రైతుల నమ్మకాన్ని వమ్ము చేయొద్దు | The farmers do not do a try | Sakshi
Sakshi News home page

రైతుల నమ్మకాన్ని వమ్ము చేయొద్దు

Published Fri, Nov 20 2015 3:06 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

రైతుల నమ్మకాన్ని వమ్ము చేయొద్దు - Sakshi

రైతుల నమ్మకాన్ని వమ్ము చేయొద్దు

* వారికందాల్సిన ప్రయోజనాల్ని నిరాకరించడానికి వీల్లేదు
* చెప్పిన వాటిని వర్తింపచేయండి
* రైతులు సంశయం లేకుండా భూములప్పగించడాన్ని మర్చిపోవద్దు
* జరీబు భూముల్ని మెట్టభూములంటూ జారీచేసిన ఉత్తర్వుల ఉపసంహరణపై పరిశీలించండి
* ఏపీ సర్కారుకు హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ
* రాజధాని భూములపై కౌంటర్ దాఖలుకు ఆదేశం
 సాక్షి, హైదరాబాద్: ఎంతో నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంకోసం భూసమీకరణ(ల్యాండ్ పూలింగ్) కింద భూములిచ్చిన రైతుల విశ్వాసాన్ని వమ్ము చేయవద్దని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది.

నిబంధనల మేరకు వారికి ఏ ప్రయోజనాలు అందాలో, అవి వారికందేలా చూడాల్సిందేనని తేల్చిచెప్పింది. పూలింగ్ కింద భూములు తీసుకున్న తరువాత, వారికందాల్సిన ప్రయోజనాల్ని నిరాకరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. రైతులు ఎటువంటి సంశయాలకు తావులేకుండా భూములప్పగించిన విషయాన్ని మర్చిపోవద్దని ప్రభుత్వానికి హితవు పలికింది.

నీటిలభ్యత ఉండే జరీబు భూముల్ని మెట్టభూములుగా పేర్కొంటూ జారీచేసిన ఉత్తర్వుల్ని ఉపసంహరించుకునే విషయంలో సాధ్యాసాధ్యాల్ని పరిశీలించాలని పేర్కొంది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
 
మెట్టభూములనడం చట్టవిరుద్ధం..
తుళ్లూరు మండలంలోని రాయపూడి ఎత్తిపోతల పథకం కింద నీటి లభ్యతున్న తమ జరీబు భూములను మెట్టభూములుగా పేర్కొంటూ సీఆర్‌డీఏ చట్టం కింద ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాలుచేస్తూ 55 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఈ.మనోహర్ వాదనలు వినిపిస్తూ.. ఏడాదిలో పది నెలలపాటు నీటి లభ్యతుండే పిటిషనర్ల భూములను మెట్టభూములుగా పేర్కొనడం సరికాదన్నారు. పూలింగ్‌కింద భూముల్ని తీసుకునే సమయంలో జరీబు భూములుగానే పేర్కొన్న ప్రభుత్వం, తీరా తీసుకున్నాక వాటిని మెట్టభూములుగా పేర్కొనడం చట్టవిరుద్ధమని వివరించారు. ఇలా జరీబు భూముల్ని మెట్టభూములుగా పేర్కొనడంవల్ల చట్టనిబంధనల మేరకు పిటిషనర్లకు దక్కాల్సిన ప్రయోజనాలు దక్కకుండా పోతాయని కోర్టుకు ఆయన నివేదించారు.
 
అనుమానాలు కలుగుతాయి..
ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘రైతులు ఎటువంటి సంశయాలకు తావులేకుండా ప్రభుత్వంపై నమ్మకంపై పూలింగ్ కింద వారి భూముల్నిచ్చారు. పూలింగ్ కింద భూములిచ్చిన వారికి చట్టప్రకారం దక్కాల్సిన ప్రయోజనాలు పూర్తిగా వారికి అందాల్సిందే. భూములు తీసుకున్న తరువాత సవరణలతో ఉత్తర్వులు జారీ చేయడంవల్ల వారిలో అనుమానాలు తలెత్తే అవకాశముంది.

పూలింగ్‌కింద భూములు తీసుకునేటప్పుడు ఏ ప్రయోజనాలు కల్పిస్తామని హామీఇచ్చారో, వాటిని తప్పక వారికందేలా చూడాలి. ఇదే మా ప్రాథమిక అభిప్రాయం. కాబట్టి జరీబు భూముల విషయంలో జారీ చేసిన సవరణ ఉత్తర్వుల్ని ఉపసంహరించుకోవడం సాధ్యమవుతుందో లేదో చెప్పండి.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మా ముందుంచండి’’ అని స్పష్టం చేసింది. అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, కౌంటర్ దాఖలు చేస్తామని, గడువునివ్వాలని కోరడంతో ధర్మాసనం అందుకు అంగీకరిస్తూ విచారణను వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement