human rights violations
-
పాక్‌కు సాయం ఆపండి
ఇస్లామాబాద్: అమెరికా అందిస్తున్న భారీ ఆర్థిక సాయాన్ని మానవ హక్కుల ఉల్లంఘనకు పాకిస్తాన్ వినియోగిస్తోందని యూఎస్ కాంగ్రెస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పాక్‌లో స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగి రాజ్యాంగబద్ధమైన రీతిలో ప్రభుత్వం ఏర్పాటయ్యేదాకా ఆ దేశానికి ఎలాంటి ఆర్థిక సాయమూ అందించొద్దని అధ్యక్షుడు జో బైడెన్‌కు విజ్ఞప్తి చేశారు. ఇలాన్ ఒమర్‌తో పాటు మరో 10 మంది కాంగ్రెస్ సభ్యులు ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి అంటోనీ బ్లింకెన్‌కు లేఖ రాశారు. దైవ దూషణ చట్టాన్ని మరింత కఠినతరం చేయడం తదితర చర్యలకు పాక్ పాల్పడుతున్న వైనాన్ని అందులో ప్రస్తావించారు. ‘‘ఇవన్నీ పాక్‌లోని మతపరమైన మైనారిటీలను మరింతగా అణచివేసేందుకు తీసుకుంటున్న చర్యలే. ఎందుకంటే దైవదూషణ బిల్లును పాక్ పార్లమెంటు ఆమోదించిన కొద్ది రోజులకే మతోన్మాద మూకలు చర్చిలను ధ్వంసం చేయడంతో పాటు క్రైస్తవుల ఇళ్లకు నిప్పు పెట్టాయి’’ అంటూ వారు ఆందోళన వెలిబుచ్చారు. -
కశ్మీర్లో మానవహక్కుల ఉల్లంఘన: పాక్
ఇస్లామాబాద్: కశ్మీర్లో భారత్ యంత్రాంగం మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని పాకిస్తాన్ ఆరోపించింది. పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషి, మానవహక్కుల శాఖ మంత్రి షిరీన్ మజారి, జాతీయ భద్రతా సలహాదారు మోయీద్ యూసఫ్ ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కశ్మీర్లో హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన వివరాలను ఐక్యరాజ్యసమితికి, అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళతామని చెప్పారు. 131 పేజీల ఈ డాక్యుమెంట్లో113 ఉదాహరణలు న్నాయన్నారు. ఉల్లంఘనలకు కారణమైన అధికా రులపై ఆంక్షలు విధించాలని ఐక్యరాజ్యసమితిని వారు కోరారు. కాగా, పాక్ చేసిన ఆరోపణలను భారత్ పలుమార్లు ఖండించింది. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని స్పష్టం చేసింది. -
కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన
న్యూఢిల్లీ/శ్రీనగర్: కశ్మీర్లో పరిస్థితులను పరిశీలించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీ నుంచి వెళ్లిన ప్రతిపక్షపార్టీల నాయకుల బృందాన్ని అధికారులు శ్రీనగర్‌లోనే నిలిపివేశారు. బృందంలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, డీఎంకే, ఎన్సీపీ, జేడీఎస్, ఆర్జేడీ, టీఎంసీ పార్టీలకు చెందిన 11 మంది నేతలు ఉన్నారు. జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడాలన్న గవర్నర్ సూచనల మేరకే తాము ఈ పర్యటన చేపట్టినట్లు బృందం వెల్లడించింది. అక్కడ ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని బీజేపీని ఉద్దేశించి సీపీఐ ఆరోపించింది. దీనిపై జమ్మూ కశ్మీర్ ప్రభు త్వం స్పందించింది. ప్రతిపక్ష పార్టీల పర్యటన కశ్మీర్లో నెలకొన్న శాంతికి విఘాతం కలిగించే అవకాశం తెలిపింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు రాలేదని సీపీఐ నేత డి.రాజా అన్నారు. ‘మేము క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని పరిశీలించడానికే వచ్చాం తప్ప ఇతరులకు ఇబ్బంది కలిగించడానికి కాదు’ అని ఎల్జేడీ పార్టీ చీఫ్ శరద్ యాదవ్ అన్నారు. ‘పరిస్థితులు బాగానే ఉంటే మమ్మల్ని ఎందుకు అనుమతించడం లేదు? మేము చట్టాలను అతిక్రమించడానికి రాలేదు’ అని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ అన్నారు. హక్కులను ఓ నిరంకుశ ప్రభుత్వం ఎలా కాలరాస్తుందో దేశం గమనిస్తోందని సీపీఎం విమర్శించింది. కశ్మీర్‌లోయలో ఆంక్షల ఎత్తివేత.. కశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో శనివారం ఆంక్షలను ఎత్తివేశారు. ప్రార్థనల సందర్భంగా ఐక్యరాజ్య సమితి మిలిటరీ బృంద కార్యాలయాన్ని ముట్టడించాలని వేర్పాటువాదులు భావించారు. ఈ నేపథ్యంలో అధికారులు శుక్రవారం ఆంక్షలు విధిం చారు. పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. ఇంటర్నెట్, మొబైల్ సేవలపై ఆంక్షలుండగా, కొన్నిచోట్ల ల్యాండ్‌లైన్ ఫోన్లను అనుమతించారు. సుప్రీంకోర్టులో పీసీఐ పిటిషన్.. జమ్మూకశ్మీర్‌లో సమాచార వ్యవస్థపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని కశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధ భాసిన్ వేసిన పిటిషన్‌ను పరిశీలిం చాల్సిందిగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జర్నలిస్టులు తమ వృత్తిని నిర్వహించేందుకుగాను ఆంక్షలను ఎత్తివేయాల్సిందిగా ఆ పిటిషన్లో కోరారు. మీడి యా, దేశ సమగ్రత, సార్వభౌమాధికారం వాటిని దృష్టిలో ఉంచుకొనే ఆంక్షలు తొలగించేందుకు సహాయం చేయాలని పీసీఐ కోరింది. -
అది దురుద్దేశాల నివేదిక
న్యూఢిల్లీ/జెనీవా: కశ్మీర్లో పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి(ఐరాస) మానవ హక్కుల విభాగం జారీచేసిన నివేదికపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దురుద్దేశాలు, అవాస్తవాలతో కూడిన ఈ నివేదిక.. పాకిస్తాన్ నుంచి పుట్టుకొస్తున్న ఉగ్రవాదం అనే మూలాంశాన్ని విస్మరించిందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. కశ్మీర్లో నెలకొన్న అనేక సమస్యలను పరిష్కరించేందుకు అటు పాకిస్తాన్ లేదా ఇటు ఇండియా ఏ చర్యలూ తీసుకోలేదని ఐరాస తాజా నివేదికలో పేర్కొంది. దీనిపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. సీమాంతర ఉగ్రవాదాన్ని విస్మరించారు.. ‘భారత ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాలను ఉల్లంఘిస్తూ, కశ్మీర్లో మూల సమస్య అయిన సీమాతంర ఉగ్రవాదాన్ని విస్మరిస్తూ ఈ నివేదికను రూపొందించారు. పాక్ నుంచి పుట్టుకొస్తున్న ఉగ్రవాదుల వల్ల జరుగుతున్న నష్టాన్ని పట్టించుకోలేదు. ఇండియాకు, ఉగ్రవాదాన్ని ప్రభుత్వమే ప్రోత్సహించే పాకిస్తాన్‌కు మధ్య కృత్రిమ పోలిక తేవాలన్న ప్రయత్నం ఈ తాజా నివేదికలో కనిపిస్తోంది. దీనిపై ఐరాస మానవహక్కుల కార్యాలయానికి ఇండియా తన తీవ్ర నిరసనను తెలిపింది. నివేదికను ఇలా విడుదల చేయడం వల్ల ఐరాస విశ్వసనీయత, చిత్తశుద్ధి దెబ్బతింది. భారత విధానాలు, ఆచరణలు, విలువలను విస్మరించిన ఈ నివేదిక తన విశ్వసనీయతనే ప్రమాదంలోకి నెట్టుకుంది’ అని చెప్పారు. -
'టాస్క్‌ల పేరుతో వెకిలి చేష్టలు'
సాక్షి, హైదరాబాద్ : బిగ్ బాస్ షోపై మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)లో ఫిర్యాదు దాఖలైంది. ఓ టీవీ చానల్లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షోలో టాస్క్‌ల పేరుతో వెకిలి చేష్టలు చేస్తున్నారని ఆరోపిస్తూ హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ ఫిర్యాదు చేశారు. మహిళలను కించపరిచేలా ఈ షో ఉందని ఆయన ఆరోపించారు. బిగ్‌బాస్ ప్రోగ్రాం పేరుతో ఒకే ఇంటిలో 16 మందిని నిర్బంధించి సమాజానికి ఉపయోగపడని, అనవసరమైన వెకిలి చేష్టలను ప్రసారం చేస్తున్నారన్నారు. ఈ షోతో ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తూ, కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తున్నారని రాపోలు భాస్కర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని వ్యాపార సంస్థలతో కలిసి యాజమాన్యం తమ లాభాలు, టీఆర్పీల కోసం బిగ్ బాస్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోందని పిటిషనర్ పేర్కొన్నారు. ఎవరికీ కనపడని బిగ్ బాస్ బాత్రూమ్లు కడగాలని, తాను చెప్పినట్టు చేయాలని 16మంది పోటీదారులను బానిసల్లా పరిగణిస్తూ ఆదేశాలివ్వడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. షోలో పాల్గొన్నవారిని బయటకు పోనివ్వకుండా ఒకే ఇంట్లో ఉంచడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని తెలిపారు. టాస్కుల పేరుతో చెడు సంప్రదాయాలను చూపించి సమజానికి నష్టం చేస్తున్నారని విమర్శించారు. చిలిపి టాస్కులు, సహజీవనం కాన్సెప్టుతో ఉన్న ప్రోగ్రాములు సమాజానికి నష్టం చేస్తాయన్నారు. ఇలాంటి ప్రోగ్రాములు చూసిన వాళ్లు మానసిక వేదనకు లోనయ్యే ప్రమాదం ఉందన్నారు. -
హక్కుల ఉల్లంఘనలను సహించబోం
న్యూఢిల్లీ: మానవ హక్కుల ఉల్లంఘనలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇటువంటి ఘటనలను సహించేది లేదని స్పష్టం చేసింది. మణిపూర్‌లో సైన్యం, అస్సాం రైఫిల్స్, పోలీసు బలగాలు పాల్పడిన నాలుగు నకిలీ ఎన్కౌంటర్లపై ఈ నెల 27లోగా తుది నివేదిక ఇవ్వాలని సీబీఐను ఆదేశించింది. ఈ ఎన్కౌంటర్లలో పౌరులు ప్రాణాలు కోల్పోయినందున తీవ్ర ప్రాముఖ్యత గల విషయంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ యుయు లలిత్‌ల బెంచ్ గురువారం ఈ కేసు విచారణ చేపట్టింది. తమ విచారణ పూర్తయిందని, తుది నివేదిక రూపొందించే పనిలో ఉన్నామని సీబీఐ ప్రత్యేక విచారణ బృందం(సిట్) కోర్టుకు తెలిపింది. దీంతోపాటు మణిపూర్‌లో జరిగిన 41 ఎన్కౌంటర్లపై సిట్ దర్యాప్తు కొనసాగుతోందనీ, ఇప్పటివరకు 20 కేసుల్లో దర్యాప్తు పూర్తికావొచ్చిందని అదనపు సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) మణీందర్ సింగ్ తెలిపారు. స్పందించిన న్యాయస్థానం ‘మానవ హక్కుల ఉల్లంఘన గురించి మాత్రమే కాదు, మరణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాం. అవి హత్యలా? కాదా? మానవ హక్కుల కంటే ఈ అంశానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం’ అని పేర్కొంది. -
కశ్మీర్‌పై ఐరాస నివేదిక
జెనీవా/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలకు సంబంధించి ఐక్యరాజ్యసమితి గురువారం ఓ నివేదికను విడుదల చేసింది. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ విచారణ జరిపించాలని డిమాం డ్ చేసింది. కశ్మీర్‌కు సంబంధించి ఇలాంటి నివేదికను ఐక్యరాజ్యసమితి విడుదల చేయడం ఇదే తొలిసారి. అయితే ఈ నివేదికపై భారత్ ఘాటుగా స్పందించింది. ఇది పూర్తిగా దురుద్దేశంతో కూడిన, మోసపూరితమైన, ఇతరుల ప్రేరణతో నివేదిక రూపొందించినట్లు ఉందంది. ఈ మేరకు భారత ప్రభుత్వం తన వ్యతిరేకతను ఘాటు వ్యాఖ్యలతో ఐరాసకు ఓ లేఖ ద్వారా తెలిపింది. ఈ నివేదిక భారతదేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత లను ఉల్లంఘించేలా ఉందంది. జమ్మూ కశ్మీర్ రాష్ట్రం మొత్తం భారత్‌లో అంతర్భా గమని, పాక్ చట్టవిరుద్ధంగా, దురాక్రమణ ద్వారా భారత్ లోని కొంత భాగాన్ని ఆక్రమించుకుందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. యూఎన్ ఆఫీస్ ఆఫ్ ద హై కమిషనర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ జమ్మూకశ్మీర్(కశ్మీర్ లోయ, జమ్మూ, లడఖ్ ప్రాంతాలు), పాకిస్తాన్ అడ్మినిస్టర్డ్ కశ్మీర్(ఆజాద్ జమ్ముకశ్మీర్, గిల్గిట్–బల్టిస్తాన్)లపై 49 పేజీల నివేదికను విడుదల చేసింది. మానవ హక్కుల ఉల్లంఘనలకు శిక్షలు పడకపోవడం, న్యాయం పొందే అవకాశం లేకపోవడం జమ్మూకశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలకు ఎదురవు తున్న సవాళ్లని ఐరాస తన నివేదికలో పేర్కొంది. అయితే పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)కు బదులుగా ఆజాద్ జమ్మూకశ్మీర్, గిల్గిట్ బల్టిస్తాన్ అనే పదాలను ఐరాస ఉపయోగించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత భూభాగం గురించి నివేదికలో తప్పుగా పేర్కొనడం తప్పుదారి పట్టించేలా ఉందని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, అసలు ఆజాద్ జమ్మూకశ్మీర్, గిల్గిత్ బల్టిస్తాన్ అనేవి లేనేలేవని పేర్కొంది. శాంతియుత కార్యకర్తలను అణచివేసేందుకు, వారిని హింసించేందుకు ఉగ్రవాద వ్యతిరేక చట్టాన్ని దుర్వినియోగం చేసే చర్యలను నిలిపివేయాలని ఐరాస పాకిస్తాన్‌ను కోరింది. 2016 నుంచి జమ్మూ కశ్మీర్లో చెలరేగిన ఆందోళనలు, భద్రతాదళాల చర్యలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను రూపొందించింది. -
ఎన్టీఆర్ బిగ్ బాస్‌పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు
టాలీవుడ్ బిగ్ బాస్ పై వివాదాలు మొదలవుతున్నాయి. ఎన్టీఆర్ వ్యాఖ్యాత రూపొందుతున్న ఈ షోలో కంటెస్టెంట్ లకు విధించే శిక్షలు అమానవీయం గా ఉన్నాయంటూ సామాజిక కార్యకర్త అచ్యుతరావు రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బిగ్ బాస్ షోపై తనకు అభ్యంతరాలను తెలియజేస్తూ పిటీషన్ దాఖలు చేశారు. షోలో పాల్గొంటున్న కంటెస్టెంట్స్ చేస్తున్న పనులు యువతను తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. షోలో బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు ఇస్తున్న టాస్క్‌లపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. శిక్షల పేరుతో నోటికి ప్లాస్టర్లు వేయడం, స్విమ్మింగ్ పూల్‌లో 50 సార్లు మునిగి లేవమనడం, రాత్రి సమయాల్లో గార్డెన్లో పడుకోమని ఆదేశించటం, గంటల తరబడి ఉల్లిపాయలు కోయమనటం వంటివి అమానవీయ చర్యలని ఆరోపించారు. ఈ చర్యలు పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని అచ్యుతరావు వాదిస్తున్నారు. ఈ పిటీషన్ పై మానవ హక్కుల సంఘం స్పందించలేదు. ఒకవేళ పిటీషన్ ను హెచ్చార్సీ విచారణకు తీసుకుంటే బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసలు పంపే అవకాశం ఉంది. -
భారత్‌లో హక్కుల ఉల్లంఘన: యూఎస్
న్యూఢిల్లీ: భారత్‌లో యథేచ్చగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని అమెరికా ప్రభుత్వ నివేదిక విమర్శించింది. సామాజికవేత్త తీస్తా సెతల్వాద్‌పై కేసు, మధ్యప్రదేశ్‌లో 8 సిమీ కార్యకర్తల కాల్చివేతను నివేదికలో పేర్కొంది. ‘భారత్‌లో మానవ హక్కులు–2016’ నివేదికలో.. ఎన్జీవోలకు విదేశీ నిధులపై ఆంక్షలు, మహిళలపై నేరాల కేసులను పొందుపరిచింది. 25 స్వచ్ఛంద సంస్థలు విదేశీ నిధులు పొందకుండా భారత ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించింది. ఈ ఎన్జీవోలు భారత్‌లో తమ కార్యకలాపాలు నడిపేందుకు భయపడుతున్నాయని పేర్కొంది.