disease attacks
-
చుట్టుముట్టిన ఆరోగ్య సమస్యలతో రాజీ పడకూడదనుకుంది..కట్‌చేస్తే..!
చుట్టుముట్టే ఆరోగ్య సమస్యలు మనకు పరోక్షంగా మంచి జీవనశైలి అవలంభించమని సంకేతమిస్తుంటాయి. మన శరీరం చెప్పే మాట వింటే ఆరోగ్యం, బరువు మన చేతిలో ఉంటుంది. లేదంటే అధిక బరువుతో లేనిపోని అనారోగ్య సమస్యలతో సతమతమవ్వక తప్పదు. కనీసం అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నప్పుడే మేల్కొని మంచి ఆహారపు అలవాట్లతో బరువు తగ్గేందుకు ఉపక్రమించి ఎందరికో స్ఫూరిగా నిలుస్తున్నారు కొందరు. అచ్చం అలానే బరువు తగ్గి ఆరోగ్యంలో రాజీ ఉండకూడదని చాటి చెప్పి శెభాష్ అనిపించుకుంది ఈ మహిళ. ఆ మహిళ పేరు రాజీ ఘంఘాస్. ఆమె జనవరి 2024లో సుమారు 155 కిలోల బరువుతో పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతుండేది. భారీకాయం వల్ల కొద్ది దూరం నడకకే ఆయాస పడిపోతుండేది. అలాగే ఈ అధిక బరువు కారణంగా ఆమె రూపం అసహ్యంగా మారడమే గాక ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టాయి. అధిక బరువు, హర్మోన్ల అసమతుల్యత, క్రమరహిత రుతుక్రమం, ప్రీ డయాబెటిక్ వంటి సమస్యలను ఎదుర్కొంది. ఆమెను చూస్తే పెద్దన్నాళ్లు ఈ బరువుతో బతకదేమో అనేంతలా ఇబ్బందులుపడింది. అప్పుడే రాజీ అనుకుంది భగవంతుడి ఇచ్చిన రూపం మార్చలేను, కానీ అనారోగ్యాన్ని భరిస్తూ మాత్రం చావలేను అని గట్టిగా నిర్ణయించుకుంది. ముందు అందం కంటే ఆరోగ్యంగా ఉండటమే ప్రధానం, పైగా అది తన చేతిలో ఉన్న అవకాశం అని గ్రహించింది రాజీ. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మంచి ఆహారపు అలవాట్లను అనుసరించింది. ముఖ్యంగా ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యత ఇచ్చింది. "రోజుని మెంతులు, యాలకులతో ఉడికించిన గోరువెచ్చని డిటాక్స్ వాటర్‌తో ప్రారంభించేది. అల్పహారంగా కూరగాయలతో నిండిన పోహా వంటివి తీసుకునేది. మధ్యాహ్నం చియా గింజల నీరు, ఓట్స్ తీసుకునేది. సాయంత్రం: గ్రీన్ టీ, మొక్కజొన్న చాట్. ఇక రాత్రికి కూరగాయలతో చేసిన శాండ్విచ్లు, డిటాక్స్ నీరు తీసుకునేది. క్రమం తప్పకుండా ఈ డైట్‌ని అనుసరించింది. తన అధిక బరువుతో ఎదురవ్వుతున్న ఆరోగ్య సమస్యలు గుర్తొచ్చి చీట్మీల్కి చోటివ్వకుండా నిబద్ధతతో ఆరోగ్యకరమైన డైట్‌ని అనుసరించింది రాజీ". అలా ఒక్క ఏడాదికే 60 కిలోలు తగ్గి 95కిలోల బరువుకి చేరింది. అయితే వెయిట్ లాస్ జర్నీ మగియలేదని అంతలా 155 కిలోల బరువు ఉన్న తాను ఇంతలా బరువు తగ్గుతానని కలలో కూడా ఊహించలేదని ఆనందంగా చెబుతోంది రాజీ. ఆరోగ్యకరమైన బరువు చేరుకునేవరకు తన వెయిట్ లాస్ జర్నీ ఆగదని సోషల్ మీడియా వేదికగా తన అనుభవాల్ని షేర్ చేసుకుంది. View this post on Instagram A post shared by Rajii Ghanghas (@rajiighanghas) (చదవండి: సింగిల్ పేరెంటింగ్ సవాలుని సులభంగా అధిగమించండిలా..!) -
ముంచుకొస్తున్న మిస్టరీ వ్యాధి ’డింగా డింగా’.. బాధితుల్లో వింత లక్షణాలు!
ఆఫ్రికా దేశం ఉగాండాలో వింత వ్యాధి అక్కడి ప్రజలను వణికిస్తోంది. ఈ వ్యాధి పేరు ‘డింగా డింగా’ ఫీవర్. ఈ వ్యాధి పేరు ఎంత భిన్నంగా ఉందో.. ఈ వ్యాధి లక్షణాలు కూడా అంతే వింతగా ఉంటాయి. ఈ వ్యాధి బారినపడిన వారిలో అనియంత్రిత వణుకు ఉంటుంది. దీంతో, వారు డ్యాన్స్ చేస్తున్నట్టుగా కనిపిస్తారు. ఇక, స్థానిక భాషలో ‘డింగా డింగా అంటే.. కదులుతూ నృత్యం చేయడం’ అని అర్థం’ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాధులు ప్రబలుతున్న వేళ ఉగాండాలో డింగా డింగా వ్యాధి ప్రజలను టెన్షన్ పెడుతోంది. ఉగాండాలోని బుండిబుగ్యో జిల్లాలో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. ఈ వ్యాధి ప్రధానంగా మహిళలు, బాలికల్లోనే ఎక్కువగా వ్యాప్తి చెందడం స్థానికులను, అధికారులను టెన్షన్ పెడుతోంది. స్థానిక నివేదికల ప్రకారం, ఇప్పటివరకు 400 మందికి పైగా వ్యాధి బారిన పడినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, వ్యాధి కారణంగా ఇప్పటివరకు ఎటువంటి మరణాలు సంభవించలేదు. ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో వ్యాధి రావడానికి గల కారణాలను తెలుసుకుంటున్నట్టు తెలిపారు.ఇక, డింగా డింగా ఫీవర్ వ్యాధి కారణంగా శరీరంలో అనియంత్రిత వణుకు మొదలవుతుంది. దీని కారణంగా వ్యాధి బారినపడిన వ్యక్తి నడవడానికి కూడా ఇబ్బంది పడతాడు. వీరిని దూరం నుంచి చూస్తే బాధితురాలు డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. వణికిపోతున్న చేతులు, కాళ్ల కారణంగా డ్యాన్స్ మాదిరిగా కనపడటం విశేషం. ఇక 2023 ప్రారంభంలో మొదటిసారిగా ఈ వ్యాధిని గుర్తించారని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యాధి గురించి ఇంకా చాలా వివరాలు తెలిసి రాలేదు. దీంతో, డింగా డింగాపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇక తదుపరి విశ్లేషణ కోసం నమూనాలను ఉగాండా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు పంపారు స్థానిక అధికారులు.మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య నిపుణులు ఈ వ్యాధి వ్యాప్తిని 1518లో ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో ‘డ్యాన్సింగ్ ప్లేగు’ వ్యాధితో పోలుస్తున్నారు. అప్పుడు ఫ్రాన్స్‌లో ఈ వ్యాధి ప్రబలిన సమయంలో కూడా బాధితులు.. అనియంత్రితంగా రోజుల తరబడి ఉన్నారని తెలిపారు. అలాగే, ఇది మరణాలకు కూడా దారి తీసినట్టు చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. తాజాగా ఈ వ్యాధి నుంచి కోలుకున్న బాధితురాలు(18) మాట్లాడుతూ..‘నేను చాలా బలహీనంగా ఉన్నాను. నేను నడవడానికి ప్రయత్నించినప్పుడు నా కంట్రోల్లో నేను ఉండటం లేదు. కాళ్లు, చేతులు వణికిపోతున్నాయి. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. వారం రోజులకు పైగా వ్యాధి కారణంగా ఆసుపత్రిలోనే ఉన్నాను. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను’ అంటూ చెప్పారు.డింగా డింగా లక్షణాలు..జ్వరం.తలనొప్పి.దగ్గు.ముక్కు కారటం.శరీర నొప్పులు.A mysterious illness locally called 'Dinga Dinga' is rapidly spreading amog women and girls in Uganda's Bundibugyo district, leaving dem dancing and shaking uncontrollably, along with experiencing fever. The illness is treatable with antibiotics. pic.twitter.com/yYEx9unIbR— Common Sense (@keysense_1) December 20, 2024 -
డేంజర్ బెల్స్.. 2040లో మన పాలిట శాపాలివే..
