నగదు బహుమానాల నుంచి స్కాలర్‌షిప్‌ల వరకు కోళ్ల దగ్గర్నుంచి కొత్త కార్ల వరకు గిఫ్ట్ వోచర్ల నుంచి స్క్రాచ్ కార్డుల వరకు రండి బాబూ రండి అంటూ.. వివిధ దేశాలు ప్రజల్ని ఆఫర్లతో ముంచేస్తున్నాయి. ఇదంతా ఏ కంపెనీయో తమ వాణిజ్యాన్ని పెంచుకోవడానికి కాదండీ. మరి దాని కథా కమామిషు ఏంటో చూద్దాం..
. ఇప్పటివరకు తమ వ్యాపారాలను పెంచుకోవడానికి వాణిజ్య సంస్థలు ఇలాంటి గిఫ్ట్ వోచర్లు, నగదు బహుమానాలు ఇవ్వడం మనకి తెలుసు. ఇప్పుడు కరోనా మహమ్మారిని ప్రపంచం నుంచి తరిమి కొట్టాలంటే ఇదొక్కటే మార్గమని వివిధ దేశాలు భావిస్తున్నాయి. ప్రభుత్వాలకి అండగా కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. చివరికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాక్సిన్ వేసుకుంటే 100 డాలర్లు ఇవ్వాలంటూ రాష్ట్రాలకు పిలుపునివ్వడం విశేషం.
–నేషనల్ డెస్క్, సాక్షి
ఆఫర్లు ఇలా...
► రష్యా రాజధాని మాస్కోలో కోవిడ్–19 రెండు డోసులు తీసుకున్న వారికి ప్రతీ వారం లక్కీ డ్రా తీసి అయిదుగురికి కార్లు ఇస్తోంది.
► బ్రిటన్‌లో యువత వ్యాక్సిన్ తీసుకుంటే వివిధ కంపెనీలు కార్లలో ఉచితంగా టీకా కేంద్రాలకు తీసుకువెళ్లడం, పిజ్జాలు ఇవ్వడానికి ముందుకొచ్చాయి.
► అమెరికాలో ఒక్కో రాష్ట్రం ఒక్కో విధానాన్ని అవలంబిస్తోంది. ఎక్కువ రాష్ట్రాలు నగదు బహుమానాలు ఇస్తున్నాయి. కాలిఫోర్నియాలో 50 డాలర్ల విలువ జేసే గిఫ్ట్ వోచర్లను 20 లక్షల మంది వరకు ఇచ్చింది. ఓహియో మరో అడుగు ముందుకేసి కాలేజీ విద్యార్థులు వ్యాక్సిన్ వేయించుకుంటే స్కాలర్‌షిప్‌లు అందిస్తామని ప్రకటించింది. న్యూయార్క్ రాష్ట్రం వ్యాక్స్ అండ్ స్క్రాచ్ అంటూ స్క్రాచ్ కార్డులను ప్రవేశపెట్టింది. టీకా తీసుకున్న వారికి ఇచ్చిన స్క్రాచ్ కార్డులో 20 డాలర్ల నుంచి 10 లక్షల డాలర్ల వరకు ఎంతైనా ఉండొచ్చు. ఇక ఎవరి అదృష్టం వారిది.
► ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్‌లలో కొన్ని ప్రాంతాల్లో టీకా వేసుకున్న వారికి ఆవుల్ని ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించాయి.
► దుబాయ్‌లో వ్యాక్సిన్ వేయించుకున్న వారికి జిమ్స్, ఫిటినెస్ సెంటర్లకి ఉచితంగా వెళ్లొచ్చు
► ఇండోనేసియాలో ఒక టీకా డోసు తీసుకొని ఎంచక్కా కోడిని ఇంటికి తీసుకువెళ్లి కూర వండుకొని లాగించేయొచ్చు
► చైనాలో టీకా తీసుకుంటే నిత్యావసర సరుకులపై డిస్కౌంట్‌లు, ఉచితంగా గుడ్లు పంపిణీ చేస్తున్నారు.
► సెర్బియాలో వ్యాక్సిన్ వేయించుకున్న ప్రతీ ఒక్కరికీ 30 డాలర్ల నగదు బహుమతి ఇస్తున్నారు.
► ఇజ్రాయెల్‌లో వ్యాక్సిన్ వేయించుకుంటే ప్రభుత్వం ఆస్తి పన్నులో డిస్కౌంట్ ఇస్తోంది.
► హాంకాంగ్‌లో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏకంగా వ్యాక్సిన్ తీసుకుంటే లక్కీ డ్రా తీసి అపార్ట్‌మెంట్ ఇవ్వడానికి ముందుకొచ్చాడు. మరికొన్ని వాణిజ్య సంస్థలు వజ్రాలు పొదిగిన వాచీలు, బంగారం బిస్కెట్‌ల్ని కూడా ఆఫర్లుగా ఇస్తున్నాయి.
► ఊబర్ సంస్థ భారత్ సహా వివిధ దేశాల్లో టీకా కేంద్రాలకు ఉచితంగా ప్రజల్ని తీసుకువెళుతోంది.
► భారత్‌లోని చెన్నైలో ఒక వాణిజ్య సంస్థ లక్కీ డ్రా తీసి వాషింగ్ మిషన్లు ఇస్తూ ఉంటే, అరుణాచల్ ప్రదేశ్‌లో ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు.
ఎందుకీ ప్రోత్సాహకాలు?
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు రేయింబవళ్లు శ్రమించి కోవిడ్–19 వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చారు. అయితే, దీనిపై ఉన్నన్ని అపోహలు అన్నీఇన్నీ కావు. ఇప్పటి వరకు ప్రపంచ జనాభాలో కేవలం 15% మంది రెండు డోసులు తీసుకుంటే, ఒక్క డోసు తీసుకున్న వారు 29% మంది మాత్రమే ఉన్నారు. దీంతో, కొన్ని దేశాలు కరోనా టీకా తీసుకోకపోతే కఠినమైన నిబంధనలు విధిస్తున్నాయి. వీటిపై కూడా ప్రజల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్న వారికి హెల్త్ పాస్‌లు ఇచ్చి, అవి ఉంటేనే రెస్టారెంట్‌లలో అనుమతి ఉంటుందని ఇటీవల ఫ్రాన్స్ పార్లమెంటు ఒక బిల్లును ఆమోదించగా దీనిపై ఆ దేశ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. టీకా తప్పనిసరిగా తీసుకోవడం అంటే తమ వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని వారు నిరసన తెలిపారు. ఈ పరిణామాల నడుమ టీకాలు తీసుకుంటే ఇన్సెంటివ్‌లు ఇవ్వడమే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇన్సెంటివ్‌లు సరైనవేనా?
కరోనా టీకాపై ప్రజల్లో ఉన్న భయాందోళనలు పోగొట్టి, వారికి వైద్య శాస్త్రంపై విశ్వాసం కలిగించాల్సిన ప్రభుత్వాలు ఇలా ప్రోత్సాహకాల వల వెయ్యడంపై చాలా చోట్ల చర్చ జరుగుతోంది. కరోనా వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా తీసుకోవాలన్న నిబంధనలు విధించడానికి బదులుగా ప్రజలకి ఆసక్తి కలిగించేలా ప్రోత్సాహకాలు ఇవ్వడం సరైందేనని అమెరికాలోని జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ పబ్లిక్ హెల్త్ డిప్యూటీ డైరెక్టర్ నాన్సీ కాస్ అభిప్రాయపడ్డారు. కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ తీసుకోకపోతే కఠినమైన నిబంధనలు, జరిమానాలు విధిస్తున్నారని, అటువంటి వాటి కంటే ప్రోత్సాహకాలు చాలా మెరుగైనవని ఆమె పేర్కొన్నారు.
మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కూడా చిన్న పిల్లలకు కొన్ని రకాల వ్యాక్సిన్లు ఎలా తప్పనిసరో, కరోనా టీకాని కూడా తప్పనిసరి చేయాలని సూచిస్తోంది. ఇలా ఉండగా, 100 డాలర్లు ఇస్తామంటే కరోనా టీకా తీసుకోవడానికి అమెరికాలోని మూడో వంతు ప్రజలు సిద్ధమేనని ఇటీవల కాలిఫోర్నియా యూనివర్సిటీ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాల ప్రజలకు కరోనా మహమ్మారి నుంచి విముక్తి కల్పించాలంటేæ టీకా మినహా మరో గత్యంతరం లేదని, అందుకే ఏం చేసైనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడమే మేలని అత్యధికులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment