former problems
-
ఆ చైతన్యం ఏది..?
సాక్షి, అశ్వారావుపేట(ఖమ్మం) : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌కు ముందు రైతుల్లో అవగాహన కల్పించేందుకు ‘మన తెలంగాణ–మన వ్యవసాయం’ కార్యక్రమాన్ని నిర్వహించేది. అందులో భాగంగా ఆధునిక వ్యవసాయం, నకిలీ విత్తనాలు, సాగు పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భూసార పరీక్షల అవశ్యకత, పంట మార్పిడి, పంటల ఉత్పత్తులు గోదాముల్లో నిల్వ చేసి రుణం పొందే విధానం, వర్షాభావ పరిస్థితుల్లో సాగు చేయాల్సిన పంటలు, చీడపీడల నివారణ, పాడి పశువుల ద్వారా అభివృద్ధి, పశు సంవర్ధక శాఖ అందిస్తున్న రాయితీలు, వ్యవసాయంలో విద్యుత్ వినియోగం, విత్తనోత్పత్తికి సంబంధించిన ప్రోత్సాహం వంటి అంశాలపై వ్యవసాయాధికారులతో రైతుల్లో చైతన్యం కలిగించేవారు. కానీ, గతేడాది ఆ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ఈ ఏడాది కూడా చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు లేదు. దీంతో రైతులు పలు అంశాలపై అవగాహన లేక తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అసలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారా? లేదా? అనే అయోమయంలో రైతులు ఉన్నారు. ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం, కనీసం దీని గురించి కూడా ఊసెత్తకపోవడం గమనార్హం. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఖరీఫ్ పంటల సాగుకు ముందే ప్రభుత్వం ‘మన తెలంగాణ–మన వ్యవసాయం’ కార్యక్రమాన్ని నిర్వహించేది. ఈ కార్యక్రమాన్ని గతేడాది నిర్వహించకపోగా, ఈ ఏడాది కూడా నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వం ‘రైతు చైతన్య యాత్ర’ పేరును ‘మన తెలంగాణ–మన వ్యవసాయం’గా మార్చి ఏటా మే చివరి నుంచే రైతులకు సాగు అంశాలు, నకిలీ విత్తనాలు, ఆధునిక వ్యవసాయం, భూసార పరీక్షల అవశ్యకత, పంట మార్పిడి లాంటి అంశాలపై వ్యవసాయాధికారులతో సమావేశాలు (వారం రోజులపాటు) పెట్టించి రైతులకు అవగాహన కల్పించేవారు. కానీ ఈ చైతన్య యాత్రలను గతేడాది నిర్వహించలేదు. ఈ ఏడాదైనా నిర్వహిస్తారా? లేదా? అని రైతులు ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ఇప్పటికే ప్రారంభం కాగా, ఈ చైతన్య యాత్రలపై స్పష్టత లేకపోవడం, ప్రభుత్వం కనీసం ఊసెత్తకపోవడంతో నిరాశ వ్యక్తం అవుతోంది. అవగాహన లేకపోతే ఎలా? ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు ఏఏ పంటలు సాగు చేయాలి? ఖరీఫ్‌లో ఎలాంటి పంటలు సాగు చేస్తే రైతులకు ప్రయోజనం ఉంటుంది, ఏ పంట సాగు చేస్తే పెట్టుబడి తగ్గుతుంది, వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే అందుకు అనుగుణంగా సాగు చేయాల్సిన పంటల వివరాలు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు రావాలంటే పాటించాల్సిన సాగు పద్ధతులపై అవగాహన కల్పించకపోతే ఎలా? అనే వాదనలు వినిపిస్తున్నాయి. వాటితోపాటు పంటల సాగుకు విత్తనాల ఎంపిక ఏ విధంగా చేసుకోవాలి? నకిలీ విత్తనాలను ఎలా గుర్తించాలి? నకిలీ విత్తనాలతో వచ్చే నష్టాలు, ఆధునిక సాగు పద్ధతులు, యంత్రాలు, సేంద్రియ ఎరువుల వాడకం, చీడ పురుగుల నివారణ, భూసార పరీక్షలు అలాంటివి వ్యవసాయ రుణాలు, సబ్సిడీ రాయితీలు పొందే పద్ధతులు, పంటల మార్పిడి, వివిధ పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సాగు పద్ధతులతోపాటు ఆరుతడి పంటలపై మండలస్థాయి, జిల్లా స్థాయి వ్యవసాయధికారులే స్వయంగా ఆయా గ్రామాలకు వచ్చి రైతుల్లో చైతన్యం కల్పించడం ‘రైతు చైతన్య యాత్ర’ల ముఖ్య ఉద్దేశం. ఈ చైతన్య యాత్రలు, అవగాహన సదస్సుల్లో వ్యవసాయ శాఖతోపాటు ఉద్యాన శాఖ, పట్టు పరిశ్రమ, ఆయిల్ ఫెడ్, మార్కెటింగ్ శాఖ, మరో 7 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు రైతుల వద్దకే వెళ్లి అవగాహన కల్పించేవారు. కానీ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఈ సారి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. చైతన్య యాత్రలు నిర్వహించకపోతే రైతులకు ఎలా అవగాహన కలుగుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. యథావిధిగా కొసాగించాలి గతేడాది ‘మన తెలంగాణ–మన వ్యవసాయం’ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ఆ కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించాలి. సాగు పద్ధతులపై అవగాహన లేక రైతులు పంట వేసి నష్టపోయే అవకాశం ఉంది. సేంద్రియ వ్యవసాయంపై కూడా అవగాహన కల్పించాలి. జంగ జమలయ్య, వేంసూరు అవగాహన కల్పిస్తేనే మేలు ఖరీఫ్, రబీ సీజన్లో రైతులకు ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా అవగాహన కల్పిస్తేనే మేలు జరుగుతుంది. సాగు చేసే పంటలపై అవగాహన లేకపోతే పంటలు సాగు చేసి రైతులు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం, రాయితీలపై అవగాహన కల్పిస్తే రైతులకు ఎంతో ప్రయోజనం. గతంలో మాదిరిగానే రైతు చైతన్య యాత్రలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. సంగీతం వీర్రాజు, రైతు, వేదాంతపురం -
ఉపాధి చిక్కుల్లో రాజధాని చిన్నరైతు!
సాక్షి, తాడేపల్లి రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలకు చెందిన దాదాపు 50 వేల మంది చిన్న, సన్నకారు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం చెప్పిన దానికి, జరుగుతున్న దానికి ఎక్కడా పొంతన ఉండడంలేదు. రాజధాని నిర్మాణం పేరుతో ఇక్కడ 33వేల ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సమీకరించింది. భూములిచ్చిన వారిలో అధిక భాగం రైతులు ఎకరం, అర ఎకరం ఉన్నవారే. దీంతో తమ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ఇల్లు గడవక దిక్కుతోచడంలేదని బాధిత రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం వీరికి ఏటా కౌలు చెల్లిస్తున్నప్పటికీ అవి ఏ మూలకూ చాలడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అలాగే, రైతుల పిల్లలకు ఉచితంగా కార్పొరేట్ స్కూళ్లలో చదువు చెప్పిస్తామని హామీ ఇచ్చినా, అది ఎక్కడా అమలుకావడంలేదు. అప్పులు చేసి చదివించాల్సి వస్తోందంటున్నారు. అంతేకాక, రాజధాని మూడు మండలాల్లో సరైన ప్రభుత్వ వైద్యశాల లేక ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కూలి పనీ దొరకడం లేదు గతంలో ఉన్న ఎకరం, అరెకరంలో ఏదో ఒక పంట వేసుకుని, అప్పోసొప్పో చేసుకుని తినేవారమని, పంట చేతికి రాగానే అప్పులు తీర్చేవారమని రైతులు చెబుతున్నారు. రాజధాని పుణ్యమా అంటూ వడ్డీ వ్యాపారస్తులు రైతువారీ వడ్డీకి స్వస్తి చెప్పి అధిక వడ్డీలకు తిప్పుతున్నారని, ఆ అప్పు చేసి ఎలా తీర్చాలో అర్ధంకావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పొలాల్లో పనిలేక నిర్మాణ పనులకు వెళ్తే అక్కడా అన్యాయమే జరుగుతోందని వాపోతున్నారు. భవన యజమానులు, కాంట్రాక్టర్లు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను అతితక్కువ కూలీకి తీసుకువచ్చి వారితో పనులు చేయించుకుంటున్నారని.. తమను తొలగిస్తున్నారని వాపోయారు. దీంతో ఇప్పుడు ప్రతిరోజూ పొట్ట చేతబట్టుకుని ఎక్కడ పని దొరుకుతుందా అని వెతుక్కుంటున్నామంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ గోడు పట్టించుకుని భూములిచ్చిన చిన్న, సన్నకారు రైతులకు పనులు కల్పించాలని వారు కోరుతున్నారు. పని కోసం వెతుక్కోవాల్సి వస్తోంది ఉన్న ఎకరాన్ని పూలింగ్‌కు ఇచ్చా. వచ్చిన కౌలు చాలకపోవడంతో రోజు కూలీ చేసుకుంటున్నాం. కురగల్లులో నిర్మిస్తున్న వర్సిటీలో రూ.10వేల జీతానికి చేరాను. మహారాష్ట్ర నుంచి వచ్చిన వారు రూ.7 వేలకే చేయడంతో మమ్మల్ని తొలగించారు. ఇప్పుడు పనికోసం వెతుక్కోవాలి. – దావులూరి వెంకటేశ్వరరావు పనిలేక ఇబ్బంది పడుతున్నాం ఉన్న 75 సెంట్లు పూలింగ్‌కు ఇచ్చాం. గతంలో అక్కడ కూరగాయలు పండించి అమ్ముకొని జీవించే వాళ్లం. ఇప్పుడు పనిపోయింది. కొత్త పని కోసం వెతుక్కుంటున్నాం. నాలాగా చాలామంది రైతుల పరిస్థితి ఇదే. ప్రభుత్వం దారి చూపకపోతే ఇచ్చిన ప్లాట్లు అమ్ముకుని వలస వెళ్లాల్సిందే. – నాగేశ్వరరావు, ఐనవోలు కూలీలకు పని దొరకడంలేదు గతంలో పొలాల్లో పనిచేసుకుని సాయంత్రానికి ఆరేడు వందలతో ఇంటికి తీసుకెళ్లేవాళ్లం. ఇప్పుడు సిమెంటు పనిచేసినా రూ.500 ఇవ్వడంలేదు. ఎవరిని అడిగినా పనిలేదు పొమ్మంటున్నారు. ఇలా అయితే మేం ఎక్కడకు వలస వెళ్లాలో అర్ధంకావడంలేదు. – బాణావతు దినేష్‌నాయక్, నవులూరు -
సూక్ష్మసేద్యం అనుమతులకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూక్ష్మసేద్యానికి బ్రేక్ పడింది. రైతులు చుక్కచుక్కనూ సద్వినియోగం చేసుకునేందుకు చేపట్టిన ఈ కార్యక్రమానికి నిధులలేమి సమస్యగా మారింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క దరఖాస్తుకు కూడా ఉద్యానశాఖ అనుమతివ్వలేదు. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. రెండేళ్లుగా నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాకపోవడంతో సమస్య మరింత తీవ్రంగా మారింది. కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 60 శాతం చెల్లించినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని విడుదల చేయకపోవడంతో సూక్ష్మసేద్యం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. రెండేళ్ల నుంచి రూ.200 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. భారీ సబ్సిడీతో ప్రోత్సాహం ఇచ్చినా.. ప్రభుత్వం సూక్ష్మసేద్యాన్ని ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ఇస్తుంది. బీసీలకు 90 శాతం, ఇతరులకు 80 శాతం వరకు సబ్సిడీ ఇస్తుంది. ఎకరానికి సూక్ష్మసేద్యం ఏర్పాటు చేసుకోవాలంటే దాదాపు రూ. 25–30 వేల వరకు ఖర్చు కానుంది. నాలుగు ఎకరాల్లో సూక్ష్మసేద్యం ఏర్పాటు చేసుకోవాలంటే రూ. లక్షకు పైగానే ఖర్చుకానుంది. అయితే ఈ సూక్ష్మసేద్యం కోసం ఎస్సీ, ఎస్టీ రైతులకు ఒక్కపైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. దీంతో రైతులు సూక్ష్మసేద్యం ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. 2016–17లో కేవలం 10,550 మంది రైతులు 32,710 ఎకరాలకు దరఖాస్తు చేసుకోగా, 2017–18లో ఏకంగా 3.85 లక్షల ఎకరాలకు 1.16 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో కొందరికి సూక్ష్మసేద్యాన్ని మంజూరు చేసింది. సూక్ష్మసేద్యానికి ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం నాబార్డు నుంచి రూ. 800 కోట్లు రుణంగా తీసుకుంది. ఆ సొమ్ము అంతా కూడా గతేడాది నాటికి చెల్లింపులకు పూర్తయింది. ఇంకా రూ.200 కోట్లు కేంద్రం వాటా పెండింగ్‌లో ఉందని అధికారులు చెబుతున్నారు. పెండింగ్‌లో దరఖాస్తులు... ఇప్పటివరకు నిధులు పెండింగ్‌లో ఉండిపోవడం, ఈ ఏడాది బడ్జెట్లో సూక్ష్మసేద్యం పథకానికి కేటాయించిన రూ.127 కోట్లలో ఒక్క పైసా విడుదల చేయకపోవడంతో ఉద్యానశాఖ సందిగ్ధంలో పడిపోయింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 1.20 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. నిధులు లేకపోవడంతో వాటి అనుమతులకు బ్రేక్ పడింది. తమ వాటాగా ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయకపోవడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనిపై తమకు కేంద్రం మెమో కూడా ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలావుంటే సూక్ష్మసేద్యంలో తెలంగాణ వెనుకబడిందని కేంద్ర వ్యవసాయశాఖ ఇటీవల విడుదల చేసిన జాతీయ వ్యవసాయ గణాంక నివేదికలోనూ స్పష్టంచేసింది. దేశవ్యాప్తంగా 2.30 కోట్ల ఎకరాల్లో సూక్ష్మసేద్యం అందుబాటులోకి వచ్చింది. కానీ తెలంగాణలో కేవలం 3.31 లక్షల ఎకరాల్లోనే సూక్ష్మసేద్యంతో రైతులు సాగు చేస్తున్నారని వెల్లడించింది. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పదో స్థానంలో ఉన్నట్లు తెలిపింది. సూక్ష్మసేద్యం అమలుకోసం తెలంగాణ ప్రభుత్వం రూ.800 కోట్ల రుణం తీసుకొచ్చినా పెద్దగా మార్పురాలేదన్న ఆరోపణలున్నాయి. -
‘గజపతి’ నియోజకవర్గంలోకి వైఎస్ జగన్.. ఘన స్వాగతం
సాక్షి, విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రజాసంకల్పయాత్ర ఎస్.కోట నియోజకవర్గంలో విజయవంతంగా పూర్తి చేసుకొని గజపతినగరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. జననేతకు ఆ పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, అప్పలనర్సయ్య, నియోజకవర్గ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. దీంతో కొత్త వలస-విజయనగరం రోడ్డు జనసంద్రంతో నిండిపోయింది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గొడికొమ్ము గ్రామ మహిళలు కలిసి జననేతను కలిశారు. డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో చంద్రబాబు నాయుడు మోసం చేశారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా వడ్డీలేని రుణాలు ఇవ్వటం లేదని, దీంతో తీసుకున్న రుణానికి ప్రతీ నెలా వడ్డీల రూపంలో రూ.3వేలు వసూలు చేస్తున్నారని రాజన్న తనయుడికి తమ ఆవేదన వక్యం చేశారు. పలు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో గెలిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందటంలేదని, సాయం అందిస్తే మరిన్ని విజయాలు సాధిస్తానని దివ్యాంగురాలు, వెయిట్ లిఫ్టర్ రాజేశ్వరి వైఎస్ జగన్‌ను కలిసి వినతి పత్రం సమర్పించింది. (జగన్‌ను కలిసిన సాహసవీరుడు) అంతకముందు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఎలాంటి అభివృద్ది చేయటం లేదని, నియోజకవర్గ సమస్యలు అస్సలు పట్టించుకోవడంలేదని ఎస్.కోట నియోజకవర్గ ప్రజలు జననేతకు చెప్పుకున్నారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని, స్థానిక సమస్యలను ఎమ్మెల్యే లలిత కుమరి పట్టించుకోవడం లేదని జామి మండల మైనారిటీలు జననేత దృష్టికి తీసుకెళ్లారు. తమను అక్రమంగా తొలగించారిన జామి మండల ఫీల్డ్ అసిస్టెంట్లు వైఎస్ జగన్‌కు పిర్యాదు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఫీల్డ్ అసిస్టెంట్లు జననేతకు వినతి పత్రం సమర్చించారు. (జగన్‌తో నడిచిన ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి) జననేతను కలిసిన జిందాల్ నిర్వాసితులు దివంగత నేత వైఎస్సార్ తర్వాత తమను పట్టించుకునేవారే లేరని జిందాల్ ఫ్యాక్టరీ నిర్వాసితులు వైఎస్ జగన్ ముందు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా రాజన్న తనయుడిని జిందాల్ ఫ్యాక్టరీ నిర్వాసితులు, రైతులు టీడీపీ దుర్మార్గపు పాలనలో ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఫ్యాక్టరీ పెట్టకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, జిందాల్ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని రైతుల వైఎస్ జగన్‌ను కోరారు. ప్రజల సమస్యలను ఓపిగ్గా విన్న జననేత వారికి భరోసానిస్తూ ముందుకు కదిలారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు మండుటెండను సైతం లెక్క చేయకుండా జననేత వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. (చారిత్రాత్మక పైలాన్ ఆవిష్కరణ) చదవండి: నడిచేది నేనైనా.. నడిపించేది మీ అభిమానమే చరిత్రాత్మక ఘట్టం: ప్రజాసంకల్పయాత్ర @3000 కి.మీ. -
ధర.. దైన్యం
అనంతపురం అగ్రికల్చర్: మార్కెట్లో టమాట రేటు చూసి రైతు నోట మాట రావడం లేదు. మిర్చి ధర వింటే మూర్ఛవస్తోంది. వరుస కరువులతో ఆర్థికంగా చితికిపోయిన ‘అనంత’ రైతులను ఉద్యానతోటలు కూడా ఊసురుమనిపిస్తున్నాయి. మార్కెటింగ్ సదుపాయం లేక పండిన పంట ఉత్పత్తులను అమ్ముకోలేక చతికిలపడుతున్నారు. సరైన ప్రణాళిక, సాగు స్థిరీకరణ, గిట్టుబాటు ధర కల్పించడంలో పాలకులు, అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమవుతుండటంతో రైతులు దారుణ నష్టాలు చవిచూస్తున్నారు. ఓవైపు ప్రకృతి కన్నెర చేస్తుండగా మరోవైపు పాలకులు నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం ‘అనంత’ రైతుల పాలిట శాపంగా పరిణమించింది. కూర‘గాయాలే’ ఇటీవలకాలంలో అంతో ఇంతో నీటి వనరులు ఉన్న రైతులు వేరుశనగ, వరి లాంటి పంటలకు పోకుండా కూరగాయ పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. ఉద్యానశాఖ, మార్కెటింగ్‌శాఖ నుంచి సరైన ప్రణాళిక, సాగు, మార్కెటింగ్ సదుపాయం లేక కూరగాయలకు ధరలు లేక దారుణ నష్టాలు అనుభవిస్తున్నారు. ప్రస్తుతం టమాటా, మిరప సాగు చేసిన రైతులు ధరల పతనంతో ఈ సీజన్లో రూ.250 నుంచి రూ.300 కోట్లు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. పెరిగిన సాగు... తగ్గిన ధర జిల్లా వ్యాప్తంగా టమాట, మిరపసాగు బాగా పెరిగింది. దిగుబడులు కూడా బాగానే వచ్చాయి. అయితే మార్కెట్లో ధరలు పతనం కావడంతో పెట్టుబడులు కూడా దక్కించుకోలేకపోతున్నారు. ఈ రెండు పంటల ద్వారా ఏటా 10 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడులు వస్తుండగా... రమారమి రూ.900 నుంచి రూ1,000 కోట్ల వరకు టర్నోవర్ జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ సీజన్లో ధరలు దారుణంగా పతనం కావడం, తరచూ ఇలాంటి పరిస్థితి ఏర్పడటంతో ఈ ఏడాది రైతులకు రూ.250 నుంచి రూ.300 కోట్ల వరకు నష్టం జరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో వినియోగదారులు కిలో రూ.10 ప్రకారం కొంటున్నా మార్కెట్లో రైతులకు మాత్రం కిలో రూ.2 కూడా గిట్టుబాటు కావడం లేదు. దళారులు, మధ్యవర్తుల ప్రమేయం నివారించి, మార్కెటింగ్ సదుపాయం కల్పించడంలో యంత్రాంగం విఫలం కావడంతో రైతులు కుదేలవుతున్నారు. టమాట పరిస్థితి ఇలా... జిల్లా వ్యాప్తంగా కళ్యాణదుర్గం, కుందుర్పి, బ్రహ్మసముద్రం, శెట్టూరు, కంబదూరు, తనకల్లు, నల్లచెరువు, గాండ్లపెంట, ఓడీచెరువు, నల్లమాడ, గోరంట్ల, తాడిమర్రి, బత్తలపల్లి, అనంతపురం, ధర్మవరం, ఆత్మకూరు, కూడేరు, రాప్తాడు, కనగానపల్లి, చిలమత్తూరు, మడకశిర, గుమ్మఘట్ట, కణేకల్లు, బొమ్మనహాళ్, డి.హిరేహాళ్, గుత్తి, గుంతకల్లు, యాడికి, తాడిపత్రి, యల్లనూరు తదితర మండలాల్లో టమాట పంట ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 14,200 హెక్టార్లలో పంట సాగులోకి రాగా ప్రస్తుతం 7,800 హెక్టార్లలో పంట పొలం మీద ఉన్నట్లు ఉద్యానశాఖ వర్గాలు చెబుతున్నాయి. పెట్టుబడి రూ.1.20 లక్షలు...రాబడి రూ.80 వేలు మామూలు పద్ధతిలో అయితే ఎకరా విస్తీర్ణంలో టామాట సాగుకు రూ.50 వేల నుంచి రూ.60 వేలు పెట్టుబడి అవుతుండగా, ట్రెల్లీస్, మల్చింగ్ పద్ధతిలో అయితే ఎకరాకు రూ.1.10 లక్షల నుంచి 1.20 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. దీంతో పాటు క్రేట్స్, రవాణా, కమిషన్ల ఖర్చు అదనంగా భరించాలి. ఎకరా టమాట బాగా పండితే 30 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. మార్కెట్లో కిలో కనీసం రూ.10 పలికితే కాని గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. కిలో రూ.10 ఉంటే అందులో పెట్టుబడులు, రవాణా, ఇతరత్రా ఖర్చులు కింద రూ.8 వరకు పోతుంది. మిగతా రెండు రూపాయలు మిగిలే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఇపుడు కిలో రూ.2 కూడా గిట్టుబాటు కాకపోవడంతో భారీ నష్టాలు చవిచూస్తున్నారు. జిల్లాతో పాటు పక్కనున్న చిత్తూరు, మదనపల్లి, అలాగే కర్ణాటకలోని కోలార్, చింతామణి, హైదరాబాద్ చుట్టుపక్కల, కొన్ని తెలంగాణా జిల్లాల్లో టమాట సాగు పెరగడం వల్ల ధరలు తగ్గుముఖం పట్టినట్లు చెబుతున్నారు. నవంబర్ వరకు ఇదే రకమైన మార్కెట్ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మిరపదీ అదే దారి జిల్లా వ్యాప్తంగా బుక్కరాయసముద్రం, నార్పల, గుత్తి, బొమ్మనహాళ్, కణేకల్లు, పరిగి, తాడిపత్రి, రాయదుర్గం, ధర్మవరం, బత్తలపల్లి, కూడేరు, ఆత్మకూరు, కళ్యాణదుర్గం, కంబదూరు, తనకల్లు, మడకశిర ప్రాంతాల్లో మిరప సాగు ఎక్కువగా ఉంది. ఉరవకొండ, గుంతకల్లు ప్రాంతాల్లో ఎండుమిర్చి ఎక్కువగా ఉంది. ఈ ఏడాది 4,100 హెక్టార్లలో మిరప సాగు చేయగా అందులో ప్రస్తుతం 2,400 హెక్టార్లలో పంట ఉన్నట్లు చెబుతున్నారు. ఎకరా పచ్చి మిరప సాగుకు రూ.1.10 నుంచి 1.50 లక్షల వరకు పెట్టుబడి అవుతోంది. పంట నాటిన 75 రోజుల తర్వాత నుంచి 7 నుంచి 8 నెలల వరకు పంట కోతలు ఉంటాయి. అంతా బాగుంటే ఎకరాకు 15 టన్నుల మిరప దిగుబడులు వస్తాయి. అన్ని రకాల ఖర్చులు పోనూ కిలో కనీసం రూ.15 పలికితే కాని మిరపకు గిట్టుబాటు కాదని అధికారులు చెబుతున్నారు. ఇపుడు కనిష్ట స్థాయికి పడిపోవడంతో మిరప రైతులు నిలువునా మోసపోతున్నారు. తెలంగాణ, మహరాష్ట్రలో విపరీతంగా మిరప సాగు, దిగుబడులు రావడంతో ఈ దుస్థితి తలెత్తినట్లు విశ్లేషిస్తున్నారు. దళారుల దందా కూరగాయల వ్యాపారంలో దళారీలే బాగుపడుతున్నారు. దళారీలు సిండికేట్ అయి ఒక రేటును ఫిక్స్ చేస్తున్నారు. రైతులనుంచి తక్కువ ధరలకు పంట కొనుగోలు చేసి ఎక్కువ ధరలకు మార్కెట్లో విక్రయిస్తున్నారు. అంతేకాకుండా నూటికి రూ.10 కమిషన్ రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. పండించిన పంట అమ్ముకోవాలంటే కమిషన్, బాడిగ, హమలీ ఖర్చుల పోనూ మిగిలేదేమీ ఉండదని రైతులు వాపోతున్నారు. కూలి డబ్బులుకూడా వచ్చేట్లు లేవు నాకు ఐదెకరాల పొలం ఉండగా..రెండు ఎకరాల్లో టమాట సాగు చేశాను. ప్రస్తుతం 15 కిలోల టమాట బాక్సును వ్యాపారులు రూ.45 అడుగుతున్నారు. ఈ లెక్కన అమ్మితే పెట్టుబడి కాదుగదా.. కూలీలు కూడా వచ్చేట్టు లేవు.– సుబ్రమణ్యం, బుక్కరాయసముద్రం ధర అధ్వానం నాకు పదెకారల పొలం ఉండగా..రెండు ఎకరాల్లో డ్రిప్పు ద్వారా మిరప సాగు చేశాను. ఎకరాకు రూ.లక్ష దాకా పెట్టుబడి పెట్టాను. తీరా పంట చేతికి వచ్చిన తర్వాత వ్యాపారస్తులు కిలో రూ.3, రూ.4కు అడుగుతున్నారు. పంట దిగుబడి ఉన్నా..ధర మాత్రం రావడం లేదు. కేజీ రూ.15 నుంచి రూ.20 పలికి ఉంటే ఎకరాకు రూ.1.5 లక్షల నుంచి రూ. 2 లక్షల దాకా ఆదాయం వచ్చేది. – రవిచంద్రారెడ్డి, సంజీవపురం -
ప్రకృతి సేద్యంలో మేమే మేటి
సాక్షి, అమరావతి: సాంకేతిక పరిజ్ఞానాన్ని, ప్రకృతిని కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. భారతదేశంలో ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని చెప్పారు. 8 మిలియన్ల హెక్టార్లలో 60 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని, రాష్ట్రంలో ప్రకృతి సేద్య విధానం ప్రపంచానికే ఒక ఆదర్శ నమూనాగా నిలిచిందని పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు మంగళవారం ఐక్యరాజ్యసమితి సదస్సుల్లో ‘సుస్థిర సేద్యం–ఆర్థిక చేయూత–అంతర్జాతీయ సవాళ్లు’ అనే అంశంపై ప్రసంగించారు. రాష్ట్ర జీఎస్డీపీలో 28 శాతం వ్యవసాయ రంగానిదేనని అన్నారు. రాష్ట్రంలో 62 శాతం జనాభాకు వ్యవసాయం, అనుబంధ రంగాలే జీవనాధారమని వెల్లడించారు. చంద్రబాబు ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘వ్యవసాయం అంటే అత్యధిక వ్యయం, శ్రమతో కూడుకున్నది. భూసారం క్షీణించి పర్యావరణం దెబ్బతింటుంది. ఉత్పత్తి, మార్కెటింగ్ చాలా కష్టంతో కూడుకున్నవి. పంటలు సరిగ్గా పండక గ్రామీణులు పట్టణాలకు వలస వెళుతుంటారు. వాతావరణ మార్పులతో కరవు కాటకాలు, వరదలు సంభవిస్తుంటాయి. ఈ దుష్ప్రభావాలను అధిగమించడానికే ప్రకృతి వ్యవసాయాన్ని (జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌ను) ప్రోత్సహిస్తున్నాం. ప్రకృతి సేద్యంలో మీరు ఒక డాలర్ పెట్టుబడి పెట్టినట్లయితే 13 డాలర్ల లాభం వస్తుంది. రసాయన ఎరువులతో వచ్చే దుష్ప్రభావాలు మేం ప్రవేశపెట్టిన ప్రకృతి వ్యవసాయంతో తొలగిపోతున్నాయి. సురక్షితమైన, మిక్కిలి పోషకాలతో కూడిన ఆహారోత్పత్తి సాధ్యమవుతోంది. వ్యవసాయాన్ని మేము లాభసాటిగా తీర్చిదిద్దడంతో ఐటీ నిపుణులు ఆ రంగంవైపు ఆసక్తి చూపుతున్నారు. రివర్స్ మైగ్రేషన్ ప్రారంభమైంది. యువతను వ్యవసాయం వైపు ఆకర్శిస్తున్నాం. ప్రకృతి సేద్యంతో పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నాం. ప్రకృతి సేద్యంతో పండించిన ఆహారోత్సత్తులు తీసుకుంటుండటంతో తమ ఆరోగ్యం బాగుపడిందని ప్రజలు చెబుతున్నారు. వచ్చే ఐదేళ్లలో రైతాంగాన్ని 100 శాతం ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. 2020 నాటికి 1.7 మిలియన్ల రైతులు, 2022 నాటికి 4.1 మిలియన్ల రైతులను ఈ సేద్యం వైపు మళ్లించాలన్నదే మా ధ్యేయం. కోర్ డ్యాష్‌బోర్డును మీకు కనెక్ట్ చేస్తా.. 20 ఏళ్ల క్రితం స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేశాం. ఇప్పుడు 9 లక్షల స్వయం సహాయక బృందాలున్నాయి. వీరంతా తమ గ్రామాలు దాటి తమ భాష రాని, తమ ప్రాంతం కాని ప్రాంతాలకు వెళ్లి ప్రకృతి వ్యవసాయంపై రైతాంగానికి అవగాహన కలిగిస్తున్నారు. భూమి ఉపరితలంపై కురిసే వర్షపు నీటిని రియల్ టైమ్ మేనేజ్మెంట్ ద్వారా ఒడిసి పడుతున్నాం, భూగర్భ జలాలుగా మారుస్తున్నాం. అల్పపీడనాలు ఏర్పడి అవి తుపానులుగా మారి ఎక్కడ కేంద్రీకృతమయ్యాయో రియల్ టైమ్ ట్రాకింగ్ వ్యవస్థతో చెప్పగలుగుతున్నాం. న్యూయార్క్‌లో ఉండి ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల గ్రామంలో వీధిలైట్ల వ్యవస్థను నేను రియల్ టైమ్ వ్యవస్థ సహాయంతో నిర్వహించగలను. నాకు సీఎం కోర్ డ్యాష్‌బోర్డు ఉంది. సీఎం కోర్ డ్యాష్‌బోర్డును మీకు కనెక్ట్ చేస్తా. మీరు అందులోని అంశాలన్నీ చూడొచ్చు’’ అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. -
దేవుడి భూములకు పంగనామాలు
సాక్షి, అమరావతి: రాజధానిలో దేవుడి భూములకు రాష్ట్ర ప్రభుత్వం పంగనామాలు పెడుతోంది. ఆ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పులతో పాటు తాను చేసిన చట్టాలను, జారీచేసిన మెమోలను సైతం లెక్క చేయడంలేదు. హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రాజధానిలో ల్యాండ్ పూలింగ్‌లో తీసుకున్న దేవాలయాల భూములకు ఎటువంటి రైతువారీ పట్టాలు చెల్లబోవని, గతంలో రైతు వారీ పట్టాలు ఇచ్చినప్పటికీ అవి పనికిరావని స్పష్టం చేస్తూ సీఆర్డీఏ 2015 సంవత్సరంలో మెమో జారీ చేసింది. ఆ భూమలన్నీ కూడా ధార్మిక సంస్థలకే చెందుతాయని ఆ మెమోలో స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ పూలింగ్‌లో తీసుకున్న ఆలయాల భూములకు కేవలం పరిహారం మాత్రమే సదరు ధార్మిక సంస్థలకు చెల్లించాలని, ప్రభుత్వం ఇచ్చే ప్లాట్లు మాత్రం ఆక్రమణదారుల పేరిట ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధానిలో దేవుడి భూములపై గతంలో హైకోర్టుకు సీఆర్డీఏ ఇచ్చిన హామీని కూడా తుంగలో తొక్కి చట్టానికి విరుద్ధంగా రైతు వారీ పట్టాల సాకుతో ఈనాం భూముల ఆక్రమణదారులకు కోట్ల రూపాయల విలువైన ప్లాట్లను కట్టబెడుతుండటంపై భక్తుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్లాట్లు, పరిహారం కూడా ఆలయాలకే రాజధానిలో ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా వివిధ దేవాలయాలకు చెందిన 843.87 ఎకరాలను సీఆర్డీఏ సేకరించింది. మరో 173.22 ఎకరాలకు సంబంధించి దేవాదాయ శాఖతో పాటు రైతులు కూడా ఆ భూములు తమవంటూ క్లెయిమ్ చేయడంతో ఆ భూములపై సీఆర్డీఏ నిర్ణయం తీసుకోలేదు. రాజధానిలోని ఆలయాలకు, చారిటబుల్ సంస్థలకు చెందిన భూములన్నీ ఆయా సంస్థలకే చెందాలని, ఎటువంటి రైతు వారీ పట్టాదారులకు ఆ భూములపై హక్కు లేదని దేవాదాయ శాఖ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని షరతులతో ఆ భూములను సీఆర్డీఏకు బదిలీ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఆలయాలకు చెందిన భూములకు సంబంధించి పూర్తి పరిహారంతో పాటు అభివృద్ధి చేసిన ప్లాట్లను కూడా ఆయా ఆలయాల వ్యక్తిగత బ్యాంకు అకౌంట్లకు జమ చేయాల్సిందిగా ఆ షరతుల్లో హైకోర్టు పేర్కొంది. దీనిపై హైకోర్టుకు సీఆర్డీఏ లిఖితపూర్వక అంగీకారం తెలిపింది. ఈ సందర్భంగానే సీఆర్డీఏ మెమో జారీ చేసింది. ఆ మెమోలో.. ఎటువంటి రైతు వారీ పట్టాలు జారీ చేయడానికి వీల్లేదని, ఇప్పటికే జారీ చేసి ఉంటే అవి చెల్లుబాటు కావని, ఆ భూములపై పూర్తి హక్కులు ఆయా సంస్థలకే చెందుతాయని మెమోలో స్పష్టం చేసింది. రైతువారీ పట్టాలు చెల్లవు.. ఈనాం భూములకు ఇచ్చిన పట్టాలపై 2015లో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. వింజమూరి రాజగోపాలచారి, రాష్ట్ర ప్రభుత్వం మధ్య నడిచిన కేసుల్లో హైకోర్టు గతంలో స్పష్టంగా పేర్కొంది. ఈనాం భూములకు సంబంధించి 1956 చట్టం ప్రకారం రైతు వారీ పట్టాలు ఇవ్వడానికి ఆస్కారం లేదని, ఒక వేళ రైతు వారీ పట్టాలు ఇచ్చినా అవి చెల్లుబాటు కావని, ఈనాం భూములన్నీ కూడా ఆయా ఆలయాలకు మాత్రమే చెందుతాయని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. రైతువారీ పట్టాలు జారీ చెల్లబోవని 2013లో చేసిన చట్టసవరణను ఈ తీర్పు ద్వారా హైకోర్టు సమర్థించినట్లు అయిందని న్యాయశాఖ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గతంలో హైకోర్టు, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను దృష్టిలో ఉంచుకుని తగిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా న్యాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కాగా, ఈనాం భూములను ఆక్రమించుకున్న రైతులు తమకే పరిహారం చెల్లించాలని కోరుతున్నారని, ఈ నేపథ్యంలో ఒక నిర్ణయం తీసుకోవాలని సీఆర్డీఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో దేవుని భూములకు పరిహారాన్ని ఆయా ఆలయాలకు చెల్లించాలని, అభివృద్ధి చేసిన ప్లాట్లను మాత్రం ఆక్రమణదారులకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పునకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడించిందని న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
34 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఖరీఫ్‌లో 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. దీనికనుగుణంగా 3,140 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చింది. సేకరణలో ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల అధికారులను ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. శనివారం ఖరీఫ్ ధాన్యం సేకరణపై ఆ శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్, జిల్లాల జాయింట్ కలెక్టర్లు, అధికారులతో మంత్రి సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు 1,128 ఐఏపీ సెంటర్లు, 1,799 ప్రాథమిక సహకార సంఘాల కేంద్రాలు, 213 ఇతర కేంద్రాలు కలిపి 3,140 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైతే సంఖ్య పెంచాలని, ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కొనడం ఆలస్యం చేయొ ద్దని సూచించారు. గ్రేడ్–1 మద్దతు ధర రూ.1,770, కామన్ వెరైటీకి రూ.1,750 ఇస్తామని, రైతులు తక్కువ ధరకు అమ్ముకోవద్దని కోరారు. ధాన్యం సేకరణకు 8.59 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమని, పాత బ్యాగుల నాణ్యతలో కఠినంగా వ్యవహరించాలన్నా రు. ఈ ఖరీఫ్‌లో 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. కేసులున్న మిల్లులకు వద్దు కేసులున్న రైస్ మిల్లులకు ధాన్యం సరఫరా చేయొద్దని, మిల్లుల సామర్థ్యాన్ని బట్టి ధాన్యం కేటాయించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర అవసరాలకు పోనూ 17 లక్షల టన్నుల బియ్యం నిలువ చేయాల్సి వస్తుందని, అందులో 9.69 ఎల్ఎంటీ సివిల్ సప్లయ్ శాఖ వద్ద అందుబాటులో ఉందని మంత్రికి కమిషనర్ అకున్ సబర్వాల్ వివరించారు. మిగిలిన స్థలాన్ని ఎఫ్‌సీఐ నుండి తీసుకుంటామన్నారు. -
పత్తి కొనుగోలుకు 386 కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయడానికి 386 కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ మంత్రి టి.హరీశ్‌రావు భారత పత్తి సంస్థ (సీసీఐ)ను ఆదేశించారు. అందులో 98 మార్కెట్ యార్డుల్లో, 288 కొనుగోలు కేంద్రాలు జిన్నింగ్ మిల్లుల్లో ఏర్పాటు చేయాలన్నారు. 25 ముఖ్య మార్కెట్ యార్డు కేంద్రాల్లో వచ్చే నెల 10లోగా, మిగిలిన కేంద్రాలను 20వ తేదీలోగా ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు మంత్రి శనివారం మార్కెటింగ్, వ్యవసాయశాఖలు, మార్క్‌ఫెడ్, హాకా, గిడ్డంగుల సంస్థ, సీసీఐ అధికారులతో పత్తి, మొక్కజొన్న, పెసర, మినుముల కొనుగోలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. టెండర్లలో పాల్గొన్న 288 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేసేలా జిల్లా కలెక్టర్లు, సీసీఐ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లా నుంచి జిన్నింగ్ మిల్లుల యజమానులు టెండర్లలో పాల్గొనకపోవడంపై హరీశ్ అధికారులను ప్రశ్నించారు. ఆ జిల్లాలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమస్యను పరిష్కరించాలని సీసీఐ సీఎండీని ఫోన్లో కోరారు. అలాగే సీసీఐ సంచాలకులు అల్లిరాణితో ఫోన్లో చర్చించి జిన్నింగ్ మిల్లుల యజమానుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. నిర్ణీత శాతం తేమ ఉండేలా చూసుకోండి... రైతులు పత్తిని మార్కెట్ యార్డులకు తెచ్చేటప్పుడు శుభ్రపరిచి, ఆరబెట్టి తేమ 8% నుంచి 12% మా త్రమే ఉండేటట్లు చూసుకొని తెస్తే సరైన ధర వస్తుం దని దీనిపై విస్తృత ప్రచారం చేయాలని అధికారులను హరీశ్ ఆదేశించారు. పత్తికి కనీస మద్దతు ధర రూ.5,450గా కేంద్రం నిర్ణయించిందని, నాణ్యతా ప్రమాణాలకు తగ్గట్టుగా పత్తిని తెచ్చి ఆ మేరకు లబ్ధి పొందాలని రైతులను కోరారు. మొక్కజొన్నల కొనుగోలుకు 259 కేంద్రాలను తెరవాలని మార్క్‌ఫెడ్ ఎం డీని కోరారు. పెసర కొనుగోలుకు 9 కేంద్రాలను ప్రా రంభించాల్సిందిగా ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కందులు, మినుములు, వేరుశనగ మద్దతు ధర కొనుగోలుకు ముందస్తు అనుమతి తీçసుకొని రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి, మార్క్‌ఫెడ్, హాకాల ఎండీ సురేందర్‌రెడ్డి, గిడ్డంగుల సంస్థ ఎండీ భాస్కరాచారి, మార్క్‌ఫెడ్ పంట ఉత్పత్తుల సేకరణ మేనేజర్ ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్ఆర్ఐలకు ‘పెట్టుబడి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ భూములుండి విదేశాల్లో నివసిస్తున్న(ఎన్ఆర్ఐ) పట్టాదారులకు రైతుబంధు పథకం కింద పెట్టుబడి సొమ్ము అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారి పేరిట ఉన్న చెక్కులను ఎవరికీ ఇవ్వకపోవడంతో వ్యవసాయశాఖ వద్దే ఉండిపోయాయి. ఒకానొక సందర్భంలో విదేశాల్లో ఉన్నవారికి ‘సొమ్ము ఇవ్వడం అవసరమా’అన్న ధోరణిలో వ్యవసాయ శాఖ వర్గాలున్నట్లు ప్రచారం జరిగింది. ఎన్నికల సమయంలో అనవసరంగా వ్యతిరేకత మూటగట్టుకోవడం అవసరమా అన్న భావనతో ఎన్ఆర్ఐలకు చెక్కులు ఇచ్చేందుకు సర్కారు రంగం సిద్ధం చేసింది. దీనిపై ఉన్నతస్థాయి సమావేశం కూడా నిర్వహించినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో దాదాపు 61 వేల మంది ఎన్ఆర్ఐ రైతులకు లబ్ధి కలగనుంది. చనిపోయిన రైతుల పేరుతో ఉన్న చెక్కులు, రాష్ట్రం సహా దేశంలోనే వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న పట్టాదారుల చెక్కుల పంపిణీపైనా నిర్ణయం తీసుకోలేదు. కుటుంబసభ్యులకు సొమ్ము... ఈ ఖరీఫ్‌లో 1.43 కోట్ల ఎకరాల భూమి కలిగిన 58.33 లక్షల మంది రైతులకు పెట్టుబడి చెక్కులను పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ప్రభుత్వం చెక్కులను ముద్రించింది. అందుకోసం రూ. 5,730 కోట్లు బ్యాంకులకు అందజేసింది. అయితే, ఇప్పటివరకు కేవలం 48 లక్షల మంది రైతులే చెక్కులు తీసుకున్నారు. రూ. 5,100 కోట్లు రైతులకిచ్చినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. విదేశాల్లో ఉన్న 61 వేల మంది పట్టాదారులకు ఇప్పుడు ఎలా ఇవ్వాలన్న దానిపై సర్కారు కసరత్తు చేస్తోంది. అత్యధిక మంది బతుకుదెరువు, వ్యాపార, ఉపాధి, ఉద్యోగాల కోసం గల్ఫ్సహా వివిధ దేశాల్లో ఉంటున్నారు. రైతుబంధు పథకం నిబంధనల ప్రకారం పట్టాదారు పాసుపుస్తకం ఉన్న రైతే స్వయంగా వచ్చి చెక్కు తీసుకోవాలి. ఈ నిబంధన విదేశాల్లో ఉన్న పట్టాదారులకు ప్రతిబంధకంగా మారింది. ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐల డిక్లరేషన్ మేరకు వారి కుటుంబసభ్యులకు చెక్కులిచ్చే అవకాశాలున్నాయి. అయితే, కుటుంబసభ్యులెవరూ ఇక్కడ లేని పరిస్థితుల్లో ఏం చేయాలన్న దానిపై సర్కారు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. చనిపోయిన రైతుల పేరుతో 90 వేల చెక్కులు మరో 90 వేల చెక్కులు చనిపోయిన రైతుల పేరుతో ఉన్నాయి. వాటిని సర్దుబాటు చేయడంలోనూ నిర్లక్ష్యం కనిపిస్తోందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. మరోవైపు, రాష్ట్రంలోనూ, దేశంలోనూ వివిధ ప్రాంతాల్లో ఉండే 1.14 లక్షల మంది చెక్కుల అందజేతపైనా మీమాంస కొనసాగుతోంది. చెక్కులను జిల్లాల నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చి వ్యవసాయశాఖ కమిషనరేట్‌లో కౌంటర్లు పెట్టి అందజేయాలని అనుకున్నారు. కానీ, ఇప్పటికీ చెక్కులు జిల్లాల్లోనే ఉన్నాయి. దీంతో గ్రామాలకు వెళ్లడానికి వీలుపడని వారంతా కూడా ఆ చెక్కుల కోసం ఎదురుచూస్తున్నారు. -
మళ్లీ యూటర్న్
తెలుగుదేశం ప్రభుత్వం ఆక్వా రైతులను మళ్లీ మోసం చేసింది. ఆక్వా చెరువులకు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటనతో హడావిడిగా తాను కూడా చార్జీలు తగ్గిస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబునాయుడు ఆచరణలో అమలు చేయలేదు. తాజాగా జారీచేసిన జీవో ప్రకారం.. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా యూనిట్‌కు రూ.3.86 రైతులు చెల్లిస్తే... తర్వాత మత్స్యశాఖ ద్వారా రూ.1.86 వెనక్కి చెల్లిస్తామని పేర్కొనడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం ఆక్వా సాగు 72,945 హెక్టార్లు ఉండగా 29,922 కుటుంబాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి. రాష్ట్రం మొత్తం మీద జరిగే సాగులో 40 శాతం వరకూ జిల్లాలోనే జరుగుతోంది. ఒకప్పుడు డాలర్లు కురిపించిన ఆక్వాసాగు నేడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. గిట్టుబాటు ధరలు పడిపోవడం, మరోవైపు ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవడంతో అక్వా రైతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విదేశాలకు ఎగుమతులు తగ్గాయని, కుంటిసాకులు చెబుతూ దళారులు ధరలు తగ్గించి వేయడంతో రైతులు పూర్తిగా నష్టాలలో కూరుకుపోయారు. ఈ నేపథ్యంలో మే నెలలో జిల్లాలోని ఉంగుటూరు, ఉండి, భీమవరం, పాలకొల్లు, నర్సాపురం ప్రాంతాలలో ఆక్వా రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తమ ఇబ్బందులు తీసుకువెళ్లారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించి ఆక్వా చెరువులకు ఉపయోగించే విద్యుత్ చార్జీలను యూనిట్ రూ.3.80 నుంచి రూ.1.50కి, ఆక్వా అనుబంధ పరిశ్రమలకు ఏడు రూపాయల నుంచి రూ.ఐదుకు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే సముద్ర తీర ప్రాంతాల్లో కోల్డ్‌స్టోరేజి, ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుతానని, నాలుగో ఏడాది నుంచి ఆక్వాకు మద్దతు ధర ప్రకటిస్తానని ఆయన çహామీ ఇచ్చారు. ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడంపై జగన్ సీరియస్‌గా స్పందించడంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మే 26న హడావిడిగా సమావేశం ఏర్పాటుచేసి ఆక్వా వ్యాపారులు, రైతులతో చర్చించారు. విద్యుత్ చార్జీలు ఏడాది పాటు రూ.3.80 నుంచి రెండు రూపాయలకు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. అయినా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కరెంటు బిల్లులు యూనిట్ రూ.3.80 టారిఫ్‌తోనే వచ్చాయి. ప్రస్తుతం జీవో విడుదల చేస్తూ రైతులు ముందు రూ.3.86 చొప్పున బిల్లులు చెల్లిస్తే తర్వాత రూ.1.86 మత్స్యశాఖ నుంచి ఇప్పిస్తామని అందులో పేర్కొన్నారు. మత్స్యశాఖ ద్వారా చెల్లింపులేంటి? వ్యవసాయ శాఖ మంత్రి చేసిన ప్రకటన ప్రకారం 2017–18లో రాష్ట్రంలో మత్స్య ఉత్పత్తులు రూ. 42,110 కోట్లు కాగా ప్రత్యక్ష పరోక్ష పన్నుల ద్వారా ప్రభుత్వానికి రూ.నాలుగువేల కోట్ల పైగా ఆదాయం వస్తోంది. కానీ 2018–19 బడ్జెట్లో మత్స్యశాఖకు కేటాయింపులు కేవలం రూ. 386 కోట్లు మాత్రమే. ఇవి మత్య్సకారుల సంక్షేమానికి సరిపోవడం లేదు. అటువంటప్పుడు మత్స్యశాఖ ద్వారా చెల్లిస్తాననడం వంచన అని ఆక్వా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆక్వాలో విద్యుత్ కనెక్షన్లు భూయజమానుల పేరుతో ఉన్నాయి. బిల్లులు చెల్లించేది కౌలు రైతులైతే, భూ యజమానుల ఖాతాల్లో డబ్బులు పడతాయి. 1980 నుంచి తీసుకున్న విద్యుత్ కనెక్షన్‌దారులు అనేక మంది చనిపోయారు. ప్రస్తుతం భూములు వారి వారసుల పేరుతో ఉన్నాయి. ఇవన్నీ క్షేత్రస్థాయిలో సమస్యాత్మకంగా మారతాయని ఆక్వారైతులు అంటున్నారు. ఆక్వాపై చంద్రబాబు హైడ్రామా ఆక్వా రైతులపై చంద్రబాబు మళ్లీ డ్రామా ఆడుతున్నారు. విద్యుత్ చార్జీలు తగ్గించామని చెబుతూ రైతుల వద్ద నుంచి పాత బకాయిలు వసూలుకు మార్గం చూసుకున్నారు. ఓవర్‌లోడ్, ఏసీడీల పేరుతో భారీగా బిల్లులు వేసి, వాటిని చెల్లిస్తేనే రాయితీ ఇస్తాననడం సరికాదు. బిల్లు ఏక మొత్తంలో చెల్లించిన తరువాత తగ్గించిన సొమ్ము తిరిగి బ్యాంకు అకౌంట్లో యజమాని పేరున వేస్తాననడం విడ్డూరంగా ఉంది. చెరువులు సాగుచేసే లీజుదారులు లక్షలు వెచ్చించి రొయ్యల సాగు చేస్తున్నారు. విద్యుత్ బిల్లుల రాయితీల పేరుతో బకాయిలు గుంజడానికే చంద్రబాబు ఎత్తుగడ. జిల్లా వ్యాప్తంగా ఆక్వా రైతులు నష్టాలతో విద్యుత్ బకాయిలు పడ్డారు. తగ్గించిన సొమ్మును మినహాయించుకుని బిల్లు చెల్లించే పద్ధతి తీసుకురావాలి. – వేగేశ్న వెంకట్రాజు (యండగండి శ్రీను), ఆక్వా రైతు, చినకాపవరం రాయితీ పేరుతో భారీ మోసం విదేశీ మారక ద్రవ్యం తెచ్చిపెట్టే ఆక్వా రైతుపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారు. రొయ్యల రైతుల విద్యుత్ బకాయిలు ముక్కుపిండి వసూలు చేసేందుకు విద్యుత్ బిల్లుల రాయితీలు ప్రకటించారు. విద్యుత్ బిల్లులో తగ్గించిన యూనిట్ ధరను యథావిధిగా ఎందుకు వసూలు చేయరు. డొంకదారుల్లో రాయితీలు ఇస్తాననడం చంద్రబాబు వంచన యోచనలో భాగం. యూనిట్‌కు రూ.1.86 పైసలు తగ్గించినట్లు ప్రకటించిన ప్రభుత్వం ఆ సొమ్మును బిల్లులోనే తగ్గించి చెల్లించే విధంగా రైతులకు అవకాశం కల్పించాలి. పాత బకాయిల పేరుతో చార్జీలు తగ్గించకపోవడం దారుణం. – గొట్టుముక్కల సూర్యనారాయణరాజు (సూరిబాబు), ఆక్వా రైతు, ఆకివీడు -
దిగుబడికి దెబ్బే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలు జిల్లాల్లో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఈ ఏడాది పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 670 మండలాలకుగాను 394 మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఈ ప్రభావం పంట దిగుబడులపై కూడా ఉంటుందని వ్యవసాయ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్, రబీ.. రెండు సీజన్లలో కలిపి 186.41 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం కాగా అందులో ఒక్క ఖరీఫ్‌లోనే అత్యధికంగా 98.07 లక్షల టన్నుల దిగుబడి రావాల్సి ఉంది. ప్రతికూల వాతావరణం, అదును తప్పి కురుస్తున్న వర్షాలతో పంటల సాగు గాడి తప్పింది. ఫలితంగా సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గుతోంది. అలాగే, రాష్ట్రంలో చిరుధాన్యాలు, నూనె గింజల పంటల పరిస్థితి కూడా ఇంతే. ఈ నేపథ్యంలో స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యే 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు చేయడానికి ఏం చేయాలో అర్ధంకాక వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు తలలుపట్టుకుంటున్నారు. దిగుబడి తగ్గితే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ప్రస్తుతం ఉన్న 30 శాతం వ్యవసాయ రంగం వాటా తగ్గి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆహార సంరక్షణ రంగాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ రంగంలో 16.55 శాతం అధికంగా వృద్ధి సాధించడం సాధ్యమయ్యే పనిగా కనిపించడంలేదు. ప్రధాన పంటల పరిస్థితి ఇలా.. వ్యవసాయ, అనుబంధ రంగాలలో గుర్తించిన 23 అభివృద్ధి సూచికలలో 9 పంటల్ని ఎంపిక చేశారు. వాటిలో వరి, మొక్కజొన్న, మినుము, పెసర, శనగ, వేరుశనగ, ప్రత్తి, చెరకు, పొగాకు ఉన్నాయి. అయితే, వీటిల్లో ప్రస్తుతం ఏ ఒక్క పంట కూడా సరిగ్గాలేదు. 2018–19లో ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 186.41 లక్షల మెట్రిక్ టన్నులు. గత ఏడాదితో పోలిస్తే ఇది 16 శాతం ఎక్కువ. వరిలో 14 శాతం, మొక్కజొన్నలో 15 శాతం, అపరాలలో 33 శాతం, నూనె? గింజల్లో 30 శాతం పెరుగుదల నమోదు చేయాలన్నది లక్ష్యం కాగా.. ఇప్పటికే రాయలసీమలో ప్రధాన పంట అయిన వేరుశనగ గాడి తప్పింది. ఇప్పటికే తొలిదశలో పంట దెబ్బతింది. ప్రస్తుత ఖరీఫ్‌లో వేరుశనగ దిగుబడిని 10.28 లక్షల టన్నులుగా అంచనా వేసినా అది ఇప్పుడు 2–3 లక్షల టన్నులు కూడా వచ్చే పరిస్థితి లేదు. భారీగా తగ్గనున్న దిగుబడి ఇదిలా ఉంటే.. ఖరీఫ్‌లో మొత్తం 98.07 లక్షల టన్నుల దిగుబడి లక్ష్యం కాగా.. ప్రస్తుత అంచనాల ప్రకారం దాదాపు 20 లక్షల టన్నులకు పైగా పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. వర్షాధార పంటలు సాగుచేసే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో పంట ఉత్పత్తులు చేతికి వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ఇక్కడ వర్షాభావంతో వేసిన పంటలు వేసినట్టే ఎండిపోతున్నాయి. వైఎస్సార్ కడప జిల్లా యావత్తు తీవ్ర లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటోంది. తుపానో, వాయుగుండమో వస్తే తప్ప ఇక్కడి పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశంలేదు. రాయలసీమలో ప్రధాన ఖరీఫ్ పంట వేరుశనగను సుమారు 9.25 లక్షల హెక్టార్లలో సాగు చేయాల్సి ఉంటే అధికారిక లెక్కల ప్రకారమే 6.60 లక్షల హెక్టార్లలో విత్తనాలు పడ్డాయి. అయితే, ఈ పంటలో మూడొంతులు వాడు ముఖం పట్టింది. ఫలితంగా దిగుబడి లక్ష్యం 10.28 లక్షల మెట్రిక్ టన్నులు నెరవేరే సూచనలు కనిపించడంలేదు. అపరాలదీ అదే పరిస్థితి. వరి సాగు విస్తీర్ణం కూడా లక్ష్యానికి దూరంగానే ఉంది. వరి పంట చేతికి రావడానికి ఇంకా చాలా సమయం ఉన్నందున దిగుబడులు ఎలా ఉంటాయనేది ఇప్పుడే చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. దేశంలో 7.3మిలియన్ టన్నుల అధిక దిగుబడి గత ఏడాది కంటే ఈ ఏడాది దేశంలో ఆహార ధాన్యాల దిగుబడి 284.80 మిలియన్ టన్నులకు చేరే అవకాశముందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత ఏడాది కంటే ఇది 7.3 మిలియన్ టన్నులు ఎక్కువని కేంద్రం చెబుతుంటే రాష్ట్రంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వరుస కరువులతో రైతులు అల్లాడుతున్నారు. దిగుబడులు తగ్గే అవకాశం ఎక్కువగా ఉందని అధికారులు భావిస్తున్నారు. దేశంలో చిరు ధాన్యాల ఉత్పత్తి గత ఏడాది కంటే 7.3 శాతం, అపరాలు 9 శాతం పెరిగితే రాష్ట్రంలో ఈ పంటలు సైతం తిరోగమనంలో ఉండడం గమనార్హం. -
రైతుల పోరుపై ఉక్కుపాదం
తుళ్లూరు రూరల్/సాక్షి, అమరావతి: తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం రాజధాని ప్రాంత రైతులు సోమవారం తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ చెక్పాయింట్లు ఏర్పాటుచేసి.. భారీఎత్తున మొహరించిన పోలీసులు రైతులను, నాయకులను అదుపులోకి తీసుకుని ఉద్యమంపై ఉక్కుపాదం మోపారు. అంతకుముందు.. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు రైతులు, లంక భూముల సొసైటీల అధ్యక్షులకు నోటీసులు ఇచ్చి నిర్బంధకాండ కొనసాగించారు. తుళ్లూరు మండలాన్ని పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆందోళనకు తరలివచ్చే అవకాశం ఉన్న రైతులందరినీ రాత్రికి రాత్రే అదుపులోకి తీసుకున్నారు. చలో అసెంబ్లీకి రావద్దని.. అలాగే పెద్ద నాయకులందరూ ఇంటికే పరిమితం కావాలని హెచ్చరికలు జారీచేశారు. మరోవైపు.. సోమవారం ఉదయం 5 గంటల నుంచి సచివాలయం చుట్టూ ఆరు చెక్ పాయింట్లు పెట్టారు. మల్కాపురం మలుపు వద్ద మందడం జెడ్పీ ఉన్నత పాఠశాల వెనుక నుంచి సచివాలయానికి చేరుకునే ప్రధాన రహదారిపై ఒకేచోట మూడు చెక్ పాయింట్లు ఏర్పాటుచేశారు. వేర్వేరుచోట్ల నేతలు అదుపులోకి.. ఇదిలా ఉంటే.. ‘చలో అసెంబ్లీ’కి రైతులందరూ తరలివస్తున్నారని భావించిన వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ, జనసేన, కాంగ్రెస్ నేతలు పెద్దఎత్తున తరలివచ్చారు. వీరందరినీ వేర్వేరు చోట్ల పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 11గంటలకు సీపీఐకి చెందిన మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్, సీఆర్డీయే ఏఐటీయూసీ కార్యదర్శి జీవీ రాజు, సీపీఎం సీఆర్డీయే కార్యదర్శి ఎం. రవి, జిల్లా రైతు విభాగం రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్‌లను మందడంలో అదుపులోకి తీసుకున్నారు. ఐనవోలు వద్ద లింగాయపాలేనికి చెందిన రైతు నాయకుడు అనుమోలు గాంధీతోపాటు మరో న్యాయవాదిని 11.30గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం 1.30గంటల ప్రాంతంలో బాపట్ల వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త నందిగం సురేష్‌తోపాటు పార్టీ తుళ్లూరు మండల నేత చలివేంద్రం సురేష్‌ను మందడంలో అరెస్టుచేసి పెదకూరపాడు పోలీసుస్టేషన్‌కు తరలించారు. అలాగే, మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు శృంగారపాటి సందీప్, లంక రైతు పులి ప్రకాష్‌లను తెల్లవారుజామున 6 గంటలకు అదుపులోకి తీసుకుని తుళ్లూరు స్టేషన్‌కు తరలించారు. తాడికొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చిలకా విజయ్ను ఉ.6గంటలకు గృహనిర్బంధం చేశారు. వెంకటపాలెంలో జనసేన నేతలను అదుపులోకి తీసుకున్నారు. కాగా, వీరందరినీ సాయంత్రం అయిదు గంటలకు విడుదల చేశారు. తుళ్లూరు పోలీసుస్టేషన్లో ఉన్న వైఎస్సార్సీపీ నేతలు, రాజధాని రైతులను తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కత్తెర హెనీ క్రిస్టీనా పరామర్శించి వారికి సంఘీభావం తెలిపారు. రైతుల డిమాండ్లు ఇవీ.. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల్లో ఎక్కువ శాతం భూములు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ అసైన్డ్, లంక భూములను సాగుచేసుకుంటున్న తమకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని రైతుల ప్రధాన ఆరోపణ. లింగాయపాలెం, రాయపూడి, ఉద్దండ్రాయునిపాలెం, వెంకటపాలెం గ్రామాల్లో లంక భూములు దాదాపు 1600 ఎకరాల వరకు ఉంటాయి. ఈ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు చట్ట ప్రకారం ప్యాకేజ్ ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. మూడున్నరేళ్లుగా అధికారులకు, మంత్రులకు తమ సమస్యలను విన్నవించినా ఫలితం లేకపోవడంతో చివరి అస్త్రంగా రైతులు సోమవారం ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. జరీబు ప్యాకేజీ ఇవ్వాలి : వైఎస్సార్సీపీ ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేత నందిగం సురేశ్ మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో దళితులకు అన్యాయం జరుగుతోందని, ప్యాకేజీ విషయంలో వివక్ష ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపించారు. రాజధానిలో 29 గ్రామాల్లో సాగు చేసుకునే ఐదు వేల ఎకరాల భూములను జీవో నంబర్ 259 ప్రకారం మాత్రమే తీసుకోవాలని, అందరికీ జరీబు ప్యాకేజ్‌ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోతున్న వారికి తగిన పరిహారాన్ని అందజేయాలన్నారు. అక్రమ అరెస్టులపై వామపక్షాల ఖండన రాజధాని ప్రాంతంలో శాంతియుతంగా ఆందోళన చేయడానికి ప్రయత్నించిన వారిని అక్రమంగా అదుపులోకి.. అరెస్టులు చేయడాన్ని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి. మధు, కె. రామకృష్ణ సోమవారం ఖండించారు. అసైన్డ్ రైతులను, వారికి సంఘీభావంగా వెళ్లిన వివిధ పార్టీల నాయకులను అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. రాజధాని ప్రాంతంలో పోలీసులు భయానక వాతావరణాన్ని సృష్టించారని పేర్కొన్నారు. అసైన్డ్, లంక భూముల రైతులకు ఇతర రైతులతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలని, వ్యవసాయ కార్మికులకు సామాజిక పెన్షన్ రూ.9 వేలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. -
అమరావతిలో అసైన్డ్ భూముల రైతులు విడుదల
-
రాజధానిలో ‘భూ’మంతర్
రాజధాని అమరావతిలో అసైన్డ్ భూములు: 2,028 ఎకరాలు లంక, శివామ్ జమీందార్ భూములు: 2,284 ఎకరాలు ఎకరం అసైన్డ్ జరీబు భూమి విలువ: దాదాపు రూ.2.28 కోట్లు ఎకరం అసైన్డ్ మెట్ట భూమి విలువ: దాదాపు రూ.2.02 కోట్లు సాక్షి, తుళ్లూరు: రాష్ట్ర రాజధాని అమరావతిలో పేద దళిత, గిరిజన రైతులను ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు దారుణంగా వంచించారు. భూసమీకరణ కింద పరిహారం రాదంటూ మభ్యపెట్టి అసైన్ట్ భూములను కారుచౌకగా కొట్టేశారు. వాటిని భూసమీకరణలో భాగంగా ప్రభుత్వానికి ఇచ్చి, పరిహారం కింద నివాస, వాణిజ్య స్థలాలు సొంతం చేసుకున్నారు. అమాయక దళిత, గిరిజనుల భూములను లాక్కోవడానికి భూబకాసురులు సాగించిన కుట్రలు, కుతంత్రాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. రాజధాని నిర్మాణం పేరుతో తెలుగుదేశం సర్కారు మోసపూరితంగా వ్యవహరించింది. అమరావతి ప్రాంతంలో రాజధాని నగరాన్ని నిర్మిస్తారనే ప్రకటన వచ్చాక ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతల కన్ను పేదలు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములపై పడింది. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి పరిధిలోని 29 గ్రామాల్లో అసైన్డ్, లంక, శివాయ్ జమీందార్ భూములు 4,312 ఎకరాలు ఉన్నాయి. ఇందులో 2,028 ఎకరాలు అసైన్డ్, మరో 2,284 ఎకరాలు లంక, శివాయ్ జమీందార్ భూములు. వీటిని 1954, 1971, 1976, 2005 సంవత్సరాల్లో భూమిలేని నిరుపేదలకు అప్పటి ప్రభుత్వం పంచి పెట్టింది. రాజధాని ప్రకటన వెలువడగానే ఈ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయనే వివరాలను ప్రభుత్వ పెద్దలు తెప్పించుకున్నారు. అందులో నవులూరు, కురగల్లు, కృష్ణాయపాలెం, ఉండవల్లి, రాయపూడి, ఐనవోలు, తుళ్లూరు, ఉద్ధండ్రాయునిపాలెం, లింగాయపాలెం, బోరుపాలెం, అనంతవరం, మందడం, వెంకటపాలెం, నెక్కల్లు, నేలపాడు గ్రామాల్లోని ప్రభుత్వ భూములను టార్గెట్ చేశారు. వీటి అనుభవదారుల వివరాలు తీసుకుని రంగంలోకి దిగారు. బినామీలతో తప్పుడు ప్రచారం అసైన్డ్ భూములను గతంలో ప్రభుత్వాలే ఇచ్చాయి కాబట్టి వాటిని భూసమీకరణ కింద సీఆర్డీఏ వెనక్కి తీసుకుని పైసా కూడా పరిహారం ఇవ్వదు అంటూ టీడీపీ నాయకులు, మంత్రులు తమ బినామీలతో ప్రచారం చేయించారు. ఇప్పుడు అమ్ముకుంటే ఎంతో కొంత సొమ్ము వస్తుందంటూ అసైన్డ్ భూముల అనుభవదారులను మాటలతో వంచించారు. అసైన్డ్ భూములకు ప్రభుత్వం పరిహారం ఇవ్వదంటూ సీఆర్డీఏ, రెవెన్యూ అధికారులు కూడా వంతపాడారు. దీంతో భయాందోళనకు గురైన అసైన్డ్ రైతులు తమ భూములను నామమాత్రపు ధరకు అధికార పార్టీ నేతలకు రాసి ఇచ్చేశారు. ఆ వెంటనే సీఆర్డీఏ అధికారులు అసైన్డ్ భూములకు ప్యాకేజీ ప్రకటించారు. తక్కువ ధరకు పేదల నుంచి భూములను కొట్టేసిన బడాబాబులు వాటిని ప్రభుత్వానికి ఇచ్చి, భారీగా పరిహారం జేబులో వేసుకున్నారు. అసైన్డ్ రైతులకు తీరని అన్యాయం అధికార పార్టీ నేతలు అసైన్డ్ రైతులను బెదరగొట్టి ఎకరా భూమికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల్లోపే చెల్లించారు. ప్రభుత్వం ప్రకటించిన అసైన్డ్ భూముల ప్యాకేజీ ప్రకారం.. ఎకరానికి 500 గజాల చొప్పున నివాస స్థలం, 100 గజాల చొప్పున వాణిజ్య స్థలం దక్కించుకున్నారు. నివాస స్థలం గజం విలువ రూ.22,000, వాణిజ్య స్థలం రూ.26,000 పలుకుతోంది. దాని ప్రకారం 500 గజాల విలువ రూ.1.10 కోట్లు. 100 గజాల వాణిజ్య స్థలం విలువ రూ.26 లక్షలు. అంటే ఎకరానికి రూ.1.36 కోట్ల విలువ ఉంది. అసైన్డ్ రైతులే తమ భూములను నేరుగా ప్రభుత్వానికి ఇచ్చి ఉంటే జరీబు ప్యాకేజీ ప్రకారం.. 800 గజాల నివాస స్థలం, 200 గజాల వాణిజ్య స్థలం దక్కేది. 800 గజాల నివాస స్థలం విలువ రూ.1.76 కోట్లు, 200 గజాల వాణిజ్య స్థలం విలువ రూ.52 లక్షలు. అంటే ఎకరం భూమిని కారుచౌకగా ప్రభుత్వ పెద్దలకు విక్రయించడం వల్ల అసైన్డ్ రైతు రూ.2.28 కోట్లు నష్టపోయినట్లు లెక్క. మెట్ట భూమి ప్యాకేజీ ప్రకారం.. 800 గజాల నివాస స్థలం, 100 గజాల వాణిజ్య స్థలం ఇస్తారు. ఈ లెక్కన ఎకరం మెట్ట భూమి విలువ రూ.2.02 కోట్లు. జరీబు రైతులకు రూ.50 వేలు, మెట్ట రైతులకు రూ.30 వేల చొప్పున పదేళ్లపాటు ప్రభుత్వం నుంచి పరిహారం ఆందుతుంది. ఈ పరిహారాన్ని కూడా అసైన్డ్ రైతులు కోల్పోయారు. మా భూములు మాకిప్పించండి ‘‘రాష్ట్ర మంత్రులు, అధికార టీడీపీ నాయకులు తమ బినామీలను గ్రామాల్లోకి పంపించి.. అసైన్డ్ భూములకు పరిహారం రాదు, వీటిని తీసేసుకుంటుంది, కొనేవాళ్లు దొరికితే ఇప్పుడే అమ్మేసుకోండి అంటూ పుకార్లు పుట్టించారు. అధికారులు కూడా ఇవే మాటలు చెప్పారు. దీంతో భయపడి ఎకరా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకే అమ్మేసుకున్నాం. ఇప్పుడు ఆ భూములు రూ.కోట్లు పలుకుతున్నాయి. ప్రభుత్వం మా భూములను మాకు ఇప్పించి న్యాయం చేయాలి’’ – పొన్నూరి నాగేశ్వరరావు, అసైన్డ్ రైతు, ఉద్ధండ్రాయునిపాలెం చట్టం.. మాకు చుట్టమే! చట్టం ప్రకారం పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములను ఇతరులెవరూ కొనుగోలు చేయకూడదు. ఎవరైనా కొనుగోలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలి. ఆయా భూములను తొలుత కేటాయించిన పేదలు ఉంటే వారికి ఇవ్వాలి. వారు లేకపోతే ఇతర పేద కుటుంబాలకు పంపిణీ చేయాలి. అయితే, అధికార పార్టీ నాయకులు చట్టాన్ని సైతం లెక్కచేయలేదు. అసైన్డ్ రైతులను భయపెట్టి భూములను లాగేసుకున్నారు. ఇదంతా బహిరంగంగానే జరిగినా అదేమిటని అడిగే నాథుడే లేకుండాపోయాడు. -
మద్దతు దక్కేలా..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పత్తి కొనుగోళ్లకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీ ఐ) ఏర్పాట్లు చేస్తోంది. పత్తికి మద్దతు ధర కల్పించడానికి సీసీఐ ప్రత్యేక కేంద్రాలు నెలకొల్పేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. జిల్లా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 11 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఆయా జిన్నింగ్ మిల్లుల్లోనే వీటిని ఏర్పాటు చేయనున్నారు. గతేడాది ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోనే ఈ సారి కూడా కొనుగోలు కేంద్రాలు తెరుచుకోనున్నాయి. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో 68 వేల హెక్టార్లలో సుమారు లక్ష మందికిపైగా రైతులు పత్తి సాగు చేశారు. సుమారు 12 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అధికారుల అంచనా ప్రస్తుతం పత్తి వివిధ దశల్లో ఉంది. మాడ్గుల, కొందర్గు, చౌదరిగూడ తదితర ప్రాంతాల్లో పూత దశకు చేరుకుంది. వర్షానికి వర్షానికి మధ్య చాలా రోజుల విరామం ఉండడంతో మొక్కల్లో ఎదుగుదల లోపించింది. దీనికితోడు పోషకాల లేమి కూడా ఎదురైంది. దీంతో పూర్తిస్థాయిలో పూత దశకు చేరుకోలేదు. నవంబర్ రెండో వారం నుంచి పత్తి దిగుబడి మొదలవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ లోగా అంటే న వంబర్ ఒకటి కల్లా కొనుగోలు కేం ద్రాలు తెరచాలన్న యోచనలో సీసీఐ ప్రతిని ధులు ఉన్నారు. గతేడాది వరకు దిగుబడి ప్రారంభ దశలో సీసీఐ కేంద్రాలు తెరచుకోలేదు. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి తీవ్రంగా నష్టపోయారు. వారు నిర్ణయించిందే ధరగా రైతు లు అమ్ముకున్నారు. ఈసారి ఇటువంటి పరిస్థితి రాకుండా దిగుబడి ఆరంభానికి ముందే కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. రైతుకు ‘మద్దతు’.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పత్తి మద్దతు ధరను పెంచిన విషయం తెలిసిందే. గతేడాది వరకు క్వింటా పత్తి రూ.4,320 ఉండగా దీన్ని తాజాగా రూ.5,450కు పెంచడం విశేషం. ఈ పెంపు రైతులకు ఊరట కలిగించే అంశం. రైతులు పత్తిని వ్యాపారులకు కాకుండా సీసీఐ కేంద్రాల్లోనే విక్రయిస్తే మేలు జరుగుతుంది. ఈ మేరకు త్వరలో రైతులకు అవగాహన కల్పించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది రైతుల పేరిట వ్యాపారులు సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించి సొమ్ము చేసుకున్నారు. రైతుల నుంచి వివిధ సాకులతో తక్కువ ధరకు పత్తిని వ్యాపారులు సేకరించారు. ఆ తర్వాత సీసీఐ కేంద్రాల్లో అమ్మి మద్దతు ధరకు కాస్త అటుఇటుగా లాభపడ్డారు. అయితే రైతుల సమగ్ర వివరాలతో రూపొందించిన క్యూఆర్ బార్ కోడ్ కార్డులు రైతులకు ఆలస్యంగా అందజేయడంతో పెద్దగా వారికి ఒరిగిందేమీ లేదు. గతేడాది అందజేసిన క్యూర్ బార్ కోడ్ కార్డుల ద్వారానే రైతుల నుంచి సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించేందుకు ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో సుమారు 80 వేల మంది రైతుల వద్ద ఆ కార్డులు ఉన్నాయి. ఐదేళ్లపాటు ఈ కార్డులు మనుగడలో ఉంటాయని జిల్లా మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఛాయదేవి తెలిపారు. కార్డులు లేని రైతులు ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం, వ్యవసాయ అధికారుల ఇచ్చే ధ్రువీకరణ పత్రం ఆధారంగా పత్తిని విక్రయించుకోవచ్చని పేర్కొన్నారు. -
ప్రైవేటు దోపిడీ
సాక్షి ప్రతినిధి,ఒంగోలు: సాగర్ కుడి కాలువ కింద నీటిని విడుదల చేస్తున్న ప్రభుత్వం రైతులకు వరి విత్తనాలను సరఫరా చేయకపోవడంతో విత్తనాల కోసం బ్లాక్ మార్కెట్ ను ఆశ్రయించాల్సి వస్తోంది. రైతులు ఏ రకం విత్తనాలు సాగు చేయాలో సూచించిన ప్రభుత్వం వాటిని అందుబాటులోకి తీసుకురాలేదు. ఇదే అదనుగా వ్యాపారులు విత్తనాల ధరలను ఇబ్బడి ముబ్బడిగా పెంచారు. 25 కేజీల బస్తా విత్తనాలపై రూ.800 నుంచి రూ.1500 వరకు పెంచారు. దీంతో రైతులకు విత్తన కొనుగోల్లు భారంగా మారాయి. ఈ ధరలకు పేదరైతులు విత్తనాలు కొనలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం, విత్తన వ్యాపారులు కుమ్మక్కై రైతులను నిలువునా ముంచుతున్నారని, ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. ఎన్‌ఎల్‌ఆర్ 145 ఇవ్వని ప్రభుత్వం.. సాగర్ కుడికాలువ పరిధిలో ప్రకాశం జిల్లాలో 1.85 లక్షల ఎకరాల్లో వరిసాగు కానుంది. కొమ్మమూరు కెనాల్ పరిధిలో 72,800 ఎకరాలు ఉండగా గుండ్లకమ్మతో పాటు చెరువుల పరిధిలోని ఆయకట్టుతో కలుపుకుంటే మొత్తం 2.90 లక్షల ఎకరాల్లో వరిపంట సాగు చేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. తొందరగా దిగుబడి ఇచ్చే వరి రకాలను సాగు చేయాలని ఇప్పటికే వ్యవసాయ అధికారులు సూచించారు. ప్రధానంగా ఎన్‌ఎల్‌ఆర్ 34449 తోపాటు ఎన్‌ఎల్‌ఆర్ 145 రకాలను సాగు చేయాలని అధికారులు సూచించారు. ప్రభుత్వమే ఏపీ సీడ్స్ ద్వారా వరి విత్తనాలు సరఫరా చేస్తుందని అధికారులు ప్రకటించారు. అధికారిక గణాంకాల ప్రకారం ప్రస్తుతం సాగవనున్న విస్తీర్ణానికి 80 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం. ఏపీ సీడ్స్ వద్ద మూడు వేల క్వింటాళ్ల ఎన్‌ఎల్‌ఆర్ 34449 రకం విత్తనాలు మాత్రమే ఉన్నాయి. జిల్లా రైతాంగం దాదాపు 50 శాత విస్తీర్ణంలో ఎన్‌ఎల్‌ఆర్ 145 రకం వరి సాగుచేస్తారు. ఈ రకం తక్కువ నీటితో పండించుకోవచ్చు. పైపెచ్చు 130 రోజుల్లోనే పంటకాలం ఉంటుంది. ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి పేదలకు బియ్యం పంపిణీ కార్యక్రమంలో వినియోగిస్తుంది . దీంతో రైతులు సులభంగానే మద్దతు ధరతో ధాన్యాన్ని అమ్ముకొనే వెసులు బాటు ఉంటుంది. అందుకే రైతులు ఈ రకం వరి విత్తనాలకోసం ఎదురు చూస్తుంటారు. కానీ ప్రభుత్వం ఎన్‌ఎల్‌ఆర్ 145 రకం విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకరాలేదు. ఎన్‌ఎల్‌ఆర్ 34449 విత్తనాలను.. అది కూడా 80 వేల క్వింటాళ్లు అవసరమైతే మూడు వేల క్వింటాళ్లు మాత్రమే అందుబాటులో ఉంచింది. ఈ విత్తనాలు 12 వేల ఎకరాలకు మాత్రమే సరిపోతాయి. దీంతో రైతులు రెండు రకాల విత్తనాలకోసం ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. అందుబాటులో లేని ఎన్‌ఎల్‌ఆర్ రకం.. ప్రభుత్వం ఏపీ సీడ్స్ ద్వారా తగినన్ని విత్తనాలు సరఫరా చేయకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యాపారుల వద్ద విత్తనాలు అధిక రేట్లకు కొనాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రస్తుతం సరఫరా చేస్తున్న ఎన్‌ఎల్‌ఆర్ 34449 రకం విత్తనాలు (25 కిలోల బస్తా) కిలో రూ.28.15 ప్రకారం రూ.703.75గా ఉంది. ప్రభుత్వం కిలోకు రూ.5 సబ్సీడీ ఇస్తోంది. సబ్సీడీ పోను రైతు రూ.588.75 చెల్లించాలి. కానీ ఇవే ఇత్తనాలు బయట మార్కెట్లో రూ. 1300 అమ్ముతున్నారు. తప్పనిసరి పరిస్థితిలో రైతు అదనంగా రూ.711.25 చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు 50 శాతం రైతులు సాగు చేసే ఎన్‌ఎల్‌ఆర్ 145 రకం విత్తనాలు ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. దీంతో రైతుల ఈ రకం విత్తనాలను ప్రైవేటు వ్యాపారుల వద్ద అధికధరలు వెచ్చించి కొనాల్సి వస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఎన్‌ఎల్‌ఆర్ 145 రకం 30 కిలోల బస్తా రూ.2 వేల నుంచి 2200 వరకూ అమ్ముతున్నారు. ఇది రైతులు కొనలేని ధర. ఒకరకంగా చెప్పాలంటే వ్యాపారులు అవకాశం చూసుకొని దోపిడీ చేస్తున్నట్లే. ఒక పక్క ఎన్‌ఎల్‌ఆర్ 145 రకం విత్తనాలు అధికంగా సాగుచేయాలని సూచిస్తున్న వ్యవసాయాధికారులు విత్తనాలను మాత్రం సరఫరా చేయకపోవడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ప్రభుత్వ పెద్దలతో పాటు కొందరు అధికారులు సీడ్ వ్యాపారులతో కుమ్మక్కై ప్రభుత్వం ద్వారా విత్తనాలు సరఫరా చేయడం లేదన్న విమర్శలున్నాయి. దీని వెనుక రూ.కోట్లలో చేతులు మారినట్లు ప్రచారం సాగుతోంది. నాలుగేళ్లుగా జిల్లాలో కరువు తాండవిస్తోంది. పశ్చిమ ప్రకాశం తో పాటు తూర్పు ప్రాంతంలోనూ పంటలులేవు. దీంతో రైతాంగం కుదేలయింది. ఈ పరిస్థితిలో ఈ ఏడాది సాగర్ నీళ్లు వస్తున్నాయి. కనీసం ఇప్పుడైనా ఒక పండించుకుందామంటే కొనలేని పరిస్థితిలో విత్తనాల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రైవేటు దోపిడీని అరికట్టాల్సి ప్రభుత్వం వ్యాపారులకు కొమ్ముకాయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమౌతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వ్యాపారుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి. ఏపీ సీడ్స్ ద్వారా రైతులకు వరి విత్తనాలను సరఫరా చేయాలి. -
రాజధానికి భూములు ఇవ్వలేదని.. ప్రభుత్వం కక్ష సాధింపు
-
రాజధానికి భూములు ఇవ్వలేదని..
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణంలో భూములు ఇవ్వని రైతులపై టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులు రైతులను ఎన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేయాలో అన్నిరకాలుగా చేస్తున్నారు. తాజాగా పొలాలకు వెళ్లే వాటర్ పైపులను అధికారులు పగలగొట్టారు. దీనిపై వివరణ అడిగితే.. నిడమర్రు ఈ16 నిర్మాణం కోసమే వాటర్ పైపులు పగలగొట్టామని అధికారులు కాకమ్మకబుర్లు చెబుతున్నారు. కానీ రెండు రోజులుగా నీరు వృథాగా పోతున్నాయి. కొద్ది రోజుల క్రితమే వాటర్‌పైపులు పగల కొట్టవద్దంటూ స్థానిక రైతులు వినతి పత్రం ఇచ్చారు. అయినప్పటికీ అధికారులు మొండి వైఖరితో వారు అనుకున్న పని చేశారని రైతులు మండిపడ్డారు. తమ పొలాలకు నీరు వచ్చే మార్గం అదొక్కటేనని, ఇప్పుడు అధికారులు ఇలా చేయడంతో పొలాలు ఎండిపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ రైతులు ఆందోళనలు చేపట్టారు. పగల కొట్టిన పైపులకు మరమ్మత్తులు చేసేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. -
అనుమతి లేని నిర్ణయం..
సాక్షి, హైదరాబాద్: ఆగ్రోస్‌లో టార్పాలిన్ల విక్రయాలపై దుమారం చెలరేగుతోంది. సర్కారు నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా టార్పాలిన్లను సబ్సిడీపై రైతులకు సరఫరా చేయడంపై విమర్శలు వస్తున్నాయి. సబ్సిడీని నిర్ణయించడంలో కానీ, వాటి ని రైతులకు సరఫరా చేసే అంశంపైకానీ ఏదీ ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదని తెలుస్తోంది. దీంతో రైతులకు ఇచ్చిన సబ్సిడీని ఎవరు చెల్లించాలి, దీనికి ఎవరు బాధ్యులన్నది చర్చనీయాంశమవుతోంది. సరఫరా కంపెనీలతో కొందరు కుమ్మక్కు కావడం వల్లే ఇదంతా జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. టార్పాలిన్ల విలువ రూ. 5.4 కోట్లు... ఈ ఏడాది రైతులకు రూ.5.4 కోట్ల విలువైన టార్పాలిన్లను సబ్సిడీపై సరఫరా చేయాలని ఆగ్రోస్‌లో కొందరు నిర్ణయానికి వచ్చారు. వచ్చిందే తడవుగా జాబితాల్లో ఉన్న కంపెనీలతో మాట్లాడారు. సాధారణంగా బయట ఒక్కో టార్పాలిన్ ధర రూ. 2,500 కాగా, ఆగ్రోస్ ద్వారా రూ. 2,350కే రైతులకు ఇవ్వాలనుకున్నారు. అంటే బయటకంటే రూ. 150 తక్కువకు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అందులో రైతులకు సగం సబ్సిడీ ఇచ్చారు. అంటే వారికి రూ. 1175కు ఒక్కో టార్పాలిన్‌ను విక్రయించారు. మిగిలి న సగం ప్రభుత్వం భరించాలన్నమాట. ఈ వ్యవహా రానికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోలేదు. అంతర్గతంగా నిర్ణయం తీసుకున్నాక, వ్యవసాయశాఖకు చెందిన మండల ఏవోల ద్వారా వాటిని రైతులకు విక్రయించారు. రైతుల వాటా సొమ్ము రూ. 2.70 కోట్లు కంపెనీలకు చెల్లించారు. ప్రభుత్వ వాటాగా మరో రూ. 2.70 కోట్లు కంపెనీలకు చెల్లించాల్సి ఉంది. దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోవడంతో ఆ సొమ్మును చెల్లింపులపై ఇప్పుడు ఆగ్రోస్‌లో అంతర్మథనం మొదలైంది. అలాగనీ ఆగ్రోస్ భరించే స్థితిలో లేదు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి అనుమతి కోరినా లభించే అవకాశాలు లేవు.దీంతో ఆగ్రో చిక్కుల్లో పడింది. అవును నిజమే: ఆగ్రోస్ ఎండీ ఈ విషయంపై ప్రస్తుత ఆగ్రోస్ ఎండీ సురేందర్‌ను వివరణ కోరగా, అనుమతి లేకుండా టార్పాలిన్లు విక్రయించిన మాట వాస్తవమేనని స్పష్టంచేశారు. తాను ఇటీవలే ఆగ్రోస్ బాధ్యతలు తీసుకున్నానని, తనకు పూర్తి వివరాలు తెలియవన్నారు. -
దళితుల భూపంపిణీకి ఎన్నికల జోష్
సాక్షి, హైదరాబాద్: దళితుల భూపంపిణీ పథకంపై ఎన్నికల ప్రభావం పడింది. రెండేళ్లుగా ఈ పథకానికి కేటాయింపులు తగ్గుతున్న క్రమంలో ఈసారి అతి తక్కువ లక్ష్యంతో ఎస్సీ కార్పొరేషన్ వార్షిక ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లో కేవలం 159 మంది లబ్ధిదారులకు భూపంపిణీ చేసేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఇందుకుగాను రూ.4.06 కోట్లు అవసరమని ప్రణాళికలో పేర్కొంటూ ప్రభుత్వానికి సమర్పించారు. కానీ, అనూహ్యంగా ఎన్నికల సీజన్ వచ్చిన దళితుల భూపంపిణీపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 1,900 మంది రైతులకు భూపంపిణీ చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనికి రూ.407.32 కోట్లు కేటాయించింది. ఎస్సీ కార్పొరేషన్ వార్షిక ప్రణాళికను ఆమోదిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. భూమి ఎక్కడ ? గతంలో ఎన్నడూ లేనంత పెద్దమొత్తంలో ప్రభుత్వం దళితుల భూపంపిణీకి నిధులు కేటాయించినప్పటికీ, లక్ష్య సాధన సులువు కాదనిపిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జరిగిన పరిణామాలతో రాష్ట్రవ్యాప్తంగా స్థిరాస్థి రంగం పుంజుకుంది. దీంతో భూముల ధరలు పెరిగిపోయాయి. ప్రాజెక్టులు, కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం సేకరిస్తున్న భూమికి ఎక్కువ ధరలు పెట్టి కొనుగోలు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో దళితుల భూపంపిణీ పథకానికి ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూమి కొనుగోలు చేయడం ఎస్సీ కార్పొరేషన్‌కు కష్టంగా మారింది. అన్ని వసతులతోపాటు సాగుకు యోగ్యమైన భూమినే కొనుగోలు చేయాలనే నిబంధన ఉంది. ఎకరాకు రూ.7లక్షలు మించకుండా ఉండాలని స్పష్టం చేసింది. ఈ మొత్తంతో భూమి కొనుగోలు చేయడం అసాధ్యమని అధికారులు చెబుతున్నారు. గత మూడేళ్లుగా నిర్దేశించిన లక్ష్యం తాలూకు సాధనే కష్టమైందని ఒక అధికారి ‘సాక్షి’తో అన్నారు. -
మొక్కజొన్న గజగజ
సాక్షి, హైదరాబాద్: మొక్కజొన్న పంటపై కత్తెర పురుగు దాడి ఉధృతమైంది. మొదట్లో సిద్దిపేట, మెదక్ జిల్లాలకే పరిమితమైన కత్తెర పురుగు (ఫాల్ ఆర్మీ వార్మ్) ఆ తర్వాత గత వారంలో 8 జిల్లాలకు విస్తరించింది. ఇప్పుడు ఏకంగా 17 జిల్లాల్లో విధ్వంసం సృష్టిస్తోంది. ఈ విషయమై వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపింది. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, ఖమ్మం, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, గద్వాల, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, మహబూబాబాద్, వికారాబాద్ జిల్లాల్లోని మొక్కజొన్న పంటపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని నివేదిక తెలిపింది. అలాగే పత్తిపై గులాబీ రంగు పురుగు దాడి విస్తరించింది. గత వారం వ్యవసాయ శాఖ వర్గాల లెక్కల ప్రకారం మెదక్, వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోనే కనిపించిన గులాబీరంగు పురుగు, ఇప్పుడు ఏకంగా మరో 12 జిల్లాలకు విస్తరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, ఖమ్మం, భద్రాద్రి, నల్లగొండ, ఆసిఫాబాద్, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లోనూ కనిపించింది. మొక్కజొన్నపై కత్తెర, పత్తిపై గులాబీ పురుగు దాడి చేస్తున్నా చర్యలు చేపట్టడంలో వ్యవసాయశాఖ విఫలమైంది. కోటి ఎకరాల్లో పంటల సాగు... ఖరీఫ్ సాగు గణనీయంగా పెరిగింది. ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటికి 1.01 కోట్ల ఎకరాలకు అంటే 93 శాతానికి చేరింది. అందులో పత్తి సాగు గణనీయంగా పెరిగింది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు ఏకంగా 44.71 లక్షల (106%) ఎకరాల్లో సాగైంది. ఖరీఫ్ ఆహారధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 49.06 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 45.91 లక్షల(94%) ఎకరాల్లో సాగయ్యాయి. ఆహార పంటల్లో కీలకమైన వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.75 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 24.11 లక్షల (102%) ఎకరాల్లో నాట్లు పడ్డాయి. ఇటీవలి వర్షాలతో వరి నాట్లు సాధారణం కంటే గణనీయంగా పుంజుకున్నాయి. ఇక మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 13.40 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 11.48 లక్షల (86%) ఎకరాల్లో సాగైంది. కంది 97%, పెసర 72% సాగయ్యాయి. పంట నష్టంపై కేంద్రానికి నివేదిక ఏదీ? ఇటీవల కురిసిన వర్షాలకు అనేకచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లాయి. అనేక జిల్లాల్లో దాదాపు రెండున్నర లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇవిగాక పలు జిల్లాల్లో పంటలు నీట మునిగాయి. పంట నష్టం ఇంత పెద్ద ఎత్తున ఉన్నా వ్యవసాయశాఖ కేవలం ప్రాథమిక నివేదిక వరకే పరిమితమైంది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి నివేదిక పంపించలేదని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. కనీసం ప్రాథమిక నివేదిక కూడా తమకు చేరలేదని విపత్తు నిర్వహణశాఖ తెలిపింది. 12 జిల్లాల్లో లోటు వర్షపాతం ఈ ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా సాధారణ వర్షపాతం 614.5 మిల్లీమీటర్లు (ఎంఎం) కాగా, ఇప్పటివరకు 584.1 ఎంఎంలు నమోదైంది. జూన్ నెలలో 14 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, జూలైలో 30 శాతం లోటు నమోదైంది. ఆగస్టులో 18 శాతం అధిక వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్‌లో ఇప్పటివరకు ఈ ఐదు రోజుల్లో 74 శాతం లోటు నమోదైంది. ఇటీవల భారీగా వర్షాలు కురిసినప్పటికీ ఇప్పటికీ 12 జిల్లాల్లో లోటు వర్షపాతమే ఉంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, జోగులాంబ, నాగర్‌కర్నూలు, నల్లగొండ, వనపర్తి జిల్లాల్లో లోటు నమోదైంది. -
ఎరువు.. బరువు
సాక్షి భూపాలపల్లి: ఇప్పటికే విపరీతమైప ఒడిదుడుకుల మధ్య సేద్యం సాగుతోంది. రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కుదేలైన అన్నదాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. మరోవైపు గులాబీ రంగు పురుగు, కత్తెర పురుగు వంటి చీడపీడల ఉధృతికి వ్యవసా యం భారంగా మారుతోంది. దీనికి తోడు ప్రస్తుతం పెరిగి న ఎరువుల ధరలు అన్నదాతకు మరింత భారంగా పరిణమించాయి. ప్రభుత్వం పంపిణీ చేసే యూరియా మినహాయించి మిగతా డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులపై రూ.50 నుంచి 100 వరకు ధరలు పెరిగాయి. రైతుకు ఎకరాకు ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడి సాయం రూ.4000లకు మించి వ్యయం అవుతోంది. పెరుగుతున్న పెట్టుబడి వ్యయం జిల్లాలో రైతుల పరిస్థితి అంత బాగోలేదు. పత్తి పంటకు గులాబీ రంగు పురుగు, కొత్తగా మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు రూపంలో చీడపీడల ఉధృతి పెరిగింది. వీటిని అదుపు చేయడానికే రసాయ న మందులను పిచికారీ చేస్తున్నారు. ఎకరానికి అదనంగా రెండు నుంచి మూడు వేల రూపాలయల ఖర్చు అవుతోం ది. ఇటీవల కురిసిన భారీ వర్షాల నుంచి రైతులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. పంటల చేలల్లో వర్షపునీరు నిలవడంతో మొక్కల ఎదుగుదల లోపించింది. వారం రోజులుగా వర్షాలు తెరిపినివ్వడంతో వ్యవసాయ క్షేత్రాల్లో రైతులు ఎరువులు వేస్తూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం మరో మారు ఎరువుల ధరలు పెరిగాయి. ఐదు నెలల్లో పెరగడం ఇది మూడోసారి. దీంతో వ్య యం కాస్త ఎకరానికి మరో వెయ్యిరూపాయలు పెరగనుంది. మున్ముందు కాలం ఎట్లుంటుందో తెలియదు. దిగుబడి ఏమేరకు వస్తదో.. ధర ఎట్టుంటదో.. ఇప్పుడు మాత్రం పెట్టుబడి ఎక్కువైతాంది.. అంటూ చాలామంది రైతులు వాపోతున్నారు. అధికమైన ఎరువుల వినియోగం రెండు వారాల నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పంట పొలాల్లో ఎరువులు చల్లుతూ రైతులు బీజీగా ఉన్నారు. జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో పత్తి పంట పండిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఆశించిన విధంగా పత్తి, ఇతర పంటల్లో ఎదుగుదల లోపించింది. మొక్కల పెరుగుదల కోసం ఎక్కువ మొత్తంలో ఎరువులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 85,000 మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాలో వ్యవసాయశాఖ అంచనాల ప్రకారం అన్ని పంటకు కలిపి దాదాపు 85,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం. ఎక్కువగా పత్తి, వరి పంటలు సాగుచేస్తుండడంతో రైతులు యూరియా, డీఏపీ, 20–20 ఎరువులను ఎక్కువగా వాడుతున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరల్లో డీఏపీ, 20–20 కూడా ఉన్నాయి. డీఏపీ ప్రతి బస్తాపై రూ.180, 20–20 బస్తాపై రూ.100 పెరిగింది. ప్రభుత్వం యూరియా బస్తాను 5 కిలోలు తగ్గించినా ధర రూ.290 దగ్గరే ఉంచింది. డీపీపీ బస్తా ధర మొదట్లో రూ.1081 ఉండగా తాజాగా 1,330కి పెరిగింది. అయితే ఇందులో జింక్, వేప æకలిపిన డీపీపీతోపాటు సాధరణ డీఏపీలను కంపెనీలు విడుదల చేస్తున్నాయి. దీంతో ఏవి కొనుగోలు చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. సాధారణ డీఏపీ రూ.1,290, కోటెడ్ డీఏపీ పేరిట బస్తాకు రూ.40 నుంచి రూ.50 అదనంగా తీసుకుంటున్నారు. -
ఢిల్లీలో కదం తొక్కిన రైతు,కార్మిక సంఘాలు
-
రైతు సొమ్ము.. రాబందుల పాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుబంధు సొమ్ముపై రాబందుల కన్ను పడింది. రైతులకు పెట్టుబడి కింద ఇస్తున్న సొమ్మును కొన్నిచోట్ల అక్రమార్కులు కాజేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో పెట్టుబడి మొత్తాన్ని స్వాహా ఘటన వెలుగు చూడటంతో సర్కారు ఒక్క సారిగా ఉలిక్కిపడింది. ఎంతో పకడ్బందీగా పెట్టుబడి చెక్కులను పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. అక్రమాలు జరగడం ఆగలేదు. ఇందులో బ్యాంకర్లు, రెవెన్యూ అధికారులు కీలక సూత్రధారులుగా ఉన్నట్లు తెలిసింది. దీంతో సీరియస్ అయిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ వ్యవహారంపై విచారణ చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. పెట్టుబడి సొమ్మును బ్యాంకు, రెవెన్యూ అధికారులతోపాటు బయటి వ్యక్తులు అక్రమంగా కొట్టేసినట్లు ప్రాథమిక విచారణలో ఈ మేరకు వెల్లడైంది. సుమారు రూ.70 లక్షలు కాజేసినట్లు నిర్ధారణ అయింది. వ్యవసాయశాఖ అధికారుల నిర్లక్ష్యం కూ డా ఉన్నట్లు దర్యాప్తులో బయటపడింది. ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగాయా అన్న కోణంలోనూ ప్రభుత్వం దృష్టి సారించింది. మిగిలిన చెక్కులు 7.7 లక్షలు గత మేలో ప్రభుత్వం రైతుబంధు చెక్కుల పంపిణీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొత్తం 58.16 లక్షల మంది పట్టాదారులకు 58.81 లక్షల చెక్కులు ముద్రించారు. 51.11 లక్షల చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. 7.7 లక్షల చెక్కులు పంపిణీ కాకుండా మిగిలిపోయాయి. ఇందులో చనిపోయిన వారి పేరు మీద, భూమిని మొత్తం అమ్ముకున్న వారి పేర్ల మీద, విస్తీర్ణం ఉన్న దాని కంటే ఎక్కువ, తక్కువగా పడి మరికొందరి పేర్ల మీద చెక్కులు ముద్రితమయ్యాయి. అందులో విదేశాల్లో ఉన్నవారి పేరు మీద దాదాపు 70 వేలు, చనిపోయిన రైతుల పేరు మీద లక్షకు పైగా ఉన్నట్లు అంచనా. కొన్ని రకా ల చెక్కుల్లో లోపాలున్నందున వాటిని తీసుకొచ్చే రైతులకు సొమ్ము చెల్లించవద్దని వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీచేసింది. వాటిని విత్‌హోల్డ్‌లో పెట్టా లని ఆదేశించింది. దీన్ని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు నల్లగొండలో ‘విత్ హోల్డ్’లో ఉన్న 551 చెక్కులను నగదుగా మార్చుకుని పంచుకున్నారు. నల్లగొండలోని నాంపల్లి మండలంలో ఎస్బీఐ బ్యాం కు క్యాషియర్, ప్రభుత్వాధికారులు, బయటి వారితో కలిసి సొమ్మును కాజేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పెద్ద అడిశెర్లపల్లి, చింతపల్లి, నాంపల్లి, గుర్రంపోడు, దేవర కొండ, చండూరు మండలాలకు చెందిన విత్‌హోల్డ్‌లో ఉన్న రైతుబంధు చెక్కులు డ్రా చేసినట్లు గుర్తించారు. ఈ సంఘటనలు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లోనూ జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతు నుంచి ఎలా కొట్టేశారు నిబంధనల ప్రకారం సంబంధిత పట్టాదారు రైతు మాత్రమే చెక్కు తీసుకుని బ్యాంకుకు వెళ్లాలి. నగదు తీసుకునే సమయంలో పట్టాదారు పాసు పుస్తకం చూపించాలి. ఒకవేళ పాసు పుస్తకం రానట్లయితే ఆధార్ కార్డు, ఓటరు ధ్రువీకరణ కార్డును చూపించాల్సి ఉంది. కాని ఇవేమీ పట్టించుకోకుండానే నాంపల్లి మండల ఎస్బీఐ క్యాషియర్.. విత్‌హోల్డ్‌లో ఉంచిన రైతుబంధు చెక్కులను రెవెన్యూ, ఇతర ప్రభుత్వాధికారులతో కలిసి అక్రమంగా నగదులోకి మార్చారు. అయితే రైతుల వద్ద ఉన్న చెక్కులను రెవెన్యూ అధికారులు, బ్యాంకర్లు ఎలా కొట్టేశారో ఇప్పటికీ తేలలేదు. మరోవైపు మిగిలిపోయిన చెక్కులను ప్రభుత్వం ఇంకా జిల్లాల్లోనే ఉంచడంలో అర్థం లేదన్న చర్చ జరుగుతోంది. పైగా విదేశాల్లో ఉన్న పట్టాదారు చెక్కులను పంపిణీ చేయడంలో తాత్సారం చేస్తుండటంపైనా విమర్శలు వస్తున్నాయి. కలెక్టర్‌ను ఆదేశించాం పెట్టుబడి చెక్కుల సొమ్మును కాజేసిన అంశంపై విచారణ చేపట్టాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించాం. ఇందులో రెవెన్యూ, బ్యాంకు అధికారులు బాధ్యులుగా ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది. ఇప్పటికే బ్యాంక్ క్యాషియర్‌పై కేసు నమోదైంది. కలెక్టర్ నుంచి రెండు, మూడు రోజుల్లో నివేదిక రానుంది. పార్థసారథి, ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ శాఖ -
కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా...
అటు వ్యవసాయరంగంలోని రైతులు, వ్యవసాయకార్మికులు, ఇటు పారిశ్రామికరంగంలోని ఫ్యాక్టరీలు, కర్మాగారాల్లో పనిచేస్తున్న శ్రామికులు దేశం నలుమూలల నుంచి కదిలారు. శ్రమశక్తినే నమ్ముకున్న ఈ శ్రామికవర్గం పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అన్న తేడా లేకుండా తమ మౌలికసమస్యల పరిష్కారానికి గళమెత్తారు. కార్మికులు, కర్షకులు భుజం, భుజం కలిపి ఏకతాటిపై నడిచారు. అంగన్వాడి, ఆశావర్కర్లు, ఇలా వివిధరంగాలకు చెందిన కార్మిక,కర్షకలోకం వెంట నడిచింది. బుధవారం ఢిల్లీ నడివీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. చలోపార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు మొత్తం 23 రాష్ట్రాల నుంచి రైతులు, కార్మికులు ఢిల్లీకి చేరుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి చేరుకున్న వారందరికీ రామ్‌లీలా మైదానంలోనే టెంట్లు, ఇతరత్రా ఏర్పాట్లతో తాత్కాలికంగా బస ఏర్పాటు చేయాలని నిర్వాహకులు భావించారు. అయితే గత రెండు రోజులుగా కురిసిన వర్షాలతో అక్కడి నేలంతా బురదమయమై చిత్తడిగా మారింది. ఈ ఇబ్బందులను కూడా లెక్కచేయకుండా చాలా మంది రైతులు, కార్మికులు అక్కడే ఎలాగోలా సర్దుకున్నారు. మిగతావారిని గురుద్వారాలు, సాహిబాబాద్‌లోని క్యాంపులు, విడిదికేంద్రాలకు వాలంటీర్లు తరలించారు. దేశం నలుమూలల నుంచి ఢిల్లీకి వచ్చిన పలువురు శ్రామికులు, కర్షకులు అనారోగ్యం బారిన కూడా పడ్డారు. జ్వరం, జలుబు, డయేరియా వంటి సమస్యలతో సతమతమవుతున్న వారికి ఢిల్లీ ప్రభుత్వ సంచార ఆరోగ్యపథకం పరిధిలోని నలుగురు డాక్టర్ల బృందం సపర్యలు చేసింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 699 మందికి ట్రీట్మెంట్ ఇచ్చినట్టు ఈ బృందంలోని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వినీత్‌కుమార్ సాహు తెలిపారు. గత మార్చినెలలో నాసిక్ నుంచి ముంబై వరకు నిర్వహించిన రైతుల ‘మహాపాదయాత్ర’లో పాల్గొన్న వారిలో 5 వేల మంది ఈ ర్యాలీలోనూ పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న ఇబ్బందులను అధిగమించి మరో బృందం మణిపూర్ నుంచి పయనమైంది. మధ్యప్రదేశ్‌లోని మంద్సౌర్ నుంచి ఓ రైతుల బృందం దేశ రాజధానికి వచ్చి చేరింది. బిహార్ నుంచి వచ్చిన మహిళా రైతులు, కార్మికుల బృందం తమ జానపద నృత్యాల ద్వారా ఢిల్లీ నిరసనల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణలోని ఆదిలాబాద్, తదితర ప్రాంతాల నుంచి అంగన్వాడి స్కూల్ టీచర్లుగా, వర్కర్లుగా పనిచే స్తున్న మహిళలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. సీపీఎం అనుబంధ సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ), అఖిల భారత కిసాన్ సభ, అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ నిరసన ర్యాలీ నిర్వహించారు. డిమాండ్లు... స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలో భాగంగా రైతులకు గిట్టుబాటుధరలు, సకాలంలో రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, ధరల పెరుగుదల నియంత్రించి, ప్రజాపంపిణీ వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలు, ఉపాధి కల్పనకు గట్టి చర్యలు తీసుకోవాలి. రైతుల పంటరుణాల మాఫీ, కార్మికచట్టాల సక్రమ అమలు, నెలకు కనీస వేతనంగా రూ. 18 వేలు, మరిన్ని ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన, దేశవ్యాప్తంగా కోటి మంది అంగన్వాడి వర్కర్లు, అక్రిడేటెడ్ సోషల్ హెఃల్త్ యాక్టివిస్ట్‌లను కార్మికులుగా ప్రభుత్వ గుర్తింపు. -
భూమి ఉన్న ప్రతి రైతుకూ రైతుబీమా
నల్లగొండ అగ్రికల్చర్ : ‘‘రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబీమా పథకం భూమి ఉన్న ప్రతి రైతుకూ వర్తిస్తుంది. బాండ్లు రాలేదని దిగులుపడాల్సిన అవసరం లేదు. పాస్‌బుక్, ఆధార్ కార్డు, నామినీ ఆధార్ జిరాక్స్‌లను తీసుకెళ్లి మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో ఆన్లైన్లో నమోదు చేయించాలి. ఆన్లైన్లో నమోదు అయిన నాటి నుంచి రైతు బీమా వర్తిస్తుంది’’ అని జేడీఏ జి.శ్రీధర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హలో జేడీఏ’ కార్యక్రమానికి రైతుల నుంచి విశేష స్పందన వచ్చింది. జిల్లా నలుమూలల నుంచి రైతులు పట్టాదార్ పాస్‌బుక్కులు, రైతు బంధు చెక్కులు, బీమా పథకం, విత్తనాల పంపిణీపై ఉన్న సందేహాలను ‘జేడీఏ’తో ఫోన్లో మాట్లాడి నివృత్తి చేసుకున్నారు. ఎక్కువ మంది పట్టాదార్ పాస్‌బుక్కులు, రైతు బంధు చెక్కుల గురించే మాట్లాడారు. రైతుల ప్రశ్నలు, జేడీఏ సమాధానాలు వారి మాటల్లోనే... ప్రశ్న : మట్టినమూనా పరీక్షలను ఎక్కడ చేయించాలి – మురళీయాదవ్, మిర్యాలగూడ జేడీఏ : మిర్యాలగూడలోని భూసార పరీక్షాకేంద్రంలో మట్టినమూనాలను తీసుకెళ్లి పరీక్షలు చేయించుకోవచ్చు. ప్రశ్న : పాస్బుక్కు, చెక్కు రాలేదు – ఎల్లయ్య, పోలంపల్లి, చందంపేట జేడేఏ : మీ తహసీల్దార్‌ను సంప్రదించండి, పాస్బుక్కు వచ్చిన తరువాత రైతుబంధు చెక్కును ఇప్పిస్తాం. ప్రశ్న : పత్తిలో వేరుపురుగు వచ్చి చెట్లు చచ్చిపోతున్నాయి. ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి శ్రీనివాస్ మాడుగుల పల్లి జేడీఏ : ట్రైకోడర్మవిరిడిని నీటిలో కలిపి చెట్టు వేర్ల దగ్గర తడిచే విధంగా పోయండి. సూక్మపోషకాలను పిచికారీ చేయండి. దీంతో పురుగు నాశనమవుతుంది. ప్రశ్న : పాస్బుక్కు రాలేదు, బీమా వర్తిస్తుందా? భిక్షం, మిర్యాలగూడ జేడీఏ : మండల వ్యవసాయాధికారిని కలిసి ఆన్లైన్లో నమోదు చేయించండి. నమోదు అయిన నాటినుంచి బీమా వర్తిస్తుంది. ప్రశ్న : రైతుబంధు చెక్కులు ఎప్పుడు వస్తాయి? పల్లె క్రిష్ణయ్య, వేములపల్లి జేడీఏ : పాస్ బుక్కులు వచ్చిన తరువాత రైతు బంధు చెక్కులు వస్తాయి. ప్రశ్న : రైతు బీమా పధకానికి ఎక్కడ అన్లైన్ చేయించాలి? అనికుమార్‌రెడ్డి, తిమ్మన్నగూడెం జేడీఏ : మండల వ్యవసాయాధికారిని కలిసి పాస్బుక్కు జీరాక్స్, ఆధార్ కార్డుతో నామినిది కూడా జీరాక్స్ వస్తే ఆన్లైన్లో నమోదు చేస్తారు. ప్రశ్న : పాస్బుక్కు వచ్చి నెల రోజులు అయ్యింది. ఇప్పటికీ రైతుబంధు చెక్కు రాలేదు. యాదయ్య, తొండ్లాయి, శంకర్, నల్లగొండ, ఘనీ, హాలియా జేడీఏ : త్వరలోనే చెక్కు వస్తుంది. ప్రశ్న : పాస్‌బుక్కులు రాలేదు సత్తిరెడ్డి ఉట్లపల్లి, వెంకటయ్య, బొల్లెపల్లి, వెంకటేశ్వర్లు, సిరసనగండ్ల జేడీఏ : తహసీల్దార్‌ను, లేదా ఆర్డీఓలను కలవండి. బుక్కులు వచ్చిన తరువాత చెక్కులను ఇప్పిస్తాం. ప్రశ్న : రబీలో సబ్సిడీ విత్తనాలు ఇస్తారా శ్రీను, మునుగోడు జేడీఏ : వేరుశనగ, మినుము, ఉలువులు సబ్సిడీపై ఇస్తాం ప్రశ్న : రుణమాఫీ రాలేదు సుజాత, కట్టంగూరు జేడీఏ : ప్రభుత్వానికి నివేదికను పంపించాం. ప్రభుత్వంనుంచి ఆమోదం వస్తే రుణమాఫీ వస్తుంది. -
గ్రీన్ హైవే.. టెన్షన్
మోర్తాడ్(బాల్కొండ): గ్రీన్ హైవే నిర్మాణం ఏమో కానీ, రైతుల్లో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఉన్న భూములు పోతే ఇక ఏం చేసుకుని బతికేదనే ఆందోళన అన్నదాతల్లో నెలకొంది. ముప్కాల్ మండలంలోని వేంపల్లి మీదుగా వెళ్లే 44వ జాతీయ రహదారి నుంచి మంచిర్యాల వరకు గ్రీన్ హైవే నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బోధన్ నుంచి జగదల్పూర్ వరకు 63వ జాతీయ రహదారి విస్తరించి ఉంది. ఈ రోడ్డును నాలుగు లేన్ల రహదారిగా మార్చాలని కేంద్రం తొలుత యోచించింది. అయితే, పెద్ద మొత్తంలో ఇళ్లు, చెట్లు, వ్యవసాయ భూములకు నష్టం కలగనుంది. అంతేకాక మిషన్ భగీరథ పథకానికి సంబంధించిన పైప్లైన్లకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. ఈ నేపథ్యంలో అన్ని కష్ట నష్టాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. సరికొత్త రహదారికి శ్రీకారం చుట్టింది. రైతులకు తీరని నష్టం.. ప్రస్తుతం ఉన్న 63వ జాతీయ రహదారిని విస్తరించడానికి బదులు మరో మార్గంలో కొత్త హైవేను నిర్మిస్తే తక్కువ నష్టంతో సరిపెట్టవచ్చని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. దీంతో వేంపల్లి నుంచి మంచిర్యాల వరకు 125 కిలోమీటర్ల పొడవున కొత్త రహదారిని నిర్మించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ మేరకు సర్వే ప్రక్రియ పూర్తి చేశారు. అయితే, కొత్తగా నిర్మించనున్న ఈ మార్గంలో చేసిన సర్వే ప్రకారం.. మన జిల్లాకు సంబంధించి వందలాది ఎకరాల భూముల్లోంచి ఈ కొత్త రోడ్డు నిర్మించనున్నారు. వేంపల్లి, రెంజర్ల, శెట్పల్లి, తొర్తి, తిమ్మాపూర్, ఏర్గట్ల గ్రామాలకు చెందిన రైతులు విలువైన పంట భూములు కోల్పోనున్నారు. త్వరలోనే నోటిఫికేషన్..! గ్రీన్ హైవే నిర్మాణంలో భాగంగా రోడ్డు నిర్మాణంలో భాగంగా నష్టపోయే చెట్ల స్థానంలో అధిక సంఖ్యలో మొక్కలను నాటడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు, హైవే నిర్మాణానికి సంబంధించిన సర్వే కూడా పూర్తికావడంతో త్వరలోనే భూ సేకరణకు నోటిఫికేషన్‌ను జారీ అయ్యే అవకాశం ఉంది. గ్రీన్ హైవే నిర్మాణానికి సేకరించే భూమికి నష్ట పరిహారం అందించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పరిశీలించనుంది. ఆందోళనలో రైతులు.. అయితే, రహదారి నిర్మాణం కోసం విలువైన భూములు కోల్పోతున్న రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏళ్ల తరబడి ఆ భూములను నమ్ముకుని బతుకుతున్నామని, జీవనాధారమైన భూములు కోల్పోతే ఏం చేసుకుని బతకాలని వాపోతున్నా రు. నష్ట పరిహారం తమకు ముఖ్యం కాదని, కో ల్పోతున్న భూములకు బదులు భూములు ఇవ్వా లని రైతులు చెబుతున్నారు. తరతరాల నుంచి చేస్తున్న వ్యవసాయ భూములను కోల్పోవడం వ ల్ల భారీ మొత్తంలో నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ప్రత్యామ్నాయ మార్గం చూడాలని రైతులు కోరుతున్నారు. అయి తే, రహదారి నిర్మాణాలకు సహకరించాలని నేషన ల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు పేర్కొంటున్నారు. ప్రమాదాల నివారణ, రవాణా సదుపాయం కోసం జాతీయ రహదారుల నిర్మా ణం, విస్తరణ కీలకమైదని వారు చెబుతున్నారు. -
సిఫార్సు ఉంటేనే!
జిల్లాలో వ్యవసాయానికి సంబంధించి ఎటువంటి రాయితీలు కావాలన్నా, సబ్సిడీ పరికరాలు తీసుకోవాలన్నా టీడీపీ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఇన్చార్జుల సిఫార్సులు తప్పనిసరి అని అధికారులు చెబుతుండటంపై విమర్శలు వ్యక్తమ వుతున్నాయి. అర్హులైన రైతులను పక్కనపెట్టి అధికారపార్టీ నేతల బినామీలకు రైతురథం పేరుతో ట్రాక్టర్లను కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్న తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు(సెంట్రల్): జిల్లాకు చెందిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆదేశాలతో ఇష్టా నుసారంగా అధికారపార్టీ నేతల అనుచరులకు ట్రాక్టర్లను పంపిణీ చేయనుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక పక్క మద్దతు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోక పోవడం, ప్రభుత్వం ఇచ్చే రాయితీ ట్రాక్టర్లు తీసుకుందామన్నా టీడీపీ నేతల లేఖలు అధికారులు అడుగుతుండటంతో రైతులకు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రైతురథం అనే కన్నా టీడీపీ రథం అని పేరుపెట్టుకుని నేరుగా వారికే ఇవ్వాలని ఎద్దేవా చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.1.5 లక్షల సబ్సిడీ జిల్లాలో నెల్లూరు మినహా కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, కోవూరు. సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలకు 1,070 రైతు రథం ట్రాక్టర్లను పంపిణీ చేసే విధంగా గత ఏడాది టార్గెట్ విదించారు. వీటికి ఒక్కోదానికి రూ.1.50 లక్షలు సబ్సిడీ ఇచ్చారు. టీడీపీ నేతలు, జిల్లా ఇన్చార్జి మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యే సిఫార్సు చేసిన వారికి మాత్రమే ట్రాక్టర్లు పంపిణీ చేశారు. 2018 సంవత్సరానికి కూడా ఇదే తరహాలో అధికార పార్టీ నేతల సిఫార్సు ఉంటేనే ఇస్తున్నారు. రథాల రాజకీయం గత ఏడాది జిల్లాకు 1,050 ట్రాక్టర్లు మంజూరయ్యాయి. మొదట 700 ట్రాక్టర్లు మాత్రమే వచ్చినట్లు వ్యవసాయ అధికారుల చేత జిల్లాకు చెందిన మంత్రి ప్రకటన చేయించారు. తరువాత తానే జిల్లాకు అవసరం అని ఎక్కువ మొత్తంలో ట్రాక్టర్లు మంజూరు చేయించానని చెప్పుకునేదానికి తిరిగి 1,050 ఇస్తున్నట్లు ప్రకటన చేశారు. ఈ ఏడాది జిల్లాకు 1,300 ట్రాక్టర్లు మంజూరైనట్లు సమాచారం. అయితే ప్రస్తుతం 550 ట్రాక్టర్లు వచ్చినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా 150 ట్రాక్టర్లకు అనుమతి జిల్లాలో రైతురథం ట్రాక్టర్లకు ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలో, ఎక్కడ చేసుకోవాలో ఇంత వరకు అధికారులు ప్రకటన చేయలేదు. అయితే ఇప్పటికే ఈ ఏడాదికి సంబంధించి 150 ట్రాక్టర్లను మంజూరు చేసినట్లు తెలిసింది. వీటిని ఈ వారంలోనే పంపిణీ చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అర్హులైన రైతులకు ఇవ్వాల్సిన ట్రాక్టర్లను ఈ విధంగా పంపిణీ చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి కనుసన్నల్లో జిల్లాకు చెందిన మంత్రి కనుసన్నల్లో టీడీపీ నేతలకు రైతురథం ట్రాక్టర్లను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే మంత్రి సూచనలతో 150 ట్రాక్టర్లను పంపకానికి అధికారులు సిద్ధం చేశారు. మరొకొన్ని ట్రాక్టర్లను మంజూరు చేసే విధంగా అధికారులకు సిఫార్సు లేఖలు పంపిణినట్లు సమాచారం. ఈ విధంగా ఆ మంత్రి తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం చేస్తున్నాం మాకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు, నిబంధనల ప్రకారం నడుచుకుంటాం. కొన్ని ట్రాక్టర్లను ఇప్పటికే మంజూరు చేసిన మాట వాస్తవమే. ట్రాక్టర్లు మంజూరు చేయాలంటే ఇన్చార్జి మంత్రి లేదా నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి సంతకంతో లెటర్ ఉండాలి. అన్నింటినీ పరిశీలించి ట్రాక్టర్లు మంజూరు చేస్తాం .–బి.చంద్రనాయక్, జేడీ, వ్యవసాయశాఖ అధికారపార్టీ వాళ్లకే ఇస్తున్నారు రైతురథం ట్రాక్టర్లు మొత్తం టీడీపీ నేతల సిఫార్సు ఉన్నవారికే గత ఏడాది ఇచ్చారు. ఈ ఏడాది ప్రస్తుతం ఎప్పుడు దరఖాస్తులు చేసుకోవాలే అనే విషయం కూడా తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేస్తున్నారు. అంతా అధికార పార్టీ నాయకుల కనుసన్నులో జరుగుతోంది. –ప్రభాకర్‌నాయుడు, యనమదల, చేజర్ల మండలం అర్హులకు అందడం లేదు ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా ఇచ్చే రైతురైథం పథకంలో అర్హులైన వారికి ట్రాక్టర్లు ఇవ్వడం లేదు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు చెప్పిన వారికి ఇస్తామంటే వ్యవసాయ శాఖ ద్వారా ఇస్తున్నాం అని చెప్పడం దేనికి, నేరుగా టీడీపీ కార్యాలయం నుంచే ఇస్తే సరిపోతుంది కదా. గత ఏడాది అర్హులకు అందలేదు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితిగా ఉంది. –సంకటి రామకృష్ణారెడ్డి, చేజర్ల -
తవ్వుకో.. దోచుకో..
