సాక్షి, హైదరాబాద్ : బిగ్ బాస్ షోపై మానవ హక్కుల కమిషన్(హెచ్‌ఆర్‌సీ)లో ఫిర్యాదు దాఖలైంది. ఓ టీవీ చానల్‌లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షోలో టాస్క్‌ల పేరుతో వెకిలి చేష్టలు చేస్తున్నారని ఆరోపిస్తూ హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ ఫిర్యాదు చేశారు. మహిళలను కించపరిచేలా ఈ షో ఉందని ఆయన ఆరోపించారు. బిగ్‌బాస్ ప్రోగ్రాం పేరుతో ఒకే ఇంటిలో 16 మందిని నిర్బంధించి సమాజానికి ఉపయోగపడని, అనవసరమైన వెకిలి చేష్టలను ప్రసారం చేస్తున్నారన్నారు. ఈ షోతో ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తూ, కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తున్నారని రాపోలు భాస్కర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
కొన్ని వ్యాపార సంస్థలతో కలిసి యాజమాన్యం తమ లాభాలు, టీఆర్పీల కోసం బిగ్ బాస్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోందని పిటిషనర్ పేర్కొన్నారు. ఎవరికీ కనపడని బిగ్ బాస్ బాత్రూమ్‌లు కడగాలని, తాను చెప్పినట్టు చేయాలని 16మంది పోటీదారులను బానిసల్లా పరిగణిస్తూ ఆదేశాలివ్వడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. షోలో పాల్గొన్నవారిని బయటకు పోనివ్వకుండా ఒకే ఇంట్లో ఉంచడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని తెలిపారు. టాస్కుల పేరుతో చెడు సంప్రదాయాలను చూపించి సమజానికి నష్టం చేస్తున్నారని విమర్శించారు. చిలిపి టాస్కులు, సహజీవనం కాన్సెప్టుతో ఉన్న ప్రోగ్రాములు సమాజానికి నష్టం చేస్తాయన్నారు. ఇలాంటి ప్రోగ్రాములు చూసిన వాళ్లు మానసిక వేదనకు లోనయ్యే ప్రమాదం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment