది. ఈ ఉపవాస సమయాల్లో సమతుల్య ఆహారం తీసుకోవాలిన సూచించింది. ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్లో చెమట రూపంలో నీరు బయటకు వెళ్లిపోతుంది కాబట్టి డీ హైడ్రేట్ అయ్యి అలిసిపోకుండా ఉండేలా బలవర్థకమైన ఆహారం తీసుకోమని సూచించింది. తీసుకునే ఆహారంలో ఉప్పు మితంగా ఉండేలా చూసుకోమని సూచించింది. అలాగే ఈ ఉపవాస సమయాల్లో బేకింగ్‌తో చేసిన పదార్థాలను అస్సలు తీసుకోవద్దని చెబుతోంది. అలాగే డీప్ ఫ్రై చేసే వంటకాల జోలికి వెళ్లకపోవడమే మంచిదని తెలిపింది. సాధ్యమైనంత వరకు ఆవిరిపై ఉడికించినవి, కాల్చిన పదార్థాలను తీసుకోవడం ఉత్తమని చెబుతోంది. అలాగే కాస్త వ్యాయామం చేయమని చెబుతోంది. ఎందుకంటే ఉపవాసం విరమించాక ఎక్కువ మొత్తంలో తెలియకుండా ఆహారం తీసుకుంటాం కాబట్టి ఫిట్‌గా ఉండేలా చూసుకోవడం ముఖ్యం అని సూచించింది. అలాగే పొగాకు, మద్యపానానికి దూరంగా ఉండమని ఆరోగ్య సంస్థ కోరింది. ఆహ్లాద భరితంగా ఈ రంజాన్ మాసాన్ని సెలబ్రేట్ చేసుకోవడం తోపాటు ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుకోమని సూచించింది. (చదవండి: ఇవాళ నుంచే రంజాన్ ఉపవాస దీక్షలు..ఆ దేశాల్లో మాత్రం..!) -
యూరప్ దేశాలను వణికిస్తున్న పారెట్ ఫీవర్
యూరప్‌లోని అనేక దేశాల్లో పారెట్ ఫీవర్ విజృంభిస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకూ ఐదుగురు మృతి చెందారు. పారెట్ ఫీవర్‌ను సిటాకోసిస్ అని కూడా అంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పారెట్ ఫీవర్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరించింది. యూరప్ దేశాల్లో నివసించే వారిపై పారెట్ ఫీవర్ తీవ్ర ప్రభావం చూపుతోంది. 2023 ప్రారంభంలో విధ్వంసం సృష్టించిన ఈ వ్యాధి.. ఇప్పుడు 2024 ప్రారంభంలో ఐదుగురి ప్రాణాలను బలిగొంది. గత ఏడాది ఆస్ట్రియాలో 14 పారెట్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 27 నాటికి డెన్మార్క్‌లో ఈ అంటువ్యాధికి సంబంధించిన 23 కేసులు నిర్ధారితమయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. డెన్మార్క్‌లో ఒక వ్యక్తిలో ఈ వ్యాధి కనిపించింది. ఈ ఏడాది ఇప్పటికే జర్మనీలో ఐదు కేసులు నమోదయ్యాయి. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపిన వివరాల ప్రకారం పెంపుడు జంతువులు లేదా అడవి పక్షులతో అనుబంధం కలిగిన వారే అధికంగా ఈ వ్యాధి బారి పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. పారెట్ ఫీవర్ అనేది క్లామిడియా ఇన్ఫెక్షన్ కారణంగా వస్తుంది. ఇది వివిధ రకాల అడవి జంతువులు, పెంపుడు పక్షులు, కోళ్లలో కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకిన పక్షులు అనారోగ్యంగా కనిపించకపోవచ్చు. కానీ అవి శ్వాస లేదా మలవిసర్జన చేసినప్పుడు బ్యాక్టీరియాను విడుదల చేస్తాయి. ఇదే వ్యాధి వ్యాప్తి చెందడానికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే రెండవ చిన్న ఖండమైన యూరప్‌లో 50 వరకూ సర్వసత్తాక దేశాలు ఉన్నాయి. -
కోవిడ్‌ను మించిన వ్యాధి మనల్ని కబళిస్తుందా?
