మామిడిని రసాయనాల భూతం వీడటం లేదు. హైకోర్టు ఆదేశాలతో కాల్షియం కార్బైడ్ విని యోగం నియంత్రణలోకి వచ్చినా ప్రత్యామ్నాయంగా ప్రమాదకర ఇథెఫాన్ మిశ్రమం వినియోగం పెట్రేగిపోతోంది. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఇథెఫాన్ మిశ్రమం పొట్లాలను నీటిలో తడిపి మామిడి పండ్లపై వేసి కృత్రిమంగా మాగబెడుతున్నారు. ఈ మిశ్రమం నుంచి విడుదలయ్యే ఇథిలిన్‌తో మామిడి కాయలు విషతుల్యమవుతున్నాయి.
– సాక్షి, హైదరాబాద్
ఇథెఫాన్.. ఇథిలిన్..
మామిడి కాయలను తోటల నుంచి మార్కెట్లకు, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ప్లాస్టిక్ బుట్టల్లో తరలిస్తుంటారు. ఇలాంటి ఒక్కో బుట్టలో 25 నుంచి 30 కిలోల మామిడి కాయలు వేసి వాటిపై నీళ్లతో తడిపిన ఇథెఫాన్ మిశ్రమ పొట్లాలను నేరుగా పడేస్తున్నారు. ఇథెఫాన్ పొట్లాల నుంచి విడుదలయ్యే ఇథిలిన్ వాయువు బుట్ట నుంచి బయటకు రాకుండా పూర్తిగా కాగితాలతో కప్పుతున్నారు. ఒక్కో ఇథెఫాన్ పొట్లం 3 గ్రాముల బరువుండగా, ఒక్కో బుట్టలో ఐదారు పొట్లాలు వేసి ప్యాకింగ్ చేస్తున్నారు. ఇలా ప్యాకింగ్ చేసిన మామిడిని హైదరాబాద్‌లోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ నుంచి నగరంతో పాటు దేశంలోని ఇతర ప్రధాన ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తిన్నా, పీల్చినా, తగిలినా..
తడి ఇథెఫాన్ మిశ్రమం పొట్లాలు విడుదల చేసే ఇథిలిన్ వాయువు ప్రభావంతో మూడు నాలుగు రోజుల్లో మామిడి కాయలు పక్వానికొస్తున్నాయి. ఈ క్రమంలో కాయలు ఇథెఫాన్ రసాయనంతో కలసి విషతుల్యమవుతున్నాయి. ఇథెఫాన్ రసాయన మిశ్రమాన్ని తిన్నా, పీల్చినా.. చర్మం, కళ్లకు ఆ మిశ్రమం తగిలినా హానికరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావంతో కడుపు నొప్పి, విరేచనాలు, ఫిట్స్, మూత్రాశయ వ్యాధులు, స్పృహ కోల్పోవడం, శ్వాసకోశ వ్యాధులొస్తాయని.. చర్మంపై దద్దుర్లు రావడం, దురద కలగడం, కళ్లు మండటం, కంటిచూపు దెబ్బ తినడం, ముక్కు కారడం వంటి సమస్యలొస్తాయని హెచ్చరిస్తున్నారు.
అడ్డగోలు వినియోగం
నీళ్లతో తడిపిన ఇథెఫాన్ పొట్లాలను మామిడి కాయలపై వేయడం ఆహార భద్రత, ప్రమాణాల చట్టానికి విరుద్ధమని నాచారంలోని ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ అధికారులు చెబుతున్నారు. ప్లాస్టిక్ బుట్టల్లో అడుగున గడ్డిని పరిచి తడి ఇథెఫాన్ పొట్లాలున్న పెట్టె పెట్టి.. ఆపై మళ్లీ గడ్డి పరిచి తర్వాతే కాయల్ని వేయాలని వ్యాపారులకు సూచించామని ఓ అధికారి చెప్పారు. కానీ ఇథెఫాన్ వినియోగంపై ఎలాంటి సూచనలు రాలేదని గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. 100 ఇథెఫాన్ పొట్లాల ప్యాకెట్ రూ.350 నుంచి రూ.400ల్లో లభిస్తోంది. యూపీతోపాటు చైనా నుంచి రసాయనాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. మరోవైపు మార్కెట్‌లో పని చేస్తున్న కూలీలు చేతికి రక్షణ తొడుగులు లేకుండా తడి ఇథెఫాన్ పొట్లాలను మామిడి కాయల బుట్టల్లో వేస్తున్నారు.
హైకోర్టు ఆదేశాలు బేఖాతర్!
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం ప్రకారం పండ్లను ఇథిలిన్ గ్యాస్ చాంబర్లలోనే కృత్రిమంగా మాగబెట్టేందుకు అనుమతి ఉంది. ఇథిలిన్ గ్యాస్ ప్రభావంతో కాయలు 3 రోజుల్లో పక్వానికొస్తాయి. కార్బైడ్ వినియోగం నియంత్రించేందుకు ఇథిలిన్ చాంబర్లు ఏర్పాటు చేయాలని రెండేళ్ల క్రితం ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీంతో హైదరాబాద్ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌లో ఇథిలిన్ చాంబర్లు ఏర్పాటయ్యాయి. రోజూ 1,000 నుంచి 1,200 టన్నుల కాయలను రైతులు తీసుకొస్తుండగా, 60 టన్నుల సామర్థ్యంతోనే చాంబర్ ఏర్పాటు చేశారు. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. చాంబర్లు వినియోగానికి రైతులు ముందుకు రాకపోవడంతో ఆపిల్ వ్యాపారులకు అద్దెకిచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రత్యామ్నాయం ఏదీ?
కార్బైడ్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించడం, సరిపడ సంఖ్యలో ఇథిలిన్ గ్యాస్ చాంబర్ల సదుపాయం లేక ఇథెఫాన్ పొట్లాల వినియోగాన్ని అనుమతించక తప్పని పరిస్థితి నెలకొంది. ఇథెఫాన్ పొట్లాలనూ నిషేధిస్తే మాగబెట్టేందుకు మరో ప్రత్యామ్నాయం లేక రైతులు తీసుకొచ్చే పండ్లను కొనేందుకు వ్యాపారులు నిరాకరి స్తున్నారు. ఇథెఫాన్ విక్రయిస్తున్నారని ఇటీవల ఇద్దరు వ్యాపారస్తులను పోలీసులు పట్టుకెళ్లడంతో గడ్డి అన్నారం మార్కెట్‌లో ఓ రోజు పండ్ల కొనుగోళ్లను వ్యాపారులు నిలిపేశారని, దీంతో రైతులు ఇబ్బందిపడుతున్నారని ఓ అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment