High Court of Judicature at Hyderabad
-
మరియమ్మ లాకప్‌డెత్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్ : మరియమ్మ లాకప్‌డెత్ కేసుపై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. మరియమ్మ మృతదేహానికి గత నెలలో రీపోస్ట్‌మార్టమ్ పూర్తైందని ఏజీ తెలిపారు. కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం, ఉద్యోగం ఇచ్చినట్లు తెలియజేశారు. ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో దేశంలో ఇంకా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. పోయిన ప్రాణాలు పరిహారంతో తిరిగి వస్తాయా అని ప్రశ్నించింది. ఆలేరు మేజిస్ట్రేట్ నివేదిక అందిన తర్వాత విచారణ జరుపుతామని తెలిపింది. నివేదిక అందిన 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. మరియమ్మ లాకప్ డెత్‌పై విచారణ సెప్టెంబర్ 15కి వాయిదా వేసింది. -
పోలీస్‌స్టేషన్‌లో సీసీ కెమెరాలు ఎందుకు పెట్టలేదు?
సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్ ఘటనపై న్యాయమూర్తితో విచారణ చేయించకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. పోలీసు కస్టడీలో మహిళ చనిపోతే నేర విచారణచట్టం (సీఆర్పీసీ)సెక్షన్ 176(1)(ఎ) ప్రకారం స్థానిక న్యాయమూర్తితో విచారణ జరిపించాలని స్పష్టంగా ఉన్నా.. ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నిబంధన గురించి సంబంధిత అధికారులకు తెలియదా అంటూ నిలదీసింది. ఈ ఘటనపై ఆలేరు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌ను విచారణ జరపాలని ఆదేశించింది. ఈ నివేదికను నెల రోజుల్లోపు సీల్డ్ కవర్లో సమర్పించాలని పేర్కొంది. అవసరమైతే మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయాలని కూడా మేజిస్ట్రేట్ ఆదేశించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. లాకప్‌డెత్ ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలంటూ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ రాష్ట్ర కార్యదర్శి జయ వింధ్యాల దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. మరియమ్మ, ఆమె కుమారున్ని ఈ నెల 15న పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్ర చిత్రహింసలకు గురిచేశారని పిటిషనర్ తరఫున న్యాయవాది పి.శశికిరణ్ వాదనలు వినిపించారు. పోలీసుల చిత్రహింసలు భరించలేక ఈనెల 18న మరియమ్మ చనిపోయిందని తెలిపారు. ఈ వ్యవహారంపై స్థానిక న్యాయమూర్తితో విచారణ జరిపించాలని, బాధిత కుటుంబానికి రూ.5 కోట్లు పరిహారం ఇప్పించాలని, ఈ మొత్తాన్ని మరియమ్మ మృతికి కారణమైన పోలీసు అధికారుల జీతాల నుంచి వసూలు చేసేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. లాకప్‌డెత్ ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశిం చామని, ఘటన జరిగిన సమయంలో ఉన్న కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) నిబంధనల మేరకు ఈ వ్యవహారంపై ఆర్డీవో విచారణ చేస్తున్నారని, పోస్టుమార్టంను వీడియో తీశామని తెలిపారు. మరియమ్మ మృతదేహాన్ని కుమార్తెకు అప్పగించామని, వారు ఖననం కూడా చేశారని వివరించారు. సీఆర్పీసీలో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ తో మాత్రమే విచారణ చేయించాలని స్పష్టంగా ఉన్నా... ఎన్హెచ్ఆర్ నిబంధనల మేరకు ఆర్డీవో ఎలా విచారణ చేయిస్తారని ధర్మాసనం ప్రశ్నిం చింది. లాకప్‌డెత్ ఘటనపై ఆలేరు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌ను విచారణ జరిపి సీల్డ్కవర్లో నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. మృతురాలి బంధువులకు నోటీసులు జారీ చేసి వాంగ్మూలాన్ని నమోదు చేయాలని ఆదేశించింది. పోలీస్‌స్టేషన్‌లో సీసీ కెమెరాలు ఎందుకు పెట్టలేదు? లాకప్‌డెత్ జరిగిన రోజుకు సంబంధించి పోలీస్ స్టేషన్‌లోని సీసీ కెమెరా రికార్డులను పెన్‌డ్రైవ్‌లో వేసి సీల్డ్కవర్లో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు సమర్పించాలని ధర్మాసనం ఏజీకి సూచించగా... పోలీస్‌స్టేషన్ ఓ ప్రైవేట్ భవనంలో ఉందని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని నివేదించారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించినా ఇప్పటికీ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం కోర్టుధిక్కరణ కిందకు వస్తుందని స్పష్టం చేసింది. సీసీ కెమెరాలు ఉంటే సదరు మహిళది సహజ మరణమా.. చిత్రసింహల వల్లే చనిపోయిందా.. అన్నది నిర్ధారణ అయ్యేదని ధర్మాసనం పేర్కొంది. పోలీస్ స్టేషన్లో సాధారణంగా ఎవరైనా చనిపోయినా ఎవరూ విశ్వసించరని, అలాంటప్పుడు సీసీ కెమెరా రికార్డు ఆధారంగా ఉంటుందని పేర్కొంది. నిజాయితీపరులైన పోలీస్ అధికారులు ఇబ్బందులు పడకూడదనే, వారి రక్షణ కోసమే పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని ధర్మాసనం గుర్తు చేసింది. -
బంగారం కుదవ పెట్టి..బిల్లులు కడుతున్నారు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాయని, రోగుల బంధువులు బంగారాన్ని కుదవపెట్టి బిల్లులు కట్టాల్సి వస్తోందని హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ‘ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలకు ఒకే తరహాలో ధరలు నిర్ణయించాలని గతంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా ఇప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ మేరకు కొత్త జీవో జారీచేయాలని ఆదేశించినా పట్టనట్లుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు..?’అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ధరలు నిర్ణయిస్తే ప్రయోజనం ఏంటని నిలదీసింది. ‘జీవో జారీకి సంబంధించి ప్రభుత్వానికి సూచన చేయలేదు, జీవో జారీ చేయాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేశాం. అయినా పట్టించుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా అధిక బిల్లులు వసూలు చేశారంటూ ప్రైవేటు హాస్పిటల్స్‌పై వచ్చిన ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారు? అధిక బిల్లులపై 79 ఫిర్యాదులు వచ్చాయని నివేదికలో పేర్కొన్నా.. వాటిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయలేదు? ప్రభుత్వమే ఇంత బాధ్యతారహితంగా ఉంటే బాధితులు ఎవరిని ఆశ్రయించాలి? చట్టవిరుద్ధంగా వసూలు చేసిన డబ్బు ప్రైవేటు ఆసుపత్రుల దగ్గర ఉంటే ఎలా?’ అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అసమగ్రంగా, అసంపూర్తిగా నివేదిక ఇచ్చారు ‘గతంలో ఇచ్చిన జీవోను సవరించి పీపీఈ కిట్లు, సీటీ స్కాన్ తదితర పరీక్షలకు ధరలను నిర్ణయించాలని ఆదేశించాం. ఈ మేరకు గతంలో ఉన్న ధరలను రివైజ్ చేసి తాజాగా జీవో జారీ చేయాలని స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చాం. ఈ జీవోను ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పాం. విపత్తు నిర్వహణ చట్టం కింద అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేయాలన్నాం. ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరిగేలా పర్యవేక్షించేందుకు నోడల్ అధికారిని నియమించాలని స్పష్టం చేశాం. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పమన్నాం. కానీ ప్రజా ఆరోగ్య విభాగం సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ సమర్పించిన నివేదికలో గతంలో తామిచ్చిన ఆదేశాలు అమలు చేశారో లేదో ఎక్కడా పేర్కొనలేదు. అసమగ్రంగా, అసంపూర్తిగా నివేదిక సమర్పించారు. మేము అడిగిన ఏ ప్రశ్నకు ఇందులో సమాధానం లేదు. ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా, బాధ్యతా రహితంగా వ్యవహరిస్తే ఎలా..?’అంటూ ధర్మాసనం అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌కు శరపరంపరగా ప్రశ్నలు సంధించింది. గతంలో ఇచ్చిన ఆదేశాల అమలుపై వివరణ ఇచ్చేందుకు కొంత సమయం కావాలని ఏజీ నివేదించగా...15 రోజుల సమయం ఇచ్చినా ఇంకా గడువు కోరడం ఏంటని ప్రశ్నించింది. ప్రైవేటు ఆసుపత్రులు నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు వేస్తే చెల్లించాల్సిన అవసరం లేదని ఏజీ పేర్కొనగా.. కొన్ని ఆసుపత్రులు లక్షల్లో బిల్లులు వేసి డబ్బు కట్టకపోతే స్వస్థత పొందినా.. రోగిని డిశ్చార్జ్ చేసే పరిస్థితి లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నామని, గతంలో తామిచ్చిన ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలు, లేవనెత్తిన ప్రశ్నలపై వివరణ ఇవ్వాలని, విచారణకు ప్రజా ఆరోగ్య విభాగం డైరెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, డీజీపీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావాలని ధర్మాసనం ఆదేశించింది. కరోనా నియంత్రణకు, బ్లాక్ ఫంగస్ చికిత్సకు కేటాయించిన ఔషధాలను ఆసుపత్రులకు అందించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదిని అంతకుముందు ధర్మాసనం ప్రశ్నించింది. కేటాయించిన వాటిలో ఒక్క ఇంజక్షన్ అందని పరిస్థితి ఉందని, ఇందుకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీసింది. కాగా ‘అధిక బిల్లులు వసూలు చేసిందంటూ గత ఏడాది విరించి ఆసుపత్రికి కరోనా చికిత్సలు చేయకుండా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు మళ్లీ ఇదే ఆసుపత్రిపై ఇదే తరహా ఆరోపణలు రావడంతో మళ్లీ చికిత్సలు చేయరాదని ఆదేశించారు. దీంతో లక్షలాది రూపాయలు ఫీజుగా చెల్లించిన బాధితులకు న్యాయం జరగడం లేదు. అధికంగా వసూలు చేసిన బిల్లులను తిరిగి వారికి ఇప్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు..’అని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్, న్యాయవాదులు అర్జున్‌కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎం.రంగయ్య తదితరులు నివేదించారు. చిన్నారులకు ఒకే ఆసుపత్రా? ‘కరోనా మొదటి, రెండో దశతో ఎన్నో విలువైన ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. పొంచి ఉన్న మూడో దశతో రాబోయే తరం...చిన్నారుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. మహారాష్ట్రలో కరోనా మూడో దశ విజృంభిస్తోంది. ఒక్క జిల్లాలోనే 8 వేల చిన్నారులు కరోనా బారిన పడ్డారని వార్తలు వస్తున్నాయి. ఇంతటి ప్రమాద ఘంటికలు మోగుతున్నా తెలంగాణ వ్యాప్తంగా చిన్నారుల వైద్యానికి నీలోఫర్ లాంటి ఒకే ఒక ప్రభుత్వ ఆసుపత్రా? ఇందులోనూ 8 ఐసీయూ, 12 ఆక్సిజన్ పడకలు మాత్రమే ఉన్నాయా? ఇలా ఉంటే కరోనా బారినపడే చిన్నారులకు ఎలా చికిత్స అందిస్తారు?’అంటూ హైకోర్టు ప్రశ్నించింది. ‘కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని గతంలో ఆదేశించినా ప్రభుత్వం సమర్పించిన నివేదికలో చర్యలు తీసుకుంటున్నామని నామమాత్రంగా మాత్రమే పేర్కొన్నారు. ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇందుకోసం కొత్తగా ఎన్ని పడకలను ఏర్పాటు చేశారు? ఎంతమంది వైద్య సిబ్బందిని నియమించారు? అవసరమైన ఔషధాలను ఏమేరకు సమకూర్చుకున్నారు? ఇలాంటి వివరాలేవీ నివేదికలో పేర్కొనలేదు’అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. -
అంబులెన్స్‌లను అడ్డుకోవడంపై తెలంగాణ హైకోర్టు సీరియస్
-
అంబులెన్సులు ఆపొద్దు... ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సరిహద్దుల్లో కరోనా రోగులతో ఉన్న అంబులెన్సులను ఆపేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ‘ప్రాంతీయ భావంతో ప్రజల ప్రాణాలు తీస్తారా, రాజ్యాంగం కల్పిం చిన ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా వ్యవహరిస్తారా? ప్రజల జీవించే హక్కును కాలరాస్తారా’ అని మండిపడింది. కేంద్రం అనుమతి లేకుండా జాతీయ రహదారులపై అంబులెన్స్‌లను ఆపే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారని నిలదీసింది. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా, ఈ నెల 11న తామిచ్చిన ఆదేశాలను ఉల్లంఘించేలా రాష్ట్ర ప్రభుత్వ మెమో ఉందని.. ఆ మెమో జారీచేసిన అధికారులు కోర్టు ధిక్కరణ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అంబులెన్సులను రాష్ట్ర సరిహద్దుల్లో ఆపేసేలా ఇచ్చిన ఆదేశాల అమలును నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించాలంటే కంట్రోల్ రూం ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. రాష్ట్రంలోకి అంబులెన్సుల ప్రవేశానికి సంబంధించిన ఈ మెమోను మార్చి.. మరో రూపంలో ఆదేశాలు ఇవ్వడానికి కూడా వీల్లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తమ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని, సరిహద్దుల్లో ఉన్న అధికారులకు సమాచారమిచ్చి అం బులెన్స్‌ల ప్రవేశానికి ఇబ్బంది లేకుండా చూడాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీని ఆదేశించింది. మా ఆదేశాలకు వక్రభాష్యం రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఇక్కడి ప్రజల ప్రయోజనం కోసం అంబులెన్సుల నిలిపివేత ఆదేశాలు ఇచ్చినట్లు కనిపించడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘ప్రాంతీయ భావంతోనే ఇతర రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి వైద్యం కోసం రాకుండా అడ్డుకునేందుకు ఈ తరహా ఆదేశాలు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. రాతపూర్వక ఆదేశాలు ఇవ్వకుండా అంబులెన్స్‌ల ప్రవేశాన్ని ఎలా నిలిపివేస్తారని గత విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. అంబులెన్స్‌లు ఆపొద్దంటూ ఈనెల 11న మేమిచ్చిన ఉత్తర్వులకు రాష్ట్ర ప్రభుత్వం వక్రభాష్యం చెప్పింది. కరోనా రోగులతో ఉన్న అంబులెన్సుల ప్రవేశాన్ని ఏ చట్టం నిషేధించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వివక్షాపూరితంగా ఉంది. అహ్మదాబాద్‌లో ప్రభుత్వ అంబులెన్సుల్లో వచ్చే వారినే అడ్మిట్ చేసుకోవాలంటూ, ఒక సిటీ నుంచి మరో సిటీలోని ఆస్పత్రుల్లో రోగులు చేరకుండా ఇచ్చిన ఉత్తర్వులను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగుల అడ్మిషన్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా ఒకే తరహా విధానాన్ని రూపొం దించాలని సుప్రీం కోర్టు ఇటీవలే కేంద్రాన్ని ఆదేశించింది కూడా. స్థానికత ఆధారంగా వైద్యం అందిస్తామనడం, ముందస్తు అనుమతి ఉంటేనే కరోనా రోగుల అంబులెన్స్‌లను రాని స్తామనడం దారుణం’ అని ధర్మాసనం పేర్కొం ది. ఈ వ్యవహారంపై రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రం, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను ఆదేశిస్తూ.. విచారణను జూన్ 17కు వాయిదా వేసింది. పలు రాష్ట్రాలు ఈ తరహా ఆదేశాలిచ్చాయి: ఏజీ సరిహద్దుల్లోని మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, ఛత్తీస్‌ఘడ్ నుంచి పెద్ధ సంఖ్యలో కరోనా రోగులు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నారని.. ఇక్కడ అడ్మిషన్ దొరక్క ఇబ్బంది పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ హైకోర్టుకు వివరించారు. వారంతా రోడ్ల మీదే నిరీక్షిస్తుండటంతో కరోనా మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ‘కరోనా రోగుల ప్రవేశాన్ని కట్టడి చేస్తూ రాజస్తాన్, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలు కూడా ఆదేశాలు ఇచ్చాయి. మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు చెందిన కరోనా రోగులను ఆ రాష్ట్రంలోకి అనుమతించట్లేదు. తెలంగాణ ప్రభుత్వం అంత తీవ్రమైన ఆదేశాలు ఇవ్వలేదు. ఇతర రాష్ట్రాల కరోనా రోగులకు వైద్యం నిరాకరించట్లేదు. కరోనా కట్టడి, లాక్డౌన్లో భాగంగానే.. ఆస్పత్రుల్లో అడ్మిషన్ లేనివారి అంబులెన్స్‌ల నిలిపివేత నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో నిబంధనలకు లోబడే ఉంది’ అని వివరించారు. వివక్ష చూపించడమే: ఏపీ ఏజీ ఎస్.శ్రీరాం అంబులెన్సుల కేసులో ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరాం వాదనలు వినిపించారు. ‘అంటువ్యాధుల నియంత్రణ చట్టం, విపత్తు నిర్వహణ చట్టాల మేరకు మెమో జారీ చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం పేర్కొన్నా.. ఆ చట్టాల సారాంశానికి విరుద్ధంగా ఆ మెమో ఉంది. నివాస ప్రాంతం ఆధారంగా కరోనా రోగుల ప్రవేశాన్ని నియంత్రిస్తామనడం వివక్ష చూపడమే. కంట్రోల్ రూం ముందస్తు అనుమతి పేరుతో జాప్యం జరిగితే.. తగిన సమయంలోగా వైద్యం అందక రోగులు చనిపోయే ప్రమా దం ఉంది. అంబులెన్స్‌ల ప్రవేశానికి సంబంధించి తెలంగాణ జారీ చేసిన ఉత్తర్వులు ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి గురువారం రాత్రి అందాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే సరిహద్దుల్లో అంబులెన్స్ లు ఆపుతున్నారు. ముందస్తు అనుమతి పేరిట వివక్షతో ప్రాణాలు తీస్తారా?’ అని పేర్కొన్నారు. చదవండి : తెలంగాణ సరిహద్దులో ఏపీ అంబులెన్స్‌ల నిలిపివేత సరిహద్దుల్లో అంబులెన్స్‌లను నిలిపేయడం దురదృష్టకరం: సజ్జల -
ఆధార్ వివరాలు ఎట్టి పరిస్థితుల్లో అడగొద్దు
సాక్షి, హైదరాబాద్ : ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లలో ఆధార్ వివరాలు తొలగించాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. సాఫ్ట్‌వేర్‌లో ఆధార్ కాలమ్ తొలగించే వరకు స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ నిలిపేయాలని.. కులం, కుటుంబ సభ్యుల వివరాలు కూడా తొలగించాలని ఆదేశించింది. గురువారం ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వం గతంలో న్యాయస్థానానికి ఇచ్చిన హామీని ఉల్లంఘించిందని, తెలివిగా సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తే అంగీకరించబోమని మరోసారి స్పష్టం చేసింది. ( ‘సొంతిల్లు స్వంతమవుతుందని అనుకోలే..!’) రిజిస్ట్రేషన్లు యధావిధిగా కొనసాగించాలని, కానీ రిజిస్ట్రేషన్ అథారిటీ మాత్రం ఆధార్ కార్డ్ వివరాలు అడగొద్దని.. వ్యక్తి గుర్తింపు కోసం ఆధార్ మినహాయించి ఇతర గుర్తింపు కార్డులను అంగీకరించాలని.. సాఫ్ట్వేర్, మ్యానువల్‌లో మార్పులు చేసి సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల సవరణకు ప్రభుత్వం వారం రోజుల సమయం కోరగా.. హైకోర్టు తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేసింది. -
క్రాకర్స్ బ్యాన్: ఆత్మహత్యలు చేసుకుంటారు
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణలో టపాసులపై నిషేధం విధిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ శుక్రవారం సుప్రీంకోర్టులో లంచ్ పిటిషన్ దాఖలు చేసింది. దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్స్‌ను బ్యాన్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది. ఇప్పటికే షాపులలో స్టాకును నింపామని, పండుగ రెండు రోజుల ముందు బ్యాన్ విధిస్తే తాము కోట్లల్లో నష్టపోతామని పిటిషన్లో పేర్కొంది. హైకోర్టు తీర్పు వల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారని తెలిపింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. కాగా, హైకోర్టు ఆదేశాలతో తెలంగాణలో టపాసులపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్వర్వులు జారీ చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో టపాసుల అమ్మకాలపై నిషేధం ఉందని తెలిపారు. టపాసుల అమ్మకాలతో పాటు కాల్చడం కూడా నిషేధమన్నారు. క్రాకర్స్ షాపులను మూసివేయాలని ఆదేశించారు. -
టపాసులు అమ్మటం, కాల్చటం నిషేధం
సాక్షి, హైదరాబాద్ : హైకోర్టు ఆదేశాలతో తెలంగాణలో టపాసులపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్వర్వులు జారీ చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో టపాసుల అమ్మకాలపై నిషేధం ఉందని తెలిపారు. టపాసుల అమ్మకాలతో పాటు కాల్చడం కూడా నిషేధమన్నారు. క్రాకర్స్ షాపులను మూసివేయాలని ఆదేశించారు. కాగా, పండుగల కన్నా ప్రజల ప్రాణాలే తమకు ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. బాణసంచా కాల్చకుండా, విక్రయించ కుండా నిషేధం విధించాలని, రాష్ట్రవ్యాప్తంగా బాణసంచా విక్రయ దుకాణాలను వెంటనే మూసేయించాలని గురువారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా నేపథ్యంలో ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది. బాణసంచా కాల్చరాదంటూ ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, తమ ఆదేశాల అమలుపై తీసుకున్న చర్యలను 19న వివరించాలని ఆదేశించింది. -
అక్రమార్కులను ప్రోత్సహిస్తారా ?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అక్రమ లే ఔట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం తెచ్చిన జీవో–131.. అక్రమార్కులను ప్రోత్సహించేలా ఉందంటూ హైకోర్టు మండిపడింది. చట్టాలను ఉల్లంఘించిన వారికి మేలు చేసేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడమేంటని ప్రశ్నించింది. అక్రమ లేఔట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం గత ఆగస్టులో ప్రభుత్వం తెచ్చిన జీవో–131ని సవాల్ చేస్తూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తరఫున పద్మనాభరెడ్డితో పాటు మరో ఇద్దరు ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. జీవో 131 చట్టవిరుద్ధమని, జీవో జారీ చేసి మరీ క్రమబద్ధీకరించడం నిబంధనలకు విరుద్ధమని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపించారు. ప్రతి ఐదేళ్లకోకసారి అక్రమ నిర్మాణాలను, లేఔట్లను క్రమబద్ధీకరించడం సంప్రదాయంగా మారుతోందని పేర్కొన్నారు. మాస్టర్‌ప్లాన్‌కు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను, లేఔట్ల క్రమబద్ధీకరణతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయన్నారు. జీవో 111కు విరుద్ధంగా నిర్మాణాలను చేపట్టడం వల్లే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరంలోని అనేక ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయని గుర్తు చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎప్పటిలోగా కౌంటర్ దాఖలు చేస్తుందని ఏజీ బీఎస్ ప్రసాద్‌ను ధర్మాసనం ప్రశ్నించగా, వారం రోజుల్లో వేస్తామని నివేదించారు. దీంతో 11లోగా కౌంటర్ దాఖలు చేయాలని, తదుపరి విచారణను ఈనెల 12కు వాయిదా వేసింది. -
తెలంగాణలో కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారు?
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్‌కు సంబంధించిన వ్యాజ్యాలపై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. మహారాష్ట్రలో రోజుకు లక్షన్నర కరోనా పరీక్షలు చేస్తున్నారని, రోజుకు 40 వేల పరీక్షలు చేస్తామన్న హామీ ఎందుకు అమలు కావడం లేదని మరో మారు ప్రశ్నించింది. కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారో తెలపాలని ఆదేశించింది. డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలకు అనుగుణంగా ఆస్పత్రుల్లో బెడ్లు ఎందుకు లేవని, మిగతా రాష్ట్రాల కన్నా ఎందుకు వెనకబడి ఉన్నారో తెలపాలంది. వెయ్యి మందికి కనీసం మూడు బెడ్లు కూడా లేక పోవడానికి కారణాలు, ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ బెడ్లు పెంచే ప్రణాళికలు ఉన్నాయో లేదో తెలపాలని హైకోర్టు ఆదేశించింది. ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస్ రావు తండ్రి కరోనాతో మరణించినందున నివేదిక సమర్పించేందుకు గడువు సమయం ఇవ్వాలని ఏజీ కోరగా.. హైకోర్టు విచారణను అక్టోబరు 8కి వాయిదా వేసింది. (చర్ల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో పిటిషన్) రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై వివరణ ఇవ్వండి : హైకోర్టు న్యాయవాది గోపాల్ రెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. గురువారం అక్రమ లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిపి వేయడంపై విచారణ జరిపింది. రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అక్టోబరు 14లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. విచారణ 15కి వాయిదా వేసింది. -
దేవుడు కూడా చట్టానికి అతీతం కాదు
సాక్షి, ఖమ్మం : దేవుడి పేరిట భూములు ఆక్రమించరాదని, దేవుడు కూడా చట్టానికి అతీతం కాదని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఖమ్మంలో టీటీడీ కళ్యాణ మండపం భూవివాదానికి సంబంధించి వీహెచ్‌పీ ప్రధాన కార్యదర్శి అల్లిక అంజయ్య దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. టీటీడీకి చెందిన 12 గుంటల భూమిని వెనక్కి తీసుకుంటున్నారని విచారణ సందర్భంగా పిటిషనర్ పేర్కొనగా, టీటీడీ ఆధీనంలో 12 గుంటలు అదనంగా ఉందని ప్రభుత్వం తెలిపింది. అయితే టీటీడీ పక్క భూమిని కూడా ఆక్రమించే ప్రయత్నం చేస్తోందని ఖమ్మం కార్పొరేషన్ హైకోర్టుకు వెల్లడించింది. ( ఆలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన టీటీడీ చైర్మన్) దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనుమానాస్పదంగా ఉందని, భూమి వెనక్కి తీసుకుంటే టీటీడీ ఎందుకు స్పందించడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం వెనుక టీటీడీ ఉండొచ్చునని అభిప్రాయపడింది. ప్రభుత్వ భూమిని టీటీడీ ఆక్రమించినట్లు కనిపిస్తోందని, భూమికి సంబంధించిన దస్త్రాలు, పటాలన్నీ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను సెప్టెంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. -
జీహెచ్ఎంసీ నివేదిక: హైకోర్టు అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్ : యాచకులను షెల్టర్ హోంలకు తరలించే ప్రక్రియకు సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చిన నివేదికలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. యాచకులను షెల్టర్ హోంలకు తరలించాలన్న పిటీషన్‌పై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విచారణను చేపట్టింది. యాచకులను షెల్టర్ హోంలకు తరలించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ హైకోర్టుకు నివేదించగా.. ఎంతమందిని, ఎక్కడెక్కడికి తరలించారో అన్న వివరాలు సమగ్రంగా లేవని, ఈనెల 15లోగా సమగ్ర నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. -
అన్ని చర్యలు తీసుకున్నాం..
సాక్షి, హైదరాబాద్: కరోనా బాధితులకు వైద్యం అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వైద్య సేవలు అందించే వారందరికీ మాస్క్‌లు, గ్లౌజ్‌లు, దుస్తులు అన్నింటినీ సమకూర్చామని, అతి ప్రమాదకరమైన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, అత్యవసర విభాగాలు, అంబులెన్స్‌ల్లో కరోనా రోగిని తరలించేప్పుడు వ్యక్తిగత రక్షణ కిట్ (పీపీఈ)లను అందజేస్తున్నామంది. 446 సంక్షేమ హాస్టళ్లలోని వారికి ఆహారం, దుస్తులు, మాస్క్‌లు పంపిణీ చేశామని, మహిళలు, పిల్లలు, వృద్ధులు, నిరాశ్రయులు, వీధి బాలల సంక్షేమానికి చర్యలు తీసుకున్నామని వివరించింది. నిత్యావసర వస్తువులు, మందులు, అత్యవసర వస్తువుల సరఫరాకు అన్ని చర్యలు తీసుకున్నామని, వీటి రవాణాపై ఆంక్షలు ఏమీ లేవని తెలిపింది. ఆలయాలు, మసీదులు, చర్చిలను మూసివేయించామని, సామూహిక సమావేశాలు కాకుండా నిషేధ ఉత్తర్వులను అమలు చేస్తున్నామని తెలిపింది. నివేదికలో వెల్లడించిన అంశాలు.. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పూర్తి వివరాలతో తుది నివేదికను అందజేశారు. ‘13 ప్రభుత్వాసుపత్రుల్లో 4,497 ఐసోలేషన్ బెడ్లు, 361 ఐసీయూ బెడ్లు, 246 వెంటిలేటర్ ఉన్న బెడ్లు సిద్ధంగా ఉన్నాయి. వీటికి అదనంగా 21 ప్రైవేట్ మెడికల్ కాలేజీలను గుర్తించి వాటిలో 7 వేల ఐసోలేషన్, 800 ఐసీయూ బెడ్లు సిద్ధంగా ఉంచాం. గచ్చిబౌలి క్రీడా వసతి ప్రాంగణాన్ని కరోనా ఆస్పత్రిగా మార్పు చేశాం. ఆస్పత్రుల్లోనే కాకుండా అనుమానితుల ఇళ్లకు వెళ్లే వారికి కూడా పీపీఈలు అందజేస్తున్నాం. వీటన్నింటినీ రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షణ చేస్తోంది. రాష్ట్రంలో వెంటిలేటర్ల తయారీ లేనందున 600 వెంటిలేటర్ల కోసం ఆర్డర్ ఇస్తాం. 3.85 లక్షల కరోనా పరీక్షల కిట్స్‌కు, 4,57,350 వీటీఎం టెస్టింగ్ కిట్లకు ఆర్డర్ చేశాం. 3.14 లక్షల శానిటైజర్ బాటిళ్లకు ఆర్డర్ చేశాం. 27,785 లీటర్ల శానిటైజర్‌ను వివిధ సంస్థలు ఉచితంగా ఇచ్చాయి. 3,53,210 పీపీఈ కిట్లు కావాలని ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటికి 51,475 కిట్లు వచ్చాయి. సర్జికల్స్ గ్లౌవ్స్ 34 లక్షలు ఆర్డర్ ఇస్తే 10.34 లక్షలు అందాయి. అయితే ప్రభుత్వం వద్ద 23 లక్షల గ్లౌవ్స్ అందుబాటులో ఉన్నాయి. ఎన్–95 మాస్క్‌లు 7,72,480 ఆర్డర్ ఇస్తే 1,61,980 అందాయి. ప్రస్తుతం 73,227 అందుబాటులో ఉన్నాయి. మూడు పొరల సర్జికల్ మాస్క్‌లు 53 లక్షలు కావాలని ఆర్డర్ ఇస్తే 25.50 లక్షలు అందాయి. 22.48 లక్షలున్నాయి. నిపుణుల కమిటీ ఆదేశాలకు అనుగుణంగా 53 రకాల మందుల కొనుగోలు జరుగుతోంది. కరోనా అనుమానితుల్లో 80 శాతానికి స్వల్ప లక్షణాలు కనబడి తే 15 శాతానికి మోస్తరు, 5 శాతానికి వైరస్ లక్షణాలు తీవ్రంగానూ కనబడుతున్నాయి. వీరందరికీ కూడా వైరస్ నివారణ వైద్యం అందజేస్తున్నాం. లాక్డౌన్ రూల్స్‌కు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చిన 75,800 వాహనాల్ని సీజ్ చేశాం. 4,900 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 33 వేల ఉల్లంఘనల్లో 17 వేల వాహనాల్ని సీజ్ చేశాం. జరిమానాగా 3.80 కోట్లు వసూలైంది. రాష్ట్ర సరిహద్దుల్లో 40, రాష్ట్రంలో 230 చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేశా రు. పోలీసులపై దాడులకు పాల్పడిన వారి పైన, ప్రజల పట్ల దురుసుగా వ్యవహరించి న పోలీసులపై చర్యలు తీసుకుంటున్నాం..’అని నివేదికలో ప్రభుత్వం పేర్కొంది. -
కరోనా ప్రపంచ విపత్తు
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోందని, ఇదో ప్రపంచ విపత్తు అని హైకోర్టు పేర్కొంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వమే అన్నీ చేయాలని ఆశించడం సబబు కాదని వ్యాఖ్యానించింది. వైద్య పరికరాల కొరత ఉండటం సహజమని, ఉ న్నంతలోనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని పేర్కొంది. పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదని, ఉన్నంతలో వైద్యం అందించేందుకు అవసరమైన అత్యవసర చర్యలు తీసుకుంటున్నారో లేదో అనేదే ముఖ్యమని ధర్మాసనం అభిప్రాయపడింది. కరోనా కారణంగా లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యం లో కరోనా బాధితులకు చికిత్స చేసే వైద్యులకు తగిన రక్షణ పరికరాల్లేవని, రాష్ట్రాల సరిహద్దుల్లోని క్వారంటైన్ కేంద్రాల్లో వసతులు కల్పించాలని కోరుతూ న్యాయవాదులు సమీర్ అహ్మద్, ఎస్.ఎస్.ఆర్.మూర్తి, ప్రొఫెసర్ విశ్వేశ్వర్‌రావులు వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలపై గురువారం హైకోర్టు మరో సారి విచారణ జరిపింది. ప్రభుత్వం వైద్యపరంగా అ న్ని చర్యలు తీసుకుంటోందని, ప్రజలు ఇబ్బందులు పడకుండా కూడా చర్యలు తీసుకుంటున్నామని ప్రభు త్వం తరఫున కోర్టుకు అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ మధ్యంతర నివేదిక అందజేశారు. ఈ నివేదిక వాస్తవం కాదని లాయర్లు చెప్పడంతో ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జ స్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌ల ధర్మాసనం పైవిధంగా అభిప్రాయçపడుతూ విచారణను 15కి వాయిదా వేసింది. మాస్క్‌లు, గ్లౌజ్స్‌లకు ఆర్డర్లు ఇచ్చాం.. ‘కరోనా కట్టడి కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. వైద్య సేవలు అందించే వారందరికీ మా స్క్‌లు, గ్లౌజ్‌లు, దుస్తులు అన్నింటినీ సమకూర్చాం. ఆస్పత్రుల్లోనే కాకుండా అనుమానితుల ఇళ్లకు వెళ్లే వా రికి కూడా వ్యక్తిగత వైద్య రక్షణ పరికరాలు (పీపీఈ) అందజేస్తున్నాం. వీటన్నింటినీ రాష్ట్ర మెడికల్ సర్వీసె స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షిస్తోంది. దేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలోనే పీపీఈ కిట్ల కొరత ఉంది. 3,31,798 పీపీఈ కిట్లు కా వాలని ఆర్డర్లు జారీ చేశాం. ఇప్పటికి 47,603 కిట్లు వచ్చాయి. మిగతావి కూడా దశల వారీగా వస్తాయి. సర్జికల్ గ్లౌజ్స్ 34 లక్షలు ఆర్డర్ ఇస్తే 10.34 లక్షలు అందాయి. అయితే ప్రభుత్వం వద్ద 23 లక్షల గ్లౌజ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక లాక్డౌన్ నేపథ్యంలో మం దుల షాపులపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు’అని ప్రభుత్వం మధ్యంతర నివేదికలో పేర్కొంది. -
డ్రోన్ కేసు: రేవంత్ రెడ్డికి బెయిల్
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బంధువుకు చెందిన ఫామ్ హౌస్‌ను అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన కేసులో మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డికి ఉపశమనం లభించింది. ఈ కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బుధవారం కేసుపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న రేవంత్‌రెడ్డి ఈ రోజు విడుదల కానున్నారు. ( ‘రేవంత్‌కు మేము మద్దతుగా ఉన్నాం’ ) కాగా, చట్ట వ్యతిరేకంగా డ్రోన్లను వినియోగించారన్న కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ రేవంత్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నెల రోజులు మాత్రమే జైలు శిక్ష పడే కేసులో రేవంత్‌రెడ్డిని ఇప్పటికే తొమ్మిది రోజులుగా జైల్లో పెట్టారని, చాలా చిన్న కేసులో వెంటనే బెయిల్ మంజూరు చేయకుండా విచారణను వాయిదా వేయవద్దని ఆయన తరఫు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ హైకోర్టుకు విన్నవించారు. తదుపరి విచారణ నాటికి సగం శిక్షాకాలం పూర్తవుతుందని, వెంటనే బెయిల్ ఇవ్వాలని కొద్దిరోజుల క్రితం ఆయన కోర్టును కోరారు. చదవండి : తెరపైకి మరోసారి ఓటుకు కోట్లు కేసు -
కరోనా భయం : హోలీ వేడుకలపై పిటిషన్
సాక్షి, హైదరాబాద్ : కోవిడ్ 19 వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో హోలీ సంబరాలపై రాష్ట్రవ్యాప్తంగా నిషేధం విధించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైదరాబాద్‌లోని మణికొండకి చెందిన గంపా సిద్దలక్ష్మి ఈ మేరకు బుధవారం హైకోర్టుని ఆశ్రయించారు. ఈ నెల 9 లేదా 10 తేదీల్లో హోలీ సంబరాలు జరుగనున్నాయని ఆమె కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రజల ఆరోగ్యం దష్ట్యా ఈ వేడుకలని నిషేధించాలని రిట్ పిటిషన్లో కోరారు. వేడుకలని నిషేధించడం ద్వారా ప్రజలని వైరస్ బారిన పడకుండా కాపాడవచ్చని పేర్కొన్నారు. కాగా, కోవిడ్ వైరస్ విభృంభిస్తున్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారు. ప్రజలు కూడా వేడుకలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్విటర్లో తన సందేశాన్ని ట్వీట్ చేశారు. చదవండి : కరోనా ఎఫెక్ట్.. మాస్క్‌తో ప్రభాస్ కరోనా ఎఫెక్ట్: అన్నీ రెడీ అయ్యాక వద్దన్నారు! -
రసవత్తరంగా తెలంగాణ ఒలంపిక్ ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఒలంపిక్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఒలంపిక్ సంఘం ఎన్నికలు హైదరాబాద్‌లోనే నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు సోమవారం తీర్పునిచ్చింది. తెలంగాణ ఒలింపిక్ భవన్, సంఘం కార్యాలయం అన్నీ ఇక్కడే ఉంచుకుని ఎన్నికలు న్యూఢిల్లీలో నిర్వహిస్తామంటే కుదరదని జస్టిస్ వినోద్ వ్యాఖ్యానించారు. ఓటర్ల జాబితా తయారీపై కూడా హైకోర్టు ధర్మాసనం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రెండు పర్యాయాలు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తివి మరోసారి అదే పదవికి ఎలా పోటీ చేస్తావని జగదీష్ యాదవ్‌ను న్యాయమూర్తి సూటిగా ప్రశ్నించారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల తతంగం లోపభూయిష్టంగా, విమర్శలకు తావిచ్చేదిగా ఉందంటూ హైకోర్టు జగదీష్ వర్గానికి అక్షింతలు వేసింది.కాగా, రేపు ఓటర్ల జాబితా, ఎన్నికల అధికారి నియామకం, జయేష్ నామినేషన్‌పై కూడా అరిసనపల్లి జగన్మోహన్ రావు రిట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. -
మున్సిపల్ ఎన్నికల విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల పిటిషన్‌పై బుధవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం వాదనపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. నూతన వార్డుల విభజన, జనాభా ప్రక్రియపై ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని వారు తెలిపారు. కాగా తమ వాదనకు... ప్రభుత్వం చెబుతున్న సమాధానాలకు పొంతన లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో వాదనలపై కౌంటర్ ఫైల్ చేయాలని పిటిషనర్లను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. దీంతో ప్రభుత్వం 26 కంటే ముందే పిటిషన్‌ను విచారించాలని కోరగా... ప్రభుత్వ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. -
రెండవ రోజు హైకోర్టు న్యాయవాదుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్ : హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల విషయంలో న్యాయవాదుల ఆందోళన రెండవ రోజుకు చేరింది. బదిలీలకు నిరసనగా బుధవారం తెలంగాణ హెకోర్టు న్యాయవాదులు తమ విధులను బహిష్కరించారు. శనివారం వరకు రాష్ట వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టులను బహిష్కరించాలని హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానించింది. జస్టీస్ సంజయ్ కుమార్‌ను వెంటనే తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, తెలంగాణ జస్టీస్ సంజయ్ కుమార్‌ను పంజాబ్, హర్యానా కోర్ట్‌కు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ న్యాయవాదుల ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల విషయంలో న్యాయవాదులు తొలి సారి తమ నిరసన గళాన్ని విప్పారు. హైకోర్టులో నెంబర్ టు స్థానంలో ఉన్న సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌ను పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకు జూనియర్ జడ్జిగా బదిలీ చేయాలన్న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుపై న్యాయవాదులు మండిపడుతున్నారు. త్వరలో రాష్ట్ర కోటా నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావాల్సిన వ్యక్తిని, ఈ విధంగా పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో 12వ స్థానానికి బదిలీ చేస్తుండటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో రాష్ట్ర కోటా నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావాల్సిన వ్యక్తిని, ఈ విధంగా పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో 12వ స్థానానికి బదిలీ చేస్తుండటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సిఫారసును వెనక్కి తీసుకోవాలని, ఆయనను ఏదైనా హైకోర్టు సీజేగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియంను డిమాండ్ చేస్తున్నారు. -
హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా టి. వినోద్ కుమార్, ఏ. అభిషేక్ రెడ్డి, కె.లక్ష్మణ్ గౌడ్లు ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహన్ చేతుల మీదుగా ముగ్గురు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. -
అసెంబ్లీ భవనాల్ని ఖాళీ చేయాలని ఆర్ అండ్ బీ చెప్పిందా?
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ భవనాలు వినియోగానికి యోగ్యంగా లేవని ఆర్అండ్బీ శాఖ ఇచ్చిన నివేదిక గురించి స్వయంగా వివరించేందుకు ఆ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి శుక్రవారం జరిగే విచారణకు హాజరుకావాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఆర్‌ఆండ్‌బీ నివేదిక ఇచ్చి ఉంటే.. అసెంబ్లీ భవనాలు ఎంతకాలం వినియోగానికి యోగ్యంగా ఉన్నాయి, భవనం ఖాళీ చేయాలని నివేదికలో ఉందా, కొత్త అసెంబ్లీ నిర్మాణానికి ఎంత స్థలం కావాలి, నిర్మాణ ప్రణాళిక వంటివి వివరించేందుకు ఆయన స్వయంగా హాజరుకావాలంది. ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చి రాష్ట్ర చట్టసభల భవన సముదాయాన్ని నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం ఎదుట గురువారం వాదనలు జరిగాయి. ఏ నిబంధనల మేరకు ఇప్పుడున్న అసెంబ్లీ భవనాలను వినియోగించరాదని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేబినెట్ ఎజెండాలోని అంశాలు తెలియజేయాలని పేర్కొంది. ఇప్పుడున్న అసెంబ్లీ భవనాలు నిజాం కాలంలో నిర్మించినవని, టౌన్‌హాల్ నిమిత్తం నిర్మించిన వాటిలో అసెంబ్లీ కొనసాగుతోందని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదించారు. ఆర్అండ్బీ అధ్యయనంలో అసెంబ్లీ భవనాలు సురక్షితంగా లేవని తేలిందన్నారు. ‘పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు చేపట్టలేదా’అని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు ఏజీ సమాధానం ఇస్తూ ‘ఇప్పటికే పలుమార్లు మరమ్మతులు చేయడం జరిగింది, అదే మాదిరిగా కొనసాగించడం క్షేమదాయకం కాదు’అని అన్నారు. ఎర్రమంజిల్ పురాతన భవనాల జాబితాలో లేదని, అక్కడ శాసనసభ భవనాల సముదాయాన్ని నిర్మించాలనేది ప్రభుత్వ విధాన నిర్ణయం కాబట్టి న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని గట్టిగా చెప్పారు. విధానపరమైన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం తగదంటూ సుప్రీంకోర్టుతో పాటు, రాజస్తాన్ హైకోర్టు తీర్పులను ఆయన ఉదహరించగా, ఇలాంటి తీర్పును ఉదహరించి మంచిపని చేస్తున్నారని అదనపు ఏజీని ధర్మాసనం అభినందించింది. అసెంబ్లీ నిర్మాణానికి ప్లానింగ్ లేకుండా హెచ్ఎండీఏ నుంచి అనుమతి తీసుకోలేమని అదనపు ఏజీ చెప్పగానే.. ఎవరైనా ఇల్లు నిర్మించుకోవాలంటే ఇంజనీర్ దగ్గరకు వెళ్లి ఫలానా సౌకర్యాలు ఉండేలా ప్లాన్ వేయించుకుంటారని, ఇక్కడేమో ప్లానే లేదని ప్రభుత్వం చెబుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై అదనపు ఏజీ కల్పించుకుని.. ప్లాన్ రూపొందించాలని హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి ప్రాంతాలకు చెందిన కన్సల్టెన్సీలకు బాధ్యతలు ఇచ్చామని, దీనిపై ప్రభుత్వానికి కూడా సమాచారం లేదన్నారు. ఎన్ని ఎకరాల భూమి అవసరమని నిర్ణయించారనే ప్రశ్నకు.. 17 ఎకరాల్లో నిర్మించాలని యోచిస్తున్నామని, ఇప్పుడున్న చట్టసభ సభ్యుల సంఖ్య మరో పాతికేళ్లకు రెట్టింపు కావచ్చునని, అప్పటి అవసరాలకు అను గుణంగా, పార్కింగ్, అధికారిక సమావేశాలకు వీలుగా కొత్త చట్టసభల సముదాయాన్ని నిర్మించాలన్నది ప్రభుత్వ విధానమని అదనపు ఏజీ బదులిచ్చారు. కన్సల్టెన్సీల నుంచి ప్లాన్లు వచ్చాక వాటి లో ప్రభుత్వం ఆమోదించే దాని ఆధారంగా హెచ్ఎండీఏ నుంచి అనుమతి తీసుకుంటామని చెప్పా రు. విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. -
ఎర్రమంజిల్ భవనాన్ని హెచ్ఎండీఏ కాపాడాలి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) చట్టంలో అర్బన్ ఆర్ట్స్ కమిషన్ ఉందని, దీని ప్రకారం ఎర్రమంజిల్‌లోని చారిత్రక భవనాన్ని హెచ్ఎండీఏ రక్షించాలని ఓ స్వచ్ఛంద సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది స్వరూప్‌రెడ్డి హైకోర్టులో వాదించారు. ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చి అక్కడ అసెంబ్లీ సముదాయాన్ని నిర్మించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై సోమవారం కూడా హైకోర్టు వాదనలు కొనసాగాయి. గుర్తించిన భవనాలను రక్షించే బాధ్యత మాత్రమే హెచ్ఎండీ తీసుకుంటుందని ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు చెప్పారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం స్పందిస్తూ.. హెరిటేజ్ కమిటీకీ, హెచ్ఎండీఏలోని అర్బన్ ఆర్ట్స్ కమిషన్ మధ్య తేడాలు, ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు ఆ రెండింటి పాత్ర ఏమిటో చెప్పాలని కోరింది. వాదనలు మంగళవారం కొనసాగుతాయి. -
ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చొద్దు
సాక్షి, హైదరాబాద్: ఎర్రమంజిల్‌లోని పురాతన భవనాన్ని కూల్చొద్దని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచింది. వివిధ రకాల కేసులు తమ వద్ద విచారణ దశలో ఉండగా ప్రభుత్వం ఆ భవనాన్ని కూల్చుతుందని తాము భావించట్లేదని వ్యాఖ్యానించింది. కోర్టులపట్ల ప్రభుత్వానికి గౌరవభావం ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా పడింది. ప్రభుత్వం జోక్యం చేసుకోదని ఆశిస్తున్నాం... ఎర్రమంజిల్‌లో 150 ఏళ్ల నాటి పురాతన భవనాన్ని కూల్చి అక్కడ శాసనసభల ప్రాంగణాన్ని నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను హైకోర్టు సోమవారం విచారించింది. భవనాన్ని కూల్చరాదని హైకోర్టు చెప్పిన విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తామని అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు తెలిపారు. ఈ సమయంలో మరో పిటిషనర్, సామాజిక కార్యకర్త లుబ్నా సారస్వత్ తరఫు రచనారెడ్డి కల్పించుకొని యథాతథ స్థితి (స్టేటస్ కో) ఉత్తర్వులు జారీ చేయాలని లేకుంటే భవనాన్ని ప్రభుత్వం కూల్చేసే అవకాశం ఉందన్నారు. దీనిపై బెంచ్ స్పందిస్తూ ‘ప్రభుత్వానికి న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంటుంది. విచారణ దశలో ప్రభుత్వం జోక్యం చేసుకోదని ఆశిస్తున్నాం. ఎర్రమంజిల్ భవనం విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోదని భావిస్తున్నాం’అని మౌఖికంగా పేర్కొంది. హైదరాబాద్‌లో ప్రభుత్వ భవనాలపై గవర్నర్‌కే నిర్ణయాధికారం... అంతకుముందు వాదనల సందర్భంగా తెలంగాణ జన సమితి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వర్రావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014 ప్రకారం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోని ప్రభుత్వ కట్టడాలపై గవర్నర్‌కే నిర్ణయాధికారం ఉంటుందన్నారు. ఆ చట్టంలోని సెక్షన్ 8 (2) (3) ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో భవనాలు, శాంతిభద్రతల అంశాలపై గవర్నర్‌కే అధికారం ఉంటుందని, ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అమలు చేయడం చట్ట వ్యతిరేకమని చెప్పారు. గతంలో ఈ భవనాన్ని వారసత్వ సంపదగా గుర్తించారని చెప్పగా అందుకు సంబంధించిన పత్రాలు సమర్పించాలని ధర్మాసనం కోరింది. ప్రభుత్వం గుర్తించకుండానే వందేళ్లు దాటిన కట్టడాలను జాతీయ వారసత్వ సంపదగా పరిగణించరని కూడా చెప్పింది. అయితే ఆ వివరాల్ని తర్వాత అందజేస్తామని, కొత్త అసెంబ్లీ భవనాల నిర్మాణం కోసం గత నెల 28న ప్రభుత్వం శంకుస్థాపన చేసిందని న్యాయవాది బదులిచ్చారు. పత్రికల్లో వచ్చిన వార్తలను ఆధారంగా చూపవద్దని, ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు లేదా జీవోలను ఆధారాలుగా చూపాలని ధర్మాసనం కోరింది. ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చాలని నిర్ణయం తీసుకున్నట్లు కౌంటర్లో ప్రభుత్వం చెప్పిందని న్యాయవాది బదులిచ్చారు. దీనిపై ధర్మాసనం కల్పించుకొని ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ సముదాయాన్ని నిర్మించాలని మాత్రమే ఉందని, ఉన్న భవనాన్ని కూల్చుతామని ఎక్కడా కౌంటర్లో లేదని గుర్తుచేసింది. ఎర్రమంజిల్ వద్ద అసెంబ్లీ నిర్మిస్తే అక్కడి ఇరుకురోడ్ల కారణంగా ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని గతంలో చెప్పారని, దీనికి సంబంధించిన గూగుల్ మ్యాప్‌లతో వివరించాలని ధర్మాసనం కోరింది. ఉన్న భవనాన్ని వదిలి కొత్త భవనాన్ని నిర్మించాలనే నిర్ణయం వల్ల ప్రజాధనం దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు. హైకోర్టును ఆశ్రయించిన నవాబు వారసులు... ఎర్రమంజిల్ భవనాల్ని 1870లో నవాబ్ సఫ్దర్‌జంగ్ ముషీర్దౌలా ఫక్రుల్ ముల్క్ నిర్మించారని, ఆ భవనం, అక్కడి స్థలం అంశాలపై సివిల్ వివా దం ఉండగా ప్రభుత్వం ఆ భవనాన్ని కూల్చి అసెంబ్లీ భవనాన్ని నిర్మించడం చెల్లదంటూ నవాబు వార సులు నూరి మజుఫర్ హుస్సేన్, మరో ఏడుగురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును అత్యవసరంగా విచారించాలని పిటిషనర్ల తరఫు న్యాయవా ది రచనారెడ్డి కోరారు. ఎర్రమంజిల్‌లో వివిధ రూపాల్లో వినియోగించగా ఎకరం 21 కుంటల స్థలం విషయంలో ప్రభుత్వంతో 1951 నుంచి సివి ల్ వివాదం నడుస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఆ వివాదం పరిష్కారం కాకుండానే అసెంబ్లీ భవనాల నిర్మాణ ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు. -
చేప ప్రసాదం పంపిణీకి లైన్ క్లీయర్
సాక్షి, హైదరాబాద్ : చేప మందు ప్రసాదం పంపిణీకి తెలంగాణ హైకోర్టులో లైన్ క్లియర్ అయింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రేపు(శనివారం) జరిగే చేప మందు ప్రసాదం పంపిణీ ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రభుత్వం డబ్బు ఖర్చు చేయడాన్ని సవాలు చేస్తూ బాలల హక్కుల సంఘం ఈ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన హైకోర్టు.. ప్రైవేటు కార్యక్రమాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయకూడదనే చట్టం ఏమైనా ఉందా అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. -
నీటి ప్రాజెక్టుల్ని అడ్డుకోం
సాక్షి, హైదరాబాద్ : ‘ఒకరిద్దరి కోసం ప్రాజెక్టుల నిర్మాణాల్ని ఆపలేం. ప్రాజెక్టుల నిర్మాణం ప్రజల కోసమే. కోట్ల మంది దాహార్తిని శాశ్వతంగా తీరుస్తాయి. పైగా పర్యావరణ సమస్య పరిష్కారానికి ప్రాజెక్టులు దోహదపడతాయి. కొద్ది మంది కోసం ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకోజాలం. అదే సమయం లో ప్రాజెక్టుల కోసం భూములిచ్చే రైతులకు సకాలంలో చట్ట ప్రకారం పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది’ అని నీటి పారుదల ప్రాజెక్టులకు వ్యతిరేకంగా దాఖలైన పలు కేసుల విచారణ సమయంలో హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రాజెక్టుల నిర్మాణాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ధిక్కార కేసులకు మినహాయింపు... ‘పునరావాసం, పునర్నిర్మాణం, పరిహారం చెల్లింపులను విచారిస్తాం. నీటి పారుదల ప్రాజెక్టులపై దాఖలైన 177 వ్యాజ్యాలన్నీ కలిపి విచారిస్తాం. అంతే కాకుండా ఇకపై వ్యాజ్యాలు దాఖలైతే వాటిని కూడా ఇక్కడికే నివేదించేలా హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశిస్తున్నాం. అయితే సింగిల్ జడ్జి వద్ద తీర్పు వెలువరించాల్సిన మూడు కోర్టు ధిక్కార కేసులను మాత్రం మినహాయింపు ఇస్తున్నాం’అని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం గురువారం ప్రకటించింది. భూమిని సేకరించే అధికారం ప్రభుత్వానికి ఉందని, ఎవరి అంగీకారంతోనో రాష్ట్రానికి ఏమాత్రం సంబంధం లేదని, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని చట్టం కూడా చెబుతోందని ధర్మాసనం తేల్చి చెప్పింది. సింగిల్ జడ్జి తీర్పును ఉల్లంఘిస్తూ ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామంలో ప్రభుత్వం పనులు చేస్తోందంటూ దాఖలైన కోర్టు ధిక్కార వ్యాజ్యాలను, దీనిపై ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ వ్యాజ్యాలను, నీటిపారుదల ప్రాజెక్టులపై దాఖలైన ఇతర కేసుల్ని, మొత్తం 177 కేసులన్నింటినీ కలిపి ఒకేసారి విచారించాలని ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను గురువారం ధర్మాసనం విచారించింది. ప్రాజెక్టుల నిర్మాణం జరగాల్సిందే... ‘వాతావరణంలో ప్రతికూల మార్పులు కనబడుతున్నాయి. వర్షాలు పడటం లేదు. నూరు శాతం వర్షాలు పడతాయని శాస్త్రవేత్తలు చెప్పడం లేదు. ఈసారి 93 శాతం రుతుపవనాలు వస్తాయని చెప్పడం అదృష్టమే. రాజస్తాన్ ఎడారిగా మారకుండా ఉండాలంటే నీటిని ఒడిసిపట్టే చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టుల నిర్మాణాలు జరగాల్సిందే. రాజస్తాన్‌లోని బనాస్ ప్రాజెక్టుపై దాఖలైన న్యాయ వివాదాల్ని పరిష్కరించిన ధర్మాసనంలో నేనున్నాను. ఆ ప్రాజెక్టుతో తొమ్మిది జిల్లాలకు నీరు అందింది’అని అదనపు ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. పరిహార ఒప్పంద పత్రాలు తెలుగులో ఉండేలా చేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. రైతులకు వాటిని అందజేసే ముందు వాటిలోని విషయాల్ని తెలుగులోనే వివరించాలని పేర్కొంది. దీంతో బాధిత రైతులకు అన్నీ తెలుసుకునేందుకు వీలవుతుందని చెప్పింది. పరిహారం తీసుకుని పోరాడండి... ‘భూ సేకరణ ప్రజల సమస్య. చట్టపరమైనది కాదు. పదేళ్ల కిత్రం అందుకోవాల్సిన రూ.5 లక్షల పరిహారాన్ని తీసుకుని న్యాయపోరాటం చేస్తే బాధితుడు నష్టపోడు. ఆ పరిహారం తీసుకోకుండా ఇప్పుడు రూ.8 లేదా 9 లక్షలు పరిహారం తీసుకుంటే అది రూ.5 లక్షలతో సమానం అవ్వదు. పరిహారం పెంపు కోసం పాతికేళ్ల వరకూ న్యాయపోరాటం చేయవచ్చు. ప్రాజెక్టు నిర్మాణం జరిగిపోతుంటే భూమి ఇవ్వకుండా ఎంతకాలం ఉంటారు. భూమిని సర్కార్ తీసుకోవాలని అనుకుంటే ఎవ్వరూ అడ్డకోలేరు’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా ఓ కథను ధర్మాసనం ఉదహరించింది. ‘గంగా నదిలో ఓ రైతు గొడ్డలి పడిపోయింది. గంగా మాత ప్రత్యక్షమై బంగారం, వెండి, రాగి గొడ్డళ్లు తెచ్చి ఇచ్చింది. అవి నావి కావని రైతు చెప్పాడు. దీంతో గంగా మాత పోయిన ఇనపు గొడ్డలితోపాటు బంగారు, వెండి, రాగి వాటిని కూడా రైతుకు ఇచ్చేస్తుంది. ఇక్కడ కూడా రైతులు తమకు ఏది కావాలో కోరాలి. కానిది అడగొద్దు. ఇచ్చింది తీసుకోవాలి. పట్టుదలకు పోవద్దు. హైకోర్టు మీకు న్యాయపరంగా అండగా నిలుస్తుంది’అని ధర్మాసనం హితవు చెప్పింది. ‘భూ సేకరణ కోసం రైతులు త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. కుటుంబం కోసం వ్యక్తి. గ్రామం కోసం కుటుంబం. పట్టణం కోసం గ్రామం. రాష్ట్రం కోసం పట్టణం. చివరికి దేశం కోసం ఒక రాష్ట్రం త్యాగం చేయాలి. ఇది ఇప్పటి హితోపదేశం కాదు. మహాభారతంలోనే ఉంది. అయిదారు ఎకరాల కోసం ప్రాజెక్టుల్ని అడ్డుకోవడం ధర్మం కాదు. ప్రాజెక్టులు కూడా లక్షలాది మంది ప్రజల కోసమేనని గుర్తించాలి’అని వ్యాఖ్యానించింది. పరిహారం అందజేత... హైకోర్టులో 93 మంది పిటిషన్లు దాఖలు చేస్తే పరిహారం తీసుకోని 33 మందికి, కోర్టు ధిక్కార వ్యాజ్యాలు వేసిన ఆరుగురి చెందిన పరిహారాన్ని రూ.7.5 లక్షల చొప్పున వారి తరఫున వాదించే న్యాయవాది, న్యాయమూర్తుల సమక్షంలో అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు అందజేశారు. దీంతో మొత్తం 93 మందికి పరిహారం అందజేసినట్లు అయింది. ఇళ్ల నిర్మాణాలకు రూ.5 లక్షలు వద్దని చెప్పి తిరిగి తీసుకోడానికి సమ్మతిని తెలిపిన ఇద్దరికీ కూడా కోర్టులోనే చెక్కుల్ని అందజేశారు. అనసూయ అనే పిటిషనర్ భర్తతో విభేదించి పదేళ్లుగా విడిగా ఉంటున్నారని, భర్తకు పరిహారం ఇచ్చారని, ఆమెకు ఏదీ అందలేదని బాధితురాలి తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించగా, ఈ అంశాన్ని పరిశీలిస్తామని అదనపు ఏజీ బదులిచ్చారు. ఏటిగడ్డ కిష్టాపూర్‌లో 2,500 ఎకరాల రైతులకు పరిహారం చెల్లించామని, ఆర్ఆర్ ప్యాకేజీ నోటీసులు ఇచ్చామని తెలిపారు. గృహాల సేకరణ అంశంపై ప్రాథమిక నోటీసు ఇచ్చామని వివరించారు. డిక్లకేషన్ ఇచ్చేందుకు రైతులు సహరించలేదని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు అదనపు ఏజీ బదులిచ్చారు. విచారణ జూన్ 18కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.