సాక్షి, వరంగల్ రూరల్ : జిల్లాలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. ఆకేరువాగు అడ్డాగా రోజువారీగా టన్నుల కొద్దీ ఇసుక నగరానికి చేరుతోంది. ధనార్జనే ధ్యేయంగా దళా రులు రెచ్చిపోతున్నారు. ఇక వాగుల్లో టన్నుల కొద్దీ ఇసుక తోడుకుంటూ పోతుంటే భూగర్భజలాలు అడుగుంటుతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. కారణమేదైనా ఇలా టన్నుల కొద్దీ ఇసుక తరలించుకుపోతే భూగర్భ జలాలు అడుగంటిపోతాయని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అక్రమ దందాకు అధికారులు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరంగల్ నగరం దగ్గరలో ఉండడంతో ఇసుక దళారుల దందా మూడు పూలు ఆరు కాయలుగా సాగుతోంది. వాల్టాకు తూట్లు.. జిల్లాలో వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మం డలంలోని ఆకేరు వాగుకు చుట్టు పక్కల ఉన్న పచ్చని చెట్లు, పొలాలను ఇసుకాసురులు నేలమట్టం చేస్తున్నారు. రైతుల కంట్లో ఇసుక కొడుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు కోసం వాల్టా(నీరు, భూమి, చెట్టు) చట్టం పకడ్బందీగా అమలు చేయాల్సిన అధికారులే అక్రమార్కులకు కొమ్ము కాస్తూ తూట్లు పొడుస్తున్నారు. అధికారులు మా మూళ్ల మత్తులో జోగుతుండగా అక్రమార్కులు వాల్టా చట్టాన్ని తమ చుట్టంగా చేసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆకేరు వాగు అడ్డాగా.. ఆకేరు వాగు శివారు రైతుల పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. రాత్రికి రాత్రే వారికి తెలియకుండానే పొలాల్లో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. వాగుకు ఆనుకొని మా పొలాలు ఉండడమే శాపంగా మారిందని కర్షకులు కన్నీరు మున్నీరవుతున్నారు. వర్ధన్నపేటలోని కొత్తపల్లి, కూనూరు, ల్యాబర్తి, నందనం, ఇల్లంద, పర్వతగిరి మండలంలోని రోళ్లకల్లు, అన్నారం, నారాయణపురం, కల్లెడ, రాయపర్తి మండలంలోని కొత్తూరు గుండా ఆకేరు వాగు పారుతుంది. ఈ వాగు చుట్టు పక్కల ఉన్న భూముల్లో ఇసుకను తోడేస్తున్నారు. వరంగల్ నగరంతో పాటు, సంగెం, నెక్కొండ, ఐనవోలు మండలాలకు ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఇక్కడి రైతుల పచ్చని పంటలను ధ్వంసం చేస్తూ ఇసుక తవ్వకాలను ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు. ఏళ్లుగా కొనసాగుతున్న ఇసుక అక్రమదందాతో వందల ఎకరాల్లో సాగు భూములు బీళ్లుగా మారుతున్నాయి. రాత్రి వేళల్లో ట్రాక్టర్ల రణగొణ ధ్వనితో దద్దరిల్లుతున్న ఆకేరువాగు తెల్లవారుకాగానే అంతా నిర్మానుష్యంగా మారుతుంది. ఇసుక తవ్వకాలతో చుట్టు పక్క రైతులు విలువైన పంట భూములను కోల్పోవాల్సిన దుస్థితి ఎదురవుతుందని తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. ఆకేరు వాగు పరివాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాల పంచాయితీ రోడ్డెకుతున్నా అధికార ముసుగులో ఉన్న పెద్దలు సామరస్యంగా చక్కబెడుతూ అక్రమ తవ్వకాలకు పచ్చజెండా ఊపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనిపించని దాడులు ఇసుక రవాణాను ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరికలు రెవెన్యూ, పోలీస్ అధికారులు చేయడమే తప్పా దాడులు చేసిన సంఘటన లేవు. పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో ఇసుక వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. స్థానిక పోలీసులు రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో నేరుగా విజిలెన్స్ అధికారులు రంగంలో దిగారు. స్థానిక పోలీసులకు సమాచారం తెలియకుండానే ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. ప్రతీ రోజు వరంగల్, హన్మకొండ, కాజీపేటలకు దాదాపు 300లకు పైగా ట్రాక్టర్లు వస్తున్నాయి. ఆగస్టు 28న విజిలెన్స్ అధికారులు 26 ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో 13, సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో 13 ట్రాక్టర్లను విజిలెన్స్ అధికారులు అప్పగించారు. రాత్రి సమయంలో తవ్వుతున్నట్లు తెలుస్తోంది పగలు సమయంలో ఎలాంటి కార్యకలాపాలు కొనసాగించకుండా రాత్రి సమయంలో తవ్వుతున్నారని సమాచారం అందింది. ఇటీవల రైడ్ చేసి పలు మోటార్లు, ట్రాక్టర్లు సీజ్ చేశాం. త్వరలో దాడులు చేస్తాం. ప్రభుత్వ అనుమతి లేనిది ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. –కనకయ్య, తహసీల్దార్, వర్ధన్నపేట -
ఎరువు భారం 35 కోట్లు
మోర్తాడ్(బాల్కొండ) : అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ధర పెరగడంతో రైతుల పరిస్థితి ఢమాల్ అయ్యింది. డాలర్ ధర పెరగడం వల్ల కాంప్లెక్స్ ఎరువుల ముడిసరుకు ధరకు రెక్కలు తొడిగాయి. దీంతో మూడు నెలల వ్యవధిలో మరోసారి కాంప్లెక్స్ ఎరువుల ధర పెరిగింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగులో యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులను రైతులు ఎక్కువగానే వినియోగిస్తున్నారు. పంటల దిగుబడి పెరగాలంటే కాంప్లెక్స్ ఎరువులను వినియోగించాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. అయితే ధరలు పెరగడం వల్ల పెట్టుబడులు అధికం అవుతున్నాయని వాపోతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా తక్కువ సమయంలోనే కాంప్లెక్స్ ఎరువుల ధరలలో పెరుగుదల కనిపిస్తుండటంతో మూలిగే నక్కపై తాటికాయ పడిందనే చందంగా రైతుల పరిస్థితి తయారైందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జూన్‌లో కాంప్లెక్స్ ఎరువుల ధర ఒక బస్తాపై రూ.100 నుంచి రూ.173 వరకు పెరిగింది. ఇప్పుడు మాత్రం ఒక బస్తాపై రూ.50 నుంచి రూ.100 వరకు పెరిగింది. గతంలో పెరిగిన ధరల వల్ల ఉమ్మడి జిల్లా రైతులపై ఏటా దాదాపు రూ.50 కోట్ల భారం ఏర్పడగా ఇప్పుడు మళ్లీ ధర పెరగడంతో మరో రూ.35 కోట్ల ఆర్థిక భారాన్ని రైతులు మోయాల్సి వస్తోంది. కాంప్లెక్స్ ఎరువుల తయారీకి వినియోగించే ముడిసరుకును ఎరువుల ఉత్పత్తి కంపెనీలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. దిగుమతి సరుకుపై డాలర్ ప్రభావం పడుతుండటంతో కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఇఫ్కో ఉన్నతాధికారులు వెల్లడించారు. కాంప్లెక్స్ ఎరువుల ధర పెరగడం వల్ల ప్రతి రైతు ఒక హెక్టార్‌కు రూ.వెయ్యిని ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. నిజామాబాద్ జిల్లాలో 2.35 లక్షల హెక్టార్లలో, కామారెడ్డి జిల్లాలో 1.72 లక్షల హెక్టార్లలో పంటలను రైతులు సాగు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని రైతులు ఎక్కువగా వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోనూ రైతులు కొంత మేర వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారు. వరి కంటే వాణిజ్య పంటలలోనే కాంప్లెక్స్ ఎరువులను రైతులు ఎక్కువగా వినియోగిస్తారు. డీఏపీ రకం కాంప్లెక్స్ ఎరువు ధర గతంలో రూ.1,295 ఉండగా ఇప్పుడు రూ.1,345కు చేరింది. 20:20 రకం ఎరువు ధర రూ.960 నుంచి రూ.1,025కు చేరింది. 12:32:16 రకం ఎరువు రూ.1175 నుంచి రూ.1275 కు చేరింది. రైతులు ఎక్కువగా డీఏపీతో పాటు 20:20 రకాన్ని వినియోగిస్తున్నారు. డాలర్ ధరలో మార్పు లేక పోతే కాంప్లెక్స్ ఎరువుల ధరలో తగ్గుదల కనిపించకపోవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి కాంప్లెక్స్ ఎరువుల ధరలను నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. డాలర్ ధరలు పెరిగినా కాంప్లెక్స్ ఎరువుల ధరలు మాత్రం పెరగకుండా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. డాలర్ ధరలు పెరగడం వల్లనే.. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ధర పెరగడం వల్లనే కాంప్లెక్స్ ఎరువుల ధరల్లో పెరుగుదల ఏర్పడింది. ముడిసరుకు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అందువల్లనే కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరుగుతున్నాయి. సెప్టెంబర్ ఒకటి నుంచి పెరిగిన ధరలు అమలులోకి వస్తాయి. – మారుతి ప్రసాద్, ఇఫ్కో రాష్ట్ర మేనేజర్ కాంప్లెక్స్ ఎరువుల ధరలను నియంత్రించాలి ప్రభుత్వం స్పందించి కాంప్లెక్స్ ఎరువుల ధరలను నియంత్రించాలి. లేకుంటే రైతులు ఇంకా భారం మోయాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం స్పందించి కాంప్లెక్స్ ఎరువుల ధరలను అదుపులో ఉంచాలి. ధరలు పెరగడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. – ఒల్లాడపు గంగారాం, రైతు, తిమ్మాపూర్ పెట్టుబడులు అధికం అవుతున్నాయి కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడం వల్ల మాకు పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి. ప్రభుత్వం స్పందించి రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలి. రైతులు ఇప్పటికే ఎన్నో కష్టాల్లో ఉన్నారు. ఎరువుల ధరలు పెరగడం వల్ల మరింత ఇబ్బంది పడుతారు. – కొప్పుల భాజన్న, రైతు, మోర్తాడ్ -
ఇది కొత్త ఉత్సాహం
ప్రగతి నివేదన సభకు పదపదమంటూ రైతులు ఉత్సాహంగా బైలెల్లారు. నేతల ఫ్లెక్సీలతో అలంకరించుకున్న ట్రాక్టర్లు బండెనక బండి.. వేలాది బండ్లు అన్నట్లు జాతర మాదిరిగా తరలివెళ్లాయి. హోరెత్తిన తెలంగాణ పాటలు, డీజే మోతలతో ఉర్రూతలూగించాయి. ఎటుచూసినా ఇక్కడే నివేదన సభ.. అన్నట్లుగా ట్రాక్టర్ల సందడి కనిపించింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఖమ్మం నగరంలో సందడి నెలకొంది. కాగా.. టీఆర్ఎస్ కార్యకర్తల కోలాహలం నడుమ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ జెండా ఊపి ప్రదర్శనను ప్రారంభించారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్ నడపగా.. పక్కనే ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ తదితరులు కూర్చున్నారు. ఖమ్మం మయూరిసెంటర్ : రెండో తేదీన హైదరాబాద్‌లో జరిగే ప్రగతి నివేదన సభలో పాల్గొనేందుకు రైతులు వందలాది ట్రాక్టర్లలో తరలిరావడం, ఉత్సాహంగా ప్రదర్శన వెళుతుండడం కొత్త ఉత్సాహాన్నిస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మంజిల్లాకు చెందిన రైతులు 1890ట్రాక్టర్ల ద్వారా శుక్రవారం ప్రదర్శనగా బయలుదేరి వెళ్లారు. ఈ ర్యాలీకి ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ గుమ్మడికాయ కొట్టగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ పొంగులేటి స్వయంగా ట్రాక్టర్‌ను నడిపి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ..రైతు కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో రూ.5లక్షల బీమాను వర్తించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాని ప్రారంభించారన్నారు. పెట్టుబడి కోసం ఎవరి వద్ద చేయి చాచకుండా ఎకరానికి రూ.4వేలు పెట్టుబడి సాయం చేస్తున్నారన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, మార్కెట్ల ను ఆధునీకరించడం, పంట ఉత్పత్తులను దాచుకునేందుకు గిడ్డంగులను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. రైతులకు తమ పార్టీ చేసిన మేలు గతంలో ఏ పార్టీ చేయలేదన్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా రైతులు తమవెంటే ఉంటారని తెలిపారు. అన్నదాతకు సేవలు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు వారే స్వచ్ఛందంగా తరలిరావడం గొప్ప కార్యక్రమం అన్నారు. భవిష్యత్‌లో రైతాంగానికి మరిన్ని మంచి కార్యక్రమాలు అందించేందుకు, సేవలు చేసేందుకు కేసీఆర్‌ను ఆశీర్వదించడానికి రైతులు ప్రగతినివేదనసభకు తరలి వెళ్తున్నారన్నారు. ఇంత భారీ ప్రదర్శనను నిర్వహిస్తున్న ఎంపీకి రాష్ట్ర పార్టీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. రైతులు నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో యువత పాల్గొని అండగా నిలవాలన్నారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపేందుకే..: ఎంపీ పొంగులేటి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 2వ తేదీన కొంగరకలాన్‌లో జరిగే ప్రగతి నివేదన సభ ద్వారా తమకు సేవ చేసిన రైతుబాంధవుడికి కృతజ్ఞత తెలుపుకునేందుకే రైతులు స్వచ్ఛందంగా తరలివస్తున్నారన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 51నెలల్లో సాధించిన ప్రగతిని, ప్రజలకు చేసిన సేవలను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ద్వారా ప్రజల ముందు ఉంచుతారని తెలిపారు. 28 లక్షల మంది ఈ నివేదన సభలో పాల్గొనేలా ఏర్పాట్లు జరిగాయన్నారు.సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుకునేందుకు మంచి అవకాశం వచ్చిందంటూ జిల్లా రైతాంగం స్వచ్ఛందంగా నివేదన సభకు తరలివస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలు పలు కారణాలతో రైతుల నుంచి డబ్బులు వసూలు చేశాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి చెల్లిస్తుందన్నారు. ఖమ్మం నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన సూర్యాపేట, నల్లగొండ మీదుగా ప్రగతినివేదన సభా ప్రాంగణానికి చేరుకుంటుందని, చివరలో తాను కూడా వీరితో కదలివెళ్తానని వివరించారు. రెండు రోజుల పాటు రైతులకు అవసరమైన వసతి, భోజన సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు, మేయర్ పాపాలాల్, నల్లమల వెంకటేశ్వరరావు, సాధు రమేష్‌రెడ్డి, లింగాల కమల్‌రాజు, తాతా మధు, కమర్తపు మురళి, బొమ్మెర రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
కూలీలను రైతులుగా చూపి 15కోట్లు బ్యాంక్ లోన్
-
భూసేకరణ జీవో చెల్లదు
తాటిచెట్లపాలెం (విశాఖపట్నం): రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా వేల ఎకరాలు భూసేకరణ చేస్తోందని, ఇది సరైన పద్ధతిలో జరగట్లేదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 2018 మార్చిలో విడుదల చేసిన జీవో నంబర్ 118, పార్లమెంట్ చట్టం 113కు పూర్తి వ్యతిరేకమన్నారు. విశాఖపట్నంలోని పౌరగ్రంథాలయంలో శుక్రవారం ‘భూసేకరణ– పరిష్కారం’ అనే అంశంపై జరిగిన సెమినార్లో జస్టిస్ గోపాలగౌడ మాట్లాడారు. భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆయన విమర్శలుగుప్పించారు. ప్రభుత్వం భూసేకరణ చేయాల్సి వస్తే ముందుగా గ్రామసభ ఆమోదం పొందాలని, ప్రజల అభిప్రాయాలు సేకరించాల్సి ఉంటుందని, ఆ తర్వాత వారికి తగు నష్టపరిహారం, ప్రతిగా స్థలం ఇవ్వాలని, అలాగే బాధితులకు జీవనాధారం చూపించాల్సి ఉందని వివరించారు. భూసేకరణ అనేది హౌసింగ్ స్కీం కోసమైతే అక్కడి పరిస్థితులు నివాసయోగ్యతకు అనుకూలంగా ఉండాలని, పర్యావరణ అనుమతులు ఉండాలని పార్లమెంట్లో చేసిన చట్టంలో స్పష్టంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో ఆమెదం పొందాలంటే గవర్నర్ అనుమతి ఉండాలని, కానీ ఇష్టానుసారంగా చేసిన ఆ జీవో చెల్లదని, అలాంటి జీవో బంగాళాఖాతంలో కలిపేయడమేనని వ్యాఖ్యానించారు. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేస్తే అది రాష్ట్రపతి ఆమోదం పొందాలని కాని ఇక్కడ అలాంటి నిబంధనలేవీ పాటించలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవేమీ పాటించకుండా పారిశ్రామిక కారిడార్ల, విశ్వవిద్యాలయాలు, రహదారుల పేరిట పేద, మధ్య తరగతుల రైతుల నుంచి బలవంతంగా లక్షల, వేల ఎకరాలు భూసేకరణ చేస్తోందని జస్టిస్ గోపాలగౌడ దుయ్యబట్టారు. రైతుల్ని వేధిస్తూ భూసేకరణ రాష్ట్రంలో పెట్రో యూనివర్సిటీకి 250 ఎకరాలు అవసరమైతే దీని పేరిట 750 ఎకరాలు సేకరించేందుకు కుట్రపన్నుతున్నారని జస్టిస్ గోపాలగౌడ పేర్కొన్నారు. అయితే దీని కోసం ఇంతవరకు పర్యావరణ అనుమతులు కూడా తీసుకోలేదని వివరించారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు రాజ్యాంగాన్ని కాపాడాలని, కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం బలవంతంగా ప్రజల్ని, రైతుల్ని వేధిస్తూ భూసేకరణ చేస్తోందన్నారు. అభివృద్ధికి ఎవరూ ఆటంకం కాదని, కానీ అభివృద్ధి పేరిట సంవృద్ధిగా పంటలు పండే వేల, లక్షల ఎకరాలు సేకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు. రైతులంతా ఏకమై పోరాడితే అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. కొందరు రైతులకు పట్టాలు లేనందున వారికి తక్కువ నష్టపరిహారం ఇచ్చేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అయితే వారు దశాబ్దాలుగా ఆ భూమిని సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, అలాంటి సందర్భంలో ఆ భూములకు వారే హక్కుదారులని చట్టం చెబుతోందన్నారు. ప్రభుత్వాలు ప్రజలను కాపాడడానికి ఉండాలిగాని వారిని బిచ్చగాళ్లను చేయడానికి కాదని తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం పనిచేసేది కేవలం పట్టణ ప్రజల కోసమేనా? గ్రామీణులు, రైతుల కష్టాలు పట్టవా అని ప్రశ్నించారు. సమావేశంలో íసీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్.నరసింగరావు, సీపీఐ నేతలు గంగారాం, కె.లోకనాథం, బాధిత రైతులు పాల్గొన్నారు. ఓటుతో బుద్ధి చెప్పాలి! పారిశ్రామిక ప్రాంతం కోసం భూసేకరణ చేయదలిస్తే ఆ ప్రాంతంలో ఎంత మందికి ఉపాధి దొరుకుతుంది.. లాభనష్టాలు, ప్రాజెక్టు రిపోర్టులు తదితర అంశాలతో, వివిధ శాఖల అనుమతులతో మాత్రమే చేయాల్సి ఉంటుందని జస్టిస్ గోపాలగౌడ తెలిపారు. మన దేశ జనాభాలో 70 శాతం మంది గ్రామీణులేనని, వీరి జీవనాధారం పాడి పంటలు, ఫలసాయమేనని వివరించారు. మరి అలాంటి సాగు భూముల్ని బలవంతంగా ప్రభుత్వాలు తీసేసుకుంటే ప్రజలు ఏం చేయాలని ప్రశ్నించారు. ప్రజలంతా ఏకమై అలాంటి నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపిచ్చారు. -
కక్ష సాధింపు!
రాజధాని గ్రామమైన ఉండవల్లి రైతులపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు తెగబడుతోంది. పూలింగ్ ప్రక్రియను మొదటి నుంచి ఈ గ్రామానికి చెందిన రైతులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా ఏకపక్ష ధోరణితో ముందుకు వెళ్లింది. ప్రభుత్వ నిరంకుశత్వంపై రైతులంతా కలిసి ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఉండవల్లిలో భూములను సేకరించవద్దని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆర్డర్‌ను సైతం పక్కన పెట్టిన ప్రభుత్వం.. తన ఆగడాలను రెట్టింపు చేసింది. రైతుల అనుమతి లేకుండానే గ్రామ పొలాల్లో నుంచి విద్యుత్ తీగలు లాగిస్తోంది. సాక్షి, అమరావతిబ్యూరో : ఉండవల్లి గ్రామంలోని రైతుల పొలాల్లో నుంచి హైటెన్షన్ విద్యుత్ తీగలు లాగేందుకు గురువారం అధికారులు సిద్ధమయ్యారు. తమ అనుమతి లేకుండానే తీగలు ఎలా లాగుతారని ప్రశ్నించిన రైతులపై ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడింది. తీగలు లాగడాన్ని అడ్డుకున్న రైతులను పోలీసులు ఈడ్చిపారేసి మంగళగిరి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అమరావతికి కొండవీటి వాగు నుంచి ముంపు బెడద తప్పించడానికి ప్రకాశం బ్యారేజి సీతానగరం వద్ద రూ.237 కోట్లతో ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 16 మోటార్లను ఏర్పాటు చేసి వరద సమయంలో కొండవీటి వాగు నీటిని కృష్ణా నదిలోకి ఎత్తిపోయనున్నారు. ఇందుకోసం అవసరమైన సబ్‌స్టేషన్‌ను కొండవీటివాగు హెడ్ స్లూయిస్ వద్ద ప్రభుత్వం చేపట్టింది. దీనికి మంగళగిరి మండలం నులకపేట 130 కేవీ సబ్‌స్టేషన్ నుంచి గుంటూరు చానల్ మీదుగా హైటెన్షన్ విద్యుత్ తీగలు లాగుతున్నారు. వాగు వద్దకు వచ్చే సరికి తీగలు రైతుల పొలాల్లో నుంచి వెలుతున్నాయి. సుమారు 9 ఎకరాల్లో నుంచి తీగలను వేశారు. రైతులు ఎదురుతిరిగినా పోలీసుల సాయంతో వారిని అరెస్ట్ చేయించి మరీ తీగలు లాగారు. విడతల వారీగా రైతులు కాపలా.... నెలన్నర రోజుల కిందట ప్రభుత్వం ఇలాగే నియంతృత్వంగా వ్యవహరించడంతో రైతులంతా కలిసి ఎదురుతిరగడంతో అప్పట్లో అధికారులు వెనుతిరిగారు. అప్పటి నుంచి రైతులు విడతల వారీగా రేయింబవళ్లు తమ పొలాల్లో కాపలా ఉంటూ వచ్చారు. ఎప్పుడు ఎవరూ వచ్చి తీగలు లాగుతారోనని భయం భయంగా గడిపారు. గురువారం ఉదయం అధికారులు చడీచప్పుడుకాకుండా వచ్చి పోలీసుల సాయంతో రైతులను అరెస్ట్ చేయించి తమ పనికానిచ్చేశారు. కోట్లలో నష్టపోనున్న బాధిత రైతులు... ఉండవల్లి రైతులు మొదటి నుంచి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. మూడు పంటలు పండే భూములను వదులుకునేది లేదని తేల్చి చెబుతూ వచ్చారు. ప్రభుత్వ నియంతృత్వ విధానాలను అడ్డుకుని, వాటిని కోర్టులో సవాల్ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం తీగలు లాగిన పొలాలు మాస్టర్ ప్లాన్ ప్రకారం రెసిడెన్షియల్ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతం గుండా తీగలు లాగడం వల్ల భూముల ధరలు భారీగా పడిపోవడంతో పాటు వీటిని కొనేందుకు ఎవరూ ముందుకురారని బాధిత రైతులు వాపోతున్నారు. భవిష్యత్తులో ఈ భూమిని డెవలప్ చేసుకోవాలన్నా, భవంతులు కట్టుకోవాలన్నా హై టెన్షన్ వైర్లు ఉండడం వల్ల నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని... ఇక జీవితాంతం ఈ భూమిని వదిలేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరా భూమి రూ.10 కోట్ల మేర పలుకుతోందని రైతులు చెబుతున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు విషయంలోనూఎదురు దెబ్బ కనకదుర్గా వారధి నుంచి తుళ్లూరు మండలంలోని బోరుపాలెం వరకు 21 కిలోమీటర్ల నిర్మించనున్న సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఉండవల్లి రైతులు తమ భూములను ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వం ఆ భూములను సేకరించాలని నిర్ణయించి నోటిఫికేషన్ జారీ చేసింది. భూ సేకరణ కోసం ప్రభుత్వం నిబంధనలు ఉల్లఘిస్తోందని, తప్పులతడకగా సర్వే చేసిందని సాక్ష్యాధారాలతో సహా రైతులంతా హైకోర్టును ఆశ్రయించడంతో రోడ్డు కోసం సేకరించాలనుకున్న 153 ఎకరాలపై తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. -
పొలాల్లో హై‘టెన్షన్’
తాడేపల్లి రూరల్: రాజధానికోసం భూములివ్వని రైతులపై ప్రభుత్వ దమనకాండ కొనసాగుతూనే ఉంది. తాజాగా గురువారం ఉండవల్లిలో రైతుల పంటపొలాల్లోంచి హైటెన్షన్ వైర్లు లాగేందుకు సిద్ధమైన విద్యుత్‌శాఖ అధికారులు భారీగా పోలీసులను వెంటపెట్టుకుని వచ్చారు. ఆందోళన చెందిన రైతులు హడావుడిగా పంటపొలాలకు చేరుకుని వైర్లు లాగడాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో రైతులు తమకు ఆత్మహత్యే శరణ్యమంటూ పురుగుమందు డబ్బాలు, పెట్రోలు బాటిళ్లను బయటకు తీయగా.. వారిని పోలీసులు బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వైర్లు లాగుతాం.. ఏం చేస్తారు? గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాలను ప్రభుత్వం రాజధానిగా ప్రకటించినప్పటినుంచి భూములివ్వని రైతులను ఏదోవిధంగా బెదిరిస్తూ దమనకాండకు పాల్పడుతూనే ఉంది. ఈ క్రమంలో గురువారం ఉదయం ఉండవల్లిలో రైతులకు చెందిన ఎనిమిది ఎకరాల పంటపొలాల్లోంచి హైటెన్షన్ వైర్లు లాగేందుకు సిద్ధమైన విద్యుత్‌శాఖ అధికారులు భారీగా పోలీసు బలగాలను వెంటపెట్టుకుని వచ్చారు. ఇది తెలుసుకున్న ఆయా పొలాలకు చెందిన 18 మందికిపైగా రైతులు హడావుడిగా సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అధికారులతో మాట్లాడుతుండగానే.. కాంట్రాక్టరు హైటెన్షన్ వైర్లు లాగేందుకు సిద్ధమవడంతో ఆగ్రహానికి లోనైన రైతులు అడ్డుకున్నారు. వారిని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగానే.. విద్యుత్ అధికారులు మళ్లీ వైర్లు లాగే ప్రయత్నం చేశారు. అంతేగాక.. వైర్లు లాగుతాం, ఏం చేస్తారో చెయ్యండంటూ రైతులపై విరుచుకుపడ్డారు. దీనిపై రైతులు.. అన్నం పెట్టే అన్నదాతలు మిమ్మల్నేం చేయగలరు. పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోవడం తప్ప అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కాస్త వెనక్కి తగ్గిన తహసీల్దార్.. వారిని బుజ్జగించేందుకు ప్రయత్నించారు. వైర్లు వెళ్లే స్థలాలకు కూడా జిల్లా కలెక్టర్ నష్టపరిహారం ఇస్తారంటూ చెప్పగా.. ఎలా ఇస్తారంటూ రైతులు ప్రశ్నించారు. దానికి అధికారులు సమాధానం చెప్పకుండా వైర్లు లాగుతామంటూ ముందుకెళ్లారు. దాంతో రైతులు తమ జేబుల్లోనుంచి పురుగుమందు డబ్బాలు, పెట్రోలు బాటిళ్లు బయటకు తీశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం ఆరుగురు రైతులను పోలీసులు బలవంతంగా జీపులో మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరోవైపు మహిళా రైతులను పంటపొలాలనుంచి బలవంతంగా బయటకు గెంటేశారు. అనంతరం హైటెన్షన్ వైర్లను లాగే ప్రక్రియ చేపట్టారు. అదుపులోకి తీసుకున్న రైతులను గురువారం సాయంత్రం పూచీకత్తుపై వదిలిపెట్టారు. -
ఉండవల్లిలో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, అమరావతి : తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తల పరిస్థితులు నెలకొన్నాయి. తమ అనుమతి లేకుండానే పంటపోలాల్లో కరెంట్ హైటెన్షన్ లైన్ ఏర్పాటు చేస్తున్నారంటూ ఉండవల్లి గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. హైటెన్షన్ లైన్లను ఏర్పాటు చేస్తున్న అధికారులను అడ్డుకున్నారు. దీంతో భారీగా పోలీసు బలగాలను రంగంలోకి దించి హైటెన్షన్ లైన్‌ను ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. రైతులు పెద్దఎత్తున గుమిగూడి హైటెన్షన్ లైన్ ఏర్పాటుచేయ్యొదంటూ ఆందోళనకు దిగారు. దీంతో రైతులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. హైటెన్షన్ లైన్ ఏర్పాటు వ్యతిరేకంగా రైతులు పురుగుల మందు తాగేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఉండవల్లి పొలాల్లో ఉద్రిక్తత
-
ఆశలు.. మోసులు
జిల్లాలో రబీ సీజన్ సాగుపై ఆశలు మోసులెత్తుతున్నాయి. జిల్లా వ్యవసాయానికి సోమశిల, కండలేరు జలవనరులే కీలకం. అటువంటి జలాశయాలు ప్రస్తుతం నిండుకున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నా.. జిల్లాలో ఊరిస్తున్న మేఘాలు జల్లుకురిసే వరకు నిలవడం లేదు. ఈ పరిస్థితితో వర్షాలు జిల్లాకు మొహం చాటేస్తున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా కృష్ణా జలాలు సోమశిలకు వస్తుండడంతో జిల్లా రైతులు రబీ సాగుపై ఆశలు పెట్టుకుంటున్నారు. వర్షం ఊరిస్తుందా.. ఊతమిస్తుందా అనేది చూడాల్సి ఉంది. నెల్లూరు(సెంట్రల్): జిల్లాలో వ్యవసాయం సాగుకు తలమానికంగా ఉన్న సోమశిల, కండలేరు రిజర్వాయర్లు ప్రస్తుతం నిండుకున్నాయి. సోమశిల 71 టీఎంసీలు, కండలేరు 68 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉన్నాయి. అయితే కొన్నేళ్లుగా రెండు రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండిన దాఖలాలు లేవు. సోమశిల కింద గతంలో గరిష్టంగా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. కండలేరు కింద జిల్లాలో 2.54 జిల్లాలో ఆయకట్టు ఉంటే.. చిత్తూరు జిల్లాలో 46 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. నీటి స్టోరేజీని బట్టి ఏటా ఆయకట్టు విస్తీర్ణాన్ని స్థిరీకరిస్తున్నారు. ఊరిస్తుందా..! ఊతమిస్తుందా!! సాధారణంగా సోమశిల జలాశయం నుంచి 18 నుంచి 20 టీఎంసీలు ఉంటేనే అరకొర నీరు వదులుతారు. కండలేరు పరిస్థితి కూడా అంతే. 8.8 టీఎంసీల నీరు నిల్వ ఉంటేనే సాగుకు నీటిని విడుదల చేస్తారు. ప్రస్తుతం 3.8 టీఎంసీలు మాత్రమే ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో నీరు లేకపోవడంతో చాలా తక్కువ శాతం సాగు చేశారు. అయితే సోమశిల జలాశయంలో కొద్ది రోజుల వరకు 9 టీఎంసీల నిల్వ ఉండేది. ఇటీవల కృష్ణా జలాలు విడుదల కావడంతో సాగుపై కాసింత ఆశలు మొలకెత్తాయి. బుధవారం సాయంత్రానికి 18.587 టీఎంసీల నీరు నిల్వ ఉంది. బుధవారం 16,440 క్యూసెక్కుల వంతున కృష్ణానది జలాల రాక కొనసాగింది. గతేడాది కూడా జిల్లాలో వర్షాలు కురవలేదు. ఎగువ ప్రాంతాల నుంచి జలాశయాలకు నీళ్లు రావడంతో రబీ సాగు గట్టెక్కింది. ప్రస్తుతం పరిస్థితులు జిల్లాలో వర్షాలు కురవకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు సోమశిలకు రావడంతో అక్టోబరు నుంచి ప్రారంభం కానున్న రబీ సీజన్‌పై రైతులు ఆశలు పెట్టుకుంటున్నారు. చిత్తడి జల్లులతో సరి.. రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. కానీ జిల్లాలో మాత్రం తుంపర్లతో సరిపెడుతున్నాయి. గతేడాది కూడా పడాల్సిన సాధారణ వర్షపాతం కన్నా 55 శాతం తక్కువగా నమోదైంది. దీంతో రబీ అంతంత మాత్రంగా గట్టెక్కినా.. ఖరీఫ్‌లో అనుకున్నంతగా సాగు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇటీవల జిల్లాలో 45 మండలాలను కరువుగా కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది రబీ సీజన్ ముంచుకొస్తున్నా.. వర్షాలు సమృద్ధిగా కురవాల్సిన రోజులు దాటిపోతున్నా.. నీటి నిల్వల పరిస్థితి రైతాంగాన్ని కలవరపెడుతుంది. జిల్లాలో ఏడాది కూడా ప్రస్తుత సమయానికి పడాల్సిన వర్షాలు కూడా పడలేదు. ఈ ఏడాది పరిస్థితి ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుండడంతో రబీ ప్రారంభం ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే రబీలో కొంత, ఖరీఫ్‌లో పూర్తిస్థాయిలో నష్టాలు చవిచూసిన రైతులు ఈ ఏడాది రబీలోనైనా గట్టెక్కాలనుకుంటే వరుణుడు కనికరించక పోవడంతో వర్షాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడూ ఈ విధంగా లేదు ప్రస్తుతం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సాగు, తాగుకు నీరు ఇబ్బందికరంగా మారింది. భూగర్భ జలాలు ఎండిపోయాయి. బోర్లు వేద్దామన్నా నీరు పడే పరిస్థితి లేదు. దీంతో వర్షాలపై ఆధారపడి సాగు చేసే పంటల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వమే ప్రత్యామ్నాయం చూపాలి. – కొప్పోలు యల్లారెడ్డి, ఆత్మకూరు జేడీ వ్యవసాయశాఖఆందోళన కలిగిస్తుంది ప్రస్తుతం కొంత కాలం నుంచి వర్షాలు లేకపోవడంతో ఎక్కువగా రాపూరు మండలంలో కరువు ఏర్పడింది. ఈ ప్రాంతంలో వర్షాలపై ఎక్కువగా ఆధార పడి సాగు చేస్తారు. కానీ పరిస్థితి చూస్తుంటే వర్షాలు లేకపోతే ఈ ఏడాది పంట ఏ విధంగా సాగుచేయాలో ఆందోళన కలిగిస్తుంది.– టి హరగోపాల్, రాపూరు ప్రత్యామ్నాయ పంటలను చూస్తాం ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో అనుకున్నంతగా సాగు చేయలేదు. కానీ మరో నెల తర్వాత రబీ ప్రారంభం కానుంది. అప్పటికీ వర్షాలు లేకపోతే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఈ విషయంపై త్వరలోనే రైతులకు అవగాహన కల్పిస్తాం. రబీకి విత్తనాలు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. – బీ చంద్రనాయక్, -
బతుకుపై బండ'రాయి'
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలోని నాగల్గిద్ద మండలం మేత్రి రాందాస్‌కు రాళ్లలతో నిండిన ముప్పావు ఎకరం భూమి ఉంది. దానిపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అందులో పంటలు సరిగా పండక కుటుంబంతో సహా ఉపాధి కోసం వలస బాట పట్టాడు. వర్షాలకు మాత్రమే పంటలు పండే ఆ భూముల్లో వర్షాభావంతో ఇప్పటికే వేసిన పెసర పంట సగానికి పైగా ఎండిపోయింది. నారాయణఖేడ్ ప్రాంతంలో రాళ్ల భూముల్లో రైతులు చేస్తున్న ‘కష్టాల సాగు’కు రాందాస్ కథ అద్దం పడుతోంది. నారాయణఖేడ్ ప్రాంతంలో వేలాది ఎకరాల్లో రాళ్ల భూమి విస్తరించి ఉంది. వీటిపైనే ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఎలాంటి నీటి ఆధారం లేకపోవడంతో పూర్తిగా వర్షాధార పంటలను సాగు చేస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు. వర్షాధార పంటలు జొన్న, పెసలు, మినుములు తదితరాలను పండిస్తున్నారు. నియోజకవర్గంలోని నాగల్గిద్ద, మనూరు, కంగ్టి మండలాల్లో ఈ తరహా ‘ఎర్ర నేలలు’ఎక్కువగా ఉన్నాయి. పలుగు రాళ్లతో కూడిన ఈ భూములను స్థానికంగా ఎర్ర మొరం భూములు లేదా పడావు భూములుగా వ్యవహరిస్తారు. పూర్తిగా రాళ్లతో కూడిన ఈ భూమిలో భూగర్భ జల జాడలు ఎక్కడా కనిపించడం లేదు. బావుల తవ్వకానికి ఈ భూములు అనుకూలం కావని రైతులు చెబుతున్నారు. 300–400 అడుగుల లోతు వరకు బోర్లు వేసినా చుక్క నీరు పడలేదని కొందరు రైతులు చెబుతున్నారు. దీంతో వర్షాధార పంటలపైనే ఆధారపడుతున్నారు. నాకు ఉన్న భూమితో పాటు మరో ఎకరా కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నా. నువ్వులు, అవిశెలు వంటి గడ్డి జాతి పంటలు పండిస్తున్నా. రాళ్ల భూమి కాబట్టి వేరే పంటలు వేసే అవకాశం లేదు. ఈ భూముల్లో సాగు చేసినా లాభం లేదనే ఉద్దేశంతో చాలా మంది పంటలు వేయడం మానేశారు. వర్షం ఎక్కువ కురిసినా నీటి జాలుతో వేర్లు కుళ్లిపోయి పంటలు దెబ్బతింటాయి. ఈ భూములకు ఎకరా కౌలుకు రూ.5 వేలు ఇవ్వడం కూడా కష్టమే. ఏవైనా ఫ్యాక్టరీలు, తోటలు పెడితే ఏదన్నా ప్రయోజనం కలుగుతుంది. – బక్కప్ప, రైతు, నాగల్గిద్ద మాకు ఐదెకరాల భూమి ఉంది. ఎలాంటి నీటి ఆధారం లేదు. వర్షాధార పంటలు కంది, పెసర, జొన్న వేస్తున్నాం. పూర్తిగా రాళ్లతో కూడిన భూమి కావడంతో పత్తి, వరి పంటలు వేసేందుకు మాకు అవకాశం లేదు. ఏటా దుక్కి దున్నేందుకు రూ.10 వేలకు పైగా ఖర్చు అవుతుంది. వర్షాలు లేకపోతే పంట చేతికందే పరిస్థితి ఉండదు. ఎకరాకు ఒక్కో సారి క్వింటాలు కందులు కూడా పండవు. వానలు పడితే చేనులో పని చేసుకుంటం. లేదంటే తలోదారిన వేరే పనికి వెళ్తాం. – శాంతాబాయి, బంగ్లా తండా,నాగల్గిద్ద మండలం వర్షం లేకుంటే ఉపాధి బాటే.. తొలకరి మొదలవ్వగానే జొన్నలు, కందులు, పెసలు, మినుములు తదితర పంటలు వేస్తారు. జొన్న కొంత మేర వర్షాభావాన్ని తట్టుకోవడం, పెసలు, మినుములు తక్కువ కాల వ్యవధిలో దిగుబడి రావడంతో రైతులు వీటి సాగుపైనే మొగ్గు చూపుతున్నారు. రాళ్లతో కూడిన భూమిని దుక్కి దున్నేందుకు ఏటా వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. ఒకసారి రాళ్లను తొలగించినా, ఆ నేలల స్వభావం వల్ల మరుసటి సంవత్సరం కూడా మళ్లీ రాళ్లు వస్తాయని అంటున్నారు. వర్షాలు ఎక్కువ కురిస్తే మృత్తిక క్షయం జరుగుతోందని, తక్కువ పడితే పంటలు ఎండిపోయి పెట్టుబడి కూడా రావడం లేదని చెబుతున్నారు. దీంతో వేలాది ఎకరాలు నిరుపయోగంగా ఉన్నాయి. సాగు నీరు అందించడం లేదా పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తేనే తమకు ప్రయోజనం కలుగుతుందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు అమ్ముడుపోయిన ఈ భూములు ప్రస్తుతం ఎకరాకు రూ.2 లక్షల పైనే ధర పలుకుతున్నాయి. -
కనికరం ‘కరువు’
సాక్షి, అమరావతి: రైతులపై ఈ సర్కారు కాస్తయినా కనికరం చూపడం లేదు. కళ్లెదుట కనిపిస్తున్న కరువుకు పరదా కప్పేసింది. ప్రభుత్వ వాతావరణ శాఖ అధికారిక గణాంకాల ప్రకారమే 395 మండలాల్లో వర్షాభావ పరిస్థితి ఉంది. సాధారణం కంటే తక్కువ వర్షం కురిసినందున రాష్ట్రంలో 395 మండలాలు లోటు వర్షపాతం జాబితాలో ఉన్నట్లు వాతావరణ శాఖ నివేదికలు తేల్చి చెబుతుండగా, ప్రభుత్వం 275 మండలాలనే కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. మిగిలిన 120 మండలాలు ‘పచ్చ’గా ఉన్నట్లు నివేదికల్లో చేర్చేసింది. కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తే ఈ 120 మండలాల్లోనూ పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ భారాన్ని తగ్గించుకోవాలనే రకరకాల నిబంధనలు పేరిట 120 మండలాలను కరువు జాబితాలో చేర్చలేదు. ఏటా ఇదే తంతు కరువు బారిన పడిన రైతాంగాన్ని ఉదారంగా ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కరువు మండలాలను పూర్తిస్థాయిలో ప్రకటించకపోవడం, పెట్టుబడి రాయితీ బకాయిలను ఎగ్గొట్టడం చంద్రబాబు సర్కారుకు అలవాటే. 2014 జూన్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రూ.2,350 కోట్ల మేర పెట్టుబడి రాయితీ బకాయిలను ఎగవేశారు. 2015లో దుర్భిక్ష మండలాలను సగానికి కుదించారు. 2016లోనూ అలాగే చేశారు. 2017 ఖరీఫ్‌లో పంటలన్నీ ఎండిపోయినా సెప్టెంబర్, అక్టోబర్‌లో అల్పపీడనాల వల్ల కురిసిన వర్షాన్ని లెక్కలోకి తీసుకుని కరువు లేదని ప్రకటించడం ద్వారా రైతులను దగా చేశారు. 2017 రబీలో 350 మండలాల్లో వర్షపాతం లోటు ఉన్నా 121 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. పడిపోయిన సాగు విస్తీర్ణం ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జూన్, జూలై నెలల్లో ఏడు జిల్లాల్లో లోటు వర్షపాతం ఉంది. ఇందులో గుంటూరు జిల్లా కూడా ఉంది. గుంటూరు జిల్లాలో 18, విజయనగరం జిల్లాలో 10 మండలాల్లో వర్షాభావ పరిస్థితులున్నా ఒక్క మండలాన్ని కూడా కరువు జాబితాలో చేర్చలేదు. జూన్, జూలై నెలల్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఆరు జిల్లాల్లో 275 కరువు మండలాలను ప్రకటించినట్లు ప్రభుత్వం ఈ నెల 8న జారీచేసిన జీవోలో పేర్కొంది. అనంతపురం జిల్లాలో 63 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాల్సి ఉండగా, 44, కర్నూలు జిల్లాలో 54 మండలాలకు గాను 37, చిత్తూరులో 66 మండలాలకు గాను 58 మండలాలనే కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ ఖరీఫ్‌లో 23.07 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు కావాలన్నది లక్ష్యం కాగా.. 9.6 లక్షల ఎకరాల్లోనే సాగైంది. 2016తో పోల్చితే ఈ సంవత్సరం ఖరీఫ్ సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోయింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 2016 జూన్, జూలై నెలల్లో 13,93,933 హెక్టార్లలో పంటలు సాగు కాగా.. ఈ ఏడాది ఇదే కాలంలో సాగు విస్తీర్ణం 8,04,844 హెక్టార్లకు పడిపోయింది. 2016తో పోల్చితే ఈ ఏడాది 5.89 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు తగ్గిపోవడం కరువు తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్రంలో జూన్, జూలై నెలల్లో సాధారణంగా 247.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ ఏడాది 215.5 మిల్లీమీటర్ల వర్షమే కురిసింది. రైతాంగాన్ని ఆదుకోవాలి ‘‘రాష్ట్రంలో దుర్భిక్షం తీవ్రత కళ్లకు కనిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో కరువు మండలాలను ప్రకటించకపోవడం దారుణం. రైతాంగాన్ని మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన సర్కారు ఇలా కరువును దాచేయడం ఏమాత్రం సమంజసం కాదు’’ – నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు -
‘ఖరీఫ్ కంది 75% కొనుగోలు చేయండి’
సాక్షి, హైదరాబాద్: ఈ ఖరీఫ్‌లో సాగవుతున్న కంది ఉత్పత్తిలో 75% మేర కేంద్రమే కొనుగోలు చేయాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కోరనుంది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు త్వరలో కేంద్రానికి లేఖ రాయనున్నారు. కేంద్ర అర్థ, గణాంక శాఖ ముందస్తు అంచనాల ప్రకారం మద్ద తు ధరకు కొనుగోలు పథకం కింద సేకరణకు అనుమతినిస్తుంది. దీని ప్రకారం మొత్తం ఉత్పత్తిలో 40% మాత్రమే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేస్తాయి. ఈ ఖరీఫ్‌లో రైతులు కందులు 6.57 లక్షల ఎకరా ల్లో వేశారు. ఈ విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉండటంతో ముందుగానే కేంద్రానికి లేఖ రాయనున్నట్లు తెలిసింది. గతేడాది కంది సాగు విస్తీర్ణం 7.28 లక్షల ఎకరాలు కాగా, దిగుబడి 2.84 లక్షల టన్నులుగా ఉంది. మొదటి ముందస్తు అంచనాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్న కేంద్రం కేవలం 75,300 క్వింటాళ్లకే అనుమతించింది. తర్వాత రాష్ట్రమే రైతుల నుంచి క్వింటాకు రూ.5,450 మద్దతు ధర తో 1.13 లక్షల మెట్రిక్ టన్నులు మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. -
పక్కాగా సర్వే
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో పంట నష్టం అంచనాకు బృందాలు సర్వేలో నిమగ్నమయ్యాయి. ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు బృందాలు ఏర్పాటు చేయాలని శుక్రవారం వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. నష్టాన్ని అంచనా వేసి నాలుగైదు రోజుల్లో సమగ్ర నివేదిక పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పంట నష్టానికి సంబంధించి కలెక్టర్ దివ్యదేవరాజన్ కొద్దిరోజుల ముందే బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 22 నుంచే ఈ బృందాలు రంగంలోకి దిగాయి. జిల్లా వ్యాప్తంగా 101 క్లస్టర్లకు గాను 101 బృందాలను ఏర్పాటు చేసి సర్వే కోసం పంపించారు. ఒక్కో బృందంలో వ్యవసాయ శాఖ నుంచి ఏఈఓ, రెవెన్యూ శాఖ నుంచి వీఆర్ఓ ఉన్నారు. సర్వే కోసం వారికి ప్రత్యేక యాప్‌ను ఇచ్చారు. ఆ యాప్‌పై వారికి అవగాహన కల్పించేందుకు సమావేశం కూడా నిర్వహించారు. ప్రధానంగా జియో ట్యాగింగ్ ద్వారా పంట నష్టం సర్వేను నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామాల్లో పూర్తి పారదర్శకంగా నష్టం జరిగిన రైతులనే పరిగణనలోకి తీసుకునే పరిస్థితి. తద్వారా సర్వేలో బోగస్ పేర్ల నమోదు జరిగే ఆస్కారం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఒక గ్రామంలోని పంట నష్టపోయిన రైతుకు సంబంధించి చేను ఫొటోను యాప్‌లో అప్లోడ్ చేసే క్రమంలో దాని అక్షాంశాలు, రేఖాంశాలు అందులో నమోదవుతాయి. అంతేకాకుండా సర్వే చేసిన తేదీ, సమయం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రైతు పేరు, సర్వేనంబర్, ఎన్ని ఎకరాలు ఉందనేది అందులో పేర్కొంటారు. ఇక పంట నష్టానికి సంబంధించి మాత్రం ఆ యాప్‌లో నమోదు చేయరు. రికార్డులో నష్టం వివరాలను నమోదు చేసుకుంటారు. ఇలా సర్వే ఒక పారదర్శకంగా జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రధానంగా ప్రకృతి వైఫరీత్యాలు సంభవించినప్పుడు పంట నష్టంలో రాజకీయ జోక్యం, గ్రామంలో భూస్వాముల నుంచి ఒత్తిడి చోటుచేసుకొని బోగస్ పేర్లు, ఎకరాలు నమోదు చేయడం వంటివి, తద్వారా పరిహారాన్ని పరిహాసం చేసి స్వాహా చేసేవారు. దీనికి అవకాశం లేకుండా జియో ట్యాగింగ్ ద్వారా పంట నష్టాన్ని నమోదు చేస్తుండడంతో అసలైన రైతులకు పంట నష్టపరిహారం దక్కుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఎక్కువ రోజులు.. సాధారణ సర్వే కంటే జియో ట్యాగింగ్ ద్వారా చేపడుతున్న ఈ సర్వేకు కొంత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ప్రధానంగా మామూలు సర్వేలో బృందాలు ఒక చేనులో పరిశీలన చేసిన తర్వాత పక్క చేనులో కూడా ఇదే పరిస్థితి ఉందని నమోదు చేసుకొని నష్టాన్ని అంచనా వేసేవారు. కానీ దీంట్లో ఆ పరిస్థితి లేదు. నష్టం జరిగిన ప్రతి రైతుకు సంబంధించి జియో ట్యాగింగ్ ద్వారా వివరాలు నమోదు చేయాలి. ఒక క్లస్టర్ పరిధిలో 5వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉంటుంది. సాధారణ సర్వేలో రోజు 400 నుంచి 500 ఎకరాలు సర్వే చేసే పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ జియో ట్యాగింగ్ సర్వేలో సుమారు 200 నుంచి 250 ఎకరాల వరకు సర్వే చేయడం జరుగుతుందని పేర్కొంటున్నారు. తద్వారా సాధారణ సర్వే కంటే రెట్టింపు రోజులు ఈ జియో ట్యాగింగ్ సర్వేకు పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 22 నుంచి ప్రారంభమైన ఈ సర్వే 10 నుంచి 20 రోజులు పట్టే అవకాశం ఉంది. పకడ్బందీగా సర్వే జరుగుతుండడంతో పంట నష్టపోయిన రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి నాలుగైదు రోజుల్లో పంట నష్టానికి సంబంధించి సమగ్ర నివేదిక పంపించాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే సర్వే ప్రారంభమై ఉండడం, కొంత ఆలస్యమైనా మరో వారం, పది రోజుల్లో పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏనుగు కేశవ్‌రెడ్డి జైనథ్ మండలం కాప్రి గ్రామంలో 5.11 ఎకరాల్లో పత్తి పంట వేశాడు. ఇటీవల భారీ వర్షాలకు చేనులో వరద నీరు నిలిచి పంట పూర్తిగా నష్టపోయాడు. సర్వే బృందం పంట నష్టం నమోదులో ఒక కొత్త పద్ధతిని అవలంబించింది. పంట నష్టపోయిన చేనులో రైతును నిల్చోబెట్టి ఆ చేనుకు సంబంధించి ప్రత్యేక యాప్‌లో ఫొటో తీసుకోవడమే కాకుండా ఆ రైతు పేరు, సర్వేనంబర్, ఎన్ని ఎకరాలు ఉందనే విషయాలను నమోదు చేసుకున్నారు. ఇక ఆ ఫొటో తీసిన సమయం, తేదీ అందులో స్పష్టంగా కనిపిస్తోంది. జియో ట్యాగింగ్ ద్వారా ఆ ప్రాంతంలోని అక్షాంశాలు, రేఖాంశాలు నమోదవుతాయి. పంట నష్టం సర్వేలో బోగస్ పేర్లు, ఎకరాలు, తదితర నమోదు చేసే అవకాశం లేదు. తద్వారా పంట నష్టపోయిన నిజమైన రైతులకే పరిహారం అందజేసేందుకు అవకాశం ఉంటుందనేది అధికారుల భావన. పకడ్బందీగా సర్వే.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో పకడ్బందీగా సర్వే నిర్వహించడం జరుగుతోంది. పంట నష్టం సర్వేలో పూర్తి పారదర్శకత ఉంటుంది. జియో ట్యాగింగ్ ద్వారా రైతు చేనుకు సంబంధించి ఫొటోతోపాటు రైతు వివరాలు, చేను అక్షాంశాలు, రేఖాంశాలు నమోదు చేయడం జరుగుతుంది. తేదీ, సమయం అన్ని స్పష్టంగా ఉంటాయి. – మంగీలాల్, జేడీఏ, ఆదిలాబాద్ -
పాము కాట్లు..సమయస్ఫూర్తి !
నూజివీడు: వర్షాకాలంలో పొలం పనుల్లో నిమగ్నమయ్యే రైతులు పాముకాటుకు గురవుతున్నారు. జిల్లాలో ఈ పరిస్థితి దివిసీమ ప్రాంతంలో ఎక్కువగా ఉంది. పదుల సంఖ్యలో రైతులు పాముకాటు బాధితులవుతున్నారు. అవనిగడ్డ ప్రాంతంలో నాలుగు రోజుల వ్యవధిలోనే 40 మంది పాము కాటుకు గురయ్యారు. కొందరు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి తక్షణం ఆసుపత్రికి చేరుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చని వైద్యులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో పొలం పనులకు వెళ్లే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నూజివీడు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్.నరేంద్రసింగ్ వెల్లడించిన వివరాలివి.... రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి.... రైతులు రాత్రిపూట పొలాలకు వెళ్లేటపుడు తప్పనిసరిగా మోకాళ్ల వరకు ఉండే గమ్బూట్లు వేసుకోవాలి. అలానే టార్చిలైటు, కర్ర తప్పనిసరిగా ఉండాలి. పాములకు చెవులుండవు. శబ్ధ తరంగాలను గ్రహించి అవి అప్రమత్తమవుతాయి. ఈ నేపథ్యంలో రాత్రిపూట వెళ్లేటపుడు చప్పుడు చేసుకుంటూ, శబ్ధం వచ్చేలా అడుగులు వేసుకుంటూ వెళ్లాలి. అప్పుడు పాములు అక్కడి నుంచి వెళ్లిపోతాయి. ఎక్కువ శాతం కాళ్లు, పాదాలపైనే పాముకాట్లు పడుతుంటాయి గనుక పాదం వరకు కప్పి ఉంచే పంచెలు, లుంగీలు, ప్యాంట్లు వేసుకోవడం మంచిది. చెత్తాచెదారంను ఒక్కసారిగా చేత్తో ఎత్తకూడదు. ముందు కర్రతో అటూఇటూ కదిలించి ఆ తరువాత ఎత్తేయాలి. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, వర్షాలు కురిసినపుడు పాముల పుట్టలలోకి నీరు చేరడం వల్ల అవి బయటకు వచ్చి చెత్తాచెదారంలోకి చేరి తలదాచుకుంటాయి. అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలు, మదుగు ఎక్కువగా ఉన్న చోట సంచరిస్తూ ఉంటాయి. వీటి సమీపంలోకి వెళ్లినపుడు పాము కాటుకు గురవుతుంటారు. గ్రామాలలో ఇచ్చే పసరు మందు, నాటువైద్యులు ఇచ్చే ఆకులు, అలములను ఎట్టి పరిస్థితులలోనూ నమ్ముకోకూడదు. పాము కరిచిన వ్యక్తిని ఏమాత్రం భయపెట్టకూడదు. భయం వల్ల ఆందోళన పెరిగి రక్తం మరింత తొందరగా గుండెకు చేరుతుంది. దీనివల్ల మరణం త్వరగా సంభవిస్తుంది. కాటును గుర్తించడం ఎలా... పాము శరీరంపై నేరుగా కాటువేసిందా, వస్త్రాల పై నుంచి వేసిందా అనేది పరిశీలించాలి. శరీరంపై కాటువేస్తే ఎన్ని గాట్లు పడ్డాయనేది ప్రధానంగా గుర్తించాలి. ఎందుకంటే విషం ఉన్న పాములు కాటేస్తే కేవలం రెండు గాట్లు మాత్రమే పడతాయి. సాధారణ పాములు కాటువేస్తే రెండు కంటే ఎక్కువ గాట్లు పడతాయి. తాచుపాము, కట్లపాము, రక్తపింజర వంటి పాములు కాటేస్తే రెండు గాట్లు మాత్రమే పడతాయి. వైద్యం అందకేమృత్యువాత.... ఏటా దేశంలో 2 లక్షల మంది పాముకాటుకు గురవుతుండగా, సకాలంలో వీరికి వైద్యం అందక దాదాపు 30 వేల మంది మృత్యువాత పడుతున్నారని వైద్య ఆరోగ్య శాఖల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 3 వేల రకాలకు పైగా పాములున్నప్పటికీ వాటిలో 350 రకాలు మాత్రమే విషపూరితమైనవని వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. విషం ఉన్న పాములలో కూడా కట్లపాము, తాచుపాము, రక్తపింజర ప్రమాదకరం. ఇవి కాటేస్తే వాటి విష ప్రభావం కేంద్ర నాడీ మండలంపై పనిచేస్తుంది. దీంతో మరణం వేగంగా సంభవించడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాటువేసిన వెంటనే ప్రథమ చికిత్స.... పాము కాటువేసిందని తెలిసిన వెంటనే ఏమాత్రం ఆందోళన చెందడం గానీ, అటూఇటూ పరిగెత్తడం గాని చేయకూడదు. పాముకాటు వేసిన వెంటనే నిమిషాల వ్యవధిలో అప్రమత్తం కావాలి. పాముకాటువేసిన శరీరానికి పై భాగంలో తాడుతో గానీ, గుడ్డతో గానీ, రబ్బర్‌తో గానీ గట్టిగా కట్టాలి. ఎందుకంటే విషం రక్తంలో కలసి గుండెకు చేరితే మరణం సంభవించినట్లే లెక్క. పాము కాటేసిన చోట బ్లేడుతో కొద్దిగా గాయం చేసి విషం కలిసిన రక్తాన్ని బయటకు వెళ్లేలా చేయాలి. విషప్రభావం ఇలా... మానవ శరీరంపై విషం రెండు రకాలుగా ప్రభావాన్ని చూపుతుంది. నరాలపై చూపే ప్రభావాన్ని న్యూరో టాక్సిన్ పాయిజన్‌గా, నేరుగా గుండెపై చూపే ప్రభావాన్ని కార్డియో టాక్సిన్ పాయిజన్‌గా పిలుస్తారు. ఒక్కోసారి ఏ పాము కరిచిందో సరిగా తెలియని పరిస్థితులలో ఏ పాము విషానికైనా విరుగుడుగా పనిచేసే యాంటీవీనమ్‌ను వేస్తారు. ఈ మందులు అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలలో అందుబాటులో ఉన్నాయి. పాముకాటుకు గురైన బాధితుడిని త్వరితగతిన ఆసుపత్రులకు చేర్చినట్లయితే ప్రాణాపాయం నుంచి బయటవడవచ్చు. స్పందించడమే ప్రధానం పాముకాటుకు గురైన వెంటనే స్పందించడమే ప్రధానం. కాటువేసిన భాగానికి పైన తాడుతో కట్టి నూతన బ్లేడుతో కాటువేసిన చోట చిన్న గాయం చేసి రక్తాన్ని బయటకు పిండేయాలి. దీనివల్ల శరీరంలోకి ప్రవేశించిన విషం గుండెకు చేరకుండా ఉంటుంది. తక్షణమే ఆసుపత్రికి వస్తే సకాలంలో చికిత్స అంది ప్రాణాలు నిలుస్తాయి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలలో పాముకాటు మందులను 24 గంటలూ అందుబాటులో ఉంచి ఉచితంగానే ఇస్తున్నారు.– డాక్టర్. ఆర్.నరేంద్రసింగ్, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్, నూజివీడు. -
కాంగ్రెస్‌తో పొత్తుకు బాబు ప్రయత్నం
అమరావతి: కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకే ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్రంలో రైతాంగం సంక్షోభాన్ని ఎదుర్కోంటోందని, ప్రకృతి వైపరీత్యం సంభవించినపుడు ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉన్నా కరువు మండలాల ప్రకటన గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఆరు జిల్లాల్లో కరువు, మిగతా జిల్లాల్లో అధిక వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు. నాబార్డు నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్ అన్నిరంగాల్లో, ప్రధానంగా రైతాంగం అట్టడుగు స్థాయికి పడిపోయిందని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా ఏరియల్ సర్వే చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు, వ్యవసాయశాఖా మంత్రి తప్పుడు నివేదికలను ఇచ్చి మోసగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. -
ప్రకృతికి ఆగ్రహం వస్తే కేరళ పరిస్థితి వస్తుంది
విజయవాడ: బాపులపాడు మండలం శేరినరసన్నపాలెం ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గురువారం పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో ముఖాముఖీలో పాల్గొన్నారు. రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి ప్రకృతి వ్యవసాయంలో వారి అనుభవాలను తెలుసుకున్నారు. సొంతంగా వ్యవసాయం చేస్తున్న రైతులను కలవాలని ఇక్కడికి వచ్చానని వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రకృతిని మనం ప్రేమిస్తే అది మనల్ని కాపడుతుందని, దానికి ఆగ్రహం వస్తే కేరళ పరిస్థితి వస్తుందని అన్నారు. రైతులంతా ప్రకృతి వ్యవసాయం పట్ల మమేకం అవ్వాలని పిలుపునిచ్చారు. సేంద్రీయ వ్యవసాయం చేస్తోన్న రైతులతో మాట్లాడాలి..వ్యవసాయ క్షేత్రాలను చూడాలని వచ్చానని వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడ సేంద్రీయ వ్యవసాయం సాగు చేస్తున్నా అక్కడికి వెళ్తానని తెలిపారు. తాతల అనుభవాలు నాకు వ్యవసాయంపై మక్కువ కలిగేలా చేశాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రకృతి పూర్తిగా కనుమరుగువుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సుభాష్ పాలేకర్ అనుభవాలు, వ్యవసాయ విధానాలతో వ్యవసాయం చేయాలని సూచించారు. దేశంలో రైతులకు సేంద్రీయ వ్యవసాయంపై ప్రోత్సాహం ఇవ్వాలని ప్రధాని మోదీకి చెప్పానని తెలిపారు. భారతీయ జీవన విధానాన్ని అందరూ పాటించాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయాన్ని ఆదుకోవాలని, శాస్త్రవేత్తలు రైతులతో కలిసి పరిశోధనలు చెయ్యాలన్నారు. ఇప్పుడిప్పుడే ఆర్గానిక్ ఫుడ్స్‌కి ఆదరణ పెరుగుతోందని అన్నారు. -
బీ(ధీ)మా కల్పించేనా..!
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున పంట నష్టం సంభవించింది. ప్రధానంగా పత్తి, సోయా పంటలను పూర్తిగా కోల్పోయిన రైతాంగం కుదేలైంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పంటకు సంబంధించి ప్రాథమిక అంచనాలు వేసినప్పటికీ త్వరలో పూర్తిస్థాయి సర్వే నిర్వహిస్తామని ప్రకటించింది. ఒకవేళ ఈ సర్వే నిర్వహించి నివేదిక పంపినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహారం విడుదల అవుతుందా.. లేదా అనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో రైతులకు బీమానే ధీమా ఇవ్వాల్సింది. గతేడాది వాతావరణ ఆధారిత బీమా కింద పత్తి రైతులు ప్రీమియం చెల్లించినా పరిహారం అందలేదు. అసలు ఆ పరిహారం వస్తుందా.. రాదా అనేది తెలియని పరిస్థితి. వాతావరణ ఆధారిత బీమాలో అటు వర్షాభావ పరిస్థితుల్లోనూ, ఇటు అతివృష్టిలోనూ పరిహారం అందజేసే పరిస్థితి ఉంటుంది. ప్రీమియం చెల్లించినా పరిహారం ఎప్పుడొస్తుందో అనే విషయంలో స్పష్టత లేకపోవడం రైతులను అయోమయానికి గురిచేస్తోంది. ప్రధానంగా ఈ బీమాకు సంబంధించిన కార్యాలయం ఆదిలా బాద్‌లో లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఉంది. దీంతో వ్యవసాయ అధికారులను రైతులు సంప్రదించినా పరిహారం విషయంలో వారు ఒక స్పష్టతను ఇవ్వలేకపోతున్నారు. అసలు పరిహారం వస్తుందా.. రాదా అనే విషయాన్ని కూడా చెప్పలేకపోవడంతో రైతుల్లో అయోమయం కనిపిస్తోంది. దీంతో అసలు ప్రీమియం చెల్లించి లాభమేమిటన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. దీంతోనే పలువురు రైతులు వాతావరణ ఆధారిత, ఫసల్‌బీమా యోజన ప్రీమియం గడువులోగా బ్యాంకుల్లో రుణం తీసుకునేందుకు కూడా వెనుకంజ వేస్తున్నారు. బ్యాంకులో రుణం తీసుకున్న రైతుకు సంబంధించి ప్రీమియం డబ్బులను రుణం నుంచే తీసుకోవడం జరుగుతుంది. దీంతో రైతులు గడువు తర్వాతే రుణం తీసుకునేందుకు ఆసక్తి కనబర్చుతున్నారంటే ఈ బీమాలపై ధీమా లేకపోవడమే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదీ పరిస్థితి.. జిల్లాలో లక్ష మందికి పైగా రైతులు ఉన్నారు. జిల్లాలో పంటల సాధారణ విస్తీర్ణం లక్షా 92,626 హెక్టార్లు కాగా, అందులో లక్షా 86,007 హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. అందులో అత్యధికంగా లక్షా 28,300 హెక్టార్లలో పత్తి పంట సాగైంది. ఇది సాధారణ విస్తీర్ణం కంటే 3 శాతం అధికం. సోయాబీన్ 30,120 హెక్టార్లలో సాగైంది. కందులు 21,260 హెక్టార్లలో సాగు చేశారు. మిగతా పంటలు కొద్దిమొత్తంలో సాగయ్యాయి. కాగా పత్తిని మండల యూనిట్‌గా వాతావరణ ఆధారిత బీమా కింద, సోయా, కందులు, ఇతర పంటలు గ్రామ యూనిట్‌గా ఫసల్ బీమా యోజన కింద బీమా చెల్లించేందుకు గత నెలలో గడువులోగా కొద్ది మంది రైతులు మాత్రమే ప్రీమియం చెల్లించారు. బ్యాంక్ రుణం ద్వారా కొంతమంది, నాన్‌లోనింగ్ రైతులు కూడా మీసేవ ద్వారా నేరుగా ఈ ప్రీమియం కట్టి బీమా కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఫసల్ బీమాలో రైతులు 10వేలలోపే ఉండడం గమనార్హం. ఇక వాతావరణ ఆధారిత బీమాలో వేల మంది రైతులు ప్రీమియం కట్టారు. పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా ఏ యేడాదికి సంబంధించి ఆ యేడాది బీమా పరిహారం డబ్బులు అందజేయాలని రైతుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. తద్వారా తదుపరి పంటల సాగులో పెట్టుబడికి కొంత ఉపయుక్తంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2017లో పలువురు రైతులు వాతావరణ ఆధారిత బీమా కింద ప్రీమియం చెల్లించినా వారికి పరిహారం రాకపోవడంతో ఈయేడాది పలువురు రైతులు ఈ బీమా పొందేందుకు ఆసక్తి చూపడం లేదనేది స్పష్టమవుతోంది. సర్వే ప్రారంభం.. జాతీయ బీమా కంపెనీ(ఎన్ఐసీ) జిల్లాలో ఫసల్ బీమా యోజనకు సంబంధించి సర్వే మొదలు పెట్టింది. ప్రధానంగా పంట నష్టం సంభవించిన తర్వాత రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఈ బీమా అధికారులపై సర్వేను త్వరగా ప్రారంభించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కలెక్టర్ కూడా ఎన్ఐసీ అధికారులతో సమావేశమై రైతులకు పరిహారం అందించే విషయంలో సర్వే చేసి పరిహారం అందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. కాగా మంగళవారం జైనథ్, బేల, ఆదిలాబాద్‌రూరల్ మండలాల్లో ఈ సర్వే మొదలుపెట్టారు. ఎన్ఐసీ క్లస్టర్ మేనేజర్ రాకేష్‌రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖాధికారులతో కలిసి సర్వే ప్రారంభించారు. ఇచ్చోడ, తలమడుగు, తాంసి, భీంపూర్లలో బుధవారం నుంచి సర్వే చేపట్టారు. నివేదికను ప్రభుత్వానికి పంపిస్తారు. ఆ తర్వాత పరిహారం విషయంలో స్పష్టత వస్తుంది. అత్యధికంగా వాతావరణ ఆధారిత బీమా కింద పత్తి రైతులు ప్రీమియం చెల్లించి ఉన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి సర్వే చేసి రైతులకు న్యాయం చేస్తేనే జిల్లాలో అధిక మంది రైతులకు ప్రయోజనం దక్కే అవకాశం ఉంది. -
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు కుదేలైన అన్నదాత
-
3.70 లక్షల ఎకరాల్లో పంట నష్టం
సాక్షి, అమరావతి: ఎడతెరిపి లేని వర్షాలు పంటలను తుడిచిపెట్టాయి. వరుణుడి నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పలు రకాల పంటలు పూర్తిగా వర్షార్పణం అయ్యాయి. రూ.వెయ్యి కోట్లకు పైగా నష్టం వాటిల్లి ఉంటుందని రైతు సంఘాలు అంచనా వేస్తున్నాయి. దక్షిణ కోస్తాలో నాలుగు రోజుల పాటు కురిసిన వర్షాలు, వరదలతో సుమారు 3.70 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా. దెబ్బతిన్న పంటల్లో వరి మొదటి స్థానంలో ఉండగా పత్తి, మొక్కజొన్న, చెరకు, అరటి, పసుపు, కంద వంటి పంటలు తర్వాతి స్థానాలలో ఉన్నాయి. నష్టాన్ని అంచనా వేసేందుకు అధికార బృందాలు త్వరలో గ్రామాలలో పర్యటిస్తాయని వ్యవసాయ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు 2.34 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఇప్పటికిప్పడు నష్టం విలువ ఎంత అనేది చెప్పడం సాధ్యం కాదని అధికార వర్గాలు చెబుతున్నా రైతు సంఘాలు మాత్రం వేయి కోట్లకు పైమాటే అంటున్నాయి. పంట నష్టం వివరాలను తగ్గించి చూపే ప్రయత్నం అధికారులు చేస్తున్నారని రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. గత ఏడాది కూడా ఇలాగా నష్ట తీవ్రతను తగ్గించి చూపారని వారు గుర్తు చేస్తున్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.15 వేల చొప్పున తక్షణమే సాయం అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 1.48 లక్షల ఎకరాల్లో వరికి దెబ్బ దక్షిణాకోస్తాలోని విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో దాదాపు 1.48 లక్షల ఎకరాల్లో వరి పంట నీట మునిగి ఉంది. ప్రధానంగా తూర్పు గోదావరి జిల్లాలోని 16 లంక గ్రామాల భూముల్లో పంట పూర్తిగా వరద నీటిలో మునిగి ఉంది. ప్రస్తుతం ఆయా లంక గ్రామాలకు వెళ్లేందుకు పడవలు తప్ప వేరే మార్గం లేకపోవడంతో ఎంత విస్తీర్ణం మేర నీట మునిగి ఉందనేది తెలియడం లేదు. లంక గ్రామాల్లో వేసిన ఉద్యాన, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లాలోనే సుమారు 17,300 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 34,594 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేశారు. కోనసీమలోని లంక గ్రామాలలో పసుపు, కంద పంటలు నీట మునిగి ఉన్నాయి. పంట నష్ట పరిహారం ఏదీ? ఎక్కడ? గత మేలో కురిసిన అకాల వర్షాలకు సుమారు రూ.200 కోట్ల నష్టం జరిగినా ఇంతవరకు రైతులకు నయాపైసా చేతికి అందలేదు. అదిగో ఇదిగో అని తిప్పుతూనే ఉన్నారు. అప్పట్లో మార్కెట్ యార్డులలో సుమారు 7 లక్షల టన్నుల ధాన్యం, మొక్కజొన్నలు తడిసిపోయాయి. నష్టం అంచనా అంటూ హడావిడి చేసి రెండు నెలల తర్వాత ఆ మొత్తాన్ని రూ.190 కోట్లకు చేర్చినా రైతులకు అందింది శూన్యమే. ఇప్పుడు జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ఇంకెంత కాలం పడుతుందో, రైతు చేతికి వచ్చేటప్పటికీ పుణ్యకాలం ముగిసిపోతుందని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. తెగుళ్ల బెడద– నివారణ సూచనలు ఎడతెరిపి లేని వర్షాల వల్ల పంటలకు తెగుళ్లు సోకే బెడద ఎక్కువగా ఉండొచ్చని వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ పంట సంరక్షణకు పలు సూచనలు చేశారు. వీటిని పాటించి పంటను కాపాడుకోవాలని సలహా ఇచ్చారు. వరి నాటు వేసిన పొలంలో అధికంగా ఉన్న నీటిని తొలగించి ఎకరానికి 15, 20 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ వేసుకోవాలి. పొడ తెగులు లక్షణాలు కనిపిస్తే హెక్సా కోనాజోల్ గాని వాలిదామైసిన్ను గానీ లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకోవాలి. పత్తి వేసి నెల రోజులు దాటితే ఎకరానికి 20 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ వేసుకోవాలి. కుళ్లు తెగులు, బాక్టీరియా మచ్చ తెగులు ఆశించకుండా కాపర్ ఆక్సీ క్లోరైడ్ 30 గ్రాముల్ని పిచికారీ చేయాలి. వంగ, టమాటా వంటి కూరగాయల పంటలకు తెగుళ్లు రాకుండా ఆక్సిక్లోరైడ్‌ను నీళ్లలో కలిపి మొక్కల మొదళ్లలో పోయాలి. పసుపుకు తాటాకు తెగులు ఆశించినట్టయితే ప్రోపికొనజోల్ లేదా మాంకోజెట్ ను పిచికారీ చేసుకోవాలని శాస్త్రవేత్తలు తెలిపారు. -
ఎకరాకు రూ.10 వేలు
సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరికి వరదల వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకుంటామని, ఆయా పంటలను తిరిగి వేసుకునేందుకు హెక్టారుకు రూ.25 వేల చొప్పున (ఎకరాకు సుమారు రూ.10 వేలు) సాయం అందజేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వరదల కారణంగా పశ్చిమగోదావరి జిల్లాలో 19 వేల ఎకరాల్లో, తూర్పుగోదావరి జిల్లాలో 6,468 హెక్టార్లలో వరి, పత్తి, ఉద్యానవన పంటలు, కూరగాయలు దెబ్బతిన్నాయని తెలిపారు. మొత్తంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పంటలు, రోడ్లు, ఇళ్లు దెబ్బతినడంతో రూ.600 కోట్ల నష్టం వాటిల్లిందని వివరించారు. పశ్చిమగోదావరిలో రూ.350 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.250 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి వరదలపై సీఎం బుధవారం ఏరియల్ సర్వే చేశారు. అనంతరం రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి విమానాశ్రయంలో రెండుజిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జలనవరులశాఖ, ఆర్అండ్బీ తదితర విభాగాల ముఖ్యఅధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష జరిపారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల కలెక్టర్లు కార్తికేయ మిశ్రా, కాటమనేని భాస్కర్లు తమ జిల్లాల్లో వరద ప్రభావం, నష్టం, పునరావాస చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడుతూ.. పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి వరదలకంటే ఎర్రకాలువ పొంగడంతో ఎక్కువ నష్టం జరిగిందన్నారు. ఎర్రకాలువ వరదను పోలవరం కుడికాలువ, సముద్రంలోకి మళ్లించి మరోసారి నష్టం జరగకుండా చర్యలు చేపడతామని చెప్పారు. వరదలకు ప్రభావితమైన తూర్పుగోదావరి జిల్లాలోని 19 మండలాల్లోని 149 గ్రామాలు, పశ్చిమలో 25 మండలాల్లోని 195 గ్రామాల్లో చేపట్టిన పునరావాస చర్యలపై అధికారులను అభినందించారు. వరదలు తగ్గగానే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఆర్అండ్బీ రోడ్ల మరమ్మతులకు రూ.35 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. 110 కిలోమీటర్ల మేరకు దెబ్బతిన్న రాష్ట్ర రహదారుల మరమ్మతులకు రూ.22 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. పశ్చిమలో కొత్తగా ఐదు బ్రిడ్జిల నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మైదాన ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇళ్లనిర్మాణానికి గృహ నిర్మాణ పథకం కింద రూ.1.5 లక్షలు, గిరిజన ప్రాంతాల్లో రూ.2.25 లక్షలు చొప్పున అందజేస్తామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు నెలరోజులకు సరిపడా బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. కోనసీమలో లంకల్లోకి వెళ్లేందుకు నదిని దాటే 8 ప్రాంతాల్లో 15 రోజుల్లో స్పీడు బోట్లు ఏర్పాటు చేస్తామన్నారు. కరువు, వరద వారసత్వంగా వస్తున్నాయి... రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కరువు, కోస్తాలో వరదలు కవలపిల్లల్లా వారసత్వంగా వస్తున్నాయని సీఎం వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ధవళేశ్వరం నుంచి రోజుకు రూ.150 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళుతోందన్నారు. ఆ నీటిని కొంతమేరకైనా కరువు జిల్లాలకు మళ్లిస్తే బాగుండేదన్నారు. పోలవరం ప్రాజెక్టును 2019లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు. ఆలోపు పూర్తి చేస్తామంటే ఎవరికైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ప్రాజెక్టు రీడిజైన్లను కేంద్రం ఆమోదించాల్సి ఉందని, ఇప్పటివరకు చేసిన పనులకు ఇవ్వాల్సిన రూ.2,600 కోట్లను మంజూరు చేయకపోవడమే అడ్డంకిగా మారిందని చెప్పారు. రాష్ట్రంలో 57 ప్రాజెక్టులు చేపట్టామని, నదుల అనుసంధానం చేసి కరువును తరమికొడతామన్నారు. త్వరలో ప్రతిఇంటికీ కుళాయి ద్వారా నీళ్లు ఇస్తామన్నారు. దుబారా ఖర్చులను అరికడితే ప్రాజెక్టులు పూర్తి చేయవచ్చని ఓ నాయకుడంటున్నారని, అలాంటప్పుడు మీరెందుకు చేయలేదని ప్రశ్నించారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డిసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
పెట్టుబడి చెక్కు.. వీటికేది దిక్కు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యవసాయ భూములుండీ విదేశాల్లో నివసిస్తున్న పట్టాదారులకు రైతుబంధు పథకం కింద పెట్టుబడి సొమ్ము అందజేతపై నీలినీడలు అలుముకున్నాయి. మే నెలలో వారికి ఎలాగైనా అందజేసేందుకు పలు ప్రత్యామ్నాయాలు ఆలోచించిన సర్కారు... ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదు. విదేశాల్లో ఉన్న వారికి ‘సొమ్ము ఇవ్వడం అవసరమా’అన్న ధోరణిలో ఉన్నట్లు వ్యవసాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. చనిపోయిన రైతుల పేరుతో ఉన్న చెక్కులు, దేశంలోనే వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న పట్టాదారుల చెక్కుల పంపిణీపైనా సర్కారు నిర్ణయం తీసుకోవడంలేదు. దీంతో 61 వేల మంది ఎన్ఆర్ఐ, 90 వేల మంది చనిపోయిన రైతుల చెక్కులు మూలనపడి ఉన్నాయి. అలాగే దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న రైతులకు చెందిన 1.14 లక్షల విలువైన చెక్కులు కూడా అలాగే ఉండిపోయాయి. ఇలా మొత్తంగా 2.75 లక్షల చెక్కుల సొమ్ము త్రిశంకు స్వర్గంలో తేలియాడుతోంది. ఆయా కుటుంబాల ఎదురుచూపు... ఖరీఫ్ సీజన్లో 58.33 లక్షల మంది రైతులకు పెట్టుబడి చెక్కులను పంపిణీ చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఆ మేరకు ప్రభుత్వం 58.98 లక్షల చెక్కులను ముద్రించింది. అందుకోసం రూ. 5,730 కోట్లు బ్యాంకులకు అందజేసింది. అయితే గ్రామాలకు పంపిన చెక్కుల్లో ఇప్పటివరకు కేవలం 48 లక్షల మంది రైతులే చెక్కులు తీసుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన సొమ్ములో రూ. 5,100 కోట్లు రైతులు తీసుకున్నారని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. విదేశాల్లో ఉన్న పట్టాదారుల విషయంలో సర్కారు నిర్ణయం తీసుకోకపోవడంపై వారి కుటుంబాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. అమెరికా సహా ధనిక దేశాలకు వెళ్లిన వారిలో చాలామంది ఆర్థికంగా శ్రీమంతులే. కానీ గల్ఫ్ దేశాలకు వెళ్లినవారిలో అధికులు పేదలే. వారి పేరిట ఉన్న చెక్కులను, పట్టాదారు పాసుపుస్తకాలను తీసుకోవడానికి వారిక్కడికి వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉన్నవారు, వారి కుటుంబీకులు వాటికోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఇక 90 వేల చెక్కులు చనిపోయిన రైతుల పేరిట ఉన్నాయి. వాటిని సర్దుబాటు చేయడంలోనూ నిర్లక్ష్యం కనిపిస్తోందనే ఆరోపణలు న్నాయి. దేశంలోనే వివిధ ప్రాంతాల్లో ఉండే వారి కోసం చెక్కులను జిల్లాల నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చి కౌంటర్ల ద్వారా అందజేయాలని అనుకున్నారు. ఆ ప్రయత్నాలేవీ జరగలేదు. దీంతో గ్రామాలకు వెళ్లడానికి వీలుపడని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘మా భూమి’ ఏమైపోయిందో!
సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండల కేంద్రానికి చెందిన ఓ రైతు కుటుంబానికి పదెకరాల భూమి ఉంది. ఆ భూమి ముగ్గురు కుటుంబ సభ్యుల పేరు మీద నమోదయింది. భూరికార్డుల ప్రక్షాళనకు ముందు ఆ ముగ్గురి పేర్ల మీద పాస్‌పుస్తకాలున్నాయి. పహాణీలో పేర్లున్నాయి. మాభూమి వెబ్సైట్లో సర్వేనంబర్‌ను చూసుకుంటే వారి పేర్ల మీదనే ఆ భూమి పదిలంగా ఉండేది... కానీ, ఇప్పుడు ఆ భూమికి పాస్పుస్తకాల్లేవు. ఎవరో ఫిర్యాదు చేశారని రెవెన్యూ యంత్రాంగం పాస్‌పుస్తకాలు నిలిపివేసింది. వారి భూములను పార్ట్–బీలో చేర్చి పక్కన పెట్టింది. కనీసం ఆన్లైన్లో చూసుకుందామన్నా ఇప్పుడు మా భూమి వెబ్సైట్ లేదు. భూరికార్డులూ అందుబాటులో లేవు. ఇప్పుడు ఆ భూమి ఎవరి పేరు మీద ఉందో కూడా తెలియని పరిస్థితి. ఆ రైతు కుటుంబంలో ఎడతెగని ఆందోళన.. ఈ ఆందోళన ఆ ఒక్క రైతు కుటుంబానిదే కాదు.. కారణమేదైనా భూరికార్డుల ప్రక్షాళన తర్వాత తమ భూములకు పాస్‌పుస్తకాలు రాని లక్షలాది మంది రైతులది. అన్నీ సరిగానే ఉన్నా సాంకేతిక కారణాలతో పాస్‌పుస్తకాలు రాని వారు, పుస్తకాల్లో అచ్చు తప్పులు పడి మళ్లీ ప్రభుత్వానికి తమ పుస్తకాలను సరెండర్ చేసినవారు, ఎవరో, ఏదో ఫిర్యాదు చేశారని, సరైన ఆధారాలు, డాక్యుమెంట్లు లేకుండానే పార్ట్–బీలో చేర్చిన భూములకు చెందిన రైతులంతా ఇప్పుడు ఇదే ఆందోళనతో కొట్టుమిట్టాడుతుండడం గమనార్హం. ధరణీ.. కానరాదేమీ! భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 57లక్షలకు పైగా ఖాతాల్లో 2కోట్లకు పైగా ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులను సరిచేశారు. 49లక్షలకు పైగా ఖాతాలకు పాస్‌పుస్తకాలను ముద్రించారు. ఆధార్ నంబర్లు, ఫొటోలు లేవనే కారణంతో 7లక్షలకు పైగా ఖాతాలకు పుస్తకాలను అసలు ముద్రించనే లేదు. ముద్రించిన వాటిలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే 7లక్షలకు పైగా పుస్తకాలను పంపిణీ చేయలేదు. కొన్ని కాలమ్‌లు రాలేదని, తప్పులు వచ్చాయంటూ నిలిపివేసిన వీటిలో దాదాపు నాలుగు లక్షల పుస్తకాలను మళ్లీ పంపిణీకి జిల్లాలకు పంపారు. అంటే, మొత్తంమీద 10లక్షలకు పైగా ఖాతాలకు పాస్‌పుస్తకాలు లేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు, ఈ ఖాతాల్లో ఉన్న భూములపై ఎవరికి హక్కులున్నాయో కూడా తెలియని పరిస్థితి. అసలు ఆ భూములు తమ పేరు మీద వస్తాయా రావా... పాస్‌పుస్తకాలు ఇస్తారో లేదోననే ఆందోళన రైతాంగంలో నెలకొంది. ధరణి పేరు మీద పైలట్‌గా ప్రారంభమయిన 21 మండలాల్లోనూ రికార్డులు సరిగా లేకపోవడంతో రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక పార్ట్–బీ పేరుతో వివాదాలున్నాయని పక్కన పెట్టిన భూములను ఇంతవరకు పరిష్కరించలేదు. ఇలా మరో 3లక్షలకు పైగా ఖాతాల్లో రైతులు అసలు తమ భూమి తమకు దక్కుతుందో లేదోననే ఆందోళనలో ఉన్నారు. పాస్ పుస్తకాలు ఇచ్చిన రైతులు కూడా తమ భూమి ఆన్లైన్లో ఎవరి పేరు మీద ఉందోననే గాభరాకు గురవుతున్నారు. కేవలం పాస్పుస్తకమే తమకు ఆధారంగా ఉందని, ఆన్లైన్ రికార్డుల్లో కూడా తమ పేర్లు చేర్చాలని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో భూరికార్డుల ప్రక్షాళన వివరాలను ఆన్లైన్లో ఉంచాలని, భూమి ఎవరి పేరు మీద ఉన్నదనే ప్రస్తుత స్థితిని తెలియజేస్తూ రికార్డులు నమోదు చేయాలని, అవసరమైతే మార్పులు, చేర్పులు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏడాది నుంచి రికార్డుల్లేవు.. వాస్తవానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు రెవెన్యూ రికార్డులు అందుబాటులో ఉండేవి కావు. రైతుల దగ్గర ఉండే పాస్‌పుస్తకాలు తప్ప భూమికి సంబంధించిన ఏ రికార్డు కావాలన్నా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే. ఆమ్యామ్యాలు సమర్పించుకోవాల్సిందే. అయితే, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ హయాంలో నిజామాబాద్ జిల్లాలో ‘భూభారతి’పేరుతో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించి రెవెన్యూ రికార్డులను కంప్యూటరీకరించే ప్రయత్నం జరిగినా అది పూర్తి కాలేదు. కానీ, భూపరిపాలన ప్రధాన కమిషనర్‌గా రేమండ్ పీటర్ బాధ్యతలు చేపట్టాక 2016లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని భూముల వివరాలను పబ్లిక్ డొమైన్లో ఉంచారు. ఫలానా సర్వే నంబర్లో ఉన్న భూమి ఏ రైతు పేరు మీద ఉందో చూపించే విధంగా ‘మా భూమి’వెబ్సైట్లో పొందుపరిచారు. కానీ, భూరికార్డుల ప్రక్షాళన ప్రారంభమయిన 2017, సెస్టెంబర్ 15 నుంచి ఈ వెబ్‌సైట్‌ను నిలిపివేశారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో భూరికార్డుల ప్రక్షాళన వివరాలను నమోదు చేసిన అధికారులు, ఆ తర్వాత ధరణి పేరుతో కొత్త వెబ్సైట్ ప్రారంభించారు. -
వైఎస్సార్‌సీపీతోనే రైతుసంక్షేమం
మదనపల్లె రూరల్: రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీతోనే రైతు సంక్షేమం సాధ్యమవుతుందని మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. మంగళవారం మదనపల్లె రూరల్ మండలంలోని కాశీరావుపేటలో వైఎస్సార్సీపీ రూరల్ మండల కన్వీనర్ మహేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. గ్రామ సమీపంలోని పొలాల్లోకి వెళ్లి రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధర, వ్యవసాయ విద్యుత్ అంశా ల గురించి వివరాలు అడిగారు. టమాట పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని, విద్యుత్ కోతల వల్ల పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని, మోటర్లకు లోఓల్టేజి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మిథున్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే రైతుసంక్షేమానికి పెద్దపీట వేసేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి కంకణబద్దులై ఉన్నారని తెలిపారు. నేరుగా రైతులు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే వేల కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారన్నారు. ఎండనక, వాననక రాత్రింబవళ్లు ప్రజాక్షేత్రంలోనే ఉంటూ సమస్యలు తెలుసుకుం టున్నారని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాల్లో రైతు శ్రేయస్సు కోసం రైతు భరోసా కింద పట్టాదారు పాసుపుస్తకం ఉన్న ప్రతి రైతుకు రూ. 50 వేలు ఇస్తారని హామీ ఇచ్చారని తెలిపారు. రైతులకు ఉచితంగా బోరు బావులు తవ్వించడం, హంద్రీ–నీవా ద్వారా సాగు, తాగునీరు ఇవ్వడం, రైతుల ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్సు రద్దుచేయడం, 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా పథకాలు అమలు చేస్తారన్నారు. ఎమ్మెల్యే తిప్పారెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటువేస్తే రైతుల సమస్యలన్నీ పూర్తిగా తీరిపోతాయన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు బాబ్జాన్, ఉదయ్‌కుమార్, షమీమ్ అస్లామ్, కౌన్సిలర్లు జింకా వెంకటాచలపతి, బాలగంగాధర్‌రెడ్డి, మస్తాన్‌రెడ్డి, ఖాజా, సుగుణాంజినేయులు, నీరుగట్టు వెంకటరమణారెడ్డి, వేమనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదుల వెల్లువ
‘రుణమాఫీ ఫిర్యాదులు కర్నూలు జిల్లాలో తక్కువగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈ జిల్లాలో రుణమాఫీ బాగానే జరిగిందనే విషయం స్పష్టమవుతోంది.’ – ఇవీ సోమవారం రుణమాఫీ ఫిర్యాదుల పరిష్కార వేదిక ప్రారంభం సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఆయన అంచనా తప్పని ఒక్కరోజులోనే తేలిపోయింది. తమకు రుణాలు మాఫీ కాలేదని, ఎందరు అధికారులను కలిసినా, ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేదని ఫిర్యాదు చేయడానికి వేలాదిమంది రైతులు తరలివచ్చారు. కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని పంచాయతీ వనరుల కేంద్రంలో రెండోరోజైన మంగళవారం కూడా రుణమాఫీపై ఫిర్యాదుల స్వీకరణ కొనసాగింది. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి తరలివచ్చిన రైతులతో జెడ్పీ ప్రాంగణం కిటకిటలాడింది. రెండో రోజు దాదాపు ఆరు వేల మంది రైతులు ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చారంటే జిల్లాలో రుణమాఫీ ఏ రీతిలో అమలైందో అర్థం చేసుకోవచ్చు. రైతు సాధికార సంస్థ నుంచి వచ్చిన సాంకేతిక నిపుణుల ద్వారా ఫిర్యాదులను పరిశీలించేందుకు కంప్యూటర్లు, ఇంటర్నెట్ సదుపాయంతో 15 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటర్ వద్ద రైతులు బారులుతీరారు. అర్ధరాత్రి వరకు ఫిర్యాదుల పరిశీలన కొనసాగింది. ఒక్కో రైతుది ఒక్కో వేదన.. పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తే ఒక్కో రైతుది ఒక్కో వేదనగా ఉంది. రుణమాఫీకి అన్ని అర్హతలున్నా ఒక్కరూపాయి కూడా మాఫీ కాని రైతులు 50 శాతం మంది వరకు ఉన్నారు. మిగిలిన వారిలో బంగారంపై తీసుకున్న రుణాలు మాఫీ కాని వారు, మొదటి విడత రైతులకు మాత్రమే నిధులు జమ అయ్యి.. రెండు, మూడు విడతలు రానివారు ఉన్నారు. మాఫీ నిధులు వడ్డీలకు కూడా సరిపోలేదని రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రెండు, మూడు విడతల మాఫీ నిధులను సంబంధిత బ్యాంకులకు విడుదల చేశామని, వెళ్లి బ్యాంకులో కలవాలంటూ అధికారులు పాత పాటే పాడారు. పరిష్కార వేదిక పేరిట హడావుడి తప్ప పెద్దగా ప్రయోజనం లేదనే విమర్శలు రైతుల నుంచి వ్యక్తమయ్యాయి. ఎన్నికల ముందు రైతుల కోసం ఏదో చేస్తున్నారే అభిప్రాయాన్ని ఏర్పరచుకునేందుకు చేస్తున్న ప్రయత్నంగా దుయ్యబట్టారు. బంగారంపై తీసుకున్న రుణం మాఫీ కాలేదు బంగారంపై రూ.78 వేల వ్యవసాయ రుణం తీసుకున్నా. కానీ మాఫీ కాలేదు. అర్హత ఉన్నందున మాఫీ కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఫిర్యాదు చేశా. యథావిధిగా ఎన్ఐసీ పోర్టల్‌లో వివరాలు లేవు. బ్యాంకుకు వెళ్లమని కాగితం చేతిలో పెట్టారు. – బి.గిరప్ప, చాగి, ఆదోని మండలం -
ఏపీలోనే రైతుల పరిస్ధితి దారుణంగా ఉంది
-
తెలంగాణలో వర్షాలతో రైతులకు భారీ నష్టం
-
రైతులపై సోమిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
కర్నూలు : కర్నూలులో మంత్రి సోమిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జెడ్పి మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ గ్రీవెన్స్ సెల్లో సోమిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులను పారిశ్రామికవేత్తలతో పోల్చారు. కేవలం లక్ష రూపాయలు అప్పు ఉన్న రైతులు ఆత్మహత్యలు ఎందు చేసుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన పారిశ్రామిక వేత్తలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవడం లేదు అంటూ, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను చులకనగా చేసి మాట్లాడారు. రైతులకు ఆదర్శవంతంగా రుణమాఫీ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు. రూ. 680 కోట్లతో రైతులకు కొంత రుణమాఫీ చేశామన్నారు. రుణమాఫీలో 9లక్షల ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. వాటిని పరిష్కరించి, అర్హులైన అందరు రైతులకు రుణమాఫీ అందజేస్తామని తెలిపారు. కాగా, సోమిరెడ్డికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి షాకిచ్చారు. జిల్లాలోని రైతాంగ సమస్యలను మంత్రి వద్ద ఎకరువు పెట్టారు. జిల్లాలో కరువు మండలాల గుర్తింపుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో 53 మండలాలకు గాను కేవలం 37 మండలాలను కరువు మండలాలుగా ఎంపిక చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. వర్షపాతం లేని కారణంగా కర్నూలు జిల్లాను కరువు పీడిత జిల్లాగా ఎంపిక చేయాలన్నారు. తమ ప్రాంతంలో వర్ష పాతం తక్కువగా ఉన్నా తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నకిలీ విత్తనాల బెడద అధికంగా ఉందని కేఈ పేర్కొన్నారు. -
ఖరీఫ్ సాగుకు కరువు పోటు
ఖరీఫ్ సాగు రైతులను కుంగదీస్తోంది. ఇటీవల ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. మరోవైపు వేడి గాలులు పంటల సాగుపై ప్రభావం చూపుతున్నాయి. బోర్లలో భూగర్భజలాలు అడుగంటడంతో ఇప్పటికే కొన్ని బోర్లలో నీరు రావడం లేదు. మరికొన్ని బోర్లలో నీరు వస్తున్నా వరి పొలాలు తడారిపోతున్నాయి. దీంతో ఖరీఫ్‌లో పంటలు సాగుచేసిన రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే వేలాది రూపాయలు ఖర్చు చేసి పంటలు సాగుచేసినా చేతికందుతుందన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. వరుణుడు కరుణించపోతాడా అన్న చివర ఆశతో ఆకాశం వైపు రైతులు ఎదురుచూస్తున్నారు. డక్కిలి (నెల్లూరు): ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు కరువు పోటు తప్పడం లేదు. వరిపంటను సాగుచేసిన రైతులను వాతావరణ పరిస్థితులు నష్టాలోకి నెట్టేస్తున్నాయి. దీంతో పంటల సాగు రైతులకు ప్రశ్నార్థకంగా మారింది. డక్కిలి మండలంలో నెల్లూరు మసూర 34449, ఎంటీయూ–1010 రకం వరి పంటను సుమారు 800 హెక్టార్లలో ఖరీఫ్ కింద సాగు చేశారు. బోర్లు, ఏర్లను ఆధారం చేసుకొని వరి పంటను సాగుచేసిన రైతులకు ప్రస్తుతం పంటలు చేతికందుతాయా అన్న ఆందోళన నెలకొంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ప్రతి ఏటా జూన్, జూలై మాసాల్లో తొలకరి వర్షాలు కురుస్తాయి. అయితే ఈ ఏడాది రైతులను తొలకరి వర్షాలు పలకరించకపోవడంతో సాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారు. అందుబాటులో ఉన్న సాగునీటి వనరులను పొందేందుకు రైతులు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కొంతమంది రైతులు అయిల్ ఇంజిన్లు ఏర్పాటు చేసుకుని నీటిని పంపింగ్ చేస్తున్నారు. మరికొంతమంది ఏర్లు, కాలువల్లో ఉన్న కొద్దిపాటి నీటితో వరి పంటకు ఆరుతడులు కడుతూ పంటను సంరక్షించుకుంటున్నారు. కళ్లెదుటే ఎండిపోతున్న వరి రెండు నెలల క్రితం బోర్లలో, ఏరుల్లో నీరు పుష్కలంగా ఉంది. దీంతో రైతులు ఖరీఫ్ కింద తమకున్న పొలాల్లో వరి పంటను సాగు చేశారు. గత 10 రోజుల వరకు సాగునీటి కొరత ఎదుర్కొన్నారు. ప్రస్తుతం బోర్లు, ఏరుల్లో భూగర్భజలాలు అడుగంటడంతో సాగునీటి కొరతతో ఆందోళన చెందుతున్నారు. సాగునీటి కొరతతో తమ కళ్లెదుటే పంట ఎండిపోతుండడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. పంటను ఎలానైనా రక్షించుకోవాలన్న ఆశతో బోర్లు వేస్తున్నా నీరు రావడం లేదు. దీంతో రైతులు మరింత అప్పుల్లో కూరుకుపోతున్నారు. నష్టపోతున్న పంటలకు పరిహారం అందించి ఆదుకోవాలని పలు గ్రామాల రైతులు వ్యవసాయశాఖ అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. భగీరథ యత్నం డక్కిలి మండలంలో ప్రధానంగా నాయుడుపాళెం, చాకలపల్లి, పాతనాలపాడు, భీమవరం, కొత్తనాళ్లపాడు, లింగసముద్రం, దగ్గవోలు, మోపూరు, దందవోలు, ఆల్తూరుపాడు, తీర్థంపాడు, ఆముడూరు, శ్రీపురం, మాటుమడుగు తదితర గ్రామాల్లో ఖరీఫ్ కింద వరి పంట సాగు చేశారు. ప్రస్తుతం వరి పంట వెన్ను దశ, చిరుపొట్ట దశలో ఉంది. మరో నెల రోజులు సాగునీరు అందితే రైతులకు పంట చేతికందుతుంది. ఇప్పటికే రైతులు ఎరువులు, పురుగుమందులు, కూలీలు, దుక్కుల కోసం ఎకరాకు రూ.30 వేలు ఖర్చు చేశారు. మరోవైపు సాగునీటి కొరతను తీర్చుకునేందుకు అదనంగా కొంత ఖర్చు చేయాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. వ్యయ ప్రయాసాలకు లోనైనా మరో వారం రోజుల్లో వరుణుడు కరుణించకపోతే డక్కలి మండలంలో సాగవుతున్న 90 శాతం వరి పంట ఎండిపోయే అవకాశం ఉందనే ఆందోళనతో రైతులు ఇప్పటికే వ్యవసాయశాఖ అధికారులకు ఆర్జీలు ఇచ్చారు. ఎండిపోయిన డ్యామ్ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది డక్కిలి మండలంలోని చాకలపల్లి సమీపంలో ఉన్న అలపలేరు డ్యామ్ పూర్తిగా ఎండిపోయింది. ఈ ప్రాంతంలో డ్యామ్‌లో నీరు ఉండడం వల్ల పరిసర గ్రామాల్లోని బోర్లలో నీరు బాగా వచ్చేది. అయితే ఈ ఏడాది డ్యామ్ ఎండిపోవడంతో భూగర్భజలాలు అడుగంటి బోర్లలో చుక్కనీరు రాని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదని ఈ ప్రాంత రైతులు చెబుతున్నారు. పంటను రక్షించుకునేందుకు డ్యామ్ నుంచి కొంతమంది రైతులు లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతిలో ఆయిల్ ఇంజిన్లు, విద్యుత్ మోటార్లతో నీటిని పంపింగ్ చేకుంటున్నా మరో రెండు రోజులు మాత్రమే నీరు వస్తుందని చాకలపల్లి, యల్లావజ్జలపల్లి గ్రామాలకు చెందిన రైతులు చెబుతున్నారు. పంటలు ఎండిపోతున్నాయి గత 10 రోజుల నుంచి సాగునీటి కొరత ఎదుర్కొంటున్నాం. ఏర్లు, బోర్లలో నీరు అడుగంటడంతో అలపలేరు డ్యామ్ నుంచి ఆయిల్ ఇంజిన్లు ఏర్పాటు చేసుకుని నీరు పొలాలకు అందిస్తున్నాం. ప్రతి రోజూ ఆయిల్ ఇంజిన్లు నడిపేందుకు బాగా ఖర్చవుతోంది. డ్యామ్‌లో కూడా నీరు అడుగంటింది. – ఎం.వెంకటేశ్వర్లు, చాకలపల్లి, రైతు రూ.వేలు ఖర్చు చేయాల్సివస్తుంది ఖరీఫ్ కింద ఐదెకరాల్లో వరి పంట సాగు చేశా. బోర్లలో నీరు రాకపోవడంతో అలపలేరు డ్యామ్ నుంచి నీటిని పంపింగ్ చేసుకునేం దుకు పైప్‌ల కోసం రూ.20 వేలు ఖర్చు చేశాను. అయినా పంట చేతికి వస్తుందన్న నమ్మకం లేకుండాపోయింది. ఎండిపోయిన పంటలకు బీమా వర్తించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – మధు, చాకలపల్లి, రైతు -
టీజేఎస్ పోరుబాట
సాక్షి, హైదరాబాద్: రైతులు, నిరుద్యోగుల సమస్యలపై పోరుబాటకు తెలంగాణ జన సమితి (టీజేఎస్) సిద్ధమైంది. ఈ నెల 20 నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వాటి పరిష్కారంలో ముందుండేలా ఏర్పాట్లు చేస్తోంది. ముందస్తు ఎన్నికల ఆలోచనల నేపథ్యంలో పార్టీని వీలైనంతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళిక రచించింది. ఆ తరువాత జిల్లాల్లో బస్సుయాత్రకు ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయాలన్న ఉద్దేశంతోనే ఉన్నా.. కలసి వచ్చే పక్షాలనూ కలుపుకునే అవకాశాలను పరిశీలిస్తోంది. అయితే ముందు సొం త కార్యాచరణే చేపట్టాలని ఇటీవల ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు టీజేఎస్ అధికార ప్రతినిధి జి.వెంకట్‌రెడ్డి వెల్లడించారు. సకల జనుల సమ్మె రోజునే.. పాసు పుస్తకాల్లో దొర్లిన తప్పులను ఎత్తిచూపుతూ వాటి సవరణ కోసం మండల కేంద్రాల్లో రైతులతో విజ్ఞాపన పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ నెల 20 నుంచి చేపట్టాలని టీజేఎస్ నిర్ణయించింది. సెప్టెంబర్ 1 నుంచి వారం రోజులు.. రైతు బంధులో జరుగుతున్న అవకతవకలు, నష్టపోయిన రైతులతో మండల అధికారులకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చే కార్యాచరణను అమలు చేయనుంది. ఆ బాధ్యతలను టీజేఎస్ అధికార ప్రతినిధి వెంకట్‌రెడ్డికి అప్పగించింది. రైతులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారంపై వచ్చేనెల 12న హైదరాబాద్‌లో దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. సకల జనుల సమ్మె చేపట్టిన సెప్టెంబర్ 12వ తేదీనే ఈ దీక్ష చేపట్టాలని తీర్మానించింది. రాజీవ్ లేదా విజయవాడ రహదారిపై భూములు తీసుకున్న వివిధ కంపెనీలను పరిశీలించి ఎంత మందికి ఉద్యోగాలు కల్పించారో ఈ నెల 27 నుంచి 31 వరకు కార్యక్రమం నిర్వహించి చర్చించాలని టీజేఎస్ నిర్ణయించింది. భూములు కోల్పోయిన వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలన్న డిమాండ్‌తో నిరుద్యోగుల నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 30న రాజీవ్ రహదారి, విజయవాడ హైవేపై సడక్ బంద్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యాచరణ విజయవంతం కోసం అన్ని జిల్లాల్లో పార్టీ శ్రేణులు పక్కాగా ఏర్పాట్లు చేయాలని సూచించింది. తరువాత పార్టీ అధ్యక్షుడు కోదండరాం నేతృత్వంలో ప్రజల్లోకి వెళ్లాలని, జిల్లాల్లో బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించింది. -
6 జిల్లాల్లో కరువు కాటు!
సాక్షి, అమరావతి:రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కరువు వల్ల భారీగా పంట నష్టం సంభవించిందని వైఎస్సార్, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. దాదాపు 5 లక్షల హెక్టార్లలో 33 శాతానికిపైగా పంట దెబ్బతిందని, దీనివల్ల 3.10 లక్షల టన్నుల మేర వ్యవసాయోత్పత్తుల దిగుబడి పడిపోయినట్లేనని పేర్కొన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఏడు జిల్లాల్లో పంటలు ఎండిపోతున్న పరిస్థితుల్లో జూన్, జూలై నెలల వర్షపాతం, వర్ష విరామం (డ్రైస్పెల్), ఇతర నిబంధనను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం ఈ నెల 8న 275 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. కరువు మండలాల్లో రైతుల వారీగా, పంటల వారీగా నష్టాలను మదించి త్వరగా నివేదికలు పంపాలని ఆరు జిల్లాల అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర సర్కారు ఆదేశించింది. దీంతో ఈ జిల్లాల్లోని 275 కరువు మండలాల్లో రైతుల వారీగా, పంటల వారీగా నివేదికలు రూపొందించి సంయుక్త వ్యవసాయ కమిషనర్లు కలెక్టర్లకు సమర్పించారు. ఆయా జిల్లాల కలెక్టర్ల సూత్రప్రాయ ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. కేంద్ర కరువు నిబంధనావళి ప్రకారం 33 శాతం లోపు పంట నష్టం వాటిల్లిన వారికి ఎలాంటి సాయం (పెట్టుబడి రాయితీ) ఇవ్వరు. అందువల్ల ఇలాంటి నష్టాలను వ్యవసాయ అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. మొత్తం 5 లక్షల హెక్టార్లలో(12.5 లక్షల ఎకరా) 3.10 లక్షల టన్నుల మేరకు పంట దిగుబడి కోల్పోయినట్లు ఆయా జిల్లాల అధికారులు పంపిన నివేదికల్లో పేర్కొన్నారు. కరువు మండలాల్లో పంట నష్టంపై ప్రాథమిక నివేదికలను ప్రభుత్వానికి పంపామని వైఎస్సార్, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అధికారులు తెలిపారు. పంట నష్టపోయిన 7.40 లక్షల మంది రైతులకు రూ.695 కోట్లు పైగా పెట్టుబడి రాయితీ ఇవ్వాలని అధికారులు నివేదించినట్లు తెలిసింది. జిల్లాల నుంచి వచ్చిన నివేదికలను వ్యవసాయ శాఖ క్రోడీకరించి పంట నష్టం వివరాలతో సమగ్రమైన నివేదిక రూపొందించి రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్‌కు పంపుతుంది. విపత్తు నిర్వహణ కమిషనర్ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనుమతితో సంబంధిత మంత్రికి, ముఖ్యమంత్రికి పంపించి వారి ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి కరువు సాయం కోసం నివేదిక పంపనున్నారు. తుది నివేదికను ఈ వారంలో కేంద్ర ప్రభుత్వానికి పంపే అవకాశం ఉన్నట్లు సమాచారం. కర్నూలు జిల్లాలో అత్యధిక నష్టం క్షేత్రస్థాయి అధికారుల నివేదికల ప్రకారం కరువు వల్ల కర్నూలు జిల్లాలో అధిక నష్టం సంభవించింది. ఈ జిల్లాలో 2.70 లక్షల మంది రైతులు పంటలు కోల్పోయారు. 2.17 లక్షల హెక్టార్లలో 33 శాతానికిపైగా పంట నష్టం వాటిల్లింది. ఈ ఒక్క జిల్లాలోనే లక్ష టన్నులపైగా వ్యవసాయోత్పత్తుల దిగుబడి పడిపోనుందని అంచనా. అనంతపురం జిల్లాలో 2.20లక్షల మంది రైతులకు చెందిన పంటలు దెబ్బతిన్నాయి. 1.5లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 1.10 లక్షల టన్నులకుపైగా పంట దిగుబడికి నష్టం జరిగినట్లు అంచనా. చిత్తూరు జిల్లాలో 1.75 లక్షల మంది రైతులు కరువు వల్ల పంటలు నష్టపోయారు. 90 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. దీనివల్ల జిల్లాలో 60 వేల టన్నుల వ్యవసాయోత్పత్తుల దిగుబడి తగ్గిపోనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. -
మృత్యుభూతం
ఆ రైతు, అతనితోపాటు ఒక డాక్టరు.. చనిపోవడానికి సిద్ధంగా వున్న ఆ ముసలామె మంచం ఎదురుగా నిలబడ్డారు. ఆమె స్తబ్దుగా వుంది. అన్నీ వదిలేసినట్లు స్థిరంగా ఆ ఇద్దరి సంభాషణ వింటూ, వాళ్ళనే చూస్తూ వుంది. ఆమె చావడానికి సిద్ధంగా వుంది. వచ్చే చావుని ఎదిరించాలన్న కోరిక ఆమెలో లేదు. తొంభై రెండేళ్ళ వయసు అంటే అదే చివరి అంకం అని ఆమెకి తెలుసు.జ్యేష్ఠ మాసపు సూర్యుడు కిటికీలోనుంచి, తెరిచివుంచిన తలుపులోనుంచి మంటపుట్టించే వేడి కిరణాలను ప్రసరిస్తున్నాడు. అవి బురదమట్టితో అలికిన ఇంటి నేలపైన అడ్డదిడ్డంగా పడుతున్నాయి. నాలుగు తరాల మోటు మనుషులు వేసిన అడుగుల కింద నలిగిన నేల అది. ఎండతో పాటు వచ్చిన సన్నటి గాలులు పొలాల వాసనను వెంటబెట్టుకొస్తున్నాయి. డాక్టరు గొంతుపెగిల్చి కాస్త గట్టిగానే మాట్లాడటం మొదలుపెట్టాడు – ‘‘హోన్రే! మీ అమ్మ పరిస్థితి ఇలా వున్నప్పుడు నువ్వు ఆమెను వదిలి పెట్టడం మంచిది కాదు. ఆమె ఏ క్షణంలోనైనా ప్రాణాలు వదలచ్చు’’. రైతు చాలా బాధపడి సమాధానం ఇచ్చాడు – ‘‘కానీ పొలం నుంచి గోధుమలు తెచ్చుకోవాలి. కుప్పలూడ్చి అలాగే వదిలేసి చాలా రోజులైంది. వాతావరణం కూడా అనుకూలంగా వుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తెచ్చుకోగలను. ఏమంటావు అమ్మా?’’ అన్నాడు. మరణశయ్య మీద వున్న ఆమె, కొడుకు లోభత్వానికి బాధపడ్డా, సరే అన్నట్లు కళ్ళతో, ముఖకవళికలతో చెప్పింది. కొడుకు గోధుమలుతెచ్చుకోడానికి వెళ్తే, ఒంటరిగా ప్రాణం వదలడానికి సిద్ధపడ్డట్టుగా వున్నదా సమాధానం.కానీ డాక్టరు కోపం నషాళాన్ని తాకింది. ‘‘నీ అంత దుర్మార్గుడు వుంటాడా? నేను నిన్ను అడుగు కూడా బయటపెట్టనివ్వను. అర్థమయిందా? కాదూ కూడదూ వెళ్ళాల్సిందే అంటే వెళ్ళే ముందు నర్స్ రాపేని తీసుకురా. ఆమెకు నీ తల్లిని దగ్గరుండి చూసుకోమని చెప్పి అప్పుడు కదులు. నా మాట వింటావా లేదా? నీకు మాత్రం ఇలాంటి పరిస్థితి రాదా? అప్పుడు కుక్కకన్నా హీనంగా చస్తావు. వింటున్నావా?’’సన్నటి పొడుగాటి ఆ రైతు చిన్న చిన్న అడుగులు వేస్తూ వెనకాముందు ఆడాడు. నిర్ణయం తీసుకోలేక తర్జనభర్జనపడ్డాడు. ఓ పక్క డాక్టరు అంటే భయం. మరో పక్క డబ్బులు వృధా అయిపోయే పరిస్థితి. స్వతహాగా రూపాయి రూపాయి కూడబెట్టడాన్ని ఎంతో ఇష్టపడే పొదుపరి. వెనుకాడాడు. లెక్కలు కట్టాడు.తడబడుతూ మాట్లాడాడు – ‘‘ఆమె ఎంత తీసుకుంటుంది?’’ అన్నాడు.‘‘నాకేం తెలుసు? ఆమెతోనే మాట్లాడుకో! కానీ చెప్తున్నా. గంటలో ఆమె ఇక్కడుండాలి.’’రైతు ఒక నిర్ణయానికి వచ్చాడు.‘‘కోప్పడకండి డాక్టరుగారూ. నేనే వెళ్ళి తీసుకొస్తాలెండి.’’ అన్నాడు. డాక్టరు వెళ్ళిపోయాక రైతు తన తల్లి వైపు తిరిగి తప్పదని ధ్వనిస్తున్న గొంతుతో – ‘‘నేను వెళ్ళి రాపేని పిల్చుకొస్తాను. ఖంగారు పడకు’’ అని బయల్దేరాడు.లా రాపే ముసల్ది. బట్టలు వుతకడం ఆమె వృత్తి. ఆ చుట్టుపక్కల ఎంతో మంది చావుల్ని చూసింది. వాళ్ళు చనిపోతుండగా చూసింది. తెల్లటి గుడ్డలో వాళ్ళను చుట్టిపెట్టి, తిరిగిరాని లోకాలకు పంపించేదాకా వెంటే వుంది. అది అయిపోగానే బతికున్నవాళ్ళ గుడ్డల్ని ఇస్త్రీ చేసే పని చేసుకునేది.ఆమె ఎవరిమీదో విరోధమున్నట్లు, ఇంకెవరినో చూసి అసూయపడుతున్నట్లు వుంటుంది. డబ్బు ఆశ. చనిపోయేవాళ్ళ యాతన చూడటం అంటే ఆమెకు ఒక పైశాచిక ఆనందం వున్నట్లు అందరూ అనుకుంటారు. హాన్రే బాన్టెంప్స్ ఆమె ఇంట్లో అడుగుపెట్టేసరికి ఆమె బట్టలకోసం గంజి తయారుచేస్తూ వుంది. ‘‘ఏమ్మా రాపే? ఏంటి విశేషాలు?’’ అన్నాడు పలకరిస్తూ. ఆమె తల వెనక్కి తిప్పి అతన్ని చూసింది.‘‘ఏముంటాయి. అంతా మాములే. నీ సంగతులు చెప్పు’’ అంది. ‘‘నేనా? నాకేం? నేను బాగానే వున్నాను. మా అమ్మ ఆరోగ్యమే సరిగాలేదు’’‘‘మీ అమ్మా?’’‘‘అవును మా అమ్మే’’‘‘ఏమైందామెకి?’’ ‘‘ఏముంది. అంతా అయిపోయింది. చావడానికి సిద్ధంగా వుంది’’ ‘‘అయ్యో మరీ అంత దారుణంగా వుందా?’’ ముసలామె గంజి కలుపుతున్న నీటిలో నుంచి చేతులు బయటికి తీసి జాలిగా అడిగింది. ‘‘డాక్టరు రేపు వుదయం దాకా కూడా వుండదేమో అన్నాడు’’‘‘అయ్యో! అయితే పరిస్థితి అసలు బాలేదన్నమాట’’హాన్రే కాస్సేపు తటపటాయించాడు. కాసేపటికి విషయంలోకి రాక తప్పలేదు. ‘‘ఆమె వెళ్ళిపోయేదాకా ఆమెతో వుండాలి. ఎంత తీసుకుంటావు? నేనేం డబ్బులున్నవాణ్ణి కాదు. కనీసం పనిమనిషిని పెట్టుకునే స్థోమత కూడా లేదు. అమ్మ ఈ పరిస్థితికి రావడానికి కారణం కూడా అదే!’’.అవన్నీ పట్టనట్లు అతనివైపు చూసింది రాపే. ‘‘రెండు రేట్లు వున్నాయి. పగటిపూట నలభై సౌలు, రాత్రికి మూడు ఫ్రాంకులు. ఈ రేటు డబ్బు వున్నవాళ్ళకి. ఇరవై సౌలు పగటికి, నలభై రాత్రికి ఇది మిగతావాళ్ళకి రేటు. నువ్వు కూడా ఇరవై, నలభై ఇవ్వు’’ అంది.రైతు ఆలోచించాడు. తన తల్లి గురించి తనకు బాగా తెలుసు. ఆమె పట్టు పట్టిందంటే వదిలే రకం కాదు. ఎప్పుడూ తలవంచిన ఘటం కాదు.డాక్టర్లు ఎన్ని చెప్పినాకనీసం ఇంకో వారం బండి లాగేయ్యగలదు. ఇదంతా ఆలోచించుకోని అతను ఆమెతో కొత్త ప్రతిపాదన పెట్టాడు. ‘‘అలా కాదు. నువ్వు ఆమె చనిపోయేదాకా ఆమెకు సేవ చెయ్యాలి.మొత్తానికి కలిపి ఇప్పుడే ఒక రేటు అనేసుకుందాం. ఎలా జరిగినా సరే! డాక్టర్లేమో ఇవాళో రేపో అంటున్నారు. అలా జరిగితే నీకే లాభం, నాకు నష్టం. అలా కాకుండా ఆమె తట్టుకోని నిలబడిందనుకో నీకు నష్టం, నాకు లాభం.’’నర్స్ ఆ మనిషి వైపు ఆశ్చర్యంగా చూసింది. చావుతో పందేలు వేయడం ఆమెకు కొత్త. అంచేత కాస్త తటపటాయించింది. నాలుగు డబ్బులు ఎక్కువ వచ్చే అవకాశం వుందని అనిపించింది. ఇంతలో వచ్చినవాడు ఏదైనా మోసం చేసే అవకాశం కూడా లేకపోలేదు అనుకుంది. ‘‘మీ అమ్మను చూస్తేగానీ నేను ఏ విషయం చెప్పలేను’’ అంది. వెంటనే చేతులు కడుక్కొని, అతని వెంటే బయల్దేరింది. దారిలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇద్దరూ. ఇంటికి చేరుకున్నాక హోన్రే సన్నగా గొణిగాడు – ‘‘ఈపాటికే అంతా అయి పోయిందేమో’’. అలా జరిగి వుంటే బాగుండు నన్న కోరిక అతని గొంతులో అస్పష్టంగా వినిపించింది.లోపల ముసలామె బతికేవుంది. ఆ దరిద్రపు మంచం మీద అలాగే వెల్లకిలా పడుకొని వుంది. దాదాపు నూరు సంవత్సరాల జీవితంలో ఆమె సాధించినవాటన్నింటికీ ఇప్పుడు అలిసిపోయినట్లు పడివుంది. రాపే మంచం దగ్గరకు వెళ్ళి చావటానికి సిద్ధంగా వున్న ముసలామెను చూసింది. ఆమె నాడి పరిశీలించి, గుండె పైన చిన్నగా తట్టింది. ఆమె శ్వాస విని, కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టాలని ప్రయత్నించింది. అలా కొంతసేపు పరిశీలించిన తరువాత ఆ గదిలో నుంచి బయటకు నడిచింది. ఆమె వెంటే అతను కూడా కదిలాడు. ఆ ముసలామెకి ఆ రాత్రి గడిస్తే గొప్ప అని అనుకుంది రాపే.‘‘ఏమంటారు’’ అడిగాడతను. ‘‘బహుశా రెండురోజులు వుంటుందేమో! మహా అయితే మూడు అంతే. నాకు మొత్తం అన్నీ కలిపి ఆరు ఫ్రాంకులు ఇవ్వు చాలు’’ అంది. ‘‘ఆరు ఫ్రాంకులా? ఆరు ఫ్రాంకులు!’’ అంటూ అరవడం మొదలుపెట్టాడు. ‘‘నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను చెప్తున్నాను కదా! ఆమె ఓ ఐదారు గంటలకన్నా బతకదని.’’ఇద్దరి మధ్యా తీవ్రమైన వాదన జరిగింది. ఆమె ఇంటికి వెళ్ళాలి కాబట్టి త్వరగా తేల్చమంది.ఇతనికి కూడా పొలానికి వెళ్ళకపోతే గోధుమల పనికాదని తెలుసు. చివరికి ఆమె చెప్పిన రేటుకే అంగీకరించాడు. అతను అంగలు వేసుకుంటూ ఎండకు గోధుమలు ఆరబెట్టిన పొలానికి వెళ్ళిపోయాడు. ఆమె ఇంట్లోకి నడిచింది. ఆమె ఎప్పుడూ తనతో పాటు ఏదో ఒక పని తెచ్చుకుంటుంది. చనిపోతున్నవాళ్ళ పక్కనే తనపని కూడా చేసుకుంటూ కూర్చుంటుంది. ఒకసారి తన పని చేసుకుంటే, ఒకసారి తనని నియమించుకున్న కుటుంబానికి పని చేసేది. ఒకసారి పనికి కుదిరాక ఎంత పనైనా చేసేస్తుంది.ఉన్నట్టుండి ఆమెకు ఏదో జ్ఞాపకం వచ్చింది.‘‘నీ గొంతులో ఎవరైనా కాసిని పవిత్రజలం పోశారామ్మా?’’ అంది.ముసలామె లేదన్నట్లు తలాడించింది. రాపే కాస్త భయం భక్తి వున్న మనిషే. అందుకే ఆ సమాధానం విని వెంటనే లేచి నిలబడింది. ‘‘భగవంతుడా! అలా ఎలా జరిగింది. వుండు నేను ఇప్పుడే వెళ్ళి నీకు పవిత్రజలం పోసే ఏర్పాటు చేస్తాను’’ అంటూ పాస్టరు ఇంటికి పరుగులుపెట్టింది. ఆమె ఉరుకులు చూసి వీధుల్లో వుండే జులాయివాళ్ళంతా ఏదో ప్రమాదం జరిగిందేమో అనుకున్నారు.ఫాదరు వెంటనే తన తెల్లగౌను వేసుకొని ఆమె వెంట బయల్దేరాడు. అతనితో పాటే చర్చిలో కాయిర్ నిర్వహించే బృందంలో పిల్లవాడు కూడా వచ్చాడు. వీళ్ళంతా ఇలా నడుస్తుంటే హోన్రే దూరం నుంచి చూసి, ‘‘పాస్టరుగారు ఎక్కడికి వెళ్తున్నారో’’ అన్నాడు. అతనికన్నా తెలివైన మరో మనిషి సమాధానమిచ్చాడు – ‘‘ఇంకెక్కడికీ! అదిగో ఆయన మీ అమ్మకోసమే పవిత్రజలం తీసుకెళ్తున్నాడు’’. హోన్రే ఏమాత్రం ఆశ్చర్యపోలేదు. పైగా ‘‘అంతే అయ్యుంటుందిలే’’ అని తన పనిలో నిమగ్నమైపోయాడు.అతని తల్లి పాస్టరు ముందు తన తప్పులన్నీ చెప్పి క్షమాపణలు అడిగింది. స్వచ్ఛతను, శాంతిని పొందింది. ఆ తరువాత పాస్టరు వెళ్ళిపోయాడు. ఇరుకు గదిలో ఇద్దరే మిగిలారు. చావడానికి సిద్ధంగా వున్న ముసలామెను చూసి ఇంకా ఎంతకాలం ఇలా ఆయిష్షుని సాగదీస్తుందో అని ఆలోచిస్తోంది రాపే. కృష్ణపక్ష రోజులు కావటంతో గాలులు వీచడం మొదలైంది. గోడకు వేలాడదీసిన కేలండర్ టపటపమని కొట్టుకుంటోంది. ఒకప్పుడు తెల్లగా వుండి ఇప్పుడు పచ్చగా మారిన కర్టెన్లు గాలికి ముసలి ప్రాణంలాగే ఎగిరిపోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నాయి.మంచంలో కదలకుండా, కళ్ళు మాత్రం తెరిచి మనసులో ఏ భావం లేకుండా చావుకోసం ఆమె ఎదురుచూస్తున్నట్లుంది. వచ్చినట్లే వచ్చి రాకుండాపోతున్న మృత్యువు ఆమెతో ఆటలాడుతోంది. భారంగా తీస్తున్న ఊపిరి ఆమె నోటినుంచి సన్నటి ఈలలా వస్తోంది. ఆ శబ్దం ఏ క్షణంలోనైనా ఆగిపోతుంది. ఈ భూమి మీద మరో ఆడమనిషి తగ్గిపోతుంది. అలా జరిగినా ఎవరికీ పెద్ద బాధ కలిగేలా లేదు. పొద్దుగుంకుతుండగా హాన్రే తిరిగి వచ్చి నేరుగా ఆమె మంచం దగ్గరకు వెళ్ళి ఆమె ఇంకా ప్రాణాలతోనే వుందని తెలుసుకున్నాడు.‘‘ఎలా వుంది’’ అన్నాడు అక్కడికి ఆమెకి ఏదో తగ్గిపోయే అనారోగ్యం వున్నట్లు. ఆ తరువాత రాపేని వెళ్ళిపొమ్మని చెప్పాడు. ‘‘రేపు ఉదయం ఐదుగంటలకి వచ్చేసెయ్’’ అన్నాడు.‘‘అలాగే. ఐదుకే వస్తాను’’ అన్నదామె.తెల్లవారుతుండగా ఆమె ఆ ఇంటికి వచ్చేసరికి హాన్రే సూప్ తయారు చేసుకొని తాగుతూ కనిపించాడు.‘‘మీ అమ్మ చనిపోయిందా లేదా?’’ అడిగిందామె.‘‘లేదు. కాస్త కుదుటపడినట్లు వుంది’’ అంటూ సమాధానం చెప్పాడు. అలా చెప్తున్నప్పుడు రాపే వైపు కనుచివర్ల నుంచి దొంగచూపు చూశాడు. ఆ తరువాత లేచి పనికి వెళ్ళిపోయాడు. రాపే ఆందోళనగా చావుబతుకుల్లో వున్న ముసలామె దగ్గరకు వెళ్ళింది. ఆమె అలాగే వుంది. కదలకుండా కళ్ళు మాత్రం తెరిచి, చేతులతో మంచాన్ని బలంగా పట్టుకొని వుంది. ఇది ఇలాగే సాగితే ఆమె ఇంకో రెండు రోజులో, నాలుగు రోజులో బతకచ్చు. ఎనిమిది రోజులు కూడా పట్టచ్చు. అసలే అత్యాశ వున్న ఆమెకు మోసపోయానేమోనన్న భయం కలిగింది. జిత్తులమారి రైతుమీద, చావడానికి సిద్ధంగా లేని అతని తల్లిపైనా చాలా కోపం వచ్చింది.అయినా సరే ఆమె తన పని మానుకోలేదు. అన్ని సేవలు చేసి ముడతలు పడ్డ ముసలామె ముఖాన్నే చూస్తూ ఎదురుచూసింది. కాస్సేపటికి టిఫిన్ చెయ్యడానికి తిరిగివచ్చిన హాన్రే సంతోషంగానూ, తృప్తిగానూ వున్నట్లు ప్రవర్తించాడు. కాస్త పరిహాసంతో కూడిన చణుకులు విసిరాడు.అతని గోధుమపంట సకాలంలో చేతికి వచ్చిన ఆనందం అతని మాటల్లో వుంది. రాపేలో అసహనం పెరిగిపోయింది. గడుస్తున్న ప్రతి నిమిషం ఆమె నుంచి సమయాన్ని, డబ్బుని దొంగిలిస్తున్నట్లుగా అనిపించసాగింది. ఆమెలో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. ఈ రోగిష్టిదాన్ని, దిక్కుమాలిన పక్షిని, లేకుండా చేస్తే? తన డబ్బుని తనకి కాకుండా చేస్తున్న ఆ ఎగశ్వాసని అసలు లేకుండా చేస్తే? ఆమె గొంతుని నులిమేస్తే? అంతలోనే అలా చేయడంలో వున్న సమస్యలను తలచుకుంది. మరో రకంగా పథకం వెయ్యసాగింది. మంచం దగ్గరగా వెళ్ళి –‘‘మీరెప్పుడైనా మృత్యుభూతాన్ని చూశారా?’’ అంది.‘‘లేదు’’ అని ముసలామె సమాధానం చెప్పింది. ఇక అక్కడ్నుంచి నర్స్ ఆమెకు మృత్యుభూతం గురించి భయపెట్టేలా చెప్పడం మొదలుపెట్టింది. చావుబతుకుల్లో వున్న ముసలామె బలహీనమైన మనసును భయంతో వణికించేసింది. చావడానికి కొన్ని నిమిషాల ముందు ఓ భూతం కనిపిస్తుందనీ, మరణయాతన నుంచి ఆ భూతం విముక్తిని ఇస్తుందని చెప్పింది. ఆ భూతం చేతిలో ఓ చీపురు వుంటుందనీ, తలపైన కవచం వుంటుందనీ, భయంకరమైన అరుపులు అరుస్తుందని చెప్పింది.‘‘ఒక్కసారి ఆ మృత్యుభూతాన్ని చూస్తే ఇక అంతా అయిపోయినట్లే. కొన్ని నెలల ఆయుష్షు వున్నవాళ్ళు కూడా ఆ క్షణమే ప్రాణాలు వదిలేస్తారు’’ అంటూ తన అనుభవంలో చివరి క్షణాలలో భూతాన్ని చూసిన వాళ్ళు అంటూ చాలామంది పేర్లు చెప్పింది.ముసలామెకి అదంతా విని భయంగానూ, ఇబ్బందిగానూ అనిపించింది. అసహనంగా కదిలి అతి కష్టం మీద తలని రెండో వైపుకు తిప్పుకుంది. అదే అదనుగా రాపే అక్కడ్నుంచి తప్పుకుంది. కబోర్డ్ దగ్గర వున్న ఓ పెద్ద గుడ్డని తీసి తన చుట్టూ చుట్టుకుంది. ఇనుప మూకుడు ఒకటి తీసుకుని తలపైన బోర్లించుకుంది. దాని కాడలు కొమ్ముల్లా కనపడేట్లు పెట్టుకుంది. ఒక చేతిలో చీపురు తీసుకుని, మరో చేతితో ఇంకో గిన్నని పట్టుకుంది. ఉన్నట్టుండి ఆ గిన్నెని నేల మీదకు విసిరికొట్టింది.అది నేల తాకుతూనే పెద్ద శబ్దం చేసింది. ఆ తరువాత ఆమె కుర్చీ పైకి ఎక్కి, మంచానికి కట్టిన తెరని కిందనుంచి పైకి ఎత్తి ఒక్కసారిగా తన ముఖాన్ని ముసలామెకు చూపించింది. చేతులు భయం కలిగించేలా తిప్పుతూ, కీచు గొంతుతో గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ముఖం కనపడకుండా కప్పుకున్న మూకుడులో ఆ అరుపులు ప్రతిధ్వనించి ఇంకా భయంకరంగా వినపడసాగాయి. భయంతో బిక్కచచ్చిన ముసలామెని చీపురుతో తడుతూ ఇంకా బెదరకొట్టింది. అదిరిపోయిందామె. ఆమె ముఖం పిచ్చిపట్టినట్లుగా మారిపోయింది. చావడానికి సిద్ధంగా వున్న ఆమెలో ఏదో చిత్రమైన శక్తి ప్రవేశించినట్లు బలమంతా కూడదీసుకొని లేచి పారిపోవాలని ప్రయత్నం చేసింది.భుజాలు, సగం శరీరం పైకి లేపింది కూడా. అంతే! ఒక్కసారి గట్టిగా నిట్టూరుస్తూ వెనక్కిపడిపోయింది. అయిపోయింది.రాపే ఏమీ ఎరగనట్లు ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టేసింది. చీపురు మూల పెట్టేసింది, కప్పుకున్న గుడ్డ మళ్ళీ కబోర్డ్‌లో పెట్టేసింది. మూకుడు, గిన్నెలను గట్టుపైన, కుర్చీని గోడవారగా సర్దేసింది. ఆ తరువాత అనుభవం నేర్పిన చాకచక్యంతో చనిపోయిన ముసలామె పెద్ద కళ్ళను మూసేసింది. ఓ ప్లేటు మంచం మీద పెట్టి అందులో కాసింత పవిత్రజలం పోసింది. ఆ తరువాత మంచం పక్కనే మోకరిల్లి, ఎంతో కాలంగా చదివి చదివి నోటికి వచ్చేసిన ప్రార్థనలన్నీ చదివింది.హాన్రే సాయంత్రం తిరిగి వచ్చేసరికి ప్రార్థనలు చేస్తున్న రాపేను చూశాడు. వెంటనే లెక్కలు వేసి ఆమెకు ఇరవై సౌలు లాభం వచ్చిందని గుర్తించాడు. ఆమె గడిపిన రెండు రోజులు, ఒక రాత్రికి అయిదు ఫ్రాంకులే అయ్యేది కానీ ఒప్పందం ప్రకారం ఆరు ఫ్రాంకులు ఇవ్వాల్సివస్తోందని నష్టం లెక్క వేసుకున్నాడు. ఫ్రెంచి మూలం : గి ది మొపాసా అనువాదం: అరిపిరాల సత్యప్రసాద్ -
ఎమ్మెల్యే సిఫార్సులుంటేనే పరికరాలిస్తాం!
సాక్షి, అమరావతి: వ్యవసాయ పరికరాలు కొనాలంటే ఎమ్మెల్యే సిఫార్సులు తప్పనిసరంటూ వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో తెగేసి చెబుతున్నారు. ఎమ్మెల్యే ఆఫీసు నుంచి చెప్పనిదే చిన్నపాటి పరికరాల కోసం దరఖాస్తు చేసినా తిరస్కరిస్తున్నారు. కనీసం దరఖాస్తులూ తీసుకోవడం లేదు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పథకం కింద రైతులకు అవసరమైన పరికరాలను వారే కొనుగోలు చేసుకొనే విధానాన్ని ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. దరఖాస్తుతో వెళ్తే ఎమ్మెల్యే సిఫార్సులుండాలని వ్యవసాయ అధికారులు చెబుతుండడంతో, సేద్యం పనులు మానుకొని అటు ఎమ్మెల్యే ఇళ్ల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరగలేక అన్నదాలు అష్టకష్టాలు పడుతున్నారు. ఏమిటీ డీబీటీ? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో రైతులకు అవసరమైన పరికరాలను వారే కొనుగోలు చేసుకోవచ్చు. పరికరాలు రాయితీపై తక్కువ ధరకు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి డీబీటీ విధానాన్ని ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. రైతులు తమకు అవసరమైన యాంత్రిక పరికరం పొందడానికి వారే స్వయంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని కొనుగోలు చేసుకోవచ్చు. బిల్లులను వ్యవసాయ శాఖకు అందచేస్తే రాయితీతో కలిపి మొత్తం నగదును రాష్ట్ర ప్రభుత్వం రైతుకు చెల్లిస్తుంది. ప్రస్తుత ఖరీఫ్‌కు దాదాపు రూ.400 కోట్లను కేటాయించారు. రైతులు తమకు అవసరమైన ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు, రొటోవేటర్లు, కల్టివేటర్లు, తైవాన్ స్ప్రేయర్లు, గ్రాస్ కట్టర్, డిస్క్‌ప్లవ్ వంటి పరికరాలను కొనుగోలు చేసేందుకు వ్యవసాయశాఖ అధికారుల ద్వారా దరఖాస్తు చేయాలి. సిఫార్సు తప్పనిసరి గ్రామాల్లో ఎంపీవో (మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ అధికారి) నుంచి దరఖాస్తు తీసుకునేందుకు రైతులు వెళితే, ఎమ్మెల్యే ఆఫీసు నుంచి ఫోన్ చేయించుకోవాలని, లేకుంటే అక్కడి నుంచి సిఫార్సు లేఖ తీసుకురావాలని చెబుతున్నారు. పదిరోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఈ పరిస్థితిలో తమకు అవసరమైన చిన్నపాటి పరికరాలను రాయితీపై పొందడానికి రైతులు చేస్తున్న ప్రయత్నాలకు ఎమ్మెల్యేలు పెద్ద అడ్డంకిగా మారారు. రూ.5 లక్షల రాయితీ లభించే వరికోత యంత్రాలు, ట్రాక్టర్లు, రొటోవేటర్లు వంటి పరికరాలకు గతంలో ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు ఇచ్చేవారని, ఇప్పుడు రూ.5 వేల నుంచి రూ.10 వేల రాయితీ లభించే చిన్నపాటి పరికరం పొందడానికీ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు కావాలని అధికారులు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కావాలనే చేస్తున్నారు.. దీనిపై అధికారులు వివరణ ఇస్తూ.. కొందరు రైతులు దరఖాస్తులు పూర్తి చేసుకునే విధానం తెలియక ఎమ్మెల్యేల కార్యాలయాలకు వెళ్తున్నారని, అక్కడి సిబ్బందితో దరఖాస్తులు పూర్తి చేయించుకుని తమకు ఇస్తున్నారని చెబుతున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమకు తెలియకుండా నియోజకవర్గాల్లో ఏమీ జరగకూడదని, ప్రతీ దరఖాస్తును తాము చూడనిదే, సిఫార్సు చేయనిదే ఇవ్వవద్దని ఎమ్మెల్యేలు చెబుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. వారికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే పనిచేయలేమనే భావనతో రైతులను ఎమ్మెల్యేల కార్యాలయాలకు పంపుతున్నామని అధికారులు చెబుతున్నారు. -
ఆయ‘కట్టు కథలు’
సాక్షి, అమరావతి: కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీళ్లు అందుబాటులో ఉన్నా.. గోదావరి పరవళ్లు తొక్కుతున్నా.. వంశధార, నాగావళి పోటీ పడి ప్రవహిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతుల ప్రయోజనాలు కాపాడటంలో విఫలమవుతోంది. ప్రాజెక్టుల్లో కావాల్సినన్ని నీళ్లున్నా కూడా నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువలతో పాటు రాయలసీమ జిల్లాల్లోని ఏ ఒక్క ఆయకట్టుకు విడుదల చేయకుండా ప్రభుత్వం కట్టుకథలు చెబుతోంది. రాష్ట్రంలో సాధారణంగా ఖరీఫ్ సీజన్లో 42.78 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేస్తారు. ఇందులో 16.26 లక్షల హెక్టార్లలో వరి వేస్తారు. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 21.34 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగు చేశారు. ఇందులో 8.54 లక్షల హెక్టార్లలోనే వరి వేశారు. అదికూడా.. కరువనేదే ఎరుగని గోదావరి, కృష్ణా డెల్టాలతో పాటు వంశధార ప్రాజెక్టు కిందనున్న ఆయకట్టుకు మాత్రమే ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. మిగిలిన ఆయకట్టులను గాలికొదిలేసింది. రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంలో వరుసగా ఐదో ఏడాది కూడా విఫలమైన సీఎం చంద్రబాబు.. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి 2 కోట్ల ఎకరాలకు నీళ్లందిస్తామంటూ ప్రకటన చేయడంతో అధికారవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 92,19,918 ఎకరాల ఆయకట్టు ఉంది. గత నాలుగేళ్లలో ఏ ఒక్క ఏడాది కూడా కనీసం 25 శాతం ఆయకట్టుకు కూడా నీళ్లందించిన దాఖలాలు లేవు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 16.26 లక్షల హెక్టార్లలో వరి సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటివరకు 8.54 లక్షల హెక్టార్ల(21.17 లక్షల ఎకరాలు)లోనే వరి పంట వేశారు. ఇందులో కనీసం 2 లక్షల ఎకరాలను బోరు బావుల కింద సాగు చేసి ఉంటారని అంచనా. అంటే.. వరికి సంబంధించి కేవలం 19.17 లక్షల ఎకరాలకు మాత్రమే ప్రాజెక్టుల ద్వారా ప్రభుత్వం నీళ్లందిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ప్రాజెక్టుల్లో నీళ్లున్నా పట్టించుకోని సర్కార్.. ఎన్నడూ లేని రీతిలో జూలై మూడో వారానికే కృష్ణా వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి చేరింది. జూలై నెలాఖరుకే తుంగభద్ర జలాశయం నిండిపోయింది. సాధారణంగా ఆగస్టు రెండో వారానికి శ్రీశైలాన్ని చేరాల్సిన కృష్ణమ్మ నెల ముందే వచ్చింది. ఈ నేపథ్యంలో ఆగస్టు అవసరాల కోసం 30 టీఎంసీలు కేటాయించాలని కృష్ణా బోర్డును తెలంగాణ సర్కార్ కోరితే.. ఏపీ ప్రభుత్వం మాత్రం 25 టీఎంసీలు మాత్రమే చాలని పేర్కొంది. దీంతో బోర్డు ఆ మేరకు కేటాయింపులు చేసింది. ఈ ఉత్తర్వులు వెలువడేలోగా జూరాల నుంచి కుడి, ఎడమ కాలువలతోపాటు బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల ద్వారా జూలై 19 నుంచి రోజుకు సగటున 5,940 క్యూసెక్కుల నీటిని తెలంగాణ సర్కార్ తరలిస్తూ అక్కడి ఆయకట్టుకు నీళ్లందిస్తోంది. శ్రీశైలం జలాశయం ద్వారా జూలై 24 నుంచి రోజుకు సగటున 2,100 క్యూసెక్కులను కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తరలిస్తోంది. కానీ టీడీపీ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 854 అడుగులకు చేరగానే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎస్సార్బీసీ, తెలుగుగంగ, కేసీ కెనాల్ ఆయకట్టుకు నీళ్లందించాలి. ఆగస్టు మొదటి వారానికే హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలి. నాగార్జునసాగర్‌లో నిల్వ కనీస నీటిమట్టాన్ని తాకిన వెంటనే సాగర్ కుడి, ఎడమ కాలువలకు నీరందించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఐదారు రోజుల పాటు అరకొరగా నీరు విడుదల చేసి చేతులు దులుపుకుంది. తెలుగు గంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్ ఆయకట్టుకు నీరు విడుదల చేయలేదు. తుంగభద్రలో ఈ ఏడాది నీటి లభ్యత పెరిగినా ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టుకు మాత్రం నీరు అందలేదు. సాగర్ కుడి, ఎడమ కాలువల కిందనున్న 14.68 లక్షల ఎకరాలదీ అదే పరిస్థితి. దీన్నేమంటారు బాబూ? అటు తుంగభద్రకు ఇటు శ్రీశైలానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. నీళ్లందించడానికి అనుకూలమైన పరిస్థితులున్నా కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో రాయలసీమ, నెల్లూరు.. నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువ కిందనున్న ఆయకట్టు రైతులు రోడ్లెక్కారు. సర్కార్ తీరును నిరసిస్తూ ఆందోళన బాట పట్టారు. రైతుల ఆందోళనలు మిన్నంటడంతో సీఎం చంద్రబాబు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ‘కట్టు’కథలు వల్లెవేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీళ్లను ఆయకట్టులకు అందించి పంటలు కాపాడకుండా.. 2 కోట్ల ఎకరాలకు నీళ్లందించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశించడంతో అధికారులు నివ్వెరపోయారు. రాష్ట్రంలో మొత్తం ఆయకట్టు 92,19,918 ఎకరాలు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వరి సాగు లక్ష్యం 16.26 లక్షల హెక్టార్లు ఇప్పటివరకు 8.54 లక్షల హెక్టార్లు (21.17 లక్షల ఎకరాలు)లోనే పంట బోరు బావుల కింద సాగు 2 లక్షల ఎకరాలు కేవలం 19.17 లక్షల ఎకరాలకు మాత్రమే ప్రాజెక్టుల ద్వారా నీరు -
పంట నష్టం అపారం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. వంద కోట్లకుపైగా నష్టం ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా వర్షపాతం నమోదు కావడంతో పాటు, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్‌లో మూడు రోజులుగా కుండపోతగా వర్షం కురుస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లుతుండగా, చెరువులు నిండుకున్నాయి. పంట పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరి, పంటనష్టం రోజురోజుకు పెరుగుతోంది. వర్షాకాలం ప్రారంభమైన మొదట్లో వర్షాలు కురిసినట్లే కురిసి ముఖం చాటేయడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొనగా, భారీ వర్షాలతో పంటకు జీవం పోసినట్లే పోసి, వరద నీటిలో మునిగిపోవడంతో రైతులు జరిగిన నష్టానికి ఆవేదన చెందుతున్నారు. వరద పంటల్లో చేరగా, మరి కొన్ని ప్రాంతాల్లో ఇసుక మేటలు వేశా యి. ఉమ్మడి జిల్లాలో వరి పంట 10 వేల ఎకరాలకు పైగా నష్టపోగా, పత్తి పంట 1.5 లక్షల ఎకరాల్లో నష్టపోయినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశా రు. సోయా 20 వేల ఎకరాలు, కంది పంట 10 వేల ఎకరాలు, జొన్న, ఇతర పంటలు 5 వేల ఎకరాలకుపైగా నష్టపోయాయి. వర్షాలు ఇంకా కురుస్తుండటంతో పంట నష్టం తీవ్రత పెరిగే అవకాశముంది. నష్టపోయిన పంట రూ.100 కోట్లకు పైగా ఉంటుంది. ఖరీఫ్‌లో వేసిన పంటలు వర్షార్పణం అవుతాయేమోనని రైతుల్లో ఆందోళన నెలకొంది. -
‘ప్రాణాంతక మందుల’ పై ఉదాసీనత
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రైతుల ప్రాణాలను హరిస్తున్న 18 రకాల క్రిమిసంహారక మందులపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెల్సిందే. అయితే అందులో గతేడాది మధ్య భారత్‌లో పదుల సంఖ్యలో పత్తి రైతులను బలితీసుకున్న మోనోక్రోటోపాస్, మాంకోజెబ్ క్రిమి సంహారక మందులు లేకపోవడం ఆశ్చర్యకరం. దోమల సంహారానికి మున్సిపల్ సిబ్బంది, తెగుళ్ల నివారణకు రైతులు కొట్టే డీడీటీని కూడా నిషేధించక పోవడం గమనార్హం. మానవులు, జంతువుల ప్రాణాలకు హానికరమైన ఈ మూడు మందులను కూడా నిషేధించాలని వ్యవసాయ శాస్త్రవేత్త అనుపమ వర్మ నేతృత్వంలోని కమిటీ సిఫార్సు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన మొత్తం 18 క్రిమిసంహారక మందుల్లో 11 మందుల రిజిస్ట్రేషన్, ఉత్పత్తి, అమ్మకం, దిగుమతి, ఉపయోగాన్ని తక్షణమే నిషేధించగా, ఆరు క్రిమిసంహారక మందులను 2020, డిసెంబర్ నాటికి విడతల వారిగా నిషేధించాలని నిర్ణయించింది. హెర్బిసైడ్ ట్రిఫులారిన్ను కూడా కేంద్రం తక్షణమే నిషేధించినప్పటికీ ఒక్క గోధుమ పంటకు మాత్రం అనుమతించాలని నిర్ణయించింది. వాస్తవానికి దీన్ని కూడా సంపూర్ణంగా నిషేధించాలని వర్మ కమిటీ సిఫార్సు చేసింది. వాస్తవానికి ఈ క్రిమిసంహారక మందులను కేంద్రం ఎప్పుడో నిషేధించి ఉండాల్సిందీ, తాత్సారం చేస్తూ వచ్చింది. దేశంలో రైతులు ప్రాణాంతకమైన క్రిమిసంహారక మందులను ఉపయోగిస్తున్నారంటూ సామాజిక కార్యకర్తలు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ప్రాణాంతకమైన 66 మందుల ప్రభావాన్ని సమీక్షించి తగిన సిఫార్సులను చేయాల్సిందిగా కోరుతూ 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం వర్మ కమిటీని నియమించింది. ఆ కమిటీ 66 మందుల్లో 19 మందులను సంపూర్ణంగా నిషేధించాలని సిఫార్సు చేస్తూ 2015, డిసెంబర్ నెలలోనే నివేదికను మోదీ ప్రభుత్వానికి అందజేసింది. దాదాపు 20 నెలల అనంతరం ఆగస్టు 8వ తేదీన చర్యలు తీసుకుంది. ప్రపంచంలోని పలు దేశాల్లో నిషేధించిన క్రిమిసంహారక మందుల్లో 104 మందులను మన దేశంలో వాడుతున్నారని ఆరోగ్య కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. వాటిల్లో 66 రకాల మందులను మాత్రమే వర్మ కమిటీ సమీక్షించిందని వారు చెప్పారు. అలాగే ప్రపంచంలో పలు దేశాలు నిషేధించిన ‘గ్లైఫోసేట్’ను వర్మ కమిటీ సమీక్షించినా దాన్ని నిషేధించాల్సిందిగా ఎలాంటి సిఫార్సు చేశారు. ప్రాణాంతక మందులను నిషేధించే అధికారం ఒక్క కేంద్రానికి మాత్రమే ఉంది. రాష్ట్రానికి వాటిపై 90 రోజులపాటు తాత్కాలికంగా నిషేధం విధించే అధికారం మాత్రం ఉంది. కాకపోతే వాటి ఉత్పత్తి యూనిట్లకు లైసెన్స్‌లు నిరాకరించే అధికారం ఉంది. -
రైతులకు అప్పులిస్తలే!
సాక్షి, హైదారాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ పంట రుణాల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ప్రాంతంలో లక్ష్యానికి మించి పంట రుణాలిచ్చిన బ్యాంకులు.. నాలుగేళ్లుగా మాత్రం ఆ లక్ష్యాలు చేరుకోవడం లేదు. 2011–12 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యానికి మించి 115 శాతం, 2012–13లో 121 శాతం, 2013–14లో 103 శాతం ఇవ్వగా.. రాష్ట్రం ఏర్పడ్డాక 2014–15లో లక్ష్యంలో 93 శాతమే రైతులకు ఇచ్చాయి. అలా తగ్గుతూ వచ్చిన రుణాలు గతేడాది 79 శాతానికి చేరుకున్నాయి. 2017–18లో పంట రుణాల లక్ష్యం రూ. 39,752 కోట్లు కాగా, రూ. 31,410 కోట్లే అందించాయి. దీర్ఘకాలిక వ్యవసాయ రుణాల పరిస్థితి చెప్పనక్కర్లేదు. భూమి చదును చేయడం, బావులు తీయడం తదితర మౌలిక సదుపాయాల కోసం ఇచ్చే ఈ రుణాల విషయంలో బ్యాంకులు తీవ్ర నిర్లక్ష్యం చూపాయి. 2011లో లక్ష్యానికి మించి 205 శాతం, 2012–13లో 121 శాతం, 2013–14లో 200 శాతం రుణాలిచ్చిన బ్యాంకులు.. 2014–15లో కేవలం 62 శాతమే ఇచ్చాయి. ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. కొత్త రుణమే లేదు ప్రస్తుత ఖరీఫ్‌లో రుణాల పరిస్థితి మరీ ఘోరంగా మారింది. ఈ ఖరీఫ్‌లో 83 శాతం విస్తీర్ణంలో పంటలు సాగవగా ఇప్పటివరకు బ్యాంకులు 30 శాతానికి మించి రుణాలివ్వలేదు. ఈ ఖరీఫ్ పంట రుణాల లక్ష్యం రూ. 25,496 కోట్లు, కానీ తాజా లెక్కల ప్రకారం ఇప్పటివరకు బ్యాంకులు రూ. 7,300 కోట్లే ఇచ్చాయి. విచిత్రమేంటంటే ఈ ఖరీఫ్‌లో ఇప్పటివరకు రుణాలు తీసుకున్న వారంతా రెన్యువల్ చేసుకున్న వారే. అంటే పాత బాకీలు చెల్లించి రెన్యువల్ చేసుకున్నవారే. ఇతరులకు కొత్తగా రుణం ఇవ్వలేదని సర్కారుకు పంపిన బ్యాంకు నివేదికే స్పష్టం చేసింది. బ్యాంకులు సహకరించక, మరోదారి లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద రైతులు అప్పులు చేస్తున్నారు. ఈ విషయమై ప్రభు త్వం మొత్తుకుంటున్నా, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) సమావేశాల్లోనూ ప్రస్తావిస్తున్నా బ్యాంకుల వైఖరిలో మార్పు రావడం లేదన్న విమర్శలున్నాయి. సర్కారు, బ్యాంకుల మధ్య దూరమే!: భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత రాష్ట్రంలో రైతుల సంఖ్య 58.33 లక్షలుంది. కానీ వారిలో 46.50 లక్షల మందికే కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చాయి. అయితే రైతుల వివరాలు ధరణి వెబ్సైట్లో సరిచూసుకొని రుణాలు ఇవ్వాలన్న సర్కారు నిబంధనే రుణాల విడుదలకు శాపమైందని చెబుతున్నారు. వెబ్సైట్ ఇప్పటికీ అమలులోకి రాకపోవడంతో రెన్యువల్ చేసుకున్న వారికి తప్ప కొత్త రుణం రాలేదు. ఇలా కొందరు బ్యాంకు వర్గాలు ధరణిని సాకుగా చూపిస్తుండగా.. మరికొందరు ప్రభుత్వమే కారణమంటున్నారు. సకాలంలో రుణమాఫీ చేయకపోవడం వల్ల రుణాలపై వడ్డీ ఎలా చెల్లిస్తారో చెప్పకుండా గాలికొదిలేశారన్న ఆరోపణలున్నాయి. పావలా వడ్డీ సొమ్ము కూడా చెల్లించలేదని చెబుతున్నారు. ఇలా ప్రభుత్వం, బ్యాంకుల మధ్య తీవ్రమైన అగాథమే పంట, దీర్ఘకాలిక రుణాల్లో సమస్యలకు కారణమని కొందరు విశ్లేషిస్తున్నారు. -
చిగురిస్తున్న ఆశలు
మిర్యాలగూడ : నాగార్జునసాగర్ నీటి విడుదలపై ఎడమ కాల్వ ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రెండు రోజులుగా కృష్ణాబేసిన్‌లో కురుస్తున్న వర్షాల వల్ల నీరు వస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆల్మట్టి డ్యామ్ నుంచి కూడా దిగువకు నీటిని వదులుతుండడంతో దిగువన ఉన్న జలాశయాల్లోకి కూడా నీరు చేరుతుంది. సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను 522.40 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 17,226 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలోకి రాగానే దిగువకు నీటిని వదిలే అవకాశాలు ఉన్నందున రైతులు ఆశతో ఉన్నారు. ఆల్మట్టి వైపు చూపు కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్పైనే నాగార్జునసాగర్ ఎడమ కాల్వ రైతుల ఆశలు ఉన్నాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టు మినహా అన్ని ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి నీటి మట్టాలు ఉన్నాయి. వస్తున్న వర్షపు నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో దిగువకు వస్తున్న నీటి విషయంలో ఆల్మట్టి డ్యామ్ నుంచి ఎంత మేరకు దిగువకు వదులుతున్నారనే విషయాన్ని ఆయకట్టు రైతులు ప్రతిరోజు పరిశీ లిస్తున్నారు. ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్‌లో 1705 అడుగు పూర్తిస్థాయి నీటి మట్టంకు గాను ప్రస్తుతం 1704.66 అడుగుల మేర నీరుంది. ప్రస్తుతం డ్యామ్‌లోకి 57,500 క్యూసెక్కుల నీరు చేరుతుండగా దిగువకు 90,900 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అదే విధంగా నారాయణపూర్ ప్రాజెక్టులో 1615 అడుగులకు గాను 1614.27 అడుగుల మేర నీరుం డగా 90 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా 92,680 క్యూసెక్కుల నీరు దిగువకు వదులు తున్నారు. అదేవిధంగా జూరాల ప్రాజెక్టులోకి 30వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా దిగువకు 44,621 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. తుంగభద్ర కు పెరిగిన వరద తుంగభద్ర ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం తుంగభద్ర ప్రాజెక్టులో 1633 అడుగులకు గాను 1632.30 అడుగుల నీరుంది. కాగా 1,12,671 క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది. దీంతో దిగువకు 1,18,445 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టులో 885 అడుగుల పూర్తి స్థాయి నీటి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 872 అడుగలు మేర నీరుంది. కాగా శ్రీశైలం ప్రాజెక్టులోకి 57,906 క్యూసెక్కుల నీరు చేరుతుండగా దిగువకు 24,851 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఇంకా 13 అడుగుల నీరు చేరితే దిగువకు భారీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. శ్రీశైలంకు ప్రాజెక్టులోకి వస్తున్న నీరు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి కూడా ప్రస్తుతం వస్తున్న నీరు 17,226 క్యూసెక్కులు ఉండగా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని రైతులు ఎదురు చూస్తున్నారు. -
ఇన్చార్జి మంత్రుల చేతిలోనే ‘స్టీరింగ్’
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఎన్నికల ఏడాది సబ్సిడీ ట్రాక్టర్ల పథకం అమలులో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఈ ట్రాక్టర్లు మంజూరు చేసే అధికారమున్న జిల్లాస్థాయి అధికారుల కమిటీని తప్పించి, పూర్తి అధికారాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రులకు కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయశాఖ కమిషనరేట్ నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మార్గదర్శకాలు ఇటీవలే అన్ని జిల్లాల వ్యవసాయశాఖాధికారులకు అందాయి. ఇప్పటికే ఈ సబ్సిడీ ట్రాక్టర్లన్నీ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలకే దక్కుతున్నాయనే విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. సంప్రదాయ సాగు పద్ధతులకు స్వస్తి చెప్పి, ఆధునిక యంత్ర పరికరాలతో పంటలు పండించేలా రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ (యంత్ర లక్ష్మి) పథకాన్ని అమలు చేస్తున్న విషయం విదితమే. జిల్లా అధికారుల కమిటీ ప్రమేయం లేదు ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం సబ్సిడీ ట్రాక్టర్లు పొందాలనుకున్న రైతులు ఆయా మండలాల వ్యవసాయశాఖ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. మండల వ్యవసాయాధికారి, తహసీల్దార్, ఎంపీడీఓలతో కూడిన మండల స్థాయి కమిటీ దరఖాస్తులను పరిశీలించి.. డివిజన్ స్థాయిలోని ఏడీఏ కార్యాలయానికి పంపుతుంది. అక్కడి నుంచి వచ్చిన దరఖాస్తులను జిల్లా వ్యవసాయశాఖ అధికారి ద్వారా జిల్లా స్థాయి అధికారుల కమిటీ వాటిని పరిశీలించి ట్రాక్టర్లు మంజూరు చేస్తుంది. కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించే జిల్లా స్థాయి కమిటీకి డీఏఓ కన్వీనర్‌గా, ఆగ్రోస్ ఆర్ఎం, వ్యవసాయ శాస్త్రవేత్త, లీడ్ బ్యాంక్ మేనేజర్ సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఇకపై ఈ జిల్లా స్థాయి అధికారుల కమిటీతో ప్రమేయం ఉండదు. దరఖాస్తులు నేరుగా కలెక్టర్ ద్వారా జిల్లా ఇన్చార్జి మంత్రికి పంపాల్సి ఉంటుంది. ఇన్చార్జి మంత్రి ఆమోద ముద్ర వేస్తేనే ట్రాక్టర్ మంజూరు అవుతుంది. ఇప్పటికే సబ్సిడీ ట్రాక్టర్ల పథకం పూర్తిగా విమర్శల పాలైంది. కేవలం అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలే ఈ ట్రాక్టర్లు పంచుకుంటున్నారు. వీటి మంజూరులో పెద్ద ఎత్తున ముడుపులు కూడా చేతులు మారుతున్నాయి. ఒక్కో ట్రాక్టర్‌పై రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు దండుకున్నారనేది బహిరంగ రహస్యం. సగం ధరకే (గరిష్టంగారూ.3.5 లక్షల వరకు సబ్సిడీ) ట్రాక్టర్ వస్తుండటంతో ఈ మొత్తాన్ని ఇచ్చేందుకు నాయకులు కూడా వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో ఇకపై ట్రాక్టర్ల మంజూరు అధికారాలు ఏకంగా మంత్రికి కట్టబెట్టడంతో ట్రాక్టర్లు పొందాలంటే ఇన్చార్జి మంత్రులను ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్టేట్ రిజర్వు కోటాపై వివాదాస్పదం గతంలో సబ్సిడీ ట్రాక్టర్ల పథకం అమలులో స్టేట్ రిజర్వు కోటా (ఎస్‌ఆర్‌క్యూ) పేరుతో జారీ అయిన మార్గదర్శకాలు కూడా వివాదాస్పదమయ్యాయి. ఆయా జిల్లాలకు మంజూరైన ట్రాక్టర్లలో కొన్నింటిని ఫలానా లబ్ధిదారునికే ఇవ్వాలని ఏకంగా కమిషనరేట్ నుంచే సిఫార్సు లేఖలు అధికారికంగానే జిల్లా అధికారులకు అందడం పట్ల ఆ శాఖ వర్గాలు అప్పట్లో ముక్కున వేలేసుకున్నాయి. స్టేట్ రిజర్వు కోటా ట్రాక్టర్లలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈసారి ట్రాక్టర్ల మంజూరు అధికారం ఏకంగా జిల్లా మంత్రులకు కట్టబెట్టడంతో ఎలాంటి ఆరోపణలు వ్యక్తమవుతాయనేది వేచి చూడాల్సి ఉంది. -
రైతు రక్తాక్షరాలు
బొమ్మనహళ్లి : కన్నడ నాట విచిత్ర పరిస్థితి నెలకొంది. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలతో అతలాకుతలమవుతుండగా ఉత్తర కర్ణాటక చుక్కనీరు లేక అల్లాడుతోంది. ఈ నేపథ్యంలో తమకు సాగు, తాగునీటి సౌకర్యం కల్పించాలని కొందరు రైతులు తమ రక్తంతో ముఖ్యమంత్రి కుమారస్వామికి లేఖ రాశారు. కుమారస్వామి సొంత జిల్లా అయిన హాసన్ ప్రాంతం నుంచే లేఖ రాయడం గమనార్హం. హాసన్ జిల్లా చెన్నరాయపట్టణ తాలూకా బాగూరు గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు తమకు సాగు, తాగునీటిని కల్పించాలని తమ రక్తంతో లేఖ రాయడంతో పాటు రక్తంతో సంతకాలు కూడా చేశారు. బాగూరు గ్రామం సమీపంలో ఉన్న సొరంగ మార్గం కాలువలో నీరు లేదని, ఈ కాలువకు నీరు మళ్లించాలని, లేకుంటే ప్రజలతో పాటు పశువులు కూడా తాగునీటి కష్టాలు తప్పవన్నారు. భూగర్భ జలాలు సైతం ఇంకిపోవడంతో బోర్లలో సైతం నీరు లేదని, ఇక మాకు ఆత్మహత్యలే శరణ్యమని ఆ లేఖలో పేర్కొన్నారు. నీరు కల్పించలేని పరిస్థితి ఉంటే దయా మరణానికి అనుమతి ఇవ్వాలని లేఖలో ప్రస్తావించారు. -
కరువు ఛాయలు
జిల్లాలో కరువు విలయ తాండవం చేస్తోంది. తాగు, సాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న జిల్లాలో నాలుగేళ్లుగా కరువుతో రైతుల బాధలు వర్ణనాతీతం. వరుణుడు సైతం కరుణించక పోవడంతో పంటలు వేయలేని పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల వేసిన పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం కన్నా సగం కూడా పడక పోవడంతో అన్నదాతలు అయోమయంలో పడ్డారు. నెల్లూరు(సెంట్రల్) : జిల్లాలో నాలుగేళ్లుగా అతివృష్టి, అనావృష్టి కారణంగా ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు. 2015లో వరదలు వచ్చి వేసిన పంటలు కొట్టుకోని పోయాయి. చెరువులకు గండ్లు పడి చుక్క నీరు లేకుండా పోయింది. 2016లో తీవ్ర అనావృష్టితో రైతులు అవస్థలు పడ్డారు. పెన్నా డెల్టాకింద తప్ప జిల్లా మొత్తం సాగు విస్తీర్ణం తగ్గింది. 2017లో ఓ మోస్తరు వర్షాలు పడ్డా నీరు భూమిలోకి ఇంకి పోవడంతో నీటి చుక్క ఎక్కడా నిల్వ లేదు. 2015లో 33, 2016లో 27 మండలాలను కరువు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2017లో 15 మండలాల్లో కరువు ఉన్నట్లు అధికారులు నివేదిక పంపారు. ఇప్పటి వరకు శాశ్వత నివారణ చర్యలు తీసుకోవడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. కరువు మండలాల్లోని రైతులకు పంట నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాల్సింది పోయి ఇంత వరకు వ్యవసాయ శాఖ తరపున ఒక్క రూపాయి కూడా చెల్లించిన దాఖలాల్లేవు. ఈ ఏడాది 45 మండలాలు జిల్లాలో మొత్తం 46 మండలాలు ఉన్నాయి. వీటిలో ఈ ఏడాది 45 మండలాల్లో తీవ్రంగా కరువు ఉన్నట్లు వ్యవసాయ అధికారులు నివేదికను ప్రభుత్వానికి పంపారు. దీంతో జిల్లా మొత్తం కరువు ఛాయల్లో చిక్కుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 173.3 మిల్లీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉంది. అయితే 77.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. పరిహారం ఎక్కడ? ప్రభుత్వం నుంచి కరువు మండలాల్లోని రైతులకు ఎటువంటి పరిహారం అందిన దాఖలాల్లేవు. నాలుగు సంవత్సరాలుగా కరువుతో రైతులు అల్లాడుతున్నా వారికి బ్యాంకులలో రుణాలు కూడా ఇవ్వడం లేదు. రుణమాఫీ పూర్తి స్థాయిలో కాక పోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. కరువు ప్రాంతాల్లో రుణాలను రీషెడ్యుల్ చేస్తామని ప్రభుత్వ ప్రకటనలు నీటిమూటలుగా మారాయనే విమర్శలున్నాయి. జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా రైతులకు ఒరిగిందేమీ లేదనే ఆరోపణలున్నాయి. నివేదిక పంపుతున్నాం జిల్లాలో కరువు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు, నమోదైన వర్షపాతం, ఏయే పంటలు దెబ్బతిన్నాయి. వాటి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిక పంపుతున్నాం. పరిహారం అందించే విషయం ఉన్నతాధికారులు చూసుకుంటారు. –శివనారాయణ, వ్యవసాయ శాఖ ఇన్చార్జి జేడీ సాయం లేదు కరువు ప్రాంతాల్లో ఉన్న రైతులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదు. నీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. ప్రధానంగా పంటకు పెట్టిన పెట్టుబడి రాలేదు. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. –కె.వెంకటకృష్ణారెడ్డి, డీసీ పల్లె, మర్రిపాడు నాలుగేళ్లుగా ఇంతే నాలుగు సంవత్సరాలుగా వరిపంట వేసి నీరు లేక ఎండిపోయిన సందర్భాలు ఉన్నాయి. దీంతో పెట్టిన పెట్టుబడి, చేసిన కష్టం నేలపాలు అవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో బ్యాంకుల్లో రుణం కూడా ఇవ్వడం లేదు. పూర్తిగా రుణమాఫీ కాక పోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. –పసుపులేటి వెంకటేశ్వర్లు, వెన్నవాడ, ఆత్మకూర -
అత్త సొమ్ము..అల్లుడి దానం!
చీరాల : రొంపేరు భూములు ఏళ్ల తరబడి కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. పైగా అవి తమ సొంత భూములన్నట్లు కొందరు ఇతరులకు కూడా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. వ్యవసాయ మురుగు కాలువల్లో ప్రధానమైన రొంపేరు కుడి కాలువకు సంబంధించిన సుమారు 300 ఎకరాలు 125 మంది అక్రమార్కులు ఆక్రమించుకుని పట్టా భూములతో పాటు రొయ్యల చెరువులు సాగు చేసుకుంటూ లక్షల రూపాయలు గడిస్తున్నారు. చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల పరిధిలో వందలాది ఎకరాలు ఆక్రమణకు గురైనా డ్రైనేజీ శాఖ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. భూమి ఆక్రమించిన చాలామంది ఎకరాన్ని రూ.5 నుంచి 7 లక్షలకు చొప్పున అమ్మకాలు చేస్తున్నారు. ప్రభుత్వ భూమి కాస్తా అక్రమార్కుల పరమవుతన్నాయి. కోట్లాది రూపాయలు విలువైన వందలాది ఎకరాల భూములు కళ్లెదుటే ఆక్రమణలకు గురైనా కాపాడాల్సిన అధికారులు ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారు. భవిష్యత్ అవసరాలకు ఉంచిన భూములన్నీ ఆక్రమణదారుల చేతుల్లో చిక్కుకున్నాయి. లంచాలకు కక్కుర్తి పడిన రెవెన్యూ యంత్రాంగం ఇతర శాఖలకు చెందిన భూమిని కూడా కొందరికి బి.ఫారాలు ఇచ్చి అక్రమార్కుల సరసన నిలబడింది. వివరాలు.. వ్యవసాయ భూముల నుంచి వచ్చే మురుగు నీరు, వర్షాల సమయంలో వచ్చే వరద నీరు సముద్రంలో కలిసేందుకు వీలుగా కారంచేడు నుంచి పెదగంజాం వరకు రొంపేరు కుడి మురుగునీటి కాలువ నిర్మించారు. వరదలు, ఇతర వ్యవసాయ మురుగు నీరంతా ఈ కాలువ నుంచి పెదగంజాం వద్ద సముద్రంలో కలుస్తోంది. కబ్జా కోరల్లో 300 ఎకరాలు భవిష్యత్‌లో కాలువ వెడల్పు పెరుగుతుందన్న ఉద్దేశంతో ముందు చూపుగా డ్రైనేజీ శాఖ కాలువకు ఇరువైపులా 300 ఎకరాల వరకు ఉంచింది. కారంచేడు నుంచి పెదగంజాం వరకు ఈ రొంపేరు కాలువ 35 కిలో మీటర్ల పొడవున ఉంటుంది. అదే పొడవున ఆ శాఖకు చెందిన భూములు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆ భూములన్నీ కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. కాలువ పక్కనే ఉన్న భూములను ఆక్రమించుకొని కొందరు వ్యవసాయం చేస్తుండగా మరికొందరు ఏకంగా రొయ్యల చెరువులు తవ్వి లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. కారంచేడు నుంచి పందిళ్లపల్లి వరకు 200 ఎకరాలు ఆక్రమించుకొని వరిసాగు చేస్తుండగా పందిళ్లపల్లి నుంచి పెదగంజాం వరకు 100 ఎకరాలకు పైగా ఆక్రమించుకున్న భూముల్లో రొయ్యల చెరువులు తవ్వి సాగు చేస్తున్నారు. కన్నెతి చూడని డ్రైనేజీ అధికారులు కళ్లెదుటే ఏళ్ల తరబడి ఈ అక్రమ వ్యవహారం నిరాటంకంగా సాగుతున్నా సంబం«ధించిన డ్రైనేజీ శాఖ వాటిని కాపాడుకొనేందుకు కనీస ప్రయత్నం కూడా చేయడం లేదు. డ్రైనేజీ శాఖ భూములను ఆక్రమించుకొని ఉన్న కొందరికి రెవెన్యూ శాఖ నిబంధనలకు విరుద్ధంగా పదేళ్ల క్రితం బి–ఫారాలు కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇవి నకిలీవన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. డ్రైనేజీ శాఖ భూములు బదలాయింపు జరగకుండా బి–ఫారాలు ఇవ్వడం అక్రమం. అరకొరగా ఆధునికీకరణ రొంపేరు డ్రైన్లు ఆధునికీకరణకు గతంలో ప్రభుత్వం రూ.130 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం ఉన్న కాలువ కంటే 20 శాతం వెడల్పున కాలువను విస్తరించి అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో భాగంగా డ్రైనేజీ శాఖ తమ భూములకు హద్దులు నిర్ణయించాలని రెవెన్యూ అధికారులను కోరినా నేటికీ వారు ముందుకు రాలేదు. ఆధునికీకరణ జరగాలంటే తప్పని సరిగా ఆక్రమణలో ఉన్న కొందరి భూములు స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రొంపేరు భూములకు రెక్కలొచ్చాయి. ఎకరం రూ.5 నుంచి రూ.7 లక్షల వరకు పలుకుతోంది. ఇంకా మిగిలి ఉన్న భూములను అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. పైపెచ్చు తాము సాగు చేస్తున్నామని, భూమిపై హక్కు తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఎకరం నుంచి ఐదు ఎకరాలకుపైగా ఆక్రమించుకొని వరి, రొయ్యల చెరువులు సాగు చేస్తున్నారు. చాలామంది ఈ భూములను తమ సొంత భూములుగా భావించి ఇతరులకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన దర్జాగా అమ్మకాలు జరుపుతున్నా సంబంధిత డ్రైనేజీ శాఖాధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. కనీసం అక్రమార్కులకు నోటీసులు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. కోట్లాది రూపాయల విలువైన భూములు ఆక్రమణలో చిక్కుకున్నా వాటిని కాపాడుకొనే ప్రయత్నం చేయకపోవడంతో ప్రస్తుతం ఆధునికీకరణ పనులకు అవసరమైన భూమి కూడా డ్రైనేజీ శాఖకు లేకపోవడం గమనార్హం. -
జల రాజకీయం
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి జిల్లాలో జల జగడం కొనసాగుతోంది. రైతుల నీటి కష్టాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అన్నదాతలకు మద్దతుగా ఆందోళనలు చేపట్టడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎంతో కొంత లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నాయి. కాకతీయ కాలువకు నీటిని విడుదల చేయాలని రైతు లు పది రోజుల క్రితం ఆందోళన చేపట్టారు. ఒక్క తడి ఇచ్చినా తమ పంటలు గట్టెక్కుతాయని, నీటి ని ఇవ్వాలని కోరుతూ పలుమార్లు ఎస్సారెస్పీ కా ర్యాలయాన్ని ముట్టడించారు. రైతులకు మద్దతు గా ప్రతిపక్ష పార్టీలు రంగంలోకి దిగాయి. రైతుల సాగునీటి సమస్యను ఒక అవకాశంగా భావించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. వారం రోజులుగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో అఖిలపక్షంగా ఏర్పడిన కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలు శుక్రవారం చలో ఎస్సా రెస్పీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. కాకతీయ కాలువకు అర టీఎంసీ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రం నుంచి ఆయకట్టు రైతుల గ్రామాలకు తరలివెళ్లాలని నిర్ణయించాయి. మరోవైపు ఆయా పార్టీల రాష్ట్ర స్థాయి నేతలు కూడా రైతుల సమస్యలపై స్పందిస్తున్నారు. శనివారం బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులకు మద్దతు తెలిపేందుకు జిల్లాకు వచ్చారు. బాధిత రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ కిసాన్ కేత్ రాష్ట్ర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇ లా పది రోజులుగా జిల్లాలో ప్రతిపక్ష పార్టీల నేత ల ఆందోళనలతో జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ప్రతిపక్ష పార్టీల ఆందోళనల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. రైతులకు సంబంధించిన అంశం కావడంతో ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుతో సమావేశమయ్యారు. ప్రాజె క్టులో నీటి నిల్వ పరిమితంగా ఉన్న నేపథ్యంలో కాకతీయ కాలువకు నీటి విడుదల ప్రస్తుతానికి వీలు పడదని ఆయన ప్రకటించారు. నేతల అరెస్టులు ప్రతిపక్ష పార్టీ నేతల ఆందోళన నేపథ్యంలో జిల్లా లో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఎస్సా రెస్పీ పరీవాహక గ్రామాల్లో వందలాదిగా పోలీసు బలగాలను మోహరించారు. మరోవైపు జిల్లాలో 144 సెక్షన్ విధించారు. ఆందోళనలు నిర్వహిస్తున్న నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్లకు తరలిస్తున్నారు. శనివారం ఎస్సారెస్పీ వెళ్తున్న కాంగ్రెస్ కిసాన్ కేత్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డిని డిచ్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డి జిల్లాలో... కామారెడ్డి జిల్లాలోనూ సాగునీటి సమస్యపై ఆందోళన చేపట్టారు. సింగూరు జలాశయం నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవల బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా, నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులు నాట్లు వేసుకున్నారు. సింగూరు నుంచి జిల్లా వాటా కింద రావాల్సిన తొమ్మిది టీఎంసీల నీటిని విడుదల చేసి ఆయకట్టు రైతులకు భరోసా కల్పించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం నిజాంసాగర్‌లో సుమారు రెండున్నర టీఎంసీల నీరుంది. జిల్లా వాటా కింద రావాల్సిన నీటిని విడుదల చేయాలని రైతులు కూడా కోరుతున్నారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ ఒక అవకాశంగా భావించి ఆందోళన చేపట్టింది. మొత్తం మీద రెండు జిల్లాల పరిధిలో సాగునీటి అంశంపై ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలను కొనసాగించడంతో రాజకీయ వేడి రాజుకున్నట్లవుతోంది. -
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద కొనసాగుతోన్న బందోబస్తు
నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద వర్షంలోనూ పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. ప్రాజెక్టు వద్ద పోలీసు బలగాలు గత రెండు వారాల నుంచి పహారా కాస్తున్నాయి. పోచంపాడు గ్రామం, అలాగే ప్రాజెక్టు వైపు వెళ్లే వారిని పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు గ్రామాల రైతులు సాగునీటి కోసం కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెల్సిందే. శ్రీరాంసాగర్‌కు వరద పెరగడంతో ఆయకట్టు రైతాంగంలో ఆశలు చిగురిస్తున్నాయి. ఇటీవల వర్షాలు లేకపోవడంతో ఆయకట్టు ప్రాంత పరిధిలోని పొలాలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో వెంటనే కాకతీయ కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున ఆయా గ్రామాల ప్రజలు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగిన సంగతి తెల్సిందే. రైతులు బలవంతంగా గేట్లు ఎత్తే అవకాశం ఉండటంతో అధికారులు ప్రాజెక్టు వద్ద భద్రతను పెంచారు. అయితే వర్షాలు పడుతుండటంతో రైతులకు కాసింత ఉపశమనం లభించింది. -
మా పొట్టకొడుతున్నారు.. ఆదుకో అన్నా
పిఠాపురం: భూమిపై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటు పొట్టపోసుకునే నిరుపేద రైతుల పొట్టకొట్టడానికి చూస్తున్నారని, ఉన్న భూమి పోతే ఇక వేరే దారిలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తుని మండలం రాజుపేట వచ్చిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ వద్ద తుని మండలం రాజుపేట, కొత్త వెలంపేట, సీతయ్యపేట, లోవ కొత్తూరుకు చెందిన పలువురు సన్న, చిన్నకారు రైతులు తమ సమస్యలు విన్నవించుకున్నారు. పై నాలుగు గ్రామాల పరిధిలో 30 ఏళ్లుగా ప్రభుత్వం ఇచ్చిన సుమారు 500 ఎకరాల భూమిని సుమారు రెండు వేలకు పైగా రైతులు సాగు చేసుకుని జీవనోపాధి పొందుతున్నారన్నారు. ఈ గ్రామాల భూములు కొండ ప్రాంతానికి చెందినవి అయినా ఎంతో కష్టపడి చదును చేసుకుని చెరకు, మామిడి, జీడిమామిడి, కొబ్బరి, సరుగుడు, నిమ్మ, వంటి పంటలతో పాటు అన్ని రకాల వాణిజ్య పంటలు పండిస్తు జీవిస్తున్నామన్నారు. ఈ భూములపై కన్నెసిన అధికార పార్టీ నేతలు అ««ధికారాన్ని అడ్డుపెట్టుకుని స్వాధీనం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఇటీవల పారిశ్రామికవాడ పేరుతో భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నట్లు 32 ఎకరాల భూములకు చెందిన రైతులకు స్థానిక రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారన్నారు. వీటితో పాటు మిగిలిన సుమారు 450 ఎకరాలను స్వాధీనం చేసుకుంటామని అధికారులు చెబుతున్నారన్నారు. వేల కుటుంబాలను వీధి పాలు చేస్తు ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ఈ దురాగతాన్ని ఆపి తమను కాపాడాలని వైఎస్ జగన్‌కు రైతులు విజ్ఞప్తి చేశారు. -
చంద్రబాబుకు ఏదీ చేతకాదు!
ఒంగోలు టౌన్: ‘జిల్లాలో సుబాబుల్, జామాయిల్ రైతులకు పేపర్ మిల్లుల యజమాన్యాలు ధర రాకుండా చేశాయి. అతి తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో అప్పట్లో కలెక్టర్లుగా వ్యవహరించిన ఉదయలక్ష్మి, విజయకుమార్ పేపర్ మిల్లుల యాజమాన్యాలతో సమావేశాలు పెట్టారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేయకుంటే రవాణా బంద్ చేస్తాం.. కరెంట్ కట్ చేస్తామని హెచ్చరించడంతో రైతులకు న్యాయం జరిగింది. నాటి కలెక్టర్లు చూపిన చొరవ కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు చూపడం లేదు. ప్రభుత్వం జారీ చేసిన జీఓను కూడా అమలు చేయించలేని చేతకాని చంద్రబాబు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. శనివారం స్థానిక మల్లయ్య లింగం భవన్లో నిర్వహించిన అఖిలపక్ష రైతు సంఘాల సమావేశంలో ఆయన ప్రభుత్వ వైఖరిని తూర్పార పట్టారు. సుబాబుల్ 4200, జామాయిల్, సరుగుడు 4400 రూపాయలు చొప్పున ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించి జీఓ విడుదల చేసినా జిల్లాలో ఆ ధరకు కొనుగోలు చేయడం లేదన్నారు. సగానికి సగం ధరలు తగ్గించి కొనుగోలు చేస్తుంటే జిల్లా యంత్రాంగం మౌనంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓను అమలు చేయించాల్సిన బాధ్యత యంత్రాంగానికి లేదా..అని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి రైతాంగానికి గిట్టుబాటు ధర వచ్చేలా చూశారని, ఈ ముఖ్యమంత్రి మాత్రం రైతులను దళారులకు వదిలేశారని విమర్శించారు. రైతుల పక్షమో, పేపర్ మిల్లుల యాజమాన్యాల పక్షమో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సుబాబుల్, జామాయిల్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కె.వీరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జామాయిల్ సాగులో జిల్లాలో 60 శాతం ఉందని, అయినా ప్రభుత్వం నిర్ణయించిన ధర రైతాంగానికి రావడం లేదన్నారు. జామాయిల్ తాట తీసి సరఫరా చేయాలన్న నిబంధన విధించడంతో రైతులు వెయ్యి రూపాయలు నష్టపోతున్నారన్నారు. వెంటనే ఈ నిబంధన మార్చాలని డిమాండ్ చేశారు. జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు చుండూరి రంగారావు మాట్లాడుతూ పత్తి, పొగాకు పంటలకు ప్రత్యమ్నాయంగా తీసుకొచ్చిన సుబాబుల్, జామాయిల్ రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కర్ర కొనుగోలు చేసి నేరుగా మార్కెట్ కమిటీలు డబ్బులు చెల్లించే విధంగా పాత విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఆచార్య రంగా కిసాన్ సంస్థ కార్యదర్శి చుంచు శేషయ్య మాట్లాడుతూ దేశంలోని సుబాబుల్, జామాయిల్, సరుగుడు రైతులకు ధర లేకుండా తీవ్రంగా నష్టపోతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం విదేశాల నుంచి పేపర్‌ను, పేపర్ తయారీ గుజ్జును దిగుమతి చేసుకోవడం దారుణమన్నారు. మేక్ ఇన్ ఇండియా అంటూ పదేపదే వల్లెవేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ ఇక్కడి రైతాంగాన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. సమావేశంలో సీపీఐ జిల్లా నాయకుడు ఉప్పుటూరి ప్రకాశరావు, ఓపీడీఆర్ రాష్ట్ర నాయకుడు చావలి సుధాకర్, లోక్‌సత్తా జిల్లా నాయకుడు షఫీ, పౌర సమాజం నాయకుడు నరసింహారావు, రైతు కూలీ సంఘం నాయకుడు హనుమంతురావు, రైతు నాయకుడు సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
వ్యవసాయోత్పత్తులకు గడ్డుకాలం
వ్యవసాయ రంగంలో 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని 2016 ఫిబ్రవరి 22న ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలిలో ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ ప్రతిపాదనను సాఫల్యం చేయడానికి నీతి ఆయోగ్‌ను ఆదేశించారు. ప్రణాళికాబోర్డును రద్దుచేసి, దానిస్థానంలో నీతి ఆయోగ్‌ను ఏర్పర్చిన తర్వాత ఈ సంస్థ ప్రతిపాదించిన సూచనలు, నివేదికలు కార్పొరేట్లకు అనుకూలంగా వున్నాయే తప్ప, సామాన్య ప్రజలకు ఏమాత్రం ప్రయోజనకరంగా లేవని ఆచరణ రుజువు చేసింది. రైతుల ఆదాయం రెట్టింపుచేసే బాధ్యతను తీసుకున్న నీతి ఆయోగ్ 4 సూచనలను ప్రకటించింది. 1. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించటం 2. వ్యవసాయ ఉత్పత్తులు పెంచటం 3. భూసంస్కరణలు అమలుచేసి పేదలకు భూములు పంచటం 4. రైతులకు సహాయం అందించటం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయవచ్చని సూచించింది. అసలు పెరుగుదల అంటే ఏమిటి? ఏ ప్రాతిపదికగా పెరుగుదలను పరిశీలించాలి? 1. రైతుల ఆదాయం 2. ఉత్పత్తి పెరుగుదల 3. వ్యవసాయ రంగంలో అదనపు విలువ పెంపుదల 4. దేశీయ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల. పై నాలుగింటిలో ఏ రంగంలో పెరుగుదల వల్ల రైతుల ఆదాయం పెరుగుతుంది? ఈ నాలుగు అంశాలను పరిశీలించిన నిపుణుల కమిటీ భారతదేశంలో ప్రస్తుత విధానాల ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరగడం కానీ, రైతు ఆదాయం పెరగడం కానీ అసాధ్యమని ఈ మధ్య తేల్చారు. గిట్టుబాటు ధరలు రెండు విధాలుగా చూడాలి. 1. మార్కెట్ సంస్కరణలు 2. కనీస మద్దతు ధర నిర్ణయం. మార్కెట్ సంస్కరణల విషయంలో రాజ్యాంగం రీత్యా రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు చేపట్టాలి. కానీ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు మార్కెట్ చట్టాలను కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మార్చి బిల్లులు తయారుచేసి తమ తమ శాసనసభలలో ఆమోదానికి పెట్టాల్సిందిగా ఆదేశిం చింది. తెలుగు రాష్ట్రాలు రెండూ ఆ బిల్లులను ఆమోదించాయి. ఈ చట్ట సభల ద్వారా కార్పొరేట్ సంస్థలకు మార్కెట్లలో కొనుగోలుచేసే అవకాశం కల్పిం చారు. ధరలను ఆ సంస్థలే నిర్ణయిస్తాయి. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరల నుంచి వైదొలిగి రాష్ట్రాలపై నెట్టివేసింది. గిట్టుబాటు ధరలు నిర్ణయించటం, వాటిని అమలుచేసే బాధ్యతను కేంద్రం గానీ, రాష్ట్రంగానీ ఇంతవరకూ ప్రకటించలేదు. కేంద్రం ధరలు ప్రకటించి చేతులు దులుపుకోగా, రాష్ట్రం నేటికీ ధరల అమలుపై తన బాధ్యతను ప్రకటించలేదు. ఉత్పత్తిని పెంచడం: గత సంస్కరణల నుండి (1997 నుండి) మన దేశీయ పరిశోధనల విభాగాలను దాదాపుగా మూసివేశారు. బహుళజాతి సంస్థలైన మోన్శాంటో, డూపాంట్, కార్గిల్, సింజెంటా సంస్థలు 80% ప్రయోగాలను చేస్తుండగా, వాటిని మన దేశంలో వినియోగిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో 27 కేంద్రాలలో 5 వేల ఎకరాల భూమి పరిశోధనల కొరకు కేటాయించబడినప్పటికీ, ఆ పరి శోధనా కేంద్రాలన్నింటినీ మూసివేయడం జరిగింది. ఇలాంటి స్థితిలో ఉత్పాదకత ఎలా పెరుగుతుంది? సహాయక చర్యలు: ప్రస్తుతం బడ్జెట్లో 2.5% మాత్రమే వ్యవసాయ రంగానికి కేటాయిస్తున్నారు. పేద దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ దేశాలు తమ బడ్జెట్లో 5 నుంచి 8 శాతం కేటాయించాయి. 8 రకాల సబ్సిడీలను రైతులకు అందచేస్తున్నారు. పంటల బీమా ప్రీమియం పూర్తిగా ప్రభుత్వాలే చెల్లిస్తున్నాయి. నిర్ణయించిన ఆదాయం, నిర్ణయించిన ధరలు మార్కెట్లో తగ్గితే ఆ లోటును కూడా ప్రభుత్వాలు రైతుకు నగదుగా ఇస్తున్నాయి. కానీ ఇందులో ఏ ఒక్కటీ భారతదేశంలో అమలు జరగడం లేదు. రెట్టింపు కావడానికి చేపట్టాల్సిన చర్యలు: నాణ్యత గల వ్యవసాయ ఉపకరణాలు స్వదేశీ టెక్నాలజీలో పరిశోధన చేసి రైతులకు సకాలంలో అందించాలి. వ్యవసాయ భూమి తగ్గుదలను అరికట్టాలి. సకాలంలో పంటలకు సాగునీటి వసతి కల్పించాలి. సకాలంలో రుణాలు ఇవ్వాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక రుణాలు వడ్డీ లేకుండా ఇవ్వడంతోపాటు, సహకార వ్యవస్థను బలపర్చాలి. పంటలు వేసేటప్పుడే ధరలు నిర్ణయించి, ఆ ధరలను అమలు జరపాలి. ప్రభుత్వమే అన్ని పంటలకు ప్రీమియం చెల్లించాలి. 60 సం.లు దాటిన రైతులకు పెన్షన్లు ఇవ్వాలి. బడ్జెట్లో 6% వ్యవసాయ రంగానికి కేటాయించాలి. పరిశోధనా కేంద్రాలలో స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా విత్తనోత్పత్తి చేసి, రైతులకు అందించాలి. కార్పొరేట్ల జోక్యం ఉన్నంతకాలం రైతుల ఆదా యం పెరగదని ప్రపంచబ్యాంకు అనుకూల నిపుణులే వ్యాఖ్యానిస్తున్న అంశాలను కేంద్రం దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ప్రకటించిన విధానాలను మార్చాలి. వ్యాసకర్త: సారంపల్లి మల్లారెడ్డి, వ్యవసాయ నిపుణులు మొబైల్ : 94900 98666 -
‘మాకే తప్పుడు సమాచారం ఇస్తారా?’
సాక్షి, ముంబై: వర్షాలు పడకపోవటతో వాతావరణ శాఖపై రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఈసారి రుతుపననాల సందర్భంగా మంచి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ కొన్నిరోజుల క్రితం ప్రకటించింది. దీంతో మరాఠ్వాడా ప్రాంతానికి(మహారాష్ట్ర) చెందిన రైతులు తమవద్ద ఉన్న మొత్తం నగదుతో పంటల్ని సాగుచేశారు. అయితే తొలికరి వర్షం మినహా వర్షాలు కురవకపోటంతో ఆగ్రహించిన అన్నదాతలు.. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) డైరెక్టర్(పుణె )పై పర్బానీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వర్షపాతంపై వాతావరణ శాఖ సరైన అంచనాలు ఇవ్వకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోయామని.. ఎరువులు, పురుగు మందుల కంపెనీలతో కుమ్మక్కై వాతావరణ శాఖ అధికారులు తప్పుడు అంచనాలను ఇచ్చారని రైతులు ఆరోపించారు. ఈ మేరకు రైతు సంఘం ‘స్వాభిమాని షేట్కారీ సంఘటన’ చీఫ్ మానిక్ కదమ్ రైతులతో కలసి పోలీసులను ఆశ్రయించారు. ఐఎండీ అధికారులపై ఛీటింగ్ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ విషయమై స్పందించేందుకు వాతావరణ శాఖ అధికారులెవరూ అందుబాటులోకి రాలేదు. గతేడాది జూన్‌లో బీడ్ జిల్లా వాసులు కూడా ఇలాంటి ఫిర్యాదే చేయగా.. పెద్దగా ఫలితం కనిపించలేదు. ఇదిలా ఉంటే ‘వర్షాలపై తప్పుడు సమాచారంతో రైతులకు తీరని నష్టం చేశారంటూ’ వాతావరణ శాఖపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్.. గతేడాది సెప్టెంబర్‌లో పర్యావరణ మంత్రితత్వ శాఖకు ఓ లేఖ రాశారు కూడా. -
మా బడి తోట.. ‘దివ్య’మైన బాట
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ మరో వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల కాలంలోనే ఆమె కౌలు రైతులు, ఆదివాసీల కోసం చేపట్టిన చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకున్న విషయం విదితమే. తాజాగా ఆమె ఆలోచనల నుంచి వచ్చిందే ‘మా బడి తోట’. ఆదిలాబాద్ జిల్లా సర్కారు బడుల్లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రతీ బడిలో సేంద్రియ పద్ధతిలో కిచెన్ గార్డెన్‌ను సాగు చేయాలి. తద్వారా విద్యార్థులకు మేలైన పోషకాహారం అందించడంతోపాటు వ్యవసాయం, పోషక విలువలపై ఈ పాఠశాలల్లో సాగు ద్వారా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. కూరగాయల విత్తన రకాలు అందజేత జిల్లాలో కేజీబీవీ, రెసిడెన్షియల్, ఆశ్రమ పాఠశాలలు, మోడల్ స్కూల్, ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలతోపాటు వసతిగృహాలు కలిపి 1400లకు పైగా ఉన్నాయి. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లకు స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో కూరగాయల విత్తన రకాలకు సంబంధించి తయారుచేసిన ప్యాకెట్లను కలెక్టర్ అందజేశారు. ఒక్కో రకం కూరగాయల పంటకు ఇద్దరు ముగ్గురు విద్యార్థులు గ్రూపుగా కలసి దత్తత తీసుకోవాలి. బడి ఆవరణలో ఎంపిక చేసిన ప్రదేశంలో ఆయా రకాల విత్తనాలను ఆయా గ్రూపు విద్యార్థులతో నాటించాలి. నారు పెంపకంలో అటు కలుపు తీయడమే కాకుండా నీళ్లందించి వాటిని సంరక్షించే బాధ్యత ఆ దత్తత తీసుకున్న గ్రూపు పిల్లలే వహించేలా చూడాలి. కూరగాయలు అందించడం ద్వారా మధ్యాహ్న భోజన నిర్వాహకులకు మేలు జరుగుతున్నందునా ఈ నారు పెంపకంలో వారిని భాగస్వాములు చేసి తోటను వృద్ధి చేయాలి. దీనికి సంబంధించి మాబడి తోట పెంపకానికి సూచనలను ఇస్తూ నాలుగు పేజీల నోట్‌ను తయారుచేసి ప్రతి పాఠశాలకు అందజేశారు. టమాటా మినహా ఇతర కూరగాయ గింజలన్ని నాటిన మొక్కల నుంచి తీసుకొని తర్వాత సంవత్సరంలో నాటేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశించారు. స్థలం లేనిచోట.. ఆదిలాబాద్ జిల్లాలో 1400లకు పైగా పాఠశాలలు ఉంటే ఓ పది శాతం పాఠశాలల్లో స్థలం కొరత కారణంగా కిచెన్‌గార్డెన్ ఇబ్బందిగా ఉంటుందని కొంతమంది ప్రధానోపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటిచోట తీగజాతి సొరకాయ, బీరకాయ వంటివి పెంచాలని కలెక్టర్ సూచించారు. గోడల మీదా పెరిగేలా వాటిని ఏర్పాటు చేసుకోవాలి. ప్రహరీలు లేని పాఠశాలల్లో ముళ్ల కంచెలను ఏర్పాటు చేసుకోవాలి. నీటి వసతిలేని దగ్గర నీళ్లు వృథా కాకుండా విద్యార్థుల భోజనం తర్వాత చేతులు శుభ్రం చేసే దగ్గరి నుంచి కూరగాయల నారు వరకు నీళ్లు వెళ్లేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇలా మాబడితోట కార్యక్రమం విషయంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ‘దివ్య’మైన ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. -
పత్తి.. ముంచెత్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతన్నలు తెల్ల బంగారంపై మోజు పెంచుకున్నారు. గులాబీ రంగు పురుగు భయపెడుతున్నా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. నష్టమైనా కష్టమైనా పత్తే మేలు చేస్తుందని భావిస్తున్నారు. వ్యవసాయ శాఖ అంచనాలకు మించి ఈసారి పత్తి సాగవడాన్ని బట్టే పత్తిపై రైతులు ఎంత ధీమాగా ఉన్నారో తెలుస్తోంది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా ఇప్పటివరకు 42.66 లక్షల ఎకరాల్లో (102 శాతం) పంట సాగు చేశారు. అన్నీ అనుకూలిస్తే ఈ సీజన్లో దిగుబడి భారీగా ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొక్కలు పీకేస్తున్న రైతులు గులాబీరంగు పురుగు దాడి గతేడాది కంటే ఈసారి ఎక్కువగా ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. గతేడాది 10 లక్షల ఎకరాల్లో పురుగు దాడి చేయగా ఈసారి ఉధృతి ఇంకా ఎక్కువ ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. గులాబీ ఉధృతికి ఇప్పటికే పలుచోట్ల రైతులు మొక్కలు పీకేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏడాదికేడాది గులాబీ పురుగు దాడి పెరుగుతోందని, దీన్ని ప్రాధాన్యంగా గుర్తించి పురుగుపై యుద్ధం చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. గతేడాది సకాలంలో వర్షాలు కురవక, గులాబీ పురుగు వల్ల పెద్ద ఎత్తున దిగుబడులు తగ్గిపోయాయని.. గత సీజన్లో 3.30 కోట్ల క్వింటాళ్ల దిగుబడి అంచనా వేస్తే 2 కోట్ల క్వింటాళ్లకు మించి రాలేదని, కాబట్టి పత్తి రైతులకు మున్ముందు పెను సవాళ్లు పొంచి ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. మరోవైపు అనుమతిలేని బీజీ–3ని పావు శాతం విస్తీర్ణంలో వేసినట్లు అంచనా. గ్లైఫోసెట్ నిషేధంతో బీజీ–3లో పెరిగే కలుపును నివారించే పరిస్థితి కూడా ఉండదు. ఇది కూడా పత్తి రైతుపై వ్యతిరేక ప్రభావం చూపే ప్రమాదముంది. దిగుబడి పెరిగినా ధర పలకదే! భారీ దిగుబడులొచ్చిన ప్రతిసారీ పత్తి ధరలు తగ్గుతుండటం చూస్తూనే ఉన్నాం. పైగా అంతర్జాతీయ పరిస్థితులూ పత్తిపై ప్రభావం చూపుతుంటాయి. మరోవైపు వ్యాపారుల మాయాజాలంతో రైతులను నిలువునా ముంచుతున్న పరిస్థితులూ కనబడుతున్నాయి. గతేడాది పత్తి కనీస మద్దతు ధర రూ. 4,020 కాగా, కీలక సమయంలో క్వింటాకు రూ. 3 వేల వరకు కూడా వ్యాపారులు కొనుగోలు చేశారు. పైగా భారత పత్తి సంస్థ (సీసీఐ) కూడా వివిధ కారణాలు చూపి ధర తగ్గించిన పరిస్థితులున్నాయి. దీన్ని వ్యాపారులు సొమ్ము చేసుకున్నారు. అయితే పత్తి మద్దతు ధరను కేంద్రం రూ. 5,150కు పెంచడం రైతులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఎన్నికల ఏడాదిలో పత్తి చేతికి వస్తున్నందున ప్రభుత్వం జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇప్పటికే మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి కూడా ఖరీఫ్ పంటల కొనుగోలుపై తాజాగా సమావేశం ఏర్పాటు చేశారు. పుంజుకోని వరి నాట్లు ప్రస్తుత ఖరీఫ్‌లో వరి నాట్లు పుంజుకోలేదు. ఖరీఫ్ వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.75 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 14.87 లక్షల ఎకరాల్లోనే నాట్లు పడినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10.47 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 8.91 లక్షల (85%) ఎకరాల్లో సాగయ్యాయి. అందులో కంది సాగు 92 శాతానికి చేరుకుంది. ఈసారి లోటు వర్షపాతం రాష్ట్రంలో ఈసారి లోటు వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 423.5 మిల్లీమీటర్ల (ఎంఎం) వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 338 ఎంఎంలే నమోదైంది. 20 శాతం లోటు వర్షపాతం నమోదైందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. జిల్లాల వారీగా చూస్తే 17 జిల్లాల్లో లోటు, 14 జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డయిందని పేర్కొంది. ఇదే పరిస్థితి కొనసాగితే పత్తి సహా ఇతర పంటలపైనా వ్యతిరేక ప్రభావం ఉంటుందని, వరి నాట్లు వేయడానికి వాతావరణం అనుకూలంగా ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
వరి వేయాలా.. వద్దా..!
రాజుపాళెం (వైఎస్సార్ కడప): రాజోలి నుంచి మెదలయ్యే కేసీ కాలువ ఆయకుట్టు పరిధిలో రైతులకు సాగునీటిపై అధికారులు ఏ విషయం చెప్పలేకపోతున్నారు. అన్నదాతలేమో వరినారు కయ్యలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటినుంచి డిసెంబరు 15వ తేదీ వరకు నీటిని విడుదల చేస్తామని అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే శ్రీశైలం ప్రాజెక్టులో 876 అడుగుల నీటిమట్టం ఉందని, ఆయకట్టు పరిధిలో వరి సాగు చేసేందుకు రైతులు సన్నద్ధం అయ్యారు. నాలుగైదు రోజులుగా నారుదొడ్డి చేసుకుంటూ, వట్టి వడ్లు, పులక చల్లుకుంటున్నారు. గత నెల 29న ప్రధాన కాలువకు, ఈనెల 1న కేసీ చాపాడు కాలువలకు ఆశాఖ అధికారులు, డీసీ చైర్మన్లు నీటిని విడుదల చేశారు. కేసీ చాపాడు కాలువ కింద రాజుపాళెం, ప్రొద్దుటూరు, చాపాడు మండలాలు, కేసీ ప్రధాన కాలువ కింద కర్నూలు జిల్లా చాగలమర్రి, వైఎస్ఆర్ జిల్లా రాజుపాళెం, దువ్వూరు, మైదుకూరు, ఖాజీపేట, చెన్నూరు, కడప, వల్లూరు మండలాలు కలిపి దాదాపు 92 వేల ఎకరాల ఆయకుట్టు ఉంది. ఇప్పటికే రాజపాళెం మండలంలోని వెలవలి, తొండలదిన్నె, టంగుటూరు, వెంగళాయపల్లె, రాజుపాళెం, పగిడాల, గాదెగూడూరు గ్రామాల్లోని రైతులు వరి నారుకయ్యలు తయారు చేసుకొని పులక చల్లుతున్నారు. ఎకరా వరి పంట సాగు చేయాలంటే విత్తనవడ్లు రూ.900, ఎరువు, కూలీల ఖర్చు రూ.500, ఎద్దులకు రూ.400 కలిపి రూ.1800 నుంచి రూ.2200 ఖర్చు అవుతున్నట్లు తెలిపారు. గత మూడేళ్లేగా సాగునీరు లేకపోవడంతో కేసీ ఆయకట్టు వరి సాగుకు నోచుకోవడం లేదు. వరి సాగు చేయొద్దు ఈక్రమంలో కర్నూలు జిల్లాల్లోని ఉన్నతాధికారులు కేసీ ఆయకట్టు కింద వరిపంట వేయొద్దని, ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని చెబుతున్నారు. దీంతో నారుదొడ్లలో పులక చల్లిన రైతుల్లో ఆందోళన నెలకొంది. మూడేళ్లుగా ఆరుతడి పంటే సాగు కేవలం ఆరుతడి పంటలైన మినుము, పెసర, శనగ, జొన్న పంటలనే రైతులు సాగు చేసుకోవాల్సి వస్తోంది.అక్కడక్కడా పత్తి సాగవుతోంది. మాగాణి భూముల్లో వరి సాగు చేసుకోవాల్సిన రైతులకు ప్రతిఏటా సాగునీటి కష్టాలు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో నీరు నిల్వ ఉన్నప్పటికి మంత్రి, అధికారులు కేసీ ఆయకట్టు పరిధిలో సాగునీటిపై స్పష్టమైన ప్రకటన ఇవ్వలేకపోతున్నారు. ప్రస్తుతం రాజోలి ఆనకట్ట నుంచి కేసీ చాపాడు కాలువకు 200, కేసీ ప్రధాన కాలువకు 600, కుందునదిలోకి 2900 క్యూసెక్కులు నీరు పోతోంది. 10 ఎకరాలకు పులక చల్లాను నేను పది ఎకరాల్లో నారుదొడ్డిలో పులక చల్లాను. అధికారులు మాత్రం డిసెంబరు 15వ తేదీ వరకు నీటిని విడుదల చేస్తామని చెప్పారు. రైతులంతా కాలువలకు నీరు రావని అనుకుంటున్నారు. ఎకరాకు రూ.2000 వరకు ఖర్చవుతోంది. ఏంచేయాలో తెలియడం లేదు. అధికారులు కేసీ కాలువ కింద వరి పంట సాగుపై ప్రకటన ఇవ్వాలి. – పద్మనాభరెడ్డి, రైతు, వెలవలి, రాజుపాళెం మండలం స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి నేను ఇరవై ఎకరాల్లో వరి సాగు చేసేందుకు నారుకయ్యలను సిద్ధం చేసి పులక, వడ్లు చల్లాను. కాలువకు నీటిని విడుదల చేసేటప్పుడు అధికారులు డిసెంబరు నెలాఖరు వరకు నీటిని విడుదల చేస్తామని చెప్పారు. కర్నూలు జిల్లాలోని అధికారులు మాత్రం వరిపంట సాగు చేయవద్దంటున్నారు. గత మూడేళ్లుగా వరిపంట వేయలేదు. – చెన్నంగి ఎర్రన్న, రైతు, తొండలదిన్నె, రాజుపాళెం మండలం