కరోనా తాలూకు కల్లోలం నుంచి మనమింకా పూర్తిగా తేరుకొనే లేదు. డిసీజ్ ఎక్స్‌గా పేర్కొంటున్న మరో ప్రాణాంతక వైరస్ అతి త్వరలో ప్రపంచాన్ని మరోసారి అతలాకుతలం చేయనుందట. సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థే చేస్తున్న హెచ్చరిక ఇది! 2019లో వెలుగు చూసినా కరోనా డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా కనీసం 70 లక్షల ప్రాణాలు తీసింది. కానీ కొత్త రోగం హీనపక్షం 5 కోట్ల మందిని కబళించవచ్చన్న అంచనాలు ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. పైగా డిసీజ్ ఎక్స్ ఇప్పటికే తన ప్రభావం మొదలుపెట్టి ఉండొచ్చని కూడా డబ్ల్యూహెచ్‌ఓ సైంటిస్టులను ఉటంకిస్తూ డైలీ మెయిల్ పేర్కొంది.
ఆ ఊహే భయానకంగా ఉంది కదా!
కరోనా. ఈ పేరు వింటే చాలు ఇంకా ఉలిక్కిపడుతూనే ఉంది ప్రపంచం. ఆధునిక ప్రపంచ చరిత్ర ఒక రకంగా కరోనాకు ముందు, తర్వాత అన్నట్టుగా తయారైంది. మరి కోవిడ్‌ను మించిన వైరస్ మరోసారి ప్రపంచం మీదికి వచి్చపడితే? కానీ అది అతి త్వరలో నిజమయ్యే ఆస్కారం చాలా ఉందని స్వయానా ప్రపంచ ఆరోగ్య సంస్థే అంటోంది! ప్రస్తుతానికి ఎక్స్‌గా పిలుస్తున్న సదరు ప్రాణాంతక వైరస్ మన ఉసురు తీయడం ఖాయమట.
తీవ్రతలో కోవిడ్ కంటే ఇది ఏడు రెట్లు ఎక్కువని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొనడం ఆందోళనలను మరింతగా పెంచుతోంది. ప్రస్తుతానికి ఎక్స్‌గా పిలుస్తున్న ఈ పేరు పెట్టని వైరస్ ప్రపంచవ్యాప్తంగా హీనపక్షం 5 కోట్ల మందిని బలి తీసుకోవడం ఖాయమని సైంటిస్టులను ఉటంకిస్తూ హెచ్చరిస్తోంది. అంత డేంజరస్ కరోనా కూడా నిజానికి మున్ముందు మానవాళిని కబళించబోయే మహా మహమ్మారులకు ట్రెయిలర్ మాత్రమేనని జోస్యం చెబుతోంది...!
తెలిసిన వైరస్ నుంచే..?
డిసీజ్ ఎక్స్ మనకిప్పటికే తెలిసిన వైరస్ నుంచే పుట్టుకొచ్చి ఉంటుందని బ్రిటన్ వాక్సిన్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డేమ్ కేట్ బిన్ హామ్ చెబుతున్నారు. వినడానికి కఠోరంగా ఉన్నా, మనకు ముందున్నది కష్ట కాలమేనన్నది అంగీకరించాల్సిన నిజమని ఆమె అన్నారు! ‘1918–19 మధ్య ఫ్లూ కేవలం ఒక్క ఏడాదిలోనే ఏకంగా 5 కోట్ల మందికి పైగా బలి తీసుకుంది. ఇప్పుడు కూడా మనకు ఆల్రెడీ తెలిసిన వైరస్‌లలోనే ఒకటి కనీవినీ ఎరగని రీతిలో భయానకంగా మారి అలాంటి మహోత్పాతానికే దారి తీయవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అసంఖ్యాకమైన వైరస్‌లు పరస్పరం పరివర్తనాలు చెందుతూ రూపు మార్చుకుంటున్నాయి. ఊహాతీత వేగంతో విస్తరిస్తున్నాయి. పైగా వీటి సంఖ్య ప్రస్తుతం భూమి మీద ఉన్న ఇతర అన్ని జీవరాశుల మొత్తం సంఖ్య కంటే కూడా చాలా ఎక్కువ‘ అని చెప్పుకొచ్చారు! ‘వాటిలో అన్నీ మనకు అంతగా చేటు చేసేవి కాకున్నా కొన్ని మాత్రం చాలా డేంజరస్‘ అని వివరించారు.
లోతుగా పర్యవేక్షణ
జీవ రసాయన సైంటిస్టులు ప్రస్తుతం కనీసం 25 వైరస్ కుటుంబాలను జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. వీటిలో ఒక్కో దాంట్లో వేలాది విడి వైరస్‌లు ఉన్నాయి. వాటిల్లో ఏదో ఒకటి విపరీతమైన పరివర్తనాలకు లోనై మహా మహమ్మారిగా రూపుదాల్చే ప్రమాదం పొంచి ఉందట! పైగా జంతువుల నుంచి మనుషులకు సోకగల వైరస్ లను అధ్యయనంలో భాగంగా చేయలేదు. వాటినీ కలిపి చూస్తే మానవాళికి ముప్పు మరింత పెరుగుతుందని డేమ్ హెచ్చరిస్తున్నారు.
అప్పుడే వ్యాక్సిన్ తయారీ!
ఇంకా కొత్త రోగం పేరైనా తెలియదు. ఒక్కరిలో కూడా దాన్ని గుర్తించలేదు. అప్పుడే దానికి వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నాల్లో బ్రిటన్ సైంటిస్టులు తలమునకలుగా ఉన్నారు. ఏకంగా 200 మందితో కూడిన బృందం ఈ పనిలో తలమునకలుగా ఉందట! జంతువుల నుంచి ఎలుకల ద్వారా మనుషులకు సోకే, శరవేగంగా వ్యాపించే స్వభావమున్న బర్డ్ ఫ్లూ, మంకీ పాక్స్, హంట్ వైరస్‌లనే ప్రస్తుతానికి లక్ష్యంగా పెట్టుకున్నట్టు బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్ ప్రొఫెసర్ డేమ్ జెన్నీ హారిస్ తెలిపారు. అయితే, పర్యావరణ మార్పుల వంటి మానవకృత విపత్తులకు ఇప్పటికైనా అడ్డుకట్ట వేస్తే ఎన్నో వైరస్‌లను కూడా అరికట్టినవాళ్లం అవుతామంటూ ఆయన ముక్తాయించారు! మున్ముందు మన పాలిట ప్రాణాంతకంగా మారే భయంకరమైన మహమ్మారులకు కరోనా కేవలం ఒక దారుణమైన ఆరంభం మాత్రమేనని సైంటిస్టులు ముక్త కంఠంతో చెబుతున్నారు!
అవును.. మరిన్ని మహమ్మారులు!
ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
చైనా ‘బ్యాట్ ఉమన్’ షీ జెంగ్ లీ జోస్యం
కోవిడ్ తరహా మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని చైనా ’బ్యాట్ ఉమన్’ షీ జెంగ్ లీ జోస్యం చెప్పారు. చైనాలో బెస్ట్ వైరాలజిస్ట్‌గా చెప్పే ఆమె జంతువుల నుంచి, ముఖ్యంగా గబ్బిలాల నుంచి మనుషులకు సోకే వైరస్‌లపై అపారమైన రీసెర్చ్ చేసినందుకు బ్యాట్ ఉమన్‌గా పేరుబడ్డారు. కరోనాకు పుట్టిల్లుగా నేటికీ ప్రపంచమంతా నమ్ముతున్న చైనాలోని వుహాన్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో లీ బృందం 40 కరోనా జాతులపై లోతుగా అధ్యయనం చేసింది.
వాటిలో సగానికి సగం మానవాళికి చాలా ప్రమాదకరమైనవని తేలి్చంది. వీటిలో ఆరు ఇప్పటికే మనకు సోకాయని లీ చెప్పారు! గత జూలైలో ఇంగ్లిష్ జర్నల్ ఎమర్జింగ్ మైక్రోబ్స్ అండ్ ఇన్ఫెక్షన్స్ లో పబ్లిష్ అయిన ఈ అధ్యయనం ఇటీవలే ప్రాచుర్యంలోకి వచి్చంది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలూ మరింత అప్రమత్తంగా ఉండాలని చైనాకు చెందిన మరికొందరు ప్రముఖ వైరాలజిస్టులు కూడా సూచిస్తున్నారు. గబ్బిలాలు, ఎలుకల నుంచి ఒంటెలు, పంగోలిన్లు, పందుల వంటి జంతువుల ద్వారా సమీప భవిష్యత్తులో ఇవి మనకు మరింతగా సోకే ప్రమాదం చాలావరకు ఉందని వారు హెచ్చరిస్తున్నారు!
డిసీజ్ ఎక్స్‌తో పోలిస్తే కరోనా ప్రమాదకరమైనది కానే కాదని చెప్పాలి. ఎందుకంటే కరోనాకు ఇప్పుడు దాదాపుగా అంతా ఇమ్యూన్‌గా మారాం. కానీ కొత్త వైరస్ తట్టు అంత శరవేగంగా వ్యాపించే అంటురోగానికి కారణమైతే? సోకిన ప్రతి 100లో ఏకంగా 67 మందిని బలి తీసుకున్న ఎబోలా అంతటి ప్రాణాంతకంగా మారితే? ఇదే ఇప్పుడు సైంటిస్టులను తీవ్రంగా కలవర పెడుతున్న అంశం! ప్రపంచంలో ఏదో ఇక మారుమూలలో అదిప్పటికే సడీచప్పుడూ లేకుండా ప్రాణం పోసుకునే ఉంటుంది. అతి త్వరలో ఉనికిని చాటుకుంటుంది. ఇక అప్పటి నుంచీ నిత్య కల్లోలమే!
– డేమ్ కేట్ బిన్ హామ్, బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్ చీఫ్
Comments
Please login to add a commentAdd a comment