మానవ జీవన శైలి కారణంగా రానున్న రోజుల్లో మరిన్ని వ్యాధుల బారినపడే అవకాశం ఉంది. రోజురోజుకు మారిపోతున్న టెక్నాలజీలు, కొత్తగా అందుబాటులోకి వైద్య చికిత్సలు ఒకవైపు.. మారుతున్న జీవనశైలి, కాలుష్యం వంటివి మనుషుల మరణం తీరును మార్చేస్తున్నాయి.భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలు, ఇతర ప్రమాద మరణాలు, టీబీ, ఎయిడ్స్ వంటివాటితో జరిగే మరణాలు బాగా తగ్గిపోతే.. అల్జీమర్స్, కిడ్నీ వ్యాధులు, డయాబెటిస్ కారణంగా మరణాలు పెరిగిపోతాయని ఓ అధ్యయనం తేల్చింది. 2016లో నమోదైన మరణాలకు (సహజ మరణాలు కాకుండా..) కారణాలను పరిశీలించడంతోపాటు 2040లో మరణాలకు కారణమయ్యే 20 ప్రధాన అంశాలను అంచనా వేసింది.ఈ నేపథ్యంలో భవిష్యత్తులో గుండె జబ్బులు, మధుమేహం, వివిధ రకాల కేన్సర్లు పెరుగుతాయని.. జీవన శైలిలో మార్పులు చేసుకోవడం, తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆ ముప్పును తప్పించుకోవచ్చని పేర్కొంది. సైన్స్ జర్నల్ లాన్సెట్‌లో ఈ అధ్యయన నివేదిక తాజాగా ప్రచురితమైంది. -
Disease X: కరోనాను మించిన వైరస్
కరోనా తాలూకు కల్లోలం నుంచి మనమింకా పూర్తిగా తేరుకొనే లేదు. డిసీజ్ ఎక్స్‌గా పేర్కొంటున్న మరో ప్రాణాంతక వైరస్ అతి త్వరలో ప్రపంచాన్ని మరోసారి అతలాకుతలం చేయనుందట. సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థే చేస్తున్న హెచ్చరిక ఇది! 2019లో వెలుగు చూసినా కరోనా డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా కనీసం 70 లక్షల ప్రాణాలు తీసింది. కానీ కొత్త రోగం హీనపక్షం 5 కోట్ల మందిని కబళించవచ్చన్న అంచనాలు ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. పైగా డిసీజ్ ఎక్స్ ఇప్పటికే తన ప్రభావం మొదలుపెట్టి ఉండొచ్చని కూడా డబ్ల్యూహెచ్ఓ సైంటిస్టులను ఉటంకిస్తూ డైలీ మెయిల్ పేర్కొంది. ఆ ఊహే భయానకంగా ఉంది కదా! కరోనా. ఈ పేరు వింటే చాలు ఇంకా ఉలిక్కిపడుతూనే ఉంది ప్రపంచం. ఆధునిక ప్రపంచ చరిత్ర ఒక రకంగా కరోనాకు ముందు, తర్వాత అన్నట్టుగా తయారైంది. మరి కోవిడ్‌ను మించిన వైరస్ మరోసారి ప్రపంచం మీదికి వచి్చపడితే? కానీ అది అతి త్వరలో నిజమయ్యే ఆస్కారం చాలా ఉందని స్వయానా ప్రపంచ ఆరోగ్య సంస్థే అంటోంది! ప్రస్తుతానికి ఎక్స్‌గా పిలుస్తున్న సదరు ప్రాణాంతక వైరస్ మన ఉసురు తీయడం ఖాయమట. తీవ్రతలో కోవిడ్ కంటే ఇది ఏడు రెట్లు ఎక్కువని డబ్ల్యూహెచ్ఓ పేర్కొనడం ఆందోళనలను మరింతగా పెంచుతోంది. ప్రస్తుతానికి ఎక్స్‌గా పిలుస్తున్న ఈ పేరు పెట్టని వైరస్ ప్రపంచవ్యాప్తంగా హీనపక్షం 5 కోట్ల మందిని బలి తీసుకోవడం ఖాయమని సైంటిస్టులను ఉటంకిస్తూ హెచ్చరిస్తోంది. అంత డేంజరస్ కరోనా కూడా నిజానికి మున్ముందు మానవాళిని కబళించబోయే మహా మహమ్మారులకు ట్రెయిలర్ మాత్రమేనని జోస్యం చెబుతోంది...! తెలిసిన వైరస్ నుంచే..? డిసీజ్ ఎక్స్ మనకిప్పటికే తెలిసిన వైరస్ నుంచే పుట్టుకొచ్చి ఉంటుందని బ్రిటన్ వాక్సిన్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డేమ్ కేట్ బిన్ హామ్ చెబుతున్నారు. వినడానికి కఠోరంగా ఉన్నా, మనకు ముందున్నది కష్ట కాలమేనన్నది అంగీకరించాల్సిన నిజమని ఆమె అన్నారు! ‘1918–19 మధ్య ఫ్లూ కేవలం ఒక్క ఏడాదిలోనే ఏకంగా 5 కోట్ల మందికి పైగా బలి తీసుకుంది. ఇప్పుడు కూడా మనకు ఆల్రెడీ తెలిసిన వైరస్‌లలోనే ఒకటి కనీవినీ ఎరగని రీతిలో భయానకంగా మారి అలాంటి మహోత్పాతానికే దారి తీయవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అసంఖ్యాకమైన వైరస్లు పరస్పరం పరివర్తనాలు చెందుతూ రూపు మార్చుకుంటున్నాయి. ఊహాతీత వేగంతో విస్తరిస్తున్నాయి. పైగా వీటి సంఖ్య ప్రస్తుతం భూమి మీద ఉన్న ఇతర అన్ని జీవరాశుల మొత్తం సంఖ్య కంటే కూడా చాలా ఎక్కువ‘ అని చెప్పుకొచ్చారు! ‘వాటిలో అన్నీ మనకు అంతగా చేటు చేసేవి కాకున్నా కొన్ని మాత్రం చాలా డేంజరస్‘ అని వివరించారు. లోతుగా పర్యవేక్షణ జీవ రసాయన సైంటిస్టులు ప్రస్తుతం కనీసం 25 వైరస్ కుటుంబాలను జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. వీటిలో ఒక్కో దాంట్లో వేలాది విడి వైరస్లు ఉన్నాయి. వాటిల్లో ఏదో ఒకటి విపరీతమైన పరివర్తనాలకు లోనై మహా మహమ్మారిగా రూపుదాల్చే ప్రమాదం పొంచి ఉందట! పైగా జంతువుల నుంచి మనుషులకు సోకగల వైరస్ లను అధ్యయనంలో భాగంగా చేయలేదు. వాటినీ కలిపి చూస్తే మానవాళికి ముప్పు మరింత పెరుగుతుందని డేమ్ హెచ్చరిస్తున్నారు. అప్పుడే వ్యాక్సిన్ తయారీ! ఇంకా కొత్త రోగం పేరైనా తెలియదు. ఒక్కరిలో కూడా దాన్ని గుర్తించలేదు. అప్పుడే దానికి వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నాల్లో బ్రిటన్ సైంటిస్టులు తలమునకలుగా ఉన్నారు. ఏకంగా 200 మందితో కూడిన బృందం ఈ పనిలో తలమునకలుగా ఉందట! జంతువుల నుంచి ఎలుకల ద్వారా మనుషులకు సోకే, శరవేగంగా వ్యాపించే స్వభావమున్న బర్డ్ ఫ్లూ, మంకీ పాక్స్, హంట్ వైరస్‌లనే ప్రస్తుతానికి లక్ష్యంగా పెట్టుకున్నట్టు బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్ ప్రొఫెసర్ డేమ్ జెన్నీ హారిస్ తెలిపారు. అయితే, పర్యావరణ మార్పుల వంటి మానవకృత విపత్తులకు ఇప్పటికైనా అడ్డుకట్ట వేస్తే ఎన్నో వైరస్‌లను కూడా అరికట్టినవాళ్లం అవుతామంటూ ఆయన ముక్తాయించారు! మున్ముందు మన పాలిట ప్రాణాంతకంగా మారే భయంకరమైన మహమ్మారులకు కరోనా కేవలం ఒక దారుణమైన ఆరంభం మాత్రమేనని సైంటిస్టులు ముక్త కంఠంతో చెబుతున్నారు! అవును.. మరిన్ని మహమ్మారులు! ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి చైనా ‘బ్యాట్ ఉమన్’ షీ జెంగ్ లీ జోస్యం కోవిడ్ తరహా మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని చైనా ’బ్యాట్ ఉమన్’ షీ జెంగ్ లీ జోస్యం చెప్పారు. చైనాలో బెస్ట్ వైరాలజిస్ట్‌గా చెప్పే ఆమె జంతువుల నుంచి, ముఖ్యంగా గబ్బిలాల నుంచి మనుషులకు సోకే వైరస్‌లపై అపారమైన రీసెర్చ్ చేసినందుకు బ్యాట్ ఉమన్‌గా పేరుబడ్డారు. కరోనాకు పుట్టిల్లుగా నేటికీ ప్రపంచమంతా నమ్ముతున్న చైనాలోని వుహాన్ వైరాలజీ ఇన్స్టిట్యూట్లో లీ బృందం 40 కరోనా జాతులపై లోతుగా అధ్యయనం చేసింది. వాటిలో సగానికి సగం మానవాళికి చాలా ప్రమాదకరమైనవని తేలి్చంది. వీటిలో ఆరు ఇప్పటికే మనకు సోకాయని లీ చెప్పారు! గత జూలైలో ఇంగ్లిష్ జర్నల్ ఎమర్జింగ్ మైక్రోబ్స్ అండ్ ఇన్ఫెక్షన్స్ లో పబ్లిష్ అయిన ఈ అధ్యయనం ఇటీవలే ప్రాచుర్యంలోకి వచి్చంది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలూ మరింత అప్రమత్తంగా ఉండాలని చైనాకు చెందిన మరికొందరు ప్రముఖ వైరాలజిస్టులు కూడా సూచిస్తున్నారు. గబ్బిలాలు, ఎలుకల నుంచి ఒంటెలు, పంగోలిన్లు, పందుల వంటి జంతువుల ద్వారా సమీప భవిష్యత్తులో ఇవి మనకు మరింతగా సోకే ప్రమాదం చాలావరకు ఉందని వారు హెచ్చరిస్తున్నారు! డిసీజ్ ఎక్స్‌తో పోలిస్తే కరోనా ప్రమాదకరమైనది కానే కాదని చెప్పాలి. ఎందుకంటే కరోనాకు ఇప్పుడు దాదాపుగా అంతా ఇమ్యూన్‌గా మారాం. కానీ కొత్త వైరస్ తట్టు అంత శరవేగంగా వ్యాపించే అంటురోగానికి కారణమైతే? సోకిన ప్రతి 100లో ఏకంగా 67 మందిని బలి తీసుకున్న ఎబోలా అంతటి ప్రాణాంతకంగా మారితే? ఇదే ఇప్పుడు సైంటిస్టులను తీవ్రంగా కలవర పెడుతున్న అంశం! ప్రపంచంలో ఏదో ఇక మారుమూలలో అదిప్పటికే సడీచప్పుడూ లేకుండా ప్రాణం పోసుకునే ఉంటుంది. అతి త్వరలో ఉనికిని చాటుకుంటుంది. ఇక అప్పటి నుంచీ నిత్య కల్లోలమే! – డేమ్ కేట్ బిన్ హామ్, బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ -
డేంజర్.. వర్షకాలంలో రోజూ పానీపూరీ తింటున్నారా?
పానీపూరి అంటే ఇష్టపడని వాళ్లు ఉండరేమో. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాధారణంగానే సాయంత్రం కాగానే వీధి చివర్లోని పానీపూరీ బండి వద్ద గుమిగూడుతుంటారు. ఇక మరీ ముఖ్యంగా వర్షాకాలంలో పానీపూరి క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు.కాస్త చినుకులు పడగానే పానీపూరీల కోసం జనాలు ఎగబడతారు. అయితే వర్షాకాలంలో పానీపూరీ తినడం డేంజర్ అని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. పానీపూరీ అంటే ఆహా ఓహో అంటూ లొట్టలు వేసుకొని తినేవాళ్లు చాలామందే ఉంటారు. తినేటప్పుడు అది ఎలా తయరుచేశారో, ఆ తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యల గురించి ఏమాత్రం ఆలోచించరు. అయితే ఇలా అడ్డగోలుగా ఎక్కడపడితే అక్కడ పానీపూరీ తింటే మాత్రం రోగాల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పానీపూరీలు అమ్మే స్థలం పరిశ్రుభంగా లేకపోయినా, తయారు చేసే వ్యక్తికి ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉన్నా అవి మీకు వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వర్షాకాలంలో పానీపూరీలు తినాలనుకుంటే మాత్రం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. లేదంటే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అపరిశుభ్రమైన నీళ్లు తాగడం వల్ల టైఫాయిడ్, ఉదర సంబంధిత వ్యాధులకు గురవుతారు. ► పానీపూరీకి ఉపయోగించే నూనె మంచిది కాకపోతే డేంజరే. ఎందుకంటే స్ట్రీట్ వెండర్స్ చాలావరకు ఒకసారి వాడిన నూనెను మళ్లీమళ్లీ ఉపయోగిస్తుంటారు. ఇలా నూనెను ఎక్కువసార్లు వేడి చేయడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. ► పానీపూరీలో పాన్ మసాలా కలుపుతారు అన్న విషయంలో చాలా మందికి తెలియదు. ఇది క్యాన్సర్‌కు కారకం అవుతుంది. ► పానీపూరీలో సోడియం ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజూ తినడం వల్ల ఉదర సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. ► వీటితో పాటు అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. ఇది కేవలం పానీపూరీకే వర్తించదు. అన్ని రకాల స్ట్రీట్ ఫుడ్స్, పరిశ్రుభత పాటించని హోటళ్లు చాలానే ఉన్నాయి. వీటివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే బయటి ఫుడ్‌కు దూరంగా ఉండటమే మంచిదంటున్నారు నిపుణులు. -
మొదలైన ఎండలు.. జ్వరాలు.. కరోనా!
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు ఎండలు.. మరోవైపు జ్వరాలు.. ఇంకోవైపు కరోనా కేసుల పెరుగుదలతో రాష్ట్రంలో మళ్లీ అలజడి మొదలవుతోంది. చలికాలం నుంచి ఎండాకాలానికి వాతావరణం మారడంతో ఒక్కసారిగా గొంతు నొప్పి, జలుబు, జ్వరాల వంటి కేసులు నమోదవుతున్నాయి. వైరస్ విస్తరించడానికి ఈ పరిస్థితి అనుకూలం కావడంతో కరోనా కేసుల సంఖ్య కూడా పెరుగుతోందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎండాకాలం కావడం వల్ల సాధారణంగా శరీరం వేడెక్కుతుంది. దానికి తగ్గట్లు జాగ్రత్తలు తీసుకోకపోతే వైరల్ జ్వరాలు పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. గణనీయమైన సంఖ్యలో జ్వరం కేసులు నమోదు కాకపోయినా, గతం కంటే కాస్తంత పెరిగాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గొంతు నొప్పి, జలుబు, జ్వరంతో రోగులు ఆసుపత్రులకు వస్తున్నారని వెల్లడిస్తున్నారు. కరోనా కేసుల్లో పెరుగుదల.. సరిగ్గా గతేడాది మార్చి నెలలో కరోనా కేసులు రాష్ట్రంలో మొదలయ్యాయి. కీలకమైన ఎండాకాలం సీజన్లోనూ కేసులు పెరిగాయి. ఇప్పుడూ తెలంగాణలో కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాల్లో కరోనా రెండోసారి విజృంభించడంతో, మన దగ్గర ఆ ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటు బ్రిటన్, సౌదీ అరేబియా, దుబాయ్ తదితర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో కొందరిలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. కాలేజీలు, స్కూళ్లు తెరవడం, అన్ని రకాల వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు మొదలు కావడంతో కేసులు పెరుగుతున్నాయి. అంతేగాకుండా ఇక కరోనా లేదన్న భావనతో అనేకమంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. మరీ ముఖ్యంగా మాస్క్‌లు ధరించేవారి సంఖ్య తగ్గిపోయింది. భౌతికదూరం కనుమరుగైంది. చేతి శుభ్రత పాటించడంపై అశ్రద్ధ కనిపిస్తోంది. గత వారంతో పోలిస్తే రాష్ట్రంలో 14 జిల్లాల్లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఈ నెల 4వ తేదీన 27 కేసులు నమోదు కాగా, 10వ తేదీన 35 కేసులు రికార్డయ్యాయి. ఎండల తీవ్రత, జ్వరాల వల్ల కేసులు ఇంకా పెరుగుతాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇటీవల కరీంనగర్ జిల్లాలో ఒక వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొన్న 33 మందికి కరోనా వచ్చింది. హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ సంస్థలో 150 మందికి పరీక్షలు చేస్తే, 21 మందికి ఒకేరోజు కరోనా నిర్ధారణ అయింది. ఆదిలాబాద్ జిల్లాలో ఒక హాస్టల్లో పరీక్షలు చేస్తే ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. బయటకు వచ్చే కేసులు కొన్ని కాగా, వెలుగు చూడని కేసులెన్నో ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. యాంటిజెన్ కిట్లు పెద్ద ఎత్తున అందుబాటులోకి రావడంతో అనుమతి లేని డయాగ్నస్టిక్ సెంటర్లలోనూ పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో అవి లెక్కలోకి రావడం లేదంటున్నారు. అంతేకాదు ప్రతీరోజూ విడుదల చేసే కరోనా బులెటిన్‌లో ఒక్కోసారి మరణాలు ఉండేవి కావు. ఒక్కోరోజు ఒకటి, అప్పుడప్పుడు రెండు నమోదయ్యేవి. తాజాగా గురువారం విడుదల చేసిన బులెటిన్‌లో ఏకంగా ముగ్గురు కరోనాతో మరణించినట్లు పేర్కొన్నారు. మూడు నెలల తర్వాత ఒకేరోజు మూడు కరోనా మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. వాతావరణ మార్పులతో అనారోగ్యం.. చలికాలం నుంచి వేసవిలోకి ప్రవేశించడంతో వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. దీంతో శరీరంలోనూ గణనీయంగా మార్పులొస్తాయి. గొంతునొప్పి, జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు సంభవిస్తాయి. ఈ నేపథ్యంలోనే జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా కాలం కావడం వల్ల అందుకు సంబంధించిన జాగ్రత్తలు పాటించాలి. మాస్క్‌లు, భౌతిక దూరం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. అవకాశమున్నంత మేరకు ఎండల్లో బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. ఏమాత్రం అనుమానమొచ్చినా, కరోనా లక్షణాలున్నా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.. - డాక్టర్ హెప్సిబా, మెడికల్ ఆఫీసర్, హైదరాబాద్ -
ప్రపంచానికి శనిలా పట్టుకుంది!
ఒక్కసారి పట్టుకుంటే ఏళ్ల పాటు వదలదని ఏలినాటి శనికి పేరు.. ఇప్పుడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ కూడా ఇంతే! ఏడాది కాలంలో 13 లక్షలకు పైగా ప్రాణాలను బలి తీసుకున్న ఈ మహమ్మారి.. భవిష్యత్తులోనూ మానవాళికి అనేక రకాలుగా సమస్యగానే మిగిలిపోనుంది. ఆయు ప్రమాణాలను తగ్గించడం మాత్రమే కాదు.. కోట్ల మందిని పేదరికం కోరల్లోకి తోసేయనుంది! సాక్షి, హైదరాబాద్: రోగమొచ్చింది.. మందేసుకున్నాం.. తగ్గింది.. హమ్మయ్య.. ఇక ఏ చింతా లేదు! ఇప్పటివరకు ఏదైనా అనారోగ్యమొస్తే మనం ఆలోచించిన తీరిది.. కానీ కోవిడ్ విషయంలో ఈ ఆలోచన పూర్తిగా మారి పోతోందని అంటున్నారు వైద్య నిపుణులు.. ఈ మహమ్మారి బారిన పడి కోలుకున్న వారిలో కొంతమంది దీర్ఘకాలం పాటు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇటీవలి కాలంలో నిర్వహించిన అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. వైరస్ కారణంగా వచ్చే జబ్బుల ప్రభావం కొంతకాలం ఉంటుందని ఇప్పటికే తెలిసినప్పటికీ కరోనా విషయంలో తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ ప్రధానంగా ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపుతుందని.. కానీ కొన్ని కేసుల్లో దాని ప్రభావం మెదడు, గుండెలపై కూడా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ‘సాధారణ శ్వాస సంబంధిత వైరస్‌లతో పోలిస్తే కరోనాలో తెలియని మిస్టరీలు చాలా ఉన్నాయి. (ఐరోపా దేశాల్లో 17 సెకన్లకు ఒక మరణం) రోగ నిరోధక శక్తి తగ్గుదల, దీర్ఘకాలం పాటు నిస్సత్తువ, తలనొప్పితో పాటు గుండె, శ్వాస సమస్యలు కొనసాగుతాయి..’అని మేయో క్లినిక్‌కు చెందిన శాస్త్రవేత్త గ్రెగరీ పోలాండ్ అన్నారు. కోవిడ్ వ్యాధి కణస్థాయిలో జరిపే విధ్వంసం ఇందుకు కారణమవు తుందన్నది ఆయన అంచనా.. వీటితోపాటు కొంతమంది కండ రాలు, దగ్గు వంటి లక్షణాలూ కనపరచవచ్చు. కోవిడ్ బారిన పడి కోలుకున్న వారి గుండె ఎక్స్‌రేలను పరిశీలించినప్పుడు కండరాలు దెబ్బతిన్నట్లు తెలిసిందని, ఊపిరితిత్తుల్లోని గాలి సంచుల్లోనూ నష్టం ఎక్కువగా ఉందని మేయో క్లినిక్ జరిపిన పరిశోధనల ద్వారా ఇప్పటికే స్పష్టమైంది. అంతేకాకుండా.. రక్తంలో చిన్నసైజు ముద్దల్లాంటివి ఏర్పడతాయని, పెద్దసైజు వాటితో గుండెజబ్బులు వస్తే చిన్నవాటితో గుండెకు వెళ్లే చిన్న చిన్న ధమనులు మూసుకుపోతాయని చెబుతున్నారు. అయితే ఈ లక్షణాలు కోవిడ్ నుంచి కోలుకున్న కొందరిలో మాత్రమే కనిపిస్తుండటం కొంచెం ఊరటనిచ్చే అంశం.. (కరోనా: ఒకే ఇంట్లో ఐదురోజుల్లో ముగ్గురి మరణం) ఆయుః ప్రమాణాల తగ్గుదల వైద్య సదుపాయాలు పెరగటం, ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆయు ప్రమాణాలు పెరిగాయి. అయితే కోవిడ్ కారణంగా ప్రభుత్వాలు ఇప్పటివరకు చేసిన శ్రమ మొత్తం నీరు కారిపోనుంది. ఆయు ప్రమాణాలు భారీగా తగ్గనున్నాయని దాదాపు మూడు దేశాల శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేస్తోంది. కాకపోతే ఇది ఆయా దేశాల్లో వ్యాధి తీవ్రత, ప్రస్తుత ఆయు ప్రమాణం తదితర అంశాలపై ఆధారపడి ఉండనుంది. పీఎల్ఓఎస్ వన్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం.. కోవిడ్ బారిన పడ్డ వారు పది శాతం వరకు ఉంటే.. అమెరికా, యూరప్, లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాల్లో కొత్తగా పుట్టబోయే వారి ఆయుష్షు ఏడాది వరకూ తగ్గనుంది. షాంఘై యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అప్లైడ్ సిస్టమ్స్ అనాలసిస్ (ఆస్ట్రియా), యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా (యూకే) శాస్త్రవేత్తల ఈ అధ్యయనం ప్రకారం వ్యాధి తీవ్రత ఎక్కువున్న చోట్ల ఆయుష్షు 3 నుంచి 8 ఏళ్ల వరకు తగ్గవచ్చు. ఆగ్నేయాసియా దేశాల్లో ఇది రెండు నుంచి ఏడేళ్లు.. సబ్ సహారన్ ఆఫ్రికా దేశాల్లో ఏడాది నుంచి నాలుగేళ్ల వరకు ఉండవచ్చు. (రెండో దశలో కరోనా సునామీలా విజృంభించొచ్చు!) పెరగనున్న పేదరికం... ప్రపంచవ్యాప్తంగా గత 20 ఏళ్లుగా తగ్గుతున్న పేదల సంఖ్య కోవిడ్ కారణంగా ఇకపై పెరగనుంది. ప్రపంచ బ్యాంకు అధ్యయనం ప్రకారం.. ఈ ఏడాది 8.8 నుంచి 11.5 కోట్ల మంది మళ్లీ కఠిన దారిద్య్రం బారిన పడనుండగా.. ఈ సంఖ్య వచ్చే ఏడాది చివరికల్లా 15 కోట్లకు పెరుగుతుంది. రోజుకు 2 డాలర్లు లేదా రూ.150 కంటే తక్కువ ఆర్జించే వారిని పేదలుగా గుర్తించి ప్రపంచబ్యాంకు ఈ అధ్యయనం నిర్వహించింది. కోవిడ్ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది పేదల జనాభా 7.9 శాతంగా ఉండేదని, ఈ మహమ్మారి కారణంగా ఇప్పుడు అది 9.1 నుంచి 9.4 శాతం వరకు పెరగనుందని ఈ అధ్యయనం వివరించింది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ఆర్థిక వ్యూహాలతో ముందు కెళ్లాల్సి వస్తుందని తెలిపింది. ఇలా పేదరికం బారిన పడే వారిలో ఎక్కువ మంది ఇప్పటికే పేదరికం ఎక్కువున్న దేశాల్లోనే ఉండటం గమనార్హం. మధ్య ఆదాయ దేశాల్లోనూ గుర్తించదగ్గ స్థాయిలో ప్రజలు పేదలుగా మారతారని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. యుద్ధాల వంటి సమస్యలతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న దేశాల్లో కోవిడ్ గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా మారిందని తెలిపింది. ఈ పరిణామం వల్ల 2030 నాటికి పేదల జనాభాను 7 శాతం కంటే తక్కువ స్థాయికి తీసుకురావాలని ప్రపంచబ్యాంకు తీసుకుంటున్న చర్యలకు ఇబ్బంది ఏర్పడనుంది. -
పశువుల్లో బాక్టీరియా వ్యాధులు
శీతాకాలంలో పశువులను వ్యాధుల బారి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. గొంతువాపు: పాస్టురెల్లా మల్టోసైడా అనే బ్యాక్టీరియా వల్ల గొంతువాపు వస్తుంది. ఒక్కసారిగా జ్వరం రావడం, నోటి చొంగ, ఊపిరి కష్టంగా ఉండటం లాంటివి చూపిస్తుంది. 24 గంటల్లో పశువు చనిపోతుంది. చలికాలంలో పశువులు దగ్గర దగ్గరగా ఉంటుంటాయి. అందువల్ల చొంగ ద్వారా ఈ వ్యాధి త్వరగా వ్యాపించవచ్చు. ఇంతకుముందే టీకాలు వేయించుకొని ఉంటే గొంతువ్యాపు రాదు. ఇప్పుడు కూడా టీకా వేయించుకోవచ్చు. వైద్యము ఖరీదు కాబట్టి నివారణ మేలు. పింక్ ఐ: ఇన్ఫెచ్యువస్ బొవైన్ కెరెటో కంజెక్టువైటిస్ అనే వ్యాధికి పింక్ ఐ అని కూడా పేరు. దీని తీవ్రత వర్షాకాలంలో ఎక్కువైనప్పటికీ శీతాకాలంలోనూ వ్యాపిస్తుంది. మోరాక్సెల్లా బోవిస్ అనే బ్యాక్టీరియా వల్ల పింక్ ఐ సోకుతుంది. వ్యాధి బారిన పడి తేరుకున్న పశువుల ముక్కు రంధ్రాల ద్వారా ఈ బాక్టీరియా బయటకు వ్యాప్తి చెందుతుంది. త్వరగా వైద్యం మొదలు పెట్టడం, పశువైద్యుని సలహా మేరకు టెట్రాసైక్లిన్స్ గల ఆంటీబయోటిక్స్ని వాడాలి. ఫుట్ రాట్: దీనినే గొర్రెల్లో వాడుక భాషలో కుంట్లు అంటారు. గిట్టల మధ్య వాచి, నొప్పిగా ఉండి, పశువులు కుంటుతూ ఉంటాయి. ఫ్యూసోబ్యాక్టీరియమ్ నెక్రోఫోగమ్ అనే బ్యాక్టీరియా వలన కలుగుతుంది. చిత్తడి నేలల్లో పశువులను ఉంచినట్లయితే ఈ పరిస్థితి వస్తుంది. కాళ్ల మీద బరువు మోపలేకపోవడం, నొప్పి కనబరచడం, వాసన కలిగి ఉండడం, మేత మేయలేకపోవడం లాంటి లక్షణాలను పశువు చూపిస్తుంది. పశువులను పొడి నేలల్లో ఉండడం, పెన్సిలిన్, సెప్టియోఫర్, టెట్రాసైక్లిన్ లాంటి యాంటీ బయోటిక్స్‌ను వాడాలి. కాఫ్ దిప్తీరియా/లారిన్జైటిస్: ఇది కూడా ఫూసోబ్యాక్టీరియమ్ నెక్రోఫోరమ్ వల్లనే కలుగుతుంది. 3 నుంచి 18 నెలల వయసున్న దూడల్లో ఎక్కువగా కనబడుతుంది. జ్వరం, దగ్గు, రొప్పడం వంటి లక్షణాలు కనబడతాయి. పక్కపక్కనే ఉన్న పశువులకు సోకుతుంది. పశువైద్యుని సలహా మేరకు యాంటిబయోటిక్స్‌ను వాడాలి. కంటేజియస్ బొవైన్ ఫ్లూగో నిమోనియా: చలికాలంలో పశువుల ఊపిరితిత్తులు వాచి, 107 డిగ్రీల ఫారన్‌హీట్ వరకు జ్వరం రావడం, కళ్ల వెంబడి పుసులు రావడం, పశువు బాగా చిక్కిపోవడం, కష్టసాధ్యమైన ఊపిరి.. ఇవీ లక్షణాలు. పశువు 1–3 వారాల్లో చనిపోయే ప్రమాదం ఉంది. ఖచ్చితమైన పరిశుభ్రత పాటించాలి. టైలోసిస్ లాంటి యాంటిబయోటిక్స్ కొంత ఉపయోగకరం. – డా. ఎం.వి.ఎ.యన్. సూర్యనారాయణ (99485 90506), ప్రొఫెసర్ – అధిపతి, డిపార్ట్మెంట్ ఆఫ్ లైవ్‌స్టాక్ ఫామ్ కాంప్లెక్స్, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతి -
జీవితాలకు పొ(సె)గ
సాక్షి, ఆలేరు : ‘పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్’ అని కన్యాశుల్కంలో గిరీశం అన్న మాటలను వల్లె వేస్తూ పొగబాబులు ఈ వ్యసనాన్ని వదల్లేక పోతున్నారు. సరదాగా మొదలయ్యే ధూమపానం జేబుతోపాటు ఊపిరితిత్తులకు చిల్లు వేస్తుంది. ఈ విషయం తెలిసే ధూమపానాన్ని అనేకమంది వదలడం లేదు. పొగాకు, ధూమపానం కారణంగా ప్రపంచంలో ప్రతి 6.5 సెకండ్లకు ఒకరు మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. అయితే చిన్నవయస్సులోనే సిగరేట్ తాగటం మొదలుపెట్టినవారు సాధారణ ఆరోగ్యవంతుల కన్నా వీరు 20–25 సంవత్సరాల ముందే చనిపోతున్నారని వెల్లడైంది. పొగాకులో నికోటిన్ అనే మత్తు పదార్థం ఉంటుంది. బహిరంగ ధూమపానం ఇతరులకు కూడా హాని కలిగిస్తుంది. వచ్చే జబ్బులు ధూమపానం ప్రమాదకరమైంది. ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. ఆయు ప్రమాణాలను తగ్గిస్తుంది. కళ్లు, ముక్కు, గొంతు మీద ప్రభావం కలిగిస్తుంది. ఊపిరితిత్తులకు సహజసిద్ధంగా శుభ్రపరిచే సామర్ధ్యం ఉంటుంది. పొగతాగడంతో శ్వాస స్థాయి పెరిగి ఊపిరితిత్తుల కణాలకు రసాయన హనీ కలుగుతుంది. దగ్గు, కఫం సమస్యలు మొదలవుతాయి. శ్వాసకోస వ్యాధులు వస్తాయి. శ్వాసనాళం మందంగా మారి క్యాన్సర్‌కు దారి తీస్తుంది. సోరియాసిస్ వ్యాధి కూడా వస్తుంది. శుక్లాలు కూడా వచ్చే అవకాశం ఉంది. దంతాలు రంగు మారడమే కాదు దెబ్బతింటాయి. చిగుళ్ల వ్యాధులు కూడా వస్తాయి. గుండె జబ్బులు, పక్షవాతం, పొట్టలో అల్సర్లు వస్తాయి. సంతాన, అంగస్తంభన సమస్యలు, వీర్యంలోని శుక్రకణాల స్వరూపం మారిపోతుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు తక్కువవుతాయి. అలాగే పొగతాగే స్త్రీలలో గర్భధారణ సమస్యలు, గర్భస్రావాల సమస్యలు తలెత్తుతాయి. రక్తపోటు మీద ప్రభావం. సిగరెట్ కాల్చే ప్రతిసారి 15శాతం రక్తపోటు అమాంతం పెరుగుతుంది. చర్మంలో రక్తకణాలు బిగుసుకుపోతాయి. పొగతాగితే నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఫ్యాషన్‌గా భావిస్తున్న యువత సిగరెట్ తాగడాన్ని యువత ఫ్యాషన్‌గా భావిస్తుంది. ఇంటర్ నుంచే అబ్బాయిలు సిగరెట్ అలవాటు చేసుకుంటున్నారు. అలవాటు లేకపోయిన తోటి స్నేహితుల ప్రోత్సాహంతో సిగరెట్లు తాగుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో నిషేధం బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని ప్రభుత్వం నిషేధించింది. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే రూ. 1000వరకు జరిమానా విధించవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ క్యార్యాలయాలు, బీజినెస్ సెంటర్లు, హోటళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, సినిమా థియేటర్లలో పొగతాగడాన్ని కేంద్ర ప్రభుత్వం 2008 సంవత్సరం అక్టోబర్ 8న నిషేధించింది. ధూమపానం చేస్తే జరిమానా విధించేందుకు పలువురు అధికారులకు అధికారం కల్పించారు. పొగ నిషేధ చిహ్నం ఉమ్మడి జిల్లాలో 1300 కిల్లీ షాపులు ఉమ్మడి జిల్లాలో 1300పైగా కిల్లీ షాపులు నడుస్తున్నాయి. నిత్యం ఈ షాపుల్లో రూ. 5.50లక్షల బీడీలు, సిగరెట్లు అ మ్ముడుపోతున్నాయని తెలిసిం ది. అలాగే జిల్లాలో హుక్కా పీల్చేవారి సంఖ్య కూడా లక్షకుపైగా ఉన్నట్టు తెలుస్తుంది. పేరుకే కమిటీలు బహిరంగ ప్రదేశాల్లో «ధూమపాన నిషేధాన్ని అమలు చేసేందుకు జిల్లా స్థాయిలో కమిటీ ఉంది. ప్రతి నెలలో కమిటీ సమావేశమై చట్టం అమలును సమీక్షించాలి. జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా, డీఎంహెచ్ఓ కన్వీనర్‌గా, అగ్నిమాపక అధికారి, పోలీస్, రవాణా, పురపాలక సంఘం, ఉన్నత పాఠశాల, రెవెన్యూ, విద్య, డ్రగ్ ఇన్స్పెక్టర్, ఫుడ్ ఇన్స్పెక్టర్, డీసీహెచ్ఎస్ కోఆర్డినేటర్లు సభ్యులుగా ఉం టారు. మొత్తం 12మంది ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఉందని చాలా మందికి తెలియదు. దాంతో కమిటీ నామమాత్రంగా మారింది. కుటుంబ సభ్యులకు హానికరమే.. సిగరెట్ తాగేవారితో పాటు కుటుంబ సభ్యులకు కూడా హానికరమే. పిల్లల వద్ద తాగితే సున్నితంగా ఉండే వారి ఊపిరితిత్తులకు మరింత ప్రమాదకరం. పొగతాగితే అనారోగ్యానికి గురవుతారు. 40 రకాల క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. ధూమపానం చేస్తే ఆయు ప్రమాణం తగ్గుతుంది. – డా. కె ప్రభాకర్, ఆలేరు -
జాగ్రత్తలతోనే వ్యాధుల నివారణ
మెదక్‌జోన్: వ్యాధుల నివారణ కోసం ప్రతివ్యక్తి మాత్రలను తప్పని సరిగా వేసుకోవాలని కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. పట్టణంలోని జూనియర్ కళాశాలలో మంగళవారం నులిపురుగుల, పైలేరియా మాత్రలను కలెక్టర్ చేతుల మీదుగా వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ మనకు తెలియకుండానే నట్టలు( నులిపురుగులు) మన శరీరంలోకి ప్రవేశించి మన జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తాయని వివరించారు. దీంతో మనం తీసుకునే ఆహారాన్ని పురుగులు తినేసే ప్రమాదం ఉంటుందన్నారు. ఈ పురుగుల సంఖ్య అధికమైతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. అలాగే బోదకాలు వ్యాధి బారిన పడకుండా డీఈసీ మాత్రలను సైతం వేసుకోవాలని ఈ మాత్రలను ప్రతి మనిషికి ఇచ్చే విధంగా సంబంధిత వైద్యారోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్యశాఖ అధికారుల సూచన మేరకు ఈ మాత్రలను ప్రతివ్యక్తి వేసుకోవాలని లేనిచో మైక్రోఫైలేరియా మనశరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం బారిన పడతామన్నారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ మరుగుదొడ్లను వినియోగించడంతోపాటు ప్రతి వ్యక్తి వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు దరిచేరవన్నారు. 50 శాతం వ్యాధులు మనం సరిగ్గా చేతులు శుభ్రం చేసుకోకపోవటంతోనే వస్తాయన్నారు. భోజనం చేసే ముందు, మలవిసర్జన చేసిన తర్వాత తప్పని సరిగా సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. అలాగే అనేక వ్యాధులు దోమల ద్వారా సంక్రమిస్తాయని వాటి నివారణకోసం తగుజాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని సూచించారు. ఏడాదికి రెండు సార్లు వేసే నులిపురుగు నివారణ మాత్రలు తప్పని సరిగా పిల్లలు, యువకులు వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు శ్రీరాములు, ఇర్షాద్, అనిల్, కుమారస్వామి, పాండురంగాచారి, చందర్, మణికంఠ ఆరోగ్యకార్యకర్తలు, ఆశవర్కర్లు తదితరులు పాల్గొన్నారు. -
బోధకాలు నివారణే లక్ష్యం
నల్లగొండ టౌన్ : ప్రజల్లో బోధకాలు వ్యాధి, నులిపురుగుల (నట్టల) నివారణకు ప్రభుత్వం నడుం బిగించింది. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 19నుంచి 21వరకు మూడు రోజుల పాటు సామూహిక డీఈసీ, ఆల్బెండజోల్ మాత్రలను మింగించే కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసేపనిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే తలమునకలై ఉంది. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సీడీపీఓలకు ఈ నెల 14న, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, ఇతర వలంటీర్లకు 15, 16 తేదీల్లో శిక్షణను ఇవ్వనున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 5,829 మంది బోధకాలు వ్యాధితో బాధపడుతున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాకు చేరిన మాత్రలు : ల జిల్లాలోని 31 మండలాల్లో గల అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మాత్రల పంపిణీకి అవసరమైన చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 15,27,845 మందికి మాత్రలను మింగించాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన 42,01,573 డీఈసీ (100గ్రాములు) మాత్రలను, 15,27,845 ఆల్బెండజోల్ (400 గ్రాముల) మాత్రలను జిల్లాకు తెప్పించి అన్ని మండలాలకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచారు. మాత్రలను మింగించడానికి 6,111 మంది సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నారు. 2 నుంచి 5 సంవత్సరాలలోపు పిల్ల లకు డీఈసీ మాత్ర 1, ఆల్బెండజోల్ మాత్ర 1, 6 నుంచి 14 సంవత్సరాలలోపు వయస్సు వారికి డీఈసీ 2, ఆల్బెండజోల్ 1, 15 సంవత్సరాల పైబడిన వారికి డీఈసీ 3, ఆల్బెండజోల్ మాత్ర 1 చొప్పున మింగించనున్నారు. కార్యక్రమ పర్యవేక్షణకు 601 మంది సూపర్వైజర్లను నియమించారు. 40 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయనున్నారు. కార్యక్రమాన్ని కలెక్టర్ డాక్టర్ గౌరవ్‌ఉప్పల్, జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ గంగవరప్రసాద్, జిల్లా మలేరియా అధికారి రుద్రాక్షి దుర్గయ్యతో పాటు ఇతర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పర్యవేక్షించనున్నారు. బోధకాలు వ్యాధి ఎలా వస్తుంది.. ఫైలేరియా అనే సూక్మ క్రిమి ద్వారా బోధకాలు వ్యాధి వస్తుంది. ఇంటి పరిసరాల్లో ఉన్న మురుగునీటిలో గుడ్లు పెట్టి వృద్ధి చెందే క్యూలెక్స్ దోమ ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. దోమలను నివారించడానికి మురుగు నిల్వ లేకుండా పరిసరాలను ఉంచుకోవాలి. ప్రతిఒక్కరూ మాత్రలు మింగాలి ఈనెల 19 నుంచి 21 వరకు మూడు రోజులపాటు నిర్వహించే సామూహిక డీఈసీ, అల్బెండజోల్ మాత్రల మింగించే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ విధిగా మాత్రలను మింగాలి. మాత్రల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మాత్రలను వేసుకుంటే ఏమైనా దుష్ప్రభావాలు తలెత్తినా.. ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతాయి. తగ్గనిపక్షంలో సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని డాక్టర్‌ను సంప్రదించి చికిత్స పొందాలి. కార్యక్రమం విజయవంతానికి ప్రతిఒక్కరూ సహకరించాలి.– ఆర్.దుర్గయ్య, జిల్లా మలేరియా అధికారి -
కేరళ వరదలు : వెంటాడుతున్న వ్యాధుల భయం
తిరువనంతపురం : వారం రోజులుపైగా కేరళను ముంచెత్తిన వరద తగ్గుముఖం పట్టిన క్రమంలో పునరావాస శిబిరాల్లో లక్షలాది మంది తలదాచుకుంటున్న క్రమంలో కలుషిత నీరు, వాయుకాలుష్యంతో వ్యాపించే వ్యాధులపై అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పునరావాస శిబిరాల్లో రెండు లక్షలకు పైగా కుటుంబాలు తలదాచుకుంటున్నాయని కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారి అనిల్ వాసుదేవన్ వెల్లడించారు. రాష్ట్ర రాజధాని తిరువనంతపురానికి 200 కిమీ దూరంలోని అలువ పట్టణంలోని పునరావాస శిబిరంలో ముగ్గురికి చికెన్‌పాక్స్‌తో బాధపడుతున్నట్టు గుర్తించారు. శిబిరాల్లో అంటువ్యాధులు ప్రబలితే ఎదుర్కొనేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నట్టు కేరళ ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. మరోవైపు కేరళలో 14 జిల్లాల్లో రెడ్ అలర్ట్‌ను ఉపసంహరించిన వాతావరణ శాఖ ఎర్నాకుళం, పధానమతిట్ట, అలప్పుజ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు కేరళలో వరద మృతుల సంఖ్య 194కు పెరిగింది. రాష్ట్రంలో వరద సహాయక, పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు సోమవారం కొచ్చి నావల్ బేస్ నుంచి విమానాల రాకపోకలను పునరుద్ధరించనున్నారు. -
ఖనన్
పొద్దున్నించీ ఇంట్లోనే కూర్చుని ఎలాగో ఉంది అతనికి. బయటికెళ్లి కాసేపు ఎక్కడైనా చెట్టునీడన కూర్చోవాలనుకున్నాడు. ఎర్రటి ఎండ. ఈమధ్య కాలంలో ఇంత ఎండ ఏనాడైనా వచ్చింది లేదు అనుకున్నాడు. ఎలాగోలా సర్దుకొని ఇంట్లోనుంచి చేతికర్ర సాయంతో బయటకి వెళుతుంటే అరిచినట్టే అడిగింది అతని భార్య – ‘‘భోజనం చెయ్యకుండా ఎక్కడికి వెళుతున్నావు? పైగా ఇంత ఎండలోనా? కళ్లు తిరిగి పడిపోతే తీసుకొచ్చే వారున్నారా ఏమైనా?’’. ఆమె మాటలు విననట్టే, ‘‘ఇక్కడికే వెళ్లొస్తానులే!’’ అని బయలుదేరాడు. వయసు మీద పడిపోతోంది. చేతికర్ర సాయమున్నా ఎక్కడ పడిపోతానోనన్న భయం అతణ్ని ఈమధ్య రోజూ వెంటాడుతూనే ఉంది. ఒక్కో అడుగు వేస్తూ వీధి చివర్న ఉన్న ఒక చెట్టుకిందకు చేరాడు. అప్పుడే అటుగా వెళుతున్న పశువులను అవి వెళ్లిపోయేంతవరకూ చూసి, ఒక దగ్గర కూలబడి కూర్చున్నాడు. అతనికి అకస్మాత్తుగా తన ఖనన్ గుర్తుకొచ్చింది. ఖనన్ తనకెంతో ఇష్టమైన ఎద్దు. ఇప్పుడతను కూర్చున్న ఈ చెట్టుకిందే ఖనన్‌ను పద్నాలుగేళ్ల కిందట అమ్మేశాడు.ఈ చెట్టు నీడలో, చల్లటి గాలిలో ఖనన్‌తో గడిపిన కాలం అతనికి గుర్తుకువస్తోంది. జ్ఞాపకాలు ఎప్పుడూ వెన్నంటే ఉంటాయి. ఖనన్ జ్ఞాపకాలనైతే అతను ఎప్పటికీ వదులుకోలేడు. ఎన్నేళ్ల బంధం ఖనన్‌తో తనది? ఎంత ఇష్టంగా చూసుకునేవాడు ఖనన్‌ని? ఒక్కొక్కటీ గుర్తుకొస్తూ ఉంటే అతని కళ్లలో నీటిచెమ్మ. ఈ వయసులో దాన్ని తలుచుకుంటూ ఒంటరి వాడైపోయినట్టు భావిస్తున్నాడతను. ఖనన్‌తో అతనిది విడదీయలేని బంధం. ఇలాంటిదే ఒకరోజు మధ్యాహ్నం. ఖనన్‌తో కలిసి చెలకను దున్నుతున్నాడతను. సూర్యుడు నడి నెత్తి మీదకు వచ్చాడు. అతనికి అప్పటికే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. నీరసంగా ఉన్నాడు. ఇంక ఏమాత్రం పనిచేసే ఓపిక లేక, వెళ్లి దూరంగా ఓ చెట్టునీడ పట్టున గడ్డిమీదే పడుకొని కునుకు తీస్తున్నాడు. ఖనన్ మాత్రం పనిచేసుకుంటూనే ఉంది. దాని గజ్జెల శబ్దం అతనికి వినిపిస్తూనే ఉంది. కాసేపటికి చెలకనంతా దున్నేసి నాగలితో ఎర్రటి ఎండలో నిల్చుండిపోయింది. చాలాసేపు అలాగే నిలబడి ఉంది. అతను నీళ్ల దగ్గరికి తీసుకెళతాడని ఆశగా చూస్తూంది. ‘‘అయ్యో! ఎంత చెడ్డ పనిచేశాను నేను. నన్ను క్షమించు ఖనన్..’’ అంటూ పరుగున వెళ్లి ఖనన్‌ను నీళ్ల దగ్గరికి తీసుకెళ్లాడతను. దాని దాహం తీరింది. ఖనన్ అతను తప్ప ఎవ్వరు నీళ్లు తాగించినా తాగదు. గడ్డి కూడా అతను వేస్తే తప్ప తినేది కాదు. ఎవరైనా వేసినా విరుచుకు పడేది. ఖనన్‌కు ఏదైనా గాయమైతే అతను తన చేతి స్పర్శతో నిమిరితే చాలు గాయాన్ని మరచిపోయేది. ఒక్కరోజు అతను కనిపించకపోయినా ఖనన్ దిగులుగా ఉండేది. ఖనన్ మెడలో ఉండే గజ్జెల మువ్వలు ఉదయాన్నే అతణ్ని నిద్రలేపేవి. అలాగే అతను ఎప్పుడు నిద్రలేచినా ముందుగా ఖనన్‌ను చూసుకునేవాడు.వాళ్లదొక విచిత్ర బంధం. ఒకరంటే ఒకరికి పిచ్చి ప్రేమ. ఖనన్ అతనికి ఒక కొడుకు లాగా. ఖనన్ తోడుంటే పొలం పనులన్నీ ఇట్టే అయిపోతున్నట్టు అనిపించేది అతనికి. అతను ఏదైనా పనిమీద బయటకెళ్లి వస్తూంటే, దూరం నుంచే అతని మాటలో, కేకలో విని, గొంతు గుర్తుపట్టి దగ్గరకు వచ్చి చూసేది. అతను వందమందిలో ఉన్నా ఖనన్ అతణ్ని గుర్తుపడుతుంది. అతనికి దు:ఖం ఎక్కువైంది. ‘ఎలా ఉండేది ఖనన్‌తో! ఇప్పుడు ఎక్కడుందో?’ అనుకుంటూ ఆ చెట్టునీడనే కొద్దిసేపు కునుకు తీశాడు. ఓసారి అతని పరిస్థితి దారుణంగా తయారైంది. ఎటుచూసినా కరువే. పేదరికం అతని ఇంటిని బలంగా తాకింది. కుటుంబానికి ఏమీ చెయ్యలేడు. ఖనన్‌కు తినడానికి ఏదైనా పెట్టడానికి కూడా కష్టమైంది. రోజురోజుకీ పేదరికం మీద పడిపోతుంటే, పెళ్లైనా అత్తారింటికి వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న కూతుర్ని చూస్తుంటే అతనికి బాధ లోలోతుల్నుంచి తన్నుకొచ్చేది. ఎంత బాధ ఉన్నా ఏం చేస్తాడు? పెళ్లికైతే ఇల్లు అమ్మేశాడు కానీ, కూతుర్ని అత్తారింటికి పంపడానికి కట్నం బాకీ తీర్చాలి. ఎలా? ఖనన్ పరిస్థితీ అంతే ఉంది. ఎప్పుడైనా అది ఎక్కడో ఒక దగ్గర ఇంత గడ్డి తినగలిగి ఇంటికొస్తే అతను చాలా సంతోషించే వాడు. ఒకరోజు ఇలాగే చాలారోజులకు కొంత తిని అతని పక్కనొచ్చి నెమరేస్తూ కూర్చుంది ఖనన్. అతను ఖనన్‌ను దగ్గరకు తీస్కొని నిమురుతున్నాడు. అప్పుడే కూతురు అక్కడికొచ్చి అతణ్ని చూసింది. ‘‘ఇంకా ఎన్ని రోజులు ఉండాలి నేనిక్కడ? మా అత్తగారింటికి ఎప్పుడు పంపిస్తారు నన్ను?’’ అంటూ అరుస్తున్నట్టే మాట్లాడింది. అతనికేం సమాధానం చెప్పాలో తెలియలేదు. ‘‘నా దగ్గర డబ్బులు లేవమ్మా!’’ అని సమాధానమిచ్చాడు. ‘‘ఈ ఖనన్‌ని అమ్మేసి డబ్బులు తీసుకురా!’’ అంది. అతని గుండె ముక్కలయినంత పనయ్యింది. అతని భార్య భుజమ్మీద చెయ్యేసి పేదరికపు చూపొకటి చూసింది. అతనింకేం మాట్లాడలేదు. ఖనన్‌ని తీసుకొని ఆదివారం పశువులు అమ్ముడుపోయే సంతకు వెళ్లాడు. అక్కడ అన్నీ బక్కచిక్కిన ఎద్దులు, వ్యాధిసోకిన గేదెలు ఉన్నాయి. వాటితో కలిపి ఖనన్‌ని అమ్మేయాలన్న ఆలోచనే అతనికి భయంకరంగా తోచింది. ‘లేదు. నా ఖనన్‌ని అమ్మే ప్రసక్తే లేదు.’ అని గట్టిగా అనుకున్నాడు. వెంటనే కూతురి మాటలు గుర్తుకొచ్చాయి. ఖనన్‌ని చూసి చాలామంది ఎగబడి కొనడానికి వస్తున్నారు. అతను చివరకు ఎలాగోలా గుండె నిబ్బరం చేసుకొని ఖనన్‌ని అమ్మేశాడు. యజమాని దగ్గర్నుంచి డబ్బులు తీసుకుంటున్నప్పుడు అతణ్ని బాధగా చూస్తూ ఉంది ఖనన్. అతను మాత్రం దానికి ఏమని చెబుతాడు? ఆ రోజు ఈరోజుకీ అతనికి అలాగే గుర్తుంది. ఖనన్‌ను చివరగా చూసిన ఆ చూపును ఎప్పటికీ మరచిపోలేడు. ఖనన్‌ని అమ్మేయగా వచ్చిన డబ్బులతో అతను అప్పులన్నీ తీర్చేశాడు. కూతురు అత్తారింటికి కూడా వెళ్లిపోయింది. కానీ ఖనన్? ఖనన్ మాత్రం లేదిప్పుడు. చెట్టుకింద కునుకు తీస్తున్నాడన్న మాటే కానీ అతణ్ని ఖనన్ ఆలోచనలు వెంబడిస్తున్నాయి. ఆకలిని కూడా మరచిపోయాడు. కళ్లు తెరిచి చూస్తే వాతావరణం కాస్తంత చల్లబడింది. అప్పుడే సాయంత్రమైందా అన్నట్టు చుట్టూ చూశాడు. దూరంగా ఒక ఎద్దుల మంద కనిపించింది. ఆ మంద అతణ్ని చేరుతున్న కొద్దీ అతనికి ఒక శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది. ‘అదే! కచ్చితంగా అదే చప్పుడు. అది కచ్చితంగా నా ఖనన్ గజ్జల చప్పుడే..’ అని లేచి నిలబడ్డాడు. అతని మనసు పట్టరాని ఆనందంతో ముసలి చిందులు వేస్తోంది. వెంటనే పరుగులాంటి నడకతో ఖనన్వస్తున్న వైపుకు వెళ్లాడు. ఖనన్ బక్కచిక్కిన ఎముకలు బయటకొచ్చి దీనంగా నిలబడింది. అతనితో పాటు అతని ఖనన్ కూడా ముసలిదైపోయింది. ‘ఎలా ఉండే ఖనన్ ఎలా అయిపోయింది!’ అనుకుంటూ ఖనన్‌ను చాలాకాలం తర్వాత చూసి తెలీకుండా ఏడ్చేశాడతను. అతనైతే ఖనన్‌ని గుర్తుపట్టాడు కానీ, ఖనన్ అతణ్ని గుర్తుపట్టలేకపోయింది. దగ్గరికెళ్లి ఖనన్‌తో ఏదో మాట్లాడే ప్రయత్నం చేశాడు. దాని కాలు మీద ఏదో ఎర్రటి ముద్ర ఉండటం చూశాడు. ‘‘ఇదేమిటయ్యా!’’ అని యజమానిని అడిగాడు. ‘‘ఈ పశువులన్నింటినీ వేరే దేశానికి పంపిస్తున్నాం పెద్దయ్యా!’’ అన్నాడతను. అతనికి దు:ఖం తన్నుకొచ్చింది. ‘ఖనన్‌ను వేరే దేశానికి పంపిస్తున్నారా?’ ఖనన్‌కు దగ్గరగా వెళ్లి నిలబడి, ‘‘ఖనన్!’’ అని పిలిచాడు. దగ్గరగా జరిగి దాని ఒంటిమీద చెయ్యేసి మెల్లిగా నిమురుతూ ఉన్నాడు. ఆ చేతి స్పర్శతో, మాటతో ఖనన్ అతణ్ని గుర్తుపట్టింది. అతనికి ఎక్కడలేని సంతోషాన్నంతా ఎవరో పిలిచి ఇచ్చినట్టనిపించింది. ఖనన్ గంటలు మోగించింది. చెంగున ఎగిరింది. ‘నా ఖనన్‌ను ఎక్కడికీ పంపించకూడదు. నాతో పాటే తీసుకెళ్లాలి.’ అనుకున్నాడు. పశువులు అమ్మే అతని దగ్గరికి ఆ సాయంత్రమే వెళ్లి కలిశాడు. తన దగ్గరున్న డబ్బునంతా తెచ్చుకున్నాడు. తాను గుడిసె వేసుకొని ఉన్న పొలాన్ని తాకట్టు పెట్టి కొంత అప్పు కూడా తెచ్చుకున్నాడు. ‘‘ఖనన్! నేను నిన్ను ఎక్కడికీ పోనివ్వను. ఇంకెప్పటికీ..’’ అన్నాడతను ఖనన్‌ను గట్టిగా కౌగిలించుకుంటూ. -
రెండువారాలు అలా గడిపితే..
లండన్ : ఆధునిక సౌకర్యాలు మనిషి జీవితాన్ని సుఖమయం చేసినా అదే సమయంలో లేజీనెస్ పెరగడం మన శరీరాలను ఛిద్రం చేస్తోంది. రోజంతా డెస్క్‌కు అంకితమవడం, అదేపనిగా డ్రైవింగ్, వారాంతాల్లో సోఫాల్లో అతుక్కుపోవడం ఇలా ఓ రెండు వారాలు గడిచినా అనారోగ్యానికి దారితీస్తుందని తాజా అథ్యయనం వెల్లడించింది. నిత్యం బద్ధకంతో గడిపితే కొన్నేళ్లలోనే శరీరం వ్యాధుల కుప్పగా మారుతుందని హెచ్చరించింది. దీర్ఘకాలంలో ఇది టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, స్ర్టోక్ వంటి తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుందని పరిశోధకులు తేల్చిచెప్పారు. అయితే చిన్నపాటి జీవనశైలి మార్పులతో ఈ పరిస్థితిని నివారించవచ్చని చెబుతున్నారు. లిఫ్ట్‌కు బదులు మెట్లను ఉపయోగించడం, ఆన్లైన్ షాపింగ్‌కు ప్రత్యామ్నాయంగా సూపర్ మార్కెట్‌కు వెళ్లడం, రోజుకు అరగంట పాటు నడవడం ద్వారా అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చని సూచించారు. శరీరాన్ని చురుకుగా ఉంచకపోతే భవిష్యత్ వ్యాధులకు పునాదులు వేసినట్టేనని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ డేనియల్ కూత్బెర్ట్స్న్ హెచ్చరించారు. ఆధునిక జీవితంతో సమాజం యాంత్రిక జీవనశైలిలో మగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కదలికలు లేని జీవనశైలి ప్రమాదకరమని..ఇది దీర్ఘకాలం కొనసాగితే శరీరం వ్యాధులకు నిలయమవుతుందన్నారు. -
జ్వరభద్రం
ప్రజలు జ్వరాలతో అల్లాడుతున్నారు. పల్లె, పట్టణం తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. తాగునీరు కూడా కలుషితమవుతోంది. వీటి విషయంలో వైద్య, ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. దీంతో సీజనల్ వ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయి. మరీ ముఖ్యంగా తీవ్ర ఒళ్లునొప్పులు, కీళ్లు పట్టేయడం వంటి లక్షణాలతో కూడిన జ్వరంతో ప్రజలు అల్లాడుతున్నారు. పట్టణాల్లో ప్రతి వీధిలోనూ, గ్రామాల్లో ప్రతి ఇంట్లోనూ కనీసం ఒకరు చొప్పున బాధపడుతున్నారు. ఫలితంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోని ఓపీ విభాగాలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. కర్నూలు(హాస్పిటల్): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతిరోజూ 60 నుంచి 100 వరకు ఉండే ఓపీ ఇటీవల వైరల్ ఫీవర్ల కారణంగా 150 నుంచి 180కి చేరుతోంది. అలాగే కర్నూలు సర్వజన వైద్యశాల, నంద్యాల జిల్లా ఆసుపత్రి, ఆదోని ఏరియా ఆసుపత్రులతో పాటు ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు జ్వరపీడితులు అధిక సంఖ్యలో వస్తున్నారు. సర్వజన వైద్యశాలలోని మెడికల్ ఓపీ విభాగాల్లో జ్వరపీడితుల సంఖ్య ప్రతిరోజూ 400 నుంచి 450 వరకు ఉంటోంది. ఇటీవల వర్షాలు ఆశాజనకంగా కురుస్తున్నాయి. నదుల్లో, కాలువల్లో కొత్త నీరు వచ్చి చేరుతోంది. ఇదే క్రమంలో తాగునీరు కలుషితమవుతోంది. నీటిని శుద్ధిచేసి అందించాల్సిన ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖలు తమ బాధ్యతలను నిర్వర్తించడం లేదు. దీంతో వ్యాధులు విజృంభిస్తున్నాయి. టైఫాయిడ్, పసరికల(కామెర్లు)తో బాధపడేవారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. పెరుగుతున్న డెంగీ, స్వైన్‌ఫ్లూ కేసులు ఒకవైపు వైరల్ ఫీవర్లు విజృంభిస్తుండగా.. మరోవైపు చాపకింద నీరులా డెంగీ, మలేరియా, స్వైన్‌ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 57 మందికి డెంగీ వచ్చినట్లు అధికారికంగా నిర్ధారణ అయ్యింది. ఇంకా 188 మందికి అనుమానిత డెంగీగా చికిత్స అందించారు. కర్నూలు నగరంలోని పలు కాలనీలు, నంద్యాల, ఆదోనితో పాటు గూడూరు, బేతంచర్ల, క్రిష్ణగిరి, ఎమ్మిగనూరు, ఆత్మకూరు, మిడుతూరు, శ్రీశైలం తదితర ప్రాంతాల్లో డెంగీ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఇక గిరిజన ప్రాంతాల్లో 30, ఇతర ప్రాంతాల్లో 29 మందికి మలేరియా వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవానికి మూడింతలు అధికంగా బాధితుల సంఖ్య ఉంటుంది. కర్నూలు, నంద్యాల పట్టణాల్లో స్వైన్‌ఫ్లూ కేసులు కూడా బయటపడుతున్నాయి. నంద్యాలకు చెందిన ఓ వ్యక్తి కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అలాగే నగరానికి చెందిన ఓ మహిళ సైతం స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. డెంగీ, మలేరియా నిర్ధారణ అయిన ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపడుతున్నాం. ఈ మేరకు మలేరియా సబ్యూనిట్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చాం. పాజిటివ్ వచ్చిన రోగి ఇంటి పక్కల 50 ఇళ్లల్లో పైరిత్రమ్ స్ప్రే చేస్తున్నాం. నీళ్లు నిలిచిన చోట యాంటీలార్వా చర్యలు తీసుకుంటున్నాం. దోమలు ఎక్కువగా ఉంటే పంచాయతీల సహకారంతో ఫాగింగ్ చేయిస్తున్నాం. –జె.డేవిడ్‌రాజు, జిల్లా మలేరియా అధికారి -
పిట్టల్లా రాలిపోతున్న గొర్రెలు
ఒకే గ్రామంలో ఇప్పటికే 500 గొర్రెలు మృత్యువాత ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే పీటీఆర్ మందులు కాళ్లరిగేలా తిరిగినా వాటికీ గతిలేదు ప్రైవేట్‌లో మందులు అందుబాటులో లేక ఇక్కట్లు ఆందోళనలో గొల్లకురుమలు దుబ్బాక: పిల్లల నుంచి చేతికొచ్చే వరకు పోషించిన గొర్రెలు కళ్లెదుటే ఒక్కొక్కటి రాలిపోతుండడంతో గొల్ల, కురుమల్లో ఆందోళన నెలకొంది. వాటికొచ్చిన వ్యాధిని నయం చేసుకుందామంటే మార్కెట్లో మందు బిల్ల దొరకడం లేదు. దిక్కు తోచక కాపరులు దేవుడిపై భారం వేసి బతుకీడుస్తున్నారు. పశువుల డాక్టర్లు చేతులెత్తేయడంతో గొల్ల కురుమలకు కంటిమీద కనుకు లేకుండా పోతోంది. దుబ్బాక మండలం పెద్దగుండవెళ్లిలో 90 కుటుంబాలు గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రతి ఇంట్లో 100 నుంచి 200 వందల జీవాలను పోషిస్తారు. పెరిగి పెద్దగయ్యే వరకు పోషించి విక్రయించగా వచ్చిన డబ్బులతోనే కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. గొర్రెల మూతి చుట్టూ ఎర్రటి మచ్చలు, నాలుక రంగు మారడం, లో జ్వరంతో బాధపడుతుండడమే సొరపు వ్యాధి ముఖ్య లక్షణం. గొర్రెలకు సొరపు వ్యాధి సోకడంతో గ్రామంలో 500 గొర్రెలకు ఇప్పటికే మృత్యువాత పడ్డాయి. గ్రామానికి చెందిన పెద్దొళ్ల బాలమల్లు-40, బైతి చంద్రయ్య-15, బట్టు మల్లయ్య-25, బీర్ల మల్లయ్య-24, ఏల్పుల తిరుపతి-18, కోర్ల ఎల్లయ్య-13, గూడూరి నాగయ్య-20, దయ్యాల ఎల్లయ్య-8, దయ్యాల మల్లయ్య-24, చిట్టపురం దుర్గయ్య-18 మేకలు, కంతుల మల్లయ్య-14, ఏల్పుల ఎల్లయ్య-6, బీర్ల రాజయ్య-14, గూడూరి నాంపల్లి-16, గూడూరి యాదయ్య-14, బీర్ల వీరమల్లు-40, దయ్యాల బాలమల్లుకు చెందిన 40 గొర్రెలు మరణించాయి. మరో 600 గొర్రెలు చావుకు దగ్గర్లో ఉన్నాయి. సొరపు వ్యాధి నివారణకు వాడే పీటీఆర్ మందులు ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రుల్లోనే లభిస్తాయి. ప్రైవేట్ మందుల దుకాణాల్లో అసలే దొరకవు. మందుల కోసం 3 నెలల నుంచి ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ గొల్ల కురుమలు చెప్పులరిగేలా తిరిగినా ఫలితం లేదు. తమ వద్ద స్టాక్ లేదని డాక్టర్లు పంపిస్తున్నారని గొర్రె, మేకల పెంపకందారులు వాపోతున్నారు. చేతికందివచ్చిన గొర్రెలు కళ్లెదుటే మరణిస్తుండడంతో వేలకు వేలు నష్టపోతున్నారు. ఈ వ్యాధి విషయాన్ని జెడ్పీటీసీ ఏల్పుల గౌతమి సమక్షంలో గొర్రెలకాపరులు రాష్ర్ట శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో ఫోన్లో మాట్లాడి గొర్రెలకు వచ్చిన వ్యాధి, కావాల్సిన మందులను పంపించాలని కోరారు. సొరపు వ్యాధిపై మంత్రి దృష్టికి.. పెద్దగుండవెళ్లి గ్రామంలోని గొర్రెలకు వచ్చిన సొరపు వ్యాధి నివారణకు మందులు కావాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశా. మంత్రి సానుకూలంగా స్పందించారు. రెండు, మూడు రోజుల్లో నివారణ మందులు అందుబాటులోకి రానున్నాయి. గొర్రెల వృత్తిదారులెవ్వరూ ఆందోళన చెందొద్దు. బాధిత కుటుంబాలను ఆదుకుంటాం. - ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మందులు ఇవ్వడం లేదు గొర్రెల పెంపకంపైనే ఆధారపడి జీవిస్తున్నా. సొరపు వ్యాధితో 40 గొర్రెలు చనిపోయాయి. వ్యాధి నివారణ మందుల కోసం ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నా ఒక్క మందు బిల్ల ఇవ్వడం లేదు. ఆసుపత్రిలో స్టాక్ లేదని తిప్పి పంపుతున్నరు. సొరపు వ్యాధితో నష్టపోతున్న మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. - గూడూరి చంద్రయ్య, గొర్రెల కాపరి, పెద్దగుండవెళ్లి ప్రభుత్వం ఆదుకోవాలి సొరపు వ్యాధితో వందలాది గొర్రెలు చస్తానయ్. నేను పెంచుతున్నవాటిలో 40 గొర్రెలు ఇప్పటికే మరణించాయి. మరిన్ని చనిపోవడానికి సిద్ధంగా ఉన్నయి. వ్యాధి నివారణకు మందులు లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. డాక్టర్లు సకాలంలో స్పందించాలి. గొర్రె కాపరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. - బీర్ల వీరమల్లు, గెర్రెల కాపరి, పెద్దగుండవెళ్లి -
పంటకు తెగులు.. రైతుకు దిగులు
♦ పురుగు మందుల కోసం భారీగా ఖర్చు చేస్తున్న రైతులు ♦ పత్తాలేని వ్యవసాయశాఖ డయాగ్నస్టిక్ బృందాలు ♦ సీఎం పర్యటన నెపంతో పొలంబాట పట్టని అధికారులు అనంతపురం అగ్రికల్చర్ : వేరుశనగను తెగుళ్లు చుట్టుముట్టాయి. పత్తి, పెసర, ఆముదం, కంది తదితర పంటలకు కూడా చీడపీడలు వ్యాపించాయి. ఇటీవల విస్తారంగా వర్షాలు కురవడంతో ఖరీఫ్ పంటలన్నీ పచ్చదనం సంతరించుకున్నాయి. పచ్చదనం మాటున పురుగులు, తెగుళ్లు పంటలను దెబ్బతీసే పరిస్థితి ఏర్పడింది. అసలే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతులు పంటలను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. పురుగు మందుల కోసం భారీగా ఖర్చు పెడుతున్నారు. సరైన సస్యరక్షణ సలహాలు, పంట యాజమాన్య పద్ధతులు తెలియజేయడంలో వ్యవసాయశాఖ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోంది. ఖరీఫ్ పంటల కోసం అనంతపురం, రెడ్డిపల్లి, రేకులకుంట, కళ్యాణదుర్గం డాట్ సెంటర్, ఏఆర్ఎస్, కేవీకేలకు చెందిన శాస్త్రవేత్తలు, డివిజన్ ఏడీలు, కొందరు టెక్నికల్ ఏవోలతో డయాగ్నస్టిక్ (వ్యాధి నిర్ధారణ) బృందాలు ఏర్పాటు చేసినట్లు వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీఏ) శ్రీరామమూర్తి ఘనంగా ప్రకటించారు. అయితే.. వాటి జాడ ఎక్కడా కనిపించడం లేదు. దీంతో రైతులు పురుగు మందుల దుకాణదారులను ఆశ్రయిస్తూ వారి సిఫారసు చేసిన రెండు, మూడు మందులు కలిపి పిచికారీ చేస్తున్నారు. దీనివల్ల మిశ్రమ ఫలితాలు చవిచూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 5.10 లక్షల హెక్టార్లలో వేరుశనగ, 60 వేల హెక్టార్లలో కంది, 12 వేల హెక్టార్లలో ఆముదం, 10 వేల హెక్టార్లలో పత్తి పంటలతోపాటు మరో 20–30 వేల హెక్టార్లలో ఇతరత్రా పంటలు వేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఇంకా గ్రామాల వారీగా గణాంకాలు అందుబాటులోకి రాకపోవడంతో విస్తీర్ణం లెక్కలు కచ్చితంగా తెలియడం లేదు. వేరుశనగ పంటకు జీడ, మొదలుకుళ్లు, వేరుకుళ్లు, ఆకుముడత, ఆకుమచ్చతెగులు, పొగాకు లద్దెపురుగు, శనగపచ్చ పురుగుతో పాటు గొంగళి పురుగులు కూడా ఆశించాయి. దీంతో ఏ మందు కొట్టాలో తెలియక రైతులు అవస్థలు పడుతున్నారు. గులాబీరంగు కాయతొలచు పురుగు భయంతో పత్తి రైతులు, పల్లాకు తెగులు, ఆకుమచ్చ వస్తుందనే ఆందోళనలో పెసర రైతులు ఉన్నారు. ఆకుమచ్చ, వేరుకుళ్లు, నామాల పురుగు, లద్దెపురుగు, దాసరిపురుగుతో ఆముదం పంట దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ప్రాంతాల వారీగా డయాగ్నస్టిక్ బృందాలు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తే ఫలితం ఉంటుందనే అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. కనీసం వారం రోజుల పాటు పొలాలపై దృష్టి పెడితేనే ఖరీఫ్ పంటలు కొంత వరకు కోలుకునే పరిస్థితి ఉంటుంది. పొలంబాట, పొలంపిలుస్తోంది వంటి కార్యక్రమాలు చిత్తశుద్ధితో చేపడితేనే రైతులు కష్టాల నుంచి బయట పడతారు. అయితే.. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఏర్పాట్లలో వ్యవసాయశాఖ పూర్తిగా నిమగ్నమై.. రైతుల పరిస్థితిని పట్టించుకోవడం లేదు.