మొన్నటి వరకూ ప్రపంచాన్ని కోవిడ్-19 వణికించింది. దీని నుంచి కాస్త దూరవుతున్నామనేంతలోనే ఇప్పుడు మరొక ప్రాణాంతక వ్యాధి సమస్త మానవాళిని చుట్టుముట్టేలా ఉంది. ప్రపంచవ్యాప్తంగా త్వరగా వ్యాపించగల ఈ కొత్త వ్యాధికి ‘డిసీజ్ ఎక్స్’ అనే పేరు పెట్టారు. కరోనా మాదిరిగానే ఈ వ్యాధి కూడా మనిషి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. ప్రాణాలను కూడా మింగేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2016లోనే ఈ వ్యాధి పేరును మొదటిసారి ప్రకటించింది. భవిష్యత్తుకు ముప్పుగామారిన ఈ వ్యాధి విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తీవ్రంగా హెచ్చరించింది. 2019లో కోవిడ్-19 వేగంగా వ్యాపించడం వల్ల అనేక దేశాలలో బాధితులకు సహాయం చేయడానికి తగినంత మంది వైద్యులు, నర్సులు, మందులు, పరికరాలు అందుబాటులో లేక అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పటికీ కోవిడ్-19 ప్రపంచానికి పెద్ద సమస్యగానే ఉంది. కొందరు శాస్త్రవేత్తలు డిసీజ్ ఎక్స్ వ్యాధి నుంచి మానవాళిని రక్షించేందుకు వ్యాక్సిన్లను తయారు చేసేందుకు కృషి చేస్తున్నారు. కోయలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్ అనే గ్రూప్ వ్యాక్సిన్ తయారీకి కృషిచేస్తోంది. ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఈ కొత్త వ్యాధి గురించి సమగ్రంగా తెలుసుకున్న తర్వాత వ్యాక్సిన్లను తయారీ సులభమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంచనాలకు అందని డిసీజ్ ఎక్స్ డిసీజ్ ఎక్స్ ఎంత ఘోరంగా ఉండనుందో ఇప్పటికీ శాస్త్రవేత్తలు అంచనావేయలేకపోతున్నారు. ఇది తేలికపాటి జలుబు మాదిరిగా ఉండవచ్చు లేదా కోవిడ్-19 కంటే చాలా ప్రాణాంతకం కావచ్చని వారు భావిస్తున్నారు. ఏ సూక్ష్మక్రిమి దీనికి కారణంగా నిలుస్తున్నదో, దానిని ఏ విధంగా కనుగొనాలో, ఎటువంటి చికిత్స అందించాలో వైద్యులకు కూడా అంతుచిక్కడం లేదు. అందుకే ఈ వ్యాధి విషయంలో అప్రమత్తత అవసరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. డిసీజ్ ఎక్స్ వ్యాధి సోకిన బాధితుడు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఆ డ్రాప్స్ ద్వారా వ్యాధి వ్యాపించవచ్చు. బాధితుడు తాకిన వస్తువులపై నిలిచిన సూక్ష్మక్రిములు ద్వారానూ ఈ వ్యాధి సంక్రమించవచ్చు. ఈ వ్యాధి క్రిములను మోసే కీటకాల నుంచి కూడా వ్యాప్తి చెందవచ్చంటున్నారు వైద్య శాస్త్రవేత్తలు. జంతువుల నుంచి.. డిసీజ్ ఎక్స్ అనేది కోతులు, కుక్కలు తదితర జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే దీనిపై పూర్తి స్థాయిలో సమాచారం లేదు. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఒక ఊహాజనిత వ్యాధి. దీని కారణంగా ప్రపంచం మొత్తం మీద తీవ్రమైన అంటువ్యాధులు సంభవించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. రాబోయే కాలంలో జంతువుల నుంచి మానవులకు సోకే పలు రకాల వ్యాధుల్లో ఇదీ ఒకటి కానుంది. అంటువ్యాధులను వ్యాప్తి చేయడంలో ఇది కీలక పాత్ర పోషించనుందని ప్రపంచ ఆరోగ్యం సంస్థ చెబుతోంది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న పలు వైరస్లు గతంలో కంటే వేగంగా రూపాంతరం చెందుతున్నాయని, ఇవి మనుషులపై తీవ్ర ప్రభావం చూపించవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. వాటిలో ఏదైనా వైరస్ మహమ్మారిగా రూపాంతరం చెందవచ్చని కూడా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. డిసీజ్ ఎక్స్ సోకినపుడు బాధితునికి జ్వరం, నరాల తిమ్మిరి, మెడ నొప్పి, వెన్నునొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు, వికారం, మూర్ఛ వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ వ్యాధి వ్యాపిస్తే కోవిడ్‌ను మించిన ప్రమాదం వాటిల్లవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అందుకే ప్రతీఒక్కరూ పరిశుభ్రత, పోషకాహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.