సాక్షి, అమరావతి: సంప్రదింపుల పేరుతో సామధాన దండోపాయాలు ప్రయోగించి ఎక్కడ కావాలంటే అక్కడ భూములను లాక్కోవాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగానే 2013 కేంద్ర భూసేకరణ చట్టం స్థానే ఆంధ్రప్రదేశ్ భూసేకరణ సవరణ చట్టం – 2018కి సంబంధించిన విధి విధానాలతో సోమవారం జీవో జారీ చేసింది. 2013 కేంద్ర భూసేకరణ చట్టంలోని సామాజిక ప్రభావ అంచనా, ప్రజాభిప్రాయ సేకరణలను చట్టుబండల్లా మార్చి(తొలగించి) తెచ్చిన ఆంధ్రప్రదేశ్ భూసేకరణ చట్టం – 2018 ప్రకారం భూ యజమాని ఇక ప్రేక్షకుడిగా మిగిలిపోనున్నాడు.
సవరించిన కొత్తచట్టం ప్రకారం భూసేకరణ అథారిటీ (కలెక్టరు) సంప్రదింపుల ద్వారా రైతులను ఒప్పించి భూములను సేకరించవచ్చు. తెలిసో తెలియకో, సర్కారు ఒత్తిడికి భయపడో భూములు ఇవ్వడానికి అంగీకరిస్తూ రైతులు సంతకాలు చేస్తే తర్వాత ఈ చట్టం ప్రకారం రైతులు కోర్టుకు వెళ్లడానికి కూడా వీలుండదు (భూమి ఇవ్వడానికి అంగీకరించకుండా సంతకాలు చేయకుండా ఉంటే మాత్రమే కోర్టుకు వెళ్లి రక్షణ పొందవచ్చు). భూయజమానుల హక్కులను దారుణంగా దెబ్బతీసే ఈ చట్టం వాస్తవంగా అయితే ఇప్పటి నుంచి అమలు కావాలి. అయితే 2014 జనవరి ఒకటో తేదీ నుంచే చట్టం అమల్లోకి వచ్చినట్లు పరిగణించాలంటూ జీవోలో ప్రభుత్వం మెలిక పెట్టడం గమనార్హం.
జీవోలోని ముఖ్యాంశాలివీ..
ఏ విభాగమైనా, సంస్థ అయినా భూమి కావాలని కలెక్టరుకు దరఖాస్తు చేసుకుంటే భూసేకరణ అథారిటీ (సంబంధిత జిల్లా కలెక్టరు) సంప్రదింపుల పద్ధతిలో భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. దీనినే కన్సెంట్ అవార్డు అంటారు. దీని ప్రకారం భూములు ఇవ్వడానికి ఇష్టపడే రైతులు సమ్మతి పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టరు, రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో), పనుల విభాగం కార్యనిర్వహణ ఇంజినీరు ( భూమి సేకరణ కోరిన శాఖ కాకుండా వేరే విభాగం వారు), భూమి కోరుతున్న సంస్థ ప్రతినిధితో కూడిన కమిటీ భూయజమానులతో సంప్రదింపులు జరిపి ధర ఖరారు చేస్తుంది. సమ్మతి తెలిపిన భూ యజమానులు, భూసేకరణ సంస్థ ప్రతినిధులు దీని ప్రకారం అంగీకారపత్రాలపై సంతకాలు చేస్తారు. దీనినే అగ్రిమెంటు అంటారు. దీని ప్రకారం కలెక్టరు అవార్డు ప్రకటిస్తారు.
రాష్ట్ర ప్రభుత్వ అధికారాలిలా..
ఏదైనా విభాగం కనీసం ఎంత భూమి సేకరించాలో మొదట నిర్ణయించుకుని రెవెన్యూ శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. రెవెన్యూ శాఖ దీనిని ఖరారు చేసిన ప్రజాప్రయోజనాల కోసమని భావిస్తే సామాజిక ప్రభావ అంచనా నుంచి మినహాయింపు నోటిఫికేషన్ జారీ చేస్తుంది. దీంతో మైదాన ప్రాంతాల్లో గ్రామసభలు నిర్వహించాల్సిన అవసరం ఉండదు. గిరిజన ప్రాంతాల్లో పీసా చట్టం అమల్లో ఉన్నందున అక్కడ గ్రామసభలు తప్పనిసరి. ఎవరైనా తమకు భూమి కావాలంటూ జిల్లా కలెక్టరుకు విజ్ఞప్తి చేసుకోవచ్చు. వాటిని పరిశీలించి కలెక్టరు భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయవచ్చు.
– ఈ జీవో ప్రకారం భూసేకరణ వల్ల ప్రభావితులయ్యే కుటుంబాలకు ముందస్తు నోటీసులు జారీ చేయాలి. నిర్వాసితులకు 2018 భూసేకరణ చట్టం ప్రకారం ఏకమొత్తంగా పరిహారం చెల్లించాలి.
– భూ యజమానుల అభిప్రాయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఎక్కడ కావాలంటే అక్కడ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా భూములు తీసుకునేందుకు మార్గం సుగమమయ్యింది.
సవరణలతో వచ్చే నష్టాలివీ..
ఏపీ భూసేకరణ చట్టం–2018 వల్ల భూయజమానులకు వివిధ రకాలుగా నష్టం జరుగనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద చేపట్టే ప్రాజెక్టులు, రహదారులు, గృహ నిర్మాణ ప్రాజెక్టులు, ప్రభుత్వ అవసరాలకు ఇకపై సామాజిక ప్రభావ మదింపు అంచనా అవసరంలేదు. నచ్చిన పారిశ్రామికవేత్తలకు విలువైన భూములను సేకరించి ఇవ్వొచ్చు.
- ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటే భూ యజమానులు ప్రేక్షకుల్లా మిగిలిపోవాల్సి వస్తుంది.
- కలెక్టరు, ఇతర అధికారులు సంప్రదింపుల ద్వారా నిర్ణయించిన ధరే ఇక ఫైనల్. దీనికి రైతులు ఆమోదం తెలుపుతూ సంతకాలు చేస్తే తర్వాత దీనిపై కోర్టుకు వెళ్లడానికి కూడా అవకాశంలేదు. ఉదాహరణకు.. రాజధాని అమరావతి కోసం భూములు ఇవ్వడానికి తిరస్కరించిన గుంటూరు జిల్లా పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో ఎకరా అధికారిక ధర రూ.కోటి వరకు (మార్కెట్ ధర రూ.రెండు నుంచి నాలుగు కోట్లకు పైగా) ఉందనుకుందాం. 2013 కేంద్ర భూసేకరణ చట్టం ప్రకారం దీనికి రెండున్నర రెట్లకు పైగా రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి.
మరీ అన్యాయం...
ఇప్పుడు జారీ చేసిన 2018 భూసేకరణ చట్టానికి సంబంధించిన జీవో 2014 జనవరి నుంచే అమల్లోకి వచ్చినట్లు పేర్కొడం దారుణమని నిపుణులతోపాటు అధికారులు కూడా అంటున్నారు. అనగా 2013 కేంద్ర భూసేకరణ చట్టం కింద జారీ చేసిన నోటిఫికేషన్లకు కొత్త చట్టమే అమలు చేస్తామని అర్థం. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో, వివిధ ప్రాజెక్టులకు, మచిలీపట్నం పోర్టుకు, అమరావతి అనంతపురం హైవే భూసేకరణకు 2013 భూసేకరణ చట్టం కింద జారీ చేసిన నోటిఫికేషన్లను చట్టుబండలుగా మార్చి కొత్త చట్టం ప్రకారం భూములు లాక్కోవాలన్న ఎత్తుగడతోనే పాత తేదీతో జీవో జారీ చేసిందని అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment