పంటకు తెగులు.. రైతుకు దిగులు
♦ పురుగు మందుల కోసం భారీగా ఖర్చు చేస్తున్న రైతులు
♦ పత్తాలేని వ్యవసాయశాఖ డయాగ్నస్టిక్ బృందాలు
♦ సీఎం పర్యటన నెపంతో పొలంబాట పట్టని అధికారులు
అనంతపురం అగ్రికల్చర్ : వేరుశనగను తెగుళ్లు చుట్టుముట్టాయి. పత్తి, పెసర, ఆముదం, కంది తదితర పంటలకు కూడా చీడపీడలు వ్యాపించాయి. ఇటీవల విస్తారంగా వర్షాలు కురవడంతో ఖరీఫ్ పంటలన్నీ పచ్చదనం సంతరించుకున్నాయి. పచ్చదనం మాటున పురుగులు, తెగుళ్లు పంటలను దెబ్బతీసే పరిస్థితి ఏర్పడింది. అసలే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతులు పంటలను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. పురుగు మందుల కోసం భారీగా ఖర్చు పెడుతున్నారు.
సరైన సస్యరక్షణ సలహాలు, పంట యాజమాన్య పద్ధతులు తెలియజేయడంలో వ్యవసాయశాఖ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోంది. ఖరీఫ్ పంటల కోసం అనంతపురం, రెడ్డిపల్లి, రేకులకుంట, కళ్యాణదుర్గం డాట్ సెంటర్, ఏఆర్‌ఎస్, కేవీకేలకు చెందిన శాస్త్రవేత్తలు, డివిజన్ ఏడీలు, కొందరు టెక్నికల్ ఏవోలతో డయాగ్నస్టిక్ (వ్యాధి నిర్ధారణ) బృందాలు ఏర్పాటు చేసినట్లు వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీఏ) శ్రీరామమూర్తి ఘనంగా ప్రకటించారు. అయితే.. వాటి జాడ ఎక్కడా కనిపించడం లేదు. దీంతో రైతులు పురుగు మందుల దుకాణదారులను ఆశ్రయిస్తూ వారి సిఫారసు చేసిన రెండు, మూడు మందులు కలిపి పిచికారీ చేస్తున్నారు. దీనివల్ల మిశ్రమ ఫలితాలు చవిచూస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా 5.10 లక్షల హెక్టార్లలో వేరుశనగ, 60 వేల హెక్టార్లలో కంది, 12 వేల హెక్టార్లలో ఆముదం, 10 వేల హెక్టార్లలో పత్తి పంటలతోపాటు మరో 20–30 వేల హెక్టార్లలో ఇతరత్రా పంటలు వేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఇంకా గ్రామాల వారీగా గణాంకాలు అందుబాటులోకి రాకపోవడంతో విస్తీర్ణం లెక్కలు కచ్చితంగా తెలియడం లేదు. వేరుశనగ పంటకు జీడ, మొదలుకుళ్లు, వేరుకుళ్లు, ఆకుముడత, ఆకుమచ్చతెగులు, పొగాకు లద్దెపురుగు, శనగపచ్చ పురుగుతో పాటు గొంగళి పురుగులు కూడా ఆశించాయి.
దీంతో ఏ మందు కొట్టాలో తెలియక రైతులు అవస్థలు పడుతున్నారు. గులాబీరంగు కాయతొలచు పురుగు భయంతో పత్తి రైతులు, పల్లాకు తెగులు, ఆకుమచ్చ వస్తుందనే ఆందోళనలో పెసర రైతులు ఉన్నారు. ఆకుమచ్చ, వేరుకుళ్లు, నామాల పురుగు, లద్దెపురుగు, దాసరిపురుగుతో ఆముదం పంట దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ప్రాంతాల వారీగా డయాగ్నస్టిక్ బృందాలు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తే ఫలితం ఉంటుందనే అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. కనీసం వారం రోజుల పాటు పొలాలపై దృష్టి పెడితేనే ఖరీఫ్ పంటలు కొంత వరకు కోలుకునే పరిస్థితి ఉంటుంది. పొలంబాట, పొలంపిలుస్తోంది వంటి కార్యక్రమాలు చిత్తశుద్ధితో చేపడితేనే రైతులు కష్టాల నుంచి బయట పడతారు. అయితే.. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఏర్పాట్లలో వ్యవసాయశాఖ పూర్తిగా నిమగ్నమై.. రైతుల పరిస్థితిని పట్టించుకోవడం లేదు.